‘‘సకాష్ ఇచ్చే సేవను చేసేందుకు మోహముక్తులుగా అయ్యి అనంతమైన వైరాగులుగా అవ్వండి’’
ఈరోజు విశేషంగా స్నేహం యొక్క రోజు. అమృతవేళ నుండి నలువైపులా ఉన్న పిల్లలు తమ హృదయములోని స్నేహాన్ని బాప్‌దాదాకు అర్పిస్తూ ఉన్నారు. పిల్లలందరి స్నేహమనే ముత్యాలతో కూడిన మాలలు బాప్‌దాదా మెడలో పడుతూ ఉన్నాయి. ఈరోజు ఒకవైపు స్నేహమనే ముత్యాల మాలలు ఉన్నాయి, మరొకవైపు మధురాతి మధురమైన ఫిర్యాదుల మాలలు కూడా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరము ఫిర్యాదులలో తేడాను చూసాము. ఇంతకుముందు ఫిర్యాదులు ఎలా ఉండేవంటే - మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకువెళ్ళాల్సింది, మేము సాకార పాలనను పొందలేదు... ఈ సంవత్సరం మెజారిటీ వారి ఫిర్యాదు ఏమిటంటే ఇప్పుడు బాబా సమానంగా అయ్యి మీ దగ్గరకు చేరుకోవాలి. సమానంగా అవ్వాలి అన్న ఉల్లాస-ఉత్సాహాలు మెజారిటీలో బాగున్నాయి. సమానంగా అవ్వాలన్న కోరిక చాలా తీవ్రంగా ఉంది, తయారైపోవాలి మరియు వచ్చేయాలి అన్న ఈ సంకల్పము ఆత్మిక సంభాషణలో చాలామంది పిల్లలకు ఉంది. బాప్‌దాదా కూడా పిల్లలకు ఇదే చెప్తున్నారు - సమాన భావ, సంపన్న భవ, సంపూర్ణ భవ. ఇందుకు సాధనము సదాకాలము కొరకు చాలా సహజమైనది, అన్నింటికంటే సహజ సాధనము - సదా స్నేహ సాగరములో ఇమిడిపోండి. ఎలా అయితే ఈరోజు స్నేహములో ఇమిడిపోయి ఉన్నారు, వేరే ఏదన్నా గుర్తుందా? బాప్‌దాదా తప్ప వేరే ఏదన్నా గుర్తుందా? లేస్తూ, కూర్చుంటూ స్నేహములో ఇమిడిపోయి ఉన్నారు. నడుస్తూ-తిరుగుతూ ఏ స్మృతి ఉంది? బ్రహ్మా బాబా యొక్క చరిత్ర మరియు చిత్రము, చిత్రము కూడా ఎదురుగా ఉంది మరియు చరిత్ర కూడా స్మృతిలో ఉంది. అందరూ ఈరోజు స్నేహాన్ని విశేషంగా అనుభవం చేసారు కదా? కష్టమనిపించిందా? సహజమైపోయింది కదా! స్నేహము ఎటువంటి శక్తి అంటే, అది అన్నింటినీ మరిపింపజేస్తుంది. దేహమూ గుర్తుకు రాదు, దేహ ప్రపంచమూ గుర్తుకు రాదు. స్నేహము శ్రమ నుండి విడిపిస్తుంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. స్నేహము సదా మరియు సహజంగా బాప్‌దాదా చేతిని తమపై ఉన్నట్లుగా అనుభవము చేయిస్తుంది. స్నేహము ఛత్రఛాయగా అయ్యి మాయాజీతులుగా చేస్తుంది. ఎంత పెద్ద సమస్య రూపీ పర్వతమైనా కానీ, స్నేహమనేది పర్వతాన్ని కూడా నీటిలా తేలికగా చేసేస్తుంది. మరి స్నేహములో ఉండటం వస్తుంది కదా? ఈరోజు ఉండి చూసారు కదా! వేరే ఏమన్నా గుర్తుందా? లేదు కదా! బాబా, బాబా మరియు బాబా... ఒకే స్మృతిలో లవలీనులై ఉన్నారు. కనుక బాప్‌దాదా అంటున్నారు - వేరే ఏ పురుషార్థము చెయ్యకండి, స్నేహ సాగరములో ఇమిడిపోండి. ఇమిడిపోవటం వస్తుందా? అప్పుడప్పుడు పిల్లలు స్నేహ సాగరములో ఇమిడిపోతారు కానీ కొద్ది సమయం ఇమిడిపోయి, మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ఇప్పుడిప్పుడే - బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా అని అంటారు, మళ్ళీ ఇప్పుడిప్పుడే బయటకు వచ్చేసి ఇతర విషయాలలో మునిగిపోతారు. చిన్న మునక వేసి మళ్ళీ బయటకు వచ్చేసినట్లుగా స్నేహ సాగరంలో లీనమై మునక వేస్తారు, మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ఇమిడిపోయి ఉండండి, అప్పుడు స్నేహమనే శక్తి అన్నింటి నుండి సహజంగా విముక్తులుగా చేస్తుంది.
పిల్లలందరి బ్రాహ్మణ జన్మ యొక్క ఆది అనుభవము ఏమిటంటే - స్నేహము బ్రాహ్మణులుగా చేసింది. స్నేహము పరివర్తన చేసింది. మీ జన్మ యొక్క ఆది సమయంలోని అనుభవం గుర్తుంది కదా? జ్ఞాన యోగాలైతే లభించాయి కానీ స్నేహము ఆకర్షించి బాబాకు చెందినవారిగా చేసింది. ఒకవేళ సదా స్నేహమనే శక్తిలో ఉన్నట్లయితే సదా కొరకు శ్రమ నుండి విముక్తులైపోతారు. ఎలాగూ ముక్తి సంవత్సరమును జరుపుకుంటున్నారు కదా. కనుక శ్రమ నుండి కూడా విముక్తి, అందుకు సాధనము - స్నేహములో ఇమిడిపోయి ఉండండి. స్నేహము యొక్క అనుభవము అందరికీ ఉంది కదా? లేక లేదా? ఒకవేళ ఎవరినైనా బాప్దాదాపై అందరికంటే ఎక్కువ స్నేహము ఎవరికి ఉంది అని అడిగితే, నాకు ఉంది అని అందరూ చేతులు ఎత్తుతారు. (అందరూ చేతులు ఊపారు). సైలెన్స్ యొక్క చేతులు ఎత్తండి, శబ్దము చేసేవి కాదు. కనుక బాప్‌దాదా ఈరోజు ఇదే చెప్తున్నారు - స్నేహ శక్తిని సదా కార్యములో వినియోగించండి. సహజమే కదా! దేహాన్ని మర్చిపోవాలి, దేహ ప్రపంచాన్ని మర్చిపోవాలి, మాయాజీతులుగా అవ్వాలి అని యోగాన్ని జోడిస్తారు. స్నేహమనే ఛత్రఛాయలో ఉన్నప్పుడు ఈ స్నేహమనే ఛత్రఛాయ లోపలకి మాయ రాలేదు. స్నేహ సాగరము నుండి బయటకు వస్తారు కదా, అప్పుడు మాయ చూసేస్తుంది మరియు తనవారిగా చేసుకుంటుంది, అందుకే అసలు బయటకే రాకండి. ఇమిడిపోయి ఉండండి. స్నేహితులైనవారు ఏ పని చేస్తున్నా తమ స్నేహితుడిని మర్చిపోలేరు. స్నేహములో మైమరిచిపోయి ప్రతి కార్యాన్ని చేస్తారు. కావున ఎలా అయితే ఈరోజు మైమరిచిపోయి ఉన్నారో, అలా సదా స్నేహములో ఉండలేరా? స్నేహము సహజంగానే సమానంగా చేస్తుంది ఎందుకంటే ఎవరిపైనైతే స్నేహము ఉంటుందో వారిలా అవ్వటమనేది కష్టము కాదు.
బ్రహ్మా బాబాపై హృదయపూర్వకమైన ప్రేమ ఉంది, బ్రహ్మాబాబాకు కూడా పిల్లలపై అతి స్నేహము ఉంది. సదా పిల్లలు ప్రతి ఒక్కరినీ ఇమర్జ్ చేసుకుని విశేషంగా సమానంగా అయ్యే సకాష్ను ఇస్తుంటారు. ఎలా అయితే గత జీవితంలో ఒకొక్క రత్నాన్ని చూస్తూ, ప్రతి రత్నము యొక్క విలువ తెలిసి ఉంటూ దానిని విశేషంగా కార్యములో వినియోగించేవారో, అలా ఇప్పుడు కూడా ఒక్కొక్క రత్నాన్ని విశేష రూపంలో విశేషతను కార్యంలో ఉపయోగించాలని సదా సంకల్పాన్ని ఇస్తూ ఉంటాము మరియు ప్రతి ఒక్కరి విశేషత గురించి వాహ్-వాహ్ అని పాడుతుంటాము. వాహ్ నా అమూల్య రత్నము. చాలామంది పిల్లలు ఆలోచిస్తారు – బ్రహ్మా బాబా వతనంలో ఏం చేస్తారు? మేమైతే ఇక్కడ సేవ చేస్తూ ఉంటాము, మరి బ్రహ్మా బాబా అక్కడ వతనంలో ఏం చేస్తారు? బాబా అంటారు - ఎలా అయితే సాకార రూపములో సదా పిల్లలతో పాటు ఉన్నారో, అలాగే వతనములో కూడా ఉంటారు. పిల్లలతో పాటే ఉంటారు, ఒంటరిగా ఉండరు. పిల్లలు లేకుండా బాబాకు కూడా మజా అనిపించదు. ఎలా అయితే పిల్లలకు బాబా లేకపోతే ఏమీ తోచదో, అలాగే బాబాకు కూడా పిల్లలు లేకపోతే ఏమీ తోచదు. ఒంటరిగా ఉండరు, తోడుగా ఉంటారు. సాకారములో అయితే తోడు యొక్క అనుభవాన్ని సాకార రూపములో కొద్దిమంది పిల్లలే చేసుకోగలిగేవారు, ఇప్పుడైతే అవ్యక్త రూపములో పిల్లలు ప్రతి ఒక్కరితో ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో, ఎప్పుడు కావాలంటే అప్పుడు తోడును నిర్వర్తిస్తూ ఉంటారు. ఎలా అయితే చిత్రాలలో చూపిస్తారు కదా - వారు ప్రతి గోపికతోపాటు కృష్ణుడిని చూపించారు, కానీ అది ఈ సమయములోని గాయనము. ఇప్పుడు అవ్యక్త రూపములో పిల్లలు ప్రతి ఒక్కరితోపాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు, అది రాత్రి 2 గంటలకైనా, 2.30 గంటలకైనా, ఏ సమయంలోనైనా తోడును నిర్వర్తిస్తూ ఉంటారు. సాకారములోనైతే సెంటర్లకు అప్పుడప్పుడు మాత్రమే వెళ్ళడమయ్యేది, కానీ ఇప్పుడు అవ్యక్త రూపములోనైతే పవిత్ర ప్రవృత్తిలో ఉన్నవారి వద్దకు కూడా వెళ్తూ ఉంటారు. బాబాకు అసలు ఏం పని ఉంది, పిల్లలను సమానంగా తయారుచేసి తమతోపాటు తీసుకువెళ్ళటము, ఇదే కదా వారి పని, వేరే ఏముంది? కనుక ఇందులోనే బిజీగా ఉంటారు.
ఈరోజు బాప్‌దాదా పిల్లలకు విశేషంగా శ్రమ నుండి ముక్త భవ అన్న వరదానాన్ని ఇస్తున్నారు. ఏ కార్యము చేసినా డబల్ లైట్ గా అయ్యి కార్యమును చెయ్యండి, అప్పుడు శ్రమను మనోరంజనముగా అనుభవము చేస్తారు ఎందుకంటే బాప్‌దాదాకు పిల్లలు శ్రమ చెయ్యటము, యుద్ధము చెయ్యటము, గెలుపు-ఓటముల ఆట ఆడటము - ఇది మంచిగా అనిపించదు. మరి ముక్తి సంవత్సరమును జరుపుకుంటున్నారు కదా! జరుపుకుంటున్నారా లేక శ్రమించటములోనే నిమగ్నమై ఉన్నారా? ఈరోజున విశేషంగా ఈ వరదానమును గుర్తు పెట్టుకోండి - శ్రమ నుండి ముక్త భవ. ఈ సంగమయుగము శ్రమ నుండి విముక్తులయ్యే యుగము, ఆనందములో ఉండే యుగము. ఒకవేళ శ్రమ ఉన్నట్లయితే ఆనందము ఉండదు. ఈ ఒక్క యుగమే పరమాత్మ మరియు ఆత్మలు ఆనందముగా జరుపుకునే యుగము, ఆత్మ-పరమాత్మల స్నేహము యొక్క యుగము, మిలనము యొక్క యుగము. కనుక ధృఢ సంకల్పము చెయ్యండి - ఈరోజు నుండి శ్రమ నుండి విముక్తులమైపోతాము. అవుతారు కదా? ఇక్కడ చెయ్యి ఎత్తి, మళ్ళీ అక్కడకు వెళ్ళి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని అనకండి. ఎందుకంటే బాప్‌దాదా వద్ద పిల్లలు ప్రతి ఒక్కరూ చేసిన దృఢ సంకల్పాల యొక్క పూర్తి ఫైల్ ఉంది. బాప్‌దాదా ఒక్కోసారి పిల్లల ఫైల్‌ను చూస్తారు. పదే-పదే దృఢ సంకల్పాలు చేసారు కదా. జన్మ తీసుకున్నప్పటి నుండి ఇప్పటివరకు ఇది చేస్తాము, అది చేస్తాము... అని ఎన్ని సార్లు సంకల్పాలు చేసారు. కానీ వాటిని పూర్తి చెయ్యలేదు. ఆత్మిక సంభాషణను చాలా బాగా చేస్తారు, బాప్‌దాదాను కూడా సంతోషపెడతారు. ఎలా అయితే జిజ్ఞాసువులను ప్రభావితం చేస్తారు కదా, అలా బాప్‌దాదాను కూడా ప్రభావితం చేస్తారు. కానీ ఆ దృఢ సంకల్పం యొక్క ప్రభావము కొద్ది సమయమే ఉంటుంది, సదా ఉండటం లేదు. బాప్‌దాదా వద్ద ఫైల్ అయితే పెరిగిపోతూనే ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు బాప్‌దాదా దగ్గర ఉన్న ఫైల్లో ఒక ప్రతిజ్ఞ పత్రమైతే తప్పకుండా జమ అవుతుంది, అందుకే బాప్‌దాదా వ్రాయించటం లేదు.
ఈరోజు కూడా అందరూ సంకల్పం అయితే చేస్తున్నారు, ఈసారి ఎప్పటివరకు నడుస్తారు, ఫైల్లో కాగితం ఎప్పటివరకు ఉంటుంది, బాబా కూడా చూస్తూ ఉంటారు. పిల్లలు బాబా సమానంగా తయారైపోతే ఫైళ్లు సమాప్తం అయ్యి ఫైనల్ అయిపోతాయి. ఇప్పుడైతే చాలా, చాలా ఫైల్స్ ఉన్నాయి. కేవలం స్నేహములో మునిగిపోయి ఉండండి, స్నేహ సాగరము నుండి బయటకు రాకండి. బ్రహ్మా బాబాపై హృదయపూర్వకమైన స్నేహము ఉంది కదా? స్నేహీని ఫాలో చెయ్యటం కష్టమైన పని కాదు. ఎక్కడైతే స్నేహము ఉంటుందో, అక్కడ ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తారు అని స్నేహం గురించి అంటారు కూడా. బాప్‌దాదా అయితే ప్రాణాన్ని త్యాగం చెయ్యమని చెప్పరు. పాత ప్రపంచాన్ని త్యాగం చెయ్యండి. దీని కోసం ఫైనల్ డెట్‌ను ఫిక్స్ చెయ్యండి. వేరే ఫంక్షన్లకు డేట్‌ను ఫిక్స్ చేస్తారు, 20వ తారీఖు, 24వ తారీఖు అని, మరి దీని డేట్‌ను ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? (ఈ డేట్‌ను బాప్‌దాదా ఫిక్స్ చెయ్యాలి) బాప్‌దాదా అయితే ‘ఎప్పుడు’ అన్న మాటను అననే అనరు, ‘ఇప్పుడు’ అని అంటారు. బాప్‌దాదా ఎప్పుడైనా ‘ఎప్పటికో’ అని వదిలేస్తారా? ‘ఇప్పుడు’ అని అంటారు. ఏదైతే చెయ్యాలో దానిని ఇప్పుడే చెయ్యండి. కానీ బాప్‌దాదా సమర్థులు కదా, కనుక ఆ సామర్థ్యము లెక్కలో ‘ఇప్పుడు’ అని అంటారు. పిల్లలు ఎప్పటికో, ఎప్పటికో అన్న అలవాటులో ఉన్నారు. అందుకే బాప్‌దాదా పిల్లలతో అంటున్నారు - ఈ డేట్‌ను ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? మీరు ఎప్పుడు, ఎప్పుడు అని అంటారు కనుక బాబా కూడా ఎప్పుడు అని అడుగుతున్నారు.
ఇప్పుడు సమయమనుసారముగా అందరూ అనంతమైన వైరాగ్య వృత్తిలోకి వెళ్ళాల్సే ఉంటుంది. కానీ పిల్లలకు సమయం శిక్షకునిగా అవ్వకూడదు అని బాప్‌దాదా అనుకుంటారు. బాబా శిక్షకుడు అయినప్పుడు సమయానికి తయారవ్వటము అంటే సమయాన్ని శిక్షకునిగా చేసుకున్నట్లు అవుతుంది. దీనిలో మార్కులు తక్కువ అయిపోతాయి. ఇప్పుడు కూడా కొంతమంది పిల్లలు - సమయం నేర్పిస్తుంది, సమయం మారుస్తుంది అని అంటారు. సమయమనుసారంగా అయితే మొత్తము విశ్వములోని ఆత్మలందరూ మారుతారు కానీ పిల్లలైన మీరు సమయం కోసం ఎదురుచూడకండి. సమయాన్ని శిక్షకునిగా చేసుకోకండి. మీరు విశ్వ శిక్షకుని యొక్క మాస్టర్ విశ్వ శిక్షకులు, రచయితలు, సమయం మీ రచన, కనుక ఓ రచయిత ఆత్మలారా, రచనను శిక్షకునిగా చేసుకోకండి. బ్రహ్మా బాబా సమయాన్ని శిక్షకునిగా చేసుకోలేదు, ఆది నుండి అంతిమము వరకు అనంతమైన వైరాగ్యము ఉండేది. ఆదిలో చూసారు - ఎంతగా తనువును పెట్టారు, మనసును పెట్టారు, ధనాన్ని పెట్టారు, కానీ కొంచెము కూడా మోహము లేదు. తనువు గురించి సదా సహజంగానే ఇదే మాట అనేవారు - ఇది బాబా రథము. నా శరీరము అని అనేవారు కాదు. ఇది బాబా రథము. బాబా రథానికి తినిపిస్తాను, నేను తింటాను అని అనేవారు కాదు. తనువుపై కూడా అనంతమైన వైరాగ్యము ఉండేది. ఇక మనస్సు అయితే మన్మనాభవగానే ఉండేది. ధనాన్ని కూడా పెట్టారు, కానీ ఎప్పుడూ నా ధనం ఉపయోగించడం జరుగుతుంది అన్న సంకల్పం కూడా రాలేదు. నా ధనాన్ని పెడుతున్నాను లేక నేను ధనాన్ని పెట్టాను అని ఎప్పుడూ వర్ణన చెయ్యలేదు. బాబా భండారము, భోళానాథుని భండారము. ధనాన్ని నాది అని భావించి వ్యక్తిగతముగా తన కోసము ఒక్క రూపాయి విలువ చేసే వస్తువును కూడా ఉపయోగించలేదు. కన్యలు, మాతల బాధ్యత అని కన్యలకు, మాతలకు వీలునామా చేసారు, నాది అనేదే లేదు. సమయమును, శ్వాసను తన కోసం ఉపయోగించలేదు, వాటి నుండి అనంతమైన వైరాగిగా ఉన్నారు. ఇంతగా ప్రకృతి దాసీగా ఉన్నా కానీ అదనంగా ఏ సాధనాన్నీ ఉపయోగించలేదు. సదా సాధారణ జీవితంలో ఉన్నారు. ఏ విశేష వస్తువునూ తన కార్యంలో ఉపయోగించలేదు. వస్త్రాల విషయంలో కూడా, అంతిమం వరకు ఒకే విధమైన వస్త్రాలను ధరించారు. మార్పు చెయ్యలేదు. పిల్లల కోసం ఇళ్ళు కట్టించారు కానీ స్వయం ఉపయోగించలేదు. పిల్లలు చెప్పేవి వింటూ కూడా ఉపరామముగా ఉండేవారు. సదా పిల్లల స్నేహాన్ని చూస్తూ కూడా - అంతా పిల్లల కోసమే అని అనేవారు. అనంతమైన వైరాగ్య వృత్తి ప్రత్యక్ష జీవితంలో కలిగి ఉండటము అని దీనినే అంటాము. అంతిమంలో చూడండి, పిల్లలు ఎదురుగా ఉన్నారు, చేతిని పట్టుకుని ఉన్నారు, కానీ మోహము ఉందా? అనంతమైన వైరాగ్య వృత్తి. స్నేహీ పిల్లలు, అనన్యులైన పిల్లలు ఎదురుగా ఉన్నారు, అయినా కూడా అనంతమైన వైరాగ్యము ఉంది. క్షణములో ఉపరామ వృత్తి మరియు అనంతమైన వైరాగ్యము యొక్క ఋజువును చూసారు. ఒకటే తపన - సేవ, సేవ, సేవ... మిగిలిన అన్ని విషయాల నుండి ఉపరామము. దీనినే అనంతమైన వైరాగ్యము అని అంటాము. ఇప్పుడు సమయమనుసారంగా అనంతమైన వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చెయ్యండి. అనంతమైన వైరాగ్య వృత్తి లేకుండా సకాష్ ఇచ్చే సేవ జరగలేదు. ఫాలో ఫాదర్ చెయ్యండి. సాకారములో బ్రహ్మా బాబా ఉన్నారు, నిరాకారుని విషయం వదిలేయండి. సాకారములో సర్వ ప్రాప్తుల సాధనాలు ఉన్నా, పిల్లలందరి బాధ్యత ఉన్నా, పరిస్థితులు, సమస్యలు వస్తూ ఉన్నా, పాస్ అయిపోయారు కదా! పాస్ విత్ ఆనర్ (గౌరవప్రదమైన ఉత్తీర్ణత) అనే సర్టిఫికేట్ తీసుకున్నారు. దీనికి విశేష కారణం - అనంతమైన వైరాగ్య వృత్తి. ఇప్పుడు సూక్ష్మమైన బంగారు సంకెళ్ళ మోహము, సూక్ష్మాతి సూక్ష్మమైన మోహము చాలా ఉంది. కొంతమంది పిల్లలకు - ఇది మోహము అని మోహము గురించి అర్థం కాదు కూడా. ఇదైతే జరుగుతూనే ఉంటుంది, ఇదైతే నడుస్తూనే ఉంటుంది అని అనుకుంటారు. ముక్తులుగా అవ్వాలి అని అనుకోరు. ఇలా అయితే జరుగుతూనే ఉంటుంది కదా అని అనుకుంటారు. ఇలా అనేక రకాల మోహములు అనంతమైన వైరాగిగా అవ్వనివ్వవు. అవ్వాలి అన్న కోరికైతే ఉంది, అవ్వాల్సిందే అని సంకల్పము కూడా చేస్తారు. కానీ కోరుకోవటము మరియు చెయ్యటము, ఈ రెండింటి బ్యాలెన్స్ లేదు. కోరుకుంటుంది ఎక్కువ, చేస్తుంది తక్కువ. చెయ్యాల్సిందే - ఈ వైరాగ్య వృత్తి ఇప్పుడు ఇమర్జ్ అయ్యి లేదు. మధ్యమధ్యలో ఇమర్జ్ అవుతుంది, మళ్ళీ మర్జ్ అయిపోతుంది. సమయమైతే చేస్తుంది కానీ అప్పుడు పాస్ విత్ ఆనర్‌గా అవ్వలేరు. పాస్ అవుతారు కానీ పాస్ విత్ ఆనర్ కారు. సమయము యొక్క వేగము తీవ్రముగా ఉంది, పురుషార్థపు వేగము తక్కువగా ఉంది. స్థూల పురుషార్థాలైతే చేస్తున్నారు కానీ సూక్ష్మ మోహములో బంధించబడిపోతారు.
ఎగురుకుంటూ రావాలి, ఎగురుకుంటూ రావాలి... అని పిల్లలు పాడే పాటను బాప్‌దాదా విన్నప్పుడు, బాబా కూడా ఎగిరేలా చేద్దాము కదా అని అనుకుంటారు కానీ మోహము ఎగరనిస్తుందా లేక ఇక్కడికి కాకుండా, అక్కడికి కాకుండా ఉంటారా? ఇప్పుడు సమయమనుసారంగా మోహముక్తులుగా అనంతమైన వైరాగులుగా అవ్వండి. మనసులో నుండి వైరాగ్యము ఉండాలి. ప్రోగ్రామ్ అనుసారంగా వచ్చే వైరాగ్యము అల్పకాలికంగా ఉంటుంది. మీ సూక్ష్మ మోహములను చెక్ చేసుకోండి. పైపై విషయాలు ఇప్పుడు సమాప్తమైపోయాయి, కొంతమంది పిల్లలు స్థూలమైన మోహముల నుండి విముక్తులయ్యారు కూడా, కానీ సూక్ష్మ మోహములు చాలా సూక్ష్మమైనవి, వాటిని స్వయం కూడా చెక్ చేసుకోలేకపోతారు (అవి తెలియవు). చెక్ చేసుకోండి, బాగా చెక్ చేసుకోండి. సంపూర్ణత అనే దర్పణములో మోహమును చెక్ చేసుకోండి. బ్రహ్మా బాబా స్మృతి దివసము సందర్భంగా ఈ కానుకనే బ్రహ్మా బాబాకు ఇవ్వండి. ప్రేమ ఉంది కదా, మరి ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తారు? కానుకను ఇస్తారు కదా? కనుక ఈ కానుకను ఇవ్వండి. వదిలేయండి, అన్ని ఆధారాలను వదిలేయండి, విముక్తులుగా అయిపోండి. పిల్లలలో ఉల్లాస-ఉత్సాహాలు కలుగుతాయని, స్వ ఉన్నతి కొరకు చాలా మంచి-మంచి సంకల్పాలను కూడా చేస్తారని బాప్‌దాదా సంతోషిస్తారు కూడా. ఇప్పుడు ఆ సంకల్పాలను చేసి చూపించండి. అచ్ఛా.
ఈరోజు విశేషంగా టీచర్ల సంగఠన వచ్చింది. మీరు చేసిన సేవకు రిటర్న్‌లో ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చెయ్యటం జరిగింది. పిల్లలకు సేవా ఫలం లభిస్తుంది, వారు జరుపుకుంటున్నారు, తింటున్నారు అని బాప్‌దాదా సంతోషిస్తారు. సేవలో నంబరువారుగా సఫలురవుతున్నారు మరియు అవుతూ ఉంటారు. బాప్‌దాదా పిల్లల 40 సంవత్సరాల సేవను చూసి హర్షిస్తున్నారు. ఫంక్షన్ కోసం వచ్చినవారు చేతులు ఎత్తండి. పెద్ద గ్రూప్ ఉంది. 40 సంవత్సరాలు కూడా సేవలో అమర భవ వరదానీగా ఉన్నందుకు అభినందనలు. మీ సంఘటిత రూపాన్ని చూసి అందరూ చాలా సంతోషిస్తారు - 40 సంవత్సరాలు సేవలో అమరులుగా ఉండడం కూడా ఒక అద్భుతమే. డైమండ్ జూబ్లీ జరిగింది, సిల్వర్ జూబ్లీ జరిగింది, మరి ఇది ఏ జూబ్లీ? ఇది విశేష జూబ్లీ. ఎక్కువ శ్రమ ఈ గ్రూపే చేసింది. ఈ గ్రూప్ ఎలా అంటే, సరిహద్దుకు మిలిటరీ వెళ్తుంది కదా! కమాండర్లు అయితే వెనుక ఉంటారు, కానీ సరిహద్దుకు మహారథులే వెళ్తారు. అలాగే సేవ యొక్క సరిహద్దులో ఈ గ్రూప్ ఉంది. బాప్‌దాదా, తమ సమానమైన సేవాధారి గ్రూపును చూసి సంతోషిస్తారు. సరిహద్దుకు వెళ్లేవారు దృఢంగా ఉంటారు. చాలా అనుభవాలు ఉంటాయి కదా! ఎదుర్కొనే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి గ్రూప్‌కు దాని దాని విశేషత ఉంది. డైమండ్ జూబ్లీ వారు స్థాపనకు నిమిత్తమయ్యారు. గోల్డెన్ జూబ్లీ వారు సేవలో ఆది రత్నాలుగా నిమిత్తమయ్యారు. సిల్వర్ జూబ్లీ వారు కుడి భుజంగా అయి ముందుకు వెళ్లారు మరియు ముందుకు తీసుకువెళ్లారు. ఈ విశేష గ్రూప్ సేవ యొక్క అన్ని రకాలలో అనుభవమూర్తులు. ఎక్కువ అనుభవం ఈ గ్రూప్‌కు ఉంది. శ్రమ కూడా చేసారు, కానీ ప్రేమతో శ్రమ చేసారు. అందుకే బాప్‌దాదా ఈ గ్రూపును విశేష సేవాధారి, సఫలతామూర్తి గ్రూప్ అని అంటారు. కొత్తగా వచ్చే వారి పాలనకు నిమిత్తమైన ఆధారమూర్తి ఈ గ్రూపే. ఈ గ్రూపుకు ఒక విషయం చెప్పనా? వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఆర్డర్ చేస్తాము. ఆర్డర్ చేయనా? ఎవర్రెడీ గ్రూపే కదా!
బాప్‌దాదాకు విశేషంగా సేవలో సఫలతాస్వరూప ఆత్మలను చూసి ఈ సంకల్పం వస్తుంది - సెంటర్లను అయితే బాగా స్థాపించారు. స్థాపించారు కదా, లేక కదిలిపోయేవిగా ఉన్నాయా? ఇప్పుడు ఈ గ్రూప్ నుండి అనంతమైన సేవ కోసం కొన్ని రత్నాలు వెలువడాలి. ఎవర్రెడీగా ఉన్నారా, లేక సెంటర్‌ను వదలడం కష్టమా? కష్టమా, లేక సులభమా? ఇప్పుడు చేతులు ఎత్తండి. మీరు బయటకు వెళ్తే సెంటర్లు కదిలిపోతాయా? ఇది కూడా పక్కాగా ఉండాలి కదా. మేమైతే సిద్ధంగా ఉన్నాము. సెంటర్లు కదిలినా, కదలకపోయినా మాకు ఏముంది! అని అనకండి. అలా కాదు. అయినా కూడా బాప్‌దాదా 6 నెలల సమయం ఇస్తున్నారు. మీ మీ సెంటర్లలో మీలాంటి ఒక కుడి భుజాన్ని తయారుచేయండి. అప్పుడు మీరు చక్రవర్తులుగా అయి సేవ చేయగలుగుతారు. ఎందుకంటే బాప్‌దాదా చూస్తున్నారు, చక్రవర్తులుగా అయి సేవ చేసేవారితో పోలిస్తే, ఒకే చోట కూర్చొని సేవ చేసేవారి నంబర్ కొంచెం వెనుకకు వెళ్తుంది. వారు చక్రవర్తి, నంబర్‌వన్ రాజులుగా అవ్వగలరు. ఈ గ్రూప్ అలాంటిది, ఇది ముందరి నంబర్ తీసుకోగలదు. అయితే నంబర్ తీసుకుంటారా? అప్పుడు దాదీ ఆర్డర్ చేస్తారు - ఎవర్రెడీ. (దాదీతో) ఆర్డర్ చేస్తారు కదా? మీకు హ్యాండ్స్ కావాలి కదా! హ్యాండ్స్ కావాలి అన్ని కొన్నిసార్లు దాదీ ఆత్మిక సంభాషణలో అంటారు. అయితే ఈ కోరికను ఎవరు నెరవేరుస్తారు? మీరు మాత్రమే చేయగలరు. బాప్‌దాదా మిమ్మల్ని ఆశావాదులుగా భావిస్తున్నారు. అందుకే మీ మీ స్థానాలను అంత పక్కాగా, దృఢంగా చేయండి; మీరు వెళ్లిపోయినా ఎలాంటి తేడా రాకూడదు. నా తర్వాత ఏమవుతుంది అని బ్రహ్మా బాబా చూసారా? చూడలేదు కదా! మంచిగానే ఉంది, మంచిగానే ఉంటుంది. అందుకే ఒక్క సెకనులోనే మోహముక్త ఆత్మ ఎగిరిపోయింది. ఏ మమకారం కూడా వారిని లాగలేదు. అలాగే అలాంటి గ్రూప్‌ను తయారుచేయండి. ఎలాంటి మమకారం ఉండకూడదు. ఈ డ్యూటీ నాదే, నేను లేకపోతే ఎవరూ చేయలేరు అనే సంకల్పం కూడా రాకూడదు. దీనిపట్ల కూడా వైరాగ్యం ఉండాలి. మరి, బాప్‌దాదా చెప్పిన మాట విన్నారా? శ్రద్ధగా విన్నారు. అచ్ఛా. ఇప్పుడు 6 నెలల్లో అందరూ తమ సెంటర్‌ను అలా దృఢంగా తయారుచేయండి. తర్వాత ఆర్డర్ వస్తుంది. ఇష్టం కదా? విశ్వ మహారాజుగా అవ్వాలా లేక ఒక రాష్ట్రానికి రాజుగా అవ్వాలా? ఏ రాజుగా అవ్వాలి? ఒకే సెంటర్‌ను సంభాళించడము చేస్తే రాష్ట్రానికి రాజుగా అవుతారు. చక్రవర్తిగా అయితే విశ్వానికి రాజుగా అవుతారు. మీరు ఎలా అనుభవజ్ఞులుగా అయ్యారో, అలాగే ఇతరులను కూడా అనుభవజ్ఞులుగా చేయండి. ఇది కష్టమైన పని కాదు కదా? కష్టంగా ఉంటే వద్దని చెప్పండి. కష్టంగా అనిపిస్తే ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి అని బాప్‌దాదా అంటారు. అది కూడా స్వేచ్ఛే. ఎవరి ఇష్టం వారిది. కానీ బాప్‌దాదా ఈ గ్రూప్‌ను ముందుకు వెళ్లే ఆశావాదులుగా భావిస్తున్నారు. సరేనా? ఇష్టమేనా?
జరుపుకునే ముందు ఆందోళన అయితే కలగలేదు కదా? నిశ్చింత చక్రవర్తులు కదా! బ్రహ్మా బాబా ఏమీ ఆలోచించనప్పుడు, ఫాలో ఫాదర్. పిల్లలు - ఏమవుతుంది, ఎలా జరుగుతుంది, సెంటర్లు నడుస్తాయా లేదా, మురళి ఎక్కడి నుండి వస్తుంది... అని ఎన్ని ప్రశ్నలు ఆలోచించారు! బ్రహ్మా బాబా ఆలోచించారా? ఒక్క సెకనులో వ్యక్తము నుండి అవ్యక్తంగా అయిపోయారు. కానీ ఇంకా మంచివారిగా అవ్వాల్సిందే అనే నిశ్చయం ఉంది. అలా జరుగుతోంది కదా! మిగతా విషయాల్లో బాప్‌దాదాకు ప్రతి గ్రూప్ యొక్క విశేషత ప్రియంగా అనిపిస్తుంది. అచ్ఛా.
నలువైపులా దేశ-విదేశములలో స్నేహములో ఇమిడి ఉన్న స్నేహీ పిల్లలకు, సదా బాబా స్నేహ సాగరములో ఇమిడిపోయి ఉండే అతి సమీప ఆత్మలకు, సదా బ్రహ్మాబాబా విశేషతలను స్వయములో ధారణ చేసే శ్రేష్ట ఆత్మలకు, సదా శ్రమ నుండి విముక్తులై ఆనందములో ఉండే పరమాత్మ ప్రేమలో ఎగిరే ఆత్మలకు, బాబా సమానంగా అవ్వాలన్న సంకల్పాన్ని సాకారములోకి తీసుకువచ్చే హృదయాభిరాముడైన బాబా హృదయములో ఇమిడి ఉన్న పిల్లలకు, విశేషంగా ఈరోజున బ్రహ్మా బాబా యొక్క పదమాపదమాల రెట్ల ప్రియస్మృతులను స్వీకరించండి. బాప్‌దాదా అయితే సదా పిల్లల హృదయములో ఉంటారు, వతనములో ఉంటూ కూడా పిల్లల హృదయములో ఉంటారు, కనుక ఇలా హృదయములో ఇమిడిపోయే పిల్లలకు బాప్‌దాదా యొక్క స్నేహమనే ముత్యాలతో పళ్లాల నిండుగా ప్రియస్మృతులు మరియు నమస్తే.
సేవ టర్న్ గుజరాత్‌ది:- అచ్ఛా. గుజరాత్ వారు అనుభవమూర్తులు. సమీపంగా ఉండడం వలన ప్రతి కార్యంలో ఎవరెడీగా అయిపోతారు. ప్రతి జోన్‌కు ఈ సేవ చేసే అవకాశం కూడా చాలా బాగా లభించింది. సేవ చేయడం అంటే అందరి ఆశీర్వాదాలు తీసుకోవడం. అయితే ఎన్ని ఆశీర్వాదాలు తీసుకున్నారు? చాలా తీసుకున్నారు కదా! అందుకే గుజరాత్ ఆశీర్వాదాల జోలెను నింపుకుంటోంది. అచ్ఛా. గుజరాత్‌కు చెందిన సేవాధారులందరూ చేతులు ఎత్తండి. మీరు కేవలం సేవ మాత్రమే చేయడం లేదు, ఆశీర్వాదాలను జమా చేసుకుంటున్నారు. అచ్ఛా.
క్యాబిన్లో కూర్చొని సేవ చేస్తున్న సోదరసోదరీలందరితో బాప్‌దాదా అన్నారు:-
వీరు కూడా చాలా శ్రమ చేస్తారు. ఈ డిపార్ట్మెంట్ (సౌండ్ డిపార్ట్మెంట్) కూడా మంచి శ్రమ చేస్తుంది. క్యాబిన్లలో కూర్చున్న వారందరూ మంచి శ్రమ చేస్తున్నారు. అందరికీ సుఖాన్ని ఇస్తున్నారు. అందువల్ల సుఖాన్ని ఇవ్వడం యొక్క ఆశీర్వాదాలు చాలా లభిస్తాయి. పురుషార్థంలో ఈ ఆశీర్వాదాలు కలుస్తాయి. నిర్విఘ్న సేవ చాలా పదమారెట్ల ఫలాన్ని ఇస్తుంది. ఎంత నిర్విఘ్నంగా సేవ జరుగుతుందో, అంత ఆటోమేటిక్‌గా మార్కులు పెరుగుతూ ఉంటాయి. అందరికీ సుఖాన్ని ఇవ్వడం - కర్మ ద్వారా అయినా, వాణి ద్వారా అయినా, మనసా ద్వారా అయినా - ఎవరైనా సుఖాన్ని ఇస్తే, వారి మార్కులు ఆటోమేటిక్‌గా పెరుగుతూ ఉంటాయి. ఈ ఆటోమేటిక్ మార్కులు ఎంతగా పెరుగుతాయో అంతగా శ్రమ వల్ల పెరగవు. అందుకే సుఖస్వరూపంగా అయి సుఖాన్ని ఇవ్వండి. సుఖాన్ని ఇవ్వండి మరియు సుఖాన్ని తీసుకోండి. అలాగే ఉంది కదా! చాలా బాగుంది.
మధుబన్ నివాసులకు చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. శుభ్రం చేసే వారైనా, చీపురుతో చిమ్మే వారైనా, మంచి శుభ్రతను చూసి అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి. అందరికంటే సులభమైన పురుషార్థం - ఆశీర్వాదాలు తీసుకోండి, ఆశీర్వాదాలు ఇవ్వండి. ఇందులో ఎలాంటి శ్రమ లేదు. చాలా త్వరగా మాయాజిత్ అయిపోతారు. ఎవరికీ కూడా మర్యాదాపూర్వకంగా కూడా దుఃఖం ఇవ్వకూడదు. అలాగే మర్యాదను అతిక్రమించి ఎవరికైనా సుఖాన్ని ఇవ్వండి అని కూడా కాదు. అటువంటి సుఖం, సుఖం యొక్క ఖాతాలో జమా కాదు. అది ఆటోమేటిక్ యంత్రం ద్వారా దుఃఖం యొక్క ఖాతాలోకి జమా అయిపోతుంది. అందుకే హృదయంతో సుఖాన్ని ఇవ్వండి. మర్యాదాపూర్వకంగా హృదయంతో సుఖాన్ని ఇవ్వండి. కేవలం చూపించడానికి కాదు, హృదయంతో. సుఖకర్త యొక్క పిల్లలు ఒక్క సెకనులో తమ మనసా ద్వారా, వాణి ద్వారా, సంబంధ-సంపర్కాల ద్వారా సుఖాన్ని ఇవ్వగలరు. అచ్ఛా.
(ఈ సీజన్లో ఇది అతిపెద్ద గ్రూప్)
అందరూ సౌకర్యంగా ఉన్నారా! టీచర్లకు అయితే సౌకర్యం లభిస్తుంది. టీచర్లు ప్రత్యేకమైనవారు కదా. (డబల్ విదేశీయులు కూడా సుమారు 150 మంది వచ్చారు) బాబా విశ్వ కళ్యాణకారి కాబట్టి ప్రతి గ్రూప్‌లో దేశ-విదేశీయులు తప్పకుండా ఉండాలి. విదేశీయులకు ఈ సీజన్ నచ్చిందా? ఇంత పెద్ద సభ నచ్చిందా? విదేశీయులందరూ చాలా మంచి అనుభవాలతో కూడిన ఉత్తరాలు రాసారు. అవి బాప్‌దాదా వద్దకు చేరాయి. చాలామంది తమ ఉల్లాస-ఉత్సాహాలను చాలా బాగా రాశారు. ఎక్కడెక్కడ పురుషార్థం చేస్తున్నారో కూడా రాశారు. కానీ మెజారిటీ ఫలితం చాలా బాగుంది. ఇప్పుడు ముందు లాగా త్వరగా కదిలిపోయేవారు కాదు. అచంచలంగా అయిపోయారు. అందుకే డబల్ విదేశీయులకు ముందుకు వెళ్లడానికి అభినందనలు. (160 స్థానాలలో ప్రత్యక్షంగా వింటున్నారు.) చాలా బాగుంది. బ్రహ్మా బాబా ముందుగానే చెప్పారు - ఒక సమయం వస్తుంది, అప్పుడు ప్రపంచమంతటా బాబా యొక్క సందేశం చేరుతుంది. ఇప్పుడు వింటున్నారు, తరువాత చూస్తారు కూడా. మీ అందరి సాక్షాత్కారం చేస్తారు. స్థలం స్థలానికి మీరు వెళ్లవలసిన అవసరం ఉండదు. ఒకే స్థలం నుండి బాప్‌దాదాతో పాటు మీ పిల్లలందరి సాక్షాత్కారం అయిపోతుంది. అచ్ఛా.
*** ఓంశాంతి ***
