‘‘సంగమయుగ ప్రాప్తుల యొక్క ప్రారబ్ధాన్ని అనుభవము చెయ్యండి, మాస్టర్ దాతగా, మహా సహయోగిగా అవ్వండి’’
ఈరోజు భాగ్యవిధాత అయిన బాబా తమ శ్రేష్ఠ భాగ్యవాన్ పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్య రేఖలను చూస్తూ భాగ్యవిధాత అయిన బాబా కూడా హర్షిస్తారు ఎందుకంటే మొత్తము కల్పమంతా తిరిగి చూసినా కానీ మీకున్న శ్రేష్ఠ భాగ్యము ఏ ధర్మాత్మకు కానీ, మహాత్మకు కానీ, రాజ్యాధికరి ఆత్మకు కానీ, ఎవ్వరికీ కూడా సంగమయుగ శ్రేష్ఠ ఆత్మలైన మీకున్నంత గొప్ప భాగ్యము లేదు. మస్తకముపై మీ భాగ్యరేఖలను చూస్తున్నారా? బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకముపై మెరుస్తున్న జ్యోతి యొక్క శ్రేష్ఠ రేఖను చూస్తున్నారు. మీరందరూ కూడా మీ రేఖలను చూసుకుంటున్నారా? నయనాలలో చూస్తే స్నేహము మరియు శక్తి యొక్క రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నోటిపై మధుర శ్రేష్ఠ వాణి అనే రేఖలు మెరుస్తున్నాయి. పెదవులపై చూస్తే ఆత్మిక మందహాసము, ఆత్మిక సంతోషపు మెరుపుతో కూడిన రేఖ కనిపిస్తూ ఉంది. హృదయంలో లేక మనసులో చూస్తే హృదయాభిరాముని ప్రేమలో లవలీనులై ఉండే రేఖ స్పష్టంగా ఉంది. చేతులలో చూస్తే, రెండు చేతులు సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండే రేఖను చూడండి, పాదాలలో చూస్తే ప్రతి అడుగులో పదమాల ప్రాప్తి కల రేఖ స్పష్టంగా ఉంది. ఇది ఎంత గొప్ప భాగ్యము!
భాగ్యవిధాత అయిన బాబా పిల్లలు ప్రతి ఒక్కరికీ పురుషార్థం ద్వారా, శ్రేష్ఠ కర్మల కలము ద్వారా ఈ అన్ని రేఖలను గీసుకోవటానికి విశాల హృదయంతో పూర్తి అవకాశాన్ని ఇచ్చారు. ఈ రేఖలను ఎంత పొడవుగా గీసుకోవాలనుకుంటే అంత పొడవుగా గీసుకోవచ్చు, కానీ సమయం లోపలే గీసుకోవాలి. ఎవరు ఎంత పొడవాటి రేఖను గీసుకోవాలనుంటే అంత స్వయమే గీసుకోగలరు, బాబా కలమును మీ చేతికి ఇచ్చారు. మరి ఆ రేఖను గీసుకోవటము వస్తుందా? గీసుకున్నారా లేక గీసుకోవటం రావటం లేదా? అందరికీ వస్తుందా? (హాజీ). చాలా మంచిది. చూడండి, ఇప్పటి అదృష్ట రేఖ మిమ్మల్ని మొత్తము కల్పములో కూడా శ్రేష్ఠంగా తయారుచేస్తుంది. 21 జన్మలైతే సదా సంపన్నంగా మరియు సుఖంగా ఉండే రేఖ ఎలాగూ ఉంటూనే ఉంటుంది మరియు ద్వాపర-కలియుగాలలో కూడా పూజ్యులుగా అయ్యే మీ రేఖ శ్రేష్ఠంగా ఉంటుంది. కనుక ఈ సమయములోని భాగ్యరేఖ మొత్తము కల్పమంతా సదా తోడుగా నడుస్తుంది ఎందుకంటే ఇది అవినాశీ బాబా యొక్క అవినాశీ రేఖ. మరి, సదా మీ శ్రేష్ఠ భాగ్యరేఖ స్మృతిలో ఉంటుందా? ఉండటమైతే ఉంటుంది కానీ ఒక్కోసారి ఇమర్జ్ అయ్యి (ప్రత్యక్షమై), ఒక్కోసారి మర్జ్ అయ్యి (గుప్తమై) ఉంటుందా లేక ఎప్పుడూ ఇమర్జ్ అయ్యే ఉంటుందా? ఇందులో తక్కువమంది చేతులెత్తుతున్నారు. చూడండి, సదా ఇమర్జ్ అయ్యి ఉండాలి. ఇమర్జ్ అయి ఉంది అన్నదానికి గుర్తు ఏమిటంటే - పాత స్మృతులు, పాత సంస్కారాల రేఖలు మర్జ్ అయిపోతాయి. ఎప్పుడూ పాత సంస్కారాల రేఖలు లేక పాత విషయాల స్మృతి రేఖలు ఇమర్జ్ అవ్వకూడదు, మర్జ్ అయ్యి ఉండాలి మరియు మర్జ్ అవుతూ-అవుతూ సమాప్తమైపోవాలి. ఎక్కడైతే శ్రేష్ఠ భాగ్యరేఖలు ఇమర్జ్ అయ్యి ఉంటాయో అక్కడ పాత రేఖలు ఇమర్జ్ అవ్వటము అసంభవము. ఒకవేళ అలా జరుగుతుంది అంటే శ్రేష్ఠ భాగ్యరేఖ సదా ఇమర్జ్ అయ్యి ఉండటం లేదు అన్నది నిరూపణ అవుతుంది. మరి ఏమనుకుంటున్నారు? ఇంతటి శ్రేష్ఠ భాగ్య రేఖలు ఇమర్జ్ అయ్యి ఉండాలా లేక మర్జ్ అయ్యి ఉండాలా?
బాప్‌దాదా వర్తమాన సమయములో పిల్లలందరినీ వర్తమాన సంగమయుగ ప్రాప్తుల యొక్క ప్రారబ్ధ రూపములో చూడాలనుకుంటున్నారు. పురుషార్థము చాలా సమయము చేసారు, ఇప్పుడు పురుషార్థము స్వతహాగా జరగాలి, శ్రమ పడి పురుషార్థము చెయ్యటము కాదు. అంతిమము వరకు పురుషార్థం యొక్క శ్రమ చేస్తూనే ఉంటారా? సంగమయుగపు ప్రాప్తులు అనే ప్రారబ్ధం యొక్క అనుభవాన్ని ఇప్పుడు చెయ్యకపోతే మరెప్పుడు చేస్తారు! భవిష్య ప్రారబ్ధము వేరు. అదైతే మీ ఈ పురుషార్థము యొక్క ప్రారబ్ధానికి నీడవంటిది. అదైతే మీ వెనుక-వెనుక దానంతటదే వస్తుంది. కానీ ఈ సమయములోని ప్రారబ్ధాన్ని ప్రాప్తి చేసుకోవటమే విశేషమైన విషయము. ఎవరైనా మిమ్మల్ని - ఎలా ఉన్నారు, పరిస్థితి ఏమిటి అని అడిగితే - పురుషార్థమే నడుస్తూ ఉంది అని ఇప్పటికీ అదే చెప్పకూడదు. పురుషార్థమైతే జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు పురుషార్థం యొక్క ప్రారబ్ధాన్ని అనుభవం చేయండి. ఆ ప్రారబ్ధమే సర్వ శక్తి సంపన్నము, సర్వ జ్ఞాన సంపన్నము, సర్వ విఘ్న వినాశక మూర్తి. ఇప్పటి ఈ ప్రారబ్ధము భవిష్యత్తులో స్వతహాగానే ప్రాప్తిస్తుంది. ఎలా అయితే భవిష్యత్తులో కేవలము ప్రారబ్ధమే ఉంటుందో, పురుషార్థం సమాప్తమైపోతుందో అలా ఇప్పుడు మిగిలి ఉన్న సమయంలో ప్రారబ్ధ స్వరూపాన్ని విశేషంగా అనుభవము చేయండి. ప్రారబ్ధము అని అనటమంటే అది పురుషార్థము యొక్క ప్రారబ్ధమే. పురుషార్థము చేసారు, ఆ పురుషార్థము అనుసారంగానే ప్రారబ్ధాన్ని అనుభవం చేసుకోగలరు. కానీ బాప్‌దాదా పిల్లల నుండి ఏం కోరుకుంటున్నారు? బాప్‌దాదా మా నుండి ఏం కోరుకుంటున్నారు అని మీరు అడుగుతారు కదా? బాప్‌దాదా కోరుకుంటుంది ఏమిటంటే - ఇప్పుడు కొద్ది సమయము కొరకు పురుషార్థము యొక్క ప్రారబ్ధ స్వరూపులుగా అయిపోండి. అవ్వగలరా లేక పురుషార్థపు శ్రమే మంచిగా అనిపిస్తుందా? ప్రారబ్ధం కలవారిగా అవుతారా? ఇప్పుడు పురుషార్థం చేస్తున్నాను, పురుషార్థం అయిపోతుంది, చేసి చూపిస్తాను - అన్న ఈ మాటలు సమాప్తమైపోవాలి. చేసి చూపిస్తాను ఏంటి, చూపించండి, ఇంకెప్పుడు చూపిస్తారు? వినాశన సమయములో చూపిస్తారా ఏమిటి? ఇందుకు చాలా సహజమైన విధి ఏమిటంటే - ఇప్పుడు మాస్టర్ దాతగా అవ్వండి. బాబా నుండి తీసుకున్నారు మరియు తీసుకుంటూ కూడా ఉండండి కానీ ఆత్మల నుండి తీసుకునే భావనను పెట్టుకోకండి - వీరు ఇది చేస్తే ఇలా ఉంటుంది, వీరు మారితే నేను మారుతాను - ఇవన్నీ తీసుకునే భావనను ఉంచుకోవటము. ఇలా ఉంటే అలా ఉంటుంది, ఇవి తీసుకునే భావనలు. అలా ఉండాలి అని అనటము కాదు, అలా చేసి చూపించాలి. అలా జరిగితే... అని అనకండి, అలా జరగాల్సిందే మరియు నేనే చేయాలి. నేనే వైబ్రేషన్ ఇవ్వాలి. నేనే దయాహృదయునిగా అవ్వాలి. నేనే గుణాల సహయోగాన్ని ఇవ్వాలి, నేనే శక్తుల సహయోగాన్ని ఇవ్వాలి. ఇలా మాస్టర్ దాతగా అవ్వండి. తీసుకోవాలనుకుంటే ఒక్క బాబా నుండే తీసుకోండి. ఒకవేళ ఇతర ఆత్మల నుండి ఏదైనా లభించినా కానీ, అక్కడ బాబా వారికి ఇచ్చినదే మీకు లభిస్తుంది. కనుక దాతగా అయ్యి విశాలహృదయులుగా అవ్వండి. ఇస్తూనే ఉండండి, ఇవ్వటం వస్తుందా? లేక కేవలం తీసుకోవటమే వస్తుందా? ఏదైతే జమ చేసుకున్నారో, అది ఇప్పుడు ఇవ్వండి. పరస్పరంలో బ్రాహ్మణ ఆత్మలు కూడా మాస్టర్ దాతలుగా అవ్వండి. ఇతరులు ఇస్తే నేను ఇస్తాను అని కాదు, నేను ఇవ్వాలి. మీ వద్ద ఖజానా ఉందా? నిండుగా ఉందా? గుణాలతో నిండుగా ఉందా? శక్తులతో నిండుగా ఉందా? ఉంటే మరెందుకు ఇవ్వటం లేదు? మీ కోసమని దాచిపెట్టుకున్నారా? ఖజానాలతో నిండుగా ఉన్నారంటే ఇస్తూ వెళ్ళండి. వీరెందుకు ఇలా చేస్తారు, వీరెందుకు ఇలా అంటారు అని ఆలోచించకండి. దయార్ద్ర హృదయులుగా అయ్యి మీ గుణాలు మరియు మీ శక్తుల యొక్క సహయోగాన్ని ఇవ్వండి - ఇటువంటివారినే మాస్టర్ దాత, మహా సహయోగి అని అంటాము. కేవలం సహయోగిగా అవ్వడం కాదు, మహా సహయోగిగా అవ్వండి, మహా దాతగా అవ్వండి. మరి బాప్‌దాదా ఏం కోరుకుంటున్నారో అర్థమైందా?
బాప్‌దాదా ఇప్పటివరకు పిల్లలు చేస్తున్న పురుషార్థపు శ్రమను చూడలేకపోతున్నారు. డైమండ్ జూబ్లీ సమాప్తమైపోయింది కానీ డైమండ్లు ఇప్పటివరకు మచ్చలేనివారిగా అయ్యే పురుషార్థములోనే మునిగి ఉన్నారు. డైమండ్ జూబ్లీ అనగా ప్రతి బ్రాహ్మణ ఆత్మ (డైమండ్) మెరుస్తూ ఉండాలి. మీరెలా ఆలోచిస్తారంటే - డైమండ్ జూబ్లీ మాది కాదు కదా, దాదీలది కదా. అది మీదా లేక దాదీలదా, ఎవరిది? అది యజ్ఞ స్థాపనా కార్యము యొక్క డైమండ్ జూబ్లీ, అది కేవలం దాదీలదే కాదు, స్థాపనా కార్యము యొక్క డైమండ్ జూబ్లీ. కనుక మీరంతా, రెండు సంవత్సరాలవారు కావచ్చు, 12 సంవత్సరాలవారు కావచ్చు, 50 సంవత్సరాలవారు కావచ్చు, కానీ స్థాపనా కార్యానికైతే నిమిత్తులే కదా, కాదా? నిమిత్తులేనా? బ్రాహ్మణులు అంటేనే బ్రహ్మా బాబాతోపాటు స్థాపనా కార్యానికి నిమిత్తమైన ఆత్మలు అని అర్థము. వారే బ్రహ్మాకుమారులు లేక బ్రహ్మాకుమారీలు అని పిలువబడగలరు. మరి అందరూ బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలేనా లేక పురుషార్థీ కుమారులు, కుమారీలా? మీరెవరు? బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలు అనగా జన్మ తీసుకోవటంతోనే బ్రహ్మాబాబాకు సహచరులై స్థాపనకు నిమిత్త ఆత్మలుగా అయినట్లు. కనుక మేమైతే ఇప్పుడు కొత్తవారము, మేమైతే ఇప్పుడు చిన్నవాళ్ళము అని ఆలోచించవద్దు. సమయమనుసారంగా సమయ సమాప్తి సమీపంగా వచ్చినప్పుడు చిన్నవారైనా, కొత్తవారైనా ఇంతే తీవ్ర పురుషార్థం చెయ్యవలసిందే, ఒకవేళ బ్రాహ్మణులైతే. ఒకవేళ క్షత్రియులైతే మీ ఇష్టము. కానీ ఒకవేళ బ్రాహ్మణులైతే బ్రాహ్మణుల నుండి దేవతలు అని అంటారు, అంతేకానీ క్షత్రియుల నుండి దేవతలు అని అనరు. కనుక బ్రాహ్మణ ఆత్మలు స్థాపనకు నిమిత్తులుగా అవ్వాల్సిందే. ఉన్నదే నిమిత్తులుగా, కనుక ఇప్పుడు మాస్టర్ దాతగా అవ్వండి. దానమివ్వకండి కానీ సహయోగాన్ని ఇవ్వండి. బ్రాహ్మణులు, బ్రాహ్మణులకు దానమివ్వలేరు. కానీ సహయోగాన్ని ఇవ్వవచ్చు. కనుక ఏమి చెప్పారు? మహా దాతగా మరియు మహా సహయోగిగా అవ్వండి. ఒక్క సంవత్సరమువారైనా కూడా సమయమనుసారంగా ఇప్పుడు చిన్ననాటి విషయాలను సమాప్తం చెయ్యండి ఎందుకంటే పిల్లలందరూ వానప్రస్థావస్థకు సమీపంగా ఉన్నారు. సమయం యొక్క వేగం అనుసారంగా, డ్రామా యొక్క నియమం అనుసారంగా ఇప్పుడు అందరి వానప్రస్థావస్థ సమీపంగా ఉంది.
పిల్లలకు బాబాపై గాఢమైన స్నేహము ఉందన్న సంగతి బాప్‌దాదాకు తెలుసు. ఎంతో గాఢమైన స్నేహము ఉంది కదా? లేక పై-పై స్నేహమేనా? హృదయపూర్వకమైన స్నేహము ఉంది కనుకనే పరుగెత్తుకుని వచ్చారు కదా? చూడండి, అనంతమైన హాల్లో, అనంతమైన బాబా యొక్క పిల్లలు అనంతమైన రూపంలో విరాజమానమై ఉన్నారు. ఈ హాల్ మంచిగా అనిపిస్తుంది కదా లేక దూరమనిపిస్తుందా? చూడండి, కూర్చోవటంలోనైతే దూరంగా కూర్చున్నారు, కానీ బాప్‌దాదా తమ హృదయం అనే చాలా పెద్ద స్క్రీన్‌పై దూరంగా కూర్చున్న పిల్లలను కూడా అతి సమీపంగా చూస్తున్నారు అంతేకానీ దూరంగా చూడటం లేదు. బాప్‌దాదా యొక్క హృదయం అనే స్క్రీన్ చాలా పెద్దది. ఇప్పటివరకు సైన్స్ వారు కూడా అంత పెద్ద స్క్రీన్‌ను కనిపెట్టలేదు. అందుకే మీరు దూరంగా కూర్చోలేదు, బాప్‌దాదా హృదయంలో కూర్చున్నారు. ఇలా భావిస్తున్నారా? కుర్చీపై కూర్చున్నారా, తివాచిపై కూర్చున్నారా లేక హృదయంలో కూర్చున్నారా? ఈ దృశ్యమైతే చాలా మంచిగా, సుందరంగా అనిపిస్తుంది. పూర్తిగా చివరి వరకు నిండిపోయిందా లేక కొంచెం ఖాళీ ఉందా? వెనుక కొంచెం ఖాళీ ఉండటాన్ని బాప్‌దాదా చూస్తున్నారు.
చూడండి, మీకు బాప్‌దాదా ఒక పని ఇచ్చారు. మీరు మర్చిపోయి ఉండచ్చు కానీ బాప్‌దాదాకు గుర్తుంది. ఏ పని ఇచ్చాను? (క్రోధముక్తులుగా అవ్వాలని) ఈ రోజు అది అడగను. మొదటి అవకాశం తీసుకున్నారు కదా, అందుకే ఈ రోజు క్రోధముక్తులుగా అయ్యారా అని అడిగితే నిరాశపడతారు. బాప్‌దాదాకు రిజల్టు తెలుసు. కానీ తర్వాత అడుగుతాను. మీది కూడా అక్కడి నుండి రిజల్టు తెప్పించుకుంటాము. ఈ రోజు వదిలేస్తున్నాము. 9 లక్షల మందిని తయారుచేసి చూపించండి అని పని ఇచ్చాము కదా, గుర్తుందా, ప్రతి జోన్‌కు చెప్పాము. మరి ఏ జోన్ 9 లక్షల మందిని తయారుచేసింది?
సేవా టర్న్ బెంగాల్, బీహార్ వారిది. మరి బెంగాల్, బీహార్ వారు 9 లక్షల మందిని తయారుచేసారా? మౌనంగా ఉన్నారు, మాట్లాడటం లేదు. పోనీ ఒక్క జోన్ కాకపోయినా, అన్ని జోన్లు, దేశ-విదేశాలలోని వారు కలిసి 9 లక్షల మందిని తయారుచేసారా? విదేశీయులు చెప్పండి. 9 లక్షల మంది ఉన్నారా? బాప్‌దాదా అయితే తమ డేట్‌ను ఫిక్స్ చేసుకుంటారు మరియు ఆ ఫిక్స్ చేసిన డేట్‌కే వస్తారు. మీరు కూడా అన్ని విషయాలకు డేట్‌ను ఫిక్స్ చేసుకుంటారా? ఈ హాల్ ఎప్పటికల్లా తయారవుతుంది, ఫంక్షన్ ఎప్పుడు జరుగుతుంది, ఈ డేట్‌ను ఫిక్స్ చేస్తారు కదా? మరి దీని డేట్ ఎప్పుడు? ఫిక్స్ చేసారా? వినాశనానికి చివర్లోనా లేక ముందా? ఎప్పుడు ఉంటుంది? ఏమి ఆలోచించారు? ఏ డేట్ ? ఏదైనా డేట్ ఉందా లేక ఇప్పుడు ఇంకా ఫిక్స్ చెయ్యలేదా? ఇది కూడా బాబానే చెయ్యాలా. చెయ్యాల్సింది మీరు. బాప్‌దాదా అయితే శుభ కార్యంలో ఆలస్యం చెయ్యకండి అని చెప్తారు, మరి ఏం చేస్తారు? సరే, ఈ సీజన్ చివరికల్లా అయిపోయినా కానీ మంచిదే. అంత ధైర్యం ఉందా? కేవలం దాతగా అవ్వండి. ఒకవేళ దాతగా అయినట్లయితే దాతా భావన ద్వారా మీ రాయల్ కుటుంబీకులు మరియు సమీప ప్రజలు చాలా త్వరగా తయారవుతారు. వారైతే ఎదురుచూస్తూ ఉన్నారు, కేవలం సదా దాతగా అవ్వటమే ఆలస్యము, మహా సహయోగిగా అవ్వటమే ఆలస్యము. ఖజానాను ఎక్కువగా స్వయం కోసము లేక కేవలము స్వయం యొక్క సేవల కోసమే ఉపయోగిస్తున్నారు. మీ-మీ సేవల యొక్క డ్యూటీలలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. మహా దాతగా అయ్యి, అనంతమైన దాతగా అయ్యి విశ్వమనే గ్లోబ్‌పై నిలబడి అనంతమైన సేవలో వైబ్రేషన్లను వ్యాపింపజెయ్యండి. మీరు విశ్వ రాజుగా అవ్వాలి, అంతేకానీ జోన్‌కు లేక మీ-మీ సేవా బాధ్యతల పరిధిలో మాత్రమే రాజుగా అవ్వటము కాదు. మీరు విశ్వ కళ్యాణకారులు. ఇప్పుడు అనంతములోకి వెళ్ళండి. అనంతములోకి వెళ్ళటం ద్వారా హద్దు విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. మనోబలము చాలా శ్రేష్ఠమైన బలము, దానిని ఉపయోగించటం లేదు. వాణి, సంబంధ-సంపర్కాల ద్వారా సేవ చేయటంలోనే బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు మనోబలాన్ని పెంచండి. మీరు వాణి ద్వారా మరియు సంబంధాలు, సహయోగం ద్వారా అనంతమైన సేవను ఏదైతే చేస్తున్నారో, అది ఇప్పుడు మనోబలంతో చెయ్యండి. మనోబలం యొక్క అనంతమైన సేవను ఒకవేళ మీ అనంతమైన వృత్తి ద్వారా, మనోబలం ద్వారా విశ్వమనే గ్లోబ్‌పై ఉన్నతమైన స్థితిలో స్థితులై, బాబాతోపాటు పరంధామం యొక్క స్థితిలో స్థితులై ఈ సేవను కొద్ది సమయం చేసినా, మీకు దాని ప్రారబ్ధం అనేక రెట్లు ఎక్కువ లభిస్తుంది.
ఇప్పటి సమయము మరియు పరిస్థితుల అనుసారంగా అంతిమ సేవ ఈ మనసా సేవ లేక మనోబలం యొక్క సేవయే. ఈ అభ్యాసాన్ని ఇప్పటినుండే చెయ్యండి. వాణి ద్వారా మరియు సంబంధ-సంపర్కాల ద్వారా సేవ చేస్తారు కానీ ఇప్పుడు ఈ మనసా సేవ యొక్క అభ్యాసము అత్యంత అవసరము, వాటితో పాటు దీనిని కూడా అభ్యాసం చేస్తూ వెళ్ళండి. ఏం చెయ్యాలో అర్థమైందా? స్థాపన ఆదిలో బాబా యొక్క మనసా ద్వారా ఏ ఆత్మిక ఆకర్షణైతే పిల్లలను ఆకర్షించిందో, ఇప్పుడు ఈ మనసా సేవ ఆ దృశ్యాన్నే చూపిస్తుంది. మనసా సేవ యొక్క ఫల స్వరూపాన్ని ఇప్పటికీ కూడా చూస్తున్నారు, అదేమిటంటే - ఆ ఆత్మలే ఇప్పుడు కూడా పునాదిగా ఉన్నారు. ఎంత పక్కాగా అయ్యారు అనేది డ్రామా అనుసారంగా బాబా యొక్క మనసా ఆకర్షణకు ఋజువు. కనుక అంతిమములో కూడా, ఇప్పుడు బాబాతోపాటు మీ మనసా ఆకర్షణ ద్వారా, ఆత్మిక ఆకర్షణ ద్వారా ఏ ఆత్మలైతే వస్తారో, వారు సమయమనుసారంగా తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో బ్రాహ్మణ పరివారాన్ని వృద్ధి చేసేందుకు నిమిత్తులు అవుతారు. ఆదిలోని ఆ దృశ్యాన్ని అంతిమంలో కూడా చూస్తారు. ఆదిలో బ్రహ్మాబాబాను సాధారణమైనవారిగా చూడకుండా శ్రీకృష్ణుని రూపంలో అనుభవం చేసేవారు. సాక్షాత్కారము అవ్వటం వేరే విషయము, కానీ సాక్షాత్తు శ్రీకృష్ణ స్వరూపాన్నే చూస్తూ, వారితోనే తింటూ-త్రాగుతూ, నడుస్తూ ఉండేవారు. అలాగే జరిగింది కదా? మరి స్థాపనలో బాబా ఒక్కరే చేసారు, అంతిమంలో పిల్లలైన మీరు కూడా ఆత్మల ముందు సాక్షాత్తు దేవీ-దేవతలుగా కనిపిస్తారు. వీరు సాధారణమైనవారు అని వారు అనుకోనే అనుకోరు. ఆ పూజ్య స్థితి ప్రభావాన్నే అనుభవము చేస్తారు. అప్పుడు బాబా సహితంగా మీ అందరి ప్రత్యక్షత అనే పరదా తెరుచుకుంటుంది. ఇప్పుడు బాబా ఒంటరిగా ప్రత్యక్షమవ్వరు, పిల్లలతోపాటు ప్రత్యక్షమవుతారు. ఏ విధంగా స్థాపనలో బ్రహ్మాతోపాటుగా విశేషంగా బ్రాహ్మణులు కూడా స్థాపనకు నిమిత్తులు అయ్యారో, అదే విధంగా సమాప్తి సమయంలో కూడా బాబాతోపాటు అనన్యులైన పిల్లలు కూడా సాక్షాత్తు దేవతా రూపంలో అనుభవమవుతారు. దీని కొరకు ఈ రోజు ఏదైతే వినిపించామో, ఆ విధంగా ఇప్పటి నుండి ప్రారబ్ధ స్వరూపంలో స్థితులై ఉండండి. చిన్న-చిన్న విషయాలను వదిలెయ్యండి, ఇప్పుడు ఉన్నతిలోకి వెళ్ళండి. విశేషంగా ప్రారబ్ధ స్వరూపపు సాక్షాత్కారాన్ని స్వయము కూడా చూడండి మరియు ఇతరులకు కూడా చేయించండి. అర్థమైందా!
ఇప్పుడు అందరూ తమ అనాది స్వరూపములో ఒక్క క్షణంలో స్థితులవ్వగలరా? ఎందుకంటే అంతిమంలో ఒక్క క్షణంలోనే ఈల మ్రోగనున్నది. కనుక ఇప్పటినుండే అభ్యాసం చెయ్యండి. కేవలం అలా స్థితులైపోండి, అంతే. (డ్రిల్ చేయించారు) అచ్ఛా.
అందరూ సౌకర్యంగా ఉంటున్నారా? శాంతివన్ బాగానే అనిపిస్తుందా? అందరికీ నచ్చిందా? డబల్ విదేశీయులు చేతులు ఎత్తండి. డబల్ విదేశీయులకు డబల్ నషా ఉందా లేక పదమారెట్లు నషా ఉందా? పదమారెట్లు నషా ఉందా లేక డబల్ నషా ఉందా? విదేశాలలో కూడా వింటున్నారు కదా? అన్ని దేశాలలో వింటున్నారు కదా? (శాటిలైట్-ఇంటర్నెట్ ద్వారా 50 కంటే ఎక్కువ దేశాలలో బాప్‌దాదా మురళిని ప్రత్యక్షంగా అందరూ వింటున్నారు) చూడండి, విదేశాల ఇన్వెన్షన్ ముందుగా విదేశాలలోనే ఉపయోగంలోకి వస్తోంది. బాప్‌దాదాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే విదేశీయులు బాప్‌దాదాను ప్రత్యక్షం చేయడంలో సహయోగులుగా అవుతున్నారు, ఇంకా ముందూ అవుతారు. బుద్ధిని బాగా ఉపయోగిస్తారు. మంచి ఇన్వెన్షన్లు తీసుకొస్తారు. అందుకే మొదటి ఛాన్స్ వారికి లభించింది. కాబట్టి ఎవరు ఎవరి దేశాలలో వింటున్నారో, బాప్‌దాదా పిల్లలందరినీ ఈ హాల్లో ఫరిశ్తా రూపంలో హాజరైనట్లుగా చూస్తున్నారు. డబల్ సభను చూస్తున్నారు. ఒకటి సాకార సభ, మరొకటి ఫరిశ్తాల సభ. భారతదేశంలో కూడా నలుదిక్కుల పిల్లలు ఈ సమయంలో ఫరిశ్తా రూపంలో శాంతివన్‌కు చేరుకున్నారు. కాబట్టి సాకార రూపధారి పిల్లల కంటే ముందుగా పిల్లలందరికీ అఖండ ప్రియస్మృతులను ఇస్తున్నారు. బాప్‌దాదా చూస్తున్నారు - మూలమూలల నుండి పిల్లలు శాంతివన్ నివాసులై అవ్యక్త అనుభవాన్ని చేస్తున్నారు. చాలా మంచి సాధనం లభించింది. ఎల్లప్పుడూ సాధనం మరియు సాధన రెండింటినీ కలిపి ఉంచండి. అచ్ఛా.
నలువైపులా ఉన్న పిల్లలందరికీ, సదా భాగ్యరేఖలను ఇమర్జ్ రూపంలో స్మృతిలో ఉంచుకునే ఆత్మలకు, సదా తమ సంగమయుగ సర్వ ప్రాప్తి స్వరూపపు ప్రారబ్ధాన్ని అనుభవము చేసేవారికి, సదా మాస్టర్ దాత, మహా సహయోగి ఆత్మలకు, సదా మనసా సేవ ద్వారా విశ్వ ఆత్మల కళ్యాణం చేసే కళ్యాణకారీ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
ఈస్టర్న్ మరియు తమిళనాడు సేవాధారులతో:-
ఈస్టర్న్ జోన్ మరియు తమిళనాడు - ఈ రెండు ప్రాంతాలవారు కలిసి తమ ఉల్లాస-ఉత్సాహాలతో, పరస్పర సహకారంతో, ఒకరినొకరు ముందుంచుకుంటూ పోషించిన పాత్ర చాలా మంచిగా ఉంది. ఈ సంగఠన ఎంతో శక్తిని ఇస్తుంది. అందరి సహకారపు వేలు కలిసి సేవ సఫలతను సహజంగా చేస్తుంది. కాబట్టి ఈస్టర్న్ జోన్ మరియు తమిళనాడు నుండి సేవకు వచ్చిన సోదరసోదరీలందరూ, సహకార శక్తిని ఉపయోగించి అందరికీ శాంతి, శక్తి అనుభూతిని, స్నేహానుభూతిని కలిగించారు. అది చాలా బాగుంది, ఇక ముందూ అలాగే మంచిగా ఉంటుంది. అందుకే మీ అందరి తరఫున బాప్‌దాదా కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
