‘‘సత్యత యొక్క సభ్యతయే రియల్ రాయల్టీ’’
ఈరోజు బాప్‌దాదా తమ శ్రేష్ఠ పరివారాన్ని అనగా తమ రాయల్ పరివారాన్ని చూస్తున్నారు. మొత్తం కల్పంలో అందరికన్నా రాయల్‌గా ఉండేవారు శ్రేష్ఠ ఆత్మలైన మీరే. అనాది ఆత్మిక స్వరూపంలో కూడా అందరికన్నా శ్రేష్ఠమైన రాయల్ ఆత్మలు మరియు ఆది స్వరూప దేవాత్మల రూపంలో కూడా రాయల్ రాజ్యాధికారులు, రాయల్ పరివారానికి చెందినవారు. పూజ్య రూపంలో కూడా దేవాత్మలైన మీకు ఎంతో రాయల్టీతో పూజ జరుగుతూ ఉంటుంది. ఇతర ఏ ధర్మాత్మలకు లేక రాజకీయ ఆత్మలకు ఇటువంటి రాయల్ పూజ జరగదు. కనుక మూడు రూపాలలోనూ - అనాది, ఆది మరియు పూజ్య స్వరూపాలలో ఇంత రాయల్‌గా ఇంకెవ్వరూ లేరు ఎందుకంటే ఆత్మలైన మీ విషయంలో పవిత్రతనే రాయల్టీ. మొత్తం కల్పంలో ఇంతటి సంపూర్ణ పవిత్రులుగా ఇతర ఏ ఆత్మా అవ్వలేదు, అవ్వదు కూడా. ఇది పవిత్రత యొక్క విశేషతనే. అందుకే కేవలం దేవాత్మలైన మీ ఎదురుగా మాత్రమే ‘మీరు సంపూర్ణ నిర్వికారులు’ అన్న మహిమను పాడుతారు, ఇతర ఏ ధర్మాత్మల మహిమలోనూ ఇటువంటి మహిమ గానం చేయబడదు. కేవలం దేవాత్మల యొక్క శ్రేష్ఠ కీర్తి అనగా శ్రేష్ఠ పవిత్రతకు మాత్రమే కీర్తన జరుగుతుంది. ఇతర ఏ ధర్మములోనూ కీర్తన ఉండదు. వాయిద్యాలతో మరియు బాజా భజంత్రీలతో కీర్తన చేసే ఆచారము దేవాత్మలలోనే ఉంది మరియు సంగమయుగం యొక్క శక్తి స్వరూపంలో ఉంది. ఇది సంపూర్ణ పవిత్రతా విధి యొక్క సిద్ధి, కనుక మీ వంటి ఆత్మిక రాయల్టీ ఇతర ఏ ఆత్మకూ లేదు. కనుక ఇటువంటి పవిత్రతా రాయల్టీ ఎంత వరకు వచ్చింది అని చెక్ చేసుకోండి. ఆత్మిక రాయల్టీకి అన్నింటికన్నా శ్రేష్ఠమైన గుర్తు - రియాల్టీ అనగా రాయల్టీ అనగా సత్యత. ఏ విధంగా ఆత్మ యొక్క అనాది స్వరూపము సత్యము. సత్ అనగా అవినాశీ మరియు సత్యము. ఏ విధంగానైతే తండ్రి మహిమలో కూడా విశేషంగా సత్యమ్-శివమ్-సుందరమ్ అని ఇదే పాడుతూ ఉంటారు. సత్యమే శివుడు లేక గాడ్ ఈజ్ ట్రూత్ (భగవంతుడు సత్యము) అని అంటారు. కావున తండ్రి మహిమ సత్యమైనది అనగా సత్యతకు సంబంధించినది. ఇలాంటి రాయల్టీ అనగా రియాల్టీ - సత్యతలో కొద్దిగా కూడా కృత్రిమత్వము లేక కల్తీ ఉండకూడదు. మాటల్లోనైనా, కర్మల్లోనైనా, సంబంధ-సంపర్కంలోనైనా కల్తీ లేక కృత్రిమత్వము ఉండకూడదు. బాప్‌దాదా దీనినే సాధారణ భాషలో సత్యత అని అంటారు. రాయల్ ఆత్మల వృత్తి, దృష్టి, మాటలు మరియు నడవడిక అన్నింటిలోనూ ఒకే సత్యత ఉంటుంది. వృత్తిలో ఒక విషయం ఉండడం మరియు మాటల్లో మరొక కృత్రిమమైన భావం ఉండడం జరగకూడదు కదా. దీనిని రాయల్టీ (హుందాతనము) లేక రియాల్టీ (వాస్తవికత) అని అనబడదు.
ఈ రోజుల్లో బాప్‌దాదా పిల్లల లీలలను చూస్తున్నారు మరియు వింటున్నారు కూడా. చాలా మంది పిల్లలు విషయాలను కలపడంలో మరియు తయారుచేయడంలో చాలా తెలివైనవారిగా ఉన్నారు. ఎందుకంటే ద్వాపరం నుండి ఈ విధంగా కలిపిన మరియు తయారుచేసిన కథలను చాలా విన్నారు. కావున ఈ బ్రాహ్మణ జీవితంలో కూడా ఆ సంస్కారాన్ని ఇమర్జ్ చేస్తారు. ఎంత మంచి రూపంతో విషయాన్ని తయారుచేస్తారంటే, అసత్యాన్ని పూర్తిగా సంపూర్ణ సత్యంగా తయారుచేస్తారు మరియు సత్యాన్ని అసత్యంగా నిరూపిస్తారు. దీనినే లోపల ఒకటి, బయట మరొకటి అని అంటారు. మరి ఇదేమైనా రియాల్టీనా? రాయల్టీనా? కాదు కదా. కనుక ఇటువంటి పవిత్రత యొక్క రాయల్టీ అనగా రియాల్టీ. ఇది రాయల్టీ యొక్క లక్షణము. ఒకవేళ ఈ లక్షణం లేదంటే పవిత్రత యొక్క రాయల్టీ రాలేదని లేదా పర్సెంటేజ్లో వచ్చిందే కానీ సంపూర్ణంగా రాలేదని భావించండి.
రియాల్టీ యొక్క రెండవ లక్షణాన్ని బాప్‌దాదా సదా వినిపిస్తూ ఉంటారు - సత్యమున్న చోట మనసు ఆనందముతో నాట్యము చేస్తుంది. సత్యమైన ఆత్మలు సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. ఒక్కోసారి తక్కువ సంతోషము, ఒక్కోసారి ఎక్కువ సంతోషము, అలా ఉండదు. రోజురోజుకూ ప్రతి సమయము సంతోషం ఇంకా పెరుగుతూ ఉంటుంది. రియాల్టీ యొక్క లక్షణము - సదా సంతోషంగా నాట్యం చేయడము. నయనాలు మరియు హావభావాలు అని అంటారు కదా, రాయల్టీ యొక్క అర్థమేమిటంటే చిత్తములో కూడా మరియు నయనాలు, హావభావాలలో కూడా సదా హర్షితము. కేవలం బయటకు హర్షితముఖులుగా ఉండడం కాదు కానీ చిత్తములో కూడా హర్షితంగా ఉండాలి. హర్షిత చిత్తము, హర్షిత ముఖము - రెండూ హర్షితంగా ఉండాలి. చాలా సార్లు ఇలా కూడా జరుగుతూ ఉంటుంది, లోపల చిత్తములో సంతోషముండదు కానీ బాహ్యముఖతలో సమయమనుసారంగా హర్షితముఖులుగా అయి చూపిస్తారు. దీనిని అల్పకాలికమైన హర్షితముఖమని అంటాము, కానీ హర్షిత చిత్తము, హర్షిత ముఖము అవినాశీగా ఉండాలి. కావున పవిత్రత యొక్క రాయల్టీ, రియాల్టీ అనగా చిత్తము మరియు ముఖము హర్షితంగా, అవినాశీగా ఉండాలి. చెక్ చేసుకోండి - ఇతరులను చెక్ చేయడం మొదలుపెట్టకండి, స్వయాన్ని చెక్ చేసుకోండి. ఇటువంటి రాయల్ ఆత్మ బాప్‌దాదాకు మరియు సర్వ బ్రాహ్మణ పరివారానికి అతి ప్రియంగా ఉంటుంది. అసలైన ప్రియమైన ఆత్మ యొక్క విశేషత ఏముంటుంది? ఎందుకంటే ఈ రోజుల్లోని ఆచార-పద్ధతుల అనుసారంగా ఎవరైతే చాలా ప్రియంగా అనిపిస్తారో, ఆ ప్రియమైనవారి వైపుకు వద్దనుకున్నా కూడా ఆకర్షితులవుతారు. దీనిని మీరు మీ భాషలో అటాచ్మెంట్ అని అంటారు. ఎందుకంటే ప్రియమైనవారిగా ఉంటే అటాచ్మెంట్ ఉంటుంది కదా. కానీ రియల్ మరియు రాయల్ ప్రేమ యొక్క గుర్తు ఏమిటంటే - వారు ఎంత ప్రియంగా ఉంటారో అంతే అతీతంగా కూడా ఉంటారు, అందుకే వారు స్వయము ఎక్స్ట్రా అటాచ్మెంట్లోకి రారు మరియు ఇతరులు కూడా వీరి అటాచ్మెంట్లోకి రారు. దీనినే రియల్ ప్రేమ, సంపూర్ణ ప్రేమ అని అంటాము. వారు హర్షితంగా ఉంటారు, ఆకర్షణీయంగా కూడా ఉంటారు కానీ హద్దులో ఆకర్షణ చేసేవారిగా ఉండరు. కనుక రియల్ మరియు రాయల్‌గా ఉండేవారి లక్షణమేమిటి? అతి ప్రియము మరియు అతి అతీతము.
రాయల్టీకి కల మరొక విశేషత ఏమిటంటే, ఆ ఆత్మలో ఎప్పుడూ ఏ రకమైన, స్థూలమైన లేక సూక్ష్మమైన యాచించే సంస్కారం ఉండదు ఎందుకంటే రాయల్ ఆత్మ సదా సంపన్నంగా, నిండుగా ఉంటుంది. ఒక నిండుదనమేమో బాహ్యమైనది, స్థూలమైన వస్తువులతో, స్థూలమైన సాధనాలతో నిండుదనము. రెండవది - మనసుతో నిండుదనము. ఎవరైతే మనసుతో నిండుగా ఉంటారో, వారి వద్ద స్థూలమైన వస్తువులు లేక సాధనాలు లేకపోయినా కానీ మనసు నిండుగా ఉన్న కారణంగా వారెప్పుడూ స్వయంలో లోటును అనుభూతి చేయరు. లేకపోయినా ఉన్నట్లుగా అనుభవం చేస్తారు. మరియు ఎవరి మనసైతే నిండుగా ఉండదో ఆ ఆత్మ బయటకు ఎంతగా వస్తువులు మరియు సాధనాలతో నిండుగా ఉన్నా కానీ వారెప్పుడూ స్వయాన్ని నిండుగా ఉన్నట్లు భావించరు. ఇటువంటి ఆత్మ కోరికల కారణంగా సదా ‘కావాలి, కావాలి’ అన్న పాటను పాడుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ ఇది జరగాలి, ఇది చేయాలి, ఇది లభించాలి, ఇది మారాలి... ప్రతి సమయము ఇదే పాటను పాడుతూ ఉంటారు. మనసుతో నిండుగా ఉన్న ఆత్మ సదా ఏ పాట పాడుతూ ఉంటుందంటే - అంతా పొందాను, అంతా ప్రాప్తించింది. ఇది జరగాలి, ఇది చేయాలి... ఇలా ‘కావాలి, కావాలి’ అన్నది కూడా రాయల్‌గా యాచించే సంస్కారము. అనంతమైన సేవ విషయంలో ఇది జరగాలి, ఇది చేయాలి అని ఆలోచించడం వేరు, కానీ స్వయం యొక్క హద్దు ప్రాప్తుల కోసం ‘కావాలి, కావాలి’ అన్నది రాయల్‌గా యాచించడము. పేరు కావాలి, గౌరవం కావాలి, కీర్తి కావాలి, ప్రేమ కావాలి, నన్ను అడగాలి - ఇవన్నీ హద్దు విషయాలు. రాయల్ ఆత్మలో యాచించే సంస్కారము అంశమాత్రము కూడా ఉండదు. రాయల్టీ అంటే ఏమిటో అర్థమయిందా?
తపస్య యొక్క చార్టులో ఇవన్నీ చెక్ చేసుకోండి. అంతేకానీ నేను ఎవరినీ నిందించలేదు, క్రోధం చేయలేదు అని కాదు. ఈ విషయాలన్నీ చెక్ చేసుకోండి. అప్పుడు ప్రైజ్ తీసుకోండి. తపస్య అంటే అర్థమే సంపూర్ణ పవిత్రంగా అవ్వడము. కనుక పవిత్రత యొక్క పర్సనాలిటీ, పవిత్రత యొక్క రాయల్టీ ప్రాక్టికల్‌గా ఎంతవరకు ఉంది, ఇది చెక్ చేసుకోవాలి. ఇటువంటివారినే తపస్వీరాజు అని అంటాము. రాయల్టీ అంటే ఏమిటో అర్థమయిందా?
రాయల్ ఆత్మ యొక్క ముఖము మరియు నడవడిక, రెండూ సత్యత యొక్క సభ్యతను అనుభవం చేయిస్తాయి. మామూలుగా కూడా రాయల్ ఆత్మలను సభ్యత యొక్క దేవీలు అని అంటారు. వారి మాట్లాడడములో, చూడడములో, నడవడములో, తినడములో, తాగడములో, కూర్చోవడములో, లేవడములో, ప్రతి కర్మలోనూ సభ్యత, సత్యత స్వతహాగానే కనిపిస్తాయి. నేను సత్యాన్ని నిరూపిస్తున్నాను అని అంటూ అందులో సభ్యత లేకపోవడం కాదు. చాలా మంది పిల్లలు ఏమంటారంటే, మామూలుగా అయితే క్రోధం రాదు కానీ ఎవరైనా అబద్ధం చెప్తే క్రోధం వస్తుంది. వారు అబద్ధం చెప్పారు, మీరు క్రోధంతో చెప్పారు, ఇరువురిలో రైట్ ఎవరు? సత్యతను నిరూపించేవారు సదా సభ్యత కలవారిగా ఉంటారు. చాలా మంది తెలివిని ప్రదర్శిస్తారు - మేము క్రోధం చేయము, మా గొంతే పెద్దదిగా ఉంటుంది, మా గొంతే అలా పదునుగా ఉంటుంది అని అంటారు. సైన్స్ సాధనాలతో శబ్దాన్ని తక్కువగా మరియు ఎక్కువగా చేయగలరు కదా, మరి సైలెన్స్ శక్తితో మీ మాటను నెమ్మదిగా లేక గట్టిగా చేయలేరా? దానికన్నా ఈ టేప్ రికార్డర్ మరియు ఈ మైక్ బాగున్నాయి ఎందుకంటే వీటిలో శబ్దాన్ని ఎక్కువగా, తక్కువగా చేయవచ్చు కదా. కావున సత్యతతో పాటు సభ్యత కూడా ఉందా అని చెక్ చేసుకోండి. ఒకవేళ సభ్యత లేకపోతే సత్యత లేనట్లే. కనుక పవిత్రత యొక్క రాయల్టీ సదా ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. లోపల అయితే రాయల్టీ ఉంది కానీ బయటకు కనిపించదు అని కాదు. ఒకవేళ లోపల ఉన్నట్లయితే బయటకు తప్పకుండా కనిపిస్తుంది. సత్యత యొక్క రాయల్టీని ఎవరూ దాచిపెట్టలేరు. ఇందులో గుప్తంగా ఉండకూడదు. చాలా మంది, మేము గుప్త పురుషార్థులము, అందుకే గుప్తంగా ఉంటాము అని అంటారు. కానీ ఎలాగైతే సూర్యుడిని ఎవరూ దాచిపెట్టలేరో, అలా సత్యత యొక్క సూర్యుడిని కూడా ఎవరూ దాచిపెట్టలేరు. దానిని ఏ కారణమూ దాచిపెట్టలేదు, ఏ వ్యక్తి దాచిపెట్టలేరు. సత్యము సదా సత్యమే. సత్యత యొక్క శక్తి అన్నింటికన్నా మహోన్నతమైనది. సత్యత అనేది నిరూపించడంతో నిరూపించబడదు. సత్యత యొక్క శక్తికి స్వతహాగానే నిరూపణ అయ్యే సిద్ధి ప్రాప్తిస్తుంది. సత్యతను ఒకవేళ ఎవరైనా నిరూపించాలనుకుంటే ఆ నిరూపించటము మొండితనంలా అవుతుంది, అందుకే సత్యత స్వయమే నిరూపణ అవుతుంది. దానిని నిరూపణ చేసే అవసరం లేదు. అర్థమైందా. తపస్యా సంవత్సరంలో ఏం చూపించాలి? పవిత్రత యొక్క పర్సనాలిటీ మరియు రాయల్టీ. అచ్ఛా!
దేశ-విదేశాల నుండి పిల్లలందరి ఉత్తరాలు, ప్రియస్మృతులు, పురుషార్థము మరియు సేవా సమాచారము మరియు హృదయపూర్వక ఆత్మిక సంభాషణ, అన్నీ బాప్‌దాదా వద్దకు చేరుకుంటున్నాయి, చేరుకున్నాయి. బాప్‌దాదా పిల్లలందరికీ పేరు సహితంగా ప్రియస్మృతులను ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ మొదట మా స్మృతి చేరుకుంది అని భావించండి ఎందుకంటే బాప్‌దాదా ప్రియస్మృతులకు రెస్పాన్స్‌ను అవ్యక్త రూపంతోనైతే అదే క్షణంలో ఇచ్చేస్తారు. కానీ ఎంతైనా సాకార విధితో స్వయం కూడా సాకారంలో ఉత్తరాలు రాస్తారు లేక ప్రియస్మృతులను పంపిస్తారు కనుక బాప్‌దాదా కూడా సాకార విధి అనుసారంగా సాకార రూపంలో కూడా ప్రియస్మృతులను రిటర్న్‌లో ఇస్తున్నారు. నలువైపులా తపస్య మరియు మనసా వైబ్రేషన్ల ద్వారా సేవ చేసే ఉల్లాస-ఉత్సాహాలు బాగున్నాయి మరియు ఇలాగే ఉంటాయని బాప్‌దాదాకు తెలుసు. ఇప్పుడింకా లోతైన రహస్యయుక్తమైన విషయాలను ఎదురుగా ఉంచుకుని పురుషార్థాన్ని, సేవను సూక్ష్మంగా మరియు మహాన్‌గా చేసుకుంటూ వెళ్ళండి. పిల్లలందరికీ, ఎవరైతే సమ్ముఖంలో కూర్చున్నారో లేక ఆకారీ స్వరూపంలో తండ్రి సమ్ముఖంలో ఉన్నారో, ఇలా సమ్ముఖంగా అనగా సదా తోడుగా ఉన్నవారందరి నయనాలలో, ముఖంలో, మనసులో సదా పిల్లలకు తండ్రి ఉన్నారు మరియు తండ్రికి పిల్లలు ఉన్నారు.
ఇలా సదా స్మృతిలో ఇమిడి ఉన్న శ్రేష్ఠ ఆత్మలకు, సదా పవిత్రత యొక్క రియాల్టీ మరియు రాయల్టీలో ఉండే ఆత్మలకు, సదా మనసుతో సంపన్నంగా, నిండుగా ఉండే ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో మిలనము
గ్రూప్ నం.1:- స్వయాన్ని పదమాపదమ భాగ్యశాలి ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా! ఇంతటి శ్రేష్ఠమైన భాగ్యము మొత్తం కల్పంలో ఏ ఆత్మకూ లేదు. ఎంత ప్రసిద్ధమైన ఆత్మలైనా కానీ, మీ భాగ్యం ముందు వారి భాగ్యము ఏపాటిది? అది అల్పకాలికమైన భాగ్యము మరియు బ్రాహ్మణాత్మలది అవినాశీ భాగ్యము. ఇది కేవలం ఈ ఒక్క జన్మది కాదు, జన్మ జన్మల భాగ్యము. తండ్రికి చెందినవారిగా అవ్వడం అనగా భాగ్యం యొక్క వారసత్వము అధికారంగా లభించడము. కావున అధికారమైతే లభించింది కదా. బిడ్డ అనగా అధికారము, వారసత్వము. అధికారం యొక్క నషా ఉందా లేక అది ఎక్కుతూ దిగుతూ ఉందా? అర్థకల్పమైతే కిందికే దిగారు, ఇప్పుడేం చేయాలి? నడవాలా, ఎక్కాలా లేక ఎగరాలా? ఎగిరే వస్తువు మధ్యలో ఎప్పుడూ ఆగదు. ఆగిపోతే కిందకు వస్తారు. కొంత సమయం కోసమైనా ఆగి, మళ్ళీ ఎగిరితే గమ్యానికి ఎలా చేరుకుంటారు? అందుకే ఎగురుతూ ఉండండి. కానీ ఎవరు సదా ఎగురుతారు? తేలికగా ఉన్నవారు. మరి తేలికగా ఉన్నారు కదా? లేదా తనువు, మనసు, సంబంధాల బరువు ఉందా? ఒకవేళ బరువు లేకపోతే ఎందుకు ఆగుతారు? బరువుగా ఉన్న వస్తువు కిందికి వస్తుంది మరియు తేలికగా ఉన్నది సదా పైన ఉంటుంది. మీరందరూ అయితే డబల్ లైట్‌గా ఉన్నారు కదా?
కాబట్టి సదా తమ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకోవడం వల్ల భాగ్యవిధాత అయిన బాబా స్వతహాగానే గుర్తుకొస్తారు. భాగ్యవిధాతను గుర్తుచేసుకోవడం అనగా భాగ్యాన్ని గుర్తుచేసుకోవడం మరియు భాగ్యాన్ని గుర్తుచేసుకోవడం అనగా భాగ్యవిధాతను గుర్తుచేసుకోవడం. రెండింటికీ సంబంధం ఉంది. ఏదో ఒక్కరిని గుర్తుచేసుకున్నా రెండూ గుర్తొస్తాయి. కాబట్టి నడుస్తూ తిరుగుతూ ‘వాహ్ నా శ్రేష్ఠ భాగ్యము!’ అని పాడుకోండి. సంకల్పంలో కూడా లేనిదానిని సాకార రూపంలో పొందుతున్నారు. ఇంత సహజమైన భాగ్యం మరియు ఎంత సహజంగా లభించిందో! ఏ మహానాత్మ వద్దకైనా వెళ్తే హద్దు ప్రాప్తి కొరకు - సంతానం కావాలన్నా, ధనం కావాలన్నా, శరీర ఆరోగ్యం కావాలన్నా, ఒకే ఒక్క ప్రాప్తి కొరకు కూడా ఎంత శ్రమ చేయిస్తారు! మరి మీరు ఏమి చేయాల్సి వచ్చింది? శ్రమ పడాల్సి వచ్చిందా? లేక కన్ను తెరుచుకోగానే, మూడవ నేత్రం తెరుచుకోగానే భాగ్యపు దృశ్యం కనిపించిందా? ఇంట్లో కూర్చునే పరిచయం లభించింది. మీరైతే వెతకాల్సిన అవసరమే రాలేదు. ఏదైనా హద్దు గని నుండి హద్దు ఖజానాను తీసుకోవాలన్నా ఎంత పరుగులెత్తాల్సి వస్తుందో. ఇదైతే సహజంగానే ఇంట్లో కూర్చుని చేతికి దొరికిపోయింది. ఒక్క బాబా ఒక్క కుటుంబం. అనేకత సమాప్తమైపోయింది మరియు అందరూ ఒక్కటిగా అయ్యారు. మన బాబా, మన కుటుంబం. మనదిగా అనిపిస్తుంది కదా. ఎంత దూరంలో ఉన్నా స్నేహం సమీపానికి తీసుకువస్తుంది. స్నేహం లేకపోతే కలిసి ఉంటున్నా దూరంగా ఉన్నట్లే అనిపిస్తుంది. కాబట్టి ఈశ్వరీయ స్నేహం గల కుటుంబంలోకి వచ్చేశారు. అందుకే సదా గుర్తుంచుకోండి - ‘ఓహో నా శ్రేష్ఠ భాగ్యము!’ భాగ్యవిధాత ద్వారా శ్రేష్ఠ భాగ్యాన్ని పొందేశాము. బాబా తనవారిగా చేసుకున్నప్పుడు ఇక ఏమి కావాలి? మంచివారిగా మారారు కదా, కాబట్టి కోరిక సమాప్తమైపోయింది. మంచివారిగా మారకపోతే కోరిక మిగిలి ఉండేది. కోరికలన్నీ సంపన్నమైపోయాయి. బాబా లభించారు, సర్వస్వం లభించింది. తృప్త ఆత్మ సదా ఆత్మిక నషాలో ఉంటుంది. సంపన్నమైన ఆత్మ నషాను చూడండి - చెప్పినా, చెప్పకపోయినా దాని నషా స్వతహాగానే కనిపిస్తుంది. మరి మీ ఆత్మిక నషా ఎంత పెద్దదో! కాబట్టి మీరు ఏమి గుర్తుంచుకుంటారు? ‘వాహ్ నా శ్రేష్ఠ భాగ్యము!’ ఇది గుర్తుంటుందా లేక బాంబే వెళ్ళగానే మరచిపోతారా? బాంబేలో మాయ ఫోర్స్ ఎంతగా ఉందో మీలో ఆత్మిక ఫోర్స్ అంతగా ఉంది. బాంబేను మాయా నగరి అంటారు కదా. మీరు ఏమంటారు? మా కొరకు బాబా నగరి. మంచిది.
గ్రూప్ 2 :- మిమ్మల్ని మీరు బ్రాహ్మణ ప్రపంచానికి చెందినవారిగా భావిస్తున్నారా? బ్రాహ్మణ ప్రపంచమే మన ప్రపంచం, బాబాయే మన ప్రపంచం - ఇలా అనుభవం చేసుకుంటున్నారా లేక ఇంకా ఏదైనా ప్రపంచం ఉందా? బాబా మరియు చిన్న కుటుంబమే ఈ ప్రపంచం. ఇలా అనుభవం చేసుకున్నప్పుడే అతీతంగా మరియు ప్రియంగా మారగలరు. మన ప్రపంచమే అతీతమైనది. మన దృష్టి-వృత్తి అన్నీ అతీతమైనవి. బ్రాహ్మణుల వృత్తిలో ఏమి ఉంటుంది? ఎవరిని చూసినా ఆత్మిక వృత్తితో, ఆత్మిక దృష్టితో కలుస్తారు. దృష్టిని బట్టే సృష్టి. వృత్తి మరియు దృష్టిలో ఆత్మిక దృష్టి ఉన్నట్లయితే సృష్టి ఎలా అనిపిస్తుంది? ఆత్మల సృష్టి ఎంత బాగుంటుంది! శరీరాన్ని చూస్తూ కూడా ఆత్మనే చూస్తారు. శరీరం ఒక సాధనం మాత్రమే. కానీ ఈ సాధనంలో విశేషత ఆత్మదే కదా. ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరమనే సాధనానికి విలువ ఏముంది! ఆత్మ లేకపోతే చూడటానికే భయమేస్తుంది. కాబట్టి విశేషత ఆత్మదే. ఆత్మయే ప్రియంగానూ అనిపిస్తుంది. కాబట్టి బ్రాహ్మణుల ప్రపంచంలో స్వతహాగా నడుస్తూ తిరుగుతూ ఆత్మిక దృష్టి, ఆత్మిక వృత్తి ఉంటాయి, అందువల్ల ఎలాంటి దుఃఖపు నామరూపాలు ఉండవు. ఎందుకంటే దుఃఖం దేహభానం వల్లనే కలుగుతుంది. ఒకవేళ దేహభానాన్ని మరచి ఆత్మిక స్వరూపంలో ఉంటే సదా సుఖమే సుఖం. సుఖదాయి-సుఖమయ జీవితం. ఎందుకంటే బాబాను అసలే సుఖదాత అంటారు. కాబట్టి సుఖదాత ద్వారా సర్వ సుఖాల ఆస్తి లభించింది. తల్లిదండ్రులు అనగానే ఆస్తి లభించింది. కాబట్టి సుఖశయ్యపై నిద్రించేవారు. స్థూలంగా పరుపుపై పడుకున్నప్పటికీ మనస్సు దేనిపై నిద్రిస్తుంది? నడుస్తూ తిరుగుతూ ఏమి అనిపిస్తుంది? సుఖమే సుఖం. ప్రపంచమే సుఖమయమైనప్పుడు సుఖమే సుఖం కనిపిస్తుంది కదా. దుఃఖధామాన్ని వదిలేశారు. ఇప్పటికీ దుఃఖధామంలో ఉంటున్నారా లేక అప్పుడప్పుడు చక్కర్లు కొట్టడానికి వెళ్తున్నారా? దుఃఖధామానికి స్వస్తి పలికారు. సంగమంలోకి వచ్చేశారు కదా. ఇప్పుడు సంగమయుగులా లేక కలియుగులా? స్వప్నంలో కూడా దుఃఖధామానికి వెళ్ళలేరు. కొత్త జీవితం కదా. యుగమూ మారింది, జీవితమూ మారింది. ప్రస్తుతం సంగమయుగపు శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలము - అనే ఈ నషాలోనే సదా ఉండండి. సుఖమయ ప్రపంచంలో నివసించే సుఖ స్వరూప ఆత్మలు. దుఃఖాన్ని 63 జన్మలు చూసేశారు. ప్రస్తుతం సంగమంలో అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగేవారు. ఇది బాహ్య సుఖం కాదు, అతీంద్రియ సుఖం. వినాశి సుఖం కలియుగ ఆత్మలకు కూడా ఉంటుంది. కానీ మీకు అతీంద్రియ సుఖం ఉంది. ఇంద్రియాల సుఖమే అయితే ఇంద్రియాలే వినాశమైనవి, అప్పుడు సుఖం కూడా వినాశనమయ్యేదే అవుతుంది కదా? ఫలానావారు నాకు చాలా దుఃఖాన్ని ఇచ్చేశారు అనే ఆలోచన సంకల్పంలో కూడా రాకూడదు. ఫలానావారు చాలా దుఃఖపెడుతున్నారు అనే సంకల్పం కూడా చేయలేరు. ఎవరైనా దుఃఖాన్ని ఇస్తే మీరెందుకు తీసుకున్నారు? ఇచ్చేవారు ఇచ్చారు, మీరేమో తీసుకోలేదు, మరి ఎవరి వద్ద మిగిలింది? మీకైతే అందలేదు కదా, మరి ఎందుకు తీసుకుంటారు? నన్ను చాలా దుఃఖపెట్టారు, ఇతడు చాలా దుఃఖాన్ని ఇచ్చేవాడు అని అనేవి - బ్రాహ్మణుల మాటలు కావు. ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడుతారా? కోడలు చాలా దుఃఖపెట్టింది, విసిగించింది అని మాతలు ఎప్పుడైనా అంటారా? అత్తగారు చాలా దుఃఖపెట్టారు, ఆడపడుచు చాలా దుఃఖపెట్టింది అని కోడలు అంటుందా? అలా అనట్లేదు కదా, భాష పరివర్తన అయిపోయింది. తీసుకునేవారు తీసుకోనప్పుడు ఇక మీ వద్దకు ఎక్కడి నుండి వస్తుంది? బాప్‌దాదా ఏమి పక్కా చేయించారు - దుఃఖాన్ని ఇవ్వకండి, దుఃఖాన్ని తీసుకోకండి. మేమైతే ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వము అనేది అసంపూర్ణమైనది. దుఃఖాన్ని తీసుకోనూ తీసుకోము. ఎప్పుడైతే ఇవ్వరో, తీసుకోరో, అప్పుడే అతీంద్రియ సుఖంలో ఉంటారు. ఇచ్చేవారు ఏదైనా చెత్తను ఇస్తే తీసుకుంటారా? దుఃఖం మంచిదా లేక చెడ్డదా? చెడ్డ వస్తువు అయినప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు? వారు ఏదో నిస్సహాయతతో ఇచ్చేస్తున్నారు అందుకే తీసుకుంటున్నారా? ఎవరైనా చెత్తను పారవేసి వెళ్తే మీరేం చేస్తారు? బయట పారేస్తారా లేక జమ చేసి దాచుకుంటారా? బలవంతంగా ఎవరైనా ఇచ్చినా సమాప్తం చేసేయండి, ఎందుకు ఉంచుకుంటారు, ఎందుకు ధారణ చేస్తారు? బ్రాహ్మణులు అనగా సదా సుఖీగా ఉండేవారు? సదా సుఖాన్ని ఇచ్చేవారు. బ్రాహ్మణుల పని - సుఖాన్ని ఇవ్వడం మరియు సుఖాన్ని తీసుకోవడం. కాబట్టి సదా సుఖపు ఊయలలో ఊగుతూ ఉండండి. బాబా అంటారు - సదా బాబాతో పాటు ఊయలలో ఊగుతూ ఉండండి. ఇదే భక్తికి ప్రతిఫలం.
సదా రాయల్ ఫ్యామిలీకి చెందినవారే కదా. రాయల్ ఫ్యామిలీ వారు సదా తివాచీలపై నడుస్తారు కానీ మట్టిలో కాదు. కాబట్టి ఊయలలో ఊగండి. కిందకు రావడం అనగా మట్టిలోకి రావడం. ఈ దేహం కూడా మట్టే కదా. దేహభానంలోకి కిందకు రావడం అనగా మట్టిలో అడుగు పెట్టడమే. కాబట్టి పొరపాటున కూడా మట్టిలో అడుగు పెడితే - మనం రాయల్ బాబా పిల్లలమై ఉండి మట్టిలో అడుగు ఎలా పెట్టాము అని ఆ సమయంలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి? తల్లిదండ్రులకు గారాల బిడ్డలు ఎవరైతే ఉంటారో వారిని సదా ఒడిలోనే ఆడుకోవాలని ప్రయత్నిస్తారు. కింద పెట్టరు. మరి మీరు కూడా గారాల పిల్లలే. బాబా మిమ్మల్ని ఇంతటి సికిలధే గారాల పిల్లలుగా చేసినప్పుడు గారాల పిల్లలుగానే నడవండి, సాధారణంగా మారకండి. అచ్ఛా!
*** ఓంశాంతి ***
