‘‘ఆజ్ఞాకారులే సర్వ శక్తులకు అధికారులు’’
ఈరోజు సర్వశక్తుల దాత అయిన బాప్‌దాదా తమ శక్తి సైన్యాన్ని చూస్తున్నారు. సర్వశక్తిమంతుడైన తండ్రి బ్రాహ్మణాత్మలందరికీ సర్వ శక్తుల వారసత్వాన్ని సమానంగా ఇచ్చారు. కొందరికి తక్కువ శక్తి ఇవ్వడము మరియు కొందరికి ఎక్కువ శక్తి ఇవ్వడము - ఇటువంటి వ్యత్యాసాన్ని చూపించలేదు. అందరికీ ఒక్కరి ద్వారా, ఒకేసారి, ఒకే సమానంగా శక్తులను ఇచ్చారు. మరి ఒకే సమానంగా లభిస్తున్నప్పటికీ వ్యత్యాసం ఎందుకు ఉంది అన్న రిజల్ట్‌ను చూస్తున్నారు. కొంతమంది సర్వ శక్తి సంపన్నులుగా అయ్యారు మరియు కొంతమంది కేవలం శక్తి సంపన్నులుగా అయ్యారు కానీ సర్వ శక్తి సంపన్నులుగా కాదు. కొంతమంది సదా శక్తి స్వరూపులుగా అయ్యారు, కొంతమంది అప్పుడప్పుడు శక్తి స్వరూపులుగా అయ్యారు. కొంతమంది బ్రాహ్మణాత్మలు సర్వశక్తిమాన్ అన్న తమ అథారిటీతో ఏ సమయంలో, ఏ శక్తిని ఆర్డర్ చేస్తే, ఆ శక్తి రచన రూపంలో మాస్టర్ రచయితల ఎదురుగా వస్తుంది. ఆర్డర్ చేసారు మరియు అది హాజరవుతుంది. కొందరు ఆర్డర్ చేస్తారు కానీ సమయానికి శక్తులు హాజరవ్వవు, ‘చిత్తం ప్రభు’ అని అంటూ హాజరవ్వవు. దీనికి కారణమేమిటి? కారణం ఏమిటంటే - పిల్లలు సర్వశక్తిమంతుడైన తండ్రిని ప్రభు అని కూడా అంటారు, ఎదురుగా ఉపస్థితులై ఉన్నవారు అని కూడా అంటారు, అయితే పిల్లల్లో ఎవరైతే ప్రభు అనగా తండ్రి ప్రతి అడుగు కోసం తెలిపిన శ్రీమతానికి, ప్రతి సమయము ‘సరే బాబా’ అని అంటారో లేక ప్రతి ఆజ్ఞకు ‘సరే బాబా’ అని అంటూ దానిని ప్రాక్టికల్‌గా చేస్తారో, అలా ‘సరే బాబా’ అనేవారి ఎదురుగా ప్రతి శక్తి కూడా ‘సరే ప్రభు’ లేక ‘సరే మాస్టర్ హజూర్’ అని అంటుంది.
ఒకవేళ ఆత్మలు ఎవరైనా - సహజంగా పాటించగలిగే శ్రీమతాన్ని లేక ఆజ్ఞను పాటిస్తూ, కష్టంగా అనిపించేదానిని పాటించకపోతే - కొంత చేయడము, కొంత చేయకపోవడము, ఒకసారి ‘సరే ప్రభు’ అని, మరోసారి కేవలం ‘ప్రభు’ అని అంటే, దీనికి ప్రత్యక్ష ఋజువు లేక ప్రత్యక్ష ప్రమాణం యొక్క రూపం ఏమిటంటే - అటువంటి ఆత్మల ఎదురుగా సర్వ శక్తులు కూడా సమయమనుసారంగా హాజరవ్వవు. ఎలాగైతే ఏదైనా పరిస్థితిలో ఇముడ్చుకునే శక్తి కావాలంటే, అప్పుడు, మేము తప్పకుండా ఇముడ్చుకునే శక్తి ద్వారా ఈ పరిస్థితిని దాటుతాము, విజయులుగా అవుతాము అని సంకల్పం చేస్తారు. కానీ జరిగేదేమిటి? రెండవ నంబరువారు అనగా అప్పుడప్పుడు ఉపయోగించేవారు ఇముడ్చుకునే శక్తిని ప్రయోగిస్తారు, 10 సార్లు ఇముడ్చుకుంటారు కానీ అలా ఇముడ్చుకుంటున్నప్పటికీ ఒకటి-రెండుసార్లు ఇముడ్చుకోవాలనుకుంటున్నా ఇముడ్చుకోలేకపోతారు. అప్పుడు ఏం ఆలోచిస్తారు? నేను ఎవ్వరికీ వినిపించలేదు, నేను ఇముడ్చుకున్నాను కానీ వీరు నాతో పాటు ఉండేవారు, నా సహయోగులు, సమీపంగా ఉండేవారు, వీరికి కేవలం సూచన ఇచ్చాను. వినిపించలేదు, సూచన ఇచ్చాను. ఏమీ మాట్లాడకూడదు అనుకున్నాను కానీ కేవలం ఒకటి-రెండు మాటలైతే వెలువడ్డాయి. మరి దీనిని ఏమంటారు? ఇముడ్చుకోవడము అని అంటారా? 10 మంది ఎదురుగానైతే ఇముడ్చుకున్నారు, కానీ ఒకరిద్దరి ఎదురుగా ఇముడ్చుకోలేకపోతారు, మరి దీనిని ఏమంటారు? ఇముడ్చుకునే శక్తి ఆజ్ఞను పాటించిందా? అది మీ శక్తి అయినప్పుడు, దానిని తండ్రి వారసత్వంగా ఇచ్చినప్పుడు, మరి తండ్రి వారసత్వం అనగా పిల్లల వారసత్వము అవుతుంది. మీ శక్తులు మీకే ఉపయోగపడకపోతే వాటిని ఏమంటారు? ఆజ్ఞను పాటించేవి అని అంటారా లేక ఆజ్ఞను పాటించనివి అని అంటారా?
ఈరోజు బాప్‌దాదా సర్వ బ్రాహ్మణాత్మలను, సర్వ శక్తులకు అధికారులుగా ఎంతవరకు అయ్యారు అన్నది చూస్తున్నారు. ఒకవేళ అధికారులుగా అవ్వకపోతే, మరి ఆ సమయంలో పరిస్థితికి అధీనులుగా అవ్వాల్సి ఉంటుంది. బాప్‌దాదాకు అన్నింటికన్నా ఎక్కువగా ఏ సమయంలో దయ కలుగుతుందంటే, ఎప్పుడైతే పిల్లలు ఏదైనా శక్తిని సమయానికి కార్యంలో ఉపయోగించలేకపోతే అప్పుడు. ఆ సమయంలో వారు ఏం చేస్తారు? ఏదైనా విషయము వారిని ఎదుర్కొంటున్నప్పుడు వారు తండ్రి ఎదురుగా ఏ రూపంలో వస్తారు? జ్ఞానీ-భక్తుల రూపంలో వస్తారు. భక్తులు ఏం చేస్తారు? భక్తులు ‘ఇది ఇవ్వండి’ అని కేవలం పిలుస్తూ ఉంటారు. పరుగెత్తుకుంటూ వచ్చేది తండ్రి వద్దకు, అధికారం పెట్టుకునేది తండ్రిపైన, కానీ రూపం రాయల్ భక్తుని వలె ఉంటుంది. ఎక్కడైతే అధికారులకు బదులుగా జ్ఞానీ భక్తులు లేక రాయల్ భక్తుల రూపంలో వస్తారో, అలా ఎప్పటివరకైతే భక్తి యొక్క అంశం మిగిలి ఉంటుందో, మరి భక్తి యొక్క ఫలము సద్గతి అనగా సఫలత, ఆ సద్గతిని అనగా విజయాన్ని ప్రాప్తి చేసుకోలేకపోతారు ఎందుకంటే ఎక్కడైతే భక్తి యొక్క అంశం మిగిలి ఉంటుందో, అక్కడ భక్తి యొక్క ఫలమైన జ్ఞానము అనగా సర్వ ప్రాప్తులు లభించజాలవు, సఫలత లభించజాలదు. భక్తి అనగా శ్రమ మరియు జ్ఞానం అనగా ప్రేమ. ఒకవేళ భక్తి యొక్క అంశం ఉంటే తప్పకుండా శ్రమ చేయాల్సి ఉంటుంది మరియు భక్తి యొక్క ఆచారము-పద్ధతి ఏమిటంటే, ఎప్పుడైతే కష్టం వస్తుందో అప్పుడు భగవంతుడు గుర్తుకొస్తారు, లేదంటే నిర్లక్ష్యులుగా ఉంటారు. జ్ఞానీ-భక్తులు కూడా ఏం చేస్తారు? ఎప్పుడైనా ఏదైనా విఘ్నం వస్తే, అప్పుడు విశేషంగా స్మృతి చేస్తారు.
ఒకటేమో - సేవ కోసం స్మృతిలో కూర్చోవడము మరియు రెండవది - స్వయంలో లేనిదానిని నింపుకునేందుకు స్మృతిలో కూర్చోవడము. రెండింటిలో తేడా ఉంది. ఏ విధంగానైతే ఇప్పుడు కూడా విశ్వంలో అశాంతితో కూడిన వాయుమండలం ఉంది కనుక సేవ కోసం సంగఠిత రూపంలో విశేషంగా స్మృతి యొక్క ప్రోగ్రామ్‌ను తయారుచేస్తారు, అది వేరే విషయము. అది దాతగా అయి ఇవ్వడము కోసం చేస్తారు. అది యాచించడం కోసం చేయరు, ఇతరులకు ఇవ్వడం కోసం చేస్తారు. కనుక అది సేవ కోసం అయినట్లు. కానీ తమలో లేనిదానిని నింపుకునేందుకు అవసరమైన సమయంలో విశేషంగా స్మృతి చేస్తారు, అది నిర్లక్ష్యం యొక్క స్మృతి అవుతుంది. స్మృతి ఉంటుంది, మర్చిపోరు కానీ - మేము ఉన్నదే బాబాకు చెందినవారిగా, ఇంకెవరున్నారు అని అంటూ నిర్లక్ష్యపు స్మృతి ఉంటుంది. కానీ యథార్థమైన శక్తిశాలి స్మృతికి ప్రత్యక్ష ఋజువు ఏమిటంటే, సమయమనుసారంగా శక్తి అనేది హాజరవ్వాలి. నేను స్మృతిలోనే ఉంటాను - అని ఎవరెంతగా చెప్పినా కానీ స్మృతి యొక్క స్వరూపము - సఫలత. అంతేకానీ, ఏ సమయంలో స్మృతిలో కూర్చుంటారో, ఆ సమయంలో సంతోషం కూడా అనుభవమవుతుంది, శక్తి కూడా అనుభవమవుతుంది మరియు ఎప్పుడైతే కర్మలోకి, సంబంధ-సంపర్కంలోకి వస్తారో, ఆ సమయంలో సదా సఫలత ఉండదు - అన్నట్లు ఉండదు. అటువంటివారిని కర్మయోగి అని అనము. శక్తులు అనేవి శస్త్రాలు మరియు శస్త్రాలు ఏ సమయం కోసం ఉంటాయి? శస్త్రాలను సదా అవసరమైన సమయంలో ఉపయోగించడం జరుగుతుంది.
యథార్థ స్మృతి అనగా సదా సర్వ శక్తి సంపన్నము. సదా శక్తిశాలి శస్త్రాలు కలిగి ఉండాలి. పరిస్థితి రూపీ శత్రువు వచ్చినప్పుడు శస్త్రాలు పనిచేయకపోతే, వారినేమంటారు? శక్తిశాలి అంటారా లేక శస్త్రధారి అని అంటారా? ప్రతి కర్మలో స్మృతి అనగా సఫలత ఉండాలి. అటువంటివారినే కర్మయోగి అని అంటాము. కేవలం కూర్చున్న సమయంలో మాత్రమే యోగీ కాదు. మీ యోగం పేరు కూర్చున్న యోగి అనా లేక కర్మయోగి అనా? కర్మయోగి కదా. నిరంతరం కర్మలు ఉంటాయి మరియు నిరంతరం కర్మయోగులుగా ఉంటారు. కర్మ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు, నిద్రపోతున్నా సరే అక్కడ కూడా నిద్రపోయే కర్మను చేస్తున్నారు కదా. కనుక ఎలాగైతే కర్మ చేయకుండా ఉండలేరో, అలా ప్రతి కర్మను యోగం లేకుండా చేయలేరు. ఇటువంటివారిని కర్మయోగి అని అంటారు. అంతేకానీ, విషయమే అటువంటిది కదా, పరిస్థితులే అటువంటివి, సమస్యలే అటువంటివి, వాయుమండలమే అటువంటిది అని భావించకండి. ఇదే శత్రువు మరియు ఆ సమయంలో ఒకవేళ ఇలా అంటే, శత్రువు వచ్చేసాడు, అందుకే ఖడ్గాన్ని ఉపయోగించలేకపోయాను, ఖడ్గాన్ని కార్యంలో ఉపయోగించలేకపోయాను లేక ఖడ్గం అసలు గుర్తుకు రానే రాలేదు, లేదా ఖడ్గం పని చేయలేదు, ఇటువంటివారిని ఏమంటారు? శస్త్రధారి అని అంటారా? మీరు శక్తి సైన్యము. మరి సైన్యానికి శక్తి ఏమిటి? శస్త్రాలు. మరియు శస్త్రాలు అంటే సర్వ శక్తులు. కనుక రిజల్టు ఏం చూసారు? మెజారిటీవారిలో సదా అవసరమైన సమయంలో సర్వ శక్తులను ఆజ్ఞానుసారంగా నడిపించడములో లోపం కనిపించింది. అర్థం చేసుకుంటారు కూడా, కానీ సఫలతా-స్వరూపంలో సమయమనుసారంగా, శక్తిహీనంగా అన్నా అయిపోతారు లేదా కొద్దిగా అసఫలతను అనుభవం చేసి వెంటనే సఫలత వైపుకు నడవడం ప్రారంభిస్తారు. మూడు రకాల వారిని చూసాము.
మొదటి రకంవారు - అదే సమయంలో బుద్ధి ద్వారా - ఇది సరైనది కాదు, చేయకూడదు అని అర్థం చేసుకుంటారు, కానీ ఆ వివేకాన్ని శక్తి స్వరూపంలోకి మార్చలేరు.
రెండవ రకంవారు - అర్థం చేసుకుంటారు కూడా, కానీ అర్థం చేసుకుంటున్నప్పటికీ సమయం గడిచిపోయిన తర్వాత లేక సమస్య పూర్తయిన తర్వాత ఆలోచిస్తారు. మొదటి రకంవారు ఆ కొద్ది సమయంలో ఆలోచిస్తారు, రెండవ రకంవారు పూర్తయిన తర్వాత ఆలోచిస్తారు.
మూడవ రకంవారు - ఇది తప్పు అని అసలు రియలైజ్ అవ్వరు, సదా తమ తప్పును ఒప్పుగానే ఋజువు చేస్తారు అనగా సత్యతను రియలైజ్ అయ్యే శక్తి లేదు. మరి నేను ఎవరిని అని స్వయాన్ని చెక్ చేసుకోండి.
బాప్‌దాదా ఏం చూసారంటే, వర్తమాన సమయమనుసారంగా సదా మరియు సహజ సఫలతను ఏ పిల్లలు ప్రాప్తి చేసుకున్నారు. వారిలో కూడా తేడా ఉంది. ఒకరేమో - సహజంగా సఫలతను ప్రాప్తి చేసుకునేవారు మరియు రెండవవారు, శ్రమ మరియు సహజము - ఈ రెండింటి తర్వాత సఫలతను పొందేవారు. ఎవరైతే సహజంగా మరియు సదా సఫలతను ప్రాప్తి చేసుకుంటారో, వారి మూల ఆధారము ఏం చూసారు? ఏ ఆత్మలైతే సదా స్వయాన్ని నిర్మాన-చిత్తము అనే విశేషత ద్వారా నడిపిస్తూ ఉంటారో, వారే సహజంగా సఫలతను ప్రాప్తి చేసుకుంటూ వచ్చారు. ‘నిర్మానము’ అనేది కేవలం ఒక పదమే కానీ నిర్మాన-స్థితి యొక్క విస్తారము మరియు సమయమనుసారంగా నిర్మాన-స్థితి యొక్క రకాలు... ఇవి చాలా ఉన్నాయి. దీని గురించి తర్వాత ఎప్పుడైనా వినిపిస్తాము. కానీ ఇది గుర్తుంచుకోండి, నిర్మానముగా అవ్వడమే స్వమానము మరియు సర్వుల ద్వారా గౌరవాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సహజ సాధనము. నిర్మానముగా అవ్వడము అనగా వంగడము కాదు, కానీ తమ విశేషత మరియు ప్రేమలో సర్వులను వంగేలా చేయడము. అర్థమయిందా?
అందరూ రిజల్ట్ విన్నారు. సమయం మీ కోసం ఎదురు చూస్తూ ఉంది కానీ మీరేం చేస్తున్నారు? మీరు సమయం కోసం ఎదురు చూస్తున్నారా? మీరు యజమానికి బాలకులు కదా. కనుక సమయం మీ కోసం ఎలా ఎదురు చూస్తుందంటే, నా ఈ యజమానులు సమయమునైన నన్ను పరివర్తన చేస్తారు. అది ఎదురు చూస్తూ ఉంది కానీ మీరు ఏర్పాట్లు చేయాలి, ఎదురు చూడకూడదు. సర్వులకు సందేశమిచ్చే మరియు సమయాన్ని సంపన్నం చేసే ఏర్పాట్లు చేయాలి. ఎప్పుడైతే ఈ రెండు కార్యాలు సంపన్నమవుతాయో, అప్పుడు సమయం యొక్క ఎదురు చూపు పూర్తవుతుంది. మరి ఇటువంటి ఏర్పాట్లను అందరూ చేస్తున్నారా? ఏ వేగంతో? సమయాన్ని చూసి మీరు కూడా అంటారు, సమయం చాలా వేగంగా గడుస్తూ ఉంది అని. ఇన్ని సంవత్సరాలు ఎలా పూర్తి అయ్యాయి అని ఆలోచిస్తారు కదా! అవ్యక్త బాబా యొక్క పాలన మొదలై ఎన్ని సంవత్సరాలైంది! సమయం ఎంత వేగంగా గడిచిపోయింది! మరి మీ వేగం ఎలా ఉంది? ఫాస్ట్‌గా ఉందా? లేక ఫాస్ట్‌గా వెళ్ళి అప్పుడప్పుడు అలసిపోయి విశ్రాంతి తీసుకుంటారా? చేస్తున్నారు, డ్రామా యొక్క బంధనంలోనైతే బంధింపబడే ఉన్నారు. కానీ వేగం ఎలా ఉంది, ఇది చెక్ చేసుకోండి. సేవ జరుగుతూ ఉంది, పురుషార్థము జరుగుతూ ఉంది, ముందుకు వెళ్తున్నారు, ఇదైతే బాగానే ఉంది. కానీ ఇప్పుడు వేగాన్ని చెక్ చేసుకోండి, కేవలం నడవడాన్ని మాత్రమే చెక్ చేసుకోకండి. వేగాన్ని చెక్ చేసుకోండి, స్పీడ్‌ను చెక్ చేసుకోండి, అర్థమయిందా? అందరూ తమ పనులు చేసుకుంటున్నారు కదా. అచ్ఛా!
నలువైపులా ఉన్న సదా తండ్రి ఎదురుగా ‘సరే బాబా’ అని అనేవారు, సదా మాస్టర్ సర్వశక్తిమంతులుగా అయి సర్వ శక్తులను స్వయం యొక్క ఆజ్ఞానుసారంగా నడిపించేవారు, సర్వ శక్తులు ‘చిత్తం ప్రభు’ యొక్క పాత్రను అభినయించే - ఇటువంటి సదా సఫలతామూర్తి ఆత్మలకు, సదా ప్రతి కర్మలో స్మృతి స్వరూపాన్ని అనుభవం చేసే మరియు చేయించేవారు - ఇటువంటి అనుభవీ ఆత్మలకు సదా ప్రతి కర్మలో, సంబంధంలో, సంపర్కంలో నిర్మానులుగా అయి విజయీ-రత్నాలుగా అయ్యేవారు, ఇటువంటి సహజ సఫలతామూర్తులైన శ్రేష్ఠమైన పిల్లలకు బాప్‌దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
అవ్యక్త బాప్‌దాదాతో వ్యక్తిగత మిలనము
గ్రూప్ నం.1:- సాధారణ కర్మలలో కూడా ఉన్నతమైన స్థితి యొక్క మెరుపును చూపించడమే ఫాలో ఫాదర్ చేయడము
సదా సంగమయుగీ పురుషోత్తమ ఆత్మను - ఇలా అనుభవం చేస్తున్నారా? సంగమయుగము యొక్క పేరే పురుషోత్తమము అనగా పురుషుల నుండి ఉత్తమ పురుషులుగా తయారుచేసే యుగము. మరి మీరు సంగమయుగమువారేనా? మీరందరూ పురుషోత్తములుగా అయ్యారు కదా. ఆత్మ పురుష్ మరియు శరీరము ప్రకృతి. కనుక పురుషోత్తమము అనగా ఉత్తమమైన ఆత్మను. అందరికన్నా నంబర్‌వన్ పురుషోత్తములు ఎవరు? (బ్రహ్మా బాబా) అందుకే బ్రహ్మాను ఆది దేవ్ అని అంటారు. ‘ఫరిశ్తా బ్రహ్మా’ కూడా ఉత్తమమైనవారిగా అయ్యారు మరియు తర్వాత భవిష్యత్తులో దేవాత్మగా తయారైన కారణంగా పురుషోత్తమునిగా అవుతారు. లక్ష్మీ-నారాయణులను కూడా పురుషోత్తములని అంటారు కదా. కావున ఇది పురుషోత్తమ యుగము, పురుషోత్తమముగా ఉన్నది ఆత్మనైన నేను. పురుషోత్తమ ఆత్మల కర్తవ్యము కూడా సర్వ శ్రేష్ఠమైనది. లేచారు, తిన్నారు-తాగారు, పనులు చేసారు, ఇలాంటి సాధారణ కర్మలు కాదు, సాధారణ కర్మలు చేస్తూ కూడా శ్రేష్ఠమైన స్మృతి, శ్రేష్ఠమైన స్థితి ఉండాలి. వారిని చూస్తూనే ఎలాంటి అనుభూతి కలగాలంటే - వీరు సాధారణమైన వ్యక్తి కాదు. ఏ విధంగానైతే అసలైన వజ్రం ఉంటుంది, అది ఎంత ధూళిలో దాగి ఉన్నా కానీ, తన మెరుపును తప్పకుండా చూపిస్తుంది, దాగి ఉండలేదు. మరి మీ జీవితము వజ్రతుల్యమైనది కదా.
ఎలాంటి వాతావరణంలో ఉన్నా కానీ, ఎలాంటి సంగఠనలో ఉన్నా కానీ, ఎలాగైతే వజ్రము తన మెరుపును దాచిపెట్టలేదో, అలా పురుషోత్తమ ఆత్మల శ్రేష్ఠమైన మెరుపు అందరికీ అనుభవమవ్వాలి. మరి ఇలా ఉన్నారా లేక ఆఫీసుకు వెళ్ళి, పనిలోకి వెళ్ళి మీరు కూడా అలాగే సాధారణంగా అయిపోతారా? ఇప్పుడు గుప్తంగా ఉన్నారు, పని కూడా సాధారణమైనది, అందుకే పాండవులను గుప్త రూపంలో చూపించారు. గుప్త రూపంలో రాజ్యం చేయలేదు, సేవ చేసారు. కావున ఇతరుల రాజ్యంలో గవర్నమెంట్-సర్వెంట్‌గా పిలవబడతారు కదా. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కానీ సేవకులే కదా. కావున గుప్త రూపంలో మీరందరూ సేవాధారులు కానీ సేవాధారులుగా ఉంటూ కూడా మీరు పురుషోత్తములు. కావున ఆ మెరుపు మరియు నషా కనిపించాలి.
ఏ విధంగానైతే బ్రహ్మా బాబా సాధారణ తనువులో ఉన్నప్పటికీ కూడా పురుషోత్తమునిగా అనుభవమయ్యేవారు. అందరూ విన్నారు కదా. చూసారా లేక విన్నారా? ఇప్పుడు అవ్యక్త రూపంలో కూడా ఏం చూస్తారంటే - సాధారణ రూపములో పురుషోత్తముని మెరుపు! కావున ఫాలో ఫాదర్ చేయాలి కదా. అంతేకానీ, సాధారణమైన పని చేస్తున్నామని కాదు. మాతలు భోజనం తయారుచేస్తున్నారు, బట్టలు ఉతుకుతున్నారు - పని సాధారణమైనది కావచ్చు, కానీ స్థితి సాధారణంగా ఉండకూడదు, స్థితి మహాన్‌గా ఉండాలి. ఇలా ఉన్నారా? లేక సాధారణ కర్మలు చేస్తూ సాధారణంగా అవుతున్నారా? ఇతరులు ఎలాగో, మనము అలాగే - అన్నట్లు ఉండకూడదు. ముఖంపై ఆ శ్రేష్ఠ జీవితం యొక్క ప్రభావం ఉండాలి. ఈ ముఖమే దర్పణం కదా. దీని ద్వారానే మీ స్థితిని చూసుకోగలరు. మహాన్‌గా ఉన్నారా లేక సాధారణంగా ఉన్నారా, అది ఈ ముఖము అనే దర్పణం ద్వారా చూడగలరు. అది స్వయము కూడా చూసుకోగలరు మరియు ఇతరులు కూడా చూడగలరు. మరి ఇలా అనుభవం చేస్తున్నారా? సదా స్మృతి మరియు స్థితి శ్రేష్ఠంగా ఉండాలి. స్థితి శ్రేష్ఠంగా ఉన్నట్లయితే మెరుపు స్వతహాగా శ్రేష్ఠంగా ఉంటుంది.
ఎవరైతే సమాన స్థితి కలవారు ఉంటారో, వారు సదా తండ్రితో పాటు ఉంటారు. శరీరంతో ఏ మూలన కూర్చున్నా, ఒక పక్కన కూర్చున్నా, వెనుక కూర్చున్నా, మనసు యొక్క స్థితి ద్వారా తోడుగా ఉంటారు కదా. ఎవరైతే సమానంగా ఉంటారో, వారే తోడుగా ఉంటారు. స్థూలంగా ఎదురుగా కూర్చున్నా కానీ సమానంగా లేకపోతే సదా తోడుగా ఉండరు, ఒక పక్కకు ఉంటారు. కావున సమీపంగా ఉండడము అనగా సమాన స్థితిని తయారుచేసుకోవడము, అందుకే సదా బ్రహ్మా బాబా సమానంగా పురుషోత్తమ స్థితిలో స్థితులై ఉండండి. లౌకిక పరంగా కూడా చాలా మంది పిల్లల యొక్క ముఖము మరియు నడవడిక తండ్రి సమానంగా ఉంటే - వీరైతే తండ్రి వలె ఉన్నారు అని అంటారు. అయితే ఇక్కడ ముఖానికి సంబంధించిన విషయము కాదు, కానీ నడవడికయే చిత్రము. కావున ప్రతి నడవడిక ద్వారా తండ్రి యొక్క అనుభవం అవ్వాలి, దీనిని తండ్రి సమానము అని అంటాము. మరి సమీపంగా ఉండాలనుకుంటున్నారా లేక దూరంగానా? సంగమంలో, ఈ ఒక్క జన్మలో, స్థితిలో ఎవరైతే సమీపంగా ఉంటారో, వారు పరంధామంలో కూడా సమీపంగా ఉంటారు మరియు రాజధానిలో కూడా సమీపంగా ఉంటారు. ఒక్క జన్మలోని సమీపత అనేక జన్మలకు సమీపంగా ఉండేలా చేస్తుంది.
ప్రతి కర్మను చెక్ చేసుకోండి. తండ్రి సమానంగా ఉంటే చేయండి, లేదంటే మార్చుకోండి. మొదట చెక్ చేసుకోండి, ఆ తర్వాత చేయండి. అంతేకానీ, చేసిన తర్వాత - ఇది సరిగ్గా లేదు అని చెక్ చేసుకోవడము కాదు. జ్ఞాని యొక్క లక్షణము ఏమిటంటే - మొదట ఆలోచించాలి, ఆ తర్వాత చేయాలి. అజ్ఞాని యొక్క లక్షణము - చేస్తారు, ఆ తర్వాత ఆలోచిస్తారు. మరి మీరు ‘‘జ్ఞానయుక్త ఆత్మలు’’ కదా. లేక అప్పుడప్పుడు భక్తులుగా అవుతారా? పంజాబ్వారు ధైర్యవంతులు కదా. మనసుతో కూడా ధైర్యవంతులు. మాయ కొద్దిగా చీమ రూపంలో వస్తే భయపడడము అన్నట్లు కాదు. మీరు ఛాలెంజ్ చేసేవారు. విద్యార్థులు ఎప్పుడైనా పరీక్షకు భయపడతారా? మరి మీరు ధైర్యవంతులా లేక చిన్న పరీక్షకు కూడా భయపడేవారా? యోగ్యులైన విద్యార్థులు ఎవరైతే ఉంటారో - వారు, త్వరగా పరీక్షలు అవ్వాలి మరియు పై క్లాసుకు వెళ్ళాలి అని ఆహ్వానిస్తారు. ఎవరైతే బలహీనంగా ఉంటారో, వారు - తారీఖు వాయిదా అవ్వాలి అని ఆలోచిస్తారు. మీరైతే తెలివైనవారు కదా.
మేమే కల్ప-కల్పము యొక్క విజయులము మరియు మేమే పదే-పదే అలా అవుతాము, ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి. ఇంతటి పురుషార్థం చేసారా? మీరు అవ్వకపోతే ఇంకెవరు అవుతారు? మీరే ఇంతకుముందు కూడా విజయులుగా అయ్యారు, ఇప్పుడు విజయులుగా అయ్యారు మరియు విజయులుగా ఉంటారు. ‘విజయి’ అన్న పదం పలకడంతోనే ఎంత సంతోషం కలుగుతుంది! ముఖం మారిపోతుంది కదా. ఎవరైతే సదా విజయులుగా ఉంటారో, వారు ఎంత సంతోషంగా ఉంటారు! అందుకే ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా క్షేత్రంలో విజయం ప్రాప్తి చేసుకుంటే సంతోషపు వాయిద్యాలు మోగుతాయి. మీకైతే సదా వాయిద్యాలు మోగుతాయి. ఎప్పుడూ సంతోషపు వాయిద్యాలు ఆగకూడదు. అర్థకల్పం కొరకు ఏడవడము సమాప్తమైపోయింది. ఎక్కడైతే సంతోషపు వాయిద్యాలు మోగుతాయో, అక్కడ ఏడవడము జరగదు. అచ్ఛా!
గ్రూప్ నం. 2 :- యథార్థ నిర్ణయానికి ఆధారం - నిశ్చయబుద్ధి మరియు నిశ్చింత స్థితి
సదా తమను తాము విజయి రత్నాలుగా అనుభవం చేసుకుంటున్నారా? సదా విజయిగా అవ్వడానికి సహజ సాధనం ఏమిటి? సదా విజయిగా అవ్వడానికి సహజ సాధనం ఒకే బలం ఒకే నమ్మకం. ఒక్కరిపై నమ్మకం మరియు ఆ ఒక్క నమ్మకం నుండే ఒకే బలం లభిస్తుంది. నిశ్చయం సదా నిశ్చింతగా తయారుచేస్తుంది. నాకు నిశ్చయం ఉంది అని ఎవరైనా భావిస్తే, దానికి గుర్తు ఏమిటంటే వారు సదా నిశ్చింతగా ఉంటారు మరియు నిశ్చింత స్థితితో ఏ కార్యం చేసినా అందులో తప్పక సఫలమవుతారు. నిశ్చింతగా ఉన్నప్పుడు బుద్ధి జడ్జిమెంట్ యథార్థంగా చేస్తుంది. ఏదైనా చింత ఉంటే, బెంగ ఉంటే, అలజడి ఉంటే ఎన్నడూ జడ్జిమెంట్ సరిగ్గా ఉండదు. త్రాసును చూశారు కదా. త్రాసులో అలజడి లేనప్పుడే దాని తూకం యథార్థంగా ఉంటుంది. అలజడి ఉంటే యథార్థమైనది అని అనరు. అలాగే బుద్ధిలో అలజడి, బెంగ, చింత ఉంటే తప్పకుండా అలజడి జరుగుతుంది.
అందుకే యథార్థ నిర్ణయానికి ఆధారం - నిశ్చయబుద్ధి, నిశ్చింత. ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఫాలో ఫాదర్ కదా. ఇది చేయాలా, అది చేయాలా... అని స్వంతంగా ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఆలోచించాలి. చేయాల్సింది ఫాలో కదా. కాబట్టి ఫాలో చేయడానికి ఆలోచించవలసిన అవసరం లేదు. అడుగులో అడుగు వేయాలి. అడుగే శ్రీమతం. లభించిన శ్రీమతం ప్రకారం నడవడమే అడుగులో అడుగు వేయడం. మరి ఆలోచించవలసిన అవసరం ఉందా? లేదు కదా. నిశ్చింతగా ఉంటే సదా యథార్థ నిర్ణయమే ఇస్తారు. నిర్ణయం యథార్థంగా ఉన్నప్పుడు విజయిగా అవుతారు. నిర్ణయం సరిగ్గా లేదంటే తప్పకుండా అలజడి ఉన్నట్లే. ఏ అలజడి వచ్చినా బ్రహ్మా బాబా ఏమి చేశారు అని ఆలోచించండి? ఎందుకంటే బ్రహ్మా బాబా కర్మలకు శాంపిల్. బ్రహ్మా బాబా ప్రతి అడుగూ శ్రీమతంపైనే వేశారు. కాబట్టి ఫాలో ఫాదర్. కేవలం ఫాలో చేయడమే, కొత్త మార్గాన్ని కనిపెట్టనవసరం లేదు, ఆలోచించనవసరం లేదు. మన్మతాన్ని మిక్స్ చేసినప్పుడే కష్టమవుతుంది. ఒకటి - కష్టమవుతుంది, రెండవది - అసఫలత. శ్రమ అయితే చేశారు కదా. పల్లెటూరిలో వ్యవసాయం పని చేస్తున్నప్పుడు ఎంతో శ్రమ పడతారు. ఇక్కడైతే శ్రమ పడనవసరం లేదు. సహజం ఇష్టమా లేక శ్రమా? శ్రమ పడి, అనుభవం చేసి చూసేశారు.
ఇప్పుడు శ్రమను వదిలి ప్రేమలో ఉండండి, లవ్లీన్గా ఉండండి అని బాబా అంటున్నారు. ఎవరైతే ప్రేమలో లీనమై ఉంటారో వారు శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. బ్రాహ్మణులు అనగా ఆనందం, బ్రాహ్మణులు అనగా శ్రమ కాదు. బాబా చెప్పారు, పిల్లలు చేశారు - ఇందులో శ్రమ పడే విషయమేముంది! చేయడం పిల్లల పని, ఆలోచించడం కాదు. సహజయోగులే కదా. సదా విజయి రత్నాలే కదా. మనం కాకపోతే ఇంకెవరు అవుతారు అనే ఈ ఆత్మిక నిశ్చయం కావాలి! ఇంతటి స్థిర నిశ్చయం ఉండాలి. ఫాలో ఫాదర్ చేస్తున్నప్పుడు ఇంకెవరు అవుతారు. వారే అవుతారు కదా. నిశ్చయం అంటే నిశ్చయమే కదా. ఒకవేళ నిశ్చయంలో 10 పర్సెంట్, 20 పర్సెంట్ తక్కువైనా దాన్ని నిశ్చయం అని అనరు.
ఎవరైతే సదా విజయిగా ఉంటారో వారినే నిశ్చింత చక్రవర్తి అంటాము. ఇప్పుడు ఎవరైతే చక్రవర్తిగా అవుతారో వారే భవిష్యత్తులో చక్రవర్తిగా అవుతారు. ఇప్పుడు నిశ్చింత చక్రవర్తిగా కాకపోతే భవిష్యత్తులోనూ కాలేరు. మరి రాజులుగా అయ్యేవారా లేక ఇతరులు రాజ్యం చేస్తుంటే చూసేవారా? స్వరాజ్యం ఉంటేనే విశ్వరాజ్యం ఉంటుంది. అలాంటి అధికారులుగా ఉన్నారా? ఏం చేస్తాం, సంస్కారం పక్కాగా ఉంది అని అధీనం అయిపోవడం లేదు కదా? కోరుకోవట్లేదు కానీ జరిగిపోతుంది అని ఇలా అయితే లేదు కదా? దీనిని అధీనం అంటాము. మరి ఎన్నడూ అధీనం అయిపోవట్లేదు కదా? కోపం చేయాలని అనుకోము కానీ వచ్చేస్తుంది. అనుకోము కానీ నిస్సహాయులం అయిపోతాము. కాదు. అధికారులుగా అయినప్పుడు అధీనత సమాప్తమైపోయింది. ఎలా కావాలంటే, ఏది కావాలంటే అది చేయగలరు. “అనుకోము కానీ జరిగిపోతుంది, పురుషార్థం చేస్తున్నాము, అవుతుందిలే” అనేవి అధికారి సంకల్పంలో ఎన్నడూ రావు. దీనిని బట్టి అధీనంలో ఉన్నారని స్పష్టమవుతుంది. అధీనంలో ఉండేవారు అధికారి కారు. అధికారిగా ఉండేవారు అధీనంలో ఉండరు. అయితే రాత్రి ఉంటుంది, లేదా పగలు ఉంటుంది. రెండూ కలిసి ఉండవు. ‘అధికారం’ మరియు ‘అధీనత’ రెండూ కలిసి నడవలేవు. మాతలు అధికారులుగా అయ్యారా? ప్రజలు ఎక్కడ పడేశారు, బాబా ఎక్కడ కూర్చోబెట్టారు! ప్రజలు కాలి చెప్పుగా మార్చేస్తే బాబా తలపై కిరీటంగా చేశారు. సంతోషం ఉంది కదా. ఎక్కడ చెప్పు, ఎక్కడ కిరీటం - ఎంత తేడా ఉంది! ఇప్పుడైతే శక్తిస్వరూపులుగా అయ్యారు. పాండవులను కూడా శక్తిరూపంలో చూస్తారు కదా. శివశక్తులు కూడా విజయులే, పాండవులు కూడా విజయులే. అవినాశి నిశ్చయం, అవినాశి నషా ఉంటే సదా విజయం నిశ్చితము. అచ్ఛా!
గ్రూప్ నం. 3 :- సదా ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ సంతోషం అనే ఔషధాన్ని తీసుకోండి
అందరూ తమను తాము అదృష్టవంతులైన ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? ఎవరైతే అదృష్టవంతులైన ఆత్మలో వారి మనసులో సదా సంతోషపు పాటలు మోగుతాయి. “వాహ్ నా శ్రేష్ఠ భాగ్యము!” అనే ఈ పాట మోగుతుంది కదా. ఈ సంతోషపు పాట పాడటం అందరికీ వచ్చు కదా. వృద్ధులైనా, పిల్లలైనా, యువకులైనా అందరూ పాడతారు. మనసులో మోగేందుకు ఇది తప్ప ఇంకేముంది. ఈ సంతోషపు పాటలే మోగుతాయి కదా. మిగిలిన విషయాలన్నీ సమాప్తమైపోయాయి. అంతే, బాబా మరియు నేను, మూడవవారు ఎవరూ లేరు. ఇలాంటి స్థితి తయారైనప్పుడు “వాహ్ బాబా వాహ్, వాహ్ నా భాగ్యము వాహ్!” అనే సంతోషపు పాటలు మోగుతాయి. అయినా ‘సంతోషం’ అన్నింటికంటే పెద్ద ఆహారము, సంతోషం లాంటి ఆహారము ఇంకొకటి లేదు అని గానం చేయబడి ఉంది. సంతోషం అనే ఔషధాన్ని తినేవారు సదా ఆరోగ్యంగా, హెల్దీగా ఉంటారు, ఎన్నడూ బలహీనపడరు. మంచి ఆహారం తినేవారు శరీరంతో బలహీనపడరు. సంతోషం మనస్సుకు మందువంటిది. మనస్సు ఎన్నడూ బలహీనపడదు, సదా శక్తిశాలిగా ఉంటుంది. మనస్సు మరియు బుద్ధి సదా శక్తిశాలిగా ఉంటే స్థితి శక్తిశాలిగా ఉంటుంది. అలాంటి శక్తిశాలి స్థితి ఉన్నవారు సదా అచలంగా-అడోలంగా ఉంటారు. మరి సంతోషం అనే ఆహారాన్ని తింటున్నారా? లేక అప్పుడప్పుడు తిని, అప్పుడప్పుడు మరచిపోతున్నారా? అలా జరుగుతుంది కదా. శరీరానికి కూడా బలాన్నిచ్చే పదార్థాలను ఇస్తే కొన్నిసార్లు తింటారు, కొన్నిసార్లు మరచిపోతారు. ఈ ఆహారాన్ని ఏ సమయంలో తింటారు? అప్పుడప్పుడు తిని, అప్పుడప్పుడు తినకుండా ఉండటం అలా అయితే లేదు కదా.
బాబా తనవారిగా చేసుకున్నారు అనేదే అన్నింటికంటే పెద్ద సంతోషకరమైన విషయం! భగవంతుని దృష్టి ఒక్క సెకను పడితే చాలు అని ప్రపంచంలోనివారు పరితపిస్తుంటారు, కానీ మీరు సదా నయనాలలో ఇమిడిపోయి ఉన్నారు! వారైతే ఒక్క ఘడియ దృష్టి అంటారు, మీరైతే ఏకంగా బాబా దృష్టిలోనే నివసిస్తున్నారు. అందుకే నూరే రత్న, కళ్ళ వెలుగు అనే టైటిల్ ఉంది. వారేమో పరితపిస్తున్నారు, మీరేమో ఇమిడిపోయారు. వీరినే అదృష్టవంతులు అంటాము. అనుకోలేదు కానీ అయిపోయారు. తమ భాగ్యాన్ని చూసుకుని నషాలో ఉంటున్నారు కదా. వాహ్-వాహ్! ఇప్పుడు ‘హాయ్-హాయ్’ అని అయితే అనట్లేదు కదా. ఎప్పుడైనా ‘హాయ్-హాయ్’ అంటారా? కొద్దిగా దుఃఖపు అల అనుభవమైనా ‘హాయ్-హాయ్’ అన్నట్లేదు కదా. “అయ్యో! ఇలా జరగకూడదు, ఇలా జరిగిపోయిందే...” అని ఎప్పుడైనా దుఃఖపు అల వస్తుందా? సుఖదాత పిల్లలకు దుఃఖం ఎక్కడి నుండి వస్తుంది? సాగరుని పిల్లలై ఉండి నీరు ఎండిపోతే ఏమంటాము? దుఃఖపు అల సమాప్తమైందా? ఎప్పుడైనా తనువు యొక్క, ధనం యొక్క, అనారోగ్యం యొక్క దుఃఖం కలుగుతుందా? ఎప్పుడైనా మనవలు-మనవరాళ్ళు అనారోగ్యం పాలైతే, వ్యవసాయంలో నష్టం వస్తే దుఃఖం కలుగుతుందా?
మనం సుఖదాత పిల్లలమైన మాస్టర్ సుఖదాతలము అనే ఈ స్మృతి సదా ఉండాలి. దాత వద్ద ఉన్నప్పుడే కదా ఇస్తారు. మరి మాస్టర్ దాతగా అయ్యేంత ఉందా? తనకే తినడానికి లేనివాడు దాతగా ఎలా మారగలడు. అందుకే తండ్రి ఎలాగో పిల్లలు అలాగే ఉంటారు. బాబాను సాగరుడు అంటారు. సాగరుడు అనగా అపరిమితమైనది, తరిగిపోనిది. సాగరాన్ని ఎంత ఎండగట్టినా అది తరగదు. మరి మీరు కూడా మాస్టర్ సాగరులే తప్ప నదులు, కాలువలు కారు. భాగ్యవిధాతే బాబా అయ్యారు. కాబట్టి బాబా వద్ద ఉన్నదంతా పిల్లలదే. భాగ్యము మీ ఆస్తి. ఆస్తిని సంభాళించడం వచ్చా? లేక పోగొట్టుకునేవారా? చాలామంది పిల్లలకు సంభాళించడం రాక సమాప్తం చేసేస్తారు, కొందరికి చక్కగా సంభాళించడం వచ్చి దాన్ని వృద్ధి చేస్తారు. మీరు ఎవరు? వృద్ధి చేసేవారు. ఇలాంటి భాగ్యం మొత్తం కల్పంలో ఇప్పుడే లభిస్తుంది. కాబట్టి ఇలాంటి అమూల్యమైన వస్తువును వృద్ధి చేయాలి తప్ప పోగొట్టుకోకూడదు. వృద్ధి చేయడానికి సాధనం - పంచడం.
ఇతరులను ఎంతగా భాగ్యవంతులుగా చేస్తారో అనగా భాగ్యాన్ని పంచుతారో అంతగా భాగ్యం పెరుగుతూ ఉంటుంది. బ్రహ్మా భాగ్యాన్ని పంచినప్పుడు నిద్రపోతున్నారా ఏంటి అనే గానం ఉంది కదా? మరి బ్రహ్మా భాగ్యాన్ని పంచారు, బ్రహ్మాకుమార్-కుమారీలు ఏమి చేస్తారు? భాగ్యాన్ని పంచుతారు కదా. ఎంత పంచితే అంత పెరుగుతుంది. ఇతర ధనం ఖర్చు చేస్తే తగ్గుతుంది, కానీ ఈ భాగ్యం ఎంత ఖర్చు చేస్తే అంత పెరుగుతుంది. సంపాదించడంలో పాండవులు నిపుణులు. ఎందుకంటే ఒక్క జన్మ జమ చేసుకునేది మరియు అనేక జన్మలు తినేది అని తెలుసు. సత్యయుగంలో సంపాదన చేస్తారా ఏంటి? హాయిగా తింటూ ఉంటారు. ఒక్క జన్మ పురుషార్థం మరియు అనేక జన్మల ప్రాలబ్ధం. కాబట్టి జన్మజన్మల కొరకు ఈ ఒక్క జన్మలోనే పోగు చేసుకోవాలి. అచ్ఛా! అందరూ సంతుష్టంగా ఉన్నారు కదా. బ్రాహ్మణ జీవితంలో సంతుష్టంగా ఉండకపోతే ఇక ఎప్పుడు ఉంటారు. సంతుష్టత యొక్క మజా ఇప్పుడే ఉంది. సంతుష్టంగా ఉండటమే బ్రాహ్మణ జీవితపు లక్షణం. సంతుష్టంగా ఉంటే సంతోషంగా ఉన్నట్లే, ఒకవేళ సంతుష్టంగా లేకపోతే సంతోషంగా లేనట్లే. అచ్ఛా!
గ్రూప్ నం. 4 :- డ్రామా జ్ఞానం యొక్క స్మృతి ప్రతి విఘ్నాన్నీ ‘నథింగ్-న్యూ’గా చేస్తుంది
తమను తాము సదా విఘ్న-వినాశక ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? లేక విఘ్నం వస్తే కంగారుపడేవారా? విఘ్న-వినాశక ఆత్మ సదా సర్వ శక్తులతో సంపన్నంగా ఉంటుంది. విఘ్నాలకు వశమయ్యేవారు కారు, విఘ్న-వినాశకులు. ఎప్పుడైనా విఘ్నాల ప్రభావం కొద్దిగా పడుతుందా? ఎప్పుడైనా ఎలాంటి విఘ్నం వచ్చినా - రావడం విఘ్నం పని, విఘ్న-వినాశకులుగా అవ్వడం మన పని అనే స్మృతి ఉంచుకోండి. పేరు విఘ్న-వినాశకుడు అని ఉన్నప్పుడు, విఘ్నం వచ్చినప్పుడే కదా వినాశనం చేసేది. కాబట్టి మా వద్దకే ఈ విఘ్నం ఎందుకు వస్తుంది అని ఎన్నడూ ఆలోచించకండి. విఘ్నం రావాల్సిందే మరియు మనం విజయిగా అవ్వాల్సిందే. కాబట్టి విఘ్న-వినాశక ఆత్మ విఘ్నానికి ఎన్నడూ భయపడదు, ఓటమి పాలు కాదు. అలాంటి ధైర్యము ఉందా? ఎందుకంటే ఎంత ధైర్యము ఉంచుకుంటే - పిల్లల ఒక వంతు ధైర్యము, బాబా వేయి రెట్ల సహాయం. మరి బాబా సహాయం ఇంతగా ఉన్నప్పుడు ఇక విఘ్నం కష్టమైనది ఎలా అవుతుంది? అందువల్ల ఎంత పెద్ద విఘ్నమైనా అనుభవం ఏమి అవుతుంది? ఇది విఘ్నం కాదు, ఆట అనిపిస్తుంది. ఆటలో ఎప్పుడైనా కంగారుపడతారా ఏంటి? ఆట ఆడటంలో సంతోషం కలుగుతుంది కదా! ఇలా ఆటగా భావించడం వల్ల కంగారుపడరు, చాలా సంతోషంగా విజయిగా అవుతారు. సదా డ్రామా జ్ఞానం యొక్క స్మృతితో ప్రతి విఘ్నాన్నీ ‘నథింగ్ న్యూ’గా భావిస్తారు. కొత్త విషయం కాదు, చాలా పాతది.
ఎన్నిసార్లు విజయిగా అయ్యారు? (అనేకసార్లు) గుర్తుందా లేక ఊరికే అంటున్నారా? డ్రామా రిపీట్ అవుతుందని విన్నారు కాబట్టి అంటున్నారా లేక అనేకసార్లు చేశామని అర్థం చేసుకుని అంటున్నారా? అదే విధంగా రిపీట్ అవుతుంది అనే డ్రామా పాయింట్ బుద్ధిలో స్పష్టంగా ఉంటే, ఆ నిశ్చయం ప్రకారం అదే విధంగా రిపీట్ అయినప్పుడు అనేకసార్లు రిపీట్ అయింది మరియు ఇప్పుడు రిపీట్ చేస్తున్నాము. కానీ ఇది నిశ్చయానికి సంబంధించిన విషయం. వచ్చే కల్పంలో వేరొకరు విజయిగా అయి, ఈ కల్పంలో మీరు విజయిగా అవ్వడం అనేది జరగదు. ఎందుకంటే తయారై ఉన్న డ్రామా అన్నప్పుడు, తయారై ఉంది మరియు తయారు చేస్తున్నాము అనగా రిపీట్ చేస్తున్నాము. అలాంటి నిశ్చయబుద్ధి అచలంగా-నిశ్చలంగా ఉంటారు.
అచల్‌ఘర్ ఎవరి స్మృతిచిహ్నం? జ్ఞాన రహస్యాలలో ఎవరైతే అచలంగా ఉంటారో వారి స్మృతిచిహ్నమే అచల్‌ఘర్. మరి ప్రాక్టికల్‌గా మన స్మృతిచిహ్నాన్ని మనం చూస్తున్నాము అనే నషా ఉంటుంది కదా. ఎవరైతే సదా విఘ్న-వినాశక స్థితిలో స్థితులై ఉంటారో వారు సదా డబల్ లైట్‌గా ఉంటారు. ఏమైనా భారం ఉందా? సర్వస్వాన్నీ నీదిగా చేసేశారా? లేక సగం నీది, సగం నాదా? 75 పర్సెంట్ బాబాది, 25 పర్సెంట్ నాదా? అప్పుడప్పుడు నీది అని, అవసరం వచ్చినప్పుడు నాది అని అంటారా? నాది-నాది అనుకుంటూ అనుభవం చేసుకున్నారు, ఏమి లభించింది? నీది అనడం ద్వారా సంపూర్ణులుగా అవుతారు. నాది-నాది అంటే ఖాళీ అయిపోతారు. సదా డబల్ లైట్ అనగా సర్వస్వం నీదే. కొద్దిగానైనా మోహము ఉంటే నాది ఉన్నట్లే. నీది అనగా నిర్మోహి.
గ్రూప్ నం. 5 :- సర్వస్వాన్నీ సమర్పించి ఎవరెడీగా అవ్వండి
అందరూ ప్రతి అడుగులోనూ పదమాల సంపాదన జమ చేసుకునేవారిగా తమను భావిస్తున్నారా? ఎంత జమ చేశారు? కోట్లు, కోటానుకోట్లు - ఎంత జమ చేసుకున్నారు? లెక్కించగలరా? ఇప్పటి కంప్యూటర్ లెక్కించగలదా? మరి మొత్తం కల్పంలో మరియు ప్రపంచం మొత్తంలో ఇంతటి షాహుకారు ఎవరైనా ఉంటారా? మీరందరూ అలాగే ఉన్నారా? లేక కొందరు తక్కువ, కొందరు ఎక్కువగా ఉన్నారా? అందరూ సంపన్నులుగా ఉన్నారా? ప్రతి అడుగులోనూ పదమాల సంపాదన చేసే ఆత్మను నేను అనే నషా సదా ఉండాలి. లౌకిక ప్రపంచంలో తరతరాలు కూర్చుని తినేంత సంపాదించి పోగు చేయాలి అంటారు. మరి మీ ఎన్ని తరాలు తింటూ ఉంటాయి? ఒక్క జన్మలో అనేక జన్మల సంపాదనను జమ చేసుకున్నారు మరియు అనేక జన్మలు హాయిగా తింటూ ఉంటారు. సత్యయుగంలో అమృతవేళ లేచి యోగం చేస్తారా ఏంటి? యోగ సిద్ధిని అనుభవిస్తారు. పాస్ అయ్యేంతవరకే చదువు చదువుకున్నట్లుగా. మరి అనేక జన్మలకు సరిపడా జమ చేశారా? ఎప్పుడైనా వినాశనం జరిగినా మీది జమ అయి ఉంటుంది కదా. లేక ఇంకొంచెం సమయం దొరికితే మరికొంత చేసుకుంటాం అంటారా? ఇంకా సమయం కావాలా? ఎవరెడీగా ఉన్నారా? మీరు ఇక్కడికి వచ్చారు మరియు ఇక్కడే వినాశనం మొదలైతే సెంటర్ లేదా సెంటర్లోని వస్తువులు గుర్తుకొస్తాయా? ఏమీ గుర్తురావు. అంతటి నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారు కదా! శరీరమే తమది కానప్పుడు ఇక తమదైనది ఇంకేముంది! తనువు, మనస్సు, ధనము సర్వస్వం ఇచ్చేశారు కదా! సర్వస్వం నీదే అని సంకల్పం చేసినప్పుడు ఇక ఎవరెడీగా అయినట్లే కదా. నేను బాబావారిని మరియు బాబా నావారు అని అందరూ దృఢ సంకల్పం చేసుకున్నారు. సంకల్పం చేశారా లేక దృఢ సంకల్పం చేశారా? ఎలాంటి చింతా లేదు. ఏదైనా అలాంటి వార్త వస్తే చింత కలుగుతుందా? ఫ్లాట్ గుర్తుకురాదా? మంచిది, పక్కాగా ఉన్నారు. బ్రాహ్మణులుగా అయ్యేదే ఉంది అన్నప్పుడు పక్కాగానే అవ్వాలి, కచ్చాగా అవ్వడం వల్ల లాభం ఏమిటి! జీవించి ఉండగానే చనిపోయారా లేక కొద్దికొద్దిగా శ్వాస ఆడుతోందా? ఎక్కడైనా శ్వాస దాక్కుని ఉండలేదు కదా?
చూడండి, బాబాకు పిల్లలపై ప్రేమ ఉంది. మరి ప్రేమకు గుర్తు ఏమిటి? ప్రేమకు గుర్తు - ఎవరితోనైతే ప్రేమ ఉంటుందో వారిపై సర్వస్వాన్నీ త్యాగం చేస్తారు. మరి బాబా పూర్తి ఆస్తిని మీకే ఇచ్చేశారు కదా! తన కొరకు ఏమైనా ఉంచుకున్నారా? చూడండి, రోజూ ఇంత ప్రేమతో కూడిన ఉత్తరం రాసేలా ఎవరూ ప్రేమించలేరు. రోజూ ప్రియ-స్మృతులు లభిస్తున్నాయి కదా. పిల్లలకు ప్రేమ ఉన్నప్పుడే బాబా ప్రేమకు స్పందిస్తారు (రెస్పాండ్ ఇస్తారు). మీకు కూడా అంతే ప్రేమ ఉంది కదా. లేక బాబా కంటే ఎక్కువ ప్రేమ ఉందా? ప్రేమకు ఇంకొక గుర్తు ఏమిటంటే ఎవరితోనైతే ప్రేమ ఉంటుందో వారి నుండి ఎన్నడూ వేరు కారు. బాబా పిల్లలను ఎన్నడూ వేరు చేయరు, సదా తోడున్నారు మరియు సదా తోడుంటారు. తోడు పట్టుకోవడానికి ఇంకెవరూ లేనే లేరు. బాబా సమానంగా తయారయ్యే పురుషార్థాన్ని ఫాస్ట్ గతితో చేస్తున్నారు కదా. సమీపానికి వచ్చేవారే కదా. ఏ మాలలోకి రానున్నారు? (108) 16,108 లోకి వచ్చేవారు ఎవరూ లేరా? అంటే 108 మాల డబల్ విదేశీయులదే కావాలా? మంచిది, లక్ష్యాన్ని సదా శ్రేష్ఠంగా ఉంచుకోవడమే యథార్థ పురుషార్థం.
మనసా సేవ మరియు వాచా సేవ రెండూ చేస్తున్నారా లేక ఒకటే చేస్తున్నారా? డబల్ సేవ చేస్తున్నారా? ఏది సహజంగా అనిపిస్తుంది? (కొందరు మనసా సేవలో, కొందరు వాచా సేవలో చేతులెత్తారు, మరికొందరు రెండింటిలోనూ చేతులెత్తారు) రెండు అభ్యాసాలూ అవసరమే. ఎందుకంటే సమయానికి తగినట్లుగా సేవ చేయగలుగుతారు. కాబట్టి అన్నిచోట్లా సేవ బాగా నడుస్తుంది. విదేశాలలో సత్యయుగపు ఆది జనాభాలో నుండి ఎంతమందిని తయారుచేశారు? ఒక లక్ష మంది తయారయ్యారా? ఇండియా 8 లక్షలు చేస్తే ఫారిన్ కనీసం ఒక లక్ష అయినా చేయాలి. ఎప్పుడు చేస్తారు? ఎంత సమయం కావాలి? ఇప్పుడు అందరికీ సమాచారం వెళ్ళింది కదా! ఒక నెలలో ఒకరిని తయారుచేయగలరు కదా. సాధ్యమేనా? మరి 12 నెలల్లో ఎంతమంది అవుతారు? సమయం యజమానులైన మీ కొరకు ఎదురుచూస్తుంది. కనీసం 9 లక్షల మంది అయినా సిద్ధం కావాలి కదా. మనసా మరియు వాచా డబల్ సేవ ద్వారా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సేవను పెంచండి. సేవ యొక్క ఉత్సాహం బాగుంటుంది. కానీ సదా ముందుకు సాగుతూనే ఉండాలి. కాబట్టి సేవ పట్ల ఉత్సాహం ఉంది, ఈ ఉత్సాహాన్ని మరింత ముందుకు పెంచండి. పిల్లల పురుషార్థపు లగ్నము మరియు సేవా లగ్నము రెండింటినీ చూసి బాప్‌దాదా హర్షిస్తారు. అందువల్ల చాలా ఫాస్ట్ గతితో సిద్ధం చేయండి.
అందరూ ఎగిరే కళ గల ఆత్మలే కదా. డబల్ ఫారినర్స్ గట్టిగా ఉన్నారా? భయపడేవారు కారు కదా! డబల్ ఫారినర్స్ ఇప్పుడు ఒక పదాన్ని సదాకాలం కొరకు సమాప్తం చేయండి అని బాప్‌దాదా సదా అంటారు. ఏ పదం? (అప్పుడప్పుడు) మరి ఫినిష్ (సమాప్తం) చేశారా? లేక ఇప్పటికీ ‘సమ్‌టైమ్’ (అప్పుడప్పుడు) ఉందా! బాబా ప్రేమ సదా ఉన్నప్పుడు పిల్లల ప్రేమ కూడా సదా ఉండాలి. లేదా ‘సమ్‌టైమ్’ ఉందా? మరి ‘సమ్‌టైమ్’ అనే పదం ముగిసిపోయిందా? ఎందుకంటే ఇప్పటి నుండి సదా సంతోషంగా ఉండే, సదా శక్తిశాలిగా ఉండే అభ్యాసం చేస్తే బహు కాలం యొక్క పురుషార్థం అంతిమంలో పనికి వస్తుంది. ముందుముందు చూద్దాంలే అని ఎన్నడూ అనుకోకండి. అందరూ సంతుష్టంగా ఉన్నారా? దృష్టి లభించింది మరియు వరదానం లభించింది - “సమ్‌టైమ్ ఫినిష్”. ‘సదా’ అనే పదాన్ని సదా గుర్తుంచుకోండి.
ఈ సమయంలో అందరూ మధుబన్ నివాసులు. మధుబన్ నివాసిగా అవ్వడం బాగుంటుంది కదా. ఒరిజినల్ అడ్రస్ మధుబన్ కదా. ఇల్లు మధుబన్ మరియు సేవా స్థానానికి వెళ్ళారు. సమస్త విశ్వం యొక్క సేవ జరగాల్సి ఉంది, అందుకనే వేర్వేరు స్థానాలకు సేవ చేయడానికి వెళ్ళారు. కానీ అసలైన మధుబన్ నివాసులు మరియు భవిష్యత్తులోనూ భారతదేశంపైనే రాజ్యం చేయనున్నారు. భారతదేశమే అన్నిటికంటే మహాన్ మరియు అన్నిటికంటే సుందరమైనదిగా మారుతుంది.
మొదటిసారి వచ్చినవారికి సదా నంబర్‌వన్ తీసుకోవాలి అనే వరదానం ఉంది. నంబర్‌వన్ కావడానికి ప్రతి సమయం విన్ (విజయం సాధించేవారు) అయ్యేవారే వన్ అవుతారు. ఫాస్ట్ గతితో ఎగురుతూ ఉండండి. శక్తి ఉంది కదా. రెక్కలు బలంగా ఉన్నాయా? ఎవరివైనా బలహీనంగా లేవు కదా? జ్ఞానము మరియు యోగము అనే ఈ రెండు రెక్కలు బలంగా ఉంటే ఎగురుతూనే ఉంటారు. జ్ఞానము అనగా ప్రతి అడుగూ శ్రీమతంపై నడిచే అవగాహన. స్మృతి అనగా సదా బాబా తోడు యొక్క అనుభవం చేసుకోవడం. మరి రెండు రెక్కలూ బలంగా ఉన్నాయి కదా. ఎలాంటి బలహీనత ఉన్నా ఆ బలహీనత సహజాన్ని కష్టంగా మారుస్తుంది మరియు శక్తిశాలిగా ఉంటే కష్టమైనది సహజమైపోతుంది, అసంభవం కూడా సంభవమైపోతుంది. అంత పవర్‌ఫుల్‌గా ఉన్నారు కదా.
దాదీలతో మిలనము:- వర్తమాన సమయంలో ఏ బ్యాలెన్స్ నడుస్తుంది? ఒకవైపు ధమాల్ (అల్లకల్లోలం), ఇంకోవైపు కమాల్ (అద్భుతము). ఏది జరిగినా అద్భుతమే జరుగుతుంది కదా. ప్రతి రంగంలోనూ మీరైతే ముందుకు సాగుతున్నారు కదా. ప్రపంచంలో అల్లకల్లోలం ఉంది మరియు మీ వద్ద సమాచారాలలో అద్భుతము ఉంది. ఎంతటి అల్లకల్లోలం ఉంటే అంతగా మీ అద్భుతము ఉంటుంది మరియు ప్రత్యక్షమవుతూ వెళ్తారు. ప్రపంచంలోనివారు భయపడుతున్నారు మరియు మీరు మరింత నిర్భయంగా అవుతున్నారు. నిర్భయంగా ఉన్నారా లేక అల్లకల్లోలానికి భయపడుతున్నారా? ఎంతటి అల్లకల్లోలాన్ని చూస్తే అంతగా నేడు అల్లకల్లోలం ఉంది, రేపు మన అద్భుతము జరిగే ఉంది అని అనుకుంటారు! బ్యాలెన్స్ నడుస్తుంది కదా. చూడండి, డిగ్రీ కూడా లభిస్తుంది (దాదీజీకి ఉదయ్‌పూర్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ డిగ్రీ లభించనుంది), భవనాలు కూడా లభిస్తున్నాయి. అసంభవమైన విషయాలు సంభవమవుతున్నాయి. ఇది అద్భుతమే కదా. ఆహ్వానాలు కూడా లభిస్తున్నాయి. కొంతకాలం క్రితం ఇది లేదు, ఇప్పుడు పెరుగుతుంది. మరి అద్భుతము పెరుగుతుంది కదా. బ్రహ్మా బాబా ద్వారా ఇవి ఫాస్ట్ గతి యొక్క సేవకు రుజువును చూపిస్తున్నారు. కష్టమైన విషయాలు సమయానుసారంగా ముందే జరిగి ఉన్నట్లుగా ఎంత సహజమైపోతాయో! అందువల్ల మీకు భయం లేదు. ఈ అల్లకల్లోలం ఎలాగూ జరగాల్సిందే మరియు మన అద్భుతము కూడా జరగాల్సిందే అని ఆలోచిస్తారు. కొందరు భయపడతారు - కర్ఫ్యూ విధించారు, సివిల్ వార్ జరుగుతుంది, ఏమవుతుందో అని భయపడుతున్నారా? డ్రామా ప్రకారం ఇవన్నీ పురుషార్థాన్ని మరింత బలోపేతం చేస్తాయి. మంచిది! అంతా బాగున్నారా? (దాదీజీకి కాస్త దగ్గు ఉంది) శారీరక ఆరోగ్యం యొక్క లెక్కాచారాన్ని సమాప్తం చేసుకుంటున్నారు. ఒకటి వయస్సు రీత్యా కూడా లెక్కాచారాలు సమాప్తమవుతాయి, రెండవ రహస్యం ఏమిటంటే మహారథులు సర్వ లెక్కాచారాలనూ ఇక్కడే సమాప్తం చేసుకోవాలి, ఏ కొద్దిగానూ మిగలకూడదు. బాప్‌దాదాకు ఇదంతా ఆటలా అనిపిస్తుంది. బ్రహ్మా బాబా ఎలాగైతే క్రాస్ చేశారో, మీరందరూ కూడా క్రాస్ చేయాల్సిందే. అయితే యోగబలంతో సహజంగా క్రాస్ చేయడం, లేదా ధర్మరాజు యొక్క క్రాస్ (శిలువ) ఎక్కడం. వీరు క్రాస్ చేస్తున్నారు, అందువల్ల క్రాస్ ఎక్కరు. అచ్ఛా!
క్రిస్మస్ కోసం బాప్‌దాదా సందేశం:- ఎవరైతే క్రిస్మస్, న్యూ ఇయర్ కార్డులు పంపారో ఆ పిల్లలందరికీ బాప్‌దాదా పదమా రెట్ల స్మృతిమి, ప్రేమని స్వీకరించండి. క్రిస్మస్ అనగా పెద్ద రోజు. వారేమో పెద్ద రోజును జరుపుకుంటారు, మీరేమో పెద్ద హృదయం గలవారు. పెద్ద హృదయం కలవారు సదా స్వయంగానూ సంపన్నంగా ఉంటారు మరియు ఇతరులనూ సంపన్నంగా ఉంచుతారు. కాబట్టి పెద్ద హృదయంతో పెద్ద రోజును జరుపుకునేవారికి అభినందనలు. ‘క్రిస్మస్-డే’ గిఫ్ట్‌గా బాప్‌దాదా అందరికీ వరదానాలు ఇచ్చారు. ఇది అన్నింటికంటే పెద్ద గిఫ్ట్. బ్లెస్సింగ్స్ గుర్తున్నాయి కదా. అచ్ఛా!
*** ఓంశాంతి ***
