‘‘సర్వ ఖజానాలతో సంపన్నంగా అవ్వండి - ఆశీర్వాదాలను ఇవ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి’’
ఈరోజు సర్వ ఖజానాల యజమాని తమ సంపన్న పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరికీ అనేక రకాల అవినాశీ తరగని ఖజానాలు లభించాయి మరియు ఆ ఖజానాలు ఎటువంటివంటే, ఆ సర్వ ఖజానాలు ఇప్పుడు కూడా ఉన్నాయి మరియు ఇక ముందు కూడా అనేక జన్మలు ఆ ఖజానాలతో పాటు ఉంటారు. ఏ-ఏ ఖజానాలు మరియు ఎన్నెన్ని లభించాయి అన్నది తెలుసా? ఖజానాల ద్వారా సదా ప్రాప్తి కలుగుతుంది. ఖజానాలతో సంపన్నంగా ఉన్న ఆత్మ సదా నిండుతనం యొక్క నషాలో ఉంటుంది. సంపన్నత యొక్క మెరుపు వారి ముఖంపై మెరుస్తుంది మరియు ప్రతి కర్మలో సంపన్నత యొక్క మెరుపు స్వతహాగానే కనిపిస్తుంది. ఈ సమయంలోని మనుష్యాత్మలకు వినాశీ ఖజానాల ప్రాప్తి ఉంది, అందుకే కొంత సమయం నషా ఉంటుంది, సదా ఉండదు. అందుకే ప్రపంచంలోని వారు ‘ఖాళీ అయి వెళ్ళాలి’ అని అంటారు మరియు మీరు ‘నిండుగా అయి వెళ్ళాలి’ అని అంటారు. మీ అందరికీ బాప్‌దాదా అనేక ఖజానాలు ఇచ్చారు. అన్నింటికన్నా శ్రేష్ఠమైన మొదటి ఖజానా - జ్ఞాన రత్నాల ఖజానా. అందరికీ ఈ ఖజానా లభించింది కదా. ఎవరూ వంచితులుగా ఉండిపోలేదు కదా. ఈ జ్ఞాన రత్నాల ఖజానా ద్వారా విశేషంగా ఏ ప్రాప్తిని పొందుతున్నారు? జ్ఞాన ఖజానా ద్వారా ఈ సమయంలో కూడా ముక్తి-జీవన్ముక్తిని అనుభూతి చేస్తున్నారు. ముక్తిధామములోకి వెళ్తారు మరియు జీవన్ముక్త దైవీ పదవిని ప్రాప్తి చేసుకుంటారు - ఇది భవిష్యత్తుకు సంబంధించిన విషయము. కానీ ఇప్పుడు కూడా ముక్త జీవితాన్ని అనుభవం చేస్తున్నారు. ఎన్ని విషయాల నుండి ముక్తులుగా ఉన్నారో తెలుసా? దుఃఖము మరియు అశాంతి యొక్క కారణాలుగా ఏవైతే ఉన్నాయో, వాటి నుండి ముక్తులుగా అయ్యారా లేక ఇప్పుడింకా ముక్తులుగా అవ్వాలా? ఇప్పుడు ఏ వికారమూ రాదా? ముక్తులుగా అయిపోయారు. ఒకవేళ వచ్చినా కానీ విజయులుగా అవుతారు కదా. కనుక ఎన్ని విషయాల నుండి ముక్తులుగా అయ్యారు! లౌకిక జీవితము మరియు అలౌకిక జీవితము - రెండింటిని పక్కపక్కన పెడితే ఎంత తేడా కనిపిస్తుంది! కనుక ఇప్పుడు ముక్తిని కూడా ప్రాప్తి చేసుకున్నారు మరియు జీవన్ముక్తిని కూడా అనుభవం చేస్తున్నారు. అనేక వ్యర్థ సంకల్పాలు మరియు వికల్పాలు, వికర్మల నుండి ముక్తులుగా అవ్వడము, ఇదే జీవన్ముక్త అవస్థ. ఎన్ని బంధనాల నుండి ముక్తులుగా అయ్యారు? మనుష్యాత్మలు ఎన్ని బంధనాల తాళ్ళతో బంధింపబడి ఉన్నారు అన్నది చిత్రంలో చూపిస్తారు కదా! ఇది ఎవరి చిత్రము? మీరైతే వారు కాదు కదా. మీరైతే ముక్తులుగా ఉన్నారు కదా. కావున జీవితంలో ఉంటూ జీవన్ముక్తులుగా అయ్యారు. కనుక జ్ఞాన ఖజానా ద్వారా విశేషంగా ముక్తి-జీవన్ముక్తుల ప్రాప్తిని అనుభవం చేస్తున్నారు.
రెండవది - స్మృతి అనగా యోగం ద్వారా సర్వ శక్తుల ఖజానాను అనుభవం చేస్తున్నారు. ఎన్ని శక్తులున్నాయి? చాలా ఉన్నాయి కదా! అష్ట శక్తులనైతే ఒక శ్యాంపుల్ రూపంలో చూపిస్తారు కానీ సర్వ శక్తుల ఖజానాలకు యజమానులుగా అయ్యారు.
మూడవది - ధారణా సబ్జెక్టు ద్వారా ఏ ఖజానా లభించింది? సర్వ దివ్య గుణాల ఖజానా. గుణాలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా. కావున సర్వ గుణాల ఖజానా. ప్రతి గుణం మరియు ప్రతి శక్తి యొక్క విశేషత ఎంత గొప్పది! ప్రతి జ్ఞాన రత్నం యొక్క మహిమ ఎంత గొప్పది!
నాల్గవ విషయము - సేవ ద్వారా సదా సంతోషం యొక్క ఖజానాను అనుభూతి చేస్తారు. ఏ సేవ చేసినా దాని ద్వారా విశేషంగా ఏం అనుభవమవుతుంది? సంతోషం కలుగుతుంది కదా. కనుక అన్నింటికన్నా పెద్ద ఖజానా అవినాశీ సంతోషము. కావున సంతోషపు ఖజానా సహజంగా, స్వతహాగా ప్రాప్తిస్తుంది.
ఐదవది - సంబంధ-సంపర్కాల ద్వారా బ్రాహ్మణ పరివారం యొక్క సంపర్కంలోకి కూడా వస్తారు, సేవ యొక్క సంబంధంలోకి కూడా వస్తారు. కనుక సంబంధ-సంపర్కం ద్వారా ఏ ఖజానా లభిస్తుంది? సర్వుల ఆశీర్వాదాల ఖజానా లభిస్తుంది. ఈ ఆశీర్వాదాల ఖజానా చాలా పెద్ద ఖజానా. ఎవరైతే సర్వుల ఆశీర్వాదాల ఖజానాతో నిండుగా ఉంటారో, సంపన్నంగా ఉంటారో, వారెప్పుడూ పురుషార్థంలో శ్రమ చేయాల్సిన అనవసరం ఉండదు. మొదటగా మాత-పిత యొక్క ఆశీర్వాదాలు, దానితో పాటు సర్వుల సంబంధంలోకి రావడంతో సర్వుల ద్వారా లభించే ఆశీర్వాదాలు. అన్నింటికన్నా అత్యంత పెద్ద, తీవ్ర వేగంతో ముందుకు ఎగిరేందుకు వేగవంతమైన యంత్రము - ‘ఆశీర్వాదాలు’. ఏ విధంగానైతే సైన్స్‌లో అన్నింటికన్నా అత్యంత ఎక్కువ తీవ్ర వేగం కలిగినది - రాకెట్. కానీ ఆశీర్వాదాల రాకెట్ దాని కన్నా శ్రేష్ఠమైనది. విఘ్నము కొద్దిగా కూడా స్పర్శించదు, విఘ్న ప్రూఫ్‌గా అవుతారు. యుద్ధం చేయాల్సిన అవసరముండదు. ప్రతి కర్మ, మాట, సంకల్పము యోగయుక్తంగా, యుక్తియుక్తంగా సహజంగా స్వతహాగానే అవుతాయి. ఈ ఆశీర్వాదాల ఖజానా అటువంటిది. అన్నింటికన్నా పెద్ద ఖజానా ఈ సంగమయుగ సమయం యొక్క ఖజానా.
వాస్తవానికి ఖజానాలైతే చాలా ఉన్నాయి. కానీ ఏ ఖజానాలనైతే వినిపించానో, కేవలం ఈ ఖజానాలను మీ లోపల ఇముడ్చుకునే శక్తిని ధారణ చేస్తే, సదా సంపన్నంగా ఉన్న కారణంగా కొద్దిగా కూడా అలజడి ఉండదు. ఖాళీగా ఉన్నప్పుడే అలజడి కలుగుతుంది. నిండుగా ఉన్న ఆత్మ ఎప్పుడూ చలించదు. కనుక సర్వ ఖజానాలను స్వయంలో ఇముడ్చుకున్నానా అని ఈ ఖజానాలను చెక్ చేసుకోండి. ఈ అన్ని ఖజానాలతో నిండుగా ఉన్నారా? లేక కొన్నింటిలో నిండుగా ఉండి, కొన్నింటిని ఇప్పుడింకా కొద్దిగా నింపుకోవాలా? ఖజానాలైతే అందరికీ లభించాయి కదా. ఒక్కరి ద్వారా ఒకే విధమైన ఖజానాలు అందరికీ లభించాయి. వేర్వేరుగా అయితే పంచలేదు కదా. ఒకరికి లక్ష, మరొకరికి కోటి ఇవ్వడము - ఇలా అయితే కాదు కదా? మొదటి రకం వారు - కేవలం తీసుకునేవారు. ఏది లభిస్తే అది తీసుకుంటారు కూడా, కానీ లభిస్తూనే తింటారు, తాగుతారు, ఆనందపడతారు, సమాప్తం చేసేస్తారు. రెండవ వారు - లభించిన ఖజానాలను జమ చేసుకునేవారు - వారు తింటారు, తాగుతారు, ఆనందపడతారు మరియు జమ కూడా చేసుకుంటారు. మూడవ వారు - జమ కూడా చేసుకుంటారు, తింటారు, తాగుతారు కూడా కానీ లభించిన ఖజానాలను ఇంకా పెంచుకుంటూ వెళ్తారు. తండ్రి ఖజానాలను తమ ఖజానాలుగా చేసుకుని పెంచుకుంటూ వెళ్తారు. కావున ‘నేను ఎవరు’ అన్నది చూసుకోవాలి - మొదటి నంబరువారినా, రెండవ నంబరువారినా లేక మూడవ నంబరువారినా?
ఎంతగా ఖజానాలను స్వయం యొక్క కార్యంలో లేక ఇతరుల కోసం సేవా కార్యంలో ఉపయోగిస్తారో, అంతగా ఖజానాలు పెరుగుతాయి. ఖజానాలను పెంచుకునే తాళంచెవి - వాటిని ఉపయోగించడము. మొదట స్వయం పట్ల. ఏ విధంగానైతే జ్ఞానం యొక్క ఒక్కొక్క రత్నాన్ని సమయానికి స్వయం పట్ల ఉపయోగిస్తే, ఆ ఖజానాను ఉపయోగించడంతో అనుభవీలుగా అవుతారు. ఖజానాల ప్రాప్తి ఏదైతే ఉందో, అది జీవితంలో అనుభవం యొక్క ‘అథారిటీ’ గా అవుతుంది. కనుక అథారిటీ యొక్క ఖజానా అదనంగా జమ అవుతుంది. కనుక పెరిగాయి కదా. కేవలం వినడము వేరే విషయము. వినడము అంటే తీసుకోవడము కాదు. ఇముడ్చుకోవడము మరియు సమయానికి కార్యంలో ఉపయోగించడము - ఇది తీసుకోవడము. వినేవారు ఏం చేస్తారు మరియు ఇముడ్చుకునేవారు ఏం చేస్తారు - ఇరువురిలో చాలా గొప్ప వ్యత్యాసముంది.
వినేవారి దృశ్యాన్ని చూసినప్పుడు బాప్‌దాదా చిరునవ్వు నవ్వుతారు. వినేవారు ఆ సమయానికి పరిస్థితి అనుసారంగా లేక విఘ్నం అనుసారంగా, సమస్య అనుసారంగా పాయింట్లను గుర్తు చేసుకుంటారు - బాప్‌దాదా ఈ విఘ్నాన్ని దాటేందుకు ఈ-ఈ పాయింట్లు ఇచ్చారు అని. ఇలా చేయాలి, ఇలా చేయకూడదు - రిపీట్ చేస్తూ, గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఒక వైపు పాయింట్‌ను రిపీట్ చేస్తూ ఉంటారు, మరోవైపు వశీభూతులుగా కూడా అవుతూ ఉంటారు. ఏమని అంటూ ఉంటారంటే - ఇలా చేయకూడదు, ఇది జ్ఞానం కాదు, ఇది దివ్య గుణం కాదు, ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయాలి, ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు అని. రిపీట్ కూడా చేస్తూ ఉంటారు కానీ ఫెయిల్ కూడా అవుతూ ఉంటారు. ఒకవేళ ఆ సమయంలో కూడా, వారిని - ఇది కరక్టేనా అని అడిగితే, కరెక్ట్ కాదు కానీ జరిగిపోతుంది అని జవాబిస్తారు. చెప్తూ కూడా ఉంటారు, మర్చిపోతూ కూడా ఉంటారు. మరి వారిని ఏమంటారు? వినేవారు. వినడం చాలా బాగా అనిపిస్తుంది. పాయింట్ చాలా శక్తిశాలి అయినది అని అంటారు. కానీ ఉపయోగించే సమయంలో ఒకవేళ శక్తిశాలి పాయింటు విజయీగా చేయకపోతే లేక సగం విజయీగా చేస్తే, అటువంటివారిని ఏమంటాము? వినేవారు అని అంటాము కదా.
ఇముడ్చుకునేవారు ఏదైనా పరిస్థితి లేక సమస్య ఎదురుగా వస్తే త్రికాలదర్శి స్థితిలో స్థితులై స్వ-స్థితి ద్వారా పర-స్థితిని అసలేమీ లేనే లేదు అనే విధంగా దాటేస్తారు. దీనినే ఇముడ్చుకోవడము అనగా సమయానికి కార్యంలో ఉపయోగించడము, సమయమనుసారంగా ప్రతి శక్తిని, ప్రతి పాయింటును, ప్రతి గుణాన్ని ఆజ్ఞానుసారంగా నడిపించడము అని అంటాము. ఏ విధంగా ఏదైనా స్థూల ఖజానా ఉంటే, ఆ ఖజానాను ఖజానా స్వయానికి ఉపయోగించదు, ఆ ఖజానాను ఉపయోగించేది మనుష్యాత్మలు. వారు ఎప్పుడు కావాలో, ఎంత కావాలో, ఎలా కావాలో, అలా ఉపయోగించుకోగలరు. అదే విధంగా ఈ సర్వ ఖజానాలన్నీ ఏవైతే వినిపించామో, వాటికి యజమాని ఎవరు? మీరా లేక ఇతరులా? యజమాని కదా. యజమాని పని ఏమిటి? ఖజానా వారిని నడిపిస్తుందా లేక వారు ఖజానాను నడిపిస్తారా? కనుక ఇలా ప్రతి ఖజానాకు యజమానిగా అయి సమయానికి జ్ఞానిగా అనగా వివేకవంతులుగా, జ్ఞాన సంపన్నులుగా, త్రికాలదర్శులుగా అయి ఖజానాలను కార్యంలో ఉపయోగించండి. అంతేకానీ, సమయానికి సహనశక్తిని ఆజ్ఞాపిస్తే ఆ కార్యం పూర్తయిన తర్వాత సహనశక్తి రావడము కాదు. ఇముడ్చుకునే శక్తి ఏ సమయంలో, ఏ విధితో అవసరమో ఆ సమయంలో ఆ విధితో తన పని చేయాలి. అంతేకానీ, బాగానే ఇముడ్చుకున్నాను, అయినా కానీ కొద్ది-కొద్దిగా నోటి నుండి వచ్చేసింది, అర్థగంట ఇముడ్చుకున్నాను కానీ ఆ ఒక్క సెకండు ఇముడ్చుకునేందుకు బదులుగా మాట్లాడేసాను. మరి ఇటువంటివారిని ఏమంటారు? ఖజానాకు యజమానులా లేక బానిసలా?
సర్వ శక్తులు తండ్రి అధికారం యొక్క ఖజానా, వారసత్వము, జన్మ సిద్ధ అధికారము. కనుక జన్మ సిద్ధ అధికారం యొక్క నషా ఎంతగా ఉంటుంది! ఒక చిన్న రాకుమారుడు ఉన్నారనుకోండి, ఏ ఖజానా ఉంది అన్నది అతనికి తెలియను కూడా తెలియదు కానీ కొద్దిగా స్మృతిలోకి వచ్చినా - నేను రాజు కొడుకును అని ఎంత నషా ఉంటుంది! మరి ఇది యజమానత్వపు నషా కదా. కనుక ఖజానాలను కార్యంలో ఉపయోగించండి. కార్యంలో తక్కువగా ఉపయోగిస్తారు. నిండుగా ఉన్నాము, అన్నీ లభించాయి అని సంతోషంగా ఉంటారు. కానీ కార్యంలో ఉపయోగించడము - దీని ద్వారా స్వయానికి ప్రాప్తి చేయించడము మరియు ఇతరులకు ప్రాప్తి చేయించడంలో నంబరువారుగా అవుతారు. లేదంటే నంబరు ఎందుకు తయారవుతుంది? ఇచ్చేవారూ ఒక్కరే, ఇవ్వడము కూడా అందరికీ ఏకరసంగా ఇస్తారు, మరి నంబరు ఎందుకు? కనుక బాప్‌దాదా చూసారు - ఖజానాలైతే చాలా లభించాయి, అన్నీ నిండుగా కూడా ఉన్నాయి, కానీ నిండుదనం యొక్క లాభం తీసుకోరు. ఏ విధంగానైతే లౌకికంలో కూడా చాలామందికి ధనం ద్వారా ఆనందాన్ని లేక లాభాన్ని ప్రాప్తి చేసుకునే పద్ధతి వస్తుంది మరియు కొంతమంది వద్ద చాలా ధనం ఉంటుంది కానీ ఉపయోగించే పద్ధతి రాదు, అందుకే ఉన్నా లేనట్లే ఉంటారు. కావున దేనిని అండర్లైన్ చేయాలి? కేవలం వినేవారిగా అవ్వకండి, ఉపయోగించే విధి ద్వారా ఇప్పుడు కూడా సిద్ధిని ప్రాప్తి చేసుకోండి మరియు అనేక జన్మలకు సద్గతిని ప్రాప్తి చేసుకోండి.
దివ్య గుణాలు కూడా తండ్రి యొక్క వారసత్వమే. కావున ప్రాప్తించిన వారసత్వాన్ని కార్యంలో ఉపయోగించడంలో కష్టమేముంది. ఆజ్ఞాపించండి. ఆజ్ఞాపించడం రాదా? యజమానులకే ఆజ్ఞాపించడము వస్తుంది. బలహీనులకు ఆజ్ఞాపించడం రాదు. వారు - చెప్పాలా, వద్దా, సహాయం లభిస్తుందో, లభించదో తెలియదు... అని ఆలోచిస్తారు. మీ ఖజానా కదా. తండ్రి ఖజానా అంటే మీ ఖజానా. లేదా ఇది తండ్రిదేనా, మీది కాదా? తండ్రి దేని కోసం ఇచ్చారు? మీదిగా చేసుకునేందుకు ఇచ్చారా లేక కేవలం చూసి సంతోషించేందుకు ఇచ్చారా? కర్మలో ఉపయోగించేందుకు లభించింది. రిజల్ట్‌లో ఖజానాలన్నింటినీ జమ చేసుకునే విధి తక్కువగా వస్తుందని గమనించారు. జ్ఞానమంటే పాయింటును రిపీట్ చేయడము లేక బుద్ధిలో ఉంచుకోవడము అని అర్థం కాదు. జ్ఞానం అనగా తెలివి, త్రికాలదర్శిగా అయ్యేటువంటి తెలివి, సత్య-అసత్యాల గురించి తెలివి, సమయమనుసారంగా కర్మలు చేసే తెలివి. దీనిని జ్ఞానము అని అంటాము.
ఒకవేళ ఎవరైనా అంత తెలివైనవారిగా ఉండి కూడా సమయానికి తెలివితక్కువ పని చేస్తే వారిని జ్ఞాని అని అంటారా? తెలివైనవారు ఒకవేళ తెలివిహీనులుగా అయితే వారిని ఏమని అంటారు? తెలివిహీనులను ఏమీ అనరు. కానీ తెలివైనవారికి - ‘ఇది తెలివేనా’ అని అందరూ సూచనను ఇస్తారు. కనుక జ్ఞాన ఖజానాను ధారణ చేయడము, జమ చేసుకోవడము అనగా ప్రతి సమయము, ప్రతి కార్యంలో, ప్రతి కర్మలో తెలివితో నడుచుకోవడము. అర్థమయిందా? మరి మీరు ఎంతో తెలివైనవారు కదా. ‘జ్ఞానయుక్త ఆత్మలా’ లేక ‘జ్ఞానం వినే ఆత్మలా’? ప్రాక్టికల్ కర్మలలో, మాట్లాడడంలో... ఇలాంటి జ్ఞానయుక్త ఆత్మలుగా ఎంతవరకు అయ్యారు అన్నది చెక్ చేసుకోండి. వాస్తవానికి అందరిచేత చేతులు ఎత్తిస్తే, అందరూ మేము లక్ష్మీ-నారాయణులుగా అవుతాము అని అంటారు. మేము రాముడిగా, సీతగా అవుతామని ఎవరూ అనరు. కానీ ఎవరో ఒకరైతే అవుతారు కదా. అందరూ, మేము విశ్వ మహారాజుగా అవుతామని అంటారు. మంచిది, లక్ష్యము ఇలాగే ఉన్నతంగా ఉండాలి. కానీ కేవలం లక్ష్యము పెట్టుకోవడం వరకే కాదు, లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉండాలి. లక్ష్యమేమో విశ్వ మహారాజుగా అవ్వడము మరియు కర్మలో ఒక్క గుణము లేక ఒక్క శక్తి కూడా ఆజ్ఞను పాటించకపోతే, వారు విశ్వమహారాజుగా ఎలా అవుతారు? తమ ఖజానా తమకే ఉపయోగపడకపోతే విశ్వ ఖజానాను ఏం సంభాళిస్తారు? అందుకే సర్వ ఖజానాలతో సంపన్నంగా అవ్వండి మరియు విశేషంగా వర్తమాన సమయంలో ఏ సహజ పురుషార్థము చేయండంటే - సర్వుల నుండి, బాప్‌దాదా నుండి ప్రతి సమయము ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండాలి.
ఆశీర్వాదాలు ఎవరికి లభిస్తాయి? ఎవరైతే సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టపరుస్తారో వారికి. ఎక్కడైతే సంతుష్టత ఉంటుందో అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి. ఇంకేమీ రాకపోయినా ఫర్వాలేదు. భాషణ చేయడం రాకపోయినా ఫర్వాలేదు. సర్వ గుణాలను ధారణ చేయడంలో శ్రమ అనిపించినా, సర్వశక్తులను కంట్రోల్ చేయడములో శ్రమ అనిపించినా దానిని కూడా వదిలేయండి. కానీ ఈ ఒక్క విషయాన్ని ధారణ చేయండి - ఆశీర్వాదాలను అందరికీ ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఇందులో ఎలాంటి శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. చేసి చూడండి. ఒక రోజు అమృతవేళ నుండి రాత్రి వరకు కేవలం ఈ పని మాత్రమే చేయండి - ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి. మరియు రాత్రికి చార్ట్ చెక్ చేసుకోండి - అది సహజ పురుషార్థంగా అనిపించిందా లేక కష్టము అనిపించిందా? ఇంకేమీ చేయకండి కానీ ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. ఇందులో అన్నీ వచ్చేస్తాయి. దివ్య గుణాలు, శక్తులు వాటంతటవే వచ్చేస్తాయి. ఎవరైనా మీకు దుఃఖమిచ్చినా కానీ మీరు ఆశీర్వాదాలు ఇవ్వాలి. అప్పుడు సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి ఉంటాయి కదా, సహనశీలతా గుణం ఉంటుంది కదా. ఇది అర్థమవుతుంది.
ఆశీర్వాదాలు తీసుకోవడము మరియు ఆశీర్వాదాలు ఇవ్వడము - ఇది బీజము, ఇందులో వృక్షము స్వతహాగానే ఇమిడి ఉంది. దీనికి విధి - రెండు పదాలను గుర్తుంచుకోండి. ఒకటేమో ‘శిక్షణ’ మరియు రెండవది ‘క్షమ’, దయ. శిక్షణ ఇవ్వడానికి చాలా ప్రయత్నిస్తారు, కానీ క్షమించడం రాదు. కనుక క్షమించాలి, క్షమించడమే శిక్షణ ఇవ్వడము అవుతుంది. శిక్షణ ఇచ్చేటప్పుడు క్షమించడాన్ని మర్చిపోతారు. కానీ క్షమించినట్లయితే శిక్షణ స్వతహాగా వచ్చేస్తుంది. శిక్షకులుగా అవ్వడము చాలా సహజము. వారం రోజుల కోర్సు తర్వాత శిక్షకులుగా అయిపోతారు. కనుక క్షమించాలి, దయార్ద్రహృదయులుగా అవ్వాలి. కేవలం శిక్షకులుగా అవ్వకూడదు. క్షమిస్తే, ఇప్పటి నుండే ఆ సంస్కారాన్ని ధారణ చేస్తే ఆశీర్వాదాలను ఇవ్వగలరు. మరియు ఇప్పటి నుండి ఆశీర్వాదాలు ఇచ్చే సంస్కారాన్ని పక్కా చేసుకుంటేనే, మీ జడ చిత్రాల నుండి కూడా ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు. చిత్రాల ఎదురుగా వెళ్ళి ఏమంటారు? ఆశీర్వాదాలు ఇవ్వండి, దయ చూపించండి... మీ జడ చిత్రాల నుండి ఆశీర్వాదాలు లభిస్తున్నప్పుడు చైతన్యములో ఆత్మల నుండి ఎన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి! ఆశీర్వాదాల తరగని ఖజానా బాప్‌దాదా నుండి ప్రతి అడుగులో లభిస్తుంది, తీసుకునేవారు తీసుకోవాలి. మీరు చూడండి, ఒకవేళ శ్రీమతమనుసారంగా ఏదైనా అడుగు వేస్తే, ఏం అనుభవమవుతుంది? తండ్రి ఆశీర్వాదాలు లభిస్తాయి కదా. ఒకవేళ ప్రతి అడుగు శ్రీమతమనుసారంగా నడిస్తే ప్రతి అడుగులో ఎన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి, ఆశీర్వాదాల ఖజానా ఎంత నిండుగా అవుతుంది!
ఎవరు ఏమిచ్చినా కానీ మీరు వారికి ఆశీర్వాదాలు ఇవ్వండి. ఒకవేళ ఎవరైనా క్రోధం చేసినా కానీ, అందులో కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి. క్రోధంలో ఆశీర్వాదాలు ఉన్నాయా లేక యుద్ధము ఉందా? ఎవరెంత క్రోధం చేసినా కానీ, వారు మీకు స్మృతిని ఇప్పిస్తారు - నేను పరవశమై ఉన్నాను కానీ మీరు మాస్టర్ సర్వశక్తిమంతులు అని. కనుక ఆశీర్వాదాలు లభించాయి కదా. మీరు మాస్టర్ సర్వశక్తిమంతులు, మీరు శీతల జలాన్ని వేసేవారు అని మీకు స్మృతిని ఇప్పించారు. కనుక క్రోధం చేస్తున్న వారు ఆశీర్వాదాలు ఇచ్చారు కదా. వారు ఏం చేసినా కానీ, మీరు వారి నుండి ఆశీర్వాదాలు తీసుకోండి. వినిపించాము కదా, గులాబి పుష్పంలో కూడా చూడండి, ఎంత విశేషత ఉంది, ఎంతో మురికిగా ఉండే ఎరువు నుండి, దుర్గంధము నుండి ఏం తీసుకుంటుంది? సుగంధాన్ని తీసుకుంటుంది కదా. గులాబి పుష్పము దుర్గంధము నుండి సుగంధాన్ని తీసుకోగలిగినప్పుడు, మీరు క్రోధం చేసేవారి నుండి ఆశీర్వాదాలు తీసుకోలేరా? విశ్వ-మహారాజుగా గులాబి పుష్పము అవ్వాలా లేక మీరు అవ్వాలా? వీరు సరిగ్గా ఉంటే నేను సరిగ్గా ఉంటాను, ఈ సిస్టమ్ సరిగ్గా ఉంటే నేను సరిగ్గా ఉంటాను అని ఎప్పుడూ అనుకోకండి. ఎప్పుడైనా సాగరం ముందుకు వెళ్ళి ఇలా అంటారా - ‘‘ఓ కెరటమా! నీవు పెద్దగా రావద్దు, చిన్నగా రా, వంకరగా రావద్దు, తిన్నగా రా’’ అని. ఈ ప్రపంచం కూడా సాగరము. అన్ని అలలు చిన్నవిగానూ ఉండవు, వంకరగానూ ఉండవు, తిన్నగానూ ఉండవు, పెద్దవిగానూ ఉండవు. కనుక వీరు సరి అయితే నేను సరి అవుతాను అన్నటువంటి ఆధారాన్ని ఉంచుకోకండి. పరిస్థితి పెద్దదా లేక మీరు పెద్దవారా?
బాప్‌దాదా వద్దకైతే అన్ని విషయాలు చేరుకుంటాయి కదా. దీనిని సరి చేస్తే నేను కూడా సరి అవుతాను, ఈ క్రోధం చేసేవారిని శీతలంగా చేస్తే నేను కూడా శీతలంగా అవుతాను, ఈ గొడవ చేసేవారిని పక్కకు తీస్తే సెంటరు బాగవుతుంది - ఇలాంటి ఆత్మిక సంభాషణ చేయకండి. మీ స్లోగన్ ఏమిటంటే - ‘‘ప్రతీకారం తీసుకోకండి, పరివర్తనై చూపించండి.’’ వీరిలా ఎందుకు చేస్తారు, ఇలా చేయకూడదు, వీరు మారాల్సిందే... అని అంటారు. కానీ మొదట స్వయాన్ని మార్చుకోండి. స్వపరివర్తనతో విశ్వపరివర్తన మరియు ఇతరుల పరివర్తనా లేక ఇతరుల పరివర్తనతో స్వపరివర్తనా? స్లోగన్‌ను తప్పుగా అయితే తయారుచేయలేదు కదా? ఏం చేస్తారు? స్వయాన్ని మార్చుకుంటారా లేక ఇతరులను మార్చడంలో సమయం పోగొట్టుకుంటారా? ‘‘కావాలంటే ఒక సంవత్సరం పాటు చూడండి - స్వయాన్ని మార్చుకోకండి కానీ ఇతరులను మార్చే ప్రయత్నం చేయండి, సమయం మారిపోతుంది కానీ మీరూ మారరు, వారూ మారరు.’’ అర్థమయిందా! సర్వ ఖజానాలకు యజమానులుగా అవ్వడం అనగా సమయానికి ఖజానాలను కార్యంలో ఉపయోగించడము. అచ్ఛా!
కొందరు ఎలా ఉంటారంటే చాలా మంచి మంచి వస్తువులు ఉన్నప్పుడు మా వద్ద సర్వస్వం ఉంది అని సంతోషపడుతూ ఉంటారు. కానీ సమయం వచ్చినప్పుడు గుర్తురానే రాదు లేదా ఆ వస్తువు దొరకదు. కారణం ఏమిటి? సమయానుకూలంగా దానిని కార్యంలో ఉపయోగించలేదు. కాబట్టి కేవలం చూసి సంతోషపడటం కాదు, ప్రతి ఖజానా యొక్క మజాను పొందండి, ఆనందం చేసుకోండి. జ్ఞానపు ఖజానాతో ఆనందం చేసుకోండి, అవగాహనతో కార్యం చేయండి, సిద్ధిని పొందండి, శక్తులను ఆర్డర్‌పై నడిపించండి - దీనిని ఆనందం చేసుకోవడం అంటారు. గుణాలను తమ కొరకు కార్యంలో ఉపయోగించండి మరియు ఇతరులకు కూడా గుణదానం చేయండి, జ్ఞానదానం చేయండి, శక్తుల దానం చేయండి. ఎవరైనా బలహీనంగా ఉంటే శక్తిని ఇచ్చి వారిని కూడా సంపన్నంగా తయారుచేయండి. వీరినే సంపన్నమైన ఆత్మ అని అంటాము. అచ్ఛా!
సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న ఆత్మలకు, సర్వ ఖజానాలను కార్యంలో ఉపయోగించేవారికి, పెంచుకునే ‘జ్ఞానయుక్త ఆత్మలైన’ పిల్లలకు, సర్వ ఖజానాలకు యజమానులుగా అయి సమయానికి విధిపూర్వకంగా కార్యంలో ఉపయోగించే శ్రేష్ఠ ఆత్మలకు, ప్రతి శక్తి, ప్రతి గుణం యొక్క అథారిటీగా అయి స్వయంలో మరియు సర్వులలో నింపే విశేష ఆత్మలకు, సదా ఆశీర్వాదాల ఖజానాతో సహజ పురుషార్థాన్ని అనుభవం చేసే సహజయోగీ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో మిలనము:- బాప్‌దాదా సెకనులో ఎన్ని విషయాలు మాట్లాడగలరు? సమయం తక్కువ మరియు విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఫరిశ్తeలు సైగల ద్వారానే అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ దృష్టి యొక్క భాష ఫరిశ్తా రూపానికి గుర్తు. ఇది కూడా బాప్‌దాదా నేర్పిస్తూ ఉంటారు. ఇప్పటి కాలం ప్రకారం వాణి ద్వారా ఎవరికైనా వినిపిస్తే సమయం కావాలి, ధైర్యము కావాలి. అదే మధురమైన దృష్టి ద్వారా అర్థం చేయించే ప్రయత్నం చేస్తే ఎంత సహజమైపోతుంది! సమయానుసారంగా దృష్టి ద్వారా పరివర్తన అవ్వడం మరియు పరివర్తన చేయించడం - ఇదే పనికి వస్తుంది. వినిపిస్తే అంతా మాకు ముందే తెలుసు అంటారు. కానీ మధురమైన దృష్టి మరియు శుభ వృత్తి ఒక్క నిమిషంలో ఒక గంట అర్థం చేయించే కార్యాన్ని చేయగలవు. ప్రస్తుతం ఇదే శ్రేష్ఠమైన విధి మరియు అంతిమంలో కూడా ఇదే పనికి వస్తుంది. ఫాలో ఫాదర్ చేస్తూ వెళ్తారు. విఘ్నాన్ని కూడా వినోదంగా భావించి నడుస్తూ ఉంటారు. వాహ్ డ్రామా వాహ్! ఎలాంటి దృశ్యం అయినా కానీ ‘వాహ్-వాహ్’ అనే ఉండాలి. మంచిది, బాప్‌దాదా పిల్లల ధైర్యము, ఉల్లాస-ఉత్సాహాలను చూసి సంతోషిస్తున్నారు మరియు వాటిని పెంచుతూ ఉంటారు. నిమిత్తంగా తయారవ్వడమే లిఫ్ట్ ఇచ్చే విశేష గిఫ్ట్. అచ్ఛా!
అవ్యక్త బాప్‌దాదాతో పర్సనల్ మిలనము
గ్రూప్ నం. 1 :- శ్రేష్ఠ స్థితికి ఆధారం - శ్రేష్ఠ స్మృతి
అందరికీ శ్రేష్ఠ ఆత్మనైన నేను యజమానిని మరియు బాలకుడిని కూడా అనే డబల్ నషా ఉంటుందా? ఒకటి యజమానిగా ఉండే ఆత్మిక నషా మరియు రెండవది బాలకతనపు ఆత్మిక నషా. ఈ డబల్ నషా సదా ఉంటుందా లేక అప్పుడప్పుడు ఉంటుందా? సదా బాలకులుగా ఉంటారా లేక అప్పుడప్పుడా? బాలకులు సదా బాలకులే కదా. పరమాత్మ యొక్క బాలకులు మరియు ఆది-మధ్య-అంతాలను తెలిసిన యజమానులు. ఇలాంటి యజమానితనం మరియు ఇలాంటి బాలకతనం మొత్తం కల్పంలో మరే సమయంలోనూ ఉండజాలదు. సత్యయుగంలో కూడా పరమాత్మ పిల్లలు అని అనము, దేవాత్మల పిల్లలుగా అయిపోతారు. త్రికాలాలను తెలిసిన యజమాని అనే ఈ యజమానితనం కూడా ఈ సమయంలోనే ఉంటుంది. మరి ఈ సమయంలోనే ఉండి, తర్వాత మర్జ్ అయిపోతుంది కాబట్టి సదా ఉండాలి కదా. డబల్ నషాను ఉంచుకోండి. ఈ డబల్ నషా ద్వారా డబల్ ప్రాప్తి కలుగుతుంది, యజమానితనం ద్వారా ఒక అనుభూతి మరియు బాలకతనపు నషా ద్వారా ఒక ప్రాప్తి. వేర్వేరు ప్రాప్తులు కదా. ఈ ఆత్మిక నషా నష్టం కలిగించేది కాదు. ఆత్మికమైనది కదా. దేహాభిమానం యొక్క నషాలు నష్టాన్ని కలిగిస్తాయి. ఆ నషాలు కూడా అనేకం ఉన్నాయి. దేహాభిమానానికి ఎన్ని నషాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా - నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా... అని. కానీ అవన్నీ నష్టం కలిగించేవి, కిందకు దింపేవి. ఈ ఆత్మిక నషా ఉన్నతంగా తీసుకువెళ్తుంది, అందువల్ల నష్టం లేదు. ఉండటమే బాబావారిగా ఉన్నారు. బాబా అనగానే చిన్నతనం గుర్తుకొస్తుంది కదా. బాబా అనగా నేను బిడ్డను అయినప్పుడే బాబా అంటారు. మరి రోజంతా ఏమి గుర్తుంటుంది? “నా బాబా”. లేదా ఇంకేమైనా గుర్తుంటుందా? బాబా అనేవారు ఎవరు? బిడ్డే కదా. కాబట్టి సదా పిల్లలే మరియు సదా అలాగే ఉంటారు.
సదా ఈ భాగ్యాన్ని ఎదురుగా ఉంచుకోండి అనగా స్మృతిలో ఉంచుకోండి - నేను ఎవరిని, ఎవరివాడిని మరియు ఏమి లభించింది! ఏమి లభించింది అనేదానికి ఎంత పెద్ద జాబితా ఉందో! జాబితాను గుర్తుంచుకుంటారా లేక కేవలం పుస్తకంలో ఉంచుకుంటారా? పుస్తకంలో అయితే అందరి వద్దా ఉంటుంది, కానీ నేను ఎవరిని అని బుద్ధిలో ఇమర్జ్ కావాలి. అప్పుడు ఎన్ని సమాధానాలు వస్తాయి? చాలా సమాధానాలు ఉన్నాయి కదా. సమాధానాలు చెప్పడంలో, జాబితా వినిపించడంలో అయితే నిపుణులే కదా. ఇప్పుడు కేవలం స్మృతి స్వరూపులుగా అవ్వండి. స్మృతి రావడంతోనే సహజంగా ఎలాంటి స్మృతి ఉంటుందో అలాంటి స్థితి ఏర్పడుతుంది. స్థితికి ఆధారం స్మృతియే. సంతోషపు స్మృతిలో ఉంటే స్థితి సంతోషంగా మారుతుంది మరియు దుఃఖాన్ని స్మృతి చేస్తే దుఃఖపు స్థితి అవుతుంది. బాబా ఇచ్చేది ఒకే ఒక్క పని - స్మృతి చేయండి లేదా స్మృతిలో ఉండండి. ఒకే ఒక్క పని కష్టంగా ఉంటుందా? కొన్నిసార్లు చాలా పనులు ఒకేసారి పోగైతే కన్ఫ్యూజ్ అయిపోతారు - ఇన్ని పనులు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి... అని. ఒకే పని ఉన్నప్పుడు కంగారుపడాల్సిన అవసరం ఉండదు కదా. బాబా ఇచ్చింది ఒకే పని కదా. అంతే, స్మృతి చేయండి. ఈ స్మృతిలోనే సర్వస్వం వచ్చేస్తుంది. కాబట్టి యజమానిగానూ ఉన్నాము, బాలకులుగానూ ఉన్నాము అని స్మృతి చేయండి! ఆత్మిక నషాలో ఉంటే ఏమి లభిస్తుంది మరియు మరచిపోతే ఏమవుతుంది - రెండూ అనుభవాలే కదా. మరచిపోయే అలవాటు 63 జన్మల నుండి ఉంది. కానీ స్మృతి ఎంత సమయం చేయాలి? ఒక జన్మ. మరియు ఈ జన్మ కూడా ఎంత చిన్నది! కాబట్టి ‘సదా’ అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. అచ్ఛా! అందరూ సదా సంతోషంగా ఉన్నారు కదా. మనం సంతోషంగా ఉండకపోతే ఇంకెవరు ఉంటారు అని ఆలోచించండి! మాతలు కూడా సదా సంతోషంగా ఉంటున్నారా లేక అప్పుడప్పుడు కొద్దిగా దుఃఖపు అల వస్తుందా? ప్రపంచం ఎంత దుఃఖమయంగా ఉన్నప్పటికీ మీరు సుఖ సాగరుని పిల్లలు, సదా సుఖ-స్వరూపులు. దుఃఖంలో దుఃఖితులుగా అయిపోతున్నారా ఏంటి? ప్రపంచపు సమయమే దుఃఖపు సమయమని మీకు తెలుసు. కానీ మీ సమయం ఎలాంటిది? సుఖపు సమయమే కదా, కొద్దికొద్దిగా దుఃఖపు సమయమా ఏంటి? ప్రపంచంలో దుఃఖం పెరగాల్సిందే. తగ్గదు, పరాకాష్టకు చేరుకుంటుంది. కానీ మీరు దుఃఖానికి అతీతంగా ఉన్నారు. అంతే కదా. మంచిది, ఆనందంలో ఉండండి. ఏది జరుగుతున్నా కానీ మేము ఆనందంలో ఉండేవారము. ఆనందంలో ఉండటం మంచిది కదా.
గ్రూప్ నం. 2 :- సమస్యల పర్వతాన్ని ఎగిరే కళతో దాటండి
అందరూ తమ పురుషార్థాన్ని సదా చెక్ చేసుకుంటున్నారా? మీ పురుషార్థం తీవ్ర గతితో సాగుతోందా లేక సమయం తీవ్ర గతితో ముందుకు సాగుతుందా, ఏమంటారు? సమయం వేగంగా ఉండి, మీరు ఢీలాగా ఉన్నారా? సమయం రచయితా లేక రచనా? రచన ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నప్పటికీ రచయిత రచయితే కదా. మరి సమయాన్ని మీరు ఆహ్వానించాలా లేక సమయం మిమ్మల్ని ఆహ్వానిస్తుందా? సమయమే నా యజమాని రండి అని మిమ్మల్ని ఆహ్వానించాలి! సమయం యొక్క వేగం సదా ముందుకు సాగుతూనే ఉంటుంది, ఆగదు. పతనమయ్యే సమయమైనా, వృద్ధి చెందే సమయమైనా కానీ సమయం ఎన్నడూ ఆగదు, సదా ముందుకు సాగుతూనే ఉంటుంది. ఎవరైనా సమయాన్ని ఆపాలని అనుకున్నా ఆగదు. మరి మిమ్మల్ని ఎవరైనా ఆపితే ఆగిపోతారా? ఆగిపోతారు కదా. ఆగకూడదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి సమస్యల పర్వతం ఎదురైనా మీరు ఆగిపోయేవారా? ఎగిరే కళ కలవారు కదా. మరి పర్వతాన్ని కూడా ఏమి చేస్తారు? ఎగిరే కళ ఉంటే సెకనులో దాటేస్తారు. కాబట్టి ఎక్కే కళ కలవారా లేక ఎగిరే కళ కలవారా? ఎగిరేవారు ఎన్నడూ ఆగరు. గమ్యం చేరకుండానే ఎగిరే వస్తువు ఆగిపోతే ఏమవుతుంది? నడుస్తున్న విమానం గమ్యానికి ముందే ఆగిపోతే ప్రమాదం జరుగుతుంది కదా. మీరు కూడా ఎగిరే కళ కలవారు. ఎగిరే కళ ఉన్నవారు గమ్యానికి ముందు ఎక్కడా ఆగరు. లేక అలసిపోతే ఆగిపోతారా?
ఎక్కడైతే ప్రాప్తి ఉంటుందో, ప్రాప్తి ఉన్నవారు ఎన్నడూ అలసిపోరు. ఈ విషయం వ్యాపారస్తులకు అనుభవమే కదా. కస్టమర్ ఆలస్యంగా వచ్చినా అలసిపోరు, రండి అని ఆహ్వానిస్తారు... ఎందుకు అలసిపోరు? ఎందుకంటే ప్రాప్తి ఉంది. మరి మీకు ఎన్ని ప్రాప్తులు ఉన్నాయి? అడుగడుగునా పదమాల ప్రాప్తి ఉంది. మొత్తం ప్రపంచంలో అడుగడుగునా పదమాల సంపాదన ఉండే ఇంతటి షాహుకారు ఎవరైనా ఉన్నారా? ఎంతటి పేరుప్రఖ్యాతులు గలవారైనా ఇంతటి షాహుకారులు ఎవరూ లేరు. ఒకసారి అంతా తిరిగి రండి. చూడండి, విదేశాలలో ఎవరైనా దొరుకుతారేమో? ఎంత గొప్పవారైనా మీ ముందు వారు ఏమీ కారు. కాబట్టి ఇంత పెద్ద ప్రాప్తి ఉన్నవారు ఎన్నడూ అలసిపోలేరు. ప్రాప్తిని మరచిపోవడమే అలసిపోవడం. ఆ వ్యాపారంలో ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది, శ్రమ పడ్డా ఏమి లభిస్తుంది? పోనీ, మహా అయితే కోట్లు లభిస్తాయేమో, నిజానికి లభించవు, ఒకవేళ లభించినా అంతే కదా. ఇక్కడైతే పదమాల విషయం. కాబట్టి సదా తమ ప్రాప్తులను ఎదురుగా ఉంచుకోండి. కేవలం పురుషార్థం మాత్రమే చేయకండి, పురుషార్థానికంటే ముందు ప్రాప్తులను ఎదురుగా ఉంచుకోండి. ఇది లభిస్తుంది అని తెలిస్తే పురుషార్థాన్ని మరచిపోతారు, ప్రాప్తినే ఎదురుగా ఉంచుకుంటారు. వారికి పురుషార్థం కనిపించదు, ప్రాప్తే కనిపిస్తుంది. వ్యవసాయం పని చేస్తున్నప్పుడు కూడా ఏమి కనిపిస్తుంది? శ్రమ కనిపిస్తుందా లేక పంట కనిపిస్తుందా? పంట యొక్క సంతోషం ఉంటుంది కదా. కాబట్టి ఈ స్మృతిని ఉంచుకోవడం వల్ల ఎన్నడూ అలసిపోరు. అలసిపోనూ లేరు, తీవ్ర గతి నుండి వేగం నెమ్మదిగానూ కాదు, సదా తీవ్ర గతి ఉంటుంది.
గుజరాత్ వారిది తీవ్ర గతియే కదా. గుజరాత్ మాతలు కూడా వేగంగా, చకచకా నడుస్తారు. చూడండి, గర్బా ఆడేటప్పుడు లావుగా ఉన్నా, వృద్ధులైనా ఎంత వేగంగా ఆడతారో! ఇతరులు చూసి ఇంత లావుగా ఉండి ఎలా ఆడగలరు అనుకుంటారు? కానీ ఎంత ఫాస్ట్‌గా ఆడతారు! కాబట్టి గుజరాత్ వారికి తీవ్ర గతి అలవాటు. శరీరమే వేగంగా నడవగలిగినప్పుడు ఆత్మ నడవలేదా? సదా సంతోషంగా ఉండటమే గుజరాత్ యొక్క విశేషత. గుజరాత్ వారందరికీ గర్బా వచ్చు. జబ్బుపడినవారిని కూడా దాండియా ఆడటానికి రమ్మంటే మంచం మీద నుండి లేచి మరీ వచ్చేస్తారు. కాబట్టి ఇది సంతోషానికి, ఆనందం జరుపుకోవడానికి గుర్తు. గుజరాత్లో ప్రతి ఇంట్లోనూ ఉయ్యాల ఉండటమే ఆనందానికి గుర్తు. శరీరంతో ఎలాగైతే ఆనందం జరుపుకుంటారో, అలాగే ఆత్మ కూడా ఆనందంలో ఉండాలి కదా. కాబట్టి గుజరాత్ అనగా ఆనందంలో ఉండేవారు, సంతోషంలో ఉండేవారు అని అర్థం. కానీ సదా ఉండాలి, అప్పుడప్పుడు కాదు. గుజరాత్ వారికి సంతోషం తగ్గడం అనేది అసంభవం. అంత పక్కా నిశ్చయం ఉందా లేక అప్పుడప్పుడు తికమకపడతారా? బాబాకు తమ బాధ్యతలన్నింటినీ అప్పగించినప్పుడు ఇక మీరు ఆనందంలోనే ఉంటారు కదా. బాధ్యతలే తలను భారం చేస్తాయి. సంతోషం తగ్గినప్పుడల్లా, ఏం చేస్తాం, దీన్ని కూడా చూసుకోవాలి కదా, చేయాలి కదా, బాధ్యత ఉంది కదా అని అంటారు లేదా ఆలోచిస్తారు. ఆ సమయంలో ఆలోచిస్తారు కదా. కానీ బాధ్యత తీసుకున్నది బాబా, నేను నిమిత్తమాత్రుడిని. నా బాధ్యత అనుకుంటే భారం అవుతుంది. బాధ్యత బాబాది, నేను నిమిత్తం అనుకుంటే లైట్‌గా అయిపోతారు. లైట్‌గా ఉన్నది ఎగురుతుంది. బరువైన వస్తువు ఎగరలేదు, మాటిమాటికి కిందకు వచ్చేస్తుంది. నేను చేయాల్సి వస్తోంది, నేనే చేయాలి అనే సంకల్పం కొద్దిగా వచ్చినా భారమైపోతుంది. మరి డబల్ లైట్‌గా ఉన్నారు కదా. లేదా కొద్దికొద్దిగా భారం ఉందా? సదా ఎగురుతూ ఉండండి. ఎగిరే కళ అనగా తీవ్ర గతి.
ఎగిరే కళ సమయంలో వచ్చినందుకు మీరైతే చాలా చాలా భాగ్యవంతులు. ఇప్పటి పిల్లలు మేము ఎడ్లబండ్ల కాలంలో కాకుండా మోటారు కార్ల టైమ్‌లో వచ్చినందుకు భాగ్యవంతులము అంటారు కదా. పాతవారితో ఇప్పటి పిల్లలు మీ కాలం ఎడ్లబండ్ల కాలం, మా కాలం ఏరోప్లేన్ కాలం అని అంటారు. మరి వారికి ఎంత నషా ఉంటుంది! మేము ఎగిరే కళ సమయంలో వచ్చాము అనే నషా మీకు కూడా ఉండాలి. చూడండి, సమయం కూడా మీకు సహాయకారిగా మారింది. కాబట్టి చక్కగా ఎగరండి. మీ వద్ద చిన్నచిన్న భారాలు కూడా ఉంచుకోకండి - పురుషార్థపు భారం గానీ, సేవా భారం గానీ, సంబంధ-బాంధవ్యాలు నిర్వర్తించే భారం గానీ ఉండకూడదు. ఏ భారమూ ఉండకూడదు. లేదా కొద్దికొద్దిగా భారం ఉంచుకోవడం బాగుంటుందా? అలవాటు పడిపోయారు కదా. 63 జన్మల నుండి భారాన్ని మోస్తూ వచ్చారు, మధ్యమధ్యలో ఆ అలవాటు ఇప్పటికీ పనిచేస్తూ ఉంటుంది. కానీ భారం మోయడం వల్ల ఏమి లభించింది? భారంగా ఉన్నారు మరియు భారంగా ఉండటం వల్ల కిందకు పడిపోతూ వచ్చారు. ఇప్పుడైతే పైకెక్కాలి కదా. మంచిది! గుజరాత్ వారు ఏం చేస్తాం, ఎలా చేయాలి, మాయ వచ్చేసింది అని ఎన్నడూ అనరు. మాయకు భయపడేవారా లేక విజయాన్ని పొందేవారా? పోరాడుతూనే ఉంటే చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు. అందువల్ల సదా విజయి. ఓటమి పాలయ్యేవారు కారు. ఓటమి పాలు కావడం బలహీనుల పని, బ్రాహ్మణులు సదా ధైర్యవంతులు. అచ్ఛా!
గ్రూప్ నం. 3 :- రాజయోగి అనగా తన కర్మేంద్రియాలను ఈశ్వరీయ లా అండ్ ఆర్డర్‌పై నడిపించేవారు
శబ్దంలోకి రావడం సహజంగా అనిపిస్తుంది కదా. అలాగే శబ్దానికి అతీతంగా ఉండటం కూడా అంతే సహజంగా అనిపిస్తుందా? శబ్దంలోకి రావడం సహజమా లేక శబ్దానికి అతీతంగా ఉండటం సహజమా? శబ్దంలోకి రావడం సహజం మరియు శబ్దానికి అతీతంగా అవ్వడంలో శ్రమ పడుతుందా? నిజానికి మీ ఆత్మల ఆది స్వరూపం ఏమిటి? శబ్దానికి అతీతంగా ఉండటమా లేక శబ్దంలోకి రావడమా? మరి ఇప్పుడు ఎందుకు కష్టంగా అనిపిస్తుంది? 63 జన్మలు ఆది సంస్కారాన్ని మరిపించేశాయి. అనాది స్థానమైన ‘పరమధామం’ శబ్దానికి అతీతంగా ఉంది, అక్కడ శబ్దం లేదు మరియు ఆది స్వరూపమైన ఆత్మలో కూడా శబ్దం లేదు, మరి శబ్దానికి అతీతంగా అవ్వడం కష్టం ఎందుకు? మధ్య కాలం యొక్క వ్యతిరేక ప్రభావం ఎంత పక్కాగా మారిపోయింది! బ్రాహ్మణ జీవితం అనగా శబ్దంలోకి రావడం ఎంత సహజమో, శబ్దానికి అతీతంగా అయిపోవడం కూడా అంతే సహజమైన అభ్యాసం కావాలి. దీనికి విధి - రాజాగా అయి నడవడం మరియు కర్మేంద్రియాలను నడిపించడం. రాజు ఆర్డర్ ఇస్తే - ఈ పని జరగకూడదు అని; అప్పుడు ప్రజలు ఏమి చేస్తారు? అంగీకరించాల్సిందే కదా.
ఈ రోజుల్లో అసలు రాజే లేరు, ప్రజా రాజ్యం నడుస్తోంది. అందువల్ల ఎవరూ ఎవరి మాటా వినరు. కానీ మీరైతే రాజయోగులు కదా. మీ వద్ద ప్రజా రాజ్యం లేదు కదా. రాజు రాజ్యం ఉంది కదా. బాబా అంటారు, ఓ రాజుల్లారా! మీ కర్మేంద్రియాలనే ప్రజలు మీ కంట్రోల్లో ఉన్నారా? లేక అప్పుడప్పుడు కంట్రోల్ తప్పుతున్నారా? రోజూ రాజ్య-దర్బారు ఏర్పాటు చేస్తున్నారా? రోజూ రాత్రి పూట రాజ్య దర్బారు ఏర్పాటు చేయండి. మీ రాజ్య వ్యవహారాలను నడిపే కర్మేంద్రియాలను క్షేమ సమాచారాలు అడగండి. రాజా ఎలాగైతే రాజ్య దర్బారు ఏర్పాటు చేస్తారో అలా. మరి మీరు మీ రాజ్య దర్బారు ఏర్పాటు చేస్తున్నారా? లేదా మరచిపోయి నిద్రపోతున్నారా? రాజ్య దర్బారు ఏర్పాటు చేయడానికి ఎంత సమయం పడుతుంది? వారి రాజ్య దర్బారులో అయితే గొడవలు జరుగుతాయి. ఇక్కడ గొడవలకు తావే లేదు. వ్యతిరేక పక్షం (అపోజిషన్) ఏమీ లేదు కదా. ఒక్కరి కంట్రోలే ఉంది. కొన్నిసార్లు మీ ఉద్యోగులే వ్యతిరేకత చూపించడం మొదలుపెడతారు. కాబట్టి రాజయోగి అనగా మాస్టర్ సర్వశక్తిమాన్ రాజా ఆత్మ, ఒక్క కర్మేంద్రియం కూడా మోసం చేయలేదు. స్టాప్ అనగానే స్టాప్. ఆర్డర్‌పై నడిచేవారే కదా. ఎందుకంటే భవిష్యత్తులో లా అండ్ ఆర్డర్‌పై నడిచే రాజ్యం రానుంది. కాబట్టి స్థాపన ఇక్కడి నుండే జరగాలి కదా.
ఇక్కడే ‘ఆత్మ’ అనే రాజు తన సర్వ కర్మేంద్రియాలను లా అండ్ ఆర్డర్‌పై నడిపించే వారిగా తయారైనప్పుడే, విశ్వ-మహారాజుగా అయి విశ్వ రాజ్యాన్ని లా అండ్ ఆర్డర్‌పై నడిపించగలరు. ముందుగా స్వరాజ్యం లా అండ్ ఆర్డర్‌పై ఉండాలి. మరి మీ రాజ్య దర్బారు పరిస్థితి ఎలా ఉంది? తారుమారుగా ఏమీ లేదు కదా. అందరి పరిస్థితి బాగుందా? ఎలాంటి గందరగోళం లేదు కదా? ఇక్కడ అప్పుడప్పుడు ఆర్డర్లో నడిపించి, అప్పుడప్పుడు నడిపించలేకపోతే అక్కడ కూడా అప్పుడప్పుడు లభించే రాజ్యమే లభిస్తుంది, సదాకాలపు రాజ్యం లభించదు. పునాది ఇక్కడి నుండే పడుతుంది కదా. కాబట్టి సదా అకాల సింహాసనాధికారిగా స్వరాజ్యాన్ని నడిపించే రాజా ‘ఆత్మ’ను నేను అని సదా చెక్ చేసుకోండి? అందరి వద్దా సింహాసనం ఉంది కదా. పోగొట్టుకోలేదు కదా? సింహాసనంపై కూర్చునే కదా రాజ్యం నడిపించేది. లేక సింహాసనంపై హాయిగా అలసత్వంగా నిద్రపోతారా? సింహాసనంపై ఉండటం అనగా రాజ్య-అధికారిగా అవ్వడం. మరి సింహాసనాధికారిగా ఉన్నారా లేక అప్పుడప్పుడు కిందకు దిగిపోతున్నారా?
“నేను ‘ఆత్మ’ను, కానీ ఎలాంటి ఆత్మను? రాజా ‘ఆత్మ’ను, రాజ్య అధికార ‘ఆత్మ’ను, సాధారణ ‘ఆత్మ’ను కాను” అనే స్మృతి సదా ఉంచుకోండి. రాజ్య అధికార ఆత్మ యొక్క నషాకు మరియు సాధారణ ఆత్మ యొక్క నషాకు మధ్య ఎంత తేడా ఉంటుంది! కాబట్టి రాజుగా అయి మీ రాజ్య వ్యవహారాలను చెక్ చేసుకోండి - ఏ కర్మేంద్రియం మాటిమాటికి మోసం చేస్తోంది? ఒకవేళ మోసం చేస్తుంటే దాన్ని చెక్ చేసి మీ ఆర్డర్లో ఉంచుకోండి. అలసత్వంతో వదిలేస్తే మోసం చేసే దాని అలవాటు మరింత పక్కాగా మారుతుంది, మరి నష్టం ఎవరికి జరుగుతుంది? మనకే జరుగుతుంది కదా. అందుకే ఏమి చేయాలి? అకాల సింహాసనాధికారిగా అయి చెక్ చేసుకోండి.
భవిష్యత్తులో ఏమి కాబోతున్నారు - దీని యథార్థ పరిచయం దేని ఆధారంగా చేసుకోగలరు? భవిష్యత్తులో నేను ఏమి కాబోతున్నాను అని తెలుసుకునేందుకు ఏదైనా ఆధారం ఉందా? లక్ష్యాన్ని ఉన్నతంగా ఉంచుకోండి. ఎందుకంటే ఇంకా రిజల్ట్ రాలేదు. కుర్చీలాట జరుగుతుంది కదా, చివరగా విజిల్ మోగుతుంది. ఆ ఆఖరి విజిల్ ఆధారంగా ఎవరు విజయి అయ్యారో తెలుస్తుంది. మొదటి నంబర్ తప్ప ప్రస్తుతం ఎవరిదీ ఖరారు కాలేదు. ఇద్దరివి ఖరారయ్యాయి, ఇంకా ఆరుగురిలో అవకాశం ఉంది. మొదటి విశ్వ మహారాజు లేదా విశ్వ మహారాణి కాకపోయినా ఫస్ట్ డివిజన్‌లోనైనా వస్తారు కదా అని వినిపించారు. మొదటి నంబర్లో ఒక్కరే ఉంటారు కానీ ఫస్ట్ డివిజన్లో చాలామంది ఉంటారు. కాబట్టి మొదటి నంబర్లో రాకపోయినా ఫస్ట్ డివిజన్లో రావచ్చు. అక్కడ రాయల్ ఫ్యామిలీ పదవి కూడా సింహాసనాధికారి అయిన రాజు-రాణి పదవి అంతగానే ఉంటుంది. అందువల్ల సదా ఫస్ట్ డివిజన్ లక్ష్యాన్నే ఉంచుకోండి. రాయల్ ఫ్యామిలీ అక్కడ తక్కువేమీ కాదు - లక్ష్మీ-నారాయణులకు ఎంత గౌరవ మర్యాదలు ఉంటాయో అంతే పదవి, అంతే గౌరవం ఉంటుంది. కాబట్టి మొదటి రాయల్ ఫ్యామిలీలోకి రావడం కూడా లక్ష్మీ-నారాయణులుగా అవ్వడంతో సమానమే. అందువల్ల పురుషార్థం చేయండి, ఛాన్స్ ఉంది. కాబట్టి లక్ష్యం చాలా మంచిది ఉంచుకున్నారు.
పిల్లలందరూ మేము రాజులము అని అనడంలో ఉన్న సంతోషం మరే తండ్రికీ కలగదు అని బాప్‌దాదా మునుపే వినిపించారు. ఎవరూ ప్రజలము అని అనరు. ఒకే తండ్రికి ఇంతమంది రాజులైన పిల్లలు ఉన్నారంటే అది ఎంత నషా కలిగించే విషయం! అందరూ లక్ష్మీ-నారాయణులుగా అయ్యేవారే. అందువల్ల బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. అర్థమైందా? ఇది వెరైటీ గ్రూప్. కానీ బాప్‌దాదా అందరినీ మధుబన్ నివాసులుగానే చూస్తున్నారు. మీ అసలైన అడ్రస్ ఏమిటి? బొంబాయా, రాజస్థానా, బెంగళూరా... ఏమిటి? నా ఇల్లు అని అనుకోకపోవడమే నష్టోమోహాగా మారడానికి అత్యంత సహజమైన ఉపాయం. నా ఇల్లు, నా కుటుంబం అనుకుంటే నష్టోమోహా కాలేరు. సేవా స్థానం, అసలైన ఇల్లు మధుబన్. మరి సదా ఇంట్లో ఉంటున్నారా లేక సేవా స్థానంలో ఉంటున్నారా? సేవా స్థానంగా భావిస్తే నష్టోమోహా అయిపోతారు. నా బాధ్యత, నా పని, నా ఆలోచన ఇది, నా కర్తవ్యం... ఇవన్నీ మోహాన్ని పుట్టిస్తాయి. సేవకు నిమిత్తమాత్రుడిని. నిజమైన సేవాధారి విశేషత ఏమిటి? సేవాధారి సదా తనను తాను నిమిత్తంగా భావిస్తారు, నాది అని అనుకోరు. నిమిత్త భావం ఎంతగా ఉంటే అంత నిర్మాణ భావం ఉంటుంది, ఎంత నిర్మాణ భావం ఉంటే అంత నవనిర్మాణ కర్తవ్యాన్ని చేయగలరు. నిమిత్త భావం లేకపోతే దేహాభిమానానికి అతీతంగా నిర్మాణచిత్తులుగా కాలేరు. అందువల్ల సేవాధారి అనగా సమర్పణ భావం. సేవాధారిలో సమర్పణ భావం లేకపోతే సేవ ఎన్నడూ సఫలం కాదు, నాది అనే భావం సఫలతను తీసుకురాలేదు.
డబల్ విదేశీయులు విదేశాలకు ఎందుకు వెళ్ళారు? సేవ కొరకే కదా. కానీ మీరు మధుబన్ నివాసులు. భారతదేశ నివాసులా లేక విదేశ నివాసులా? భారతదేశ ఆత్మలే కదా. చూడండి, మీరు డబల్ విదేశీయులుగా కాకపోతే సేవలో భాషల సమస్య ఎంతగా ఉండేది! అన్ని భాషలు నేర్చుకోవడానికి ప్రత్యేకంగా ఒక స్కూల్ ఏర్పాటు చేయాల్సి వచ్చేది. ఇప్పుడైతే సహజంగా సేవ జరుగుతోంది కదా. కాబట్టి సేవార్థమై విదేశాలకు చేరుకున్నారు. రాజ్యం భారతదేశంలోనే చేయాలి కదా. సమస్త విశ్వమే భారతదేశంగా మారుతుంది. అమెరికా మొదలైనవన్నీ భారతదేశంగా మారిపోతాయి. ఇప్పుడైతే ముక్కలు ముక్కలుగా అయిపోయింది. మహాభారతం నుండి అందరూ తమ తమ ముక్కలను తీసుకున్నారు. తీసుకున్నదానిని తిరిగి ఇచ్చేయాల్సిందే కదా. ఎందుకంటే భారతదేశం మహాదాత, అందుకే అందరికీ ముక్కలు ముక్కలుగా ఇచ్చేసింది. మాకు ముక్క ఇవ్వండి అని మీరు అడగనవసరం లేదు, వాళ్ళే స్వయంగా ఇచ్చేస్తారు. కాబట్టి మనమందరం అనంతమైన రాజ్య అధికారులు అనే అనంతమైన నషాను సదా ఉంచుకోండి! స్వరాజ్య స్థితి ద్వారా విశ్వరాజ్యం యొక్క తమ భవిష్యత్తును తెలుసుకోవచ్చు. ఇప్పుడు స్వరాజ్యం సరిగ్గా లేకపోతే విశ్వరాజ్యం కూడా మొదట్లోనే లభించదు, వెనుక లభిస్తుంది అని అర్థం చేసుకోండి. అందరి వద్దా అద్దం ఉంది కదా. నారదునికి అద్దం ఇచ్చారు కదా “చూసుకో నేను ఎవరిని? లక్ష్మిని వరించే యోగ్యత ఉందా?” అని. ఈ స్వరాజ్య స్థితియే అద్దం. ఈ అద్దంలో నేను ఏమి కాబోతున్నాను అనేది మీరే స్వయంగా చూసుకోవచ్చు. అచ్ఛా!
గ్రూప్ నం. 4 :- మనం కల్ప-కల్పపు విజయులము - ఈ నిశ్చయంతో పెద్ద విషయాన్ని కూడా చిన్నదిగా మార్చండి
అందరికీ అన్నింటికంటే ఎక్కువగా ఏ సంతోషం ఉంది? ప్రపంచ ఆత్మల దృష్టి ఎవరిపై పడలేదో వారిపై స్వయంగా పరమాత్మ దృష్టి పడింది అనేదే అందరికంటే పెద్ద సంతోషకరమైన విషయం! ప్రస్తుత కాలంలో ఎన్నికలు జరుగుతాయి కదా. మిమ్మల్ని ఎవరు ఎన్నుకున్నారు? ఈ ఎన్నికల్లో ఏదైనా అవకతవక జరిగిందా? ఏదైనా ఖర్చు చేయాల్సి వచ్చిందా? బాబా మన ఆత్మలను ఎన్నుకున్నారు, తనవారిగా చేసుకున్నారు. ప్రపంచ దృష్టిలో ఎంతో సాధారణ ఆత్మలు, కానీ బాబా దృష్టిలో మహాన్ ఆత్మలు, విశేష ఆత్మలు. కాబట్టి నిన్న ఎలా ఉన్నాము, నేడు ఎలా మారాము, ఎవరి దృష్టిలో పడ్డాము అనే సంతోషంలో ఉండండి! ప్రపంచం కాలదన్నితే బాబా తనవారిగా చేసుకున్నారు. ఎన్ని ఎదురుదెబ్బల నుండి రక్షింపబడ్డారు! 63 జన్మలు ఎదురుదెబ్బలే తింటూ వచ్చారు కదా. భక్తి చేసినా దెబ్బలే తిన్నారు. తమ ప్రవృత్తి జీవితంలోనూ భిన్న రకాల దెబ్బలు తింటూ వచ్చారు. బాబా వచ్చి సరైన స్థానాన్ని ఇచ్చారు. స్థానం లభించాక ఎదురుదెబ్బలు తినడం ఆగిపోతుంది. స్థానం లభించింది కదా. ఎలా ఉండేవారు, ఎలా మారిపోయారు! ఇంత మహాన్‌గా అవుతామని స్వప్నంలోనైనా ఉందా? కానీ ఎంత సహజంగా తయారయ్యారు! ఎలాంటి కష్టాన్నీ చూడాల్సి రాలేదు. ఎంత శ్రేష్ఠమైన భాగ్యం! మరి ఏ పాట పాడుకుంటారు? పొందవలసినదంతా పొందేశాము. ఈ పాట ఆటోమేటిక్‌గా నడుస్తూ ఉంటుంది. నోటితో పాడాల్సిన పని లేదు, హృదయం పాడుతూనే ఉంటుంది. ఈ హృదయపు టేప్‌రికార్డర్ ఎన్నడూ పాడవదు, మాటిమాటికి ఆన్ చేయనవసరం లేదు, స్వతహాగానే నడుస్తూ ఉంటుంది కదా. అచ్ఛా!
అందరూ మాయను జయించారా? అందరూ మాయాజీత్గా అయ్యారా? లేక ఇంకా విజయిగా అవ్వాల్సి ఉందా? ఆట ఆడించడం మాయ పని, ఆట చూడటం మీ పని. ఆటలో కంగారుపడకూడదు. కంగారుపడితే వీళ్ళు కంగారుపడుతున్నారు, ఇప్పుడు గట్టిగా దెబ్బ కొట్టాలి అని అది గ్రహిస్తుంది. మాయ కూడా తెలుసుకోవడంలో తెలివైనదే కదా. ఏది జరిగినా కంగారుపడకండి. విజయం జరిగే ఉంది. దీనిని సంపూర్ణ నిశ్చయబుద్ధి అంటాము. ఏమవుతుందో ఏమో, ఓడిపోతానేమో, విజయం లభిస్తుందో లేదో... ఇవి ఉండకూడదు. పాండవ సైన్యానిది విజయం కాకపోతే ఇంకెవరిది అవుతుంది అనే నషా సదా ఉండాలి! కౌరవులది అవుతుందా ఏంటి? మరి మీరు ఎవరు? పాండవుల విజయం నిశ్చితమే కదా.
ఏ పెద్ద విషయాన్నయినా చిన్నదిగా మార్చడం లేదా చిన్న విషయాన్ని పెద్దదిగా మార్చడం తమ చేతుల్లోనే ఉంది. కొందరి స్వభావం చిన్న విషయాన్ని పెద్దదిగా చేసేదిగా ఉంటుంది, మరికొందరి స్వభావం పెద్ద విషయాన్ని చిన్నదిగా చేసేదిగా ఉంటుంది. మాయ ఎంత పెద్ద విషయంతో ఎదురైనా సరే మీరు దానికంటే పెద్దవారిగా మారితే అది చిన్నదైపోతుంది. మీరు కిందకు దిగితే అది పెద్దదిగా కనిపిస్తుంది, మీరు పైకి వెళ్తే అది చిన్నదిగా కనిపిస్తుంది. ఎంత పెద్ద పరిస్థితి ఎదురైనా మీరు ఉన్నతమైన స్వ-స్థితిలో స్థితులైతే పరిస్థితి చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది మరియు చిన్న విషయంపై విజయం పొందడం సహజమైపోతుంది. అనేకసార్లు విజయిగా అయ్యాము అనే నిశ్చయం ఉంచుకోండి. ఏదో ఈ కల్పంలోనే విజయిగా అవ్వట్లేదు, అనేకసార్లు విజయిగా అయ్యారు. అందువల్ల ఇది కొత్త విషయం కాదు, పాత విషయమే. కానీ ఆ సమయంలో గుర్తురావాలి. సమయం గడిచిపోయాక, ఇది చిన్న విషయమే కదా, నేనే ఎందుకు పెద్దదిగా చేశాను అని తర్వాత గుర్తురాకూడదు. నేను కల్ప-కల్పపు విజయిని అని సమయానికి గుర్తురావాలి.
మాతలకు నషా ఉందా? మాతల భాగ్యం తెరుచుకుంది. మాతలు ఎలా ఉండేవారు, ఎలా మారిపోయారు! ఏ మాతలనైతే ప్రజలు కిందకు పడదోసి, కాలి చెప్పులుగా చేశారో - శరీరంలో కాళ్ళు అన్నింటికంటే కింద ఉంటాయి, చెప్పులు కాళ్ళ కంటే కూడా కింద ఉంటాయి - అలాంటి మాతలను బాబా తలపై కిరీటంగా చేశారు. మాతలకు ఎక్కువ సంతోషం ఉంది కదా! సంతోషంలో నాట్యం చేయాల్సి ఉంటుంది. మరి నాట్యం చేస్తున్నారా? కాళ్ళతో కాదు, మనసుతో సంతోషంలో నాట్యం చేయండి. బాబా లభించారు, సర్వస్వం లభించింది. బాబాకు సంతోషం కలిగినప్పుడు పిల్లలకు కూడా సంతోషం కలుగుతుంది కదా. నేటి ప్రపంచంలో ఇంకేదైనా దొరకవచ్చు కానీ నిజమైన సంతోషం దొరకదు. మీకు నిజమైన సంతోషం లభించింది. ప్రాప్తి ఉంది కనుకే బాబాను స్మృతి చేస్తున్నారు. ఆస్తిని ఇచ్చినప్పుడే తండ్రి ప్రియంగా అనిపిస్తారు. బాబా సంతోషం అనే ఖజానాను ఇచ్చారు. అందుకే చాలా సంతోషంగా స్మృతి చేస్తున్నారు. ఎవరైనా పదమాలు ఖర్చు చేసినా ఈ సంతోషం లభించదు. మరి మీరేమి ఖర్చు చేశారు? ఏమైనా పైసా పెట్టారా? ‘బాబా’ అనగానే ఖజానా లభించింది! కాబట్టి చిల్లిగవ్వ ఖర్చులేకుండా చక్రవర్తిగా అయ్యారు! పెట్టింది ఏమీ లేదు, కానీ చక్రవర్తిగా అయ్యారు!
అందరికంటే పెద్ద చక్రవర్తి ఎవరు? (నిశ్చింత చక్రవర్తి) మరి మీరు నిశ్చింత చక్రవర్తియేనా? లేక ఇక్కడికి వచ్చినప్పుడు నిశ్చింతగా ఉండి, అక్కడికి వెళ్ళాక చింత పడతారా? పిల్లలను ఏమి చేయాలి, మనవలను ఏమి చేయాలి అని మాతలకు చింత కలుగుతుందా? ఇక్కడ కూడా లేదు, అక్కడ కూడా ఉండదు. ఇప్పటి చక్రవర్తులు చింతలున్న చక్రవర్తులు, మీరేమో నిశ్చింత చక్రవర్తులు. పిల్లాడికి ఏమైనా చింత ఉంటుందా? తండ్రి ఉన్నప్పుడు పిల్లలు నిశ్చింతగా ఉంటారు. కాబట్టి నిశ్చింత చక్రవర్తులగా అయ్యారు. అయినా ఏ విషయం గురించైనా చింత పడితే చింతించేవారికి ఎన్నడూ సఫలత లభించదు. చింతించేవారు సమయాన్ని పోగొట్టుకుంటారు, తమను తాము పోగొట్టుకుంటారు, ఎందుకంటే ఎనర్జీ (శక్తి) వేస్ట్ అవుతుంది, మరియు పనిని కూడా పాడుచేసుకుంటారు; ఏ పని కొరకైతే చింతిస్తారో ఆ పనిని కూడా పాడుచేస్తారు. సఫలత కావాలంటే దానికి విధి నిశ్చింతగా అవ్వడమే. అలాంటి చక్రవర్తులు!
సేవలకు సంబంధించి ఏదైనా కొత్త ఇన్వెన్షన్ కనిపెట్టండి. లక్ష్యం ఉంచుకుంటే టచింగ్ స్వతహాగానే కలుగుతుంది. సేవలో ముందుకు సాగడం అనగా స్వయం పురుషార్థంలోనూ ముందుకు సాగడమే. స్వచ్ఛమైన మనసుతో సేవ చేసేవారు సదా ఉన్నతిని పొందుతారు. మిశ్రమ సేవ చేస్తే సఫలత లభించదు, స్వఉన్నతి కూడా జరగదు. అచ్ఛా!
గ్రూప్ నం. 5 :- మంచివారిగా మారితే సర్వ కోరికలు స్వతహాగానే నెరవేరుతాయి
మస్తకంపై విజయపు తిలకం సదా దిద్దబడి ఉన్నట్లు అనుభవమవుతుందా? అవినాశి తండ్రి ద్వారా అవినాశి తిలకం దిద్దబడింది. తిలకం స్మృతికి గుర్తు. తిలకం సదా మస్తకంపై దిద్దుతారు. మస్తకం యొక్క విశేషత ఏమిటి? జ్ఞాపకం లేదా స్మృతి. కాబట్టి విజయపు తిలకధారులు అనగా ‘సదా విజయీ భవ’ వరదానీలు. ఎవరైతే స్మృతి స్వరూపులుగా ఉంటారో వారు సదా వరదానీలు. వరదానాన్ని మీరు అడగవలసిన అవసరం లేదు. వరదానం ఇవ్వండి అని అడుగుతారా? ఏమి అడగాలో కూడా మీకు తెలిసేది కాదు. ఏమి అడగాలో కూడా బాబాయే వచ్చి వినిపిస్తున్నారు. అడగాలనుకుంటే పూర్తి ఆస్తిని అడగండి. మిగిలిన హద్దు వరదానాలైన ఒక అబ్బాయిని ఇవ్వండి, ఒక అమ్మాయిని ఇవ్వండి, ఒక ఇల్లు ఇవ్వండి, మంచి కారు ఇవ్వండి, మంచి భర్తను ఇవ్వండి... ఇవే అడుగుతూ వచ్చారు కదా. అనంతమైనదానిని అడగడం అంటే ఏమిటో కూడా తెలిసేది కాదు. అందుకే ఇంత కిందకు పడిపోయి అడిగేది కూడా హద్దుది, అల్పకాలికమైనది అడుగుతున్నారు అని బాబాకు తెలుసు. ఈరోజు కారు దొరుకుతుంది, రేపు పాడైపోతుంది, యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఏమి చేస్తారు? మళ్ళీ ఇంకో కారు ఇవ్వండి అని అడుగుతారు! మీరైతే అధికారులుగా అయ్యారు. అనంతమైన బాబా యొక్క అనంతమైన ఆస్తికి అధికారులుగా అయ్యారు. ఇప్పుడు స్వతహాగానే వరదానాలు ప్రాప్తించేశాయి. దాత పిల్లలుగా, వరదాత పిల్లలుగా అయినప్పుడు వరదానాల ఖజానా పిల్లలదే అవుతుంది కదా. వరదానాల ఖజానాయే మనదైనప్పుడు ఇక అడగవలసిన అవసరం ఏముంది!
అడగడం నుండి తప్పించుకున్నాము అనే సంతోషంలో ఇప్పుడు ఉండండి. ఆలోచనలో కూడా లేనిది సాకార రూపంలో లభించింది. ప్రతి విషయంలో సంపన్నులయ్యారు, ఎలాంటి లోటూ లేదు. మీ దేవతా జీవితం గురించి గానం చేసేటప్పుడు కూడా సర్వ గుణ సంపన్నులు అంటారు, కొద్ది గుణాలు కలవారు అని అనరు. సర్వ గుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు. 14 కళలు అని అనరు కదా. పురుషోత్తములు అంటారు, సాధారణ పురుషులు అనరు. పురుషులలోనూ ఉత్తములు. కాబట్టి సర్వ అనగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యారు. ఎందుకంటే బాబా సర్వశక్తిమాన్, కాబట్టి మీరందరూ కూడా సర్వమూ అయ్యారు కదా - సర్వ గుణ సంపన్నులు, మాస్టర్ సర్వశక్తిమాన్. మరి ఇంత సంతోషం ఉంటుందా? అయినా అడగకుండా లభించేదానిని శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. బాబా ఆస్తి హక్కు రూపంలో సర్వస్వాన్నీ ఇచ్చేశారు, అధికారంలో ఏ లోటూ ఉంచలేదు. ఏదైనా వస్తువు లోటు ఉందా? చిన్న ఇల్లు ఉంది, ఇంకాస్త పెద్దది బాగున్న ఇల్లు కావాలని ఆలోచిస్తున్నారా? పెద్ద ఇల్లు దొరికితే గీతా-పాఠశాల తెరుద్దాం అని ఆలోచిస్తున్నారా? ఇది అడుగుతున్నారా? అడగకూడదు. అడగడం ద్వారా లభించదు. ఎందుకంటే అడగడం అనగా కోరిక. హద్దు కోరిక అయిపోయింది కదా. సేవా భావమే అయినప్పటికీ ‘అడగడం’ సరైనది కాదు. అడగవలసిన అవసరమే లేదు, మీ అనంతమైన సేవ యొక్క సంకల్పం హద్దు కోరిక లేకుండా ఉంటే అది తప్పక పూర్తవుతుంది. కోరిక ఉంచుకునేవారి కోరిక తీరదు. కానీ మంచివారిగా మారేవారి కోరిక తీరుతుంది, స్వతహాగానే ప్రాప్తి లభిస్తుంది. అందువల్ల ఏదీ అడగవలసిన ఆవశ్యకత లేదు. ప్రాప్తి స్వరూపులా లేక ‘అడిగే స్వరూపమా’? శుభ కామన స్వతహాగానే నెరవేరుతుంది. ఏమవుతుందో, ఎలా అవుతుందో అని ఆలోచించను కూడా ఆలోచించరు, కానీ స్వతహాగానే ప్రాప్తి లభిస్తుంది. మనం ఇంత ఉన్నతమైన బ్రాహ్మణులుగా అవుతాము అని అనుకున్నారా? అనుకోలేదు కానీ సహజంగానే అయిపోయారు కదా.
సదా సంపన్నంగా ఉండండి. సంపన్నమైన ఆత్మ అచలంగా ఉంటుంది. సంపన్నంగా లేనివారిలో అలజడి ఉంటుంది. ఈ సమయంలోనూ సంపన్నులుగా అయ్యారు, భవిష్యత్తులో రాజ్యం చేసేటప్పుడు కూడా ఎంత సంపన్నంగా ఉంటారు! ఎలాంటి లోటూ ఉండదు. పూజ్యులుగా అయినప్పుడు మీ మందిరాలు కూడా ఎంత సంపన్నంగా ఉంటాయి! భారతదేశ మందిరాల ద్వారా ఇతరులు ధనవంతులయ్యారు. మీ జడ చిత్రాల మందిరాలే అంత సంపన్నంగా ఉన్నప్పుడు మీరు ఇంకెంత సంపన్నంగా ఉంటారు! అప్రాప్తి అనే నామరూపాలు ఉండవు. సత్యయుగంలో ఏమైనా అప్రాప్తి ఉంటుందా? ప్రస్తుతం ఏదైనా అప్రాప్తి ఉందా? సర్వస్వం లభించింది! సరే, సత్యయుగంలో బాబా (శివబాబా) ఉంటారా? మరి అప్రాప్తి జరిగినట్లా కాదా? జరిగింది కదా. కాబట్టి సత్యయుగం కంటే కూడా సర్వ ప్రాప్తులు ఇప్పుడే ఉన్నాయి. ఎంత సంతోషం, ఎంత నషా!
మేమే అర్థ కల్పం రాజ్య అధికారులుగా అవుతాము, అర్థ కల్పం పూజ్య ఆత్మలుగా అవుతాము మరియు సంగమంలో సర్వ ప్రాప్తి సంపన్న ఆత్మగా అవుతాము అని సదా స్మృతిలో ఉంచుకోండి. మొత్తం కల్పమంతా సంపన్నంగా ఉన్నారు కదా! ఎందుకంటే ఇప్పటి సంపన్నత మొత్తం కల్పమంతా రాజ్య రూపంలోనూ మరియు పూజ్య రూపంలోనూ నడుస్తుంది. కలియుగాంతం అయినప్పటికీ ఇప్పటికీ తాము ఎండు రొట్టె తింటూ దేవతలకు శ్రేష్ఠమైన భోగ్‌ను అర్పిస్తారు. చైతన్య మనుషులకు నివసించడానికి స్థలం ఉండదు, ఫుట్‌పాత్‌లపై పడుకుంటారు, గుడిసెలు వేసుకుని పడుకుంటారు, కానీ మీ జడ చిత్రాలు ఎంత విధిపూర్వకంగా మందిరాలలో ఉంటాయి! చైతన్యమగా ఉన్నవారికి చోటు దొరకదు కానీ మీ జడ చిత్రాలకు చోటు ఇస్తారు! ఎంతెంత పెద్ద మందిరాలు ఉన్నాయి! విగ్రహం ఎంత ఉంటుంది! మూడు అడుగుల నేల కావాలి, కానీ మందిరాలు ఎంత పెద్దవి కడతారు! కాబట్టి ఈ అంతిమ జన్మలో కూడా ఆత్మలైన మీరు ఎంత సంపన్నులు! మీ జడ చిత్రాలు కూడా సంపన్నమైనవి. చైతన్యంలోనూ సంపన్నులే కదా.
మొత్తం కల్పం యొక్క శ్రేష్ఠ భాగ్యం ఇప్పుడు లభిస్తోంది. లభించింది! భాగ్యవిధాత ప్రతి బిడ్డ యొక్క పూర్తి కల్పపు భాగ్యరేఖను గీసేశారు. మొత్తం కల్పమంతా పేరు ప్రసిద్ధి చెందుతుంది. మరి ఇంత నషా ఉంటుందా? మా పూజ జరుగుతుంది అని అర్థం చేసుకుంటున్నారా? ఎవరి పూజ జరుగుతుంది? మీ మందిరం ఉందా? లేదా పెద్ద పెద్ద మహారథుల మందిరాలా? బ్రాహ్మణులుగా అయినవారే దేవతలుగా అవుతారు, దేవతలే తప్పకుండా పూజ్యులుగా అవుతారు. నంబరువారీగా ఉన్నారు కానీ తప్పకుండా పూజ్యులుగా అవుతారు. మందిరాలు కూడా నంబరువారీగా ఉన్నాయి కదా. కొన్ని విగ్రహాలకు పూజ ఎంత విధిపూర్వకంగా జరుగుతుందో చూడండి! మరికొన్ని మందిరాలలో అప్పుడప్పుడు పూజ జరుగుతుంది. ఎవరైతే అప్పుడప్పుడు స్మృతిలో ఉంటారో వారి విగ్రహానికి పూజ కూడా అప్పుడప్పుడే జరుగుతుంది, ఎవరైతే సదా స్మృతిలో ఉంటారో, సదా శ్రీమతంపై నడుస్తారో వారి పూజ కూడా సదా జరుగుతుంది. ప్రతి కర్మలోనూ కర్మయోగిగా ఉండేవారి ప్రతి కర్మకూ పూజ జరుగుతుంది. పెద్ద పెద్ద మందిరాలలో ప్రతి కర్మకూ పూజ జరుగుతుంది - భోజనానికీ పూజ ఉంటుంది, ఉయ్యాల ఊపేందుకూ ఉంటుంది, శయనానికీ ఉంటుంది, మేల్కొలుపుకూ ఉంటుంది. ఎంతటి స్మృతి ఉంటే అంతటి రాజ్యం, అంతటి పూజ. నేను ఎంతగా స్మృతిలో ఉంటున్నాను అని ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అచ్ఛా!
*** ఓంశాంతి ***
