Search for a command to run...
17 Oct 2003
‘‘పూర్తి సంవత్సరము - సంతుష్టమణులుగా అయ్యి సదా సంతుష్టముగా ఉండండి మరియు అందరినీ సంతుష్టము చేయండి’’
17 October 2003 · తెలుగు
ఈరోజు మనోభిరాముడైన బాప్‌దాదా తమ నలువైపులా ఉన్న అనగా ఎదురుగా ఉన్నవారిని కూడా మరియు దూరముగా ఉంటూ కూడా సమీపముగా ఉన్న రాకుమారులైన, అతి ప్రియమైన పిల్లలు ప్రతి ఒక్కరినీ చూసి హర్షిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ రాజులే, అందుకే రాజకుమారులు. ఈ పరమాత్మ ప్రేమ, అనురాగము విశ్వములో చాలా కొద్దిమంది ఆత్మలకే ప్రాప్తిస్తుంది, కానీ మీరందరూ పరమాత్మ ప్రేమకు, పరమాత్మ అనురాగానికి అధికారులు. ప్రపంచములోని ఆత్మలు రండి, రండి అని పిలుస్తూ ఉన్నారు, కానీ మీరందరూ పరమాత్మ ప్రేమను అనుభవము చేస్తున్నారు, పరమాత్మ పాలనలో పాలింపబడుతున్నారు. మీ భాగ్యాన్ని ఈ విధంగా అనుభవము చేస్తున్నారా? బాప్‌దాదా పిల్లలందరినీ డబల్ రాజ్య అధికారులుగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా స్వరాజ్య అధికారము కల రాజులు మరియు భవిష్యత్తులోనైతే రాజ్యము మీ జన్మసిద్ధ అధికారము. కనుక డబల్ రాజులు. అందరూ రాజులే కదా, ప్రజలైతే కాదు కదా! రాజయోగులేనా లేక కొంతమంది ప్రజాయోగులు కూడా ఉన్నారా? ప్రజాయోగులు ఎవరైనా ఉన్నారా, వెనుక ఉన్నవారు రాజయోగులేనా? ప్రజాయోగులు ఎవ్వరూ లేరు కదా! పక్కా? ఆలోచించి అవును అని చెప్పండి! రాజ్య అధికారి అనగా సర్వ సూక్ష్మ మరియు స్థూల కర్మేంద్రియాలకు అధికారులు, ఎందుకంటే స్వరాజ్యము ఉంది కదా? మరి అప్పుడప్పుడు రాజులుగా అవుతారా లేక సదా రాజులుగా ఉంటారా? ముఖ్యమైన మీ మనసు-బుద్ధి-సంస్కారాలకు కూడా అధికారులేనా? సదా అధికారులేనా లేక అప్పుడప్పుడూనా? స్వ రాజ్యము అనేది సదా స్వరాజ్యముగానే ఉంటుందా, లేదా ఒక రోజు ఉండి, మరొక రోజు ఉండదా? రాజ్యమనేది సదా ఉంటుంది కదా? కనుక సదా స్వరాజ్య అధికారులు అనగా సదా మనసు-బుద్ధి-సంస్కారాలపై అధికారులు. సదా అలా ఉంటున్నారా? సదా ఉంటుందా అంటే అవును అని చెప్పటం లేదు? ఒక్కోసారి మనసు మిమ్మల్ని నడిపిస్తుందా లేక మీరు మనసును నడిపిస్తారా? ఒక్కోసారి మనసు అధికారిగా అవుతుందా? అవుతుంది కదా! మరి సదా స్వరాజ్య అధికారులే విశ్వ రాజ్య అధికారులు.
సదా చెక్ చేసుకోండి - ఎంత సమయము మరియు ఎంత శక్తితో మీ కర్మేంద్రియాలపై, మనసు-బుద్ధి-సంస్కారాలపై ఇప్పుడు అధికారులుగా అవుతారో, అంతగానే భవిష్యత్తులో రాజ్య అధికారము లభిస్తుంది. ఒకవేళ ఇప్పుడు పరమాత్మ పాలన, పరమాత్మ చదువు, పరమాత్మ శ్రీమతము ఆధారముపై ఈ ఒక్క సంగమయుగ జన్మలో సదా అధికారులుగా ఉండకపోతే, ఇక 21 జన్మలు ఎలా రాజ్య అధికారులుగా అవుతారు? ఇది లెక్క కదా! ఈ సమయములోని స్వరాజ్యమనేది, స్వయముపై రాజుగా అవ్వటము ద్వారానే 21 జన్మలకు గ్యారంటీ ఉంటుంది. నేను ఎవరిని మరియు ఎలా అవుతాను అన్న మీ భవిష్యత్తును ఈ వర్తమాన అధికారము ద్వారా స్వయమే తెలుసుకోగలరు. ఆలోచించండి, విశేష ఆత్మలైన మీ అనాది, ఆది పర్సనాలిటీ మరియు రాయల్టీ ఎంత ఉన్నతమైనది! అనాది రూపములో కూడా చూడండి, ఆత్మలైన మీరు పరంధామములో ఉన్నప్పుడు ఎంతటి మెరుస్తున్న ఆత్మలుగా కనిపించేవారు! ఆ మెరుపుకు ఉన్న రాయల్టీ, పర్సనాలిటీ (హుందాతనము, వ్యక్తిత్వము) ఎంత గొప్పది! అది కనిపిస్తుందా? మరియు బాబాతోపాటుగా ఆత్మ రూపములో కూడా ఉంటారు, సమీపముగా ఉంటారు. ఏ విధంగా ఆకాశములో కొన్ని-కొన్ని నక్షత్రాలు చాలా ఎక్కువగా మెరుస్తూ ఉంటాయి కదా, అదే విధంగా ఆత్మలైన మీరు కూడా విశేషముగా బాబాతోపాటు ఉంటారు మరియు విశేషముగా మెరుస్తున్న నక్షత్రాలుగా ఉంటారు. పరంధామములో కూడా మీరు బాబాకు సమీపమైనవారు మరియు తర్వాత ఆదికాలమైన సత్యయుగములో కూడా దేవాత్మలైన మీ పర్సనాలిటీ, రాయల్టీ ఎంత ఉన్నతమైనది. మొత్తము కల్పమంతా చుట్టి రండి, ధర్మాత్మలు వచ్చి వెళ్ళారు, మహాత్ములు వచ్చి వెళ్ళారు, ధర్మపితలు వచ్చి వెళ్ళారు, నేతలు వచ్చి వెళ్ళారు, అభినేతలు (యాక్టర్లు) వచ్చి వెళ్ళారు, కానీ సత్యయుగములో దేవాత్మలైన మీకు ఉన్న పర్సనాలిటీ వారెవరికైనా ఉందా? మీ దేవ స్వరూపము ఎదురుగా వస్తుంది కదా? వస్తుందా లేక మేము అలా తయారవుతామో, లేదో తెలియదు అని అంటారా! పక్కాయే కదా! మీ దేవ స్వరూపాన్ని ఎదురుగా తెచ్చుకోండి మరియు చూడండి, ఆ పర్సనాలిటీ ఎదురుగా వచ్చిందా? ఎంత రాయల్టీ ఉంది. ప్రకృతి కూడా పర్సనాలిటీ కలిగినదిగా అవుతుంది. పక్షులు, చెట్లు, ఫలాలు, పూలు అన్నీ పర్సనాలిటీ కలిగినవిగా ఉంటాయి, రాయల్‌గా ఉంటాయి. అచ్ఛా, ఇప్పుడు కిందకు రండి, మీ పూజ్య స్వరూపాన్ని చూసారా? మీ పూజ జరుగుతుంది! డబల్ విదేశీయులు పూజ్యులుగా అవుతారా లేక ఇండియావారు అవుతారా? మీరు దేవీలు, దేవతలుగా తయారయ్యారా? తొండము కలవారిగా, తోక కలవారిగా కాదు. దేవీలలో కూడా ఆ కాళీ రూపము కలవారిగా కాదు. దేవతల మందిరాలలో చూడండి, మీ పూజ్య స్వరూపానికి ఎంత రాయల్టీ ఉంది, ఎంత పర్సనాలిటీ ఉంది? మూర్తి 4 అడుగులు, 5 అడుగులే ఉంటుంది, కానీ మందిరాలను ఎంత పెద్దవిగా తయారుచేస్తారు. ఇదే రాయల్టీ మరియు పర్సనాలిటీ. ఈ రోజుల్లో ఎంత ప్రధానమంత్రి అయినా లేక రాజు అయినా కానీ పాపం, వారి విగ్రహాన్ని తయారుచేసి ఎండలో పెట్టేస్తారు. ఆ విగ్రహాలకు ఏదైనా జరగవచ్చు. కానీ మీ పూజ్య స్వరూపము యొక్క పర్సనాలిటీ ఎంత ఉన్నతమైనది. ఉన్నతమైనదే కదా! కుమారీలు కూర్చుని ఉన్నారు కదా! మీలో రాయల్టీ ఉంటుంది కదా? మళ్ళీ అంతిమములో సంగమయుగములో కూడా మీ అందరి రాయల్టీ ఎంత ఉన్నతమైనది. బ్రాహ్మణ జీవితములోని పర్సనాలిటీ ఎంత గొప్పది! డైరెక్టుగా భగవంతుడే మీ బ్రాహ్మణ జీవితములో పర్సనాలిటీని మరియు రాయల్టీని నింపారు. బ్రాహ్మణ జీవితము యొక్క చిత్రకారుడు ఎవరు? స్వయంగా తండ్రి. బ్రాహ్మణ జీవితములోని పర్సనాలిటీ మరియు రాయల్టీ అంటే ఏమిటి? పవిత్రత. పవిత్రతయే రాయల్టీ. అంతే కదా! బ్రాహ్మణ ఆత్మలందరూ ఎవరైతే ఇక్కడ కూర్చుని ఉన్నారో, వారిలో పవిత్రతకు చెందిన రాయల్టీ ఉంది కదా! ఉంది, తల ఊపండి. వెనుకవారు చేతులు ఎత్తుతున్నారు. మీరు వెనుక లేరు, ఎదురుగా ఉన్నారు. చూడండి, వెనుక వైపుకు స్వతహాగా దృష్టి వెళ్తుంది. ముందు వైపుకైతే ప్రత్యేకముగా చూడవలసి వస్తుంది కానీ వెనుకవైపుకు ఆటోమేటిక్‌గా వెళ్తుంది.
కనుక చెక్ చేసుకోండి - పవిత్రత యొక్క పర్సనాలిటీ సదా ఉంటుందా? మనసా-వాచా-కర్మణా, వృత్తి-దృష్టి మరియు కృతి, అన్నింటిలోనూ పవిత్రత ఉందా? మనసా పవిత్రత అనగా సదా మరియు సర్వుల పట్ల శుభ భావన, శుభ కామన - సర్వుల పట్ల. ఎదుటి ఆత్మ ఎటువంటివారైనా సరే, పవిత్రతా రాయల్టీ కల మనసా ఎలా ఉంటుందంటే - సర్వుల పట్ల శుభ భావన, శుభ కామన, కళ్యాణ భావన, దయా భావన, దాతాతనపు భావన. మరియు దృష్టి ద్వారా సదా ప్రతి ఒక్కరిలో ఆత్మిక స్వరూపమైనా కనిపించాలి లేక ఫరిశ్తా రూపమైనా కనిపించాలి. వారు ఫరిశ్తాగా అవ్వకపోయినా కానీ, నా దృష్టిలో ఫరిశ్తా రూపము మరియు ఆత్మిక రూపమే ఉండాలి మరియు కృతిలో అనగా సంపర్క సంబంధాలలో, కర్మలలోకి రావటములో, సదా సర్వులకు స్నేహాన్ని ఇవ్వటము, సుఖాన్ని ఇవ్వటము. ఇతరులు స్నేహాన్ని ఇచ్చినా, ఇవ్వకపోయినా కానీ నా కర్తవ్యము - స్నేహాన్ని ఇచ్చి స్నేహిగా తయారుచెయ్యటము, సుఖాన్ని ఇవ్వటము. దుఃఖాన్ని ఇవ్వకండి, దుఃఖాన్ని తీసుకోకండి అన్న స్లోగన్ ఉంది కదా. ఇవ్వకూడదు కూడా, తీసుకోకూడదు కూడా. ఇచ్చేవారు ఎప్పుడైనా మీకు దుఃఖాన్ని ఇచ్చినా కానీ మీరు వారిని సుఖము యొక్క స్మృతితోనే చూడండి. పడిపోయినవారిని ఇంకా పడేయరు, పడిపోయినవారిని సదా పైకి లేపుతారు. వారు పరవశులై దుఃఖాన్ని ఇస్తున్నారు. వారు పడిపోయారు కదా! కావున వారిని ఇంకా పడేయకూడదు. పాపం వారిని ఇంకా కాలితో తన్నడం కాదు. వారిని స్నేహముతో పైకి లేపండి. అందులో కూడా ముందు దానము ఇంటి నుండే ప్రారంభమవుతుంది. మొదటైతే దానము ఇంటి వద్దనే ప్రారంభమవుతుంది కదా, మీ సహచరులందరినీ, సేవా సహచరులను, బ్రాహ్మణ పరివారములోని సహచరులను, ప్రతి ఒక్కరినీ పైకి లేపండి. వారు తమలోని చెడును చూపించినా కూడా, మీరు మాత్రం వారిలోని విశేషతను చూడండి. నంబరువారుగా అయితే ఉన్నారు కదా! చూడండి, మాల మీ స్మృతిచిహ్నము. మరి అందరిదీ ఒకటే నంబరు కాదు కదా! 108 మంది ఉన్నారు కదా! కనుక నంబరువారుగా ఉన్నారు మరియు ఉంటారు, కానీ నా కర్తవ్యము ఏమిటి? ఇలా ఆలోచించకండి - అచ్ఛా, నేను 8 రత్నాలలోనైతే లేనే లేను, 108 లోకి బహుశా వస్తానేమో, ఆ 108లో చివరివానిగా కూడా ఉండవచ్చు, మరి నాలో కూడా కొన్ని సంస్కారాలు ఉంటాయి కదా, ఇలా ఆలోచించకండి. ఇతరులకు సుఖాన్ని ఇస్తూ-ఇస్తూ, స్నేహాన్ని ఇస్తూ-ఇస్తూ మీ సంస్కారాలు కూడా స్నేహీగా, సుఖీగా అయిపోతాయి. ఇది సేవ మరియు ఈ సేవ మొదట ఇంటి నుండే ప్రారంభమవుతుంది.
బాప్‌దాదాకు ఈ రోజు ఒక విషయములో నవ్వు వస్తుంది, చెప్పమంటారా? చూడండి, మీకు కూడా నవ్వు వస్తుంది. బాప్‌దాదా అయితే పిల్లల ఆటలను చూస్తుంటారు కదా! బాప్‌దాదా ఒక్క క్షణములో ఒక్కోసారి ఒక్కో సెంటరు యొక్క టి.వి.ని తెరుస్తారు, ఒక్కోసారి విదేశమువారిది, ఒక్కోసారి ఇండియావారిది స్విచ్ ఆన్ చేస్తారు, అప్పుడు వారు ఏం చేస్తున్నారు అన్నది తెలిసిపోతుంది ఎందుకంటే బాబాకు పిల్లలపై ప్రేమ ఉంది కదా. పిల్లలు కూడా అంటారు - సమానముగా అవ్వాల్సిందే అని. పక్కా కదా, సమానముగా అవ్వాల్సిందేనా! ఆలోచించి చెయ్యి ఎత్తండి. మరణించాల్సి వచ్చినా, వంగాల్సి వచ్చినా, సహనము చెయ్యాల్సి వచ్చినా, వినాల్సి వచ్చినా కానీ, సమానముగా అయ్యే చూపిస్తాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. కుమారీలు ఆలోచించి చెయ్యి ఎత్తండి. వీరి ఫోటో తియ్యండి. కుమారీలు చాలామంది ఉన్నారు. మరణించాల్సి వస్తుంది, వంగాల్సి వస్తుంది. పాండవులు చేతులెత్తండి. విన్నారా, సమానముగా అవ్వాల్సిందే. సమానముగా అవ్వకపోతే మజా రాదు, పరంధామములో కూడా సమీపముగా ఉండరు, పూజ్యులుగా అవ్వడములో కూడా తేడా వస్తుంది, సత్యయుగ రాజ్య భాగ్యములో కూడా తేడా వస్తుంది.
బ్రహ్మాబాబాపై మీకు ప్రేమ ఉంది కదా, డబల్ విదేశీయులకు అందరికంటే ఎక్కువ ప్రేమ ఉంది. ఎవరికైతే బ్రహ్మా బాబాపై చాలా గాఢమైన, మనస్ఫూర్వకమైన ప్రేమ ఉందో వారు చేతులెత్తండి. అచ్ఛా, పక్కా ప్రేమ ఉంది కదా? ఇప్పుడు ప్రశ్న అడుగుతాము, ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో, ఆ ప్రేమకు గుర్తు ఏమిటంటే - ఏదైతే వారికి ఇష్టమనిపిస్తుందో, ప్రేమించేవారికి కూడా అది ఇష్టమనిపిస్తుంది, ఇరువురి సంస్కారాలు, సంకల్పాలు, స్వభావము అన్నీ కలుస్తాయి, అందుకే వారు ప్రియమనిపిస్తారు. మరి బ్రహ్మా బాబాపై ప్రేమ ఉన్నట్లయితే 21 జన్మలూ, మొదటి జన్మ నుండి, రెండవ-మూడవ జన్మ నుండి వస్తే బాగుండదు, కానీ మొదటి జన్మ నుండి మొదలుకుని చివరి జన్మ వరకు తోడుగా ఉంటారు, రకరకాల రూపాలలో తోడుగా ఉంటారు. మరి తోడుగా ఎవరు ఉండగలరు? సమానముగా ఉన్నవారు. వారు నంబర్‌వన్ ఆత్మ. మరి తోడుగా ఎలా ఉంటారు? నంబర్‌వన్‌గా అయినప్పుడే తోడుగా ఉంటారు కదా, అన్నింటిలోనూ నంబర్‌వన్, మనసాలో, వాణిలో, కర్మణాలో, వృత్తిలో, దృష్టిలో, కృతిలో, అన్నింటిలోనూ. మరి నంబర్‌వన్‌గా ఉన్నారా లేక నంబరువారుగా ఉన్నారా? మరి ఒకవేళ ప్రేమ ఉంటే ఆ ప్రేమ కోసము దేనినైనా బలిహారము చేయడము కష్టమనిపించదు. చివరి జన్మలో, కలియుగ అంతిమములో కూడా దేహాభిమానపు ప్రేమ కలవారు ప్రాణాలను కూడా బలిహారము చేసేస్తారు. మరి ఒకవేళ మీరు బ్రహ్మా బాబాపై ఉన్న ప్రేమకు మీ సంస్కారాలను పరివర్తన చేసుకుంటే, అదేమంత పెద్ద విషయము! అదేమైనా పెద్ద విషయమా? కాదు. మరి ఈ రోజు నుండి అందరి సంస్కారాలు మారిపోయాయా! పక్కా? రిపోర్ట్ వస్తుంది, మీతోటివారు వ్రాస్తారు, పక్కా? దాదీలూ, వింటున్నారు కదా! సంస్కారాలు మారిపోయాయి అని అంటారా లేక సమయము పడుతుందా? ఏమిటి? మోహిని (న్యూయార్క్) చెప్పండి, మారిపోతారు కదా! వీరంతా మారిపోతారు కదా? అమెరికావారైతే మారిపోతారు. నవ్వు వచ్చే విషయము చెప్పటం మిగిలిపోయింది.
నవ్వు వచ్చే విషయము ఏమిటంటే - పురుషార్థమైతే చాలా చేస్తున్నాము అని అందరూ అంటారు మరియు బాప్‌దాదాకు వారిని చూస్తే దయ కూడా కలుగుతుంది, పురుషార్థము చాలా చేస్తారు, అప్పుడప్పుడు చాలా శ్రమ చేస్తారు, కానీ తర్వాత ఏమంటారు - ఏం చెయ్యాలి, నా సంస్కారాలే అలా ఉన్నాయి. సంస్కారాల వంక పెట్టి తమను తాము తేలిక చేసేసుకుంటారు కానీ బాబా ఈ రోజు ఏం చూసారంటే, నా సంస్కారము అని మీరు ఏదైతే అంటారో, వాస్తవానికి అది మీ సంస్కారమా? మీరు ఆత్మ, ఆత్మే కదా! శరీరమైతే కాదు కదా! మరి ఆత్మ సంస్కారాలు ఏమిటి? మరియు మీ అసలైన సంస్కారాలు ఏవి? నా సంస్కారాలు అని ఈ రోజు మీరు ఏదైతే అంటున్నారో అవి మీవా లేక రావణుడివా? ఎవరివి? మీవా? కాదా? మరి నావి అని ఎందుకంటారు! నా సంస్కారము ఇలా ఉంది అనే అంటారు కదా? మరి ఈ రోజు నుండి నా సంస్కారము అని అనకండి. వద్దు. అప్పుడప్పుడు అక్కడి నుండి, ఇక్కడి నుండి, చెత్త అంతా ఎగిరి వస్తుంది కదా! అలాగే ఈ రావణుడి వస్తువులు మీ దగ్గరకు వస్తే, వాటిని నావి అని ఎలా అంటారు! అవి మీవా? కాదు కదా? కనుక ఇక ఎప్పుడూ ఇలా అనకండి, నాది అన్న పదాన్ని ఉపయోగించినప్పుడు నేను ఎవరిని మరియు నా సంస్కారము ఏమిటి అన్నది గుర్తు తెచ్చుకోండి. దేహాభిమానములో ఉన్నప్పుడు అది నా సంస్కారము, ఆత్మాభిమానములో ఈ సంస్కారము లేదు. కనుక ఇప్పుడు ఈ భాషను కూడా పరివర్తన చేసుకోండి. నా సంస్కారము అని అంటూ నిర్ల్యక్షులైపోతారు. అటువంటి భావము లేదు కానీ అది నా సంస్కారము అని అంటారు. అచ్ఛా, మరొక మాట ఏమంటారు? నా స్వభావము. ఇప్పుడు స్వభావము అన్న పదము ఎంత బాగుంది. స్వ అయితే ఎప్పుడూ మంచిగానే ఉంటుంది. నా స్వభావము, స్వయము యొక్క భావము మంచిగా ఉంటుంది, చెడుగా ఉండదు. కనుక నా స్వభావము, నా సంస్కారము అని ఈ పదాలేవైతే ఉపయోగిస్తారో, ఇప్పుడు ఈ భాషను మార్చుకోండి. నాది అన్న పదము ఎప్పుడు వచ్చినా, నా అసలైన సంస్కారము ఏమిటి అన్నదానిని గుర్తు తెచ్చుకోండి. ఇలా ఎవరు అంటారు? ఇది నా సంస్కారము అని ఆత్మ అంటుందా? ఇది ఆలోచించినప్పుడు మీపై మీకే నవ్వు వస్తుంది, వస్తుంది కదా నవ్వు? నవ్వు వస్తే ఏదైతే గొడవ చేస్తుంటారో అది సమాప్తమైపోతుంది. దీనినే భాషను పరివర్తన చేయటము అని అంటారు అనగా ప్రతి ఆత్మ పట్ల స్వమానము మరియు గౌరవముతో ఉండటము. స్వయము కూడా సదా స్వమానములో ఉండండి, ఇతరులను కూడా స్వమానముతో చూడండి. స్వమానముతో చూసినప్పుడు ఏ విషయాలు జరిగినా, అవి మీకు కూడా ఇష్టం లేని విషయాలే, ఎప్పుడైనా ఏదైనా గొడవ జరిగితే ఇష్టమనిపిస్తుందా? అనిపించదు కదా? కనుక ఒకరినొకరు చూడటమే స్వమాన దృష్టితో చూడండి. వీరు విశేష ఆత్మ, వీరు బాబా పాలనలో ఉన్న బ్రాహ్మణ ఆత్మ, వీరు కోట్లలో కొందరు, కొందరిలో కూడా కొందరిలో ఉన్న ఆత్మ అని స్వమాన దృష్టితో చూడండి. కేవలం ఒక పని చెయ్యండి - మీ నయనాలలో బిందువును ఇముడ్చుకోండి, అంతే. ఒక బిందువుతోనైతే చూస్తున్నారు, రెండవ బిందువును కూడా ఇముడ్చుకున్నట్లయితే ఇక ఏమీ జరగదు, శ్రమ చెయ్యాల్సిన అవసరం ఉండదు. ఆత్మ, ఆత్మను చూస్తున్నట్లు ఉంటుంది. ఆత్మ, ఆత్మతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది. ఆత్మిక వృత్తిని, ఆత్మిక దృష్టిని తయారుచేసుకోండి. ఏం చెయ్యాలో అర్థమైందా? ఇప్పుడు ఇక నా సంస్కారము అని ఎప్పుడూ అనకండి. స్వభావము అని అన్నట్లయితే స్వయము యొక్క భావములో ఉండండి. సరేనా!
బాప్‌దాదా ఈ సీజన్ యొక్క మొదటి టర్న్‌లో, మొదటి టర్న్ అయితే మీ అందరిదీ కదా, మరి మొదటి టర్న్ తీసుకున్నప్పుడు మొదటి నంబరులో రిటర్న్ కూడా ఇవ్వాలి. ఇవ్వాల్సి ఉంటుంది కదా! పైగా డబల్ విదేశీయులకు జన్మతహా ఉన్న విశేషత ఏమిటంటే – ఏది చేసినా అది పక్కాగా చేస్తారు. సగం సగం చేయరు, చేస్తాము లేక చేయము. అంతేకానీ అవును కాదు మధ్యన వ్రేలాడరు. మరి రిటర్న్ చేయాలి కదా! ఈ సీజన్లో, పూర్తి సీజన్లో, ఈరోజు మొదటి ఛాన్స్ కదా, బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు - ఈ పూర్తి సంవత్సరమంతా, సీజన్ 6 నెలలే నడిచినా కానీ పూర్తి సంవత్సరమంతా అందరినీ ఎప్పుడు కలిసినా, ఎవరిని కలిసినా, పరస్పరములోనైనా లేక ఇతర ఆత్మలతోనైనా ఎప్పుడు కలిసినా, ఎవరిని కలిసినా, వారికి సంతుష్టతా సహయోగాన్ని ఇవ్వండి. స్వయము కూడా సంతుష్టముగా ఉండండి మరియు ఇతరులను కూడా సంతుష్టము చేయండి. ఈ సీజన్ యొక్క స్వమానము - సంతుష్టమణి. సదా సంతుష్టమణి. సోదరులు కూడా మణియే, మణ అని ఉండదు, మణి అనే ఉంటుంది. ప్రతి ఒక్క ఆత్మ, ప్రతి సమయము సంతుష్టమణిగా ఉండాలి. మరియు స్వయం సంతుష్టముగా ఉంటే ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు. సంతుష్టముగా ఉండండి మరియు సంతుష్టము చెయ్యండి. సరేనా, ఇష్టమేనా? (అందరూ చేతులెత్తారు) చాలా మంచిది, అభినందనలు, అభినందనలు. అచ్ఛా. ఏం జరిగినా కానీ, మీ స్వమానమనే సీట్‌పై ఏకాగ్రులై ఉండండి, ఒకసారి ఒక సీట్‌పైకి, మరోసారి మరో సీట్‌పైకి, ఇలా భ్రమించకండి. మీ స్వమానమనే సీట్‌పై ఏకాగ్రులై ఉండండి. మరియు ఏకాగ్రత అనే సీట్‌పై సెట్ అయినప్పుడు ఒకవేళ ఏదైనా విషయము వస్తే, దానిని ఒక కార్టూన్ షోలా చూడండి. కార్టూన్ చూడటం మంచిగా అనిపిస్తుంది కదా. కనుక ఇది సమస్య కాదు, కార్టూన్ షో నడుస్తూ ఉంది. సింహము వస్తుంది, మేక వస్తుంది, తేలు వస్తుంది, అశుద్ధమైన బల్లి వస్తుంది - అది కార్టూన్ షో. మీ సీట్ నుండి అప్సెట్ అవ్వకండి. మజా వస్తుంది. అచ్ఛా. పులి కూడా వస్తుంది, కుక్క కూడా వస్తుంది, పిల్లి కూడా వస్తుంది – రానివ్వండి - చూస్తూ ఉండండి.
బాప్‌దాదా వినిపించి ఉన్నారు – మీరందరూ మీ స్వమానము అనే షాన్ అనే సీట్‌పై సెట్ అయ్యి ఉంటే పరేషాన్ అవ్వరు. స్వమానము అనే షాన్(హుందాతనము)లో ఉండరు కాబట్టి పరేషాన్ అవుతారు. చిన్నని పేపర్ టైగరే ఉంటుంది కానీ దానిని చూసి పరేషాన్(కలవరం) అవుతారు. మరి ఈ సంవత్సరం ఏకాగ్రులై స్వమానము అనే సీట్‌పై సెట్ అవ్వండి. నాకు తెలుసు కానీ... అని అనకండి. విన్నారు కూడా, తెలుసు కూడా, కానీ... ఇలా వద్దు. వినడము మరియు తెలుసుకోవడము వరకు బాగుంది కానీ స్వయాన్ని ఆ విధంగా అంగీకరించి ఏకాగ్రులై సీట్‌పై కూర్చోండి, స్వయాన్ని ఆ విధంగా అంగీకరించి నడుచుకోరు, కేవలం తెలుసుకున్నారు మరియు విన్నారు. సీట్‌పై స్వరూపంలో స్థితులై కూర్చోండి. అర్థమయిందా!
బాప్‌దాదాకు, నాలుగు గ్రూపులు వచ్చి ఉన్నాయి అన్న సమాచారము లభించింది. ఒకటి కుమారీలది, కంప్యూటర్ గ్రూప్, మేనేజ్మెంట్ గ్రూప్, హెల్త్... నాలుగు గ్రూపుల సమాచారము లభించింది. మంచిది కానీ కంప్యూటర్ పని చేస్తూ కూడా కంప్యూటర్ కుర్చీలో కూర్చుని కూడా మీ స్వమానము అనే సీట్‌ను విడిచిపెట్టకండి. డబల్ సీట్‌పై కూర్చోండి, కేవలం కంప్యూటర్ కుర్చీపై మాత్రమే కూర్చోకండి. అప్పుడు డబల్ సేవ జరుగుతుంది. చాలా సేవ చేయవచ్చు. హెల్త్ వారు కూడా చాలా సేవ చేయవచ్చు. చూపించారు కదా, పుస్తకం తయారు చేసారు కదా, సమాచారము అంతా విన్నాము. పుస్తకాన్ని ఎవరు తయారు చేసారు? మంచిగా తయారు చేసారు. కానీ హెల్త్ కన్నా ముందు స్వమానము. స్వమానము అనే సీట్‌ను విడిచిపెట్టకండి. ఒకసారి ఒక సీట్‌పై, ఒకసారి మరో సీట్‌పై కూర్చోకండి. శ్రేష్ఠ స్వరూప స్మృతి యొక్క సీట్ పైననే కూర్చోండి. మీ సీట్‌ను విడిచి పెట్టకండి. కుమారీలు కూడా ఏ ప్రతిజ్ఞ అయితే చేసారో, చాలా మంచిగా చేసారు. బాప్‌దాదా ఇప్పుడు చేసిన ప్రతిజ్ఞకు అభినందనలు తెలుపుతున్నారు కానీ ఏ అభినందనలను తీసుకోవాలి? ప్రాక్టికల్. మరి ఈరోజు కేవలం చేసిన ప్రతిజ్ఞకు అభినందనలు తెలుపుతున్నాము, తర్వాత ప్రాక్టికల్ రిజల్ట్ యొక్క అభినందనలు తెలుపుతాము. ఆ అభినందనలు తీసుకోవాలి కదా! మంచి-మంచివారు కూర్చుని ఉన్నారు, కనిపిస్తున్నారు. మంచి స్వమానము కలిగిన కుమారీలు ఉన్నారు.
(10 సంవత్సరాల వారు కూడా ఉన్నారు) ఇది కూడా చాలా అద్భుతము, 10 సంవత్సరాలు అమరులుగా ఉన్నారు. మరి అమరనాథుడైన బాబా తరఫున అమర భవ యొక్క వరదానము ఉంది. 10 సంవత్సరాల వారు చేతులెత్తండి. ఆంటీ అంకుల్కైతే చాలా సంవత్సరాలు అయ్యాయి.
మరి 10 సంవత్సరాల వారికి బాప్‌దాదా 9 రత్నాల మాలను వేస్తున్నారు. 9 రత్నాలు నిర్విఘ్నంగా చేసేవిగా ఉంటాయి. 8 శక్తులు మరియు బాబా, సదా స్మృతిలో ఉండాలి. మంచిది. ఫారెన్‌లో ఉంటూ ఇప్పుడు 10 సంవత్సరాలు పాస్ అయ్యారంటే అమరులుగా అయినట్లే కదా! లేక ఇక ముందు ఏమవుతుందో తెలియదు అంటారా! అచ్ఛా, 10 సంవత్సరాల వారు ఎవరైతే చేతులెత్తారో, వారికి తమ ఫ్యూచర్ గురించి కూడా నిశ్చయము ఉందా లేక ఇందులో నడవగలమో లేదో అని భావిస్తున్నారా? చివరి వరకు కలిసి ఉండాల్సిందే, అమరులుగా ఉండవలసిందే, ఏది ఏమైనాగానీ, హిమాలయం వంటి పర్వతం మీద పడినాగానీ, పడుతుంది, పక్కాగా ఉన్నారా? చాలా మంచిది. అచ్ఛా, ఇండియా వారు చేతులెత్తారా? మేము పక్కాగానే ఉన్నాము అని ఇండియావారు భావిస్తున్నారా? వీరు 10 సంవత్సరాల వారు కాదు, అందరికీ ఈ నిశ్చయము కావాలి – ఏది ఏమైనా, కలిసి ఉంటాము, కలిసి వెళ్తాము, కలిసి రాజ్యంలోకి వస్తాము అని నిశ్చయము ఉంది కదా! బాబాను ఒంటరిగా విడిచి వెళ్ళిపోకండి. ఒంటరిగా మంచిగా అనిపించదు కదా. మీకు కూడా మంచిగా అనిపించదు, బాబాకు కూడా మంచిగా అనిపించదు. కనుక విడిచిపెట్టకండి. ఏ విషయము వచ్చినాగానీ మీరు మనసుతో, బాబా, నా బాబా అని అనండి, బాబా హాజరు అయిపోతారు. మీ సమస్యను పరిష్కరించేస్తారు. మనస్ఫూర్తిగా చెప్పండి, బాబా ఈ పరిస్థితి ఉంది, బాబా ఇది చేయండి, బాబా ఇది... బాబా బంధింపబడి ఉన్నాడు. కానీ మనస్ఫూర్తిగా చెప్పాలి, అంతేకానీ అవసరానికి గుర్తు చేసుకుని తర్వాత మర్చిపోవడం కాదు.
మరి డబల్ విదేశీయులు అందరూ మీ భాగ్యాన్ని చూసుకుని సంతోషిస్తున్నారా! మొదటి ఛాన్స్ లభించింది మరియు స్పెషల్ ఛాన్స్ లభించింది. మరైతే పూర్తి సీజన్ బాబా చెప్పిన దానిని పాటిస్తారు కదా. ఆలోచించేవారిగా అవ్వవద్దు, పాటించేవారిగా అవ్వండి. నావారు అని అన్నప్పుడు, నా బాబా, బాబా కూడా నా పిల్లలు అని అన్నారు, అంటే పక్కా బేరం కుదిరినట్లే కదా! అంతే కదా దాదీలూ! విదేశీయులను చూసి సంతోషం కలుగుతుంది కదా. చాలా సంతోషము. దాదీకైతే చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఒకవేళ ఏమైనా వీలు ఉంటే, దాదీ అయితే మీ అందరినీ ఇక్కడే పెట్టుకుంటారు. వారంతా హాజరుగా ఉంటారా లేక లండన్ యొక్క డైమండ్ హాల్ ఏమవుతుందో అని ఆలోచిస్తారా? లేదు, వీరంతా సదా ఎవరెడీ. ఒకవేళ బాప్‌దాదా వచ్చేయండి అని ఆర్డర్ వేస్తే, ఏదీ ఆలోచించకండి, సేవ గురించి, సెంటరు గురించి, తోటివారి గురించి ఏమీ ఆలోచించకండి, వచ్చేయండి అని అంటే వచ్చేస్తారా? (వచ్చేస్తాము) మంచిది. ఆరోజు కూడా వస్తుంది, వచ్చేయండి అన్న ఆర్డర్ వస్తుంది ఎందుకంటే బాబా ప్రేమ సాగరుడు కదా, కనుక వేరు-వేరుగా కాకుండా కలిసి వెళ్తాము. ఎవరైతే పక్కా ఉంటారో వారు ఉంటారు. మరి అందరూ నిర్విఘ్నంగా ఉన్నారా లేక ఏదైనా ఒక మూలన విఘ్నము ఉండి పోయిందా? లేదు కదా? ఏదైనా విఘ్నము ఇంకా లోపల ఉందా? కొద్దికొద్దిగా అయితే ఉంది కదా? లేదా? అందరూ నిర్విఘ్నంగా ఉన్నారా? ఈరోజు అందరూ ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళండి, ఓం శాంతి భవన్ కదా, అంతా ఓం శాంతి అయిపోతుంది. ఏమి చేయాలి? ముల్లును వెంటనే తీసేయడం జరుగుతుంది. ఒకవేళ ముల్లును వెంటనే తీయకపోతే కాలును తీసేయాల్సి వస్తుంది, కావున విఘ్నాన్ని సమాప్తం చేయండి. మీ ఒరిజినల్ సంస్కారాన్ని ఇమర్జ్ చేసుకోండి. అచ్ఛా – అన్ని గ్రూపులు బాగున్నాయా?
ఇప్పుడు గ్రూపు-గ్రూపు చేతులెత్తండి.
కుమారీల గ్రూప్ చేతులెత్తండి. కంప్యూటర్ గ్రూప్ వారు వెనుక కూర్చుని ఉన్నారు, హెల్త్ వారు, ఎస్.ఎమ్.ఎల్ వారు, బాగుంది, నాలుగు గ్రూపుల సమాచారము బాగుంది. అచ్ఛా. ఎదురుగా ఉత్తరాలు కూడా పెట్టారు.
నలువైపుల నుండి ఉత్తరాలు, కార్డులు కూడా వచ్చాయి, మనసు యొక్క ఉత్తరాలు కూడా వచ్చాయి, కాగితం ఉత్తరాలు కూడా వచ్చాయి, రెండూ బాప్‌దాదా వద్దకు చేరుకున్నాయి. బాప్‌దాదాకు తమ మనసు ప్రేమను కూడా పంపుతారు మరియు దానితోపాటు కొందరు తమ సేవా సమాచారాన్ని కూడా మంచిగా పంపిస్తారు. మరికొందరు కొద్దిగా యాద్‌తో (స్మృతితో) పాటు ఫరియాద్ (ఫిర్యాదు) కూడా పంపుతారు – బాబా ఇది చేయండి, బాబా ఇది చేయండి. కానీ బాగుంది – ఒకవేళ వ్రాస్తే, వ్రాసేవారికి సహయోగము కూడా లభిస్తుంది. సత్యమైన మనసు మరియు స్వచ్ఛమైన మనసు ఉంటుంది కదా, స్వచ్ఛమైన మనసుకు కోరుకున్నది లభిస్తుంది. ఇప్పుడు కూడా నలువైపుల వింటున్నారు కూడా, కొందరు చూస్తున్నారు కూడా, కానీ వినేవారు చాలామంది ఉన్నారు. మీరు ఈ హాల్లో కూర్చుని ఉన్నారు, వారు వారి దేశంలోని హాల్లో కూర్చున్నారు. ఈ సైన్సు సాధనాలు కూడా బ్రాహ్మణులైన మీ కోసమే వెలువడ్డాయి. మీరు స్థాపనా కార్యంలో వినియోగిస్తారు, వారు వినాశన కార్యంలో వినియోగిస్తారు. కానీ బాప్‌దాదా సైన్సు పిల్లలకు కూడా అభినందనలు తెలుపుతారు ఎందుకంటే మంచి ఇన్వెన్షన్‌ను తయారు చేసారు, వీటి కారణంగా దూరంగా కూర్చున్న పిల్లలు కూడా వింటున్నారు, చూస్తున్నారు. అచ్ఛా.
నలువైపులా ఉన్న రాజకుమార పిల్లలకు, సర్వ స్నేహీ, సహయోగీ, సమానులుగా తయారయ్యే పిల్లలకు, సదా తమ శ్రేష్ఠ స్వ భావము మరియు సంస్కారాలను స్వరూపములో ఇమర్జ్ చేసుకునే పిల్లలకు, సదా సుఖాన్ని ఇచ్చే, సర్వులకు స్నేహాన్ని ఇచ్చే పిల్లలకు, సదా సంతుష్టమణిగా అయ్యి సంతుష్టతా కిరణాలను వ్యాపింపజేసే పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీజీతో:- చాలా బాగా ఆరోగ్యంగా అయ్యారు. అలాంటి విషయమేమీ లేదు, మిగిలినది కూడా మంచిగా అయిపోతుంది. (బాబా వరదానము ఉంది) మీరు స్వయం కూడా వరదాని కదా, అందుకే వరదానము త్వరగా పని చేస్తుంది. అందరికీ మీపై ఎంతో ప్రేమ ఉంది. అందరి ప్రేమ ఉంది ఎందుకంటే బాబా మిమ్మల్ని నిమిత్తం చేసారు. బాబా స్వయం అవ్యక్తమయ్యారు కానీ సాకార రూపంలో మిమ్మల్ని నిమిత్తంగా చేసారు.
గంగే దాదీతో:- మహారథుల సభ మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మహారథులు అందరూ కలిసారు కదా. బాప్‌దాదాకు కూడా చాలా మంచిగా అనిపించింది.
రుక్మిణి దాదీతో:- వర్తమానమును మరియు భవిష్యత్తును మంచిగా చేసుకుంటున్నారు.
విదేశీ పెద్దక్కయ్యలతో:- అందరూ మంచిగా సేవలో నిమగ్నమై ఉన్నారు. వృద్ధి చేస్తున్నారు మరియు విధి పూర్వకంగా నడుస్తున్నందుకు బాప్‌దాదాకు కూడా సంతోషంగా ఉంది. విధి కూడా ఉంది, వృద్ధి కూడా ఉంది. అక్కడ ఇక్కడ ప్రోగ్రాములైతే చాలా మంచిగా జరుగుతూనే ఉన్నాయి. పరస్పరంలో కలుసుకుని విశ్వంలో ధ్వనిని వ్యాప్తి చేయడానికి ప్లాన్లను తయారు చేస్తూనే ఉంటారు.
(కంప్యూటర్‌తో చేయదగ్గ సేవల గురించి ప్లాన్ చేస్తున్నాము) మూలమూలన కంప్యూటర్లయితే ఉన్నాయి, సమయం కూడా తక్కువ మరియు నలువైపుల వ్యాపించి ఉన్నాయి. కుమారీలు కూడా మంచి-మంచిగా ఉన్నారు. మంచి ప్లాన్‌ను తయారు చేసారు, బాప్‌దాదా సంతోషిస్తున్నారు. నలువైపుల కోసం తయారు చేసారు, హెల్త్ కూడా వచ్చేసింది, కంప్యూటర్ కూడా వచ్చేసింది, కోర్స్ కూడా వచ్చేసింది.
విదేశీ ముఖ్యమైన అన్నయ్యలతో:- చాలా మంచిది, పాండవ సైన్యం కూడా తక్కువేమీ కాదు. శక్తులు, శక్తులే కానీ పాండవులు సుభాన్ అల్లాహ్. పాండవులతో అయితే పాండవపతి ఉండనే ఉన్నారు. చూడండి, ఒక్కొక్కరిదీ వారి వారి విశేషత ఉంటుంది, బాప్‌దాదా అయితే ఒక్కొక్కరి విశేషత చూస్తుంటారు మరియు ప్రతి ఒక్కరూ తమ విశేషతల పాత్రను మంచిగా చేస్తున్నారు. అంతే కదా! అంకల్ కూడా తమ పాత్రను మంచిగా చేస్తున్నారు, ఈ రాబిన్ కూడా మంచిగా చేస్తున్నారు, గోవింద్, నిజార్ కూడా చేస్తున్నారు. పాత్రను మంచిగా చేసారు కదా. మంచి-మంచి పాండవులు కూడా వెలువడ్డారు, అలాగే శక్తులు కూడా వెలువడ్డారు. సేవ కోసం డబల్ విదేశీయుల గ్రూపు చాలా బాగా తయారవ్వడం బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. అందరిలో సేవ యొక్క ఉల్లాసము ఉంది. ఉల్లాసము ఉంది కదా? పునాది అంకల్. బాగున్నారు. సదా అమర భవ. స్మృతి మరియు సేవలో అమర భవ. అచ్ఛా. ఈరోజు నుండి ప్రశ్నలు అడగడము సమాప్తము. మాయాజీతులేనా లేక ఇంకా ప్రశ్నలు అడుగుతారా? మాయాజీతులు అయ్యారు కదా? ఇప్పటినుండి ఎవ్వరినీ మీరు మాయాజీతులేనా అని అడగకండి. కాదు కానీ మాయాజీత్ అన్న నషాలో చాలా ఎగురుతున్నారు. ఎగిరే కళ వారు, ఎవరిని అడిగినాగానీ ఇదే చెప్పండి, నేను దిల్ఖుష్ ఫరిశ్తాను. మాయ పేరే తీసుకోకండి. పేరు సహితంగా సమాప్తం చేసేయండి, ఎందుకంటే కొంత సమయం మాయాజీతులుగా ఉండే అభ్యాసాన్ని తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఎవరైతే బహుకాలము మాయాజీతులుగా ఉంటారో వారికి బహుకాలము యొక్క రాజ్య భాగ్యము లభించింది. కావున సదా మాయాజీత్. ఉన్నదే మాయాజీత్. బాప్‌దాదా దృష్టి ఉంది, దృష్టితో సంగఠన తృప్తి పడవలసిందే. అచ్ఛా!