Search for a command to run...
15 Oct 2004
"ఒక్కరిని ప్రత్యక్షము చేయడానికి ఏకరస స్థితిని తయారు చేసుకోండి, స్వమానములో ఉండండి, అందరికీ గౌరవాన్ని ఇవ్వండి"
15 October 2004 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకముపై మెరుస్తున్న మూడు భాగ్య సితారలను మెరుస్తూ ఉండటం చూస్తున్నారు. ఒకటి, పరమాత్మ పాలన యొక్క భాగ్యము, రెండు, పరమాత్మ చదువు యొక్క భాగ్యము మరియు మూడు, పరమాత్మ వరదానాల భాగ్యము. ఇటువంటి మూడు సితారలను ప్రతి ఒక్కరి మస్తకము మధ్యలో చూస్తున్నారు. మీరు కూడా మెరుస్తున్న మీ భాగ్య సితారలను చూస్తున్నారా? కనిపిస్తున్నాయా? ఇటువంటి శ్రేష్ఠ భాగ్య సితారలు మొత్తము విశ్వములో మరెవ్వరి మస్తకములోనూ మెరుస్తూ ఉండడం కనిపించవు. ఈ భాగ్య సితారలైతే అందరి మస్తకములోనూ మెరుస్తున్నాయి, కానీ మెరుపులో అక్కడక్కడా తేడా కనిపిస్తుంది. కొందరి మెరుపు చాలా శక్తిశాలిగా ఉంది, కొందరి మెరుపు మధ్యమముగా ఉంది. భాగ్యవిధాత పిల్లలందరికీ భాగ్యాన్ని ఒకే విధంగా ఇచ్చారు. ఎవ్వరికీ స్పెషల్‌గా ఇవ్వలేదు. పాలన కూడా ఒకే విధముగా ఇచ్చారు, చదువు కూడా అందరికీ కలిపే చెప్తున్నారు, వరదానాలు కూడా అందరికీ ఒకే విధమైనవి లభించాయి. మొత్తము విశ్వములోని మూలమూలల్లో చదువు సదా ఒక్కటే ఉంటుంది. ఒకటే మురళి, ఒకటే డేట్ మరియు అమృతవేళ సమయము కూడా తమ-తమ దేశాలలోని సమయము లెక్కలో ఉన్నా కూడా సమయము ఒకటే, వరదానము కూడా ఒక్కటే, స్లోగన్ కూడా ఒక్కటే - ఇది అద్భుతము. ఏమన్నా తేడా ఉంటుందా? అమెరికా మరియు లండన్‌లో తేడా ఉంటుందా? ఉండదు. అయితే మరి తేడా ఎందుకు ఉంది?
అమృతవేళ బాప్‌దాదా నలువైపులా ఒకే విధమైన పాలన చేస్తారు. నిరంతర స్మృతి యొక్క విధి కూడా అందరికీ ఒకటే లభిస్తుంది, అయినా నంబరువారుగా ఎందుకు ఉన్నారు? విధి ఒక్కటే కానీ సిద్ధి యొక్క ప్రాప్తిలో తేడా ఎందుకు ఉంది? బాప్‌దాదాకు నలువైపులా ఉన్న పిల్లలపై ప్రేమ కూడా ఒకే విధంగా ఉంది. బాప్‌దాదా ప్రేమలో, పురుషార్థానుసారముగా నంబరులో చివరి నంబరు అయినా కానీ బాప్‌దాదాకు ప్రేమ అయితే చివరి నంబరువారిపై కూడా అదే విధంగా ఉంది. చివరి నంబరువారిపై అయితే ప్రేమతోపాటు ఇంకా దయ కూడా ఉంది, వీరు లాస్ట్ నుండి ఫాస్ట్‌గా, ఫస్ట్‌గా అయిపోవాలి అని అనుకుంటారు. దూరదూరాల నుండి చేరుకున్న మీరందరూ ఎలా చేరుకున్నారు? పరమాత్మ ప్రేమ ఆకర్షించి తీసుకువచ్చింది కదా! ప్రేమ బంధములో ఆకర్షించబడి వచ్చేసారు. కావున బాప్‌దాదాకు అందరిపైనా ప్రేమ ఉంది. ఇలానే భావిస్తున్నారా లేక నా పట్ల ప్రేమ ఉందా లేక తక్కువ ప్రేమ ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుందా? బాప్‌దాదాకు పిల్లలందరిపై ఒకరి కంటే ఒకరిపై ఎక్కువ ప్రేమ ఉంది. మరియు ఈ పరమాత్మ ప్రేమయే పిల్లలందరి విశేష పాలనకు ఆధారము. ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారు - బాబాపై నాకు ఎక్కువ ప్రేమ ఉంది అని అనుకుంటున్నారా లేక ఇతరులకు ఎక్కువ ప్రేమ ఉంది, నాకు తక్కువ ఉంది అని అనుకుంటున్నారా? అలా అనుకుంటున్నారా? నాకు ప్రేమ ఉంది, నాకు ప్రేమ ఉంది అని అనుకుంటున్నారు కదా? అలానే అనుకుంటున్నారు కదా? పాండవులు అలానే అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరూ ‘‘నా బాబా’’ అనే అంటారు. అంతేకానీ సెంటరు ఇంఛార్జ్ యొక్క బాబా, దాదా యొక్క బాబా, జానకి దాదీ యొక్క బాబా అని అనరు కదా. అలా అంటారా? అనరు. నా బాబా అనే అంటారు. నా వారు అని అన్నప్పుడు మరియు బాబా కూడా నా వారు అని అన్నప్పుడు, ఆ ఒక్క ‘నా’ అనే పదముతోనే పిల్లలు బాబాకు చెందినవారిగా అయిపోయారు మరియు బాబా పిల్లలకు చెందినవారిగా అయిపోయారు. ఇది కష్టమనిపించిందా? కష్టమనిపించిందా? కొంచెం-కొంచెం అనిపించిందా? అనిపించలేదా? అప్పుడప్పుడు అనిపిస్తుందా? అనిపించదా? అనిపిస్తుంది. మరి కష్టమనిపించినప్పుడు ఏం చేస్తారు? అలసిపోతారా? మనస్ఫూర్తిగా, ప్రేమతో ‘‘నా బాబా’’ అని అనండి, అప్పుడు శ్రమ ప్రేమలోకి మారిపోతుంది. ‘‘నా బాబా’’ అని అనగానే బాబా వద్దకు ఆ శబ్దము చేరుకుంటుంది మరియు బాబా ఎక్స్ ట్రా సహాయము అందిస్తారు. కానీ ఇది మనసుతో చేసుకున్న ఒప్పందము, నోటితో చేసుకున్న ఒప్పందము కాదు. ఇది మనసుతో చేసుకున్న ఒప్పందము. మరి మనసుతో ఒప్పందము చెయ్యటములో తెలివైనవారే కదా? అలా చేయడం వస్తుంది కదా? వెనుక ఉన్నవారికి వస్తుందా? వస్తుంది కాబట్టే చేరుకున్నారు కదా. కానీ అందరికంటే దూరదేశి ఎవరు? అమెరికానా? అమెరికావారు దూరదేశీయులా లేక బాబా దూరదేశీనా? అమెరికా అయితే ఈ ప్రపంచములోనే ఉంది. బాబా అయితే మరో ప్రపంచము నుండి వస్తారు. కనుక అందరికంటే దూరదేశి ఎవరు? అమెరికావారు కారు. అందరికంటే దూరదేశి బాప్‌దాదా. ఒకరు ఆకార వతనము నుండి వస్తారు, ఒకరు పరంధామము నుండి వస్తారు, మరి వాటిముందు అమెరికా ఎంత? అసలేమీ కాదు.
ఈరోజు దూరదేశి బాబా ఈ సాకార ప్రపంచములోని దూరదేశి పిల్లలను కలుస్తున్నారు. ఈరోజు మా కోసం బాప్‌దాదా వచ్చారు అన్న నషా ఉంది కదా? భారతవాసులైతే బాబాకు చెందినవారే కానీ డబల్ విదేశీయులను చూసి బాప్‌దాదా విశేషముగా సంతోషిస్తారు. ఎందుకు సంతోషిస్తారు? బాప్‌దాదా ఏం చూసారంటే – భారత్‌లోనైతే బాబా వచ్చారు కనుక భారతవాసులకు ఈ నషా ఎక్స్ట్రాగా ఉంటుంది కానీ డబల్ విదేశీయులపై ప్రేమ ఎందుకని ఉందంటే రకరకాల సంస్కృతులకు చెందినవారైనా కానీ బ్రాహ్మణ సంస్కృతిలోకి పరివర్తన అయిపోయారు. అయ్యారు కదా? ఇది భారత్ యొక్క సంస్కృతి, మా సంస్కృతి వేరు అని ఇప్పుడైతే సంకల్పము రావటం లేదా? లేదు. ఇప్పుడు బాప్‌దాదా రిజల్టులో ఏం చూసారంటే - అందరూ ఒకే సంస్కృతికి చెందినవారిగా అయిపోయారు. ఏ స్థానానికి చెందినవారైనా కానీ, సాకార శరీరము పరంగా దేశాలు వేర్వేరు కానీ, ఆత్మ బ్రాహ్మణ సంస్కృతికి చెందినదిగా ఉంది. డబల్ విదేశీయులలోని మరొక విషయము బాప్‌దాదాకు చాలా బాగా అనిపిస్తుంది, అదేమిటో తెలుసా? (త్వరగా సేవ చెయ్యటములో నిమగ్నమైపోయారు). ఇంకా చెప్పండి? (ఉద్యోగము కూడా చేస్తారు, సేవ కూడా చేస్తారు), అలా అయితే ఇండియాలో కూడా చేస్తారు. ఇండియాలో కూడా ఉద్యోగము చేస్తారు. (ఏదైనా జరిగితే సత్యతతో తమలోని బలహీనతను చెప్పేస్తారు, స్పష్టవాదులు), అచ్ఛా, ఇండియావారు స్పష్టవాదులు కాదా?
బాప్‌దాదా ఏం చూసారంటే - దూరముగా ఉన్నా కానీ బాబాపై ప్రేమ కారణముగా ప్రేమలో మెజారిటీ పాస్ అయ్యారు. భారత్కైతే భాగ్యము ఉండనే ఉంది కానీ దూరముగా ఉన్నా కానీ ప్రేమలో అందరూ పాస్. ప్రేమలో పర్సెంటేజ్ ఉందా అని బాప్‌దాదా ప్రశ్నించినట్లయితే ఏమంటారు? బాబాపై ప్రేమ అనే సబ్జెక్టులో పర్సెంటేజ్ ఉందా? ప్రేమలో 100 శాతము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. (అందరూ చేతులెత్తారు) అచ్ఛా - 100 శాతము ఉందా? భారతవాసులు చేతులెత్తటం లేదు. చూడండి, బాబా భారత్‌లోనే వచ్చారు కావున భారత్‌కు అందరికంటే ఎక్కువ భాగ్యము లభించింది. ఈ విషయములో బాబాకు అమెరికా ఇష్టమనిపించలేదు, భారత్‌యే ఇష్టమనిపించింది. ఈమె (అమెరికా యొక్క గాయత్రి అక్కయ్య) ఎదురుగా కూర్చుని ఉన్నారు, అందుకే అమెరికా అంటున్నాము. కానీ దూరముగా ఉన్నా సరే ప్రేమ బాగుంది. సమస్యలు వస్తాయి కూడా, అయినా కానీ బాబా-బాబా అంటూ వాటిని తొలగించేస్తారు.
ప్రేమలో అయితే బాప్‌దాదా కూడా పాస్ చేసేసారు, ఇప్పుడు ఇంకా ఎందులో పాస్ అవ్వాలి? ఇంకా అవ్వాలి కదా! అయ్యారు కూడా మరియు ఇంకా అవ్వాలి కూడా. వర్తమాన సమయమనుసారముగా బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు - పిల్లలు ప్రతి ఒక్కరిలో స్వ పరివర్తన శక్తి యొక్క పర్సెంటేజ్ ఎంత ఉంది? ఏ విధంగా ప్రేమ శక్తిలో అందరూ చేతులెత్తారో, అందరూ చేతులెత్తారు కదా! అంతగానే స్వ పరివర్తనలో కూడా తీవ్ర గతి ఉందా? ఈ విషయములో సగమే చెయ్యి ఎత్తుతారా లేక పూర్తిగా ఎత్తుతారా? ఎలా ఎత్తుతారు? పరివర్తన చేసుకుంటారు కూడా, కానీ సమయము పడుతుంది. సమయ సమీపత అనుసారముగా స్వ పరివర్తనా శక్తి ఎంత తీవ్రముగా ఉండాలంటే, ఎలా అయితే కాగితముపై బిందువు పెట్టాలంటే ఎంత సమయములో పెట్టగలరు? ఎంత సమయము పడుతుంది? బిందువు పెట్టడానికి ఎంత సమయము పడుతుంది? ఒక్క క్షణము కూడా పట్టదు. అంతే కదా! మరి అటువంటి తీవ్ర గతి ఉందా? ఇందులో చేతులెత్తుతారా? ఇందులో సగమే చేతులెత్తుతారు. సమయము యొక్క వేగము తీవ్రముగా ఉంది, స్వ పరివర్తన యొక్క శక్తి కూడా అంత తీవ్రముగా ఉండాలి. పరివర్తన అని అన్నప్పుడు ముందుగా పరివర్తన అన్న పదానికి ముందు స్వ అన్న పదాన్ని సదా గుర్తు పెట్టుకోండి. పరివర్తన కాదు, స్వ పరివర్తన. బాప్‌దాదాకు గుర్తుంది - సంస్కార పరివర్తన ద్వారా సంసార (ప్రపంచ) పరివర్తన చేస్తాము అని పిల్లలు బాబాకు ఒక సంవత్సరము కొరకు ప్రతిజ్ఞ చేసారు. గుర్తుందా? సంస్కార పరివర్తన ద్వారా ప్రపంచ పరివర్తన అన్న సంవత్సరాన్ని జరుపుకున్నారు. ప్రపంచ గతి అయితే అతిలోకి వెళ్తూ ఉంది. మరి సంస్కార పరివర్తన, దాని గతి అంత వేగముగా ఉందా? ఆ మాటకొస్తే విదేశాల విశేషత ఏమిటంటే - మామూలుగా విదేశాలు ఫాస్ట్‌గా నడుస్తాయి, ఫాస్ట్‌గా చేస్తాయి. కనుక బాబా అడుగుతున్నారు - సంస్కార పరివర్తనలో ఫాస్ట్‌గా ఉన్నారా? బాప్‌దాదా స్వ పరివర్తన యొక్క వేగాన్ని ఇప్పుడు తీవ్రముగా చూడాలని కోరుకుంటున్నారు. బాప్‌దాదా ఏం కోరుకుంటారు అని అందరూ అడుగుతారు కదా? పరస్పరము ఆత్మిక సంభాషణ చేసుకుంటుంటారు కదా, అప్పుడు బాప్‌దాదా ఏం కోరుకుంటారు అని ఒకరినొకరు అడుగుతుంటారు. కనుక బాప్‌దాదా దీనిని కోరుకుంటున్నారు. క్షణములో బిందువు పడాలి. కాగితముపై బిందువు పడుతుంది కదా, దానికంటే కూడా వేగముగా, పరివర్తనలో ఏదైతే అయథార్థమో, దానికి బిందువు పడాలి. బిందువు పెట్టడం వస్తుందా? వస్తుంది కదా! కానీ అప్పుడప్పుడు అది ప్రశ్నార్థకమైపోతుంది. పెట్టేది బిందువు కానీ అది ప్రశ్నార్థకమైపోతుంది. ఇది ఎందుకు, ఇది ఏమిటి? ఈ ఎందుకు మరియు ఏమిటి... ఇవి బిందువును ప్రశ్నార్థకములోకి మార్చేస్తాయి. బాప్‌దాదా ఇంతకుముందు కూడా చెప్పారు - వై, వై (ఎందుకు, ఎందుకు) అని అనకండి, ఏం చేయాలి? ఫ్లై. అయితే వాహ్, వాహ్ అనండి లేదా ఎగరండి. ఎందుకు, ఎందుకు అని అనకండి. ఎందుకు, ఎందుకు అని అనటం త్వరగా వస్తుంది కదా! అది వచ్చేస్తుంది కదా? ఎందుకు అనేది వచ్చినప్పుడు దానిని వాహ్, వాహ్గా చెయ్యండి. ఎవరైనా ఏదైనా చేస్తే, ఏదైనా అంటే - వాహ్ డ్రామా వాహ్! ఇలా ఎందుకు చేస్తారు, ఇలా ఎందుకు అంటారు అని అనవద్దు. వీరు చేసినట్లయితే నేను చేస్తాను అని కూడా అనవద్దు.
ఈరోజుల్లో బాప్‌దాదా చూసారు, వినిపించమంటారా! పరివర్తన చేసుకోవాలి కదా! ఈరోజుల్లోని రిజల్టులో, విదేశాలలోనైనా లేక ఇండియాలోనైనా, రెండు వైపులా ఒక విషయము యొక్క అల ఉంది, అది ఏమిటి? ఇది అవ్వాలి, ఇది లభించాలి, వీరు ఇది చెయ్యాలి... నేను ఏదైతే ఆలోచిస్తానో, ఏదైతే అంటానో అది జరగాలి... ఈ కావాలి, కావాలి అనేది సంకల్పమాత్రముగా ఉన్నా కూడా ఆ వేస్ట్ థాట్స్ (వ్యర్థ ఆలోచనలు) బెస్ట్‌గా అవ్వనివ్వవు. బాప్‌దాదా అందరిదీ వేస్ట్ యొక్క చార్టును కొద్ది సమయము కొరకు నోట్ చేసారు. చెక్ చేసారు. బాప్‌దాదా వద్దనైతే శక్తిశాలీ మెషినరీ ఉంది కదా. మీ దగ్గర ఉన్నలాంటి కంప్యూటర్ కాదు, మీ కంప్యూటర్ అయితే నిందిస్తుంది కూడా. కానీ బాప్‌దాదా వద్ద ఉన్న చెకింగ్ మెషినరీ చాలా వేగవంతమైనది. బాప్‌దాదా చూసారు - మెజారిటీవారికి వ్యర్థ సంకల్పాలు మొత్తము రోజంతటిలో మధ్యమధ్యలో నడుస్తూనే ఉంటాయి. ఏమవుతుందంటే ఈ వేస్ట్ సంకల్పాల బరువు ఎక్కువైపోతుంది మరియు బెస్ట్ సంకల్పాల బరువు తక్కువైపోతుంది. కనుక మధ్యమధ్యలో ఈ వ్యర్థ సంకల్పాలు ఏవైతే నడుస్తాయో, అవి బుద్ధిని భారంగా చేసేస్తాయి. పురుషార్థాన్ని భారంగా చేసేస్తాయి. బరువుగా ఉంటాయి కదా, అందుకే అవి తమవైపుకు లాగుతుంటాయి, అందుకే స్వ ఉన్నతికి లిఫ్ట్ అయిన శుభ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో, అవి మెట్లు కూడా కాదు, అవి లిఫ్ట్, ఆ శుభ సంకల్పాలు తక్కువగా ఉన్న కారణముగా, శ్రమ అనే మెట్లు ఎక్కవలసి వస్తుంది. కేవలం రెండు పదాలను గుర్తు పెట్టుకోండి, అంతే - వేస్టును (వ్యర్థాన్ని) సమాప్తము చేసేందుకు అమృతవేళ నుండి రాత్రి వరకు రెండు పదాలను సంకల్పాలలో, మాటలలో మరియు కర్మలలో, కార్యములో పెట్టండి, ప్రాక్టికల్లోకి తీసుకురండి. ఆ రెండు పదాలు ఏమిటంటే – స్వమాన్ (స్వమానము) మరియు సమ్మాన్ (గౌరవము). స్వమానములో ఉండాలి మరియు గౌరవాన్ని ఇవ్వాలి. ఎవరు ఎలా ఉన్నా కానీ మనము గౌరవాన్ని ఇవ్వాలి. గౌరవాన్ని ఇవ్వాలి, స్వమానములో స్థితులవ్వాలి. ఈ రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. ఒక్కోసారి స్వమానములో ఎక్కువగా ఉంటారు, ఒక్కోసారి గౌరవాన్ని ఇవ్వటములో తక్కువగా ఉంటారు. ఇతరులు గౌరవాన్ని ఇస్తే అప్పుడు నేనూ ఇస్తాను అన్నట్లు ఉండకూడదు. నేను దాతగా అవ్వాలి. శివ శక్తి పాండవ సేన దాత పిల్లలు, దాతలు. వారు ఇస్తే నేను ఇస్తాను అన్నది బిజినెస్ అయిపోతుంది, అది దాతగా అయినట్లు కాదు. మరి మీరు బిజినెస్ మ్యానా లేక దాతనా? దాత ఎప్పుడూ తీసుకునేవారిగా ఉండరు. మీ వృత్తిలో మరియు దృష్టిలో ఇదే లక్ష్యము పెట్టుకోండి - నేను సదా ప్రతి ఒక్కరి పట్ల అనగా సర్వుల పట్ల, వారు అజ్ఞానులైనా లేక జ్ఞానులైనా కానీ, అజ్ఞానుల పట్ల ఎంతైనా శుభ భావన పెట్టుకుంటారు కానీ జ్ఞాన స్వరూప ఆత్మల పట్ల పరస్పరం ప్రతి సమయము శుభ భావన, శుభ కామన ఉండాలి. వృత్తి ఆ విధంగా తయారైపోవాలి, దృష్టి ఆ విధంగా తయారైపోవాలి, అంతే. దృష్టిలో స్థూల బిందువు ఉంటుంది, ఆ బిందువు ఎప్పుడైనా మాయమైపోతుందా! కళ్ళ నుండి ఒకవేళ బిందువు మాయమైపోతే ఎలా అయిపోతారు? చూడగలుగుతారా? కనుక ఎలా అయితే కళ్ళల్లో బిందువు ఉంటుందో, అలా ఆత్మ మరియు బాబా బిందువు నయనాలలో ఇమిడి ఉండాలి. చూసే బిందువు ఎప్పుడూ ఎలా అయితే మాయమవ్వదో అలా ఆత్మ మరియు బాబా స్మృతి అనే బిందువు వృత్తి నుండి, దృష్టి నుండి మాయమవ్వకూడదు. ఫాలో ఫాదర్ చెయ్యాలి కదా! కనుక ఏ విధంగా బాబా దృష్టిలో మరియు వృత్తిలో ప్రతి బిడ్డ కొరకు స్వమానము మరియు గౌరవము ఉందో, అలాగే మీ దృష్టి-వృత్తిలో స్వమానము, గౌరవము ఉండాలి. గౌరవాన్ని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే - వీరు మారాలి, వీరు ఇది చెయ్యకూడదు, వీరు ఇలా ఉండాలి అని మనసులో ఏదైతే ఉంటుందో అది శిక్షణ ద్వారా అవ్వదు కానీ గౌరవాన్ని ఇచ్చినట్లయితే ఇది అవ్వాలి, వీరు మారాలి, వారు ఇలా చెయ్యాలి అని మనసులో ఉన్న సంకల్పాలను వారు చెయ్యటం మొదలుపెడతారు. వృత్తి ద్వారా మారుతారు, చెప్పినందువల్ల మారరు. మరి ఏం చేస్తారు? స్వమానము మరియు గౌరవము, ఈ రెండూ గుర్తుంటాయి కదా లేక కేవలము స్వమానమే గుర్తుంటుందా? గౌరవాన్ని ఇవ్వటము అనగా గౌరవాన్ని తీసుకోవటము. ఎవరికైనా గౌరవాన్ని ఇవ్వటము అనగా గౌరవనీయులుగా అవ్వటము అని భావించండి. ఆత్మిక ప్రేమకు గుర్తు ఏమిటంటే - ఇతరుల లోపాలను తమ శుభ భావన, శుభ కామనలతో పరివర్తన చెయ్యటము. బాప్‌దాదా ఇప్పుడు చివరి సందేశములో కూడా పంపించారు - వర్తమాన సమయములో మీ స్వరూపాన్ని దయాస్వరూపముగా తయారుచేసుకోండి, దయార్ద్ర హృదయముగా తయారుచేసుకోండి. చివరి జన్మలో కూడా మీ జడ చిత్రాలు దయా స్వరూపముగా అయ్యి భక్తులపై దయ చూపిస్తున్నాయి. చిత్రాలే ఇంత దయా స్వరూపముగా ఉంటే ఇక చైతన్యములో ఎలా ఉంటారు? చైతన్యములో అయితే దయలో గని వంటివారు. దయలో గనిగా అవ్వండి. ఎవరు వచ్చినా సరే దయ చూపించండి, ఇదే ప్రేమకు గుర్తు. చెయ్యాలి కదా? లేక కేవలము వినాలా? చెయ్యాల్సిందే, అవ్వాల్సిందే. మరి బాప్‌దాదా ఏం కోరుకుంటున్నారు అన్నదానికి సమాధానము ఇస్తున్నాము. ఇలా ప్రశ్నిస్తారు కదా, అందుకే బాప్‌దాదా సమాధానమిస్తున్నారు.
ఇకపోతే బాప్‌దాదాకు సంతోషంగా ఉంది, చూడండి, ఎన్ని దేశాల నుండి వచ్చారో? భిన్న భిన్న దేశాల నుండి ఒక్క మధుబన్కు చేరుకున్నారు. బాప్‌దాదా గత సంవత్సరం ఒక పని ఇచ్చారు, గుర్తుందా? గుర్తుందా? ఎవరికి గుర్తుంది? పాండవులు, శక్తులు? బాప్‌దాదా ఏమన్నారంటే, ఈ సంవత్సరం, ఒక సంవత్సరం గడిచిపోయింది, వారసులను మరియు మైక్‌లను బాబా ముందుకు తీసుకురండి. ఎంతమంది వారసులను తయారు చేసారు? చెప్పండి, ఆస్ట్రేలియా? ఎంతమంది వారసులు వెలువడ్డారు? అమెరికా చెప్పండి, ఎంతమంది వారసులు వెలువడ్డారు? మైక్‌లు తయారవుతున్నారా? ఇలాగా? కానీ బాబా ముందుకు రావడం లేదు. మీరైతే వచ్చేసారు కానీ మైక్‌లు మరియు వారసులు రాలేదు. వచ్చారా? ఏ దేశం నుండైనా వారసులు వచ్చారా? పాత వారే కదా. ఏ దేశమైనా ఉంటే చేతులెత్తండి. ఎన్ని దేశాలు వచ్చాయి? వీరు వారసునిగా అయి వచ్చారు, (కొలంబియా నుండి ఒక సోదరి చేతులెత్తారు). అభినందనలు. చాలా మంచిది. ఇంకెక్కడి నుండి వచ్చారు? (ఒకరు బ్రెజిల్ నుండి వచ్చారు) అభినందనలు. ఇంకెక్కడి నుండి వచ్చారు? (కెనడా నుండి, అర్జెంటీనా నుండి, హాంగ్‌కాంగ్ నుండి, అమెరికా నుండి, న్యూజిలాండ్ నుండి, జర్మనీ నుండి వచ్చిన క్రొత్త-క్రొత్త పిల్లలు చేతులెత్తుతున్నారు) చాలా మంచిది, అభినందనలు. హాంగ్‌కాంగ్ నుండి 4 వెలువడ్డారు. మంచి పక్కా వారసులా? అచ్ఛా, బ్రాహ్మణులుగా అయి వచ్చారు. చాలా మంచిగా సేవలో వృద్ధి చేసారు, ఇది చాలా మంచిది. వర్తమాన సమయములో భారత్‌లోనైనా లేక విదేశాలలోనైనా సేవలో వృద్ధి బాగా జరుగుతూ ఉంది కానీ బాప్‌దాదా ఏం కోరుకుంటున్నారంటే - ఏదైనా విశేష కార్యాన్ని చేసి చూపించే నిమిత్త ఆత్మను తయారుచెయ్యండి. ఇప్పటివరకు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో దానిని చేసి చూపించే అటువంటి సహయోగి తయారవ్వాలి. ప్రోగ్రాములైతే చాలానే చేసారు, ఎక్కడెక్కడైతే ప్రోగ్రాములు చేసారో ఆ ప్రోగ్రాములకు సంబంధించి అన్ని వైపులవారికి బాప్‌దాదా అభినందనలను ఇస్తున్నారు. ఇప్పుడు మరేదైనా నవీనతను చూపించండి. మీ తరఫు నుండి మీ సమానముగా బాబాను ప్రత్యక్షము చెయ్యాలి. ఇది పరమాత్మ చదువు అని వారి నోటి నుండి వెలువడాలి. బాబా-బాబా అన్న మాట హృదయము నుండి వెలువడాలి. సహయోగులుగా అవుతున్నారు కానీ ఇప్పుడు ఒక విషయము ఏదైతే మిగిలిపోయిందో - వీరు ఒక్కరే, వీరు ఒక్కరే, వీరు ఒక్కరే... అన్న ఈ ధ్వని వ్యాపించాలి. బ్రహ్మాకుమారీలు మంచి పని చేస్తున్నారు, వీరు చెయ్యగలరు అని ఇంతవరకైతే చేరుకున్నారు కానీ వీరు ఒక్కరే మరియు ఇది పరమాత్మ జ్ఞానము అన్నది వ్యాపించాలి. బాబాను ప్రత్యక్షము చేసేవారు నిర్భయముగా, నిస్సంకోచముగా చెప్పాలి. పరమాత్మ కార్యాన్ని చేయిస్తున్నారు, ఇది పరమాత్మ కార్యము అని మీరు అంటారు కానీ వారు ఏం చెప్పాలంటే - ఏ పరమాత్మ తండ్రినైతే అందరూ పిలుస్తున్నారో, ఇది ఆ జ్ఞానము, వారు ఇలా చెప్పాలి. ఇప్పుడు ఈ అనుభవమును చేయించండి. ఎలా అయితే, మీ మనసులో ఎప్పుడూ ఏముంటుంది? బాబా, బాబా, బాబా... అటువంటి గ్రూపు ఏదైనా వెలువడాలి. ఇది మంచిది, వీరు చెయ్యగలరు అని ఇంతవరకు బాగానే ఉంది. ఈ పరివర్తన వచ్చింది. కానీ చివరి పరివర్తన ఏమిటంటే - ఒక్కరే, ఒక్కరే, ఒక్కరే.... అది ఎప్పుడు జరుగుతుందంటే బ్రాహ్మణ పరివారమువారు ఏకరస స్థితి కలవారిగా అయినప్పుడు. ఇప్పుడు స్థితి మారుతూ ఉంటుంది. ఏకరస స్థితి ఆ ఒక్కరిని ప్రత్యక్షము చేస్తుంది. సరేనా! మరి డబల్ విదేశీయులు ఉదాహరణగా అవ్వండి. గౌరవాన్ని ఇవ్వటములో, స్వమానములో ఉండటములో ఉదాహరణగా అవ్వండి, నంబరు తీసుకోండి. నలువైపులా మోహజీత పరివారము యొక్క ఉదాహరణను చెప్తారు కదా, అందులో బంట్రోతు అయినా, నౌకర్లు అయినా అందరూ మోహజీతులే. అలాగే ఎక్కడికి వెళ్ళినా, అమెరికాకు వెళ్ళినా, ఆస్ట్రేలియాకు వెళ్ళినా, ప్రతి దేశములోనూ ఏకరసముగా ఉండటము, ఏకమతముతో ఉండటము, స్వమానములో ఉండటము, గౌరవాన్ని ఇవ్వటము, ఇందులో నంబరు తీసుకోండి, తీసుకోగలరు కదా? తీసుకోండి. నంబరు తీసుకోవాలా? వీరు కూర్చున్నారు కదా, (నిర్మల బెహన్) నంబర్ తీసుకోండి. నంబర్ తీసుకుని చూపించండి, అప్పుడు బాప్‌దాదా రెండు సార్లు వస్తారు. (అందరూ చప్పట్లు కొట్టారు) చప్పట్లు కొట్టండి కానీ ముందు రిజల్ట్ చూస్తాము. అచ్ఛా – అందరూ ఎగురుతున్నారు కదా! ఎగిరే కళ వారే కదా! క్రింద పైన కాదు, అలసిపోతారు. ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. అచ్ఛా.
బాప్‌దాదా చూసారు- ఎవరైతే రాలేకపోయారో, ఆ పిల్లలందరూ ప్రియస్మృతులను పంపించారు అలాగే ఉత్తరాలు కూడా చాలామంది పంపారు. దూరంగా కూర్చుని కూడా చూస్తున్నారు. కానీ బాబా అంటారు, వారు దూరంగా లేరు, హృదయంలో ఉన్నారు. అన్నిటికన్నా సమీపంగా హృదయము ఉంటుంది. అందుకే ఎక్కడ కూర్చునా కానీ, చూడకపోయినా కానీ, హృదయంతో చూస్తున్నారు, సాధనాలతో చూడలేకపోయినా కానీ మనసుతో చూడగలుగుతున్నారు. కావున హృదయముతో చూసేవారు, దూరంగా కూర్చున్నవారు, అందరూ బాబా హృదయ సింహాసనంపై ఉన్నారు. ప్రియస్మృతులను మనస్ఫూర్తిగా పంపించారు, తమ సమాచారాన్ని కూడా పంపించారు, బాప్‌దాదా అందరికీ ప్రియస్మృతులతో పాటు ఇదే వరదానమును ఇస్తున్నారు - గడిచినదానిని గతంగా భావించి బిందువు పెట్టండి, బిందువుగా అయ్యి, బిందువైన బాబాను గుర్తు చేయండి. ఇదే అన్ని స్మృతులకు, సమాచారాలకు బాప్‌దాదా ఇస్తున్న రెస్పాంస్. ఫస్ట్ ఛాన్స్ డబల్ విదేశీయులు తీసుకున్నారు, మరి ఫస్ట్ రావాలి. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఫాలో ఫాదర్, సదా సంతోషంగా ఉండండి. అచ్ఛా!
నలువైపులా ఉన్న బాబా నయనాలలో ఇమిడి ఉన్న కంటిపాపలైన పిల్లలకు, సదా ఏకరస స్థితిలో స్థితులై ఉండే పిల్లలకు, సదా భాగ్య సితార మెరుస్తూ ఉండే భాగ్యవంతులైన పిల్లలకు, సదా స్వమానాన్ని మరియు గౌరవాన్ని కలిపి ఉంచుకునే పిల్లలకు, సదా పురుషార్థములో తీవ్ర వేగాన్ని చూపించే పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు, దీవెనలు మరియు నమస్తే.
దాదీలతో:- ఆది రత్నాలైతే చాలా కొద్దిమందే మిగిలారు. (మనోహర్ దాదీ చాలా-చాలా స్మృతిని పంపారు, వారు కాన్పూర్‌లో ఉన్నారు) మంచిగా చేసారు, త్యాగము చేసారు కనుక అనేక ఆత్మల ఆశీర్వాదాలు తీసుకున్నారు. అచ్ఛా, అందరూ దాదీలను చూసి సంతోషిస్తారు కదా. అచ్ఛా – పాత్రను పోషిస్తున్నారు.
(సభతో) బాప్‌దాదా చూస్తున్నారు అంటే వీరు కూడా చూస్తున్నారు. కనిపిస్తున్నారు కదా. బాగుంది, చూడండి, ఇండియా వారు త్యాగం చేసారు కదా. డబల్ విదేశీయులైన మీకు ఛాన్స్ ఇచ్చారు. బాగుంది, అందరి ముఖాలు హర్షితంగా ఉన్నాయి. ఇప్పుడిక ఇలాగే హర్షితంగా ఉండండి. ఇప్పుడు మీ ఫోటోను చూసుకుంటున్నారు కదా. ఇప్పటి మీ ఫోటో కనిపిస్తుంది కదా, సదా ఇలాగే ఉండండి. సదా ఉంటారా లేక మారిపోతారా? సదా స్వయాన్ని బాప్‌దాదా సమ్ముఖంలో ఉన్నట్లుగా చూసుకోండి, తోడుగా చూసుకోండి. అప్పుడు సదా ముఖము ఇలాగే ఉంటుంది. బాగుంది, అందరూ బాగా కష్టపడుతున్నారు. ప్రేమ కూడా అందరికీ బాగుంది. ఇప్పుడు నడుస్తూ తిరుగుతూ సాధారణంగా కనిపించకూడదు, ఫరిశ్తాగా కనిపించాలి. అచ్ఛా, దాదీలు అందరూ సేవ లగ్నములో, స్మృతి లగ్నములో ఉండేవారు. అందరూ చాలా బాగున్నారు.
విదేశాల పెద్దక్కయ్యలతో:- మీటింగ్ బాగా జరుగుతుంది, ఇప్పుడు ప్లాన్‌ను ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. కానీ మంచిగా చేస్తున్నారు, పరస్పరంలో అందరి సలహాలు తీసుకోవడం వలన ఆశీర్వాదాలు లభిస్తాయి. ఒకటి మీ లక్ష్యము, రెండు ఆశీర్వాదాలు, అంటే రెండు పనులు చేస్తున్నారు. ఇకపోతే ప్రతి ఒక్కరూ తమ-తమది సంభాళిస్తున్నారు, మంచిగా నడిపిస్తున్నారు, నడుస్తూ ఉంటుంది, అందుకు అభినందనలు. సదా మంచిగా నడుస్తుంది కదా. అనుభవీగా కూడా అయ్యారు. మీ అనుభవంతో ఇతరులను కూడా అనుభవీలుగా చేస్తున్నారు. నిర్విఘ్నంగా నడుస్తుంది, ఇందుకు అభినందనలు. సేవపై ఉత్సాహము కూడా బాగుంది. బాప్‌దాదా కూడా సమాచారాన్ని విన్నారు, ఆఫ్రికాకు ఉన్న ఉల్లాస-ఉత్సాహాలకు అభినందనలు. మొదటి నంబరును ప్రారంభించారు, అందుకు అభినందనలు. ఇలాగే అందరూ నంబరువారీగా చేయాలి కానీ ముందుగా మీరు ఆ బాధ్యత తీసుకున్నారు, మంచిది. ప్లాన్ కూడా బాగుంది. (ఆఫ్రికాలో 55 దేశాలు ఉన్నాయి, అందులో ఇప్పటివరకు 14 దేశాలలో సెంటర్ ఉంది, 41 దేశాలలో 2 సంవత్సరాలలోపు సందేశాన్ని అందించే ప్లాన్ ఉంది) అక్కడే హ్యాండ్స్‌ను తయారు చేసి అక్కడి సేవ చేయడము, ఈ ప్లాన్ చాలా బాగుంది ఎందుకంటే వేరే స్థానాల నుండి హ్యాండ్స్ తక్కువగానే లభిస్తారు, అక్కడి నుండైతే అక్కడి అనుభవం కూడా ఉంటుంది.
(నిజార్ అన్నయ్య ఆఫ్రికా సోదరసోదరీల తరఫున బాప్‌దాదాకు సంకల్ప పత్రాన్ని ఇచ్చారు – మేమందరమూ సంకల్పం చేస్తున్నాము – 2006 మమ్మా రోజుకల్లా ఆఫ్రికాలోని అన్ని దేశాలలో సందేశాన్ని ఇస్తాము, ఎవ్వరూ ఫిర్యాదు చేయకుండా చూసుకుంటాము) బాగుంది, చాలా మంచిది. ఇలాగే అందరూ ఏ స్థానాలైతే మిగిలి ఉన్నాయో, వారికి సందేశాన్ని ఇవ్వండి. ఈ ప్లాన్ అన్నిటికన్నా బాగా అనిపించింది మరియు సహజ విధి అయిపోయింది. హ్యాండ్స్ కూడా లభిస్తారు మరియు సేవ కూడా పెరుగుతుంది. ఇప్పుడు అందరూ చేయాలి (లోకల్ వారు సేవ చేస్తే రెస్పాంస్ మంచిగా లభిస్తుంది) చాలా మంచిది, అభినందనలు.