‘‘బ్రహ్మా బాబా అడుగుపై అడుగు వేసి ఆజ్ఞాకారిగా మరియు సర్వస్వ త్యాగిగా అవ్వండి’’
ఈరోజు అనంతమైన బాప్‌దాదా తమ అనంతమైన సేవా సహచరులను చూస్తున్నారు. రెండు రకాల సహచరులు ఉన్నారు - ఒకరు, స్నేహము మరియు సంబంధము యొక్క తోడును నిర్వర్తించేవారు మరియు రెండవవారు, స్నేహము, సంబంధము మరియు సేవ యొక్క తోడును నిర్వర్తించేవారు. రెండు రకాల సహచరులను చూస్తున్నాము. విశ్వములోని చివరి మూలలో ఉన్నా కానీ బాప్‌దాదా ఎదురుగా ఉన్నారు. బాప్‌దాదాకు మరియు పిల్లలకు మధ్యన ప్రతిజ్ఞ ఏమిటంటే - ఎక్కడ ఉండాల్సి వచ్చినా గానీ, ఎక్కడ ఉన్నా గానీ సదా తోడుగానే ఉంటాము. ఈ బ్రాహ్మణ జీవితంలో ఆది నుండి అంతిమము వరకు బాబా మరియు పిల్లలు అవినాశీగా తోడుగా ఉంటారు. పిల్లలు సాకారంలో ఉన్నారు మరియు బాప్‌దాదా ఆకారంలో, నిరాకారంలో ఉన్నారు, అయినా కానీ వేరుగా ఉన్నారా? లేరు కదా! మరి దూరంగా ఉన్నారా లేక సమీపంగా ఉన్నారా? హృదయంలోని ఈ సమీపత సాకారంలో కూడా సమీపతను అనుభవం చేయిస్తుంది. ఏ దేశంలో ఉన్నా కానీ హృదయం యొక్క సమీపత, తోడుగా ఉన్నట్లు అనుభవం చేయిస్తుంది. మీరు వేరు అవ్వలేరు, అది అసంభవము. పరమాత్మ ప్రతిజ్ఞ ఎప్పుడూ ఉల్లంఘించబడదు. పరమాత్మ ప్రతిజ్ఞ విధి వలె తయారవుతుంది మరియు విధిని తప్పించలేరు, అందుకే సదా సమీపంగా ఉన్నారు, సదా సహచరులుగా ఉన్నారు మరియు సహచరులుగా అయ్యి చేతిలో చేయి వేసి, ఇరువురూ కలిసి ఎంతో ఆనందంగా నడుస్తున్నారు. ఆనందంగా ఉందా లేక శ్రమ అనిపిస్తుందా? కొద్ది-కొద్దిగా శ్రమ అనిపిస్తుందా? ఎప్పుడైనా ఏదైనా విషయము వస్తే, తండ్రి పక్కకు వెళ్ళిపోతారు. ఏ విషయమూ తీసుకురాకుండా ఉంటే, తండ్రి పక్కకు వెళ్ళకుండా ఉంటారు. విషయమనేది తండ్రిని పక్కకు వెళ్ళిపోయేలా చేస్తుంది. ఎలాగైతే మధ్యలో ఏదైనా పరదా వస్తే, ఆ పరదా రావడం వలన పక్కకు వెళ్ళిపోతారు కదా? అలా విషయము అనే పరదా మధ్య-మధ్యలో వచ్చేస్తుంది. కానీ దానిని తీసుకొచ్చేవారు ఎవరు? పరదా పని రావటము, మరి మీ పని ఏమిటి? దానిని పక్కకు తీయటమా లేక దాని నుండి కొద్ది-కొద్దిగా ఆనందం తీసుకోవడమా? పిల్లలు అప్పుడప్పుడు విషయాల నుండి చాలా ఆనందాన్ని తీసుకోవడాన్ని బాప్‌దాదా చూసారు.
ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో ఆ ప్రేమకు గుర్తు తోడుగా ఉండటము. తోడుగా ఉండటము అంటే ఆబూలో ఉండటము అని కాదు. ఆబూలో చూడండి, కొద్దిగా సంఖ్య ఎక్కువైనా సరే నీటికి ఇబ్బంది అయ్యింది కదా! కావున సాకారంలో తోడుగా ఉండటం కాదు కానీ హృదయంతో తోడును నిర్వర్తించాలి. ఒకవేళ హృదయంతో తోడును నిర్వర్తించకపోతే మధుబన్‌లో ఉన్నా దూరంగా ఉన్నట్లే మరియు చివరి దేశంలో ఉన్నా కానీ హృదయంతో సమీపంగా ఉంటే వారు తోడుగా ఉన్నట్లే, అందుకే బాప్‌దాదాను హృదయాభిరాముడు అని అంటారు, అంతేకానీ శరీర రాముడు అని అనరు. మరి హృదయం తండ్రిలో ఉంది కదా? తండ్రి హృదయంలో మీ హృదయం ఉంది మరియు మీ హృదయంలో తండ్రి హృదయం ఉంది. ఈ ఆత్మిక తోడు గురించి హృదయానికే తెలుస్తుంది. అనుభవజ్ఞులే కదా? లేదా ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత దూరం అయిపోయాము అని అంటారా? కాదు. సదా తోడును నిర్వర్తించడమనేది - ఒక ఆత్మ ఇంకొక ఆత్మతో నిర్వర్తించలేదు. ఒక్క పరమ ఆత్మ మాత్రమే ఆత్మలతో తోడును నిర్వర్తించగలరు. మరియు ఈ విధంగా పరమాత్మ తోడును నిర్వర్తించే భాగ్యము పిల్లలైన మీ అందరికే ఉంది కదా?
(ఈ రోజు మొత్తం హాల్లో సోదరసోదరీలు అందరూ నేలపై కూర్చున్నారు) ఇది చాలా మంచి దృశ్యము. బాప్‌దాదాకు ఈ రోజు సభ యొక్క దృశ్యాన్ని చూసి స్మృతిచిహ్నం గుర్తుకొస్తుంది. స్మృతిచిహ్నంగా రుద్రమాలను చూపిస్తారు, ఇందులో కేవలం ముఖాలను మాత్రమే చూపిస్తారు, శరీరాలను చూపించరు. అలాగే ఇక్కడి నుండి చూస్తుంటే కేవలం ముఖాలే కనిపిస్తున్నాయి, ఇంకేమీ కనిపించటం లేదు. కావున రుద్రమాల యొక్క స్మృతిచిహ్నము కనిపిస్తుంది. ఒకరి వెనుక ఒకరు కూర్చున్నారు కదా, అందుకే శరీరాలు దాగిపోయాయి, ముఖాలే కనిపిస్తున్నాయి.
ఇది స్నేహానికి ప్రత్యక్ష స్వరూపము - బ్రహ్మా బాబాపై అందరికీ స్నేహం ఉంది, అందుకే వచ్చారు కదా! అందరూ బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీలగానే పిలుచుకుంటారు కదా, అంతేకానీ శివకుమారులు, శివకుమారీలు అని అనరు. అంటే బ్రహ్మా బాబాపై ఎక్కువ ప్రేమ ఉంది కదా! మరియు బ్రహ్మా బాబాకు కూడా సదా పిల్లలపై ప్రేమ ఉంది. అందుకే కదా అవ్యక్తం అయినప్పటికీ అవ్యక్త పాలన చేస్తున్నారు. అవ్యక్త పాలన లభిస్తుంది కదా? లేక మేము బ్రహ్మా బాబాను అనుభవం చేయలేదు అని అంటారా? బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలుగా పిలుచుకుంటున్నప్పుడు, తండ్రి పాలన లేకుండానే జన్మించేసారా! ఒకవేళ బ్రహ్మా బాబా పాలన లేకపోయి ఉంటే, ఈ రోజు కేవలం నిరాకార తండ్రి యొక్క పాలనతోనే యజ్ఞం యొక్క రచన, యజ్ఞం యొక్క వృద్ధి జరిగి ఉండేది కాదు. డబల్ విదేశీయులకు బ్రహ్మా బాబా పాలన లభిస్తుంది కదా? (హాజీ) చూడండి, తండ్రి ఫారన్కు వెళ్తారన్నప్పుడు, మరి ఇండియాలో పాలన చేయరా ఏమిటి! కావున - బాబా, మేము మిమ్మల్ని చూడనేలేదు అని ఫిర్యాదు చేయరు కదా! సదా కలుసుకుంటారు, సదా చూస్తారు, సదా తోడుగా ఉంటారు. సాకార శరీరంతో సాకార రూపంలో సదా తోడుగా ఉండలేరు కానీ అవ్యక్త రూపంలో అందరికీ తోడును అందించగలరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మిలనం యొక్క తలుపులు తెరుచుకునే ఉంటాయి. అవ్యక్త వతనంలో - ఇప్పుడు స్థలం లేదు, ఇప్పుడు సమయము లేదు అని అనము, అలా అనము. దేహంలో దేహం యొక్క బంధనం ఉంది కానీ అవ్యక్తంలో దేహం యొక్క బంధనము ఉండదు, అలాగే దైహిక ప్రపంచం యొక్క నియమాల బంధనము ఉండదు. ఇక్కడైతే నియమాలు పెట్టాల్సి వస్తుంది కదా - ముందు కూర్చోండి, వెనుక కూర్చోండి అని. ఇప్పుడు కూడా సమయమనుసారంగా మీరు చాలా-చాలా-చాలా భాగ్యవంతులు! ఎంతైనా కూర్చునే స్థలమైతే లభించింది కదా! తర్వాత-తర్వాత నిలబడటానికి కూడా స్థలం దొరకటం కష్టమవుతుంది ఎందుకంటే మీరందరూ ఇతరులకు అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడైతే మీకు అవకాశం లభించింది. ఎలాగైతే ఇప్పుడు మధుబన్ వారు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది కదా! (మధుబన్ నివాసులు మరియు ఆబూ నివాసులు అందరూ పాండవ భవన్లో మురళి వింటున్నారు) ఇది కూడా పరివారం యొక్క ప్రేమ.
బ్రహ్మా బాబాపై ప్రేమ అనగా బాబా సమానంగా అవ్వడము. నిరాకారుని సమానంగా అవ్వటం అనేది కొద్ది సమయం కోసం అనుభవం చేస్తారు. కానీ బ్రాహ్మణులు అనగా సదా బ్రహ్మా సమానంగా బ్రహ్మాచారులు. బ్రహ్మా బాబా ఆచరణ ఏదైతే ఉందో అదే బ్రాహ్మణులందరి ఆచరణ అనగా కర్మలు. ఉచ్ఛారణ కూడా బ్రహ్మా బాబా సమానంగా ఉండాలి, ఆచరణ కూడా బ్రహ్మా బాబా సమానంగా ఉండాలి, దీనినే ఫాలో ఫాదర్ అంటారు. కావున బ్రహ్మా బాబా యొక్క ప్రతి అడుగుపై అడుగు వేయటము, దీనినే ఫాలో ఫాదర్ అంటాము. అయితే బ్రహ్మా బాబా తండ్రి యొక్క శ్రీమతం అనుసారంగా మొదట ఏ అడుగును వేసారు?
మొదటి అడుగు - ఆజ్ఞాకారిగా అయ్యారు. ఏ ఆజ్ఞ లభించిందో ఆ ఆజ్ఞను ప్రత్యక్ష స్వరూపంలోకి తీసుకొచ్చారు. కనుక ఇప్పుడు చెక్ చేసుకోండి - ఆజ్ఞాకారీ అనే మొదటి అడుగులో ఫాలో ఫాదర్ చేసానా? అమృతవేళ నుండి రాత్రి వరకు మనసా, వాచా, కర్మణా, సంబంధ-సంపర్కాలలో ఏవైతే ఆజ్ఞలు లభించాయో ఆ ఆజ్ఞల అనుసారంగా నడుస్తున్నానా? లేక కొన్ని ఆజ్ఞలను పాటిస్తున్నాను మరియు కొన్నింటిని పాటించడం లేదా? సంకల్పాలు కూడా ఆజ్ఞ అనుసారంగా ఉన్నాయా లేక కల్తీ ఏదైనా ఉందా? ఒకవేళ ఏదైనా కల్తీ ఉంటే పూర్తి ఆజ్ఞాకారులుగా ఉన్నట్లా లేక సగం ఆజ్ఞాకారులుగా ఉన్నట్లా? ప్రతి సమయంలో చేయాల్సిన సంకల్పానికి ఆజ్ఞ స్పష్టంగా లభించి ఉంది. అమృతవేళ ఏ సంకల్పం చేయాలి, ఇది కూడా స్పష్టంగా ఉంది కదా! మరి ఫాలో చేస్తున్నారా లేక ఒక్కోసారి పరంధామానికి వెళ్ళిపోతున్నారు మరియు ఒక్కోసారి నిద్రాలోకంలోకి వెళ్ళిపోతున్నారా? ప్రతి కర్మలో, ప్రతి సమయము అడుగులో అడుగు ఉంటుందా? తండ్రి వేసే అడుగు ఒకటి మరియు పిల్లలు వేసే అడుగు వేరొకటి అయినట్లయితే వారిని ఆజ్ఞాకారీ అని అనము కదా! పరమార్థంలోనైనా, వ్యవహారంలోనైనా రెండింటిలో దేనికి ఏ విధంగా ఆజ్ఞ లభించిందో ఆ ఆజ్ఞను పాలన చేయాలి - దీని పర్సెంటేజ్‌ను చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం వస్తుందా? కావున మొదటి అడుగులో బాబా ఆజ్ఞాకారిగా అయ్యారు, అందుకే ఆజ్ఞాకారులకు సదా తండ్రి ఆశీర్వాదాలు స్వతహాగా లభిస్తాయి, అలాగే బ్రాహ్మణ పరివారం యొక్క ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. కావున చెక్ చేసుకోండి - ఏ సంకల్పం చేసినా సరే, అది స్వయం విషయంలోనైనా, సేవ విషయంలోనైనా, స్థూల కర్మల విషయంలోనైనా లేక ఇతరాత్మల విషయంలోనైనా అందులో అందరి ఆశీర్వాదాలు లభిస్తున్నాయా! ఎందుకంటే ఆజ్ఞాకారులుగా అవ్వటం ద్వారా సర్వుల ఆశీర్వాదాలు లభిస్తాయి మరియు ఆశీర్వాదాలు లభిస్తున్నాయంటే దానికి గుర్తు - ఆశీర్వాదాల ప్రభావం వలన హృదయం సదా సంతుష్టంగా ఉంటుంది, మనస్సు సంతుష్టంగా ఉంటుంది. అది బాహ్య సంతుష్టత కాదు, కానీ మనసులోని సంతుష్టత. మనసులోని సంతుష్టత నిజమైనదా లేక వట్టిదేనా - దీనికి గుర్తు ఏమిటంటే, ఒకవేళ యథార్థ రీతిలో యథార్థ ఆజ్ఞాకారులుగా ఉన్నట్లయితే, ఆశీర్వాదాలు లభించినట్లయితే సదా స్వయం మరియు సర్వులు డబల్ లైట్‌గా ఉంటారు. ఒకవేళ డబల్ లైట్‌గా లేకపోతే మనసులో సంతుష్టత లేదు అని అర్థం చేసుకోండి. తండ్రి మరియు పరివారం యొక్క ఆశీర్వాదాలు కూడా లభించటం లేదు. పరివారం యొక్క ఆశీర్వాదాలు కూడా అవసరము. మాకు తండ్రితో సంబంధం ఉంది, తండ్రి ఆశీర్వాదాలు అయితే ఉన్నాయి, పరివారంతో సరిగ్గా లేకపోయినా ఏమీ ఫర్వాలేదు అని అనుకోకండి. ఇంతకుముందు కూడా వినిపించాము, మాలలో కేవలం జంట పూసలు మాత్రమే ఉండవు, వాటితో మాల తయారవ్వదు. మరి మాలలోకి రావాలి, అందుకే పూర్తి లక్ష్యం పెట్టుకోండి, అదేమిటంటే - ప్రతి ఆత్మ నన్ను చూసి సంతోషంగా ఉండాలి, నన్ను చూసి తేలికగా అవ్వాలి, వారి భారం సమాప్తమైపోవాలి. కావున మనసులోని సంతుష్టత మరియు ఆజ్ఞాకారులుగా ఉన్నందుకు లభించిన ఆశీర్వాదాలు, స్వయాన్ని కూడా లైట్‌గా చేస్తాయి మరియు ఇతరులను కూడా లైట్‌గా చేస్తాయి. దీని ద్వారా ఎంతవరకు ఆజ్ఞాకారులుగా అయ్యారు అన్నది అర్థం చేసుకోండి. ఎలాగైతే బ్రహ్మా బాబాను చూసారు, చిన్న-పెద్ద ప్రతి ఒక్కరూ సంతుష్టులై సంతోషంతో నాట్యం చేసేవారు. నాట్యం చేసే సమయంలో తేలికగా ఉంటారు కదా, అలా ఉంటేనే నాట్యం చేయగలరు కదా. ఒకవేళ ఎవరైనా లావుగా ఉన్నా కానీ మనసు తేలికగా ఉంటే నాట్యం చేస్తారు మరియు సన్నగా ఉన్నా కానీ మనసు భారీగా ఉంటే నాట్యం చెయ్యరు. కావున మాటలు ఎలా ఉండాలంటే వాటి ద్వారా స్వయం కూడా తమతో తాము సంతుష్టంగా ఉండాలి మరియు ఇతరులు కూడా సంతుష్టంగా ఉండాలి. అలా కాకుండా - ఇది మా భావం కాదు, ఇది మా భావన కాదు అని అనకండి. మీ భావము మరియు భావన ఎందుకు చేరుకోవటం లేదు? ఒకవేళ అవి సరైనవి అయితే ఇతరుల వరకు ఆ వైబ్రేషన్స్ ఎందుకు చేరుకోవటం లేదు? ఏదో ఒక కారణం ఉంటుంది కదా? కావున చెక్ చేసుకోండి - ఆశీర్వాదాలకు పాత్రులుగా ఎంతవరకు అయ్యారు?
ఎంతగా ఇప్పుడు తండ్రి మరియు బ్రాహ్మణాత్మల ఆశీర్వాదాలకు పాత్రులుగా అవుతారో, అంతగానే రాజ్యానికి పాత్రులుగా అవుతారు. ఒకవేళ ఇప్పుడు బ్రాహ్మణ పరివారాన్ని సంతుష్టం చేయలేకపోతే ఇక రాజ్యం ఏం నడిపిస్తారు! రాజ్యాన్ని ఏం సంతుష్టపరుస్తారు! ఎందుకంటే బ్రాహ్మణాత్మలే మీ రాయల్ ఫ్యామిలీగా అవుతారు, మరి ఎవరైతే ఫ్యామిలీనే సంతుష్టం చేయలేరో, వారు ప్రజలను ఏం సంతుష్టం చేస్తారు? సంస్కారాలను ఇక్కడే నింపుకోవాలి కదా! లేక అక్కడ యోగం చేసి నింపుకుంటారా? ఇక్కడే నింపుకోవాలి. ఒకవేళ వర్తమాన బ్రాహ్మణ పరివారంలో కారణాన్ని నివారణ చేయలేకపోతే, కారణము-కారణము అనే అంటూ ఉంటే, ఎక్కడైతే కారణము ఉంటుందో అక్కడ నివారణా శక్తి ఉండదు. ఒకవేళ పరివారంలోనే నివారణా శక్తి లేకపోతే ఇక విశ్వ రాజ్యానికి ఏం నివారణ చేస్తారు! ఎందుకంటే మీ రాజ్యంలో ప్రతి ఆత్మా సదా నివారణా స్వరూపంగా ఉంటుంది. అక్కడ కారణాలు ఉంటాయా? ఎలాగైతే ఇక్కడ రాజ్య సభలో కారణాలు చెప్తూ ఉంటారు - ఇది కారణము, ఇది కారణము, ఇది కారణము... అక్కడ ఇటువంటి రాజ్య దర్బారు ఉంటుందా? అక్కడ కేవలం క్షేమ-సమాచారాలను అడుగుతారు. అక్కడ జరిగేది కేవలం దర్బారు మాత్రమే కాదు కానీ చాలా మంచి మిలనము. అందుకే కారణాలు చెప్పి మిమ్మల్ని మీరు ఆశీర్వాదాల నుండి వంచితులుగా చేసుకోకండి. బ్రహ్మా బాబా కారణాలను నివారణ చేసారు, అందుకే నంబర్‌వన్‌గా అయ్యారు. బాప్‌దాదా వద్ద అందరి కారణాల ఫైల్స్ పోగవుతాయి. అందరి ఫైల్స్ ఉన్నాయి, కొంతమందివి పెద్దగా, కొంతమందివి చిన్నగా ఉన్నాయి. మరి ఇప్పటికీ ఫైల్స్ ఉంచాలా, ఫైల్స్‌ను పెంచుకుంటూ ఉండాలా లేక రిఫైన్‌గా అవ్వాలా? అయితే ఈ రోజు నుండి ఫైల్స్ అన్నీ సమాప్తం చేసేయాలా? మళ్ళీ ఇంకొక కొత్త ఫైల్ పెట్టాల్సిన అవసరం రాదు కదా. ఒకవేళ కొత్త ఫైల్ పెడితే ఫైన్ పడుతుంది. ఆలోచించుకోండి! చెప్పండి - సమాప్తం చేసేయమంటారా లేక కొన్ని రోజులు ఉంచమంటారా? శివరాత్రి వరకు ఉంచమంటారా! మరి ఎవరైతే - శివరాత్రి వరకు కాస్త అవకాశం లభించాలి, అప్పటికల్లా పురుషార్థం చేసి రిఫైన్ అయిపోతాము అని అనుకుంటున్నారో - వారు చేతులు ఎత్తండి. మంచిది, ధైర్యం పెట్టడము కూడా మంచి విషయము. కానీ కేవలం ఇప్పుడు మాత్రమే ధైర్యం ఉంచడం కాదు. బాప్‌దాదా ఎదురుగా ఉన్నారు కనుక ధైర్యం ఉంది, కిందకు దిగే సరికి కొంచెం తగ్గిపోయింది, ఇంకా ఎవరి దేశాలకు వారు వెళ్ళేటప్పటికి ఇంకా తగ్గిపోయింది, ఏదైనా విషయం వచ్చేటప్పటికి ఇంకా తగ్గిపోయింది అన్నట్లు ఉండకూడదు. ఇలా అయితే చెయ్యరు కదా? చూడండి, ఎప్పుడైనా ఏదైనా కారణం ఎదురుగా వస్తే ఆ కారణం కారణంగా ధైర్యం తగ్గిపోతుంది, బలహీనత వస్తుంది, తర్వాత ఎప్పుడైతే ఆ విషయం సమాప్తమైపోతుందో, అప్పుడు మీకు మీకే సిగ్గనిపిస్తుంది కదా! ఇది మంచిగా చేయలేదు, ఇది మంచిగా జరగలేదు... అని మీకు మీకే సంకోచం కలుగుతుంది. చేసేసి, ఆ తర్వాత పశ్చాత్తాప పడితే... ఇది మీ ప్రజల పనా లేక మీ పనా? పశ్చాత్తాపం పడేవారు రాజుగా అవుతారా? అందుకే ఆలోచించండి. సాక్షీ స్థితి అనే సింహాసనంపై కూర్చోండి మరియు మిమ్మల్ని మీరే జడ్జ్ చేసుకోండి. మీకు మీరు జడ్జ్‌గా అవ్వండి, ఇతరులకు జడ్జ్‌గా అవ్వకండి. ఇతరులకు జడ్జ్‌గా అవ్వటం అందరికీ వస్తుంది, ఇతరులకు జడ్జ్‌గా చాలా తొందరగా అవుతారు మరియు స్వయానికి వకీలుగా అవుతారు. అందుకే సాక్షీ స్థితి అనే సింహాసనంపై కూర్చుంటే మీకు మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిగా ఉంటుంది. సింహాసనం దిగి జడ్జ్ చేస్తే నిర్ణయం సరిగ్గా ఉండదు. సెకెండులో సింహాసనాధికారులుగా అవ్వండి. ఈ స్థితియే మీ సింహాసనము. యథార్థ సహజ నిర్ణయాన్ని అందించే సింహాసనము ఈ సాక్షీతనం యొక్క స్థితి. సాక్షీగా లేకపోతే ఇతరుల విషయాలు, ఇతరుల నడవడిక ఎక్కువగా ఎదురుగా వస్తాయి, స్వయానివి రావు. ఒకవేళ సాక్షీగా అయ్యి చూస్తే స్వయానివీ కనిపిస్తాయి, ఇతరులవీ కనిపిస్తాయి. అప్పుడు ఏ నిర్ణయం తీసుకోబడుతుందో, అది యథార్థంగా ఉంటుంది, లేదంటే యథార్థంగా ఉండదు.
బాప్‌దాదా ఇంతకుముందు కూడా వినిపించారు, డ్రామాలో ఏ విషయాలు అయితే వస్తాయో ఆ విషయాలలో చాలా మంచి తెలివి ఉంటుంది కానీ అప్పుడప్పుడు బ్రాహ్మణ పిల్లలలో కొద్దిగా తెలివి తగ్గిపోతుంది. విషయమనేది వస్తుంది మరియు వెళ్ళిపోతుంది, కానీ బ్రాహ్మణ పిల్లలు విషయాన్ని పట్టుకునే కూర్చుంటారు. విషయం ఆగదు, అది వెళ్ళిపోతుంది కానీ స్వయం విషయాన్ని వదలరు. మరి విషయాలలో తెలివి ఎక్కువ ఉందా లేక బ్రాహ్మణులలోనా? విషయాలు తెలివైనవి అయినట్లు కదా! చాలామంది పిల్లలు - రెండు రోజుల నుండి ఈ విషయం నడుస్తుంది, ఈ విషయం రెండు గంటలు నడిచింది అని అంటారు. రెండు గంటలలో పోగొట్టుకున్నది ఎంత? రెండు రోజులలో పోగొట్టుకున్నది ఎంత? అందుకే తెలివైనవారిగా అవ్వండి. అచ్ఛా!
అయితే మొదటి అడుగు ఆజ్ఞాకారి, రెండవ అడుగు సర్వవంశ త్యాగి. ముందుగా ఆజ్ఞాకారిగా ఉండడం వల్ల ఆశీర్వాదాలు లభించాయి, ఆ ఆశీర్వాదాల బలంతో సర్వవంశ త్యాగిగా అయ్యారు. త్యాగంలో కూడా నంబర్‌వన్ ఎగ్జాంపుల్ బ్రహ్మా బాబా అయ్యారు. దేహ సంబంధాలను త్యజించడం పెద్ద విషయం కాదు. కానీ దేహానికి సంబంధించిన పాత స్వభావ-సంస్కారాలను త్యజించడం అవసరం. సంబంధాల త్యాగం ఇతర ధర్మాలలో కూడా చేస్తారు, కానీ స్వభావ-సంస్కారాలను వాటి సర్వ వంశంతో సహా త్యజించడం, దీనినే సర్వవంశ త్యాగి అని అంటాము. దేహానికి సంబంధించిన స్వభావ-సంస్కారాలలో అంశమాత్రమైనా మిగిలి ఉంటే, సమయానుసారంగా ఆ వంశం పెరుగుతూ ఉంటుంది. ఆ వంశం ఎంత తీవ్రంగా ఉంటుందంటే, లౌకిక కుటుంబంలో చూస్తారు కదా, పెద్దవారు చాలా శీతలంగా ఉంటారు, కానీ మనవలు, మనవరాళ్లు చాలా తీవ్రంగా ఉంటారు. అలాగే పాత వంశం ఏదైనా మిగిలి ఉంటే, అది కూడా తప్పుడు అద్భుతాన్ని చేసి చూపిస్తుంది. ఆ సమయంలోని స్థితిని బాప్‌దాదా చూస్తే, ప్రపంచంలో ఎవరైనా దివాలా తీసినట్లుగా అనిపిస్తుంది, ఒక్క సెకనులో లక్షాధికారి నుండి కఖపతిగా(బికారిగా) అయిపోతారు. మొత్తం ఖజానాలు ఒక్క సెకనులో సమాప్తమైపోతాయి. తరువాత మళ్లీ శ్రమ చేయాల్సి వస్తుంది కదా! అందుకే సర్వాంశ త్యాగి అంటే దేహ సంబంధాలు మరియు దేహానికి సంబంధించిన పాత స్వభావ-సంస్కారాల నుండి త్యాగిగా ఉండడం. ఎప్పుడైనా మీ స్థితిని చెక్ చేసుకోండి. మోసం చేస్తే ఎవరు చేస్తారు? స్వభావ-సంస్కారాలే కదా! త్యాగం యొక్క భాగ్యాన్ని సమాప్తం చేసేవి ఈ స్వభావ-సంస్కారాలే. బాప్‌దాదా బ్రాహ్మణుల కోసం ఇంకో విషయం అండర్లైన్ చేస్తారు - త్యాగాన్నీ త్యాగం చేయండి. ‘‘నేను త్యాగిని’’ అనే అభిమానం కూడా త్యజించాలి. దీనినే త్యాగాన్ని కూడా త్యాగం చేయడం అంటాము. నేను చేశాను, నేను సహించాను, ఇది చేశాను, అది చేశాను అనే కథలు చెప్పకండి. ఎవరైనా సహించినా, ఆ సహనం వెనుక శక్తి ఉంది. కేవలం సహించడం కాదు. సహించడం అంటే శక్తిని ధారణ చేయడం. అందుకే దానిని సహనశక్తి అంటాము. సహించడం అంటే శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూపించడం. మరి మంచిదే జరిగింది కదా! ఏమి సహించారు? ఇంకా లాభాన్నే పొందారు కదా! ఎవరి కోసం సహించారు? బాబాకు ఆజ్ఞాకారిగా అవ్వడానికి సహించారు, మరొకరి కోసం కాదు. బాబా ఆజ్ఞను పాటించారు. మరి ఆజ్ఞకు సంబంధించిన ఆశీర్వాదాలు లభిస్తాయి కదా! అయితే ఏమి సహించారు? ఆశీర్వాదాలు పొందారు కదా! విషయాన్ని ముందుంచుకుంటే, చాలా సహించాను, ఇంకా ఎంతకాలం సహించాలి? సహించడానికీ ఏదో ఒక హద్దు ఉండాలి అని అనుకుంటారు. కానీ ఎంత అనంతంగా సహిస్తారో, అంత అనంతమైన ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎందుకంటే మీరు బాబాకు ఆజ్ఞాకారిగా అవుతున్నారు. ‘సహించండి’ అని బాబా చెప్పారు. మరి ఆజ్ఞను పాటించడం సంతోషకరమైన విషయమా లేక తప్పక చేసిన విషయమా? నిస్సహాయతతో సహించకండి. కొందరు సహిస్తారు కూడా, తరువాత ‘నాలాంటి సహనశీలి ఎవ్వరూ లేరు’ అని కూడా అంటారు. తరువాత దాదీల దగ్గరకు వచ్చి, మీకు తెలియదు, నేను ఎంత సహించానో! అని చెబుతారు. కానీ నష్టం ఏమైంది? లాభమే జమ అయింది.
మరి త్యాగం యొక్క నిర్వచనం అర్థమైందా? చూడండి, భక్తిమార్గంలో కూడా ఒక గుర్తు ఉంది. బలి ఇస్తున్నప్పుడు బలి ఇచ్చే మేక అరిస్తే, దానిని ప్రసాదంగా భావించరు. ఒక్కసారిగా, అరవకుండా స్వాహా అయితేనే ప్రసాదమవుతుంది. బలి ఇవ్వబడే మేకే ‘అరవకూడదు’ అని అంటారు. మరి మీరు సహించాను, సహించాను అని అంటుంటే, ఇది అరవడం కాదా? మనసులో అయినా, నోటి ద్వారా అయినా కొంచెం కూడా అరిస్తే అది ప్రసాదం కాలేదు. బాబాకు స్వీకారయోగ్యం కాకపోతే ఆశీర్వాదాలు ఎలా ఇస్తారు? మరి ఏమి చేస్తారు? కొంచెం కొంచెంగా లోపల అరుస్తారా? ఏదైనా మూలలో, బాత్రూమ్లో దాక్కొని ఒకటి రెండు కన్నీళ్లు కారుస్తారా? కొంచెం అనుమతి ఉండాలి కదా! మాతలను పిల్లలు ఇబ్బంది పెడితే ఏమి చేస్తారు? కొంచెం మనసులో ఏడుస్తారా? మాతలు మనసులో ఏడుస్తారా? కొద్దికొద్దిగా ఏడుస్తారు! మరి అన్నయ్యలు ఏమి చేస్తారు? వారు కళ్లతో ఏడవరు, కానీ క్రోధం చేసి లోపల ఏడుస్తారు. ఆవేశం రావడం కూడా ఏడవడమే. మరి పాండవ సైన్యం ఏమనుకుంటుంది? కొంచెం ఏడవడానికి అనుమతి కావాలా? కొంచెం కొంచెం అనుమతి కావాలనుకునేవారు చేతులు ఎత్తండి. వద్దా? అయితే ఈరోజు నుండి ఏడుపు ఫైల్ కూడా సమాప్తం. లేక కేవలం చప్పట్లు కొట్టి సంతోషపెట్టారా? అయితే ఈ రోజు నుండి పోస్టు కూడా తగ్గిపోతుంది. పోస్టుకు అయ్యే వ్యర్థ ఖర్చును జ్ఞాన సరోవర్ కోసం ఆదా చేయండి. ఎప్పుడైనా అలాంటి విషయం వస్తే పోస్టు డబ్బును భండారీలో వేయండి. జ్ఞాన సరోవర్కు ఇంకా అవసరం ఉంది కదా.
జ్ఞాన సరోవర్‌పై అందరికీ చాలా ప్రేమ ఉంది. జ్ఞాన సరోవర్‌పై ప్రేమ అంటే సేవపై ప్రేమ. స్థలంపై ప్రేమ కాదు, సేవకు నిమిత్తమైన స్థలం కాబట్టి సేవపై ప్రేమ. ఇక్కడ కూర్చున్న వారిలో జ్ఞాన సరోవర్‌లో తమ కణం లేదా ధాన్యం వేయని వారు ఎవరైనా ఉన్నారా? వేసిన వారు చేతులు ఎత్తండి. అందరూ చేశారు. మధుబన్ వారు, హాస్పిటల్ వారు, సేవాధారులు, అందరూ వేస్తారా? అందరి సహయోగంతో చూడండి ఎంత మంచి సేవా స్థలం తయారైంది! అందరికీ నచ్చింది కదా? నచ్చిందా? హా, ఉండడంలో కొంచెం ఇబ్బంది అయింది, కానీ సరిగ్గా అయిపోతుంది. తరువాతి సారి వచ్చినప్పుడు ఆనందంగా ఉంటారు. ఇప్పుడు అయితే ఒకసారి వేడి నీరు లేదు, ఒకసారి చల్ల నీరు లేదు. కొత్త భవనంలో అలా జరుగుతుంది. కానీ జ్ఞాన సరోవర్‌లో ఉన్నవారందరూ సంతోషంగా ఉన్నారా? చెప్పాం కదా, మీరు చాలా-చాలా-చాలా భాగ్యవంతులు. భక్తిమార్గపు మేళాలో అయితే నేలపై పడుకుంటారు. ఇక్కడ పరుపు, రజాయి లభించాయి కదా! మరి అందరూ బాగా నిద్రపోయారా? కొత్త పరుపు, కొత్త భవనం. అయినప్పటికీ ఇంతమందికి రావడానికి ఛాన్స్ లభించింది కదా! అచ్ఛా, దాదీలకు జ్ఞాన సరోవర్ నచ్చింది కదా?
జ్ఞాన సరోవర్కు రెండు లక్ష్యాలు ఉన్నాయి - ఒకటి విశేషంగా సేవ, రెండవది బ్రాహ్మణులకు ఆశ్రయం. ఈ రెండు లక్ష్యాల కారణంగానే ఈ విధంగా తయారు చేశారు. ఇక్కడ పాండవ భవన్లో బ్రాహ్మణులను తప్ప మరెవరికీ అనుమతి ఉండదు. కానీ అక్కడ అనేక సంపర్కంలో ఉన్నవారు సమీప సంబంధంలోకి వస్తారు. పేరు ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కదా! అందుకే విద్యాలయం అనే పేరునూ ప్రత్యక్షం చేస్తారు. కాబట్టి డబల్ సేవ కదా! ఇక్కడ బ్రాహ్మణుల లెక్క ప్రకారం నిర్మించారు, అక్కడ విశ్వంలోని సర్వ ఆత్మల లెక్క ప్రకారం నిర్మించారు. అందుకే తేడా వచ్చింది కదా! లక్ష్యంలో తేడా వచ్చింది. అచ్ఛా!
మిగతా అడుగులను తరువాత చెబుతాము. కానీ ఈ రెండు అడుగులను బాగా చెక్ చేసుకోండి. అలాగే అన్ని ఫైళ్లు సమాప్తం అని గుర్తుంచుకోండి. మర్చిపోవద్దు. ఏ ఫైళ్లు? కారణాల ఫైల్ మరియు ఏడుపు ఫైల్. ఆవేశం కూడా ఏడుపే. ఆవేశంలోకి రావడం కూడా మనసు ఏడవడమే. మేమేం ఏడ్చాం అని వారు అనుకుంటారు. కానీ మనసులో చాలా ఏడ్చారు. కాబట్టి రెండు ఫైళ్లు సమాప్తం! మీపై ఫైన్ వేసుకోకండి, రిఫైన్ అవ్వండి.
బ్రహ్మా బాబా తమ ఆది సహచరులను చూసి సంతోషిస్తున్నారు. సహచరులే కదా! టీచర్లందరూ సహచరులే కదా! పాండవులు కూడా ఆది సహచరులు, శక్తులు కూడా సహచరులే. రైట్ హ్యాండ్స్ కాబట్టి బ్రహ్మాకు అనేక భుజాలు చూపిస్తారు. భుజం అంటే సహయోగి-సహచరి. అందరూ రైట్ హ్యాండ్స్ కదా! ఇక్కడ లెఫ్ట్ కూడా రైట్ అయిపోతుంది. లెఫ్ట్‌ను లెఫ్ట్ అని అనము, సర్వ సహయోగులు అంటాము. అచ్ఛా! నలువైపుల నుండి వచ్చారు.
ఒకటి భారతదేశ సేవకు నిమిత్తమైన అన్ని జోన్లు. కాబట్టి భారత్ సేవాధారి పిల్లలకు బాప్‌దాదా సేవకు అభినందనలు కూడా ఇస్తున్నారు. దానితో పాటు సదా సుపుత్రులు మరియు రుజువును ఇచ్చే పిల్లలకు విశేష దివ్య గుణాల జ్యువెలరీని గిఫ్ట్‌గా ఇస్తున్నాము. సుపుత్రుని గుర్తు ఏమిటంటే రుజువు ఇవ్వడం, అంటే ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపించడం. కాబట్టి సుపుత్ర పిల్లలు తమ తమ రుజువును, అంటే సేవా ఫలానికి సంబంధించిన ప్రమాణాన్ని చూపిస్తున్నారు మరియు ఇకముందు కూడా చూపిస్తూనే ఉంటారు. అందుకే సుపుత్ర పిల్లలను బాప్‌దాదా, మాత సదా అత్యుత్తమ అలంకారంతో అలంకరిస్తారు. మంచి బిడ్డగా అనిపించిన వారికి ఎల్లప్పుడూ మంచి వస్తువే ఇస్తారు. ఇక్కడ అయితే అందరూ ఒకరికి ఒకరు మించినవారు. అందుకే అటువంటి సుపుత్రులు మరియు రుజువును ఇచ్చే పిల్లలకు బాప్‌దాదా విశేష దివ్య గుణాల జ్యువెలరీని గిఫ్ట్‌గా ఇస్తున్నారు. కాబట్టి ఈ గిఫ్ట్‌ను జాగ్రత్తగా ఉంచుకోండి. చెవుల్లో కూడా ధరించండి, మస్తకంపై కూడా ధరించండి, తలపై కిరీటం ధరించండి, తీసేయకండి. మాయకు దొంగిలించనివ్వకండి. మీకు గిఫ్ట్ లభిస్తోందని మాయకు కూడా తెలిసిపోతోంది. మరి డబల్ లాక్ ఉందా? యోగం మరియు సేవ రెండింటి బ్యాలెన్స్‌లో ఎల్లప్పుడూ ఉండడం అంటే డబల్ లాక్ వేయడం. మరి అందరి దగ్గర డబల్ లాక్ ఉందా? లేక ఒక లాక్ ఉంది, మరొకటి ఢీలాగా ఉందా? చూడండి, తాళంచెవి పోయిందేమో! మీరు తాళంచెవిని చాలా జాగ్రత్తగా ఉంచుకున్నామని అనుకుంటారు. కానీ అవసరమైనప్పుడు కనిపించకుండా పోకూడదు. అలా కాదు కదా! మంచివారు!
(బాప్‌దాదా అన్ని జోన్ల సోదరసోదరీలను చేతులు ఎత్తించారు)
ఢిల్లీ:- తాళంచెవిని జాగ్రత్తగా ఉంచుకోండి. ఢిల్లీలోకి మాయ అనే పిల్లి రాకూడదు! ఢిల్లీ వారు ఏమి చేస్తారు? పెద్ద పెద్ద మైక్‌లను తీసుకురావాలి, చిన్నవి కాదు. ఎందుకంటే ఢిల్లీ యొక్క ధ్వని సహజంగానే నలువైపులా వ్యాపిస్తుంది. ఢిల్లీ న్యూస్ ఇంటర్నేషనల్ న్యూస్ అవుతుంది. అందుకే ఢిల్లీ వారు ఒక మైక్‌ను కాదు, మైక్‌ల గ్రూప్‌ను తీసుకురావాలి. జెండా ఎగురవేయాలి. ఢిల్లీలో రాజ్యపు జెండా ఎగురవేస్తారు, కాబట్టి రాజ్యపు ఫ్లాగ్‌కు ముందు సేవ యొక్క ఫ్లాగ్. ఒక మైక్‌ను కాదు, గుంపుగా తీసుకురావాలి. ఒక్కరి ధ్వని నలువైపులా వ్యాపించదు. సంగఠనలో వచ్చినప్పుడు అందరి దృష్టి పడుతుంది.
పంజాబ్, హర్యానా, హిమాచల్, జమ్మూ:- పంజాబ్ ఎలాగూ సింహమే, సింహం ముందు పిల్లి ఎలా వస్తుంది! పంజాబ్ సింహం కదా!
బెంగాల్, బీహార్, ఒడిశా, నేపాల్, అస్సాం:- ఈ ఐదు నదులు కలిసి ఉన్నాయి. మంచిది, ఐదింటి మిలనము ఉంది. మొట్టమొదట బెంగాల్లో సూర్యోదయం అవుతుంది, కాబట్టి మాయ యొక్క అంధకారం రాలేదు. మంచిది, ఇప్పుడు సంఖ్యను ఇంకొంచెం పెంచండి. ఎవరైనా వారసులను వెలికితీయండి. ఐదు ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి, ఐదు ప్రదేశాల నుండి మంచి మంచి వారసులను స్టేజ్‌పైకి తీసుకురండి. గుప్తంగా ఉంటే స్టేజ్‌పైకి తీసుకురండి. లేకపోతే వెలికితీయండి. మరుసటి సీజన్లో ఈ ఐదు నదుల సంఖ్యే అన్నింటికంటే ఎక్కువగా ఉండాలి. అర్థమైందా?
యు.పి., బనారస్:- యు.పి., బనారస్ వారు ఏమి చేస్తారు? భక్తులు యు.పి.లో ఎక్కువగా ఉన్నారు. కాబట్టి భక్తులకు త్వరత్వరగా కళ్యాణం చేయండి. పాపం వారు తిరుగుతూ ఉంటారు. ఒకసారి కుంభమేళాలో, ఒకసారి ఏదో ఒక మేళాలో, ఒకసారి మందిరాలలో, ఒకసారి ఇంకెక్కడో తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతున్న భక్తులకు బాబా పరిచయాన్ని ఇచ్చి మధుబన్ వరకు చేర్చండి. అర్థమైందా?
రాజస్థాన్:- రాజస్థాన్ ఏమి చేస్తుంది? రాజులను మళ్లీ రాజ్య-భాగ్యానికి అధికారులుగా చేయండి. పేరే రాజస్థాన్ అయినప్పుడు ఎంతమంది రాజులు ఉంటారు! ఇప్పుడు రాజులు లేరు, కానీ రాజులుగా తయారు చేయవచ్చు కదా! మమ్మల్ని మళ్లీ రాజ్య అధికారులుగా చేశారు అని ఎంతగా ఆశీర్వాదాలు ఇస్తారు! మరి ధైర్యం ఉంది కదా? రాజస్థాన్, రాజులందరూ రాజ్యాధికారపు సంతోషంలో మధుబన్ స్టేజ్‌పై డాన్స్ చేసేలా ఒక గ్రూప్‌ను తయారు చేయండి.
బాంబే, మహారాష్ట్ర:- మహారాష్ట్ర భూమి చాలా మంచిది, అందుకు అభినందనలు. కానీ ఇప్పుడు బాంబే లేదా మహారాష్ట్ర వారు వారస క్వాలిటీ ఉన్న ఒక గ్రూప్‌ను తయారు చేయండి. వారు రాజుల గ్రూప్‌ను తీసుకువస్తే, మహారాష్ట్ర లేదా బాంబే వారు వారసుల గ్రూప్‌ను తీసుకురావాలి. తీసుకురాగలరా? మరుసటి సీజన్లో వారసుల పుష్పగుచ్ఛం వస్తుందేమో చూస్తాము. అచ్ఛా.
గుజరాత్:- వారు పొయ్యి వద్ద కూడా ఉన్నారు, హృదయంలో కూడా ఉన్నారు. పొయ్యి వద్ద ఉన్నారు కాబట్టే చూడండి, రొట్టెలు బాగా చేస్తారు కదా! కాబట్టి హృదయపు పొయ్యిపైన ఉన్నారు. దానితో పాటు ధైర్యానికి సంబంధించిన అభినందనలను బాప్‌దాదా సదా గుజరాత్‌కు ఇస్తూనే ఉంటారు. గుజరాత్ వారసులను తయారు చేయగలదు. గుజరాత్లో వారస క్వాలిటీ వెలువడగలదు. బాంబే వారు వారస క్వాలిటీ గ్రూప్‌ను తయారు చేసినట్లుగా, మీరు మహావారసుల గ్రూప్‌ను తయారు చేయండి. భూమి మంచిది. ఇప్పుడు క్వాంటిటీలో ఎక్కువగా నిమగ్నమైపోయారు. మొదట్లో కొంతమంది వారసులు వెలువడ్డారు, ఇప్పుడు క్వాంటిటీలో క్వాలిటీ దాగిపోయింది. పేర్లు చెబితే కనిపిస్తారు. అందుకే ఇప్పుడు మళ్లీ వారస క్వాలిటీని వెలికితీయండి. ఒక వారసుడు వేలమంది క్వాంటిటీకి సమానం. గుజరాత్ ఏమి చేస్తుందో అర్థమైందా? మహావారసులను తీసుకువస్తారు. వన్ నంబర్ తీసుకుంటారు కదా! అందరూ నంబర్‌వన్ తీసుకోవాలి, టూ ఎవరూ తీసుకోకూడదు.
తమిళనాడు:- తమిళ్ వారు ఏ గ్రూప్‌ను తీసుకువస్తారు? తమిళ్లో స్థూల నాలెడ్జ్‌ఫుల్ క్వాలిటీ చాలా మంచిగా ఉంది. కాబట్టి ఎవరైతే నాలెడ్జ్ యొక్క అథారిటీగా పిలవబడతారో, అలాంటి అథారిటీ ఉన్నవారి గ్రూప్‌ను తయారు చేసి తీసుకురండి. ధైర్యం ఉంది కదా? మొత్తం గ్రూప్ నాలెడ్జ్‌లో అథారిటీ ఉన్నవారిగా ఉండాలి. వీరు కూడా చిన్న చిన్న మైక్లుగా అవుతారు.
కర్ణాటక:- కర్ణాటక వారు ఏ గ్రూప్‌ను తీసుకువస్తారు? జ్ఞానం యొక్క నాటకం చేసేవారిని. అక్కడ ధర్మానికి నిమిత్తమైనవారు, ధర్మాత్మలు ఎవరైతే సంబంధ-సంపర్కాలలో ఉన్నారో, వారిని పిల్లల రూపంలో గ్రూప్‌గా తయారు చేసి తీసుకురండి. ధర్మ నేతలుగా రాకూడదు, వెండి కుర్చీ కావాలి, అది కావాలి... అలా కాదు. ధర్మ నేతలు పిల్లలుగా అయి రావాలి. రాజ్య అధికారుల ద్వారా పేరు ప్రసిద్ధమయ్యే విధంగా, ధర్మ నేతల ద్వారా కూడా అవుతుంది. వీరు కూడా పెద్ద మైక్‌లు. కాబట్టి అలాంటి గ్రూప్‌ను తీసుకురండి. ఒక ధర్మాత్మను కాదు, సంగఠనగా తీసుకురండి. ధర్మ నేతలను సంభాళించగలరా లేక వారు పరస్పరం గొడవపడతారా? కాదు, భావన కలవారు. ధర్మ నేతలు అయినప్పటికీ మాతలలో భావన మంచిగా ఉంది. అందుకే కర్ణాటక వారు ధర్మ నేతల నాటకాన్ని చూపించండి. అచ్ఛా!
ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రా వారు ఏమి చేస్తారు? ఆంధ్రాలో కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నవారు ఉన్నారు, భావన కలవారు కూడా ఉన్నారు. అందుకే ఆంధ్రా వారు ఈ రోజుల్లో పేరుప్రఖ్యాతులు పొందిన వారందరినీ బాబా ఇంటికి చేర్చండి. అర్థమైందా? ఎవరు తమ మంచి గ్రూప్‌ను తీసుకువస్తారో చూస్తాము. వచ్చే సీజన్లో అందరూ గ్రూపులు-గ్రూపులుగా వస్తారు కదా! నంబర్‌వన్, టూ, త్రీ ఎవరో చూస్తాము. అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది కదా! లేకపోతే ఎలా జరుగుతుంది?
ఇండోర్:- ఇండోర్ సంఖ్య అయితే మంచిగా ఉంది. ఇండోర్ వారు ఏమి చేస్తారు? ఇండోర్‌లో కూడా పేరుప్రఖ్యాతులు కలవారు మంచివారు ఉన్నారు, వారిని సేఠ్లు అంటారు కదా! సేఠ్లు చాలా మంది ఉన్నారు. కాబట్టి సేఠ్ల గ్రూప్‌ను తీసుకురండి. సేఠ్లందరి గ్రూప్ వచ్చినప్పుడు ఎంత బాగుంటుంది! కొందరు టోపీ ధరించినవారు, కొందరు తలపాగా ధరించినవారు. ఇండోర్ వారు ఏమనుకుంటున్నారు? బాప్‌దాదా మిమ్మల్ని ఇండోర్‌కు పంపిందే సేఠ్ల సేవ కోసం. కానీ ఇప్పటివరకు ఏ సేఠ్ రాలేదు. మిమ్మల్ని మొదట సేఠ్ దగ్గరికే పంపించాము కదా! కానీ అతను ఎక్కడ వచ్చాడు? ఎంతమంది సేఠ్లు వచ్చారు? చిన్న చిన్న బిజినెస్ చేసేవారు కాదు, సేఠ్లు. ఒక సేఠ్ వస్తే అతని సేవాధారులు ఎంతమంది ఉంటారు! మరి ఎంతమంది వచ్చేస్తారు? కానీ ఇప్పుడు షావుకార్లు షావుకార్లుగా లేరు, చింతల నిలయాలుగా ఉన్నారు. అందుకే ఇప్పుడు సమయం మారుతోంది. ఇప్పుడు వారికి ఆ షావుకారి నషా లేదు. తమను తాము రక్షించుకోవాలనే నషా ఉంది, షావుకారి నషా కాదు.
భోపాల్, ఆగ్రా:- ఆగ్రా ఇంకా తన కార్యాన్ని పూర్తి చేయలేదు. తాజ్‌మహల్‌తో పాటు జ్ఞానం యొక్క కిరీటాన్ని సాక్షాత్కారం చేయించాలి, ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నారు. ముందుగా ఆగ్రా వారు అదే చేయాలి. అర్థమైందా! తరువాత గ్రూప్‌ను తీసుకువస్తారు. స్థలం తయారైనప్పుడు ఇంటర్నేషనల్ గ్రూప్‌ను తీసుకువస్తారు.
అచ్ఛా, భోపాల్ వారు ఏమి చేస్తారు? అక్కడ చిన్న చిన్న మైక్‌లు చాలా ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి చిన్న చిన్న మైక్‌ల గ్రూపులు కూడా ధ్వనిని వ్యాపింపజేయగలవు. అక్కడ కూడా ఆఫీసర్ క్వాలిటీ మంచిగా ఉంది. కాబట్టి సేవలో మంచి మంచి సహయోగులైన ఆఫీసర్ల గ్రూప్‌ను ఇంకా సమీపంగా తీసుకువస్తారు. తీసుకువస్తున్నారు, కానీ ఇంకా సమీపంగా తీసుకువస్తారు. మరి ఎన్ని గ్రూపులు వస్తాయి? చాలా గ్రూపులు వస్తాయి కదా! అన్ని వెరైటీ గ్రూపులను చూసి మీరు ఏమి చేస్తారు? చప్పట్లు కొడతారు. ప్రత్యక్షతకు చప్పట్లు కొట్టండి, ఈ చప్పట్లు కాదు. మరి అందరూ సంతోషంగా ఉన్నారు కదా? అచ్ఛా.
ఈ గ్రూప్‌లో అనారోగ్యంతో వచ్చినవారు ఉన్నారా? అనారోగ్యంతో వచ్చినవారు చేతులు ఎత్తండి. ఎవరూ లేరు. ఈ సమయంలో అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, అనారోగ్యాన్ని మర్చిపోయారు. హాస్పిటల్లో పేషెంట్లు వచ్చారా? రాలేదు. మరి ఈ గ్రూప్ మంచిదే కదా, పేషెంట్లు ఎవరూ లేరు. పేషన్స్లో ఉండేవారు కాబట్టి పేషెంట్లు లేరు. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- డబల్ విదేశీయులకు బాప్‌దాదా హృదయపూర్వక ప్రియస్మృతులతో పాటు ఆశీర్వాదాల గిఫ్ట్‌ను ఇస్తున్నారు. ఎందుకంటే వీరి ధైర్యం భారతవాసుల కంటే కూడా ఎక్కువగా ఉంది. అనేక గోడలను దాటి బాబాకు చెందినవారయ్యారు. అందుకే బాప్‌దాదా సదా ఉల్లాస-ఉత్సాహాల రెక్కలను ఇచ్చి ఎగిరేలా చేస్తూ ఉంటారు. ఈ ధైర్యానికి సంబంధించిన ఆశీర్వాదాలతో పాటు అన్ని దేశాల పిల్లలకు విశేష గిఫ్ట్‌ను ఇస్తున్నాము. ఈ గిఫ్టే లిఫ్ట్‌గా పని చేస్తుంది. శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. అర్థమైందా? ఇప్పుడు రెక్కల గిఫ్ట్‌ను సదా మీతో ఉంచుకోండి. ఆశీర్వాదాలను సదా మీతో ఉంచుకోండి. మంచిది, అన్ని దేశాల నుండి కొద్దికొద్దిగా వచ్చి చేరుతున్నారు. దీనిని చూసి చూసి బాప్‌దాదాకు సంతోషం కలుగుతుంది. ఎలాంటి పరిస్థితులు ఉన్నా, హృదయపు ఆశీర్వాదాలు సౌకర్యంగా అవుతాయి, అందుకే వచ్చి చేరుతున్నారు. ఒక్క గ్రూప్ కూడా విదేశీయులు లేకుండా వెళ్లలేదు. ప్రతి గ్రూప్‌లో ఉన్నారు, కాబట్టి హాజిర్-నాజిర్ అయిపోయారు కదా!
మధుబన్ నివాసులు, హాస్పిటల్ పరివారం:- (మధుబన్ నివాసులు, హాస్పిటల్ వారు అందరూ పాండవ భవన్లో కూర్చొని మురళి వింటున్నారు.) వారు గుర్తొస్తున్నారు. మధుబన్ వారు ప్రతిరోజూ లాటరీ పొందేవారు. ఎంత లాటరీ లభిస్తుంది! శ్రమ చేయాల్సిన అవసరం లేదు, లాటరీ వచ్చేస్తుంది. మధుబన్‌లో అయినా, హాస్పిటల్లో అయినా, జ్ఞాన సరోవర్‌లో అయినా, కింద-పైన ఎక్కడ ఉన్నా ప్రతిరోజూ లాటరీ వస్తుంది. లాటరీతోనే నడుస్తున్నారు. హాయిగా తింటూ, త్రాగుతూ ఉన్నారు. సెంటర్ వారు భండారీని నింపడానికి ఎంత శ్రమ చేయాల్సి వస్తుంది! మధుబన్ వారి భండారీ మరియు భండారా సదా నిండుగా ఉన్నాయి. మధుబన్ వారు ఖర్చు చేసేవారు, మధుబన్‌లో జమ చేసేవారు సెంటర్ వారు. కాబట్టి సెంటర్ వారు సంపాదించే పిల్లలు. సంపాదించే నషా దానిదే, లాటరీ నషా దానిదే. అందరికీ తమ తమ భాగ్యం లభించింది. ఎవరి భాగ్యం ఎవరికంటే తక్కువ కాదు. ఎందుకంటే భాగ్యవిధాత యొక్క భాగ్య భండారం నిండుగా ఉంది. అందుకే ప్రతి ఒక్కరి భాగ్యం ఒకరికంటే మరొకరిది ఎక్కువగా ఉంది. కేవలం ఎవరిది వారిది, కానీ ప్రతి ఒక్కరిదీ ఒకరికంటే మరొకరిది శ్రేష్ఠంగా ఉంది. అచ్ఛా!
టీచర్లు:- టీచర్లు ఎవరు? రైట్ హ్యాండ్స్ కదా! రైట్ హ్యాండ్ లేకుండా ఏ కార్యమూ జరగదు. బాబా కార్యాన్ని సఫలం చేసే రైట్ హ్యాండ్స్. అచ్ఛా.
నలువైపులా ఉన్న బాప్‌దాదా స్నేహాన్ని ప్రత్యక్షము చేసేవారందరికీ, ఫాలో ఫాదర్ చేసే శ్రేష్ఠ ఆత్మలకు, సదా బాప్‌దాదా అడుగులో అడుగు వేసే ఆజ్ఞాకారీ శ్రేష్ఠ ఆత్మలకు, సదా దృఢ సంకల్పము ద్వారా బ్రహ్మా బాబా సమానమైన సర్వస్వ త్యాగీ విశేష ఆత్మలకు, సదా సుపుత్రులుగా అయ్యి ప్రతి సమయము ఋజువును ఇచ్చే మంచి పాత్ర కల ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- అన్నీ సహజంగా సంపన్నమవుతున్నాయి కదా? సంతోషం అన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది. సంతోషం ముందు మరేదీ అనిపించదు. కాబట్టి మధుబన్ సంతోషాల గని. సంతోషం కారణంగా అన్నీ సహజమైపోతాయి. భోజనం లభించినా, లభించకపోయినా సంతోషం అనే ఆహారం లభిస్తూనే ఉంటుంది. (సభను చూస్తూ) అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కదా? లేక కొద్దిగా ఏదైనా లోపం మిగిలిందా? లేదు. సంతోషాల గనికి వచ్చారు కదా! ఏదైనా జరిగినా సంతుష్టత అనే వరదానం లభించింది. కాబట్టి సంతుష్టత యొక్క ఫలం ప్రసన్నత. అందరూ ప్రసన్నంగా ఉంటారు. ఏదైనా కింద-మీద జరిగినా మళ్లీ ప్రసన్నంగా అయిపోతారు. ప్రసన్నచిత్త ఆత్మలను చూడాలంటే ఎక్కడ చూడాలి? మధుబన్లోనా లేక సెంటర్లో కూడానా? ప్రసన్నచిత్తులను చూడాలంటే బ్రాహ్మణులను చూడండి. సదా సంతుష్టంగా, సదా ప్రసన్నచిత్తంగా. చిత్తంలో ఇంకేమైనా ఉందా? ప్రసన్నతే ప్రసన్నత. అలాగే కదా! అందరూ ప్రసన్నచిత్తులా లేక ప్రశ్నచిత్తులా? అందరూ చిరునవ్వుతో ఉండే ఇలాంటి సభ మరెక్కడైనా ఉంటుందా? సత్సంగానికి వెళ్తే ఒక్కొక్కరి ముఖం ఒక్కోలా ఉంటుంది. ఇక్కడ అందరి ముఖాలు చూడండి, ఎలా ఉన్నాయి? చిరునవ్వుతో ఉన్నాయి. బ్రాహ్మణుల చిరునవ్వు యొక్క గుర్తును దేవతల చిత్రాలలో కూడా చూపిస్తారు. అవి ఎవరి చిత్రాలు? మీవే కదా! లేక పెద్ద దాదీలవా? అవి మీ మందిరాలేనా? మీరు ఏ దేవి లేదా దేవత? తెలుసా? గణేశుడా, హనుమంతుడా, దేవీలా, ఏమిటి? ఎలాంటి దేవి-దేవత అయినా సరే, దివ్యగుణధారి ఆత్మనే దేవత అంటారు. తరువాత ఎవరైనా హనుమాన్ అని చెప్పొచ్చు, గణేశ్ అని చెప్పొచ్చు, దేవీ అని చెప్పొచ్చు. కానీ మీరు దివ్యగుణధారి దేవ ఆత్మలు.
అచ్ఛా, (దాదీలతో) మీ భక్తులు ఏ సమయంలో ప్రార్థన చేస్తారో మీకు తెలుస్తుందా? భక్తులు పిలిచినప్పుడు మీకు అనుభవమవుతుందా? లేక మీ మస్తీలో మస్తుగా ఉంటారా? పాపం భక్తులు అలా పిలుస్తూనే ఉంటారా! ఫీల్ అవుతుంది కదా! భక్తుల పిలుపు యొక్క ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. అందుకే శుభ భావన, శుభ కామనలను ఇస్తారు కదా! వాతావరణంలో శాంతిని ఎందుకు వ్యాపింపజేస్తారు? లైట్ హౌస్, మైట్ హౌస్ ఎందుకు అవుతారు? సర్వ భక్త ఆత్మలు లేదా ఇతర ఆత్మలు సంతుష్టంగా, సంతోషంగా, శాంతిగా ఉండాలని. (దాదీ జానకితో) విశ్వ గ్లోబ్‌పై నిలబడి ఉన్నారు కదా! లేక లండన్ గ్లోబ్పైనా? విశ్వ గ్లోబ్పైనే ఉన్నారు కదా! మధుబన్ గ్లోబ్పైన కాదు, విశ్వ గ్లోబ్పైన. రావడం, వెళ్లడం ఇప్పుడు ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు రావడం-వెళ్లడం ఎలా అనిపిస్తుంది? విదేశంలా అనిపిస్తుందా లేక ఇంటిలా అనిపిస్తుందా? ఇంటి నుండి హాల్‌కు వచ్చారా లేక హాల్ నుండి ఇంటికి వచ్చారా! అచ్ఛా, లండన్ వారికి కూడా విశేష సేవకు అభినందనలు. కష్టమైనదాన్ని సహజం చేయడం ఒక మంచి ఎగ్జాంపుల్. మంచిది. ఎవరైనా తనువుతో, ఎవరైనా మనసుతో, ఎవరైనా ధనంతో, సర్వ సహయోగంతోనే సఫలత లభించింది మరియు లభిస్తూనే ఉంటుంది. లండన్ కూడా విదేశాలకు లైట్ హౌస్. భారతదేశానికి మధుబన్ లైట్ హౌస్ అయితే, లండన్ కూడా లైట్ హౌస్. అందుకే రెండు దాదీలపైనా అందరికీ చాలా ప్రేమ ఉంది కదా! ఇద్దరికీ బాబాపై ప్రేమ, బాబాకు వీరిపై ప్రేమ, అందరికీ కూడా దాదీలపై ప్రేమ. చాలా ప్రేమ ఉంది కదా! అచ్ఛా. ప్రేమే కోట. ప్రేమ అనే కోట లేకపోయి ఉంటే యజ్ఞ స్థాపన కార్యం కదిలిపోయేది. కానీ ప్రేమ అనే కోట అవినాశిగా, అఖండంగా ఉండి కార్యాన్ని కొనసాగిస్తోంది. జోడీ మంచిది. ప్రేమ ఉంచాలంటే ఇలాంటి ప్రేమ ఉంచండి - ప్రియంగా కూడా, అతీతంగా కూడా. అచ్ఛా!
(‘జివెల్ఆఫ్ లైట్’ పుస్తకానికి హిందీ అనువాదం ‘రత్న ప్రభా – దాదీ ప్రకాశమణి’ ముద్రించబడింది. దానిని బాప్‌దాదా తమ హస్తాలతో ఆవిష్కరించారు) ఏది జరుగుతున్నదో అది సేవను ఇంకా ఎగిరే కళలోకి తీసుకెళ్లే సాధనం. ఇది కూడా సేవ యొక్క సాధనం. ఇలాగే సేవల ప్రత్యక్షత జరుగుతూ, సేవ చేయించేవారు అయిన బాబా ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షత కోసం సాధనాలు మంచివి. అచ్ఛా!
*** ఓంశాంతి ***
