‘‘తనువు, మనసుల అలసటను తొలగించుకునేందుకు సాధనము – “శక్తిశాలీ స్మృతి”
తమ సత్యమైన ఆజ్ఞాకారి పిల్లలకు సేవలో సదా రిఫ్రెష్ అయి ఉండే యుక్తులను తెలియజేస్తూ అవ్యక్త బాప్‌దాదా ఉచ్ఛరించిన మహావాక్యాలు -
ఈరోజు పరదేశి అయిన బాబా తమ అనాది దేశవాసులను మరియు సేవ కొరకు విదేశీయులైన ఆది దేశవాసులను, ఇటువంటి పిల్లలందరినీ కలిసేందుకు వచ్చారు. వీరే నా అతి ప్రియమైన అల్లారు ముద్దు పిల్లలు అన్న సంగతి బాప్‌దాదాకు తెలుసు, అనాది దేశమైన పరంధామ నివాసులు. అలాగే సృష్టి ఆదిలో ఈ భారత భూమిలో సత్యయుగమైన స్వదేశము ఉండింది, మీ రాజ్యముగా ఉండింది, దానినే అందరూ భారతదేశము అని అంటారు, కనుక ఆదిలో ఈ భారతదేశ వాసులుగా ఉన్నారు. ఈ భారత భూమిలోనే బ్రహ్మా బాబాతోపాటు రాజ్యము చేసారు. అనేక జన్మలు మీ రాజ్యములో సుఖ శాంతి సంపన్నమైన అనేక జీవితాలను గడిపారు కనుక ఆది దేశవాసులైన కారణంగా భారత భూమిపై మనస్ఫూర్వక స్నేహము ఉంది. ఇప్పుడు అంతిమములో భారతదేశము ఎంతో పేదదిగా, నిరర్థకముగా అయిపోయినాగానీ మన దేశము మన దేశమే అవుతుంది. మీ అందరి ఆత్మల దేశము ఏది మరియు శరీరధారీ దేవతా జీవితము గడిపిన దేశము ఏది? భారతదేశమే ఉండింది కదా. ఎన్ని జన్మలు భారత భూమిలో ఉన్నారు అన్నది గుర్తుందా? అందరూ బాబా నుండి 21 జన్మల వారసత్వాన్ని ప్రాప్తి చేసుకున్నారు, కనుక 21 జన్మలకైతే తప్పకుండా గ్యారంటీ ఉండనే ఉంది. తరువాత కూడా ప్రతి ఆత్మ యొక్క అనేక జన్మలు భారత భూమిలోనే ఉన్నాయి ఎందుకంటే ఎవరైతే బ్రహ్మా బాబాకు సమీప ఆత్మలో, సమానులుగా అయ్యే ఆత్మలో, వారు బ్రహ్మా బాబాతోపాటుగా మీరే పూజ్యులు-మీరే పూజారులు అన్న పాత్రను కూడా పోషిస్తారు. ద్వాపర యుగములోని మొదటి భక్తులుగా బ్రాహ్మణులైన మీరే తయారవుతారు. నూతన స్వర్గములో ఈ దేశ వాసులుగా ఉండేవారు మరియు అనేకసార్లు భారత భూమి దేశవాసులు. కనుక బ్రాహ్మణుల అలౌకిక ప్రపంచమైన ‘మధువనము’పై చాలా ప్రేమ ఉంటుంది. ఈ మధువనము బ్రాహ్మణుల చిన్నపాటి ప్రపంచము. ఈ ప్రపంచము చాలా మంచిగా అనిపిస్తుంది కదా! ఇక్కడినుండి వెళ్ళటానికి ఇష్టమనిపించదు కదా. మధువన నివాసులుగా అవ్వండి అని ఈ క్షణమే ఆర్డర్ చేసినట్లయితే, సంతోషపడిపోతారు కదా. లేకపోతే అక్కడ సేవ ఎవరు చేస్తారు? సేవ కొరకు వెళ్ళాల్సే వస్తుంది అన్న ఆలోచన వస్తుందా? ఇక్కడ కూర్చోండి అని బాప్‌దాదా అంటే కూడా సేవ గుర్తొస్తుందా? సేవ చేయించేవారు ఎవరు? బాబా డైరెక్షన్ ఏదో, శ్రీమతము ఏదో దానిని ఆ రూపములోనే పాలన చెయ్యటము - సత్యమైన ఆజ్ఞాకారీ సంతానము అని వీరినే అంటాము. మధువనములో కూర్చోబెట్టాలా లేక సేవ కొరకు పంపించాలా అన్నది బాప్‌దాదాకు తెలుసు. బ్రాహ్మణ పిల్లలు ప్రతి విషయంలో ఎవరెడీగా ఉండాలి. ఇప్పటికిప్పుడు ఏ డైరెక్షన్ లభిస్తే ఆ డైరెక్షన్లో ఎవరెడీగా ఉండాలి. సంకల్పమాత్రము కూడా మన్మతము కలవకూడదు, శ్రీమతముపై నడిచే శ్రేష్ఠ ఆత్మ అని వీరిని అంటాము.
సేవకు బాధ్యులు బాప్‌దాదా అన్నదైతే తెలుసు కదా! లేక మీరా? ఈ బాధ్యత నుండైతే మీరు తేలికైపోయారు కదా, లేక బాధ్యత గురించి కాస్త-కాస్త బరువు ఉందా? ఇంత పెద్ద ప్రోగ్రాం చెయ్యాలి, ఇది చెయ్యాలి - భారంగానైతే భావించటం లేదు కదా! చేయించేవారు చేయిస్తున్నారు. చేయించేవారు ఒక్క బాబాయే. ఎవరి బుద్ధినైనా టచ్ చేసి విశ్వ కార్యమును చేయిస్తూ ఉన్నారు మరియు చేయిస్తూ ఉంటారు. ఎవరు చేస్తే వారు పొందుతారు అని పిల్లలను కేవలము నిమిత్తులుగా తయారుచేస్తారు. పొందేవారు పిల్లలు, బాబా పొందరు. ప్రాలబ్ధాన్ని పొందటము లేక సేవ ఫలాన్ని అనుభవించడము - ఇది ఆత్మల పని, కనుక పిల్లలను నిమిత్తులుగా తయారుచేస్తారు. సాకార రూపములో కూడా సేవ చేయించే కార్యమును చూసారు మరియు ఇప్పుడు అవ్యక్త రూపములో కూడా చేయించే బాబా అవ్యక్త బ్రహ్మా ద్వారా కూడా ఎలా సేవ చేయిస్తున్నారు అన్నదానిని కూడా చూస్తున్నారు. అవ్యక్త సేవ యొక్క గతి చాలా వేగంగా ఉంటుంది. చేయించేవారు చేయిస్తున్నారు, మీరు తోలుబొమ్మల్లా అయ్యి నాట్యము చేస్తున్నారు. ఈ సేవ కూడా ఒక ఆట వంటిది. చేయించేవారు చేయిస్తున్నారు, మీరు నిమిత్తంగా అయ్యి ఒక్క అడుగుకు పదమాలరెట్లుగా ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటున్నారు. మరి భారము ఎవరిపై ఉంది? చేయించేవారి పైనా లేక చేసేవారి పైనా? ఇది భారము కాదు అన్నది బాబాకు తెలుసు. మీరు భారము అంటారు కాబట్టి బాబా కూడా భారము అనే పదాన్ని వాడుతారు. బాబాకైతే అన్నీ జరిగే ఉన్నాయి. కేవలము ఒక గీత గీసినట్లు, గీత గియ్యటం ఏమైనా పెద్ద విషయంగా అనిపిస్తుందా? కనుక బాబా ఇలా సేవ చేయిస్తారు. సేవ చెయ్యటం కూడా ఎంత సహజమంటే అది ఒక గీత గియ్యటం లాంటిది. రిపీట్ చేస్తున్నారు, నిమిత్తంగా ఆట ఆడుతున్నారు.
ఎలా అయితే మాయ విఘ్నము ఆట వంటిదో, అలా సేవ కూడా కష్టమైనది కాదు, ఆట వంటిది - ఇలా భావించటం వలన సేవలో సదా ఉత్సాహాన్ని, తాజాదనాన్ని అనుభవము చేస్తారు. ఎవరైనా ఎందుకు ఆడుతారు? అలసిపోయేందుకు కాకుండా, ఉత్సాహం పొందేందుకు ఆడుతారు. ఎంత పెద్ద కార్యమైనాగానీ ఆట ఆడి రిఫ్రెష్ అయినట్లుగా అనుభవము చేస్తారు. ఆట ఎంత అలసిపోయేలా చేసేదైనాగానీ ఆటగా భావించటం వలన అలసట ఉండదు ఎందుకంటే మీ మనసుకు ఇష్టమనిపించి ఆడటం జరుగుతుంది. ఆటలో ఎంత కష్టమైన పని చెయ్యాల్సి వచ్చినాగానీ అది కూడా మనోరంజనంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీ మనసుతో చేస్తారు. కానీ ఏదైనా లౌకిక కార్యము భారంలా ఉంటుంది, నిర్వహించేందుకు చెయ్యాల్సి వస్తుంది. డ్యూటీగా భావించి చేస్తారు, కనుక కష్టమనిపిస్తుంది. శారీరిక శ్రమతో కూడుకున్న పని అయినా లేక మానసిక శ్రమతో కూడుకున్న పని అయినాగానీ డ్యూటీగా భావించి చెయ్యటం వలన అలసటను అనుభవము చేస్తారు ఎందుకంటే దానిని మానసిక సంతోషంతో చెయ్యరు, ఎవరైతే తమ మనసులో ఉల్లాసంతో, సంతోషంతో పనిని చెయ్యటం జరుగుతుందో, వారిలో అలసట ఉండదు, భారము అనుభవమవ్వదు. అక్కడక్కడ పిల్లలకు సేవ లెక్కలో ఎక్కువ పనులు కూడా వస్తుంటాయి, అందువలన కూడా అప్పుడప్పుడు అలసట అనుభవమవుతుంది. చాలామంది పిల్లలు అలసిపోకుండా సేవ చేస్తూ ఉల్లాస-ఉత్సాహాలలో కూడా ఉంటారు అన్నది బాప్‌దాదా చూసారు. అయినా కూడా ధైర్యాన్ని పెట్టి ఉన్నతి చెందుతున్నారు అన్నది చూసి బాప్‌దాదా సంతోషిస్తారు కూడా. అయినాకూడా బుద్ధిని తప్పకుండా ఎల్లప్పుడు తేలికగా పెట్టుకోండి.
బాప్‌దాదా పిల్లల అన్ని ప్లాన్లు, ప్రోగ్రాములను వతనంలో కూర్చుని కూడా చూస్తుంటారు. పిల్లలు ప్రతి ఒక్కరి, ప్రతి సమయపు స్మృతి మరియు సేవల రికార్డ్ బాప్‌దాదా వద్ద ఉంటుంది. మీ ప్రపంచములో రికార్డులను పెట్టేందుకు చాలా సాధనాలు ఉన్నాయి. బాప్‌దాదా వద్ద సైన్స్ సాధానాల కంటే కూడా రిఫైన్ సాధనాలు ఉన్నాయి, వాటి పని అవి చేస్తూ ఉంటాయి. సైన్సు సాధనాలు ఏ పని చేసినా అవి లైట్ ఆధారంతో చేస్తాయి. సూక్ష్మవతనము ఉన్నదే లైట్‌తో. సాకార వతనములోని లైట్ సాధనాలు ప్రకృతి సాధనాలు, కానీ అవ్యక్త వతనములోని సాధనాలు ప్రకృతికి చెందినవి కావు. అంతేగాక ప్రకృతి రూపము మార్తుంది, సతో, రజో, తమోలలోకి పరివర్తన అవుతుంది. ఈ సమయములో ఉన్నదే తమోగుణ ప్రకృతి, కనుక ఈ సాధనాలు ఈరోజు పనిచేస్తాయి, రేపు పనిచెయ్యవు. కానీ అవ్యక్త వతనములోని సాధనాలు ప్రకృతికి అతీతమైనవి, కనుక అవి పరివర్తనలోకి రావు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా సూక్ష్మ సాధనాలు ఎల్లప్పుడూ తమ కార్యమును చేస్తుంటాయి కనుక పిల్లలందరి రికార్డులను చూడటము బాప్‌దాదాకు పెద్ద పనేమీ కాదు. మీకైతే సాధనాలను సంభాళించటం కూడా కష్టమవుతుంది కదా. బాప్‌దాదా స్మృతి మరియు సేవ - రెండింటి రికార్డును చూస్తారు ఎందుకంటే రెండింటి బ్యాలెన్సు అదనపు ఆశీర్వాదాలను ఇప్పిస్తుంది.
సేవ కొరకు సమయాన్ని వెచ్చించినప్పుడు, ఒక్కోసారి ఆ సేవలో నియమం కంటే కూడా ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. సేవలో సమయాన్ని పెట్టడము అనేది చాలా మంచి విషయము మరియు సేవా బలము కూడా లభిస్తుంది, సేవలో బిజీ అయిన కారణంగా చిన్న-చిన్న విషయాల నుండి రక్షింపబడతారు. పిల్లల సేవను చూసి బాప్‌దాదా చాలా సంతోషిస్తారు, మీ ధైర్యానికి బాబా బలిహారమైపోతారు, కానీ ఏ సేవ అయితే స్మృతిలో, ఉన్నతిలో కాస్త ఆటంకాలను కలిగించేందుకు నిమిత్తంగా అవుతుందో అటువంటి సేవకు సమయాన్ని తగ్గించాలి. ఉదాహరణకు, రాత్రిపూట పన్నెండు, ఒంటిగంట వరకు మేల్కొన్నారనుకోండి, అప్పుడు అమృతవేళ ఉత్సాహంగా, తాజాగా అనిపించదు. ఏదో నియమానుసారంగా కూర్చుంటారు, అమృతవేళ శక్తిశాలిగా ఉండదు కనుక మొత్తము రోజంతటి స్మృతి మరియు సేవలలో తేడా వచ్చేస్తుంది. సేవ ప్లాన్లను తయారుచెయ్యటంలో, సేవను ప్రాక్టికల్లోకి తీసుకురావటంలో సమయం కూడా పడుతుంది. అప్పుడు రాత్రి సమయాన్ని తగ్గించి 12 గంటలకు బదులుగా 11 గంటలకు నిద్రపోండి. ఆ ఒక్క గంటను ఏదైతే తగ్గించారో, శరీరానికి విశ్రాంతినేదైతే ఇచ్చారో దానివలన అమృతవేళ మంచిగా ఉంటుంది, బుద్ధి కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. లేదంటే సేవ అయితే చేస్తున్నాము కానీ స్మృతి చార్ట్ ఎంతగా ఉండాలో అంతగా ఉండటం లేదు అని మనసు తింటూ ఉంటుంది. ఇది ఇలా ఉండాలి కానీ ఉండటం లేదు అన్న ఆలోచన ఏదైతే మనసులో లేక హృదయంలో పదే పదే వస్తూ ఉంటుందో, ఆ ఆలోచన కారణంగా బుద్ధి కూడా తాజాగా (ఫ్రెష్‌గా) ఉండదు. ఒకవేళ బుద్ధి ఫ్రెష్‌గా ఉన్నట్లయితే ఫ్రెష్ బుద్ధి కారణంగా 2-3 గంటలు పట్టే పని 1 గంటలో పూర్తి చెయ్యగలరు. అలసిపోయిన బుద్ధి వలన సమయము ఎక్కువ పడుతుంది. ఈ అనుభవము ఉంది కదా! మరియు ఎంత ఫ్రెష్ బుద్ధి ఉంటుందో, శారీరక లెక్కలో కూడా ఫ్రెష్ మరియు ఆత్మిక ఉన్నతి రూపములో కూడా ఫ్రెష్ - డబల్ రిఫ్రెష్నెస్(తాజాదనము) ఉంటుంది అప్పుడు గంట పనిని అరగంటలో చేసేస్తారు.
కనుక ఎల్లప్పుడు మీ దినచర్యలో ఫ్రెష్ బుద్ధిని ఉంచుకునే విషయంపై అటెన్షన్ పెట్టండి. ఎక్కువగా నిద్ర పోయే అలవాటు కూడా ఉండకూడదు కానీ శరీరము లెక్కలో ఎంత సమయము అవసరమో దానిపై అటెన్షన్‌ను పెట్టండి. కొన్ని కొన్నిసార్లు ఏదైనా సేవలో అవకాశము వచ్చినప్పుడు, నెల, రెండు నెలలలో రెండు-నాలుగుసార్లు రాత్రి నిద్రపోవటం ఆలస్యమైతే, అది వేరే విషయం. కానీ ఒకవేళ మీ శరీరము ఎప్పుడూ అలసిపోతున్నట్లయితే స్మృతి చెయ్యటంలో తేడా వస్తుంది. ఎలా అయితే సేవ ప్రోగ్రామును తయారుచేసినప్పుడు, 4 గంటల సమయాన్ని వెచ్చించాలంటే వెచ్చిస్తారు. అలాగే స్మృతికి కూడా ఖచ్చితమైన సమయాన్ని వెచ్చించాల్సిందే - ఇది కూడా అవసరము అని భావించి ఆ విధితో మీ ప్రోగ్రామును తయారు చేసుకోండి. బద్ధకస్తులుగా అవ్వకండి కానీ శరీరానికి విశ్రాంతిని ఇవ్వాలి - ఈ విధితో నడవండి ఎందుకంటే రాత్రింబవళ్ళు సేవలో ఇంకా తీవ్రగతితో ముందుకు వెళ్ళే సమయము వస్తూ ఉంది. అచ్ఛా, ఈ ఒక్క సంవత్సరములో ఈ కార్యము పూర్తయిపోతుంది, తరువాత విశ్రాంతి తీసుకుంటాము, అన్నీ సరిచేసుకుంటాము, స్మృతిని ఎక్కువ చేసుకుంటాము అని మీరు అనుకుంటారు. కానీ సేవ కార్యాలైతే రోజురోజుకూ క్రొత్త క్రొత్తవిగా, చాలా పెద్దవిగా అవుతాయి కనుక ఎల్లప్పుడు బ్యాలెన్స్ పెట్టుకోండి. అమృతవేళను ఫ్రెష్‌గా చెయ్యండి, తరువాత ఆ పనిని మొత్తము రోజులో సమయప్రమాణంగా చేసినట్లయితే అదనంగా బాబా నుండి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి మరియు బుద్ధి కూడా ఫ్రెష్‌గా ఉన్న కారణంగా కార్యమును కూడా చాలా త్వరగా మరియు సఫలతాపూర్వకంగా చెయ్యగలరు. అర్థమైందా?
బాప్‌దాదా చూస్తున్నారు - పిల్లలలో చాలా ఉత్సాహము ఉంది కనుక శరీరం గురించి కూడా ఆలోచించడం లేదు. ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు. ముందుకు వెళ్ళడం బాప్‌దాదాకు మంచిగా అనిపిస్తుంది, అయినాకూడా బ్యాలెన్స్ తప్పకుండా ఉండాలి. చేస్తూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు కానీ అప్పుడప్పుడు, చాలా పని ఉన్నప్పుడు ఎక్కువగా పని చేసినప్పుడు ఒకటేమో బుద్ధి అలిసిపోయిన కారణంగా చెయ్యాలనుకున్నంత చెయ్యలేకపోతారు, రెండవది - ఎక్కువ పని ఉన్న కారణంగా ఎవరిద్వారానైనా కొద్దిపాటి అలజడి కలిగినా అలసట కారణంగా చికాకుపడిపోతారు. దానివలన సంతోషము తక్కువైపోతుంది. మామూలుగా అయితే, లోపల బాగానే ఉంటారు, సేవా బలము కూడా లభిస్తూ ఉంది, సంతోషము కూడా లభిస్తూ ఉంది, అయినాకూడా శరీరమైతే పాతది కదా, కనుక మరీ అతిలోకి వెళ్ళకండి. బ్యాలెన్స్ పెట్టుకోండి. అలసట ప్రభావం స్మృతి చార్టుపై ఉండకూడదు. సేవలో చాలా బిజీగా ఉంటారు, కానీ ఎంత బిజీగా ఉన్నాగానీ అలసటను తొలగించుకునేందుకు విశేషమైన సాధనము - ప్రతి గంటలో లేక రెండు గంటలలో ఒక్క నిముషాన్ని శక్తిశాలీ స్మృతి కొరకు తప్పకుండా కేటాయించండి! శరీరము బలహీనంగా ఉన్నప్పుడు శరీరానికి శక్తిని ఇచ్చేందుకై డాక్టర్లు రెండు-రెండు గంటలకు ఒకసారి శక్తినిచ్చే టానిక్‌ను త్రాగమని ఇస్తారు. సమయం కేటాయించి ఆ మందును త్రాగాల్సివస్తుంది కదా. అలాగే మధ్యమధ్యలో ఒక్క నిముషాన్నయినా శక్తిశాలీ స్మృతి కొరకు వెచ్చించినట్లయితే దాని ద్వారా ఎ. బి. సి. . . అన్ని విటమిన్లు వచ్చేస్తాయి.
వినిపించాము కదా, శక్తిశాలీ స్మృతి సదా ఎందుకని ఉండదో! ఉన్నదే బాబావారిగా అయినప్పుడు, బాబా మీవారు, సర్వ సంబంధాలు ఉన్నాయి, మనస్ఫూర్వకమైన స్నేహము ఉంది, జ్ఞాన సంపన్నులుగా ఉన్నారు, ప్రాప్తి యొక్క అనుభవము కలవారు, అయినా కూడా శక్తిశాలీ స్మృతి ఎల్లప్పుడు ఎందుకని ఉండదు, దానికి కారణమేంటి? మీ స్మృతి అనే లింక్‌ను జోడించి ఉంచరు, లింక్ తెగిపోతుంటుంది, మరల దానిని జోడించేందుకు సమయము కూడా పడ్తుంది, కష్టం కూడా అవుతుంది మరియు స్మృతిలో శక్తిశాలురకు బదులుగా బలహీనురుగా అవుతారు. విస్మృతి అయితే జరగదు, స్మృతి ఉంటుంది, కానీ సదా శక్తిశాలీ స్మృతి స్వతహాగా ఉండాలంటే ఈ లింక్ తెగిపోకూడదు. ప్రతి సమయము బుద్ధిలో స్మృతి లింక్ జోడింపబడి ఉండాలి - అందుకు విధి ఇది. ఇది కూడా అవసరమని భావించండి. ఏవిధంగా అయితే ఆ పనిని చెయ్యటము అవసరమని భావిస్తారో, ఈ ప్లాన్‌ను పూర్తి చేసే లేవాలి అని అనుకుంటారు కనుక సమయాన్ని కూడా ఇస్తారు, శక్తిని కూడా పెట్తారు. అలాగే ఇది కూడా తప్పనిసరి. ముందు ఈ పనిని పూర్తి చేసి తరువాత స్మృతి చేస్తాము అని స్మృతిని వెనుకకు పెట్టేయకండి, అలా చెయ్యకూడదు. మీ ప్రోగ్రాంలో ముందుగానే దీనికి సమయాన్ని చేర్చండి. ఏవిధంగానైతే, సేవ ప్లాన్ కొరకు రెండు గంటల సమయాన్ని ఫిక్స్ చేస్తారో, మీటింగ్ చేసినా, ప్రాక్టికల్‌గా చేసినాగానీ రెండు గంటలతోపాటుగా దీనిని కూడా మధ్యమధ్యలో చెయ్యాల్సిందే - దీనిని చేర్చండి. అప్పుడు ఒక్క గంటలో ఏదైతే ప్లాన్‌ను తయారుచేస్తారో అది అర్థగంటలోనే అయిపోతుంది. చేసి చూడండి. రెండు గంటలకు తాజాగా మీ కళ్ళు వాటికవే తెరుచుకుంటాయి, అది వేరే సంగతి. కానీ కార్యము కారణంగా మేల్కోవాల్సి వచ్చినప్పుడు దాని ప్రభావము శరీరముపై పడ్తుంది కనుక బ్యాలెన్స్‌పై సదా అటెన్షన్ ఉంచండి.
పిల్లలు ఎంతో బిజీగా ఉండటాన్ని చూసిన బాప్‌దాదాకు వీరి తలకు మర్దన చెయ్యాలి అని ఆలోచిస్తారు. కానీ సమయం కేటాయించినట్లయితే బాప్‌దాదా వతనములో మర్దన కూడా చేస్తారు. అది కూడా అలౌకికమైనదిగా ఉంటుంది, లౌకిక మర్దనలా ఉండదు. ఒక్కసారిగా ఫ్రెష్ అయిపోతారు. క్షణకాలపు శక్తిశాలీ స్మృతి అయినాకూడా అది తనువు మరియు మనసు - రెండింటినీ ఫ్రెష్‌గా చేసేస్తుంది. బాబా వతనములోకి రండి, ఏ సంకల్పము చేస్తే ఆ సంకల్పము పూర్తయిపోతుంది. అది శారీరిక అలసట అయినా, బుద్ధి అలసట అయినా, స్థితి యొక్క అలసట అయినా - బాబా వచ్చిందే అలసటను తీసేసేందుకు.
ఈరోజు డబల్ విదేశీయులతో వ్యక్తిగత ఆత్మిక సంభాషణను చేస్తున్నాము. చాలా మంచి సేవ చేసారు మరియు చేస్తూనే ఉండాలి. సేవ పెరగటము - డ్రామా అనుసారంగా ఇది తయారయ్యే ఉంది. ఇప్పటికే చాలా అయిపోయింది అని మీరు ఎంత ఆలోచించినాగానీ డ్రామా విధి తయారై ఉంది కనుక సేవ ప్లాన్లను తయారు చెయ్యాల్సిందే మరియు మీరందరూ నిమిత్తులుగా అయ్యి చెయ్యాల్సిందే. ఈ విధిని ఎవ్వరూ మార్చలేరు. ఒక సంవత్సరము సేవ నుండి ఫ్రీ చేద్దాము అని బాబా అనుకున్నా కానీ, అది మారదు. సేవ నుండి ఫ్రీ అయిపోయి కూర్చోగలరా? స్మృతి ఏవిధంగా బ్రాహ్మణ జీవితానికి భోజనమో, అలా సేవ కూడా జీవితానికి భోజనం వంటిది. భోజనం లేకుండా ఎప్పుడైనా ఎవరైనా ఉండగలరా? కానీ తప్పకుండా బ్యాలెన్స్ ఉండాలి. బుద్ధిపై భారం పడేంతగా, నిర్లక్ష్యులుగా అయిపోయేంతగా కూడా ఎక్కువగా చెయ్యకండి, భారమూ ఉండకూడదు, నిర్లక్ష్యమూ ఉండకూడదు - దీనినే బ్యాలెన్స్ అంటాము.
డబల్ విదేశీయులలో సేవా ఉల్లాసము బాగుంది. కావున వృద్ధి కూడా బాగా జరుగుతుంది. 14 సంవత్సరాలలో విదేశీ సేవలను బాగా పెంచారు. లౌకిక మరియు అలౌకిక కార్యాలు రెండూ చేస్తూ కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. డబల్ కార్యంలో సమయం కూడా వెచ్చిస్తారు, అలాగే బుద్ధి మరియు శరీర శక్తిని కూడా పెడ్తున్నారు. ఇది కూడా బుద్ధి యొక్క అద్భుతము. లౌకిక కార్యం చేస్తూ సేవలో ముందుకు వెళ్ళడము – ఇది కూడా ధైర్యంతో కూడిన పని. ధైర్యం కలిగిన ఇటువంటి పిల్లలకు బాప్‌దాదా సదా ప్రతి కార్యంలో సహయోగిగా ఉంటారు. ఎంత ధైర్యము ఉంటుందో అంతగా పదమారెట్లు బాబా సహయోగిగా అవుతారు. రెండు పాత్రలను చేస్తూ ఉన్నతిని పొందుతున్నారు – ఇది చూసి బాప్‌దాదా సదా పిల్లలపై హర్షితంగా ఉంటున్నారు. మాయ నుండి ముక్తులై ఉన్నారు కదా? యోగయుక్తంగా ఉన్నప్పుడు స్వతహాగానే మాయ నుండి ముక్తులై ఉంటారు. యోగయుక్తంగా లేకపోతే మాయ నుండి ముక్తులవ్వలేరు. మాయకు కూడా బ్రాహ్మణ ఆత్మలంటే చాలా ఇష్టము. వస్తాదుకు, వస్తాదుతోటే మజా వస్తుంది. మాయ కూడా శక్తిశాలి, మీరు కూడా శక్తిశాలి, కనుక మాయకు శక్తిశాలి అయిన మీతో ఆట ఆడుకోవడం మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మాయను బాగా తెలుసుకున్నారు కదా, అది ఒక్కోసారి కొత్త కొత్త రూపాలలో వస్తుంది. నాలెజ్ఫుల్ అంటే అర్థము బాబాను కూడా తెలుసుకోవడము, రచనను కూడా తెలుసుకోవడము, అలాగే మాయను కూడా తెలుసుకోవడము. ఒకవేళ రచయిత మరియు రచనను తెలుసుకుని మాయను తెలుసుకోకపోతే నాలెజ్ఫుల్ కాదు.
ఎప్పుడూ ఏ విషయంలోనూ, తనువు బలహీనంగా ఉన్నాగానీ, ఏదైనా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నాగానీ మనసుతో ఎప్పుడూ అలసిపోవద్దు. మనసు సంతోషంగా ఉంటే తనువు యొక్క అలసట సమాప్తమైపోతుంది. కానీ మనసు అలసట శారీరక అలసటను పెంచుతుంది. మనసు ఎప్పుడూ అలసిపోకూడదు. అలసిపోయినప్పుడు సెకండులో బాబా వతనంలోకి వచ్చేయండి. మనసు అలసిపోవడం అలవాటైతే బ్రాహ్మణ జీవితంలో అనుభవమవ్వాల్సిన ఉల్లాస ఉత్సాహాలు ఉండవు. నడవనైతే నడుస్తున్నాము కానీ, నడిపించేవారు ఎవరు అన్నది అనుభవం చేసుకోరు. కష్టంగా నడుస్తారు, కష్టంగా ఉంటే అలసట వస్తుంది. కనుక ఎప్పుడూ ఇలా భావించండి – ‘చేయించేవారు చేయిస్తున్నారు, నడిపించేవారు నడిపిస్తున్నారు’.
సమయము, శక్తి – రెండిటి ప్రకారంగా సేవను చేస్తూ ఉండండి. సేవ ఎప్పుడూ ఉండిపోదు, ఈరోజు కాకపోతే రేపు జరుగుతుంది. ఒకవేళ సత్యమైన మనసుతో, మనస్ఫూర్వక స్నేహంతో ఎంత సేవను చేయగలరో అంతే చేస్తే అందుకు బాప్‌దాదా ఎప్పుడు కూడా, ఇంతే చేసారు, ఇది చేయలేదు అని ఫిర్యాదు చేయరు. శభాష్ లభిస్తుంది. సమయ ప్రమాణంగా, శక్తి ప్రమాణంగా సత్యమైన మనసుతో సేవను చేసినప్పుడు సత్యమైన హృదయంపై సాహెబు రాజీ అవుతారు. మీ మిగిలి ఉన్న పనిని కూడా బాబా ఎలాగో అలాగా పూర్తి చేయిస్తారు. ఏ సేవ ఎప్పుడు పూర్తవ్వాలో అది అయ్యే తీరుతుంది, ఉండిపోదు. ఏదో ఒక ఆత్మను టచ్ చేసి బాప్‌దాదా పిల్లలకు సహయోగిగా చేస్తారు. యోగి పిల్లలకు అన్ని రకాల సహయోగములు సమయానికి లభిస్తాయి. కానీ ఎవరికి లభిస్తాయి? సత్యమైన మనసున్నవారికి, సత్యమైన సేవాధారులకు. మరి అందరూ సత్యమైన సేవాధారులేనా? సాహెబు మాపై రాజీ అయి ఉన్నారు – ఇలా అనుభవం చేసుకుంటున్నారు కదా. అచ్ఛా.
సదా స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ద్వారా బాబా ఆశీర్వాదాలకు అధికారులుగా, సదా బాబా సమానంగా డబల్ లైట్‌గా ఉండేవారు, సదా నిరంతర శక్తిశాలీ స్మృతి లింక్‌ను జోడించేవారు, సదా శరీరము మరియు ఆత్మను రిఫ్రెష్‌గా ఉంచుకునేవారు, ప్రతి కర్మను విధిపూర్వకంగా చేసేవారు, సదా శ్రేష్ఠ సిద్ధిని ప్రాప్తి చేసుకునేవారు, ఇటువంటి శ్రేష్ఠ సమీప పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
విదేశీ సోదరసోదరీలు గ్లోబల్ కో-ఆపరేషన్ మీటింగ్ సమాచారాన్ని వినిపించారు
బాప్‌దాదా సంతోషిస్తున్నారు – ఇంతగా కలిసి ప్లాన్లను తయారు చేస్తారు, ప్రాక్టికల్లోకి తెస్తారు మరియు తెస్తూనే ఉంటారు. అందుకే బాప్‌దాదాకు ఇష్టము. ఇక ఏదైనా కష్టముంటే బాప్‌దాదా సహజం చేసేస్తారు. ఇలా బుద్ధి నడపడం కూడా ఒక వరదానము. కేవలం బ్యాలెన్స్‌ను ఉంచి నడుచుకోండి. బ్యాలెన్స్ ఉన్నప్పుడు బుద్ధి చాలా త్వరగా నిర్ణయం తీసుకుంటుంది. 4 గంటలు చర్చించే విషయానికి ఒక్క గంట సమయం కూడా పట్టదు. అందరివీ ఒకే ఆలోచనలు వస్తాయి. కానీ ఇది కూడా మంచిది, ఆట కదా, కొంచెం చేస్తారు, కొంచెం కొట్టేస్తారు... ఇందులో కూడా మజా ఉంది. ప్లాన్లు చేస్తూ ఉండండి, వాటిని రిఫైన్ చేస్తూ ఉండండి. బిజీగా అయితే ఉంటున్నారు. భారంగా మాత్రం ఫీల్ అవ్వకండి, ఆట ఆడండి. సమయం తక్కువగా ఉంది, ఎంత చేయగలరో అంత చేయండి. ఈ సంవత్సరం జరిగేదుంటే జరుగుతుంది, జరగకపోతే వచ్చే సంవత్సరం ఇంకా మంచి ప్రోగ్రాము తయారవుతుంది. ఈ సేవ కూడా జరుగుతూనే ఉంటుంది. భండారా (వంటశాల) ఎప్పుడూ ఆగనట్లుగా, ఈ సేవ కూడా భండారా వంటిది, అవినాశిగా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా కార్యంలో ఆలస్యం అవుతుంది అంటే, బహుశా ఇంకా మంచిగా జరిగేదుందేమో, అందుకే ఆలస్యమవుతుంది. ఇకపోతే శ్రమ పడుతున్నారు, సుస్తిగా లేరు. దీనిపై బాప్‌దాదాకు ఏమీ ఫిర్యాదు లేదు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
