‘‘డైమండ్ జూబిలీ సంవత్సరములో విశేష అటెన్షన్ పెట్టి సమయము మరియు సంకల్పాల ఖజానాను జమ చేసుకోండి’’
ఈరోజు త్రిమూర్తి రచయిత అయిన శివబాబా పిల్లలకు మూడు శుభాకాంక్షలను ఇస్తున్నారు. పిల్లలు తండ్రికి శుభాకాంక్షలను తెలియజేయడానికి వచ్చారు, దానికి రిటర్న్‌లో తండ్రి మూడు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. ఒకటి - శివ జయంతికి, రెండు - డైమండ్ జూబిలీకి మరియు మూడు - వర్తమాన సమయములో ఉల్లాస-ఉత్సాహాలతో సేవ చేసినందుకు శుభాకాంక్షలు. ఈ మూడు శుభాకాంక్షలను బాప్‌దాదా నలువైపులా ఉన్న పిల్లలకు ఇస్తున్నారు. అందరి హృదయాలలోని ఉల్లాస-ఉత్సాహాలతో చేసిన సేవా సమాచారాలు తండ్రి వద్దకు చేరుకుంటూ ఉంటాయి. ఈ అలౌకిక జయంతి మొత్తము కల్పములో మరెప్పుడూ జరగదు ఎందుకంటే మొత్తము కల్పములో దేవాత్మలైనా, మహాత్ములైనా లేక సాధారణ ఆత్మలైనా, ఆత్మలు ఆత్మ జయంతిని జరుపుతారు. కానీ ఈ సంగమయుగములో శ్రేష్ఠ ఆత్మలైన మీరు ఎవరి జయంతిని జరపటానికి వచ్చారు? పరమ ఆత్మ జయంతిని జరపటానికి వచ్చారు మరియు తండ్రి అయిన పరమ ఆత్మ పిల్లల జయంతిని జరుపుతారు. సత్య, త్రేతాయుగాలలో కూడా పరమ ఆత్మ మీ జయంతిని జరపరు లేక మీరు పరమాత్మ జయంతిని జరపరు. కావున మీరు ఎంత పదమా, పదమా, పదమాల రెట్ల భాగ్యవాన్ ఆత్మలు! ఇటువంటి మీ శ్రేష్ఠ భాగ్యము గురించి కలలోనైనా ఆలోచించి ఉంటారా? ఆలోచించలేదా? కానీ ఈ రోజు సాకార రూపములో జరుపుకుంటున్నారు. అందుకే సంతోషంగా ఉంది కదా! చూడండి, ఈ దేశం వారైనా, విదేశాల వారైనా, మధుబన్ వారైనా, ఎవరెవరైతే ఈ గ్రూపులో కూర్చున్నారో వారు ఎంత అదృష్టవంతులు! లోలోపల ఏ పాటను పాడుతారు? వాహ్ నా భాగ్యము! మరియు తండ్రి కూడా వాహ్ పిల్లల భాగ్యము అనే పాటను పాడుతారు! విశేషంగా సేవ యొక్క గ్రూపు కూర్చన్నారు, అన్ని వైపుల యొక్క విశేషమైనవారు ఉన్నారు కదా! మీరు విశేష సేవకు విశేష ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేసుకునే ఆత్మలు. తండ్రి కూడా అటువంటి శ్రేష్ఠ పిల్లలను చూసి హర్షిస్తారు. పిల్లలు ఎక్కువ హర్షిస్తారా లేక తండ్రినా? ఇరువురూ. లేక తండ్రి ఎక్కువ హర్షిస్తారా? మీరు ఎక్కువ హర్షిస్తారు. అచ్ఛా!
ఈరోజు బాప్‌దాదా నలువైపులా ఉన్న సేవాధారీ డైమండ్ల మాలను చూస్తున్నారు. మీరందరూ మాలలో ఉన్నారు కదా? తండ్రి మెడలో డైమండ్లుగా అయి మెరిసే మాలలోని మణిపూసలు మీరేనా లేక అది ఇంకెవరైనానా? అది మీరేనా, వేరెవరూ కాదు కదా? 108 మాల అని వ్యక్తులు కూడా అంటారు కానీ బాప్‌దాదా మెడలో డైమండ్లు అయిన మీ అందరిదీ ఎంత పెద్ద మాల ఉంది? కేవలం 108 అంటే కింద కూర్చున్నవారు సరిపోతారు. వెనుక ఉన్నవారు కూడా ఉన్నారు కదా? మొదట వెనుక ఉన్నవారే. బాప్‌దాదా వెనుక ఉన్నవారికి ఎక్కువ శుభాకాంక్షలను ఇస్తున్నారు, ఇది కూడా త్యాగానికి ప్రత్యక్ష ఫలము. కింద ఉన్నవారికి ఇంకా ఎక్కువ శుభాకాంక్షలు.
బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరి విశేషతను చూస్తారు. సంపూర్ణంగా అవ్వకపోయినా, పురుషార్థులుగా ఉన్నా కానీ, ఏ విశేషతా లేనటువంటి బాబా పిల్లలు ఒక్కరు కూడా లేరు. అందరిలోనూ విశేషతలు ఉన్నాయి. అన్నింటికన్నా మొదటి విశేషత ఏమిటంటే - కోట్లలో కొందరు అనే లిస్టులోనైతే ఉన్నారు కదా. ఇంకొక విశేషత ఏమిటంటే - పెద్ద-పెద్ద తపస్వీ మహాన్ ఆత్మలైనా, 16108 జగద్గురువు అయినా, శాస్త్రవాదులైనా, మహా మండలేశ్వరులైనా, వారు తండ్రిని తెలుసుకోలేదు, కానీ తండ్రి పిల్లలైన మీరందరూ తండ్రిని తెలుసుకున్నారు కదా. మరి తండ్రిని తెలుసుకోవటము అంటే, ఇది ఎంత పెద్ద విశేషత! హృదయపూర్వకంగా ‘నా బాబా’ అనైతే అంటారు కదా. ‘నా వారు’ అని అంటూ యజమానులుగానైతే అయ్యారు కదా. మరి దీనిని ఏమంటారు? ఎవరైతే తండ్రిని గ్రహించారో, గుర్తించారో, మరి గుర్తించటము అంటే ఇది కూడా బుద్ధి యొక్క విశేషత, పరిశీలించే శక్తి ఉంది. కావున మీ అందరి పరిశీలనా శక్తి శ్రేష్ఠంగా ఉంది. అచ్ఛా, ఈ రోజు విశేషంగా జరుపుకోవటానికి వచ్చారు కదా? ఈ రోజు జరుపుకునే రోజా లేక ఈ రోజు కూడా వినేటువంటి రోజా? వినాలి కూడానా? అచ్ఛా!
శివరాత్రి అని అంటారు, కానీ మీ కొరకు ఇప్పుడు ఇది ఏమిటి? మీ కొరకు ఇది రాత్రి కాదు అంటే మరి ఇంకేమిటి? అమృతవేళనా? మీరందరూ రాత్రి నుండి బయటపడ్డారా లేక ఇప్పుడు కూడా కొద్దికొద్దిగా రాత్రి ఉందా? అది సెలవు తీసుకుని వెళ్ళిపోయిందా? ఏ రకమైన అంధకారమైనా వస్తుందా లేక సమాప్తమైపోయిందా? అమృతవేళ సదా వరదానీ సమయము, మరి మీకు రోజూ వరదానాలు లభిస్తున్నాయి కదా? తండ్రి రాత్రివేళలో వస్తారు అని మీరు అంటారు, కానీ మనకైతే ఇది అమృతవేళ గోల్డెన్ మార్నింగ్, డైమండ్ మార్నింగ్. మరి మీ ఈ వరదానీ స్వరూపాన్ని చూసుకుంటున్నారా? మాయ మీ వరదానాలను మరపింపజేయటం లేదు కదా? మాయ వస్తుందా? అప్పుడప్పుడు అయితే వస్తుంది కదా? మాయ అయితే అంతిమ ఘడియ వరకు వస్తుంది. ఊరికే వెళ్ళిపోదు. కానీ మాయ పని రావటం మరియు మీ పని దూరం నుండే దానిని పారద్రోలటము. మాయ వచ్చిన తర్వాత దానిని పారద్రోలటము, ఇలా కాదు. ఆ సమయం ఇప్పుడు సమాప్తం అయిపోయింది. మాయ వచ్చింది, మిమ్మల్ని కదిలించింది, ఆ తర్వాత మీరు దానిని పారద్రోలటము అంటే సమయమైతే పోయింది కదా! కానీ సైలెన్స్ యొక్క సాధనాల ద్వారా మీరు దూరం నుండే - ఇది మాయ అని గ్రహించగలుగుతారు. ఇందులో కూడా సమయాన్ని వృధా చేసుకోకండి మరియు మాయ కూడా - పోనిలే, రావడమైతే రానిస్తున్నారు కదా అని చూస్తుంది. అలా రావటమనేది అలవాటైపోతుంది. ఏ విధంగా ఏదైనా పశువుకు లేక జంతువుకు మీ ఇంటికి వచ్చే అలవాటు చేసారు, ఆ తర్వాత విసిగిపోయి దానిని పారద్రోలారు, కానీ దానికి అలవాటైతే అయిపోయింది కదా! కొంతమంది పిల్లలైతే మాయకు నీళ్ళు, టీ కూడా ఇస్తారు అని తండ్రి వినిపించారు. ఏ నీళ్ళు, టీ తాగిస్తున్నారు? తెలుసా? ఏం చెయ్యను, ఎలా చెయ్యను, ఇప్పుడింకా పురుషార్థులమే, ఇప్పటికీ సంపూర్ణంగా అవ్వలేదు, చివరకు అయిపోతాములే - ఈ సంకల్పాలు నీళ్ళు, టీ వంటివి. కావున నీళ్ళు, టీ అయితే లభిస్తున్నాయి కదా అని మాయ చూస్తుంది. ఎవరికైనా ఒకవేళ నీళ్ళు, టీ ఇస్తే, వారు వెళ్ళిపోతారా లేక కూర్చుండిపోతారా? కావున ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి వచ్చిందంటే - ఎందుకు, ఏమిటి, ఎలా, అప్పుడప్పుడు అయితే అవుతూనే ఉంటుంది, ఇప్పుడింకా ఎవరు పాస్ అయ్యారు, అందరి దగ్గర ఉంది కదా అని అనటం - ఇదే మాయకు ఆతిథ్యాన్ని ఇవ్వటము. కొంచెం స్వీట్, కొంచెం హాట్ కూడా తినిపిస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? విసిగిపోయి - బాబా, మీరే పారద్రోలేయండి అని అంటారు. రానివ్వడం మీరు రానిస్తారు కానీ పారద్రోలడం అనేది బాబా చేయాలా, ఎందుకు? అసలు ఎందుకు రానిస్తారు? మాయ పదే-పదే ఎందుకు వస్తుంది? ప్రతి సమయము, ప్రతి కర్మ చేస్తూ, త్రికాలదర్శి సీట్‌పై సెట్ అవ్వరు. త్రికాలదర్శి అనగా భూత, భవిష్యత్, వర్తమానాల గురించి తెలిసినవారు. అప్పుడు ఏమిటి, ఎందుకు అని అనవలసిన అవసరం ఉండదు. త్రికాలదర్శులైన కారణంగా ముందు నుండే - ఈ విషయాలైతే రావలసిందే, జరగవలసిందే, స్వయం ద్వారానైనా, ఇతరుల ద్వారానైనా, మాయ ద్వారానైనా, ప్రకృతి ద్వారానైనా, అన్ని రకాలుగా పరిస్థితులైతే వస్తాయి, అవి రావాల్సిందే అన్నది తెలుసుకుంటారు. కానీ స్వ స్థితి శక్తిశాలిగా ఉన్నట్లయితే పరిస్థితి దాని ముందు అసలు ఏమీ కాదు. పరిస్థితి పెద్దదా లేక స్వ స్థితి పెద్దదా? లేక అప్పుడప్పుడు స్వ స్థితి పెద్దగా, అప్పుడప్పుడు పరిస్థితి పెద్దగా అవుతుందా? మరి దీనికి సాధనము - ఒకటేమో ఆదిమధ్యాంతాలు, మూడు కాలాలను చెక్ చేసుకుని, అర్థం చేసుకుని అప్పుడు ఏదైనా చెయ్యండి. కేవలం వర్తమానాన్ని చూడకండి. కేవలం వర్తమానాన్నే చూస్తే, ఒక్కోసారి పరిస్థితి పెద్దగా అనిపిస్తుంది మరియు ఒక్కోసారి స్వ స్థితి పెద్దగా అనిపిస్తుంది. ప్రపంచంలో కూడా - మొదట ఆలోచించండి, ఆ తర్వాత చేయండి అని అంటారు. ఒకవేళ దేనినైనా ఆలోచించి చేయకపోతే, తర్వాత ఆలోచించడము అనేది పశ్చాత్తాప రూపంగా అవుతుంది. అలా చేసుండేవారము కాదు, ఇలా చేసేవారము అని అనుకుంటారు, కనుక తరువాత ఆలోచించడము అనగా పశ్చాత్తాప రూపము మరియు ముందే ఆలోచించటము అనేది జ్ఞానీ ఆత్మల గుణము. ద్వాపర-కలియుగాలలోనైతే అనేక రకాలుగా పశ్చాత్తాపపడుతూనే ఉన్నారు కదా? కానీ ఇప్పుడు సంగమంలో పశ్చాత్తాపపడటం అంటే జ్ఞానీ ఆత్మలు కారు అని అర్థము. మిమ్మల్ని మీరు ఎలా తయారుచేసుకోవాలంటే - మీలో మీరు, మనస్సులో ఒక్క సెకెండు కూడా పశ్చాత్తాపపడకూడదు.
మరి ఈ డైమండ్ జూబిలీలో విశేషంగా రోజంతటిలో - ఒకటి సమయము మరియు రెండు సంకల్పాలు - ఈ రెండు ఖజానాలపై అటెన్షన్ పెట్టండి. ఆ మాటకొస్తే ఖజానాలైతే చాలానే ఉన్నాయి కానీ , ప్రతి రోజూ శ్రేష్ఠమైన, శుభమైన సంకల్పాలను ఎంత జమ చేసుకున్నాను? అని విశేషంగా ఈ రెండు ఖజానాలపై అటెన్షన్ పెట్టండి. ఎందుకంటే మొత్తం కల్పం కొరకు జమ చేసుకునే బ్యాంకు ఇప్పుడే తెరుచుకుంటుంది. సత్యయుగంలో ఈ జమ చేసుకునే బ్యాంకు మూసివేయబడుతుంది. ఈ బ్యాంకు కూడా ఉండదు, వేరే బ్యాంకు కూడా ఉండదు. మీ వద్ద ఎంత ధనం ఉంటుందంటే, ఎవరి దగ్గర నుండి ఏమీ తీసుకునే అవసరముండదు. బ్యాంకులో ఎందుకు పెట్టుకుంటారు? ఒకటేమో రక్షణ కోసము మరియు రెండవది వడ్డీ లభిస్తుంది. చాలా మంది ఎంత తెలివైనవారిగా ఉంటారంటే కేవలం వడ్డీతోనే గడుపుతూ ఉంటారు. మరి ఈ సమయంలో ఒకవేళ ఇంత తెలివైనవారిగా ఉన్నారంటే మంచిదే, జమ అయితే చేసుకుంటున్నారు కదా. కానీ వడ్డీని ఎటువైపు వినియోగిస్తారు అనేది చూడాలి. సత్యయుగంలో ఈ బ్యాంకు కూడా ఉండదు, ఆత్మిక సంపాదనను జమ చేసుకునే బ్యాంకు కూడా ఉండదు. రెండు బ్యాంకులూ ఉండవు. ఈ సమయంలో ఒకటికి పదమాల రెట్లు చేసి ఇచ్చేటువంటి బ్యాంకు ఉంది, కానీ ఒకటి జమ చేసుకుంటే అప్పుడు పదమాలు లభిస్తాయి, ఊరికే కాదు. లెక్క ఉంది. డైమండ్ జూబిలీలో సత్యమైన డైమండ్గా అవ్వవలసిందే, ఇందులో దృఢంగా ఉన్నారు కదా? లేదా ఎప్పుడైనా అవ్వగలమో లేదో అని సంకల్పం వస్తుందా? ఏమో తెలియదు, అన్న సంకల్పమైతే రావటం లేదు కదా? ఏమి జరిగినా, త్యాగం చేయాల్సి వచ్చినా, తపస్య చేయాల్సి వచ్చినా, నమ్రచిత్తులుగా ఉండాల్సి వచ్చినా, ఏది ఏమైనా కానీ, తప్పకుండా తయారవ్వాలి. అలా తయారవ్వాలా? చెప్పండి, హాజీ నా లేక నాజీ నా? (హాజీ) చూడండి, హాజీ అని అనటము చాలా సహజము. కానీ ఆ విధంగా తయారవ్వటంపై అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది. మొట్టమొదటగా ఈ ‘నేను’ అన్న మాటను త్యాగం చేయాలి. ఈ ‘నేను’ అన్న మాట చాలా పాతది కానీ ఈ రోజుల్లో దీని రూపం చాలా రాయల్‌గా అయ్యింది. భాషలో కూడా ఈ ‘నేను’ అన్న మాట సమాప్తమై ‘బాబా-బాబా’ అన్న మాట రావాలి. పలకడానికి ఇది సాధారణమైన మాటే. నేను యోగ్యుడిని కదా, మరి యోగ్యుడిని అన్నప్పుడు సౌకర్యాలు మరియు సేవ అదే విధంగా లభించాలి. నేను యోగ్యుడిని, నేను చేస్తున్నాను - ఇది రైటేనా? చేస్తున్నారు కదా, మరి నేను చేస్తున్నాను అని ఎందుకు అనకూడదు! నేను రాంగ్, నేను రైట్, అనడమైతే నేను చేస్తున్నాను... అనే అంటారు కదా! మీరు చెయ్యటం లేదా? చేసేది బాబా! ఆ తండ్రి చేయించేవారు కానీ చేసేది మీరే కదా. మరి ‘నేను’ అని అనటం తప్పు ఎందుకు అయ్యింది? ఆ మాటకొస్తే ‘నేను’ అన్న మాటను ఉపయోగిస్తారు కానీ వాస్తవానికి ‘నేను’ అన్న మాట ఎవరికి వర్తిస్తుంది? ఆత్మకా లేక శరీరానికా? నేను అంటే ఎవరు? ఆత్మ కదా, శరీరమైతే కాదు కదా? ఒకవేళ దేహీ-అభిమానులుగా అయ్యి, నేను ఆత్మను అన్న ఈ స్మృతితో ‘నేను’ అన్న మాటను ఉపయోగిస్తే అది రైట్. కానీ ఒకవేళ దేహాభిమాన రూపంలో ‘నేను’ అని ఉపయోగిస్తే అది రాంగ్. మొత్తం రోజంతటిలో ఈ ‘నేను’ అన్న మాట చాలా సార్లు వస్తుంది మరియు అది వచ్చేదే ఉంది. అందుకే ప్రాక్టీస్ చేయండి - ఎప్పుడైతే ‘నేను’ అని అంటారో, అప్పుడు నేను అంటే ఎవరు? వాస్తవానికి ‘నేను’ అంటేనే ఆత్మ. శరీరాన్ని ‘నాది’ అని అంటారు. కనుక ఒకవేళ ‘నేను’ అన్న మాటను ఆత్మాభిమానిగా అయ్యి ఉపయోగించినట్లయితే ఆత్మకు స్వతహాగానే తండ్రి గుర్తుంటారు. చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. నేను ఉన్నానే ఆత్మను - ఈ ప్రాక్టీస్ చెయ్యండి. ‘నేను’ అని అన్నప్పుడు మీ నామ-రూపాలు గుర్తు రావడం మీకు వ్యతిరేకంగా అలవాటైంది మరియు సహజం అయిపోయింది. నేను అంటే ఎవరు? నేను ఫలానా. ఇది సహజం అయిపోయింది కదా? ఆలోచించాల్సిన అవసరముండదు. ఇలా వ్యతిరేక భావంతో ‘నేను’ అన్న మాటను ఉపయోగిస్తున్నారు కావుననే రిజల్టులో శ్రమ ఎక్కువ మరియు ప్రాప్తి తక్కువ ఉంటుంది. చాలా మంది పిల్లలు - మేమైతే చాలా సేవ చేస్తున్నాము, చాలా కృషి చేస్తున్నాము కానీ ప్రాప్తి అంతగా లభించటం లేదు అని అంటారు. దానికి కారణం ఏమిటి? వరదానము అందరికీ ఒక్కటే, 60 సంవత్సరాల వారికైనా ఒకటే, ఒక నెల వారికైనా ఒకటే. ఖజానాలు అందరి వద్ద ఒకే విధంగా ఉన్నాయి. పాలన అందరికీ ఒకే విధంగా ఉంది, దినచర్య, మర్యాదలు అందరికీ ఒకేలా ఉన్నాయి. వేర్వేరుగా అయితే లేవు కదా! విదేశాలలో మర్యాదలు వేరు, భారత్‌లో వేరు, అలాగైతే లేవు కదా? కొంచెం-కొంచెం తేడా ఉందా? లేదా? మరి అన్నీ ఒకటే అయినప్పుడు కొందరికి సఫలత లభిస్తుంది, కొందరికి తక్కువగా లభిస్తుంది - ఎందుకు? కారణమేమిటి? తండ్రి ఏమైనా తక్కువగా సహాయం చేస్తారా ఏమిటి? కొందరికి ఎక్కువ సహాయం చేయడం, కొందరికి తక్కువ, ఇలా ఉందా? లేదు. మరి ఇలా ఎందుకు అవుతుంది? దీని అర్థం ఏమిటి? మీ పొరపాటు ఉంది. అయితే దేహాభిమానము అనే ‘నేను’ వస్తుంది, లేదా ఒక్కోసారి తోటి వారి సఫలతను చూసి ఈర్ష్య కూడా వస్తుంది. ఆ ఈర్ష్య కారణంగా ఏ సేవనైతే హృదయపూర్వకంగా చేయాలో, దానిని బుద్ధితో చేస్తారు, హృదయపూర్వకంగా చేయరు. హృదయపూర్వకంగా చేసిన సేవకే ఫలం లభిస్తుంది. ఎన్నో సార్లు పిల్లలు బుద్ధిని ఉపయోగిస్తారు కానీ మనస్సు మరియు బుద్ధి, ఈ రెండింటినీ కలిపి చేయడం లేదు. బుద్ధి లభించింది, దానిని కార్యంలో ఉపయోగించటం మంచిదే కానీ కేవలం బుద్ధిని మాత్రమే కాదు. ఎవరైతే హృదయపూర్వకంగా చేస్తారో, అటువంటివారి హృదయంలో తండ్రి స్మృతి కూడా సదా ఉంటుంది. కేవలం బుద్ధితో చేస్తే - అవును, బాబాయే చేయించేవారు, అవును బాబాయే చేయించేవారు అని కొద్దిసేపు బుద్ధిలో గుర్తుంటుంది, కానీ కొద్ది సమయం తర్వాత మళ్ళీ అది ‘నేను’ అన్న భావం వచ్చేస్తుంది, అందుకే మనసు మరియు బుద్ధి, రెండింటి బ్యాలెన్స్ పెట్టండి.
మరి వినిపించాము కదా - డైమండ్ జూబిలీలో ఏం చేయాలి అని. విశేషంగా పొదుపు ఖాతాను జమ చేసుకోండి. మొత్తం రోజంతటిలో నా ద్వారా అటువంటిదేమీ జరగలేదు కదా, ఎవరికీ దుఃఖాన్ని అయితే ఇవ్వలేదు కదా, ఎవరితో ఎటువంటి గొడవ జరగలేదు కదా అనగా పోగొట్టుకోలేదు కదా. పోగొట్టుకోలేదు, మంచిదే కానీ జమ చేసుకున్నారా? సేవ కూడా చేసారు కానీ మీ ఆత్మికతతో సేవలో సఫలతను పొందారా? లేదా సఫలతను జమ చేసుకున్నారా? సేవకు సమయాన్ని కేటాయించారు - ఇది మంచిదే కానీ ఏ విధితో సేవ చేసారు? మేము రోజంతా ఎంతగా సేవలో బిజీ ఉంటామంటే మాకు మా గురించే తెలియదు అని చాలా మంది అంటారు. బిజీగా ఉంటున్నారు, ఇది చాలా మంచిది. కానీ సేవ యొక్క ప్రత్యక్ష ఫలం జమ అయ్యిందా? లేక కేవలం శ్రమించారా? సేవలో 8 గంటల సమయాన్ని కేటాయించారు కానీ 8 గంటలూ సేవలో జమ అయ్యాయా? సమయం జమ అయ్యిందా? లేక సగం జమ అయ్యి, సగం పరిగెత్తడంలో, ఆలోచించటంలో పోయిందా? శ్రేష్ఠ సంకల్పాలు, శుభ భావన, శుభ కామనలతో కూడిన సంకల్పాలు జమ అవుతాయి. కనుక మొత్తం రోజంతటిలో జమ ఖాతాను నోట్ చేసుకోండి. జమ ఖాతా పెరుగుతూ ఉన్నప్పుడు స్వతహాగా డైమండ్గా అవ్వవలసిందే. ఇప్పటికీ సమయము మరియు సంకల్పాలు - మంచిగానూ ఉండటం లేదు, చెడుగానూ ఉండటం లేదు. చెడుగా లేదంటే మీరు రక్షించబడ్డారు కానీ మంచిలో జమ అయ్యాయా? అర్థమైందా? సమయాన్ని, సంకల్పాలను పొదుపు చెయ్యండి, ఇప్పుడు ఎంతగా పొదుపు చేస్తారో, జమ చేస్తారో, అంతగా మొత్తం కల్పంలో దాని అనుసారంగా రాజ్యం కూడా చేస్తారు మరియు పూజ్యులుగా కూడా అవుతారు. ద్వాపరం నుండి మీరు సాకార రూపంలో పడిపోయే కళలోకి వస్తారు కానీ మీరు జమ చేసుకున్న ఖాతా మీ జడ చిత్రాలకు పూజ చేయిస్తుంది. కనుక ఇదంతా నోట్ చేసుకున్నట్లయితే, ఎంత సమయం వృధాగా లేక సాధారణంగా గడిచింది అనేది అర్థమవుతుంది? సాధారణ సంకల్పాలు ఎన్ని ఉంటున్నాయి అన్నది తెలుస్తుంది. కానీ ఒకదాని పట్ల అటెన్షన్ పెట్టాలి - ఒకవేళ ఈ రోజు మీ జమ ఖాతా చాలా తక్కువ ఉంది అనుకోండి, తక్కువగా ఉండడాన్ని చూసి మీరు నిరాశపడకండి. ఇప్పటికీ మాకు జమ చేసుకోవటానికి అవకాశం ఉంది అని భావించండి. స్వయాన్ని ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకురండి. మీతో మీరు రేస్ చేయండి, ఇతరులతో కాదు. ఈ రోజు 8 గంటలు జమ అయితే రేపు 10 గంటలు జమ అవ్వాలి అని మీతో మీరు రేస్ చేసుకోండి, ఇందులో నిరాశపడకండి ఎందుకంటే ఇప్పుడింకా జమ చేసుకునేందుకు సమయం మిగిలి ఉంది. టూ లేట్ బోర్డు ఇంకా పెట్టలేదు. ఫైనల్ రిజల్టు యొక్క సమయాన్ని ఇప్పుడింకా అనౌన్స్ చేయలేదు. ఏ విధంగా లౌకికంలో కూడా పరీక్ష తేదీ ఫైనల్ అయినప్పుడు మంచి పురుషార్థులు ఏం చేస్తారు? నిరాశపడతారా లేక పురుషార్థంలో ముందుకు వెళ్తారా? అలాగే మీరు కూడా నిరాశపడకండి. మరింత ఉల్లాస-ఉత్సాహాలలోకి వచ్చి దృఢ సంకల్పం చేయండి - నేను నా జమ ఖాతాను పెంచుకోవాల్సిందే. అర్థమైందా? నిరాశ చెందరు కదా. లేకపోతే బాబాకు శ్రమించవలసి వస్తుంది. పెద్ద పెద్ద ఉత్తరాలు వ్రాయడం మొదలుపెడతారు – బాబా, ఇలా జరిగింది... అలా జరిగింది... బాబా రక్షించండి, రక్షించండి – ఇలా అనకండి. చూడండి, మీ జడ చిత్రాల వద్దకు వెళ్ళి మమ్మల్ని రక్షించండి అని వేడుకుంటారు. మీరు రక్షించేవారు, రక్షించండి, రక్షించండి అని అనేవారు కాదు.
డబల్ విదేశీయులు, మీకూ పూజ జరుగుతుందని భావిస్తారా? లేక భారత్వాసులకే జరుగుతుందని భావిస్తారా? ఎవరిది జరుగుతుంది? మీది జరుగుతుందా? కాబట్టి ఎల్లప్పుడూ మీ రాజ్యాధికారి స్వరూపాన్ని మరియు పూజ్య స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకోండి - నేను పూజ్య ఆత్మను. ఇతరులకు ఇచ్చే దాతను. తీసుకునేవాడిని కాదు, దేవతను.
బాబా అయితే మీరు అడగకుండానే అన్నీ ఇచ్చారు కదా లేక మీరు అడిగిన తరువాత ఇచ్చారా? కాదు కదా! అడగడం కూడా మీకు తెలియదు. భక్తిలో ఏమి అడిగేవారు? ఒక బిడ్డను ఇవ్వండి, ఒక ఇల్లు ఇవ్వండి, పరీక్షలో పాస్ చేయించండి అని అడిగేవారు. కానీ వారసత్వానికి అధికారులమని ఎప్పుడూ భావించలేదు. అయితే బాబా వారసత్వంలో సమస్తమూ ఇచ్చేశారు. తన దగ్గర ఏమైనా ఉంచుకున్నారా? అడగకుండానే ఇచ్చారు. మనం విశ్వానికి రాజులమవుతాం అని ఎప్పుడైనా ఆలోచించగలిగారా? సంగమయుగ బ్రాహ్మణ ఆత్మలమవుతామని కూడా ఎక్కడైనా ఊహించారా? కాబట్టి జమ చేసుకోండి. ఎందుకంటే బాప్‌దాదా చూశారు - మీరు చాలా శ్రమ చేస్తున్నారు. కానీ జమ ఖాతా ఎంత ఉండాలో అంత లేదు. తర్వాత తేదీ ప్రకటించబడినప్పుడు, మాకు తెలియదే! తెలిసి ఉంటే చేసేవాళ్లం అని అనకండి. అందుకే ఈ డైమండ్ జూబిలీ సంవత్సరంలో యోగం ద్వారా, సేవ ద్వారా, శుభ భావన, శుభ కామనల ద్వారా ఖాతాను జమ చేసుకోండి. అర్థమైందా ఏమి చేయాలో? జమ చేయాలి. బాప్‌దాదా వద్దకు అందరి లెక్కలు చేరుతూనే ఉంటాయి. ఒక నెల రిజల్ట్‌ను మీరే చూడండి. ఇక్కడికి ఉత్తరం రాసి పంపాల్సిన అవసరం లేదు. మీరే చెక్ చేసుకోండి. చెక్ చేసి చేంజ్ చేసుకోండి. నిరాశ చెందకండి, మార్పు చేసుకోండి. బాబా తోడుగా ఉన్నప్పుడు బాబాను ఉపయోగించండి. ఉపయోగించడం తక్కువ చేస్తున్నారు. బాబా తోడుగా ఉన్నారు, బాబా తోడుగా ఉన్నారు అని మాత్రమే అంటున్నారు. ఉపయోగించండి. సర్వశక్తిమంతుడు తోడుగా ఉన్నప్పుడు విజయం మీ పాదాల వద్దకు పరుగెత్తుకుంటూ రావాల్సిందే.
అచ్ఛా, శివజయంతి లేదా శివరాత్రికి సంబంధించిన మీ కంబైన్డ్ స్వరూపాన్ని ఏమని గానం చేస్తారు? (శివశక్తి). ఇది పక్కానా? లేక శక్తి వేరు, శివుడు వేరా? మరి శివశక్తి అంటే కంబైన్డ్ అని అర్థం. వేరుకాదు. అయితే వేరు ఎలా చేస్తారు? వేరు కావడం సాధ్యమా? కలిసే ఉన్నప్పుడు వేరవడం ఎలా? కలిసినది వేరవదు. కానీ మాయ ముఖాన్ని తిప్పేస్తుంది. దారి మళ్లిస్తుంది. అందుకే కొంచెం దూరమవుతారు. కాబట్టి, నేను శివశక్తిని అనే ఈ స్మృతే ఈరోజు శివజయంతి యొక్క స్మృతిచిహ్నము. మరి పాండవులు ఏమిటి? మీరు కూడా శివశక్తులేనా? లేక శివ పాండవులా? ఏమిటి? శక్తులే కదా! అచ్ఛా.
పిల్లలు అడిగారు - భవిష్యత్తులో ఏ సేవ చేయాలి అని. దానికి బాబా ముందే చెప్పారు - ఇప్పుడైతే, సాధ్యమైనంత వరకు ఇప్పటికే సిద్ధంగా ఉన్న స్టేజ్‌లపై మీరు చీఫ్ గెస్ట్లుగా వెళ్లే సేవను ఇంకా పెంచండి. దీని కోసం పెద్ద పెద్ద అసోసియేషన్లు, కంపెనీలు, సొసైటీలు ఉన్నాయే, వాటిలోని విశేష నిమిత్త ఆత్మలకు పరిచయం ఇచ్చి వారిని దగ్గరకు తీసుకురండి. అప్పుడు ఒక్కొక్కరికి విడివిడిగా సేవ చేయాల్సిన అవసరం లేకుండా, ఒకేసారి అనేక ఆత్మలకు సేవ జరుగుతుంది. దీనిపై మరింత అటెన్షన్ పెట్టి పెంచండి. రెండవ విషయం - ఇప్పుడు మీరు అలాంటి స్పీకర్లను తయారుచేయండి. పెద్ద మైక్‌లు వేరే విషయం. అది చేయాల్సిందే. కానీ మీ సంపర్కంలోని వారిని జ్ఞానానికి దగ్గరకు తీసుకురండి. అప్పుడు జ్ఞాన విషయాలను మీరు చెప్పకుండా వారే నిరూపించి చెబుతారు - ఈ విషయం ఈ కారణంగా యథార్థమైనది అని. ఇప్పటివరకు, ఇక్కడ ప్రేమ లభించింది, శాంతి అనుభవమైంది, బ్రహ్మా బాబా యొక్క కమాల్ ఇది అని ఇక్కడి వరకు వచ్చారు. ఇప్పుడు, బ్రహ్మా బాబాలో పరమాత్మ శక్తి యొక్క కమాల్ ఉంది అనే స్థితి వరకు తీసుకురావాలి. విదేశీయులకు బాప్‌దాదా అభినందనలు ఇస్తున్నారు. ధైర్యంతో ఐ.పి.లను దగ్గరకు తీసుకువచ్చారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక విషయంలో ముందుకు వెళ్తున్నారు. కానీ ఇప్పుడు కనీసం 10-15 మంది అయినా సరే, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను, వారి మాటలకు ప్రభావం ఉండే వ్యక్తులను - భారత్‌లో అయినా, విదేశాల్లో అయినా - జ్ఞానానికి దగ్గర చేయండి. వారు స్వయంగా పరమాత్మ జ్ఞానాన్ని అర్థం చేసుకొని స్పష్టంగా చెప్పాలి. ఇందులో శ్రమ ఉంది. కానీ బాబా యొక్క, పరమాత్మ జ్ఞానం యొక్క ప్రత్యక్షతను డైమండ్ జూబిలీ తర్వాత కూడా చేయకపోతే మరెప్పుడు చేస్తారు! ఇప్పటికే 62 దేశాల్లో సేవాకేంద్రాలు ఉన్నాయి కదా! కానీ ప్రతి రాష్ట్రంలో పెద్ద మైక్‌లకు ముందుగా ఇలాంటి చిన్నా-పెద్ద స్పీకర్లను తయారుచేయండి. భారత్‌లో కూడా ప్రతి రాష్ట్రంలో ఇలాంటి ఒకటి లేదా రెండు స్పీకర్లను లేదా ఒక స్పీకర్ గ్రూప్‌ను సిద్ధం చేయండి. బాబా యొక్క ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది? ఇతరులే నిరూపించి చెప్పినప్పుడు. ఇప్పటివరకు చేసిన సేవ వలన ఇతరుల అనుభవాల ద్వారా మీ పరిచయం పెరిగింది. అక్కడ స్వర్గం ఉంది, శాంతి ఉంది, ప్రేమ ఉంది అని ఇతరులు చెప్పడం ప్రారంభించినప్పటి నుండి, వారి అనుభవాలను విని వృద్ధి త్వరగా జరిగింది. ఇంతవరకు చేసిన సేవ చాలా మంచిది. దానికి అభినందనలు. కానీ ఇక ముందు ఏమి చేయాలి? అలాంటి వారిని దగ్గరకు తీసుకురావాలి. వారితో విడిగా జ్ఞానంపై శ్రమ చేయండి, సంగఠనలో జరగదు. కానీ అందుకోసం శ్రమించి, సంపర్కంలో ఉన్నవారిని సేవలో నిమగ్నం చేయండి. ఇప్పటికే ధరణిని సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ నేలలో పరమాత్మ జ్ఞానం లేదా పరమాత్మ పరిచయం అనే బీజాన్ని నాటడమే లక్ష్యంగా పెట్టుకోండి. సమయం పట్టవచ్చు. అయినా లక్ష్యం పెట్టుకున్నారు కదా! అదే విజయం. ఇంతకుముందు, విదేశాల నుంచి ఇక్కడికి ఎలా వస్తారు? చాలా కష్టం అని అనుకునేవారు. కానీ ఇప్పుడు 200-250 మంది వస్తున్నారు కదా! కాబట్టి ఈ నేలను సిద్ధం చేశారు. దున్ని సిద్ధం చేశారు. మంచి శ్రమ చేశారు. ఇప్పుడు అలాంటి ఒక గ్రూప్‌ను సిద్ధం చేయండి. కనీసం సర్వవ్యాపి విషయాన్ని గానీ, కఠినమైన పాయింట్లను గానీ వివరించకపోయినా, ఇది పరమాత్మ శక్తి. ఇది కేవలం బ్రహ్మా శక్తి కాదు. బ్రహ్మా ద్వారా కూడా పరమాత్మ శక్తియే కార్యం చేసింది అనే స్థాయి వరకు తీసుకురండి. అప్పుడు బాబా పరిచయం లభిస్తుంది కదా! ఇది పరమాత్మ కార్యం, ఒక దివ్య శక్తి ఉంది అనే స్థాయి వరకు వచ్చారు. కానీ చివరికి పరమాత్మ పరిచయం లభించినప్పుడే సంపూర్ణత వస్తుంది. ఇప్పటివరకు చేసినది చాలా మంచిది. కానీ ఇప్పుడు ఇంకా అత్యుత్తమంగా చేయాలి. ఇందులో చాలా శ్రమ చేయాల్సి వస్తుందని బాబాకు తెలుసు. అయినా చేయాల్సిందే కదా! అందుకే తగినవారిగా మీరు భావించే వ్యక్తులను చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పరచి వారిని దగ్గరకు తీసుకురండి. ఒక్కొక్కరితో అయినా చేయండి, చిన్న గ్రూపులతో అయినా చేయండి. ఎలాంటి వ్యక్తి అయితే, అలాంటి సేవ చేయండి. అర్థమైందా ఏమి చేయాలో? అచ్ఛా.
నలువైపులా ఉన్న, జయంతికి శుభాకాంక్షలను తెలిపే పిల్లలకు, సదా తండ్రితో పాటు ఉండే కంబైండ్ రూపధారీ పిల్లలకు, సదా ఉల్లాస- ఉత్సాహాల ద్వారా స్వయాన్ని మరియు ఇతరులను ముందుకు తీసుకువెళ్ళే పిల్లలకు, నలువైపులా సేవలలో ఉన్నతిలోకి వెళ్ళే సత్యమైన సేవాధారీ పిల్లలకు బాప్‌దాదా యొక్క పదమా-పదమా-పదమా రెట్ల శుభాకాంక్షలు. ప్రియస్మృతులతో పాటు తండ్రి కూడా పిల్లల యొక్క శుభాకాంక్షలను, ప్రియస్మృతులను స్వీకరిస్తున్నారు. అన్ని వైపులా శుభాకాంక్షలు-శుభాకాంక్షలు అని మనసులోని పాటలు మ్రోగుతూ ఉండడాన్ని చూస్తున్నారు. మరి అలా శుభాకాంక్షలను తీసుకోవటము మరియు శుభాకాంక్షలను ఇవ్వటము, ఈ రెండింటి సంగమానికి విశేషమైన ప్రియస్మృతులు మరియు నమస్తే.
అచ్ఛా, ఈ రోజు బచ్చీ ఒక సంతోషకరమైన వార్త వినిపించారు - ఈ గ్రూపులో ఒక సంవత్సరం మొత్తం క్రోధముక్తంగా ఉన్న పిల్లలు ఉన్నారని. మరి సెరిమనీ జరిగినప్పుడు అలాంటి క్రోధముక్త పిల్లల ముఖాలను అందరూ చూస్తారు, బాబా కూడా చూస్తారు. వారు స్టేజ్‌పైకి వస్తారు. చేతులు ఎత్తకపోయినా నిజంగా అలానే ఉన్నవారు కూడా రావచ్చు. కానీ ఒక సంవత్సరం మొత్తం క్రోధముక్తంగా ఉన్నవారై ఉండాలి. ఏమి ఆలోచిస్తున్నారు? మనం కూడా అలా ఉండి ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారా?
దాదీలతో:- మీ త్యాగం మరియు తపస్సు యొక్క ఫలం ఇప్పుడు ప్రత్యక్ష ఫలంగా కనిపిస్తోంది. ఈ 14 సంవత్సరాల తపస్సు యొక్క ఫలితాన్ని ఇప్పుడు ప్రాక్టికల్ రిజల్ట్ రూపంలో చూస్తున్నారు. దేశంలో అయినా, విదేశంలో అయినా అందరూ ఈ సంవత్సరం ఆరంభం నుండే ఎంతో ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వచ్చారు. ఎందుకు? విశేషత ఏమిటి? ఎందుకు ఇంత ఉల్లాస-ఉత్సాహంతో వచ్చారు? (డైమండ్ జూబిలీ.) డైమండ్ జూబిలీ సంతోషం కూడా ఉంది. కానీ దానితో పాటు సేవ యొక్క విజయం ఇప్పుడు ప్రత్యక్ష రూపంలో కనిపిస్తోంది. అందుకే ఫలితాన్ని చూసి ఆనందిస్తున్నారు. ఒకటి స్వార్థ ఫలం - అది అల్పకాలికం. రెండవది నిస్వార్థ సేవ యొక్క ఫలం. ఇప్పుడు లభిస్తున్నది ఎంతో కాలంగా చేసిన నిస్వార్థ సేవ యొక్క ఫలం. అది ఇప్పుడు సహజంగా లభిస్తోంది. ఈ డైమండ్ జూబిలీ యొక్క నశాలో, సంతోషంలో ఇంకా సేవను మరింత ముందుకు తీసుకువెళ్లవచ్చు. మీరు ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు తీసుకువెళ్తే సేవ కూడా పెరుగుతుంది. మీరు నిమిత్తమైన ఆత్మలు లక్ష్యాన్ని ఉంచుకుంటే, మీ లక్ష్యపు కిరణాలు అందరికీ చేరుతాయి. జరగాల్సిందే, చేయాల్సిందే. మీలో ఆ లక్ష్యం ఉంది. ఇప్పుడు ఇతరులలో కూడా ధైర్యం, ఉల్లాస-ఉత్సాహాలను కలిగించడంలో మీ లక్ష్యాన్ని మరింత దృఢంగా ఉంచండి. బ్రహ్మా బాబా మరియు శివబాబాల పరిచయం పిల్లలకు లభించాల్సిందే కదా! అర్థమైందా? (ఎదురుగా కూర్చున్న టీచర్లతో) మీరు వింటున్నారు కదా! భుజాలైన మీరు లేకుండా ఏదీ జరగదు. వీరు ప్లాన్ చేసే వారు, సంకల్పాలను ఇచ్చేవారు. కానీ ఆ సంకల్పాలను సాకారం చేసేవారు ఎవరు? మేమే అని చెప్పండి. ఎందుకు? భుజాలమని భావించి చేస్తే, ‘నేను’ అనే దేహాభిమానమే రాదు. విదేశాల నుండి కూడా ఆది రత్నాలు కూర్చున్నారు. ఇప్పుడు మంచి తరంగం నడుస్తోంది. ఆ తరంగాన్ని ఇతరులకు కలిగించాల్సిన అవసరం లేదు. తరంగం వచ్చేసింది. ఇప్పుడు వారికి ఇంకా ఉల్లాస-ఉత్సాహాలను కలిగిస్తూ ఉండండి. నిమిత్త ఆత్మలు మంచివారు, బాప్‌దాదాకు సమీపంగా ఉన్నవారు. సమీపంలో ఉన్నారా? లేక విదేశాల్లో ఉన్నారా? సమీపంగానే ఉన్నారు కదా! బాప్‌దాదా కూడా సంతోషిస్తారు - వాహ్! నా రైట్ హ్యాండ్స్! రైట్ హ్యాండ్స్ కదా! రైట్ హ్యాండ్స్ ద్వారానే కార్యం జరుగుతుంది. ప్రతి స్థలంలో బాబాకు రైట్ హ్యాండ్స్ ఉన్నారు. కానీ ఆది రత్నాలుగా నిమిత్తమైనవారిని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలి. ఒక్కటే పని. ఎక్కడైనా సేవలో కొంచెం అలసట అనిపించినా, శ్రమ అనిపించినా వారికి ఏదో ఒక సహయోగం ఇచ్చి ఉల్లాస-ఉత్సాహాలను పెంచండి. ఇది మీ పని. అర్థమైందా? టీచర్లలో కూడా మీరు విశేషంగా నిమిత్తులు. మిమ్మల్ని మీరు నిమిత్తులుగా భావిస్తున్నారా? చెప్పండి. జయంతి, మీరు చెప్పండి. అలసిపోలేదుగా? అచ్ఛా. ఇప్పుడు టీచర్లలో కూడా ఎక్కువమందికి ధైర్యం వచ్చింది. నిర్విఘ్నంగా ఉండే విధిని కూడా అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు చాలా భయపడేవారు. ఇప్పుడు తక్కువగా భయపడుతున్నారు. ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఒకవైపు బాబా ప్రేమ, మరోవైపు సేవ యొక్క బలం - ఈ రెండూ ఇప్పుడు ధైర్యాన్ని పెంచాయి.
అచ్ఛా, టీచర్లు చేతులు ఎత్తండి. బాప్‌దాదా అందరికీ ఒకటే చెబుతున్నారు - ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, సేవలో అభివృద్ధి చెందుతూ ఉండండి.
పిల్లలతో మిలనము చేసిన తర్వాత బాప్‌దాదా తమ హస్తాలతో జెండాను ఎగరవేశారు
ఈ జెండా ఎగిరినప్పుడు పిల్లలకు ఎంత సంతోషం కలుగుతోంది! మరి ఈ జెండా ప్రపంచమంతటా అందరి ముందు ఎగిరినప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది! ఎంతగా చప్పట్లు కొడతారు! జెండాను ఎల్లప్పుడూ ఎత్తులో ఉంచుతారు. ఎందుకు? ఎత్తులో ఉంటే అందరి దృష్టి దాని వైపే వెళ్తుంది. అలాగే ప్రత్యక్షత యొక్క జెండా ఎగిరినప్పుడు అందరి దృష్టి ఒక్క బాబా వైపే ఉంటుంది. మీ హృదయాలలో స్మృతి యొక్క బాబా జెండా ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఇతరుల హృదయాలలో ఈ ప్రత్యక్షత యొక్క జెండాను ఎగరవేయాలి. ఇది వస్త్రంతో చేసిన జెండా మాత్రమే. కానీ ప్రత్యక్షత యొక్క జెండాను మీరందరూ కలిసి ఎగరవేయాలి. అది తప్పకుండా ఎగరాలి.
జాంబియా మాజీ రాష్ట్రపతి కెన్నెత్ కౌండా గారితో మరియు వారి సహచరులతో అవ్యక్త బాప్‌దాదా మిలనము
మీరు చాలా మంచి సమయంలో ఇక్కడికి వచ్చారు. సేవ చేసే చాలా మంచి ఛాన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మిమ్మల్ని మీరు కేవలం జాంబియా సేవాధారిగా భావిస్తున్నారా? లేక గాడ్లీ మెసెంజర్‌గా భావిస్తున్నారా? జాంబియాలో గాడ్లీ మెసెంజర్‌గా కూడా మారి గాడ్లీ మెసేజ్ ఇస్తారు కదా! చూడండి, సేవ సంస్కారాలు మీలో ముందునుండే ఉన్నాయి. ఇప్పుడు సేవలో స్పిరిచ్యువాలిటీని జోడించాలి. ఈరోజు ప్రపంచంలో స్పిరిచ్యువాలిటీ(ఆధ్యాత్మికత) లేకుండా పరివర్తన రావడం కష్టమని మీకు కూడా తెలుసు. మీరు రాజకీయ సేవ కోసం గ్రూపులు తయారుచేసినట్లే, ఇప్పుడు ఆధ్యాత్మిక విలువల గ్రూపును కూడా తయారుచేయండి. ఇప్పుడు రాజకీయ కార్యంలో మీకు సహయోగులు, గ్రూపులు ఉన్నట్లే, నైతిక విలువలను ముందుకు తీసుకువెళ్లే ఒక గ్రూపును సిద్ధం చేయండి. ఇలా ప్రతి దేశంలో చిన్నదైనా, పెద్దదైనా ఎవరో ఒకరు నిమిత్తమైతే ఈ వైబ్రేషన్స్ వ్యాపిస్తాయి. మీలో ముందే రెండు విశేషతలు ఉన్నాయి. వాటి ఆధారంగా మీరు ఇంకా త్వరగా ముందుకు వెళ్లగలరు. ఒకటి - మొదటి నుండే దృఢ నిశ్చయంతో చేయాల్సిందే అని ఉండటం. రెండవది - సేవ కోసం ఏదైనా సహించాల్సి వచ్చినా సహనశక్తి కలిగి ఉండటం. ఎక్కడ దృఢత్వం, సహనశక్తి ఉంటాయో అక్కడ ఏదైనా చేయగలరు. అచ్ఛా.
మారిషస్ మాజీ విద్యా మరియు విజ్ఞానశాఖ మంత్రి పరశురామ్ అన్నయ్య గారితో:- వీరు కూడా లక్కీ. ఎందుకంటే ఎప్పుడూ మననం చేస్తూ ఉంటారు. ఇలా కాదు, ఇలా చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. మనన శక్తి ఉన్నవారికి బాబా సహాయం కూడా లభిస్తుంది. కష్టమైన పని కూడా సహజమైపోతుంది. ఇప్పటివరకు చేసినది చాలా మంచిగా చేశారు. ఇకముందు కూడా చేయాల్సిందే. ఆలోచిస్తాం, చేస్తాం కాదు - చేయాల్సిందే. చూద్దాం, చేస్తాం అని అనుకునేవారు విఘ్నాలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గిపోతారు. కానీ, చేయాల్సిందే అనే దృఢ సంకల్పం ఉన్నవారు పాస్ అయిపోతారు. ఎంత పెద్ద గోడ ఎదురైనా దాటిపోతారు. గోడ చిన్నదైపోతుంది, మీరు శక్తిశాలులై పెద్దవారవుతారు. అందుకే ధైర్యాన్ని, బాబా తోడును ఎప్పుడూ విడవకండి.
(రిట్రీట్‌కు వచ్చిన ఇతర అతిథులను చూస్తూ):- మీరందరూ కలిసి ఏదైనా చేయగలరు. మీ శక్తులను కార్యంలో ఉపయోగిస్తూ వెళ్తే అవి ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు స్పిరిచ్యువల్ పవర్ గురించిన అనుభవం కూడా కలిగింది. స్పిరిచ్యువల్ పవర్ అనుభవమైంది కదా! అచ్ఛా. గ్రూపు చాలా మంచిది. వీరు ఇంకా ఇతర గ్రూపులను కూడా తీసుకువస్తారు. ఎవరి భావన స్పిరిచ్యువాలిటీ వైపు ఉంటుందో వారికి ఆ భావన యొక్క ఫలం తప్పకుండా లభిస్తుంది. ఇప్పుడు గాడ్లీ మెసేజ్ ఇవ్వడంలో కూడా సహయోగులుగా కావాల్సిందే.
వీడ్కోలు సమయంలో బాప్‌దాదా విదేశీ సేవల సిల్వర్ జూబిలీకి అభినందనలు తెలియజేసి, సంవత్సరం మొత్తం క్రోధముక్తంగా ఉన్నవారిని స్టేజ్‌పైకి పిలిచారు:-
మీరందరూ బాగా జరుపుకున్నారా? మిమ్మల్ని మీరు తయారుచేసుకున్నారా? జరుపుకోవడం అంటే తయారవడం. కాబట్టి జరుపుకున్నారు కూడా, మిమ్మల్ని మీరు తయారుచేసుకున్నారు కూడా. ఈ రోజు విశేషంగా విదేశీ సేవ స్థాపన యొక్క సిల్వర్ జూబిలీ. కాబట్టి సిల్వర్ జూబిలీ వారందరికీ - ప్రత్యేకంగా లండన్, హాంకాంగ్, నైరోబీ, లుసాకా... ఎక్కడెక్కడ సేవ జరిగిందో, ఎవరెవరు సేవ చేశారో వారందరికీ చాలా చాలా అభినందనలు! అభినందనలు! అభినందనలు! మరి సిల్వర్ జూబిలీని కూడా జరుపుకోండి. ఇది ముఖ్యంగా డబల్ విదేశీయుల సిల్వర్ జూబిలీ. మీది సిల్వర్ జూబిలీ కదా? (21 సంవత్సరాలు అయ్యాయి.) అయినా 21 సంవత్సరాలు పూర్తిచేసుకున్న మీ అందరికీ అభినందనలు. 21 సంవత్సరాలు పూర్తిచేసుకున్నవారు చేతులు ఎత్తండి.
క్రోధముక్తంగా ఉన్నవారితో:- అచ్ఛా, మీరు ధైర్యంతో మంచి పని చేశారు. కానీ దానిని వదిలిపెట్టకండి. ఎల్లప్పుడూ అలాగే ఉంటారు కదా! లేక కొంచెం సడలిపోతారా? సడలకూడదు. ఇంకా దృఢంగా మారాలి. అచ్ఛా!
*** ఓంశాంతి ***
