"ప్రతి గంట మనసుతో 5 స్వరూపాల వ్యాయామము చేసి దానిని శక్తిశాలిగా చేసుకోండి, బాబాయే మీ ప్రపంచమైనప్పుడు సంస్కారాలు కూడా బాబావలె చేసుకోండి"
ఓం శాంతి 02.02.20 “దినచర్య” మధువనం
ప్రాణేశ్వర అవ్యక్త బాప్‌దాదా యొక్క అతి ప్రియమైన, సదా ఒక్క తండ్రిని తమ ప్రపంచంగా చేసుకునేవారు, మనసును ఆత్మిక ఎక్సర్సైజ్లో బిజీ పెట్టుకుని సర్వశక్తులతో సంపన్నంగా అయ్యేటటువంటి నిమిత్త టీచర్ అక్కయ్యలకు మరియు తీవ్ర పురుషార్ధీలందరికీ, బాబా యొక్క కంటి రత్నాలకు, బ్రాహ్మణ కులభూషణ సోదరసోదరీలకు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతులు స్వీకరించండి.
తర్వాత సమాచారమేమనగా మీరందరూ అవ్యక్త మాసంలో చాలా మంచి తపస్య చేసారు, అన్ని వైపుల నుండి సమాచారాలు వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మంచి రేస్ చేసారు, చాలా స్థానాలలో 108 గంటల అఖండ భట్టీలు కూడా నడిచాయి. అందరూ చాలా సుందరమైన అనుభవాలు చేసారు. ఇప్పుడు బాప్‌దాదా పిల్లలైన మనకు విశేషమైన సూచననిస్తున్నారు, పిల్లలూ, సమయానుసారంగా పరిస్థితులు తమ భయంకర రూపం తీసుకుంటూ ఉంటాయి, అనేక పాత లెక్కాచారాలు పేపర్‌గా అయ్యి ఎదురుగా వస్తాయి. పిల్లలైన మీరు స్వయాన్ని ఎంత శక్తిశాలీగా చేసుకోవాలంటే, ఏ రకమైన పేపర్‌నైనా దాటివేసి ముందుకెళ్తూ ఉండండి. దీనికోసం బాబా అంటున్నారు పిల్లలూ, తమ 5 స్వరూపాల ఆత్మిక ఎక్సర్సైజ్ రోజంతటిలో పదే పదే చేస్తూ ఉన్నట్లయితే శక్తి సంపన్నంగా అయిపోతారు. చెప్పండి! మీరందరూ రోజూ ఈ అభ్యాసం చేస్తున్నారు కదా! మన తపస్య సదా కోసం ఉంది కాని కేవలం అవ్యక్త మాసం కోసం మాత్రమే కాదు. మరి రండి, మనమందరం అనంతమైన సేవలతో పాటు స్వయాన్ని శక్తిశాలీగా తయారుచేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ ఈ ఆత్మిక డ్రిల్ యొక్క అభ్యాసం ద్వారా నిరంతర తపస్వీలుగా అవుదాము.
ఇప్పుడు శివజయంతి యొక్క పావన పర్వం సమీపంగా వస్తుంది. సోదరసోదరీలందరూ చాలా ఉల్లాస ఉత్సాహాలతో ఈ స్మృతి చిహ్న పండుగను జరుపుకుంటున్నారు, సేవలు చాలా ఆర్భాటంగా చేస్తున్నారు. ఈ 84వ త్రిమూర్తి శివజయంతి యొక్క స్మృతి చిహ్నం యొక్క రోజును అందరూ ఎలా జరుపుకోవాలంటే, ప్రతి ఒక్కరి మనసులో శివబాబా యొక్క అవతరణ యొక్క జెండా ఎగరవేయబడాలి మరియు వీరే, వీరే... యొక్క నినాదం మ్రోగాలి. మొదట ప్రత్యక్షత జరగాలి, తర్వాత పరివర్తన జరుగుతుంది.
మరి స్వస్థితి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ధ్యానంలో ఉంచుకుంటూ విశేషంగా ఈసారి శక్తిశాలి మనసా యొక్క సూక్ష్మ వృత్తుల ద్వారా ఆత్మలను ఆహ్వానించాలి, విశేషంగా అంతర్ముఖిగా అయ్యి ఏకాగ్రతా అభ్యాసం ద్వారా మనసా సేవ చేయాలి. స్వపరివర్తన కోసం ఏదో ఒక దృఢసంకల్పం కూడా ప్రతిజ్ఞ రూపంలో తప్పకుండా చేయాలి. శివజయంతి కోసం విశేష బులెటిన్ ఈమెయిల్ ద్వారా మధుబన్ నుండి మీ దగ్గరకు పంపించడం జరిగింది.
ఇప్పుడైతే ప్రియమైన బాప్‌దాదా యొక్క ఈ టర్న్ విశేషంగా ఢిల్లీ ఆగ్రా జోన్ వారిది, సుమారుగా 19వేల సోదరసోదరీలు చాలా ఉల్లాస ఉత్సాహాలతో బాబా ఇంటికి చేరుకున్నారు. డబల్ విదేశీయులు కూడా ప్రతి టర్న్‌లో ఉంటారు. అందరూ మధుబన్ యొక్క శక్తిశాలి వాతావరణంతో పాటు అనుభవీ సోదరసోదరీల క్లాసులతో కూడా విశేషంగా నిండుగా అయ్యి వెళ్తున్నారు. బాప్‌దాదా కూడా తమ అవ్యక్త మహావాక్యాల ద్వారా అందరికీ చాలా సుందరమైన అలంకరణ చేస్తున్నారు. మంచిది - అందరికీ చాలా చాలా స్మృతులు... ఓం శాంతి.
02.02.20 ఓం శాంతి అవ్యక్త మహావక్యాలు - వీడియో 30-11-10 మధువనం
ప్రతి గంట మనసుతో 5 స్వరూపాల వ్యాయామము చేసి దానిని శక్తిశాలిగా చేసుకోండి, బాబాయే మీ ప్రపంచమైనప్పుడు సంస్కారాలు కూడా బాబావలె చేసుకోండి
ఈరోజు బాప్‌దాదా పిల్లలందరినీ ఒకే దేశస్థులుగా, ఒరిజినల్ దేశము ఏదైతే ఉందో, ఆ ఒక్క దేశము ఎంత ప్రియమైనదో మీ అందరికీ తెలుసు కదా! బాప్‌దాదా కూడా ఆ దేశం నుండే ఇక్కడకు పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు. పిల్లలకు తండ్రిని కలుసుకున్నామన్న సంతోషము, అలాగే బాబాకు కూడా పిల్లలను కలుసుకున్నానన్న సంతోషము ఉంది. ఈరోజు బాప్‌దాదా పిల్లలందరి స్వరూపాలను, విశేషంగా 5 స్వరూపాలను చూస్తున్నారు. అందుకే పంచముఖి బ్రహ్మా యొక్క గాయనము కూడా ఉంది. మరి మీ 5 రూపాలు మీకు తెలుసు కదా! మొదటిది, మీ జ్యోతిర్బిందువు స్వరూపము. ఆ రూపము మీ ఎదుటకు వచ్చేసిందా! మెరుస్తూ ఉన్నటువంటి ఎంతటి ప్రియమైన రూపమది. రెండవది, దేవత రూపము, ఆ రూపము కూడా ఎంత ప్రియమైనది మరియు అతీతమైనది. మూడవ రూపము, మధ్యమములో పూజ్యనీయ రూపము. నాల్గవది, బ్రాహ్మణ రూప సంగమవాసి, అది కూడా ఎంత గొప్పది. ఐదవది, ఫరిశ్తా రూపము. ఈ 5 రూపాలు ఎంత ప్రియమైనవి. బాప్‌దాదా ఈరోజు మనసు యొక్క వ్యాయామాన్ని నేర్పిస్తారు ఎందుకంటే మనసు అప్పుడప్పుడు పిల్లలను తన వైపుకు తీసుకువెళ్తుంది. కావున ఈరోజు బాప్‌దాదా మనసును ఏకరసంగా చేసుకునేందుకు ఎక్సర్‌సైజును నేర్పిస్తున్నారు. రోజంతటిలో ఈ 5 రూపాల వ్యాయామాన్ని చేయండి మరియు అనుభవం చేయండి. ఏ రూపాన్ని తలుచుకుంటారో ఆ రూపమును మనసులో అనుభవం చేసుకోండి. జ్యోతిర్బిందువు అనగానే మెరుస్తూ ఉన్న ఆ రూపము మీ ఎదుటకు వచ్చింది కదా, అలాగే 5 రూపాలను ఎదుటకు తీసుకురండి మరియు వాటిని అనుభవం చేయండి. ప్రతి గంటలో 5 సెకండ్లు ఈ డ్రిల్‌ను చేయండి. ఒకవేళ సెకండ్ కాకపోతే 5 నిమిషాలు చేయండి. ప్రతి రూపాన్ని మీ ఎదుటకు తీసుకురండి, అనుభవం చేయండి. మనసును ఈ ఆత్మిక వ్యాయామంలో బిజీ చేసినట్లయితే మనసు వ్యాయామంతో చక్కగా ఉంటుంది. ఎలా అయితే శారీరిక వ్యాయామాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయో అలాగే ఈ వ్యాయామము మనసును శక్తిశాలిగా ఉంచుతుంది. ఒక్క సెకండ్ కోసమైనా మనసులో ఆ రూపాన్ని తీసుకురండి. ఇది సహజమే కదా లేక కష్టమా? కష్టమనిపించదు ఎందుకంటే ఈ వ్యాయామాన్ని మీరు అనేకసార్లు చేసి ఉన్నారు. ప్రతి కల్పము చేసారు. మీ స్వరూపమునే మీ ఎదుటకు తీసుకురావడము కష్టంగా అనిపించదు. ఒక్కొక్క రూపము ఎదుటకు వస్తూ ఉంటే దాని విశేషత కూడా అనుభవం అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి పిల్లలు ఏమంటారంటే, మేము ఈ రూపాలనే అనుభవం చేసుకోవాలని అనుకుంటాము కానీ మనసు మరో వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది అని. ఎంత సమయము మనసును ఎక్కడ ఉంచాలనుకుంటారో అంత సమయము మనసు అలా ఉండటానికి బదులుగా వ్యర్థము, అయథార్థ సంకల్పాలు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనసులో నిర్లక్ష్యపు సంకల్పాలు కూడా వస్తూ ఉంటాయి. కావున బాప్‌దాదా ప్రతి గంట 5 సెకండ్లు లేక 5 నిమిషాలు ఈ వ్యాయామముతో అనుభవం చేయించాలనుకుంటున్నారు. 5 నిమిషాలు మనసును ఈ వైపుకు నడిపించండి. నడవడం మంచిదే కదా! తర్వాత మీ పనిలో మునిగిపోండి ఎందుకంటే పనులైతే చేయాలి కదా! కార్యములు చేయకుండా ఉండటమైతే వీలు కాదు. యజ్ఞ సేవ, విశ్వ సేవ అయితే అందరూ చేస్తూనే ఉన్నారు, చేయాల్సిందే. ఈ 5 నిమిషాల డ్రిల్ చేసిన తర్వాత మీరు మీ కార్యంలో మునిగిపోండి. 5 సెకండ్లు లేక 5 నిమిషాలు కూడా సమయము లభించని వారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ అలాంటివారు ఉన్నట్లయితే చేతులెత్తండి. ఎవ్వరూ లేరు. ఎవరైనా ఉన్నారా? అందరూ సమయాన్ని తీయగలరు. కావున పదే పదే ఈ వ్యాయామాన్ని చేయండి అప్పుడు కార్యం చేస్తూ కూడా ఇదే నషాలో ఉండగలరు. ఎందుకంటే బాబా మహామంత్రము - మన్మనాభవ. మనసు యొక్క అనుభవంతో మాయాజీతులుగా అవ్వడానికి మనసు యంత్రమవుతుంది. ఎందుకంటే సమయము ముందుకు గడుస్తున్న కొద్దీ దాని అనుసారంగా ఒక్క సెకండ్లో స్టాప్ చెయ్యవలసి ఉంటుంది. ఈ వ్యాయామము చేయడం వలన మన్మనాభవ అయ్యేందుకు సహాయం లభిస్తుంది. భాషణ ఇచ్చేటప్పుడుకానీ, ఎవరికైనా సందేశం ఇచ్చేటప్పుడుకానీ ఏమని అంటారు - మేము విశ్వాన్ని పరివర్తన చేసేవారము అని అంటారు కదా. మరి విశ్వాన్ని పరివర్తన చేయాలంటే ముందుగా మీ మనసును ఎంతగా శక్తిశాలిగా చేసుకోవాలంటే ఏ సమయంలో ఏ సంకల్పము చేయాలనుకుంటే ఆ సంకల్పమునే మనసు చేయాలి. సెకండ్లో ఆర్డర్ చేయండి. ఎలా అయితే ఈ శరీరానికి, కర్మేంద్రియాలకు ఆర్డర్ ఇస్తారు కదా, క్రిందకి పెట్టు, పైకి పెట్టు అని అంటారు కదా. అలాగే మనసు వ్యర్థము మరియు అయథార్థము నుండి రక్షింపబడాలి. మనసుకు మీరు యజమానులు. నా మనసు అని అంటారు కదా! మరి నా మనసు నా ఆర్డర్లో ఉండాలి అందుకు ఈ మనసు యొక్క వ్యాయామమును చెప్పడం జరిగింది.
బాప్‌దాదా ఏమి చూసారంటే పిల్లలు ప్రతి ఒక్కరూ మేము మనసును జయించి జగత్ జీతులుగా అవ్వాలని ఆశిస్తున్నారు. అందుకే రాబోవు సమయంకన్నా ముందుగానే మీ మనసును ఎక్కడ కావాలంటే అక్కడ స్థితి చేసుకునే అభ్యాసము ఉండాలి. మరి బాప్‌దాదా ఏమి ఆశిస్తున్నారంటే పిల్లలందరూ ఎంతగా శక్తిశాలిగా అవ్వాలంటే ఏ సంకల్పము చేస్తారో అదే ఆర్డర్లో మనసు, బుద్ధి, సంస్కారాలు ఉండాలి. ఎవరికైతే ఈ అభ్యాసము ఉంటుందో వారు జగత్ జీతులుగా తప్పకుండా అవుతారు. బాప్దాదాపై, పరివారంపై అందరికీ ప్రేమ ఉంది. ఎంతగా పిల్లలకు బాబాపై ప్రేమ ఉందో అంతకంటే ఎక్కువ ప్రేమ బాబాకు పిల్లలపై ఉంది. పిల్లలు ఎంతో చతురతను చూపారు, నా బాబా, నా బాబా అంటూ నావారిగా చేసేసుకున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ నిశ్చయంతో “నా బాబా” అని అంటారు. బాబా కూడా నా పిల్లలు అని అంటారు. “నా” అన్న ఈ పదము ఎంతో అద్భుతము చేసింది. నా బాబా, ప్రియమైన బాబా అని అంటూ ఉంటే పిల్లల మనసులలో ఎంతో ఉల్లాస ఉత్సాహాలు వస్తాయి. బాబా కూడా పదే పదే నా పిల్లలు అని అంటారు. మాయ యొక్క ఎటువంటి దాడి జరిగినా కానీ, ఎందుకంటే మాయను అర్థకల్పం మీ దానిగా చేసేసుకున్నారు కదా! కావున మాయకు కూడా మీపై ఎంతో ప్రేమ ఉంది! కనుక అది పదే పదే మీ వద్దకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ మనస్ఫూర్తిగా నా బాబా అన్నప్పుడు బాబా నుండి సహయోగము లభిస్తుంది. మనస్ఫూర్తిగా ఒక్కసారి నా బాబా అని అన్నప్పుడు వేయి సార్లు శక్తిశాలి సహయోగాన్ని అందించడానికి బాబా బంధింపబడి ఉన్నారు. అనుభవం ఉంది కదా! కేవలం సమయానికి ఈ అనుభవాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురండి.
బాప్‌దాదా పిల్లల ఒక్క విషయాన్ని చూసి మనసులో నవ్వుకుంటారు. ఏ విషయమో తెలుసా? బాబాయే మా ప్రపంచము అని అందరూ అంటారు, అందరూ అంటారు కదా! బాబాయే మా ప్రపంచము అని అనేవారు చేతులెత్తండి. అచ్ఛా, బాబాయే మీ ప్రపంచము. మరే ఇతర ప్రపంచము లేదు కదా! వేరే ప్రపంచము లేదు కానీ మరొకటి ఉంది, అది ఏమిటి? సంస్కారము. బాబాయే నా ప్రపంచము, మరో ప్రపంచమే లేదు. ప్రపంచము లేనప్పుడు సంస్కారము ఎలా వస్తుంది? ఈ మధ్య బాప్‌దాదా సమయానుసారంగా సంస్కారము అన్న పదాన్ని తొలగించాలనుకుంటున్నారు. తొలగించడం వీలవుతుందా? వీలవుతుందా? సంస్కారము విఘ్న రూపమవ్వదు అన్న దృఢ సంకల్పమును చెయ్యగలరు, దృఢ పురుషార్థము ద్వారా ఈరోజు కూడా సమాప్తం చేయవచ్చు. చేద్దాములే, ఆలోచిద్దాములే, చూద్దాములే... ఇది వద్దు. చేయాల్సిందే. సంస్కారము పని రావడము, మీ పని సమాప్తము చేయాల్సిందే. ధైర్యముందా? ధైర్యముందా? ముందు కూడా చేతులెత్తారు కానీ చేసిన సంకల్పం జరుగుతుందా అని పరిశీలించుకోండి. లక్ష్యమును ఇవ్వడము బాబా కార్యము , పిల్లల కార్యము బాబా చెప్పినదాన్ని చేయాల్సిందే. దీనికి కూడా ఒక డేట్‌ను ఫిక్స్ చేయండి, ఎలా అయితే భక్తులు డేట్‌ను ఫిక్స్ చేసారు కదా, ఈ తారీఖున శివరాత్రి చేయాలి అని, అలాగే మీరు కూడా దీనికి డేట్‌ను ఫిక్స్ చేయండి. అందరిదీ ఒకే డేట్ కాకపోయినా కానీ ప్రతి ఒక్కరూ తమ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకోగలరు కదా. చేసుకోగలరు కదా! చేయగలము అని అనుకుంటే చేతులెత్తండి. మరి చేసారా! చేయగలము అని అన్నప్పుడు చేసారా? డబల్ విదేశీయులు ఫిక్స్ చేసారా? అచ్ఛా, ముందు కూర్చున్నవారు, ఏమి ఫిక్స్ చేసారు? ఏ డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నారో దానిని బాప్‌దాదాకు వ్రాసి ఇవ్వండి. బాప్‌దాదా కూడా పిల్లలు పేపర్లో పాస్ అయ్యేందుకు ధైర్యాన్ని ఇస్తారు కదా. ఆ తర్వాత వాహ్ పిల్లలు వాహ్ అని పాట పాడుతారు. సెరిమనీ జరుపుతాము, ఎవరైతే సంకల్పము చేసి దాని అనుసారంగానే ప్రాక్టికల్‌గా చేస్తారో వారికి సెరిమనీ జరుపుతాము ఎందుకంటే తేడా అయితే కనిపిస్తూ ఉంటుంది కదా! ఏ డేట్ అయితే ఫిక్స్ చేసుకుంటారో అందులో ముందుకు వెళ్ళడానికి సమీపంగా వస్తూ ఉంటారు కదా! తేడా కనిపించడం మొదలవుతుంది. కావున ఎవరైతే డేట్ అనుసారంగా సంపన్నమవుతారో వారికి బాప్‌దాదా సెరిమనీ జరుపుతారు. లోపల ఏదైతే చేస్తారో దానిని చూసేవారు కూడా పరిశీలిస్తారు ఎందుకంటే సంపర్కంలోకైతే వస్తారు కదా! ఎవరో ఒకరి ద్వారా సంస్కారాలు బయటకు వస్తాయి కదా. ఎందుకంటే బాప్‌దాదా ఏమి చూసారంటే పిల్లలు ప్రతి ఒక్కరికీ నేను మాస్టర్ సర్వశక్తిమంతుడను అన్న శుద్ద నషా ఉంది. మాస్టర్ కదా? సర్వశక్తిమంతుడు ఉన్నప్పుడు సంకల్పాన్ని పూర్తి చేయగలగడం కూడా శక్తియే కదా. అచ్ఛా.
ఈరోజు మొదటిసారిగా వచ్చినవారు లేవండి. బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు. మధువనానికి వచ్చినందుకు అభినందనలు, అభినందనలు, అభినందనలు. టూ లేట్ బోర్డ్ పెట్టకముందే వచ్చారు అందుకు పూర్తి పరివారము, బాప్‌దాదా అందరికీ మీపట్ల ఉన్న శుభ ఆశ ఏమిటంటే సదా డబల్ పురుషార్ధం చేసి లాస్ట్ వచ్చినప్పటికీ ఫాస్ట్ వెళ్ళగలరు. ధైర్యముందా! ఈరోజు వచ్చినవారిలో ధైర్యముందా? లాస్ట్ వచ్చినప్పటికీ ఫాస్ట్‌గా వెళ్ళి ఫస్ట్ రాగలము, ఫస్ట్ నంబర్లో అన్న ధైర్యముందా! ఫస్ట్ క్లాస్‌లో కూడా ఫస్ట్ రావాలి, వీలవుతుందా! మేము ఫాస్ట్‌గా వెళ్ళి ఫస్ట్ రాగలము అని భావించేవారు చేతులెత్తండి. స్వయంపై నిశ్చయముందా? అచ్ఛా.
సేవ టర్న్ ఢిల్లీ మరియు ఆగ్రా జోన్ వారిది:- ఢిల్లీ మొదటి నుండి సేవలో క్రొత్త క్రొత్త విషయాలను చేస్తూ ఉండటాన్ని బాప్‌దాదా విన్నారు. చేసారు కదా! ఇప్పుడు సేవలో ఏదైనా క్రొత్త ఇన్వెన్షన్‌ను ఆలోచించండి. భాషణ, ప్రోగ్రామ్‌లు కూడా బాగానే ఉన్నాయి. ఎందుకంటే వాటితో వృద్ధి అవుతుంది మరియు సంబంధంలోకి వస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నవి చక్కగా ఉన్నాయి కానీ ఈ ప్రోగ్రామ్‌లు చాలా సమయం జరిగాయి. ఇప్పుడు ఏదైనా క్రొత్త విషయాన్ని ఆలోచించండి, దాని ద్వారా సేవ చేసే వారిలో క్రొత్త ఉల్లాస ఉత్సాహము నిండాలి. చేస్తారు కదా! బాగుంది. అందరినీ ఉత్సాహంలోకి తీసుకువచ్చి అందులో బిజీ చేయండి. అచ్ఛా.
ఢిల్లీవారు పురుషార్థంలో కూడా నంబర్‌వన్ తీసుకోవాలి. బాప్‌దాదా చాలాకాలంగా ఏమి చెప్తున్నారంటే ఏ సెంటరైనా, దేశమైనా, విదేశీ సెంటరైనా, 6 మాసాలు నిర్విఘ్నంగా ఉండాలి, ఎటువంటి విఘ్నము రాకూడదు. నిర్విఘ్నము. ఒకవేళ నంబర్‌వన్‌గా అయినట్లయితే అందుకు కూడా నిర్విఘ్న భవ అన్న రోజును జరుపుతాము. ఇప్పుడు 6 మాసాలు అని చెప్తున్నాము, 6 నెలల అభ్యాసము అయినప్పుడు మున్ముందు కూడా అలవాటు అవుతుంది. కానీ బహుమతిని పొందడానికి 6 నెలల సమయాన్ని ఇస్తున్నాము. మరి ఢిల్లీ ఏ నంబర్‌ను తీసుకుంటుంది? మొదటి నంబర్. బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. పూర్తి పరివారానికి కూడా సంతోషంగా ఉంది. సంతుష్టత ప్రసిద్ధి కావాలి. సేవలో కానీ, తయారై ఉన్న నియమాలలో కానీ. మరి చూద్దాము. బాప్‌దాదా అయితే చెప్పి ఉన్నారు కానీ ఇప్పటి వరకూ పేర్లు రాలేదు. జోన్ కాకపోయినా పెద్ద సెంటర్ల కనెక్షన్లో ఉన్న సెంటర్లు చేసినా కూడా బాప్‌దాదా చూస్తారు. ఇప్పుడు త్వరత్వరగా అడుగులు ముందుకు వేయండి, ఎందుకు? అకస్మాత్తుగా ఏమైనా జరుగవచ్చు. తారీఖు చెప్పడం జరుగదు. అచ్ఛా, ఢిల్లీవారు కూర్చోండి.
ఆగ్రా సబ్జోన్:- ఆగ్రా ఎటువంటి కార్యమును లేక సేవను చేయాలంటే ఎలా అయితే ప్రభుత్వం లిస్ట్‌లో ఆగ్రా ప్రసిద్ధి చెంది ఉందో అలాగే ఆగ్రావారు ఆల్మైటీ ప్రభుత్వంలో కూడా ప్రసిద్ధి అయ్యే విధంగా సేవలను ఆలోచించండి. ఎలా అయితే ఆగ్రాలో కిరీటము ఉందో అలాగే చెయ్యండి. నమ్మకముందా? నమ్మకము ఉన్నందుకు అభినందనలు. ఏమి చేస్తారు? ఎంత సమయంలో చేస్తారు. ఆలోచించండి, అమృతవేళ కూర్చోండి మరియు ఆలోచించండి అప్పుడు ఏదో ఒక టచింగ్ వస్తుంది. సరేనా, టీచర్లు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. మరి అద్భుతం చేయాలి. ఇప్పుడేదైనా నవీనత చేయండి అని బాప్‌దాదా పిల్లలందరికీ సూచనను ఇస్తున్నారు. సమయానుసారంగా ఏదైతే జరుగుతుందో అది నవీనతయే. కానీ ఇప్పుడు మరింత నవీనత, ఇన్వెన్షన్ తీసుకురండి. ఏ జోన్ అయినా చేయండి, కానీ క్రొత్తగా చేయండి. బాప్‌దాదాకు పిల్లలందరూ ప్రియమైనవారే. బాప్‌దాదాకు పిల్లల విశేషత కూడా తెలుసు. ప్రతి ఒక్కరిలో తప్పకుండా విశేషతలు ఉన్నాయి కానీ కొందరు కార్యంలో ఉపయోగిస్తున్నారు, మరి కొందరివి దాగి ఉంటున్నాయి. అందుకే బాబా అంటారు. పిల్లలు ప్రతి ఒక్కరూ బాబాకు ప్రియమైనవారు, గారాల పిల్లలు. పిల్లలు ఎగురుతూ ఉండాలి, ఎగిరిస్తూ ఉండాలి అని బాప్‌దాదా ఆశిస్తున్నారు.
డబల్ విదేశీ సోదరసోదరీలతో:- సదా మేము బ్రాహ్మణ పరివారము మరియు బాప్‌దాదాకు గారాల పిల్లలము అని డబల్ విదేశీయులు అనుభవం చేస్తారు. ఎందుకని! ఎంతగా దేశం అనుసారంగా దూరంగా ఉంటారో అంతగా బాప్‌దాదా హృదయానికి దగ్గరగా ఉంటారు. ఈ విశేషత ఉంది. బాబా అని అన్నప్పుడు వారి ముఖము ప్రేమలో ఎంతగా లవలీనమైపోతుందంటే బాబా కూడా వారిని చూసి సంతోషిస్తారు. మరో విశేషత ఏమిటంటే భారత దేశపు నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడంలో ధైర్యాన్ని చూపుతారు. మొదట్లో భారత దేశపు కల్చర్ అని భావించేవారు, కానీ ఇప్పుడు, మేము కూడా భారతీయులమే అని అనడం బాప్‌దాదా చూసారు. భారత దేశము రాజధాని కదా, భారత దేశపు నషా మనసులో బాగా నాటుకుంది. సేవ కూడా ఇప్పటి వరకు చక్కగా చేసారు. తమ చుట్టుప్రక్కల ఎక్కడ సేవ జరగలేదో అక్కడ కూడా సేవ చేసే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. రిజల్ట్‌లో అనేక స్థానాలలో సక్సెస్ లభించింది. అంతే కదా! సేవ చేస్తున్నారు కదా? చుట్టు ప్రక్కల సేవను చేసేవారు చేతులెత్తండి, బాగుంది. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. అచ్ఛా -
నలువైపుల ఉన్న పిల్లలు బాబాకు ముద్దు బిడ్డలు. నేను తీవ్ర పురుషార్థమును చేసి బాబాను ప్రత్యక్షం చేయాలి అని ప్రతి ఒక్కరి స్మృతిలోకి పదే పదే రావాలి మరియు వస్తుంది. నా బాబా వచ్చేసారు అని అందరూ మనస్ఫూర్తిగా అనాలి. ఇటువంటి ఉల్లాస ఉత్సాహపు సంకల్పాలు ఇప్పుడు బాప్‌దాదాకు చేరుకుంటున్నాయి. ఈ ఉల్లాస ఉత్సాహాలు మెజారిటీ పిల్లల మనసులలో ఉంది. ఇప్పుడు త్వర త్వరగా సందేశాన్ని అందరికీ అందించాలి, ఎవ్వరూ వంచితమవ్వకూడదు అని బాప్‌దాదా ఆశిస్తున్నారు. ఏదో ఒక వారసత్వాన్ని తీసుకోవాలి. జీవన్ముక్తి కాకపోయినా ప్రేమతో ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి ఎందుకంటే బాబా అందరికీ వారసత్వాన్ని ఇస్తారు. ఎంతమందికి వారసత్వాన్ని ఇప్పిస్తారో అంతగా మీకు మీ రాజ్యంలో రాజ్యాధికారులుగా అయ్యే వారసత్వము లభిస్తుంది. అన్ని వైపుల ఉన్న పిల్లలందరూ బాప్‌దాదా నుండి చాలా చాలా ప్రేమ మరియు ఆశీర్వాదాలను స్వీకరించగలరు. అచ్ఛా.
దాదీ రతన్మోహిని:- నేటి సభ చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే, ఇప్పుడు సమయం చాలా సమీపంగా ఉంది, కాబట్టి రోజు రోజుకు తండ్రి కూడా మనల్ని మున్ముందు కోసం పూర్తిగా తయారుచేస్తున్నారు. ఇప్పుడు ఏవైతే మనకు ప్రాప్తులు లభించాయో, ప్రతి ఒక్కరూ త్వరత్వరగా ఆ విషయాలన్నింటినీ అర్థం చేసుకోవాలి మరియు తండ్రి నుండి తమ తమ వారసత్వాన్ని తీసుకోవాలి, అని అందరి మనసులోనూ ఇదే కోరిక ఉంది. ఎంతగా మనం బాబా యొక్క విషయాలను వింటూ స్వయంలో నింపుకుంటూ వెళ్తామో మరియు ఇతరులకు కూడా తండ్రి పరిచయాన్నిచ్చి వారికి తండ్రి యొక్క ప్రాప్తులను చేయిస్తూ ఉంటామో, అంతగా వారికి కూడా చాలా అనుభవాలు జరుగుతూ ఉంటాయి.
త్వరత్వరగా ఇప్పుడు ఈ ప్రపంచం మారి మళ్లీ మన క్రొత్త ప్రపంచం ఈ సృష్టిపై రానే వచ్చింది అని అనిపిస్తుంది. మరి బాబా ఏ విషయాలనైతే వినిపించారో వాటిపై మననం చేస్తూ మనం స్వయాన్ని ఎంత యోగ్యంగా చేసుకోవాలంటే ఎవరు మనల్ని చూసినా వారికి మన ద్వారా తండ్రి యొక్క పరిచయం లభించాలి. బాబా పిల్లలకు ఎంత ఉత్సాహం ఉంది మరియు సమయానుసారంగా ఎలా తమ తమ వారసత్వాన్ని తీసుకోవడానికి చేరుకున్నారని మీ అందరినీ చూస్తూ మాకు చాలా సంతోషంగా ఉంది. మంచిది.
*** ఓంశాంతి ***
