"అమృతవేళ - శ్రేష్ఠ ప్రాప్తుల వేళ"
(యూ.కే. గ్రూప్‌తో బాప్‌దాదా పలికిన మహావాక్యాలు)
ఈరోజు ఆత్మిక తోటమాలి తన ఆత్మిక గులాబీ పూల (రోజ్ ఫ్లవర్స్) తోటను చూస్తున్నారు. ఇలాంటి ఆత్మిక గులాబీల తోట ఇప్పుడు ఈ సంగమయుగంలో మాత్రమే బాప్‌దాదా ద్వారా తయారవుతుంది. బాప్‌దాదా ప్రతి ఒక్క ఆత్మిక గులాబీ పువ్వు యొక్క ఆత్మిక సువాసనను మరియు వికసించిన ఆత్మిక పుష్పాల శోభను చూస్తున్నారు. అందరూ సువాసన గలవారే, కానీ ఎవరి సువాసన సదాకాలం ఉండేది, మరియు ఎవరి సువాసన కొద్ది సమయం మాత్రమే ఉండేది అని చూస్తున్నారు. కొందరు గులాబీలు సదా వికసించి ఉంటారు, మరికొందరు అప్పుడప్పుడు వికసించి, అప్పుడప్పుడు ఎండ లేదా వాతావరణం ప్రభావంతో కాస్త వాడిపోతూ కూడా ఉంటారు. అయినప్పటికీ వీరంతా ఆత్మిక తోటమాలి తోటలోని ఆత్మిక గులాబీలే! కొందరు ఆత్మిక గులాబీలలో జ్ఞానమనే సువాసన విశేషంగా ఉంది. కొందరిలో స్మృతి యొక్క సువాసన విశేషంగా ఉంది. మరికొందరిలో ధారణ సువాసన, ఇంకొందరిలో సేవా సువాసన విశేషంగా ఉన్నాయి. కొందరైతే సర్వ సువాసనలతో సంపన్నంగా ఉన్నవారు కూడా ఉన్నారు. మరి తోటలోకి ప్రవేశించగానే అందరి దృష్టి మొదట ఎవరిపై పడుతుంది? దూరం నుంచే ఎవరి సువాసన అయితే ఆకర్షిస్తుందో, అందరి దృష్టి ముందుగా అటువైపే వెళ్తుంది. కాబట్టి ఆత్మిక తోటమాలి సదా అందరు ఆత్మిక గులాబీ పుష్పాలనూ చూస్తారు, కానీ నంబర్‌వారీగా చూస్తారు. ప్రేమ అందరిపైనా ఉంది, ఎందుకంటే ప్రతి గులాబీ పుష్పం హృదయంలో తోటమాలి పట్ల అమితమైన ప్రేమ ఉంది. యజమానిపై పుష్పాలకు ప్రేమ ఉంది మరియు యజమానికి పుష్పాలపై ప్రేమ ఉంది. అయినప్పటికీ షోకేస్‌లో సదా ఉంచదగిన ఆత్మిక గులాబీలు ఎవరంటే - ఎవరైతే సదా సర్వ సువాసనలతో సంపన్నులై ఉంటారో మరియు సదా వికసించి ఉంటారో వారే; ఎన్నడూ వాడిపోనివారు. రోజూ అమృతవేళ బాప్‌దాదా స్నేహము మరియు శక్తుల విశేష పాలనతో ఈ ఆత్మిక గులాబీ పుష్పాలన్నింటితోనూ మిలనము జరుపుకుంటారు.
అమృతవేళ విశేషంగా ప్రభు పాలన లభించే వేళ. అమృతవేళ విశేష పరమాత్మ మిలనము జరుపుకునే వేళ. ఆత్మిక సంభాషణ (రూహ్-రిహాన్) చేసుకునే వేళ. అమృతవేళ భోళా భండారీ యొక్క వరదానాల ఖజానా నుండి సహజంగా వరదానాలు ప్రాప్తించే వేళ. మనసు కోరిన ఫలాన్ని పొందడం అనే ఏ మహిమ అయితే ఉందో, అది ఈ సంగమయుగపు అమృతవేళ సమయానికే చెందిన మహిమ. శ్రమ లేకుండా నిండు ఖజానాలను పొందే వేళ ఇది. ఇంతటి సుందరమైన సమయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కదా! అనుభవజ్ఞులకే తెలుస్తుంది ఈ శ్రేష్ఠ సుఖము, ఈ శ్రేష్ఠ ప్రాప్తులు. కాబట్టి బాప్‌దాదా సర్వ ఆత్మిక గులాబీలను చూసి చూసి హర్షిస్తున్నారు. బాప్‌దాదా కూడా ‘వాహ్ నా ఆత్మిక గులాబీలు!’ అని అంటున్నారు. మీరు వాహ్-వాహ్ అని గీతాలు పాడితే, బాప్‌దాదా కూడా ఇదే గీతం పాడుతున్నారు. అర్థమైందా!
మురళీలు అయితే ఎన్నో విన్నారు. విని విని సంపన్నులుగా అయిపోయారు. ఇప్పుడు మహాదానిగా మారి పంచేందుకు ప్రణాళికలు (ప్లాన్స్) రచిస్తున్నారు. ఈ ఉత్సాహం చాలా మంచిది. ఈరోజు యూ.కే. అనగా ‘ఓ.కే.’గా ఉండేవారి టర్న్. డబల్ విదేశీయుల ఒక్క మాటను విని బాప్‌దాదా సదా చిరునవ్వు నవ్వుతుంటారు. ఏ మాట అది? - ‘థ్యాంక్యూ’. థ్యాంక్యూ చెబుతూ కూడా తండ్రిని స్మరిస్తూనే ఉంటారు. ఎందుకంటే మొట్టమొదటి కృతజ్ఞతను (శుక్రియాను) హృదయపూర్వకంగా బాబాకే చెల్లిస్తారు కదా. కాబట్టి ఎవరికి థ్యాంక్యూ చెప్పినా ముందు బాబా గుర్తుకొస్తారు కదా! బ్రాహ్మణ జీవితంలో మొట్టమొదటి శుక్రియా స్వతహాగానే తండ్రి పట్ల వెలువడుతుంది. లేస్తూ-కూర్చుంటూ ఎన్నోసార్లు థ్యాంక్యూ చెబుతుంటారు. ఇది కూడా ఒక విధి - తండ్రిని స్మరించడానికి. యూ.కే. వారు విభిన్న హద్దు శక్తులు కలవారందరినీ ఏకం చేయడానికి నిమిత్తమయ్యారు కదా. అనేక రకాల నాలెడ్జ్ శక్తులు ఉన్నాయి. విభిన్న శక్తులు గలవారిని, వేర్వేరు వర్గాల వారిని, వివిధ ధర్మాల వారిని, భాషల వారిని - అందరినీ కలిపి ఒక్క బ్రాహ్మణ వర్గంలోకి, బ్రాహ్మణ ధర్మంలోకి, బ్రాహ్మణ భాషలోకి తీసుకురావాలి. బ్రాహ్మణుల భాష కూడా ప్రత్యేకమైనది. కొత్తవారు అసలు వీరు ఏమి మాట్లాడుతున్నారో కూడా అర్థం చేసుకోలేరు. కాబట్టి బ్రాహ్మణుల భాష, బ్రాహ్మణుల నిఘంటువు (డిక్షనరీ) ప్రత్యేకమైనవి. మరి యూ.కే. వారు అందరినీ ఏకం చేయడంలో బిజీగా ఉంటున్నారు కదా? సంఖ్య కూడా బాగుంది, స్నేహమూ బాగుంది. ప్రతి స్థానానికి తమదైన విశేషత ఉండనే ఉంది, కానీ ఈరోజు యూ.కే. గురించి వినిపిస్తున్నాము. యజ్ఞ స్నేహీ, యజ్ఞ సహయోగి అనే విశేషత వారిలో ఎంతో చక్కగా కనిపిస్తుంది. ప్రతి అడుగులోనూ ముందుగా యజ్ఞం అనగా మధుబన్ వాటాను తీయడంలో మంచి నంబర్లలో ముందుకు వెళ్తున్నారు. నేరుగా మధుబన్ స్మృతి అనేది ఒక ప్రత్యేకమైన లిఫ్ట్‌గా మారిపోతుంది. ప్రతి కార్యంలో, ప్రతి అడుగులో మధుబన్ అనగా బాబా స్మృతి లేదా బాబా చదువు, లేదా బాబా బ్రహ్మా భోజనం, లేదా బాబాతో మిలనము. మధుబన్ స్వతహాగానే బాబాను గుర్తుచేసేది. ఎక్కడున్నా మధుబన్ గుర్తుకురావడం అనగా ఆ విశేష స్నేహం ఒక లిఫ్ట్‌లా మారుతుంది. పైకి ఎక్కే శ్రమ నుండి విముక్తి లభిస్తుంది. సెకనులో స్విచ్ ఆన్ చేయగానే చేరుకుంటారు.
బాప్‌దాదాకు వేరే ఏ వజ్రాలు, ముత్యాలు అవసరం లేదు. తండ్రికి స్నేహంతో కూడిన చిన్న వస్తువే వజ్రవైఢూర్యాలతో సమానం. అందుకే కుచేలుడి (సుదాముడి) పిడికెడు అటుకుల మహిమ గానం చేయబడింది. దీని భావార్థం ఏమిటంటే - స్నేహమనే చిన్న సూదిలో కూడా మధుబన్ గుర్తుకొస్తే, అది కూడా ఎంతో గొప్ప అమూల్యమైన రత్నంతో సమానం. ఎందుకంటే విలువ స్నేహానికే ఉంది. వస్తువుకు కాదు, స్నేహానికే విలువ. ఒకవేళ ఎవరైనా భావం లేకుండా ఎంత సమర్పించినా, స్నేహం లేకపోతే అది జమ కాదు. అదే స్నేహంతో కొద్దిగా సమర్పించినా అది పదమా పదమ రెట్లుగా జమ అవుతుంది. కాబట్టి తండ్రికి స్నేహమే ఇష్టం. కనుక యూ.కే. వారి విశేషత - ఆది నుంచీ యజ్ఞ స్నేహీలుగా, యజ్ఞ సహయోగులుగా ఉంటూ వచ్చారు. ఇదే సహజ యోగం కూడా. సహయోగమే సహజ యోగము. సహకారం అందించాలనే సంకల్పం రాగానే తండ్రి స్మృతి ఉండనే ఉంటుంది కదా. కాబట్టి సహయోగి స్వతహాగానే సహజయోగిగా మారిపోతారు. యోగం తండ్రితో కుదురుతుంది, మధుబన్ అనగా బాప్‌దాదాతో కుదురుతుంది. అందువల్ల సహయోగిగా మారేవారు కూడా సహజయోగం సబ్జెక్ట్‌లో మంచి మార్కులు పొందుతారు. హృదయపూర్వక సహకారం బాబాకు ప్రియమైనది. అందుకే ఇక్కడ స్మృతిచిహ్నంగా ‘దిల్వాలా మందిరం’ నిర్మించబడింది. కాబట్టి దిల్వాలా అయిన తండ్రికి హృదయపూర్వక స్నేహం, హృదయపూర్వక సహకారమే ప్రియమైనవి. చిన్న మనస్సు కలవారు చిన్న వ్యాపారం చేసి సంతోషపడతారు, విశాల హృదయం కలవారు అనంతమైన వ్యాపారం చేస్తారు. పునాది విశాల హృదయమైతే విస్తరణ కూడా పెద్దగా జరుగుతుంది. అనేక ప్రాంతాల్లో చెట్లను చూసి ఉంటారు - చెట్టు కొమ్మలు కూడా మొదళ్ళుగా (కాండాలుగా) మారిపోతాయి. అలాగే యూ.కే. పునాది నుండి కాండం వెలువడింది, కొమ్మలు వచ్చాయి. ఇప్పుడు ఆ కొమ్మలు కూడా కాండాలుగా మారాయి. ఆ కాండాల నుండి మళ్ళీ కొమ్మలు విస్తరిస్తున్నాయి. ఎలాగైతే ఆస్ట్రేలియా వెలువడింది, అమెరికా, యూరప్, ఆఫ్రికాలు వెలువడ్డాయి. ఇవన్నీ కాండాలుగా మారాయి. మరియు ప్రతి కాండం యొక్క కొమ్మలు కూడా ఎంతో చక్కగా వృద్ధిని పొందుతున్నాయి. ఎందుకంటే పునాది స్నేహము మరియు సహకారమనే నీటితో దృఢంగా ఉంది. అందుకే విస్తరణ కూడా బాగుంది, ఫలాలు కూడా ఎంతో శ్రేష్ఠంగా ఉన్నాయి. అచ్ఛా!
*** ఓంశాంతి ***
