‘‘బ్రాహ్మణ జీవితము యొక్క అన్నింటికన్నా శ్రేష్ఠమైన ఖజానా - సంకల్పాల ఖజానా’’
ఈరోజు బాప్‌దాదా నలువైపులా ఉన్న పిల్లల ఖజానాల ఖాతాలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరికీ ఎన్నో ఖజానాలు లభించాయి మరియు అవినాశిగా లెక్కలేనన్ని ఖజానాలు లభించాయి. కేవలం ఈ జన్మ కోసం కాదు కానీ అనేక జన్మల గ్యారంటీ ఉంది. ఇప్పుడు కూడా తోడుగా ఉన్నాయి మరియు ఇక ముందు కూడా తోడుగా ఉంటాయి. మరి ఈరోజు విశేషంగా అన్నింటికన్నా శ్రేష్ఠ ఖజానా ఏదైతే ఉందో మరియు సర్వ ఖజానాలకు విశేషమైన ఆధారమేదైతే ఉందో, దానినే విశేషంగా చూస్తున్నారు - అందరి ఖాతాలలో ఎంతగా జమ అయింది? లభించడము లెక్కలేనంత లభించింది కానీ ఎంతగా జమ అయింది? అన్నింటికన్నా శ్రేష్ఠమైన ఖజానా సంకల్పాల ఖజానా మరియు మీ అందరి శ్రేష్ఠ సంకల్పాలే బ్రాహ్మణ జీవితానికి ఆధారము. సంకల్పాల ఖజానా చాలా శక్తిశాలిగా ఉంటుంది. సంకల్పాల ద్వారా సెకెండు కన్నా తక్కువ సమయంలో పరంధామం వరకు చేరుకోగలరు. సంకల్ప శక్తి ఒక ఆటోమేటిక్ రాకెట్ కన్నా కూడా తీవ్ర గతి కల రాకెట్. దాని ద్వారా ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకోగలరు. మీరు కూర్చున్నా కానీ, ఏవైనా కర్మలు చేస్తున్నా కానీ సంకల్పాల ఖజానా ద్వారా లేక శక్తి ద్వారా ఏ ఆత్మ వద్దకు చేరుకోవాలనుకుంటే వారి సమీపంగా స్వయాన్ని అనుభవం చేసుకోగలరు. ఏ స్థానానికి చేరుకోవాలనుకుంటే అక్కడికి చేరుకోగలరు. ఏ స్థితిని పొందాలనుకుంటే, అది శ్రేష్ఠమైనదైనా, సంతోషానికి చెందినదైనా, వ్యర్థమైనా, బలహీనతదైనా, క్షణం యొక్క సంకల్పంతో తమదిగా చేసుకోగలరు. నేను శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మను - అని సంకల్పం చేయగానే శ్రేష్ఠ స్థితి మరియు శ్రేష్ఠ అనుభూతి కలుగుతుంది, అలాగే నేను బలహీన ఆత్మను, నాలో ఎటువంటి శక్తి లేదు అని సంకల్పం చేస్తే, ఒక్క క్షణం యొక్క సంకల్పంతో సంతోషం మాయమైపోతుంది. వ్యాకులత యొక్క చిహ్నాలు స్థితిలో అనుభవమవుతాయి. కానీ రెండు స్థితులకూ ఆధారము - సంకల్పాలు. స్మృతిలో కూర్చున్నప్పుడు కూడా సంకల్పాల ఆధారంతోనే స్థితిని తయారు చేసుకుంటారు. నేను బిందువును, నేను ఫరిశ్తాను... ఈ స్థితి సంకల్పం ద్వారానే తయారైంది. కావున సంకల్పం ఎంత శక్తివంతమైనది!
జ్ఞానానికి ఆధారము కూడా సంకల్పాలే. నేను ఆత్మను, శరీరాన్ని కాదు - ఈ సంకల్పాలు చేస్తారు. రోజంతా మనసు-బుద్ధికి శుద్ధ సంకల్పాలను ఇస్తారు లేక మననంలో శుద్ధ సంకల్పాలు చేస్తారు, కావున మనన శక్తికి ఆధారము కూడా సంకల్ప శక్తి. ధారణ చేస్తారు, ఈ రోజు నేను సహన శక్తిని ధారణ చేయాలి అని మనసుకు-బుద్ధికి సంకల్పాన్ని ఇస్తారు, కావున ధారణకు ఆధారము కూడా సంకల్పాలే. సేవ చేస్తారు, ప్లాన్లు తయారుచేస్తారు అప్పుడు కూడా శుద్ధ సంకల్పాలే నడుస్తాయి కదా! శుద్ధ సంకల్పాల ద్వారానే ప్లాన్లు తయారవుతాయి. అనుభవముంది కదా! కావున బ్రాహ్మణ జీవితం యొక్క విశేషమైన శ్రేష్ఠ ఖజానా - సంకల్పాల ఖజానా. ఒకవేళ మీరు సంకల్పాల ఖజానాను సఫలం చేసుకున్నట్లయితే మీ స్థితి, కర్మ మొత్తం రోజంతా చాలా బాగుంటుంది మరియు సంకల్పాల ఖజానాను వ్యర్థంగా పోగొట్టుకున్నట్లయితే రిజల్టు ఏమవుతుంది? ఏ స్థితినైతే కోరుకుంటారో ఆ స్థితి ఉండదు. వ్యర్థ సంకల్పాలు బుద్ధిని కూడా బలహీనపరుస్తాయి మరియు స్థితిని కూడా బలహీనపరుస్తాయి అని మీ అందరికీ తెలుసు. ఎవరికైతే వ్యర్థం నడుస్తుందో, వారి బుద్ధి బలహీనంగా ఉంటుంది, కన్ఫ్యూజ్డ్ (తికమక) గా ఉంటారు. నిర్ణయాలు సరిగ్గా ఉండవు. సదా తికమకపడుతూ ఉంటారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, స్పష్టమైన నిర్ణయము ఉండదు. వ్యర్థ సంకల్పాల గతి చాలా వేగంగా ఉంటుంది. వ్యర్థ సంకల్పాల గురించైతే అందరికీ అనుభవము ఉంటుంది. వికల్పాలు కాదు, వ్యర్థం యొక్క అనుభవము అందరికీ ఉంది. గతి వేగంగా ఉన్న కారణంగా దానిని కంట్రోల్ చేయలేకపోతారు. కంట్రోల్ సమాప్తమైపోతుంది. వ్యాకులత చెందడము లేక సంతోషం మాయమవ్వడము లేక మనసు ఉదాసీనంగా ఉండడము, తమ జీవితంతో ఆనందం కలగకపోవడము - ఇవి వ్యర్థ సంకల్పాల గుర్తులు. నా స్థితి అసలు ఇలా ఎందుకు అయింది? అని చాలా మందికి తెలియనే తెలియదు. వారు పెద్ద-పెద్ద విషయాలను చూస్తారు - ఎటువంటి వికర్మలైతే చేయలేదు కదా, ఎటువంటి పొరపాటు చేయలేదు కదా అయినా సంతోషం ఎందుకు తక్కువగా ఉంది, ఉదాసీనత ఎందుకు, నేడు జీవితంలో ఆనందం ఎందుకు కలగడం లేదు! మనసు ఎందుకు నిమగ్నమవ్వడం లేదు. దానికి కారణం ఏమిటి? వికర్మలను చూస్తారు, వికల్పాలను చూస్తారు, పెద్ద పొరపాట్లను చెక్ చేసుకుంటారు కానీ సూక్ష్మ పొరపాటు ఏమిటంటే - వ్యర్థంగా ఖజానాలను పోగొట్టుకోవడము. తప్పకుండా వేస్ట్‌గా, వ్యర్థంగా పోగొట్టుకునే ఖాతా పెరిగి ఉంది. ఏ విధంగానైతే శారీరక రోగము పెద్ద రూపంలో ఉండదు, చిన్న రూపంలో ఉంటుంది కానీ చిన్నదాని నుండి పెరుగుతూ-పెరుగుతూ పెద్ద రూపము అయిపోతుంది మరియు పెద్ద రూపము కనిపిస్తుంది, చిన్న రూపము కనిపించదు, అలాగే ఈ వ్యర్థ ఖాతా, పోగొట్టుకునే ఖాతా పెరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. పాపం యొక్క ఖాతా వేరు, ఇది ఖజానాలను పోగొట్టుకునే ఖాతా. పాపమైతే స్పష్టంగా కనిపిస్తుంది, ఈరోజు ఇది చేసాము కావున సంతోషం మాయమైపోయింది అని అనుభవం చేసుకుంటారు. కానీ వ్యర్థంగా పోగొట్టుకునే ఖాతా, దాని చెకింగ్ తక్కువగా జరుగుతుంది. మరియు మీరేమో - సరే, ఈరోజు కూడా గడిచిపోయింది, మంచిగా జరిగింది, ఏ విధమైన పొరపాటు చేయలేదు అని అనుకుంటారు, కానీ - తమ సంకల్పాల శ్రేష్ఠ ఖజానాను జమ చేసుకున్నామా లేక వ్యర్థంగా పోగొట్టుకున్నామా? అని చెక్ చేసుకున్నారా. ఒకవేళ జమ అవ్వకపోతే అది పోగొట్టుకునే ఖాతా అవుతుంది కదా! లోలోపల ఎంతో చేస్తున్నాము అని అనిపిస్తుంది, కానీ ఈరోజు ఏ-ఏ ఖజానాలను జమ చేసుకున్నాము? అన్న ఖాతాను చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం వస్తుందా? స్వయం యొక్క చెకర్‌గా అయ్యారా లేక ఇతరుల చెకర్‌గా అయ్యారా? ఎందుకంటే స్వయాన్ని లోపలి నుండి చూసుకోవాల్సి ఉంటుంది, ఇతరులను బయటి నుండి చూడడము జరుగుతుంది, అది సహజమవుతుంది. మరి విశేషంగా శ్రేష్ఠ సంకల్పాల ఖజానా ఏదైతే ఉందో, అది ఎక్కువగా వ్యర్థంగా పోతుంది అని బాప్‌దాదా చూస్తున్నారు. అది వ్యర్థంగా పోయిందా లేక సమర్థంగా ఉందా? అన్నది తెలియనే తెలియదు.
బ్రహ్మా బాబాను ఎకానమీ అవతారము అని అంటారు. మీరందరూ ఎవరు? మీరందరూ కూడా మాస్టర్లే కాదా? ఎకానమీ రాదా? ఖర్చు చేయడం వస్తుంది! ఆ మాటకొస్తే డబల్ విదేశీయులకు లౌకిక జీవిత పరంగా జమా ఖాతాను చేసుకోవడం తక్కువగా వస్తుంది. తింటారు మరియు ఖర్చు చేస్తారు, ఇక సమాప్తమైపోతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువగా పెట్టుకుంటారు. కానీ ఇందులో ఎకానమీ అవతారంగా అవ్వాల్సి ఉంటుంది. బాప్‌దాదా చూస్తున్నారు - ఎంతైతే లభించిందో, ఎంతైతే సంకల్పాల శ్రేష్ఠ ఖజానా జమ అవ్వాలో అంతగా అవ్వలేదు, వ్యర్థం యొక్క లెక్క ఎక్కువగా చూసారు. ఒకవేళ సంకల్పాలు వ్యర్థమైనట్లయితే ఇతర ఖజానాలూ స్వతహాగానే వ్యర్థమైపోతాయి. సంకల్పాలు వ్యర్థమైతే, కర్మలు మరియు మాటలు ఏమవుతాయి? వ్యర్థమే అవుతాయి కదా! అందుకు పునాది సంకల్పాలు. కావున సంకల్పాలను చెక్ చేసుకోండి. తేలికగా వదలకండి. ఫరవాలేదు, కేవలం రెండు నిమిషాలే కదా అయ్యింది, ఎక్కువగా అవ్వలేదు... కానీ రెండు నిమిషాలలో - ఎన్ని సంకల్పాలు నడుస్తాయి? అన్నది మీరు చెక్ చేసుకోండి. వ్యర్థ సంకల్పాలు వేగంగా ఉంటాయి కదా! ఒక్క క్షణంలో ఆబూ నుండి అమెరికా వరకు చేరుకుంటారు. మామూలుగా అయితే చేరుకోవడానికి ఎన్ని గంటలు పడతాయి! కావున అంత తీవ్ర వేగం ఉంటుంది, ఆ గతి అనుసారంగా చెక్ చేసుకోండి, మీ సంకల్ప శక్తిని పొదుపు చేయండి మరియు రాత్రికి చెక్ చేసుకోండి. ఒకవేళ అటెన్షన్ పెట్టి ఏదైనా వస్తువును పొదుపు చేసినట్లయితే, ఆ పొదుపు తక్కువగా ఉన్నా కానీ ఆ పొదుపు యొక్క ఎక్స్ట్రా సంతోషం ఉంటుంది. ఒకవేళ 10 పౌండ్లు లేక డాలర్లు ఖర్చు అవ్వాలి కానీ మీరు ఒక పౌండు లేక డాలర్‌ను పొదుపు చేసారు, అప్పుడు ఒక్క పౌండ్‌ను పొదుపు చేసాము అని చాలా సంతోషం ఉంటుంది. కావున మీ సంకల్పాల పైన కంట్రోలింగ్ పవర్ పెట్టుకోండి. మేము అలా జరగాలనైతే అనుకోలేదు, అర్థం చేసుకుంటున్నాము కానీ ఏం చేయాలి, అలా జరిగిపోతుంది... అని అనకండి. అలా జరిగిపోతుంది అని ఎవరంటారు? యజమానులా లేక దాసులా? యజమాని కంట్రోల్ లోనైతే ఉంటాయి కదా. ఒకవేళ యజమానికి కూడా ఎవరైనా మోసం చేసినట్లయితే వారు యజమానులా? కావున చెక్ చేసుకోండి - కంట్రోలింగ్ పవర్ ఉందా? ఒకటేమో - పొదుపు చేయండి, వేస్ట్‌కి బదులుగా బెస్ట్ ఖాతాలో జమ చేయండి మరియు రెండవది - ఒకవేళ పొదుపు చేయలేకపోతే వ్యర్థాన్ని సమర్థ సంకల్పాలలోకి పరివర్తన చేయండి. ఒకవేళ కంట్రోల్ అవ్వలేకపోతే పరివర్తన అయితే చేయగలరు కదా? దాని వేగాన్ని త్వరగా పరివర్తన చేయండి. లేకపోతే అలవాటైపోతుంది. ఒక గంట సమయాన్ని చెక్ చేసుకున్నా, ఒక గంటలో కూడా 5-10 నిమిషాలు కూడా ఏవైతే వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయో, ఆ 5 నిమిషాలు కూడా వేస్ట్ నుండి బెస్ట్‌లో జమ అయినట్లయితే, 12 గంటలలో 5-5 నిమిషాలు కూడా ఎంతవుతాయి? మరియు సంతోషం ఎంతగా ఉంటుంది? ఎంతైతే శ్రేష్ఠ సంకల్పాల ఖాతా జమా అవుతుందో, అంతగా సమయానికి జమా ఖాతా ఉపయోగపడుతుంది. లేకపోతే స్థూల ధనము ఒకవేళ జమ అవ్వకపోతే సమయానికి ఎలాగైతే మోసపోతారో, అలాగే ఇక్కడ కూడా ఎప్పుడైనా, ఏదైనా పెద్ద పరీక్ష వచ్చినప్పుడు మనస్సు మరియు బుద్ధి ఖాళీ-ఖాళీగా అనిపిస్తుంది, శక్తిశాలిగా అనిపించదు. మరి ఏం చేయాలి? జమ చేయడం నేర్చుకోండి. వచ్చే సంవత్సరం చూసినప్పుడు అందరి శ్రేష్ఠ సంకల్పాల ఖాతా నిండుగా ఉండాలి. ఖాళీ-ఖాళీగా ఉండకూడదు. ఈ శ్రేష్ఠ సంకల్పాల ఖజానాయే శ్రేష్ఠ ప్రారబ్ధానికి ఆధారమవుతుంది. మరి జమ చేయడం వస్తుందా? రాజయోగి అనగా చెక్ చేయడం కూడా వస్తుంది మరియు జమ చేయడం కూడా వస్తుంది. ఎవరి ఖాతా అయితే జమ అయి ఉంటుందో వారి నడవడిక మరియు ముఖము సదా నిండుగా కనిపిస్తుంది. అంతేకానీ, ఈరోజు చూస్తే ముఖము బాగా మెరుస్తూ, మళ్ళీ రేపు చూస్తే ఉదాసీనత యొక్క అల - ఇలా ఉండదు. మొత్తం రోజంతటిలో మీ ఫోజులు ఎంతగా మారుతాయి? అన్నది చెక్ చేసుకోండి. ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? చాలా ఫోజులు మారుతాయి. బాప్‌దాదా అయితే అందరి ఫోజ్‌లను చూస్తారు కదా! అప్పుడప్పుడు ఏమి చూస్తారంటే - చాలా మంది పిల్లలు కర్మ చేయడంలో అంత సమయం తీసుకోరు కానీ చేసిన కర్మల యొక్క పశ్చాత్తాపంలో సమయాన్ని చాలా పోగొట్టుకుంటారు. మళ్ళీ - 3 రోజులు గడిచిపోయింది, సంతోషం మాయమైపోయింది అని అంటారు. సంతోషం ఎందుకు మాయమైంది, ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తీసుకువెళ్ళారు? ఖజానా అయితే మీది, కానీ ఎవరు తీసుకువెళ్ళారు? పశ్చాత్తాపపడడం మంచిదే, ఎందుకంటే పశ్చాత్తాపము పరివర్తన చేయిస్తుంది కానీ అందుకు ఎక్కువ సమయం తీసుకోకండి. పశ్చాత్తాపంతో ఏడ్చినప్పుడు మొత్తం వారమంతా ఏడుస్తూ ఉంటారు. పశ్చాత్తాపపడ్డారు, చాలా మంచిది కానీ పశ్చాత్తాపపడండి మరియు ప్రాప్తి యొక్క సంతోషాన్ని తీసుకురండి. ఇక తర్వాత కోసం క్షణంలో నిర్ణయం తీసుకోండి - ఇది చేయాలా లేక చేయకూడదా! ఇంతకుముందు వినిపించాము కదా - నాట్ మరియు డాట్, ఈ రెండు పదాలను గుర్తుంచుకోండి. నాట్ (ఆలోచించకండి) మరియు డాట్ (బిందువు పెట్టండి). నాలుగు గంటలు ఏడుస్తూ ఉన్నారు, అయితే కన్నీరు రాలేదు, కానీ లోలోపల ఏడుస్తూ ఉన్నారు. అరగంట కన్నీరు కార్చారు మరియు నాలుగు గంటలు మనస్సుతో ఏడ్చారు, ఇంతగా పశ్చాత్తాపపడకండి. ఇది చాలా ఎక్కువ. పశ్చాత్తాపానికి కూడా ఒక హద్దు పెట్టుకోండి.
బాప్‌దాదాకు డబల్ విదేశీయుల ఒక విశేషత చాలా బాగా అనిపిస్తుంది, ఏడ్వడం బాగా అనిపించదు కానీ ఒక విశేషత బాగా అనిపిస్తుంది. అదేమిటి? సత్యమైన హృదయాన్ని చూసి స్వామి సంతోషపడతారు. సత్యం చెప్పడంలో భయపడరు, దాచి పెట్టరు. కావున సత్యమైన హృదయము ఉంది, దీని కారణంగా తండ్రి యొక్క డబల్ ప్రేమకు కూడా పాత్రులుగా ఉన్నారు. మరి సత్యమైన హృదయాన్ని ఉంచారు, స్వామిని సంతుష్టపర్చారు, అలాగే పరివర్తనను కూడా అంతే త్వరగా చేయాలి. ఇది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది... అని పదే-పదే దానిని మీ లోపల వర్ణన చేయకండి. జరిగిపోయింది, ఇక ఫినిష్. ఇక ముందు కోసం అటెన్షన్ పెట్టండి. కానీ అప్పుడప్పుడు అటెన్షన్‌కు బదులుగా టెన్షన్ తీసుకుంటారు, అది చేయకూడదు. అతి పెద్ద జస్టిస్‌గా అవ్వండి. ఇక్కడ కూడా చీఫ్ జస్టిస్ అంటారు కదా, మీరైతే చీఫ్ జస్టిస్‌కి కూడా చీఫ్ వంటివారు. మీ కొరకు మీరు త్వరత్వరగా - ఇది రాంగ్, ఇది రైట్ అని నిర్ణయం తీసుకోండి. రాంగ్ అయితే నాట్ మరియు డాట్. అలా జరిగి ఉండకపోతే ఇలా ఉండి ఉండేది, అలా చేసి ఉండకపోతే ఇలా ఉండి ఉండేది... ఇలా పోగొట్టుకునే ఖాతాను జమ చేసుకుంటారు. సంపాదన సమాప్తమైపోతుంది, జమ ఖాతా సమాప్తమవుతుంది. ఆలోచించండి కానీ వ్యర్థంగా కాదు. ఒక గంటలో ఇంత పొదుపు చేసాము... అని పొదుపు చేసి చూపించండి. వ్యర్థం మొదలైంది కానీ మేము ఛేంజ్ చేసుకున్నాము మరియు జమ చేసుకున్నాము అన్న రిజల్టును చూపించండి. వేస్ట్‌ను పొదుపు చేయండి. ఈ పొదుపు ఖాతా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది.
ఈ సంవత్సరం బాప్‌దాదా అందరి పొదుపు ఖాతాను నిండుగా చూడాలనుకుంటున్నారు. మీరు చేయగలరు కదా? కావున ఇప్పుడు తీవ్ర వేగంతో చేయండి ఎందుకంటే సమయం కూడా వేగంగా వెళ్తుంది కదా! ఇందులో నంబరువన్ లోకి ఎవరు వెళ్తారు? పొదుపు ఖాతా ఎవరిది అందరికన్నా ఎక్కువగా ఉంటుంది అనేది చూస్తారు. పొదుపు ఖాతాలో నంబరువారుగా ఎవరెవరు ఉంటారు అన్న లిస్ట్‌ను తయారుచేస్తారు. ఒకవేళ మీరు సంకల్పాలను కంట్రోల్ చేసినట్లయితే ఇతరులను కంట్రోల్ చేసే శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. చెప్పాలని అనుకోలేదు కానీ నోటి నుండి ఎలా వచ్చేసిందో తెలియదు అని చాలామంది అంటారు. కానీ ఎప్పుడైతే మాటలు వెలువడతాయో లేక కర్మలు కూడా జరుగుతాయో, వాటి కన్నా ముందైతే సంకల్పం వస్తుంది. ఒకవేళ ఎవరిపైనైనా క్రోధం చేయాల్సి వచ్చినా మొదట సంకల్పంలో ప్లాన్ తయారవుతుంది - ఇలా చేస్తాను, ఇలా మాట్లాడతాను, వాళ్ళు ఏమనుకుంటున్నారు... అని. ఇలా ప్లాన్ నడుస్తుంది. అప్పుడు సమయాన్ని కూడా అందులో ఉపయోగిస్తారు. అది ఎప్పుడొస్తుంది, ఎవరొస్తారు... అంటూ సమయాన్ని చూస్తూ ఉంటారు. కావున సంకల్పాల ఖజానా వెనుక సమయం యొక్క ఖజానా కూడా వ్యర్థమవుతుంది. రెండింటికీ సంబంధం ఉంది. సంకల్పాలను పొదుపు చేయడం ద్వారా సమయాన్ని, మాటలను పొదుపు చేయడము స్వతహాగానే జరుగుతుంది.
ఇప్పుడు డైమండ్ జూబిలీ జరుపుకునే ప్లాన్స్ తయారుచేస్తున్నారు కదా. కాబట్టి డైమండ్ జూబిలీలో బాప్‌దాదా పిల్లల యొక్క ఒక దృశ్యాన్ని చూడాలనుకుంటున్నారు. దీపావళి ఉంటుంది కదా లేదా ఏదైనా ఇలాంటి పెద్ద ఉత్సవం ఉన్నప్పుడు అక్కడక్కడా లైట్లు వెలుగుతూ కనిపిస్తాయి. చూసారు కదా? మీ అందరి దేశాలలో పెద్ద రోజు అయితే ఉంటుంది కదా, అప్పుడు ఎన్ని బల్బులు లేదా ఏవైనా వస్తువులు మెరుస్తూ ఉంటాయి, ఇక్కడ చూస్తే మెరుస్తూ ఉన్నాయి, అక్కడ చూస్తే మెరుస్తూ ఉన్నాయి. అలాగే డైమండ్ జూబిలీలో ఈ రియల్ ఆత్మిక డైమండ్స్ అక్కడక్కడా ఇలా మెరుస్తూ కనిపించాలి, అందరూ ఇది ఎటువంటి మెరుపు అని అనుభవం చేయాలి. డైమండ్ అయితే మెరుస్తుంది కదా. మట్టిలో దాచినా కూడా తన మెరుపును పోగొట్టుకోదు. కాబట్టి ఎక్కడైనా, ఏ దేశంలోనైనా, ఏ స్థానంలోనైనా మీరు ఉంటే అందరికీ వీరు మెరుస్తున్న డైమండ్ అని అనుభవం కావాలి. వారికి వైబ్రేషన్స్ రావాలి. లైట్ ఎక్కడైనా వెలుగుతూ ఉంటే, మంచి అలంకరణ ఉంటే మీరు కోరుకున్నా, కోరుకోకపోయినా అది మీ దృష్టిని తప్పకుండా ఆకర్షిస్తుంది. ఎన్ని డైమండ్స్ ఉన్నారు మరియు మొత్తం వరల్డ్‌లో వ్యాపించి ఉన్నారు. కాబట్టి మొత్తం వరల్డ్‌లో మెరుస్తున్న డైమండ్స్ తమ మెరుపును చూపిస్తే - ఆ దృశ్యం ఎలా ఉంటుంది! బాగుంటుంది కదా! దీని ఫోటోను బాప్‌దాదా తీస్తారు. ఎందుకంటే మీరు అన్ని చోట్లకు వెళ్ళలేరు, బాప్‌దాదా అయితే వెళ్ళగలరు. ఈ కెమెరా తీసుకుని ఎక్కడెక్కడికి వెళ్తారు! కాబట్టి ఇలా మెరుస్తున్న డైమండ్స్ యొక్క దృశ్యం విశ్వంలో కనిపించాలి. ఏదో అద్భుతం ఉంది అని అనిపించడం ప్రారంభమవ్వాలి. మొదట ‘ఏదో ఉంది’ అనే స్థితి వరకు చేరుకున్నారు, తరువాత లాస్ట్‌లో ‘అంతా వీరే’ అని అంటారు. కాబట్టి దానికి ఆధారం - ఈ సంకల్పాల ఖాతాను జమ చేసుకోవడం. చిన్న-చిన్న విషయాలలో పురుషార్థం చేస్తూ అలసిపోకండి. ఈర్ష్య సమాప్తం కావడం లేదు, కొద్దిగా క్రోధం ఇంకా వస్తోంది, మాట బయటకు వచ్చేస్తోంది - ఒక్కొక్క విషయంలో శ్రమ చేయకండి. బీజాన్ని సరిచేయండి, వృక్షం దానంతట అదే సరిచేయబడుతుంది. వీటన్నింటికీ బీజం సంకల్పమే కదా. సంకల్పం శ్రేష్ఠంగా ఉంటే అంతా శ్రేష్ఠంగా అయిపోయినట్లే. శ్రమ చేయవలసిన అవసరమే లేదు. లేకపోతే కష్టంగా అనిపిస్తుంది కదా - ఇంకా ఇంత చేయాలి! 10 సంవత్సరాలు అయ్యాయి, 20 సంవత్సరాలు అయ్యాయి, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయ్యాయి, అయినా ఈ బలహీనత పోలేదు... ఫౌండేషన్‌ను చెక్ చేస్తే 4 సెకండ్లు కూడా పట్టకూడదు. అప్పుడు చూడండి మీ మనసా సేవ ఎంత ఫాస్ట్‌గా జరుగుతుందో! ఇప్పుడు మనసా శక్తి వేస్ట్ అవుతోంది, కార్యంలో ఉపయోగపడటం లేదు మరియు పొదుపు అయినప్పుడు కార్యంలో ఉపయోగపడుతుంది కదా. అప్పుడు శ్రమ చేయవలసిన అవసరం కూడా లేదు. నడుస్తూ-తిరుగుతూ లైట్ హౌస్, మైట్ హౌస్‌గా అనుభవమవుతారు. లైట్ హౌస్ ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి చెప్పదు, దూరం నుండే సూచిస్తుంది - మార్గం ఇది. కాబట్టి మీరందరూ మెరుస్తున్న డైమండ్ లైట్ హౌస్, మైట్ హౌస్‌లుగా అయిపోతే విశ్వంలో అంధకారం ఉంటుందా? ఇది ఇష్టమా లేక కేవలం డైమండ్ జూబిలీ ప్రోగ్రామ్స్ చేసి డైమండ్ జూబిలీ పూర్తయిపోయింది అంటారా. అలా కాదు కదా! మొదట స్వయం, తరువాత విశ్వం. చూడండి ఇప్పటికీ మీరు చెప్పేది మరియు ఇతర పెద్ద-పెద్ద మండలేశ్వరులు కూడా చెప్పేది ఒకటే అయినా, మీరు చెప్పినప్పుడు ప్రభావం పడుతుంది, హృదయానికి హత్తుకుంటుంది ఎందుకంటే మీరు చేసి తరువాత చెబుతారు. వారు కేవలం చెబుతారు, చేయరు. కాబట్టి అందరికీ తేడా అనిపిస్తుంది కదా. స్వయంగా చేసి తరువాత చెప్పేవారి ప్రభావం వేరుగా ఉంటుంది. ఇక్కడ కూడా అంటారు కదా ఫలానా అక్కయ్య లేదా అన్నయ్య చెప్పేది హృదయానికి హత్తుకుంటుంది మరియు కొంతమందిది కేవలం భాషణ విన్నాము, సరే. మరి తేడా ఏమిటి? కేవలం చెప్పడం మరియు చేసి చెప్పడం, దాని ప్రభావం వాణిపై స్వతహాగానే ఉంటుంది. కాబట్టి డైమండ్స్ అయితే అందరూ కదా లేక ఎవరైనా సిల్వర్, ఎవరైనా గోల్డ్, ఎవరైనా డైమండ్గా ఉన్నారా? డైమండ్ అయితే ఉన్నారు, కేవలం కొద్దిగా మెరుపు కనిపించాలి. బాప్‌దాదాకు కూడా సంతోషం కలుగుతుంది - బాబా ఖజానాలో ఎన్ని డైమండ్స్ ఉన్నారు మరియు ఒక్కొక్క డైమండ్ ఎంత వాల్యుబుల్‌గా ఉంది. ఇన్ని ఆత్మిక డైమండ్స్ ఎక్కడ దొరుకుతారు, ఎవరి దగ్గరైనా దొరుకుతారా? మొత్తం అమెరికా, ఆఫ్రికాలో వెతికి రండి, దొరుకుతారా? మరియు ఇక్కడ చూడండి - బాబాకు ఎన్ని రియల్ డైమండ్స్ లభించారు. కానీ వైబ్రేషన్స్ యొక్క మెరుపు వ్యాపించేలా తయారవ్వాలి. నేను డైమండ్‌ను అని మీలో మీరే సంతోషంగా ఉండటం కాదు. సత్యమైన డైమండ్ యొక్క మెరుపు ఎప్పుడైనా దాగి ఉంటుందా! ఎంతగా ఇలా-ఇలా చేసి చూపించినా కూడా మెరుపు కనిపిస్తుంది. ఈ రోజుల్లో బయట రియల్ డైమండ్స్ అని అంటారు కదా, అవి రియల్ కావు. మీ స్వర్గంలోని డైమండ్స్ రియల్, వాటి ముందు ఇవి ఏమీ కావు. కాబట్టి రియల్ డైమండ్ యొక్క గుర్తు ఏమిటంటే దాని మెరుపు వ్యాపిస్తుంది. ఈ లైట్ వెలిగితే వ్యాపిస్తుంది కదా! ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే అంతగా వ్యాపిస్తుంది. కాబట్టి వైబ్రేషన్స్ ద్వారా మీ రియల్ డైమండ్ యొక్క మెరుపు వ్యాపించాలి. ఉదాహరణకు చూడండి, మధుబన్‌లో బాబా గదిలోకి వెళ్ళినప్పుడు విశేష అనుభవం కలుగుతుంది కదా. తెలిసినా, తెలియకపోయినా, నిశ్చయం ఉన్నా లేకపోయినా సైలెన్స్ యొక్క వైబ్రేషన్స్ అయితే అనుభవమవుతాయి కదా! కాబట్టి మీ సహచరులకు కూడా వైబ్రేషన్స్ రావాలి - అవును, వీరు మెరుస్తున్నారు. వీరు అయితే అలాగే ఉన్నారు అని అనకూడదు. మొదట సహచరులకు వైబ్రేషన్స్ వస్తే తరువాత అవి దూరం వరకు కూడా వెళ్తాయి.
పరివర్తన శక్తి బాగుంది కదా లేక తక్కువగా ఉందా? ఎవరైతే పరివర్తన చేసుకోవాలనుకుంటారో వారికి టైమ్ పట్టదు, లేక చేస్తాము, చూస్తాము అని ఆలోచిస్తారా! చేయాల్సిందే, ఎవరైనా చేసినా చేయకపోయినా, నేను చేయాలి. సాకులు చెప్పడం అందరికీ చాలా బాగా వస్తుంది. సాకులు చెప్పడం రానివారు ఎవరూ ఉండరు. తెలివైనవారు. సాకులు ఏమి చెబుతారు - ఇలా జరిగింది కాబట్టి అలా జరిగింది, వీరు చేసారు కాబట్టి అలా జరిగింది, లేకపోతే నేను బాగానే ఉన్నాను, నడుస్తున్నప్పుడు వీరు దెబ్బ కొట్టారు కాబట్టి పడిపోయాను, దెబ్బ తగలకపోతే పడిపోయేవారు కాదు కానీ వారు దెబ్బ కొట్టారు. మిమ్మల్ని మీరు ఎందుకు రక్షించుకోలేరు! దెబ్బ కొట్టేవారి పని దెబ్బ కొట్టడం, మీ పని మిమ్మల్ని మీరు రక్షించుకోవడమా లేక వీరు దెబ్బ కొట్టారు కాబట్టి పడిపోయాను అని సాకు చెప్పడమా. రక్షించుకోవడం మీ పనా లేక ఇతరులు చేస్తారా? కాబట్టి ఇవి కూడా సాకులే. ఇది సరిఅయిపోతుంది కదా అప్పుడు చూడండి... చాలా మంచి మధురమైన-మధురమైన విషయాలు చెబుతారు - రేపటి నుండి ఇది అయిపోతుంది కదా అప్పుడు తీవ్ర పురుషార్థులుగా అయిపోతాము. రేపు మళ్ళీ ఇంకొక విషయం వస్తే ఎల్లుండి అయిపోతుంది అని అంటారు. కాబట్టి సాకులు చెప్పకండి. ఎగిరే కళ యొక్క ఆటలో నంబర్ తీసుకోండి. సాకులు చెప్పడంలో నంబర్ తీసుకోకండి. మీ సహచరులు, సహయోగులు చాలా అంధకారంలో ఉన్నా, నాలుగు వైపులా అంధకారం ఉన్నా, అంధకారం ఉంది కదా అందుకే నేను వెలుగును ఇవ్వలేను అని మీరు చెప్పలేరు. అంధకారం కోసమే కదా మీరు వెలుగుగా ఉన్నారు! అంధకారం ఉంది అందుకే తడబడి పడిపోయాను! ఎక్కడికి పోయారు లైట్ హౌస్! స్వయానికి కూడా లైట్ ఇవ్వలేరా! మరి సంవత్సరం గడిచిపోతూ ఉంది. ఇప్పుడు సంకల్పాలలో సాధారణ సంకల్పాలు చేయకండి, ప్రతిజ్ఞ చేయండి. శరీరం పోయినా కానీ ప్రతిజ్ఞ పోకూడదు. ఎంత సహనం చేయాల్సి వచ్చినా, పరివర్తన చేయాల్సి వచ్చినా ప్రతిజ్ఞను వదలకండి. దీనిని దృఢ సంకల్పము అని అంటారు. ఆలోచించడమైతే చాలా బాగా ఆలోచిస్తారు, బాప్‌దాదా కూడా సంతోషిస్తారు. ఇది చేస్తాము, ఇది చేస్తాము, ఇది చేయము - అని సంతోషపెడతారు కానీ ఇందులో దృఢత్వం ద్వారా సదా అన్న పదాన్ని యాడ్ చేయండి. కొంత సమయమైతే ప్రభావాన్ని చూపిస్తారు. దాని గురించి ఇంతకుముందు వినిపించాము కదా - స్వయాన్ని సదా ఎకానమీ అవతారంగా భావించండి. ఎకానమీ, ఏకనామీ మరియు ఏకాంతవాసీ అన్నది కలిసి-కలిసి జరగాలి. ఎక్కువగా మాటలలోకి రాకండి. ఏకాంతవాసులుగా అవ్వండి. ఎవరైతే రోజంతటిలో మాటలలోకి వస్తారో వారి సంకల్పాలు, సమయము, అన్ని ఖజానాలు ఎక్కువగా వేస్ట్ అవుతాయి. ఏకాంతవాసి అన్న పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. కేవలం బాహ్య పరంగా ఏకాంతం కాదు కానీ ఒక్కరి అంతంలో నిమగ్నమవ్వడము, ఏకాంతము. అలా కాకుండా కేవలం బాహ్య పరంగా ఏకాంతం ఉన్నట్లయితే బోర్ అయిపోతారు, రోజు ఎలా గడుస్తుందో తెలియదు! అని అంటారు. కానీ ఒక్క తండ్రి యొక్క అంతములో నిమగ్నమవ్వండి. ఏ విధంగానైతే సాగరం యొక్క లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఎంతగా ఖజానా లభిస్తుంది! అలా అంతములోకి వెళ్ళిపోండి అనగా తండ్రి నుండి ఏ ప్రాప్తులైతే లభిస్తాయో, అందులో నిమగ్నమైపోండి. కేవలం పై-పైన అలలలో తేలి ఆడకండి, అంతములోకి వెళ్ళండి, నిమగ్నమైపోండి. అప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో చూడండి. సర్వ ఖజానాలలో ఎకానమీ చేయండి, మరియు ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ లేరు, దీనిని ఏకనామీ అని అంటాము. ఇటువంటి స్థితిలో ఉండేవారు తమ సర్వ ఖజానాలను జమ చేసుకోగలరు, లేకపోతే జమ అవ్వదు. మరి ఎకానమీ చేయడం తెలుసు కదా? అచ్ఛా!
ఎవరితో ఎక్కువ ప్రేమ ఉంటుందో, ప్రేమకు గుర్తు వారిని స్వయం కంటే కూడా ముందుకు తీసుకువెళ్ళడం. కాబట్టి బాప్‌దాదా కూడా ప్రతి బిడ్డ నా కంటే కూడా ముందుండాలని కోరుకుంటున్నారు. ఇదే ప్రేమకు గుర్తు. ఎవరిలోనూ ఏ లోపమూ ఉండకూడదు. అందరూ సంపూర్ణంగా మరియు సంపన్నంగా ఉండాలి. సంపన్నంగా ఉంటే సంపూర్ణంగా అవుతారు. కాబట్టి డబల్ విదేశీయులపై డబల్ ప్రేమ ఉంది కదా! ఎందుకంటే స్థాపన యొక్క పాత్రలో డబల్ విదేశీయులైన మీకు విశేషమైన శోభ ఉంది. స్థాపన యొక్క పాత్రకు విశేష అలంకారంగా ఉన్నారు. ఇప్పుడు జమ ఖాతాలో విదేశం నంబర్‌వన్ తీసుకుంటుందా లేక భారతవాసులు నంబర్‌వన్ తీసుకుంటారా అనేది చూస్తాము. ఎందుకంటే డబల్ విదేశీయులలో నేచురల్ సంస్కారాలు ఉన్నాయి, ఏ లైన్లో వెళ్ళినా తీవ్ర గతితో వెళ్తారు, పడిపోయినా తీవ్రంగానే, ఎక్కినా తీవ్రంగానే. కాబట్టి ఈ సంస్కారాన్ని ఇప్పుడు జమ ఖాతాలో తీవ్ర గతితో ఉపయోగించండి. చిన్న-చిన్న స్థానాలు ఉన్నాయి కదా, వారు నంబర్ ఇంకా ముందుకు తీసుకోండి. అచ్ఛా.
ఆఫ్రికా:- ఆఫ్రికా వారు ఏమి చేస్తారు? బాప్‌దాదాకు అమెరికా, ఆఫ్రికా అని పలకడం చాలా బాగా అనిపిస్తుంది. మరి ఆఫ్రికా వారు ఏ అద్భుతం చేస్తారు? ఏ నంబర్ తీసుకుంటారు? మొత్తం ఆఫ్రికాలో మెరిసిపోతారు. డైమండ్స్ మెరుస్తారు! కాబట్టి ఈ సంవత్సరం విశేషంగా దృఢత అనే విశేషతను ప్రతి సంకల్పంలో ప్రాక్టికల్‌గా తీసుకువస్తామని సంకల్పం చేయండి. కాబట్టి ఆఫ్రికా అంటే దృఢత యొక్క విశేషత. ఇష్టమేనా? చేయాల్సిందే. అలా కాదు, ఇష్టమైతే ఉంది... కానీ బాబాకు కూడా ఇష్టమవ్వాలి కదా! కాబట్టి ఆఫ్రికా వారు ఈ విశేషతను సదా ఎదురుగా ఉంచుకోండి. సౌత్ అయినా, మరేదైనా కానీ దృఢతను వదలకండి.
అమెరికా:- అమెరికా వారు ఏ విశేషతను ధారణ చేస్తారు? (పరివర్తన చేస్తాము) చాలా బాగుంది, ఇందులో ఎడిషన్ చేయండి - ఫాస్ట్ గతిలో పరివర్తన. ఏ సంకల్పంలోనైనా ఏకాగ్రత అనే విశేషత శ్రేష్ఠ పరివర్తనలో ఫాస్ట్ గతిని తీసుకువస్తుంది. అమెరికాలో బయట టెన్షన్ చాలా ఉంది కదా, కాబట్టి బయట ఎంత టెన్షన్ ఉందో అంతగా మీరు ఏకాగ్రంగా, టెన్షన్ ఫ్రీగా ఉండండి. ఏకాగ్రత అనే విశేషత ద్వారా ఫాస్ట్ గతిలో పరివర్తన, సరే కదా! అమెరికా వారికి ఇష్టమేనా! బాప్‌దాదా దగ్గర అయితే అందరి ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు ఏకాగ్రంగా ఉంటున్నారా లేక రోజంతా పోజులు మారుస్తున్నారా అనేది చూస్తారు. బాప్‌దాదాకు కూడా నిశ్చయం ఉంది - అవ్వాల్సింది వీరే. అవ్వాల్సిందే. ఈ ఏకాగ్రత అనే విశేషతను సదా తోడుగా ఉంచుకోండి. అచ్ఛా!
యు.కె., యూరప్:- యు.కె., యూరప్ వారు ఏమి చేస్తారు? వైబ్రేషన్స్ ద్వారా సేవ చేస్తారు. లండన్ అయితే లైట్ హౌస్యే. మరి యూరప్ నుండి లైట్ ఎంతవరకు వెళ్తుంది? విశ్వం వరకు లేక కేవలం యూరప్ వరకా? విశ్వం వరకు వెళ్తుంది, అచ్ఛా! కాబట్టి ఈ విశేషతను ఇంకా ప్రాక్టికల్లోకి తీసుకురావడానికి సదా ఈ స్మృతిలో ఉంచుకోండి - “సఫలత జన్మసిద్ధ అధికారము.” సఫలం చేయడం అంటే సఫలతను పొందడం. కాబట్టి సఫలత యొక్క శక్తి ఉందా? సఫలత ఉండనే ఉంది, అవుతుందా లేదా, అని కాదు. కాబట్టి సఫలత యొక్క నిశ్చయం అనే విశేషతను సదా తోడుగా ఉంచుకోండి. అన్ని చోట్ల అవ్వాల్సిందే కానీ ధైర్యము ఉంచి సహాయం పొందేందుకు పాత్రులుగా అయ్యి, సఫలత అనే జన్మసిద్ధ అధికారాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. అవ్వాల్సిందే. సరే కదా! ఆఫ్రికా, అమెరికా, అందరూ సరే. అచ్ఛా!
ఆస్ట్రేలియా:- ఆస్ట్రేలియా ఏమి చేస్తుంది? (ఎకానమీ యొక్క అవతారంగా అవుతాము) అచ్ఛా, ఆస్ట్రేలియా అవతారంగా అయిపోతుంది. చాలా మంచిది. ఆస్ట్రేలియాకు ఎవరెవరు వస్తారో వారికి ఆస్ట్రేలియా భూమి అవతారాల భూమిగా అనిపిస్తుంది. ఒక అవతారమే ఇంత అద్భుతం చేసి చూపిస్తే, ఆస్ట్రేలియాలో ఇంతమంది అవతారాలు ఉన్నప్పుడు ఎటువంటి అద్భుతం చేసి చూపిస్తారు! మంచి విషయం, దీని కోసం ధారణ చేయవలసిన విశేషత దివ్యత. ఎంతెంతగా దివ్యత యొక్క శక్తిని లేదా విశేషతను ప్రతి సంకల్పంలో తీసుకువస్తారో అంత సహజంగానే అవతార భూమిగా అయిపోతుంది. ఆస్ట్రేలియా పేరే మారిపోతుంది - అవతార భూమి. ఇంతమంది అవతారాలు వచ్చేసారు! ఇంతటి క్రిస్టియన్ డైనాస్టీ కోసం ఒక క్రైస్ట్ అవతారం వచ్చారు. ఇక్కడ అయితే ఎంతమంది అవతారాలు ఉంటారు, కాబట్టి అవతార భూమిగా అయిపోతుంది. ఆస్ట్రేలియా భవిష్యత్తు చాలా ఉన్నతమైనది. ఆస్ట్రేలియాలోని రత్నాలందరూ సదా బాప్‌దాదా ముందు వస్తారు. మధ్యమధ్యలో కొద్దిగా దాగుడుమూతల ఆట ఆడతారు. ఆట బాగా అనిపిస్తుంది, కానీ ఆట సమాప్తమైతే ఏమవుతుంది? సఫలత. కాబట్టి సదా దివ్యతయే అవతారం యొక్క విశేషత. దివ్యత అనే విశేషత ద్వారా ఈ సంకల్పాన్ని స్వరూపంలోకి తీసుకువస్తారు. తీసుకురావాల్సిందే. అచ్ఛా!
ఏషియా:- జపాన్ వారు అయితే పరీక్ష పాస్ అయ్యారు కదా. జపాన్ వారు కూడా వచ్చారు. చేతులెత్తండి. మరి ఏషియా వారు ఏమి చేస్తారు? (ఏకాంతవాసులుగా అవుతాము, బాబాను ప్రత్యక్షం చేస్తాము) ప్రత్యక్షత యొక్క సూర్యుడు ఏషియా నుండి ఉదయిస్తాడు, చాలా మంచి సంకల్పం. కాబట్టి ఏషియా వారు ప్రత్యక్షత యొక్క జెండాను ముందుగా అక్కడి నుండే ఎగురవేస్తారు. మంచి విషయం, ఛోటే సుభానల్లా అంటారు కదా. చూడండి ఎంత మంచి ధైర్యము ఉంచారు - ఏషియా నుండి ప్రత్యక్షత జరుగుతుంది. మీ నోటిలో గులాబ్ జామున్. చాలా మంచి సంకల్పం తీసుకున్నారు. కాబట్టి ఈ సంకల్పాన్ని సహజంగా పూర్తి చేయడానికి మొదట పవిత్రత అనే జ్యోతిని నాలుగు వైపులా వెలిగించాలి. వారు జ్యోతిని తీసుకుని చుట్టూ తిరుగుతారు కదా, అలాగే మీరు పవిత్రత అనే జ్యోతిని ఏషియా అంతటా మెరిసేలా చేయాలి, అప్పుడే అందరూ బాబాను చూడగలరు, గుర్తించగలరు. కాబట్టి పవిత్రత అనే జ్యోతి సదా శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా వెలుగుతూ ఉండాలి. కొద్దిగా కూడా గందరగోళంలోకి రాకూడదు, నిశ్చలంగా ఉండాలి. పవిత్రత అనే జ్యోతి ఎంత నిశ్చలంగా ఉంటుందో అంత సహజంగా అందరూ బాబాను గుర్తించగలరు మరియు పవిత్రతకు జయజయకారాలు జరుగుతాయి. అర్థమైందా! అచ్ఛా!
మారిషస్:- మారిషస్ కూడా చిన్నదే కానీ అద్భుతం చేస్తుంది. మరి మారిషస్ వారు ఏమి చేస్తారు? మారిషస్ యొక్క మెరుపు ఎంతగా ఉంటుందంటే అది త్వరగా భారత్‌కు చేరుకుంటుంది. దగ్గరగా ఉంది కదా. కాబట్టి మారిషస్ యొక్క మెరుపు భారత్‌లోని కుంభకర్ణుడిని మేల్కొలుపుతుంది కదా. ఎవరైనా మేల్కొనకపోతే లైట్ వెలిగించి వారిని మేల్కొలుపుతారు కదా. కాబట్టి మారిషస్ వారు మొదట సదా ఏకరసమైన మెరుపు కోసం సత్యత అనే శక్తి యొక్క జెండాను ఎగురవేయండి. బాబా సత్యం, జ్ఞానం సత్యం, ఆత్మ కూడా సత్యం మరియు బ్రాహ్మణ జీవితం కూడా సత్యం. కాబట్టి సత్యత యొక్క జెండాను ముందుగా ఎగురవేయాలి, అప్పుడు ఈ సత్యత అనే విశేషత ద్వారా మెరుపు పెరుగుతుంది మరియు భారత్ మాత్రమే కాదు, మొత్తం విశ్వం వరకు వ్యాపిస్తుంది. సరే కదా!
రష్యా:- రష్యా వారు కూడా రేస్ చేస్తున్నారు. రష్యా వారు చేతులెత్తండి. వారు కలిసే కూర్చుంటారు. వీరికి పరస్పరం చాలా ప్రేమ ఉంది. ఒకరు వెళ్తే మొత్తం లైన్ వెళ్తుంది. సంగఠన శక్తి యొక్క ప్రాక్టీస్ వీరికి బాగుంది. మరి రష్యా వారు ఏ అద్భుతం చేసి చూపిస్తారు? (నిశ్చలత యొక్క శక్తిని ధారణ చేస్తాము) అప్పుడు మొత్తం రష్యాకు తీరం లభిస్తుంది. చాలా మంచిది. కాబట్టి మొత్తం విశ్వంలో సత్యమైన ఆధారం ఎవరు - అనే జెండాను ఎగురవేస్తారు. ఎందుకంటే సమయానుసారంగా అనేక ఆధారాలు వచ్చాయి కానీ ఆ ఆధారాలు తీరానికి చేర్చలేదు. కాబట్టి తీరానికి తప్పకుండా చేర్చే సత్యమైన ఆధారం ఎవరు అనేది నిశ్చితం. కాబట్టి స్వయంగా ఏ ఆధారాన్ని తీసుకున్నారో, ఆ ఆధారాన్ని ఇచ్చి బాబాను ప్రత్యక్షం చేసి అందరినీ తీరానికి చేరుస్తారు. మంచి విషయం. కాబట్టి ఆధారాన్ని ఇచ్చేవారు ఎవరు - అనే జెండాను ఎగురవేయండి.
మిడిల్ ఈస్ట్:- మిడిల్ ఈస్ట్ వారు ఏమి చేస్తారు? (అసంభవాన్ని సంభవం చేస్తాము, రాష్ట్రపతిని తీసుకువస్తాము) అయితే విదేశం నుండి మొదటి రాష్ట్రపతి వీరే వస్తారు. ధైర్యము అయితే బాగా ఉంచారు. ఇప్పుడు మొదట అసంభవం నుండి సంభవం ఇది చేయండి - బహిరంగంగా సెంటర్ తెరవబడాలి. సంభవమే కదా! కానీ అసంభవాన్ని సంభవం చేసేవారు యుక్తియుక్తంగా ఉండాలి, యుక్తి లేకుండా ముక్తి కూడా జరగదు. అందుకే యుక్తియుక్తంగా ఎలాంటి ప్రయత్నం చేయాలంటే అందరూ - అల్లాహ్ వచ్చారు అని అనాలి. ధైర్యము బాగా ఉంచారు. మరియు ధైర్యము ఉన్నవారికి బాబా సహాయం అయితే ఉంది. అందుకే యుక్తితో ముందుకు వెళ్తూ ఉండండి. యుక్తిని వదలకండి. వెళ్లి ప్రభాత ఫేరీ తీయడం - అలా చేయకండి. ఇప్పుడు గుప్తంగా ఉంది కదా. పరాయి రాజ్యంలో గుప్తంగా ఉండి కార్యం చేసారని పాండవుల గురించి ప్రసిద్ధి ఉంది. కాబట్టి ఇప్పుడు గుప్తమైన పాత్ర నెమ్మది-నెమ్మదిగా బహిర్గతమవుతూ ఉంది.
అందరూ సంతోషంగా ఉన్నారా? జ్ఞాన సరోవర్ నచ్చిందా? నచ్చింది కదా, మధుబన్‌లో సీట్ ఖాళీగా ఉంటే అక్కడికి వచ్చేద్దామని అయితే ఆలోచించడం లేదు కదా. వచ్చే సంవత్సరం డబల్ విదేశీయులకు జ్ఞాన సరోవర్నే ఇస్తాము. సరేనా? నచ్చిందా? (దాదీలు కూడా ఉంటారు) మీతో పాటు దాదీలు కూడా ఉంటారు. బాప్‌దాదా అయితే రాగలరు కానీ హాల్‌నే చిన్నగా నిర్మించారు. హా, ఏదైనా యుక్తితో హాల్‌ను పెద్దది చేయండి, కనీసం 3 వేల మంది కూర్చోగలగాలి. ఏదైనా ఇన్వెన్షన్ చేయండి. బాప్‌దాదా అయితే తలహటికి కూడా వస్తున్నారు. హాల్ చాలా అందంగా నిర్మించారు కానీ చిన్నగా నిర్మించారు. చూడండి, దాదీలు అక్కడ ఉంటే డబల్ విదేశీయులు, మధుబన్ వారు, మధుబన్కు మొత్తం ఏడు భుజాలు ఉన్నాయి, అందరూ అక్కడ కూర్చోగలగాలి, మురళి అయినా వినగలగాలి. ఇప్పుడు ఎంతమంది కూర్చోగలరు? (16-17 వందలు) 16-17 వందలు అయితే డబల్ విదేశీయులే అవుతారు. ఏదైనా ఇన్వెన్షన్ చేయండి, బాప్‌దాదా వస్తారు. (లండన్‌లో కూడా బాప్‌దాదా వస్తారా?) ఇప్పుడు లండన్ టర్న్ తరువాత ఉంది. ముందు లండన్‌కు బాప్‌దాదా వస్తే ఇన్ని టికెట్లు బుక్ చేస్తారా? ఎన్ని చార్టర్లు చేస్తారు? జంబో ప్లేన్ చేస్తారా, అవి కూడా ఎన్ని? ఇంతమందిని సమీకరించి చూపించండి, మధుబన్గా తయారుచేసి చూపించండి. ఇక్కడ ఇండియాకు వస్తే ఇద్దరూ (దేశ-విదేశీయులు) ఉంటారు. అందుకే చెప్పాము కదా, దానికి ఇంకా కొంత సమయం ఉంది. ఎయిర్ ఇండియాలోని అన్ని డిపార్ట్మెంట్ల వారిని మీ సమానంగా తయారుచేయండి, అప్పుడు అందరికీ టికెట్లు ఫ్రీగా ఇస్తారు. చివరికి అన్నీ మీ పనికే రావాలి. కొద్దిగా జెండా ఎగరవేయండి, అప్పుడు అందరూ స్వయంగా ఆఫర్ చేస్తారు. అచ్ఛా!
(ఈ రోజు బాప్‌దాదాకు జ్ఞాన సరోవర్కు రావడానికి అప్లికేషన్ ఇవ్వబడింది, కానీ బాప్‌దాదా మధుబన్కే వచ్చారు)
మధుబన్ నివాసులతో:- విశేషంగా మధుబన్ కారణంగానే బాప్‌దాదా ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే మధుబన్ వారు తమ తనువు-మనసుతో, సంబంధ-సంపర్కాలతో అలసటలేకుండా సేవ చేసారు. సేవలో మధుబన్ నివాసులకు చాలా మంచి నంబర్లు లభిస్తాయి. కానీ సేవ అనే సబ్జెక్టులో మంచి మార్కులు ఉన్నట్లే, డైమండ్ జూబిలీలో మధుబన్ నివాసులు జ్ఞానం-యోగం-ధారణ అనే ఈ మూడు సబ్జెక్టుల్లో కూడా విశేష నంబర్లు తీసుకోవాలి. సేవ గురించి అందరూ ఎలా గీతాలు పాడుతారో, మొత్తం విశ్వం మధుబన్ నివాసుల సేవ గురించి గీతాలు పాడుతుందో, అలాగే ధారణలో మరియు ఇతర సబ్జెక్టుల్లో నంబర్లు ఉన్నాయి, కానీ ఇంకా ఎక్కువ తీసుకోవాలి. అంగీకారమేనా? మధుబన్ వారు చేతులు ఎత్తండి. మధుబన్ వారి ఖజానాల పొదుపు ఖాతా నంబర్‌వన్‌గా ఉండాలి. అవ్వాలి. మిగిలినవారు మంచి భాగ్యవంతులైన ఆత్మలు. మధుబన్ నివాసిగా అవ్వడం కూడా ఎక్స్ట్రా భాగ్యానికి మెడల్. ఎందుకు? కేవలం అక్కడ నివసించే విషయం కాదు. కానీ అనేక రకాల ఛాన్స్‌లు మధుబన్‌లో లభిస్తాయి. కనుక మధుబన్ నివాసిగా అవ్వడం అంటే అనేక గోల్డెన్ ఛాన్స్‌లు తీసుకోవడం. అందుకే బాప్‌దాదా మధుబన్ నివాసుల భాగ్యాన్ని చూసి హర్షితులవుతారు - వాహ్ భాగ్యవంతులారా, వాహ్!
హాస్పిటల్:- హాస్పిటల్ కూడా వృద్ధి చెందుతోంది. ఎంతెంతగా హృదయపూర్వకంగా సేవ చేస్తారో, తనువుతో సేవ అందరూ చేస్తారు కానీ ఇక్కడ హృదయంతో సేవ చేయడం అంటే హృదయపూర్వక ఆశీర్వాదాలు ఇవ్వడం. కనుక హృదయంతో సేవ చేసేవారు బాప్‌దాదా హృదయంలో నంబర్ ముందుంటారు. అందరూ ఉంటారు కానీ నంబర్ ముందు-వెనుక అయితే ఉంటుంది కదా! కనుక హృదయంతో సేవ చేసే హాస్పిటల్ నివాసులు సదా నంబర్ ముందే తీసుకోవాలి. పెరుగుతున్నారు, పెరుగుతూనే ఉంటారు. ఎందుకంటే అవసరం కూడా పెరగాలి. కనుక మధుబన్, మౌంట్ అబూ హాస్పిటల్ అందరికీ మరియు చుట్టుపక్కల వారికి కూడా ఒక ఆసరాగా అనుభవమవుతుంది - ఆసరా లభించాలంటే ఇక్కడే లభిస్తుంది అని. తనువు మరియు మనసు రెండింటికీ. కనుక మధుబన్ హాస్పిటల్ కూడా అనేక ఆత్మల తనువు మరియు మనసుకు ఆసరాగా ఉంది మరియు అవుతూనే ఉంటుంది. అందుకే సేవకు అభినందనలు. కానీ ఇంకా అభినందనలు తీసుకోవడానికి ప్లాన్లు తయారుచేస్తూ ఉండండి. అర్థమైందా? అచ్ఛా, ఎవరైతే ఉన్నారో - తలహటి వారు, మ్యూజియం వారు, ఆబూ నివాసులు, పీస్ పార్క్ వారు, సంగమ్ భవన్ వారు, ఇలా ఇంకా కూడా ఉన్నారు. చూడండి, మధుబన్కు ఎన్ని భుజాలు ఉన్నాయి? ఇప్పుడు ఏడు భుజాలు ఉన్నాయి, ఈ జ్ఞాన సరోవర్ ఎనిమిదవ భుజం. కనుక మధుబన్ అష్టభుజధారి అయిపోయింది. కనుక అష్ట భుజాలకు విశేషమైన ప్రియస్మృతులు.
భారత్ అయితే ఉంది, ఇప్పుడు భారత్ మేళా జరగాలి. బాప్‌దాదాకు భారత్‌యే నచ్చింది, లండన్ రిట్రీట్ హౌస్ కాదు. ఎప్పుడు రెస్ట్ చేస్తారో అప్పుడు పరంధామంలోని రిట్రీట్ హౌస్‌కు వెళ్తారు. కనుక భారతవాసుల పట్ల విశేషంగా బాబాకు ప్రేమ ఉంది మరియు భారతవాసులకు కూడా విశేషమైన గర్వం, నషా ఉంది - స్వర్గం కూడా విశేషంగా భారత్‌యే అవుతుంది మరియు తయారుచేసే బాబా కూడా భారత్‌లోనే వస్తారు. మరియు స్టోరీ కూడా విశేషంగా ఆది నుండి అంతం వరకు భారత్‌దే. కనుక భారత్ అవినాశీ ఖండం. అందుకే భారతవాసులు అందరికంటే నంబర్‌వన్ అఖండ, అచల, అడోల స్థితి కలవారిగా అవ్వాల్సిందే. అచ్ఛా.
(టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతోంది) ప్రోగ్రామ్ బాగా జరిగిందా? ప్రోగ్రామ్ అయితే బాగుంది, మరి ప్రోగ్రెస్ ఎలా ఉంది? ఎందుకంటే టీచర్లు నిమిత్తంగా ఉన్నారు. నిమిత్త టీచర్లు సదా శక్తిశాలిగా ఉంటే, వచ్చేవారు కూడా సహజంగా శక్తిశాలిగా అవుతారు. టీచర్లు గందరగోళంలోకి వస్తే, ఎవరైనా చూసినా, చూడకపోయినా, విన్నా, వినకపోయినా, టీచర్ల వైబ్రేషన్ ఆటోమేటిక్‌గా వెళ్తుంది. మీరు చూస్తారు - టీచర్ ఎలా ఉంటే ఆ విశేషత స్టూడెంట్స్‌లో కూడా ఉంటుంది. ఎవరైనా రమణీకమైన టీచర్ అయితే స్టూడెంట్స్ కూడా రమణీకంగా ఉంటారు, టీచర్ అఫీషియల్‌గా ఉంటే స్టూడెంట్స్ కూడా అఫీషియల్‌గా ఉంటారు, యోగంలో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటే స్టూడెంట్స్ కూడా అలాగే ఉంటారు, కల్చరల్ ప్రోగ్రామ్ చేసేవారైతే స్టూడెంట్స్ కూడా అలాగే ఉంటారు. కనుక టీచర్లు విశేషమైన ఆధారం. కనుక టీచర్ల ఫీచర్స్ పని చేస్తాయి. మాట్లాడినా, మాట్లాడకపోయినా, వారి ఫీచర్స్ మాట్లాడతాయి, దాచలేరు. కనుక టీచర్లు మనం ఫౌండేషన్, నిమిత్తం అని అర్థం చేసుకోవాలి. ఫౌండేషన్ అయితే బాప్దాదాయే, కానీ సేవకు నిమిత్తంగా ఉన్నారు. కనుక నిమిత్త భావం, చేసేవారు చేయించేవారు స్మృతి - ఇవి టీచర్లను సదా సహజంగా ముందుకు తీసుకువెళ్తాయి. కనుక టీచర్లు అంటే కేవలం నోటితో సేవ చేసేవారు కాదు, టీచర్లు అంటే తమ ఫీచర్స్ ద్వారా కూడా సేవ చేసేవారు. ఇటువంటి దివ్యమైన ఫీచర్స్, చిరునవ్వుతో కూడిన ఫీచర్స్, అచల-నిశ్చలమైన ఫీచర్స్ సేవ చేస్తాయి. కనుక కేవలం ఇది చూడకండి - కోర్స్ బాగా చేయించాను, వారం రోజుల కోర్స్ కూడా చేయించాను, పాజిటివ్ది కూడా చేయించాను, ఇంకా అన్ని పాఠాలు చదివించాను అని; కానీ ఫీచర్స్ ద్వారా సేవ చేసారా? ఫీచర్స్ ద్వారా సేవ అంటే ప్రాక్టికల్ లైఫ్‌లో బలం ఇవ్వడం. కనుక ప్రాక్టికల్ లైఫ్‌కు బలం ఇచ్చారా లేక కేవలం పాఠం చదివించారా? కనుక డబల్ సేవాధారిగా అవ్వడం అంటే నంబర్‌వన్ టీచర్‌గా అవ్వడం.
అచ్ఛా, ఎవరెవరు ఎక్కడి నుండి వచ్చారో, అందరికీ వచ్చినందుకు చాలా-చాలా అభినందనలు మరియు ప్రియస్మృతులు. ఎందుకంటే ఈ సంవత్సరం డబల్ విదేశీయుల సీజన్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్ అని అందరికీ తెలుసు. కనుక అందరూ తమ లెటర్లు మరియు కార్డులు కూడా పంపించారు. బాప్‌దాదా వద్ద అక్కడ లైన్ పెట్టి ఉంది, వచ్చి చూడండి. కనుక ఎవరైతే కార్డులు లేదా ప్రియస్మృతులు పంపుతారో, తమ స్థితి గురించి సమాచారాన్ని ఇస్తారో, చెప్పాము కదా - డబల్ విదేశీయులు దాచరు. చిన్న విషయం అయినా సత్యంగా చెప్పేస్తారు, దాచరు. కనుక సత్యమైన హృదయం వారి విశేషత. అందుకే లెటర్స్‌లో కూడా చాలా సమాచారాన్ని ఇస్తారు. సేవ గురించి కూడా ఇస్తారు, స్థితి గురించి కూడా ఇస్తారు, సంతోషం గురించి కూడా ఇస్తారు మరియు గ్రీటింగ్ కార్డులు కూడా చాలా పంపిస్తారు. బాప్‌దాదా వద్ద అందరి గ్రీటింగ్స్ విశాలమైన హృదయంలో ఇమిడిపోతాయి. ఎవరైతే తమ విశేషమైన పేరుతో కార్డ్ పంపించారో లేదా లెటర్ పంపించారో లేదా సందేశం పంపించారో, వచ్చేవారు కూడా సందేశం తీసుకువస్తారు - మా క్లాస్ వారు చాలా-చాలా ప్రియస్మృతులు ఇచ్చారు అని. కనుక ఎవరైతే సందేశం పంపించారో వారందరికీ బాప్‌దాదా రాబోయే డైమండ్ జూబిలీ సందర్భంగా విశేషమైన డైమండ్గా అవ్వడానికి అడ్వాన్స్ అభినందనలు ఇస్తున్నారు.
నలువైపులా కల ఆత్మిక సత్యమైన డైమండ్ ఆత్మలకు, సదా ఎకానమీ అవతారాలైన విశేష ఆత్మలకు, సదా ఏకనామీ, ఏకాంతప్రియ విశేష ఆత్మలకు, తమ వైబ్రేషన్, వృత్తి యొక్క మెరుపు ద్వారా విశ్వంలో ప్రకాశాన్ని వ్యాపింపజేసే మెరుస్తున్న ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- అన్ని కార్యాలు సఫలమయ్యే ఉన్నాయి. సఫలతా స్వరూప ఆత్మలైన మీరు నిమిత్తులు. నిమిత్త ఆత్మలైన మీరందరూ ఏ సితారలు? సఫలతా సితారలు కదా! ఈ సంగఠన అంతా సఫలతా సితారలే. ఈ పూర్తి సంగఠన బ్రాహ్మణ పరివారపు తారా మండలంలో సఫలతా సితారలుగా మెరుస్తున్నారు.
(బాప్‌దాదా దాదీజీని తమ దగ్గర కూర్చోబెట్టుకున్నారు) అందరూ మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. మధురమైన ఈర్ష్య అయితే కలగడం లేదు కదా, మేము కూడా కూర్చోవాలి అని! ప్రేమ ఉంది, ఈర్ష్య లేదు. ప్రేమ బాగుంటుంది కదా! ఎందుకంటే మీ అందరి ముందు సాకారంలో శాంపిల్ అయితే వీరే కదా, కనుక శాంపిల్‌ను చూసి బేరము చేయడం సహజమవుతుంది. బాప్‌దాదా వీరు 10-12 మంది కూర్చున్నారు అని భావించరు, బాప్‌దాదా అందరితో పాటు ఉన్నారు. నిమిత్తంగా వీరు ఉన్నారు కానీ మీరందరూ తోడుగా ఉన్నారు. తోడుగా ఉండే వాగ్దానం అంతం వరకు ఉంది మరియు తోడుగానే వెళ్తారు. కింద కూర్చున్నా లేదా పైన కూర్చున్నా, ఇంకా ఎదురుగానే కూర్చున్నారు. బాగుంది, డబల్ విదేశీయులు కూడా డబల్ విదేశీయుల సేవ బాగా చేసారు. ఎవరైతే నిమిత్తంగా అయ్యారో వారు మంచి సేవ చేసారు. మరి ఎవరూ ఎప్పుడూ ఏడవకుండా అలా తయారుచేసారా? మనసులో కూడా ఏడవరా! లేక దాక్కొని బాత్రూమ్లో ఏడ్చి వస్తారా? ఏడవడం ఆగిపోయింది కదా! పరీక్ష వచ్చినప్పుడు చూడండి, కొద్దిగా ముఖం మారుతుంది. అయినా చాలా మంచివారు. కొద్దికొద్దిగా ఏడుస్తారు, ఆట చూపిస్తారు, అయినా మంచివారు. బాబాను గుర్తించారు - ఇది చిన్న అద్భుతమేమీ కాదు! డైమండ్ అయితే ఉన్నారు, ఇంకా ఏ కొరత ఉన్నా దానిని సంపన్నం చేసుకోవాలి. డైమండ్ జూబిలీ జరుపుకోవడం అంటే కేవలం ప్రోగ్రామ్స్ చేయడం కాదు. డైమండ్గా అయ్యి, డైమండ్గా అయ్యే మెసేజ్ ఇవ్వాలి. తమ ప్రత్యక్ష ఋజువుతో సేవ చేయడం - ఇదే డైమండ్ జూబిలీ. లేకపోతే ఇతరులను డైమండ్గా తయారుచేసి, స్వయం నంబర్‌వన్ డైమండ్గా లేకపోతే చూసేవారు ఏమంటారు? అచ్ఛా.
విదేశాల ముఖ్య టీచర్లు బాప్‌దాదా ముందుకు వచ్చినప్పుడు బాప్‌దాదా అందరినీ అడిగారు:-
ఇండియన్స్‌నే పిలుస్తారు అని అయితే ఆలోచించడం లేదు కదా. ఇండియన్ అక్కయ్యలనే ఎందుకు ముందుంచారు అని ఎప్పుడైనా ఆలోచిస్తారా? సంకల్పం వస్తుందా? రాదా? కొద్దికొద్దిగా! చూడండి, మీ పాలన కోసం భారత్ నుండే పంపించవలసి వచ్చింది కదా. భారత్ నుండి వారు వచ్చినప్పుడు మీరు ముందుకు వచ్చారు. అలాగే విదేశాల నుండి కూడా ఎవరైతే విశేష టీచర్లు తయారయ్యారో వారు కూడా చాలా మంచిగా తయారయ్యారు మరియు మంచి సేవ చేస్తున్నారు. స్టేజ్‌పై ఉన్నవారే బాప్‌దాదా ముందు ఉన్నారని కాదు. కింద కూర్చున్నా లేదా తమ స్థానంలో కూర్చున్నా, బాప్‌దాదాతో పాటు ఉన్నారు. వీరి సహచరులు మీరందరూ. మీరు మీ భాష ద్వారా సేవ చేయకపోతే వృద్ధి కూడా జరిగేది కాదు. ఇన్ని సెంటర్లను తెరవడం సాధ్యమయ్యేది కాదు. వీరు కొద్దిమంది మాత్రమే. ఇన్ని సేవాకేంద్రాలు ఎవరు తెరిచారు? మీరే నిమిత్తంగా అయ్యి తెరిచారు కదా. అందుకే నిమిత్తంగా కొద్దిమంది మాత్రమే కూర్చోగలరు కనుక శాంపిల్‌గా కొద్దిమందిని కూర్చోబెడతాము, కానీ మీరందరూ అలాగే ఉన్నారు. అర్థమైందా! ఏ వైపున ఇండియన్ సిస్టర్ లేకపోయినా, ఇండియన్ సిస్టర్ను ఇవ్వండి అని అడుగుతున్నారని బాప్‌దాదా చూసారు. అచ్ఛా, అందరూ మంచి సేవ చేసారు, అందుకు అభినందనలు. బాగా సంభాళిస్తున్నారు. అందుకే ఇప్పుడు కేసెస్ తక్కువగా ఉన్నాయి. ముందు ఉండేవి. ఇప్పుడు సంభాళించుకున్నారు మరియు ఇతరులను కూడా సంభాళిస్తున్నారు. రెండు విషయాలూ ఉన్నాయి. విదేశాల సేవాధారులది కూడా చాలా మంచి మాల ఉంది. దాదీలలో ఎలా ప్రేమ ఉందో, నిమిత్తంగా అయ్యే ఆత్మలలో కూడా ప్రేమ ఉంది. అచ్ఛా, అందరూ సంతోషంగా ఉన్నారు కదా? కనుక బాప్‌దాదా కూడా పిల్లలందరి కోసం ఈ గీతాన్ని పాడుతున్నారు - వాహ్ పిల్లలూ వాహ్! అచ్ఛా!
*** ఓంశాంతి ***
