“ఈ బర్త్ డే సందర్భంగా అందరూ ఒకరికొకరు ఉల్లాస-ఉత్సాహాలను కలిగిస్తూ, సహయోగులుగా అవుతూ వ్యర్థ సంకల్పాలనే జిల్లేడు పువ్వులను అర్పణ చేయండి; మాస్టర్ సర్వశక్తివాన్ స్వమానపు సీటుపై ఉంటూ ఇందులో నంబర్‌వన్ బహుమతిని పొందండి.”
14-02-2026 ఓం శాంతి అవ్యక్త బాప్‌దాదా మధుబన్
ప్రాణప్రియులైన అవ్యక్తమూర్తి మాతా-పితా బాప్‌దాదా యొక్క అత్యంత గారాల పిల్లలు, భోళానాథ్ శివబాబాకు అత్యంత ప్రియమైనవారు, సదా ఉల్లాస-ఉత్సాహాలలో ఉండేవారు, తమ అలౌకిక దివ్యత్వ సంపన్న జీవితం ద్వారా బాప్‌దాదాను ప్రత్యక్షం చేసే సర్వ సేవాధారి నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు దేశ-విదేశాలలోని సర్వ బ్రాహ్మణ కుల భూషణ సోదర-సోదరీలారా,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతులతో పాటు, త్రిమూర్తి మహాశివరాత్రికి కోట్లాది అభినందనలు.
మనమందరం మన ప్రియమైన భోళానాథ్ శివబాబా యొక్క 90వ దివ్య అవతరణ జయంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. నలువైపులా సేవల సందడి ఎంతో బాగుంది. అనేక స్థానాలలో 12 జ్యోతిర్లింగాల మేళాలు నిర్వహించబడ్డాయి. ఎన్నో ప్రాంతాలలో ప్రభాతఫేరి, మందిరాలలో ప్రవచనాలు, ప్రదర్శనలు మొదలైనవి ఏర్పాటు చేసి ప్రతి ఆత్మకూ పరమాత్మ అవతరణ దివ్య సందేశాన్ని చేరవేసే సేవలను అందరూ ఎంతో ఉల్లాస-ఉత్సాహాలతో చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ళలో, దుకాణాలలో, పొలాలలో శివబాబా ధ్వజాన్ని ఎగురవేస్తున్నారు. మధుబన్‌లో కూడా బాబా యొక్క సర్వ స్థానాలలో ప్రతిరోజూ జెండాలు ఎగురవేయబడుతున్నాయి. అందరూ ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటూ, నోరు తీపి చేసుకుంటూ ఎంతో సంతోషాన్ని జరుపుకుంటున్నారు.
బాబా అంటున్నారు - పిల్లలూ, మీరందరూ జన్మదిన కానుకగా నాకు ఏమి ఇస్తారు? భక్తులు శివబాబా మందిరాలలో జిల్లేడు పువ్వులను సమర్పించినట్లుగా, మీరు పిల్లలు ఒకరికొకరు సహకారులుగా అవుతూ వ్యర్థ సంకల్పాలనే జిల్లేడు పువ్వులను బాబాకు అర్పణ చేసేయండి. ఇప్పటి నుండే వ్యర్థ సంకల్పాలు చేయకూడదు, వ్యర్థ విషయాలను వినకూడదు మరియు వ్యర్థాల సాంగత్యంలోకి రాకూడదు; ఎందుకంటే ఈ వ్యర్థ సంకల్పాలు స్మృతిలో స్థితం కానివ్వవు. వారికి ఎన్నడూ శుద్ధ సంకల్పాలు (మురళీ) కూడా గుర్తుండవు. మురళీ కేవలం వినడం వరకే పరిమితమవుతుంది కానీ మనస్సులో దాని మననం జరగదు. నేటి మురళీ, నేటి వరదానం చాలా బాగున్నాయి అంటారు, కానీ ఏమిటి అనేది గుర్తుండదు; ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు వారి మనస్సు-బుద్ధిని తమ వైపుకు ఆకర్షించేస్తాయి. కాబట్టి ఈ శుభ దినాన అందరూ ఈ వ్యర్థం అనే బహుమతిని బాబాకు ఇచ్చేయండి, దీని ద్వారా సంగమయుగపు అమూల్యమైన సమయము మరియు శక్తులు అన్నీ ఆదా అవుతాయి. మధురమైన బాబా మన పిల్లలకు స్మృతి చేయించిన అనేక రకాల స్వమానాలలో, ఏదో ఒక స్వమానం అనే సీటుపై సెట్ అయి తమ మనస్సు-బుద్ధికి ఆర్డర్ వేస్తే అవి తప్పక వింటాయి. ఇలాంటి ఎంతో ప్రేరణాదాయకమైన అనేక శిక్షణలతో కూడిన మహావాక్యాలను అందరూ వింటూ దృఢ సంకల్పాల ప్రతిజ్ఞ చేస్తున్నారు.
ఈసారి విశేషంగా బాప్‌దాదా సేవా టర్న్‌లో ఇండోర్ జోన్ (హేమ అక్కయ్య) గ్రూప్ వచ్చింది. అందరూ సేవ చేస్తూ చక్కగా రిఫ్రెష్ అవుతున్నారు. ఇది కాకుండా దేశ-విదేశాలలోని అనేక స్థానాల నుండి బాబా యొక్క అనేకానేక పిల్లలు బాబా అవతరణ భూమికి చేరుకున్నారు. అంతటా శ్వేత వస్త్రధారులైన ఫరిశ్తల వర్షంలా ఉంది.
మన గౌరవనీయులైన మోహిని దీదీ, జయంతి దీదీ కూడా మధుబన్లోనే ఉన్నారు. వారు కూడా అందరినీ తమ అనుభవాలతో, జ్ఞాన రత్నాలతో సంపన్నం చేస్తున్నారు. మంచిది - అందరికీ స్మృతులు... ఓం శాంతి.
14-02-26 ఓం శాంతి “అవ్యక్త-బాప్‌దాదా” రివైజ్ 02-03-11 మధుబన్
“ఈ బర్త్ డే సందర్భంగా అందరూ ఒకరికొకరు ఉల్లాస-ఉత్సాహాలను కలిగిస్తూ, సహయోగులుగా అవుతూ వ్యర్థ సంకల్పాలనే జిల్లేడు పువ్వులను అర్పణ చేయండి; మాస్టర్ సర్వశక్తివాన్ స్వమానపు సీటుపై ఉంటూ ఇందులో నంబర్‌వన్ బహుమతిని పొందండి.”
నేడు మీరందరూ మరియు మీతో పాటు నలువైపులా ఉన్న సర్వ పిల్లలు అమృతవేళ నుండి ఎంతో స్నేహభరితమైన తమ ప్రేమను, సంతోషాన్ని అభినందనల రూపంలో తెలియజేస్తున్నారు. కాబట్టి తండ్రి కూడా సికిలధే పిల్లలైన మీ అందరికీ ఈ జయంతి అభినందనలు తెలిపేందుకు వచ్చారు. ఒక్కొక్క బిడ్డా తండ్రికి అతి ప్రియమైన హృదయపు ముద్దుబిడ్డ. కాబట్టి బాప్‌దాదా తమ బాహువులనే మాలతో మీ అందరికీ అభినందనలు తెలుపుతున్నారు.
బాప్‌దాదా చూస్తున్నారు - మీరైతే సమ్ముఖంలో ఉండి అభినందనలు ఇస్తున్నారు మరియు తీసుకుంటున్నారు; కానీ నలువైపులా ఉన్న పిల్లలు అనేక ప్రాంతాల నుండి అభినందనలు తెలుపుతున్నారు, మరియు తండ్రి కూడా దేశ-విదేశాల్లోని అన్ని వైపుల పిల్లలకు ఎంతో స్నేహపూర్వకంగా అభినందనలు అందజేస్తున్నారు. బాప్‌దాదా చూస్తున్నారు - ప్రతి బిడ్డా ఆనందకరమైన ముఖంతో ప్రేమ సాగరంలో ఓలలాడుతున్నారు. తండ్రికి సంతోషం ఏమిటంటే - తండ్రి ఒంటరిగా రారు, పిల్లలతో పాటే వస్తారు; ఎందుకంటే తండ్రి వచ్చేదే యజ్ఞాన్ని రచించడానికి. మరి యజ్ఞంలో ఎవరుంటారు? బ్రాహ్మణులు; అందుకే తండ్రి ఒంటరిగా రాలేదు, పిల్లలతో కలిసే వచ్చారు. ఎందుకంటే ఈ జయంతి సర్వ జయంతుల కంటే ఎంతో అద్భుతమైనది. పూర్తి కల్పంలో తండ్రి మరియు పిల్లల జన్మ కలిసి జరిగేది ఈ ఒక్క జయంతిలోనే; అందుకే ఈ జయంతిని వజ్రతుల్య జయంతి అంటారు. తండ్రి కూడా విశేషంగా ఆది రత్నాలైన పిల్లలకు విశేష అభినందనలు తెలుపుతున్నారు. మరి మీరందరూ నేడు అభినందనలు ఇవ్వడానికి వచ్చారా లేక తీసుకోవడానికి కూడా వచ్చారా! కలిసి ఉంటాము, కలిసి ఎగురుతాము, కలిసి వస్తాము మరియు బ్రహ్మా బాబాతో కలిసి రాజ్యం చేస్తాము అని తండ్రి చెప్పారు. కలిసి ఉండేందుకు చేసిన ప్రతిజ్ఞ ఇది. మీరు ఏమంటారు? తండ్రి ఎక్కడ ఉంటే మేమూ అక్కడే వెన్నంటే ఉంటాము. ఇది పిల్లలు తండ్రితో, తండ్రి పిల్లలతో చేసిన ప్రతిజ్ఞ. శరీరాల ద్వారా ఎక్కడ నివసిస్తున్నప్పటికీ హృదయంలో సదా తండ్రి తోడుగానే ఉన్నారు; అందుకే తండ్రిని దిలారామ్ అంటారు. ఇక్కడ స్మృతిచిహ్నం కూడా దిల్వాలా (దేల్వాడా) మందిరం ఉంది. మరి అందరి హృదయంలో తోడుగా దిలారాముడు ఉన్నారు కదా! మరియు పిల్లలకు తండ్రి సదా చెప్తారు - ఎన్నడూ ఒంటరిగా కావద్దు. సదా తోడుగా ఉన్నారు, తోడుగానే ఉండాలి. ఒంటరిగా ఉంటే మాయ తన అవకాశాన్ని తీసుకుంటుంది; తోడుగా ఉంటే స్వయంగా లైట్ హౌస్ తోడున్నట్లే, ఆయన ఎదుట మాయ దూరం నుండే పారిపోతుంది, సమీపానికి కూడా రాలేదు. అందువలన పిల్లలు తండ్రితో, తండ్రి పిల్లలతో సదా తోడుండే ప్రతిజ్ఞ చేశారు. మీ అందరిదీ కూడా ఇదే ప్రతిజ్ఞ కదా! తోడున్నాము, తోడుగానే ఉంటాము. తోడుగా ఉండటం బాగుంది కదా. అవును, కావాలంటే చేతులు ఎత్తండి.
ప్రతి బిడ్డా అమృతవేళ తండ్రితో ఎంతో మనసు విప్పి మాట్లాడుకోవడాన్ని బాప్‌దాదా చూశారు. సాధారణంగానైతే సమయం దొరకదు, కానీ అమృతవేళ ప్రతి ఒక్కరూ ఎంతో మధురమైన హృదయపు సంభాషణలు చేస్తారు; మరియు తండ్రి కూడా ప్రతి ఒక్క బిడ్డ హృదయపు మాటలను విని సర్వ విషయాలకూ సమాధానాలు కూడా ఇస్తారు. హృదయపూర్వకంగా ‘నా బాబా’ అనగానే తండ్రి హాజరైపోతారు, హజూర్ ప్రత్యక్షమైపోతారు అనే ఒక విషయమే అందరికీ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇందులో కేవలం హృదయపూర్వకమైన భావనే ప్రధానం, వేరే ఏమీ చేయవలసిన అవసరం లేదు; మనసారా ‘నా బాబా’ అనగానే హజూర్ ప్రత్యక్షం.
మరి నేడు బర్త్ డే జరుపుకోవడానికి వచ్చారు. మీ బర్త్ డే కూడా జరుపుకోవడానికి వచ్చారు కదా! తండ్రి పిల్లలు లేకుండా ఏమీ చేయరు, అందుకే నేడు పిల్లల జన్మ ఉత్సవపు అభినందనలు తెలిపేందుకు తండ్రి వచ్చారు - వాహ్ నా పిల్లలారా వాహ్! ఇప్పుడు ఒక విషయం చెప్పమంటారా, సిద్ధంగా ఉన్నారా! చెప్పనా? చేయాల్సి ఉంటుంది. చేతులెత్తండి, చేస్తారా? డబల్ ఫారెనర్స్ చేస్తారా? టీచర్స్ చేస్తారా? మంచిది. శివ పరమాత్ముని స్మృతిచిహ్నంలో గులాబీ పువ్వులు కాదు, మరే ఇతర పువ్వులూ సమర్పించరు, జిల్లేడు పువ్వులను సమర్పిస్తారు. మరి నేడు బాప్‌దాదా మీరు ఏ విషయాన్ని సమర్పించాలో ఆ హోంవర్క్ ఇవ్వాలనుకుంటున్నారు. సిద్ధంగా ఉన్నారు కదా! మంచిది.
పిల్లల ఈ గుణం తండ్రికి చాలా నచ్చుతుంది, అందరూ ‘జీ బాబా (హాఁ జీ)’ అంటారు. కాబట్టి నేటి జన్మదినం సందర్భంగా తండ్రి సంకల్పం ఏమిటంటే - అందరూ ఒకరికొకరు ఉల్లాస-ఉత్సాహాలను కలిగిస్తూ, ఒకరికొకరు సహయోగులుగా ఉంటూ వ్యర్థ సంకల్పాలనే జిల్లేడు పువ్వులను అర్పణ చేయండి. వ్యర్థ సంకల్పాలు చేయకూడదు, వినకూడదు మరియు సాంగత్యంలోకి వచ్చి వ్యర్థ సంకల్పాల సాంగత్యపు రంగును అంటించుకోకూడదు; ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు ఉన్నచోట స్మృతి సంకల్పాలు, జ్ఞానపు మధురమైన మహావాక్యాలు, దీనినే మురళీ అంటారు - ఆ శుద్ధ సంకల్పాలు స్మృతిలో ఉండవు. మురళీ వింటున్నా, చదువుతున్నా, అది తప్పనిసరి, బ్రాహ్మణుల నియమం, అది కేవలం వినడం వరకే పరిమితమవుతుంది. మనస్సులో మననం జరగడం లేదు. నేటి మురళీ చాలా బాగుంది అని ఆలోచిస్తారు, చెప్తారు కూడా. అసలేమిటి అని ఆలోచిస్తూ ఉంటారు... వరదానం కూడా చాలా బాగుంది, కానీ గుర్తుకొస్తుందిలే అని సరిపెట్టుకుంటారు... వ్యర్థ సంకల్పాలు మనస్సు-బుద్ధిని తమ వైపుకు ఆకర్షించేస్తాయి. తండ్రి ఎదుట ఏమి చెప్తారో తెలుసా? బాబా, ఆసక్తికరమైన సమాచారాన్ని (ఇంట్రెస్టింగ్ న్యూస్) తెలుసుకోవాలి కదా అని అంటారు. నాలెడ్జ్‌ఫుల్‌గా కావాల్సిందే, కానీ వ్యర్థ విషయాలు పదవీ ప్రాప్తికి నష్టం కలిగిస్తాయి. మరి మీరందరూ వ్యర్థ సంకల్పాల విషయంలో తండ్రికి ప్రతిజ్ఞ చేస్తారా? మేమైతే కోరుకోవట్లేదు కానీ అవే వచ్చేస్తున్నాయి అని మీరంటారు. కోరుకోవట్లేదు కానీ వచ్చేస్తున్నాయి. మరి తండ్రికి దృఢ సంకల్పంతో ఇచ్చేయడం ముందుగా వచ్చా? తండ్రికి ఇచ్చేశారు. ఇచ్చిన వస్తువే మళ్ళీ మీ వద్దకు తిరిగి వస్తే, ఆ ఇచ్చిన వస్తువును మీరు మీ వద్దే ఉంచుకుంటారా లేక తిరిగి ఇచ్చేస్తారా? ఒకవేళ ఇచ్చిన వస్తువును మీ వద్దే ఉంచుకుంటే మీ బిరుదు ఏమవుతుంది? కాబట్టి తండ్రికి ఒక్కసారి మీ ఇష్టపూర్వకంగా, దృఢంగా ఇచ్చేయండి; ఇచ్చిన వస్తువు మళ్ళీ మన వద్దకు తిరిగి రాలేదు కదా అని మాటిమాటికీ చెక్ చేసుకోండి! ఇతరుల వస్తువును తమదిగా చేసుకోవడం మంచి పద్ధతిగా భావించరు కదా. అందువల్ల ప్రతిరోజూ విశ్రాంతి తీసుకునే ముందు, విశ్రాంతి తర్వాత తీసుకోండి కానీ ముందుగా చెక్ చేసుకోండి - నేడు రోజంతా ఏ వ్యర్థ సంకల్పమైనా రాలేదు కదా? చేయలేదు కదా? ఇచ్చిన వస్తువును మళ్ళీ వెనక్కి తీసుకోలేదు కదా?
మరి నేడు బర్త్ డే బహుమతి ఇచ్చే ధైర్యం ఉంది కదా! ధైర్యం ఉందా? చేతులెత్తండి, ధైర్యం ఉందా? ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ బాప్‌దాదా కూడా మీకు బహుమతిని ఇస్తారు. మీరు హృదయపూర్వకంగా ‘నా బాబా, దయాళువు, కృపాళువైన బాబా, మీరు ఈ వస్తువును తీసుకోండి’ అని చెప్పండి. హృదయపూర్వకంగా చెబితే తండ్రి ఎక్స్ట్రా గిఫ్ట్ ఇస్తారు; ఎందుకంటే ధైర్యం మీది, ఎక్స్ట్రా సహాయం తండ్రిది. ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ తండ్రి సహాయం తప్పక ఉంటుంది, ఇది అనుభవమే కదా. మరి బహుమతి ఇచ్చేందుకు సంతోషంగా చేతులు ఎత్తారా లేక సంగఠనలో ఉండి బలవంతంగానా? ఎందుకంటే బలవంతంగా చేసేవారిది సదా ఉండదు, అప్పుడప్పుడు ఉంటుంది. మనసారా చేసేవారు చేయాల్సిందే, అవ్వాల్సిందే అని ఉంటారు. బహుమతి ఇచ్చేశాము, ఇవ్వాల్సిందే. ఇలా సంతోషంగా సంకల్పం చేస్తే సర్వశక్తిమంతుడైన తండ్రి పిల్లలైన మాస్టర్ సర్వశక్తిమంతులకు ఇదొక పెద్ద విషయమా ఏంటి! సీటుపై స్థిరంగా ఉండండి; మాస్టర్ సర్వశక్తిమాన్ అనే సీటుపై సదా సెట్ అయి ఉండండి. మరచిపోకండి. ఇది స్వమానం కదా. తమ స్వమానాన్ని వదులుకోకూడదు. స్వమానం కోసం ప్రజలు పోరాటాలు కూడా చేస్తారు. అందుకే నేడు తండ్రికి ప్రేమ వచ్చింది - చిన్నచిన్న విషయాలలో తమ స్వమానం... పరమాత్ముని ద్వారా లభించిన స్వమానం, సాధారణంగా మనుషుల ద్వారా లభించిన స్వమానంలోనే ఎంత నషా ఉంటుంది! ఇది పరమాత్ముని ద్వారా లభించిన స్వమానము - ‘మాస్టర్ సర్వశక్తిమాన్’. ఏది కావాలనుకుంటే అది చేయగలరు. ధైర్యం ఉంది కదా? తల ఊపండి. చేతులు కాదు, తల ఊపండి. ధైర్యం ఉందా? టీచర్స్! మీరే చేయించాలి, శ్రద్ధ వహించాలి. మీరు స్వయంగా చేస్తూ అందరి దృష్టిని అటువైపు మళ్ళించి చేయించాలి. మీరే నిమిత్తం కదా. ఆ తర్వాత ఏ క్లాస్, ఎవరి క్లాస్ నంబర్ సంపాదిస్తుందో చూద్దాం! అప్పుడు మంచి బహుమతి ఇస్తాము. ఏ బహుమతి ఇస్తామో ఇప్పుడు చెప్పము. చాలా శ్రేష్ఠమైన బహుమతి ఇస్తాము. క్లాసు మొత్తం ప్రయత్నించాలి. ఎవరో ఒకరు చేశారు అని అలా కాదు, మెజారిటీ చేయాలి.
కాబట్టి నేడు బాప్‌దాదాకు ప్రతి ఒక్క బిడ్డ పట్ల - అందరూ నంబర్‌వన్‌లో రావాలి అనే ప్రేమ కలుగుతోంది. నంబర్ టూలో కూడా కాదు. మొదటి రాజగద్దెపై కూర్చోకపోవచ్చు, సింహాసనంపై ఇద్దరు మాత్రమే కూర్చుంటారు, కానీ మొదటి రాజధానిలో, మొదటి రాజవంశపు సంబంధంలోకి రావాలి. నంబర్ టూ ఎలాగూ అయ్యారు, కానీ రాజ్యం చేయాలి, రాజ్యాధికారిగా కావాలి అంటే మొదటి రాజ్యంలోకి రావాలి. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డా ఏదో ఒక విశేషతలో నంబర్‌వన్‌గా రావాలి అనేదే తండ్రికి పిల్లల పట్ల ఉన్న ప్రేమ. నంబర్వార్ కాదు, నంబర్‌వన్. ఉత్సాహం ఉందా? నంబర్‌వన్‌లో రావాలా లేక ఏది దొరికితే అదే మంచిది అనుకుంటారా? మంచిది మంచిది అని సరిపెట్టుకోవద్దు. ప్రతి ఒక్క బిడ్డా ఏదో ఒక అద్భుతంలో నంబర్‌వన్‌గా రావాలన్నదే తండ్రి ఆశ. నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి, ఏదో ఒక సబ్జెక్టులో నంబర్‌వన్‌గా అవ్వాల్సిందే. అవ్వాల్సిందే అనేదానిని అండర్లైన్ చేసుకోండి. సరే, ఎక్కువ కష్టాన్ని ఇవ్వట్లేదు, ఏదో ఒక సబ్జెక్టులో నంబర్‌వన్. ఇది సహజమే కదా. ఇక నేటి రోజున అమృతవేళ మిలనము జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డ ముఖం ఎంతో ఆహ్లాదకరంగా, సంతోషంతో నవ్వుతూ కనిపించింది. మరియు తండ్రి కూడా ప్రతి బిడ్డకూ సదా ఎగిరే కళ యొక్క వరదానాన్ని ఇచ్చారు. నడిచే కళ కాదు, ఎగిరే కళ. కాబట్టి బాప్‌దాదా నేడు ఇచ్చిన ఈ వరదానాన్ని గుర్తుంచుకోండి. బాప్‌దాదా మీ మరియు తమ జయంతి సందర్భంగా ఏ వరదానాన్ని ఇచ్చారు? ‘ఉడ్తీ కళా భవ’ (ఎగిరే కళ గలవారిగా కండి). మీరు కూడా రోజంతా శివరాత్రి ఉత్సవాన్ని హృదయంలో జరుపుకున్నారు కదా. కాబట్టి అందరూ మంచివారే, మంచిగానే ఉంటారు, అత్యుత్తమ శ్రేష్ఠ రాజ్య పదవిని పొందుతారు. అందరూ మంచివారే కదా! తండ్రి సదా మంచినే చూస్తారు. అచ్ఛా.
నలువైపులా ఎదురుగా కూర్చున్నవారైనా, తమ తమ స్థానాలలో కూర్చుని జరుపుకుంటున్నవారైనా అందరినీ చూసి బాప్‌దాదా హర్షిస్తున్నారు మరియు పిల్లలు కూడా తండ్రి మిలనాన్ని చూసి సంతోషిస్తున్నారు. కానీ నేటి సంకల్పం - ‘సదా సంతోషంగా’ ఉండాలి. అప్పుడప్పుడు ఉండేది కాదు, సదా సంతోషం. ఎవరైనా మీ ముఖాన్ని చూడగానే - వీరు ఎంతో భాగ్యవంతులైన ఆత్మగా కనిపిస్తున్నారు అని భావించాలి. మీ భాగ్యం మీ నడవడిక మరియు ముఖం ద్వారా కనిపించాలి. కేవలం మనస్సులో చాలా ఉంది అని అనుకోవడం కాదు. మీ భాగ్యవంతమైన ముఖము, సంతోషకరమైన ముఖము ఇతరులకు పరిచయాన్ని కలిగిస్తుంది. ముఖమే ఏదో విశేషత ఉందని చాటిచెప్పాలి. మీ ముఖమే సేవ చేయాలి. తండ్రి వద్దకు తీసుకురావాలి. సంతోషంగా ఉండటం కూడా సేవకు ఒక సాధనమే. కాబట్టి నలువైపులా ఉన్న పిల్లలందరికీ మీ బర్త్ డే యొక్క పదమా రెట్ల అభినందనలు, అభినందనలు, అభినందనలు. మంచిది.
సేవా టర్న్ ఇండోర్ జోన్‌ది :- మంచిది. వీరంతా ఇండోర్ వారే. ప్రతి ఒక్కరినీ విడివిడిగా చూసినప్పుడు తమ టర్న్‌లో యజ్ఞం పట్ల ప్రేమ ఉందని తెలుస్తోంది; ఎందుకంటే తండ్రి కూడా మొదట రాగానే యజ్ఞాన్ని రచించారు. యజ్ఞం సదా ముందుకు సాగాలి, నిండుగా ఉండాలి - ఇదే యజ్ఞానికి ప్రియమైన పిల్లల పని. సేవాకేంద్రాన్ని నలువైపులా ఎలాగైతే జాగ్రత్తగా చూసుకుంటారో, అలాగే యజ్ఞాన్ని సంరక్షించడం ప్రతి ఒక్క బిడ్డ కర్తవ్యము.
ఈ టర్న్ నిర్వహించడంలో అందరూ పాస్ అయ్యారని బాప్‌దాదా చూశారు. ఎవరిలోనూ ఏ లోటూ లేదు. కాబట్టి టర్న్ సమయంలో యజ్ఞాన్ని ఎలాగైతే జాగ్రత్తగా చూసుకున్నారో, అనుభవం చేసుకున్నారో... అలాగే ఇప్పుడు తమ సేవాకేంద్రాలలో ఉంటూ కూడా ప్రతి ఒక్కరూ యజ్ఞ రక్షకులే. కేవలం యజ్ఞ నివాసులు మాత్రమే కాదు, ప్రతి బ్రాహ్మణ బిడ్డకూ యజ్ఞం ప్రియమైనది, ప్రతి ఒక్కరూ యజ్ఞ రక్షకులే. ఇలా తమను తాము బాధ్యులుగా భావించి సదా నడవండి. మంచిది - బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు. అభినందనలు, అభినందనలు.
డబల్ విదేశీ సోదర-సోదరీలతో:- విదేశీ పిల్లలను చూసి భారతవాసులు ఎంతో సంతోషిస్తారు; ఎందుకంటే తండ్రి టైటిల్ ‘విశ్వ కళ్యాణకారి’. కేవలం భారత కళ్యాణకారి మాత్రమే కాదు. విదేశీయులను చూసినప్పుడు వారు కూడా ఇప్పుడు భారతీయ సంస్కారాలు కలవారిగా మారిపోయారు, ఎందుకంటే సత్యయుగంలో రాజ్యం చేయబోయేది మీరే కదా! అధికారులుగా కానున్నారు. కాబట్టి తండ్రి యొక్క ఏదైతే పరమాత్మ సంస్కృతి (కల్చర్) ఉందో, అది మీదిగా మారిపోయింది. మన సోదరులు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయారో, భారతదేశం నుండి సేవల కొరకు వెళ్ళారు కదా అని భారతవాసులు సంతోషిస్తారు. కానీ మీది భారతవాసి బీజమే. మీ బీజం ఫారెన్ది కాదు. మొదటి అసలైన బీజం భారతదేశానిదే, అందుకే ఎక్కడెక్కడి నుండో వచ్చి అందరిదీ భారతదేశపు ఒకే సంస్కృతి అయిపోయింది. మధుబన్‌లో ఇలాంటి సంఘటన జరగడం బాప్‌దాదాకు ఎంతో నచ్చుతుంది. కుటుంబం ఎంత పెద్దదో చూడండి. పెద్ద కుటుంబం, సుఖమయ కుటుంబం. సాధారణంగా కుటుంబం పెద్దదైతే దుఃఖం కలుగుతుంది, కానీ ఇక్కడ ఇంత పెద్ద సుఖమయ కుటుంబం ఎంతో బాగుంటుంది. కుటుంబం నచ్చుతుంది కదా! కుటుంబాన్ని చూసి సంతోషం కలుగుతుందా? అసలు ఇక్కడివారే కదా. అచ్ఛా!
*** ఓంశాంతి ***
