‘‘వ్యర్థమైన మాటలు, డిస్టర్బ్ చేసే మాటల నుండి స్వయాన్ని ముక్తులుగా చేసుకుని మాటలను పొదుపు చెయ్యండి’’
ఈరోజు బాప్‌దాదా మీ అందరితోపాటు నలువైపులా ఉన్న ఆత్మలను చూస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలు ఆకారీ రూపంతో బాప్‌దాదా ఎదురుగా ఉన్నారు. రెండు సభలు, సాకారీ మరియు ఆకారీ, రెండూ ఎంత పెద్ద సభలు. బాప్‌దాదా ఈ రెండు సభలలోని పిల్లలను చూసి హర్షిస్తున్నారు ఎందుకంటే బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ విశేషంగా రెండు రూపాలలో చూస్తున్నారు. ఒకటేమో - పిల్లలు ప్రతి ఒక్కరూ మనుష్యాత్మలందరికీ పూర్వజులు, మొత్తము వృక్షానికి పునాదివంటివారు ఎందుకంటే వేర్ల నుండే మొత్తం వృక్షం వెలువడుతుంది మరియు రెండవ రూపంలో, పూర్వజులు అని పెద్దవారిని కూడా అంటారు. సృష్టి ఆదిలో ఆత్మలైన మీ పాత్రయే ఉంది, అందుకే మీరే అందరికన్నా పెద్దవారు, ఈ కారణం వలన మీరు సర్వాత్మలకు పూర్వజులు. అలాగే ఉన్నతోన్నతుడైన తండ్రి యొక్క మొదటి రచన బ్రాహ్మణాత్మలైన మీరే. ఏ విధంగా అందరికన్నా ఉన్నతమైనవారు భగవంతుడో, అలాగే అందరికన్నా పెద్దవారు పూర్వజులైన మీరు. ఇంతమంది పూర్వజ పిల్లలందరినీ చూసి తండ్రి హర్షిస్తున్నారు. మేము పూర్వజులము అని మీరు కూడా హర్షిస్తున్నారు - అదే నిశ్చయము మరియు నషాలో ఉంటున్నారా? ఈ రోజు బాప్‌దాదా పూర్వజుల సభను చూస్తున్నారు.
తండ్రి యొక్క పిల్లలైన మీరందరూ మాయ నుండి రక్షించబడి ఉన్నారు. పిల్లలు అంటేనే అర్థము తండ్రికి చెందినవారిగా అవ్వడము అనగా పిల్లలుగా అవ్వడము. కావున మాయ నుండి రక్షించబడి తండ్రికి పిల్లలుగా అవుతారు. మీరందరూ మాయ నుండి రక్షించబడి ఉన్నారు కదా? లేక ఒక్కోసారి చక్రంలోకి వచ్చేస్తారా? ఎటువంటి చక్రవ్యూహం ఉంటుందంటే దాని నుండి ఎన్నో రకాలుగా బయటపడవలసి ఉంటుంది అని అంటారు కదా. మరి మాయకు చెందిన ఎటువంటి చక్రవ్యూహములోనూ చిక్కుకునేవారైతే కాదు కదా? ఎక్కడైనా చిక్కుకుని ఉన్నారా? రక్షించబడి ఉన్నారా? (హాజీ) ఇక్కడ అవును అని మళ్ళీ అక్కడకు వెళ్ళి కాదు అని అనకండి. ఒకసారి చక్రం నుండి బయటపడే మార్గము లేక విధి తెలిసిందంటే ఇక మళ్ళీ చిక్కుకునే ప్రసక్తే ఉండదు. మాయ గురించి కూడా బాగా తెలుసుకున్నారా లేక ఎప్పుడైనా తెలియనివారిగా, అమాయకులుగా అయిపోతున్నారా? అప్పుడిక - ఇది మాయ అని మాకు తెలియనే తెలియలేదే అని అంటారు ఎందుకంటే రకరకాల ముఖాలను పెట్టుకోవటము అనేది ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే ఒకలా తయారవుతారు, మళ్ళీ ఇప్పుడిప్పుడే ఇంకోలా తయారవుతారు. మాయ వద్ద కూడా ఇలా చిక్కుకునేలా చేసే ముఖాలు చాలా ఉన్నాయి. దాని వద్ద చాలా మంచి పెద్ద దుకాణము ఉంది. ఏ సమయములో ఏ రూపాన్ని ధారణ చెయ్యాలనుకుంటే ఆ సమయంలో అది చేస్తుంది. కానీ ఒకవేళ తెలిసో తెలియకో చిక్కుకుపోయారంటే, ఇక దాని నుండి బయటపడటానికి చాలా సమయం పడుతుంది. సంగమంలో ఒక్క క్షణం వ్యర్థంగా పోయిందంటే అది ఒక్క క్షణాన్ని పోగొట్టుకున్నట్లు కాదు, ఒక సంవత్సరాన్ని పోగొట్టుకున్నట్లు. సంగమయుగము ఎంత చిన్నదో మీరే ఆలోచించండి. ఇప్పుడైతే డైమండ్ జూబిలీని జరుపుకుంటున్నారు కావున ఈ మిగిలిన కొద్ది సమయములో ఎలా తయారవ్వాలనుకున్నా, ఎంత జమ చేసుకోవాలనుకున్నా, అలా ఇప్పుడే తయారవ్వగలరు. బాప్‌దాదా చూస్తున్నారు - తయారవ్వడానికి ఉన్న సమయము ఎంత కొంచెము కానీ తయారయ్యేది మొత్తం కల్పం కొరకు. 5000 సంవత్సరాలు ఎక్కడ మరియు ఇప్పటి 60 సంవత్సరాలు ఎక్కడ, పోనీ ఒకవేళ మున్ముందు సమయము ఉన్నా, అది వేల లెక్కలో అయితే ఉండదు కదా!
మరి ఈ కొద్ది సమయములో రాజ్య అధికారులుగా అయ్యేందుకు లేక రాయల్ కుటుంబములోకి వచ్చేందుకు ఏం చెయ్యాల్సి ఉంటుంది? సంఖ్యపరంగా చూస్తే, సత్యయుగంలో విశ్వం యొక్క సింహాసనమనేది అందరికీ లభించదు కూడా. మొదటి లక్ష్మీ-నారాయణులు సింహాసనంపై కూర్చుంటారు, కానీ ఆ మొదటి లక్ష్మీ-నారాయణుల యొక్క రాయల్ కుటుంబము వారు ఎవరైతే ఉంటారో, వారికి కూడా అందరి నుండి అంతే స్నేహము మరియు గౌరవము లభిస్తుంది. కనుక ఒకవేళ మొదటి రాజధానిలోని రాయల్ కుటుంబములోకి వచ్చినా, వారు కూడా మొదటి నంబరు వారే. వారు పెద్ద సింహాసనంపై కూర్చోకపోయినా కానీ ప్రారబ్ధము అనేది నంబర్‌వన్ లెక్కలోనే ఉంటుంది. లేదంటే మీ అందరికీ త్రేతాయుగం వరకు కూడా సింహాసనం లభించదు. కానీ అందరికీ విశ్వ రాజ్యాధికారిగా అవ్వాలనే లక్ష్యమే ఉంది కదా? లేక అక్కడ కూడా ఒక రాష్ట్రానికే రాజుగా అవుతారా? కనుక మొదటి నంబరు రాయల్ కుటుంబములోకి రావటము, ఇది కూడా శ్రేష్ఠ పురుషార్థమే. కొందరికి సింహాసనం లభిస్తుంది, మరి కొందరికి రాయల్ కుటుంబం లభిస్తుంది. దీని వెనుక కూడా గుహ్య రహస్యం ఉంది.
ఎవరైతే సదా సంగమములో తండ్రి యొక్క హృదయ సింహాసనాధికారులుగా స్వతహాగా మరియు సదా ఉంటారో, అప్పుడప్పుడు కాదో, ఎవరైతే సదా ఆది నుండి అంతిమము వరకు స్వప్నమాత్రంగా కానీ, సంకల్పమాత్రంగా కానీ పవిత్రతా వ్రతంలో సదా ఉన్నారో, స్వప్నమాత్రంగా కూడా అపవిత్రతను తాకలేదో, ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలు సింహాసనాధికారులుగా అవ్వగలరు. ఎవరైతే నాలుగు సబ్జెక్టులలోనూ మంచి మార్కులు తీసుకున్నారో, ఆది నుండి అంతిమం వరకు మంచి నంబరులో పాస్ అయ్యారో, వారినే పాస్ విత్ ఆనర్ అని అంటాము. ఒకవేళ మధ్యమధ్యలో మార్కులు తక్కువై ఉంటే, తర్వాత ఆ లోటును భర్తీ చేసి ఉంటే, అలా భర్తీ చేసుకునేవారు కాదు, ఎవరైతే ఆది నుండి నాలుగు సబ్జెక్టులలోనూ తండ్రి మనస్సుకు ఇష్టమైనవారిగా ఉన్నారో, వారే సింహాసనాన్ని అందుకోగలరు. అంతేకాక ఎవరైతే బ్రాహ్మణ ప్రపంచములో అందరికీ ప్రియమైనవారో, అందరికీ సహయోగులుగా ఉన్నారో, ఎవరినైతే బ్రాహ్మణ పరివారములోని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా గౌరవిస్తారో, అటువంటి గౌరవనీయులే సింహాసనాధికారులుగా అవ్వగలరు. ఒకవేళ ఈ విషయాలలో ఎందులోనైనా లోటు ఉన్నట్లయితే వారు నంబరువారుగా రాయల్ ఫ్యామిలీలోకి వస్తారు. మొదటి దానిలోనైనా రావచ్చు, ఎనిమిదవ దానిలోనైనా రావచ్చు లేక త్రేతాలోనైనా రావచ్చు. కనుక ఒకవేళ సింహాసనాధికారులుగా అవ్వాలంటే ఈ అన్ని విషయాలను చెక్ చేసుకోండి. ఒకవేళ సేవలో 100 మార్కులు జమ అయ్యి ధారణలో 25 శాతము జమ అయితే ఏమవుతుంది? వారు అధికారులుగా అవుతారా? చాలామంది పిల్లలు ఇతర సబ్జెక్టులలో ముందుకు వెళ్ళిపోతారు కానీ ప్రాక్టికల్ ధారణలో ఎవరైతే సమయమనుసారంగా స్వయాన్ని మౌల్డ్ చేసుకుంటారో (మలుచుకుంటారో), వారే రియల్ గోల్డ్ (అసలైన బంగారం) లాంటివారు. అక్కడక్కడ మాయ పిల్లలకంటే కూడా తెలివైనదిగా అయిపోతుంది. అది వెంటనే సమయమనుసారంగా తన స్వరూపాన్ని ధరిస్తుంది, అప్పుడు పిల్లలు ఏమంటారు? తండ్రి వద్దకైతే అందరి విషయాలు వస్తుంటాయి కదా! ఉదాహరణకు ఒకరు రాంగ్, మరొకరు రైట్ అనుకోండి, ఇరువైపులవారిలోనూ ఏదో ఒక లోపము ఉండటమనేది కూడా జరుగుతుంది, కానీ ఒకవేళ మిమ్మల్ని మీరు పూర్తిగా రైట్ అని భావిస్తూ, అవతలివారిని పూర్తిగా రాంగ్ అని భావిస్తే, అక్కడ మీరు రైట్, వారు రాంగ్, అయినా కానీ ఎటువంటి సమయమో, ఎటువంటి వాయుమండలమో, అది చూసుకుని, దానికి అనుసారంగా స్వయాన్నే ఇముడ్చుకోవలసి ఉంటుంది, తొలగించుకోవలసి ఉంటుంది, పక్కకు తప్పుకోవలసి ఉంటుంది. కానీ పిల్లలు ఏమంటారంటే - ప్రతి విషయంలోనూ, ప్రతి సారీ మేమే మరణించాలా! మరణించాల్సింది మేము మరియు సరదా జరుపుకునేది వారా! అని అంటారు. కానీ సదా మరణిస్తూ ఉండాలి, ఈ విధంగా మరణించడమైతే చాలా కష్టము. మరజీవాగా అయితే అయ్యారు, ఇది సహజమే. బ్రహ్మాకుమారులుగా, బ్రహ్మాకుమారీలుగా అయ్యారు, ఇది కూడా మరజీవాగా అవ్వటమే కదా! ఈ విధంగా మరణించడమైతే చాలా సహజమనిపించింది. మరణించారు అంటేనే బ్రహ్మాకుమారీగా అయిపోయారు. కానీ ఇలా పదే-పదే మరణించటమంటే, ఇది చాలా కష్టము! కష్టమే కదా? చిన్నవారు అంటారు - మేమే ఎక్కువగా మరణించాల్సి ఉంటుంది మరియు పెద్దవారు అంటారు - మేమే ఎక్కువగా వినాల్సి ఉంటుంది. కనుక మీరు సహనం చేయాల్సి ఉంటుంది, వారు వినాల్సి ఉంటుంది, మరి మరణించాల్సింది ఎవరు? ఎవరు మరణించాలి? ఒకరు మరణించాలా, ఇద్దరూ మరణించాలా? ఇద్దరూ మరణిస్తే ఇక విషయం సమాప్తము, ఆట సమాప్తము. మరి మరణించటము వస్తుందా లేక కొద్దిగా కష్టమనిపిస్తుందా? కొద్దిగా శ్వాస ఇబ్బందవుతుందా, కష్టం మీద శ్వాస అందుతుందా. కష్టం అవుతుందా? ఆ సమయంలో ఇలా అంటారు కదా - మేమే మరణించాలా, మేమే మారాలా, మారాల్సిన బాధ్యత నాదేనా, ఆ బాధ్యత ఇతరులకు కూడా ఉంటుంది కదా! నువ్వు ఇంత మరణించు, నేను ఇంత మరణిస్తాను అని సగం-సగం పంచుకోండి. బాప్‌దాదాకు అయితే ఆ సమయంలో దయ కూడా చాలా కలుగుతుంది కానీ ఈ విధంగా మరణించటమనేది మరణించటము కాదు. ఈ మరణించటమనేది సదా కొరకు జీవించటము. మరణించకుండా స్వర్గము లభించదు అని లోకులు అంటారు కదా. ఆ మరణించటము ద్వారా స్వర్గము లభించదు కానీ ఈ మరణించటము ద్వారా స్వర్గము యొక్క అధికారము తప్పకుండా లభిస్తుంది కనుక ఈ మరణించటము అనగా స్వర్గానికి అధికారిగా అవ్వటము. మరణించాల్సి ఉంటుంది, మరణించాల్సి ఉంటుంది, సహించాల్సి ఉంటుంది అని భయపడిపోతారు కదా, దాని వలన చిన్న విషయము పెద్దదైపోతుంది. మీరే ఆలోచించండి, దొంగలు, దోపిడీదారులు ఎవ్వరూ లేరు, కానీ దొంగ ఉన్నాడు, దోపిడీదారుడు ఉన్నాడు అని మీలో భయం ఏర్పడిపోయింది, ఆ భయం వలన ఏం జరుగుతుంది? భయం వలన గుండె వేగంగా కొట్టుకుంటుంది, లేదంటే బి.పి. కింద-మీద అవుతుంది. భయం వలనే అలా జరుగుతుంది కదా? అలా భయపడిపోతారు. మరణించటమనేది పెద్ద విషయమేమీ కాదు కానీ మీ భయమే విషయాన్ని పెద్దదిగా చేస్తుంది. అప్పుడేమంటారంటే - మాకేం అవుతుందో తెలియడం లేదు, ఏమో తెలియడం లేదు! కానీ ఏ విధంగా ధైర్యంగా ఉండి మరజీవాగా అవ్వటానికి భయపడలేదో, చాలా సంతోషంగా మరజీవాగా అయ్యారో, అలా చాలా సంతోషంగా పరివర్తన అవ్వాలి. నిజానికి మరణించటము అన్న మాటే లేదు, కానీ మీరు మరణించాలి, మరణించాలి అన్న మాటను ఉపయోగించారు, అందుకే భయపడిపోతారు. వాస్తవానికి ఇది మరణించటం కాదు, కానీ ధారణ సబ్జెక్టులో నంబరు తీసుకోవటము. సహనం చేయటానికి భయపడకండి. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే అసత్యమైన విషయంలో మేము ఎందుకు సహనం చేయాలి అని అనుకుంటున్నారు. కానీ సహనం చేయాలి అన్న ఆజ్ఞను ఎవరు ఇచ్చారు? అసత్యం చెప్తున్నవారు ఇచ్చారా? చాలామంది పిల్లలు సహనం చేస్తారు కూడా, కానీ తప్పదు అన్నట్లు సహనం చేయటము మరియు ప్రేమగా సహనం చేయటము, ఇందులో తేడా ఉంటుంది. మీరు అక్కడ విషయం కారణంగా సహనం చేయటం కాదు, కానీ సహనశీలురుగా అవ్వండి అన్నది తండ్రి ఆజ్ఞ. మరి తండ్రి ఆజ్ఞను పాటిస్తున్నప్పుడు, పరమాత్మ ఆజ్ఞను పాటించటమనేది సంతోషకరమైన విషయమే కదా లేక తప్పదు అన్నట్లా? అయితే చాలా సార్లు సహనం చేస్తారు కూడా, కానీ కొద్దిగా మిక్స్ అవుతుంది, ప్రేమ కూడా ఉంటుంది, తప్పదన్నట్లు కూడా ఉంటుంది. ఎలాగూ సహనం చేస్తున్నారు అన్నప్పుడు, అదేదో సంతోషంగా ఎందుకు సహనం చేయకూడదు. తప్పదు కదా అన్నట్లు ఎందుకు చేయడము! ఆ వ్యక్తి ఎదురుగా వస్తారు కదా, అప్పుడు కష్టమనిపిస్తుంది, కానీ తండ్రి ఆజ్ఞను పాటిస్తున్నాను అని తండ్రి ఎదురుగా వస్తే ప్రేమ కలుగుతుంది, తప్పదన్నట్లు అనిపించదు. కనుక మరణించాల్సి ఉంటుంది అన్న మాట గురించి ఆలోచించకండి. ఈ రోజుల్లో ఇలా అనుకోవటము కామన్ అయిపోయింది - మరణించాల్సి ఉంటుంది, మరణించాల్సి ఉంటుంది, ఎప్పటివరకు మరణించాల్సి ఉంటుంది, అంతిమము వరకా లేక రెండు సంవత్సరాలా, ఒక సంవత్సరమా, 6 నెలలా, సరే అయితే, మరణిస్తాములే... కానీ ఎప్పటివరకు మరణించాలి? కానీ ఇది మరణించటము కాదు, అధికారాన్ని పొందటము. మరి ఏం చేస్తారు? మరణిస్తారా? ఈ మరణించటము అన్న మాటను అంతము చేసేసెయ్యండి. మరణించటము అని ఆలోచిస్తారు కదా, మరి మరణించటము అంటే భయం అనిపిస్తుంది కదా. పోనీ మీ మృత్యువు విషయం వదిలేయండి, కొంతమందైతే ఇతరుల మృత్యువును చూసి కూడా భయపడిపోతారు. కావున ఈ మాటను పరివర్తన చేయండి, ఇటువంటి మాటలు మాట్లాడకండి. శుద్ధమైన భాషను మాట్లాడండి. బ్రాహ్మణుల డిక్షనరీలో ఈ మాటే లేదు. అసలు దీనిని ఎవరు మొదలుపెట్టారో తెలియదు! మొదలుపెట్టిందైతే మీలోనే ఎవరో కదా! మీరు అంటే ఇక్కడ ఎదురుగా కూర్చున్నవారని కాదు. బ్రాహ్మణులే మొదలుపెట్టారు అని. బాప్‌దాదా ఉదాహరణగా ఈ ఒక్క మాట గురించి చెప్పారు, కానీ మొత్తము రోజంతటిలో ఇటువంటి వ్యర్థమైన మాటలు లేక పరిహాసం మాటలు చాలానే మాట్లాడుతారు, మంచి మాటలు మాట్లాడరు, కానీ నా భావం అది కాదు, ఏదో సరదాగా అన్నాను అని అంటారు. మరి ఈ విధంగా పరిహాసం ఆడటమనేది మీ బ్రాహ్మణ జీవిత నియమాలలో ఉందా? ఎక్కడా వ్రాసి లేదు కదా? పరిహాసం ఆడవచ్చు అని ఎప్పుడైనా చదివారా! పరిహాసమాడండి, కానీ జ్ఞానయుక్తంగా, యోగయుక్తంగా. ఇకపోతే వ్యర్థమైన పరిహాసము, దేనినైతే మీరు సరదా అని భావిస్తారో, కానీ దాని వలన ఇతరుల స్థితి కింద-మీద అవుతుందో, అది పరిహాసమైనట్లా లేక దుఃఖమివ్వటం అయినట్లా?
ఈరోజు బాప్‌దాదా ఏం చూసారంటే - ఒకటేమో, అందరూ పూర్వజులు మరియు రెండు, అందరికంటే పెద్దవారైన పూజ్య ఆత్మలు కూడా మీరే. మీకు జరిగే పూజ మొత్తము కల్పములో మరెవ్వరికీ జరుగదు. కనుక మీరు పూర్వజులు కూడా మరియు పూజ్యులు కూడా. కానీ పూజ కూడా నంబరువారుగా ఉంటుంది. ఎవరెవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారికి పూజ తప్పకుండా జరుగుతుంది కానీ కొందరిది విధిపూర్వకంగా జరుగుతుంది, కొందరిది ఏదో చేసారంటే చేసారు అన్నట్లు మొక్కుబడిగా జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా బ్రాహ్మణులు యోగంలో కూర్చుంటారు కానీ కొందరు ఏదో మొక్కుబడిగా కూర్చుంటారు, కొంత నిద్రపోతారు, కొంత యోగం చేస్తారు, కొంత వ్యర్థం ఆలోచిస్తారు మరియు కొంత శుభం ఆలోచిస్తారు. మరి ఇది మొక్కుబడిగా చేసినట్లు కదా! రెడ్ లైట్ ఆరిపోతే, పనైపోయింది అన్నట్లు ఉంటుంది. ఇలా ధారణలో కూడా మొక్కుబడిగా చేసేవారు చాలామంది ఉంటారు. ఏదైనా పరిస్థితి వస్తే - ఇప్పటికి ఇలా కానివ్వండి, తరువాత చూసుకోవచ్చు అని అంటారు. కావున ఇటువంటి వారికి పూజ కూడా మొక్కుబడిగా జరుగుతుంది. చూడండి, లక్షల సాలిగ్రామాలను తయారుచేస్తారు కానీ ఏం జరుగుతుంది? విధిపూర్వకంగా పూజ జరుగుతుందా? ఏదో మొక్కుబడిగా జరుగుతుంది కదా! పైప్‌తో స్నానం చేయించేస్తారు మరియు తిలకాన్ని కూడా చిన్న కప్పులో వేసుకుని పండితులు అలా-అలా చిలకరించేస్తారు. తిలకం పెట్టేసినట్లు అవుతుంది. మరి ఇది ఏమైనట్లు? మొక్కుబడిగా చేసినట్లయింది కదా. పూజ్యులుగా అందరూ అవుతారు కానీ ఎటువంటి పూజ్యులుగా అవుతారు అనేదాంట్లో నంబరువారుగా ఉంటారు. కొందరికి ప్రతి కర్మకూ పూజ జరుగుతుంది, దంతాలు శుభ్రం చెయ్యటం జరుగుతుంది అంటూ ఆ దర్శనం కూడా ఉంటుంది. మథురాకు వెళ్ళినట్లయితే - ఈ సమయము దంతాలను శుభ్రం చేసే సమయం అంటూ దంతాలను శుభ్రం చెయ్యటాన్ని కూడా దర్శనం చేయిస్తారు. అందుకే ఏదో మొక్కుబడిగా చేసామంటే చేసాము అనేవారిగా అవ్వకండి. లేదంటే పూజ కూడా అలాగే జరుగుతుంది.
టీచర్లు ఏమనుకుంటున్నారు? ముందు కూర్చుంటున్నారు కాబట్టి నంబర్ కూడా ముందే తీసుకోవాలి కదా! తక్కువగా ఉండిపోకూడదు. మనం పూర్వజులము కూడా మరియు పూజ్యులము కూడా అనే నషా ఉంచుకోండి. కనుక ఎంత పెద్దవారో, అంత పెద్ద బాధ్యత ఉంటుంది. పెద్దవారిగా అవ్వడం కేవలం సంతోషపడే విషయం కాదు. పేరు పెద్దదైతే పని కూడా పెద్దదిగా ఉండాలి. టీచర్లందరూ సంతోషంగా ఉన్నారా? లేక ఇప్పటికీ మనసులో ఏదైనా కోరిక ఉందా? ఏదైనా కోరిక ఉంటే అది మంచిగా అవ్వనివ్వదు. కోరికనైనా పూర్తి చేసుకోండి లేదా మంచిగానైనా అవ్వండి. మీ చేతిలో ఉంది. ఏం గమనించడం జరిగిందంటే, ఈ కోరిక అనేది ఎటువంటిదంటే - మీరు ఎండలో వెళ్ళినప్పుడు మీ నీడ మీ ముందు వెళ్తూంటుంది, మీరు దానిని పట్టుకునే ప్రయత్నం చేస్తే అది దొరుకుతుందా? అదే మీరు వెనక్కి తిరిగి వస్తే ఆ నీడ ఎక్కడికి వెళ్తుంది? మీ వెనక-వెనకే వస్తుంది. కనుక కోరిక అనేది తన వైపుకు ఆకర్షించి ఏడిపిస్తుంది... కానీ కోరికను వదిలేసినట్లయితే ఆ కోరిక మీ వెనక-వెనకే వస్తుంది. యాచించేవారు ఎప్పుడూ సంపన్నంగా అవ్వలేరు. వేరే ఏమీ అడగరు కానీ రాయల్‌గా అడిగేవి అయితే చాలానే ఉంటాయి. రాయల్‌గా అడగడమంటే ఏంటో తెలుసా? అల్పకాలికంగానైనా కొంచెం పేరు లభించాలి, కొంచెం గౌరవం లభించాలి, ఎప్పుడైనా నా పేరు కూడా విశేషాత్మలలో లెక్కించబడాలి, మేము కూడా పెద్ద అన్నయ్యలుగా లెక్కించబడాలి, మేము కూడా పెద్ద అక్కయ్యలుగా లెక్కించబడాలి, చివరికి మాకు కూడా అవకాశం లభించాలి. కానీ ఎప్పటివరకైతే ఈ విధంగా యాచించేవారిగా ఉంటారో, అప్పటివరకు సంతోషపు ఖజానాతో ఎప్పటికీ సంపన్నులుగా అవ్వలేరు. ఇలా అడగటము వెనక లేక ఏవైనా హద్దు కోరికల వెనక పరుగెత్తటము అంటే అది ఎండమావుల వంటిది. దీని నుండి సదా రక్షించబడి ఉండండి. చిన్నవారిగా ఉండటమనేదేమీ చెడ్డ విషయమేమీ కాదు. చిన్నవారు భగవంతునితో సమానము ఎందుకంటే బాప్‌దాదా మనసులో మీ నంబరు ముందు ఉంది. అల్పకాలికమైన కోరికలను అనుభవము చేసే ఉంటారు కదా, అవి ఏడిపిస్తాయా లేక నవ్విస్తాయా? ఏడిపిస్తాయి కదా! మిమ్మల్ని ఏడిపించాలి అనేది రావణుని ఆజ్ఞ, మీరైతే తండ్రికి చెందినవారు కదా, మరి తండ్రి నవ్వించేవారా లేక ఏడిపించేవారా?
ఈ రోజు బాప్‌దాదా విశేషంగా దేని పట్ల అటెన్షన్ ఇప్పిస్తున్నారంటే - వ్యర్థమైన మాటలు ఏవైతే ఎవ్వరికీ మంచిగా అనిపించవో, అవి మీకు మంచిగా అనిపించవచ్చు కానీ ఇతరులకు మంచిగా అనిపించవు, కనుక సదా కొరకు ఆ మాటలను సమాప్తము చెయ్యండి. ఈ విధంగా మొత్తం రోజంతటిలో ఒకవేళ బాప్‌దాదా తమ వద్ద పిల్లల మాటలను నోట్ చేసుకున్నట్లయితే చాలా ఫైల్స్ తయారవ్వగలవు. ఈ చెడు మాటలు, వ్యర్థ మాటలు, గట్టిగా మాట్లాడటము... ఈ గట్టిగా మాట్లాడటమనేది కూడా వాస్తవానికి అనేకులను డిస్టర్బ్ చెయ్యటమే. నా గొంతే పెద్దది అని ఇలా అనకండి. మాయపై విజయాన్ని పొందగలరు కానీ గొంతుపై విజయాన్ని పొందలేరా! కావున ఈ విధంగా ఇతరులను డిస్టర్బ్ చేసే మాటలను మరియు వ్యర్థమైన మాటలను మాట్లాడకండి. విషయము రెండు మాటలలో చెప్పగలిగినది కానీ అరగంట సేపు ఆ విషయం గురించి చెప్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు. ఇలా ఎక్కువసేపు ఏదైతే మాట్లాడుతారో, అక్కడ నాలుగు మాటలలో పని అయిపోయేదానికి 12-15 మాటలు మాట్లాడకండి. మీ స్లోగన్ - ‘‘తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి’’. కనుక - నా గొంతు చాలా పెద్దది, మేము పెద్దగా మాట్లాడాలని అనుకోము కానీ మా గొంతే పెద్దది అని ఎవరైతే అంటారో, వారు ఈ స్లోగన్‌ను వ్రాసుకొని మెడలో వేసుకోండి. జరిగేదేంటి? మీరు మీ ధ్యాసలో ఉంటూ గట్టిగా మాట్లాడుతారు కానీ వచ్చేపోయేవారు అది విని, వీరి గొంతే పెద్దది అని అనుకోరు. గొడవ జరుగుతుందో ఏంటో అని అనుకుంటారు. కనుక ఇది కూడా డిస్ సర్వీస్ అయినట్లు. అందుకే - ఈరోజు ఈ పాఠాన్ని చెప్తున్నాము - వ్యర్థమైన మాటలు లేక ఎవరినైనా డిస్టర్బ్ చేసే మాటల నుండి స్వయాన్ని విముక్తులు చేసుకోండి. వ్యర్థ మాటల నుండి ముక్తులైనట్లయితే అవ్యక్త ఫరిశ్తాగా అవ్వటంలో మీకు చాలా సహాయం లభిస్తుంది. మాటలు, మాటలు, మాటలు, మాట్లాడుతూనే ఉంటారు. ఒకవేళ బాప్‌దాదా వాటిని టేప్‌లో రికార్డ్ చేసి మీకు వినిపిస్తే మీకు కూడా నవ్వు వస్తుంది. మరి ఏ పాఠాన్ని పక్కా చేసుకున్నారు? మాటలను పొదుపు చెయ్యండి, మీ మాటలకు విలువను ఉంచండి. సత్య వచన్ మహారాజు అని మహాత్ముల గురించి అంటారు కదా. అలా మీ మాటలు ఎల్లప్పుడూ సత్య వచనాలుగా ఉండాలి అనగా అవి ఏదో ఒక ప్రాప్తిని కలిగించే వచనాలుగా ఉండాలి. వీరు పిచ్చివారు, వీరు తెలివితక్కువవారు... అని నడుస్తూ-తిరుగుతూ ఎవరో ఒకరిని వేళాకోళంగా అనేస్తారు, ఇటువంటి మాటలు చాలా ఉంటాయి, బాప్‌దాదా ఇప్పుడు మర్చిపోయారు కానీ ఇటువంటివి వింటూ వింటారు. కనుక బ్రాహ్మణుల నోటి నుండి ఇటువంటి మాటలు వెలువడటము అంటే సత్య వచన మహారాజులైన మీరు ఇతరులకు శాపము ఇచ్చినట్లు. ఎవరినీ శపించకండి, సుఖాన్ని ఇవ్వండి. యుక్తియుక్తమైన మాటలను మాట్లాడండి మరియు పనికొచ్చే మాటలను మాట్లాడండి, వ్యర్థము మాట్లాడకండి. మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు ఒక గంటలో చెక్ చేసుకోండి - ఎన్ని మాటలు వ్యర్థమయ్యాయి మరియు ఎన్ని సత్య వచనాలు ఉన్నాయి. మీకు మీ మాటల విలువ తెలియదు, కనుక మాటల విలువను తెలుసుకోండి. అపశబ్దాలను మాట్లాడకండి, శుభమైన మాటలను మాట్లాడండి ఎందుకంటే ఇది చివరి మాసము మరియు ఆది మాసములో డైమండ్ జూబిలీ ఉంది. మరి మొత్తము సంవత్సరమంతా డైమండ్గా అవుతారా లేక 6 నెలలు అవుతారా? మొత్తము సంవత్సరమంతా అవుతారు కదా! అందుకే, బాప్‌దాదా డైమండ్ జూబిలీకి ముందే పిల్లలకు విశేష అటెన్షన్‌ను ఇప్పిస్తున్నారు. బాప్‌దాదా నలువైపులా ఉన్న దృశ్యాలనైతే చూస్తూనే ఉంటారు. మొత్తము రోజంతా అయితే చూస్తూ ఉండరు, క్షణములోనే మొత్తమంతా చూడగలరు. కనుక ముక్తులుగా అవ్వాలి అన్న పాఠాన్ని పక్కా చేసుకున్నారా? లేక కొంచెం-కొంచెం దానికి లోనవుతూ, కొంచెం-కొంచెం దాని నుండి ముక్తులుగా అవుతారా? ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకోండి. మళ్ళీ ఇలా మొదలుపెట్టకండి, బాబా వాణిలో చెప్పినా కూడా మీరు మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నారు, ఇలా ఇతరులను చూడకండి. స్వయాన్ని చూసుకోండి - నేను తండ్రి శ్రీమతాన్ని ఎంత పాటించాను? వీరు చేస్తున్నారు... అని ఇప్పటివరకు ఇతరులను చూస్తున్నారు. కానీ అధికారం లభించే సమయంలో వారు తక్కువ పదవిని పొందితే మీరు కూడా వారితో పాటు వెళ్తారా? ఆ సమయంలో వారిని చూస్తారా? ఆ సమయంలో చూడరు. మరి ఇప్పుడు ఎందుకు చూస్తారు.
అచ్ఛా, అందరూ ముక్తులుగా అవుతారు కదా? ఎవరైతే ముక్తులుగా అవ్వడం కష్టమని భావిస్తున్నారో వారు చేతులు ఎత్తండి. గతసారి చీటీ వ్రాయమని చెప్పినప్పుడు బాప్‌దాదా దగ్గరకు రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు వారు వెళ్ళిపోయారు, కానీ బాప్‌దాదా ఆ పిల్లలకు అభినందనలతో పాటు ఇంకా ధైర్యాన్ని ఇస్తున్నారు - ఎలా ఆలోచించారో, కొందరు 6 మాసాలు కావాలని వ్రాసారు, కొందరు 2 మాసాలు కావాలని వ్రాసారు, ఎంత సమయం వ్రాసినా బాబా మతం ద్వారా తప్పకుండా పూర్తి అవుతుంది. మిగిలినది బాగుంది, సత్యం అయితే చెప్పారు కదా.
అచ్ఛా, ఇప్పుడు ఒక మాసంలో కూడా సగం మాసం గడిచిపోయింది. మిగిలింది కొద్ది రోజులే. కనుక ముక్తులుగా తప్పకుండా అవ్వండి. కనీసం మొదటి-రెండవ నంబర్ రాయల్ ఫ్యామిలీలోకి అయినా వచ్చేయండి. అచ్ఛా.
ఈ కల్పంలో ఇప్పుడు మొదటిసారి వచ్చినవారు చేతులు ఎత్తండి. ఎవరైతే వచ్చారో, మేము తీవ్ర పురుషార్థులుగా అయ్యి డైమండ్ జూబిలీని మా జీవితం మరియు సేవ ద్వారా జరుపుకుంటాము అనే ధైర్యం మీలో ఉందని భావిస్తున్నారా? మేము బాబాకు చేసి చూపిస్తాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులు ఎత్తండి. మొదటిసారి కొత్తగా వచ్చినవారిలో డైమండ్ జూబిలీ చివరి వరకు చేసి చూపిస్తాము అని భావించేవారు చేతులు ఎత్తండి. సిగ్గుపడకండి. చేతులు ఎత్తడానికి కొంచెం సంకోచిస్తున్నారు. కానీ బాప్‌దాదా వారికి కూడా చెబుతున్నారు - ధైర్యంతో ఏది సాధ్యం కాదు! ధైర్యం ఉంచండి. సహాయం పొందడానికి పాత్రులుగా అవ్వండి, అప్పుడు కొద్ది సమయంలోనే ముందుకు వెళ్ళగలరు. అందుకే అవుతుందో లేదో తెలియదు అని నిరాశ చెందకండి.
అచ్ఛా, ఇప్పుడు ఏయే జోన్లు వచ్చాయి? (బాప్‌దాదా అన్ని జోన్ల వారిని చేతులు ఎత్తించి కలుస్తున్నారు)
బాప్‌దాదాకు సంతోషంగా ఉంది, మంచిది వచ్చారు. ఈసారి వచ్చిన డబల్ విదేశీయులు చేతులు ఎత్తండి. అచ్ఛా.
యువతతో:- అన్ని వైపుల నుండి వచ్చిన యువత చేతులు ఎత్తండి. డైమండ్ జూబిలీలో యువత ఏమి చేస్తారు? యువతలో డబల్ శక్తి ఉంది. శారీరక శక్తి కూడా ఉంది మరియు ఆత్మిక శక్తి కూడా ఉంది. కనుక డబల్ శక్తితో డైమండ్ జూబిలీలో ఏ విశేషతను చూపిస్తారు? ర్యాలీ తీయడం, ఫంక్షన్ చేయడం ఇవన్నీ చేస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు చేసారు, చాలా సార్లు చేసారు. ఇప్పుడు ఏమి చేస్తారు? ప్రతి యువత, ఈ రోజుల్లో అజ్ఞాని యువతకు సంబంధించిన అసోసియేషన్లు లేదా గ్రూపులు ఉన్నాయి, వారు ఇతర దేశాలలో కూడా నష్టం చేస్తారు, గవర్నమెంట్‌ను కూడా ఇబ్బంది పెడతారు, అలాంటి ఏదైనా అసోసియేషన్‌ను తీసుకుని, అందులో నష్టం చేసేవారిని పరివర్తన చేసి చూపించండి. ప్రాక్టికల్‌గా ప్రతి యువకుడు తన తన సేవాస్థానంలో అలా పరివర్తన చెందిన గ్రూపును తయారు చేయండి. ఏయే జోన్లు వచ్చాయో, ప్రతి జోన్లో ఒకచోట 100, ఒకచోట 50 సేవాకేంద్రాలు ఉన్నాయి, గీతా పాఠశాలలు అయితే చాలా ఉన్నాయి. కానీ ప్రతి జోన్ తన ఏరియాలో ఎక్కడెక్కడ సేవాకేంద్రాలు ఉన్నాయో, అక్కడి నుండి అలా పరివర్తన చెందిన శాంపిల్‌ను తయారు చేయండి. మీకు తెలుసు, దొంగల విషయంలో జరిగినప్పుడు ఒక దొంగ పరివర్తన చెందాడు, ఒక ఎగ్జాంపుల్ వెలువడింది. ఆ ఒక దొంగ ఎక్కడైనా తన అనుభవాన్ని వినిపించినప్పుడు అందరికీ చాలా ఆసక్తి కలిగేది. కనుక మీరు కూడా అలాంటి అసోసియేషన్లు, సంగఠనలు ఉన్నచోట, అక్కడి నుండి ఎంతమందిని తయారు చేయగలరో అంతమందిని తయారు చేయండి. ఎగ్జాంపుల్ తయారు చేయండి. తర్వాత అన్ని జోన్ల నుండి ఎవరైతే తయారవుతారో వారందరినీ కలిపి ఒక విశేష ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. అందులో గవర్నమెంట్ డిపార్ట్మెంట్కు - ఈ యువత ఏమి చేస్తున్నారు, ఆ యువత ఏమి చేస్తున్నారు అని చూపిస్తారు. మరి యువత సిద్ధంగా ఉన్నారా? నంబర్ తీసుకోవాలా? హా లేక నా? ఎంత టైమ్ కావాలి? డైమండ్ జూబిలీలో 6 మాసాలు కావాలా, 4 మాసాలు కావాలా, ఎంత టైమ్ కావాలి? మహారాష్ట్ర యువత ఏమి చేస్తారు? జవాబు చెప్పండి. కష్టంగా అనిపిస్తుందా? ఎవరైతే హా, చేస్తాము అని అంటున్నారో వారు చేతులు ఎత్తండి. అచ్ఛా. యు.పి. వారు చేస్తారా? హా అని చెప్పండి లేదా కాదు అని చెప్పండి. ఎంత టైమ్‌లో చేస్తారు? డైమండ్ జూబిలీలో 6 మాసాలు కావాలా? 6 మాసాల తర్వాత ఎవరూ అంగీకరించడం లేదు, మళ్ళీ మార్కులు ఇవ్వండి అని అనకండి. ఎవరైనా ఎక్కువ ఎగ్జాంపుల్స్ తయారు చేయవచ్చు, ఎవరైనా తక్కువ తయారు చేయవచ్చు, కానీ ‘కాదు’ అనే పదం రాకూడదు. కనుక ఇందులో మొదటి నంబర్ ఎవరు తీసుకుంటారు? టీచర్లు ఏమనుకుంటున్నారు, అవుతుందా? అవ్వాల్సిందే. గవర్నమెంట్‌కు ప్రాక్టికల్ ఉదాహరణ కావాలి. మేము చాలా సోషల్ వర్క్ చేస్తాము అని మీరు అంటారు కదా. కనుక వారికి ఆ ఉదాహరణ కావాలి. అలాంటి గ్రూపును తయారు చేయండి మరియు చేయించడం టీచర్ల పని. అచ్ఛా.
కుమారీలతో:- అందరికంటే ఎక్కువ కుమారీలు ఎక్కడి నుండి వచ్చారు? కుమారీలు తేలికగా ఉన్నారు కదా, లేచి నిలబడండి. అచ్ఛా, ఎక్కడి నుండి వచ్చినా కానీ కుమారీల గురించి - ‘కుమారీ అంటే తన రెండు కుటుంబాల కళ్యాణం చేసేది’ అని గాయనం చేయబడింది. మీకు అయితే ఒకే కుటుంబం ఉంది. రెండవది లేదు. కనుక కుమారీలు తమ గ్రూపులో నుండి, యువతకు ఎలా చెప్పారో అలాగే ఫిమేల్స్కు కూడా అలాంటి అసోసియేషన్లు ఉన్నాయి, అక్కడక్కడా ఉన్నాయి. కనుక మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ చెడిపోయిన ఆత్మలను పరివర్తన చేసి చూపించండి. మీరు కూడా గ్రూపును తయారు చేయండి. అప్పుడు డైమండ్ జూబిలీలో గవర్నమెంట్‌కు - చూడండి, మాతలు కూడా మారగలరు మరియు యువత కూడా మారగలరు అని చూపించండి.
మాతలతో:- ప్రవృత్తిలో ఉన్న మాతలు ఏమి చేస్తారు? చెడు సాంగత్యం కారణంగా చిక్కుకుపోయిన దుఃఖిత ఆత్మలు చాలామంది ఉన్నారు. అలాంటి అసోసియేషన్లలో నియమానుసారంగా వెళ్ళండి. అలా ఊరికే వెళ్ళి అవమానం పొంది తిరిగి రావద్దు. నియమానుసారంగా వెళ్ళండి. టీచర్లు కూడా చూడాలి - వీరి మాట, నడవడిక, ప్రవర్తన ప్రభావశాలిగా ఉందా అని. అటువంటి మాతల గ్రూపు కావచ్చు, కుమారీల గ్రూపు కావచ్చు, యూత్ గ్రూపు కావచ్చు. ఇప్పుడు ఈ మాలను తయారు చేయండి, అప్పుడు మీరు మాలలోకి వచ్చేస్తారు. చెడిపోయినవారిని సరిదిద్దండి. మాతలు చేయగలరా? అనుమతి లేకుండా ఎవరూ చేయకండి. టీచర్ల అనుమతితో నియమానుసారంగా 2-3 మందితో గ్రూపుగా వెళ్ళండి. అందరూ బయలుదేరి వెళ్ళిపోకండి. అలా చేయకండి. నియమానుసారంగా నడుచుకోండి. అర్థమైందా? కనుక మాతలు మరియు ప్రవృత్తిలో ఉన్న పాండవులు ఏమి చేస్తారు?
ప్రవృత్తిలో ఉన్నవారితో:- ప్రవృత్తిలో ఉన్న పాండవులు ఏమి చేస్తారు? పాండవులారా, ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారో ప్రతి ఒక్కరికీ తమ తమ క్షేత్రం ఉంది. కనుక ఎక్కడ లౌకిక కార్యం చేస్తున్నా, లౌకిక కార్యం చేస్తూనే అలౌకిక నడవడిక-ప్రవర్తన ద్వారా మీ ప్రభావాన్ని చూపించగలరు. కనుక పాండవులు తమలాంటి ఇద్దరు-ముగ్గురిని తప్పకుండా తయారు చేయాలి, ఎందుకంటే డైమండ్ జూబిలీలో నంబర్ పెంచాలి. అందుకే పాండవులు ఈ కార్యంలో సహయోగం ఇవ్వాలి. అర్థమైందా?
అందరికీ పాఠము గుర్తుందా? ఏ పాఠము? వ్యర్థ మాటల నుండి ముక్తులు... గుర్తుందా? మర్చిపోలేదు కదా? అచ్ఛా!
నలువైపులా ఉన్న పూర్వజ ఆత్మలకు, సదా ఈ నిశ్చయము మరియు నషాలో ఉండే శ్రేష్ఠ ఆత్మలకు, సదా తండ్రి శ్రీమతమనుసారంగా ప్రతి కర్మను చేసే కర్మయోగీ ఆత్మలకు, సదా దృఢ సంకల్పముతో తండ్రి యొక్క ప్రతి అడుగులో అడుగు వేస్తూ ఫాలో ఫాదర్ చేసే పిల్లలకు, చాలా చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే. డబల్ విదేశీయులకు డబల్ నమస్తే.
*** ఓంశాంతి ***
