Search for a command to run...
15 Nov 2003
‘‘మనసును ఏకాగ్రము చేసి, ఏకాగ్రతా శక్తి ద్వారా ఫరిశ్తా స్థితిని అనుభవము చెయ్యండి’’
15 November 2003 · తెలుగు
ఈరోజు సర్వ ఖజానాల యజమాని తమ నలువైపులా ఉన్న సంపన్నులైన పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరినీ సర్వ ఖజానాలకు యజమానిగా తయారుచేసారు. ఎటువంటి ఖజానా లభించిందంటే, దానిని ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. మరి ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఖజానాలతో సంపన్నముగా ఉన్నట్లు అనుభవం చేస్తున్నారా? అన్నిటికంటే శ్రేష్ఠ ఖజానాలు - జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, గుణాల ఖజానా, అలాగే బాబా మరియు సర్వ బ్రాహ్మణ ఆత్మల ద్వారా లభించిన ఆశీర్వాదాల ఖజానా. కావున చెక్ చేసుకోండి - ఈ సర్వ ఖజానాలూ ప్రాప్తించాయా? సర్వ ఖజానాలతో సంపన్నముగా ఉన్న ఆత్మలు ఎవరైతే ఉంటారో, వారి గుర్తు ఏమిటంటే - వారి నయనాల ద్వారా, ముఖము ద్వారా, నడవడిక ద్వారా సంతోషమనేది ఇతరులకు కూడా అనుభవమవుతుంది. ఏ ఆత్మ సంపర్కములోకి వచ్చినా, వారు ఎలా అనుభవం చేస్తారంటే - ఈ ఆత్మ అలౌకిక సంతోషముతో అలౌకికముగా, అతీతముగా కనిపిస్తుంది అని. మీ సంతోషాన్ని చూసి ఇతర ఆత్మలు కూడా కొద్ది సమయానికి సంతోషాన్ని అనుభవం చేస్తారు. ఏ విధంగానైతే బ్రాహ్మణ ఆత్మలైన మీ శ్వేత వస్త్రాలు అందరికీ ఎంతో అతీతమైనవిగా మరియు ప్రియమైనవిగా అనిపిస్తాయో, స్వచ్ఛత, నిరాడంబరత మరియు పవిత్రత అనుభవమవుతుందో, వీరు బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలు అని దూరం నుండే తెలిసిపోతుందో, అలాగే బ్రాహ్మణ ఆత్మలైన మీ నడవడిక మరియు ముఖము ద్వారా సదా సంతోషపు మెరుపు, భాగ్యముతో కూడిన నషా కనిపించాలి. ఈ రోజుల్లో సర్వాత్మలు చాలా దుఃఖముతో ఉన్నారు, అటువంటి ఆత్మలు సంతోషముతో ఉన్న మీ ముఖాన్ని చూసి, నడవడికను చూసి ఒక్క ఘడియనైనా సంతోషాన్ని అనుభవం చెయ్యాలి. ఎలా అయితే దాహముతో ఉన్న ఆత్మకు ఒకవేళ ఒక్క నీటి చుక్క దొరికినా ఎంతగా సంతోషపడతారు, అలా సంతోషమనే అంచలి ఆత్మలకు చాలా అవసరము. ఇలా సర్వ ఖజానాలతో సదా సంపన్నముగా ఉండాలి. ప్రతి బ్రాహ్మణ ఆత్మ స్వయాన్ని సర్వ ఖజానాలతో సదా నిండుగా ఉన్నట్లు అనుభవం చేస్తున్నారా లేక అప్పుడప్పుడునా? ఖజానాలు అవినాశీ అయినవి, వాటిని ఇచ్చే దాత కూడా అవినాశీ, కనుక ఉండటము కూడా అవినాశీగా ఉండాలి ఎందుకంటే మీకు లభించిన ఈ అలౌకిక సంతోషము మొత్తము కల్పములో బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ ప్రాప్తించదు. ఇప్పటి ఈ అలౌకిక సంతోషము అర్థకల్పము ప్రారబ్ధ రూపములో నడుస్తుంది. మరి అందరూ సంతోషముగా ఉన్నారా! ఇందులోనైతే అందరూ చేతులెత్తారు, అచ్ఛా - సదా సంతోషముగా ఉన్నారా? ఎప్పుడైనా సంతోషము పోవటం లేదు కదా? అప్పుడప్పుడు పోతుంటుందా! సంతోషముగా ఉంటారు కానీ సదా ఏకరసముగా అలా ఉండటములో తేడా వచ్చేస్తుంది. సంతోషముగా ఉంటారు కానీ పర్సెంటేజ్లో తేడా వచ్చేస్తుంది.
బాప్‌దాదా ఆటోమేటిక్ టి.వి. ద్వారా పిల్లలందరి ముఖాలను చూస్తూ ఉంటారు. మరి ఏం కనిపిస్తుంది? ఒక రోజు మీరు కూడా మీ సంతోషము యొక్క చార్టును చెక్ చేసుకోండి - అమృతవేళ నుండి రాత్రి వరకు సంతోషము యొక్క పర్సెంటేజ్ ఒకే విధంగా ఉంటుందా లేక మారుతుందా? చెక్ చేసుకోవటమైతే వస్తుంది కదా, ఈ రోజుల్లో చూడండి, సైన్స్ కూడా చెకింగ్ మెషినరీని చాలా శక్తిశాలిగా తయారుచేసింది. కావున మీరు కూడా చెక్ చేసుకోండి మరియు అవినాశీగా తయారుచేసుకోండి. పిల్లలందరిదీ కూడా బాప్‌దాదా వర్తమాన పురుషార్థాన్ని చెక్ చేసారు. పురుషార్థమునైతే అందరూ చేస్తున్నారు - కొందరు యథాశక్తి చేస్తున్నారు, కొందరు శక్తిశాలిగా చేస్తున్నారు. కావున ఈరోజు బాప్‌దాదా పిల్లలందరి మానసిక స్థితిని చెక్ చేసారు ఎందుకంటే ముఖ్యమైనదే మన్మనాభవ. సేవలో కూడా చూసినట్లయితే మనసా సేవ శ్రేష్ఠమైన సేవ. మనసును జయిస్తే జగత్తును జయించినట్లు అని అంటారు కూడా, కావున మనసు యొక్క గతిని చెక్ చేసారు, అప్పుడు ఏం చూసారు? మనసుకు యజమానిగా అయ్యి మనసును నడిపిస్తారు కానీ అప్పుడప్పుడు మనసు మిమ్మల్ని కూడా నడిపిస్తుంది. మనసు పరవశముగా కూడా చేస్తుంది. బాప్‌దాదా చూసారు - మనసులో ప్రేమ, తపన కలిగి ఉంటున్నారు కానీ మనసు యొక్క స్థితి ఏకాగ్రమవ్వటం లేదు.
వర్తమాన సమయములో మనసు యొక్క ఏకాగ్రత ఏకరస స్థితిని అనుభవం చేయిస్తుంది. ఇప్పుడు రిజల్టులో ఏం చూసారంటే - మనసును ఏకాగ్రము చెయ్యాలనుకుంటారు కానీ మధ్యమధ్యలో అది భ్రమిస్తుంటుంది. ఏకాగ్రతా శక్తి అవ్యక్త ఫరిశ్తా స్థితిని సహజముగా అనుభవం చేయిస్తుంది. వ్యర్థ విషయాలలోనైనా, వ్యర్థ సంకల్పాలలోనైనా, వ్యర్థ వ్యవహారములలోనైనా మనసు భ్రమిస్తూ ఉంటుంది. ఉదాహరణకు కొందరికి శరీరాన్ని ఏకాగ్రము చేసి కూర్చునే అలవాటు కూడా ఉండదు, కొందరికి ఉంటుంది. అలా మనసును ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా, ఎంత సమయము కావాలంటే అంత సమయము మరియు ఆ విధముగా అది ఏకాగ్రము అవ్వటము, దీనినే మనసు వశములో ఉండటము అని అంటారు. ఏకాగ్రతా శక్తి, యజమానత్వపు శక్తి సహజముగా నిర్విఘ్నముగా చేస్తుంది. యుద్ధము చేయవలసిన అవసరముండదు. ఏకాగ్రతా శక్తి ద్వారా స్వతహాగానే ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు అన్న అనుభూతి కలుగుతుంది. అది స్వతహాగా కలుగుతుంది, శ్రమ చేయవలసిన అవసరముండదు. ఏకాగ్రతా శక్తి ద్వారా స్వతహాగానే ఏకరస ఫరిశ్తా స్వరూప అనుభూతి కలుగుతుంది. బ్రహ్మా బాబాపై ప్రేమ ఉంది కదా - మరి బ్రహ్మా బాబా సమానముగా అవ్వటము అనగా ఫరిశ్తాగా అవ్వటము. ఏకాగ్రతా శక్తి ద్వారా స్వతహాగానే సర్వుల పట్ల స్నేహము, కళ్యాణము, గౌరవము యొక్క వృత్తి ఉండనే ఉంటుంది ఎందుకంటే ఏకాగ్రత అనగా స్వమానపు స్థితి. ఫరిశ్తా స్థితి స్వమానము. బ్రహ్మాబాబాను చూసారు కదా, వర్ణన కూడా చేస్తారు. సంపన్నతా సమయము సమీపముగా వచ్చే కొలది ఏం చూసారు? నడుస్తూ-తిరుగుతూ ఉన్న ఫరిశ్తా రూపము, దేహభాన రహితము. దేహము యొక్క ఫీలింగ్ వచ్చేదా? ఎదురుగా వెళ్తున్నప్పుడు కూడా దేహము కనిపించేదా లేక ఫరిశ్తా రూపము అనుభవం అయ్యేదా? కర్మలు చేస్తూ కూడా, మాట్లాడుతూ కూడా, డైరెక్షన్లు ఇస్తూ కూడా, ఉల్లాస-ఉత్సాహాలను పెంచుతూ కూడా, దేహము నుండి అతీతముగా, సూక్ష్మ ప్రకాశ రూపాన్ని అనుభూతి చేసారు. బ్రహ్మాబాబా మాట్లాడుతూ, మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలా అనిపించేదంటే, వీరు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ లేరు, వీరు చూస్తున్నారు కానీ దృష్టి అలౌకికముగా ఉంది, ఇది స్థూలమైన దృష్టి కాదు అని అనేవారు కదా. దేహభానము నుండి అతీతముగా ఉండాలి, ఇతరులకు కూడా దేహ భానము రాకూడదు, అతీతమైన రూపము కనిపించాలి, దీనినే దేహములో ఉంటూ ఫరిశ్తా స్వరూపము అని అంటాము. ప్రతి మాటలో, వృత్తిలో, దృష్టిలో, కర్మలో అతీతత్వము అనుభవమవ్వాలి. వీరు మాట్లాడుతున్నారు కానీ చాలా అతీతముగా, చాలా ప్రియముగా అనిపిస్తున్నారు. ఆత్మికముగా ప్రియముగా అనిపించాలి. ఇటువంటి ఫరిశ్తాతనపు అనుభూతిని స్వయము కూడా చెయ్యాలి మరియు ఇతరులకు కూడా చేయించాలి ఎందుకంటే ఫరిశ్తాగా అవ్వకుండా దేవతగా అవ్వలేరు. ఫరిశ్తా సో దేవత. మరి నంబర్‌వన్ బ్రహ్మా ఆత్మ ప్రత్యక్షముగా సాకార రూపములో కూడా ఫరిశ్తా జీవితాన్ని అనుభవం చేయించారు మరియు ఫరిశ్తా స్వరూపముగా అయ్యారు. ఆ ఫరిశ్తా రూపముతోపాటే మీరందరూ కూడా ఫరిశ్తాలుగా అయ్యి పరంధామానికి వెళ్ళాలి. దీని కొరకు మనసు యొక్క ఏకాగ్రతపై అటెన్షన్ పెట్టండి. మనసును ఆజ్ఞానుసారముగా నడిపించండి. చెయ్యాలి అంటే మనసు ద్వారా కర్మ జరగాలి, చెయ్యకూడదు కానీ మనసు చెయ్యమని చెప్తే అది యజమాని స్థితి కాదు. ఇప్పుడు చాలామంది పిల్లలు ఏమంటారంటే - అలా కోరుకోలేదు కానీ జరిగిపోయింది, అలా ఆలోచించలేదు కానీ జరిగిపోయింది, అలా చెయ్యకూడదు కానీ జరిగిపోతుంది - ఇది మనసు యొక్క వశీభూత అవస్థ. మరి అటువంటి అవస్థ మంచిగా అయితే అనిపించదు కదా! బ్రహ్మాబాబాను ఫాలో చేయండి. బ్రహ్మాబాబాను చూసారు కదా, ఎదురుగా నిలబడి ఉన్నా కానీ ఏం అనుభవమయ్యేది? ఫరిశ్తా నిలబడి ఉన్నారు, ఫరిశ్తా దృష్టి ఇస్తున్నారు. కనుక మనసు యొక్క ఏకాగ్రతా శక్తి సహజముగా ఫరిశ్తాగా చేస్తుంది. బ్రహ్మాబాబా కూడా పిల్లలకు ఇదే చెప్తున్నారు - సమానముగా అవ్వండి. శివబాబా నిరాకారీగా అవ్వండి అని చెప్తున్నారు, బ్రహ్మాబాబా ఫరిశ్తాగా అవ్వండి అని చెప్తున్నారు. మరి ఏం అర్థమైంది? రిజల్టులో ఏం చూసారు? మనసు యొక్క ఏకాగ్రత తక్కువగా ఉంది. మధ్యమధ్యలో మనసు చాలా తిరుగుతూ ఉంటుంది, భ్రమిస్తూ ఉంటుంది. ఎక్కడికైతే వెళ్ళకూడదో అక్కడికి వెళ్తుంది, దీనిని ఏమంటారు? భ్రమించడమనే అంటారు కదా! కనుక ఏకాగ్రతా శక్తిని పెంచుకోండి. యజమానితనపు స్థితి అనే సీట్‌పై సెట్ అయ్యి ఉండండి. సెట్ అయినప్పుడు అప్సెట్ అవ్వరు (డిస్టర్బ్ అవ్వరు). సెట్ అయి లేకపోతే అప్సెట్ అవుతారు. కనుక భిన్న-భిన్న శ్రేష్ఠ స్థితులనే సీట్‌పై సెట్ అయ్యి ఉండండి, దీనినే ఏకాగ్రతా శక్తి అని అంటారు. సరేనా? బ్రహ్మా బాబాపై ప్రేమ ఉంది కదా! ఎంత ప్రేమ ఉంది? ఎంత ఉంది? చాలా ప్రేమ ఉందా! మరి ప్రేమకు రిటర్నులో బాబాకు ఏమిచ్చారు? బాబాకు కూడా మీపై ప్రేమ ఉంది, అందుకే మీకు కూడా బాబాపై ప్రేమ ఉంది కదా! మరి రిటర్న్‌లో ఏమిచ్చారు? సమానముగా అవ్వటము - ఇదే రిటర్న్ ఇవ్వటము. అచ్ఛా.
ఇది సీజన్ యొక్క మొదటి టర్న్. మరి ఫస్ట్‌లో ఫస్ట్ నంబరులోకి వచ్చేసారు. బాప్‌దాదాకు కూడా ఎంత ఎక్కువమంది పిల్లలు కనిపిస్తే అంత మంచిగా అనిపిస్తుంది. ఎంత హాల్ తయారు చేసారో అంత మందే వస్తారు. ఇప్పుడు పెద్ద హాల్ తయారు చేస్తే చాలామంది వస్తారు. ఇప్పుడు చూడండి, ఫుల్ అయిపోయింది కదా! ఫుల్ అవ్వడము అంటే ఇంకా పెద్ద హాల్‌ను తయారు చేయండి అన్న సంకేతాన్ని అది ఇస్తుంది. హాల్ అలంకరింపబడుతుంది కదా. మరి ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలతో హాల్ అలంకరింపబడితే ఎంతో మంచిగా అనిపిస్తుంది. మధుబన్ వారికి కూడా, శాంతివన్ కావచ్చు, పాండవ భవన్ కావచ్చు, ఒకవేళ ఖాళీ-ఖాళీగా ఉంటే మంచిగా అనిపించదు. నిండుగా ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా లేక మధుబన్ వారికి ఏకాంతం కావాలా? ఏకాంతం కావాలా లేక సంగఠన కావాలా, సందడిగా ఉంటే మంచిగా అనిపిస్తుందా? మధ్యలో ఏకాంతమైతే లభిస్తుంది కదా. అచ్ఛా!
డబల్ విదేశీయులు కూడా వచ్చారు. మంచిది, డబల్ విదేశీయుల ద్వారా కూడా మధుబన్ యొక్క అలంకరణ జరుగుతుంది. అంతర్జాతీయమవుతుంది కదా! మంచిది, బాప్‌దాదా దాదీ యొక్క సంకల్పాన్ని విన్నారు (ఈరోజు ఉదయం క్లాసులో దాదీజీ అందరికీ దేశ-విదేశాలలో సేవలో బాగా కోలాహలం చేయాలన్న సంకల్పాన్ని ఇచ్చారు. భారతదేశంలో ఏ గ్రామం, ఏ దేశము ఈ సంవత్సరము సందేశం అందకుండా వంచితమవ్వకూడదు, ఇటువంటి ప్లాన్‌ను తయారు చేయండి అన్నారు) సంకల్పం ఇచ్చారు కదా- మంచిది. మరి ఈ సంకల్పాన్ని విదేశం పూర్తి చేస్తుందా లేక దేశమా అన్నది చూస్తాము. సందేశమైతే లభించాలి. మీకు ఇంత ప్రాప్తి జరిగింది, బాబా లభించారు, ఖజానాలు లభించాయి, పాలన లభించింది, కనీసం మీ సోదరసోదరీలకు సందేశమైతే అందించాలి కదా. మాకు తెలియదు అన్న ఫిర్యాదు అయితే రాకూడదు కదా. కావున సందేశాన్ని తప్పకుండా ఇవ్వండి, ఇది ఆవశ్యకము. ఇందులో కష్టము ఏముంది? ప్రతి జోన్ తమ-తమ జోన్ యొక్క భాగాలను పంచండి, ఇంకేముంది! ప్రతి జోన్లో ఎన్ని సెంటర్లు ఉన్నాయి, ఒక్కొక్క సెంటరుకు పంచినా కానీ ఏమంత పెద్ద విషయము కాదు. చూడండి, మధుబన్‌లో వర్గీకరణ సేవ జరుగుతుంది, దాని ద్వారా శబ్దము నలువైపులకు వ్యాపిస్తుంది. ఎప్పుటినుండైతే ఈ వర్గీకరణ సేవ ప్రారంభమైందో, అప్పటినుండీ ఐ.పి. క్వాలిటీలో శబ్దము ఎక్కువగా వ్యాపించింది అన్నది మీరు చూస్తున్నారు. వి.వి.ఐ.పి.ల విషయము వదిలేయండి, వారికి తీరిక ఎక్కడుంటుంది! అంతేకాక పెద్ద-పెద్ద ప్రోగ్రాములు చేసారు, వాటి ద్వారా కూడా శబ్దము వ్యాపిస్తుంది. ఇప్పుడు ఢిల్లీ మరియు కలకత్తా వారు చేస్తున్నారు కదా! మంచి ప్లాన్లు తయారుచేస్తున్నారు. శ్రమ కూడా బాగా చేస్తున్నారు. బాప్‌దాదా వద్దకు సమాచారము అందుతూ ఉంటుంది. ఢిల్లీలో చేసే శబ్దము విదేశాల వరకు చేరాలి. మీడియా వారు ఏం చేస్తారు? కేవలము భారత్ వరకు చేస్తారు. ఢిల్లీలో ఈ ప్రోగ్రామ్ జరిగింది, కలకత్తాలో ఈ ప్రోగ్రామ్ జరిగింది అని విదేశాల నుండి శబ్దము రావాలి. అక్కడి నుండి శబ్దము ఇండియాకు రావాలి. ఇండియాలోని కుంభకర్ణులైతే విదేశాల ద్వారా మేల్కోవాలి కదా! అందుకే విదేశాల నుండి వచ్చే వార్తకు మహత్వము ఉంటుంది. ప్రోగ్రామ్ భారత్‌లో జరిగి, సమాచారము విదేశాల వార్తాపత్రికల ద్వారా అందాలి, అప్పుడు శబ్దము వ్యాపిస్తుంది. భారత్‌లోని శబ్దము విదేశాలకు చేరుకోవాలి మరియు విదేశాల శబ్దము భారత్‌కు చేరుకోవాలి, అప్పుడు దాని ప్రభావము ఉంటుంది. మంచిది. ప్రోగ్రామునేదైతే తయారుచేస్తున్నారో, దానిని మంచిగా తయారుచేస్తున్నారు. బాప్‌దాదా ఢిల్లీ వారికి కూడా ప్రేమతో చేసే శ్రమకు అభినందనలు ఇస్తున్నారు. కలకత్తా వారికి కూడా ముందుగానే అభినందనలు, ఎందుకంటే సహయోగము, స్నేహము మరియు ధైర్యము, ఈ మూడు విషయాలు ఎప్పుడైతే కలుస్తాయో, అప్పుడు శబ్దము గట్టిగా వినిపిస్తుంది, శబ్దము వ్యాపిస్తుంది, ఎందుకు వ్యాపించదు! ఇప్పుడు మీడియావారు ఈ అద్భుతము చెయ్యండి. అందరూ టి.వి.లో చూసారు, ఇది టి.వి.లో వచ్చింది అని ఇంతవరకే ఉండటము కాదు. అది భారత్‌లో వస్తుంది. ఇప్పుడు ఇంకా విదేశాల వరకు చేరుకోండి. ఈ సంవత్సరము శబ్దాన్ని వ్యాపింపజేయటానికి ఎంత ధైర్యముతో, ఎంత ఘనముగా జరుపుకుంటారో ఇప్పుడు చూస్తాము. డబల్ విదేశీయులకు చాలా ఉల్లాసము ఉంది అని బాప్‌దాదాకు సమాచారము అందింది. ఉంది కదా? మంచిది. ఒకరినొకరు చూసుకుంటుంటే ఇంకా ఎక్కువ ఉల్లాసము వస్తుంది. ఎవరైతే ముందుకు వచ్చి సేవా బాధ్యతను తీసుకుంటారో వారు బ్రహ్మా సమానము. మంచిది. దాదీకి కూడా సంకల్పము వస్తుంది, దాదీకి బిజీగా ఉంచే పద్ధతి చాలా బాగా వస్తుంది. మంచిది. నిమిత్తులు కదా!
అచ్ఛా - అందరూ ఎగిరే కళ కలవారేనా? ఎగిరే కళ వేగవంతమైన కళ. నడిచే కళ, ఎక్కే కళ - ఇవి వేగము కల కళలు కావు. ఎగిరే కళ వేగముగా కూడా ఉంటుంది మరియు ఫస్ట్లోకి తీసుకువచ్చేదిగా కూడా ఉంటుంది. అచ్ఛా -
మాతలు ఏం చేస్తారు? మాతలు తమ తోటివారిని మేలుకొలపండి. కనీసం మాతలెవ్వరూ ఫిర్యాదు చేసే విధంగా మిగిలిపోకూడదు. మాతల సంఖ్య ఎప్పుడూ ఎక్కువ ఉంటుంది. బాప్‌దాదాకు సంతోషమనిపిస్తుంది మరియు ఈసారి గ్రూపులో అందరూ మంచి సంఖ్యలో వచ్చారు. కుమారులు కూడా మంచి సంఖ్యలో వచ్చారు. చూడండి, కుమారులు తమ తోటివారిని మేలుకొలపండి. మంచిది. స్వప్నమాత్రములో కూడా పవిత్రతలో పరిపక్వముగా ఉన్నాము అని కుమారులు ఈ అద్భుతాన్ని చూపించాలి. బాప్‌దాదా విశ్వానికి ఛాలెంజ్ చేసి చెప్పగలగాలి - వీరు బ్రహ్మాకుమారులు, యూథ్ కుమారులు, డబల్ కుమారులు కదా. బ్రహ్మాకుమారులు కూడా మరియు శరీరము ద్వారా కూడా కుమారులు. కావున పవిత్రతకు నిర్వచనము ప్రాక్టికల్‌గా ఉండాలి. మరి పవిత్రత విషయములో మిమ్మల్ని చెక్ చేయమని ఆర్డర్ ఇవ్వాలా? ఇవ్వాలా ఆర్డర్? ఇందులో చేతులు ఎత్తటం లేదు. చెక్ చెయ్యటానికి మెషిన్లు ఉంటాయి. స్వప్నమాత్రముగా కూడా అపవిత్రతకు రావటానికి ధైర్యము ఉండకూడదు. కుమారీలు కూడా ఇలా అవ్వాలి, కుమారి అనగా పూజ్య పవిత్ర కుమారి. కుమారులు మరియు కుమారీలు బాప్‌దాదాకు ఈ ప్రతిజ్ఞ చెయ్యాలి - మేమందరమూ ఎంత పవిత్రముగా ఉన్నామంటే స్వప్నములో కూడా అపవిత్రతా సంకల్పము రాలేదు. అప్పుడు కుమారులు మరియు కుమారీల యొక్క పవిత్రతా ఉత్సవాన్ని జరుపుతాము. ఇప్పుడు కొద్ది-కొద్దిగా అపవిత్రత ఉంది, బాప్‌దాదాకు తెలుసు. అపవిత్రతా విషయములో అవిద్యులుగా ఉండాలి ఎందుకంటే కొత్త జన్మ తీసుకున్నారు కదా. అపవిత్రత అనేది మీ గత జన్మలోని విషయము. ఇది మరజీవా జన్మ, జన్మయే బ్రహ్మా ముఖము ద్వారా లభించిన పవిత్ర జన్మ. కనుక పవిత్ర జన్మ యొక్క మర్యాద చాలా అవసరము. కుమారులు, కుమారీలు ఈ జెండాను ఎగురవేయాలి. పవిత్రముగా ఉన్నాము, పవిత్రతా సంస్కారాలను విశ్వములో వ్యాపింపజేస్తాము - ఈ నినాదము చెయ్యాలి. విన్నారా కుమారీలు. కుమారీలు ఎంతమంది ఉన్నారో చూడండి. ఇప్పుడు చూస్తాము, ఈ ధ్వనిని కుమారీలు వ్యాపింపజేస్తారా లేక కుమారులు వ్యాపింపజేస్తారా. బ్రహ్మాబాబాను ఫాలో చేయండి. అపవిత్రత యొక్క నామ-రూపాలు కూడా ఉండకూడదు, బ్రాహ్మణ జీవితము అంటే ఇదే. మాతలలో కూడా మోహము ఉంటే అది అపవిత్రత. మాతలు కూడా బ్రాహ్మణులు కదా. కనుక మాతలలోనైనా, కుమారీలలోనైనా, కుమారులలోనైనా, అధర్ కుమారులు-కుమారీలలోనైనా అపవిత్రత ఉండకూడదు. బ్రాహ్మణులు అంటేనే పవిత్ర ఆత్మలు. ఒకవేళ అపవిత్రతా కార్యము ఏదైనా జరిగితే అది మహాపాపము. ఈ పాపానికి శిక్ష చాలా కఠినముగా ఉంటుంది. ఇది నడుస్తూనే ఉంటుందిలే అని అనుకోకండి. కొద్దో-గొప్పో అయితే నడిచిపోతుందిలే అని అనుకోకండి. ఇది మొదటి సబ్జెక్ట్. నవీనతయే పవిత్రతకు సంబంధించినది. బ్రహ్మాబాబా కూడా నిందలు పడ్డారంటే, అది పవిత్రత కారణముగానే. జరిగిపోయింది అని అనుకుని తప్పించుకోలేరు. ఇందులో నిర్లక్ష్యులుగా అవ్వకండి. బ్రాహ్మణులనెవరినైనా కూడా, సరెండర్ అయినవారైనా, సేవాధారులైనా, ప్రవృత్తివారైనా కానీ, ఈ విషయములో ధర్మరాజు కూడా వదలరు, బ్రహ్మాబాబా కూడా ధర్మరాజుకు తోడు నిలుస్తారు. అందుకే కుమారులు, కుమారీలు ఎక్కడ ఉన్నా సరే, మధుబన్‌లో ఉన్నా, సెంటర్లలో ఉన్నా, దీని దెబ్బ, సంకల్పమాత్రపు దెబ్బ కూడా చాలా పెద్ద దెబ్బ అవుతుంది. పవిత్ర్ మన్ రఖో, పవిత్ర్ తన్ రఖో... (మనసును పవిత్రముగా ఉంచుకోండి, తనువును పవిత్రముగా ఉంచుకోండి... ) అన్న పాటను పాడుతారు కదా. మీ ఈ పాట ఉంది కదా. మరి మనసు పవిత్రముగా ఉంటే జీవితము పవిత్రముగా ఉంటుంది, ఈ విషయంలో తేలికగా ఉండకండి, కొంచమే కదా చేసాము, ఏముందిలే అని అనుకోకండి! అది కొంచెం కాదు, చాలా ఎక్కువ. బాప్‌దాదా అఫిషియల్ సూచనను ఇస్తున్నారు. ఈ విషయములో రక్షింపబడలేరు. ఈ లెక్కచారాన్ని బాగా లెక్కించి తీస్తారు, అది ఎవరైనా సరే, అందుకే సావధానులుగా ఉండండి, అటెన్షన్. అందరూ శ్రద్ధగా విన్నారా. రెండు చెవులూ తెరుచుకుని వినండి. వృత్తిలో కూడా అపవిత్రత టచింగ్ ఉండకూడదు. దృష్టిలో కూడా ఆ టచింగ్ ఉండకూడదు. సంకల్పములోనే లేకపోతే ఇక వృత్తి, దృష్టిలో ఎలా ఉంటుంది! ఎందుకంటే సమయము సంపన్నతకు సమీపముగా వస్తూ ఉంది, పూర్తిగా పవిత్రముగా అవ్వాలి. మరి అందులో అపవిత్రత అనేది తెల్లగా ఉన్న కాగితముపై నల్ల మచ్చలాంటిది.
అచ్ఛా - అందరూ ఎక్కడెక్కడి నుండి వచ్చినా, అన్నివైపుల నుండి వచ్చిన పిల్లలందరికీ అభినందనలు.
సేవ టర్న్ కర్ణాటక వారిది:- మంచి ఛాన్స్ లభించింది. కర్ణాటక సేవాధారులు లేవండి. చాలామంది సేవాధారులు వచ్చారు. సగం సభ కర్ణాటక వారే ఉన్నారు. చాలా మంచిది. (2500 మంది కర్ణాటక వారున్నారు) మంచిది, వృద్ధి మంచిగా ఉంది. విధి మరియ వృద్ధి రెండింటి బ్యాలెన్సును పెట్టుకునేవారు. ఇప్పుడు కర్ణాటక వారు నాటకంలో హీరో పాత్రను చేయలేదు. కర్ణాటక పేరే ఉంది, నాటకం చేసేవారు, నాటకంలో కూడా హీరో పాత్రను చేసేవారు. మరి ఇంకా హీరో పాత్రను చేయలేదు. సంఖ్య బాగుంది, అందుకు అభినందనలు. ఇప్పుడు వేరే ఏ జోన్ చేయనటువంటి హీరో పాత్రను చేసి చూపించండి. లక్షమందిని ప్రోగు చేయండి, ఇదైతే కామన్ అయిపోయింది. ఏదైనా నవీనతను చేయండి, అది చూసి అందరూ హియర్-హియర్ అనాలి. (చాలా బాగా చేసారు అని ప్రశంసించాలి). చేయగలరు, కానీ ఇప్పుడింకా గుప్తంగా ఉన్నారు, ప్రత్యక్షం కాలేదు. మరి టీచర్లు, చేస్తారు కదా! ఏదైనా హీరో పాత్రను చేసి చూపించండి. సెంటరు తెరవడము, గీతా పాఠశాలను తెరవడము – ఇవైతే కామన్ అయిపోయాయి. క్రొత్త విషయాన్ని చేసి చూపించండి. క్రొత్త విషయాన్ని చేస్తారు కదా! మంచి మంచి సేవాధారులు, పాత-పాతవారు ఉన్నారు. అద్భుతం చేయండి. అది చూసి అన్ని జోన్లు చప్పట్లు కొట్టాలి. బాప్‌దాదాకు కర్ణాటకపై ఆశలు ఉన్నాయి. ఇప్పుడింకా ఆశల తారలుగానే ఉన్నారు, ఇప్పుడు ఆశా సితారల నుండి సఫలతా సితారలుగా ప్రత్యక్షమవ్వాలి. అవ్వాలి, సరేనా? టీచర్లు కూడా చాలామంది ఉన్నారు. కేవలం టీచర్లు చేతులెత్తండి. చూడండి, ఎంతమంది టీచర్లు ఉన్నారో! పాండవులు కూడా ఉన్నారు. జోన్ హెడ్స్ కూడా ఉన్నారు, వారు కూడా చేతులెత్తండి. ఎంతమంది హ్యాండ్స్ ఉన్నారో చూడండి. చాలా మంచి-మంచి హ్యాండ్స్ ఉన్నారు కేవలం పరదా లోపల ఉన్నారు, స్టేజీ మీదకు రాలేదు. అచ్ఛా- అభినందనలు.
ఇండోర్ కన్యల హాస్టల్ కుమారీలతో:- కుమారీలు ఇప్పుడు అద్భుతాన్ని చేస్తారా లేక కేవలం డ్యాన్స్ చేస్తారా? ఇప్పుడు ఎంత చిన్నవారో అంత అద్భుతాన్ని చేసి చూపించాలి. చిన్న కుమారీలు ఛాలెంజ్ చేయండి. అనుభవం యొక్క ఆధారంతో ఛాలెంజ్ చేయాలి అప్పుడు అందరూ ప్రభావితులవుతారు. బాగుంది, మీ జీవితాన్ని సేఫ్‌గా అయితే చేసుకున్నారు. ప్రపంచ సాంగత్యం నుండైతే రక్షింపబడ్డారు. ఇప్పుడు పరస్పరంలో ఇటువంటి ప్లాన్‌ను తయారు చేయండి. చిన్నవారైనాగానీ అద్భుతమైన ప్లాన్‌ను తయారు చేసి చూపించండి. చేయగలరు. చూడండి, స్థాపన జరిగినప్పుడు చిన్న-చిన్న కుమారీలే కదా అద్భుతాన్ని చేసారు. మీరు కూడా ఏదైనా అద్భుతమైన ప్లాన్‌ను తయారు చేయండి. మంచిది. సాంగత్యం మంచిగా ఉంది, వాతావరణం బాగుంది, రక్షణ కూడా ఉంది, సమయం కూడా ఉంది, ఇప్పుడు ప్లాన్ తయారు చేయండి. సరేనా! తయారు చేస్తారా? ఎటువంటి ప్లాన్ తయారు చేయాలంటే పెద్దవారైతే ఉంటారు కానీ చిన్నవారు శుభానల్లాహ్ అవ్వాలి. అచ్ఛా.
అచ్ఛా - మనసును ఆజ్ఞ అనుసారముగా నడిపించండి. క్షణములో ఎక్కడ కావాలంటే అక్కడ మనసు జోడించబడాలి, నిలిచిపోవాలి. ఈ ఎక్సర్సైజ్ చెయ్యండి. (డ్రిల్) అచ్ఛా - చాలా చోట్ల నుండి పిల్లలు వింటున్నారు. స్మృతి కూడా చేస్తున్నారు, వింటున్నారు కూడా. ఇది విని సంతోషిస్తున్నారు కూడా. సైన్స్ సాధనాలు వాస్తవానికి పిల్లలైన మీ కొరకు సుఖదాయకమైనవి.
నలువైపులా ఉన్న సర్వ ఖజానాలతో సదా సంపన్నులైన పిల్లలకు, సదా భాగ్యశాలి మరియు సంతోషకరమైన ముఖము మరియు నడవడిక ద్వారా సంతోషమనే అంచలిని ఇచ్చే విశ్వకళ్యాణకారీ పిల్లలకు, సదా మనసుకు యజమానిగా అయ్యి ఏకాగ్రతా శక్తి ద్వారా మనసును కంట్రోల్ చేసి మనసును జయించి జగత్తును జయించే పిల్లలకు, సదా బ్రాహ్మణ జీవితము యొక్క విశేషత అయిన పవిత్రతా పర్సనాలిటీలో ఉండే పవిత్ర బ్రాహ్మణాత్మలకు, సదా డబల్ లైట్‌గా అయ్యి ఫరిశ్తా జీవితములో బ్రహ్మాబాబాను ఫాలో చేసేవారికి, ఇలా బ్రహ్మాబాబా సమానమైన పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. నలువైపులా వింటూ ఉన్న, స్మృతి చేస్తూ ఉన్న పిల్లలందరికీ చాలా, చాలా మనస్ఫూర్వకమైన ఆశీర్వాదాలతో కూడిన ప్రియస్మృతులు, అందరికీ నమస్తే.
దాదీలతో:- డ్రామాలో ప్రతి ఒక్కరికీ మంచి పాత్ర లభించింది. మీ పాత్ర మంచిగా అనిపిస్తుంది కదా. బాప్‌దాదా కూడా సంతోషిస్తున్నారు. మీకు (దాదీజీకి) మంచి సహయోగులు కదా, కుడి భుజాలు కదా. రైట్ హ్యాండ్సే కదా? ఈ పూర్తి గ్రూపును చూడండి, వీరంతా మీకు రైట్ హ్యాండ్స్. ఎంత మంచి రైట్ హ్యాండ్స్ ఉన్నారు. వీరికి కూడా (దాదీ జానకికి కూడా) సహయోగులు కదా, రైట్ హ్యాండ్స్ కదా. రైట్ హ్యాండ్స్ కదా? విదేశీ సేవలకు కూడా రైట్ హ్యాండ్స్. (ముగ్గురు నలుగురుని స్టేజీపైకి పిలవండి) మీపై, రైట్ హ్యాండ్స్పై బాధ్యత ఉంది. వీరు నిమిత్తము కానీ బాధ్యత మీది. (విదేశీ సోదరీలతో) ఎందుకంటే హ్యాండ్స్యే పని చేస్తాయి కదా. మీరే చూడండి, శరీరంలో ఎక్కువగా పని చేసేది ఏది? చేయి. మరి మీరందరూ రైట్ హ్యాండ్స్ మరియు హ్యాండ్స్ ఎంత కావాలంటే అంత చేయవచ్చు. వీరి పని (దాదీజీ పని) మస్తకం పని, మీ పని హ్యాండ్స్ పని. వీరు ప్రేరణ ఇస్తారు, సలహా ఇస్తారు, డైరెక్షన్లు ఇస్తారు కానీ చేసేవారు మీరు. ఇప్పుడు వీరు వెళ్ళి ఏమైనా కోర్సు ఇస్తారా! ఇప్పుడు వీరిది (పెద్దక్కయ్యలు) కూడా కోర్సు ఇచ్చే పాత్ర పూర్తయింది. మధుబన్ రైట్ హ్యాండ్స్ కూడా మంచిగా ఉన్నారు మరియు విదేశాల రైట్ హ్యాండ్స్ కూడా మంచిగా ఉన్నారు. అద్భుతాన్ని చేసేవారు. బాప్‌దాదా సంతోషిస్తున్నారు, చూడండి, ఒక్కొక్కరూ ఎంతో మంచి రత్నము.
(సభతో) మీరందరూ కూడా రైట్ హ్యాండ్స్ కదా? రైట్ హ్యాండ్స్. రైట్ హ్యాండ్ అంటే రైట్ కర్మను చేసేవారు. ఎప్పుడు కూడా వేస్ట్ కర్మలు చేసేవారు కాదు, రైట్ కర్మలే చేసేవారు. బాప్‌దాదాకు మంచిగా అనిపిస్తుంది, మీరందరూ అలంకారము. ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో మరియు ఇతరులు కూడా. అందరూ ఒకరికొకరు సహయోగులుగా అయ్యి చాలా బాగా కార్యాన్ని చేయడం చూసి బాప్‌దాదా సంతోషిస్తారు. నిమిత్తంగా అయిన మీ అందరి యూనిటీ మరియు ప్యూరిటీ రెండూ పూర్తి పరివారానికి ధైర్యాన్ని ఇస్తాయి. పాండవులు కూడా ఉన్నారు. పాండవులను స్టేజీపైకి పిలవలేదు, కానీ పాండవులు కూడా ఉన్నారు. అందరూ ఎంతోమంచి ఛాన్సును తీసుకున్నారు. చేరుకున్నారు అంటే ఛాన్స్‌ను తీసుకున్నట్లే. చూడండి, బాప్‌దాదా ఒక్కొక్కరినీ చూసినప్పుడు, వీరిని పిలిచి మాట్లాడాలి అనుకుంటారు కానీ సాకార శరీరము అంటే బంధనము. సాకార శరీరము అనే బంధనములోకి వచ్చేసారు కదా, సాకార శరీర బంధనముతో అంతగా చేయలేము కానీ వతనములో చేయవచ్చు అందుకే బంధనముక్తులుగా అయిపోయారు. అక్కడ స్థానము యొక్క సమస్య లేదు, సమయం యొక్క సమస్య లేదు కానీ మీకు తెలుసా, ఒక గుప్తమైన విషయాన్ని చెప్తాము, బాప్‌దాదా వతనములో గ్రూపు-గ్రూపులను పిలుస్తారు మరియు వారితో ఆత్మిక సంభాషణ చేస్తారు. ఎలా అయితే సాకారంలో గుర్తుందా – బ్రహ్మా బాబా ఒక్కొక్క గ్రూపును తమ వద్దకు భోజనానికి పిలిపించేవారు, గుర్తుందా? (క్లిఫ్టన్లో) అలాగే బాప్‌దాదా వతనములో తప్పకుండా పిలుస్తారు కానీ అలా సాకారంలో చేయలేరు. అచ్ఛా. మధుబన్‌లో ఎంతో మంచి-మంచి సేవాధారులు కూర్చుని ఉన్నారు, చూడండి, ఎంతో మంచి డిపార్టుమెంట్ వారు కూర్చుని ఉన్నారు. డబల్ విదేశీయులు చూడండి, ఎంత మంచివారు ఉన్నారో! మాతలు కూడా ఎంతో మంచి-మంచి వారున్నారు. కానీ అందరినీ ఎలా పిలవాలి! స్టేజీపైకి అందరూ రాగలరా? రాలేరు. మంచిది, మధుబన్ ఆకర్షణ అందరికీ ఛత్రఛాయలా పని చేస్తుంది. ఇక్కడకు చేరుకున్నప్పుడు ఎంతో మంచి అనుభవాలను చేసుకుంటారు.