‘‘బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస - సదా ఉల్లాసము మరియు ఉత్సాహము’’
ఈరోజు త్రిమూర్తి శివబాబా పిల్లలందరినీ విశేషంగా మూడు సంబంధాలతో చూస్తున్నారు. అన్నింటికన్నా మొట్టమొదటి ప్రియమైన సంబంధము - సర్వ ప్రాప్తులకు అధికారులైన వారసులు, వారసులతో పాటు ఈశ్వరీయ విద్యార్థులు, అలాగే ప్రతి అడుగులో ఫాలో చేసేటువంటి సద్గురువుకు ప్రియమైనవారు. త్రిమూర్తి శివబాబా పిల్లల యొక్క ఈ మూడు సంబంధాలను విశేష రూపంలో చూస్తున్నారు. ఆ మాటకొస్తే సర్వ సంబంధాలను నిర్వర్తించడంలో అనుభవీ ఆత్మలే కానీ ఈరోజు విశేషంగా మూడు సంబంధాలను చూస్తున్నాము. ఈ మూడు సంబంధాలు అందరికీ ప్రియమైనవి. ఈరోజు విశేషంగా త్రిమూర్తి శివ జయంతిని జరుపుకునే ఉల్లాసముతో అందరూ పరుగుపరుగున చేరుకున్నారు. తండ్రికి శుభాకాంక్షలు ఇచ్చేందుకు వచ్చారా లేక తండ్రి నుండి శుభాకాంక్షలు తీసుకునేందుకు వచ్చారా? రెండు పనులు చేయడానికి వచ్చారు. పేరే శివ జయంతి లేక శివరాత్రి అని అన్నప్పుడు త్రిమూర్తి అనే పదము దేనిని ఋజువు చేస్తుంది? ప్రజాపిత బ్రహ్మా ద్వారా ఏం చేస్తారు? బ్రాహ్మణులైన మీ రచనను రచిస్తారు కదా. తర్వాత వీరి పాలన జరుగుతుంది. కనుక త్రిమూర్తి అన్న పదము ఏమి ఋజువు చేస్తుందంటే - తండ్రితో పాటు బ్రాహ్మణ పిల్లలైన మీరు కూడా తోడుగా ఉన్నారు. తండ్రి ఒంటరిగా ఏం చేస్తారు! అందుకే తండ్రి జయంతి అనగా బ్రాహ్మణ పిల్లలైన మీ జయంతి కూడా. కనుక తండ్రి పిల్లలకు ఈ అలౌకిక దివ్య జన్మకు లేక ఈ వజ్రతుల్య జయంతికి పదమాపదమాల రెట్లు శుభాకాంక్షలను ఇస్తున్నారు. మీ అందరి శుభాకాంక్షలతో కూడిన ఉత్తరాలు, కార్డులు తండ్రి వద్దకు చేరుకున్నాయి మరియు ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు, దూరంగా ఉన్నా లేక సమ్ముఖంలో ఉన్నా, అందరూ హృదయపూర్వకంగా శుభాకాంక్షల పాటను పాడుతున్నారు. దూరంగా ఉన్నవారి శుభాకాంక్షల పాట కూడా చెవులకు వినిపిస్తుంది. దానికి బదులుగా బాప్‌దాదా కూడా దేశ-విదేశాలలోని పిల్లలందరికీ పదమాపదమాల అభినందనలను ఇస్తున్నారు.
పిల్లలందరికీ తెలిసిన విషయమేమిటంటే, బ్రాహ్మణ జీవితంలో ఏదైనా ఉత్సవాన్ని జరుపుకోవడం అనగా సదా ఉల్లాస-ఉత్సాహాలు నిండిన జీవితాన్ని తయారుచేసుకోవడము. బ్రాహ్మణుల అలౌకిక డిక్షనరీలో జరుపుకోవడము అనగా తయారవ్వడమని అర్థము. మరి కేవలం ఈరోజు మాత్రమే ఉత్సవాన్ని జరుపుకుంటారా లేక సదా ఉత్సాహభరిత జీవితాన్ని తయారుచేసుకుంటారా? ఏ విధంగానైతే ఈ స్థూల శరీరంలో శ్వాస ఉంటే జీవితముంది. ఒకవేళ శ్వాస ఆగిపోతే జీవితం ఏమవుతుంది? సమాప్తమవుతుంది. అలాగే బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస - సదా ఉల్లాసము మరియు ఉత్సాహము. బ్రాహ్మణ జీవితంలో ప్రతి క్షణము ఉల్లాస-ఉత్సాహాలు లేకపోతే అది బ్రాహ్మణ జీవితం కాదు. శ్వాస యొక్క వేగం కూడా సామాన్యంగా ఉండాలి. ఒకవేళ శ్వాస యొక్క వేగం ఎక్కువ ఉన్నా సరే జీవితం యథార్థమైనదిగా ఉండదు మరియు తక్కువగా ఉన్నా సరే అది యథార్థమైన జీవితమని అనబడదు. హై ప్రెషర్ లేక లో ప్రెషర్ అవుతూ ఉంటుంది కదా, దానిని సామాన్యమైన జీవితము అని అనరు. కనుక ఇక్కడ కూడా చెక్ చేసుకోండి - ‘‘నా బ్రాహ్మణ జీవితంలో ఉల్లాస-ఉత్సాహాల వేగం సామాన్యంగా ఉందా? లేదా ఒకసారి చాలా వేగంగా, ఒకసారి చాలా నెమ్మదిగా అవుతుందా? ఏకరసంగా ఉంటుందా?’’. ఏకరసంగా ఉండాలి కదా. ఒకసారి ఎక్కువగా, ఒకసారి తక్కువగా ఉండడం, ఇది మంచిది కాదు కదా. అందుకే సంగమయుగం యొక్క ప్రతి ఘడియ ఉత్సవమే. ఇదైతే విశేషంగా మనోరంజనం కోసం జరుపుకుంటారు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితంలో ఇంకెక్కడికి వెళ్ళి మనోరంజనాన్ని జరుపుకుంటారు! ఇక్కడే జరుపుకుంటారు కదా! విశేషంగా ఏదైనా సముద్ర తీరానికి లేక తోటకు లేక క్లబ్బుకు అయితే వెళ్ళరు కదా. ఇక్కడే సముద్ర తీరం కూడా ఉంది, తోట కూడా ఉంది, అలాగే క్లబ్ కూడా ఉంది. ఈ బ్రాహ్మణుల క్లబ్ బాగుంది కదా! కనుక బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస - ఉల్లాస-ఉత్సాహాలు. శ్వాస యొక్క వేగం సరిగ్గా ఉంది కదా లేక అప్పుడప్పుడు కిందా-మీదా అవుతుందా? బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ చెక్ చేస్తూ ఉంటారు. ఇది చెవుల్లో (స్టెతస్కోప్) పెట్టుకుని చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈరోజుల్లో సైన్స్ కూడా అన్నీ ఆటోమేటిక్‌వి తయారుచేస్తుంది.
శివ జయంతి లేక శివరాత్రి, రెండింటి రహస్యాన్ని బాగా తెలుసుకున్నారు కదా! ఈ రెండింటి రహస్యాన్ని స్వయం కూడా తెలుసుకున్నారు మరియు ఇతరులకు కూడా స్పష్టంగా వినిపించగలరు ఎందుకంటే ఇది తండ్రి జయంతితో పాటు మీది కూడా. మీ జన్మదిన రహస్యాన్ని అయితే వినిపించగలరు కదా! స్మృతి చిహ్నాన్ని అయితే భక్తులు కూడా చాలా భావనతో జరుపుకుంటారు. కానీ తేడా ఏమిటంటే వారు శివరాత్రి నాడు ప్రతి సంవత్సరం వ్రతం పెట్టుకుంటారు మరియు మీరేమో పిక్నిక్ చేసుకుంటారు ఎందుకంటే మీరందరూ జన్మ తీసుకుంటూనే సదా కాలానికి అనగా సంపూర్ణ బ్రాహ్మణ జీవితం కోసం ఒకేసారి వ్రతాన్ని ధారణ చేసారు, అందుకే పదే-పదే చేయాల్సిన అవసరం లేదు. వారు ప్రతి సంవత్సరం వ్రతం పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్రాహ్మణ ఆత్మలైన మీరందరూ జన్మ తీసుకుంటూనే ఏ వ్రతం చేపట్టారంటే - మేము సదా తండ్రి సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా ఉంటాము. ఈ వ్రతాన్ని పక్కాగా తీసుకున్నారా లేక కొద్దిగా కచ్చాగా (అపరిపక్వంగా) ఉందా...? ఆత్మ మరియు పరమ-ఆత్మ యొక్క సంబంధము అవినాశీ అన్నప్పుడు వ్రతము కూడా అవినాశీగా ఉంటుంది కదా. ప్రపంచం వారు కేవలం ఆహార-పానీయాల వ్రతం పెట్టుకుంటారు. దీని ద్వారా కూడా ఏం ఋజువవుతుంది? మీరు బ్రాహ్మణ జీవితంలో సదా కొరకు ఆహార-పానీయాల వ్రతం కూడా పెట్టుకున్నారు కదా. లేక ఏది కావాలంటే అది తినవచ్చు అని ఆహార-పానీయాల విషయంలో స్వేచ్ఛ ఉందా? పక్కా వ్రతం ఉందా లేక అప్పుడప్పుడు అలసిపోతే వ్రతాన్ని భంగపర్చవచ్చా? ఎప్పుడైనా సమయం లభించకపోతే ఏం తయారుచేసుకుంటాలే, ఏదో ఒకటి తెప్పించుకుని తినేద్దాము’ అని అనుకుంటారా? కొద్ది-కొద్దిగా ఢీలా చేస్తారా? చూడండి, మీ భక్తులు వ్రతం పెట్టుకుంటున్నారు. సంవత్సరంలో ఒక్కసారే పెట్టుకున్నా కానీ మర్యాదను పాలన అయితే చేస్తున్నారు కదా. మరి మీ భక్తులు వ్రతంలో పక్కాగా ఉన్నప్పుడు మీరెంత పక్కాగా ఉన్నారు? పక్కాగా ఉన్నారా? అప్పుడప్పుడు కొద్దిగా ఢీలా చేస్తారా - సరేలే, భోగ్ రేపు పెడదాములే, ఈరోజు వద్దులే అని అనుకుంటారా? ఇది కూడా బ్రాహ్మణాత్మలైన మీరు మీ జీవితంలో తీసుకున్న అనంతమైన వ్రతానికి స్మృతిచిహ్నముగా తయారై ఉంది.
విశేషంగా ఈరోజున పవిత్రతా వ్రతం కూడా పెట్టుకుంటారు. ఒకటేమో పవిత్రతా వ్రతం పెట్టుకుంటారు, రెండవది ఆహార-పానీయాల వ్రతం పెట్టుకుంటారు, మూడవది మొత్తం రోజంతటిలో ఎవ్వరికీ ఏ రకమైన దుఃఖమివ్వరు లేక మోసం చేయరు, ఈ వ్రతం కూడా పెట్టుకుంటారు. కానీ మీ ఈ బ్రాహ్మణ జీవితం యొక్క వ్రతము అనంతమైనది, వారి వ్రతము ఒక్క రోజుది. పవిత్రతా వ్రతాన్ని అయితే బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే ధారణ చేసారు కదా! కేవలం బ్రహ్మచర్యం మాత్రమే కాదు, పంచ వికారాలపై కూడా విజయులుగా అవ్వాలి - దీనినే పవిత్రతా వ్రతమని అంటారు. కనుక ఆలోచించండి, పవిత్రతా వ్రతంలో ఎంతవరకు సఫలురుగా అయ్యాము? ఏ విధంగానైతే బ్రహ్మచర్యము అనగా కామమనే మహాశత్రువును జయించేందుకు విశేషమైన అటెన్షన్ పెడతారో, అదే విధంగా కామమనే మహాశత్రువు యొక్క నాలుగు సహచరులు ఏవైతే ఉన్నాయో, వాటి పట్ల కూడా అంతే అటెన్షన్ ఉంటుందా? లేదంటే కొద్ది-కొద్దిగా క్రోధం చేసినా ఫర్వాలేదు అని దాని కోసం అనుమతి ఉందా? వాస్తవానికి అలాంటి అనుమతి లేదు కానీ మీకు మీరే అనుమతిని ఇచ్చుకుంటారు. క్రోధం యొక్క పిల్లా-పాపలు ఏవైతే ఉన్నాయో, వాటికి మీరు అనుమతినిచ్చారని చూడడం జరిగింది. క్రోధమనే మహా భూతాన్ని అయితే పారద్రోలారు కానీ దాని పిల్లాపాపలు ఏవైతే ఉన్నాయో, వాటి పట్ల కాస్త ప్రీతిని ఇప్పటికీ పెట్టుకున్నారు. ఏ విధంగానైతే చిన్నపిల్లలు మంచిగా అనిపిస్తారు కదా, అలా క్రోధం యొక్క పిల్లలు అప్పుడప్పుడు ప్రియంగా అనిపిస్తాయా! వ్రతము అనగా సంపూర్ణ పవిత్రతా వ్రతము. చాలామంది పిల్లలు చాలా మంచి-మంచి విషయాలను వినిపిస్తారు. ‘‘క్రోధం రాలేదు కానీ క్రోధం తెప్పించారు, మరి ఏం చేయాలి? నాకు రాలేదు కానీ ఇతరులు తెప్పిస్తారు’’ అని అంటారు. చాలా మజా కలిగించే విషయాలను మాట్లాడుతారు. ఆ సమయంలో మీరు ఉంటే మీకు కూడా వచ్చేది అని అంటారు. అప్పుడు బాప్‌దాదా ఏమంటారు? బాప్‌దాదా కూడా - అచ్ఛా, మిమ్మల్ని క్షమించాను కానీ ఇకముందు మళ్ళీ చేయవద్దు అని అంటారు.
శివరాత్రి అంటే అర్థమే - అంధకారాన్ని తొలగించి ప్రకాశాన్ని తీసుకొచ్చే రాత్రి. మాస్టర్ జ్ఞాన సూర్యులు ప్రత్యక్షం అవ్వడము, ఇదే శివరాత్రి. మీరు కూడా మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అయి విశ్వంలో అంధకారాన్ని తొలగించి ప్రకాశాన్ని ఇచ్చేవారు. ఎవరైతే విశ్వానికి ప్రకాశము ఇస్తారో వారు స్వయం ఎలా ఉంటారు? స్వయం అంధకారంలో అయితే ఉండరు కదా. దీపం వలె అయితే లేరు కదా? దీపం కింద అంధకారం ఉంటుంది, పైన వెలుగు ఉంటుంది. మీరు మాస్టర్ జ్ఞాన సూర్యులు. కనుక మాస్టర్ జ్ఞాన సూర్యులు స్వయం కూడా ప్రకాశ స్వరూపులు, లైట్-మైట్ రూపులు మరియు ఇతరులకు కూడా లైట్-మైట్ ఇచ్చేవారు. ఎక్కడైతే సదా ప్రకాశముంటుందో అక్కడ అంధకారం యొక్క ప్రశ్నే ఉండదు, అంధకారం ఉండనే ఉండజాలదు. కనుక సంపూర్ణ పవిత్రత అనగా ప్రకాశము. అంధకారాన్ని తొలగించే ఆత్మల వద్ద అంధకారం ఉండదు. ఉండగలదా? రాగలదా? సరే ఉండదు, కానీ వచ్చి వెళ్ళిపోవడము అనేది జరగగలదా? ఒకవేళ ఏ వికారం యొక్క అంశమైనా ఉంటే దానిని ప్రకాశమని అంటారా లేక అంధకారమని అంటారా? అంధకారం సమాప్తమైపోయింది కదా. శివరాత్రి చిత్రం కూడా చూపిస్తారు కదా. అందులో ఏం చూపిస్తారు? అంధకారం పారిపోతూ ఉందా లేక కొద్ది-కొద్దిగా ఉండిపోయిందా? ఈ శివరాత్రికి విశేషంగా ఏం చేస్తారు? ఏమైనా చేస్తారా లేక కేవలం జెండా ఎగరేస్తారా? మేము ఇది చేయము, ఇది చేయము... అని సదా ప్రతిజ్ఞ చేస్తారు, కానీ మళ్ళీ అలాగే చేస్తూ ఉంటారు... ఇలా అయితే కాదు కదా? ఇంతకుముందు కూడా వినిపించాము కదా - ప్రతిజ్ఞ అంటే అర్థమే ప్రాణం పోయినా ప్రతిజ్ఞ పోకూడదు. ఏదైనా త్యాగం చేయాల్సి వచ్చినా, ఏదైనా వినాల్సి వచ్చినా కానీ ప్రతిజ్ఞ పోకూడదు. అంతేకానీ ఏ సమస్యా లేనప్పుడు ప్రతిజ్ఞను పాటించడము, ఒకవేళ ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య శక్తిశాలిగా అవ్వటము మరియు ప్రతిజ్ఞ దాని ముందు బలహీనంగా అవ్వటము కాదు. దీనిని ప్రతిజ్ఞ అని అనరు. మాట అంటే మాటే. మరి ఇటువంటి ప్రతిజ్ఞను మనసు ద్వారా చేయాలి, నోటి ద్వారా కాదు. చెప్పటం వలన చేసేవారు ఆ సమయానికైతే శక్తిశాలి సంకల్పము చేస్తారు. చెప్పటం వలన చేసేవారిలో శక్తి అయితే ఉంటుంది కానీ సర్వ శక్తులు ఉండవు. మనసుతో ప్రతిజ్ఞ చేసేటప్పుడు ఎవరితో చేస్తారు? తండ్రితో. కావున తండ్రితో మనసు ద్వారా ప్రతిజ్ఞ చేయడం అనగా మనసును ‘మన్మనాభవ’ గా కూడా చేసుకోవడము మరియు మన్మనాభవ యొక్క మంత్రము సదా ఎలాంటి పరిస్థితిలోనైనా యంత్రంగా అవుతుంది. కానీ మనసు ద్వారా చేసినప్పుడే ఇలా అవుతుంది. నేను ఇలా చేయకూడదు అని మనసులో రావాలి. ఒకవేళ మనసులో ఈ సంకల్పాలు వస్తే - ప్రయత్నిస్తాను, చేయాల్సిందే కదా, అవ్వాల్సిందే కదా, ఇలా చేయకపోతే ఏమవుతుంది, ఏం చేస్తాను, అందుకే చేద్దాములే... ఈ సంకల్పాలు వస్తే దీనిని తప్పదు కదా అని చేయడమని అంటారు. ఎవరైతే మనసుతో చేస్తారో వారు - చేయాల్సిందే కదా అని ఆలోచించరు. వారు ఎలా ఆలోచిస్తారంటే - తండ్రి చెప్పారంటే అది అయ్యే ఉంది. నిశ్చయము మరియు సఫలతలో ఖచ్చితంగా ఉంటారు. ఇది మొదటి నంబరు ప్రతిజ్ఞ. రెండవ నంబరు ప్రతిజ్ఞ - అవ్వాల్సిందే కదా, చేయాల్సిందే కదా, ఎప్పుడవుతుందో తెలియదు. ఇలా ‘కదా, కదా’ అని అనడమంటే చిలుక వలె అయినట్లు కదా. బాప్‌దాదా వద్ద ప్రతి ఒక్కరూ ఎన్ని సార్లు ప్రతిజ్ఞ చేసారు అన్న ఆ ఫైల్ అంతా ఉంది. ఫైల్స్ చాలా పెద్దవి అయిపోయాయి. ఇప్పుడిక ఫైల్స్ నింపకండి, ఫైనల్ చేయండి. చీటిపై ప్రతిజ్ఞ రాయించండి అని ఎవరైనా బాప్‌దాదాతో అంటే, బాప్‌దాదా ఎదురుగా మొత్తం ఫైల్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అలాగే చేస్తారా? ఫైల్లో మరొక కాగితాన్ని చేరుస్తారా లేక ఫైనల్ ప్రతిజ్ఞ చేస్తారా?
ప్రతిజ్ఞ బలహీనమయ్యేందుకు ఒకే ఒక్క కారణాన్ని బాప్‌దాదా చూసారు. ఆ ఒక్క పదము రకరకాల రాయల్ రూపాలలో వస్తుంది మరియు బలహీనంగా చేస్తుంది. ఆ ఒక్క పదము ఏమిటంటే - దేహాభిమానము యొక్క ‘నేను.’ ఈ ‘నేను’ అన్న పదమే మోసం చేస్తుంది. ‘నేను’ ఇలా భావిస్తున్నాను, ‘నేనే’ ఇది చేయగలను, ‘నేను’ ఏదైతే చెప్పానో అదే కరెక్ట్, ‘నేను’ ఏదైతే ఆలోచించానో అదే కరెక్ట్. ఇలా రకరకాల రాయల్ రూపాలలో ఈ ‘నేను’ అనేది ప్రతిజ్ఞను బలహీనం చేస్తుంది. చివరికి బలహీనమైపోయి నిరాశతో కూడిన మాటలు ఆలోచిస్తారు - నేను ఇంత సహనం చేయలేను; స్వయాన్ని ఒక్కసారిగా ఇంత నిర్మానంగా చేసుకోవడమా, ఇంత చేయలేను; ఇన్ని సమస్యలను దాటలేను, కష్టము. ఈ ‘నేను’ అనేది బలహీనంగా చేస్తుంది. దీనికి చాలా మంచి రాయల్ రూపాలు ఉన్నాయి. మీ జీవితంలో చూసుకోండి - ఈ ‘నేను’ అనేది సంస్కారం రూపంలో, స్వభావం రూపంలో, భావం రూపంలో, భావన రూపంలో, మాటల రూపంలో, సంబంధ-సంపర్కాల రూపంలో మరియు ఇంకా ఎన్నో మధురమైన రూపాలలో వస్తుందా? శివరాత్రి రోజున ఈ ‘నేను-నేను’ అనేది బలి ఇవ్వబడుతుంది. భక్తులు పాపం ‘మే, మే’ అనే మేకను బలి ఇచ్చారు. కానీ వాస్తవానికది ఈ ‘మై, మై’ (నేను, నేను అనేది), దీనిని బలి ఇవ్వండి. స్మృతిచిహ్నమైతే మీదే కానీ దానిని మరొక రూపంలో జరుపుకుంటున్నారు. బలి అయ్యారా లేక ఇప్పుడింకా కొద్దిగా ‘నేను’ అనేదాని బలి మిగిలి ఉందా? రిజల్టు ఏమిటి? ప్రతిజ్ఞ చేయాలనుకుంటే సంపూర్ణ ప్రతిజ్ఞను చేయండి. తండ్రి పట్ల ప్రేమ ఉన్నప్పుడు, ప్రేమలో అయితే అందరూ పాస్ అయ్యారు. తండ్రి పట్ల 75% ప్రేమ ఉంది, 50% ప్రేమ ఉంది అని ఎవరైనా అంటారా? ప్రేమ విషయంలో అందరూ 100% కంటే ఎక్కువ ప్రేమ ఉంది అని అంటారు. తండ్రి కూడా ఏమంటారంటే - అందరూ ప్రేమించేవారే, ఇందులో పాస్ అయ్యారు. మరి ప్రేమలో త్యాగం చేయడమనేది ఏపాటి విషయము! కనుక ప్రతిజ్ఞను మనసుతో చేయండి మరియు దృఢంగా చేయండి. పదే-పదే స్వయాన్ని చెక్ చేసుకోండి - ప్రతిజ్ఞ శక్తిశాలిగా ఉందా లేక పరీక్ష శక్తిశాలిగా ఉందా? ఏదో ఒక పరీక్ష ప్రతిజ్ఞను బలహీనం చేసేస్తుంది.
డబల్ విదేశీయులైతే ప్రతిజ్ఞ చేయడంలో తెలివైనవారు కదా. భంగపర్చడంలో కాదు, జోడించడంలో తెలివైనవారు. బాప్‌దాదా డబల్ విదేశీయులందరి భాగ్యాన్ని చూసి హర్షిస్తారు. తండ్రిని గుర్తించారు, ఇదే మీరు చేసిన అన్నిటికంటే గొప్ప అద్భుతము! రెండవ అద్భుతము - వెరైటీ వృక్షంలోని కొమ్మలు అయినప్పటికీ ఒక్క తండ్రి యొక్క చందన వృక్షానికి కొమ్మలుగా అయ్యారు! ఇప్పుడు అందరూ ఒకే వృక్షం యొక్క కొమ్మలు. భిన్నతలో ఏకతను తీసుకొచ్చారు. దేశాలు వేరు, భాషలు వేర్వేరు, సంస్కృతులు వేర్వేరు, కానీ మీరు భిన్నతలో ఏకతను తీసుకొచ్చారు. ఇప్పుడు అందరి కల్చర్ (సంస్కృతి) ఏమిటి? బ్రాహ్మణ కల్చర్. కనుక ఎప్పుడూ - మా విదేశీ కల్చర్ ఇలా ఉంటుంది అని అనకండి, అలాగే భారతవాసులు కూడా - మా భారత్ కల్చర్ ఇలా ఉంటుంది అని అనకూడదు. భారత్ కల్చర్ కాదు, విదేశీ కల్చర్ కాదు - బ్రాహ్మణ కల్చర్. కనుక భిన్నతలో ఏకత - ఇదే కదా అద్భుతము! ఇంకా ఏ అద్భుతం చేసారు? తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత అన్ని రకాల వేర్వేరు ఆచార-పద్ధతులు, దినచర్య మొదలైనవన్నీ కలిపి ఒకటిగా చేసారు. అమెరికాలో ఉన్నా, లండన్‌లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ బ్రాహ్మణుల దినచర్య ఒక్కటేనా లేక వేర్వేరుగా ఉంటుందా? విదేశాలలో దినచర్య వేరు, భారత్‌లో దినచర్య వేరు, ఇలా కాదు. అందరిదీ ఒక్కటే. కనుక ఈ భిన్నతను త్యాగం చేయడము కూడా అద్భుతము. ఏయే అద్భుతాలు చేసారో అర్థమయిందా? ఎలాగైతే - తండ్రి అద్భుతం చేసారు అని మీరు తండ్రి కోసం పాడుతారు కదా, అలా తండ్రి కూడా - పిల్లలు అద్భుతం చేసారు అని పాడుతారు. బాప్‌దాదా చూసి-చూసి హర్షిస్తారు. తండ్రి హర్షిస్తారు మరియు పిల్లలు సంతోషంలో నాట్యం చేస్తారు.
నలువైపులా దేశ-విదేశాలలోని వారు సేవ గురించి వింటూ ఉంటారు. ఇరువురూ సేవలో రేస్ చేస్తున్నారు. అన్ని ప్రోగ్రామ్‌లు బాగా జరిగాయి మరియు ఇకముందు కూడా బాగా జరుగుతూ ఉంటాయి. ఈ దృఢ సంకల్పాన్ని ఉపయోగించడమంటే సఫలం అయినట్లు. ఎంతగా దృఢ సంకల్పాన్ని సఫలం చేస్తూ ఉంటారో, అంతగా సహజ సఫలతను అనుభవం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా - ఇది ఎలా అవుతుంది అని ఆలోచించకండి. ‘ఎలా’ అని ఆలోచించేందుకు బదులుగా ‘ఇలా’ అవుతుంది అని ఆలోచించండి. సంగమములో ఉన్న విశేషమైన వరదానమే - అసంభవాన్ని సంభవం చేయడము. కనుక ‘ఎలా’ అన్న పదము రానే రాదు. ఇది అవ్వడం కష్టము, ఇలా కాదు. ఈ నిశ్చయం పెట్టుకుని ముందుకు వెళ్ళండి - ఇది అయ్యే ఉంది, కేవలం ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. ఇది కేవలం రిపీట్ అవ్వనున్నది. ఇది తయారై ఉంది, తయారై ఉన్నదానిని తయారుచేయడం అనగా రిపీట్ చేయడము. సహజ సఫలతకు ఆధారము - దృఢ సంకల్పాల ఖజానాను సఫలం చేయండి అని దీనినే అంటాము. అర్థమయిందా! ఏమవుతుంది, ఎలా అవుతుంది అని కాదు. అవుతుంది మరియు సహజంగా అవుతుంది! సంకల్పాలలోనే అలజడి ఉంటే అది సఫలతను అలజడిలోకి తీసుకొస్తుంది. అచ్ఛా!
నలువైపులా ఉన్న సదా ఉత్సవం జరుపుకునేవారు, సదా ఉల్లాస-ఉత్సాహాలలో ఎగిరేవారు, సదా సంపూర్ణ ప్రతిజ్ఞకు పాత్రులైన అధికారీ ఆత్మలు, సదా అసంభవాన్ని సహజంగా సంభవం చేసేవారు, సదా అన్ని రకాల పరీక్షలను బలహీనం చేసి ప్రతిజ్ఞను శక్తిశాలిగా చేసేవారు, సదా తండ్రి ప్రేమకు రిటర్న్‌లో దేనినైనా త్యాగం చేసే ధైర్యం కలవారు, ఇటువంటి త్రిమూర్తి శివబాబాకు జన్మ-సహచరులైన బ్రహ్మణాత్మలకు అలౌకిక జన్మదినం యొక్క ప్రియస్మృతులు మరియు శుభాకాంక్షలు. విశేషమైన శ్రేష్ఠ ఆత్మలకు బాప్‌దాదా యొక్క నమస్తే.
బాప్‌దాదా దాదీ మరియు దాదీ జానకీలను కౌగిలించుకుని ఇలా అన్నారు :-
చూసేవారికి కూడా సంతోషంగా ఉంది. అందరూ సదా బ్రహ్మా బాబా భుజాలలో ఇమిడి ఉన్నారు. సదా బ్రహ్మా బాబా భుజాలే పిల్లలందరి రక్షణకు (సేఫ్టీకి) సాధనం. మరి ఎక్కడ ఉంటారు? భుజాలలో ఉంటారు కదా! ఎవరైతే ప్రియంగా ఉంటారో వారు సదా భుజాలలో ఉంటారు. సేవలో బాప్‌దాదా భుజాలుగా ఉన్నారు మరియు నివసించడంలో బాబా భుజాలలో ఉంటారు. రెండు దృశ్యాలూ అనుభవమవుతున్నాయి కదా. ఒకసారి భుజాలలో ఇమిడిపోండి మరియు మరొకసారి భుజాలుగా అయ్యి సేవ చేయండి! ఏ భుజాలుగా ఉంటారు? రైట్ హ్యాండ్ (కుడి భుజం). రైట్ హ్యాండ్ కదా! లెఫ్ట్ హ్యాండ్ (ఎడమ భుజం) కాదు కదా. రైట్ హ్యాండ్ అంటేనే అర్థం - శ్రేష్ఠమైన కార్యాలు చేసేవారు. లెఫ్ట్ హ్యాండ్ అయితే మీ ప్రజలకు కూడా ప్రజలుగా అవుతారు. కానీ బ్రాహ్మణులైన మీరందరూ రైట్ హ్యాండ్స్. మేము భగవంతుని యొక్క రైట్ హ్యాండ్స్ అని ఈ నషా ఉందా? ఏ సాధారణ రీతి మహాత్మా, ధర్మాత్ములకు కాదు, పరమాత్మకు రైట్ హ్యాండ్! వీరిద్దరినీ చూసి అందరూ సంతోషిస్తారు. నిమిత్త ఆత్మలను అలసటకు గురి చేయడం లేదు కదా? మంచి మంచి కథలు వినిపిస్తారు. మంచిది. మీ అందరినీ సర్వ అనుభవాల గనిగా నింపడానికి వీరు నిమిత్తంగా ఉన్నారు. మంచిది! కాన్ఫరెన్స్ లేదా రిట్రీట్ - రెంటి ఫలితం చాలా బాగుంది! మంచిది! విదేశాలకు నిమిత్తంగా ఉన్న ఆది రత్నాలు కూడా మంచి సంఖ్యలో వచ్చారు. కొందరు దూరంగా ఉన్నప్పటికీ సమీపంగా ఉన్నారు. అయినా కూడా చక్కగా చేరుకున్నారు. (17వ తేదీన 10 సంవత్సరాల నుండి జ్ఞానంలో నడుస్తున్న సోదర-సోదరీమణుల విశేష సమారోహం జరుపుకున్నారు) చాలా మంచిది, మీ ధైర్యానికి అభినందనలు! 10 సంవత్సరాలు నిశ్చయబుద్ధితో దాటారు, కాబట్టి అచలంగా-నిశ్చలంగా ఉన్నందుకు అభినందనలు. ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాలు పూర్తయిన వారు ఏమి చేయాలి? ఎలాగైతే 10 సంవత్సరాలు సమస్యలను దాటుతూ ధైర్యం-ఉత్సాహాలతో నడుస్తూ, ఎగురుతూ వచ్చారో, అలాగే ఇప్పుడు త్వరలోనే స్థాపన యొక్క డైమండ్ జూబ్లీ రాబోతోంది, అందులో మళ్ళీ పాత్ర తీసుకోండి. డైమండ్ జూబ్లీ కూడా ముందే ముందస్తుగా పక్కా అయిపోయింది కదా. ఎక్కువ రోజులు లేవు. చాలా మంచి దృశ్యం, బాబాకు బాగా నచ్చింది. ఆత్మికత యొక్క దృశ్యం చాలా బాగుంది!
అవ్యక్త బాప్‌దాదాతో వ్యక్తిగత మిలనము
గ్రూప్ నం. 1
సంగమయుగం యొక్క ప్రతి సెకను అత్యుత్తమైనది - ఈ నిశ్చయంతో సహజయోగిగా అవ్వండి
అన్ని పాయింట్ల యొక్క సారం ఏమిటి? పాయింట్ (బిందువు)గా అవ్వడం. అన్ని పాయింట్ల యొక్క సారం పాయింట్‌గా అవ్వడం. మరి పాయింట్‌గా అవ్వడం సహజమా లేదా కష్టమా? సహజమైన విషయం సదా ఉంటుంది మరియు కష్టమైనది అయితే కొన్నిసార్లు (సమ్‌టైమ్) ఉంటుంది. అత్యంత సహజమైనది ఏమిటి? పాయింట్. పాయింట్‌ను రాయడం సహజం కదా! ఎప్పుడైతే పాయింట్ రూపంలో స్థితమవ్వరో, అప్పుడు క్వశ్చన్-మార్క్ (ప్రశ్నార్థకం) యొక్క వరుస నిలబడుతుంది కదా! క్వశ్చన్-మార్క్ కష్టంగా ఉంటుంది! కాబట్టి ఎప్పుడు క్వశ్చన్-మార్క్ వచ్చినా దానికి బదులుగా సులభమైన ‘పాయింట్’ పెట్టేయండి. ఏ విషయాన్నయినా సమాప్తం చేయాలంటే దానికి బిందువు (పాయింట్) పెట్టండి అంటారు. ఫుల్స్టాప్ పెట్టడం వచ్చు కదా! ఫుల్స్టాప్ పెట్టడానికి సహజమైన స్లోగన్ గుర్తుంచుకోండి - ఏదైతే జరిగిందో, జరుగుతోందో, జరగబోతోందో అది మంచిదే జరుగుతుంది! ఎందుకంటే మంచిగా అనిపించనప్పుడే ప్రశ్న వస్తుంది. అందుకే సంగమయుగమే అత్యుత్తమమైనది, ప్రతి సెకను అత్యుత్తమమైనది. దీని ద్వారా సదా సహజయోగి జీవితాన్ని అనుభవం చేస్తారు! ‘మంచిది’ అని అనడం ద్వారా మంచే జరుగుతుంది. స్వయంగా కూడా మంచిగా ఉంటారు మరియు చేసే కర్మలు కూడా మంచిగా ఉంటాయి! మంచిదానిని చూసి ఇతరులు తప్పకుండా ఆకర్షితులవుతారు. అందరూ మంచిదానినే ఇష్టపడతారు. మంచిది! సేవ బాగా జరుగుతోంది కదా! సంఖ్యను కూడా పెంచండి మరియు క్వాలిటీని (నాణ్యతను) కూడా పెంచుతూ వెళ్ళండి. ఒకరి పేరుతో అనేకమందికి కళ్యాణం జరిగేలా మైక్‌లను తయారు చేయండి. స్వయంగా సదా సంతుష్టంగా ఉన్నారా? మీ కోసం ఎలాంటి ప్రశ్న లేదు కదా! ‘నిశ్చయము’ అనేది పునాది (ఫౌండేషన్). నిశ్చయం అనే పునాది ఉంటే కర్మలు ఆటోమేటిక్‌గా శ్రేష్ఠంగా ఉంటాయి. మొదట నిశ్చయం యొక్క స్మృతి ఉంటుంది. సంకల్పంలో నిశ్చయం అంటే దృఢత్వం ఉంటే కర్మలు ఆటోమేటిక్‌గా ఫలితాన్నిస్తాయి. మంచిది! అందరూ సంతోషంగా మరియు సంతుష్టంగా ఉన్నారు! సదా సంతోషంలో నాట్యం చేసేవారు! అలజడి సమయం సమాప్తమైపోయింది. గతాన్ని గతంగా మార్చేశారు మరియు భవిష్యత్తు అయితే చాలా సుందరంగా ఉంది! గోల్డెన్ భవిష్యత్తు!
గ్రూప్ నం. 2
సర్వ ఖజానాలను సఫలం చేయడమే సమర్థ ఆత్మ యొక్క గుర్తు
సదా మిమ్మల్ని మీరు బాబా యొక్క సమర్థ పిల్లలుగా అనుభవం చేసుకుంటున్నారా? సమర్థ ఆత్మల యొక్క గుర్తు ఏమిటి? సమర్థ ఆత్మలు ఏ ఖజానాన్నయినా వ్యర్థం చేయరు. సమర్థత అంటే వ్యర్థం సమాప్తమవ్వడం. సంగమయుగంలో బాబా ఎన్ని ఖజానాలు ఇచ్చారు? అత్యంత పెద్ద ఖజానా శ్రేష్ఠ సంకల్పాల ఖజానా. సంగమ సమయం కూడా అత్యంత పెద్ద ఖజానా. సర్వ శక్తులు కూడా ఖజానా; సర్వ గుణాలు కూడా ఖజానా. కాబట్టి సర్వ ఖజానాలను సఫలం చేయడమే సమర్థ ఆత్మ యొక్క గుర్తు. సదా ప్రతీ ఖజానా సఫలమవుతోందా లేక వ్యర్థం కూడా అవుతోందా? ఎప్పుడైనా వ్యర్థం అవుతోందా? ఎంతగా సమర్థంగా అవుతారో, అంతగా వ్యర్థం స్వతహాగానే సమాప్తమవుతుంది. వెలుగు రాగానే చీకటి తొలగిపోయినట్లు. ఎందుకంటే ప్రతి ఖజానా యొక్క విలువ ఎంత గొప్పదో మీకు తెలుసు, సంగమయుగం యొక్క పురుషార్థం ఆధారంగానే మునుపటి కల్పం మొత్తానికి ప్రారబ్ధం లభిస్తుంది! కాబట్టి ఒక సెకను, ఒక శ్వాస, ఒక గుణం యొక్క విలువ ఎంత గొప్పది! ఒక్క సంకల్పం లేదా ఒక్క సెకను వ్యర్థంగా పోయినా, కల్పం మొత్తం దానికి నష్టం జరుగుతుంది. మరి ఇది గుర్తుంటోందా? ఒక సెకను ఎంత పెద్దది! కాబట్టి కేవలం ఒక సెకను మాత్రమే వ్యర్థమైంది కదా అని ఎప్పుడూ అనుకోవద్దు! కానీ ఆ ఒక సెకను అనేక జన్మల సంపాదనకు లేదా నష్టానికి ఆధారము. అడుగులో పదమాల సంపాదన ఉందని గాయనం ఉంది కదా. ఒక అడుగు వేయడానికి ఎంత సమయం పడుతుంది? సెకను మాత్రమే పడుతుంది కదా. సెకను పోగొట్టుకోవడం అంటే పదమాలను పోగొట్టుకోవడమే. ఈ విలువను సదా ఎదురుగా ఉంచుకుంటూ సఫలం చేస్తూ వెళ్ళండి. స్వయం కొరకైనా, ఇతరుల కొరకైనా సఫలం చేస్తూ వెళితే, అలా సఫలం చేయడం ద్వారా సఫలతామూర్తులుగా అనుభవం చేసుకుంటారు. సఫలత అనేది సమర్థ ఆత్మకు జన్మహక్కు. జన్మహక్కు (బర్త్-రైట్) లభించింది కదా! ఏ కర్మ చేసినా, జ్ఞాన స్వరూపులుగా అయ్యి కర్మ చేయడం వల్ల సఫలత తప్పక లభిస్తుంది. కాబట్టి సఫలతకు ఆధారము - వ్యర్థంగా పోగొట్టుకోకుండా సఫలం చేయడమే. కేవలం వ్యర్థం చేయలేదు అని అనుకోవడమే కాక, సఫలం కూడా చేశారా? ఎంతగా కార్యంలో ఉపయోగిస్తారో అంతగా పెరుగుతూ పోతుంది.
ఖజానాలను పెంచడం వచ్చా? సఫలం చేయడం అంటే ఉపయోగించడం. మరి సదా కార్యంలో ఉపయోగిస్తున్నారా లేక అవకాశం లభించినప్పుడు ఉపయోగిస్తున్నారా? ప్రతి క్షణం చెక్ చేసుకోండి - మనస్సు ద్వారా అయినా, వాచా ద్వారా అయినా, సంబంధ-సంపర్కాల ద్వారా అయినా సఫలం తప్పక చేయాలి. రోజంతా ఎంతమందికి సేవ చేస్తారు? సేవాధారి సేవ చేయకపోతే బాగుండదు కదా. మరి మీరు విశ్వ-సేవాధారులు! ప్రతిరోజూ సేవ చేయాల్సిందే! లభించిన అఖండమైన ఖజానాలను సదా ఇస్తూనే ఉండాలని గుర్తుంచుకోండి. దాత యొక్క పిల్లలు, కాబట్టి ప్రతిరోజూ తప్పకుండా ఇవ్వాలి. మహాదానులుగా ఉన్నవారు ఒక్క రోజు కూడా ఇవ్వకుండా ఉండలేరు. వాచా ద్వారా అవకాశం లభించకపోతే మనస్సు ద్వారా చేయండి, మనస్సు ద్వారా లభించకపోతే మీ కర్మలు లేదా ప్రాక్టికల్ జీవితం ద్వారా సేవ చేయండి. ఈరోజు ఏ విద్యార్థి లభించలేదు, వినేవారు ఎవరూ దొరకలేదు అని కొందరు అంటారు. కానీ మనసా సేవ అనేది అనంతమైన సేవ. మనసా సేవ చేయడం వచ్చా? ఎంతగా మీరు మనస్సు ద్వారా, వాచా ద్వారా స్వయంగా శాంపల్గా మారతారో, ఆ శాంపల్ను చూసి స్వతహాగానే ఆకర్షితులవుతారు. కాబట్టి మీరందరూ ఫస్ట్ క్లాస్ శాంపల్ కదా. ఫస్ట్ క్లాస్ శాంపల్ ఫస్ట్ క్లాస్ వారిని తీసుకువస్తుంది కదా! కేవలం దృఢ సంకల్పం ఉంచుకోండి, అప్పుడు సహజమైపోతుంది. ఒకవేళ విజయం లభిస్తుందో లేదో అని ఎలాంటి వ్యర్థ సంకల్పం లోపల ఉన్నా, ఆ సంకల్పం విజయానికి (సఫలతకు) విఘ్నంగా మారుతుంది! అందుకే ఇది సమయ పరివర్తన సమయం అయినప్పుడు పరివర్తన జరిగి తీరుతుంది, ఇప్పటికే జరిగిపోయింది! ధైర్యపు అడుగు వేయండి, సహాయం ఉంటూనే ఉంటుంది. మీరు ధైర్యవంతులు కదా. సంతోషంతో ‘హా జీ’ అని చెప్పండి! పాండవులు కొంచెం గంభీరంగా ఉన్నారా? ఆలోచిస్తున్నారా! నేను సమర్థ ఆత్మను అని పదే పదే గుర్తుంచుకోండి. అప్పుడు అద్భుతం చేసి చూపిస్తారు. మంచిది! ఇప్పుడు ఎంతమంది వచ్చారో దానికి 10 రెట్లు పెంచి రండి. కష్టమా? మరి 10 రెట్లు కాదు, 100 రెట్లు పెంచి వస్తామని ఎందుకు చెప్పరు. ఎన్ని దీవెనలు లభిస్తాయి! సేవ యొక్క దీవెనలు చాలా సహజంగా ఎగిరేలా చేస్తాయి. ఎగిరేవారే కదా. వచ్చే సంవత్సరం రిజల్ట్ చూద్దాం. మంచిది!
గ్రూప్ నం. 3
వరదాన సంవత్సరంలో దృఢత్వంతో సఫలతను సహజంగా అనుభవం చేసుకోండి
వరదానము మరియు శ్రమల మధ్య గల వ్యత్యాసమేమిటి? ఒకటి – చాలా శ్రమ పడిన తర్వాత ఫలం లభించడం; రెండవది – నిమిత్తమాత్రంగా శ్రమ చేయడం మరియు వరదానము ద్వారా సఫలతను పొందడం. ఈ సంవత్సరం ఎవరైతే “వ్యర్థ సంకల్పం స్వప్నంలో కూడా రాకూడదు” అని దృఢ సంకల్పం చేస్తారో, వారు సఫలతను చాలా సహజంగా అనుభవం చేసుకుంటారు. లాభం పొందుతూ ఉండాలి కదా! ఈ వరదాన సంవత్సరం యొక్క ప్రయోజనాన్ని ఎవరు పొందుతారో చూద్దాం! మీ విషయంలో మీరు దేనినైతే కష్టమని భావిస్తున్నారో, దానిని కూడా సహజంగా అనుభవం చేసుకోవచ్చు; కేవలం క్వశ్చన్ మార్క్ (ప్రశ్నార్థకం)ను సమాప్తం చేయండి. క్వశ్చన్ మార్క్ అనేది సఫలతను పొందడంలో గోడలా మారుతుంది. అందుకే ఈ గోడను సమాప్తం చేయండి. అర్థమైందా? ఈ దృఢత్వమే సఫలతకు తాళంచెవి (కీ)గా మారుతుంది. కాబట్టి తాళంచెవిని ఉపయోగించండి. తాళంచెవిని ఉపయోగించడం వచ్చా? తాళంచెవి మీ దగ్గర ఉందా లేక పోగొట్టుకుంటున్నారా? ఎందుకంటే మాయకు కూడా ఈ తాళంచెవి బాగా నచ్చుతుంది. చూడండి, ఎవరైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు మొదట మీ నుండి తాళంచెవినే అడుగుతారు. అలాగే మాయ కూడా మొదట ఈ తాళంచెవినే ఎగరగొడుతుంది. నా సంకల్పం చాలా మంచిదే, కానీ ఎందుకు నెరవేరలేదు అని మీరు ఆలోచిస్తుంటారు. ఎందుకంటే మధ్యలోనే దృఢత్వమనే తాళంచెవి పోతుంది. తాళంచెవిని భద్రపరుచుకోవడంలో మాతలు చాలా తెలివైనవారిగా ఉంటారు. పాండవులకు తాళంచెవి భద్రపరుచుకోవడం వచ్చా? లేక ఎప్పుడైనా మిస్ చేస్తున్నారా?
అందరి లక్ష్యం సేవ పట్ల మరియు స్వయం పట్ల చాలా మంచిగా ఉంది. కానీ లక్ష్యాన్ని ప్రాక్టికల్‌గా తీసుకురావడానికి మధ్యమధ్యలో అటెన్షన్ ఉంచాల్సి ఉంటుంది. ఒక్కోసారి మీరు ‘అటెన్షన్’ అనే ‘కీ’ (తాళంచెవి)ని మిస్ చేసేస్తారు, దానిని ఎగరగొట్టేస్తారు. అప్పుడు ఏమవుతుంది? టెన్షన్ పెరుగుతుంది! ఎక్కడైతే టెన్షన్ ఉంటుందో, అక్కడ ప్రతిదీ కష్టంగా మారుతుంది. అటెన్షన్‌ను కూడా టెన్షన్‌గా మార్చేస్తుంటారు. బాప్‌దాదా, అటెన్షన్ ఉంచండి, అటెన్షన్ ఉంచండి అని చెప్తారు, కానీ మీరు ఆ అటెన్షన్‌ను టెన్షన్‌గా మార్చేస్తారు. బాప్‌దాదా యొక్క సహాయం, అంటే సహయోగపు హస్తం సదా నా శిరస్సుపై ఉందనే స్మృతిని సదా ఉంచుకోండి. ఈ చిత్రాన్ని సదా ఇమర్జ్ రూపంలో ఉంచుకోండి. ఎవరి శిరస్సుపై అయితే తండ్రి చేయి ఉంటుందో, వారి మస్తకంపై సదా విజయ తిలకం తప్పక ఉంటుంది. మరి మీ మస్తకంపై సదా విజయ తిలకం కనిపిస్తోందా? లేక ఎప్పుడైనా చెరిగిపోతోందా? తండ్రి ఏ విధంగా అయితే అవినాశియో, ఆత్మలైన మీరు కూడా అవినాశి; కాబట్టి ఈ విజయ తిలకం కూడా అవినాశిగా దిద్దబడి ఉంది.
మంచిది, సేవలో ఎంతగా ఉల్లాస-ఉత్సాహాలు ఉంచుకుంటూ వెళ్తారో, అంతగా సహజంగా నిర్విఘ్నంగా తయారవుతారు. ఎందుకంటే సేవలో బుద్ధి బిజీగా ఉంటుంది. ఖాళీగా ఉంటే వేరే విషయాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది, అదే బిజీగా ఉంటే సహజంగానే నిర్విఘ్నంగా మారిపోతారు. మరి బిజీగా ఉంటున్నారా? లేక కొద్దిసేపు బిజీగా, కొద్దిసేపు ఖాళీగా ఉంటున్నారా? కేవలం చేతులు, కాళ్ళు మాత్రమే కాదు, బుద్ధి కూడా బిజీగా ఉండాలి. మనస్సు మరియు బుద్ధి యొక్క టైమ్-టేబుల్ తయారు చేయడం వచ్చా? రోజూ తయారుచేస్తున్నారా లేక సమయం దొరికినప్పుడు తయారుచేస్తున్నారా? కర్మల యొక్క టైమ్-టేబుల్ రోజూ తయారు చేసుకుంటారు కదా, అలాగే మనస్సు-బుద్ధి యొక్క టైమ్-టేబుల్ కూడా తయారుచేసుకోండి. ఎందుకంటే మీరు అందరికంటే గొప్పవారు, అత్యంత ఉన్నతమైనవారు. తండ్రి పిల్లలను ముందడుగులో ఉంచుతారు కదా! మరి వి.ఐ.పి.లు (ప్రముఖులు) ఏం చేస్తారు? టైమ్-టేబుల్ ప్రకారం నడుచుకుంటారు. మరి ఈ పూర్తి చక్రంలో మీకంటే ఉన్నతమైనవారు ఎవరైనా ఉన్నారా? కాబట్టి మీరు కూడా టైమ్-టేబుల్ ప్రకారమే నడుచుకోవాలి కదా! మంచిది!
యు.కె. (U.K.) లో సేవా స్థానాలు మరియు సేవలు చాలా బాగా జరుగుతున్నాయి. స్థానాలు తీసుకోవడంలో కొరతను పూర్తి (మేకప్) చేస్తున్నారు, కానీ స్థితిలో కూడా మేకప్ చేస్తున్నారా? రిజల్ట్ చాలా బాగుంది, ఎందుకంటే మీ అందరి విశాల హృదయపు సహకారం ఉంది. ఈ సహకారమే సేవను పెద్దదిగా చేస్తోంది. నిమిత్తం ఎవరైనా కావచ్చు, కానీ యు.కె. వారి ప్రతి కార్యంలో విశాల హృదయం ఉందనేది స్పష్టంగా కనిస్తోంది; దానికి ప్రత్యక్ష ఫలం లభిస్తోంది. ఇప్పుడు యు.కె.ను ఫాలో చేయండి. ఫ్రాన్స్, కెనడా... అందరూ ఫాలో చేయండి. ఇప్పుడు ఎవరినైతే సహయోగులుగా చేశారో, వారిని వారసులుగా తయారుచేయండి. ఒకవైపు వారసులుగా, మరొకవైపు మైక్లుగా తయారుచేయండి. లండన్ వాళ్ళు ఇండియా వరకు శబ్దం చేరుకునేంత పెద్ద మైక్‌ను ఇంకా తయారుచేయలేదు. లండన్ శబ్దం లండన్‌లోనే ఉండిపోతోంది. మీరు విశ్వ కళ్యాణకారులు కదా! విశాల హృదయం ఉన్నప్పుడు సేవ యొక్క ప్రత్యక్ష ఫలం కూడా పెద్దగానే వస్తుంది. ఏ కార్యం చేసినా స్వయంగా చేయడంలోనూ విశాల హృదయం ఉంచాలి, ఇతరులను సహయోగులుగా చేయడంలోనూ విశాల హృదయాన్ని కలిగి ఉండాలి. స్వయం పట్ల కానీ, సహయోగి ఆత్మల పట్ల కానీ, తోటి సహచరుల పట్ల కానీ ఎప్పుడూ సంకుచిత హృదయంతో ఉండకండి. ఈ విధి చాలా మంచిది. హృదయాన్ని విశాలంగా ఉంచడం వల్ల మట్టి కూడా బంగారంగా మారుతుందని గానం చేయబడింది; బలహీనమైన తోటివారు కూడా శక్తిశాలిగా తయారవుతారు, అసంభవమైన సఫలత కూడా సంభవమవుతుంది. మీరు విశాల హృదయం ఉన్నవారు కదా! ‘నేను-నేను’ అని అనుకునేవారు కారు కదా! ఈ ‘నేను-నేను’ అని అరిచేవారిని మేక హృదయం ఉన్నవారని, విశాల హృదయం ఉన్నవారిని సింహ హృదయం ఉన్నవారని అంటారు. శక్తుల స్వారీ దేనిపైన ఉంటుంది? మేక పైనా లేక సింహం పైనా? సింహం పైనే కదా! మీరు కూడా శక్తి సైన్యం, కాబట్టి మీ స్వారీ సింహం పైనే ఉంది కదా! ‘నేను-నేను’ అనేదానికి బలి ఇచ్చేశారు కదా, సమాప్తం చేశారు కదా! కాబట్టి సదా ఈ స్మృతిని ఉంచుకోండి - ప్రతి సెకను, ప్రతి సంకల్పాన్ని సఫలం చేస్తూ, సఫలత యొక్క అధికారాన్ని ప్రతి సమయం పొందుతూనే ఉంటాము. అచ్ఛా!
గ్రూప్ నం. 4
డబల్ లైట్‌గా ఉండటమే ఎగిరే కళకు సహజ సాధనము
సదా మిమ్మల్ని మీరు ఏ సితారలుగా భావిస్తున్నారు? (సఫలతా సితారలు, లక్కీ సితారలు, మెరిసే సితారలు, ఆశల సితారలు)... తండ్రి నయనాల సితారలు (కంటిపాపలు)! మరి కళ్ళల్లో ఎవరు ఇమడగలరు? ఎవరైతే బిందు రూపంలో ఉంటారో వారే! కళ్ళల్లో చూసే విశేషత ఆ బిందువులోనే ఉంది. మేము తండ్రి కనుపాపలము అనే స్మృతి ఎంతగా ఉంటే, అంత స్వతహాగానే బిందు రూపంలో ఉంటారు. పెద్ద వస్తువేదీ కళ్ళల్లో ఇమడదు. కన్నే చాలా సూక్ష్మమైనది, కాబట్టి సూక్ష్మమైన కంట్లో ఇమిడే స్వరూపం కూడా సూక్ష్మంగానే ఉండాలి. బిందు రూపంలో ఉంటున్నారా? లేక ఈ పొడవాటి-వెడల్పాటి శరీరం గుర్తుకొస్తోందా? ప్రతి కర్మలోనూ సఫలత లేదా ప్రత్యక్ష ఫలాన్ని పొందే సాధనం - రోజూ అమృతవేళ మూడు బిందువుల తిలకం దిద్దుకోవడమేనని బాప్‌దాదా పూర్వమే చెప్పారు. మరి ఆ మూడు బిందువులు గుర్తున్నాయి కదా! తిలకం దిద్దుకోవడం కూడా గుర్తుంటోందా? ఒకవేళ ఈ మూడు బిందువుల తిలకం సదా దిద్దబడి ఉంటే, నిరంతరం ఎగిరే కళ యొక్క అనుభవం జరుగుతూనే ఉంటుంది. మీరు ఏ కళలో నడుస్తున్నారు? ఎగిరే కళలోనా? లేక కొద్దిసేపు ఎగరడం, కొద్దిసేపు నడవటం, కొద్దిసేపు ఎక్కడమా? సదా ఎగిరే కళ ఉండాలి. నడవటం కంటే ఎగరడంలోనే ఆనందం ఉంది కదా! నలువైపుల వాతావరణంలో చూడండి, సమయం ఎగురుతూ వెళ్తోంది. సమయం నడవడం లేదు, వేగంగా ఎగురుతోంది! మరి సమయం ఎగురుతున్నప్పుడు మీరు ఎక్కే కళలోనో, నడిచే కళలోనో ఉంటే రిజల్ట్ ఏమవుతుంది? సరైన సమయానికి చేరుకోగలరా? మరి మీరు చేరుకునేవారా లేక చేరుకునేవారిని చూస్తూ ఉండిపోయేవారా? అందరూ చేరుకునేవారే, చూసేవారు కారు. అందుకే సదా ఎగిరే కళ అవసరం.
ఎగిరే కళకు సాధనం ఏమిటి? బిందు రూపంలో ఉండడం, డబల్ లైట్‌గా కావడం. బిందు రూపులు, మరియు చేసే కర్మల్లో కూడా తేలికతనము (లైట్). ఇలా డబల్ లైట్‌గా ఉంటే తప్పకుండా ఎగురుతారు. అర్థకల్పం నుండి భారాన్ని మోసే అలవాటు ఉండటం వల్ల, బాబాకు భారాన్ని అప్పగించినప్పటికీ మళ్ళీ మళ్ళీ మీరే నెత్తికి ఎత్తుకుంటారు. దానివల్ల అలసిపోతారు, కానీ అలవాటుకు లొంగిపోతారు. నోటితో ‘తేరా’ (నీదే) అంటారు, కానీ మనసులో ‘మేరా’ (నాది) అని చేసుకుంటారు. స్వఉన్నతి కొరకైనా, విశ్వసేవ కొరకైనా ఎంత పని ఉన్నా అది భారంగా అనిపించదు. కానీ ‘నాది’ అనుకోవడమే భారం కావడం! కాబట్టి సదా ఏమి గుర్తుంచుకుంటారు? నాది కాదు, నీదే - ఇది మనస్సు నుండి అనాలి, కేవలం నోటి మాటగా కాదు. నోటితో ‘నీదే నీదే’ అంటూ మనస్సులో ‘నాది’ అని అనుకోకండి. అలాంటి పొరపాటు చేయవద్దు.
బిందు-స్వరూపంలో స్థితి కావడం అంటే డబల్ లైట్‌గా మారడం. పెద్ద వస్తువును ఎత్తడం కష్టం, చిన్న వస్తువును ఎత్తడం సులభం. మరి చిన్న బిందు రూపాన్ని స్మృతిలో ఉంచుకుంటున్నారా లేక ఈ పొడవైన శరీరాన్ని గుర్తుంచుకుంటున్నారా? స్మృతి అంటే – బుద్ధిలో ఉంచుకోవడం. పెద్ద వస్తువును బుద్ధిలో ఉంచుకుని, చిన్న బిందువును వదిలేస్తారు, అందుకే కష్టమవుతుంది. లౌకిక జీవితంలో కూడా చిన్నగా ఉండడం మంచిదా లేక పెద్దగా ఉండడం మంచిదా? చిన్నగా ఉండడమే మంచిది. కాబట్టి చిన్న స్వరూపాన్ని గుర్తుంచుకోవడం మంచిది కదా! ఏమి గుర్తుంచుకుంటారు? బిందువు! బాబా మీకు సులువైన పని ఇచ్చారా లేక కష్టమైనదా? మరి సులువైన పని అయినప్పుడు ‘ఎప్పుడో ఒకసారి’ అని ఎందుకు అంటారు? సహజమైన పనిని ‘సదా’ చేయవచ్చు కదా! బాబా బిందువు, మీరు బిందువు, చేసే పని కూడా బిందువుతోనే ఉన్నప్పుడు ఆ బిందువునే స్మృతి చేయాలి. కాబట్టి ఇప్పుడు డాట్ (బిందువు)ను మరచిపోవద్దు, భారాన్ని మోయవద్దు. మంచిది! ఇది రకరకాల పుష్పాలు ఉన్న పుష్పగుచ్ఛము. అందరూ ఒకరికొకరు తోడుగా ఉన్నారు. విజయం సాధించడం చాలా సహజం. ఎందుకు సహజం? (బాబా తోడున్నారు కాబట్టి) మరియు అనేకసార్లు విజేతలుగా అయ్యారు, కాబట్టి దానిని రిపీట్ చేయడానికి కష్టమేముంది! ఏదైనా కొత్త పని చేయాలంటే కష్టంగా అనిపిస్తుంది, కానీ ఇప్పటికే చేసిన పనిని మళ్ళీ చేయడంలో కష్టం అనిపిస్తుందా? మీరు ఎన్నిసార్లు విజేతలుగా అయ్యారు! ఎంత సహజమో చూడండి! చేసిన పని విషయంలో ‘ఎలా అవుతుంది, ఏమవుతుంది, సరిగ్గా జరుగుతుందో లేదో’ అనే క్వశ్చన్లు రావు. ఇప్పటికే చేసినదే కాబట్టి ఈజీ అయిపోయింది కదా! ఎంత ఈజీ? చాలా ఈజీ! ఇప్పుడు ఈజీగా అనిపిస్తోంది, అక్కడికి వెళ్ళాక కష్టమవుతుందా? సదా ఈజీనే! ఎప్పుడైనా కష్టమనిపిస్తే ‘నేను దీనిని ఇప్పటికే అనేకసార్లు చేశాను’ అని గుర్తు తెచ్చుకోండి, అప్పుడు కష్టానికి బదులు ఈజీ అయిపోతుంది. అందరూ ధైర్యవంతులు. ఏమి గుర్తుంచుకుంటారు? బిందువు. అవ్వాల్సింది బిందువు, దిద్దాల్సింది బిందువు (తిలకం), పెట్టాల్సింది కూడా బిందువే (ఫుల్ స్టాప్). కాబట్టి దీనిని మరచిపోకండి. మంచిది!
గ్రూప్ నం. 5
స్వయంపై రాజ్యం చేసే నిశ్చింత చక్రవర్తులుగా తయారవ్వండి
సదా మిమ్మల్ని మీరు రాజుగా భావిస్తున్నారా? స్వయంపై రాజ్యాధికారం ఉంటేనే స్వరాజ్య అధికారులు. మరియు ఇంకో రకమైన రాజులు ఎవరు? నిశ్చింత చక్రవర్తులు. నిశ్చింత చక్రవర్తులుగా ఈ సమయములోనే తయారవుతారు. ఎందుకంటే సత్యయుగంలో చింత లేదా నిశ్చింత అనే జ్ఞానమే ఉండదు. నిన్న ఏమిగా ఉండేవారు, ఈరోజు ఏమయ్యారు! నిశ్చింత చక్రవర్తులుగా అయిపోయారు కదా! నిశ్చింతగా కావడం వల్ల భండారాలు నిండుగా అయిపోయాయి. బ్రాహ్మణ జీవితం అంటేనే నిశ్చింత చక్రవర్తులు. స్వరాజ్యం లభించింది అంటే సమస్తమూ లభించినట్లే. మరి స్వరాజ్యం లభించిందా? ఏ కర్మేంద్రియాలైనా ఎప్పుడైనా మోసం చేస్తున్నాయా? ఎప్పుడైనా చిన్న ఆట ఆడితే, మీలో కంట్రోలింగ్ పవర్ లేదా రూలింగ్ పవర్ తక్కువగా ఉందని అర్థం. అందుకే ‘నేను స్వరాజ్యాధికారిని, నిశ్చింత చక్రవర్తిని’ అనే స్మృతి నడుస్తున్నా, తిరుగుతున్నా సదా ఉండాలి. తండ్రి వచ్చిందే మీ అందరి చింతలను తనపై వేసుకోవడానికి! మరి మీ చింతలను తండ్రికి ఇచ్చేశారా? ఏమైనా దాచి ఉంచుకున్నారా? మీ జేబులు చెక్ చేసుకోండి. బుద్ధి మరియు మనస్సు అనే రెండు జేబులనూ చూడండి. తండ్రి పిల్లలయ్యాక, పిల్లలు నిశ్చింతగా ఉంటారు. ఎందుకంటే తండ్రి దాత! మరి దాత పిల్లలకు చింత ఎందుకుంటుంది! మంచిది, వీరు ఏ భాష మాట్లాడేవారు? (స్పానిష్, పోర్చుగీస్)... చూడండి, సైన్స్ సాధనాలు మీ సేవకు ఉపయోగపడుతున్నాయి కదా! డ్రామా అనుసారంగా సైన్స్ వారికి కూడా తండ్రికి ఆవశ్యకత ఉన్నప్పుడే ఆ ఆలోచన వచ్చింది. సాధనాలను ఉపయోగించడం వేరు, సాధనాలకు వశమైపోవడం వేరు. మరి మీరు సాధనాలను ఉపయోగిస్తున్నారా లేక సాధనాలకు వశమవుతున్నారా? సాధనాలేమైనా మిమ్మల్ని తమవైపు ఆకర్షిస్తున్నాయా? మాస్టర్ క్రియేటర్‌గా ఉండి క్రియేషన్ (రచన) నుండి లాభం పొందండి. ఒకవేళ వశమైపోతే అవి దుఃఖాన్నిస్తాయి. మంచిది!
అమృతవేళ 3.00 గంటలకు స్వయంగా అవ్యక్త బాప్‌దాదా శివ-ధ్వజాన్ని ఎగురవేసి, అదే స్థానంలో నిలబడి బ్రహ్మా వత్సలను ఉద్దేశించి పలికిన మహావాక్యాలు:
ఈనాటి శివరాత్రి లేదా శివజయంతి ఉత్సవం సందర్భంగా ప్రతిఒక్కరికీ పదమాపదమ రెట్ల అభినందనలు! సదా ప్రతి సెకను ఉల్లాస-ఉత్సాహాలను పెంచుకుంటూ, ఈ విశ్వాన్నంతటినీ ఉత్సాహభరితమైన మీ రాజ్యంగా మార్చుకుంటారు. ఈరోజు ఇతరుల రాజ్యంలో సేవాధారులుగా అయి సేవ చేస్తున్నారు, కానీ రేపు మీ స్వరాజ్యంతో పాటు విశ్వ రాజ్యానికి కూడా రాజ్యాధికారులుగా కాబోతున్నారు! కాబట్టి సదా ప్రతి సెకను ఉత్సాహాన్ని నింపుతూ ఉండండి, దీవెనలు పొందుతూ ఉండండి. ప్రతి సెకను దీవెనలు పొందుతూ, దీవెనలు ఇస్తూ ఉండండి. మీ దీవెనల వల్ల సకల ఆత్మలు సదా సుఖీగా మారిపోతాయి. సకల ఆత్మలు తండ్రి జెండా కింద, ఛత్రఛాయ కింద నిలబడే ఆ రోజు త్వరలోనే రాబోతోంది! కాబట్టి అభినందనలు! నలువైపులా ఉన్న పిల్లలకు, హృదయ సింహాసనంపై ఉన్న పిల్లలకు అభినందనలు... అభినందనలు!!
*** ఓంశాంతి ***
