‘‘స్వదర్శన చక్రము ద్వారా విజయ చక్ర పాప్తి’’
ఈరోజు ఆత్మిక సేనాపతి అయిన బాప్‌దాదా తమ ఆత్మిక సైన్యాన్ని చూస్తున్నారు. ఈ ఆత్మిక సైన్యములో ఎటువంటి ఎటువంటి మహావీరులున్నారో, ఏ ఏ శక్తిశాలి శస్త్రాలను ధారణ చేసారో గమనిస్తున్నారు. ఎలాగైతే దేహ సంబంధమైన శస్త్రధారులు రోజురోజుకూ అతి సూక్ష్మమైన మరియు తీవ్రగతి గల శక్తి సంపన్నమైన సాధనాలను తయారు చేస్తూ ఉంటారో అలాగే ఆత్మిక సైన్యము అతి సూక్ష్మమైన శక్తిశాలి శస్త్రధారులుగా అయ్యారా? ఎలాగైతే వినాశకారి ఆత్మలు ఒకే స్థానంలో కూర్చుని ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నవాటిని వినాశకారి కిరణాల ద్వారా వినాశనం చేసేందుకు సాధనాలను తయారుచేశారు. వారు అక్కడకు వెళ్ళవలసిన అవసరము లేకుండా దూరంగా కూర్చుని గురి పెట్టగలరు. అలాగే ఆత్మిక సైన్యము స్థాపన చేసే సైన్యము. వారు వినాశకారులు, మీరు స్థాపన చేసేవారు. వారు వినాశనం చేసే ప్రణాళికలను ఆలోచిస్తారు. మీరు క్రొత్త రచన రచించేందుకు, విశ్వాన్ని పరివర్తన చేసేందుకు ప్లాన్లు ఆలోచిస్తారు. స్థాపన చేసే సైన్యం ఇటువంటి తీవ్రగతి గల ఆత్మిక సాధనాలను ధారణ చేసిందా? ఒకే స్థానంలో కూర్చుని ఉంటూ ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఆత్మిక స్మృతి యొక్క కిరణాల ద్వారా ఏ ఆత్మనైనా టచ్ చేయగలరు. ఇంత తీవ్రగతితో సేవ చేసేందుకు మీ వద్ద పరివర్తన చేసే శక్తి తయారుగా ఉందా? జ్ఞానము అనగా శక్తి అందరికీ లభిస్తుంది కదా! జ్ఞానశక్తి ద్వారా ఇటువంటి శక్తిశాలి శస్త్రధారులుగా అయ్యారా! మహావీరులుగా అయ్యారా లేక కేవలం వీరులుగా అయ్యారా? విజయచక్రాన్ని పొందారా? దేహ సంబంధమైన సైన్యానికి అనేక రకాల చక్రాలు కానుకలుగా లభిస్తాయి. మీ అందరికీ సఫలతకు కానుకగా విజయ చక్రము లభించిందా? విజయము లభించే ఉంది. అటువంటి నిశ్చయబుద్ధి గల మహావీరులైన ఆత్మలు విజయ చక్రానికి అధికారులుగా ఉన్నారు.
ఎవరికి విజయ చక్రము లభించిందో బాప్‌దాదా చూస్తున్నారు. స్వదర్శన చక్రము ద్వారా విజయ చక్రమును పొందుతారు. అందరూ శస్త్రధారులుగా అయితే అయ్యారు కదా! ఈ ఆత్మిక శస్త్రాల స్మృతిచిహ్నాన్ని స్థూల రూపంలో మీ స్మృతిచిహ్న చిత్రాలలో చూపించారు. దేవీల చిత్రాలలో శస్త్రధారులుగా చూపిస్తారు కదా! పాండవులను కూడా శస్త్రధారులుగా చూపిస్తారు కదా! ఈ ఆత్మిక శస్త్రాలు అనగా ఆత్మిక శక్తులను స్థూల శస్త్రాల రూపంలో చూపించారు. నిజానికి పిల్లలందరికీ బాప్‌దాదా ద్వారా ఒకే సమయంలో ఒకే విధమైన జ్ఞాన శక్తి ప్రాప్తిస్తుంది. వేరు వేరుగా ఇవ్వరు. అయినా నెంబరువారీగా ఎందుకవుతారు? బాప్‌దాదా ఎప్పుడైనా ఎవరినైనా వేరుగా చదివించారా? చదువైతే కలిపే చదివిస్తారు కదా! అందరికీ ఒకే చదువును చదివిస్తారు కదా! లేక ఒక గ్రూపుకు ఒక విధంగా, మరొక గ్రూపుకు ఇంకొక విధంగా చదివిస్తారా?
ఇక్కడ 6 మాసాల విద్యార్థి అయినా 50 సంవత్సరాల విద్యార్థి అయినా ఒకే క్లాసులో కూర్చుంటారు. వేరు వేరుగా కూర్చుంటారా? బాప్‌దాదా ఒకే సమయంలో, ఒకే చదువును అందరినీ కలిపే చదివిస్తారు. ఒకవేళ ఎవరైనా వెనుక వచ్చినా ఇంతకు ముందు ఏ చదువు అయితే జరిగిపోయిందో అదే చదువును మీరందరూ ఇప్పుడు కూడా చదివిస్తూ ఉంటారు. రివైజ్ కోర్సు ఏదైతే జరగుతూ ఉందో దానినే - మీరు కూడా చదువుతున్నారా? లేక పాతవారి కోర్సు వేరుగా, మీది వేరుగా ఉందా? కోర్సు అయితే ఒక్కటే కదా! 40 సంవత్సరాల వారికి ఒక మురళి, 6 మాసాల వారికి ఇంకొక మురళి అయితే లేదు కదా? మురళి ఒక్కటే కదా! చదువు ఒక్కటే, చదివించేవారూ ఒక్కరే. అయినా నెంబరువారీగా ఎందుకవుతారు? లేక అందరూ నెంబర్‌వన్‌గా ఉన్నారా? నెంబరు ఎందుకు తయారవుతుంది? ఎందుకంటే చదువును అందరూ చదువుతున్నారు కానీ చదువు చదువుకోవడం అనగా జ్ఞానములోని ఒక్కొక్క విషయాన్ని శస్త్రము లేక శక్తి రూపంలో ధారణ చేయడంలో మరియు జ్ఞాన విషయాలను పాయింట్ల రూపంలో ధారణ చేయడంలో తేడా ఏర్పడ్తుంది. కొందరు విని కేవలం పాయింట్ రూపంలో బుద్ధిలో ధారణ చేస్తారు అంతేకాక ఆ ధారణ చేసిన పాయింట్లను చాలా బాగా వర్ణన కూడా చేస్తారు. భాషణ(ఉపన్యాసం) చేయడంలో, కోర్సు ఇవ్వడంలో, మెజారిటీ చురుకుగా ఉన్నారు. బాప్‌దాదా కూడా పిల్లలు భాషణ చేసే, కోర్సు చేయించే విధానాన్ని చూసి సంతోషిస్తారు. కొందరు పిల్లలైతే బాప్‌దాదా కంటే బాగా ఉపన్యసిస్తారు. పాయింట్లను కూడా చాలా బాగా వర్ణన చేస్తారు. కానీ జ్ఞానాన్ని పాయింట్ల రూపములో ధారణ చేయడం మరియు జ్ఞానములోని ఒక్కొక్క విషయాన్ని శక్తి రూపములో ధారణ చేయడంలో తేడా ఏర్పడ్తుంది. ఉదాహరణకు, డ్రామా పాయింటును తీసుకోండి. ఇది చాలా పెద్ద విజయాన్ని ఇచ్చే శక్తిశాలి శస్త్రము. ఎవరికైతే ప్రత్యక్ష జీవితంలో డ్రామా జ్ఞాన శక్తి ధారణ అయి ఉంటుందో వారెప్పుడూ అలజడిలోకి రాజాలరు. సదా ఏకరసంగా, అచలంగా, స్థిరంగా తయారై ఇతరులను తయారు చేసేందుకు ఈ డ్రామా పాయింటే విశేషమైన శక్తి. దీనిని శక్తి రూపములో ధారణ చేసేవారెప్పుడూ ఓటమిని చవిచూడజాలరు. కానీ ఎవరైతే కేవలం పాయింట్ రూపంలో ధారణ చేస్తారో వారేం చేస్తారు? వారు డ్రామా పాయింటును వర్ణన కూడా చేస్తారు, అలజడిలోకి కూడా వస్తున్నారు, ఇంకొక వైపు డ్రామా పాయింటును కూడా చెప్తూ ఉన్నారు. అప్పుడప్పుడు కనుల నుండి కన్నీరు కూడా కారుస్తూ ఉంటారు. ఏమయిందో తెలియదు, ఇదేమిటో తెలియదు అని కూడా అంటూ ఉంటారు. మళ్ళీ ఇంకొక వైపు డ్రామా పాయింటును కూడా వల్లె వేస్తూ ఉంటారు. విజయులుగా అయితే అవ్వాల్సిందే, నేను విజయీ రత్నాన్నే, డ్రామా కూడా గుర్తుంది కానీ ఇలా ఎందుకు జరిగిందో తెలియదని అంటారు.
