‘‘సత్యమైన ఆత్మిక ప్రేయసుల లక్షణాలు’’
ఈరోజు ఆత్మిక ప్రియుడు తన ఆత్మిక ప్రేయసీ ఆత్మలను కలుసుకునేందుకు వచ్చారు. మొత్తము కల్పములో ఈ సమయములోనే ఆత్మిక ప్రియుడు మరియు ప్రేయసుల మిలనము జరుగుతుంది. ఆత్మిక ఆకర్షణతో ఎలా ఆకర్షితులై తమ సత్యమైన ప్రియుడిని తెలుసుకున్నారు, పొందారు అని బాప్‌దాదాకు తమ ప్రతి ఒక్క ప్రేయసి ఆత్మను చూసి సంతోషం కలుగుతుంది. మళ్ళీ తమ యథార్థమైన గమ్యానికి చేరుకున్నారు అని తప్పిపోయి వచ్చిన ప్రేయసులను చూసి ప్రియుడు కూడా సంతోషిస్తారు. సర్వ ప్రాప్తులను కలిగింపజేసే ఇటువంటి ప్రియుడు ఇంకెవ్వరూ లభించజాలరు. ఆత్మిక ప్రియుడు సదా తమ ప్రేయసులను కలుసుకునేందుకు ఎక్కడకు వస్తారు? ఏ విధంగా ప్రియుడు మరియు ప్రేయసులు శ్రేష్ఠమైనవారో, అలాగే కలుసుకునేందుకు శ్రేష్ఠమైన స్థానములోనే వస్తారు. మిలనమును జరుపుకుంటున్న ఈ స్థానము ఎటువంటిది? ఈ స్థానాన్ని ఏమన్నా అనండి, అన్ని పేర్లనూ ఈ స్థానానికి పెట్టవచ్చు. మామూలుగా కూడా అతి ప్రియమనిపించే మిలన స్థానము ఏదుంటుంది? మిలనము పూదోటలోనన్నా ఉంటుంది లేక సముద్ర తీరంలో మిలనము ఉంటుంది, దీనిని మీరు బీచ్ (సముద్ర తీరం) అని అంటారు. మరి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? జ్ఞాన సాగర తీరంలో, ఆత్మిక మిలనము యొక్క స్థానంలో కూర్చున్నారు. ఇది ఆత్మిక గార్డెన్ లేక గాడ్లీ గార్డెన్ (భగవంతుని పూదోట). వేరే అనేక రకాల పూదోటలను చూసారు కానీ ఇటువంటి పూదోట, ఎక్కడైతే ప్రతి ఒక్కరూ ఒకరికంటే మరొకరు ఎక్కువగా వికసించి ఉన్న పుష్పాల వంటివారు, ప్రతి ఒక్కరూ శ్రేష్ఠమైన సుందరత ద్వారా తమ సువాసనను ఇస్తున్నారు - ఇది ఇటువంటి పూదోట. ఈ బీచ్‌లో బాప్‌దాదా లేక ప్రియుడు కలుసుకునేందుకు వస్తారు. ఆ బీచ్‌లు ఎన్నో చూసారు, కానీ జ్ఞాన సాగరుని స్నేహ అలలు, శక్తుల అలలు, రకరకాల అలలు ఎగిరెగిరి పడుతూ సదాకాలమునకు రిఫ్రెష్ చేసే ఇటువంటి బీచ్‌ను ఎప్పుడైనా చూసారా? ఈ స్థానము ఇష్టమనిపిస్తుంది కదా? స్వచ్ఛత కూడా ఉంది మరియు రమణీయత కూడా ఉంది. సుందరత కూడా ఉంది. ప్రాప్తులు కూడా అంతగానే ఉన్నాయి. ఇటువంటి మనోరంజకమైన విశేష స్థానాన్ని ప్రేయసులైన మీ కొరకు ప్రియుడు తయారుచేసారు, ఇక్కడకు రావటంతోనే, ప్రేమ యొక్క రేఖల లోపలకు చేరుకోవటంతోనే అనేక రకాల శ్రమల నుండి విముక్తులైపోతారు. అన్నింటికంటే పెద్ద శ్రమ - సహజ స్మృతి, దానిని సహజంగా అనుభవము చేస్తారు మరియు ఏ శ్రమ నుండి విడుదలౌతారు? లౌకిక ఉద్యోగం నుండి కూడా విముక్తులైపోతారు. భోజనాన్ని తయారుచేసుకోవటం నుండి విముక్తులైపోతారు. అన్నీ రెడీగా తయారైయున్నవి లభిస్తాయి కదా. స్మృతి కూడా స్వతహాగా అనుభవమౌతుంది. జ్ఞాన రత్నాలతో ఒడి కూడా నిండుతూ ఉంటుంది. శ్రమ నుండి విముక్తులయ్యే మరియు ప్రేమలో లీనమైపోయే అటువంటి స్థానానికి చేరుకున్నారు.
ఈ ఇద్దరు, ఇద్దరుగా కాకుండా ఒకటిగా కలిసిపోతారు అని స్నేహానికి గుర్తుగా విశేషంగా ఇదే గాయనము చేయబడుతుంది. దీనినే లీనమైపోవటము అని అంటారు. భక్తులు ఈ స్నేహ స్థితిని కలిసిపోవటము లేక లీనమవ్వటము అని అన్నారు. వారు లీనమవ్వటము అన్నదాని అర్థమును తెలుసుకోరు. లవ్(ప్రేమ)లో లీనమవ్వటము అనేది స్థితి కానీ ఈ స్థితికి బదులుగా వారు ఆత్మ యొక్క అస్తిత్వాన్ని సదాకాలమునకు సమాప్తము చెయ్యటముగా భావించారు. లీనమైపోవటము అనగా సమానంగా అవ్వటము. ఎప్పుడైతే బాబా యొక్క లేక ఆత్మిక ప్రియుని యొక్క మిలనములో నిమగ్నమైపోతారో, అప్పుడు బాబా సమానంగా అయ్యే లేక లీనమయ్యే అనగా సమానంగా అయ్యే అనుభవమును చేస్తారు. ఈ స్థితిని భక్తులు లీనమైపోవటము అని అన్నారు. లీనం కూడా అవుతారు, కలిసిపోతారు కూడా కానీ ఇది మిలనపు ప్రేమ స్థితి యొక్క అనుభూతి. అర్థమైందా! అందుకే బాప్‌దాదా తమ ప్రేయసులను చూస్తున్నారు.
సత్యమైన ప్రేయసులు అనగా సదా ప్రేయసులు, స్వతహా ప్రేయసులు. సత్యమైన ప్రేయసుల విశేషతలు తెలుసు కూడా, అయినా వారి ముఖ్యమైన లక్షణాలు:-
మొదటి లక్షణము - ఒక్క ప్రియుని ద్వారా సర్వ సంబంధాలను సమయ ప్రమాణంగా అనుభూతి చెయ్యటము. ప్రియుడు ఒక్కరే కానీ ఒక్కరితోనే సర్వ సంబంధాలు. ఏ సంబంధము కావాలనుకుంటే ఆ సంబంధమును, మరియు ఏ సమయములో ఏ సంబంధము యొక్క అవసరం ఉందో, ఆ సమయములో ఆ సంబంధము రూపములో ప్రీతి యొక్క విధి ద్వారా అనుభవము చెయ్యగలరు. కనుక మొదటి లక్షణము - సర్వ సంబంధాల అనుభూతి. ‘సర్వ’ అన్న మాటను అండర్లైన్ చెయ్యండి, కేవలము సంబంధము కాదు. సంబంధమైతే జోడింపబడింది కదా అని భావించే కొందరు చిలిపి ప్రేయసులు కూడా ఉంటారు. కానీ సర్వ సంబంధాలు జోడింపబడ్డాయా? మరొక విషయము - అవసరమైన సమయంలో సంబంధము యొక్క అనుభూతి కలుగుతుందా? జ్ఞానము ఆధారముతో సంబంధము ఉందా లేక మనసు యొక్క అనుభూతి ఆధారముతో సంబంధము ఉందా? సత్యమైన మనసుపై బాప్‌దాదా రాజీ అవుతారు. కేవలము తీవ్రమైన బుద్ధి కలవారిని చూసి రాజీ అవ్వరు, కానీ మనోభిరాముడు మనసుపై రాజీ అవుతారు కనుక మనసు యొక్క అనుభవము గురించి మనసుకు తెలుసు, మనోభిరామునికి తెలుసు. ఇమిడిపోయే స్థానాన్ని మనసు అంటారు, బుద్ధి అని అనరు. జ్ఞానాన్ని ఇముడ్చుకునే స్థానము బుద్ధి, కానీ ప్రియుడిని ఇముడ్చుకునే స్థానము మనసు. ప్రియుడు, ప్రేయసులకు సంబంధించిన విషయాలనే వినిపిస్తారు కదా! కొంతమంది ప్రేయసులు బుద్ధిని ఎక్కువగా నడిపిస్తారు కానీ మనసు వలన బుద్ధి యొక్క శ్రమ సగమైపోతుంది. ఎవరైతే మనస్ఫూర్తిగా సేవ చేస్తారో మరియు స్మృతి చేస్తారో, వారి శ్రమ తక్కువగా మరియు సంతుష్టత ఎక్కువగా ఉంటుంది మరియు ఎవరైతే మనసు యొక్క స్నేహముతో స్మృతి చెయ్యరో, కేవలము జ్ఞానం ఆధారముగా బుద్ధితో గుర్తు చేస్తారో లేక సేవ చేస్తారో, వారు శ్రమ ఎక్కువగా చేయవలసి ఉంటుంది, సంతుష్టత తక్కువ ఉంటుంది. సఫలత కలిగినా కానీ మనసు యొక్క సంతుష్టత తక్కువ ఉంటుంది. జరగటమైతే బాగానే జరిగింది, అయినా కానీ, కానీ మరి..... అన్నదానినే ఆలోచిస్తూ ఉంటారు మరియు దిల్వాలే (మనసున్నవారు) సదా సంతుష్టత యొక్క పాటను పాడుతూ ఉంటారు. మనసులోని సంతుష్టత ద్వారా వచ్చే పాట, నోటి సంతుష్టత యొక్క పాట కాదు. సత్యమైన ప్రేయసులు మనస్ఫూర్తిగా సర్వ సంబంధాలను సమయ ప్రమాణంగా అనుభూతి చేస్తారు.
రెండవ లక్షణము - సత్యమైన ప్రేయసులు ప్రతి పరిస్థితిలో, ప్రతి కర్మలో సదా ప్రాప్తికి చెందిన సంతోషములో ఉంటారు. ఒకటేమో అనుభూతి, మరొకటి దాని ద్వారా ప్రాప్తి. చాలామంది బాబా తండ్రి కూడా, ప్రియుడు కూడా, సంతానము కూడా అని అనుభూతి చెందుతారు కానీ ఎంత ప్రాప్తిని కోరుకుంటారో అంత ప్రాప్తి కలగదు. వారు తండ్రియే కానీ వారసత్వ ప్రాప్తి యొక్క సంతోషము ఉండదు. అనుభూతితో పాటుగా సర్వ సంబంధాల ద్వారా ప్రాప్తి యొక్క అనుభవము కూడా ఉండాలి. ఏవిధంగానైతే - తండ్రి సంబంధము ద్వారా సదా వారసత్వ ప్రాప్తి యొక్క అనుభూతి ఉండాలి, నిండుతనము ఉండాలి. సద్గురువు ద్వారా సదా వరదానాలతో సంపన్నమైన స్థితి యొక్క అనుభవము లేక సదా సంపన్న స్వరూపపు అనుభవము ఉండాలి. కనుక ప్రాప్తి యొక్క అనుభవము కూడా అవసరము. అది సంబంధాల అనుభవము, ఇది ప్రాప్తుల అనుభవము. చాలామందికి సర్వ ప్రాప్తుల అనుభవము కలగదు. మాస్టర్ సర్వశక్తివంతులు కానీ అవసరమైన సమయంలో శక్తుల ప్రాప్తి కలగదు. ప్రాప్తుల అనుభూతి లేనట్లయితే ప్రాప్తిలో కూడా లోటు ఉంటుంది. కనుక అనుభూతితో పాటు ప్రాప్తి స్వరూపులుగా కూడా అవ్వాలి - ఇది సత్యమైన ప్రేయసి లక్షణము.
మూడవ లక్షణము - ఏ ప్రేయసికైతే అనుభూతి ఉంటుందో, ప్రాప్తి కూడా ఉంటుందో వారు సదా తృప్తిగా ఉంటారు, ఏ విషయములోనూ అప్రాప్తి ఆత్మగా అనిపించరు. కనుక ‘తృప్తి’ అనేది ప్రేయసి యొక్క లక్షణము. ఎక్కడైతే ప్రాప్తి ఉంటుందో అక్కడ తప్పకుండా తృప్తి ఉంటుంది. ఒకవేళ తృప్తిగా లేనట్లయితే తప్పకుండా ప్రాప్తిలో లోటు ఉన్నట్లు మరియు ప్రాప్తి లేనట్లయితే సర్వ సంబంధాల అనుభూతిలో లోటు ఉన్నట్లు. కనుక 3 లక్షణాలు - అనుభూతి, ప్రాప్తి మరియు తృప్తి. సదా తృప్త ఆత్మ. ఎటువంటి సమయము అయినా, ఎటువంటి వాయుమండలము ఉన్నా, ఎటువంటి సేవ సాధనాలు ఉన్నా, సేవ సంగఠనలో ఎటువంటి సహచరులు ఉన్నాగానీ ప్రతి పరిస్థితిలో, ప్రతి నడవడికలో తృప్తి ఉండాలి. ఇటువంటి సత్యమైన ప్రేయసులు కదా? తృప్త ఆత్మలో ఎటువంటి హద్దు కోరికలు ఉండవు. మామూలుగా చూసినట్లయితే తృప్త ఆత్మలు చాలా కొద్దిమంది ఉంటారు. ఏదో ఒక విషయంలో, మనసుకు చెందిన విషయంలోనైనా, పేరు ప్రతిష్ఠల విషయంలోనైనా ఆకలి ఉంటుంది. ఆకలిగా ఉన్నవారు ఎప్పుడూ తృప్తి చెందరు. ఎవరి కడుపైతే ఎప్పుడూ నిండుగా ఉంటుందో, వారు తృప్తిగా ఉంటారు. ఏ విధంగా శరీరం యొక్క భోజనం కోసం ఆకలి ఉంటుందో, అదే విధంగా మనసు యొక్క ఆకలి - గౌరవము, ప్రతిష్ఠ, సాల్వేషన్, సాధనాలు - ఇది మనసుకు చెందిన ఆకలి. కనుక ఏవిధంగానైతే శారీరిక తృప్తి కలవారు సదా సంతుష్టంగా ఉంటారో, అలా మానసిక తృప్తి కలవారు సదా సంతుష్టంగా ఉంటారు. సంతుష్టత తృప్తికి గుర్తు. ఒకవేళ తృప్త ఆత్మగా లేనట్లయితే, శారీరక ఆకలిగానీ, మానసిక ఆకలిగానీ ఉన్నట్లయితే, అటువంటివారు ఎంత లభించినాగానీ, ఎక్కువగానే లభిస్తుంది కూడా కానీ తృప్త ఆత్మగా లేని కారణంగా ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటారు. అసంతుష్టంగా ఉంటారు. ఎవరైతే రాయల్‌గా ఉంటారో, వారు కొంతలోనే తృప్తి చెందుతారు. రాయల్ ఆత్మల లక్షణము - సదా నిండుగా ఉంటారు. ఒక్క రొట్టెతో కూడా తృప్తిగా ఉంటే 36 రకాల భోజనంతో కూడా తృప్తిగా ఉంటారు మరియు ఎవరైతే అసంతృప్తిగా ఉంటారో, వారికి 36 రకాల భోజనం లభించినా కూడా తృప్తి చెందరు ఎందుకంటే మనసు యొక్క ఆకలి ఉంది. సత్యమైన ప్రేయసి లక్షణము - సదా తృప్త ఆత్మగా ఉంటారు. కనుక మూడు లక్షణాలనూ చెక్ చేసుకోండి. ‘మేము ఎవరి ప్రేయసులము, సదా సంపన్నులైన ప్రియునికి ప్రేయసులము’ అన్నదానినే సదా ఆలోచించండి. కనుక ఎప్పుడూ సంతుష్టతను వదలకండి. సేవను వదలేయండి కానీ సంతుష్టతను వదలకండి. ఏ సేవ అయితే అసంతుష్టంగా చేస్తుందో, ఆ సేవ, సేవ కాదు. సేవ యొక్క అర్థమే, మేవాను (సేవకు ప్రతిఫలాన్ని) ఇచ్చే సేవ. కనుక సత్యమైన ప్రేయసులు సర్వ హద్దు కోరికల నుండి అతీతంగా, ఎల్లప్పుడూ సంపన్నంగా మరియు సమానంగా ఉంటారు.
ఈరోజు ప్రేయసుల కథలను వినిపిస్తున్నాము. కొంటె పనులు, మారాం కూడా చాలా చేస్తారు. ప్రియుడు కూడా వాటిని చూసి-చూసి నవ్వుకుంటూ ఉంటారు. కొంటె పనులు, మారాం చెయ్యండి కానీ ప్రియుడిని ప్రియునిగా భావించి వారి ఎదురుగా చెయ్యండి, ఇతరుల ఎదురుగా కాదు. రకరకాల హద్దు స్వభావ, సంస్కారాల చిలిపి చేష్టలు చేస్తారు. ఎక్కడైతే నా స్వభావము, నా సంస్కారాలు అన్న మాటలు వస్తాయో, అక్కడ కూడా కొంటెతనము మొదలైపోతుంది. తండ్రి స్వభావమే నా స్వభావమై ఉండాలి. నా స్వభావము తండ్రి స్వభావము నుండి భిన్నంగా ఉండజాలదు. అది మాయ స్వభావము, పరాయి స్వభావము. దానిని నాది అని ఎలా అంటారు? మాయ పరాయిది, మీది కాదు. తండ్రి మీకు చెందినవారు. నా స్వభావము అనగా తండ్రి స్వభావము. మాయ స్వభావాన్ని నాది అని అనడం కూడా తప్పే. ‘మేరా’ (నాది) అన్న పదమే ప్రదక్షిణ చేయిస్తుంది అనగా చక్రములోకి తీసుకువస్తుంది. ప్రేయసులు ప్రియుని ముందు ఇటువంటి కొంటెతనాన్ని కూడా చూపిస్తారు. తండ్రికి చెందింది ఏదైతే ఉందో, అది నాది. ప్రతి విషయంలోనూ భక్తిలో కూడా ఇదే అంటారు - ఏదైతే నీదో, అదే నాది, నాదంటూ వేరే ఏమీ లేదు. ఏదైతే నీదో అదే నాది. ఏదైతే బాబా సంకల్పమో, అదే నా సంకల్పము. సేవ పాత్రను పోషించడంలో బాబా సంస్కార-స్వభావాలు ఏవో, అవే నావి. మరి దీనితో ఏమవుతుంది? హద్దు యొక్క ‘మేరా’ (నాది) అన్నది తేరా (నీది) గా అయిపోతుంది. నీదే నాది, నాదంటూ వేరే ఏదీ లేదు. బాబా నుండి వేరుగా ఉన్నది ఏదైనా, నాది కానే కాదు, అది మాయ చుట్టూ ప్రదక్షిణ చేయడం అవుతుంది కనుక ఈ హద్దు యొక్క కొంటెతనం నుండి బయటపడి ఆత్మిక గర్వములో ఉండండి - నేను మీ దానిని మరియు మీరు నా వారు, రకరకాల సంబంధాల అనుభూతికి చెందిన ఆత్మిక కొంటెతనాన్ని అయితే చూపించండి కానీ వేరే ఏదీ చెయ్యకండి. సంబంధాలను నిర్వర్తించడంలో కూడా ఆత్మిక కొంటెపనులు చెయ్యవచ్చు. ప్రేమతో కూడిన ప్రీతి యొక్క కొంటెపనులు బాగుంటాయి. ఒక్కోసారి సహచరుని సంబంధముతో ప్రేమతో కూడిన మురిపాలను అనుభవము చెయ్యండి. అది కొంటెతనము కాదు కానీ అద్భుతము. స్నేహముతో కూడిన మురిపాలు ప్రియంగా ఉంటాయి. చిన్న పిల్లలు చాలా స్నేహీగా మరియు పవిత్రంగా ఉన్న కారణంగా వారి చిలిపి పనులు అందరికీ బాగా అనిపిస్తాయి. పిల్లలలో శుద్ధత మరియు పవిత్రత ఉంటుంది. అదే పెద్దవారు ఎవరైనా చిలిపి పనులు చేస్తే తప్పుగా భావించడం జరుగుతుంది. కనుక ఒకవేళ చెయ్యాల్సిందే అని అంటే, బాబాతో రకరకాల సంబంధాలు, స్నేహము, పవిత్రత యొక్క చిలిపి పనులు చెయ్యాలంటే చెయ్యండి.
‘సదా చేయి మరియు తోడు’ - ఇవి సత్యమైన ప్రియుడు-ప్రేయసులకు గుర్తు. చేయి మరియు తోడు ఎప్పుడూ దూరమవ్వకూడదు. సదా బుద్ధి యొక్క తోడు ఉండాలి మరియు బాబా యొక్క ప్రతి కార్యములో సహయోగమనే చేయి ఉండాలి. పరస్పరంలో సహయోగానికి గుర్తుగా చేతిలో చెయ్యి కలిపి చూపిస్తారు కదా. కావున సదా బాబాకు సహయోగులుగా అవ్వడము - ఇదే సదా చేతిలో చెయ్యి మరియు సదా బుద్ధితో తోడుగా ఉండడం. మనసు యొక్క తపన, బుద్ధి యొక్క తోడు. ఈ స్థితిలో ఉండడం అనగా సత్యమైన ప్రేయసులు మరియు ప్రియుని పోజ్‌లో ఉండటము. అర్థమైందా? సదా తోడుగా ఉంటాము అన్నదే మీరు చేసిన ప్రతిజ్ఞ. అప్పుడప్పుడు తోడును నిర్వర్తిస్తాము - ఇది ప్రతిజ్ఞ కాదు. మనసు యొక్క ఆకర్షణ ఒక్కోసారి ప్రియునివైపు ఉండడం, ఒక్కోసారి లేకపోవడం అన్నదైతే సదా తోడుగా ఉండడం కాదు కదా, కనుక ఈ సత్యమైన ప్రేయసి యొక్క పొజిషన్లో ఉండండి. దృష్టిలో కూడా ప్రియుడు, వృత్తిలో కూడా ప్రియుడు, సృష్టియే ప్రియుడు.
కనుక ఇది ప్రియుడు మరియు ప్రేయసులు సభ. ఇది పూదోట కూడా, సాగర తీరము కూడా. ఇది అద్భుతమైన ప్రైవేట్ బీచ్ (సాగర తీరము), వేలాదిమంది మధ్యలో కూడా ప్రైవేట్ (వ్యక్తిగతము) గా ఉంది. నాపై ప్రియునికి పర్సనల్ ప్రేమ ఉంది అని ప్రతి ఒక్కరూ అనుభవము చేస్తారు. ప్రతి ఒక్కరికీ పర్సనల్ ప్రేమ యొక్క ఫీలింగ్ ప్రాప్తించటము - ఇటువంటివారే అద్భుతమైన ప్రియుడు మరియు ప్రేయసులు. ప్రియుడు ఒక్కరే కానీ వారు అందరికీ చెందినవారు. అందరి అధికారము చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరికీ అధికారము ఉంది. అధికారములో నంబరు లేదు, అధికారాన్ని ప్రాప్తి చేసుకోవడంలో నంబరు వచ్చేస్తుంది. సదా ఇది గుర్తు ఉంచుకోండి - ‘ఈశ్వరీయ పూదోటలో చేయి మరియు తోడును ఇచ్చి నడుస్తున్నాము లేక కూర్చుని ఉన్నాము. ఆత్మిక బీచ్‌లో చేయి మరియు తోడును ఇచ్చి ఆనందాన్ని అనుభవం చేస్తున్నారు.’ ఇలా భావించినట్లయితే సదా మనోరంజనములో ఉంటారు, సదా సంతోషంగా ఉంటారు, సదా సంపన్నంగా ఉంటారు. అచ్ఛా!
ఈ డబల్ విదేశీయులు కూడా డబల్ అదృష్టవంతులు. ఇప్పుడే చేరుకున్నారు, మంచిది. ఇక మున్ముందు ఎటువంటి పరివర్తన అవుతుంది అనేదైతే డ్రామా. ఎవరైతే సమయ ప్రమాణంగా చేరుకున్నారో, వారు డబల్ అదృష్టవంతులు. అచ్ఛా!
సదా అవినాశీ ప్రేయసులుగా అయ్యి ఆత్మిక ప్రియునితో ప్రీతి యొక్క విధిని నిర్వర్తించేవారు, సదా స్వయమును సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అనుభవము చేసుకునేవారు, సదా ప్రతి స్థితి లేక పరిస్థితిలో తృప్తిగా ఉండేవారు, సదా సంతుష్టత ఖజానాతో నిండుగా అయ్యి ఇతరులను కూడా నిండుగా చేసేవారు, ఇలా సదా కోసం తోడును మరియు చేతిని కలిపే సత్యమైన ప్రేయసులకు ఆత్మిక ప్రియుని హృదయపూర్వకమైన ప్రియస్మృతులు మరియు నమస్తే.
వ్యక్తిగత మిలనము - పార్టీలతో
ఆస్ట్రేలియా పార్టీతో:- ఆస్ట్రేలియా నివాసులా లేక వతన నివాసులా? ఏ దేశం బాగుంటుంది? సదా వతనవాసిగా మారి, తండ్రి ఎలాగైతే సేవల నిమిత్తం కిందికి వస్తారో, అదే రీతిలో పిల్లలు కూడా వతనం నుండి సేవల నిమిత్తమై కిందికి వచ్చారు - ఇలా అనుభవం చేసుకుంటూ సేవ చేస్తూ సాగితే సదా అతీతంగా మరియు తండ్రి సమానంగా విశ్వానికి ప్రియమైనవారిగా మారిపోతారు. పైనుండి కిందికి రావడం అనగా అవతారంగా మారి అవతరించి సేవ చేయడము. ఇలాంటి సేవ చేస్తున్నారా? ఎందుకంటే వర్తమాన సమయంలో ఇలాంటి అవతారాల ఆవశ్యకతే ఉంది. అవతారాలు వచ్చి మమ్మల్ని తమతో పాటు తీసుకువెళ్ళాలి అని అందరూ కోరుకుంటున్నారు. ఎవరు ప్రార్థన చేసినా అందులో ఏమి అంటారు? క్రీస్తును కూడా ఇదే అడుగుతారు - వచ్చి మమ్మల్ని మీతో పాటు తీసుకువెళ్ళండి అని. కాబట్టి తమతో పాటు ముక్తిధామానికి తీసుకువెళ్ళే నిజమైన అవతారాలు మీరే. ఇలాంటి అవతారాలుగా మారి సదా సేవలో ముందుకు సాగుతూ ఉండండి. నడుస్తూ-తిరుగుతూ మీ ద్వారానే - అవతారాలు వెళ్తున్నారు, అవతారాలు మాట్లాడుతున్నారు అనే సాక్షాత్కారం జరగాలి. అప్పుడు వారి కోరిక పూర్తవుతుంది మరియు వారు సంతోషిస్తారు. ఇలాంటి సేవలో నిమగ్నమై ఉన్నారా? ఎందుకంటే ప్రస్తుతం విశ్వం దుఃఖము మరియు అశాంతితో అలసిపోయినట్లుగా అనుభవం చేసుకుంటుంది. మరి ఇలాంటి అలసిపోయిన ఆత్మలకు సుఖము మరియు శాంతుల విశ్రాంతిని కలిగించే ఆత్మలు మీరే. అందరికీ తండ్రి ఖజానాల నుండి ఏదో ఒక ప్రాప్తిని తప్పకుండా కలిగించాలి అనేదే సదా లక్ష్యంగా ఉంచుకోండి.
అమెరికా, బ్రెజిల్, మెక్సికో మొదలైన పార్టీలతో:-
1. అందరూ సదా ఏకరస స్థితిలో స్థితులై ఉండే శ్రేష్ఠ ఆత్మలే కదా. అనుభవజ్ఞులైన ఆత్మలుగా మారిపోయారు కదా. ప్రపంచంలోని అన్ని రసాలనూ అనుభవించి చూసేశారు. ఇప్పుడు ఈ ఈశ్వరీయ రసాన్ని అనుభవించారు, మరి ఆ లౌకిక రసాలన్నీ ఎలా అనిపిస్తున్నాయి? చప్పగా అనిపిస్తున్నాయి కదా. మధురమైన రసం ఒక్కటే ఉన్నప్పుడు అటెన్షన్ కూడా ఒక్కవైపుకే వెళ్తుంది కదా. ఒక్కరి వైపు మనసు లగ్నమైపోతుంది, శ్రమ అనిపించదు. తండ్రి స్నేహం, తండ్రి సహాయం, తండ్రి తోడు, తండ్రి ద్వారా లభించే సర్వ ప్రాప్తులు అంతటినీ సహజంగా మార్చేస్తాయి. ప్రతి ఒక్కరూ ఇదే అనుభవంతో ముందుకు సాగుతున్నారు, ఇది చూసి తండ్రి కూడా హర్షిస్తున్నారు. దేశానికి ఎంత దూరపు ప్రదేశంలో ఉన్నప్పటికీ, అంతగా హృదయానికి సమీపంగా ఉన్నారు. ఎంత దూరంలో ఉన్నప్పటికీ బాప్‌దాదా సెకనులో పిల్లలందరినీ ఆహ్వానించి ఇమర్జ్ చేసేసుకుంటారు. అమృతవేళ బాబా ఎలా మిలనం జరుపుకుంటారో మీకు కూడా అనుభవమవుతోంది కదా! అచ్ఛా!
2. తండ్రి స్మృతితో సంతోషాల ఊయలలో ఊగేవాళ్ళే కదా. ఎందుకంటే ఈ సంగమయుగంలో లభించే సంతోషాల గని మరే యుగంలోనూ లభించదు. ఈ సమయంలో తండ్రి మరియు పిల్లల మిలనం ఉంది, వారసత్వమూ ఉంది, వరదానమూ ఉంది. తండ్రి రూపంలో వారసత్వాన్ని ఇస్తారు, సద్గురువు రూపంలో వరదానాలను ఇస్తారు. మరి రెండూ అనుభవమవుతున్నాయి కదా? రెండు ప్రాప్తులూ సహజమైన అనుభూతిని కలిగించేవే. ఆస్తి అయినా, వరదానమైనా - రెండింటిలోనూ శ్రమ లేదు. అందుకే బిరుదే ‘సహజయోగి’. ఎందుకంటే ఆల్మైటీ అథారిటీయే తండ్రిగా మారిపోతే, సద్గురువుగా మారిపోతే... ఇక సహజం కాకుండా ఎలా ఉంటుంది? పరమ-ఆత్మకు మరియు ఆత్మలకు గల తేడా ఇదే. ఎంతటి మహానాత్మ అయినా సరే ప్రాప్తిని కలిగించేందుకు ఏదో ఒక శ్రమను తప్పక ఇస్తారు. 63 జన్మల అనుభవం ఉంది కదా. అందుకే బాప్‌దాదా పిల్లల శ్రమను చూడలేరు. సంకల్పంలో కూడా తండ్రి నుండి కొద్దిగా దూరం జరిగినప్పుడే శ్రమపడతారు. ఆ సెకనులోనే తోడుగా చేసుకుంటే సెకనులో కష్టమైనది సహజమైన అనుభవంగా మారిపోతుంది. ఎందుకంటే బాప్‌దాదా వచ్చిందే పిల్లల అలసటను తీర్చడానికి. 63 జన్మలు వెతికారు, తిరిగారు; ఇప్పుడు మనస్సు అలసటను, శరీరం అలసటను మరియు ధనం చిక్కుల వల్ల కలిగిన అలసటను కూడా బాప్‌దాదా తీసివేస్తున్నారు - నయనాలపై కూర్చుండబెట్టుకుని తీసుకువెళ్తారు. మరి నయనాలపై కూర్చుండబెట్టుకుని తీసుకువెళ్ళేంత తేలికగా (లైట్‌గా) మారారా? లైట్‌గా ఉన్నారు కదా? తండ్రి భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు భారాన్ని ఎందుకు మోస్తారు? తండ్రిపై స్నేహానికి గుర్తు - సదా తేలికగా మారి తండ్రి నయనాలలో ఇమిడిపోవడమే. నయనాలలో ఇమిడిపోయేంతగా లైట్ కావాలి! ఈ సమయంలో లైట్‌గా మారితే 21 జన్మల గ్యారెంటీ లభిస్తుంది - ఎన్నడూ ఎలాంటి భారమూ రానే రాదు. అచ్ఛా!
19వ తేదీ సద్గురువారం తెల్లవారుజామున 6.30 గంటలకు బాప్‌దాదా క్లాస్‌లో ప్రియస్మృతులు అందించి వీడ్కోలు తీసుకున్నారు
నలువైపులా దేశ-విదేశాలలో సేవలలో ఉండే సేవాధారి పిల్లలందరికీ సద్గురువారం నాటి వరదాన దినం సందర్భంగా వరదాత మరియు విధాత అయిన తండ్రి ప్రియస్మృతులు, గుడ్ మార్నింగ్, గోల్డెన్ మార్నింగ్. సద్గురువు యొక్క ఈ శుభ దినం సందర్భంగా - మహానతను పొందడం అనగా నిర్మాణతను (వినమ్రతను) ధారణ చేయడమే సర్వశ్రేష్ఠమైన మహానత అనే ఈ మహామంత్రం సదా గుర్తుండాలి. ‘ముందు మీరు’ అనడమే అందరి నుండి స్వమానాన్ని పొందేందుకు ఆధారం. “సద్గురువారం” నాటి ఈ రోజున సద్గురువు ద్వారా మహానుభావులుగా మారే ఈ మంత్రాన్ని వరదాన రూపంలో సదా వెన్నంటే ఉంచుకోండి మరియు వరదానాల ద్వారా మున్ముందుగా ఎగురుతూ గమ్యస్థానానికి చేరుకోండి. వరదానాలను కార్యంలో ఉపయోగించనప్పుడే శ్రమపడతారు. వరదానాలతో పాలన పొందుతూ, వరదానాలను కార్యంలో ఉపయోగిస్తూ ఉంటే శ్రమ సమాప్తమైపోతుంది. సదా సఫలతను, సదా సహజ సంతుష్టతను స్వయం అనుభవం చేసుకుంటారు మరియు ఇతరులకూ అనుభవం చేయిస్తారు. వరదానాలతో ఎగురుతూ సాగండి, వరదానాల పాలనను ఇవ్వండి మరియు వరదాత, విధాతల నుండి పొందిన ప్రాప్తుల ప్రత్యక్ష ఫలాన్ని చూపించండి. ఇదే సద్గురువు యొక్క శ్రేష్ఠమైన శ్రీమతము లేదా శ్రేష్ఠమైన వరదానము. అచ్ఛా. అందరికీ ప్రియస్మృతులు.
*** ఓంశాంతి ***
