‘‘నంబర్‌వన్‌గా అవ్వాలంటే జ్ఞానాన్ని మరియు యోగాన్ని స్వరూపంలోకి తీసుకురండి’’
ఈరోజు సత్యమైన శిక్షకుడు తమ శ్రేష్ఠ శిక్షణలను ధారణ చేసే ఈశ్వరీయ విద్యార్థులను చూస్తున్నారు, ప్రతి ఒక్క ఈశ్వరీయ విద్యార్థి ఈ ఈశ్వరీయ శిక్షణను ఎంతవరకు ధారణ చేసారు అని చూస్తున్నారు. చదివించేవారు ఒక్కరే, చదువు కూడా ఒక్కటే కానీ చదివేవారు చదువులో నంబరువారుగా ఉన్నారు. ప్రతి రోజు యొక్క పాఠము మురళీ ద్వారా ప్రతి స్థానంలో ఒకే పాఠాన్ని వింటారు అనగా ఒకే పాఠాన్ని చదువుతారు. మురళీ అనగా పాఠము ప్రతి స్థానంలో ఒక్కటే ఉంటుంది. తేదీ తేడా ఉండవచ్చు కానీ మురళీ అదే ఉంటుంది. అయినా నంబరువారుగా ఎందుకు ఉన్నారు? నంబరు ఎందుకు తయారవుతుంది? ఎందుకంటే ఈ ఈశ్వరీయ చదువును చదివే విధి - కేవలం వినడము కాదు కానీ ప్రతి మహావాక్యాన్ని స్వరూపంలోకి తీసుకురావాలి. అందరూ ఒకేలా వింటారు కానీ స్వరూపంగా అవ్వడంలో నంబరువారుగా అవుతారు. నేను నంబర్‌వన్‌గా అవ్వాలి అని అందరికీ ఒకే లక్ష్యముంది. ఇటువంటి లక్ష్యముంది కదా! నంబర్‌వన్‌గా అవ్వాలనే లక్ష్యముంది. కానీ రిజల్టులో నంబరువారుగా అవుతారు ఎందుకంటే లక్ష్యాన్ని లక్షణాలలోకి తీసుకురావడము - ఇందులో లక్ష్యము మరియు లక్షణాలలో తేడా వచ్చేస్తుంది.
ఈ చదువులో సబ్జెక్టులు కూడా ఎక్కువ లేవు. నాలుగు సబ్జెక్టులను ధారణ చేయడము - ఇందులో కష్టమేముంది! మరియు నాలుగు సబ్జెక్టులకు పరస్పరము ఒకదానికొకటి సంబంధముంది. జ్ఞానమనే ఒక సబ్జెక్టును సంపూర్ణ విధి పూర్వకంగా ధారణ చేయండి అనగా జ్ఞానం యొక్క ఒక్కొక్క పదాన్ని స్వరూపంలోకి తీసుకురండి, జ్ఞానం ముఖ్యంగా రెండు పదాలలో ఉంది, వాటిని రచయిత మరియు రచన లేక అల్ఫ్ (తండ్రి) మరియు బే (వారసత్వం) అని అంటాము. రచయిత అయిన తండ్రి గురించి అర్థం చేసుకున్నారు అనగా పరమాత్మ పరిచయం, సంబంధం స్పష్టమైంది మరియు రచన అనగా మొదటి రచన - నేను శ్రేష్ఠ ఆత్మను మరియు రెండవది - ఆత్మనైన నాకు ఈ అనంతమైన రచనలో అనగా అనంతమైన డ్రామాలో మొత్తం కల్పంలో ఏ-ఏ పాత్ర ఉంది - ఈ మొత్తం జ్ఞానమైతే అందరికీ ఉంది కదా. కానీ శ్రేష్ఠ ఆత్మ యొక్క స్వరూపంగా అయి ప్రతి సమయము శ్రేష్ఠ పాత్రను అభినయించడము - ఇందులో అప్పుడప్పుడు స్మృతి ఉంటుంది, అప్పుడప్పుడు మర్చిపోతారు. ఒకవేళ ఈ రెండు పదాల జ్ఞానము ఉంటే, యోగము కూడా ఈ రెండు పదాల ఆధారంపైనే ఉంది కదా. జ్ఞానంతో యోగానికి స్వతహాగానే సంబంధముంది. ఎవరైతే జ్ఞానయుక్త ఆత్మలుగా ఉంటారో, వారు తప్పకుండా యోగయుక్త ఆత్మలుగా కూడా ఉంటారు. కనుక జ్ఞానానికి మరియు యోగానికి సంబంధం ఉన్నట్లు కదా. మరియు ఎవరైతే జ్ఞానులుగా,యోగులుగా ఉంటారో, వారి ధారణ శ్రేష్ఠంగా ఉంటుందా లేక బలహీనంగా ఉంటుందా? శ్రేష్ఠంగా స్వతహాగానే ఉంటుంది కదా, సహజంగా ఉంటుంది కదా లేక ధారణలో కష్టముంటుందా? ఎవరైతే జ్ఞానయుక్త, యోగయుక్త ఆత్మలుగా ఉన్నారో, వారు ధారణలో బలహీనంగా ఉండగలరా? ఉండరు. కానీ అలా ఉన్నారు. మరి వారిలో జ్ఞాన-యోగాలు లేనట్లా? జ్ఞానులుగా ఉన్నారు కానీ జ్ఞాన యుక్త ఆత్మ - ఈ స్థితి లేదు. యోగాన్ని జోడించేవారిగా ఉన్నారు కానీ యోగీ జీవితం కలవారిగా లేరు. జీవితం సదా ఉంటుంది మరియు జీవితం సహజంగా ఉంటుంది. యోగీ జీవితం అనగా వాస్తవిక స్వభావం యోగులు వలె ఉంటుంది.
63 జన్మల విస్మృతి యొక్క సంస్కారాలు మరియు బలహీనత యొక్క సంస్కారాలు బ్రాహ్మణ జీవితంలో అక్కడక్కడ మూల స్వభావంగా అయి పురుషార్థంలో విఘ్నాలు వేస్తాయి. ఎంతగా స్వయము మరియు ఇతరులు ఇది పరివర్తన చేసుకోండి అని అటెన్షన్ ఇప్పించినా కానీ లేదా స్వయం కూడా ఇది పరివర్తన అవ్వాలి అని అర్థం చేసుకున్నా కానీ, తెలిసి కూడా, పరివర్తన అవ్వాలని అనుకున్నా కూడా ఏం చెప్తారు? ఇలా ఉండాలనుకోలేదు కానీ ఇది నా నేచర్, ఇది నా స్వభావము అని అంటారు. కనుక స్వభావం సహజమైనదిగా అయిపోయింది కదా. ఎవరివైనా మాటలలో లేక వ్యవహారంలో జ్ఞాన సంపన్న వ్యవహారము లేకపోతే, యోగి జీవితము అనుసారంగా వ్యవహారము, మాటలు లేకపోతే వారు ఏమంటారు? ఈ మాటే అంటారు, నా మాటలు సహజంగా ఇలానే ఉంటాయి, మాట్లాడే టోన్ ఇలాగే ఉంటుంది. లేదా నా నడవడిక-వ్యవహారమే అఫిషియల్‌గా లేక గంభీరంగా ఉంటుంది అని అంటారు. దానికి మంచి పేరు చెప్తారు, ఇది ఆవేశం కాదు కానీ అఫిషియల్‌గా ఉండడము. కనుక పరివర్తన అవ్వాలని అనుకున్నా కూడా, అర్థం చేసుకున్నా కూడా స్వభావం అనేది సహజంగానే కార్యం చేస్తూ ఉంటుంది, అందులో శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎవరైతే జ్ఞానీ జీవితంలో లేక యోగీ జీవితంలో ఉంటారో, వారి ప్రతి కర్మ సహజంగా జ్ఞానము మరియు యోగముతో సంపన్నంగా ఉంటుంది అనగా జ్ఞానము మరియు యోగము - ఇదే వారి స్వభావంగా అయిపోతుంది మరియు స్వభావంగా అయిన కారణంగా శ్రేష్ఠ కర్మలు, యుక్తియుక్త కర్మలు సహజంగానే జరుగుతూ ఉంటాయి. కనుక అర్థమయిందా, స్వభావము సహజము చేసేస్తుంది. కనుక జ్ఞానము మరియు యోగము మూల స్వభావంగా అయిపోవాలి – వీరినే జ్ఞానీ జీవితము కలవారు, యోగీ జీవితము కలవారు అని అంటాము.
అందరూ జ్ఞానులే, అందరూ యోగులే కానీ వ్యత్యాసం ఏమిటి? ఒకరేమో, జ్ఞానం వినేవారు-వినిపించేవారు, యథా శక్తి జీవితంలోకి తీసుకొచ్చేవారు. రెండవవారు, జ్ఞానమును మరియు యోగమును ప్రతి సమయం తమ జీవితం యొక్క స్వభావంగా చేసుకునేవారు. అందరూ విద్యార్థులే కానీ ఈ వ్యత్యాసం ఉన్న కారణంగా నంబరువారుగా అయిపోతారు. ఎవరి స్వభావమైతే జ్ఞానీ-యోగీల స్వభావం వలె ఉంటుందో, వారి ధారణ కూడా సహజంగా ఉంటుంది. సహజంగానే వారి స్వభావ-సంస్కారాలు ధారణా స్వరూపంగా ఉంటాయి. ఈ గుణాన్ని ధారణ చేయాలి, ఆ గుణాన్ని ధారణ చేయాలి అని పదే-పదే పురుషార్థం చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ప్రారంభంలో పునాది సమయంలోనే జ్ఞానము, యోగము మరియు ధారణను తమ జీవితంగా చేసుకున్నారు, అందుకే ఈ మూడు సబ్జెక్టులు అటువంటి ఆత్మకు స్వతహాగా మరియు స్వాభావికమైన అనుభూతులుగా అయిపోతాయి, అందుకే అటువంటి ఆత్మలను సహజ యోగులు, సహజ జ్ఞానులు, సహజ ధారణామూర్తులు అని అంటాము. మూడు సబ్జెక్టులకు కనెక్షన్ ఉంది. ఎవరి వద్దనైతే ఇన్ని అనుభూతులతో ఖజానా సంపన్నంగా ఉంటుందో, అటువంటి సంపన్న మూర్తులు స్వతహాగానే మాస్టర్ దాతగా అవుతారు. దాత అనగా సేవాధారి. దాత ఇవ్వకుండా ఉండలేరు. దాతృత్వ సంస్కారం ద్వారా స్వతహాగానే సేవా సబ్జెక్టు ప్రాక్టికల్‌గా సహజమైపోతుంది. కనుక నాలుగు సబ్జెక్టులకు సంబంధముంది కదా. ఎవరైనా, నాలో జ్ఞానమైతే మంచిగా ఉంది కానీ ధారణలో లోపముంది అని అంటే వారిని జ్ఞాని అని అంటారా? జ్ఞానమైతే ఇతరులకు కూడా ఇస్తారు కదా. ఉంది కనుకనే ఇస్తారు! మొదటిది, అర్థం చేసుకోవడము, రెండవది, స్వరూపంలోకి తీసుకురావడము. అర్థం చేసుకోవడంలో అందరూ తెలివైనవారిగా ఉన్నారు, అర్థం చేయించడంలో కూడా అందరూ తెలివైనవారు కానీ నంబర్‌వన్‌గా అవ్వాలంటే జ్ఞానాన్ని మరియు యోగాన్ని స్వరూపంలోకి తీసుకురండి. అప్పుడు నంబరువారుగా ఉండరు కానీ నంబర్‌వన్‌గా ఉంటారు.
ఈరోజు సత్యమైన శిక్షకుడు తమ నలువైపులా ఉన్న ఈశ్వరీయ విద్యార్థులను చూస్తున్నారని వినిపించాము. మరి ఏం చూసారు? అందరూ నంబర్‌వన్‌గా కనిపించారా లేక నంబరువారుగా కనిపించారా? రిజల్టు ఏం ఉంటుంది? లేదా నంబర్‌వన్ అయితే ఒక్కరే ఉంటారు, మేమైతే నంబరువారులోకే వస్తాము అని భావిస్తున్నారా. ఫస్ట్ డివిజన్లోనైతే రాగలరు కదా. అందులో ఒక్కరే ఉండరు. కనుక చెక్ చేసుకోండి, ఒకవేళ పదే-పదే ఏదైనా విషయంలో స్థితి కింద-మీద అవుతుంది అనగా పదే-పదే పురుషార్థంలో శ్రమ చేయాల్సి వస్తుంది, దీని ద్వారా ఏం ఋజువు అవుతుందంటే, జ్ఞానమనే ముఖ్యమైన సబ్జెక్టులోని రెండు పదాలు - ‘రచయిత’ మరియు ‘రచన’ యొక్క చదువును స్వరూపంలోకి తీసుకురాలేదు, జీవితంలో మూల సంస్కారం రూపంలో లేక మూల స్వభావం రూపంలో లేక సహజ స్వభావం యొక్క రూపంలోకి తీసుకురాలేదు. బ్రాహ్మణ జీవితం యొక్క సహజ స్వభావ-సంస్కారమే యోగీ జీవితము, జ్ఞానీ జీవితము. జీవితము అనగా నిరంతరం, సదా ఉంటుంది. 8 గంటలు జీవితముంది, 4 గంటలు లేదు అని ఈ విధంగా ఉండదు. ఈరోజు 10 గంటల యోగీగా అయ్యాము, ఈరోజు 12 గంటల యోగీగా అయ్యాము, ఈరోజు 2 గంటల యోగీగా అయ్యాము - ఇలాంటివారు యోగాన్ని జోడించే యోగులు, యోగీ జీవితం కలిగిన యోగులు కాదు. విశేషంగా సంగఠిత రూపంలో ఎందుకు కూర్చుంటారంటే, సర్వుల యోగ శక్తితో వాయుమండలం ద్వారా బలహీన పురుషార్థులను మరియు విశ్వంలోని సర్వాత్మలను యోగ శక్తి ద్వారా పరివర్తన చేయాలి, అందుకే అది కూడా అవసరము, కానీ తమ తెగిపోయిన యోగాన్ని మాత్రమే జోడిస్తూ ఉండడానికి ఏమీ యోగంలో కూర్చోరు. సంగఠిత శక్తి అనేది కూడా సేవకు నిమిత్తమవుతుంది కానీ నా కనెక్షన్ మళ్ళీ జోడింపబడాలి అని ఏమీ యోగ భట్టీ పెట్టరు. ఒకవేళ బలహీనంగా ఉంటే దీని కోసమే కూర్చుంటారు మరియు ‘‘యోగయుక్త ఆత్మ’’ అయి ఉంటే మాస్టర్ సర్వశక్తిమంతులుగా అయి, మాస్టర్ విశ్వకళ్యాణకారిగా అయి సర్వులకు సహయోగాన్ని ఇచ్చే సేవ చేస్తారు. కనుక చదువు అనగా స్వరూపంగా అవ్వడము. అచ్ఛా!
ఈరోజు దీపావళి జరుపుకునేందుకు వచ్చారు. జరుపుకోవడము అంటే అర్థమేమిటి? దీపావళిలో ఏం చేస్తారు? దీపాలు వెలిగిస్తారు. ఈరోజుల్లోనైతే లైట్లు వెలిగిస్తారు. మరియు లైటు వద్దకు ఏం వస్తాయి? దీపపు పురుగులు. దీపపు పురుగుల విశేషత ఏముంటుంది? బలి అవ్వడము. కనుక దీపావళి జరుపుకోవడం అంటే అర్థము ఏమైనట్లు? మరి బలి అయ్యారా లేక ఈరోజు అవ్వాలా? అయ్యారా లేక అవ్వాలా? (అయిపోయాము) మరి దీపావళి అయితే జరుపుకున్నారు, మళ్ళీ ఎందుకు జరుపుకుంటున్నారు? బలి అయిపోయినప్పుడే దీపావళి జరుపుకున్నట్లు లేదా మధ్య-మధ్యలో తిరిగేందుకు వెళ్తారా? బలి అయ్యారు కానీ ఇప్పుడింకా కొద్దిగా రెక్కలు ఉన్నాయి, వాటితో కొద్దిగా తిరుగుతారా! అలా తిరిగేవారైతే కారు కదా. తిరగడము అనగా మాయ యొక్క ఏదో ఒక రూపంతో ఎదురుదెబ్బ తినడము. మాయతో ఎదురుదెబ్బ తింటారా లేక మాయను ఓడిస్తారా? లేక అప్పుడప్పుడు విజయం ప్రాప్తించుకుంటూ, అప్పుడప్పుడు ఎదురుదెబ్బ తింటున్నారా?
దీపావళి అంటే, మీ స్మృతిచిహ్నాన్నే జరుపుకుంటారు. మీ స్మృతిచిహ్నమే కదా? లేక ముఖ్యమైన ఆత్మల స్మృతిచిహ్నమా, మీరు కేవలం చూసేవారా? ఇది మీ అందరి స్మృతిచిహ్నము, అందుకే ఈరోజుల్లో చాలామంది దీపాలకు బదులుగా చిన్న-చిన్న బల్బులను వెలిగిస్తున్నారు. దీపాలను వెలిగిస్తే సంఖ్య వాటికన్నా తగ్గిపోతుంది. కానీ మీ సంఖ్య అయితే చాలా ఉంది కదా. కనుక అందరి స్మృతిచిహ్నంగా అనేక చిన్న-చిన్న బల్బులను వెలిగిస్తారు. కనుక మీ స్మృతి చిహ్నాన్ని జరుపుకుంటున్నారు. దీపాన్ని చూసినప్పుడు ఇది మా స్మృతిచిహ్నము అని భావిస్తున్నారా? స్మృతి వస్తుందా? ఇదే సంగమయుగం యొక్క విశేషత, చైతన్య దీపాలు తమ జడ స్మృతిచిహ్నమైన దీపాలను చూస్తున్నారు. చైతన్యంలో స్వయం మీరే మరియు జడ స్మృతిచిహ్నాన్ని చూస్తున్నారు. నిజానికి ఏ రోజునైతే దీపావళి జరుపుకుంటారో ఆ రోజే వాస్తవికమైన తిథి. ఇదైతే ప్రపంచంవారు తిథిని ఫిక్స్ చేసారు, కానీ మీ తిథి మీదే, అందుకే బ్రాహ్మణులైన మీరు ఏ రోజును జరుపుకుంటారో అదే సత్యమైన తిథి, అందుకే ఏదైనా తిథిని ఫిక్స్ చేయాలంటే ఎవరిని అడుగుతారు? బ్రాహ్మణుల ద్వారానే నిర్ణయిస్తారు. కనుక ఈరోజు బాప్‌దాదా దేశ-విదేశాలలోని సదా వెలిగి ఉన్న దీపాలందరికీ దీపావళి యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నారు, అభినందనలు తెలుపుతున్నారు. దీపావళి శుభాకాంక్షలు అనగా సమృద్ధిగా, సంపన్నంగా అయ్యే శుభాకాంక్షలు!
ఇటువంటి సదా వెలిగే జ్యోతులకు, సదా స్వయం ప్రకాశ స్వరూపులుగా అయి అనేకుల అంధకారాన్ని తొలగించే సత్యమైన దీపాలకు, సదా నాలుగు సబ్జెక్టులను తమ జీవితంలోకి తీసుకువచ్చేటువంటి, సర్వ సబ్జెక్టులలో నంబర్‌వన్ యొక్క లక్ష్యాన్ని లక్షణంలోకి తీసుకువచ్చేటువంటి జ్ఞాన యుక్త ఆత్మలకు, యోగ యుక్త ఆత్మలకు, దివ్యగుణ స్వరూప ఆత్మలకు, నిరంతర సేవాధారులకు, శ్రేష్ఠ విశ్వ-కళ్యాణకారి ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
అవ్యక్త బాప్‌దాదాతో వ్యక్తిగత మిలనము
గ్రూప్ నం.1:- ఎవరి ముఖము మరియు నడవడిక ద్వారా సదా సంతోషపు మెరుపు కనిపిస్తుందో వారే భాగ్యశాలురు
అందరూ స్వయాన్ని సదా భాగ్యశాలి ఆత్మలమని భావిస్తున్నారా? భాగ్యశాలి ఆత్మల గుర్తులేమిటి? వారి ముఖము మరియు నడవడిక ద్వారా సదా సంతోషపు మెరుపు కనిపిస్తుంది. ఏ స్థూల కార్యము చేస్తున్నా సరే, సాధారణమైన పని చేస్తున్నా కానీ ప్రతి కర్మ చేస్తూ సంతోషపు మెరుపు కనిపించాలి. దీనినే నిరంతరం సంతోషంలో మనసు నాట్యం చేస్తూ ఉండడము అని అంటాము. సదా ఈ విధంగా ఉంటున్నారా? లేక అప్పుడప్పుడు చాలా సంతోషంగా ఉంటారు, అప్పుడప్పుడు తక్కువగా ఉంటారా? సంతోషం యొక్క ఖజానా తమ ఖజానాగా అయిపోయింది. కనుక మీ ఖజానా సదా మీతో పాటు ఉంటుంది కదా. లేక అప్పుడప్పుడు ఉంటుందా? తండ్రి ఖజానాను తమ ఖజానాగా చేసుకున్నారా లేక తమ ఖజానాను మర్చిపోతారా? మీ స్థూల వస్తువైతే గుర్తుంటుంది కదా. ఆ ఖజానా కళ్ళకు కనిపిస్తుంది కానీ ఈ ఖజానా కళ్ళకు కనిపించదు, మనసుతో అనుభవం చేస్తారు. మరి అనుభవం చేసిన విషయాన్ని ఎప్పుడైనా మర్చిపోతారా? కనుక సదా మేము సంతోషం యొక్క ఖజానాకు యజమానులము అని స్మృతిలో ఉంచుకోండి. ఖజానా ఎంతగా గుర్తుంటుందో అంతగా నషా ఉంటుంది. ఈ ఆత్మిక నషా ఇతరులకు కూడా వీరి వద్ద ఏదో ఉంది అని అనుభవం చేయిస్తుంది.
మాతలకు మొత్తం సమయమంతా ఏం గుర్తుంటుంది? కేవలం తండ్రి గుర్తుంటారా లేక ఇంకేదైనా గుర్తుంటుందా? వారసత్వం యొక్క సంతోషమైతే కనిపిస్తుంది కదా. బ్రాహ్మణ జీవితానికి ఒక్క తండ్రే ప్రపంచము అయినప్పుడు, మరి ప్రపంచం తప్ప ఇంకేం గుర్తుకొస్తుంది! సదా మనసులో తమ శ్రేష్ఠ భాగ్యం యొక్క పాటను పాడుతూ ఉండండి. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యం మొత్తం కల్పంలో ప్రాప్తిస్తుందా? మొత్తం కల్పంలో ఇప్పుడే ప్రాప్తిస్తుంది, కనుక ఇప్పటి సంతోషం, ఇప్పటి నషా అన్నింటికన్నా శ్రేష్ఠమైనవి. కనుక మాతలకు ఇతర సంబంధీకులు ఎవరైనా గుర్తుకొస్తారా? సంబంధాలలో ఏదైనా కింద-మీద అయితే మోహం వస్తుందా? మోహమంతా సమాప్తమైందా? ఏం జరిగినా సరే, నాకు మోహం రాదు అని ఎవరైతే అంటారో, వారు చేతులెత్తండి. అచ్ఛా, మోహం యొక్క పేపరు వస్తే ఫర్వాలేదా? పాండవులైతే నష్టోమోహులు కదా. వ్యవహారంలో ఏదైనా కింద-మీద అయినా కూడా నష్టోమోహులుగా ఉంటారా? ఇప్పుడు కూడా మధ్య-మధ్యలో మాయ పేపరు అయితే తీసుకుంటుంది కదా. మరి అందులో పాస్ అవుతున్నారా? లేక మాయ వచ్చినప్పుడు కొద్దిగా ఢీలా అవుతున్నారా? మరి సదా సంతోషం యొక్క పాటలు పాడుతూ ఉండండి. అర్థమయిందా? ఏం పోయినా కానీ సంతోషం పోకూడదు. మాయ ఏ రూపంలో వచ్చినా కానీ సంతోషం పోకూడదు. ఈ విధంగా సంతోషంగా ఉండేవారే సదా భాగ్యశాలురు. అచ్ఛా!
ఇప్పుడు ఆంధ్ర మరియు కర్ణాటకవారు ఏ అద్భుతం చేయాలి? ఏ ఆత్మ కూడా వంచితమవ్వకూడదు. ప్రతి ఒక్కరికీ సందేశమివ్వాలి. ఎక్కడ ఉంటున్నా సరే సర్వాత్మలకు సందేశం లభించాలి. ఎంతగా సందేశమిస్తారో అంతగా సంతోషం పెరుగుతూ ఉంటుంది. అచ్ఛా!
గ్రూప్ నం. 2 :- పరమాత్మ ప్రేమ యొక్క పాలనను అనుభవం చేసుకోవడానికి ప్రతి కార్యం అతీతంగా అయి చేయండి
అందరూ తమను తాము సంగమయుగపు వజ్రతుల్య శ్రేష్ఠ ఆత్మలుగా భావిస్తున్నారా? ఎందుకంటే సంగమంలో ఈ సమయంలో వజ్రతుల్యంగా ఉన్నారు. సత్యయుగంలో స్వర్ణతుల్యంగా అవుతారు. కానీ ఈ సమయంలో మొత్తం చక్రం అంతటిలోనూ శ్రేష్ఠ ఆత్మ పాత్రను అభినయిస్తున్నారు. మరి వజ్ర సమాన జీవితం అనగా ఇంత అమూల్యమైన జీవితం తయారైందా? అన్నింటికంటే గొప్ప విలువైన జీవితం సంగమయుగపు జీవితమే. మరి ఇంత శ్రేష్ఠమైనవారము అనే స్మృతి ఉంటోందా? ఎందుకంటే స్మృతి ఎలా ఉంటుందో స్థితి అలాగే ఉంటుంది. ఒకవేళ స్మృతి శ్రేష్ఠంగా ఉంటే స్థితి సాధారణంగా ఉండజాలదు. ఒకవేళ స్థితి సాధారణంగా ఉంటే స్మృతి కూడా సాధారణమైనదే. కాబట్టి సదా సర్వశ్రేష్ఠ విలువైన జీవితాన్ని అనుభవం చేసుకునే ఆత్మను నేను - ఇది స్మృతిలో ఇమర్జ్ అయి ఉండాలి. నేను ఎలాగూ ఉన్నానులే, మేము వజ్రతుల్యమని తెలుసులే అని కాదు. స్మృతిలో ఇమర్జ్ రూపంలో ఉంటుందా మరియు అదే స్మృతితో, అదే స్థితితో ప్రతి కార్యం చేస్తున్నారా? ఎందుకంటే వజ్రతుల్య జీవితం లేదా వజ్రతుల్య స్థితి ఉన్నవారి ప్రతి కర్మ వజ్రతుల్యంగా ఉంటుంది అనగా విలువైనదిగా, అత్యున్నతమైనదిగా ఉంటుంది. మరి ప్రతి కర్మ అలా ఉన్నతంగా ఉంటోందా లేక అప్పుడప్పుడు ఉన్నతంగా, అప్పుడప్పుడు సాధారణంగానా? ఎందుకంటే సదా వజ్రతుల్యంగా ఉన్నారు. వజ్రం అంటే వజ్రమే, అది ఎన్నడూ బంగారం లేదా వెండిగా మారదు. కాబట్టి ప్రతి కర్మ చేస్తూ చెక్ చేసుకోండి - వజ్రతుల్య స్థితి ఉందా, నడుస్తూ-నడుస్తూ సాధారణత్వం వచ్చేయడం లేదు కదా? ఎందుకంటే సాధారణంగా ఉండడం 63 జన్మల అభ్యాసం. కాబట్టి పాత సంస్కారం అప్పుడప్పుడూ లాగేస్తుంది. బలహీనుడిని ఎవరైనా లాగుతారు, ధైర్యవంతులను ఎవరూ లాగలేరు. ధైర్యవంతులు దానిని కూడా పాదాల వద్ద తలవంచేలా చేస్తారు. కాబట్టి ఎన్నడూ సాధారణ స్థితి ఉండకూడదు. ఏదైనా విశేషమైన ఆక్యుపేషన్ (వృత్తి) ఉన్నవారు అలాంటి ఏదైనా సాధారణ కర్మ చేస్తే ఏమంటారు? నేటి ప్రైమ్ మినిస్టర్ ఏదైనా ఒక తేలికపాటి పని చేస్తే అందరూ నిందిస్తారు కదా, మంచిగా అనిపించదు కదా. మరి మీరు ఎవరు?
వీరు నడుస్తూ తిరుగుతూ ఉన్న విశేష ఆత్మలు అని అందరికీ కనిపించేంత నషాను స్మృతిలో ఉంచుకోండి. వజ్రం ఎంతగా మట్టిలో దాగి ఉన్నా కూడా తన మెరుపును చూపిస్తుంది. కాబట్టి మీరు ఎంత సాధారణ వాతావరణంలో ఉన్నా, ఎంత పెద్ద సాధారణ వ్యక్తుల మధ్యలో ఉన్నా విశేష ఆత్మగా, అలౌకిక ఆత్మగా కనిపించాలి. ప్రవృత్తిలో ఉంటున్నా సరే, వారి మధ్యలో కూడా అతీతంగా కనిపించాలి. అలాంటి పురుషార్థం ఉందా? ఎంతగా అతీతంగా ఉంటారో అంతగా తండ్రి ప్రేమకు పాత్రులుగా అవుతారు. ఎక్కడైనా మోహము ఉంటే అతీతంగా కాలేరు. అందువలన అతీతంగా మరియు ప్రియంగా. ఏ కార్యమైనా చేయండి కానీ అతీతంగా అయి చేయండి. అప్పుడు పరమాత్మ ప్రేమ యొక్క పాలనలో సదా ముందుకు ఎగురుతున్నామని అనుభవం చేసుకుంటారు. పరమాత్మ ప్రేమ ఎగిరేందుకు సాధనం. మరి ఎగిరేవారే కదా. ధరణి యొక్క ఆకర్షణకు సదా అతీతంగా పైన ఉండండి. ధరణి అనగా మాయ లాగకూడదు. ఎంతటి ఆకర్షణీయమైన రూపమైనా సరే, ఎగిరే కళలో ఉండేవారి వద్దకు మాయ యొక్క ఆకర్షణ చేరుకోలేదు. రాకెట్ వెళ్తుంది కదా, అప్పుడు ధరణి ఆకర్షణకు అతీతమైపోతుంది. మరి మీరు కాలేరా? దీనికి విధి ఏమిటంటే అతీతంగా అవ్వడమే. తండ్రి మరియు నేను, అంతే. తండ్రితో పాటు ఎగురుతూ ఉండాలి. ఆకర్షితులై కిందకు రాకూడదు. సేవా నిమిత్తం వచ్చినా సరే మాయ ఆకర్షణ రాలేదు, మాయా-ప్రూఫ్‌గా అయి వస్తారు. తండ్రి అతీతంగా ఉన్నారు, అందుకే ప్రియంగా ఉన్నారు. కాబట్టి ఫాలో ఫాదర్. సదా అతీతంగా, సదా తండ్రికి ప్రియంగా. అర్థమైందా? అచ్ఛా!
గ్రూప్ నం. 3 :- స్వప్నానికి ఆధారం - సాకార జీవితం
అందరూ సాకార రూపంలో సమీపంగా వచ్చేందుకు, కూర్చునేందుకు పురుషార్థం చేస్తున్నారు. దీని కొరకు పరుగులెత్తుతారు కదా. మరి సమీపంగా ఉండటం మంచిగా అనిపిస్తుంది కదా. కానీ ఇది స్వల్ప సమయం కొరకు సమీపంగా ఉండడం. సదా సమీపంగా ఉండటం ఎంత శ్రేష్ఠమైనది! తండ్రికి సదా సమీపంగా ఎవరు ఉండగలరు? సమీపంగా ఉండేవారి విశేషత ఏమిటి? సమానంగా ఉంటారు. ఎవరైతే సమానంగా ఉంటారో వారు సమీపంగా ఉంటారు. మరి ఈ స్వల్ప సమయం సామీప్యత ప్రియంగా అనిపించినప్పుడు, సదా సమీపంగా ఉండేవారు ఎంత ప్రియంగా ఉంటారు! మరి సదా సమీపంగా ఉంటున్నారా లేక కేవలం స్వల్ప సమయం కొరకే సమీపంగా ఉన్నారా? సమీపంగా ఉండటానికి భక్తి మార్గంలో కూడా సత్సంగానికి ఎంతో మహత్త్వం ఉంది. తోడుగా ఉండండి అనగా సమీపంగా ఉండండి. వారైతే కేవలం వినేవారు మాత్రమే, కానీ మీరు తోడుగా ఉండేవారు. ఇలా ఉన్నారా? ఎప్పుడైనా ముఖం తిప్పేసుకోవడం లేదు కదా? మాయ వచ్చి అలా ముఖం తిప్పేస్తే? సీత వలె మాయను గుర్తుపట్టలేకపోతే - ఇలా మోసపోవడం లేదు కదా?
మోసపోయేవారు చంద్రవంశీయులుగా అయిపోతారు. కాబట్టి మాయను చక్కగా గుర్తించేవారే కదా. తండ్రిని గుర్తించారు మరియు మాయను కూడా చక్కగా గుర్తించారు. ఇప్పుడు అది కొత్త రూపం ధరించి వచ్చినా గుర్తిస్తారు కదా. లేక కొత్త రూపం చూసి మాకేం తెలుసు అంటారా! శక్తులు గుర్తిస్తున్నారా? లేక అప్పుడప్పుడు భయపడిపోతున్నారా? తండ్రిని పక్కన పెట్టినప్పుడే భయపడతారు. ఒకవేళ తండ్రి తోడులో ఉంటే సమీపానికి రావడానికి మాయకు ధైర్యము లేదు. కాబట్టి గుర్తించడమే గీత, ఈ గుర్తించడము అనే గీత లోపలికి మాయ రాలేదు. మరి గీత లోపల ఉంటున్నారా లేక అప్పుడప్పుడు సంకల్పం ద్వారా కాస్త బయటకు వచ్చేస్తున్నారా? సంకల్పంలో కూడా తోడు అనే గీతను దాటి బయటకు వస్తే మాయకు సహచరుడు అయిపోతారు. సంకల్పంలో లేదా స్వప్నంలో కూడా తండ్రి నుండి దూరం కాకూడదు. స్వప్నాలు నా వశంలో లేవు కదా అని అనుకోకూడదు. స్వప్నానికి ఆధారం కూడా తమ సాకార జీవితమే. ఒకవేళ సాకార జీవితంలో మాయాజీతులుగా ఉంటే స్వప్నంలో కూడా మాయ అంశమాత్రంగానైనా రాలేదు. మరి స్వప్నంలో కూడా మాయ రాలేనంతగా మాయా-ప్రూఫ్‌గా ఉన్నారా? స్వప్నాన్ని కూడా తేలికగా తీసుకోకండి. ఎందుకంటే స్వప్నంలో బలహీనపడితే, లేచిన తర్వాత కూడా ఆ సంకల్పాలు తప్పక నడుస్తాయి మరియు యోగం సాధారణమైపోతుంది. అందువలన సంకల్పంతోనే కాదు, స్వప్నమాత్రంలో కూడా మాయ దాడి చేయలేనంత విజయిగా అవ్వండి. సదా మాయాజీత్ అనగా సదా తండ్రికి సమీపంగా వారి తోడులో ఉండేవారు. తండ్రి తోడు నుండి వేరుచేసే శక్తి ఎవరికీ లేదు - ఇలా ఛాలెంజ్ చేసేవారే కదా. మేము విజయిగా కాకపోతే ఇంకెవరు అవుతారు అని అంతగా హృదయం నుండి శబ్దం రావాలి! కల్ప క్రితం అయ్యారు. సదా ఇది స్మృతిలో అనుభవమవ్వాలి - మనమే ఉండేవాళ్ళం, మనమే ఉన్నాము మరియు మనమే ఉంటాము. అచ్ఛా!
గ్రూప్ నం. 4 :- అకళ్యాణపు దృశ్యంలో కూడా కళ్యాణమే కనిపించాలి
మళ్ళీ వచ్చి కలిసినది అదే కల్ప క్రితపు తండ్రియే అని బాబాపై నిశ్చయం ఉందా? అలాగే మనం కూడా అదే కల్ప క్రితపు తండ్రితో కలిసి పాత్రను అభినయించే విశేష ఆత్మలము అని తమపై కూడా అంత నిశ్చయం ఉందా? లేక బాబాపై నిశ్చయం ఎక్కువ, తమపై తక్కువగా ఉందా? సరే, డ్రామాలో ఏది జరిగినా దానిపై కూడా పక్కా నిశ్చయం ఉందా? డ్రామాలో జరిగేదంతా కల్యాణకారి యుగం కారణంగా అంతా కల్యాణకారకమే. లేక ఏదైనా అకళ్యాణం కూడా జరిగిపోతోందా? ఎవరైనా మరణిస్తే అందులో కళ్యాణం ఉందా? వారు చనిపోతుంటే మీరు కళ్యాణం, కళ్యాణం అంటారా! బిజినెస్‌లో నష్టం వచ్చింది, ఇది కళ్యాణమా? కాబట్టి నష్టం కూడా కళ్యాణకారకమే! జ్ఞానంలోకి రాకముందు ఎప్పుడూ రాని విషయాలు జ్ఞానంలోకి వచ్చాక వస్తే అందులో కళ్యాణం ఉందా? మాయ తారుమారు చేస్తోంది, కళ్యాణమేనా? ఇందులో ఏమి కళ్యాణం ఉంది? మాయ మిమ్మల్ని అనుభవజ్ఞులుగా తయారుచేస్తుంది. మంచిది, కాబట్టి డ్రామాపై కూడా అంతే అచలమైన నిశ్చయం ఉండాలి. చూడటానికి మంచి విషయంలా అనిపించకపోయినా అందులో కూడా గుప్తమైన మంచి ఏమి నిండి ఉంది అన్నది పరీక్షించాలి. అనేక వస్తువులు ఉంటాయి, వాటి పై కవర్ (మూత) బాగుండదు కానీ లోపల చాలా మంచి వస్తువు ఉంటుంది. పైనుండి చూస్తే ఏముందో ఏమో అనిపిస్తుంది! కానీ గుర్తించి దానిని తెరిచి లోపల చూస్తే ఎంతో శ్రేష్ఠమైన వస్తువు బయటపడుతుంది. కాబట్టి డ్రామాలోని ప్రతి విషయాన్ని పరీక్షించే బుద్ధి కావాలి. నిశ్చయం యొక్క గుర్తింపు ఇలాంటి సమయంలోనే వస్తుంది. పరిస్థితి ఎదురైనప్పుడు మరియు పరిస్థితి సమయంలో నిశ్చయపు స్థితి ఉన్నప్పుడే నిశ్చయబుద్ధి విజయి అంటారు. కాబట్టి మూడింటిలో పక్కా నిశ్చయం కావాలి - తండ్రిపై, తమపై మరియు డ్రామాపై. నొప్పితో విలవిల్లాడుతూ కూడా - వాహ్ డ్రామా వాహ్! అంటారా? ఆ సమయంలో కేకలు వేస్తారా లేక ‘వాహ్-వాహ్’ అంటారా? ‘హాయ్ బాబా రక్షించు’ - అని అనరు కదా? నిశ్చయం ఉన్నప్పుడు, నిశ్చయం అనగానే సంశయం యొక్క నామరూపాలు లేకపోవడం. ఏది జరిగినా సరే కానీ అచల-స్థిర నిశ్చయబుద్ధిని ఏ పరిస్థితీ అలజడిలోకి తీసుకురాలేదు. ఎందుకంటే అలజడిలోకి రావడం అనగా బలహీనం కావడం.
ఏ వస్తువైనా బాగా అలజడిలోకి వచ్చి, కదులుతూ ఉంటే విరిగిపోతుంది కదా! కాబట్టి సంకల్పంలో కూడా అలజడి ఉండకూడదు. ఇలాంటి అచల-స్థిర ఆత్మలు అచల రాజ్యానికి అధికారులుగా అవుతారు. సత్యయుగ-త్రేతాయుగాలలో అచల రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యాన్ని ఎవరూ తప్పించలేరు. వేరే రాజెవరైనా యుద్ధం చేసి రాజ్యాన్ని లాక్కుంటారు అనేది జరిగే అవకాశమే లేదు. అందువలన ఈ అవినాశి అచల రాజ్యం మహిమ చేయబడింది. అనేక జన్మలు ఈ అచల-అఖండ రాజ్యాన్ని చేస్తారు. కానీ ఎవరు అధికారిగా అవుతారు? ఎవరైతే ఇక్కడ సంగమంలో అచల-అఖండంగా ఉంటారో, ఖండితం కారో వారు. ఈరోజు నిశ్చయం ఉంది, రేపు నిశ్చయం ఊగిసలాడింది అనుకోండి - దానిని ఖండితం అంటాము. ఖండితమైన వస్తువు ఎన్నడూ పూజనీయం కాదు. విగ్రహం కూడా ఖండితమైతే పూజ జరగదు. మ్యూజియంలో కావాలంటే ఉంచవచ్చు కానీ పూజ జరగదు. కాబట్టి అఖండ నిశ్చయబుద్ధి ఆత్మలు. అలాంటి నిశ్చయబుద్ధి ఆత్మలు సదా విజయం యొక్క సంతోషంలో ఉంటారు, వారిలో సదా సంతోషపు బాజాలు మోగుతూనే ఉంటాయి. నేటి ప్రపంచంలో కూడా విజయం లభించినప్పుడు బాజాలు మోగుతాయి కదా. అలాగే సదా నిశ్చయబుద్ధి ఆత్మ మనస్సులో సదా సంతోషపు బాజాభజంత్రీలు మోగుతూనే ఉంటాయి. మాటిమాటికి వాయించనవసరం లేదు, ఆటోమేటిక్‌గా మోగుతూనే ఉంటాయి. ఇలా అనుభవం చేసుకుంటున్నారా? లేక అప్పుడప్పుడు బాజాభజంత్రీలు ఆగిపోతాయా? భక్తిలో అనంతమైన గీతాలు అంటారు, దానికి హద్దు ఉండదు, ఆటోమేటిక్‌గా మోగుతూనే ఉంటుంది. కాబట్టి హద్దులేని గీతాలు మోగుతూ ఉండాలి. డబల్ విదేశీయుల వద్ద ఆటోమేటిక్ గీతాలు మోగుతున్నాయా? సదా మోగుతాయా లేక అప్పుడప్పుడా? సదా మోగుతాయి.
అన్నింటికంటే అతిపెద్ద సంతోషపు ఖజానా ఇప్పుడు లభిస్తుంది. సంభాళించడం వచ్చు కదా. సంభాళించే విధి ఏమిటంటే - సదా తండ్రిని వెంట ఉంచుకోవడం. ఒకవేళ తండ్రి సదా తోడుంటే తండ్రి తోడే అన్నింటికంటే పెద్ద సేఫ్టీ సాధనం. మరి ఖజానాను సేఫ్‌గా ఉంచడం వచ్చా లేక మాయ దొంగిలించుకుపోతోందా? దాక్కుని దాక్కుని రావట్లేదు కదా? అది కూడా తెలివైనదే. రావడంలో అది కూడా తక్కువేమీ కాదు. కానీ తండ్రి తోడు మాయను తరిమికొడుతుంది. మరి మీరు ఎలాంటి ఆత్మలు? నిశ్చయబుద్ధి విజయి ఆత్మలు! సదా విజయం యొక్క తిలకం మస్తకంలో దిద్దబడి ఉంది, ఆ తిలకాన్ని ఎవరూ చెరిపివేయలేరు. అవినాశి తిలకం కదా! లేక మాయ చేయి పడితే చెరిగిపోతుందా? అచ్ఛా!
అందరూ మహాన్ ఆత్మలే కదా. ఎక్కడివారైనా సరే కానీ ఈ సమయంలో మీరంతా మధుబన్ నివాసులు. మధుబన్ అనగానే సంతోషం కలుగుతుంది కదా. ఎందుకు? మధుబన్ అనగానే మధుబన్ బాబా గుర్తుకొస్తారు. అందుకే మధుబన్ నివాసిగా అవ్వడానికి ఇష్టపడతారు. అందరూ ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటున్నారు కదా. ఆ రోజులు కూడా వస్తాయి. మంచం దొరకదు, దిండు దొరకదు, అప్పుడు నిద్ర ఎలా వస్తుంది? అలా నిద్రపోవడానికి సిద్ధంగా ఉన్నారా? తమ చేతినే దిండుగా చేసుకోవాల్సి వస్తుంది, రాతిపై పడుకోవాల్సి వస్తుంది. ఎన్ని రోజులు పడుకుంటారు? అన్ని అభ్యాసాలూ ఉండాలి. సాధనాలు లభిస్తే నిద్రపోండి, కానీ లభించకపోతే నిద్ర పట్టదు అనే అభ్యాసం ఉండకూడదు. ఇప్పుడైతే ఒకరికి మంచం కావాలి, ఒకరికి ప్రత్యేక గది కావాలి. అందుకే ఎక్కువమందిని పిలవరు. అందరూ నేలపైనే పడుకుంటే ఎంతమంది రావచ్చు? డబల్ సంఖ్య కావచ్చు కదా. అప్పుడు ఎవరూ కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, నడుము నొప్పిగా ఉంది, కూర్చోలేకపోతున్నాను అని అనరు కదా? ఏది లభించినా, భోజనం దొరికినా, దొరకకపోయినా సిద్ధమేనా? ఆ పేపర్ కూడా వస్తుంది. డబల్ విదేశీయులు నేలపై పడుకోగలరా? ఎంత పక్కాగా ఉండాలంటే పరుపు లభించినా మంచిదే, లభించకపోయినా మంచిదే. ‘హాయ్-హాయ్’ అని అనకూడదు. సహించడంలో మాతలు నైపుణ్యం కలవారు. పాండవులు కూడా నైపుణ్యం కలవారే. ఇంత తోడు ఉన్నప్పుడు సంగఠన యొక్క సంతోషం సర్వస్వాన్నీ మరిపిస్తుంది. కాబట్టి నిశ్చయం ఉంది కదా. బ్రాహ్మణ జీవితం అనగా ఆనందమే ఆనందం, లేచినా ఆనందంలో, పడుకున్నా ఆనందంలోనే. అచ్ఛా!
గ్రూప్ నం. 5 :- తమ శ్రేష్ఠ గౌరవంలో (షాన్) ఉంటే ఇబ్బందులు(పరేషాన్) సమాప్తమైపోతాయి
అందరూ తమ స్థూల సీట్‌పై సెట్ అయ్యారు. సెట్ అవ్వడంలో సంతోషం కలుగుతుంది కదా! అప్సెట్ అవ్వడం మంచిగా అనిపించదు, సెట్ అవ్వడమే బాగుంటుంది. మరి అలాగే సదా మనస్సు మరియు బుద్ధి యొక్క స్థితి అనే సీట్‌పై సెట్ అయి ఉంటున్నారా? లేక అప్సెట్ కూడా అవుతున్నారా? అప్సెట్ అవ్వడం వల్ల ఇబ్బంది కలుగుతుంది, సెట్ అవ్వడం వల్ల సంతోషం కలుగుతుంది, విశ్రాంతి లభిస్తుంది. మరి సదా సంతోషంలో ఉంటున్నారా లేక కాస్త కాస్త ఇబ్బంది పడుతున్నారా? తమ గౌరవాన్ని మరచిపోవడం అనగా ఇబ్బంది పడటం. మరి సంగమయుగంలో బ్రాహ్మణులైన మీ అందరిలోకెల్లా అతిపెద్ద గౌరవం ఏది? ఈశ్వరీయ గౌరవం కదా, సర్వశ్రేష్ఠ ఆత్మలు. కాబట్టి సర్వశ్రేష్ఠులుగా అయ్యే గౌరవం ఉంది. అత్యున్నతమైన భగవంతుని పిల్లలమైన మనమే అత్యున్నతమైనవారము అనేది గుర్తుంటోందా! ఈ గౌరవం గుర్తుంటే ఎన్నడూ ఇబ్బంది పడరు. ఎవరెంత ఇబ్బంది పెట్టినా మీరు కారు, ఎందుకంటే మీ గౌరవం అత్యున్నతమైనది. మరి అప్పుడప్పుడు వ్యవహారంలో, అప్పుడప్పుడు వాతావరణం కారణంగా ఇబ్బంది పడుతున్నారా? 63 జన్మలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. తిరగడం అంటేనే ఇబ్బంది పడటం. భక్తిలో తిరుగుతూనే ఉన్నారు కదా! కాబట్టి అర్థ కల్పం ఇబ్బంది పడే అనుభవం చేసుకున్నారు. ఇప్పుడు గౌరవంలోనే ఉంటారు కదా!
దేవతా గౌరవం కంటే కూడా ఈ బ్రాహ్మణ గౌరవం ఉన్నతమైనది. దేవతల కిరీటం మరియు సింహాసనం కంటే ఉన్నతమైన సింహాసనము ఇప్పుడు ఉంది. మరి సింహాసనంపై కూర్చోవడం వచ్చా లేక కిందకు జారిపోతున్నారా? అందరికీ సింహాసనము మరియు తిలకం లభించాయి, కిరీటం కూడా లభించింది. సేవ యొక్క కిరీటం లభించింది. మరి కిరీటం తలపై నిలుస్తోందా లేక దిగిపోతోందా? సింహాసనాధికారి ఆత్మలు ఎన్నడూ ఇబ్బంది పడలేరు. సింహాసనాన్ని ఎవరైనా లాక్కుంటేనే ఇబ్బంది పడతారు. కాబట్టి సదా తమ ప్రాప్తుల స్మృతిలో ఉండండి. సదా తమ బుద్ధిలో సర్వ ప్రాప్తుల జాబితాను ఉంచుకోండి. పుస్తకంలో కాదు, బుద్ధిలో ఉంచుకోండి. ఒకవేళ ప్రాప్తుల జాబితా ఎదురుగా ఉంటే సదా తమ శ్రేష్ఠ గౌరవం స్వతహాగానే స్మృతిలో ఉంటుంది. ఒక్క ప్రాప్తిని ఎదురుగా ఉంచుకున్నా ఎంత శక్తి వస్తుంది! సర్వ ప్రాప్తులూ స్మృతిలో ఉంటే మాస్టర్ సర్వశక్తిమాన్ స్థితి సహజమైపోతుంది. ప్రాప్తుల జాబితా సదా బుద్ధిలో ఉన్నప్పుడు స్వతహాగానే మనసుతో, హృదయంతో పాట పాడుకుంటారు - పొందవలసినదంతా పొందేశాము...! సదా సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు, పొందేశాము! ప్రపంచంలోనివారు పొందడం కొరకు అటూఇటూ తిరుగుతున్నారు, మరి మీరు పొందేశాము, స్థానం దొరికింది, తిరగడం సమాప్తమైపోయింది అంటారు. ఇప్పుడు మనస్సు వ్యర్థ సంకల్పాలలో తిరుగుతోందా? ఎప్పుడైనా మనస్సు లేదా బుద్ధి తిరిగితే ఈ పాట పాడండి - పొందవలసినదంతా పొందేశాము...! తండ్రి లభించారు సర్వస్వం లభించింది. ఇదే నషాలో ఉండండి. అర్థమైందా?
మేము ఢిల్లీకి చెందినవారము లేక మేము బనారస్‌కు చెందినవారము అని ఇది గుర్తుంచుకోకండి. ప్రవృత్తిలో లేదా ఇంట్లో ఉన్నప్పుడు ఎన్నడూ ఇలా భావించకండి. సేవా స్థానంలో ఉంటున్నారు. సేవా స్థానంగా భావించడం వల్ల అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. ఇల్లుగా భావిస్తే నాది-నాది వస్తుంది, సేవా స్థానం అయితే ట్రస్టీగా ఉంటారు. గృహస్థి అనగా నాది అనే భావం, ట్రస్టీ అనగా నీది. సేవా స్థానంగా భావిస్తే సదా సేవ గుర్తుంటుంది. ప్రవృత్తి అనుకుంటే ప్రవృత్తిని నిర్వర్తించడంలోనే నిమగ్నమైపోతారు. సేవాధారులు సదా అతీతంగా ఉంటారు. సర్వస్వం తండ్రి పరం చేసేశారు. అందువలన అంతా నీది. నేను బాబా వారిని మరియు బాబా నావారు అని సంకల్పం చేసినప్పుడు, ఏదైతే సంకల్పమో దాన్నే సాకార రూపంలోకి తీసుకురావాలి. కేవలం సంకల్పం మాత్రమే కాదు, సాకార స్వరూపంలో, ప్రతి కర్మలో “నా బాబా” అని భావిస్తూ నడవాలి. నా బాబా విత్తనం, విత్తనంలో మొత్తం వృక్షమంతా ఇమిడి ఉంది. అచ్ఛా!
*** ఓంశాంతి ***
