``ఇప్పుడు స్వయాన్ని ముక్తి చేసుకుని మాస్టర్ ముక్తిదాతలుగా అయ్యి అందరికీ ముక్తిని ఇప్పించేందుకు నిమిత్తులుగా అవ్వండి''
18-01-2020 ఓం శాంతి “దినచర్య” మధువనం
ప్రాణేశ్వరుడైన అవ్యక్త బాప్‌దాదాకు అతి స్నేహులు, సదా పరమాత్మ ప్రేమలో లవ్లీనమై ఉండేవారు, సాకార మరియు అవ్యక్త పాలనను పొందిన అనుభవీ ఆత్మలు, నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణులైన సోదరసోదరీమణులు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.
మనందరి అతి ప్రియమైన పితాశ్రీ బ్రహ్మా బాబా గారి స్మృతి సో సమర్థ దివసమును బ్రహ్మా వత్సలమైన మనందరం స్నేహము మరియు శ్రద్ధతో ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. బాబా అవ్యక్తమై 51 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. మనందరికీ అలౌకిక జన్మనిచ్చిన పెద్ద తల్లి. అవ్యక్త రూపంలో ఉంటూ, శివబాబాతో కంబైన్డ్‌గా ఉంటూ ఇంతటి శ్రేష్ఠ పాలనను ఇచ్చే అవ్యక్త బ్రహ్మా బాబా గారి ఈ స్మృతి దివసము వారి అనేక చరిత్రలను సాకారం చేస్తుంది. 84 సంవత్సరాల ఈ సంగమయుగ అలౌకిక యాత్ర ఎలా నిర్విఘ్నంగా ముందుకు సాగుతూ తన ఉన్నత లక్ష్యానికి సమీపంగా చేరుకుందో మనందరికీ అనుభవమే. వారి ఛత్రఛాయ క్రింద వేలాది బ్రహ్మా వత్సలు మాయ మరియు ప్రకృతిపై విజయాన్ని ప్రాప్తి చేసుకుని తమ సంపూర్ణత యొక్క గమ్యానికి సమీపంగా చేరుకుంటున్నారు. సంగమయుగ తీవ్ర పురుషార్ధీ ఆత్మలు తమ తనువు-మనసు-ధనముతో సహయోగం చేస్తూ, అడ్వాన్స్ పార్టీ ఆత్మలు తమ దివ్య ధారణా సంపన్న జీవితం ద్వారా పరమాత్మ ప్రత్యక్షత యొక్క నగారా మ్రోగించే తయారీలో ఉన్నారు. “ఇదే, ఇదే, ఇదే” అని నలువైపుల ధ్వని మారుమ్రోగే సమయం దగ్గరలో ఉంది. జయజయకారాల ధ్వని వినిపిస్తుంది, అప్పుడు సర్వాత్మలు ఏదో ఒక అంచలిని తీసుకుని, తమ ముక్తిధామం ఇంటికి వెళ్తారు. తర్వాత మన క్రొత్త సత్యయుగ ప్రపంచం వస్తుంది. చెప్పండి, ఈ దృశ్యం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా! మధురమైన బాబా గత రెండేళ్ళుగా సాక్షిగా అయి పిల్లల ప్రతి కర్మను గమనిస్తూ, ఆకారి మరియు నిరాకారి రూపంలో సహయోగిగా అయ్యి విశ్వ కళ్యాణ సేవను చేయిస్తున్నారు.
మధుబన్ పాండవ భవనంలో ప్రతి సంవత్సరం వలె ఈ స్మృతి దివసము నాడు కూడా విశేషంగా నాలుగు ధామాల అలంకారాన్ని కలకత్తా నుండి వచ్చిన సోదరసోదరీలు ఎంతో సుందరంగా వెరైటీ పూలతో చేసారు. అమృతవేళ నుండే సోదరసోదరీలందరూ ఆ స్నేహంలోనే ఇమిడిపోతూ విశేషంగా అన్ని స్థానాలలో అవ్యక్త మిలనాన్ని జరుపుకుంటూ అవ్యక్త వతనపు షికారును చేసారు. తర్వాత ప్రియమైన బాబాకు భోగ్ స్వీకరింపజేయడం జరిగింది. ఆ తర్వాత మూడు స్థానాలలో అందరూ యోగ తపస్య చేసారు. సాకార బ్రహ్మా బాబా పాలనను తీసుకున్న నిర్వైర్ అన్నయ్య మరియు అమీర్ చంద్ అన్నయ్యలు బాబాతో తమకున్న సాంగత్యపు అనుభవాలను శాంతివన్లో వినిపించారు. విశేషంగా మధ్యాహ్న సమయంలో అన్ని చోట్ల మధురమైన బాబాకు భోగ్ స్వీకరింపజేయడం జరిగింది, తర్వాత అన్ని స్థానాలలో బ్రహ్మా భోజనం జరిగింది. సాయంకాలం అందరూ విశేషంగా బ్రహ్మా బాబా స్నేహంలో మునిగిపోయి డైమండ్ హాల్లో వీడియో ద్వారా అవ్యక్త మహావాక్యాలను విన్నారు, అది మీ వద్దకు పంపుతున్నాము. ఇప్పుడు గుజరాత్ మరియు దేశవిదేశాల నుండి సుమారు 20 వేలమంది సోదరసోదరీలు చేరుకున్నారు, సేవ టర్న్ గుజరాత్ జోన్‌ది. దాదీ జానకిగారు రోజూ సాయంకాలం విశేషంగా యోగం చేయిస్తూ తమ వరదాని మహావాక్యాలతో అందరినీ రిఫ్రెష్ చేస్తున్నారు. మనందరి అతి ప్రియమైన దాదీ గుల్జార్ గారు ముంబయి గామ్దేవి సేవాకేంద్రంలోనే ఉన్నారు. అందరి శుభ సంకల్ప వైబ్రేషన్లు దాదీ వరకు చేరుకుంటూ ఉంటాయి. చలి తగ్గిన తర్వాత దాదీగారు మధుబన ఇంటికి చేరుకుంటారని ఆశిద్దాం. సోదరసోదరీలందరి శుభ భావనలు బాప్‌దాదా వద్దకు చేరుకుంటున్నాయి. బాబా తప్పకుండా పిల్లల ఆశను పూర్తి చేస్తారు. అచ్ఛా - అందరికీ చాలా చాలా స్మృతి... ఓం శాంతి.
18-01-2020 ఓం శాంతి “అవ్యక్త బాప్దాదాదా” వీడియో ద్వారా రివైజ్ 18-01-07 మధువనం ఇప్పుడు స్వయాన్ని ముక్తి చేసుకుని మాస్టర్ ముక్తిదాతలుగా అయ్యి అందరికీ ముక్తిని ఇప్పించేందుకు నిమిత్తులుగా అవ్వండి
ఈరోజు స్నేహ సాగరుడైన బాప్‌దాదా నలువైపుల ఉన్న స్నేహి పిల్లలను చూస్తున్నారు. రెండు రకాల పిల్లలను చూసి హర్షిస్తున్నారు. ఒకరు లవ్లీన్ పిల్లలు, రెండు లవ్లీ పిల్లలు, ఇద్దరి స్నేహపు అలలు బాబా వద్దకు అమృతవేళ ముందు నుండే చేరుకుంటున్నాయి. పిల్లలు ప్రతి ఒక్కరి హృదయం నుండి ఆటోమేటిక్‌గా “నా బాబా” అన్న పాట వస్తుంది. బాప్‌దాదా హృదయం నుండి కూడా “నా పిల్లలు, గారాల పిల్లలు, బాప్‌దాదాకు కూడా శిరోధార్య పిల్లలు” అన్న పాట వస్తుంది.
ఈరోజు స్మృతి దివసము కారణంగా అందరి మనసులలో స్నేహపు అల ఎక్కువగా ఉంది. అనేక పిల్లల స్నేహపు ముత్యాల మాలలు బాప్‌దాదా మెడలోకి వచ్చి చేరుతున్నాయి. బాబా కూడా తమ స్నేహ బాహువుల మాలను పిల్లలకు వేస్తున్నారు. అనంతమైన బాబా యొక్క అనంతమైన బాహువులలో అందరూ ఇమిడిపోయారు. ఈరోజు విశేషంగా అందరూ స్నేహమనే విమానంలో చేరుకున్నారు. దూరదూరాల నుండి కూడా మనసు అనే విమానంలో అవ్యక్త రూపంలో, ఫరిశ్తా రూపంలో చేరుకున్నారు. పిల్లలందరికీ బాప్‌దాదా ఈరోజు స్మృతి దివసము సో సమర్థ దివసమునకు పదమాపదమాల స్మృతిని ఇస్తున్నారు. ఈ స్మృతి ఎన్నో స్మృతులను ఇస్తుంది. ప్రతి స్మృతి సెకండ్లో సమర్థంగా తయారు చేసేస్తుంది. స్మృతుల లిస్ట్ సెకండ్లో గుర్తుకు వస్తుంది కదా! స్మృతి కలగటంతో సమర్ధత యొక్క నషా పెరుగుతుంది. మొట్టమొదటి స్మృతి గుర్తుంది కదా! బాబాకు అయ్యిన తర్వాత బాబా ఏమని గుర్తుకు తెప్పించారు? మీరు కల్ప క్రితపు భాగ్యశాలి ఆత్మలు. ఈ మొదటి స్మృతి ఏ పరివర్తనను తెచ్చిందో గుర్తుకు తెచ్చుకోండి. ఆత్మ అభిమానిగా అవ్వడం వలన పరమాత్మ తండ్రి యొక్క స్నేహపు నషా పెరిగింది. ఎందుకు నషా పెరిగింది? హృదయపూర్వకంగా మొట్టమొదటి స్నేహపు మాట ఏమి వెలువడింది? “నా మధురమైన బాబా”. ఈ గోల్డెన్ మాట ద్వారా ఏ నషా కలిగింది? నా బాబా అని అనగానే, బాబాను తెలుసుకుని, నమ్మిన కారణంగా అన్ని పరమాత్మ ప్రాప్తులు మీవిగా అయిపోయాయి. అనుభవం ఉంది కదా! నా బాబా అనగానే ఎన్ని ప్రాప్తులు మీవిగా అయిపోయాయి! ఎక్కడ ప్రాప్తులు కలుగుతాయో అక్కడ స్మృతి చేయవలసిన అవసరం ఉండదు కానీ స్మృతి స్వతహాగానే ఉంటుంది, సహజంగానే వస్తుంది ఎందుకంటే నాదిగా అయ్యింది కదా! బాబా ఖజానా నా ఖజానాగా అయ్యింది. నాది అన్నదానిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు, గుర్తుంటుంది. నాది అన్నదానిని మర్చిపోవడం కష్టంగా ఉంటుంది, గుర్తు చేయడం కష్టంగా ఉండదు. మీ అనుభవం ప్రకారం నా శరీరం అంటారు కదా, దానిని మర్చిపోతారా? మర్చిపోయే ప్రయత్నం చేస్తారా? చేయరు. ఎందుకని? నాది అనుకున్నారు కదా! ఎక్కడ నాది అంటారో అక్కడ సహజంగా స్మృతి ఉంటుంది. మరి స్మృతి సమర్థంగా చేసేసింది – “నా బాబా” అన్న ఒక్కమాట. భాగ్య విధాతను, తరగని ఖజానాల దాతను నావారిగా చేసుకున్నారు. ఇటువంటి అద్భుతం చేసే పిల్లలు కదా మీరు! పరమాత్మ పాలనకు అధికారులుగా అయ్యారు, ఆ పరమాత్మ పూర్తి కల్పంలో ఒక్కసారే లభిస్తారు, ఆత్మలు మరియు దేవాత్మల పాలన అయితే లభిస్తూనే ఉంటుంది కానీ పరమాత్మ పాలన కేవలం ఒక్క జన్మ మాత్రమే లభిస్తుంది.
మరి ఈనాటి స్మృతి సో సమర్థ దివసము నాడు పరమాత్మ పాలన యొక్క నషా మరియు సంతోషం సహజంగానే గుర్తుంది కదా! ఎందుకంటే ఈరోజు వాతావరణం సహజ స్మృతి ఉండే రోజు. మరి ఈరోజు సహజయోగిగా ఉన్నారా లేక ఈరోజు కూడా స్మృతి కోసం యుద్ధం చేయవలసి వచ్చిందా? ఎందుకంటే ఈరోజును స్నేహపు రోజు అంటాము కదా, మరి స్నేహము శ్రమను తీసేస్తుంది. స్నేహము అన్ని విషయాలను సహజం చేసేస్తుంది. మరి అందరూ ఈరోజు విశేషంగా సహజయోగులుగా ఉన్నారా లేక కష్టమయిందా? ఎవరికైతే ఈరోజు కష్టమనిపించిందో వారు చేతులెత్తండి. ఎవ్వరికీ కలగలేదా? అందరూ సహజయోగులుగా ఉన్నారా? అచ్ఛా, ఎవరైతే సహజయోగులుగా ఉన్నారో వారు చేతులెత్తండి. (అందరూ చేతులెత్తారు) అచ్ఛా - సహజయోగులుగా ఉన్నారా? ఈరోజు మాయకు సెలవు ఇచ్చేసారా? ఈరోజు మాయ రాలేదా? ఈరోజు మాయకు వీడ్కోలు చెప్పేసారా? మంచిది, ఈరోజు అయితే వీడ్కోలు చెప్పారు, అందుకు అభినందనలు, ఒకవేళ ఇలాగే స్నేహంలో ఇమిడి ఉంటే మాయకు సదా కోసం వీడ్కోలు ఇవ్వవచ్చు.
బాప్‌దాదా ఈ సంవత్సరాన్ని అతీత (న్యారా) సంవత్సరం, సర్వులకు ప్రియంగా ఉండే సంవత్సరం, శ్రమ నుండి ముక్తి అయి ఉండే సంవత్సరం, సమస్య నుండి ముక్తి సంవత్సరం జరుపుకోవాలని ఆశిస్తున్నారు. మీ అందరికీ ఇష్టమేనా? ఇష్టమేనా? ముక్తి సంవత్సరం జరుపుకుంటారా? ఎందుకంటే ముక్తిధామానికి వెళ్ళాలి, ముక్తిదాత బాబాతో కలిసి అనేక దుఃఖ అశాంత ఆత్మలకు మీరు ముక్తిని ఇప్పించాలి. మరి మాస్టర్ ముక్తిదాత స్వయం ముక్తి అయినప్పుడే ముక్తి సంవత్సరం జరుపుకుంటాము కదా! ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మలైన మీరు స్వయం ముక్తులై అనేకులకు ముక్తిని ఇప్పించేందుకు నిమిత్తులు. ఒక భాష ముక్తిని ఇప్పించే బదులు బంధనంలో బంధిస్తుంది, సమస్యకు ఆధీనం చేస్తుంది, అదే - ఇలా కాదు, అలా. అలా కాదు ఇలా. సమస్య వచ్చినప్పుడు బాబా, అలా కాదు, ఇలా కాదు అంటారు కదా. ఇలా జరిగి ఉండకపోతే, ఇలా జరిగేది కదా. ఇది సాకులు చెప్పే ఆట.
బాప్‌దాదా అందరి ఫైల్స్ చూసారు, మరి ఫైల్లో ఏమి చూసారు? మెజారిటీ ఫైల్స్ ప్రతిజ్ఞ చేసిన పేపర్లతో నిండి ఉన్నాయి. ప్రతిజ్ఞను చేసే సమయం ఎంతో మనస్ఫూర్తిగా చేస్తారు, ఆలోచిస్తారు కూడా కానీ ఫైల్ పెద్దదవుతుంది కానీ ఫైనల్ అవ్వడం లేదని బాబా చూసారు. ప్రాణం పోయినా కానీ మాట పోకూడదు అని దృఢ ప్రతిజ్ఞ గురించి అంటారు కదా. బాప్‌దాదా ఈరోజు అందరి ఫైల్ చూసారు. చాలా చాలా మంచి ప్రతిజ్ఞలు చేసారు. మనసులో చేసారు మరియు వ్రాతపూర్వకంగా కూడా చేసారు. మరి ఈ సంవత్సరం ఏమి చేస్తారు? ఫైల్‌ను పెంచుతారా లేక ప్రతిజ్ఞను ఫైనల్ చేస్తారా? ఏమి చేస్తారు? మొదటి లైన్లో ఉన్నవారు చెప్పండి, పాండవులు వినిపించండి, టీచర్లు వినిపించండి. బాప్‌దాదా వద్ద పెరిగిపోతున్న ఫైళ్ళను ఈ సంవత్సరం ఫైనల్ చేస్తారా లేక ఈ సంవత్సరం కూడా ఫైల్లో మరో కాగితాన్ని జత చేస్తారా? ఏమి చేస్తారు? పాండవులు చెప్పండి, ఫైనల్ చేస్తారా? వంగాల్సి వచ్చినా కానీ, మారాల్సి వచ్చినా కానీ, సహించాల్సి వచ్చినా కానీ, వినాల్సి వచ్చినా కానీ, మారవలసిందే అని అనుకునేవారు చేతులెత్తండి. చూడండి, టి.వీలో అందరి ఫోటో వస్తుంది. అందరి ఫోటోను తీయండి, రెండు, మూడు, నాలుగు టీ.వీలు ఉన్నాయి, అన్ని వైపుల ఫోటోలు తీయండి. ఈ రికార్డ్ పెట్టుకోండి, బాబాకు ఈ ఫోటో తీసి ఇవ్వండి. టీ.వి వారు ఎక్కడున్నారు? బాప్‌దాదా కూడా ఫైల్ యొక్క లాభాన్ని తీసుకోవాలి కదా. అభినందనలు, అభినందనలు, మీ కోసం మీరు చప్పట్లు కొట్టుకోండి.
చూడండి, ఒకవైపు సైన్స్, రెండవ వైపు భ్రష్టాచారము, మూడవ వైపు పాపాచారము, అన్నీ తమ తమ పనులను వృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాయి. చాలా కొత్త కొత్త ప్లాన్లను తయారు చేసుకుంటూ వెళ్తున్నాయి. మరి మీరైతే వరల్డ్ క్రియేటర్ (విశ్వ రచయిత) పిల్లలు, మీరు ఈ సంవత్సరం ప్రతిజ్ఞ దృఢమయ్యేలా నవీనత నిండిన సాధనాలను తయారు చేయండి ఎందుకంటే అందరూ ప్రత్యక్షతను కోరుకుంటున్నారు. ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎన్నో స్థానాలలో పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేస్తున్నారు. ప్రతి ఒక్క వర్గంవారు బాగా కష్టపడుతున్నారు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఏ సేవ చేసినా, నోటి సేవ చేసారనుకోండి, కేవలం నోటితో సేవను చేయడమే కాకుండా మనసా వాచ మరియు స్నేహ సహయోగ రూపి కర్మను, ఒకేసారి మూడింటిని చేసే సేవను జత చేయండి. వేరువేరుగా చేయకండి. బాప్‌దాదా ఆశించిన రిజల్ట్ సేవలలో కనిపించడం లేదు. మీరు కూడా ప్రత్యక్షతను కోరుకుంటున్నారు. అందరూ బాగుంది, బాగుంది, చాలా బాగుంది అన్నంత వరకు ఇప్పటి దాకా సేవ యొక్క రిజల్ట్ వచ్చింది. కానీ మంచిగా అవ్వటం అంటే ప్రత్యక్షత జరగటం. కావున ఇప్పుడు దీనిని ఎడిషన్ చేయండి. ఒకే సమయంలో మనసా-వాచ-కర్మణలో స్నేహి సహయోగిగా అవ్వడం. మీకు తోడుగా ఉన్నది బ్రాహ్మణ ఆత్మలు కావచ్చు, బయటివారు కావచ్చు, ఆ తోడుగా ఉన్నవారికి స్నేహము మరియు సహయోగాన్ని ఇవ్వడము - ఇదే కర్మణ సేవలో నంబర్ తీసుకోవడము. వీరిలా చేసారు కదా, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అన్న భాష మాట్లాడకండి. స్నేహానికి బదులు కొద్దికొద్దిగా అనాల్సి వచ్చింది, బాబా మీరు వాడే పదాలను చెప్పడం లేదు. ఇది చేయాల్సి వస్తుంది, అనాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది... ఇలా వద్దు. ఇన్ని సంవత్సరాలు చూస్తూ వచ్చాము, బాప్‌దాదా కూడా ఊరుకున్నారు. ఇలా కాదు అలా అంటూ వచ్చారు, కానీ ఎప్పటి వరకు? బాబా, ఇంకా తెర ఎప్పుడు తెరుస్తారు అని బాప్‌దాదాతో ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు మెజారిటీ పిల్లలు అడుగుతారు. ఎప్పటివరకు నడుస్తుంది అంటారు? మీ పాత భాష, పాత నడవడిక, సోమరితనము, చేదుతనము ఎప్పటివరకు అని బాప్‌దాదా పిల్లలను అడుగుతున్నారు? బాప్‌దాదాకు కూడా ఎప్పటి వరకు అన్న ప్రశ్న ఉంది. మీరు సమాధానం చెబితే బాప్‌దాదా కూడా ఎప్పటి వరకు వినాశనం అవుతుందో సమాధానం చెప్తారు ఎందుకంటే బాప్‌దాదా అయితే వినాశనపు తెరను ఇప్పుడు ఈ సెకండ్లో కూడా తెరవగలరు కానీ ముందు రాజ్యం చేసేవారు తయారుగా ఉండాలి కదా. మరి ఇప్పటి నుండి తయారీ చేసుకుంటేనే సమాప్తిని సమీపంగా తీసుకురాగలరు. ఎటువంటి బలహీన విషయంలోనూ కారణాన్ని చెప్పకండి, నివారణ చేయండి, ఈ కారణం ఉంది కదా అని అనకండి. బాప్‌దాదా రోజంతా పిల్లల ఆటను చూస్తూనే ఉంటారు, పిల్లలపై ప్రేమ ఉంది కదా, అందుకని మళ్ళీ మళ్ళీ పిల్లల ఆటలను చూస్తుంటారు. బాప్‌దాదా టీ.వి చాలా పెద్దది. ఒకే సమయంలో పూర్తి విశ్వం కనిపిస్తుంది, నలువైపుల ఉన్న పిల్లలు కనిపిస్తారు. అమెరికా కావచ్చు, గురుగ్రామ్ కావచ్చు, అన్నీ కనిపిస్తాయి. బాప్‌దాదా చాలా ఆటను చూస్తారు. తోసిపుచ్చే భాష చాలా ఉంటుంది, ఈ కారణం ఉంది కదా, బాబా నా తప్పు లేదు, వీరిలా చేసారు. వారు చేసారు సరే, మీరు సమాధానం చేసారా? కారణాన్ని కారణంగానే ఉంచారా లేక నివారణలోకి మార్చారా? బాబా, మీ ఆశ ఏమిటి అని అందరూ ఆడుగుతారు కదా. మరి బాప్‌దాదా తమ ఆశను వినిపిస్తున్నారు. బాప్‌దాదాకు ఒకే ఆశ ఉంది - నివారణ కనిపించాలి, కారణం సమాప్తం కావాలి. సమస్య సమాప్తం కావాలి, సమాధానం జరుగుతూ ఉండాలి. వీలవుతుందా? వీలవుతుందా? మొదటి లైన్ వారు - వీలవుతుందా? తల ఊపండి. వెనుక ఉన్నవారు, వీలవుతుందా? (అందరూ చేతులెత్తారు). అచ్ఛా. రేపు ఒకవేళ టీ.వి చూస్తే, టీ.వి అయితే చూస్తారు కదా. మరి రేపు టీ.వి చూస్తే విదేశం కావచ్చు, దేశం కావచ్చు, చిన్న గ్రామం కావచ్చు, చాలా పెద్ద రాష్ట్రం కావచ్చు, ఎక్కడ కూడా కారణం కనిపించదా? పక్కా? ఇందులో సరే అనడం లేదే? చేతులెత్తండి. చేతులు మాత్రం చాలా బాగా ఎత్తుతారు, బాప్‌దాదా సంతోషిస్తున్నారు. చేతులెత్తడం చాలా అద్భుతం. సంతోషపెట్టడమైతే పిల్లలకు వచ్చు ఎందుకంటే బాప్‌దాదా ఏమి చూసారంటే - ఆలోచించండి, కోట్లలో కొద్దిమందిలో కూడా కొద్దిమంది మీరు నిమిత్తంగా అయ్యారు, ఇప్పుడు ఈ పిల్లలు కాకుండా ఇంకెవరు చేస్తారు? మీరే చేయాలి కదా? బాప్‌దాదాకు మీపై ఆశలున్నాయి. ఎవరైతే వస్తారో, వారు మీ అవస్థ చూసే సరిగ్గా అవుతారు కదా, వారికి కష్టపడాల్సిన అవసరం ఉండదు. మీరు అవ్వండి చాలు ఎందుకంటే మీరందరూ జన్మించగానే ప్రతిజ్ఞ చేసారు - కలిసి ఉంటాము, తోడుగా ఉంటాము మరియు కలిసి వెళ్తాము మరియు బ్రహ్మా బాబాతో కలిసి రాజ్యంలోకి వస్తాము. ఈ ప్రతిజ్ఞ చేసారు కదా? కలిసి ఉంటాము, కలిసి నడుస్తాము అన్నప్పుడు సేవలో కూడా కలిసి ఉంటారు కదా!
ఈరోజు యొక్క సమాచారాన్ని ఇంకా వినిపిస్తాము. ఈరోజు ఎడ్వాన్స్ పార్టీ కూడా బాప్‌దాదా వద్ద ఇమర్జ్ అవుతారు. ఎప్పుడు బాప్‌దాదాతో కలిసి ముక్తిధామ ద్వారాలను తెరుస్తారు అని ఎడ్వాన్స్ పార్టీ కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటుంది. ఈరోజు ఎడ్వాన్స్ పార్టీ మొత్తం మాకు తారీఖు చెప్పండి అని బాప్‌దాదాను అడుగుతుంది. మరి ఏమని జవాబు చెబుదాము? చెప్పండి, ఏమని జవాబు చెబుదాము? జవాబు చెప్పడంలో ఎవరు తెలివైనవారు? బాప్‌దాదా అయితే త్వరలోనే అవుతుంది అని జవాబు చెప్తారు. కానీ ఇందుకు బాప్‌దాదాకు పిల్లలైన మీ సహయోగం కావాలి. అందరూ కలిసి నడుస్తారు కదా! కలిసి నడిచేవారా లేక ఆగి ఆగి నడిచేవారా? కలిసి నడిచేవారు కదా! కలిసి నడవడం ఇష్టమే కదా? మరి సమానంగా కావలసి ఉంటుంది. కలిసి నడవాలంటే సమానంగా అవ్వవలసిందే కదా! ఏమని అంటారు? చేతిలో చేయి ఉండాలి, కలిసి నడవాలి. చేతిలో చేయి అంటే సమానము. మరి చెప్పండి, దాదీలు చెప్పండి, తయారీ అవుతుందా? దాదీలు చెప్పండి. దాదీలు చేతులెత్తండి. దాదాలు చేతులెత్తండి. మరి చెప్పండి దాదీలు, దాదాలు ఏ తారీఖు ఇద్దాము? (ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు) ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు తయారుగా ఉన్నట్లేనా? జవాబు అయితే మంచిగా ఇచ్చారు. దాదీలు? పూర్తి కావలసిందే. ప్రతి ఒక్కరూ చిన్నవారు పెద్దవారు అందరూ ఇందులో స్వయాన్ని బాధ్యులుగా భావించాలి. ఇందులో చిన్నవారిగా అవ్వవద్దు. 7 రోజుల బిడ్డకు కూడా బాధ్యత ఉంది ఎందుకంటే కలిసి నడవాలి కదా. ఒక్క బాబాయే వెళ్ళాలనుకుంటే వెళ్ళుండవచ్చు కానీ బాబా వెళ్ళరు. కలిసి వెళ్ళాలి. బాబా మరియు పిల్లల ప్రతిజ్ఞ ఉంది. చేసిన ప్రతిజ్ఞను నిలుపుకోవాలి కదా. నిలుపుకున్నాము కదా? ఇక్కడ మధుబనం వారు కూర్చున్నారు కదా!
మధుబనంలో ఉన్న ఇన్ఛార్జ్ హెడ్స్, ఛార్జెస్ (బాధ్యతలు) చాలా ఉన్నాయి కదా, శాంతివన్, జ్ఞాన సరోవర్, పాండవ భవనం అన్ని స్థానాలు ఉన్నాయి. ఇన్ ఛార్జ్ వారి పేర్ల లిస్ట్‌ను బాప్‌దాదాకు ఇవ్వండి, వారి నుండి లెక్క తీసుకుంటాము. ఇన్ఛార్జ్ టీచర్ అక్కయ్యలు, సెంటర్ ఇన్‌ఛార్జులు, జోన్ ఇన్‌ఛార్జులు, వీరందరి సంగఠన ఒక రోజు చేద్దాం, లెక్కలను అడగాలి కదా. ఎందుకంటే బాప్‌దాదా వద్దకు అనేకుల దుఃఖము, అశాంతి వినిపిస్తున్నాయి. కలవరంలో ఉన్న ధ్వని వినిపిస్తుంది. మీకు వినిపించడం లేదా? మీ భక్తులు కూడా ఉంటారు కదా! మరి భక్తుల మొర ఇష్ట దైవాలైన మీ వద్దకు చేరుకోవడం లేదా? టీచర్లకు భక్తుల మొర వినిపిస్తుందా? అచ్ఛా.
సేవ టర్న్ గుజరాత్ వారిది:- గుజరాత్ వాకిట్లోనే ఉంది కదా. గుజరాత్లో మెజారిటీ గీతా పాఠశాలలు ఉన్నాయి మరియు గీతా పాఠశాలలు నడిపించే హ్యాండ్స్ కూడా చాలామంది ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. ఇప్పుడు గుజరాత్ ఏమి చేస్తుంది? సేవాధారులు కూడా చాలామంది ఉన్నారు, సేవ కూడా చాలా ఉంది, ఇప్పుడు కొత్త సేవ ఏమి చేస్తారు? ఎవ్వరూ చేయనటువంటి ప్లాన్ ఏదైనా చేసారా? ఎవ్వరూ చేయనిదానిని గుజరాత్ చేసి చూపించండి. మరి గుజరాత్ ఏమి చేస్తుంది? మనసా సేవలో నంబర్‌వన్‌గా అయ్యి చూపించండి. అందరి కోసం ఇది. కానీ ఇది గుజరాత్ టర్న్ కనుక గుజరాత్‌కు చెప్తున్నాము. ఇప్పుడు స్వయం యొక్క మనసు పవర్‌ఫుల్‌గా ఉంటేనే మనసా సేవ యొక్క రిజల్ట్ ముందుకు వస్తుంది. ఎలా వాచ సేవ మొదట్లో లేదు, కానీ ఇప్పుడు వాచ సేవ యొక్క రిజల్ట్ ముందుకు వస్తుంది. బాగా కష్టపడుతున్నారు. ఇందుకు నిమిత్తమైనవారికి బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు కానీ సమయం ఫాస్ట్‌గా వెళ్తుంది, ఇప్పుడు కూడా సమయం వేగంగా వెళుతుంది. అచ్ఛా. అభినందనలు. గుజరాత్ ఎలా అయితే స్థానం ప్రకారం సమీపంగా ఉన్నదో అలాగే బాబా హృదయంలో కూడా సమీపంగా ఉన్నారు. మంచి మంచివారున్నారు, ఆరంభం నుండి చాలా మంచి పాండవులు మరియు శక్తులు వెలువడ్డారు. ఇప్పుడు ఇటువంటి స్పీకర్లను తయారు చేయండి. మీరు సకాశ్ ఇస్తే వారు భాషణ ఇవ్వాలి. అచ్ఛా, చాలా మంచిది. పదమారెట్ల అభినందనలు.
డబల్ విదేశీయులు:- డబల్ విదేశీయులు వచ్చినప్పుడు మధుబన అలంకారం జరుగుతుంది అని బాప్‌దాదా ముందు కూడా చెప్పి ఉన్నారు. డబల్ విదేశీయుల పై అందరికీ ప్రేమ ఉంటుంది. మీ గ్రూప్‌ను చూసినప్పుడు అందరూ సంతోషిస్తారు ఎందుకంటే మీరు కూడా కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో అతి కొద్దిమంది వెలువడ్డారు. ఈరోజుల్లో విదేశీ సేవా సమాచారం బాగుంది. ఈరోజు ఇప్పుడు వినిపించాము కదా, ఒక సమయంలో ఒకే సేవను చేయకండి, మూడు సేవలను కలిపి చేయండి అప్పుడు దాని ప్రభావం తొందరగా పడుతుంది. మీ ముఖంతో, మీ నడవడికతో కూడా సేవను చేయండి. నడుస్తూ-తిరుగుతున్న మ్యూజియంగా ఉండండి. ఎలా అయితే మ్యూజియం మరియు ప్రదర్శనిలో భిన్న భిన్న చిత్రాలు ఉంటాయి కదా, అలాగే మీ నయనాలు, మీ మస్తకం, మీ చిరునవ్వు చిందించే పెదవులు, ఇవన్నీ భిన్న భిన్న సాధనాలు, వీటితో సేవను చేయవచ్చు. మంచివారు, బాప్‌దాదాకు ధైర్యవంతులుగా కనిపిస్తున్నారు, కేవలం ఇప్పుడు రియలైజేషన్ సూక్ష్మంగా కావాలి. రియలైజ్ అవుతారు కానీ కొంచెం సూక్ష్మ రూపంలో రియలైజేషన్ అయ్యి నంబర్‌వన్ అవ్వండి. విన్ అవ్వండి (గెలవండి) మరియు వన్ అవ్వండి. సెకండ్ నంబర్ కాదు, వన్. సరేనా! వన్ కదా, టూ కాదు కదా? వన్ నంబరేనా? తల ఊపండి. మంచిది, విదేశీయుల గ్రూప్ మధుబనానికి వస్తూ ఉండాలి, ఇది బాప్‌దాదాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మధుబనం అలంకరించబడుతుంది. అచ్ఛా.
బాప్‌దాదా వద్దకు పూల అలంకారం చేసిన గ్రూప్ యొక్క ప్రియస్మృతి కూడా చేరుకుంది (కలకత్తా నుండి వచ్చిన సోదరసోదరీలు), ఆ గ్రూప్ లేవండి, ఎక్కడున్నారు? చూడండి, అందరికీ పూలతో అలంకరణ నచ్చుతుంది కదా. (స్మృతి దివసము నిమిత్తంగా బాప్‌దాదా యొక్క అన్ని స్మృతిచిహ్న స్థానాలను చాలా సుందరంగా పూల మాలలతో అలంకరించారు) పూల అలంకారం అయితే కామన్ విషయము, అందరూ చేస్తారు కానీ మీ అలంకారం ఇతరుల అలంకారానికి తేడా ఉంది - మీరు స్నేహ స్వరూపులై అలంకరించారు, వారు డ్యూటీ అనుకుని చేస్తారు, మీరు స్నేహంతో చేస్తారు. ఎక్కడ స్నేహం ఉంటుందో, అక్కడ పూల సుగంధం, అలంకారం మరియు సౌందర్యం ఉంటాయి.
వచ్చేటువంటి మీ సోదరసోదరీలు చూసి సంతోషిస్తారు, వాహ్! అద్భుతం, అద్భుతం. మరి మీరంతా ఏ స్నేహంతో అయితే అలంకరించారో, బాప్‌దాదా అందుకు పదమారెట్లు మీకు స్నేహాన్ని ఇస్తున్నారు, అభినందనలు. అచ్ఛా .
నలువైపుల నుండి ఉత్తరాలు, స్మృతి ఉత్తరాలు, ఈ మెయిల్స్, ఫోన్లు చాలా చాలా వచ్చాయి. ఇక్కడకు మధుబనానికి కూడా వచ్చాయి, వతనానికి కూడా వచ్చాయి. ఈరోజు బంధనంలో ఉన్న మాతల స్నేహం నిండిన హృదయపూర్వక స్మృతి కూడా బాప్‌దాదా వద్దకు చేరుకుంది. బాప్‌దాదా ఇటువంటి స్నేహి పిల్లలను చాలా గుర్తు చేస్తున్నారు మరియు ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నారు.
ఈరోజుల్లో అందరూ దూరంగా కూర్చుని కూడా సమీపంగా ఉన్నట్లుగా అనుభవం చేసుకోవడాన్ని బాప్‌దాదా చూస్తున్నారు. కానీ మధుబనానికి సమ్ముఖంలో రావడం, తమ ఒడిని నింపుకోవడం, ఇంత పెద్ద పరివారాన్ని కలుసుకోవడం, ఈ పరివారం తక్కువైనదేమీ కాదు, ఏ విధంగా చూసుకున్నా కానీ ఈ పరివారం తక్కువైనది కాదు. ఈ పరివారాన్ని సమ్ముఖంలో చూసి సంతోషం కలుగుతుంది. ఎందుకంటే 5 వేల సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నారు. ఆ అనుభవం వేరేనే ఉంటుంది. మధుబన నివాసులుగా ఉండటం, ఈ గోల్డెన్ ఛాన్స్ చాలా సహయోగాన్ని ఇస్తుంది. అందరూ అనుభవం కూడా చేసుకుంటున్నారు. అందరికీ మురళిపై ప్రేమ ఉండటాన్ని చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. మురళి మీద ప్రేమ అంటే మురళీధరుడిపై ప్రేమ ఉండటము. మాకు మురళీధరుడిపై ప్రేమ ఉంది కానీ మురళి మాత్రం అప్పుడప్పుడు వింటాము అని ఎవరైనా అంటే, వారి ప్రేమను ప్రేమగా భావించను అని బాప్‌దాదా అంటారు. ప్రేమను నిలుపుకోవడం వేరు, ప్రేమించడం వేరు. ఎవరికైతే మురళిపై ప్రేమ ఉంటుందో వారు ప్రేమను నిలుపుకునేవారు. ఎవరికైతే మురళిపై ప్రేమ ఉండదో వారు ప్రేమ చేసేవారి లిస్ట్‌లో ఉన్నారు కానీ ప్రేమను నిలుపుకునేవారి లిస్ట్‌లో లేరు. మధుబనంలో మురళి మ్రోగుతుంది, మధుబనం యొక్క గాయనం ఉంది. మధుబన ధరిత్రి యొక్క మహత్వం ఉంది. అచ్ఛా.
మరి నలువైపుల ఉన్న స్నేహి పిల్లలకు, లవ్లీ మరియు లవ్లీన్ పిల్లలు ఇద్దరికీ, సదా బాబా శ్రీమతం ప్రమాణంగా ప్రతి అడుగులో పదమాలు జమ చేసుకునే నాలెడ్జ్‌ఫుల్, పవర్ఫుల్ పిల్లలకు, సదా స్నేహి కూడా మరియు స్వమానధారి కూడా, సమ్మానధారి కూడా, ఇటువంటి సదా బాబా శ్రీమతాన్ని పాటించే విజయి పిల్లలకు, సదా బాబా యొక్క ప్రతి అడుగుపై అడుగును వేసే సహజయోగి పిల్లలకు బాప్‌దాదా యొక్క, కానీ ఈరోజు వతనంలో ఎడ్వాన్స్ పార్టీ పిల్లలు కూడా ఒక్కొక్కరూ తమ తరఫు నుండి అందరికీ, నలువైపుల ఉన్న పిల్లలకు మా ప్రియస్మృతులను ఇవ్వమని, మీ కోసం వేచి ఉన్నాము అన్న తమ సందేశాన్ని ఇవ్వమని చెప్పారు. మీరు త్వరత్వరగా ఏర్పాట్లు చేసుకోండి, విశేషంగా మీ అందరి ప్రియమైన తల్లి, దీదీ, విశ్వ కిషోర్ మరియు ఇతర తోటివారు అందరూ మీ అందరికీ ప్రియస్మృతులను ఇచ్చారు. మీరు కూడా విజయులుగా అయ్యి, దుఃఖము, బాధలను దూరం చేసి త్వరత్వరగా ముక్తిధామ ద్వారాలను తెరిచేందుకు బాప్‌దాదాకు సహచరులుగా అవ్వండి అని మీ మధురమైన తల్లి చెప్పారు. ఎవరైతే సాకారంలో బ్రహ్మా బాబాను చూడలేదో, బ్రహ్మా బాబా కూడా విశేషంగా అందరికీ హృదయపూర్వక ప్రియస్మృతులను ఇస్తున్నారు మరి ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీ జానకిగారు:- మూడు సార్లు ఓం శాంతి. వండర్ఫుల్ బాబా, వండర్ఫుల్ బాబా పిల్లలు, బాబా ఎంత మంచిగా దృష్టినిస్తారు, మనం దృష్టితో ఎటువంటి ప్రపంచంలోకి వెళ్ళిపోతాము! సూక్ష్మవతనం, మూల వతనం. రెండు వతనాలు చాలా బాగుంటాయి. సూక్ష్మవతనంలో బాబా వస్తారు, తర్వాత మూల వతనానికి పిలుస్తారు. మరి మనం బాబా పిల్లలం. పిల్లలేమో బాబా అంటారు, బాబా ఏమో పిల్లలూ అంటారు. మా మనసు నుండి బాబా అని వెలువడుతుందంటే, మనసు పలికే బాబా మీకు ధన్యవాదాలు. మీరు చాలా మంచివారు, మేము కూడా మంచివారము. సమయానుసారంగా ఇక్కడ హాజరు కావడం, బాబా వచ్చేస్తారు. మనం కష్టపడము కానీ ప్రేమ ఉంది. నేను ఎవరిని, నాకు ఎవరు! ప్రతి ఒక్కరిదీ వారి పాత్ర ఉంది.
కలకత్తావారు సదా పూలతో అలంకరిస్తారు. ప్రతి ఒక్కరిదీ వారి వారి పాత్ర, అందరి పాత్రలను చూసి సంతోషిస్తాము. సంతోషంగా ఉండటం మరియు సంతోషపెట్టడం ఇదే మన కర్తవ్యం. సంతోషంగా ఉండండి, సంతోషాలను పంచండి. ఈ మిలనం యొక్క ఆచారం కూడా చాలా ప్రియంగా అనిపిస్తుంది.
*** ఓంశాంతి ***
