Search for a command to run...
30 Mar 2000
‘‘మనసును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మధ్యమధ్యలో 5 సెకనులనైనా కేటాయించి మనసు యొక్క ఎక్సర్సైజ్ను చెయ్యండి’’
30 March 2000 · తెలుగు
ఈరోజు దూరదేశి అయిన బాప్‌దాదా సాకార ప్రపంచములో భిన్న-భిన్న దేశాలకు చెందిన తమ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. బాప్‌దాదా భిన్న-భిన్న దేశాలకు చెందినవారిని ఒకే దేశవాసులుగా చూస్తున్నారు. ఎవరు ఎక్కడి నుండి వచ్చినా గానీ అన్నింటికంటే ముందు అందరూ ఒకే దేశము నుండి వచ్చారు. మరి మీ అనాది దేశము గుర్తుంది కదా! అది ప్రియమనిపిస్తుంది కదా! బాబాతోపాటు మీ అనాది దేశము కూడా చాలా ప్రియమనిపిస్తుంది కదా!
బాప్‌దాదా ఈ రోజు పిల్లలందరి 5 స్వరూపాలను చూస్తున్నారు, ఆ 5 స్వరూపాలు ఏవో తెలుసా? తెలుసు కదా! పంచ ముఖి బ్రహ్మాకు కూడా పూజ జరుగుతుంది. బాప్‌దాదా పిల్లలందరి 5 స్వరూపాలను చూస్తున్నారు.
మొదటిది - అనాది జ్యోతిర్బిందు స్వరూపము. మీ స్వరూపము గుర్తుంది కదా? మర్చిపోరు కదా? రెండవది - ఆది దేవతా స్వరూపము. దేవతా స్వరూపములోకి చేరుకున్నారా? మూడవది - మధ్యలో పూజ్య స్వరూపము, అది కూడా గుర్తుందా? మీ అందరి పూజ జరుగుతుందా లేక భారతవాసులు పూజనే జరుగుతుందా? మీ పూజ జరుగుతుందా? కుమారులు వినిపించండి, మీ పూజ జరుగుతుందా? కనుక మూడవది పూజ్య స్వరూపము. నాల్గవది - సంగమయుగ బ్రాహ్మణ స్వరూపము మరియు చివరిది ఫరిశ్తా స్వరూపము. మరి ఈ 5 రూపాలూ గుర్తుకొచ్చాయా? అచ్ఛా, ఒక్క సెకండులో ఈ 5 రూపాలలోనూ స్వయాన్ని అనుభవం చేయగలరా? వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్... మరి అనుభవము చేయగలరా! ఈ 5 స్వరూపాలూ ఎంత ప్రియమైనవి? ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ రూపములో స్థితులవ్వాలనుకున్నా, తలచుకున్నారు మరియు అనుభవము చేసారు అన్నట్లు ఉండాలి. ఇదే మనసు యొక్క ఆత్మిక ఎక్సర్సైజ్ (వ్యాయామము). ఈ రోజుల్లో అందరూ ఏం చేస్తున్నారు? ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా! ఏ విధంగానైతే ఆదిలో కూడా మీ ప్రపంచములో (సత్యయుగములో) నడుస్తూ-తిరుగుతూ ఉన్న సహజసిద్ధమైన ఎక్సర్సైజ్ ఉండేది. నిలబడి వన్, టూ, త్రీ... అంటూ చేసే ఎక్సర్సైజ్ కాదు. కనుక ఇప్పుడు అంతిమములో కూడా బాప్‌దాదా మనసు యొక్క ఎక్సర్సైజ్ను చేయిస్తున్నారు. ఏ విధంగా స్థూల ఎక్సర్సైజ్ ద్వారా తనువు ఆరోగ్యంగా ఉంటుంది కదా, అలా ఇప్పుడు నడుస్తూ-తిరుగుతూ మనసు యొక్క ఈ ఎక్సర్సైజ్ను చేస్తూ ఉండండి. దీని కొరకు సమయము కేటాయించవలసిన అవసరము లేదు. 5 సెకండులను ఎప్పుడైనా సరే కేటాయించగలరా, లేదా! 5 సెకండులు కూడా కేటాయించలేనంతలా ఎవరైనా బిజీగా ఉన్నారా? ఉన్నారా ఎవరైనా అలా, ఉంటే చేతులెత్తండి. మళ్ళీ తర్వాత - ఏం చెయ్యము, సమయం దొరకటం లేదు అని అనరు కదా? ఇలా అనరు కదా? సమయం లభిస్తుందా? కావున ఈ ఎక్సర్సైజ్ను మధ్యమధ్యలో చెయ్యండి. ఏ పనిలో ఉన్నా సరే, 5 సెకండుల ఈ మనసు యొక్క ఎక్సర్సైజ్ను చేయండి, అప్పుడు మనసు సదా ఆరోగ్యంగా ఉంటుంది, సరిగ్గా ఉంటుంది. బాప్‌దాదా అయితే - ప్రతి గంట ఈ 5 సెకండుల ఎక్సర్సైజ్ను చెయ్యండి అని అంటున్నారు. వీలవుతుందా? చూడండి, అందరూ వీలవుతుంది అని అంటున్నారు. గుర్తు పెట్టుకోండి. ఓం శాంతి భవనాన్ని గుర్తు పెట్టుకోండి, మర్చిపోవద్దు. మనసులో రకరకాల ఫిర్యాదులు ఉంటాయి కదా! ఏం చెయ్యాలి, మనసు నిలవటం లేదు అని అంటారు. మనసును మణుగంత (సుమారు 40 కిలోల బరువు) చేసుకుంటారు. బరువు తూకం చూస్తారు కదా. పాతకాలంలో పావు, శేరు, మణుగు ఉండేవి, ఈ రోజుల్లో అవి మారిపోయాయి. మనసును మణుగంత బరువుగా చేసుకుంటారు, ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ను చేస్తూ ఉంటే పూర్తిగా తేలికగా అయిపోతారు. అభ్యాసమైపోతుంది. బ్రాహ్మణులు అన్న మాట గుర్తు రావటంతోనే బ్రాహ్మణ జీవితము యొక్క అనుభవములోకి రండి. ఫరిశ్తా అన్న మాట అంటే ఫరిశ్తాగా అయిపోండి. కష్టమా? కష్టం లేదా? కుమారులు చెప్పండి, కొంచెం కష్టమా? మీరు ఫరిశ్తాలా, కాదా? ఫరిశ్తాలు మీరేనా లేక ఇంకెవరైనానా? ఎన్నిసార్లు ఫరిశ్తాగా అయ్యారు? లెక్కలేనన్ని సార్లు అయ్యారు. మీరేనా అలా అయ్యారు? అచ్ఛా. లెక్కలేనన్ని సార్లు చేసిన విషయాన్ని రిపీట్ చెయ్యటమనేది కష్టమా? అప్పుడప్పుడు కష్టమవుతుందా? ఇప్పుడు ఈ అభ్యాసము చెయ్యండి. ఎక్కడ ఉన్నా సరే 5 సెకండులు మనసును తిప్పండి, చుట్టూ తిరిగి రండి. చుట్టూ తిరిగి రావటం మంచిగా అనిపిస్తుంది కదా! టీచర్లు, సరేనా! ఒక రౌండ్ వెయ్యటం వస్తుంది కదా? ఒక రౌండ్ వెయ్యండి, మళ్ళీ కర్మలోకి వెళ్ళిపోండి, అంతే. ప్రతి గంట రౌండ్ వెయ్యండి, మళ్ళీ పనిలోకి వెళ్ళిపోండి, ఎందుకంటే పనినైతే వదలలేరు కదా! డ్యూటీనైతే చెయ్యాలి. కానీ 5 సెకండులు అంతే, నిమిషాలు కూడా కాదు, సెకండులు, ఈ మాత్రం కూడా కేటాయించలేరా? కేటాయించగలరా? యునైటెడ్ నేషన్ ఆఫీస్‌లో ఉన్నా కేటాయించగలరా? మీరు మాస్టర్ సర్వశక్తిమంతులు. మరి మాస్టర్ సర్వశక్తిమంతులు చెయ్యలేనిది ఏముంది!
బాప్‌దాదాకు ఒక విషయములో పిల్లలను చూసి మధురాతి మధురమైన చిరునవ్వు వస్తుంది. ఏ విషయములో? ఛాలెంజ్ చేస్తారు, కరపత్రాలను ముద్రిస్తారు, భాషణ చేస్తారు, కోర్స్ చేయిస్తారు. ఆ సమయములో ఏమంటారు? మేము విశ్వాన్ని పరివర్తన చేస్తాము అని అంటారు. ఇలా అయితే అందరూ అంటారు కదా! లేక అనరా? అందరూ అంటారా లేక కేవలం భాషణ చేసేవారే అంటారా? ఒకవైపేమో, విశ్వ పరివర్తన చేస్తాము, మాస్టర్ సర్వశక్తిమంతులము అని అంటారు! ఇంకొక వైపేమో మీ మనసును నా మనసు అని అంటారు, మీరు మనసుకు యజమానులు, మాస్టర్ సర్వశక్తిమంతులు, అయినా కూడా కష్టము అని అంటుంటే మరి నవ్వు రాదా! నవ్వు వస్తుంది కదా! మరి ఏ సమయములోనైతే నా మనసు ఒప్పుకోవటం లేదు అని అనుకుంటారో, ఆ సమయములో మీపై మీరే నవ్వుకోండి. మనసులో ఏదైనా విషయము వస్తే... మూడు రకాల రేఖల గురించి చెప్తుంటారు అని బాప్‌దాదా చూసారు. ఒకటి, నీటిపై గీత, నీటిపై గీతను గీసి చూసారా? గీత గియ్యగానే వెంటనే చెరిగిపోతుంది. గీస్తారు కదా! రెండవది, ఏదైనా కాగితంపైనైనా, పలకపైనైనా, ఎక్కడైనా గీత గియ్యటము మరియు అన్నింటికంటే పెద్ద గీత రాతిపై గీత. రాతిపై గీసిన గీత చాలా కష్టం మీద చెరుగుతుంది. చాలా సార్లు పిల్లలు తమ మనసులోనే రాతిపై గీతలా పక్కా గీతను గీసుకుంటారు అన్నదానిని బాప్‌దాదా చూస్తారు. దానిని చెరపాలనుకున్నా చెరగటం లేదు. అటువంటి గీత ఉండటము మంచిదా? ఇప్పటి నుండి చెయ్యము, ఇప్పటి నుండి జరగదు అని ఎన్ని సార్లు ప్రతిజ్ఞను కూడా చేసారు, కానీ మళ్ళీ-మళ్ళీ పరవశులైపోతారు, అందుకే బాప్‌దాదాకు పిల్లలపై ద్వేషము కలగదు, కానీ దయ కలుగుతుంది. పరవశులైపోతారు. మరి పరవశమైనవారిపై దయ కలుగుతుంది. బాప్‌దాదా ఇటువంటి దయా భావముతో పిల్లలను చూసినప్పుడు డ్రామా అనే పరదాపై ఏం వస్తుంది? ‘ఎప్పటివరకు’ అని వస్తుంది. మరి దీనికి సమాధానము మీరే ఇవ్వండి. ఎప్పటివరకు? ఎప్పటికల్లా ఇది సమాప్తమవుతుంది అన్నదానికి కుమారులు సమాధానం ఇవ్వగలరా? కుమారులు చాలా ప్లాన్లు తయారుచేస్తారు కదా. మరి ఎప్పటివరకో చెప్పగలరా? చివరకు ఇలా ఎప్పటివరకు? చెప్పండి. ఎప్పటివరకు అన్నదానికి జవాబు వస్తుందా? దాదీలు చెప్పండి. (ఎప్పటివరకైతే సంగమయుగము ఉంటుందో అప్పటివరకు కొంచెం-కొంచెం ఉంటుంది) మరి సంగమయుగము కూడా ఎప్పటివరకు? (ఫరిశ్తాగా అయ్యేంతవరకు) అది కూడా ఎప్పటివరకు? (బాబా చెప్పాలి) ఫరిశ్తాగా అవ్వాల్సింది మీరా లేక బాబానా? కావున దీనికి సమాధానం ఆలోచించండి. బాబా అయితే ఇప్పుడే అని అంటారు, మరి సిద్ధంగా ఉన్నారా? సగం మాల తయారైందా అన్నదానిలో కూడా చేతులెత్తలేదు.
బాప్‌దాదా సదా పిల్లలను సంపన్న స్వరూపములో చూడాలని కోరుకుంటారు. బాబాయే మా ప్రపంచము అని అంటారు కదా. ఇలా అయితే అందరూ అంటారు కదా! ఇంకో ప్రపంచమేదైనా ఉందా? బాబాయే ప్రపంచము, మరి ఈ ప్రపంచానికి బయట ఇంకేం ఉంది? కేవలం సంస్కారాలను పరివర్తన చేసుకునే విషయము ఉంది. బ్రాహ్మణుల జీవితములో మెజారిటీ విఘ్న రూపముగా అయ్యేది - సంస్కారము. అది తమ సంస్కారమైనా లేక ఇతరుల సంస్కారమైనా. జ్ఞానమైతే అందరిలోనూ ఉంది, శక్తులు కూడా అందరి వద్ద ఉన్నాయి, కానీ కారణమేమిటి? ఏ శక్తిని ఏ సమయములో కార్యములోకి తీసుకురావాల్సి ఉంటుందో, ఆ సమయములో అది ఇమర్జ్ అయ్యేదానికి బదులుగా కాస్త తర్వాత ఇమర్జ్ అవుతుంది. ఇలా అనకుండా అలా అని ఉంటే చాలా బాగుండేది, ఇది చేసే బదులు అది చేసుంటే చాలా బాగుండేది అని తర్వాత ఆలోచిస్తారు. కానీ గడిచిపోయే సమయమైతే అప్పటికి గడిచిపోతుంది కదా. అలాగే అందరూ తమలోని శక్తుల గురించి కూడా ఆలోచిస్తుంటారు - ఇది సహనశక్తి, ఇది నిర్ణయ శక్తి, ఇలా ఉపయోగించాలి అని ఆలోచిస్తారు, కానీ కొద్ది సమయంలో తేడా వచ్చేస్తుంది. ఇంకో విషయమేమిటి? సరే, ఒకసారికి ఆ శక్తి అవసరమైన సమయములో కార్యములోకి రాలేదు, ఇలా చెయ్యకుండా అలా చెయ్యాల్సింది కదా అని తర్వాత రియలైజ్ కూడా అయ్యారు, అది తర్వాత అర్థమైపోతుంది, కానీ ఆ పొరపాటును ఒకసారి అనుభవం చేసిన తర్వాత ఇక ముందు కోసం అనుభవీలుగా అయ్యి అది మళ్ళీ జరగకుండా దానిని మంచిగా రియలైజ్ అవ్వాలి. అప్పుడు ఉన్నతి జరగడానికి అవకాశముంటుంది. ఇది తప్పు, ఇది ఒప్పు అని ఆ సమయములో అర్థమవుతుంది, కానీ ఆదే పొరపాటు రెండోసారి జరగకూడదు, దాని కోసం మీకు మీరే మంచిగా రియలైజేషన్ చేసుకోవాలి, అందులో కూడా అంతగా పూర్తి శాతం పాస్ అవ్వరు. మాయ ఏమో చాలా తెలివైనది, అదే విషయం తీసుకోండి, మీలో సహనశక్తి తక్కువ ఉందనుకోండి, అప్పుడు మీకు ఆ సహనశక్తిని ఉపయోగించవలసిన విషయమే వస్తుంది, ఒకసారి మీరు రియలైజ్ అయ్యారనుకుందాము, కానీ మాయ ఏం చేస్తుందంటే రెండవసారి వచ్చేటప్పుడు కాస్త రూపాన్ని మార్చుకుని వస్తుంది. విషయము అదే ఉంటుంది కానీ రూపం మారుతుంది. ఈ రోజుల్లోని ప్రపంచములో వస్తువు పాతదే ఉంటుంది, కానీ దానిని ఎలా పాలిష్ చేస్తారంటే, అది కొత్తవాటి కంటే కూడా కొత్తదిగా కనిపిస్తుంది. అదే విధంగా మాయ కూడా ఎలా పాలిష్ చేసుకుని వస్తుందంటే, ఆ విషయం యొక్క రహస్యం అదే ఉంటుంది, ఉదాహరణకు మీలో ఈర్ష్య వచ్చిందనుకోండి, ఈర్ష్య కూడా రకరకాల రూపాలలో ఉంటుంది, ఒకే రూపములో ఉండదు. అక్కడ బీజము ఈర్ష్యదే ఉంటుంది కానీ వేరే రూపములో వస్తుంది, ఆ రూపములోనే రాదు. అప్పుడు చాలాసార్లు ఏమనుకుంటారంటే - ముందు వచ్చిన విషయం వేరేది కదా, ఇప్పుడు వచ్చినది వేరే విషయము కదా. కానీ బీజము అదే ఉంటుంది, కేవలం రూపము పరివర్తన అవుతుంది. దీని కోసం ఏ శక్తి అవసరము? పరిశీలించే శక్తి. దీనికి సంబంధించి బాప్‌దాదా ఇంతకుముందు కూడా చెప్పారు - రెండు విషయాలలో అటెన్షన్ పెట్టండి - ఒకటి సత్యమైన మనసు. సత్యత. లోపల ఉంచుకోకండి. లోపల ఉంచుకోవడం వల్ల గ్యాస్‌తో బెలూన్ నిండిపోతుంది, అప్పుడు చివరకు ఏమవుతుంది? పేలిపోతుంది కదా! కనుక సత్యమైన మనస్సు ఉండాలి. సరే, ఆత్మల ముందు కొంచెం సంకోచించవచ్చు, నన్ను ఏ దృష్టితో చూస్తారో తెలియదు అని కొంచెం సిగ్గుగా అనిపించవచ్చు. కానీ సత్యమైన మనసుతో, రియలైజేషన్‌తో బాప్‌దాదా ముందు పెట్టండి. ఈ పొరపాటు జరిగింది అని నేను బాప్‌దాదాకు చెప్పేసాను అని అనుకోవటం కాదు. అవును, నా వల్ల ఈ పొరపాటు జరిగింది అని ఏదో ఆజ్ఞాపించినట్లు చెప్పటం కాదు. రియలైజేషన్ శక్తితో, సత్యమైన మనసుతో, కేవలం బుద్ధితో కాదు, సత్యమైన మనసుతో ఒకవేళ బాప్‌దాదా ముందు రియలైజ్ అయినట్లయితే మనసు ఖాళీ అవుతుంది, చెత్త సమాప్తమవుతుంది. విషయాలు పెద్దవిగా ఏమీ ఉండవు, చిన్నవే ఉంటాయి, కానీ ఒకవేళ మీ మనసులో చిన్న-చిన్న విషయాలు కూడా పోగవుతూ ఉంటే వాటితో మనసు నిండిపోతుంది. ఖాళీగా అయితే ఉండదు కదా! మరి మనసులో ఖాళీ లేకపోతే మనోభిరాముడు ఎక్కడ కూర్చుంటారు! బాబా కూర్చోవటానికి స్థలమైతే ఉండాలి కదా! సత్యమైన మనసుపై సాహెబ్ రాజీ అవుతారు. నేను ఎవరినైనా, ఏ విధంగా ఉన్నా, బాబా, నేను మీ వాడిని. నంబరువారుగా ఉండవలసిందే అని బాప్దాదాకైతే తెలుసు, అందుకే బాప్‌దాదా మిమ్మల్ని ఆ దృష్టితో చూడరు, కానీ సత్యమైన మనస్సు ఉండాలి. రెండవ విషయము - సదా బుద్ధి లైన్ క్లియర్ (స్పష్టం)గా ఉండాలి. లైన్లో అంతరాయాలు ఉండకూడదు, కటాఫ్‌లు ఉండకూడదు. బాప్‌దాదా అవసరమైన సమయములో ఏదైతే అదనపు శక్తిని ఇవ్వాలనుకుంటారో, ఆశీర్వాదాలను ఇవ్వాలనుకుంటారో, అదనంగా సహాయం ఇవ్వాలనుకుంటారో, అవి ఒకవేళ అంతరాయాలు ఉన్నట్లయితే లభించజాలవు. లైన్ క్లియర్‌గా లేకపోతే, క్లీన్‌గా లేకపోతే, కటాఫ్‌లు ఉన్నట్లయితే, ఇక ఏ ప్రాప్తి అయితే లభించాలో, అది లభించదు. కొంతమంది ఏమంటారంటే, అలా అనకపోయినా సరే అనుకుంటారు - కొంతమంది ఆత్మలకు చాలా సహయోగము లభిస్తుంది, బ్రాహ్మణుల సహయోగము కూడా లభిస్తుంది, పెద్దలది కూడా లభిస్తుంది, బాప్‌దాదా నుండి కూడా లభిస్తుంది, కానీ మాకు తక్కువ లభిస్తుంది. ఇందుకు కారణం ఏమిటి? బాబా అయితే దాత, సాగరుడు. ఎవరెంత తీసుకోవాలనుకుంటే అంత. బాప్‌దాదా భండారీకి తాళమేమీ లేదు, కాపలాదారుడు లేడు. బాబా అని అనగానే అన్నీ హాజరైపోతాయి. బాబా అని అనండి మరియు తీసుకోండి. వారు దాత కదా. వారు దాత కూడా మరియు సాగరుడు కూడా. ఇక ఏం లోటు ఉంటుంది? ఈ రెండు విషయాలలోనే లోటు ఉంటుంది. ఒకటి సత్యమైన మనసు, స్వచ్ఛమైన మనసు, తెలివిని చూపించకండి. చాలా తెలివి చూపిస్తారు. రకరకాల తెలివిని చూపిస్తారు. కనుక స్వచ్ఛమైన మనసు, సత్యమైన మనసు. ఇంకొకటి బుద్ధి లైన్‌ను సదా చెక్ చేసుకోండి, అది క్లియర్‌గా, క్లీన్‌గా ఉందా? ఈ నాటి సైన్స్ సాధనాలలో కూడా చూస్తుంటారు కదా, కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా అది క్లియర్‌గా ఉండనివ్వదు. కనుక దీనిని తప్పకుండా చెయ్యండి.
ఇంకొక విశేషమైన విషయము - ఇది సీజన్‌లోని చివరి టర్న్ కదా, అందుకే చెప్తున్నాము. ఇది కేవలం డబల్ విదేశీయుల కోసమే కాదు, అందరి కోసము. చివరి టర్న్‌లో మీరు ఎదురుగా కూర్చున్నారు కనుక మీకే చెప్పాల్సి ఉంటుంది. బాప్‌దాదా చూసారు, సంస్కారమనండి లేక నేచర్ అనండి, నేచర్ అయితే ఎవరిది వారికే ఉంటుంది, కానీ సర్వులకు స్నేహీలుగా, అన్ని విషయాలలో మరియు సంబంధాలలో సఫలురుగా, మనసులో విజయులుగా మరియు వాణిలో మధురత ఎప్పుడు రాగలదంటే ఈజీ నేచర్ (సరళ స్వభావము) ఉన్నప్పుడు. నిర్లక్ష్యముతో కూడుకున్న నేచర్ ఉండకూడదు. నిర్లక్ష్యము అనేది వేరే విషయము. ఈజీ నేచర్ అంటే ఎటువంటి సమయము, ఎటువంటి వ్యక్తి, ఎటువంటి పరిస్థితి అన్నదానిని పరిశీలిస్తూ స్వయాన్ని ఈజీ (సరళం) చేసుకోవాలి. ఈజీ అనగా కలుపుగోలుతనము. టైట్ నేచర్ (బిగుసుకుపోయి ఉండే నేచర్), ఉండకూడదు, టూ మచ్ అఫీషియల్‌గా ఉండకూడదు. అఫిషియల్‌గా ఉండటం మంచిదే కానీ టూ మచ్ అఫీషియల్‌గా ఉండకూడదు. సమయాన్ని బట్టి ఉండాలి, సమయము కానీ సమయములో ఒకవేళ ఎవరైనా అఫిషియల్‌గా ఉన్నట్లయితే, అది వారి గుణములా లేక విశేషతలా అనిపించదు. చిన్నవారైనా, పెద్దవారైనా సరే, మిమ్మల్ని మీరు మలుచుకోగలగాలి, కలుపుగోలుగా ఉండగలగాలి. పెద్దవారితో పెద్దరికంతో నడవగలగాలి, చిన్నవారితో చిన్నవారిగా నడవగలగాలి. సహచరులతో సహచరులుగా అయ్యి నడవగలగాలి, పెద్దవారితో గౌరవముగా నడవగలగాలి. సులభంగా మలచుకోగలగాలి, శరీరాన్ని కూడా ఈజీగా ఉంచుకుంటే, దానిని ఎక్కడ కావాలంటే అక్కడ మలచగలరు, ఒకవేళ శరీరం టైట్‌గా (బిగుసుకుని) ఉంటే ఎలా అంటే అలా మలచలేరు. నిర్లక్ష్యముగా ఉండకూడదు, ఈజీగా ఉండాలి, ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా మరియు నిర్లక్ష్యముగా అయిపోవటము కాదు. బాప్‌దాదా ఈజీగా అవ్వండి అని చెప్పారు కదా, అందుకే ఈజీగా అయిపోయాము, అని ఇలా నిర్లక్ష్యము చెయ్యకూడదు. ఈజీ నేచర్ అనగా ఎటువంటి సమయమో, దానికి తగినట్టు తమ స్వరూపాన్ని తయారుచేసుకోగలగటము.
అచ్ఛా - డబల్ విదేశీయులకు మంచి అవకాశము లభించింది. చూడండి, మధుబన్ వారికి కూడా ఈ సీజన్లో ఛాన్స్ లభించలేదు కానీ విదేశీయులకు మాత్రం రెండు టర్న్‌లు లభించాయి. గారాల పిల్లలు కదా! బాప్‌దాదాకు కూడా డబల్ విదేశీయులు ప్రియంగా అనిపిస్తారు ఎందుకంటే ధైర్యమును ఉంచి చక్కగా ముందుకు వెళ్తున్నారు. ధైర్యమును మంచిగా పెడ్తారు. ధైర్యము కలిగిన వారే కదా! కన్ఫ్యూజ్ అయ్యేవారు కాదు కదా! కన్ఫ్యూజ్ అవుతారా? చిన్న చిన్న విషయాలకు కన్ఫ్యూజ్ అవుతారా? అవ్వము అని చెప్పడం లేదే? మొదట్లో చాలా కన్ఫ్యూజ్ అవ్వడాన్ని బాప్‌దాదా చూసారు, ఇప్పుడు తేడా వచ్చింది. ధైర్యము మంచిగా ఉంచుతున్నారు. ధైర్యము కారణంగా బాబా సహాయము కూడా ఉంది. తేడా వచ్చింది కదా? ముందుకన్నా తేడా ఉంది కదా! ఇప్పుడు కథలు తక్కువ అయ్యాయి. ఎక్కువగా చెప్పకండి. విషయం తప్పకుండా చెప్పండి, మనసులో పెట్టుకోకండి కానీ క్లుప్తంగా చెప్పండి. ఎక్కువ విస్తారము వద్దు, 10 మాటలతో స్పష్టం చేసే విషయాన్ని 2-3 మాటలతో చెప్పండి ఎందుకంటే వృద్ధి చెందవలసిందే కదా. ఇప్పుడు కూడా చూడండి, వృద్ధి చెందారు కదా! డబల్ విదేశీయుల సంఖ్య పెరిగింది కదా! ఇంకా కూడా వృద్ధి చెందవలసిందే. మరి వృద్ధి అవుతున్నప్పుడు షార్ట్ చెయ్యవలసిందే. చాలావరకు స్వచ్ఛమైన మనసుతో ఉంటారు, తక్కువ దాచుకుంటారు. ఎవరిలో అయితే స్వభావ-సంస్కారము, మాట, మనసా సంకల్పములో కొద్దిగా కూడా పాత చెత్త ఉండదో వారిని బాప్‌దాదా స్వచ్ఛమైన మనసు కలిగిన వారు అంటారు. భారతవాసులు కావచ్చు, డబల్ విదేశీయులు కావచ్చు, ఎవరైనా సరే, వచ్చి, కలిసి లైన్‌గా ఓ.కే, ఓ.కే అని చెప్పాలి... ఆ రోజు వస్తుందా? సెకండ్-సెకండ్ దృష్టి తీసుకోవాలి అని ఎలా అయితే మీరు అప్లికేషన్ పెట్టారు కదా, ఈరోజు బాప్‌దాదా మీ కోరికను తీరుస్తారు, కానీ, దాదీల ఎదుట కావచ్చు, బాప్‌దాదా ఎదుట కావచ్చు అందరూ లైన్‌గా వచ్చి మనస్ఫూర్తిగా ఓ.కే, ఓ.కే అని చెప్పే రోజును తీసుకురండి. ఇది వీలవుతుందా? కుమారులు, వీలవుతుందా? (పూర్తి సభను అడిగారు) అయితే ఈ శుభవార్త చాలా మంచిది. అది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు అన్న ప్రశ్న వస్తుంది. చెప్పండి, పెద్ద అన్నయ్యలు ఎవరైతే ఉన్నారో, వారు ఆ డేట్ ఎప్పుడో చెప్పండి. (ఇప్పుడు).
బాప్‌దాదా సమయము ఇస్తారు. ఇప్పుడే చెప్పండి అంటే, ఈ విషయము నాలో ఇంకా ఉంది కదా, ఇది తీసేసి వస్తాను అని అంటారు. కానీ మరుసటి సీజన్లో ఇటువంటి లైన్‌ను తీసుకురండి. 6 నెలలు ఉన్నాయి, 8 నెలలు అవుతాయి. ఇది సమ్మతమేనా? మనసుతో ఓ.కే. అంతేకానీ ఊరికే ఓ.కే, ఓ.కే అనడం కాదు... కుమారులలో ఎవరైతే తయారుగా ఉన్నారో వారు చేతులెత్తండి. సగం మంది తయారుగా ఉన్నారు, సగంమంది తయారుగా లేరు. ఎవరైతే చేతులు ఎత్తలేదో వారికి ఎంత సమయం కావాలి? పూర్తి సంవత్సరం కావాలా? ఒక సంవత్సరంలో తయారైపోతారా? ఒక సంవత్సరంలో తయారవుతాము అనేవారు చేతులెత్తండి. అచ్ఛా, ఒక నెల కావాలా? ఎవరైతే చేయి ఎత్తలేదో, వారికి ఎంత సమయం కావాలో చిట్టీలో వ్రాసి ఇవ్వండి. మంచిది. అచ్ఛా, సోదరీలు ఎవరైతే తయారుగా ఉన్నారో వారు చేతులెత్తండి. ఇప్పుడే తయారుగా ఉన్నాము అనేవారు చేతులెత్తండి. (బాప్‌దాదా సర్టిఫికేట్ ఇస్తేనే) బాప్‌దాదా అయితే మాలను వేస్తారు. మాలను వేసుకోవాలి కదా? ఫారెన్ వారు పాస్ విత్ ఆనర్ అయితే మాలలోకైతే వస్తారు కదా. అప్పుడు మాల త్వరగా తయారవుతుంది. పక్కా కదా! కచ్చాగా అవ్వకండి. మంచిది. ఎవరైతే ధైర్యమును ఉంచుతారో వారికి ఎక్స్ట్రా సహాయం తప్పకుండా లభిస్తుంది. చూడండి, ఎవరినైతే మీరు దాదీలు అంటున్నారో, వారు దాదీలుగా ఎలా అయ్యారు? ధైర్యమును ఉంచారు మరియు స్వయముతో ప్రతిజ్ఞ చేసారు – మేము చేయవలసిందే, అవ్వవలసిందే. అలా వారు ఈరోజు దాదీల లిస్టులో ఉన్నారు. మరి డబల్ విదేశీయులను 108 మాలలో ముందుంచుతాము, తయారైపోండి. విజయ మాలలోకి వచ్చే పూసలకు వేడుక చేస్తాము. ఎవరైనా రావచ్చు, కేవలం ముందు కూర్చున్న వారే కాదు, ఎవరైనా రావచ్చు. బాప్‌దాదా సెరిమనీ (వేడుక) చేస్తారు, విజయి రత్నము. ముందున్న వారందరూ రావాలి. రావాలి కదా! ఎందుకు రాము అని చెప్పండి. మేము రాకపోతే ఇంకెవరు వస్తారు! నషా పెట్టుకుంటే, నిశ్చయము ఉంటే అది ఏమంత పెద్ద విషయము కాదు. బాబాకైతే అయిపోయారు, ఇప్పుడు తిరిగి వెళ్ళేది లేదు. ఒకవేళ తిరిగి వెళితే ఆ ప్రపంచంలో ఉండలేరు, ఈ ప్రపంచంలో ఉండలేరు. అందుకే తిరిగి వెళ్ళేదే లేదు. ముందుకే వెళ్ళాలి. ప్రపంచమే బాబా అయినప్పుడు, ఇంకేమి మిగిలి ఉంది! బాప్‌దాదాకు డబల్ విదేశీయులపై చాలా-చాలా శ్రేష్ఠ ఆశలు ఉన్నాయి – డబల్ విదేశీయులలో ఎటువంటి రత్నము వెలువడాలంటే వారు లాస్ట్ సో ఫాస్ట్ లిస్టులోకి రావాలి, ఫాస్ట్ సో ఫస్ట్. భారత దేశం వారు కూడా వస్తారు కానీ ఈరోజు డబల్ విదేశీయులు ఎదురుగా ఉన్నారు కావున వారికి చెప్తున్నాము. లాస్ట్ సో ఫాస్ట్ మరియు ఫస్ట్ వస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. అలా జరగవలసిందే. కేవలం ఎవరు ముందుకు వెళ్తారు అన్నది ప్రత్యక్షం కావాలి. అలా జరగవలసిందే. సెంటర్ నివాసులు ఏమని భావిస్తున్నారు? ఫస్ట్ వస్తారా? చాలా మంచిది. ధైర్యము కలిగిన వారు తప్పకుండా విజయులుగా అవ్వవలసిందే అని బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. అవుతారా లేదా అన్న మాటే లేదు. అవ్వవలసిందే. మరి స్వయంపై ఇటువంటి ఆశ ఉన్నదా?
అందరికంటే ఎక్కువ దూరదేశం నుండి ఎవరు వచ్చారు? ఎక్కువ దూరదేశి బాప్దాదానా లేక మీరా? మేము బహు దూరం నుండి వచ్చాము అని మీరెంత చెప్పినాగానీ, బాప్‌దాదా దూరంకన్నా ఎక్కువ కాదు. సంతుష్టంగా ఉన్నారా? డబల్ విదేశీయులు సంతుష్టంగా ఉన్నారా? స్పెషల్ లభించింది, సంతోషంగా ఉన్నారా? ఇది జరిగింది, ఇది జరగలేదు అని ఇక అనరు కదా. అచ్ఛా.
భారతవాసులు, ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో వారు చేతులెత్తండి. మధుబన్ వారు చేతులెత్తండి. మధుబన్ వారైతే తెలివైనవారు.
టోలీ లభించలేదు అని మధుబన్ వారు చేసిన ఫిర్యాదు ఉండిపోయింది. ఈ సీజన్‌కి బాప్‌దాదా ద్వారా దిల్ఖుష్ మిఠాయిని తినండి అని బాప్‌దాదా చెప్తున్నారు. మధుబన్ వారు, శాంతివన్ వారు, జ్ఞాన సరోవర్ వారు, హాస్పిటల్ వారు, వీరి ప్లాన్ బాప్‌దాదా వద్ద ఉంది, ఫిర్యాదు ఉండదు. మధుబన్ వారినైతే సంతోషపరచాలి కదా, లేకపోతే మీరెలా వస్తారు. వీరి భాగము ముందుగా ఉంటుంది, నలువైపుల ఎంతో శ్రమ చేస్తారు, మరి శ్రమకు ప్రత్యక్ష ఫలం లభించాలి కదా. కేవలం సమయమే కాదు, బాప్‌దాదా అయితే ముందుగా మధుబన్ నివాసులనే గుర్తు చేసుకుంటారు.
అందరికన్నా క్రొత్త దేశం నుండి ఎవరు వచ్చారు, ఏ దేశం ఇక్కడకు మొదటి సారి వచ్చింది? (కెరేబియన్ తరఫు నుండి – కువైట్, కురుసవ్, ఈజిప్ట్) అభినందనలు. పరివారంలో క్రొత్త పిల్లలు పుడితే అభినందనలు తెలుపుతారు. మీ పరివారంలో కూడా యాడ్ అయ్యారు. సంతోషంగా ఉంది కదా!
అచ్ఛా, ఎదురుగా సెంటర్లలో ఉండేవారు కూర్చుని ఉన్నారు. చేతులెత్తండి. సెంటర్లో ఉండేవారైతే పక్కాగా ఉన్నారు కదా, ఈ స్టాంప్ అయితే వేసేసుకున్నారు కదా! ఆల్మైటీ గవర్నమెంట్ ద్వారా ‘‘సదా పక్కా’’ అన్న స్టాంప్‌ను వేయించుకున్నారా? స్టాంప్ గట్టిగా పడిందా లేక తేలికగా పడిందా? తొలగిపోయేలా ఉందా? ఇలా అయితే లేదు కదా? ఎవరైతే సెంటర్లో ఉండేవారు ఉన్నారో, వారు, మేము అంతిమము వరకు బాప్‌దాదాతో కలిసి ఉంటాము, కలిసి వెళ్తాము అని భావిస్తున్నారా? ఇప్పుడు కలిసి ఉన్నారు, తర్వాత కలిసి వెళ్తారు. ఇలా అనుకుంటే చేతులెత్తండి, టి.విలో చూపించండి. మీ ఫోటోను బాప్‌దాదా వతనంలో అలంకరించి పెట్టుకుంటారు. చాలా మంచిది. ఇన్ అడ్వాన్స్ అంతిమము వరకు అభినందనలు. మంచిది కదా! తోటివారు ఒక్కరైనా అలజడిలోకి వస్తే మంచిగా అనిపించదు కదా! కనుక అందరమూ కలిసి వెళ్తాము. ముందు వెనుక కాదు, కలిసి వెళ్తాము. ఇప్పుడు కూడా సేవలో కలిసి ఉంటాము మరియు ఇంటికి కూడా కలిసి వెళ్తాము, ఆ తర్వాత బ్రహ్మా బాబాతో కలిసి రాజ్యంలోకి వస్తారు. పక్కా కదా? ఏమవుతారు? కృష్ణుడి సఖిగా(స్నేహితురాలిగా) అవుతారా? (సోదరిగా అవుతాము) మంచిది కదా! (బాబా పర్సనల్‌గా ఎదురుగా కూర్చున్నవారిని అడుగుతున్నారు) ఒకవేళ ఇక్కడ కలిసి ఉంటే అక్కడ కూడా కలిసి ఉంటారు, బాబా మాట ఇస్తున్నారు. ఒకవేళ ఇక్కడ ఉంటే అక్కడ గ్యారంటీగా ఉంటారు. వీరంతా కలిసి-కలిసి ఉంటారా లేక దూర-దూరంగా ఉంటారా? అప్పుడప్పుడూ కలవడానికి వస్తారా! శ్రీకృష్ణుడితో కలిసి చదవడము, కలిసి రాస్ చేయడము, కలిసి తిరగడము... పాండవులు కూడా రాస్ చేస్తారా లేక కేవలం సోదరీలే రాస్ చేస్తారా? ఇద్దరికీ ఛాన్స్ ఉంది, ఎవరు కావాలంటే వారు చేయవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇంకా సీట్ ఫిక్స్ అవ్వలేదు. కేవలం రెండు సీట్లు ఫిక్స్ అయ్యాయి, 3-4 నుండి ఖాళీగా ఉన్నాయి. అనౌన్స్ అవ్వలేదు. నంబర్ తీసుకోవచ్చు. అచ్ఛా, కుమారులు భట్టీని బాగా చేసుకున్నారా? టీచర్ ఎవరు?
(విదేశీ యూథ్ రిట్రీట్ జ్ఞాన సరోవర్‌లో జరిగింది) మంచిగా జరిగిందా? అచ్ఛా, అందరినీ చూసి అందరికన్నా ఎక్కువ సంతోషం ఎవరికి కలుగుతుంది? బాప్దాదాకైతే కలుగుతుంది, తర్వాత ఎవరికి? నాకు అని ప్రతి ఒక్కరూ అంటారు. చాలా మంచిది. దాదీలకు చాలా సంతోషంగా ఉంది. అలసిపోయేలా చేయడం లేదు కదా? ఎక్కువ సంతోషం దాదీలకు ఉంటుందా లేక మీకు ఉంటుందా? (ఇద్దరికీ ఉంటుంది) అచ్ఛా, ఇప్పుడు డబల్ విదేశీయులను పర్సనల్‌గా కలిసాము కదా. చిట్‌చాట్ కూడా చేసాము. దూరంగా ఉన్నా కూడా సమీపంగా ఉన్నారు.
టీచర్లు చాలామంది ఉన్నారు, బాగుంది, డబల్ పాత్రను చేస్తున్నారు. డబల్ పాత్ర చేసేవారికి డబల్ సహాయం లభిస్తుంది. ధైర్యము బాగుంది. అచ్ఛా.
అందరికీ డ్రిల్ గుర్తుందా లేక మర్చిపోయారా? ఇప్పుడిప్పుడే అందరూ ఈ డ్రిల్ చెయ్యండి, అంతా చుట్టి రండి. అచ్ఛా!
నలువైపులా ఉన్న సర్వ శ్రేష్ఠ ఆత్మలకు, నలువైపుల నుండి ప్రియస్మృతులను, సమాచారాన్ని పంపించినవారికి, చాలా మంచిగా భిన్న-భిన్న సంబంధాలతో స్నేహ పత్రాలను మరియు తమ స్థితిగతులను వ్రాసారు, ఉల్లాసముతో సేవా సమాచారాన్ని వ్రాసారు, ప్లాన్లు చాలా మంచి-మంచివి వ్రాసారు, అవన్నీ బాప్‌దాదాకు లభించాయి. ప్రేమతో, శ్రమ తీసుకుని వ్రాసారు. ఎవరెవరైతే వ్రాసారో, వారు ప్రతి ఒక్కరు తమ-తమ పేరు సహితంగా బాప్‌దాదా యొక్క, మనోభిరాముని యొక్క మనస్ఫూర్వకమైన ప్రియస్మృతులను స్వీకరించండి. పిల్లలకు బాబాపై ప్రేమ ఉంది మరియు దానికంటే పదమాల రెట్ల ప్రేమ బాబాకు పిల్లలపై ఉంది మరియు అది సదా అమరంగా ఉంటుంది. స్నేహీ పిల్లలు, వారు బాబా నుండి వేరు కాలేరు, అలాగే బాబా పిల్లల నుండి వేరు కాలేరు. కలిసి ఉన్నాము, కలిసి ఉంటాము.
సదా స్వయాన్ని బాబా సమానంగా తయారుచేసుకునే నలువైపులా ఉన్న పిల్లలకు, సదా బాబా నయనాలకు, మనసుకు, మస్తకానికి సమీపంగా ఉండేవారికి, సదా ఒక్క బాబా అనే ప్రపంచములో ఉండేవారికి, సదా ప్రతి అడుగులో బాప్‌దాదాను ఫాలో చేసేవారికి, సదా విజయులుగా ఉండేవారము, విజయులుగా ఉన్నాము మరియు విజయులుగా ఉంటాము అనే నిశ్చయము మరియు నషాలో ఉండేవారికి, ఇటువంటి అతి శ్రేష్ఠమైన సికీలధే, ప్రియాతి ప్రియమైన పిల్లలందరికీ బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
(దాదీజీ మరియు దాదీ జానకిజీ బాప్‌దాదాను ఆలింగనం చేసుకుంటున్నారు)
అందరూ సంతోషిస్తున్నారు కదా లేక మేము కూడా దాదీలుగా ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారా? అందరి ప్రేమ చాలా బాగుంది, ఇదే ఆశీర్వాదాలను ఇస్తుంది. ప్రేమ ఉంది కనుకనే అందరికీ సంతోషం కలుగుతుంది. ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండండి, మూడ్ ఆఫ్ అవ్వకండి. సదా ఏకరసంగా, సంతోషకర ముఖంతో ఉండండి. ఎవరు మిమ్మల్ని చూసినా వారికి ఆత్మిక సంతోషం అనుభూతి కావాలి. ఇది సేవా సాధనము. ముఖముపై ఆత్మిక సంతోషం ఉండాలి, సాధారణ సంతోషం కాదు, ఆత్మిక సంతోషము. ముఖము మారకూడదు. ఏకరస స్థితి వలె ఏకరస ముఖము ఉండాలి. వీలవుతుందా? ఏకరస మూడ్ ఉండాలి. వీలవుతుందా లేక అలా అవ్వవలసిందేనా? ఇప్పుడు అలా జరుగుతుంది కదా? ఎప్పుడైనా ఎవరైనా అకస్మాత్తుగా మీ ఫోటో తీస్తే మరో విధంగా మీ ఫోటో రాకూడదు, ఆత్మిక చిరునవ్వుతో ఉన్న ఫోటోయే రావాలి. పని చేస్తున్నా, సేవా టెన్షన్ ఉన్నాగానీ ముఖముపై చిరునవ్వు ఉండాలి. అప్పుడు మీరు ఎక్కువ శ్రమ కూడా చేయనవసరం లేదు. ఒక గంట మాట్లాడితే జరిగే పని మీ ఆత్మిక చిరునవ్వుతో ఒక్క సెకండులో జరిగిపోతుంది ఎందుకంటే ప్రత్యక్షముకు తన ప్రమాణాన్ని ఇవ్వవలసిన అవసరం లేదు. ఎవరు కలిసినా, ఎలాంటివారు కలిసినా, నిందించేవారు కలిసినా, అవమానించేవారు కలిసినా, గౌరవించనివారు కలిసినా, పేరు-ప్రతిష్ఠలు ఇవ్వనివారు కలిసినాగానీ మీ ముఖము ఏకరసంగా ఉండాలి, ఆత్మిక చిరునవ్వు. కుమారులు, వీలవుతుందా? పాండవులు, వీలవుతుందా? అనవసరమైన శ్రమ నుండి రక్షింపబడతారు. ఆత్మిక చిరునవ్వే నవ్వడము. ఏమి జరిగినా కానీ, నేను నా చిరునవ్వును విడిచిపెట్టకూడదు. వీలవుతుందా? ఆలోచిస్తున్నారా? (చేసి చూపిస్తాము) చాలా మంచిది, అభినందనలు. ఎవరైతే ముందు కూర్చున్నారో వారైతే చేయవలసిందే. మంచిది కదా – స్వయం సంతోషం, ఇతరులు కూడా సంతోషం – ఇంకేమి కావాలి! బాప్‌దాదా అయితే సంతోషంగా ఉండనే ఉన్నారు, దాదీలు కూడా సంతోషంగా ఉన్నారు.
(బాబా, మీరు ఇలాగే కలుస్తూ ఉండాలి) కలవకపోతే సంతోషం మాయమవుతుంది. మీరు సదా నవ్వుతూ ఉండాలి, బాబా కలుస్తూ ఉంటారు. చాలా మంచిది.