‘‘శ్రమ నుండి విడుదల అయ్యేందుకు సహజ సాధనము - నిరాకార స్వరూప స్థితి’’
బాప్‌దాదా పిల్లలపై ఉన్న స్నేహం కారణంగా వాచాకు అతీతంగా ఉన్న నిర్వాణ స్థితి నుండి వాచాలోకి వస్తారు. ఎందుకు? పిల్లలను తమ సమానంగా నిర్వాణ స్థితిని అనుభవం చేయించేందుకు, నిశ్శబ్దమైన, మధురమైన ఇంటికి తీసుకెళ్లేందుకు. నిర్వాణ స్థితి అనగా నిర్వికల్ప స్థితి. నిర్వాణ స్థితి అనగా నిర్వికార స్థితి. నిర్వాణ స్థితి నుండి నిరాకారి, నిరాకారి నుండి సాకార స్వరూపధారిగా అయ్యి వాచాలోకి వస్తారు. సాకారంలోకి వచ్చినా నిరాకారి స్వరూప స్మృతి వారి స్మృతిలో ఉంటుంది. నేను నిరాకారుడను, సాకార(శరీరం) ఆధారంతో మాట్లాడ్తున్నానని స్మృతి ఉంటుంది. సాకారంలో కూడా నిరాకార స్థితి స్మృతి ఉన్నప్పుడు దానిని నిరాకారము సాకారము ద్వారా వాచాలోకి, కర్మలోకి రావడం అని అంటాము. అసలు స్వరూపం నిరాకారము. సాకారము ఆధారంగా ఉంటుంది. ఈ డబల్ స్మృతి నిరాకారము నుండి సాకార శక్తిశాలి స్థితిగా ఉంటుంది. సాకారాన్ని ఆధారంగా తీసుకుంటూ నిరాకార స్వరూపాన్ని మర్చిపోకండి. మర్చిపోతున్నారు అందువలన స్మృతి చేసే శ్రమ చెయ్యవలసి వస్తుంది. ఎలాగైతే లౌకిక జీవితంలో నేను ఫలానా లేక ఈ సమయంలో ఫలానా కార్యము చేస్తున్నానని తమ శారీరిక స్వరూపం స్వతహాగానే సదా గుర్తుంటుంది. ఎలాగైతే కార్యము మారుతుంది కానీ నేను ఫలానా అనేది మారదో, మర్చిపోరో అలా నేను నిరాకార ఆత్మను అని అసలు స్వరూపము ఏ కార్యము చేస్తున్నా స్వతహాగా, సదా గుర్తుండాలి. నేను నిరాకార ఆత్మను అని ఒకసారి స్మృతిలోకి వచ్చింది, పరిచయము కూడా లభించింది. పరిచయం అనగా జ్ఞానం. కావున జ్ఞాన శక్తి ద్వారా స్వరూపాన్ని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఎలా మర్చిపోగలరు? జ్ఞాన శక్తి వలన శరీర భ్రాంతి మరిపించినా మర్చిపోలేరు. కనుక ఈ ఆత్మిక స్వరూపాన్ని ఎలా మర్చిపోగలరు? కావున స్వయంతో స్వయం ప్రశ్నించుకోండి, అభ్యాసం చెయ్యండి. నడుస్తూ తిరుగుతూ పనులు చేస్తూ నిరాకారము నుండి సాకారం ఆధారంతో ఈ పని చేస్తున్నానా అని పరిశీలించుకోండి. అప్పుడు స్వతహాగానే నిర్వికల్ప స్థితి, నిరాకార స్థితి, నిర్విఘ్న స్థితి సహజంగా ఉంటాయి. శ్రమ నుండి విడుదల అవుతారు. మాటి మాటికీ మర్చిపోతే శ్రమ అనిపిస్తుంది. తర్వాత స్మృతి చేసే శ్రమ చేస్తారు. అసలు ఎందుకు మర్చిపోతారు, మర్చిపోవాలా? మీరు ఎవరు అని బాప్‌దాదా అడుగుతారు. సాకారులా, నిరాకారులా? నిరాకారులే కదా! నిరాకారులు. అయినా ఎందుకు మర్చిపోతారు? అసలు స్వరూపము మర్చిపోవుటకు ఆధారం గుర్తుంటుందా? ఏం చేస్తున్నాను అని స్వయం పైనే నవ్వు రావడం లేదా? ఇప్పుడు నవ్వు వస్తుంది కదా? అసలు స్వరూపాన్ని మర్చిపోయి నకిలీ వస్తువు జ్ఞాపకం వస్తుంది. బాప్‌దాదాకు అప్పుడప్పుడు పిల్లలను చూసి ఆశ్చర్యం కూడా కలుగుతుంది. స్వయాన్ని మర్చిపోతారు. మర్చిపోయి ఏం చేస్తారు? స్వయాన్ని మరచి బాధపడ్తారు(కలవరపడ్తారు). తండ్రిని స్నేహంతో నిరాకారం నుండి సాకారంలోకి ఆహ్వానం చేసి తీసుకొస్తారు. కావున ఎవరితో స్నేహం ఉందో వారిలా నిరాకారులగుట కష్టమా? మాస్టర్ సర్వశక్తివంతులు సర్వ శక్తులకు యజమానులుగా ఉంటారు. ఏ శక్తిని ఏ సమయంలో శుభ సంకల్పంతో ఆహ్వానించినా ఆ శక్తి యజమానులైన మీ ముందు ప్రత్యక్షంగా ఉంటుంది. ఇలాంటి యజమానులు ఎవరికైతే సర్వ శక్తులు సేవాధారులుగా ఉన్నాయో వారు శ్రమ చేస్తారా? లేక శుభ సంకల్పంతో ఆర్డర్ చేస్తారా? ఏం చేస్తారు? రాజులుగా ఉన్నారా లేక ప్రజలుగా ఉన్నారా? అక్కడ కూడా యోగ్యులైన పిల్లలను ఏమంటారు? రాజా పిల్లలని అంటారు కదా! కావున మీరు ఎవరు? రాజులుగా అయ్యే పిల్లలా లేక అధీనులుగా అయ్యే పిల్లలా? అధికారి ఆత్మలుగా ఉన్నారు కదా! ఈ శక్తులు, ఈ గుణాలు అన్నీ మీకు సేవాధారులు. ఆహ్వానించండి, అవి ప్రత్యక్షమవుతాయి. ఎవరైతే బలహీనంగా ఉంటారో వారు శక్తిశాలి శస్త్రము ఉన్నప్పటికీ బలహీనత కారణంగా ఓడిపోతారు. మీరు బలహీనమైనవారా? మహావీర్ పిల్లలుగా ఉన్నారు కదా! సర్వశక్తివంతుని పిల్లలు బలహీనంగా ఉంటే అందరూ ఏమంటారు? బాగుంటుందా? కాబట్టి ఆహ్వానించండి. ఆర్డర్ చెయ్యడం నేర్చుకోండి. కానీ సేవాధారి ఎవరి ఆజ్ఞను అంగీకరిస్తారు? ఎవరైతే యజమానులుగా ఉంటారో వారి ఆజ్ఞను అంగీకరిస్తారు. యజమాని స్వయం సేవాధారిగా అయ్యారు. ఎందుకంటే శ్రమ చేసేవారు సేవాధారులే కదా! మానసిక శ్రమ నుండి ఇప్పుడు విడుదల అయ్యారు. యజ్ఞ సేవ కొరకు చేసే శారీరిక శ్రమ వేరు. వారు కూడా యజ్ఞ సేవకు గల మహత్వాన్ని తెలుసుకుంటే కష్టమనిపించదు. మధువనంలో సంపర్కంలో ఉన్న ఆత్మలు వచ్చి, ఇంతమంది సంఖ్యలో ఆత్మల భోజనం ఎలా తయారవుతుందో, అన్ని పనులు ఎలా జరుగుతున్నాయో చూసినప్పుడు ఇంత కష్టమైన పని ఎలా చేస్తున్నారో అని చూసి చూసి అర్థం చేసుకుంటారు. ఇంత పెద్ద కార్యము ఎలా జరుగుతూ ఉందని వారికి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ చేసేవారు ఇంత పెద్ద కార్యాన్ని కూడా ఏమని భావిస్తారు? సేవకు మహత్వమున్న కారణంగా వారికి ఒక ఆటగా అనిపిస్తుంది, కష్టమనిపించదు. ఇలాంటి మహత్వం కారణంగా, తండ్రితో ప్రేమ ఉన్న కారణంగా శ్రమ రూపము మారిపోతుంది. ఈ విధంగా మానసిక శ్రమ నుండి ముక్తులుగా అయ్యే సమయం వచ్చింది. ద్వాపరయుగం నుండి వెతికే, పరితపించే, పిలిచే మానసిక శ్రమ చేస్తూ వచ్చారు. మానసిక శ్రమ కారణంగా ధనం సంపాదించేందుకు కూడా శ్రమ పెరుగుతూ వచ్చింది. ఈరోజు ఎవరిని అడిగినా ఏమంటారు? ధనం సంపాదించడం పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులభం కాదని అంటారు. మానసిక శ్రమ వలన ధన సంపాదనకు కూడా శ్రమ పెరిగింది. తనువైతే రోగిగా అయిపోయింది. అందువలన శారీరిక కార్యంలో కూడా శ్రమ(కష్టము), మనసుకు కూడా కష్టము, ధనానికి కూడా కష్టము కలుగుతూ ఉంది. కేవలం ఇది మాత్రమే కాదు, ఈరోజు కుటుంబాలలో ప్రేమ నిభాయించడంలో కూడా కష్టముంది. ఒకసారి ఒకరు అలుగుతారు, ఇంకొకసారి ఇంకొకరు..... తర్వాత వారిని ఓదార్చే కష్టంలో నిమగ్నమై ఉంటారు. ఈరోజు నీ వారిగా ఉంటారు, రేపు నీ వారిగా ఉండరు. విబేధం వస్తుంది. కావున అన్ని రకాల శ్రమ చేసి అలిసిపోయారు కదా! తనువుతో, మనసుతో, ధనంతో, సంబంధంతో అన్నిటితో అలిసిపోయారు.
బాప్‌దాదా మొదట మానసిక శ్రమను సమాప్తి చేసేస్తారు, ఎందుకంటే మనసు బీజము కదా. మానసిక శ్రమ, తనువు ధనాల శ్రమను అనుభవం చేయిస్తుంది. మనసు సరిగ్గా లేనప్పుడు ఏ కార్యము చేయాలన్నా, ఈరోజు ఇది జరగదని అంటారు. రోగం ఉండదు కానీ నాకు 103 జ్వరము ఉందని అంటారు. కావున మానసిక శ్రమ శారీరిక శ్రమను అనుభవం చేయిస్తుంది. ధనంలో కూడా ఇలాగే ఉంటుంది. మనసు కొంచెం బాగలేకపోయినా చాలా పని చెయ్యవలసి వస్తుందని అంటారు. సంపాదించడం చాలా కష్టము, వాయుమండలం చెడిపోయిందని అంటారు మరియు మనసు సంతోషంగా ఉన్నప్పుడు ఇది ఏమంత పెద్ద విషయము కాదని అంటారు. పని అదే ఉంటుంది కానీ మానసిక శ్రమ ధనమును గురించిన శ్రమను కూడా అనుభవం చేయిస్తుంది. మానసిక బలహీనత వాయుమండల బలహీనతలోకి తీసుకొస్తుంది. బాప్‌దాదా పిల్లల మానసిక శ్రమను చూడలేరు. 63 జన్మలు కష్టపడ్డారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మ సంతోషాల జన్మ. ప్రేమను అనుభవించే జన్మ, ప్రాప్తులు పొందే జన్మ, వరదానాల జన్మ, సహాయం తీసుకునే, సహాయం లభించే జన్మ. అయినా ఈ జన్మలో కూడా కష్టమెందుకు చేస్తారు? ఇప్పుడు కష్టాన్ని ప్రేమలోకి పరివర్తన చెయ్యండి. మహత్వంతో శ్రమను సమాప్తి చెయ్యండి.
ఈరోజు బాప్‌దాదా ఇరువురూ పరస్పరం, పిల్లలు చేసే శ్రమపై చాలా సంభాషించినారు. ఏం చేస్తారు, మానసిక శ్రమకు కారణం ఏమవుతుంది, పిల్లలు ఏం చేస్తారు అని చూసి బాప్‌దాదాకు నవ్వు వచ్చింది. వంకర టింకర పిల్లలకు జన్మనిస్తారు. వారికి ఒకప్పుడు ముఖము ఉండదు, ఒకప్పుడు కాళ్లు ఉండవు, ఒకప్పుడు చేతులు ఉండవు. ఇలా వ్యర్థ వంశావళికి చాలా జన్మనిస్తారు. అంతేకాక దేనినైతే రచించారో దానినేం చేస్తారు? దానిని పాలించిన కారణంగా కష్టము చెయ్యవలసి వస్తుంది. ఇలాంటి రచన రచించిన కారణంగా ఎక్కువ శ్రమ చేసి అలసిపోతారు. అంతేకాక వ్యాకులపడ్తారు కూడా. చాలా కష్టమనిపిస్తుంది. మంచిదే కానీ చాలా కష్టమని అంటారు. విడిచిపెట్టాలని కూడా ఉండదు, ఎగరాలని కూడా ఉండదు. కావున ఏం చెయ్యవలసి వస్తుంది? నడవాల్సి వస్తుంది. నడిచేందుకు తప్పకుండా శ్రమ కలుగుతుంది కదా. అందువలన ఇప్పుడు బలహీన రచనను సమాప్తి చేసినట్లయితే మానసిక శ్రమ నుండి విడుదల అవుతారు. తర్వాత నవ్వు వచ్చే విషయం ఏం చెప్తారు? ఇలాంటి రచన ఎందుకు చేస్తారని తండ్రి అంటారు. ఈ రోజులలో మనుష్యులు కూడా ఏం చెయ్యాలి, అన్నీ ఈశ్వరుడే ఇస్తాడని అంటారు కదా. మొత్తం దోషమంతా ఈశ్వరునిపై వేస్తారు. ఇలాంటి ఈ వ్యర్థ రచన గురించి ఏం చెప్తారు? మేము కోరుకోవడం లేదు కానీ మాయ వచ్చేస్తుంది. మేము కోరుకోవడం లేదు కానీ జరిగిపోతుందని అంటారు. అందువలన సర్వశక్తివంతుడైన తండ్రికి పిల్లలైన మీరు యజమానులుగా అవ్వండి. రాజులుగా అవ్వండి. బలహీనత అనగా అధీనమైన ప్రజలు. యజమాని అనగా శక్తిశాలి రాజు. కావున యజమానిగా అయ్యి ఆహ్వానించండి. స్వ స్థితి అనే శ్రేష్ఠ సింహాసనంపై కూర్చోండి. సింహాసనంపై కూర్చొని శక్తులు అనే సేవాధారులను ఆహ్వానించండి, ఆజ్ఞాపించండి. మీ సేవాధారులు మీ ఆజ్ఞపై నడవకుండా ఉండడం జరగదు. ఏం చెయ్యాలి అని తర్వాత అనరు కదా. సహన శక్తి లేని కారణంగా శ్రమ చెయ్యవలసి వస్తుంది. ఇముడ్చుకునే శక్తి తక్కువగా ఉన్నందున ఇలా జరిగింది. మీ సేవాధారులు సమయానికి కార్యంలోకి రాకపోతే వారు సేవాధారులెలా అవుతారు? కార్యం పూర్తి అయిన తర్వాత సేవాధారులు వస్తే ఏమవుతుంది? ఎవరికైతే సమయం కొరకు మహత్వం ఉంటుందో వారి సేవాధారులు కూడా సమయ మహత్వం తెలుసుకొని హాజరవుతారు. ఏ శక్తి లేక గుణము అయినా సమయానికి ప్రత్యక్షమవ్వకపోతే యజమానికి సమయ మహత్వం లేదని ఋజువవుతుంది. ఏం చెయ్యాలి? సింహాసనంపై కూర్చోవడం మంచిదా లేక శ్రమ చేయడం మంచిదా? ఇప్పుడు ఇంత సమయమిచ్చే అవసరం లేదు. శ్రమ చేయడం మంచిదా లేక యజమానిగా అవ్వడం మంచిగా అనిపిస్తుందా? ఏది మంచిగా అనిపిస్తుంది? వినిపించాము కదా! దీని కొరకు కేవలం ఈ ఒక్క అభ్యాసము సదా చేస్తూ ఉండండి. ‘నిరాకారము నుండి సాకార శరీరం ఆధారముతో ఈ పని చేస్తున్నాను.’ మీరు చేసేవారిగా అయ్యి మీ కర్మేంద్రియాలతో చేయించండి. తమ నిరాకార వాస్తవిక స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకుంటే వాస్తవిక స్వరూపం యొక్క గుణాలు, శక్తులు స్వతహాగానే ఉత్పన్నమవుతాయి. ఎలాంటి స్వరూపం ఉంటే అలాంటి గుణాలు, శక్తులు స్వతహాగానే కర్మలోకి వచ్చేస్తాయి. కన్య తల్లిగా అయినప్పుడు తల్లి స్వరూపంలో సేవా భావము, త్యాగము, స్నేహము, అలసట లేని సేవ మొదలైన గుణాలు, శక్తులు స్వతహాగానే ప్రత్యక్షం అవుతాయి కదా! కావున అనాది, అవినాశి స్వరూపం స్మృతిలో ఉన్నందున స్వతహాగానే ఈ గుణాలు మరియు శక్తులు ఇమర్జ్ అవుతాయి. స్వరూపం యొక్క స్మృతి, స్థితిని స్వతహాగానే తయారు చేస్తుంది. ఏం చెయ్యాలో అర్థమయిందా! కష్టము లేక శ్రమ అనే మాటను జీవితంలో సమాప్తి చేయండి. శ్రమ కారణంగా కష్టమనిపిస్తుంది. శ్రమ సమాప్తమైతే కష్టము అనే శబ్దము కూడా స్వతహాగానే సమాప్తమవుతుంది. అచ్ఛా.
సదా కష్టాన్ని సహజంగా చేసుకునేవారు, శ్రమను ప్రేమలోకి మార్చుకునేవారు, సదా స్వ స్వరూప స్మృతి ద్వారా శ్రేష్ఠ శక్తులు మరియు గుణాలను అనుభవం చేసేవారు, సదా తండ్రి స్నేహానికి బదులు ఇచ్చేవారు, తండ్రి సమానంగా తయారయ్యేవారు, సదా శ్రేష్ఠ స్మృతి అనే శ్రేష్ఠ ఆసనంపై స్థితులై యజమానిగా అయ్యి సేవాధారుల ద్వారా కార్యము చేయించే రాజా పిల్లలు, యజమానులుగా అయ్యే పిల్లలు - ఇటువంటి వారికి బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
వ్యక్తిగత మిలనము (విదేశీ సోదర-సోదరీలతో) :-
1. సేవ తండ్రి తోడును అనుభవం చేయిస్తుంది. సేవకు వెళ్లడమంటే సదా తండ్రి తోడులో ఉండటం. సాకార రూపంలో ఉండవచ్చు, ఆకార రూపంలో ఉండవచ్చు కానీ సేవాధారి పిల్లలతో తండ్రి సదా తోడుగానే ఉంటారు. చేయించేవారు చేయిస్తున్నారు, నడిపించేవారు నడిపిస్తున్నారు. అయితే స్వయం ఏం చేస్తున్నారు? నిమిత్తంగా అయ్యి ఆటలాడుకుంటూ ఉంటారు. ఇలాగే అనుభవం అవుతూ ఉంది కదా? ఇలాంటి సేవాధారులు సఫలతకు అధికారులుగా అవుతారు. సఫలత జన్మ సిద్ధ అధికారము. సఫలత సదా మహాన్ పుణ్యాత్మగా అయ్యే అనుభవం చేయిస్తుంది. మహాన్ పుణ్యాత్మలుగా అయ్యేవారికి అనేకమంది ఆత్మల ఆశీర్వాదాల లిఫ్ట్ లభిస్తుంది. మంచిది.
ఇప్పుడైతే అందరి నోటి నుండి ‘‘ఒక్కరే, ఒక్కటే’’ అనే పాట వెలువడే రోజు కూడా రానున్నది. డ్రామాలో ఇదే పాత్ర మిగిలి ఉంది. ఇది జరుగుతూనే సమాప్తి అయిపోతుంది. ఇప్పుడు ఈ పాత్రను సమీపానికి తీసుకురావాలి. దీని కొరకు అనుభవం చేయించడమే విశేష ఆకర్షణకు సాధనము. జ్ఞానం వినిపిస్తూ ఉండండి, అనుభవం చేయిస్తూ ఉండండి. జ్ఞానం కేవలం విన్నందున సంతుష్టంగా అవ్వరు కానీ జ్ఞానం వినిపిస్తూ అనుభవం కూడా చేయిస్తూ ఉంటే జ్ఞానానికి కూడా మహత్వం ఉంటుంది అంతేకాక ప్రాప్తి కారణంగా పోను పోను ఉత్సాహంలోకి కూడా వచ్చేస్తారు. వారందరి ఉపన్యాసాలు కేవలం జ్ఞానవంతంగా ఉంటాయి. మీ ఉపన్యాసాలు కేవలం జ్ఞానవంతమే కాదు, అనుభవం చేయించే అథారిటీ కలవిగా ఉండాలి. అనుభవాల అథారిటీతో మాట్లాడుతూ అనుభవం చేయిస్తూ ఉండండి. కొంతమంది మంచి ఉపన్యాసకులు ఉంటారు. వారు మాట్లాడుతూ ఏడిపిస్తారు, నవ్విస్తారు కూడా. శాంతిలోకి, సైలెన్సులోకి కూడా తీసుకెళ్తారు. ఎలాంటి మాటలు మాట్లాడితే అలాంటి వాతావరణాన్ని హాలులో తయారు చేస్తారు. అదంతా తాత్కాలికము. వారు చెయ్యగలిగినప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులైన మీరు చేయలేనిదేముంది? ఎవరైనా శాంతి అని మాట్లాడితే శాంతి వాతావరణం ఉండాలి. ఆనందం గురించి మాట్లాడితే ఆనందం కలిగించే వాతావరణం ఉండాలి. ఇలాంటి అనుభూతి చేయించే ఉపన్యాసాలు ప్రత్యక్షతా జెండాను ఎగురవేస్తాయి. ఏదో ఒక విశేషత చూస్తారు కదా! మంచిది - సమయం స్వతహాగానే శక్తులు నింపుతూ ఉంది. అంతా అయ్యే ఉంది, కేవలం రిపీట్ చెయ్యాలి.
యూ.కే. గ్రూప్‌తో:- సదా మిమ్మల్ని మీరు బహుకాలం తర్వాత కలిసిన ప్రియమైన పిల్లలుగా (సికీలధేగా) భావిస్తున్నారా? సదా తండ్రి యొక్క ఆప్యాయత మరియు ప్రేమల విశేష అనుభవం కలుగుతుంది కదా! ఏ ఆప్యాయత మరియు ప్రేమతో అయితే తండ్రి తనవారిగా చేసుకున్నారో, అలాంటి ఆప్యాయత మరియు ప్రేమతో మీరు కూడా తండ్రిని మీ వారిగా చేసుకున్నారు కదా. ఇద్దరి మధ్య స్నేహం యొక్క అవినాశి పక్కా ఒప్పందం (సౌదా) జరిగిపోయింది. ఇలాంటి బేరం చేసే వర్తకులు లేదా వ్యాపారులే కదా! ఇలాంటి వ్యాపారం ఈ ప్రపంచం మొత్తంలో ఎవరూ చేయలేరు. ఎంత సహజమైన వ్యాపారం ఇది! రెండు పదాల ఒప్పందం, కానీ అది అమరమైనది. ఆ రెండు పదాలు ఏవి? మీరు ‘నీది’ (తేరా) అన్నారు మరియు తండ్రి ‘నాది’ (మేరా) అన్నారు. అంతే, ఒప్పందం జరిగిపోయింది. ‘నీది’ మరియు ‘నాది’ అనే ఈ రెండు పదాలలో అవినాశి ఒప్పందం జరిగిపోయింది. ఇంకేమీ ఇవ్వాల్సిన పనిలేదు. ఏమీ ఇవ్వనవసరం లేకుండానే వ్యాపారం ఘనంగా జరిగిపోతే ఇంతకంటే ఇంకేం కావాలి! సమస్తమూ లభించేసింది కదా. ఇంట్లో కూర్చుండగానే భగవంతుడితో ఇంత సహజమైన ఒప్పందం చేసుకుంటామని ఎప్పుడైనా భావించారా, ఆలోచించారా! కాబట్టి ఏదైతే సంకల్పంలో కూడా లేదో అది ప్రాక్టికల్ కర్మలో జరిగిపోయింది. ఈ సంతోషం ఉంది కదా? అందరికంటే ఎక్కువ సంతోషం ఎవరికి ఉంది? విశేషత ఏమిటంటే ప్రతి ఒక్కరూ ‘మాకే ఎక్కువ సంతోషం ఉంది, ముందు నేను’ అని అంటారు. అలా కాకుండా ‘వీరికి ఉంది, మాకు లేదు’ అని కాదు. ఇది కూడా రేసు, ఈర్ష్య కాదు. ఇందులో ప్రతి ఒక్కరూ ఒకరి కంటే ఒకరు ముందుకు సాగండి. ముందుకు సాగడానికి అవకాశం (ఛాన్స్) ఉంది. ఎంత ముందుకు సాగాలనుకుంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. కాబట్టి అందరూ పక్కా వ్యాపారులుగా మారండి. బలహీనమైన (కచ్చా) వ్యాపారం చేస్తే మీకు మీరే నష్టం చేసుకుంటారు.
సదా స్వయాన్ని తండ్రిలో ఇమిడిపోయినట్లుగా అనుభవం చేసుకుంటున్నారా? తండ్రి నయనాలలో, హృదయంలో ఇమిడిపోయి ఉన్నట్లు. ఎవరైతే ఇమిడి ఉంటారో వారు ప్రపంచానికి అతీతంగా ఉంటారు. తండ్రే సమస్త ప్రపంచం అని వారికి అనుభవమవుతుంది. కలలో కూడా పాత ప్రపంచపు ఆకర్షణ ఆకర్షించలేదు. ఇలా ఇమిడి ఉన్నవారికి ఏ విషయంలోనూ కష్టమనే అనుభవం కలగదు. వారు ప్రపంచం నుండి దూరంగా లీనమైపోయి ఉంటారు. అవినాశి సర్వ ప్రాప్తులను పొంది ఉంటారు. సదా హృదయంలో ఒక్క దిలారామ్ - దిల్ఆరామ్ (హృదయానికి శాంతినిచ్చే తండ్రి) మాత్రమే ఉంటారు. ఇలా ఇమిడిపోయిన ఆత్మ సదా సఫలమైనదే.
ఫ్రాన్స్ సోదర-సోదరీమణులతో:-
సదా మిమ్మల్ని మీరు శక్తివంతమైన ఆత్మగా భావించుకుంటూ ముందుకు సాగడం మరియు ఇతరులను ముందుకు నడిపించడం - ఇదే లక్ష్యం కదా. బాప్‌దాదా ప్రతి బిడ్డనూ విశేష ఆత్మ రూపంలో చూస్తారు. అలాగే మీరందరూ మీ విశేషతలను తెలుసుకుని, ఆ విశేషతను కార్యంలో పెడుతూ ముందుకు సాగుతున్నారు కదా. సమస్త విశ్వంలో ఎంతమంది ఆత్మలు తండ్రికి చెందినవారిగా మారారు! విశేషమైన వారు కాబట్టే కోట్లలో కొందరు, ఆ కొందరిలోనూ కొందరు ఆత్మలు తండ్రికి చెందినవారిగా మారారు. బాప్‌దాదా ఇలాంటి విశేషతా సంపన్న ఆత్మలపై శ్రేష్ఠ ఆశలు పెట్టుకున్నారు - బాప్‌దాదా సదా పిల్లలను స్వ-ఉన్నతి మరియు సేవా ఉన్నతిలో ముందుగా చూస్తారు. సదా ‘తండ్రి నా ద్వారా ఏమి కోరుకుంటున్నారు?’ - దీనిని గుర్తుంచుకుంటే తండ్రి మరియు సేవ సదా ఎదురుగా ఉంటాయి. మరియు తండ్రి, సేవ ఎదురుగా ఉండటం వల్ల సఫలత ఉండనే ఉంది. బాప్‌దాదా పిల్లల హృదయ భావాలను రోజూ వింటారు, మరియు హృదయ స్పందన (రెస్పాండ్) హృదయం కలవారికి లభిస్తుంది మరియు లభిస్తూనే ఉంటుంది.
బ్రెజిల్:- దేశం ప్రకారం ఎంత దూరంగా ఉన్నారో, హృదయానికి అంత సమీపంగా ఉన్నారు. అత్యంత సమీపంగా ఉండేవారు అనగా సదా హృదయ సింహాసనాధికారులు. ఇప్పుడు హృదయ సింహాసనాధికారులుగా ఉండేవారు జన్మజన్మాంతరాలు సింహాసనాధికారి ఆత్మలుగా మారిపోతారు. ఇలాంటి అధికారులే కదా! ఇంతటి తండ్రి, ఇంతటి ప్రాప్తి పూర్తి కల్పంలో మరెప్పుడూ లభించవు, ఇప్పుడే లభిస్తాయి అని తెలుసుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు సదాకాలం కొరకు అధికారి ఆత్మగా భావించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. సదా హృదయ సింహాసనాధికారులు అనగా స్మృతిలో ఇమిడి ఉన్నవారు. హృదయంలో ఇమిడి ఉన్నారంటే ఎన్నడూ తండ్రి నుండి వేరు కాలేరు. పిల్లలు ఎంతగా స్మరిస్తారో దానికి పదమారెట్లు తండ్రి ప్రతిఫలంగా (రిటర్న్‌లో) స్మరిస్తారు. పిల్లలకు స్మృతికి ప్రతిఫలంగా స్నేహం, సహకారం అందిస్తూ ఉంటారు. ఎవరైతే సదా తండ్రి స్మృతి అనే రాగాలలో బిజీగా ఉంటారో, వారు మాయ యొక్క రాగాల నుండి ముక్తులైపోతారు. నాలెడ్జ్‌ఫుల్‌గా ఉండేవారు ఎన్నడూ ఫెయిల్ కాలేరు.
వీడ్కోలు తీసుకునే సమయంలో దాదీ జానకిగారితో బాప్‌దాదా మిలనము :-
చూసి చూసి సంతోషిస్తూ ఉంటారు! అందరికంటే ఎక్కువ సంతోషం అనన్య పిల్లలకు ఉంటుంది కదా! వారు సదా సంతోషాల సాగరంలో ఓలలాడుతూ ఉంటారు. సుఖసాగరంలో సర్వ ప్రాప్తుల సాగరంలో ఓలలాడుతూ ఉంటారు. వారు ఇతరులను కూడా అదే సాగరంలో ఓలలాడేలా చేస్తారు. రోజంతా ఏం చేస్తారు? ఎవరికైనా సాగరంలో స్నానం చేయడం రాకపోతే ఏం చేస్తారు? చెయ్యి పట్టుకొని స్నానం చేయిస్తారు కదా! ఈ పనే చేస్తున్నారు. సుఖంలో ఓలలాడించండి, సంతోషంలో ఓలలాడించండి..... ఇలా చేస్తూ ఉన్నారు కదా! బిజీగా ఉండే మంచి పని లభించింది. ఎంత బిజీగా ఉంటున్నారు! సమయం ఉందా? ఇందులోనే సదా బిజీగా ఉన్నారు. కనుక ఇతరులు కూడా మిమ్ములను చూసి అనుసరిస్తారు. స్మృతి మరియు సేవ తప్ప ఇంకేమీ కనిపించదు. స్వతహాగానే బుద్ధి స్మృతి మరియు సేవలోకి వెళ్తుంది. ఇంకెక్కడికీ వెళ్లజాలదు. నడిపించాల్సిన అవసరం ఉండదు. నడుస్తూనే ఉంటుంది. దీనినే నేర్చుకొని, నేర్పిస్తున్నారని అంటాము. మంచి పని ఇచ్చారు కదా! తండ్రి తెలివిగలవారిగా తయారు చేసి వెళ్లారు కదా! బలహీనంగా తెలివి తక్కువగా వదిలిపెట్టి వెళ్లలేదు కదా! తెలివిగలవారిగా చేసి స్థానం ఇచ్చి వెళ్లారు కదా! తోడుగా అయితే ఉండనే ఉన్నారు కానీ నిమిత్తంగా అయితే చేశారు కదా. తెలివిగలవారిగా చేసి సీటు ఇచ్చారు. సీటు ఇచ్చే ఆచారం ఇక్కడ నుండే మొదలయింది. సేవ చేసే సింహాసనం లేక సేవకు సీటు ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు సాక్షిగా అయ్యి పిల్లలు ఎలా మున్ముందుకు వెళ్తున్నారో చూస్తున్నారు. కలిసి కూడా ఉన్నారు, సాక్షిగా కూడా ఉన్నారు. రెండు పాత్రలూ అభినయిస్తున్నారు. సాకార రూపంలో సాక్షి అని అంటారు. అవ్యక్త రూపంలో తోడుగా ఉన్నారని అంటాము. రెండు పాత్రలూ అభినయిస్తున్నారు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
