Search for a command to run...
19 Apr 1969
సంస్కారాలను మార్చుకోవాలంటే బిందు స్వరూపంలో స్థితి అయ్యే అభ్యాసం చేయండి
19 April 1969 · తెలుగు
బాప్దాదా వచ్చినప్పుడు అందరిలో ఏమి చూస్తారు? మీరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఏమి చూస్తారు? (సోదరుడు) సోదరుని రూపంలో ఎలా చూస్తారు? దేనిని చూస్తారు? (ఆత్మను సాకారంలో చూస్తాము) బాప్దాదా ఏమి చూస్తారు? బాప్దాదా ఒక్క సెకండులో చాలా చూస్తారు. ఒకటి, ఆత్మ స్థితిని చూస్తారు. రెండు, సేవా చార్టును చూస్తారు. మూడు, నడవడిక, యోగం చార్టును కూడా చూస్తారు. నాల్గవ విషయం ఏమి చూస్తారు? భవిష్య పదవి, ప్రతి ఒక్కరూ ఏమి అవ్వబోతున్నారని చూస్తారు. అది బాప్దాదా ఇప్పటి నుండే చూస్తారు. మీరు కూడా ఈ నాలుగు విషయాలు చూడగలరా? మీరు ఇతరులను యోగంలో కూర్చోబెట్టినప్పుడు, మీ ఆత్మ స్థితి యొక్క సాక్షాత్కారం జరుగుతుందా? జరగాలి. మీరు కూడా త్రికాలదర్శి అని పిలవబడతారు.
స్మృతి యాత్ర యొక్క భట్టీ జరిగే సమయంలో ఎదురుగా గద్దెపై కూర్చున్నప్పుడు, ఆ సమయంలో మీ స్థితి ఎలా ఉంటుంది? ఈరోజు రోజంతా బిందు రూపము యొక్క స్మృతి ఎంత ఉండింది అని చెక్ చేసుకోవాలి. బిందు రూపము మరియు విచార సాగర మథనము – రెండింటిలో శక్తిశాలి స్థితి ఏదనుకుంటున్నారు? (బిందు రూపము). ఈ బిందు స్వరూపము ఎక్కువ సమయము నిలిచి ఉండాలంటే అందుకు ముఖ్యమైన సాధనము ఏమిటి? (భిన్న భిన్న ఆలోచనలు చెప్పారు) ఇవన్నీ సరే, కానీ ఇందులో కూడా ముఖ్యమైన విషయము – ఎలా అయితే మీరు ప్రజలకు అర్థం చేయిస్తారు కదా, ప్రతి విషయాన్ని సమయానికి చేయాలి అని. మీ వద్దకు ఎవరైనా వచ్చి, మాకు జ్ఞానం వినే సమయం లేదు, గృహస్థ వ్యవహారం యొక్క జంజాటము చాలా ఉంది అని అంటే వారికి మీరు ఏ ఉపాయం చెప్తారు? గృహస్థ వ్యవహారం చేసే సమయంలో ఆ కార్యం చేయండి, మిగిలిన కొద్ది సమయంలో వచ్చి జ్ఞానాన్ని వినండి అని చెప్తారు కదా. మీరు వారికి సమయం గురించి, సమయానికి కర్తవ్యాలు చేయాలని అవగాహన ఇస్తారు కదా. అలాగే ఎవరైతే పురుషార్థీలు ఉన్నారో, వారికి ఎప్పుడు ఏమి చేయాలి, సమయము మరియు కర్తవ్యం యొక్క అవగాహన ఉండాలి. ఎప్పుడు ఏ స్థితి ఉండాలో అప్పుడు ఆ స్థితి ఉండాలి. యోగంలో కూర్చున్నప్పుడు బీజరూప స్థితిలో స్థితి అవ్వగలగాలి. అప్పుడు విచార సాగర మథనం చేయాల్సిన అవసరం లేదు. విచార సాగర మథనం అయితే నడుస్తూ-తిరుగుతూ, స్నానం చేస్తూ-తింటూ కూడా చేయవచ్చు. ఎలా అయితే అవ్యక్త సంభాషణకు అమృతవేళ సమయం నిర్థారించబడిందో అలాగే కూర్చున్నప్పుడు ముందుగా బిందు రూపంలో సమయాన్ని కేటాయించాలి, తర్వాత ఆత్మిక సంభాషణకు. బిందు రూప స్థితి ఎక్కువ సమయం నిలవడం లేదనిపిస్తే అప్పుడు రెండవ స్థితి అయిన ఆత్మిక సంభాషణను పట్టుకోండి. ఏమి జరుగుతుందంటే, అవ్యక్త సంభాషణ లేక విచార సాగర మథనం సహజము. అదైతే వెంటనే చేసేస్తారు కానీ బిందు రూపంలో స్థితి అవ్వడం కష్టం అందుకనే దానిపై తక్కువ శ్రద్ధను పెడతారు. కానీ ఇది తప్పకుండా జరగాలి. సాకార రూపంలో కూడా ఉదాహరణ చూసారు కదా, మాట్లాడుతున్నప్పుడు, తింటున్నప్పుడు ఒకట్రెండు క్షణాలు శరీరం నుండి మాయమైనట్లుగా అనిపించేది. మాట్లాడుతూ అశరీరి, ఆత్మిక రూపాన్ని చూసేవారు. ఇది బిందు రూపంలో స్థితి అయ్యే పురుషార్థము. మీలో ఈ పురుషార్థం తక్కువగా ఉంది అందుకే సంస్కారాలు మారడం లేదు. సంస్కారాలు ఎప్పుడు మారుతాయి? వికర్మల భారము తగ్గినప్పుడు. సంస్కారాలను మార్చుకోవడానికి ధారణ క్లాసులైతే చాలా జరుగుతున్నాయి. పరస్పరంలో వర్ణన కూడా చాలా చేస్తున్నారు, అయినాకానీ సంస్కారాలు ఎక్కడ మారుతున్నాయి? సంస్కారాలు మారేందుకు సాధనము ఇదే. కనుక, వర్తమాన సమయంలో ఈ విషయంపై కూడా విశేషమైన శ్రద్ధను ఉంచాలి. కనీసం రోజంతటిలో ఇందుకు విశేషమైన సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించాలి. తమ తమ దినచర్య అనుసారంగా ప్రత్యేకంగా ఈ అభ్యాసం కోసం మీ సమయాన్ని కేటాయించండి. అవ్యక్త స్థితిలో ఉండే పురుషార్థమైతే చేస్తున్నారు కానీ అశరీరి బిందు రూప స్థితి యొక్క అభ్యాసం ఉన్నప్పుడే అవ్యక్త స్థితి స్థిరంగా నిలవగలదు. లేకపోతే పదే పదే వ్యక్త భావంలోకి వస్తారు. ఇతరులకు వినిపిస్తారు – ఈ శరీరం ఒక వస్త్రం అని. మరి ఈ వస్త్రాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ధరించండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయాలి. ఇటువంటి అభ్యాసం కావాలి. శరీర భానాన్ని మర్చిపోవాలి మరియు భానంలోకి రావాలి. ఇటువంటి స్థితి ఉన్నప్పుడు అంతిమ సమయంలో ధర్మరాజు శిక్షలను తినరు. లేకపోతే ప్రబలమైన సంస్కారాలు ఉండటం వలన ఆ సంస్కారాల కారణంగా శిక్షలు తినాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ అభ్యాసం తక్కువగా ఉంది. మీరు ముందుగా బిందు స్వరూప స్థితిని పక్కా చేసుకోనంత వరకు మీరు చేసే అభ్యాసం జరగదు. అందుకోసం ముఖ్యంగా మహారథులు, ఎవరైతే అష్ట దేవతలుగా అవ్వనున్నారో, వారు విశేషమైన శ్రద్ధ పెట్టాలి. కేవలం ఎనిమిదిమందే ధర్మరాజుపురిని శిక్షలు లేకుండా క్రాస్ చేస్తారు. శిక్షలు తినకుండా ఉండాలంటే ఇదే ప్రయత్నము చేయాలి. ఎంత సమయం బిందు రూపము ఉంటుందో అంతగా వారి సంస్కారాలలో మార్పును చూడవచ్చు. మరి, సంస్కారాలను మార్చుకునేందుకు ఇదే ముఖ్యమైన సాధనము, ఇందుకోసం సమయము మరియు కర్తవ్యములపై ధ్యాస పెట్టండి. మీ దినచర్యను సెట్ చేసుకోండి. ఇలాగే సమయం గడుస్తూ ఉంటే సంపూర్ణంగా ఎప్పుడు అవుతారు! పురుషార్థానికి సమయం తక్కువగా ఉంది అని అంటారు కదా, మరి ముఖ్య పురుషార్థం ఇంకా మిగిలి ఉంది. బిందు రూపంలో స్థితి అయ్యేందుకు మీరు ఏవైతే అన్ని విషయాలు వినిపించారో అవన్నీ బిందు రూపంలో ఉండేందుకు సహాయపడతాయి. కానీ అందులో ముఖ్యమైన విషయము, బ్రేక్ శక్తిశాలిగా ఉండాలి. కొందరి బ్రేక్ చాలా బలహీనంగా ఉంది. బండి బ్రేక్ సరిగ్గా లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి, అందుకే బ్రేక్ పవర్ఫుల్గా ఉండాలి. డ్రామా పాయింటు కూడా ప్రతి కర్తవ్యంలో పరిపక్వంగా ఉండాలి. ఈ సబ్జెక్టు కొంచెం తక్కువగా కనిపిస్తుంది. మీ స్మృతిచిహ్నంలో మూడవ నేత్రాన్ని చూపించారు, ఆత్మ యొక్క ఆ స్థితిని స్థూలంగా చూడగలుగుతాము.
ఈరోజు విశేషంగా ఈ విషయం యొక్క రిజల్టును వినిపించాలనుకున్నాము, వినిపించాము. అత్యధికంగా రెండు, రెండున్నర గంటలకన్నా ఎక్కువ రిజల్టులో చూడలేదు. అది కూడా చాలా కొద్దిమందిలో, అప్పుడప్పుడూ చూసాము. సదా కాదు. రెండు గంటలు కూడా సదా ఉంటే చాలా గొప్ప. ఈ స్థితిలో ఉండటం వలన అంతర్ముఖత గుణం సహజంగా వస్తుంది, వద్దన్నా వారిని ఏకాంతము తనవైపుకు ఆకర్షిస్తుంది. పని చేస్తున్నప్పుడు కూడా ఏకాంతము ఆకర్షిస్తున్నట్లుగా అనిపిస్తుంది. మాట్లాడుతూ కూడా ఇటువంటి స్థితిని అనుభూతి చేసుకోవచ్చు. కానీ ఏకాంతంలో కూర్చునే అభ్యాసం లేనంతవరకు మీరు కర్మ చేస్తూ ఈ అనుభూతిని పొందలేరు.
సాకార రూపం ఎదురుగా మీరు వెళ్ళినప్పుడు ఏకాంతము, అంతర్ముఖత మిమ్మల్ని ఆకర్షించేవి కదా. ప్రకాశమే ప్రకాశము ఉంది అని అప్పుడప్పుడూ మీరు వినిపించారు. మాట్లాడే సమయంలో కూడా ప్రకాశమే ప్రకాశము కనిపించింది అని చెప్పారు. ఇది బిందు రూప స్థితి యొక్క ప్రభావము. మీ ద్వారా కూడా ఇలా అనుభవం అవ్వాలి. అప్పుడు మీ జీవితం అలౌకికంగా కనిపిస్తుంది. బిందు రూపంలో జ్ఞానం లోపల మర్జ్ అయిపోతుంది. సత్యయుగంలోని దేవతలలో జ్ఞానం ఇమర్జ్ రూపంలో ఉండదు అనగా విస్తారంగా ఉండదు అని అంటారు కదా, బీజంలో విస్తారం ఇమిడి ఉంటుంది, మరి బిందు రూపం అంటే బీజ రూపము. బీజంలో అన్నీ మర్జ్ అయి ఉంటాయి. ధరణిలో బీజము వేసినప్పుడు ఇమర్జ్ అవుతుంది. ఇదే విధంగా బిందు రూపంలో జ్ఞానం మొత్తం మర్జ్ అయి ఉంటుంది. క్రిందికి వచ్చినప్పుడు ఇమర్జ్ అవుతుంది. బిందు రూపంలో ఆ నిండైన అవస్థ ఉంటుంది. (ఇది సమాధి స్థితి వంటిదా) కాదు. ఇక్కడ సమాధి విషయమే లేదు. వారికి జ్ఞానమేమీ లేదు. అది నిల్ (శూన్య) స్థితి. ఇది శూన్య స్థితి కాదు. ఇది జ్ఞాన స్వరూపులుగా అవ్వడము. ఏదైనా పాయింటు స్పష్టత కోసం మీరు మథనం చేస్తారు, అది రెండవ దశ. కొందరు సాకార విషయాలనే స్మరిస్తూ ఉంటారు, అది కూడా యోగమనే అనవచ్చు. బాప్దాదా స్మృతియే ఉంటుంది కదా కానీ శాతం తగ్గిపోతుంది. దానిని కూడా స్మృతి అంటాము కానీ బిందు రూప స్థితి చాలా శక్తివంతమైనది. ప్రేమ స్వరూపము, స్నేహ స్వరూపం రెండింటిలో తేడా ఉంది. అందులో విశేషంగా కొంత శక్తి ఉంటుంది. సమాధిలోని శూన్యావస్థ వేరు. వారికి ఏ లక్ష్యమూ ఉండదు. ఇందులో అయితే ప్రాప్తి ఉంది. సంతోషము, శీతలత మరియు సర్వగుణ సంపన్నత యొక్క అనుభూతి జరుగుతుంది. నిండుదనం యొక్క స్థితి ఇది. బీజము నిండుగా ఉంటుంది, ఖాళీగా ఉండదు. ఇటువంటిదే ఈ స్థితి. కొద్దిగా అభ్యాసం చేస్తే తర్వాత ఈ అనుభవాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటారు. మీలో మీరు దీని గురించి ఆలోచించండి. ఎవరికైనా బిందు రూపంలో స్థితి అయ్యే అభ్యాసం ఉంటే వారు తమ అనుభవాన్ని వినిపించి ఇతరులను కూడా అనుభవీలుగా చేసే ప్రయత్నం చేయాలి, అది కూడా తమ అభ్యాసంతో! అచ్ఛా.
ప్రతి ఒక్కరూ ఎంతమంది ప్రజలను తయారు చేసుకున్నారు? ఎవరు ఏ పని చేయాల్సి ఉంటుందో వారు లక్ష్యం పెట్టుకుంటే ఆ ప్లాను కూడా ముందుకు వస్తుంది. ఎక్కువమంది ప్రజలను తక్కువ సమయంలో మేము తయారు చేసుకోవాలి అని లక్ష్యం పెట్టుకోండి. లక్ష్మీ నారాయణులకు ఎంతమంది ప్రజలు ఉన్నారు? మరి వారి రాజ్యంలో సమీపంగా ఉండాలన్నా, కలిసి ఉండాలన్నా, కలిసి ఆడుకోవాలన్నా అంతమంది ప్రజలను తయారు చేసుకోవాలి కదా. తక్కువ ప్రజలు ఉన్నవారిని చిన్న రాజు అంటారు. వారు అప్పుడప్పుడు దర్బారుకు వస్తారు. సమీపంగా రావాలి కదా. ఎలా అయితే రోజు చార్టు చూసుకుంటారో అలాగే ప్రజలుగా తయారు చేసే చార్టును కూడా పెట్టుకోండి. తర్వాత కలవడానికి వచ్చినప్పుడు ఎక్కువమంది ప్రజలను తయారు చేసుకున్నవారు ఎదురుగా కనిపించాలి. అలా కనిపిస్తారు కదా. ప్రజలనైతే అందరూ తయారు చేసుకోవాలి. అచ్ఛా.
అతీంద్రియ సుఖంలో ఉంటున్నారా? అతీంద్రియ సుఖం అంటే అర్థం ఏమిటి? అవ్యక్త స్థితిలో ఉంటూ ఈశ్వరీయ సుఖాన్ని అనుభూతి చేయడము. తర్వాత వచ్చేవారు మరింత రేస్ చేయాల్సి ఉంటుంది. ముందుకు వెళ్ళవచ్చు. మాయ ఎంత వచ్చినాకానీ కదలకండి. ధైర్యము ఉంచితే దైవీ పరివారం యొక్క సహకారం లభిస్తుంది అంతేకానీ మీ పురుషార్థం నుండి తొలగకండి. పురుషార్థం రోజురోజుకూ క్రొత్తదా లేక పాతదా? మీరు పాతవారు అవుతున్నా కానీ పురుషార్థం కొత్తగా ఉండాలి. అచ్ఛా!
ఓంశాంతి