‘‘భగవంతుని భాగ్యశాలి పిల్లల లక్షణాలు’’
బాప్‌దాదా పిల్లలందరి మస్తకంపై ఉన్న భాగ్య రేఖలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంపై భాగ్యరేఖలు గీయబడి ఉన్నాయి. కానీ కొంతమంది పిల్లల భాగ్యరేఖలు స్పష్టంగా ఉన్నాయి. కొంతమంది రేఖలు స్పష్టంగా లేవు. తండ్రి అయిన భగవంతుని పిల్లలుగా అయినప్పటి నుండి భాగ్యరేఖలను చూస్తున్నారు. భగవంతుడంటే భాగ్యవిధాత. భగవంతుడంటే దాత, విధాత. అందువలన వారి పిల్లలుగా అయినంతనే భాగ్యానికి అధికారులు అనగా వారసత్వము పిల్లలందరికీ అవశ్యం ప్రాప్తిస్తుంది. అయితే లభించిన ఆ వారసత్వాన్ని జీవితంలో ధారణ చేయడం, సేవలో ఉపయోగించి శ్రేష్ఠంగా చేసుకోవడం, స్పష్టంగా చేసుకోవడం ఇందులో నంబరువారుగా ఉన్నారు. ఎందుకంటే ఈ భాగ్యాన్ని ఎంతగా స్వయం పట్ల లేక సేవ పట్ల కార్యములో ఉపయోగిస్తారో అంత వృద్ధి చెందుతుంది అనగా రేఖలు స్పష్టమవుతాయి. తండ్రి ఒక్కరే, వారు ఇచ్చేది కూడా అందరికీ ఒకే విధంగా ఇస్తారు. తండ్రి భాగ్యాన్ని నంబరువారుగా పంచరు. కానీ భాగ్యాన్ని తయారు చేసుకునేవారు ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవడంలో యథాశక్తిగా అయిన కారణంగా నంబరువారుగా అయిపోతారు. అందువలన కొంతమంది రేఖలు స్పష్టంగా ఉన్నాయి. కొంతమంది రేఖలు స్పష్టంగా లేవు. స్పష్టమైన రేఖలు గల పిల్లలు స్వయం కూడా ప్రతి కర్మలో తమను తాము భాగ్యశాలురమని అనుభవం చేస్తారు. దానితో పాటు వారి ముఖము ద్వారా, నడవడిక ద్వారా భాగ్యము ఇతరులకు కూడా అనుభవమవుతుంది. అంతేకాక ఇటువంటి భాగ్యశాలి పిల్లలను చూసి వీరు గొప్ప భాగ్యశాలి ఆత్మలని అనుకుంటారు, అంటారు. వీరి భాగ్యము సదా శ్రేష్ఠమైనది. ప్రతి కర్మలో మిమ్ములను మీరు భగవంతుని భాగ్యశాలి పిల్లలమని అనుభవం చేస్తున్నారా అని ప్రశ్నించుకోండి. భాగ్యము మీ వారసత్వము. వారసత్వము ప్రాప్తి అవ్వకుండా ఉండడం ఎప్పుడూ ఉండజాలదు. భాగ్యాన్ని వారసత్వ రూపంలో అనుభవం చేస్తున్నారా? లేక శ్రమ చేయాల్సి వస్తోందా? వారసత్వము సులభంగా ప్రాప్తిస్తుంది. శ్రమ ఉండదు. లౌకికంలో కూడా తండ్రి ఖజానాలపై, ఆస్తులపై పిల్లలకు స్వతహాగా అధికారముంటుంది. అంతేకాక తండ్రి వారసత్వము లభించిందనే నషా ఉంటుంది. ఇటువంటి భాగ్య నషా ఉందా లేక నషా ఎక్కుతూ, దిగుతూ ఉంటుందా? ఇది అవినాశి వారసత్వము కనుక ఎంత నషా ఉండాలి! ఒక జన్మకే కాదు, అనేక జన్మల భాగ్యము జన్మ సిద్ధ అధికారంగా లభించిందని నషాతో వర్ణన చేస్తారు. సదా ఈ భాగ్య మెరుపు ప్రత్యక్ష రూపంలో ఇతరులకు కనిపించాలి. మెరుపు మరియు ఉత్సాహము రెండూ ఉన్నాయా? మర్జ్ రూపంలో ఉన్నాయా? ఇమర్జ్ రూపంలో ఉన్నాయా? భాగ్యశాలి ఆత్మల గుర్తులు - వారు సదా ఒడిలో పాలింపబడ్తారు. తివాచీలపై నడుస్తారు, ఊయలలో ఊగుతారు. మట్టిలో కాలు పెట్టరు. వారి కాళ్లు ఎప్పుడూ మైల పడవు. ప్రపంచంలోని వారు తివాచీలపై నడుస్తారు, మీరు బుద్ధి రూపి కాళ్లతో సదా నేలపై కాక ఫరిశ్తాల ప్రపంచంలో ఉంటారు. ఈ పాత మట్టి ప్రపంచంలో బుద్ధి రూపి కాలు మోపరు అనగా బుద్ధిని మురికిగా చేసుకోరు. భాగ్యశాలురు మట్టి బొమ్మలతో ఆడుకోరు. సదా రత్నాలతో ఆడుకుంటారు. భాగ్యశాలురు సదా సంపన్నంగా ఉంటారు. అందువలన ఇచ్ఛా మాత్రమ్ అవిద్యా స్థితిలో ఉంటారు. భాగ్యశాలి ఆత్మలు సదా మహాదాని పుణ్యాత్మలుగా అయి ఇతరుల భాగ్యాన్ని కూడా తయారుచేస్తూ ఉంటారు. భాగ్యశాలి ఆత్మలు సదా కిరీటము, సింహాసనము, తిలకధారులుగా ఉంటారు. భాగ్యశాలి ఆత్మలు భాగ్యానికి ఎంత అధికారులుగా ఉంటారో అంత త్యాగధారి ఆత్మలుగా ఉంటారు. భాగ్యానికి గుర్తు త్యాగము. త్యాగము భాగ్యాన్ని స్పష్టము చేస్తుంది. భాగ్యశాలి ఆత్మలు సదా భగవంతుని సమానంగా నిరాకారి, నిరహంకారి, నిర్వికారి - ఈ మూడు విశేషతలతో నిండుగా ఉంటారు. ఈ గుర్తులన్నీ స్వయంలో అనుభవం చేస్తున్నారా? భాగ్యశాలుర లిస్టులో అయితే ఉండనే ఉన్నారు కదా. అయితే యథాశక్తిగా ఉన్నారా లేక సర్వశక్తివంతంగా ఉన్నారా? మాస్టర్‌గా ఉన్నారు కదా. తండ్రిని ఎప్పుడూ యథాశక్తివాన్ లేక నంబరువార్ అని అనరు. సదా సర్వశక్తివంతుడు అనే అంటారు. మీరు మాస్టర్ సర్వశక్తివంతులు. యథాశక్తి ఎందుకు? సదా శక్తివంతులు. యథా అనే శబ్దాన్ని మార్చి సదా శక్తివంతులుగా అవ్వండి, ఇతరులను కూడా చేయండి. అర్థమయిందా!
ఏ జోన్ వారు వచ్చారు? అందరూ వరదాన భూమిలోకి వచ్చి వరదానాలతో జోలె నింపుకుంటున్నారు కదా. వరదాన భూమిలో ఒక్కొక్కరి చరిత్రలో, కర్మలో విశేష వరదానాలు నిండి ఉన్నాయి. యజ్ఞ భూమిలోకి వచ్చి కూరగాయలు తరిగినా, ధాన్యము శుభ్రము చేసినా అందులో కూడా యజ్ఞ సేవ వరదానాలు నిండి ఉన్నాయి. ఎలాగైతే యాత్రకు వెళ్లినప్పుడు మందిరాన్ని శుభ్రపరచడం కూడా ఒక పెద్ద పుణ్యంగా భావిస్తారో అలా ఈ మహా తీర్థ స్థానము లేక వరదాన భూమిలో చేసే ప్రతి కర్మలో, ప్రతి అడుగులో వరదానాలే వరదానాలు నిండి ఉన్నాయి. జోలెలో ఎంత భాగము నింపుకున్నారు? జోలెను పూర్తిగా నింపుకుని వెళ్తారా లేక యథాశక్తి నింపుకుంటారా? ఎవరు ఎక్కడ నుండి వచ్చినా మేళా జరుపుకునేందుకే వచ్చారు. మధువనంలో ఒక సంకల్పము గానీ, ఒక సెకండు గానీ వ్యర్థంగా పోరాదు. సమర్థంగా అయ్యే ఈ అభ్యాసము మీ స్థానములో కూడా సహయోగం చేస్తుంది. చదువు మరియు పరివారము - చదువులోని లాభము కూడా తీసుకోండి, పరివారములో విశేషమైన అనుభవం కూడా చేయండి. అర్థమయిందా.
బాప్‌దాదా అన్ని జోన్ల వారికి సదా వరదానులుగా, మహాదానులుగా అయినందుకు అభినందనలు తెలుపుతున్నారు. జనుల ఉత్సవము సమాప్తమయింది కానీ మీ ఉత్సాహము నిండిన ఉత్సవము సదా ఉంటుంది. మీది సదా పండగ రోజే. అందువలన ప్రతి రోజూ మీకు శుభాకాంక్షలే శుభాకాంక్షలు. మహారాష్ట్ర సదా మహాన్‌గా అయి మహాన్‌గా చేసే వరదానాలతో జోలెను నింపేవారు. కర్ణాటక వారు సదా తమ హర్షితముఖము ద్వారా స్వయం కూడా సదా హర్షితంగా ఉండి, ఇతరులను కూడా హర్షితంగా చేసి జోలెను నింపుతూ ఉండేవారు. యు.పి వారు ఏం చేస్తారు? సదా శీతలంగా ఉండే నదుల సమానంగా శీతలతా వరదానమునిచ్చి శీతలా దేవీలుగా అయి అందరినీ శీతలా దేవీలుగా చేయండి. శీతలత ద్వారా సదా సర్వుల అన్ని విధాలైన దుఃఖాలను దూరం చేయండి. అటువంటి వరదానాలతో జోలెను నింపండి. అచ్ఛా.
సదా స్పష్టమైన శ్రేష్ఠ భాగ్యరేఖలు కలవారు, సదా తండ్రి సమానంగా సర్వ శక్తులతో సంపన్న, సంపూర్ణ స్థితిలో స్థితమై ఉండేవారు, సదా ఈశ్వరీయ మెరుపు మరియు భాగ్య నషాలో ఉండేవారు, ప్రతి కర్మ ద్వారా భాగ్యవంతులై భాగ్య వారసత్వమును ఇప్పించే మాస్టర్ భాగ్యవంతులు, శ్రేష్ఠ భాగ్యవాన్ పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో అవ్యక్త బాప్‌దాదా మిలనము:-
కుమారులతో:-
1. కుమారులు అనగా నిర్బంధనులు. అన్నిటికంటే పెద్ద బంధనము మానసిక వ్యర్థ సంకల్పాల బంధనము. ఇందులో కూడా నిర్బంధనులు. అప్పుడప్పుడు ఈ బంధనము బంధించడం లేదు కదా? ఎందుకంటే సంకల్పశక్తి ప్రతి అడుగులో సంపాదన చేసేందుకు ఆధారము. స్మృతియాత్ర ఏ ఆధారముతో చేస్తారు? సంకల్పశక్తి ఆధారముతో బాబా వద్దకు చేరుకుంటారు కదా! అశరీరిగా అయి వెళ్తారు. కనుక మానసిక శక్తి విశేషమైనది. వ్యర్థ సంకల్పాలు మానసిక శక్తిని బలహీనపరుస్తాయి. అందువలన ఈ బంధనము నుండి ముక్తులవ్వండి. కుమారులు అనగా సదా తీవ్ర పురుషార్థులు. ఎందుకంటే నిర్బంధనులుగా ఉండేవారి వేగం స్వతహాగానే తీవ్రంగా ఉంటుంది. బరువుగా ఉండేవారు నెమ్మదిగా నడుస్తారు. తేలికగా ఉండేవారు సదా తీవ్ర వేగంతో నడుస్తారు. ఇప్పుడు సమయానుసారము పురుషార్థము చేసే సమయం గడిచిపోయింది. ఇప్పుడు తీవ్ర పురుషార్థులుగా అయి గమ్యానికి చేరుకోవాలి.
2. కుమారులు పాత వ్యర్థ ఖాతాను సమాప్తం చేసుకున్నారా? కొత్త ఖాతా సమర్థమైనది, పాత ఖాతా వ్యర్థమైనది. కనుక పాత ఖాతా సమాప్తమైపోయింది. అక్కడ కూడా వ్యవహారములో ఎప్పుడూ పాత ఖాతాను ఉంచుకోరు. పాతదానిని సమాప్తం చేసి కొత్త ఖాతాను పెంచుకుంటూ ఉంటారు. కనుక ఇక్కడ కూడా పాత ఖాతాలను సమాప్తం చేసి సదా కొత్తగా, ప్రతి అడుగులో సమర్థంగా ఉండాలి. ప్రతి సంకల్పము సమర్థంగా ఉండాలి. తండ్రి ఎలా ఉన్నారో పిల్లలు అలా ఉండాలి. తండ్రి సమర్థులు కనుక పిల్లలు కూడా తండ్రిని అనుసరించి సమర్థంగా అవుతారు.
మాతలతో:-
1. మాతలు ఏ గుణములో విశేషమైన అనుభవీలు? ఆ విశేష గుణమేది? (త్యాగము, సహనశీలత). ఇంకా ఏదైనా గుణముందా? మాతల స్వరూపము విశేషంగా దయాస్వరూపము. మాతలు దయాహృదయులు. బేహద్ మాతలైన మీకు బేహద్ ఆత్మల పట్ల దయ కలుగుతుందా? దయ కలిగినప్పుడు ఏం చేస్తారు? ఎవరైతే దయాహృదయులుగా ఉంటారో వారు సేవ లేకుండా ఉండలేరు. దయాహృదయులుగా అయినప్పుడు అనేక ఆత్మల కళ్యాణము జరగనే జరుగుతుంది. అందువలన మాతలను కళ్యాణి అని కూడా అంటారు. కళ్యాణి అనగా కళ్యాణం చేసేవారు. ఎలాగైతే తండ్రిని విశ్వకళ్యాణకారి అని అంటారో అలా మాతలకు విశేషంగా తండ్రి సమానంగా ‘కళ్యాణి’ అనే టైటిల్ లభించింది. ఇలా ఉత్సాహం ఉంటుందా? ఎలా ఉండేవారు ఎలా అయ్యారు? స్వ పరివర్తన ద్వారా ఇతరులకు కూడా ఉల్లాస-ఉత్సాహాలు వస్తాయి. హద్దు మరియు బేహద్ సేవల బ్యాలెన్స్ ఉందా? ఆ సేవలో అయితే లెక్కాచారము తీరుతుంది. అది హద్దు సేవ. మీరు బేహద్ సేవాధారులు. స్వయంలో సేవ చేయాలనే ఉల్లాస-ఉత్సాహాలు ఎంత ఉంటాయో అంత సఫలత లభిస్తుంది.
2. మాతలు తమ త్యాగము మరియు తపస్సు ద్వారా విశ్వకళ్యాణము చేసేందుకు నిమిత్తంగా అయి ఉన్నారు. మాతలలో త్యాగము మరియు తపస్సుల విశేషత ఉంది. ఈ రెండు విశేషతల ద్వారా సేవకు నిమిత్తంగా అయి ఇతరులను కూడా తండ్రికి చెందినవారిగా చేయడంలో బిజీగా ఉంటున్నారా? సంగమయుగ బ్రాహ్మణుల పనే - సేవ చేయడం. బ్రాహ్మణులు సేవ లేకుండా ఉండలేరు. ఎలాగైతే నామధారి బ్రాహ్మణులు తప్పకుండా కథలు చెప్తారు కనుక ఇక్కడ కూడా కథ చెప్పడం అనగా సేవ చేయడం. కనుక జగన్మాతలుగా అయి జగత్తు కొరకు ఆలోచించండి. అనంతమైన పిల్లల కొరకు ఆలోచించండి. కేవలం ఇంట్లోనే కూర్చోకండి. బేహద్ సేవాధారులుగా అయి సదా ముందుకు వెళ్తూ ఉండండి. హద్దులో 63 జన్మలు గడిచాయి. ఇప్పుడు బేహద్ సేవలో ముందుకు వెళ్లండి.
*** ఓంశాంతి ***
