‘‘యథార్థ నిశ్చయము యొక్క పునాది ద్వారా సంపూర్ణ పవిత్రతను ధారణ చెయ్యండి’’
ఈరోజు బాప్‌దాదా దేశ-విదేశాలలో నలువైపులా ఉన్న కొత్త-కొత్త పిల్లలను చూస్తున్నారు. మధుబన్కు సాకార రూపములో వచ్చినా లేక ఆకార రూపంలో తమ-తమ సేవా స్థానాలకు వచ్చి ఉన్నా, ఆ కొత్త-కొత్తవారిని చూసి బాప్‌దాదా వారందరిలోని నిశ్చయాన్ని చూస్తున్నారు ఎందుకంటే నిశ్చయము ఈ బ్రాహ్మణ జీవితము యొక్క సంపన్నతకు పునాది మరియు పునాది దృఢంగా ఉన్నట్లయితే సహజంగా మరియు తీవ్రగతితో సంపూర్ణత వరకు చేరుకోవటము నిశ్చితము. నిశ్చయము కూడా రకరకాలుగా ఉండడాన్ని బాప్‌దాదా చూస్తున్నారు. యథార్థ నిశ్చయము అనగా - నేను తండ్రి అయిన పరమాత్మకు చెందినవానిగా అయ్యాను, స్వయాన్ని కూడా ఆత్మ స్వరూపములో తెలుసుకోవటము, అంగీకరించటము, నడుచుకోవటము మరియు తండ్రిని కూడా వారు ఎవరో, అలానే తెలుసుకోవడము - ఇదే యథార్థ నిశ్చయము.
రెండవ నిశ్చయము - యోగం ద్వారా కొద్ది సమయము కొరకు అశాంతి నుండి శాంతిని అనుభవము చేస్తారు మరియు స్థానం యొక్క శక్తిశాలి శాంత వాయుమండలము ఆకర్షిస్తుంది లేదా బ్రాహ్మణ పరివారము, బ్రాహ్మణ ఆత్మల ఆత్మిక ప్రేమ మరియు పవిత్రతతో కూడిన జీవితము యొక్క ప్రభావము పడుతుంది, సాంగత్యము మంచిగా అనిపిస్తుంది, ప్రపంచములోని వాయుమండలముతో పోలిస్తే ఈ సాంగత్యము మంచిగా అనిపిస్తుంది, జ్ఞానము కూడా మంచిగా అనిపిస్తుంది, పరివారము కూడా మంచిగా అనిపిస్తుంది, వాయుమండలము కూడా మంచిగా అనిపిస్తుంది... కావున ఈ విధంగా మంచిగా అనిపించటము అనే పునాది ఆధారముగా నడుస్తుంటారు. ఇది రెండవ నంబరు. మొదటి నంబరు వినిపించాము ‘యథార్థ నిశ్చయము’ మరియు రెండవ నంబరు ‘మంచిగా అనిపించటము’ మరియు మూడవ నంబరు - ప్రాపంచిక సంబంధీకుల దుఃఖమయ వాతావరణము నుండి తప్పించుకుని ఎంత సమయమైతే సేవా కేంద్రానికి వస్తారో అంత సమయము దుఃఖము నుండి దూరమై శాంతిని అనుభవము చేస్తారు. జ్ఞానం యొక్క గుహ్యతలోకి వెళ్ళరు కానీ శాంతి యొక్క ప్రాప్తి కారణంగా ఒక్కోసారి వస్తారు మరియు ఒక్కోసారి రారు కూడా. కానీ యథార్థమైన నిశ్చయబుద్ధి కలవారు విజయిగా ఉంటారు. ఇది కూడా గమనించడం జరిగింది - మొట్టమొదట్లో వచ్చినప్పుడు అశాంతితో విసిగిపోయి ఉంటారు, శాంతి కావాలన్న కోరికతో ఉంటారు. ఏ విధంగానైతే దాహంతో ఉన్నవారికి ఒక్క నీటి చుక్క లభించినా కానీ దానిని వారు చాలా గొప్పగా అనుభవం చేస్తారు. కావున ఇది అప్రాప్తి నుండి ప్రాప్తి కలిగినట్లు. పరివారంలో, జ్ఞానంలో, యోగంలో, వాయుమండలంలో తేడా కనిపిస్తుంది. కావున మొదట్లో చాలా ఉల్లాస-ఉత్సాహాలతో నడుస్తారు, చాలా నషా ఉంటుంది, సంతోషం కూడా ఉంటుంది. కానీ ఒకవేళ మొదటి నంబరు నిశ్చయమైన ‘యథార్థ నిశ్చయము’ యొక్క పునాది దృఢంగా లేనట్లయితే, రెండవ నంబరు లేక మూడవ నంబరు నిశ్చయము ఉన్నట్లయితే నెమ్మది-నెమ్మదిగా మొదట్లో ఉన్న సంతోషము, మొదట్లో ఉన్న ఉత్సాహము, వీటిలో తేడా వచ్చేస్తుంది.
ఈ సీజన్లో కొత్త-కొత్తవారు చాలామంది వచ్చారు మరియు అవకాశము కూడా లభించింది, ఇదైతే చాలా మంచిది. వీరు మళ్ళీ తమ పరివారములోకి చేరుకున్నారు అని బాప్‌దాదాకు కూడా కొత్త-కొత్త పిల్లలను చూసి సంతోషం కలుగుతుంది. కానీ చెక్ చేసుకోండి - నిశ్చయము అనే పునాది దృఢంగా ఉందా, మా నిశ్చయము నంబర్‌వన్‌లో ఉందా లేక నంబర్ టూ లో ఉందా? ఒకవేళ నంబర్‌వన్ నిశ్చయము ఉన్నట్లయితే నడుస్తూ-నడుస్తూ ముఖ్యమైన పవిత్రతను ధారణ చెయ్యటం కష్టమనిపించదు. ఒకవేళ పవిత్రత అనేది స్వప్నమాత్రంగా కదిలించినా, అలజడిలోకి వచ్చినా, నంబర్‌వన్ పునాది బలహీనంగా ఉందని అర్థం చేసుకోండి ఎందుకంటే ఆత్మ స్వధర్మము పవిత్రత. అపవిత్రత పరధర్మము మరియు పవిత్రత స్వధర్మము. కావున ఎప్పుడైతే స్వధర్మము యొక్క నిశ్చయము ఉంటుందో అప్పుడు పరధర్మము కదిలించలేదు. చాలా మంది పిల్లలు, మొదట్లో చాలా మంచిగా వచ్చేవాళ్ళము, ఇప్పుడు ఏమైందో తెలియదు? అని అంటారు. ఏమవుతుందంటే - తండ్రి ఎవరో, ఏ విధంగా ఉంటారో, ఆ విధంగా అనుభవంలోకి తీసుకురారు. ఒకవేళ తండ్రి తోడుగా ఉన్నారా అని అడిగితే అందరూ చేతులు ఎత్తుతారు. చేతులు ఎత్తడం చాలా సహజము కానీ తండ్రి తోడుగా ఉన్నట్లయితే, వారు సర్వశక్తిమంతుడు అంటూ తండ్రి యొక్క మొట్టమొదటి మహిమను ఏదైతే చేస్తారో, దానిని కేవలము అంగీకరిస్తారా లేక తెలుసుకుంటారా? మరి సర్వశక్తిమంతుడైన తండ్రి తోడుగా ఉన్నట్లయితే సర్వశక్తిమంతుని ఎదురుగా అపవిత్రత రాగలదా? రాలేదు. కానీ రావడమైతే వస్తుంది కదా! మరి ఎక్కడి నుండి వస్తున్నట్లు? వేరే స్థానం ఏదైనా ఉందా? దొంగలు తమకంటూ ప్రత్యేకమైన ద్వారాన్ని తయారు చేసుకుంటారు. దొంగ దారి ఉంటుంది. మరి మీ వద్ద కూడా దాగి ఉన్న దొంగ దారి అయితే ఏమీ లేదు కదా? చెక్ చేసుకోండి. లేదంటే మాయ ఎక్కడి నుండి వచ్చింది? పై నుండి వచ్చిందా? ఒకవేళ పై నుండి వచ్చినా కానీ, పైనే అంతమైపోవాలి. మీకు తెలియకుండా ఏదైనా దాగి ఉన్న ద్వారం నుండి వస్తుందంటే చెక్ చేసుకోండి - మాయ ఏదైనా దొంగ దారిని తయారు చేసుకునైతే పెట్టుకోలేదు కదా? మరియు ఆ ద్వారాన్ని కూడా ఎలా తయారుచేసుకుంటుందో తెలుసా? మీలో విశేషంగా ఏదైనా స్వభావం లేక సంస్కారం బలహీనంగా ఉంటుంది కదా, దానినే మాయ తన ద్వారంగా చేసుకుంటుంది ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా స్వభావము లేక సంస్కారము బలహీనంగా ఉంటే, మీరు ఆ ద్వారాన్ని ఎంతగా మూసినా కానీ అది బలహీనమైన ద్వారం కదా! మాయ అయితే అన్నీ తెలిసినది, ఈ ద్వారం బలహీనంగా ఉంది, దీని ద్వారా దారి లభించవచ్చు అని దానికి తెలిసిపోతుంది మరియు ఆ విధంగా దారి లభిస్తుంది కూడా. నడుస్తూ-నడుస్తూ ఉండగా అపవిత్రతతో కూడిన సంకల్పాలు కూడా వస్తాయి, మాటలు కూడా వస్తాయి, కర్మ కూడా జరిగిపోతుంది. మరి ద్వారం తెరిచే ఉన్నట్లు కదా, అందుకే కదా మాయ వచ్చింది. అటువంటప్పుడు తండ్రి తోడుగా ఉన్నట్లు ఎలా అవుతుంది? అనటానికైతే సర్వశక్తిమంతుడు తోడుగా ఉన్నారు అని అంటారు, మరి ఈ బలహీనత ఎక్కడి నుండి వచ్చింది? బలహీనత ఉండగలదా? ఉండలేదు కదా? మరి ఎందుకు ఉండిపోతుంది? పవిత్రతలో ఏదైనా వికారము ఉన్నట్లయితే, లోభమే ఉందనుకోండి, లోభమంటే కేవలము తినటము-త్రాగటము విషయములోనే కాదు, చాలా మంది ఏమనుకుంటారంటే - మాకు ధరించటంలో, తినటంలో లేక ఉండటంలో ఆకర్షణ అయితే ఏమీ లేదు, ఏది లభించినా, ఏది తయారుచేసినా దాని అనుసారంగానే నడుచుకుంటాము. కానీ ముందుకు వెళ్ళే కొలది మాయ లోభాన్ని కూడా రాయల్ రూపంలో మరియు సూక్ష్మ రూపంలో తీసుకొస్తుంది. ఆ రాయల్ లోభం ఏమిటి? స్టూడెంట్ అయినా లేక టీచర్ అయినా కానీ, మాయ అనేది ఇరువురిలోనూ రాయల్ లోభాన్ని తీసుకువచ్చేందుకు పూర్తి పురుషార్థం చేస్తుంది. ఒక స్టూడెంట్ ఉన్నారనుకోండి, చాలా మంచి నిశ్చయబుద్ధి కలవారు, సేవాధారి, అన్నింటిలో మంచిగా ఉంటారు కానీ ముందుకు వెళ్ళే కొలది రాయల్ లోభము ఎలా వస్తుందంటే - నేను ఇంత చేస్తాను, అన్ని రకాలుగా సహాయకునిగా ఉంటాను, తనువుతో, మనసుతో, ధనంతో ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో సేవలో హాజరవుతాను, అయినా కానీ ఈ జిజ్ఞాసువు చాలా మంచివారు అని నా పేరును టీచరు ఎప్పుడూ వర్ణన చేయరు. ఒకవేళ ఈ రూపంలో కూడా రాకపోతే మాయ వచ్చే మరో రూపం ఏమిటి? అచ్ఛా, పేరు తీసుకున్నారనే అనుకోండి, ఆ పేరు వింటూ-వింటూ - అది నేనే, నేనే చేస్తాను, నేనే చెయ్యగలను, అది అభిమానం రూపంలో వస్తుంది. లేదంటే చాలా పని చేసి వచ్చారు కానీ ఎవ్వరూ మిమ్మల్ని కనీసం అడగలేదు కూడా, ఒక గ్లాసు నీళ్ళు కూడా ఇవ్వలేదు, అసలు చూడనే లేదు, తమ విశ్రాంతిలోనే లేక తమ పనిలోనే బిజీగా ఉన్నారు, అప్పుడు ఇలా కూడా వస్తుంది - ఎంత చేసినా కానీ ఎవ్వరూ అడగరు, ఇంకెందుకు చేయాలి, చేసినా ఒకటే చెయ్యకపోయినా ఒకటే, అడిగేవారు ఎవరూ లేరు, దీనికన్నా ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవచ్చు, కుదిరినప్పుడు సేవ చేస్తాను. వికారాల యొక్క రాయల్ రూపము ఇలా రకరకాలుగా వస్తుంది మరియు ఒక్క వికారము వచ్చినా కూడా, ఒకవేళ లోభం రాకపోయినా కానీ అభిమానం వచ్చినా లేక నన్ను గౌరవించాలి, నాకు విలువ ఉండాలి అనే భానం వచ్చినా, ఇలా ఎక్కడైతే ఒక్క వికారం ఉంటుందో అక్కడ దాని నలుగురు సహచరులు దాగి ఉంటాయి. మీరు ఒక్కదానికి అవకాశమిచ్చినా దాగి ఉన్న మిగిలినవి కూడా సమయం అనుసారంగా తమ అవకాశాన్ని తీసుకుంటుంటాయి. అప్పుడు ఏమంటారంటే, ముందు ఉన్నలాంటి నషా ఇప్పుడు లేదు, ముందు చాలా మంచిగా ఉండేది, మొదట్లో అవస్థ చాలా బాగుండేది, ఇప్పుడు ఏమైందో తెలియదు. మాయ దొంగ దారి నుండి వచ్చింది - ఇదీ విషయం, తెలియదు అని అనకండి.
టీచర్లకు కూడా వస్తుంది. టీచర్లకు ఏం కావాలి? సెంటర్ మంచిగా ఉండాలి, బట్టలు ఎలా ఉన్నా కానీ సెంటరు అయితే కాస్త ఉండేందుకు యోగ్యంగా ఉంటే మంచిగా ఉంటుంది. ఎవరైతే తోడుగా ఉంటారో వారు మంచిగా ఉండాలి, విద్యార్థులు మంచిగా ఉండాలి, బాబా భండారీ మంచిగా ఉండాలి. ఒకవేళ మంచి విద్యార్థి వేరే చోటుకు వెళ్ళిపోతే గుండె కాస్త వేగంగా కొట్టుకుంటుంది. అప్పుడెలా అనుకుంటారంటే - ఏం చెయ్యాలి, వీరు సహాయకులుగా ఉండేవారు కదా, ఇప్పుడు వీరు వెళ్ళిపోయారు. సహాయకుడు జిజ్ఞాసువా లేక తండ్రినా? మరి ఆ సమయంలో ఎవరు కనిపిస్తారు? జిజ్ఞాసువా లేక తండ్రినా? ఈ రాయల్ మాయ పునాదిని కదిలించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ మీకు - సర్వశక్తిమంతుడు తోడుగా ఉన్నారు అన్న నిశ్చయము ఉన్నట్లయితే తండ్రి ఎవరో ఒకరిని తప్పకుండా నిమిత్తం చేస్తారు. కొందరు ఎలా ఆలోచిస్తారంటే - మాకు కనీసం ఒక్కసారైనా ఆబూలో జరిగే కాన్ఫరెన్స్‌లో లేక మరేదైనా పెద్ద కాన్ఫరెన్స్‌లో అవకాశం లభించాలి, పోనీ వేరే ఏదీ కాకపోయినా కనీసం యోగ శిబిరం అయితే చేయించాలి, కనీసం ఈ అవకాశమైనా ఉండాలి కదా, పోనీ భాషణ చేయకపోయినా కనీసం స్టేజ్ పైకైతే రావాలి, చివరికి వినాశనం అయ్యేటట్లు ఉంది, వినాశనం వరకు కూడా మాకు అవకాశం రాదా ఏమిటి, అవకాశమైతే రావాలి కదా! కానీ ఇంతకుముందు కూడా బాప్‌దాదా వినిపించారు - ఒకవేళ యోగ్యులుగా ఉన్నారు, అవకాశం లభించింది అంటే సంతోషంగా చేయండి కానీ మాకు అవకాశం లభించాలి అని ఈ సంకల్పము చెయ్యటము... ఇది కూడా అడగటమే. కావాలి-కావాలి - ఇది రాయల్ రూపంలో అడగటము. ఇలా జరగాలి... వీరు మమ్మల్ని గుర్తించటం లేదు, దాదీ-దీదీలు కూడా అందరినీ గుర్తించటం లేదు, ఎవరు ముందు వస్తే వారిని ముందు పెట్టేస్తారు - ఇటువంటి సంకల్పం రావటం, ఇది కూడా సూక్ష్మంగా అడగటము. కానీ బాప్‌దాదా వినిపించారు కదా, మీరు స్టేజ్ పైకి వచ్చారే అనుకోండి లేదా మీలో ఉన్న ఏదో ఒక విశేషత కారణంగా, మీకు యోగం లేకపోయినా కానీ, మీ అవస్థ అంత మంచిగా లేకపోయినా కానీ, ఒకవేళ మాటల్లో, క్యాచింగ్ పవర్లో విశేషత ఉన్నట్లయితే అవకాశం లభించేస్తుంది, ఎందుకంటే కొందరి వాణిలో మాధుర్యం ఉంటుంది, స్పష్టత ఉంటుంది మరియు వారిలో క్యాచింగ్ పవర్ ఉంటుంది, అప్పుడు వారు అక్కడి నుండి ఇక్కడి నుండి ఉదాహరణలు వగైరా సేకరించి వినిపిస్తారు, అందుకే వారికి పేరు కూడా వస్తుంది. ఎవరు కావాలి అంటే ఫలానావారు కావాలి అంటారు. ఎవరు రావాలి అంటే ఫలానావారు రావాలి అంటారు. వారు యోగంలో బలహీనంగా ఉండవచ్చు... కానీ వీటన్నింటి ఆధారంగా నంబరు ఫైనల్ అవ్వదు. వీరు ఎన్ని భాషణలు చేసారు లేక ఎంతమంది విద్యార్థులను తయారుచేసారు లేక ఎన్ని సెంటర్లను తయారుచేసారు అన్నదానిపై ఫైనల్ నంబరు ఆధారపడదు. కానీ యోగ్యులుగా ఎంతమందిని తయారుచేసారు? సెంటర్ తయారుచెయ్యటం పెద్ద విషయం కాదు కానీ యోగ్యులుగా ఎంతమంది ఆత్మలను తయారు చేసారు? 30 సెంటర్లకు ఇన్ఛార్జ్ అన్న పేరైతే వచ్చింది మరియు ఆ 30లో 15 కదులుతున్నాయి, 15 బాగానే ఉన్నాయి, అప్పుడు అందులో లాభముందా లేక కేవలం పేరు మాత్రమే వచ్చిందా? ఫలానావారికి 30 సేవా కేంద్రాలు ఉన్నాయి అన్న పేరైతే వస్తుంది, కానీ నంబరు అనేది దీని ఆధారంగా లభించదు. ఎంతమందికి సుఖమిచ్చారు, ఎంతగా స్వయం శక్తిశాలిగా ఉన్నారు అన్నదాని ఆధారంగానే ఫైనల్ నంబరు లభిస్తుంది. అందుకే ఈ రకమైన కావాలి-కావాలి అన్నది కూడా సమాప్తం చేయండి లేదంటే యోగం కుదరదు. రోజూ ఇదే చూసుకుంటూ ఉంటారు - ఫలానా చోట ప్రోగ్రామ్ జరిగింది, అయినా నన్ను పిలవలేదు, మొన్న ఇక్కడ జరిగింది, నిన్న అక్కడ జరిగింది, ఈరోజు ఇక్కడ జరిగింది! ఇలా ఉంటే యోగం కుదురుతుందా లేక లెక్కపెట్టుకుంటూ ఉంటారా?
కనుక ముఖ్యమైన విషయం ఏమిటంటే యథార్థ నిశ్చయాన్ని దృఢం చేసుకోండి. నేను ఆత్మను మరియు తండ్రి సర్వశక్తిమంతుడు అని అనటానికైతే అంటారు కానీ అది ప్రాక్టికల్‌గా కర్మలలోకి రావాలి. తండ్రి సర్వశక్తిమంతుడే కానీ మాయ నన్ను కదిలిస్తూ ఉంటే మీ తండ్రి సర్వశక్తిమంతుడు అని ఎవరు ఒప్పుకుంటారు! ఎందుకంటే వారి కన్నా గొప్పవారైతే ఇంకెవ్వరూ లేరు. కనుక బాప్‌దాదా ఈ రోజు నిశ్చయము యొక్క పునాదిని చూస్తున్నారు. కొత్తవారైనా లేక పాతవారైనా కానీ ఈ నిశ్చయము యొక్క పునాదిని ప్రాక్టికల్లోకి తీసుకురండి మరియు సమయానికి ఉపయోగించండి. సమయం గడిచిపోతుంది, అప్పుడు తండ్రి ముందుకు పశ్చాత్తాపంతో వస్తారు - ఏం చెయ్యాలి, బాబా జరిగిపోయింది, మీరైతే దయార్ద్ర హృదయులు, దయ చూపించండి... ఇదేమైనట్లు? ఇది కూడా రాయల్ పశ్చాత్తాపము. వారు తోడుగా ఉన్నారంటే ఎవ్వరికీ ధైర్యముండదు. నిశ్చయబుద్ధి అంటేనే విజయీ అని అర్థము. ఒకవేళ ఏదైనా లెక్కాచారము వచ్చినా మనసును కదలనివ్వకండి. స్థితిని కింద-మీద చేసుకోకండి. సరే, వచ్చింది, వెంటనే దానిని దూరం నుండే సమాప్తము చేయండి. ఇప్పుడు యోధులుగా అవ్వకండి. ఎంతోమంది ఇప్పుడు నిరంతర యోగులుగా లేరు. కొద్ది సమయము యోగులుగా ఉంటారు మరియు కొద్ది సమయము యుద్ధం చేసే యోధులుగా ఉంటారు. కానీ మిమ్మల్ని మీరు ఏమని పిలుచుకుంటారు? యోధులనా లేక యోగులనా? సహజయోగి అని చెప్పుకుంటారు. కొత్తవారెవరైతే వచ్చారో, భాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నందుకు వారికి బాప్‌దాదా మళ్ళీ అభినందనలను తెలుపుతున్నారు. కానీ అభినందనలతోపాటు పునాది నంబర్‌వన్‌గా ఉందా లేక నంబర్ టూ గా ఉందా అన్నదానిని చెక్ చేసుకోండి?
జ్ఞానము, యోగము చాలా మంచిగా అనిపిస్తాయని చాలామంది అంటారు, మంచిది, అది బాగానే ఉంది కానీ వాటిని కర్మలలోకి తీసుకొస్తున్నారా? జ్ఞానము అంటే ఆత్మ, పరమాత్మ, డ్రామా... అని కేవలం ఇలా అనటమే కాదు. జ్ఞానము అనగా వివేకము అని అర్థము. వివేకవంతులు ఎటువంటి సమయమో ఆ సమయమనుసారంగా వివేకాన్ని ఉపయోగించి సదా సఫలతను పొందుతారు. ఎప్పుడైనా చూడండి, జీవితంలో దుఃఖం వస్తే ఏమి ఆలోచిస్తారు? ఇది నాకు ఎందుకు అర్థమవ్వలేదో తెలియడం లేదు అని అంటారు. మరి మీరు వివేకవంతులేనా? జ్ఞానులేనా? అవునా, కాదా చెప్పండి. (హాజీ). అవును అని చాలా బాగా చెప్తారు. వివేకవంతుల గుర్తు, ఎప్పుడూ మోసపోకుండా ఉండటము - ఇది జ్ఞానీల గుర్తు. మరియు యోగీల గుర్తు - సదా స్వచ్ఛమైన మరియు స్పష్టమైన బుద్ధి. స్వచ్ఛంగా కూడా ఉండాలి మరియు స్పష్టంగా కూడా ఉండాలి. యోగి ఎప్పుడూ - తెలియదు, తెలియదు అని అనరు. వారి బుద్ధి సదా స్పష్టంగా ఉంటుంది. మరియు ధారణా స్వరూపులకు గుర్తు - సదా స్వయం కూడా డబల్ లైట్‌గా ఉంటారు. ఎన్ని బాధ్యతలు ఉన్నా కానీ ధారణామూర్తులుగా ఉంటారు, సదా డబల్ లైట్‌గా ఉంటారు. మేళా ఉన్నా లేక గందరగోళం(ఝమేళా) ఉన్నా - రెండింటిలో డబల్ లైట్‌గా ఉంటారు. మరియు సేవాధారికి గుర్తు - సదా నిమిత్తము మరియు నిర్మాన భావము. కనుక వీటన్నింటినీ మీలో చెక్ చేసుకోండి. నాలుగు సబ్జెక్టులు కల ఈశ్వరీయ విద్యార్థులము అని అనటమైతే అందరూ అంటారు కదా. మరి ఆ గుర్తులు కనిపించాలి.
మరి కొత్త-కొత్తవారు ఏం చేస్తారు? మీ నిశ్చయాన్ని ఇంకా దృఢం చేసుకోండి. లేకపోతే ఏమవుతుందంటే రెండు సంవత్సరాలు నడుస్తారు, మూడు సంవత్సరాలు నడుస్తారు, మళ్ళీ తిరిగి పాత ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఎవరైతే తిరిగి వెళ్తారో వారు ఆ ప్రపంచంలో కూడా సెట్ అవ్వలేరు. ఈ ప్రపంచానికీ చెంది ఉండరు, ఆ ప్రపంచానికీ చెంది ఉండరు. అందుకే మీ పునాదిని చాలా దృఢంగా చేసుకోండి. సర్వశక్తిమంతుడైన తండ్రి తోడు ఉన్నారు అని అనుభవము చెయ్యండి. కేవలం ఈ ఒక్క విషయాన్ని అనుభవం చేసినా సరే అన్నింటిలో పాస్ అయిపోతారు. చూడండి, ఈ రోజుల్లో ఎవరైనా ప్రధానమంత్రి లేక మంత్రి వంటివారు తోడుగా ఉన్నా నషా ఉంటుంది కదా, మరి వీరైతే సర్వశక్తిమంతుడు! అచ్ఛా!
ఈ కల్పంలో మొదటిసారి వచ్చినవారు చేతులు ఎత్తండి. మొదటిసారి వచ్చినవారు సదా సంతోషంగా ఉండండి మరియు సదా వర్ధిల్లుతూ ఉండండి. అచ్ఛా - టీచర్లు కూడా చాలా మంది వస్తారు. ఒక సంవత్సరంలో ఎన్ని ఛాన్సులు లభిస్తాయి? ఒక్కటే లభిస్తుంది. 12 మాసాలను 13 మాసాలుగా చేయలేరు కదా. బాప్‌దాదాకు టీచర్లు ఈ విధంగా రిఫ్రెష్ అయి, శక్తిశాలిగా అవ్వాలని హృదయంలో ఉంటుంది - ఏ సేవాకేంద్రానికి ఎవరైనా వెళ్ళినప్పుడు ఒక్క ఆత్మ కూడా బలహీనంగా కనిపించకూడదు. నిర్విఘ్న సేవాకేంద్రానికే మార్కులు లభిస్తాయి. ఈ జోన్లో వెయ్యి సెంటర్లు ఉన్నాయి, వెయ్యి గీతా పాఠశాలలు ఉన్నాయి అని బాప్‌దాదా సంతోషించరు. ఏ జోన్లో గందరగోళం ఉండదో, ఎటువంటి కంప్లైంట్ ఉండదో దానిని చూసి బాప్‌దాదా సంతోషిస్తారు. ఎందుకంటే వాస్తవానికి టీచర్ శ్రమ చేస్తున్నారు, గందరగోళం కూడా జరుగుతోంది, వాతావరణం అలాగే ఉంది అంటే అది సేవా? లేక గొడవా? మరి ఎందుకు వచ్చారు? బ్రహ్మాకుమార్ లేదా బ్రహ్మాకుమారీలుగా ఎందుకు అయ్యారు? గొడవల కోసమా? గొడవలే కావాలంటే ప్రపంచంలో చాలా ప్రదేశాలు ఉన్నాయి. బాప్‌దాదా అక్కడి అడ్రస్ కూడా ఇవ్వగలరు. కానీ బ్రహ్మాకుమార్ మరియు బ్రహ్మాకుమారీలుగా అవ్వడం అంటే మిలన మేళా జరుపుకోవడం, గొడవ కాదు. చూడండి, ఇప్పుడు ఏ లక్ష్యంతో వచ్చారు? గొడవల కోసం వచ్చారా? మిలనము జరుపుకోవడానికి వచ్చారు, కనుక బాగుంది కదా! అందుకే ఎప్పుడూ, ఏ స్టూడెంట్ అయినా లేదా టీచర్ అయినా, అందరూ స్టూడెంట్లే - ఎప్పుడూ గొడవ చేయకండి. గొడవ చేయడం అంటే... ఏమని చెప్పాలి! బాప్‌దాదాకు చెప్పడం కూడా బాగనిపించదు. అందుకే టీచర్ అయినా, మధుబన్ అయినా, మధుబన్ ఉప సేవాకేంద్రాలైనా, గీతా పాఠశాలలైనా లేదా మీ జోన్‌లోని ఉప సేవాకేంద్రాలు లేదా కేంద్రాలు అయినా, ఎవరైతే తమను బ్రాహ్మణ ఆత్మ అని పిలుచుకుంటారో - మిమ్మల్ని మీరు బ్రాహ్మణులు అని పిలుచుకోకండి, క్షత్రియులు అని పిలుచుకోండి. బ్రాహ్మణ్ అనే పేరును చెడగొట్టకండి. బ్రాహ్మణులు అంటే విజయులు. గొడవ చేస్తే వారు క్షత్రియులు, బ్రాహ్మణులు కాదు.
అయితే ఈ రోజు ఏ పాఠాన్ని పక్కా చేసుకుంటారు? ఏ సంకల్పం చేస్తారు? ప్రతి ఒక్కరూ మనసు, వాణి, కర్మ, సంబంధం, సంపర్కంలో గొడవల నుండి ముక్తులుగా అవ్వాలి. గొడవ ఉండకూడదు. ప్రతిరోజూ చెక్ చేసుకోండి. వ్యర్థ సంకల్పాల గందరగోళం కూడా గొడవే. ఇతరులతో లేకపోయినా, మీ మనసులో అయితే గొడవ ఉంది. కనుక అందరూ ఏ సంకల్పం చేస్తారు? ఏమవుతారు? చెప్పండి - గొడవల నుండి ముక్తులు. ఎందుకంటే డైమండ్ జూబిలీ వస్తోంది. డైమండ్ జూబిలీలో గొడవలు చేసే డైమండ్ కావాలా? మీరు ఇష్టపడతారా? చాలా అందమైన డైమండ్ల మధ్యలో రెండు-నాలుగు గొడవలు చేసే డైమండ్లు ఉంటే ఇష్టపడతారా? ఇష్టపడరు. కానీ దీనికి చాలా సహజమైన విధి ఉంది, శ్రమ చేయవలసిన అవసరం కూడా లేదు. గొడవల నుండి ముక్తులుగా అయ్యేందుకు అన్నింటికంటే సహజమైన విధి - ముందుగా స్వయాన్ని గొడవల నుండి ముక్తులుగా చేసుకోండి. ఇతరుల వెనుక పడకండి. ఈ స్టూడెంట్ ఇలా ఉన్నారు, ఈ సహచరులు ఇలా ఉన్నారు, ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి - వాటిని చూడకండి, స్వయాన్ని గొడవల నుండి ముక్తులుగా చేసుకోండి. ఎక్కడ గొడవ ఉందో అక్కడ మీ మనసును, బుద్ధిని పక్కకు తీసుకోండి. ఈ గొడవ పూర్తి అయితే చాలా బాగుంటుంది, మా సేవ కూడా బాగుంటుంది, మా స్థితి కూడా బాగుంటుంది అని మీరు ఆలోచిస్తారు. కానీ గొడవలు పర్వతం వంటివి. పర్వతంతో తల ఢీకొట్టాలా? పర్వతం తొలగిపోతుందా? స్వయం పక్కకు తప్పుకోండి లేదా ఎగిరే కళ ద్వారా గొడవల పర్వతం కంటే పైకి వెళ్ళిపోండి. అప్పుడు ఆ పర్వతం కూడా మీకు పూర్తిగా సహజంగా అనుభవమవుతుంది. నేను అవ్వాలి. అమృతవేళ నుండి స్వయంతో ఈ సంకల్పం చేసుకోండి - నేను గొడవల నుండి ముక్తునిగా అవ్వాలి. ఇది గొడవల ప్రపంచమే, గొడవలు వస్తూనే ఉంటాయి. మీ ప్రపంచం మీ సేవాకేంద్రమే, కనుక అక్కడికే వస్తాయి కదా. మీరు పేపర్ ఇవ్వడానికి అమెరికా, లండన్ వెళ్తారా? సెంటర్లోనే ఇస్తారు కదా! కనుక గొడవ రాకూడదు అని ఆలోచించకండి. గొడవల నుండి ముక్తులుగా అవ్వాలి అని ఆలోచించండి. ఇది సాధ్యమేనా? లేక సెంటర్‌కు లేదా ఇంటికి వెళ్ళినప్పుడు - ఈ గొడవను నేను భరించలేను అని అంటారా? అలా కాదు కదా? పాత ప్రపంచం నుండి, పాత ప్రపంచపు ప్రాప్తుల నుండి ఇప్పుడు మీ మనసు మరియు బుద్ధిని ఉన్నతంగా చేసుకోండి అని బాబా చెప్పారు. పాత ప్రపంచం నుండి లంగరు ఎత్తేసారా లేక ఇంకా కట్టే ఉందా? బంధించబడి అయితే లేదు కదా? ఆ కథ చెబుతారు కదా - అజ్ఞానంగా ఉండటం కూడా అంధకారమే. అది అంధకారం కాదు, కానీ అజ్ఞానంగా ఉండటం కూడా అంధకారమే. కనుక అంధకారంలో ఉండిపోకండి. బాగా చెక్ చేసుకోండి. ఈ గొడవల నుండి ముక్తమైన నంబర్‌వన్ సేవాకేంద్రం లేదా మధుబన్ ఏది అవుతుందో చూస్తాము.
మధుబన్ వారు కూడా అవ్వాలి. ఈ గ్రూప్‌లో వచ్చినవారు మాత్రమే అవ్వాలి అని కాదు. మధుబన్ వారు కింద కూర్చున్నారు కదా. (ఓం శాంతి భవన్ హాల్ ఫుల్ అయిన కారణంగా అందరూ పాండవ భవన్లో మురళి వింటున్నారు) ఇక్కడ కూర్చున్నా, కింద కూర్చున్నా, బాప్‌దాదా ముందు అయితే ఉన్నారు. మీరు టి.వి. ముందు ఉన్నారు, బాప్‌దాదా మీ ముందు ఉన్నారు. కనుక మధుబన్ వారు లేదా దేశ-విదేశాలలో ఎక్కడ ఉన్నవారైనా ఇందులో నంబర్‌వన్ అవ్వండి, తర్వాత డైమండ్ జూబిలీని చాలా వైభవంగా జరుపుకుందాం. ఇప్పుడు బాప్‌దాదాకు కొద్దిగా - అందరూ ముక్తులుగా అవుతారా అని అనిపిస్తుంది! కానీ బాప్‌దాదా యొక్క ఈ సంకల్పం సరైనది కాదు కదా? బాబాకు పిల్లలపై నిశ్చయం ఉండాలి కదా! కానీ కొద్దిగా అనిపిస్తుంది - ఏమి చేస్తారు! ఇంకా ఎంత సమయం ఉంది? ఒక మాసం. డైమండ్ జూబిలీ జనవరి నుండి ప్రారంభమవుతుంది. డైమండ్ జూబిలీ మధ్యలో చేస్తారా, ప్రారంభంలో చేస్తారా, ఏమి చేస్తారు? చెప్పండి, మీ సలహా చెప్పండి - డైమండ్ జూబిలీ ప్రారంభంలోనే ముక్తులుగా అవుతారా లేక సమాప్తిలో ముక్తులుగా అవుతారా? కొంత సమయం కావాలి, ఇంత త్వరగా ఎలా అవుతాము, 63 జన్మల సంస్కారాలు ఉన్నాయి, ఒక మాసంలో సమాప్తమవుతాయా - కష్టంగా అనిపిస్తోంది... అని భావించేవారికి టైమ్ కావాలా? 2 మాసాలు, 6 మాసాలు, ఏమనుకుంటున్నారు? కొంత టైమ్ కావాలి అని భావించేవారు చేతులు ఎత్తండి. అచ్ఛా, చేతులు ఎత్తినవారు నిలబడండి. సత్యంగా అయితే ఉన్నారు కదా. వీరి ఫోటో తీయండి, వీరికి టైమ్ ఇస్తాము. భయపడకండి. చేతులు ఎత్తినవారు తమ చీటీలో సెంటర్ మరియు తమ పేరు, ఈ పరిచయాన్ని వ్రాసి శాంతమణికి ఇవ్వండి. ఏమీ ఫర్వాలేదు, మీరు సత్యం చెప్పారు - కనుక త్వరగా అయిపోతారు. మిగిలిన ఇంతమంది అందరూ ముక్తులైతే ఈ కొద్దిమంది కూడా మీ తోక పట్టుకొని ముక్తులైపోతారు. అచ్ఛా, పోస్టు చూసే ఈశు ఎక్కడ ఉన్నారు? వీరి వద్దకు పోస్టు వస్తుంది. ఒక మాసం తర్వాత ఇటువంటి గొడవలకు సంబంధించిన పోస్టు ఏదీ రాకూడదు. ఒకవేళ వస్తే మీరు బాప్‌దాదాకు చెప్పండి. సరేనా. పని పక్కాగా చేయాలి. వీరిని గుర్తుపడతారు కదా. అందరికీ వీరితో పని ఉంటుంది. భవిష్యత్తును తయారు చేసేందుకు నిమిత్తంగా ఉంచాము కదా! అందరూ ఇక్కడికే వచ్చి జమ చేస్తారు.
అచ్ఛా, డబల్ విదేశీయులు ఏమన్నారు? చాలా జోన్ల వారు వచ్చారు. (అన్ని జోన్ల వారితో బాప్‌దాదా చేతులు ఎత్తించారు)
అచ్ఛా, అన్ని జోన్లు, ఢిల్లీ అయినా, గుజరాత్ అయినా, తమిళనాడు అయినా, ఎవరైనా సరే, అందరి మనసులో డైమండ్ జూబిలీ పట్ల ఉల్లాస-ఉత్సాహం చాలా బాగుండటాన్ని బాప్‌దాదా చూసారు. ఈ డైమండ్ జూబిలీ, యజ్ఞ స్థాపన నిర్విఘ్నంగా 60 సంవత్సరాలు కొనసాగింది మరియు ముందు కూడా కొనసాగుతూనే ఉంటుంది అని అందరూ భావిస్తున్నారు. 60 సంవత్సరాలుగా వృద్ధి జరుగుతూనే ఉంది. సంస్థ సమాప్తమైపోతుందేమో లేదా గందరగోళంలో చెడిపోతుందేమో... అనే పరిస్థితి లేదు. ఇది ఈ విశ్వవిద్యాలయ ప్రపంచానికి చాలా గొప్ప గౌరవం. కనుక డైమండ్ జూబిలీ జరుపుకోవడం అంటే - ప్రతి బ్రాహ్మణునికి ఈ గౌరవం ఉంది, మనం ఇటువంటి విశ్వవిద్యాలయానికి లేదా ఇటువంటి శ్రేష్ఠ కార్యానికి సహచరులము. 60 సంవత్సరాలు అంటే తక్కువేమీ కాదు. ప్రపంచానికి అయితే ఇది అసంభవమైన విషయం. కానీ పరమాత్మ కార్యం సదా నిశ్చలమైనది, అవినాశీ అని మీకు తెలుసు. కనుక సంస్థ యొక్క గౌరవం అంటే ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క గౌరవం. మన కార్యానికి డైమండ్ జూబిలీ అని గర్వంగా చెప్పగలరు. ప్రపంచంలోని వారు ఏ పెద్ద గురువు వెళ్ళిపోయినా సంస్థ కూడా పోయింది అని భావిస్తారు. వీరి బ్రహ్మా బాబా వెళ్ళిపోయారు, ఇక అంతా అయిపోయింది... అని అనుకున్నారు. కానీ బ్రహ్మా బాబా ద్వారా కూడా నడిపించేవారు అవినాశీ బాబా అని మీకు తెలుసు. కనుక ఈ డైమండ్ జూబిలీ, ఒక కార్యం యొక్క సఫలతకు గుర్తు. ఇందులో యువకులు అయినా, ప్రవృత్తిలో ఉన్నవారు అయినా, అందరూ డైమండ్గా అయ్యి, ఇతర డైమండ్ల మాలను తయారు చేయాలి. స్వయంగా నిర్విఘ్నమైన శ్రేష్ఠ డైమండ్గా ఉంటే ఇతరులను కూడా అలాగే తయారు చేస్తారు.
యువకులతో:- యువకులు చేతులు ఎత్తండి. దేశ-విదేశాలలో చాలావరకు కొత్తగా వచ్చేవారిలో యువకులే ఎక్కువగా వస్తున్నారని కనిపిస్తోంది. యువ వర్గం రావడం సంస్థకు గౌరవం. ఎందుకంటే గవర్నమెంట్ అయితే ఓడిపోయింది, మా వల్ల కాదు అని స్పష్టంగా చెబుతోంది. కనుక యువ వర్గమైన మీరు ఇటువంటి అద్భుతం చేసి చూపించండి - ప్రతి యువకుని నడవడిక ద్వారా, పరివర్తన ద్వారా బాబా పేరు కనిపించాలి. దీని కోసం ప్రతి యువకుడు తనను తాను ఎలా తయారు చేసుకోవాలి? దివ్య దర్పణంగా. దర్పణంలో ముఖం కనిపిస్తుంది కదా. కనుక మీ ముఖం ద్వారా ఇతరులకు ఫరిశ్తా లేదా దివ్య గుణధారీమూర్తి కనిపించాలి.
(ఎడ్యుకేషన్ వింగ్ తరఫున గుజరాత్లో జరిగిన అభియాన్ సమాచారాన్ని బాప్‌దాదాకు వినిపించారు) బాగుంది, ఎన్ని ఆత్మలకు పరిచయం లభించింది కదా! సేవ చేసారు అంటే మీ పుణ్య ఖాతాను జమ చేసుకున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లేదా వర్గం వారు పర్యటన అయితే చేసారు, చాలా బాగా చేసారు. కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లేదా వర్గం గవర్నమెంట్‌కు - వాస్తవంగా విశ్వవిద్యాలయం అనే పేరు కలిగిన రియల్ విశ్వవిద్యాలయం ఇదే అని నిరూపించి చూపించాలి. ఇంకా గుర్తింపు ఇప్పించలేదు. కనుక ఈ పని ఇంకా మిగిలి ఉంది, ఇంకా అసంపూర్ణంగా ఉంది. గవర్నమెంట్ స్వయంగా - మా విశ్వవిద్యాలయాలు ఈ విశ్వవిద్యాలయం ముందు ఏమీ కావు. ఒకవేళ ఏదైనా ఉంటే ఇదే. ఇదే, ఇదే - అని చెప్పే విధంగా ప్లాన్ తయారు చేయండి. అప్పుడు ఎడ్యుకేషన్ వారికి బహుమానం ఇస్తారు. ఇప్పుడు ఇంకా యుద్ధం జరుగుతోంది - ఇది ఎడ్యుకేషనా కాదా? కనుక ఏది రియల్‌గా ఉందో, ఏది సత్యమో అది నిరూపించబడాలి కదా. కనుక కొంచెం ఇంకా శ్రమ చేయండి. జరగవలసిందే, కానీ పాపం వారు ఇంతగా తిరుగుతున్నారు, త్వరగా రక్షించబడాలి. అచ్ఛా, యువకులు అంటే దివ్య దర్పణం. అర్థమైందా?
ప్రవృత్తిలో ఉన్నవారితో:- ప్రవృత్తిలో ఉన్నవారు ఏమి చేస్తారు? బాప్‌దాదా ప్రవృత్తిలో ఉన్నవారిని సదా ఏ పుష్పంతో పోలుస్తారు? (కమల పుష్పంతో)
అచ్ఛా, అయితే ప్రవృత్తిలో ఉన్న మీరు కమల పుష్పాలేనా? అప్పుడప్పుడు ఏదైనా బిందువు అంటుకుంటుందా? మట్టి ప్రభావం ఏదైనా పడుతుందా? ప్రవృత్తిలో ఉన్నవారు ఈ మొత్తం పాత ప్రపంచాన్ని కమల పుష్పాల సరస్సుగా తయారు చేయండి. సరస్సు మధ్యలో కమల పుష్పాలు చాలా బాగుంటాయి. కనుక ఈ పాత ప్రపంచాన్ని కమల పుష్పాల చాలా పెద్ద సరస్సుగా తయారు చేయండి, ఎక్కడ చూసినా కమలాలే కమలాలు కనిపించాలి. అంత ధైర్యము ఉందా? డైమండ్ జూబిలీ వరకు తయారు చేస్తారా? ఒక మాసంలో అని చెప్పడం లేదు, కానీ ఒక సంవత్సరంలో అయినా తయారు చేయండి. పాపం ఆత్మల పరిస్థితులను చూస్తే నిజంగా దయ కలుగుతుంది. ప్రపంచ పరిస్థితిని చూడండి మరియు స్వయాన్ని చూడండి - ఎంత తేడా ఉంది! ఎన్ని విషయాల నుండి, దుఃఖాల నుండి, బాధల నుండి బయటపడ్డారు. ప్రపంచ పరిస్థితి ఇలా ఉందని అర్థం చేసుకుంటున్నారు కదా? ఎవరినైనా మీ పరిస్థితి ఎలా ఉంది అని అడిగితే - ప్రపంచం పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది అని అంటారు. మరి మిమ్మల్ని అడిగితే మీ పరిస్థితి ఎలా ఉంది? సంతోషంగా ఉంది. కనుక ప్రపంచం దయనీయంగా ఉంది మరియు మీరందరూ సంతోషంగా ఉన్నారు. పక్కాగా ఉందా లేక అప్పుడప్పుడు సంతోషం తగ్గుతుందా? తగ్గనివ్వకండి. కనుక ప్రవృత్తిలో ఉన్నవారందరూ కమలాలే కదా! మనం కమల పుష్పాలము అని పక్కాగా గుర్తుంచుకోండి. అతీతంగా మరియు బాబాకు ప్రియంగా. అచ్ఛా!
కుమారీలతో:- కుమారీల మహిమను అయితే బాప్‌దాదా సదా చేస్తారు. ఎందుకంటే కుమారీ సాధారణ కుమారీ నుండి విశ్వ సేవాధారి కుమారీగా అయింది. ఎక్కడ ఇంటి నాలుగు గోడల మధ్య ఉండేవారు, ఎక్కడ విశ్వ సేవాధారులుగా అయ్యారు లేదా అవుతున్నారు. కనుక కుమారీలు మిమ్మల్ని మీరు ఇంతటి యోగ్యులుగా భావిస్తున్నారా? ఇంత యోగ్యులా లేక బుట్ట మోసేవారా? బుట్ట మోస్తూ-మోస్తూ తలనొప్పి వస్తుంది. ఇప్పుడు కుమారీలు బుట్ట మోసేవారిగా అవ్వాలా లేక కిరీటం ధరించేవారిగా అవ్వాలా? బుట్టను వదిలేస్తారా? లేక బుట్ట మోయడం అవసరమా? కుమారీలు ఏమనుకుంటున్నారు? ఉద్యోగం చేయవలసిందే, తప్పనిసరి అని భావించేవారు చేతులు ఎత్తండి. తప్పనిసరి పరిస్థితిలో ఉన్నవారు ఎవరూ లేరు. అయితే ఇళ్లలో ఎందుకు కూర్చున్నారు? ఉద్యోగం అవసరం లేకపోతే ఎందుకు కూర్చున్నారు? మైదానంలోకి ఎందుకు రావడం లేదు? ఇల్లు బాగుంటుందా? చిన్న ఇల్లు, ఏ గందరగోళం లేదు, తల్లిదండ్రుల ప్రేమ లభిస్తోంది, బాగుంది. సేవాకేంద్రంలో ఏమేమి జరుగుతాయో తెలియదు, ఎలా నడుస్తుందో, నడవగలమో లేదో తెలియదు, అందుకే నాలుగు గోడల మధ్య ఉండడమే మంచిది... ఇలా భావిస్తున్నారా? కుమారీలపై అన్ని యుగాలలోకంటే సంగమయుగంలో విశేషంగా పరమాత్మ కృప ఉంది. సంగమంలో పరమాత్మ కృపకు అధికారులుగా అవ్వకపోతే మొత్తం కల్పంలో అవ్వలేరు. కనుక కుమారీలకు పరమాత్మ వరదానం లేదా పరమాత్మ కృప లభించింది, దానిని ఎప్పుడూ వదలకూడదు, పొందాలి. అర్థమైందా కుమారీలకు? భయపడకండి. ఈ రోజుల్లో వార్తలు విన్నాము, చాలామంది కుమారీలు భయపడుతున్నారు - ఏమవుతుందో తెలియదు, తెలియదు, తెలియదు! కానీ అన్ని సేవాకేంద్రాలు ఒకేలా ఉండవు. ఏదైనా విషయం ఉన్నా పెద్దవారికి తెలియజేయవచ్చు. దానికి ఎవరినీ నిరోధించలేదు. టీచర్ నిరోధించినా, ఎక్కడి నుండైనా ఉత్తరం వ్రాయవచ్చని బాప్‌దాదా అనుమతి ఇస్తారు. కానీ ఏమవుతుంది అంటే - బాప్‌దాదా ఉత్తరం కోసం అంటారు, కానీ చాలా పొడవుగా వ్రాస్తారు. కొద్దిగా వ్రాసినా అర్థమవుతుంది, కానీ పొడవైన కథ అయితే చూసే బాధ్యతగలవారు కూడా దానిని పక్కన పెట్టేస్తారు. సమయం లభించినప్పుడు చదువుతారు. పెద్దవారి వరకు కూడా వెళ్ళదు. వారికి కూడా సమయం లభించాలి కదా, అప్పుడే మీ రామాయణం చదువుతారు. అందుకే పొడవుగా వ్రాయకండి. షార్ట్‌కట్‌లో వ్రాయండి - ఈ ఇబ్బంది ఉంది మరియు దీనికి ఈ సాల్వేషన్ కావాలి. తర్వాత స్పష్టీకరణ అవసరమైతే పెద్దవారే మిమ్మల్ని పిలుస్తారు. ఇంకా మధుబన్కు వచ్చే ఛాన్స్ కూడా లభిస్తుంది. కనుక పొడవుగా వ్రాయకండి. మిగిలినది అందరికీ అనుమతి ఉంది, ఏదైనా అయథార్థమైన విషయం ఉంటే వినిపించవచ్చు. భయపడకండి. భయపడి మీ పరమాత్మ కృప యొక్క భాగ్యాన్ని పోగొట్టుకోకండి. అర్థమైందా కుమారీలకు? స్వయాన్ని ఇబ్బంది పెట్టుకోకండి, ఇతరులను కూడా ఇబ్బంది పెట్టకండి. భాగ్యం చాలా బాగుంది. కుమారీలు ధైర్యము ఉంచినప్పుడే సేవాకేంద్రాలు తెరవగలరు. కుమారీలు ధైర్యము ఉంచకపోతే సేవాకేంద్రాలు కూడా తెరవలేరు. కనుక లక్కీ కదా. అందరూ దీదీజీ, దాదీజీ అని అంటారు. ఇక్కడే టైటిల్ లభిస్తుంది. అచ్ఛా.
ఇకపోతే, మధుబన్ వారు లేదా సంపర్కంలో ఉన్న గీతా పాఠశాలలు అని చెప్పండి, ఉప సేవాకేంద్రాలు అని చెప్పండి, ఎవరైనా సరే - అందరినీ బాప్‌దాదా ఇప్పుడు తమ సమానంగా సంపన్నంగా మరియు మాస్టర్ సర్వశక్తిమంతులుగా చూడాలని కోరుకుంటున్నారు. అన్నింటికంటే పెద్ద మోడల్ మధుబన్. మధుబన్ ఏ మోడల్‌ను తయారు చేస్తుందో చూస్తాము. ఎవరైతే సత్యమైన హృదయంతో సేవ చేస్తారో వారికి బాప్‌దాదా కూడా పదమారెట్లు అభినందనలు ఇస్తారు. మధుబన్ వారు ఆతిథ్యం అయితే చేస్తారు కదా. జ్ఞాన సరోవర్‌లో అయినా, ఇక్కడ పాండవ భవన్లో అయినా, ఆతిథ్యం అయితే చేస్తారు. కనుక ఆతిథ్యం చేసేవారికి మీరందరూ కూడా అభినందనలు ఇస్తున్నారు కదా. కనుక మొత్తం సభ తరఫున అభినందనలు.
అచ్ఛా, నలువైపులా ఉన్న సదా శ్రేష్ఠ భాగ్యవంతులకు, భాగ్యవిధాతను తమవారిగా చేసుకునే ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలకు, సదా బాప్‌దాదా యొక్క శ్రీమతాన్ని వినే మరియు ఆచరించే సుపుత్రులైన పిల్లలందరికీ, సదా సేవలో అచలంగా ఉంటూ, గందరగోళం నుండి ముక్తులుగా ఉంటూ, పరమాత్మ మిలన మేళాను జరుపుకునే పిల్లలందరికీ బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
అచ్ఛా - డబల్ విదేశీయులకు డబల్ నషా ఉంది కదా? డబల్ విదేశీ అనగా డబల్ లైట్, డబల్ నషా మరియు బాప్‌దాదాకు మరియు పరివారానికి డబల్ ప్రియమైనవారు. అర్థమైందా?
అచ్ఛా! హెల్త్ మేళా చేసేవారికి కూడా అభినందనలు. అలాగే రిజల్ట్ బాగుంది మరియు బాగానే ఉంటుంది.
(దాదీలు బాప్‌దాదా ముందు కూర్చున్నారు) టీచర్లకు మంచి ఛాన్స్ లభిస్తుంది. శ్రమ కూడా చేస్తారు, ఇక్కడ అలసట తొలగిపోతుంది. ఇక్కడ రిఫ్రెష్ అవుతున్నారా లేక ఇక్కడ కూడా పార్టీ గురించిన చింతనే ఉంటుందా? అలాగే మధుబన్ దినచర్య ఎంత సెట్‌గా ఉందంటే టైమ్ కూడా ఉండదు. బిజీగా ఉంటూ, క్లాసెస్ యొక్క లాభాన్ని తీసుకుంటూ ఉంటే స్టూడెంట్‌కు తీరిక లభిస్తుందా? మధుబన్‌లో ఫ్రీగా ఉంటారా? పాండవులను అడుగుతున్నాము - క్లాసెస్‌లో బిజీగా ఉంటారా, ఏమవుతుంది? మధుబన్‌లో ఇక్కడి-అక్కడి విషయాలు మాట్లాడడానికి ఫ్రీ టైమ్ లభిస్తుందా? క్లాసెస్‌లో బిజీగా ఉంటారా? అన్ని క్లాసెస్ అటెండ్ చేస్తారా? క్లాసెస్ తప్పకుండా అటెండ్ చేయాలి, ఎందుకంటే ప్రతి రత్నంలో బాప్‌దాదా లేదా డ్రామా అనుసారంగా ఏదో ఒక విశేషత నిండి ఉంది. కాబట్టి క్లాస్ ఎవరైనా చేయించవచ్చు. ఫలానావారి క్లాస్ అయితే అందరూ పరుగెత్తండి మరియు ఇంకొకరి క్లాస్ అయితే సగం మంది తిరుగుతూ ఉండండి... అలా కాదు. ఎవరైనా క్లాస్ చేయించినా అందులో విశేషత ఉంటుంది. పైగా మీ దగ్గరకు అందరూ చేరుకోలేరు కూడా. ఇక్కడే కలుస్తారు. కాబట్టి అన్ని క్లాసెస్ అటెండ్ చేసినవారు, ఒక్కటి కూడా మిస్ చేయనివారు చేతులు ఎత్తండి. అచ్ఛా, టీచర్లు తమ పనులను పూర్తి చేసుకుంటారు. మీరు ఒకటి అఫీషియల్ రౌండ్ వేయడానికి వెళ్తారు, అది మంచి విషయమే, కానీ క్లాస్ సమయంలో క్లాస్ వదిలి ఇంకెక్కడైనా తిరగడానికి వెళ్ళినవారు చేతులు ఎత్తండి. ఇకపై అలా చేయకండి. క్లాస్‌లోని అనేక విషయాలు సమయానికి సరిగ్గా ఉపయోగపడతాయి. ఇప్పుడు వింటున్నప్పుడు చాలా విన్నాము అని అనుకుంటారు. కానీ కొన్ని పాయింట్లు అలాంటి సమయంలో ఉపయోగపడతాయి, అప్పుడు మీరు లోలోపల కృతజ్ఞత చెబుతారు. అందుకే బిజీగా ఉండండి. మధుబన్ అంటే చదువులో బిజీగా ఉండడం. మిగిలినది తినండి, త్రాగండి, ఆనందించండి, అది కూడా చేయండి కానీ సమయానికి. బాగుంది, కొత్తవారికి కొత్త విషయాలు లభిస్తాయి. చదువులో అటెన్షన్ చాలా అవసరం. చదువు అంటే కేవలం వినడం కాదు. చదువు అంటే వినడం మరియు చేయడం. అచ్ఛా, అందరూ సంతోషంగానే ఉన్నారు. బేహాల్గా(దయనీయంగా) కాదు, ఖుష్‌హాల్‌గా (సంతోషంగా) ఉన్నారు. అచ్ఛా.
(ఎడ్యుకేషన్ అభియాన్‌లో పాల్గొన్న సోదరసోదరీలు బాప్‌దాదా ముందు నిలబడ్డారు) బాగుంది, సేవ యొక్క ఫలంగా మధుబన్కు రావడానికి అనుమతి లభించింది. కానీ గవర్నమెంట్ చేత చెప్పించగలిగినప్పుడే బహుమానం ఇస్తాము. కేవలం చెప్పడం వల్ల ఏమీ జరగదు. ఇది అఫీషియల్‌గా వ్రాతపూర్వకంగా ఉండాలి. చెప్పడంలో అయితే ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పి వెళ్లారు - చాలా బాగుంది, చాలా బాగుంది.
కాబట్టి డాక్టర్లు కావచ్చు, ఎడ్యుకేషన్ వారు కావచ్చు లేదా ఇంజనీర్లు మొదలైన వారు కావచ్చు, ఎవరైతే సేవార్థం ర్యాలీ తీస్తారో అది బాగుంది. కాబట్టి అభినందనలు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
