Search for a command to run...
10 Nov 2017
ప్రియమైన బాప్‌దాదా యొక్క అవతరణలో ఇది రెండవ టర్న్. ప్రియమైన బాప్‌దాదా గారి రథమైన దాదీ గుల్జార్‌గారు నిన్న (9-11-17) నాడు ముంబయి నుండి శాంతివనానికి చేరుకున్నారు. ఈ రోజు అనగా 10వ తారీఖు నాడు సాయంత్రం 6.30ని.లకు ప్రియమైన బాప్‌దాదా గారి మహావాక్యాలను వీడియో ద్వారా (రివైజ్డ్) వినిపించడం జరిగింది. ఆ మహావాక్యాలను మీ వద్దకు పంపుతున్నాము. ఇది కర్ణాటక మరియు ఇండోర్ (ఆరతీ అక్కయ్య) జోన్ల సేవ టర్న్. అవ్యక్త మహావాక్యాలను విన్న తర్వాత దాదీ గుల్జార్ గారు బాప్‌దాదాకు భోగ్‌ను స్వీకరింపజేసారు. తర్వాత అందరితో నయన మిలనాన్ని జరుపుతూ, చేయి ఊపి అందరినీ కలిసి అందరికోసం మధురమైన మహావాక్యాలను ఈ విధంగా ఉచ్ఛరించారు
10 November 2017 · తెలుగు
“ఈరోజు ఎంతటి ప్రియమైన రోజు, ఈరోజు ప్రియమైన బాబా స్మృతిని ఇప్పిస్తుంది. భిన్న భిన్న సమయాల రోజులు, మిలనపు రోజులు, మహావాక్యాలను వినే రోజులు, ఇవన్నీ మీకు గుర్తు తెప్పించేందుకు ఉన్నాయి కానీ కొంత సమయం తర్వాత మర్చిపోతాము కూడా కానీ బుద్ధిలో, స్మృతిలో అయితే ఉంటుంది. మనకు ఈ వరదానము లభించి ఉంది. ఈ వరదానాలు సమయానికి ఎంతో ఉపయోగపడ్డాయి. ఒక్కోసారి స్వయాన్ని ఒంటరిగా భావిస్తుంటారు, సాకారంలో ఏ తోడు కనిపించదు కానీ గడిచిన మన సమయమంతా సంగఠన శక్తితోనే గడిచింది. సంగఠన మనల్ని ఎంతో ప్రేమతో, స్నేహంతో తీసుకువెళ్తుంది. ఒంటరిగా వెళ్తున్నప్పటికీ సంగఠన సహాయము ఇప్పుడు చాలా అవసరము. సంగఠన విషయము వచ్చినప్పుడు అందరి ముఖాలు మారిపోతాయి. మాకు అందరి స్మృతి ఉంది, అందరికీ మా స్మృతి ఉంది. మనం ఒంటరిగా నడవడం లేదు. సంగఠనలో ఉన్నాము. సంగఠన మనల్ని తనవారిగా చేసుకుని, కలుపుకుని నడుస్తుంది. సంగఠన ఎంత ప్రియమైనదో, దానిలో ఎంత శక్తి ఉన్నదో కూడా అది చూపిస్తుంది. సంగఠనలో నడుస్తూ తిరుగుతూ ఉండటం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. కనుక సంగఠన యొక్క లాభాన్ని తీసుకుంటూ మనం సంగఠితంగా భిన్న భిన్న రూపాలలో సంగఠనను ఉపయోగించుకుంటున్నాము. ఒంటరిగా ఉన్నప్పుడైనా, సంగఠనలో ఉన్నప్పుడైనా కానీ ఎక్కడైనా ఏదైనా జరిగితే, సంగఠనలో ఉంటే సమయం ఎంతో చక్కగా గడుస్తుంది. పరస్పర ప్రేమ ఎంతగానో గుర్తుకు వస్తుంది. ఈరోజు మనమంతా పరస్పరం కలుసుకున్నాం. చాలా మంచిది. కానీ పరస్పరం మనం కలుసుకునేందుకు ఆధారం బాబా. బాబా కూడా పిల్లలను మనస్ఫూర్తిగా కలుస్తారు. స్థూలంగా మన శరీరం ఉంది కనుక స్థూలంగా కూడా కలుస్తారు. మనమంతా ఒకే పరివారం అనిపిస్తుంది. పరస్పరం కలుసుకుంటాము, బయటివారితో, తోటి వారితో కలుసుకుంటాము, మరో ముఖ్య విషయము - పెద్దవారిని కలుసుకుంటాము. ఇది కూడా చాలా మంచి మిలన మేళా రూపం అవుతుంది. అచ్ఛా!
అందరికీ బాబా మరియు మధురమైన మమ్మా స్మృతి ఉంది, వీరే కదా మనకు ముఖ్య ఆధారము, తోడు. వారి తోడు చాలా బాగుంటుంది. మనందరి హృదయాలలో ప్రేమ ఉంది. ఇది బాహ్యంగా మిలన మేళా రూపంలో కనిపిస్తుంది. అచ్ఛా!
ఓంశాంతి
ఓం శాంతి అవ్యక్త రివైజ్డ్ మురళి మహావాక్యాలు (31-10-07) మధువనం
(ఈ మురళిని వీడియో ద్వారా 10-11-17) వినిపించడం జరిగింది)
ఈరోజు బాప్‌దాదా నలువైపుల ఉన్న తమ శ్రేష్ఠ స్వమానధారీ విశేషమైన పిల్లలను చూస్తున్నారు. పిల్లలైన ప్రతి ఒక్కరి స్వమానము ఎంత విశేషమైనదంటే అటువంటి విశేషత విశ్వములోని ఏ ఆత్మకూ లేదు. మీరందరూ విశ్వాత్మలకు పూర్వజులు మరియు పూజ్యులు కూడా. మొత్తము సృష్టిరూపీ వృక్ష పునాదికి మీరు ఆధారమూర్తులు. విశ్వమంతటికీ పూర్వజులు, మొదటి రచన. చిన్న పిల్లవాడైనా, వృద్ధ మాత అయినా, ప్రవృత్తి వారైనా కానీ బాప్‌దాదా పిల్లల ప్రతి ఒక్కరి విశేషతను చూసి సంతోషపడతారు. ప్రతి ఒక్కరికి వారి-వారి విశేషతలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఎంత పెద్ద సైన్సు వారు అయినా, ప్రపంచపు లెక్కలో విశేషమైన వారైనా కానీ ప్రకృతిజీలుగా అయితే అయ్యారు, చంద్రుని వరకు కూడా చేరుకున్నారు కానీ ఇంత చిన్నని జ్యోతి స్వరూప ఆత్మను గురించి తెలుసుకోలేకపోయారు! మరి ఇక్కడైతే చిన్న పిల్లవాడు కూడా “నేను ఆత్మను, జ్యోతి బిందువును” అని తెలుసుకున్నాడు. నేను ఆత్మను అని నషాతో అంటాడు. ఎంత పెద్ద మహాత్మలైనా మరియు బ్రాహ్మణ మాతలు, మాతలు మేము పరమాత్ముని పొందామని గర్వముతో అంటారు. పొందారు కదా! మరి మహాత్మలు ఏమంటారు? పరమాత్ముని పొందటము చాలా కష్టమని అంటారు. మేము ప్రవృత్తిలో ఉంటూ, కలసి ఉంటూ పవిత్రంగా ఉంటాము ఎందుకంటే మా మధ్య తండ్రి ఉన్నారని ప్రవృత్తిలో ఉన్నవారు ఛాలెంజ్ చేస్తారు. కావుననే ఇద్దరూ కలసి ఉంటూ కూడా పవిత్రంగా ఉండగలుగుతున్నారు ఎందుకంటే పవిత్రత మన స్వధర్మము. పరధర్మము కష్టమనిపిస్తుంది, స్వ ధర్మము సహజమవుతుంది. లోకులు ఏమంటారు? నిప్పు మరియు దూది కలసి ఉండలేవు, చాలా కష్టము అని అంటారు. కానీ మీరందరూ ఏమంటారు? చాలా సహజము. మొదట్లో మీ అందరిది ఒక గీతము ఉండేది - ఎంత పెద్ద ధనవంతులైనాగానీ, యజమానులైనాగానీ ఒక్క శివబాబాను తెలుసుకోలేదు. చిన్ని బిందువైన ఆత్మను గురించి తెలుసుకోలేదు కానీ పిల్లలైన మీరందరూ తెలుసుకున్నారు, పొందారు. అసంభవము సంభవమైందని ఎంతో నిశ్చయము మరియు గర్వముతో అంటారు. బాప్‌దాదా కూడా విజయి రత్నాలైన పిల్లలు ప్రతి ఒక్కరినీ చూసి సంతోషిస్తారు ఎందుకంటే ధైర్యము పిల్లలది, సహాయము తండ్రిది. కనుకనే ప్రపంచము వారికి అసంభవమైన విషయము మీకు సహజము మరియు సంభవమైపోయింది. మేము పరమాత్మునికి డైరెక్టు పిల్లలము అని ఫఖుర్ (శుద్దమైన గర్వము) ఉంటుంది. ఈ నషా కారణంగా, నిశ్చయము కారణంగా, పరమాత్ముని పిల్లలైన కారణంగా మాయనుంచి కూడా రక్షింపబడ్డారు. పిల్లలుగా కావటము అనగా సహజంగానే రక్షింపబడటము. అంతేగాక అన్ని విఘ్నాలనుంచి, సమస్యలనుంచి పిల్లలు రక్షింపబడ్డారు.
మరి మీ ఇంతటి శ్రేష్ఠ స్వమానమును తెలుసుకున్నారు కదా! ఎందుకని సహజము? ఎందుకంటే మీరు సైలెన్సు శక్తి ద్వారా పరివర్తన శక్తిని కార్యములో వినియోగిస్తారు. నెగెటివ్‌ను పాజిటివ్‌లోకి పరివర్తన చేసేస్తారు. మాయ ఎంత పెద్ద సమస్య రూపంలో వచ్చినా కానీ మీరు పరివర్తన శక్తి ద్వారా, సైలెన్సు శక్తి ద్వారా సమస్యను సమాధాన స్వరూపముగా చేసేస్తారు. కారణమును నివారణ రూపంలోకి మార్చేస్తారు. ఇంత శక్తి ఉంది కదా, కోర్సు కూడా చేయిస్తారు కదా! నెగటివ్‌ను పాజిటివ్‌గా చేసే విధిని నేర్పిస్తారు. ఈ పరివర్తన శక్తి తండ్రి ద్వారా వారసత్వముగా లభించింది. ఒక్క శక్తి కాదు, సర్వ శక్తులూ పరమాత్మ వారసత్వంగా లభించాయి. అందుకనే బాప్‌దాదా అంటారు, ప్రతిరోజూ మురళిని వింటారు కదా! మరి ప్రతిరోజూ బాప్‌దాదా ఇదే అంటారు - తండ్రిని స్మృతి చెయ్యండి మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. తండ్రి స్మృతి కూడా ఎందుకని సహజంగానే వస్తుంది? వారసత్వపు ప్రాప్తిని గుర్తు చేసుకున్నప్పుడు ప్రాప్తి కారణంగా తండ్రి స్మృతి సహజంగా వచ్చేస్తుంది. పిల్లలైన ప్రతి ఒక్కరికీ ఈ ఆత్మిక ఫఖుర్ ఉంటుంది, మనస్సులో పాటను పాడుతారు - పొందాల్సింది పొందేసాము. ప్రతి ఒక్కరి హృదయములో ఈ పాట స్వతహాగనే మ్రోగుతుంది కదా! ఫఖుర్ ఉంది కదా! ఎంతగా ఈ ఫఖుర్లో ఉంటారో, ఫఖుర్కు గుర్తు – బేఫికర్‌గా (నిశ్చింతగా) ఉండటము. ఒకవేళ సంకల్పములోగానీ, మాటలోగానీ లేక సంబంధ-సంపర్కములోగానీ ఏవిధమైనటువంటి ఫికర్ (చింత) ఉన్నా ఫఖుర్ (శుద్ధమైన గర్వము) ఉండదు. బాప్‌దాదా అయితే నిశ్చింత చక్రవర్తులుగా చేసారు. చెప్పండి, నిశ్చింత చక్రవర్తులేనా? ఎవరైతే నిశ్చింత చక్రవర్తులో వారు చేతులెత్తండి. నిశ్చింతులకు అప్పుడప్పుడు చింత వస్తుందా? మంచిది. తండ్రి నిశ్చింతులైనప్పుడు, పిల్లలకు ఏ చింత ఉంటుంది!
అన్ని చింతలు మరియు అన్ని భారాలను బాప్‌దాదాకు ఇచ్చెయ్యమని బాప్‌దాదా అయితే చెప్పి ఉన్నారు. తండ్రి సాగరుడు కదా! కాబట్టి భారము అంతా ఇమిడిపోతుంది. బాప్‌దాదా అప్పుడప్పుడు పిల్లల ఒక గీతాన్ని విని చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. ఏ పాటనో తెలుసా? ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి..... అప్పుడప్పుడు పాడుతుంటారు. బాప్‌దాదా వింటూ ఉంటారు. కానీ బాప్‌దాదా పిల్లలందరికీ ఇదే చెప్తారు - ఓ నా మధురమైన పిల్లలూ, ముద్దు బిడ్డలూ - సాక్షీ దృష్ట స్థితి అనే సీటుపై సెట్ అవ్వండి మరియు సీటుపై సెట్ అయ్యి ఆటను చూడండి, చాలా మజా వస్తుంది, వాహ్! త్రికాలదర్శి స్థితిలో స్థితి అవ్వండి. సీటునుంచి క్రిందకు వస్తారు కనుకనే అప్సెట్ (కలత చెందుతారు) అవుతారు. సెట్ అయినట్లయితే అప్సెట్ కారు. ఈ మూడు విషయాలు పిల్లలను వ్యాకులపరుస్తాయి. ఏ మూడు విషయాలు ? - చంచలమైన మనస్సు, భ్రమిస్తున్న బుద్ధి మరియు పాత సంస్కారాలు. పిల్లల ఒక విషయాన్ని వింటుంటే బాప్‌దాదాకు నవ్వు వస్తుంటుంది, అది ఏ విషయమో తెలుసా? పిల్లలు ఇలా అంటుంటారు - ఏం చెయ్యాలి బాబా, ఇది నా పాత సంస్కారం కదా! బాబా నవ్వుతారు. నా సంస్కారము అని చెప్తున్నారంటే మరి నాదిగా చేసుకున్నారా? ఎప్పుడైతే పాత సంస్కారాన్ని నాదిగా చేసుకున్నారో, మరి నాది అన్నది చోటు చేసుకుంది కదా. నా సంస్కారము అని బ్రాహ్మణ ఆత్మ అనగలదా? నాది-నాది అని అన్నట్లయితే నాది అనేది తన చోటును ఏర్పరుచుకుంది. బ్రాహ్మణులైన మీరు నాది అని అనజాలరు. ఇది గత జీవితపు సంస్కారము. శూద్ర జీవిత సంస్కారము. బ్రాహ్మణ జీవితముది కాదు. కావున నాది-నాది అన్నట్లయితే అది కూడా నా అధికారము అని కూర్చుంటుంది. బ్రాహ్మణ జీవితపు శ్రేష్ఠ సంస్కారము గురించి తెలుసుకదా! మీరు దేనినైతే పాతది అని అంటున్నారో ఆ సంస్కారము కూడా పాతది కాదు, శ్రేష్ఠ ఆత్మలైన మీ అతి పాతదైన సంస్కారము అనాది మరియు ఆది సంస్కారము. ఇదైతే మధ్యలోని ద్వాపరములోని సంస్కారము. కావున మధ్యలోని సంస్కారమును సమాప్తము చేసెయ్యాలి, తండ్రి సహాయము కారణంగా ఎటువంటి కష్టమూ ఉండదు. కానీ ఏం జరుగుతుంది? బాబా కంబైండ్‌గా ఉన్నారు, కంబైండ్ అన్నదానికి అర్థమే అవసరమైన సమయంలో సహయోగి కానీ సరైన సమయంలో సహయోగము తీసుకోని కారణంగా మధ్యలో వచ్చిన సంస్కారము పెద్దదిగా అయిపోతుంది.
పిల్లలందరూ తండ్రి ప్రేమకు పాత్రులు, అధికారులు అని బాప్‌దాదాకు తెలుసు. ప్రేమ కారణంగానే అందరూ చేరుకున్నారని బాబాకు తెలుసు. విదేశమునుంచి వచ్చినాగానీ, దేశమునుంచి వచ్చినాగానీ, అందరూ పరమాత్ముని ప్రేమ యొక్క ఆకర్షణతో తమ ఇంటికి చేరుకున్నారు. ప్రేమలో మెజారిటీ పాస్ అయ్యారని బాప్‌దాదాకు తెలుసు. విదేశమునుంచి ప్రేమ అనే విమానంలో చేరుకున్నారు. చెప్పండి, అందరూ ప్రేమ అనే సూత్రంలో బంధింపబడి ఇక్కడకు చేరుకున్నారు కదా! ఈ పరమాత్ముని ప్రేమ మనసుకు ప్రశాంతతను ఇచ్చేటువంటిది. అచ్ఛా - ఎవరైతే మొదటిసారి ఇక్కడకు వచ్చారో వారు చేతులెత్తండి. చేతులు ఊపండి. వచ్చారు, మంచిది.
ఇప్పుడు సమయ సమీపత ప్రమాణంగా వరదానాలను ప్రతి సమయము అనుభవములోకి తీసుకురండి. అనుభవము యొక్క అథారిటీలుగా అవ్వండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అశరీరులుగా అయ్యే, ఫరిస్తా స్వరూపులుగా అయ్యే ఎక్సర్‌సైజును చేస్తూ ఉండండి. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణులు. ఇప్పుడిప్పుడే ఫరిస్తాలు, ఇప్పుడిప్పుడే అశరీరులు, నడుస్తూ తిరుగుతూ, కార్యవ్యవహారములు చేసుకుంటూ కూడా ఒక్క నిముషము, రెండు నిముషాలను కేటాయిస్తూ అభ్యాసము చెయ్యండి. ఏ సంకల్పమునైతే చేస్తున్నానో ఆ స్వరూపమును అనుభవము చేసుకుంటున్నానా అని పరిశీలించుకోండి. అచ్ఛా!
నలువైపుల కల సదా శ్రేష్ఠ స్వమానధారులు, సదా స్వయమును పరమపూజ్య మరియు పూర్వజులుగా అనుభవము చేసేవారు, సదా తమను ప్రతి సబ్జెక్టులో అనుభవీ స్వరూపులుగా తయారుచేసుకునేవారు, సదా తండ్రి హృదయ సింహాసనాధికారులు, భృకుటి సింహాసనాధికారులు, సదా శ్రేష్ఠ స్థితి యొక్క అనుభవములో స్థితి అయ్యేవారు, నలువైపుల గల పిల్లలందరికీ ప్రియస్మృతులు మరియు నమస్తే.
సేవ టర్ను కర్నాటక జోన్ వారిది:- బాప్‌దాదా కర్నాటక వారికి పని ఇచ్చారు, గుర్తుందా. ఏ పని ఇచ్చారు! వారస క్వాలిటీ వారిని వెలికితీసే పని, గుర్తుందా? సేవలో అయితే నంబరును తీసుకున్నారు మంచిది, నంబరువన్‌లోకి వచ్చేంతగా వారసులను వెలికితీయండి. నిమిత్తులైన వారైతే ఉన్నారు, క్రొత్త క్రొత్త వారిని వెలికితీయండి. బాప్‌దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. మీకు కూడా సంతోషము, తండ్రికి కూడా సంతోషము. తండ్రిని చూసి మీరు ఎంతగా సంతోషిస్తారో, అంతకన్నా ఎక్కువగా పిల్లలను చూసి తండ్రి సంతోషిస్తారు.
సేవ టర్ను ఇండోర్ జోన్ వారిది:- 18-01-09 - యజ్ఞ సేవపు సువర్ణ అవకాశము లభించటమన్నది చాలా ఎక్కువ పుణ్యమును జమ చేసుకోవటము. ప్రతి అడుగు యజ్ఞ సేవను చెయ్యటము అనగా తమ పుణ్య ఖాతాను జమ చేసుకోవటము. మరి ఈ 10-15 రోజులలో ప్రతి అడుగు సేవ చేసినట్లయితే ఎన్ని పదమాలు తయారయ్యాయు? యజ్ఞ సేవ చాలా గొప్ప సేవ. ఈ యజ్ఞ సేవను తీసుకున్న ఏ జోన్ వారైనా చాలా చాలా ప్రేమతో సేవ చెయ్యటమును బాప్‌దాదా చూసారు. రిజల్టు వెరీగుడ్గా ఉంటుంది. మరి మీ అందరి రిజల్టు కూడా మంచిగా ఉంది మరియు ఇంకా చాలా మంచిగా ఉంటుంది.
డబల్ విదేశీయులతో:- విదేశాలలో కూడా సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలు ఎక్కువవుతూ ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. విదేశాలలో స్టూడెంటును తయారుచేయటం చాలా కష్టమైనదని మొదట అనేవారు, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కష్టమా లేక సహజమా? సహజమా? వారు పరస్పరము కలుసుకుని నిర్విఘ్నంగా అయ్యేందుకు ప్లానును తయారు చేసారు మరియు నిర్విఘ్నంగా అయ్యే ప్లానును చాలా బాగా విధి పూర్వకంగా నిర్విఘ్నంగా తయారు చేసినందుకు బాప్‌దాదాకు చాలా మంచిగా అనిపించింది. ఇందుకు చాలా చాలా అభినందనలు, పదమగుణ అభినందనలు.
ఓంశాంతి