‘‘చేసేవారు మరియు చేయించేవారి స్మృతి ద్వారా కర్మాతీత స్థితి యొక్క అనుభవము’’
ఈరోజు కళ్యాణకారీ తండ్రి తమ సహచరులైన కళ్యాణకారీ పిల్లలను చూస్తున్నారు. పిల్లలందరూ చాలా లగనముతో, ప్రేమతో విశ్వ కళ్యాణ కార్యము చెయ్యటంలో నిమగ్నమై ఉన్నారు. ఇటువంటి సహచరులను చూసి బాప్‌దాదా సదా - వాహ్, సహచరులైన పిల్లలూ, వాహ్! అన్న పాటను పాడుతూ ఉంటారు. మీరందరూ కూడా వాహ్-వాహ్ అన్న పాటను పాడుతూ ఉంటారు కదా? ఈరోజు బాప్‌దాదా నలువైపులా ఉన్న సేవ యొక్క గతిని చూసారు. దానితో పాటు స్వ పురుషార్థము యొక్క గతిని కూడా చూసారు. మరి సేవ మరియు స్వ పురుషార్థము, ఈ రెండింటి గతిలో ఏం చూసుంటారు? మీకు తెలుసా? సేవా గతి తీవ్రంగా ఉందా లేక స్వ పురుషార్థపు గతి తీవ్రంగా ఉందా? ఏమంటారు? రెండింటిలో బ్యాలెన్స్ ఉందా? లేదా? మరి ఆత్మలకు మరియు ప్రకృతికి విశ్వ పరివర్తన అనే బ్లెస్సింగ్ (దీవెన) ఎప్పుడు లభిస్తుంది? ఎందుకంటే బ్యాలెన్స్ ఉన్నట్లయితే మీ అందరికీ ఏ ఆశీర్వాదమైతే లభించిందో, అది ఇతరులకు లభిస్తుంది. మరి తేడా ఎందుకు ఉంది? మీరు ఏమని చెప్పుకుంటారు - కర్మయోగి అనా లేక కేవలము యోగి అనా? కర్మయోగులు కదా! పక్కానే కదా? మరి సేవ కూడా కర్మయే కదా! కర్మలోకి వస్తారు, మాట్లాడుతారు లేక దృష్టిని ఇస్తారు, కోర్స్ చేయిస్తారు, మ్యూజియంను అర్థం చేయిస్తారు - ఇవన్నీ శ్రేష్ఠ కర్మలు అనగా సేవ. కనుక కర్మయోగి అనగా కర్మ చేసే సమయములో కూడా యోగము యొక్క బ్యాలెన్స్ ఉండాలి. కానీ మాకు బ్యాలెన్స్ తక్కువైపోతుంది అని మీరు స్వయమే అంటున్నారు. దీనికి కారణము ఏమిటి? అది మీకు బాగా తెలుసు కూడా, కొత్త విషయమేమీ కాదు. చాలా పాత విషయము. బాప్‌దాదా చూసారు - సేవ అనగా కర్మ మరియు స్వ పురుషార్థము అనగా యోగయుక్తము, రెండింటి మధ్యన బ్యాలెన్స్ ఉంచేందుకు విశేషంగా ఒకటే పదాన్ని గుర్తుంచుకోండి, అది ఏమిటి? తండ్రి ‘చేయించేవారు’ మరియు ఆత్మనైన నేను, (నేను ఫలానా అని కాదు) ఆత్మనైన నేను ‘చేసేవాడిని’. కావున ‘చేసేవారు, చేయించేవారు’, ఈ ఒక్క మాట మీ బ్యాలెన్సును చాలా సహజతరం చేస్తుంది. స్వ పురుషార్థము యొక్క బ్యాలెన్స్ లేక గతి ఎప్పుడైనా తక్కువైతే, దానికి కారణమేమిటి? ‘చేసేవాడిని’ అన్నదానికి బదులుగా నేనే చేసేవాడిని, చేసేవాడిని అన్నదానికి బదులుగా స్వయాన్ని చేయించేవాని గా భావిస్తారు. నేను చేస్తున్నాను అని భావిస్తారు. ఎవరికి, ఏ విధమైన మాయ వచ్చినా కూడా దాని గేట్ ఏమిటి? మాయ యొక్క అన్నింటికంటే మంచి సహజమైన గేట్ గురించి మీకు తెలుసు కూడా - ‘నేను’. ఈ గేట్‌ను ఇప్పుడింకా పూర్తిగా మూయలేదు. ఎలా మూస్తారంటే, మాయ దానిని సహజంగానే తెరుచుకుని వచ్చేస్తుంది. ఒకవేళ ‘చేసేవాడిని’ అని అనుకుంటే ‘చేయించేవారు’ తప్పకుండా గుర్తుకొస్తారు. ‘చేస్తున్నాను’ కానీ చేయించేవారు తండ్రి. ‘చేయించేవారు’ లేకుండా ‘చేసేవారిగా’ అవ్వలేరు. ‘చేయించేవారి’ స్మృతి రెండు రూపాలలో ఉండాలి. ఒకటేమో - తండ్రి ‘చేయించేవారు’ మరియు ఇంకొకటి - ఆత్మనైన నేను కూడా ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించేవాడిని. దీని వలన ఏమి జరుగుతుందంటే - కర్మలు చేస్తూ కూడా కర్మల యొక్క మంచి లేక చెడు ప్రభావములోకి రారు. దీనినే - కర్మాతీత అవస్థ అని అంటాము.
మీ అందరి లక్ష్యం ఏమిటి? కర్మాతీతులుగా అవ్వాలి కదా! లేక కొద్ది-కొద్దిగా కర్మ బంధనము ఉన్నా ఫర్వాలేదా? ఉండాలా లేక ఉండకూడదా? కర్మాతీతులుగా అవ్వాలా? తండ్రిపై ప్రేమకు గుర్తు - కర్మాతీతులుగా అవ్వటము. కనుక ‘చేయించేవారిగా’ అయ్యి కర్మలు చేయండి, చేయించండి. కర్మేంద్రియాలు మీ చేత చేయించకూడదు కానీ మీరు కర్మేంద్రియాలతో చేయించండి. స్వయాన్ని పూర్తిగా అతీతముగా భావిస్తూ కర్మలు చేయించాలి - ఈ అవగాహన ఇమర్జ్ రూపంలో ఉండాలి, మర్జ్ రూపములో కాదు. మర్జ్ రూపంలో అప్పుడప్పుడు ‘చేయించేవారు’ అన్నదానికి బదులుగా కర్మేంద్రియాలకు అనగా మనస్సు, బుద్ధి, సంస్కారాలకు వశం అయిపోతారు. కారణమేమిటి? ‘చేయించే’ ఆత్మను, యజమానిని, విశేష ఆత్మను, మాస్టర్ సర్వశక్తిమాన్ ఆత్మను - ఈ స్మృతి యజమానత్వపు స్మృతిని కలిగిస్తుంది. లేదంటే ఒక్కోసారి మనసు మిమ్మల్ని నడిపిస్తుంది మరియు ఒక్కోసారి మీరు మనసును నడిపిస్తారు, అందుకే సదా, సహజంగా మన్మనాభవ స్థితి ఉండదు. నేను పూర్తిగా వేరు, కేవలం వేరు అనే కాదు కానీ యజమానిని కూడా, తండ్రిని స్మృతి చేసినప్పుడు నేను బాలకుడిని మరియు ఆత్మనైన నేను చేయించేవాడిని అన్నప్పుడు యజమానిని. ఇప్పుడు ఈ అభ్యాసము పట్ల అటెన్షన్ తక్కువ ఉంది. సేవలో చాలా బాగా నిమగ్నమై ఉన్నారు కానీ లక్ష్యము ఏమిటి? సేవాధారులుగా అవ్వడమా లేక కర్మాతీతులుగా అవ్వడమా? లేకపోతే రెండూ ఒకేసారి అవుతారా? ఈ అభ్యాసము పక్కాగా ఉందా? ఇప్పుడిప్పుడే కొద్ది సమయము కొరకు ఈ అభ్యాసము చేయగలరా? వేరు అవ్వగలరా? లేదంటే ఎంతగా అటాచ్ అయిపోయారంటే డిటాచ్ అవ్వడానికి సమయము కావాలా? ఎంత సమయంలో వేరు అవ్వగలరు? 5 నిమిషాలు కావాలా, ఒక్క నిమిషము కావాలా లేక ఒక్క సెకండు కావాలా? ఒక్క సెకెండులో అవ్వగలరా?
పాండవులు ఒక్క సెకెండులో పూర్తిగా వేరు అవ్వగలరా? యజమాని అయిన ఆత్మ వేరు మరియు కర్మచారులైన కర్మేంద్రియాలు వేరు, ఈ అభ్యాసము ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయగలగాలి. అచ్ఛా, ఇప్పుడిప్పుడే ఒక్క సెకెండులో అతీతముగా మరియు తండ్రికి ప్రియముగా అవ్వండి. శక్తిశాలి అభ్యాసము చేయండి - నేను ఉండడమే అతీతముగా ఉన్నాను, ఈ కర్మేంద్రియాలు నా సహచరులు, కర్మలలో సహచరులు కానీ నేను అతీతంగా మరియు ప్రియంగా ఉన్నాను. ఇప్పుడు ఒక్క క్షణంలో ఈ అభ్యాసాన్ని మళ్ళీ-మళ్ళీ చెయ్యండి. (డ్రిల్) సహజమనిపిస్తుందా లేక కష్టమనిపిస్తుందా? సహజమనిపిస్తే మొత్తము రోజంతటిలో కర్మలు చేసే సమయంలో ఈ స్మృతిని ఇమర్జ్ చేయండి, అప్పుడు కర్మాతీత స్థితి యొక్క అనుభవాన్ని సహజంగా చేస్తారు ఎందుకంటే సేవనైనా లేక కర్మనైనా వదలగలరా? వదిలేస్తారా? చేయాల్సిందే. తపస్యలో కూర్చోవటము, ఇది కూడా కర్మయే. కనుక కర్మ లేకుండా లేక సేవ లేకుండా ఉండలేరు మరియు అలా ఉండకూడదు కూడా ఎందుకంటే సమయము తక్కువ ఉంది కానీ సేవ ఇప్పటికీ ఇంకా ఎంతో ఉంది. సేవ యొక్క రూపురేఖలు మారాయి. కానీ ఇప్పటికీ అనేకమంది ఆత్మల ఫిర్యాదు మిగిలిపోయి ఉంది, అందుకే సేవ మరియు స్వ పురుషార్థము, ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ పెట్టండి. అంతేకానీ సేవలో చాలా బిజీగా ఉన్నాము కావున స్వ పురుషార్థము తక్కువైపోయింది అన్నట్లు ఉండకూడదు. అలా కాదు. సేవలో స్వ పురుషార్థము పట్ల అటెన్షన్ ఇంకా ఎక్కువ ఉండాలి ఎందుకంటే సేవలో మాయ వచ్చేందుకు చాలా రకాలుగా అవకాశం ఉంటుంది. పేరేమో సేవ, కానీ ఉండేది స్వార్థము. స్వయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి కానీ అలా వెళ్తూ ఉండగా బ్యాలెన్సును మర్చిపోకూడదు ఎందుకంటే సేవలోనే స్వభావ-సంబంధాల విస్తారము ఉంటుంది మరియు మాయ కూడా అవకాశాన్ని తీసుకుంటుంది. కొద్దిగా బ్యాలెన్స్ తక్కువైనా సరే, మాయ కొత్త-కొత్త రూపాలను ధరిస్తుంది, పాత రూపములో రాదు. కొత్త-కొత్త రూపాలలో, కొత్త-కొత్త పరిస్థితుల రూపంలో, సంపర్కాల రూపంలో వస్తుంది. ఒకవేళ సేవను విడిచిపెట్టి ప్రత్యేకంగా బాప్‌దాదా కూర్చోబెడితే, 1 నెల కూర్చోబెడితే, 15 రోజులు కూర్చోబెడితే కర్మాతీతులుగా అయిపోతారా? ఒక నెల ఇస్తే, ఇంక అసలు ఏమీ చేయకండి, కూర్చునే ఉండండి, తపస్య చేయండి, భోజనాన్ని కూడా ఒకేసారి తయారుచేసుకోండి, అంతే, అప్పుడు కర్మాతీతులుగా అయిపోతారా? అవ్వరా?
ఒకవేళ బ్యాలెన్స్ యొక్క అభ్యాసము లేకపోతే ఎంత కూర్చున్నా సరే, ఒక నెల ఏమిటి, రెండు నెలలు కూర్చున్నా సరే మనసు కూర్చోదు, తనువు కూర్చుంటుంది. కానీ కూర్చోబెట్టాల్సింది మనసును, కేవలము తనువును మాత్రమే కాదు. తనువుతోపాటు మనసును కూడా కూర్చోబెట్టాలి, కేవలం బాబా మరియు నేను, ఇంకెవ్వరూ లేరు అన్నట్లు కూర్చుండిపోవాలి. మరి ఒక నెల ఇలాంటి తపస్య చేయగలరా లేక సేవ గుర్తుకొస్తుందా? బాప్‌దాదా మరియు డ్రామా చూపిస్తూ ఉంటారు - రోజురోజుకూ సేవ పెరిగేదే ఉంది, కావున ఎలా కూర్చుండిపోతారు? సంవత్సరం క్రితం మీరు చేసిన సేవను మరియు ఈ సంవత్సరం చేసిన సేవను చూస్తే, పెరిగిందా లేక తగ్గిందా? పెరిగింది కదా! కోరుకోకపోయినా కూడా సేవా బంధనములో బంధింపబడి ఉన్నారు కానీ బ్యాలెన్సుతో సేవ బంధనము అనేది బంధనముగా ఉండదు, సంబంధము అవుతుంది. ఏ విధంగా లౌకిక సంబంధాలలో, ఒకటేమో కర్మ బంధనము మరియు ఇంకొకటి సేవా సంబంధము అని భావిస్తారు. బ్యాలెన్సు ఉన్నట్లయితే బంధనములా అనుభవమవ్వదు, సేవ యొక్క మధురమైన సంబంధము అని అనిపిస్తుంది. మరి ఏ అటెన్షన్ పెడతారు? సేవ మరియు స్వ పురుషార్థము యొక్క బ్యాలెన్సు. సేవ యొక్క అతి లోకి వెళ్ళకండి. నేనే చెయ్యాలి, నేనే చెయ్యగలను, ఇలా అనుకోకండి. చేయించేవారు చేయిస్తున్నారు, నేను నిమిత్తముగా ‘చేసేవాడిని’. ఇలా అనుకుంటే బాధ్యత ఉన్నా కూడా అలసట తగ్గుతుంది. చాలామంది పిల్లలు ఏమంటారంటే - చాలా సేవ చేసాము కదా, అందుకే అలసిపోయాము, తల భారమైపోయింది. సేవ వలన తల భారమవ్వదు, అంతేకాక ‘చేయించేవారైన తండ్రి’ చాలా బాగా మసాజ్ చేస్తారు. కావున తల మరింత తాజాగా అవుతుంది. అలసట ఉండదు, ఎక్స్ట్రా శక్తి వస్తుంది. సైన్స్ మందుల ద్వారా శరీరానికి శక్తి వస్తుంది అన్నప్పుడు, మరి తండ్రి స్మృతి ద్వారా ఆత్మలో శక్తి రాదా? ఆత్మలో శక్తి వచ్చినప్పుడు శరీరముపై ఆ ప్రభావము ఆటోమేటిక్‌గా పడుతుంది. అనుభవజ్ఞులు కూడా, అప్పుడప్పుడు అనుభవమవుతుంది కదా. మళ్ళీ నడుస్తూ-నడుస్తూ ఉండగా లైన్ మారిపోతుంది అప్పుడు తెలియదు కూడా. మళ్ళీ ఎప్పుడైనా ఉదాసీనత, అలసట కలిగినప్పుడు లేక తల భారమైనప్పుడు - ఏమైంది? ఎందుకైంది? అన్న తెలివి వస్తుంది. మరి కేవలము ‘చేసేవారు’ మరియు ‘చేయించేవారు’ అన్న ఒక్క మాటను గుర్తు చేసుకోండి, ఇది కష్టమా లేక సహజమా? హాజీ అని చెప్పండి. అచ్ఛా.
ఇప్పుడు 9 లక్షలమంది ప్రజలను తయారుచేసారా? విదేశాలలో ఎంతమంది తయారయ్యారు? 9 లక్షలమంది తయారయ్యారా? భారత్‌లో తయారయ్యారా? తయారవ్వలేదు. కనుక మీరే సమాప్తి అనే గడియారంలోని ముల్లును ముందుకు కదలనివ్వటం లేదు. బ్యాలెన్సు ఉంచండి, డైమండ్ జూబిలీ కదా, కనుక బాగా సేవ చెయ్యండి కానీ బ్యాలెన్సు ఉంచి సేవ చేసినట్లయితే ప్రజలు త్వరగా తయారవుతారు. సమయము పట్టదు. ప్రకృతి కూడా చాలా అలసిపోయింది, ఆత్మలు కూడా నిరాశాపరులుగా అయిపోయారు. నిరాశాపరులుగా అయినప్పుడు ఎవరిని గుర్తు చేస్తారు? భగవంతుడిని, తండ్రిని గుర్తు చేస్తారు, కానీ వారి పూర్తి పరిచయము లేని కారణంగా దేవీ-దేవతలైన మిమ్మల్ని ఎక్కువ గుర్తు చేస్తారు. మరి నిరాశలో ఉన్న ఆత్మల పిలుపు మీకు వినపడటం లేదా? వినిపిస్తుందా లేక మీ ఆనందములోనే మీరు ఉండిపోయారా? దయార్ద్ర హృదయులు కదా! తండ్రిని కూడా ఏమంటారు? దయార్ద్ర హృదయుడు. అన్ని ధర్మాలవారు దయను తప్పకుండా కోరుకుంటారు, సుఖాన్ని కోరుకోరు కానీ దయ అయితే అందరికీ కావాలి. మరి దానిని ఇచ్చేవారు ఎవరు? మీరు ఇచ్చేవారే కదా? లేక తీసుకునేవారా? తీసుకుని ఇచ్చేవారు. దాత పిల్లలు కదా! కావున మీ సోదరీ-సోదరుల పట్ల దయార్ద్ర హృదయులుగా అవ్వండి మరియు దయార్ద్ర హృదయులై సేవ చేస్తే అందులో నిమిత్త భావము స్వతహాగానే ఉంటుంది. ఎవరి పట్లనైనా, వారు ఎంత చెడ్డవారైనా కానీ ఒకవేళ మీకు ఆ ఆత్మ పట్ల దయ ఉన్నట్లయితే మీకు వారి పట్ల ఎప్పుడూ కూడా ద్వేషము, ఈర్ష్య లేక క్రోధము యొక్క భావన రాదు. దయా భావన సహజంగా నిమిత్త భావాన్ని ఇమర్జ్ చేస్తుంది. ఏదో ఉద్దేశ్యపూరితమైన దయ కాదు, సత్యమైన దయ ఉండాలి. ఉద్దేశ్యపూరితమైన దయ కూడా ఉంటుంది, ఎవరైనా ఒక ఆత్మ పట్ల లోపల మోహము ఉంటుంది కానీ వారిపై దయ కలుగుతుంది అనుకుంటారు, అది ఉద్దేశ్యపూరితమైన దయ. అది సత్యమైన దయ కాదు, సత్యమైన దయలో ఎటువంటి మోహము ఉండదు, ఎటువంటి దేహభానము ఉండదు, ఆత్మ ఆత్మపై దయ చూపిస్తుంది. దేహాభిమానము లేక దేహానికి సంబంధించిన ఎటువంటి ఆకర్షణ యొక్క నామ-రూపాలు కూడా ఉండవు. కొందరి మోహము శరీరముతో ఉంటుంది మరియు కొందరి మోహము గుణాలు, విశేషతలు పట్ల కూడా ఉంటుంది. కానీ విశేషతలను మరియు గుణాలను ఇచ్చేవారు ఎవరు? ఆత్మ ఎంత గొప్పదైనా కానీ వారు తండ్రి నుండి తీసుకునేవారు. అవి తమవి కావు, వాటిని తండ్రి ఇచ్చారు. కావున డైరెక్టుగా దాత నుండి ఎందుకు తీసుకోకూడదు. అందుకే స్వార్థముతో కూడిన దయ ఉండకూడదు అని చెప్పారు. కొంతమంది పిల్లలు కాస్త చంచలత్వం చేస్తారు, ఉండేది స్వార్థము కానీ నాకు దయ కలుగుతుంది అని చెప్తారు. వేరే ఏమీ లేదు, కేవలము దయ కలుగుతుంది అని అంటారు. కానీ చెక్ చేసుకోండి - నిస్వార్థ దయ ఉందా? మోహము నుండి ముక్తిగా ఉన్న దయ ఉందా? ఏదైనా అల్పకాలిక ప్రాప్తి కారణంగానైతే దయ ఉండటం లేదు కదా? ఇంకా ఏమంటారంటే - ఆమె చాలా మంచివారు కదా, అతను చాలా మంచివారు కదా, అందుకే కాస్త... కాస్త అన్నదానికి అనుమతి లేదు. ఒకవేళ కర్మాతీతులుగా అవ్వాలనుకుంటే ఇవన్నీ ఆటంకాలుగా అవుతాయి, ఇవి దేహాభిమానములోకి తీసుకొస్తాయి. మంచివారే, కానీ అలా తయారు చేసేవారు ఎవరు? మంచిని ధారణ చెయ్యండి కానీ మంచికి ప్రభావితులవ్వకండి. అతీతమైనవారు మరియు తండ్రికి ప్రియమైనవారు. ఎవరైతే తండ్రికి ప్రియమైనవారో, వారు సదా సురక్షితులుగా ఉంటారు. అర్థమైందా!
ఒకవేళ సేవను పెంచుతున్నారంటే మరియు పెంచాల్సిందే కూడా, కావున స్థాపనను కూడా సమీపంగా తీసుకురావాలా, వద్దా? ఎవరు తీసుకువస్తారు? తండ్రి తీసుకువస్తారా? అందరూ తీసుకువస్తారు. సహచరులు కదా! సహచరులైన పిల్లలైన మీరు లేకుండా తండ్రి కూడా ఒంటరిగా ఏమీ చెయ్యలేరు. చూడండి, తండ్రికి ఒకవేళ అర్థం చేయించాల్సి ఉన్నా కూడా శరీరాన్ని ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది. శరీరాన్ని ఆధారంగా తీసుకోకుండా మాట్లాడగలరా? పాత బండి అయినా లేక మంచిదైనా, ఆధారము అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆధారము లేకుండా చెయ్యలేరు. బ్రహ్మా బాబా యొక్క ఆధారాన్ని తీసుకున్నారు కదా, అప్పుడే మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రహ్మాకుమారులు అని అంటారు, శివకుమారులు అని అనరు ఎందుకంటే నిరాకార తండ్రి కూడా సాకారాన్ని ఆధారముగా తీసుకోవాల్సిందే. ఏ విధంగా సాకార బ్రహ్మాను ఆధారముగా తీసుకున్నారు, ఇప్పుడు కూడా బ్రహ్మా యొక్క అవ్యక్త ఫరిశ్తా రూపములో ఆధారము తీసుకోకుండా మీ పాలనను చెయ్యలేము. సాకారములో తీసుకున్నా, ఆకార రూపములో తీసుకున్నా కానీ ఆత్మ యొక్క ఆధారాన్ని, తోడును తప్పకుండా తీసుకోవాల్సే ఉంటుంది. ఆ మాటకొస్తే వారు ఆల్మైటీ అథారిటీయే (సర్వశక్తిమంతుడు), ఇంద్రజాలికుడు వినాశీ ఆటను క్షణములో చూపించగలిగినప్పుడు మరి ఆల్మైటీ అథారిటీ ఏది కావాలంటే అది చెయ్యలేరా? చెయ్యగలరా? ఇప్పుడిప్పుడే వినాశనాన్ని తీసుకురాగలరా? ఒంటరిగా తీసుకురాగలరా? ఒంటరిగా చెయ్యలేరు. వారు ఆల్మైటీ అథారిటీనే, కానీ సహచరులైన మీ సంబంధములో బంధింపబడి ఉన్నారు. కావున తండ్రికి మీపై ఎంత ప్రేమ ఉంది. చెయ్యాలనుకుంటే చెయ్యగలరు, కానీ చెయ్యరు. మ్యాజిక్ స్టిక్‌ను తిప్పలేరా? కానీ తండ్రి ఏమంటారంటే - రాజ్యాధికారులుగా ఎవరవుతారు? తండ్రి అవుతారా? మీరు అవుతారు. స్థాపన చేసేస్తారు, వినాశనము చేసేస్తారు, కానీ రాజ్యం ఎవరు చేస్తారు? మీరు లేకుండా పని అవుతుందా? అందుకే తండ్రి మిమ్మల్నందరినీ కర్మాతీతంగా చెయ్యాల్సిందే. తయారవ్వాల్సిందేనా లేక తండ్రి మిమ్మల్ని బలవంతంగా తయారుచెయ్యాలా? తండ్రి తయారుచెయ్యాల్సిందే మరియు మీరందరూ తయారవ్వాల్సిందే. ఇది మధురమైన డ్రామా. డ్రామా మంచిగా అనిపిస్తుంది కదా? లేక ఇలా తయారయ్యిందేమిటి అని అప్పుడప్పుడు విసుగు అనిపిస్తుందా? ఇది మారాలి అని అనుకుంటారా? తండ్రి కూడా అంటారు - ఇది తయారై తయారుచేయబడిన డ్రామా, ఇది మారదు. ఇది రిపీట్ అవుతుందే కానీ మారదు. డ్రామాలో మీ ఈ అంతిమ జన్మకు శక్తులు ఉన్నాయి. ఇది డ్రామాయే కానీ ఈ డ్రామాలో ఈ శ్రేష్ఠ బ్రాహ్మణ జన్మలో ఎన్నో శక్తులు లభించి ఉన్నాయి. తండ్రి విల్ చేసారు, అందుకే విల్ పవర్ ఉంది. కావున ఏ మాటను గుర్తు పెట్టుకుంటారు? ‘చేసేవారు-చేయించేవారు’. పక్కాయేనా లేక విమానంలో వెళ్తూ-వెళ్తూ మర్చిపోతారా? మర్చిపోకండి.
ఇప్పుడు మళ్ళీ స్వయాన్ని శరీర బంధనము నుండి అతీతంగా, కర్మాతీత స్థితిలో, కర్మలు చేయిస్తున్నాను కానీ అతీతముగా ఉన్నాను, చూస్తున్నాను, మాట్లాడుతున్నాను కానీ అతీతముగా ఉన్నాను, యజమాని మరియు తండ్రి ద్వారా నిమిత్తమైన ఆత్మను, ఈ స్మృతిలో మళ్ళీ మనసు-బుద్ధిని స్థితి చేయండి. (డ్రిల్) అచ్ఛా.
నలువైపులా ఉన్న సదా సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలలో ఉండే సేవాధారీ ఆత్మలకు, సదా స్వ పురుషార్థము మరియు సేవ, ఈ రెండింటి బ్యాలెన్సును ఉంచే ఆనంద స్వరూప ఆత్మలకు, సదా నిస్వార్థ దయార్ద్ర హృదయులై సర్వాత్మల పట్ల సత్యమైన దయను చూపించే విశేష ఆత్మలకు, సదా క్షణములో స్వయాన్ని కర్మ బంధనము నుండి మరియు అనేక రాయల్ బంధనాల నుండి విముక్తులుగా చేసే తీవ్ర పురుషార్థీ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
ఈరోజు ప్రత్యేకంగా ముఖ్యమైన మధుబన్ నివాసులు మరియు మధుబన్ భుజాలు ... ఎన్ని భుజాలు ఉన్నాయి? ఐదు. జ్ఞాన సరోవర్ వారు కావచ్చు, హాస్పిటల్ వారు కావచ్చు, మ్యూజియం వారు కావచ్చు, తల్హటి వారు కావచ్చు, సంగమవాసులు కావచ్చు, పీస్ పార్క్ వారు కావచ్చు, ప్రవృత్తిలో ఉంటూ నివృత్తి పాత్రను పోషిస్తున్నవారు కావచ్చు... ఇలా ఎవరెవరైతే ఉన్నారో, వారందరూ ఎంతో కాలంగా ఎంతో మంచి సేవను చేస్తున్నారు. అందరికీ సంతోషాన్ని ఇచ్చారు, దీవెనలను పొందారు. అందుకే అటువంటి సర్వ సేవాధారులందరికీ బాప్‌దాదా అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. మీరు డబల్ విదేశీయుల సేవ, అలాగే వచ్చే అతిథుల సేవ కూడా బాగా చేశారు కదా!
మధుబన్ వారు ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో వారు లేవండి. హాస్పిటల్ వారు లేవండి. చాలా మంచిది. మ్యూజియం వారు? తల్హటి శాంతివన్ వారు? సంగమ్వారు? జ్ఞాన సరోవర్ సేవాధారులు? పీస్ పార్క్ సేవాధారులు?
చూడండి, మీ దగ్గర అప్పుడప్పుడు పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి. కానీ మధుబన్‌లో మాత్రం ఎప్పుడూ పెద్ద కార్యక్రమాలే జరుగుతుంటాయి. చిన్న కార్యక్రమాలు కాదు, పెద్దవే జరుగుతుంటాయి. అందుకే మధుబన్ అంటే ఈ ఐదూ కలిసి ఉండాలి. హాస్పిటల్ లేకుండా కూడా పని జరగదు. జ్ఞాన సరోవర్ సేవాధారులు లేకుండా కూడా పని జరగదు. అలాగే పీస్ పార్క్... పేరుకు తగినట్లుగానే అనేక ఆత్మలకు శాంతి అనుభూతిని కలిగించేది. అందుకే పీస్ పార్క్ సేవాధారులు, పాండవ భవన్ సేవాధారులు... అందరూ చాలా అవసరం. ఇప్పుడు అందరి మనసులో ఏముంది? ఇప్పుడు ఏమి నిర్మించాలి? శాంతివన్లో మేళా జరగాలి. పేరు శాంతివన్, కనుక జరగాల్సింది మేళా... ఝమేళా కాదు, మేళా. ప్రపంచంలోని మేళాలు ఝమేళాలుగా ఉంటాయి, ఇక్కడ మాత్రం మిలనము యొక్క మేళా జరుగుతుంది. అయితే శాంతివన్‌ను సిద్ధం చేయడానికి మీ అందరికీ చాలా ఉత్సాహం ఉందా? లేక కష్టంగా అనిపిస్తుందా? ఇప్పుడు డైమండ్ జూబిలీని జరుపుకోవాలి కదా! అయితే ప్రారంభిద్దామా? (హా జీ) డబల్ పని చేయాల్సి ఉంటుంది. ఒకటి డైమండ్ జూబిలీ, రెండవది శాంతివన్ సిద్ధం చేయడం. బిందువు బిందువుతో చెరువు నిండిపోతుంది. చూడండి, ఇందులో ఆట ఏమిటంటే... ఒకటి బిందువు, రెండవది చుక్క. బాబా స్మృతిచిహ్నాలైన దేవాలయాలలో కూడా ఏమి చూపిస్తారు? చుక్కను కూడా చూపిస్తారు, బిందువును కూడా చూపిస్తారు. అలాగే మీ అందరి శుభభావన, సహయోగం అనే బిందువులు కలిసి ఈ మేళాను, భవనాన్ని పూర్తి చేస్తాయి. అయితే మీరందరూ సహయోగులే కదా! లేక డైమండ్ జూబ్లీ తర్వాత చేద్దామా? ఆరు నెలలు ఆగుదామా? ఇప్పుడే ప్రారంభిద్దామా? (హా జీ) భారత్వారు కూడా వింటున్నారు. కేవలం మీరు డబల్ విదేశీయులే కాదు, అందరి సహయోగపు బిందువులతో ఈ మహల్ సిద్ధమవుతుంది. అప్పుడు మీరు మేళాను జరుపుకుంటారు.
ఈ సంవత్సరం సేవలో డబల్ విదేశీయులు కూడా మంచి హై జంప్ చేశారు. ఎన్ని కార్యక్రమాలు చేశారు! ఒక కార్యక్రమం తర్వాత మరొకటి చేస్తూనే ఉన్నారు. అన్నీ విజయవంతమయ్యాయి, ఎప్పుడూ విజయవంతంగానే ఉంటాయి. మొదటి రిట్రీట్ కార్యక్రమం చేసినవారు లేవండి. సహయోగులుగా, బాధ్యత వహించినవారు లేవండి. ముగ్గురు శక్తులు మాత్రమే ఇక్కడ ఉన్నారు, మిగతావారు వెళ్లిపోయారు. వెళ్లిపోయిన వారికి పదమారెట్లు అభినందనలు చెప్పండి. అచ్ఛా, రెండవ కార్యక్రమం మహిళలది. అందులో సహయోగులైనవారు లేవండి. ఇందులో పాండవులు వెన్నెముకలాగా ఉన్నారు, శక్తులు ముందున్నారు. ఇంకా ఒక కార్యక్రమం జరగాల్సి ఉంది. (ఫ్యామిలీ రిట్రీట్ కార్యక్రమం జరగబోతోంది.) అచ్ఛా. పిల్లల కార్యక్రమానికి బాధ్యత వహించినవారు ఎవరు? (వెళ్లిపోయారు.) వారికి డబల్ పదమారెట్లు అభినందనలు. ఇక జరగబోయే కార్యక్రమానికి నిమిత్తులు ఎవరు? ఇందులో పాండవులు ఉన్నారు. వారికి ముందుగానే అభినందనలు. వీరు సేవకు నిమిత్తులైనవారు. కానీ చూసేవారు, కూర్చునేవారు లేకపోతే హాల్ ఖాళీగా ఉండేది. అందుకే చూసేవారికి, కూర్చునేవారికి కూడా అభినందనలు. ఈసారి డబల్ విదేశీయులు సంఖ్యను కూడా డబల్ చేసుకున్నారు. చాలా పెరిగారు కదా! (జ్ఞాన సరోవర్ చిన్నదైపోయింది.) ఎంత పెద్దదిగా నిర్మించినా, చిన్నదిగా అనిపించాల్సిందే.
విదేశాల నుంచి వచ్చిన అతిపెద్ద గ్రూపు ఏది? రష్యా. ఛోటా సుభాన్ అల్లా! చాలా మంచిది. పరిస్థితులను అధిగమించే విధిని తెలుసుకున్నారు. ఎన్ని పరిస్థితులు వచ్చినా వాటిని దాటడం వారికి సహజమైపోయింది. అందుకే రష్యావారికి తెలివైనవారిగా మారినందుకు అభినందనలు. అచ్ఛా. మొదట ఉత్సాహాన్ని పెంచేవారు మీరందరే. మీరు లేకపోతే ఏ కార్యక్రమమూ విజయవంతం అయ్యేది కాదు. మరి ప్రసంగాలు ఎవరి ముందు చేసేవారు? గోడల ముందు చేసేవారా? అందుకే ముందుగా మీ అందరికీ అభినందనలు. ఇప్పుడు పద్ధతి వచ్చేసింది. అచ్ఛా. సౌత్ ఆఫ్రికా, మారిషస్ ఇద్దరూ కూడా మంచి శ్రమ చేశారు. సౌత్ ఆఫ్రికా కూడా తక్కువ సమయంలో మంచి శ్రమ చేసింది. ధైర్యవంతులు. మారిషస్ చిన్నదే అయినా పెద్ద పని చేసింది. చాలా బాగా చేసింది. అలాగే ఇంకా ముందుకు సాగుతూ ఉండండి. పెద్ద పెద్ద మైక్‌లను తీసుకువస్తూ ఉండండి.
మొదటిసారి వచ్చినవారు చేతులు ఎత్తండి. (టోలీ సమయంలో లైన్లో రండి.) అప్పుడు పాతవారు అంటారు, మాకు అయితే అవకాశం రాలేదు అని. కానీ పెద్దల పని ఏమిటి? చిన్నవారిని ముందుకు తీసుకురావడం. అందులోనే పెద్దరికం ఉంది. కాబట్టి చిన్నవారిని చూసి ఎంతో సంతోషించండి. మీ గురించి ఆలోచించవద్దు. చిన్నవారిని ముందుకు తీసుకురండి. వారికి అదనంగా దక్కితే, అది మీకు దక్కినట్లే. అచ్ఛా.
దాదీగారు, దాదీ జానకి గార్లతో:- అందరి సహయోగమే మిమ్మల్ని, సేవను కూడా సహజంగా అభివృద్ధి చేస్తోంది. మీరు కూడా చూస్తూ హర్షిస్తున్నారు. ఇప్పుడు మీ పని ఏమిటంటే చూస్తూ హర్షించడం. ఇక మీకు మిగిలింది ఇదే పని. ఉత్సాహాన్ని పెంచడం, హర్షించడం. ఇది మీకు వినోదంలా అనిపిస్తుందా? లేక శ్రమలా అనిపిస్తుందా? సేవ కూడా ఒక ఆటే. ఆటలో ఎవరో పడిపోతారు, ఎవరో గెలుస్తారు. కానీ ఆటలో మాత్రం ఎప్పుడూ ఆనందమే ఉంటుంది. అలాగే ఈ సేవ కూడా సంగమయుగపు ఆటే. అలాగే కదా! ఆటను చూస్తూ సంతోషిస్తూనే ఉంటారు. ఇతరుల సంతోషాన్ని కూడా పెంచుతూనే ఉంటారు. ఇప్పుడు మీ పని ఒక్కటే... సంతోషాన్ని పెంచడం, ఉత్సాహాన్ని పెంచడం, స్వపురుషార్థాన్ని పెంచడం. ఇప్పుడు మీరు చేయాల్సిన ఆట ఇదే. ఇతరులను కూడా ఈ ఆటలో మంచి ఆటగాళ్లుగా తయారుచేయాలి. అచ్ఛా.
దాదీ నిర్మల్శాంతతో:- ఇవాళ ఆమె కూడా వచ్చింది. అచ్ఛా. ఆనందంగా ఉంది కదా! సేవలో కూడా ఆనందం, ఇంట్లో కూడా ఆనందం... ఆనందమే ఆనందం. ప్రపంచంలో చూస్తే అత్యంత ఆనందమైన జీవితం ఎవరిది? ప్రపంచంవారు ఎంతైనా మేము ఆనందంగా ఉన్నామని అనుకోవచ్చు. కానీ శాశ్వతమైన ఆనందం, నిజమైన ఆనందం మీకు తప్ప మరెవరికీ లేదు. అందుకే మీరు ఎప్పుడూ ముందుకు సాగుతున్నారు, ఇతరులను కూడా ముందుకు నడిపిస్తున్నారు. ప్రతిరోజూ సంతోషమే ఆహారంగా తీసుకుంటూ ఉండండి.
జ్ఞాన సరోవర్ మ్యూజియంకు సందేశం:-
జ్ఞాన సరోవర్ మ్యూజియం సేవకు ఎంతో గొప్ప నిమిత్తంగా నిలుస్తుంది. దేశ, విదేశాల ఆత్మలు దీని ద్వారా బాబా పరిచయాన్ని పొందుతారు. అనేక ఆత్మలు తమ కోల్పోయిన జన్మసిద్ధ హక్కును పొంది ఆనందంతో నృత్యం చేస్తారు. అనేక ఆత్మలు తమ స్వరూపాన్ని, బాబాను తెలుసుకొని, మేము ఎలా ఉండేవాళ్లం, ఎలా అయ్యాము అని ఆశ్చర్యకరమైన పరివర్తనను అనుభవిస్తారు. శక్తిశాలులై, ఇతరులకు కూడా ఈ ఈశ్వరీయ సందేశాన్ని అందించేందుకు నిమిత్తులవుతారు.
సౌత్ ఆఫ్రికా మంత్రి సోదరుడు నాయుడుగారితో:- మిమ్మల్ని మీరు విశ్వసేవకు నిమిత్తమైన ఆత్మగా భావిస్తున్నారా? అయితే మీరు ఎంతో గొప్ప పని చేయాలి. మీకు లభించిన ఈ సీటు గొప్ప సేవకు నిమిత్తంగా మారడానికి లభించింది. మంత్రిత్వంలోని హడావుడిని చూడవద్దు; సేవను చూడండి. మీరు చేయాల్సిన సేవ ఇంకా మిగిలే ఉంది. అందుకే కొంతకాలం మంత్రి పదవి అయినా, మరే లౌకిక పదవి అయినా దానిని లౌకిక దృష్టితో చూడవద్దు. ఇప్పుడు అది అలౌకిక సేవ కోసం మీకు లభించిన సీటు. అందుకే ఇప్పుడు స్మృతిలో మార్పు వచ్చింది. ఇప్పుడు ‘‘నేను మంత్రిని’’ కాదు... ‘‘నేను విశ్వ సేవాధారిని.’’ ఈ సీటు విశ్వసేవ కోసం. అర్థమైందా? మంత్రి సీటైనా, ప్రతిపక్ష సీటైనా... అది విశ్వసేవాధారి సీటు. ఆ లక్ష్యంతోనే ఆ సీటులో కూర్చోండి. అలా చేస్తే లౌకిక కార్యాలలో కూడా ఈ వృత్తి, ఈ స్మృతి మీకు ఎంతో సహాయపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు బుద్ధి, మనసు ఒక్క బాబాలోనే ఏకాగ్రమయ్యాయి. అందువల్ల ఇప్పుడు మీ బుద్ధి చేసే నిర్ణయాలు చాలా యథార్థంగా ఉంటాయి. ఏ సమయంలో, ఎవరికి ఏమి చేయాలో టచింగ్ వస్తుంది. మనస్సు, బుద్ధిని ఒక్క బాబాపై ఏకాగ్రం చేసే మెడిటేషన్ నేర్చుకున్నారు కదా! ఇంకా కొంత అభ్యాసం చేస్తే ఎంతో సహాయపడుతుంది. ఇంతవరకు ఏ పనివల్ల, ఏ వాతావరణం వల్ల అలసిపోయేవారో, ఇక అలసిపోరు. ఇప్పుడు బుద్ధిలో ఒకటే వస్తుంది... వీరందరి కల్యాణం ఎలా చేయాలి? ఎందుకంటే, నేను విశ్వ సేవాధారిని. విశ్వకళ్యాణ సీటులో ఉన్నాను. మంత్రి సీటులో కాదు. ఈ వృత్తితో, ఈ దృష్టితో కొంతకాలం సేవ చేసి చూడండి. ఎంతో మంచి అనుభవాలు కలుగుతాయి. మీ శక్తిశాలి వాతావరణం ఇతరులను కూడా సహయోగులుగా తయారుచేస్తుంది. అర్థమైందా? ఈ సమయంలో భాగ్యాన్ని సంపాదించే స్థానానికి చేరుకోవడం మీ గొప్ప భాగ్యం. ఇది భాగ్యాన్ని నిర్మించుకునే స్థలం. అర్థమైందా? కాబట్టి మీరు అదృష్టవంతులు. ఈ అదృష్టాన్ని పెంచుకుంటూ ఉంటే విజయాన్ని పొందుతూనే ఉంటారు.
టీచర్లతో:- మీరు డబల్ సహయోగులు. నిమిత్తులైన పెద్దవారికి కూడా సహయోగులు, బాబాకు కూడా సహయోగులు. అందుకే డబల్ సహయోగులుగా జీవించడం చాలా ఆనందమైన జీవితం. తినండి, త్రాగండి, సేవ చేయండి, నాట్యం చేయండి. బాధ్యతలు ఉన్నప్పటికీ బాధ్యతల నుంచి విముక్తులు. నిజానికి శ్రమంతా రెండో గ్రూపే చేస్తుంది. అందుకే బాప్‌దాదా సంతోషిస్తారు - ధైర్యంతో ముందుకు సాగుతున్నారు, ఇతరులను కూడా ముందుకు నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరిలోనూ ప్రత్యేకత చాలా బాగుంది. పేరు పెద్దలది, పని మీదే. మిమ్మల్ని ముందు పెట్టకపోతే పని అసలే జరగదు. అచ్ఛా.
*** ఓంశాంతి ***
