‘‘సుపుత్రులుగా అయ్యి మీ ముఖంతో బాబా ముఖాన్ని చూపించండి, నిర్మాణం (సేవ)తో పాటు నిర్మలవాణి, నిర్మాన స్థితి యొక్క బ్యాలెన్స్‌ను ఉంచండి’’
ఓం శాంతి 06.03.2020 మధువనం
ప్రాణప్రదమైన అవ్యక్త బాప్‌దాదాకు అతి స్నేహులు, సదా విశ్వ కళ్యాణకారులై సుఖశాంతిమయ ప్రపంచాన్ని తయారు చేసేవారు, సదా ఒకే రాజ్యము, ఒకే ధర్మము యొక్క స్థాపనకు నిమిత్తమైన టీచర్ అక్కయ్యలు మరియు దేశ విదేశాలలోని సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదరసోదరీలు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతులతో పాటు హోలీ పర్వదినం సందర్భంగా మీ అందరికీ చాలా చాలా హార్దిక అభినందనలు.
ఇప్పుడైతే హోలీ పండుగ రాబోతుంది, మధురమైన బాబా మనందరి జీవితాలను హోలీ చేసేసారు. ప్రతి ఒక్కరూ హోలీ యొక్క అర్థ స్వరూపంలో స్థితులై, హోలీ అనగా గడిచినదేదో గడిచిపోయినది అనుకుని ఒక్కరికి అయిపోయాము. పాత సంస్కారాల హోలీని కాల్చివేసి హోలీగా (పవిత్రంగా) అయిపోయాము. అందరమూ మంగళ మిలనము జరుపుకుంటూ, సంస్కార మిలనము యొక్క రాస్ చేస్తూ, ప్రతి ఒక్కరికీ మన శ్రేష్ఠ సాంగత్యపు రంగును వేస్తూ స్వర్ణిమ ప్రపంచాన్ని తీసుకువచ్చే సేవను చేస్తున్నాము. ఇటువంటి సుందరమైన స్మృతిచిహ్న పండుగకు అందరికీ పదమారెట్ల అభినందనలు. అభినందనలు.
ఈరోజు ప్రియమైన అవ్యక్త బాప్‌దాదా దివ్యమైన అవతరణ యొక్క అవ్యక్త దివసము. ఈస్టర్న్ జోన్ (బంగాల్, బీహార్, ఒరిస్సా, అస్సాం), నేపాల్ మరియు తమిళనాడు నుండి షుమారు 20-21వేల మంది సోదరసోదరీలు బాబా ఇంటికి చేరుకున్నారు. అందరూ ప్రేమ సాగరునిలో లవ్లీనమై, తమ అవ్యక్త స్థితి ద్వారా అవ్యక్త మిలనము యొక్క అనుభూతులు చేసుకుంటున్నారు. డబల్ విదేశీ సోదరసోదరీలది మంచి శోభ ఉంది. ఈసారి 100కు పైగా దేశాలనుండి సోదరసోదరీలు బాబా ఇంటికి చేరుకున్నారు. అన్ని దేశాల ముఖ్య పెద్దక్కయ్యలు మరియు అన్నయ్యలు కూడా వచ్చారు. అందరూ పూర్తి సంవత్సరం కోసం స్వ ఉన్నతి మరియు సేవలపై చాలా మంచి ఆత్మిక చర్చను చేయడంతో పాటు సేవలలో క్రొత్త క్రొత్త ప్లాన్లను తయారు చేసారు.
మనందరి అతి ప్రియమైన దాదీ జానకిగారు (అహ్మదాబాద్ నుండి), దాదీ గుల్జార్ గారు (ముంబయి నుండి) సూక్ష్మ రూపంలో తమ శక్తిశాలి వైబ్రేషన్లతో తమ ఉనికిని అనుభవం చేయిస్తున్నారు. అవ్యక్త వతనం నుండి ప్రియమైన బాప్‌దాదా తమ పిల్లలను దివ్యమైన వరదానాలు మరియు సూక్ష్మ శక్తులతో అలంకరిస్తున్నారు. వస్తున్నటువంటి సోదరసోదరీలందరూ బాబా ఇంటిలో చక్కగా రిఫ్రెష్ అయ్యి, పూర్తిగా సంతుష్టంగా అయ్యి బాప్‌దాదా మరియు దైవీ పరివారానికి హృదయపూర్వక దీవెనలను ఇస్తున్నారు. అవ్యక్త వతనంలో ఉంటూ కూడా పిల్లలకు తమ పూర్తి భాసనను, పాలనను అనుభవం చేయించడం బాప్‌దాదా చేస్తున్న అద్భుతమే. వీడియో ద్వారా కూడా ప్రతి ఒక్కరూ బాప్‌దాదా మా మధ్యలోనే ఉన్నారు అన్నట్లుగా అనుభవం చేసుకుంటున్నారు మరియు అన్ని ప్రశ్నలకు సమాధానాలను ఇస్తున్నారు. ఇప్పుడైతే నాజూకు సమయపు పరిస్థితులు వికరాల రూపంలో వస్తున్నాయి. పిల్లలు, డ్రామాలోని విధి సదా కళ్యాణకారి అని బాబా అంటారు. మనమైతే సమయ ప్రమాణంగా శక్తులను పెంచుకోవాలి మరియు మన పవిత్ర శుద్ధ వైబ్రేషన్ల ద్వారా భయంతో ఉన్న ఆత్మలకు శాంతి మరియు శక్తుల సకాశ్ను ఇవ్వాలి. అచ్ఛా - అందరికీ చాలా, చాలా స్మృతి... ఓం శాంతి.
06.03.2020 ఓం శాంతి “అవ్యక్త మహావాక్యాలు - వీడియో ద్వారా” 31-03-07 మధువనం
సుపుత్రులుగా అయ్యి మీ ముఖంతో బాబా ముఖాన్ని చూపించండి, నిర్మాణం (సేవ)తో పాటు నిర్మలవాణి, నిర్మాన స్థితి యొక్క బ్యాలెన్స్‌ను ఉంచండి
ఈరోజు బాప్‌దాదా నలువైపుల ఉన్న పిల్లల భాగ్యరేఖలను చూసి హర్షిస్తున్నారు. పిల్లలందరి మస్తకంలో జ్యోతి రేఖ మెరుస్తూ ఉంది. నయనాలలో ఆత్మీయత యొక్క భాగ్యరేఖ కనిపిస్తూ ఉంది. నోటిపై శ్రేష్ఠ వాణి యొక్క భాగ్యరేఖ కనిపిస్తూ ఉంది. పెదవులలో ఆత్మిక చిరునవ్వును చూస్తున్నారు. చేతులలో పరమాత్ముని సర్వ ఖజానాల రేఖ కనిపిస్తూ ఉంది. స్మృతితో వేసే ప్రతి అడుగులో పదమాల రేఖ కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి ప్రేమలో లవలీనం అయ్యే రేఖను చూస్తున్నారు. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని పిల్లలు ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకుంటున్నారు కదా! ఎందుకంటే ఈ భాగ్యరేఖలను స్వయంగా తండ్రి ప్రతి ఒక్కరికీ శ్రేష్ఠ కర్మ అనే కలంతో గీశారు. ఇంతటి శ్రేష్ఠ భాగ్యం అంటే అవినాశీ భాగ్యం, కేవలం ఈ జన్మకే కాదు కానీ అనేక జన్మల కొరకు అవినాశీ భాగ్యరేఖలు ఇవి. తండ్రి అవినాశీ మరియు భాగ్యరేఖలు కూడా అవినాశీ. ఈ సమయంలో చేసే శ్రేష్ఠ కర్మల ఆధారంగా ఈ రేఖలన్నీ ప్రాప్తిస్తాయి. ఈ సమయంలోని పురుషార్థం అనేక జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేస్తుంది.
పిల్లలందరికీ లభించిన అనేక జన్మల ప్రాలబ్ధమును బాప్‌దాదా ఇప్పుడు ఈ సమయంలో, ఈ జన్మలో పురుషార్థం యొక్క ప్రాలబ్ధాన్ని ఇప్పుడే చూడాలనుకుంటున్నారు. కేవలం భవిష్యత్తు కొరకే కాదు, ఇప్పుడు కూడా ఈ భాగ్యరేఖలన్నీ సదా అనుభవం కావాలి. ఎందుకంటే ఇప్పటి ఈ దివ్య సంస్కారమే మీ యొక్క కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తుంది. కనుక పరిశీలించుకోండి, పరిశీలించుకోవటం వస్తుంది కదా! స్వయానికి స్వయమే పరిశీలకులుగా అవ్వండి. సర్వ భాగ్యరేఖలు ఇప్పుడు కూడా అనుభవం అవుతున్నాయా? ఈ ప్రాలబ్ధము అంతిమంలో కనిపిస్తుంది అని అనుకోవటం లేదు కదా? ప్రాప్తించేది ఇప్పుడే అయినప్పుడు ప్రాలబ్ధము యొక్క అనుభవం కూడా ఇప్పుడే చేసుకోవాలి. భవిష్య ప్రపంచం యొక్క సంస్కారాలు ఇప్పుడు ప్రత్యక్ష జీవితంలో అనుభవం అవ్వాలి. అయితే ఏమి పరిశీలించుకోవాలి? భవిష్య ప్రపంచం యొక్క సంస్కారాల గురించి మహిమ చేస్తారు కదా - భవిష్య ప్రపంచంలో ఒకే రాజ్యం ఉంటుంది, ఆ ప్రపంచం గుర్తుంది కదా! ఎన్నిసార్లు ఆ ప్రపంచంలో రాజ్యం చేసారు! గుర్తుందా లేదా గుర్తు తెప్పిస్తే గుర్తుకు వస్తుందా? మీ స్మృతిలో ఉన్నాయి కదా? కానీ అవే సంస్కారాలు ఇప్పటి జీవితంలో ప్రత్యక్ష రూపంలో ఉన్నాయా? కనుక పరిశీలించుకోండి - ఇప్పుడు కూడా మనస్సులో, బుద్ధిలో, సంబంధ సంపర్కాలలో, జీవితంలో ఒకే రాజ్యం ఉందా? లేక అప్పుడప్పుడు ఆత్మ రాజ్యంతో పాటు మాయారాజ్యం కూడా నడవటం లేదు కదా? భవిష్య ప్రాలబ్ధంలో ఒకే రాజ్యం ఉంటుంది, రెండు రాజ్యాలు ఉండవు. అదే విధంగా ఇప్పుడు కూడా రెండు రాజ్యాలు లేవు కదా? భవిష్య రాజ్యంలో ఒకే రాజ్యంతో పాటు ఒకే ధర్మం ఉంటుంది, ఆ ఒకే ధర్మం ఏమిటి? సంపూర్ణ పవిత్రత యొక్క ధారణయే ధర్మం. కనుక ఇప్పుడు పరిశీలించుకోండి - పవిత్రత సంపూర్ణంగా ఉందా? స్వప్నంలో కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకూడదు. పవిత్రత అనగా సంకల్పం, మాట, కర్మ మరియు సంబంధ సంపర్కాలలో సంపూర్ణ పవిత్రత యొక్క ఒకే ధారణ ఉండాలి. బ్రహ్మాచారులేనా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోవటం వస్తుందా? పరిశీలించుకోవటం వచ్చు అనేవారు చేతులెత్తండి! వస్తుంది మరియు చేసుకుంటున్నారు కూడా. చేస్తున్నారు, చేస్తున్నారా? టీచర్స్‌కు వచ్చా? డబల్ విదేశీయులకు వచ్చా? ఎందుకు? ఇప్పటి పవిత్రత కారణంగానే మీ జడ చిత్రాల నుండి కూడా పవిత్రతను కోరుకుంటారు. పవిత్రత అనే ఒకే ధర్మం ఇప్పుడు స్థాపన అయితేనే భవిష్యత్తులో కూడా ఒకే ధర్మం నడుస్తుంది. భవిష్యత్తు గురించి ఇంకా ఏమి మహిమ చేస్తారు? ఒకే రాజ్యం , ఒకే ధర్మం మరియు సదా సుఖము, శాంతి, సంపద అన్నీ అఖండంగా ఉంటాయి అంటే అఖండ సుఖం, అఖండ శాంతి, అఖండ సంపద. ఇప్పటి మీ స్వరాజ్య జీవితంలో, అది విశ్వ రాజ్యము, ఇది స్వరాజ్యము. మరి పరిశీలించుకోండి - అవినాశీ సుఖము, పరమాత్మ సుఖము అవినాశిగా అనుభవం అవుతున్నాయా? ఏదో ఒక సాధనం లేదా సౌకర్యం ఆధారంగా సుఖం అనుభవం అవ్వటం లేదు కదా? ఎప్పుడూ కూడా, ఏ కారణంగానైనా కానీ దుఃఖం యొక్క అల రాకూడదు. పేరు, గౌరవం, ప్రతిష్ఠ ఆధారంగా సుఖం అనుభవం అవ్వటం లేదు కదా? ఎందుకు? ఈ పేరుప్రతిష్ఠలు, గౌరవమర్యాదలు, సాధనాలు, సౌకర్యాలు ఇవి వినాశీ మరియు అల్పకాలికమైనవి. వినాశీ ఆధారంగా అవినాశీ సుఖం లభించదు. పరిశీలించుకుంటూ ఉండండి. ఇప్పుడు కూడా వింటూ ఉండండి మరియు పరిశీలించుకుంటూ ఉండండి. అప్పుడు ఇప్పటి సంస్కారాలలో మరియు భవిష్య సంస్కారాలలో ప్రాలబ్ధములో ఎంత తేడా ఉందో మీకే తెలిసిపోతుంది. మీరందరూ జన్మిస్తూనే బాప్‌దాదాతో ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ జ్ఞాపకం ఉందా? గుర్తు ఉందా లేక ప్రతిజ్ఞను మర్చిపోయారా? మేమందరం బాబాకు సహచరులుగా అయ్యి విశ్వ కళ్యాణకారులుగా అయ్యి క్రొత్త సుఖశాంతిమయ ప్రపంచాన్ని తయారు చేస్తాము అని ప్రతిజ్ఞ చేసారు. ఉందా గుర్తు? మీరు చేసిన ప్రతిజ్ఞ గుర్తుందా? గుర్తుంటే చేతులెత్తండి. ప్రతిజ్ఞ పక్కాయేనా లేక కొంచెం కదులుతుందా? ఇప్పటి పరమాత్మ సంస్కారాల ఆధారంగానే కొత్త ప్రపంచం తయారవుతుంది. కనుక ఇప్పుడు కేవలం పురుషార్థం చేయటమే కాదు, ఆ పురుషార్థానికి ప్రాలబ్ధాన్ని కూడా ఇప్పుడు అనుభవం చేసుకోవాలి. ఇదే విధంగా సుఖంతో పాటు శాంతిని కూడా పరిశీలించుకోండి - అశాంతి వాతావరణం, అశాంతి పరిస్థితులు, అశాంతి వాయుమండలంలో కూడా శాంతిసాగరుని పిల్లలైన మీరు సదా కమల పుష్ప సమానంగా అశాంతిని కూడా శాంతి వాయుమండలంగా పరివర్తన చేయగలుగుతున్నారా? శాంతి వాయుమండలంలో మీరు శాంతిని అనుభవం చేసుకోవటం గొప్ప విషయం కాదు. మీ ప్రతిజ్ఞ ఏమిటంటే అశాంతిని శాంతిలోకి పరివర్తన చేసేవాళ్ళం. కనుక పరిశీలించుకోండి, పరిశీలించుకుంటున్నారు కదా! పరివర్తకులేనా? పరవశులు కాదు కదా? పరివర్తకులు. పరివర్తకులు ఎప్పుడూ పరవశం అవ్వరు. ఇదేవిధంగా సంపద అనగా అఖండ సంపద. స్వరాజ్యాధికారి యొక్క అఖండ సంపద ఏది? జ్ఞానం, గుణాలు మరియు శక్తులు స్వరాజ్యాధికారికి సంపదలు. కనుక పరిశీలించుకోండి - జ్ఞానం యొక్క విస్తారములోని సారాన్ని స్పష్టంగా తెలుసుకున్నారు కదా! జ్ఞానం అంటే అర్థం - కేవలం ఉపన్యాసం చెప్పటం, కోర్స్ చెప్పటం అని కాదు, జ్ఞానం అనగా తెలివి. ప్రతి సంకల్పం, కర్మ, మాట అన్నీ తెలివిగా అనగా జ్ఞాన స్వరూపులై చేస్తున్నారా? సర్వ గుణాలు ప్రత్యక్ష జీవితంలో కనిపిస్తున్నాయా? అన్నీ ఉన్నాయా లేక యథాశక్తి అనుసరించి ఉన్నాయా? అదే విధంగా సర్వశక్తులు. మీ టైటిల్ - మాస్టర్ సర్వశక్తిమాన్, శక్తిమాన్ కాదు, సర్వశక్తిమాన్ అయితే మరి సర్వశక్తులతో సంపన్నంగా ఉన్నారా? మరో విషయం ఏమిటంటే సర్వ శక్తులు సమయానికి పని చేస్తున్నాయా? సమయానికి హాజరు అవుతున్నాయా లేక సమయం గడిచిపోయిన తర్వాత జ్ఞాపకం వస్తుందా? కనుక మూడు విషయాలు అనగా ఒకే రాజ్యం, ఒకే ధర్మం మరియు అవినాశీ సుఖశాంతులు మరియు సంపదలను పరిశీలించుకోండి. ఎందుకంటే ఇప్పటి స్వరాజ్య సమయంలో ఈ విషయాలను అనుభవం చేసుకోకపోతే భవిష్యత్తులో చేసుకోలేరు. ఇప్పుడే ఈ అన్ని విషయాలను అనుభవం చేసుకోగలరు. ఇప్పటి నుండే ఈ సంస్కారాలు ప్రత్యక్షంగా ఉంటేనే అనేక జన్మలు ప్రాలబ్ధాన్ని రూపంలో వస్తాయి. ధారణ చేస్తున్నాము, తయారవుతాము, అంతిమానికి తయారైపోతాము అని అనుకోవటం లేదు కదా!
బాప్‌దాదా ముందు నుండే సూచన ఇచ్చి ఉన్నారు - ఇప్పుటి బహుకాలపు అభ్యాసమే బహుకాలం యొక్క ప్రాప్తికి ఆధారం. అంతిమంలో తయారైపోతాము అని అనుకోకండి. అయిపోతాము కాదు, అవ్వాల్సిందే. ఎందుకు? స్వరాజ్యాధికారం యొక్క అభ్యాసం చాలా కాలం నుండి కావాలి. కేవలం ఒక జన్మలోనే అధికారి కాలేకపోతున్నారు, ఆధీనం అయిపోతుంటే అనేక జన్మలు అధికారిగా ఏవిధంగా కాగలరు? అందువలన బాప్‌దాదా నలువైపుల ఉన్న పిల్లలందరికీ పదేపదే సూచన ఇస్తున్నారు - ఇప్పుడు సమయం యొక్క వేగం తీవ్ర వేగంలో ఉంది అందువలన పిల్లలందరూ ఇప్పుడు కేవలం పురుషార్థిగా అవ్వటం కాదు, తీవ్రపురుషార్ధిగా అయ్యి పురుషార్థం యొక్క ప్రాలబ్ధాన్ని బహుకాలం నుండి అనుభవం చేసుకోవాలి. తీవ్ర పురుషార్థం యొక్క గుర్తులు బాప్‌దాదా ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నారు. తీవ్ర పురుషార్థులు సదా మాస్టర్ దాతలుగా ఉంటారు, తీసుకునేవారిగా ఉండరు. ఇచ్చేటువంటి దేవతగా ఉంటారు. ఇది ఉంటే నా పురుషార్థం ఉంటుంది, వీరు చేస్తే నేను కూడా చేస్తాను, వీరు మారితే నేను కూడా మారతాను, ఇలా వీరు మారాలి, వీరు చేయాలి అనుకోవటం దాతస్థితి యొక్క గుర్తులు కాదు. ఎవరు చేసినా, చేయకపోయినా బాప్‌దాదా సమానంగా నేను చేస్తాను అనుకోవాలి. సాకారంలో బ్రహ్మా బాబాను కూడా చూసారు కదా పిల్లలు చేస్తే నేను చేస్తాను అని ఎప్పుడూ అనలేదు, నేను చేసి పిల్లలచే చేయించాలి అనుకొనేవారు. తీవ్రపురుషార్థుల రెండవ గుర్తు ఏమిటంటే - సదా కర్మ చేస్తూ కూడా నిర్మానంగా ఉంటారు. కార్యం చేస్తూ నిర్మానంగా ఉంటారు. నిర్మానము మరియు నిర్మాణం రెండింటి సమానత కావాలి. ఎందుకు? నిర్మానంగా అయ్యి కార్యం చేయడంలో సర్వుల నుండి మనస్ఫూర్వక స్నేహం మరియు ఆశీర్వాదాలు లభిస్తాయి. బాప్‌దాదా చూసారు - నిర్మాణం అంటే సేవా క్షేత్రంలో అందరూ ఈరోజుల్లో మంచి ఉత్సాహ ఉల్లాసాలతో క్రొత్త క్రొత్త ప్లాన్స్ తయారు చేస్తున్నారు. దీనికొరకు బాప్‌దాదా నలువైపుల ఉన్న పిల్లలకు శుభాకాంక్షలు ఇస్తున్నారు.
బాప్‌దాదా దగ్గరికి నిర్మాణం యొక్క సేవ యొక్క చాలా మంచి, మంచి ప్లాన్స్ వచ్చాయి. కానీ బాప్‌దాదా ఏమి చూసారంటే - నిర్మాణ కార్యంలో అయితే చాలా మంచిగా ఉన్నారు కానీ సేవా కార్యంలో ఉత్సాహ, ఉల్లాసాలు ఎంతగా ఉన్నాయో అంతగానే నిర్మానస్థితి యొక్క బ్యాలెన్స్ ఉంటే అప్పుడు నిర్మాణం అంటే సేవాకార్యంలో మరింత ఎక్కువ సఫలత ప్రత్యక్ష రూపంలో లభించగలదు. బాప్‌దాదా ఇంతకుముందు కూడా వినిపించి ఉన్నారు - నిర్మాన స్వభావము, నిర్మాన మాట మరియు నిర్మాన స్థితితో సంబంధ, సంపర్కాలలోకి రావాలి. దేవతల గురించి మహిమ చేస్తారు. వారి నోటినుండి వచ్చే మాటలు వజ్రాలు, ముత్యాలు వంటి అమూల్యమైనవి అని కానీ ఇది బ్రాహ్మణుల మహిమ. నిర్మల వాణి, నిర్మాన స్థితిపై ఇప్పుడు అటెన్షన్ ఉండాలని బాప్‌దాదా గమనించారు.
బాప్‌దాదా మూడు ఖజానాల యొక్క ఖాతాను జమ చేసుకోమని గతంలో చెప్పారు. మరయితే ఫలితంలో ఏమి చూసారు? ఆ మూడు ఖాతాలు ఏవి? గుర్తుండి ఉంటాయి కదా? అయినా కానీ మరలా రివైజ్ చేస్తున్నారు- ఒకటి, మీ పురుషార్థంతో జమా ఖాతాను పెంచుకోవడము. రెండవది - సదా స్వయం కూడా సంతుష్టంగా ఉండాలి మరియు ఇతరులను కూడా సంతుష్టం చేయాలి, రకరకాల సంస్కారాల గురించి తెలిసినా కానీ సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టంగా చేయాలి, దీని ద్వారా ఆశీర్వాదాల ఖాతా జమ అవుతుంది. ఒకవేళ ఏ కారణంగా అయినా సంతుష్టం చేయటంలో లోటు ఉండిపోతే పుణ్యఖాతా జమ అవ్వదు. పుణ్యానికి తాళంచెవి - సంతుష్టత. సంతుష్టంగా ఉండటమైనా మరియు చేయటమైనా. మరియు మూడవది – సేవలో కూడా సదా నిస్వార్ధంగా ఉండాలి, నేను అనే భావన ఉండకూడదు. నేను చేసాను, లేదా నాదిగా ఉండాలి ఇలా నేను మరియు నాది అనేవి సేవలో వస్తే పుణ్యఖాతా జమ అవ్వదు. నాది, ఈ రాయల్ రూపంలో ఉండే నాది కూడా చాలా ఉంటుంది, అనుభవీలే కదా? రాయల్ రూపంలో నాది అనే భావన యొక్క జాబితా, సాధారణ నాది అనే భావన యొక్క జాబితాకంటే పెద్దది. కనుక ఎక్కడైనా కానీ నేను మరియు నాది అనే స్వార్థం ఉంటే, నిస్వార్థంగా లేకపోతే అక్కడ పుణ్యఖాతా తక్కువ జమ అవుతుంది. నాది అనే భావం యొక్క జాబితాను మరలా ఎప్పుడైనా వినిపిస్తాము. ఆ జాబితా చాలా పెద్దది మరియు చాలా సూక్ష్మమైనది. బాప్‌దాదా ఏమి చూసారంటే, అందరూ తమ, తమ శక్తిననుసరించి పురుషార్థం ద్వారా ఖాతాను జమ చేసుకుంటున్నారు కానీ ఆశీర్వాదాల ఖాతా మరియు పుణ్యఖాతాను ఇప్పుడు నింపుకోవలసిన అవసరం ఉంది. అందువలన మూడు ఖాతాలు జమ చేసుకోవటంలో ధ్యాస పెట్టాలి. రకరకాల సంస్కారాలు ఇప్పుడు కూడా కనిపిస్తాయి ఎందుకంటే ఇప్పుడింకా అందరి సంస్కారాలు సంపన్నం కాలేదు. కానీ ఇతరుల బలహీన స్వభావము, బలహీన సంస్కారాల ప్రభావం మనపై పడకూడదు. ఈ బలహీన సంస్కారాలు శక్తివంతమైనవి కావు, నేను మాస్టర్ సర్వశక్తిమంతుడిని, మాస్టర్ సర్వశక్తిమంతుడిని అయిన నాపై ఈ బలహీన సంస్కారాల యొక్క ప్రభావం పడకూడదు అని అనుకోవాలి. రక్షణకి సాధనం - బాప్‌దాదా యొక్క ఛత్రఛాయలో ఉండటం, బాప్‌దాదాతో కంబైండ్‌గా ఉండటం. శ్రీమతమే ఛత్రఛాయ. అచ్ఛా.
సేవ టర్న్ ఈస్టర్న్ జోన్ వారిది (బంగాల్, బీహార్, ఒరిస్సా, నేపాల్, తమిళనాడు జోన్):- ఇది చాలా మంచిది, అన్ని జోన్లు వారు ఛాన్స్‌ను తీసుకునే విధిని మంచిగా తయారు చేసుకున్నారు. అచ్ఛా, మీరందరూ ఏదైనా కొత్త ఆవిష్కరణ చేసారా, సేవలో నవీనతను ఆలోచించారా? జోన్ యొక్క ముఖ్య టీచర్లు చేతులెత్తండి. భిన్న భిన్న స్థానాల హెడ్, కేవలం జోన్ హెడ్ మాత్రమే కాదు, భిన్న భిన్న స్థానాల హెడ్స్ చేతులెత్తండి. అచ్ఛా. మరి మీరందరూ సేవలో నవీనత ప్లాన్ ఏమి తయారు చేసారు? ఎవరైనా తయారు చేసారా? ముందు ఉన్న టీచర్లు తయారు చేసారా లేక చేస్తున్నారా? చేస్తున్నారు. మీ జోన్లో విస్తారం చాలా ఉంది, ఎంతోమంది ఆత్మలున్నారు, ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఎటువంటి ప్లాన్ తయారు చేయండంటే, బాప్‌దాదా చూసినట్లుగా ఏ విధంగా విదేశాలలో ఆఫ్రికా వాళ్ళు కేవలం ప్లాన్ తయారుచేయమే కాదు, కానీ ప్రాక్టికల్‌గా అన్ని ఏరియాలు కవర్ చేసారు! మరి మీ వైపున చాలా ఏరియా ఉంది మరి ఎంతమంది సమయం సమాప్తమైతే వంచితమైపోతారు! కనుక కలిసి ఏదైనా ఇటువంటి ప్లాన్‌ను తయారు చేయండి.
చూడండి, బాప్‌దాదా పిల్లలందరికీ ఉత్సాహ ఉల్లాసాలు మరియు ధైర్యము యొక్క వరదానమును అందరికీ ఒకేలా ఇచ్చారు. ఒకరికి ఎక్కువగా, మరొకరికి తక్కువగా ఇవ్వలేదు. మరి ఎక్కడ ఉత్సాహ ఉల్లాసాలు ఉంటాయో, అక్కడ ధైర్యము ఉంటుంది, అక్కడ ఏమి చేయలేరు! అసంభవం కూడా సంభవం అవుతుంది.
ఇప్పుడు ఏమి చేయాలి అని అందరూ అడుగుతారు. ఇప్పుడు ఎక్కువగా తయారై ఉన్న స్టేజ్‌పైన అవకాశాలను తీసుకోవాలి అన్నది బాప్‌దాదా సంకల్పం. వారిని సహయోగిగా చేయండి మరియు మీరు సకాశ్ను ఇవ్వండి.
ఎందుకంటే బాప్‌దాదా ఏమి చూసారంటే స్నేహి, సహయోగి పిల్లలు ప్రతి జోన్లో యథాశక్తిగా ఉన్నారు, వారిని సేవకు సహయోగులుగా చేసుకోండి. వారికి కూడా ఉత్సాహ ఉల్లాసాల రెక్కలను ఇవ్వండి. నలువైపుల ఉన్నారు ఎందుకంటే బాప్‌దాదా పరిక్రమ చేస్తారు కదా! అప్పుడు పిల్లలను కూడా చూస్తారు మరియు స్నేహి-సహయోగి పిల్లలను కూడా చూస్తారు. బాప్‌దాదా దృష్టిలో అయితే ఉన్నారు కానీ అవకాశం ఇవ్వలేదు, ప్రాక్టికల్ అవకాశాన్ని తీసుకోలేదు. మరి ఈ సంవత్సరం వారిని నిమిత్తంగా చేయండి, స్నేహి-సహయోగులను ఉల్లాస ఉత్సాహాలలోకి తీసుకురండి. తీసుకు రావలసి ఉంటుంది. లేకపోతే ఇలా కూడా చేయవచ్చు అని మీరు చెప్పనే లేదని వారు మీకు ఫిర్యాదు చేస్తారు కనుక ఇప్పుడు ఛాన్స్‌ను ఇచ్చేవారిగా అవ్వండి. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- డబల్ విదేశీయులు మధుబనానికి విశేష అలంకారము అని బాప్‌దాదా సదా చెప్తూ ఉంటారు. ఎలా అయితే దేశము తన ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్తుందో అలాగే విదేశాలు కూడా తక్కువగా లేవు. కొద్ది సమయంలోనే విదేశాలలో కూడా విస్తారం మంచిగా జరిగింది. ఇప్పుడు విదేశాలు ఒకే బహుమతిని తీసుకోవాలి, ఏ బహుమతిని తీసుకోవాలో చెప్పమంటారా, ప్రత్యేకంగా డబల్ విదేశీయులకు? నలువైపుల స్వ మరియు సేవ యొక్క బ్యాలెన్స్ యొక్క బహుమతిని తీసుకోవాలి. ఇష్టమేనా? తీసుకుంటారా? చేతులెత్తండి. వెల్కమ్. అభినందనలు, ఇన్ అడ్వాన్స్ అభినందనలు.
అచ్ఛా. ఇప్పుడు బాప్‌దాదా చెప్పిన డ్రిల్ గుర్తుందా? రోజంతటిలో 5-5 నిమిషాలు అనేకసార్లు డ్రిల్ చేయాలి. చేశారా? డ్రిల్ చేసిన వారు చేతులెత్తండి. కొద్దిమందే చేతులెత్తారు. ఎందుకు? కొద్ది సమయమే చేశారా? ఎక్కువ సమయం చేయలేదా? ఇప్పుడేమి చేస్తారు? తక్కువలో తక్కువగా చెప్పనా, తక్కువలో తక్కువ కనీసం 8 సార్లు అయినా రోజంతటిలో చేయగలరా? చేయగలరా? ఇందులో చేతులెత్తండి. చేస్తారా? మంచిది. మరలా సీజన్ మొదలైనప్పుడు బాప్‌దాదా ఫలితాన్ని అడుగుతారు. ఆ తర్వాత ఒక విషయం చెప్తాను, ఇప్పుడు చెప్పను. తర్వాత చెప్తాను. మధువనం వారు చేస్తారు కదా? మొదటి నంబర్. ఈ సంవత్సరం లేదా ఈ సీజన్ నుండి మరలా సీజన్ వరకు చేయవలసిన హోమ్‌వర్క్ ఏమిటంటే తక్కువలో తక్కువ 8 సార్లు అయినా ఈ డ్రిల్‌ను తప్పక చేయాలి. తప్పక చేయాలి, చూస్తాం అనకండి, చేయాల్సిందే. ఒకసారి మిస్ అయినా కానీ తర్వాత గంటలో అనేకసార్లు చేసి దానిని పూర్తి చేయాలి, ఆ తర్వాత నిద్రపోండి. నిద్రపోవాల్సింది తర్వాత, ముందు డ్రిల్, 8 సార్లు పూర్తి చేసి ఆ తర్వాత నిద్రపోవాలి. సరేనా టీచర్స్? చాలామంచిది, టీచర్స్ యొక్క వాయుమండలం అంతటా స్వతహాగానే వ్యాపిస్తుంది.
ఈరోజు బాప్‌దాదా అందరినీ ఇలా చూడాలనుకుంటున్నారు, ఇప్పుడిప్పుడే చూడాలనుకుంటున్నారు కనుక ఇప్పుడు ఒక్క సెకనులో కంట్రోలింగ్ పవర్ మరియు రూలింగ్ పవర్ యొక్క సంస్కారాన్ని ప్రత్యక్షంలోకి తీసుకువచ్చి స్వరాజ్య సింహాసనంపై కూర్చోండి. రెండు మూడు నిముషాల కొరకు ఒక్క సెకనులో రాజ్యాధికారి స్థితిలో స్థితులైపోండి. మంచిది. (డ్రిల్)
నలువైపుల ఉన్న పిల్లల యొక్క ప్రియస్మృతుల ఉత్తరాలు మరియు వీటితోపాటు విజ్ఞాన సాధనాల ద్వారా పంపిన ప్రియస్మృతులు బాప్దాదాకి చెరుకున్నాయి. చాలామంది పిల్లలు తమ మనస్సు యొక్క సమాచారాన్ని కూడా వ్రాస్తున్నారు మరియు ఆత్మిక సంభాషణలో కూడా చెప్తున్నారు. బాప్‌దాదా అటువంటి పిల్లలందరికీ బదులు ఇస్తున్నారు - సత్యమైన మనస్సుకి యజమాని రాజీ. మనస్సుకి బాగా ప్రియమైన అటువంటి విశేష ఆత్మలకు బాప్‌దాదా యొక్క హృదయపూర్వక ఆశీర్వాదాలు. నలువైపుల ఉన్న వారు సమాచారం అంతా ఇస్తున్నారు వారందరికీ, అందరూ చాలా మంచి ఉత్సాహ ఉల్లాసాలతో ప్లాన్స్ ఎవరైతే తయారుచేశారో వారందరికి బాప్‌దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు మరియు ముందుకు వెళ్తూ ఉండండి, ముందుకు తీసుకు వెళ్తూ ఉండండి అని వరదానం కూడా ఇస్తున్నారు.
నలువైపుల ఉన్న బాప్‌దాదా యొక్క కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో కొద్దిమంది అయిన శ్రేష్ఠ భాగ్యవాన్ పిల్లలకు బాప్‌దాదా యొక్క విశేష ప్రియస్మృతులు. పిల్లలందరి ధైర్యం మరియు ఉత్సాహ ఉల్లాసాలకు శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఇక ముందు తీవ్రపురుషార్ధిగా అయ్యే, సమానత ఉంచుకునేటందుకు కోటానుకోట్ల, కోటానుకోట్ల రెట్లు ఆశీర్వాదాలను కూడా ఇస్తున్నారు. అందరి భాగ్యసితార సదా మెరుస్తూ ఉండాలి మరియు ఇతరుల భాగ్యాన్ని తయారుచేస్తూ ఉండాలి అని ఆశీర్వదిస్తున్నారు. నలువైపుల ఉన్న పిల్లలు తమ తమ స్థానాలలో వింటున్నారు మరియు చూస్తున్నారు కూడా, దూరంగా కూర్చున్న పిల్లలందరిని బాప్‌దాదా చూసి సంతోషిస్తున్నారు. చూస్తూ ఉండండి, మధువనం యొక్క శోభను సదా పెంచండి. పిల్లలందరికీ మనస్పూర్వక ఆశీర్వాదాలతో పాటు నమస్తే.
దాదీ జానకిగారు అందరికీ అహ్మదాబాద్ ఆసుపత్రి నుండి ప్రియస్మృతులను పంపారు.
దాదీ రతన్మోహినిగారు:- మనమందరం ఇంత సమయం శాంతిపూర్వకమైన బాబా చెప్పిన మంచి మంచి మాటలను విన్నాము. ఇప్పుడు మనం ఏదైతే విన్నామో దానిని మన లోపల మననము చేయాలి మరియు మననము చేస్తూ మన అడుగులను ముందుకు వేస్తూ ఉండాలి. బాబా అయితే మనందరికీ చాలా చక్కని శిక్షణలు ఇచ్చారు, ఆ శిక్షణలను మనం మరింతగా మనలో మననం చేసుకుంటూ స్వయంలో ఆ శక్తిని జాగృతి చేసుకుని అందరికీ సుఖాన్ని ఇస్తూ ఉండాలి. ఏదైతే బాబా చెప్పారో ఆ విషయాలను మన జీవితంలో ధారణ చేసుకుంటూ అందరికీ బాబా సందేశాన్ని అందిస్తూ ఉందాము.
*** ఓంశాంతి ***
