‘‘పరమతము, పరచింతన మరియు పరదర్శన నుండి ముక్తులుగా అవ్వండి మరియు పర-ఉపకారము చెయ్యండి’’
ఈరోజు బాప్‌దాదా తమ నలువైపులా ఉన్న తండ్రి పిల్లలు ఎవరైతే ఉన్నారో, విశేషమైనవారో, ఆ సర్వ విశేషాత్మలను చూస్తున్నారు. భారత్‌లో కావచ్చు లేక విదేశములో కావచ్చు ఏ మూలన ఉన్నా కానీ బాప్‌దాదా విశేషాత్మలందరినీ సమీపంగా చూస్తున్నారు. బాప్‌దాదాకు తమ విశేషమైన పిల్లలను చూసి సంతోషం కలుగుతుంది. ఎలాగైతే పిల్లలైన మీకు తండ్రిని చూసి సంతోషం కలుగుతుంది కదా! సంతోషం కలుగుతుంది కావుననే పరుగెత్తుకుని వచ్చారు కదా. అలాగే నా ఒక్కొక్క బిడ్డ విశేషమైన ఆత్మ అని తండ్రికి కూడా సంతోషం కలుగుతుంది. వారు వృద్ధులు కావచ్చు, చదువుకోనివారు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, యువత కావచ్చు, ప్రవృత్తిలోని వారు కావచ్చు కానీ మొత్తము విశ్వము ఎదురుగా వారు విశేషమైనవారు. ఎంత గొప్ప-గొప్ప వైజ్ఞానిక అద్భుతాలను చూపించేవారైనా కానీ, చంద్రుని వరకు కూడా చేరుకునేవారైనా కానీ బాబా యొక్క విశేషమైన పిల్లల ముందు వారు కూడా ఏమీ తెలియనివారి కిందే లెక్క. వాళ్ళు పంచ తత్వాలనూ తెలుసుకున్నారు, వాటిపై విజయాన్ని కూడా ప్రాప్తి చేసుకున్నారు కానీ చిన్న బిందువైన ఆత్మను తెలుసుకోలేదు. ఇక్కడైతే - నీవు ఎవరు అని చిన్న బాలుడిని అడిగినా కానీ ఏమని చెప్తాడు? నేను ఆత్మను అనే చెప్తాడు కదా. ఆత్మ ఎక్కడ ఉంటుంది, అది కూడా చెప్తాడు. మరియు వైజ్ఞానికులను అడగండి, ఆత్మ ఏమిటి? అని. వారు ఆత్మ జ్ఞానాన్ని ఇప్పటివరకు తెలుసుకోలేకపోయారు. కనుక చరిత్రపరంగా ఎంత గొప్పవారైనా కానీ, ఈ ప్రపంచము లెక్కలో ఎంత విశేషమైనవారైనా కానీ ఎవరైతే స్వయం గురించే తెలుసుకోలేదో వారి కన్నా ఇక్కడి ఐదు సంవత్సరాల బాలుడు కూడా విశేషమైనవానిగా అయ్యాడు. మీకు ప్రారంభంలో చాలా నషాతో కూడిన పాట ఒకటి ఉండేది, అది ఏ పాటో గుర్తుందా? ఒక పాట ఉండేది - ఎంత పెద్ద సేఠ్ అయినా కానీ, స్వామి అయినా కానీ భగవంతుని గురించి తెలుసుకోలేదు... కనుక ఎంత గొప్పవారైనా కానీ, వారు నేత అయినా లేక అభినేత (యాక్టర్) అయినా స్వయము గురించే తెలుసుకోనప్పుడు మరేం తెలుసుకున్నట్లు? కనుక మీరు అటువంటి విశేషాత్మలు. ఇక్కడి చదువుకోని వృద్ధ మాత ఒక వైపు ఉన్నారు, మరొక వైపు మంచి మహాత్మ ఉన్నారు అనుకోండి, ఈ వృద్ధ మాత - మేము పరమాత్మను పొందాము అని నషాతో అంటారు. కానీ మహాత్మ - పరమాత్మను పొందటము చాలా కష్టము అని అంటారు. కానీ ఇక్కడ 100 సంవత్సరాల వయసు ఉన్న వృద్ధ మాత కూడా నిశ్చయబుద్ధి కలవారైతే, ఆమె ఏమని చెప్తారు? మీరు వెతుకుతూనే ఉండండి, మేమైతే పొందేసాము. కనుక మహాత్ములు కూడా మీ ఎదురుగా ఏమైనట్లు! ప్రవృత్తివారు నషాతో అంటారు - మేము డబల్ బెడ్‌పై పడుకున్నా, కలిసి ఉన్నా కూడా పవిత్రంగా ఉంటాము ఎందుకంటే మా మధ్య తండ్రి ఉన్నారు. మరియు మహాత్ములు ఏమంటారు? నిప్పు-దూది కలిసి ఉండటము, ఇదైతే అసంభవం అనిపిస్తుంది అని అంటారు. మరియు ఇది మీ కొరకు ఏమిటి? ప్రవృత్తి వారు చెప్పండి - పవిత్రంగా ఉండటము కష్టమా లేక సహజమా? సహజమా లేక అప్పుడప్పుడు కష్టమనిపిస్తుందా? ఎవరైతే దృఢంగా ఉంటారో వారు ఎంత పెద్ద సభలో అయినా లేక మరెక్కడైనా కానీ, పవిత్రత అయితే మా స్వధర్మము అని నషాతో చెప్పగలరు. అది పరధర్మము కాదు, స్వధర్మము. కావున స్వ అనేది సహజమనిపిస్తుంది, పరాయి అనేది కష్టమనిపిస్తుంది. అపవిత్రత పరధర్మము కానీ పవిత్రత స్వధర్మము. మరి ఇటువంటి మీ విశేషత గురించి తెలుసు కదా? ఎందుకంటే కొత్త-కొత్తవారు కూడా చాలామంది వచ్చారు కదా? కానీ ఎంత కొత్తవారైనా సరే పవిత్రతా పాఠమైతే దృఢంగా ఉంది కదా? చాలా మంది పిల్లలు ఇలా కూడా చేస్తారు - ఎప్పటివరకైతే తండ్రిని కలుసుకునేందుకు ఒక సంవత్సరం పూర్తవ్వదో, అందరికీ తెలుసు, ఈ నియమములో దృఢంగా ఉండాలి అని. కావున మధుబన్కు వచ్చేంతవరకైతే బాగానే ఉంటారు కానీ చూసేసారు, చేరుకున్నారు అంటే చాలామంది తిరిగి వెళ్ళిన తర్వాత నిర్లక్ష్యులుగా కూడా అయిపోతారు, కానీ ఆలోచించండి - పవిత్రతా ప్రతిజ్ఞను ఎవరితో చేసారు? తండ్రితో చేసారు కదా? ఇది తండ్రి ఆజ్ఞ కదా? మరి తండ్రికి ప్రతిజ్ఞ చేసి మళ్ళీ ఒకవేళ నిర్లక్ష్యులుగా అయితే నష్టము ఎవరికి కలుగుతుంది? బ్రాహ్మణ పరివారములోనైతే ఒకరు వెళ్తే, 10 మంది వస్తారు. కానీ బలహీనంగా అవ్వడం వలన నష్టము ఆ ఆత్మలకే కలుగుతుంది, అందుకే కొత్త-కొత్తవారెవరైతే మొదటి సారి వచ్చారో, వారు తండ్రి ఇంటికైతే చేరుకున్నారు, ఇదైతే భాగ్యం యొక్క విషయమే కానీ ఆ భాగ్య రేఖను ఎప్పుడూ తగ్గించుకోకండి. భాగ్యాన్ని పెంచుకోండి.
అచ్ఛా, ఎంతమంది వచ్చినా, అందరి పేర్లు రిజిస్టర్లో అయితే ఉన్నాయి. రిజిస్టర్లో మీ పేరు పక్కాగా నమోదు చేయించుకున్నారా లేక కొద్దిగా పచ్చిగా ఉందా? అచ్ఛా, కొత్తగా ఎక్కడెక్కడి నుండి ఎవరెవరు వచ్చారో, టీచర్ల వద్ద లిస్ట్ అయితే ఉంది కదా మరియు ప్రెజెంట్ మార్క్ కూడా వేస్తున్నారా లేదా? ప్రెజెంట్ మార్క్ వేయని సేవాకేంద్రం ఏదైనా ఉందా? టీచర్లు నిజం చెప్పండి. ఎప్పుడైనా నిద్ర వచ్చి ఉండవచ్చు, ఎప్పుడైనా అనారోగ్యం వచ్చి ఉండవచ్చు, ఎప్పుడైనా క్లాస్‌కు చేరుకోలేకపోయి ఉండవచ్చు, అయినా రోజూ ప్రెజెంట్ మార్క్ పడుతుందా? రోజువారీ రిజిస్టర్ మరియు ప్రెజెంట్ మార్క్ ఉంది అని చెప్పే టీచర్లు చేతులు ఎత్తండి. అచ్ఛా, రెగ్యులర్‌గా ఉందా లేక అప్పుడప్పుడు మాత్రమేనా? రెండు-మూడు రోజులు మిస్ అవుతుందా? టీచర్లందరూ పాస్ అయితే చప్పట్లు కొట్టండి. కనుక ఇప్పుడు ఏమి చేయాలి - మీరు కొత్తగా ఎవరిని తీసుకువచ్చినా, అన్నయ్యలు కావచ్చు, అక్కయ్యలు కావచ్చు, వారి గురించి మూడు-నాలుగు నెలల తర్వాత, ఎందుకంటే మొదట కొద్దిగా నషా ఉంటుంది, తర్వాత నెమ్మది-నెమ్మదిగా తగ్గుతుంది, కనుక నాలుగు నెలల తర్వాత ఎంతమంది కొత్తగా వచ్చారో అంతమంది అలాగే ఉన్నారా లేక ఎక్కడికైనా చక్కర్ వేయడానికి వెళ్లారా? ఈ రిజల్ట్ వ్రాయండి. ఎందుకంటే చాలామంది చక్కర్ వేయడానికి కూడా వెళ్తారు. రెండు సంవత్సరాలు మాయ యొక్క యాత్ర చేసి మళ్ళీ ఇక్కడికి చేరుకుంటారు. కనుక రిజల్ట్‌లో కేవలం ఈ రెండు మాటలు వ్రాయండి - 60 మంది వచ్చారు మరియు 60 మందే ఉన్నారు. లేదా 60 మంది వచ్చారు, 40 మంది ఉన్నారు. కేవలం ఈ రెండు అక్షరాలను విశేషంగా రతన్మోహినీ పేరుతో వేరుగా వ్రాయండి. బయట (కవరుపై) బ్రహ్మాకుమారీస్ అని వ్రాస్తారు, కానీ పెద్ద అక్షరాలలో రతన్మోహినీ అని వ్రాయండి, లోపల కాదు. అప్పుడు ఇది వీరి కోసం అని అర్థం చేసుకుంటారు, లేకపోతే వారి వద్దకు (ఈశూ వద్దకు) చాలా పోస్ట్ వస్తుంది. చూద్దాం, ఎంతమంది విశేష ఆత్మలు తమ విశేషతను చూపిస్తారో?
చూడండి, లౌకికములో కూడా బిడ్డ జన్మించినప్పుడు అందరూ ఏమంటారు? సదా జీవించి ఉండాలి, దీర్ఘాయుష్షు ఉండాలి. అలాగే బాప్‌దాదా కూడా విశేష ఆత్మల అవినాశీ విశేషతను చూడాలనుకుంటారు, కొద్ది సమయానికి చెందిన విశేషత కాదు. ఒక సంవత్సరం నడిచారు, రెండు సంవత్సరాలు నడిచారు - ఇలా కాదు. అవినాశీగా ఉండేవారికే అవినాశీ ప్రారబ్ధము ప్రాప్తిస్తుంది. మరి మాతలు కూడా దృఢంగా ఉన్నారా? ఎందుకంటే మీరు ఒక సంవత్సరం వారైనా, రెండు సంవత్సరాల వారైనా లేక నాలుగు సంవత్సరాల వారైనా కానీ సమాప్తి అయితే ఒకే సమయములో జరగనున్నది కదా! వినాశనమైతే ఒకేసారి జరుగుతుంది కదా. లేక మేమైతే రెండు సంవత్సరాల వారము, మా సిల్వర్ జూబిలీ జరగాలి, ఆ తర్వాత వినాశనం జరగాలి అని అంటారా! ఇదైతే జరగదు కదా, అందుకే వెనుక వచ్చేవారు ఇంకా ముందుకు వెళ్ళాలి. కొద్ది సమయములో చాలా సంపాదనను చేసుకోగలరు. ఎంతైనా మీకు పురుషార్థము యొక్క సమయమైతే లభించింది. మున్ముందైతే ఇంత సమయము కూడా లభించదు. ఇప్పుడు లేట్ (ఆలస్యమైంది) అన్న బోర్డు అయితే పెట్టడం జరిగింది కానీ టూ లేట్ (చాలా ఆలస్యమైపోయింది) అన్న బోర్డునైతే ఇంకా పెట్టలేదు అని వినిపించాము కదా. కనుక మీరందరూ అదృష్టవంతులు. కేవలము మీ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. ఇతర ఏ విషయాలలోకి వెళ్ళకండి.
పిల్లల పురుషార్థపు సమయము ఎందుకు వ్యర్థంగా పోతుంది అన్నదానిని ఈ రోజు బాప్‌దాదా చూస్తున్నారు. వ్యర్థంగా పోవాలి అని ఎవరూ కోరుకోరు, మా సమయం సఫలమవ్వాలి అనే అందరూ కోరుకుంటారు కానీ మధ్య-మధ్యలో అక్కడక్కడా అరగంట, అక్కడక్కడా పదిహేను నిమిషాలు, అక్కడక్కడా ఐదు నిమిషాలు వ్యర్థంగా పోతూ ఉంటాయి. మరి దీనికి కారణము ఏంటి? ఈ రోజు బాప్‌దాదా చూసారు - మెజారిటీ వారి పురుషార్థము తక్కువ అవ్వటానికి లేక ఢీలా అవ్వటానికి విశేషంగా మూడు కారణాలు ఉన్నాయి. వీటి గురించి ముందు కూడా వినిపించి ఉన్నాము, కొత్త విషయమేమీ కాదు, కానీ డైమండ్ జూబిలీలో విశేషంగా దేనిపై అటెన్షన్ పెట్టాలి అన్నదాని గురించి బాప్‌దాదా ముందు నుండే వినిపిస్తూ ఉన్నారు. ఆ మూడు కారణాలు - మొదటిది, నడుస్తూ-నడుస్తూ ఉండగా శ్రీమతంతోపాటు ఇతరాత్మల పరమతాన్ని కలిపేస్తారు. ఎవరో ఏదో విషయాన్ని వినిపించారు మరియు వినిపించేవారు మంచివారు, సత్యమైన మహారథి అని మీరు భావిస్తారు మరియు మీకు వారిపై నమ్మకము కూడా ఉంది, ఎప్పుడైనా అటువంటి ఆత్మ ఎవరైనా మీకు అటువంటి విషయాలు ఏవైనా వినిపిస్తే, ఈ సమాచారమైతే మంచిదే... అని మీకు దాని పట్ల ఆసక్తి కూడా కలుగుతుంది. ఏ విధంగా ప్రాపంచిక సమాచారం మంచిగా అనిపిస్తుంది కదా, అలాగే బ్రాహ్మణ ప్రపంచపు సమాచారం కూడా మంచిగా అనిపిస్తుంది, కనుక మీరు వారిపై విశ్వాసాన్ని ఉంచి ఆ విషయాన్ని విన్నారు అనగా మీ లోపల దానిని ఇముడ్చుకున్నారు, ఖండించలేదు, అక్కడ విషయము సత్యమైనదే, సమాచారము సత్యమైనదిగా కూడా ఉంటుంది, అన్నీ అసత్యమైనవే ఉండవు, కొన్ని సత్యమైనవి కూడా ఉంటాయి కానీ తండ్రి ఆజ్ఞ ఏమిటి? అటువంటి సమాచారము వినండి ఫర్వాలేదు - ఇలా బాబా ఆజ్ఞ ఉన్నదా? లేదు. దానితో మీకు ఎటువంటి సంబంధము లేదు, అది కేవలము మనసుకు ఇంపైన సమాచారము, మీరేమీ చెయ్యలేరు, కేవలము విన్నారంటే ఆ సమాచారము బుద్ధిలోకైతే వెళ్ళింది, సమయము వృథా అయ్యిందా లేదా? మరియు తండ్రి శ్రీమతములో పరమతాన్ని కలిపేసారు ఎందుకంటే తండ్రి ఆజ్ఞ ఏమిటంటే - వింటూ కూడా వినకండి. మరి మీరు ఎందుకు విన్నారు? అలవాటు చేసుకున్నారు. ఒకసారి మీకు సమాచారాన్ని వినిపించారనుకోండి, మీకు కూడా చాలా మంచిగా అనిపించింది, అది కొత్త విషయము, ఇలా కూడా జరుగుతుంది అన్నది తెలిసింది, కానీ ఒకవేళ ఒకసారి మీరు వారి విషయాన్ని వింటే ఇక రెండవ సారి వారు ఎక్కడికి వెళ్తారు? మీ దగ్గరకే వస్తారు. మీరు వారి కొరకు ఒక చెత్త డబ్బాలా అయ్యారు కదా! ఇటువంటి సమాచారము ఏది ఉన్నా సరే, వారు మీ వద్దకే వచ్చి వినిపిస్తారు ఎందుకంటే మీరు విన్నారు! అందుకే వారికి అర్థం చేయించండి, ఇటువంటి విషయాల నుండి వారిని కూడా విముక్తులుగా చెయ్యండి. అవి విని ఆసక్తిని పెంచుకోకండి. కానీ ఒకవేళ విన్నట్లయితే వారిలో కూడా సదా కొరకు ఫుల్స్టాప్ పెట్టేంత, మీ లోపల కూడా ఫుల్స్టాప్ పెట్టేంత శక్తి మీలో ఉందా? ఏ వ్యక్తి గురించైతే సమాచారాన్ని విన్నారో వారి పట్ల దృష్టిలో కానీ లేక సంకల్పములో కానీ ద్వేష భావము అసలు ఉండకూడదు. ఇంతటి శక్తి మీలో ఉన్నట్లయితే అది విన్నట్లు అవ్వదు, కళ్యాణము చేసినట్లు అవుతుంది. కానీ ఫలితం ఏం కనిపిస్తుందంటే - చాలామందిలో కొద్ది-కొద్దిగా చెత్త పోగవుతూ-పోగవుతూ ద్వేష భావము వచ్చేస్తుంది లేదంటే నడవడికలో తేడా వచ్చేస్తుంది. వేరే ఏమీ జరగకపోయినా కానీ ఆ ఆత్మ పట్ల సేవ చెయ్యాలి అన్న భావన ఉండదు, భారీతనము ఉంటుంది. దీనినే - శ్రీమతములో పరమతాన్ని కలపటము అని అంటారు. సమాచారాన్ని అయితే బాప్‌దాదా కూడా వింటారు. కానీ ఈ విషయంలో జరిగేదేమిటి? చాలామందిలో భావము మారిపోతుంది. వినిపించటంలో కూడా భావము మారిపోతుంది. ఒకరు వచ్చి అంటారు - వారిద్దరూ మాట్లాడుకోవటము నేను చూసాను. ఆ మొదటి వారు చెప్పింది విని రెండవ వారు అంటారు - అంతేకాదు, వారిద్దరూ నిలబడ్డారు కూడా కానీ మంచి పద్ధతిలోనైతే నిలబడలేదు. అంటే ఇక్కడ మరో విషయం కలిసింది.
తర్వాత మూడవవారు అంటారు - వీరైతే అలా చేస్తూనే ఉంటారు. భావము ఎంత మారిపోయింది. అసలు వారి భావన ఏమిటి కానీ మాటల్లో భావం ఎంతగా మారిపోయింది. ఈ పరమతం వాయుమండలాన్ని పాడు చేస్తుంది. కావున సమయం వ్యర్థంగా పోవటానికి ఒక కారణము పరమతము మరియు రెండవ కారణము పరచింతన. ఒకరి నుండి విషయాన్ని విన్నారంటే, దానిని ఎనిమిది-పదిమందికి వినిపించకుండా ఉండడమనేది జరగదు. ఒకవేళ ఎవరైనా దూరదేశంలో ఉన్నా కానీ వారికి ఉత్తరంలో కూడా వ్రాస్తారు - ఇక్కడ చాలా కొత్త విషయం జరిగింది, మీరు వచ్చినప్పుడు తప్పకుండా వినిపిస్తాము అని. మరి ఇదేమైనట్లు? పరచింతన. మీరు నలుగురికి వినిపించారనుకోండి, ఆ నలుగురి భావనను ఆ ఆత్మ పట్ల మీరు పాడు చేసారు కదా, మరియు పరచింతన అనేది మొదలయ్యింది అంటే దాని వేగం చాలా తీవ్రంగా ఉంటుంది మరియు దీర్ఘ కాలం ఉంటుంది.
పరచింతన అనేది ఒకటి-రెండు క్షణాలలో పూర్తవ్వదు. ఎవరికైనా జ్ఞానాన్ని వినిపించేటప్పుడు వారికి ఆసక్తి కలిగించడానికి దానిని కథ రూపంలో వినిపించండి అని బాప్‌దాదా అంటారు. ముందు ఇలా జరిగింది, తర్వాత ఏమయిందంటే, తర్వాత ఏమయిందంటే, ఆ తర్వాత ఏమయిందంటే... అప్పుడు ఆసక్తి పెరుగుతుంది కదా. అలాగే పరచింతన కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందులో వినేవారు తప్పకుండా ఆలోచిస్తారు - తర్వాత ఏమయింది, తర్వాత ఇలా జరిగిందా, అవును ఇలాగే జరిగి ఉంటుంది... కావున ఇది కూడా చాలా పెద్ద కథ. బాప్‌దాదా అయితే అందరి మనసులోని విషయాలను వింటారు కూడా, చూస్తారు కూడా. ఎవరు ఎంతగా దాచిపెట్టే ప్రయత్నం చేసినా కానీ, బాప్‌దాదా మాత్రం కేవలం లోకాన్ని దృష్టిలో పెట్టుకుని అందరి ముందు వారికి సూచనను ఇవ్వరు, అంతే తప్ప బాప్‌దాదాకు మాత్రం అన్నీ తెలుసు, అన్నీ చూస్తారు. లేదు, నేనైతే ఎప్పుడూ చేయను అని ఎవరు ఎంత చెప్పినా కానీ బాప్‌దాదా వద్ద రిజిస్టర్ ఉంది - ఎన్ని సార్లు చేసారు, ఏమేమి చేసారు, ఏ సమయంలో చేసారు, ఎంతమందితో చేసారు - ఈ రిజిస్టర్ అంతా ఉంటుంది. కాకపోతే అక్కడక్కడ మౌనంగా ఉండవలసి ఉంటుంది. కావున రెండవ విషయం వినిపించాము - పరచింతన. అటువంటి వారికి స్వచింతన ఎప్పుడూ నడవదు. ఏ విషయం జరిగినా కానీ, పరచింతన చేసేవారు తమ తప్పును కూడా ఇతరుల మీద వేస్తారు. మరియు పరచింతన చేసేవారు విషయాలను తయారుచేయడంలో నంబర్‌వన్‌గా ఉంటారు. తమ తప్పును పూర్తిగా ఎదుటివారిది అన్నట్లు ఎంతగా నిరూపిస్తారంటే అది వినే పెద్దవారు కూడా మౌనంగా ఉండిపోవలసి వస్తుంది. స్వచింతన అంటే కేవలం జ్ఞానం పాయింట్లను రిపీట్ చేయడం లేక జ్ఞానం పాయింట్లను వినడం, వినిపించడం - కేవలం ఇదే స్వచింతన కాదు. స్వచింతన అనగా తమలోని సూక్ష్మ బలహీనతలను, తమలోని చిన్న-చిన్న పొరపాట్లను చింతన చేసి తొలగించుకోవటము, పరివర్తన చేసుకోవటము, ఇది స్వచింతన. ఇకపోతే జ్ఞానాన్ని వినడము మరియు వినిపించడములో అయితే అందరూ తెలివైనవారే. అది జ్ఞాన చింతన, మననము. కానీ స్వచింతన యొక్క సూక్ష్మ అర్థము స్వయం పట్ల ఉంటుంది. ఎందుకంటే రిజల్టు వెలువడినప్పుడు - వీరు జ్ఞానాన్ని మంచిగా మననం చేసారు లేక సేవలో జ్ఞానాన్ని మంచిగా ఉపయోగించారు అన్నది చూడరు. ఈ రిజల్టు కన్నా ముందు - స్వచింతన మరియు పరివర్తన ఉండాలి, స్వచింతన చేయడము అంటే అర్థం పరివర్తన అవ్వడము. కావున ఫైనల్ రిజల్టు వచ్చినప్పుడు, అందులో ముందు మార్కులు ప్రాక్టికల్‌గా ధారణా స్వరూపులుగా ఉన్నవారికి లభిస్తాయి. ఎవరైతే ధారణా స్వరూపులుగా ఉంటారో, వారు న్యాచురల్ యోగీగా ఉండనే ఉంటారు. ఒకవేళ మార్కులు ఎక్కువ పొందాలనుకుంటే, ముందుగా ఇతరులకు ఏదైతే వినిపిస్తారో, ఈ రోజుల్లో విలువలపై ఏదైతే భాషణ ఇస్తారో, దానిని ముందుగా స్వయంలో చెకింగ్ చేసుకోండి ఎందుకంటే సేవకు ఒక్క మార్కు అయితే, ధారణ స్వరూపులుగా అయినందుకు 10 మార్కులు ఉంటాయి, ఒకవేళ మీరు జ్ఞానాన్ని ఇవ్వలేకపోయినా కానీ మీ ధారణతో ప్రభావం చూపించినట్లయితే మీ సేవ యొక్క మార్కులు జమ అయినట్లే కదా.
ఈరోజుల్లో చాలా మంది ఇలా అనుకుంటారు - మాకు సేవ యొక్క ఛాన్సు చాలా తక్కువగా లభిస్తుంది, మాకు ఛాన్సు లభించాలి, ఇతరులకు లభిస్తుంది, నాకెందుకు లభించడం లేదు? సేవ చేయడం చాలా మంచిది ఎందుకంటే ఒకవేళ బుద్ధి ఫ్రీగా ఉన్నట్లయితే వ్యర్థం చాలా నడుస్తుంది, అందుకే సేవలో బుద్ధి బిజీగా ఉండాలి, ఈ సాధనము మంచిదే. సేవా ఉత్సాహమైతే మంచిదే కానీ డ్రామానుసారంగా లేక పరిస్థితుల అనుసారంగా ఒకవేళ మీకు అవకాశం లభించలేదు అనుకోండి మరియు మీ అవస్థ ఇతరులకు సేవ చేసేందుకు బదులుగా మీ అవస్థ కూడా పడిపోయినట్లయితే లేక ఆ సేవ మిమ్మల్ని అలజడిలోకి తీసుకొచ్చినట్లయితే, అప్పుడు అదేమి సేవ అయినట్లు? ఆ సేవకు ప్రత్యక్ష ఫలము ఏమి లభిస్తుంది? సత్యమైన సేవ, ప్రేమతో సేవ, అందరి ఆశీర్వాదాలతో సేవ, దాని ప్రత్యక్ష ఫలము సంతోషము. ఒకవేళ సేవలో ఫీలింగ్ వచ్చినట్లయితే ఇక్కడ బ్రాహ్మణులు ఫీలింగ్‌ను ఏమంటారు? ఫ్లూ (ఒక రకమైన జ్వరం). ఫ్లూ వచ్చినవారు ఏమి చేస్తారు? నిద్రపోతారు. ఆహారం తినరు, నిద్రపోతారు. ఇక్కడ కూడా ఫీలింగ్ వస్తే అయితే తినడం మానేస్తారు లేదా అలిగి కూర్చుంటారు. కావున ఇది ఫ్లూ కదా. ఒకవేళ మీరు ధారణా స్వరూపులైతే, సత్యమైన సేవాధారులైతే, అది స్వార్థపూరితమైన సేవ కాదు. ఒకటేమో కళ్యాణ భావనతో చేసే సేవ, ఇంకొకటి స్వార్థంతో చేసేది. నాకు పేరు వస్తుంది, వార్తాపత్రికలో నా ఫోటో వస్తుంది, నాది టి.వి.లో వస్తుంది, బ్రాహ్మణులలో నా పేరు ప్రఖ్యాతమవుతుంది, బ్రాహ్మణి నన్ను ఎంతో ముందుంచుతారు, అడుగుతారు... ఈ భావాలన్నీ స్వార్థపూరితమైన సేవకు చెందినవి ఎందుకంటే ఈ రోజుల పరంగా, ప్రత్యక్షత పరంగా, ఇప్పుడు సేవ అనేది మీ వద్దకు వస్తుంది. ప్రారంభంలో స్థాపనా విషయము వేరు, కానీ ఇప్పుడు మీరు సేవ వెనుక వెళ్ళరు. మీ వద్దకు సేవ దానంతటదే వస్తుంది. కావున సత్యమైన సేవాధారి ఎవరైతే ఉన్నారో, ఆ సేవాధారికి ఒకవేళ ఏ సేవ లభించకపోయినా కానీ బాప్‌దాదా అంటారు - మీ ముఖంతో, మీ నడవడికతో సేవ చేయండి. మీ ముఖము తండ్రిని సాక్షాత్కారము చేయించాలి. మీ ముఖము, మీ నడవడిక తండ్రిని గుర్తు తెప్పించాలి. ఈ సేవ నంబర్‌వన్. ఎలాంటి స్వార్థ భావము లేనటువంటి సేవాధారులుగా ఉండాలి. నాకే ఛాన్సు లభించాలి, నాకే లభించాలి, ఎందుకు లభించదు, లభించాలి - ఇటువంటి సంకల్పాలను కూడా స్వార్థము అని అంటారు. బ్రాహ్మణ పరివారంలో మీ పేరు ప్రఖ్యాతమై ఉండకపోవచ్చు, మీరు మంచి సేవాధారి అయి ఉండవచ్చు అయినా కానీ మీకు పేరు లేదు, కానీ తండ్రి వద్ద అయితే పేరు ఉంది కదా, తండ్రి హృదయంలో పేరు ఉంది అన్నప్పుడు ఇంకేం కావాలి! మరియు కేవలం తండ్రి హృదయంలో మాత్రమే కాదు, ఎప్పుడైతే ఫైనల్లో నంబరు లభిస్తుందో, అప్పుడు మీ నంబరు ముందుంటుంది ఎందుకంటే బాప్‌దాదా లెక్క ఉంచుతారు. మీకు ఛాన్సు లభించలేదు, మీరు రైట్ కానీ ఛాన్సు లభించలేదు అంటే, అది కూడా నోట్ అవుతుంది. మరియు అడిగి ఛాన్సు తీసుకున్నారు, అది చేసారు కూడా, కానీ అందుకు కూడా మార్కులు కట్ అవుతాయి. ఈ ధర్మరాజు ఖాతా తక్కువేమీ కాదు. ఇవి చాలా సూక్ష్మమైన లెక్కలు, అందుకే నిస్వార్థ సేవాధారులుగా అవ్వండి, తమ స్వార్థము ఉండకూడదు. కళ్యాణం జరగాలన్న స్వార్థం ఉండాలి. ఒకవేళ మీకు ఛాన్సు ఉంది మరియు వేరే వారు - నాకు కూడా ఛాన్సు లభిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నారు, అంతేకాక వారు యోగ్యులు కూడా, అప్పుడు ఒకవేళ మీరు మీ ఛాన్సును వారికి ఇచ్చినట్లయితే, అందుకు కూడా మీ వాటా అందులో జమ అవుతుంది. మీరు చేయకపోవచ్చు, కానీ ఎవరికైనా ఛాన్సు ఇచ్చారంటే అందులో కూడా మీ వాటా జమ అవుతుంది ఎందుకంటే సత్యమైన వజ్రంగా అవ్వాలి కదా. కనుక లెక్కలను కూడా అర్థం చేసుకోండి, అలా నిర్లక్ష్యంగా నడుచుకోకండి, సరేలే, జరిగిపోయింది... లెక్కల పుస్తకం చాలా సూక్ష్మంగా ఉంది. తండ్రి ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు, ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. అప్పుడప్పుడు బాప్‌దాదా పిల్లల లెక్కల పుస్తకాన్ని చూస్తారు కూడా. కావున మొదటి విషయము పరమతము మరియు రెండవ విషయము పరచింతన.
మూడవది పరదర్శన. ఇతరులను చూడటంలో మెజారిటీ చాలా తెలివైనవారిగా ఉన్నారు. పరదర్శన - ఏదైతే చూస్తారో, చూసిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది? బుద్ధిలోకే వెళ్తుంది కదా. మరియు ఎవరైతే ఇతరులను చూడటంలో సమయాన్ని వెచ్చిస్తారో, వారికి తమను తాము చూసుకునేందుకు సమయం ఎక్కడ లభిస్తుంది? విషయాలైతే ఎన్నో జరుగుతాయి కదా, మరియు ఏవైతే విషయాలు జరుగుతాయో, అవి కనిపిస్తాయి కూడా, వినిపిస్తాయి కూడా, ఎంత పెద్ద సంగఠన అయితే అంత పెద్ద విషయాలు జరుగుతాయి. ఈ విషయాలు ఎందుకు జరుగుతాయి? ఈ విషయాలు జరగకూడదు అని చాలా మంది అనుకుంటారు. జరగకూడదు అన్నది కరక్టే కానీ వేటి గురించైతే జరగకూడదు అని మీరు అనుకుంటున్నారో, వాటికి సమయాన్ని ఎందుకు ఇచ్చారు? ఈ విషయాలే కదా పేపర్లు. ఎంత పెద్ద చదువు అయితే, అంత పెద్ద పేపర్లు కూడా ఉంటాయి. ఇటువంటి వాయుమండలం తయారవ్వడం కూడా అందరి కొరకు పేపరు వంటిదే, పరమతము లేక పరదర్శన లేక పరచింతన నుండి ఎంతవరకు స్వయాన్ని సురక్షితంగా ఉంచుకుంటారు? రెండు వేర్వేరు విషయాలు ఉన్నాయి. ఒకటేమో బాధ్యత, దాని కారణంగా వినాల్సి కూడా వస్తుంది, చూడాల్సి కూడా వస్తుంది. ఆ సందర్భంలో కళ్యాణ భావనతో వినండి మరియు చూడండి. బాధ్యత ఉంది, కళ్యాణ భావన ఉంది, అది కరక్టే. కానీ మీ అవస్థను అలజడిలోకి తీసుకొచ్చి చూడటము, వినడము లేక ఆలోచించడము - ఇది తప్పు. ఒకవేళ మిమ్మల్ని మీరు బాధ్యత కలవారిగా భావిస్తే, ఆ బాధ్యత కన్నా ముందు మీ బ్రేక్‌ను శక్తిశాలిగా చేసుకోండి. ఏ విధంగా కొండపైకి ఎక్కేటప్పుడు ముందు నుండే సూచన ఇస్తారు కదా - మీ బ్రేక్‌ను సరిగ్గా చెక్ చేసుకోండి అని. బాధ్యత కూడా ఒక ఉన్నతమైన స్థితి, బాధ్యతను తీసుకోండి కానీ ముందుగా ఇది చెక్ చేసుకోండి - క్షణంలో బిందువు పెట్టడం అవుతుందా? లేక పెట్టడం బిందువు పెడతారు కానీ అది ప్రశ్నార్థకంగా అవుతుందా? అది తప్పు. అందులో సమయము మరియు శక్తి వృథా అవుతుంది, అందుకే ముందుగా మీ బ్రేక్‌ను శక్తిశాలిగా చేసుకోండి. సరే - చూసారు, విన్నారు, ఎంత వీలైతే అంత కళ్యాణం చేసారు, ఇక ఫుల్స్టాప్. ఒకవేళ ఇటువంటి స్థితి ఉన్నట్లయితే బాధ్యతను తీసుకోండి, లేదంటే చూస్తూ చూడకుండా ఉండండి, వింటూ వినకుండా ఉండండి, స్వచింతనలో ఉండండి. ఇందులోనే లాభము ఉంది.
మరి ఈనాటి పాఠము ఏమిటి? పరమతము, పరచింతన మరియు పరదర్శన - ఈ మూడు విషయాల నుండి ముక్తులుగా అవ్వండి మరియు ఒక్క విషయాన్ని ధారణ చేయండి, ఆ ఒక్క విషయం ఏమిటంటే - పరోపకారిగా అవ్వండి. మూడు రకాల ‘పర’ అన్నవాటిని సమాప్తం చేయండి మరియు ఒక ‘పర’ - పరోపకారిగా అవ్వండి. అలా అవ్వడం వస్తుందా? మరి ఏ విషయాల నుండి ముక్తులుగా అవుతారు? మాతలు ఏం చేస్తారు? పిల్లలకు ఉపకారులా లేక పరోపకారులా? సర్వులకు ఉపకారి. సహజమా లేక కష్టమా? కొత్త-కొత్తగా వచ్చినవారు ఇది సహజంగా ఉందని భావిస్తున్నారా లేక కష్టంగా ఉందని భావిస్తున్నారా? టీచర్లు చెప్పండి - సహజంగా ఉందా? (హా జీ) లేదు, బాప్‌దాదా కష్టంగా ఉందని భావిస్తున్నారు. విషయాలు ఎంతగా ఉంటాయంటే, చాలా కష్టం! ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు కనుక సహజం-సహజం అని అంటున్నారు. తర్వాత ట్రైన్ నుండి దిగినప్పుడు ఏదైనా చిన్న విషయం జరిగితే కష్టం అని అంటారు. ఇంకా ఇంటికి వెళ్ళినప్పుడు, సేవాకేంద్రానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక విషయం పేపర్ తీసుకోవడానికి తప్పకుండా వస్తుంది.
అచ్ఛా - డబల్ విదేశీయులకు సహజంగా అనిపిస్తుందా లేక కష్టంగా అనిపిస్తుందా? సహజంగా అనిపిస్తే చేతులు ఎత్తండి. టీచర్లు నంబర్‌వన్ తీసుకుంటారు కదా? ఆ సమయంలో - మాకు అసలు తెలియనే తెలియదు, మాకు ఈ జ్ఞానమే లేదు అని అనకండి. అందుకే బాప్‌దాదా ముందుగానే చెబుతున్నారు - దేనిలో మార్కులు జమ అవుతాయి మరియు దేనిలో మార్కులు కట్ అవుతాయి. నంబర్ తీసుకోవాలంటే మేకప్ చేయండి. ఇప్పుడు ఎవరైనా చేయవచ్చు. ఎవరి సీట్ కూడా ఫిక్స్ అవ్వలేదు. బ్రహ్మాబాబా మరియు జగదంబ తప్ప మిగిలిన సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎవరైనా తీసుకోవచ్చు. ఒక సంవత్సరం వారు కూడా తీసుకోవచ్చు.
అయితే సదా ఏమి గుర్తుంచుకుంటారు? మీ విశేషతలను గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు విశేషమైనవారిగా భావిస్తే ఈ ఆటలకు సంబంధించిన విషయాలు ఉండవు. మీరు విశేషమైనవారు మరియు సదా మొత్తం కల్పంలో విశేషమైనవారిగానే ఉంటారు. ఇంకా ఏ ధర్మనాయకులకైనా లేదా మహాత్ములకైనా ఇంత విధిపూర్వకంగా పూజ జరగదు. దేవతలకు ఏ విధంగా పూజ జరుగుతుందో, ఆ విధంగా మరెవరికీ జరగదు. నాయకులనైతే పాపం ఎండలో వేలాడదీస్తారు. అచ్ఛా!
(తర్వాత అన్ని జోన్ల సోదరసోదరీలను బాప్‌దాదా చేతులు ఎత్తించారు)
బాగుంది, అందరికీ టర్న్ లభిస్తుంది. ఇప్పుడు జ్ఞాన సరోవర్‌లో బాగా ఉంటున్నారు. జ్ఞాన సరోవర్‌లో బాగుందా లేక ఇక్కడికి రావాలని అనుకుంటున్నారా? ఇష్టమే కదా? పంజాబ్ వారికి ఇష్టమేనా? భోపాల్ వారు కూడా అక్కడ ఉన్నారు. భోపాల్ వారికి బాగుందా? (చాలా బాగుంది) అచ్ఛా, అయితే వీరిని ఎప్పుడూ అక్కడికే పంపించండి. సంగమంలో ఇంత మంచి ఏర్పాటు లభించింది. సత్యయుగంలో ఒక్కొక్క మహల్ జ్ఞాన సరోవర్ కంటే కూడా పెద్దదిగా ఉంటుంది, కానీ ఇప్పుడు సంగమంలో మూడు అడుగుల భూమి కూడా మంచిదే. బాప్‌దాదా చూసారు కూడా. సాకారంలో కూడా చూసారు, అలాగే ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. దూరంగా కూడా లేదు మరియు ఏర్పాటు కూడా బాగుంది. అందుకే టర్న్ బై టర్న్ ఎవరికైనా ఇవ్వండి. రెండవసారి పంజాబ్ వారు ఇక్కడికి వస్తారు. అచ్ఛా.
కుమారీలతో:- కుమారీలు ఏ అద్భుతం చేస్తారు? అద్భుతం చేయాలి కదా! అందరూ చేసేదే మీరు కూడా చేస్తే అందులో అద్భుతం ఏముంది? అయితే ఈ కుమారీల గ్రూప్ ఏమి చేస్తుంది? మీరు చెప్పకపోతే బాప్‌దాదా ఏది చెబుతారో అది చేయవలసి ఉంటుంది. లేకపోతే మీరే చెప్పండి. ఈ డైమండ్ జూబిలీలో కుమారీలు ఏమి చేస్తారు? ఎందుకంటే మీకు ఇప్పుడే డైమండ్ జూబిలీ ఛాన్స్ ఉంది. తర్వాత ఈ ఛాన్స్ లభించదు. అయితే కుమారీలు ఏమి చేస్తారు? డైమండ్ జూబిలీని ఎదురుగా ఉంచుకొని ఆలోచించండి. ముందుగా మేము సేవలో నిమగ్నమవుతాము అనే లక్ష్యం ఉన్నవారు చేతులు ఎత్తండి. నిలబడండి. అచ్ఛా, వీరి ఫోటో తీయండి. వీరు చాలా మంది ఉన్నారు. అయితే కుమారీలు ఏమి చేయాలి? మీరు చేతులు ఎత్తారు, నిలబడ్డారు మరియు మీ ఫోటో కూడా తీయబడింది, కనుక మీరందరూ సేవలో నిమగ్నమవ్వాలి, ఇది పక్కా కదా! ఇంటికి వెళ్లి టీచర్‌తో - లేదు, నేను ఉద్యోగం చేస్తాను అని అనరు కదా! అలా లేరు కదా? చేతులు ఎత్తినవారు పక్కాగా ఉన్నారు కదా? ఉద్యోగం చేసేవారిగా ఉండరు కదా! సేవ చేస్తారు కదా? అచ్ఛా, ఎవరైతే నిర్బంధనంగా ఉన్నారో, కేవలం చదువు ఒక సంవత్సరం ఉంది లేదా కొద్దిగా ఉంది, నిర్బంధనంగా అవ్వగలిగేవారు చేతులు ఎత్తండి. అచ్ఛా. ఎందుకంటే బాప్‌దాదా చెప్పారు - ఇప్పుడు సమాప్తి సమయం సమీపంగా వస్తోంది. డేట్ చెప్పరు. కానీ సమీపంగా వస్తోంది, దాని అనుసారంగా సేవలో వృద్ధి జరగాలి కదా. కనుక ఎవరెవరు కుమారీలు లేచారో, వారు స్వయంగా నిర్బంధనంగా అవ్వలేకపోతే, ఏదైనా కారణం ఉంటే, తమతో సమానమైన ఏదో ఒక కుమారీని తప్పకుండా తయారు చేయండి. ఉదాహరణకు మీకు ఇంటి బంధనం ఉంది. స్వయంగా నిర్బంధనంగా అవ్వలేకపోతే కనీసం ఒకరినైనా తప్పకుండా తయారు చేయండి. ఇది చేయగలరా? ఒక సంవత్సరం ఉంది, ఒక సంవత్సరంలో ఒకరిని మీ సమానంగా తయారు చేయలేరా? తయారు చేయవలసిందే కదా. ప్రతి కుమారీ స్వయంగా సేవలో నిమగ్నమవ్వగలిగితే నిమగ్నమవుతారు, కానీ ఎవరైనా స్వయంగా నిమగ్నమవ్వలేకపోతే తమతో సమానమైన కుమారీని తయారు చేయండి. కుమారీలకు ఇష్టమేనా? అవునా, కాదా చెప్పండి? ఆలోచిస్తున్నారు. అచ్ఛా, పంజాబ్ కుమారీలు చేతులు ఎత్తండి. పంజాబ్ వారందరూ కలిసి చెప్పండి - వీరు సేవ చేస్తారా? పంజాబ్ సింహం ఎక్కడికి వెళ్లింది? ఎందుకు, ఉగ్రవాదులను చూసి భయపడ్డారా? పంజాబ్‌ను సింహం అని అంటారు, కనుక సింహం ముందుకు రావాలి కదా, ఇంట్లో కూర్చోకూడదు. కనుక కుమారీలు తమతో సమానమైన కుమారీని తయారు చేయాలి. ఎందుకంటే చూడండి, సోదరులు అందరూ నవ్వుతారు - కుమారీ మూడు సంవత్సరాల ట్రయల్‌లో ఉన్నా, కుమార్ 40 సంవత్సరాల పాతవారైనా, సేవాకేంద్రంలో ఉండే కుమారీని దీదీ-దాదీ అని పిలవడం ప్రారంభిస్తారు, కానీ కుమారులను ఎవరూ దాదా అని పిలవరు. కుమారుల రిపోర్ట్ ఇదే కదా, ఇదే ఫిర్యాదు. అచ్ఛా, కుమారులు చేతులు ఎత్తండి.
కుమారులతో:- కుమారులు దాదా అయితే అవ్వరు! దాదా అని ఎవరూ పిలవరు, కానీ రాజుగా అవ్వగలరు. డైమండ్ జూబిలీలో కుమారులు కనీసం ఎనిమిది ముత్యాలతో ఒక్కొక్క కంకణం లేదా మాలను తయారు చేయండి. అష్ట యొక్క గాయనం ఉంది కదా. అప్పుడు మీ ప్రజలు తయారవుతారు మరియు ప్రజలను తయారు చేయడం ద్వారా మీరు రాజుగా అవుతారు. కుమారీలను దాదీ-దీదీలుగా అవ్వనివ్వండి. మీరు ఇంకా రాజులుగా అవ్వండి. కుమారులు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు ఎనిమిది మందిని తీసుకొచ్చినా ప్రజలు తయారవుతారు. ప్రజలు తయారైతే మీకు రాజతిలకం తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే చాలావరకు ఇప్పుడు వారిస్ క్వాలిటీ తక్కువగా వస్తోంది. కుమారులు ఒక్క వారిస్ క్వాలిటీ వారిని తయారు చేసినా మహారాజుగా అవుతారు. కుమారులు సిద్ధంగా ఉన్నారా? వారిస్ అని ఎవరిని అంటారో అర్థమవుతుందా? సాధారణమైనవారు వస్తూనే ఉంటారు కదా, కానీ వారిస్ ఎవరైతే ఉంటారో, ఆ ఒక్కరిని చూసి ఇంకా అనేకమంది వస్తారు. దానిని వారిస్ క్వాలిటీ అంటారు, చిన్న-చిన్న మైక్‌లు. అయితే కుమారులు రాజులుగా అవుతారు కదా! (హా జీ) అచ్ఛా, ఇక్కడ మధుబన్‌లో మాత్రమే హా జీ అంటారా లేక పంజాబ్, బాంబే లేదా ఎక్కడికి వెళ్లినా అక్కడ కూడా హా జీ అంటారా?
కుమారులను చూసి బాప్‌దాదా సంతోషిస్తారు. కేవలం కుమారులు, కుమారీల విషయంలో బాబాకు ఒక విషయం గురించి భయం కూడా కలుగుతుంది. సంతోషం కూడా కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది. కుమారులు తెలివైనవారు కదా, చెప్పవలసిన అవసరం లేదు. కేవలం ఇందులో సదా ఒక బాబా తప్ప మరెవరూ లేరు, కొద్దిగా కూడా కాదు. ఏమి చేయను... కొద్దిగా అయితే కావాలి... ఇలా కాదు. ఇది ఎలాంటి మాయ అంటే, గజ-గ్రాహ కథ చూసారు కదా, విన్నారు కదా, అది ఏమి చేస్తుంది? ముందుగా కొద్దిగా లోపలికి లాగుతుంది, తర్వాత పూర్తిగా లోపలికి లాగేస్తుంది. తెలియనే తెలియదు. కనుక డైమండ్ జూబిలీలో ఈ భయాన్ని తొలగించండి. ఇటువంటి ఒక్క ఉత్తరం కూడా రాకూడదు. డైమండ్ జూబిలీ అంటే ఎటువంటి లోపం లేదు. బాప్‌దాదా చూస్తారు - చేతులు అందరూ ఎత్తారు, కానీ రాజులు ఎంతమంది అయ్యారో ఆ లిస్ట్ కూడా వస్తుంది కదా! అచ్ఛా.
ప్రవృత్తిలో ఉన్నవారితో:- ప్రవృత్తిలో ఉన్నవారికి బాప్‌దాదా ఒక విషయం కోసం అభినందనలు ఇస్తున్నారు. ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు సేవా సహచరులుగా అయినప్పటి నుండి సేవలో పేరు ప్రసిద్ధి చేయడంలో ఒక ఎగ్జాంపుల్‌గా అయ్యారు. ముందుగా ప్రజలు బ్రహ్మాకుమార్ లేదా బ్రహ్మాకుమారీగా అవ్వడం అంటే ఇల్లు-వాకిలి వదిలివేయడం అని భావించేవారు... ఈ భయం ఉండేది కదా. ఇప్పుడు వీరి ఇల్లు కూడా చాలా బాగా నడుస్తోంది, వ్యాపారం కూడా చాలా బాగా నడుస్తోంది, వీరు కూడా సంతోషంగా ఉంటున్నారు అని చూసి - మేము కూడా అవ్వగలము అని భావిస్తున్నారు. కనుక ఎగ్జాంపుల్‌గా అయ్యారు కదా. ముందుగా మేము అవ్వడం కష్టం అని అనేవారు, ఇప్పుడు పవిత్ర ప్రవృత్తిలో ఉండటం మంచిది అని అంటున్నారు. కనుక సేవలో వృద్ధికి నిమిత్తంగా అయ్యారు కదా, దీనికి అభినందనలు. ఇప్పుడు ప్రవృత్తిలో ఉన్నవారు ఏమి చేస్తారు? అభినందనలకు సంతోషించారు. ఇప్పుడు ఏదైనా చేయాలి కూడా కదా.
డైమండ్ జూబిలీ పట్ల బాప్‌దాదాకు ఒక శుభ సంకల్పం ఉంది - ఎవరైతే ప్రవృత్తిలో ఉంటున్నారో, ఎగ్జాంపుల్‌గా ఉన్నారో, లౌకిక మరియు అలౌకిక సేవ కూడా చేస్తున్నారో, డబల్ సేవాధారులుగా ఉన్నారో, ప్రతి ప్రవృత్తిలో ఉన్నవారు ప్రతి సేవాకేంద్రంలో ప్రతి వర్గానికి చెందిన ఎవరో ఒకరు తప్పకుండా ఉండే విధంగా ఒక మాలను తయారు చేయండి. మనకు ఏర్పడిన 13 భిన్న-భిన్న వర్గాలలో ప్రతి వర్గానికి చెందిన గ్రూప్ ఉండాలి. అందులో అన్ని వర్గాల వారు ఉండాలి, ఏ ఒక్క వర్గం కూడా మిగలకూడదు. పెద్ద జమీందారు కూడా ఉండాలి, సైంటిస్ట్ కూడా ఉండాలి..., అన్ని వర్గాల వారు ఉండాలి. ఈ విధంగా భిన్న-భిన్న వర్గాల మాలను ప్రవృత్తిలో ఉన్నవారు ప్రతి సేవాకేంద్రంలో తయారు చేయాలి. కనీసం ప్రతి వర్గానికి ఒక్కొక్కరైనా తప్పకుండా ఉండాలి. ప్రతి సెంటర్లో ప్రతి వర్గానికి చెందినవారు ఉండాలి. కనుక అన్ని వర్గాల వారిని తయారు చేయండి. తర్వాత అన్ని సెంటర్లలోని అన్ని వర్గాల డైమండ్ జూబిలీ జరుపుకుందాం. అర్థమైందా? ప్రవృత్తిలో ఉన్నవారికి ఇష్టమేనా? ప్రతి సేవాకేంద్రంలో ప్రతి వర్గానికి చెందినవారు ఉండాలి, కనీసం ఒక్కరైనా. ఇంకా ఎక్కువమంది ఉంటే మహారాజులుగా అవుతారు. మాతలకు ఇష్టమేనా? లేక మహిళలు కేవలం మహిళలనే తీసుకొస్తారా? మహిళలలో కూడా ఎవరైనా లాయర్ ఉంటారు, ఎవరైనా డాక్టర్ ఉంటారు. అచ్ఛా!
డబల్ విదేశీయులతో:- డబల్ విదేశీయులు ఏమి చేస్తారు? లండన్ వారు చెప్పండి, ఏమి చేస్తారు? మైక్‌లను తయారు చేస్తారు. అయితే కాన్ఫరెన్స్ వరకు మైక్‌లు వస్తారా లేక ఇప్పుడే తయారవుతున్నారా? మంచి విషయం. డబల్ విదేశీయులు ప్రతి ఒక్క స్టేట్ నుండి ఒక్కొక్క మైక్‌ను తీసుకొచ్చినా ఎన్ని మైక్‌లు అవుతాయి? తర్వాత మైక్‌ల సెరిమనీ చేస్తాము. సరేనా? అచ్ఛా, అందరికీ ప్రియస్మృతులు లభించాయా?
కర్ణాటక వారు సంతోషంగా ఉన్నారా? పంజాబ్ సంతోషంగా ఉందా? బాంబే సంతోషంగా ఉందా? భోపాల్ సంతోషంగా ఉందా? ఆంధ్రా వారు సంతోషంగా ఉన్నారా? యు.పి., నేపాల్ సంతోషంగా ఉన్నారా? నేపాల్ టోపీలు ఉంటాయి, అవి బాగుంటాయి. ఇవి కలియుగపు కిరీటాలు.
అచ్ఛా, టీచర్లందరూ సంతోషంగా ఉన్నారా? చూడండి, మురళి కొత్తవారి లెక్కలో గుహ్యంగా ఉంది, కానీ బాప్‌దాదా డైమండ్ జూబిలీలో అందరినీ అన్నింటి నుండి ముక్తులుగా చేయవలసిందే. చేయకపోతే ధర్మరాజుగా అవుతారు. ఇప్పుడు ప్రేమతో చెబుతున్నారు, తర్వాత ధర్మరాజును తోడుగా తీసుకోవలసి వస్తుంది కదా. కానీ ఎందుకు తీసుకోవాలి? బాబా రూపం ద్వారానే అందరూ ఎందుకు ముక్తులుగా అవ్వకూడదు? పాతవారు ఆలోచిస్తారు - బాప్‌దాదా ఏదైనా అలా చేస్తే అందరూ సరిగా అయిపోతారు అని. కానీ బాబా అలా కోరుకోవడం లేదు. బాబాకు ధర్మరాజును తోడుగా తీసుకోవడం ఇష్టం లేదు. చేయలేనిది ఏముంది! ఒక్క సెకండులో ఎవరికైనా లోలోపలే శిక్ష ఇవ్వగలరు మరియు ఆ ఒక్క సెకండు శిక్ష చాలా-చాలా తీవ్రంగా ఉంటుంది. కానీ బాప్‌దాదా అలా కోరుకోవడం లేదు. బాబా రూపం ప్రియమైనది, ధర్మరాజు తోడుగా అయితే ఏమీ వినరు. అందుకే బాప్‌దాదా డైమండ్ జూబిలీలో అందరినీ అన్ని విషయాల నుండి ముక్తులుగా చేయవలసిందే. అర్థమైందా?
నలువైపులా ఉన్న విశ్వంలోని సర్వ విశేష ఆత్మలకు, సదా స్వచింతన, జ్ఞాన చింతనను చేసే శ్రేష్ఠ ఆత్మలకు, సదా తండ్రి యొక్క శ్రేష్ఠ మతంపై ప్రతి సంకల్పము, మాట మరియు కర్మను చేసే సమీప ఆత్మలకు, నలువైపులా డైమండ్ జూబిలీ కోసం స్వయాన్ని మరియు సేవను ముందుకు తీసుకువెళ్ళేవారు - ఇటువంటి విశేషాత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- దైవీ పరివారానికి విశేష అలంకారం కదా. అలంకారాన్ని చూసినప్పుడు ఏమవుతుంది? సంతోషం కలుగుతుందా లేక మేము కూడా పైకి వెళ్ళాలి అనిపిస్తుందా? లోక సంగ్రహం చేసేవారు కదా.
అలాగే బాప్‌దాదాకు ఒక్కొక్క బిడ్డపై ఒకరి కంటే మరొకరిపై ఎక్కువ ప్రేమ ఉంది. దాదీలపై చాలా ప్రేమ ఉంది, టీచర్లపై చాలా ప్రేమ ఉంది, స్టూడెంట్స్పై తక్కువ ప్రేమ ఉంది అని కాదు. అందరిపై ప్రేమ ఉంది మరియు సదా ఉంటుంది. ప్రేమ లేకపోతే శిక్షణ ఎందుకు ఇస్తారు? ఈ శిక్షణ కూడా ప్రేమే. ఎందుకంటే బాబా పిల్లలను ఏ విషయంలోనూ తక్కువగా చూడాలని కోరుకోరు. ప్రతి ఒక్కరినీ ముందుకు వెళ్ళినవారిగా చూడాలని కోరుకుంటారు. దాదీలు అయితే బాగైపోయారు, మీరు అవ్వండి లేదా అవ్వకపోండి... అని కాదు. ముందుగా మీరు. అందుకే వస్తారు. గొంతు సహకరించినా, సహకరించకపోయినా మాట్లాడిస్తారు. పిల్లలు దూరదూరాల నుండి, వృద్ధులు కూడా వస్తారు, చిన్నవారు కూడా వస్తారు, అందరూ వస్తారు, మరి బాబా ఎలా రాకుండా ఉంటారు! తప్పకుండా వస్తారు. అయితే దాదీలపై ప్రేమ ఎక్కువగా ఉందా లేక టీచర్లపై ఎక్కువగా ఉందా లేక స్టూడెంట్స్పై ఎక్కువగా ఉందా? ఎవరిపై ఉంది? అందరిపై ఉంది. బాప్‌దాదా అందరినీ దగ్గరగా కూర్చోబెట్టలేకపోయినా, అందరి పేర్లు తీసుకోలేకపోయినా, హృదయంలో అందరి పేర్లు ఉన్నాయి. హృదయానికి సమీపంగా అందరూ ఉన్నారు. అర్థమైందా? అచ్ఛా! అయితే ఈ బ్రాహ్మణ ప్రపంచపు అలంకారం బాగుంది కదా. చూడండి, ఫౌండేషన్ నుండి ఎంత కొద్దిమంది మిగిలారు. ఆదిలో వచ్చినవారిని మరియు ఇప్పుడు ఉన్నవారిని చూస్తే ఎంత కొద్దిమంది మిగిలారు. డైమండ్ జూబిలీ వారు ఎంతమంది వెళ్ళిపోయారు.
మీటింగ్‌లోని ముఖ్య సోదరులతో:- మంచి శ్రమ చేస్తున్నారు. బాప్‌దాదా వద్దకు అన్ని సమాచారాలు చేరుతాయి. అందరూ కలిసి ఏ కార్యాన్నయినా చేసినప్పుడు, ఆ కార్యం సహజంగా మరియు సఫలంగా కూడా అవుతుందని మీరు కూడా అనుభవిస్తూ ఉంటారు. మరియు ఇలా పరస్పరం కలుసుకోవడం త్వరత్వరగా జరగాలి. ఎందుకంటే యజ్ఞానికి సంబంధించిన స్థూల కార్యకలాపాలు, తినడం-త్రాగడం వదిలేయండి, అది వీరి పని. కానీ అఫీషియల్ కార్యకలాపాలను మీరే అర్థం చేసుకోగలరు. అందుకే కార్యం పెరుగుతూ ఉంటుంది. 9 లక్షల మందిని తయారు చేయవలసి ఉన్నప్పుడు కార్యం ఎంతగా పెరుగుతుంది! చాలా పెరుగుతుంది కదా! కనుక మీరు పరస్పరం త్వరత్వరగా కలుసుకోవాలి. ఫోన్ మరియు ఫ్యాక్స్ ద్వారా కలుసుకోవడం వేరు, సమ్ముఖంగా కలుసుకోవడం ద్వారా ఒకరి ఆలోచనలను మరొకరు క్లియర్ చేసుకోగలరు. ఒకవేళ క్లియర్ కాకపోయినా క్లియర్ చేసుకోగలరు. అందుకే పరస్పరం సలహా చేసుకోండి. ఒక మీటింగ్ పూర్తి చేసినప్పుడే రెండవ మీటింగ్ డేట్‌ను ముందుగానే ఫిక్స్ చేయండి. అచ్ఛా.
మీరు సంతోషంగా ఉన్నారా అని మిమ్మల్ని అడగవలసిన అవసరం లేదు. మీరు నిమిత్తంగా ఉన్నారు, కనుక మిమ్మల్ని మీరు నిమిత్తంగా భావించడం ద్వారా సహజంగానే బాధ్యత కూడా ఉంటుంది మరియు తేలికదనం కూడా తప్పకుండా ఉంటుంది. అచ్ఛా!
*** ఓంశాంతి ***
