25 సంవత్సరాల క్రితం వరకు, ఒత్తిడి (Stress) అనేది కేవలం ఒక సైన్సు పదమే. మన మానసిక స్థితిని నిర్వచించే పదంగా అప్పుడు ఆ పదం లేనేలేదు. ఆ రోజుల్లో కూడా, మనం ఇప్పటిలా చాలా కష్టపడ్డాం. ఈరోజుల్లో ఉన్నట్లుగానే ఆ రోజుల్లో కూడా పరిస్థితులు సవాలు విసిరేవిగా ఉన్నాయి. అయినాగానీ నాకు ఒత్తిడి కలుగుతుంది అని ఆనాడు అనలేదు. నెమ్మదిగా, ఒత్తిడి అనే పదాన్ని మనం ఒక మనోభావనగా, మన మానసిక స్థితిగా వర్ణిస్తూ వచ్చాము. నేను చాలా కష్టపడి పని చేస్తున్నాను, రెగ్యులర్‌గా చేసే పనులకన్నా ఎక్కువగా పని చేస్తున్నాను అని చెప్పడానికి ‘నాకు స్ట్రెస్ ఉంది’ అన్న మాటను ఉపయోగిస్తున్నాము. ఒత్తిడి గురించి మనకున్న అవగాహనను ముందు అర్థం చేసుకుందాం. నిజానికి మనం సంతోషం, శాంతి, శక్తి నిండిన ఆత్మలం. మనం చేసే అపసవ్య ఆలోచనల పరిణామమే ఒత్తిడి. అది ఒక భావోద్వేగ నొప్పి, మనం మారాలి అన్న సంకేతాన్ని ఆ బాధ మనకు చెప్తుంది. కానీ మన చుట్టూ ఉన్నవారు కూడా ఒత్తిడిలో ఉండటాన్ని చూసి, ఒత్తిడి ఈరోజుల్లో అందరికీ ఉంటుంది, సహజమే, ఉన్నా ఫర్వాలేదు అనుకుంటున్నాము. ఇది నిజం కాదు. ఒత్తిడి మన శారీరక మరియు భావోద్వేగ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అది మన సమర్థతను, జ్ఞాపక శక్తిని, నిర్ణయ శక్తిని ప్రభావితం చేసి మన పనితీరును తగ్గిస్తుంది. కనుక, ఎలాంటి ఒత్తిడి అయినా అది హానికరమే.
సైన్సులో, ఒత్తిడి అనేది స్థితిస్థాపకతతో విభజించబడిన పీడనంతో సమానం.
దీనిని జీవితానికి అన్వయిస్తే,
పీడనం (pressure): మన పరిస్థితులు (టార్గెట్లు, చివరి గడువు తేదీలు, పరీక్షలు, గమ్యాలు, ఆరోగ్య సమస్యలు, సంబంధాలు…)
స్థితిస్థాపకత (Resilience): మన ఆంతరిక శక్తి (శాంతి, ఆనందం, ప్రేమ, పవిత్రత, శక్తి, జ్ఞానము)
అందుచేత, ఒత్తిడి అనేది మన అంతర్గత బలంతో విభజించబడిన మన పరిస్థితులకు సమానం.
కావున, మన ఆంతరిక శక్తిని మనం పెంచుకున్నప్పుడు, మన ఒత్తిడి తగ్గుతుంది. మనం స్థిరంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉంటాము. మన ఆంతరిక శక్తి తగ్గినప్పుడు, చిన్నపాటి కష్టం కూడా మనకు ఎక్కువ ఒత్తిడిని తెస్తుంది. మన ఆంతరిక శక్తిని పెంచుకుని, మన మానసిక స్థితికి మనం బాధ్యత వహించడం మనం చేయాల్సిన మొదటి పని. మన చేతుల్లో ఉన్నది మన మనసుగానీ పరిస్థితి కాదు, ఆ మనసే పరిస్థితిని ఎదుర్కునే శక్తిని ఇస్తుంది.