‘‘సేవతోపాటు దేహంలో ఉంటూ విదేహీ అవస్థ యొక్క అనుభవాన్ని పెంచండి’’
ఈరోజు బాప్‌దాదా తమ నలువైపులా ఉన్న పిల్లలను చూసి హర్షిస్తున్నారు ఎందుకంటే బాబాకు తెలుసు - నా పిల్లలు ప్రతి ఒక్కరూ, వారు చివరి పురుషార్థీ అయినా కూడా విశ్వములో అందరికంటే అత్యంత గొప్ప భాగ్యవంతులు ఎందుకంటే భాగ్యవిధాత బాబాను తెలుసుకుని, గుర్తించి భాగ్యవిధాతకు డైరెక్ట్ పిల్లలుగా అయ్యారు. ఇటువంటి భాగ్యము మొత్తము కల్పములో మరే ఆత్మకూ లేదు, ఉండదు కూడా. అలాగే మొత్తము విశ్వములో అందరికంటే సంపన్నులుగా లేక ధనవంతులుగా మరెవ్వరూ ఉండలేరు. ఎంతటి పదమపతులైనా కానీ పిల్లలైన మీ ఖజానాలతో పోలిస్తే మరెవ్వరూ సరితూగరు ఎందుకంటే పిల్లల ప్రతి అడుగులో పదమాల సంపాదన ఉంది. మొత్తం రోజంతటిలో ప్రతిరోజు ఒకటి-రెండు అడుగులైనా కూడా బాబా స్మృతిలో ఉన్నట్లయితే లేక స్మృతిలో అడుగులు వేసినట్లయితే, ప్రతి అడుగులో పదమాలు అంటే... మరి మొత్తం రోజంతటిలో ఎన్ని పదమాలు జమ అయ్యాయి? ఒక్క రోజులో పదమాల సంపాదనను చేసుకునే ఇటువంటివారు ఎవరైనా ఉంటారా! అందుకే బాప్‌దాదా అంటారు - ఒకవేళ భాగ్యవంతులను చూడాలనుకుంటే లేక ప్రపంచములో అత్యంత గొప్ప ధనవంతులైన ఆత్మలను చూడాలనుకుంటే బాబా పిల్లలను చూడండి.
పిల్లలైన మీ వద్ద కేవలం స్థూల ధనం యొక్క ఖజానా మాత్రమే లేదు, వారైతే కేవలం ధనం పరంగా షావుకారులు, కానీ పిల్లలైన మీరు ఎన్ని ఖజానాలతో నిండుగా ఉన్నారు! ఖజానాల లిస్టు గురించి తెలుసు కదా? ఈ స్థూల ధనమనేది పెద్ద విషయమేమీ కాదు కానీ మీ వద్ద ఉన్న జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, సర్వ గుణాల ఖజానా, సంతోషపు ఖజానా మరియు సర్వులకు సుఖ-శాంతుల మార్గాన్ని తెలియజేయటం ద్వారా ఏదైతే ఆశీర్వాదాల ఖజానా లభిస్తుందో, ఈ అవినాశీ ఖజానాలన్నీ కేవలం పరమాత్ముని పిల్లల వద్ద తప్ప మరెవ్వరి వద్దా అవినాశీగా ఉండవు. కావున బాప్‌దాదాకు ఇటువంటి ఖజానాలకు యజమానులైన పిల్లల విషయంలో ఎంతటి ఆత్మిక గర్వము ఉంది. బాప్‌దాదా సదా పిల్లలు ఇంత సంపన్నంగా ఉండటాన్ని చూస్తూ ఇదే పాటను పాడుతారు - వాహ్ పిల్లలూ వాహ్! మీకు కూడా మీ విషయంలో ఇంతటి ఆత్మిక గర్వము అనగా నషా ఉంది కదా! చేతి చప్పట్లు కొట్టవచ్చు (అందరూ చప్పట్లు కొట్టారు) రెండు చేతులకూ ఎందుకు కష్టాన్నిస్తారు, ఒక చేతితో చప్పట్లు కొట్టండి. ఒక చేతితో చప్పట్లు కొట్టడం వస్తుంది కదా! బ్రాహ్మణుల విషయాలన్నీ అతీతమైనవి. బ్రాహ్మణులు శాంతిని ఇష్టపడతారు కనుక చప్పట్లను కూడా శాంతిగా కొట్టడం బాగుంటుంది. కావున నషా అనేది అందరికీ సదా ఉంది కూడా మరియు ఇక ముందు కూడా ఉంటుంది. ఇది నిశ్చితము.
బాప్‌దాదా సమయ పరివర్తన యొక్క తీవ్ర వేగాన్ని చూస్తూ పిల్లల పురుషార్థపు వేగాన్ని కూడా చూస్తుంటారు. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ జీవన్ముక్త స్థితిలో సదా చూడాలనుకుంటారు. మీరు వచ్చి బాబా నుండి ముక్తి-జీవన్ముక్తుల వారసత్వాన్ని తీసుకోండి అని మీరు అందరికీ ఛాలెంజ్ చేసారు. కానీ మీకైతే ముక్తి మరియు జీవన్ముక్తుల వారసత్వం లభించింది కదా? లేక లభించలేదా? (లభించింది). సత్యయుగములో లేక ముక్తిధామములో ముక్తి-జీవన్ముక్తులను అనుభవం చెయ్యలేరు. ముక్తి-జీవన్ముక్తుల వారసత్వపు అనుభవాన్ని ఇప్పుడు సంగమయుగములోనే చెయ్యాలి. జీవితములో ఉంటూ, సమయము నాజుకుగా అవుతున్నా, పరిస్థితులు, సమస్యలు, వాయుమండలము డబల్ దూషితంగా అవుతున్నా కూడా, ఈ ప్రభావాలన్నింటి నుండి ముక్తులుగా ఉండాలి, జీవితములో ఉంటూ కూడా ఈ అన్ని రకరకాల బంధనాల నుండి ముక్తులుగా ఉండాలి, ఒక్క సూక్ష్మ బంధనము కూడా ఉండకూడదు, ఇటువంటి జీవన్ముక్తులుగా అయ్యారా? లేక అంతిమంలో అవుతారా? ఇప్పుడు అవుతారా లేక అంతిమంలో అవుతారా? ఎవరైతే అంతిమంలో తయారయ్యేందుకు బదులుగా ఇప్పుడే తయారవ్వాలి, లేక తయారయ్యాము, లేక తయారవ్వాల్సిందే అని భావిస్తున్నారో, వారు చేతులెత్తండి (అందరూ చేతులెత్తారు). రెండింటిలోనూ చేతులెత్తుతున్నారు, తెలివైనవారు. చతురతను చూపిస్తే చూపించండి కానీ బాప్‌దాదా ఇప్పటి నుండైతే స్పష్టంగా వినిపిస్తున్నారు – అటెన్షన్ ప్లీజ్. బాబా అయితే బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరినీ బంధనముక్తులుగా, జీవన్ముక్తులుగా తయారు చెయ్యాల్సిందే. అది ఏ విధితో తయారుచేసినా కానీ తప్పకుండా తయారు చెయ్యాల్సిందే. ఆ విధులు ఏమిటో తెలుసు కదా! ఆ మాత్రం తెలివైనవారే కదా! కావున మీరు తయారవ్వాల్సే ఉంటుంది. మీరు కావాలనుకున్నా, వద్దనుకున్నా కానీ తయారవ్వాల్సే ఉంటుంది. మరేం చేస్తారు? (ఇప్పటి నుండే తయారవుతాము) మీ నోట్లో గులాబ్‌జామ్. అందరి నోటిలోకి గులాబ్‌జామ్ వచ్చేసింది కదా. కానీ ఇది ఇప్పుడు బంధనముక్తులుగా అయ్యేందుకు గులాబ్‌జామ్. అంతేకానీ గులాబ్‌జామ్ ఊరికే తినేయటం కాదు.
హాల్లో శోభ చాలా బాగుంది. అచ్చంగా మాలలా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి చూస్తే మాలలా అనిపిస్తుంది. ఈ కుర్చీలలో కూర్చున్నవారి మాల తయారైపోయింది. మంచిది. కారణంగానో, అకారణంగానో ఇప్పుడు ఏ విధంగానైతే కుర్చీని తీసుకున్నారో అలాగే బాప్‌దాదా ఫైనల్ సమయ ప్రమాణంగా జీవన్ముక్తి అన్న కుర్చీపై కూర్చోండి అన్న ఈలను మ్రోగిస్తే అప్పుడు కూడా కూర్చుంటారా లేక ఇప్పుడే కుర్చీపై కూర్చున్నారా? అలాగని నేలపై కూర్చున్నవారు కుర్చీని తీసుకోరు అని కాదు, ముందు మీరే. నేలపై కూర్చోవటము - ఇది తపస్యకు గుర్తు, ఆరోగ్యానికి గుర్తు. ఆరోగ్యము కూడా ఉంది, తపస్య ద్వారా ఖజానాల సంపద కూడా ఉంది. కనుక ఎక్కడైతే ఆరోగ్యము ఉంటుందో, సంపద ఉంటుందో, అక్కడ సంతోషము కూడా తప్పకుండా ఉండనే ఉంటుంది. మంచిది - ఆరోగ్యవంతులుగా కూడా ఉన్నారు, సంపన్నులుగా కూడా ఉన్నారు.
బాప్‌దాదా ఈరోజు చూస్తున్నారు, పిల్లలలో మూడు రకాల స్థితులు ఉన్నాయి. ఒకరేమో - పురుషార్థీలు, వీరిలో పురుషార్థులు కూడా ఉన్నారు మరియు తీవ్ర పురుషార్థులు కూడా ఉన్నారు. రెండవ వారు - పురుషార్థపు ప్రారబ్ధాన్ని జీవన్ముక్త అవస్థ యొక్క స్థితిలో అనుభవం చేస్తున్నారు. కానీ చివరి సంపూర్ణ స్థితి ఏమిటంటే - దేహంలో ఉంటూ కూడా విదేహి అవస్థ యొక్క అనుభవము. ఈ మూడు రకాల స్థితులను చూసారు. పురుషార్థపు స్థితిలో ఎక్కువమందిని చూసారు. ఇక్కడ ప్రారబ్ధము అంటే జీవన్ముక్తి, అంతేకానీ సెంటరుకు నిమిత్తులుగా అవ్వటము లేక మంచి స్పీకర్‌గా అవ్వటము లేక డ్రామా అనుసారంగా వేర్వేరు విశేష సేవలకు నిమిత్తులుగా అవ్వటము... ఇది ప్రారబ్ధము కాదు. ఇది ముందుకు వెళ్ళేందుకు మరియు సర్వుల నుండి ఆశీర్వాదాలు తీసుకునేందుకు లిఫ్ట్ వంటిది, కానీ ప్రారబ్ధము అయితే జీవన్ముక్తియే. ఏ బంధనమూ ఉండకూడదు. మీరు ఒక చిత్రాన్ని చూపిస్తారు కదా! ఒక సాధారణ అజ్ఞాని ఆత్మను ఎన్నో తాళ్లతో బంధించబడి ఉన్నట్లుగా చూపిస్తారు. అవి అజ్ఞాని ఆత్మల కొరకు ఇనుప సంకెళ్లు, పెద్ద-పెద్ద బంధనాలు. కానీ జ్ఞానీ ఆత్మలైన పిల్లలకు చాలా సూక్ష్మమైన మరియు ఆకర్షణీయమైన దారాలు ఉన్నాయి. కనిపించేటువంటి ఇనుప సంకెళ్ళు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఉన్నవి చాలా సూక్ష్మంగా కూడా ఉన్నాయి మరియు రాయల్‌గా కూడా ఉన్నాయి. వ్యక్తిగతంగా అనిపించేవి కూడా ఉన్నాయి, కానీ ఆ దారాలు చూడటానికి కనిపించవు. తమ మంచితనం అనుభవము అవుతుంది, అక్కడ మంచితనం ఉండదు కానీ - మేము చాలా మంచివాళ్ళము, చాలా ముందుకు వెళ్తున్నాము అన్నట్లు అనుభవమవుతుంది. బాప్‌దాదా చూస్తున్నారు - ఇటువంటి జీవనబంధన దారాలు చాలామందిలో ఉన్నాయి. ఒకటి ఉన్నా, సగం ఉన్నా కానీ జీవన్ముక్తులను చాలా-చాలా కొద్దిమందిని చూసాము. బాప్‌దాదా చూసారు - లెక్క ప్రకారంగా జీవన్ముక్త స్థితి అనేది రెండవ స్థితి, చివరి స్థితి అయితే - దేహము నుండి అతీతులై విదేహీగా ఉండే స్థితి. ఈ స్థితి కొరకు, ఇప్పుడు వినిపించిన స్థితి కొరకు చాలా-చాలా-చాలా అటెన్షన్ కావాలి. పిల్లలందరూ అడుగుతున్నారు - 99వ సంవత్సరం వస్తే ఏమవుతుంది? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి మరియు ఏం చెయ్యకూడదు?
బాప్‌దాదా అంటున్నారు, 99వ సంవత్సరం అన్న విషయాన్ని వదిలెయ్యండి. ఇప్పటినుండే విదేహీ స్థితి యొక్క అనుభవము చాలా కావాలి. ఏయే పరిస్థితులైతే వస్తున్నాయో మరియు వచ్చేది ఉందో, వాటిలో విదేహీ స్థితి యొక్క అభ్యాసము చాలా కావాలి, అందుకే ఇతర విషయాలన్నింటినీ వదిలెయ్యండి. ఇలా అయితే అవ్వదు కదా, అలా అయితే అవ్వదు కదా అన్నది వదిలెయ్యండి. ఏమవుతుందో... అన్న ప్రశ్నను వదిలెయ్యండి. విదేహీ అభ్యాసము కల పిల్లలపై ఎటువంటి పరిస్థితి లేక ఎటువంటి అలజడి ప్రభావము చూపించలేదు. ప్రకృతిలోని పంచ తత్వాలూ కదిలించివేసేందుకు చాలా ప్రయత్నం చేసినా కానీ విదేహీ అవస్థ యొక్క అభ్యాసము కల ఆత్మలు పూర్తిగా అచలంగా, స్థిరంగా పాస్ విత్ ఆనర్లుగా ఉంటారు, తద్వారా అన్ని విషయాలూ పక్క నుండి దాటి వెళ్ళిపోతాయి, వారు మాత్రం బ్రహ్మా బాబా సమానంగా పాస్ విత్ ఆనర్‌కు ఋజువుగా ఉంటారు. బాప్‌దాదా ఎప్పటికప్పుడు సూచనలను ఇస్తున్నారు కూడా మరియు ఇస్తుంటారు కూడా. మీరు ఆలోచిస్తారు కూడా, ప్లాన్లను తయారుచేస్తారు కూడా, తయారుచెయ్యండి. మీరు ఆలోచిస్తే ఆలోచించండి, కానీ ఏమవుతుందో... అని ఇలా ఆశ్చర్యవంతులై ఆలోచించకండి. విదేహీగా, సాక్షీగా అయ్యి ఆలోచించండి. కానీ ఆలోచించారు, ప్లాన్ తయారుచేసారు, అంతే, ఇక క్షణములో ప్లెయిన్ స్థితిని తయారుచేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు అవసరమైనది స్థితి. ఈ విదేహీ స్థితి పరిస్థితులను చాలా సహజంగా దాటిస్తుంది. మబ్బులు వచ్చాయి, వెళ్ళిపోయాయి అన్నట్లుగా ఉంటుంది. మీరు విదేహీలై, అచలంగా-స్థిరంగా ఉంటూ ఆటను చూస్తుంటారు. ఇప్పుడు అంతిమ సమయం గురించి ఆలోచిస్తున్నారు కానీ అంతిమ స్థితిని గురించి ఆలోచించండి.
నలువైపులా జరుగుతున్న సేవల సమాచారాన్ని బాప్‌దాదా వింటుంటారు మరియు అలసిపోని సేవాధారులకు మనస్ఫూర్తిగా అభినందనలను కూడా తెలుపుతారు. సేవను చాలా మంచి ఉల్లాస-ఉత్సాహాలతో చేస్తున్నారు మరియు ఇకముందు కూడా చేస్తూ ఉండండి కానీ సేవ మరియు స్థితి యొక్క త్రాసు ఒక్కోసారి కాస్త ఇటువైపుకు ఒంగుతుంది, ఒక్కోసారి అటువైపుకు. అందుకే సేవ చాలానే చెయ్యండి, బాప్‌దాదా సేవ చెయ్యటానికి వద్దనరు, ఇంకా చాలా వైభవంగా చెయ్యండి, కానీ సదా సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్య్ను పెడుతూ వెళ్ళండి. స్థితిని తయారుచేసుకోవటానికి కాస్త శ్రమించాల్సి ఉంటుంది, కానీ సేవ అయితే సహజంగా జరిగిపోతుంది, అందుకే సేవా బలము స్థితి కంటే కాస్త ఎక్కువగా ఉంటూ ఉంది. బ్యాలెన్స్ పెట్టండి మరియు బాప్‌దాదా యొక్క, సేవ చేసే ఆత్మలందరి యొక్క, సంబంధ-సంపర్కములోకి వచ్చే బ్రాహ్మణ పరివారము యొక్క ఆశీర్వాదాలను తీసుకుంటూ వెళ్ళండి. ఈ ఆశీర్వాదాల ఖాతాను చాలా జమ చేసుకోండి. ఇప్పటి ఈ ఆశీర్వాదాల ఖాతా ఆత్మలైన మీలో ఎంత సంపన్నంగా అవ్వాలంటే ద్వాపరము నుండి మీ చిత్రాల ద్వారా అందరికీ ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. ఆశీర్వాదాలను అనేక జన్మలలో ఇవ్వాలి కానీ జమ అయితే ఒక్క జన్మలోనే చేసుకోవాలి, అందుకే ఏం చేస్తారు? స్థితిని సదా ముందు ఉంచుకుని సేవలలో ముందుకు వెళ్తూ ఉండండి. ఏమవుతుంది అని ఆలోచించకండి. బ్రాహ్మణ ఆత్మల కొరకు అంతా మంచిదే, మంచే జరగనున్నది, కానీ బ్యాలెన్స్ కలవారికి సదా మంచిగానే ఉంటుంది. బ్యాలెన్స్ తక్కువైనట్లయితే ఒక్కోసారి మంచిగా ఉంటుంది, ఒక్కోసారి కొద్దిగానే మంచిగా ఉంటుంది. ఏం చెయ్యాలో విన్నారా? ప్రశ్నార్థకంగా, ఆశ్చర్యార్థకంగా ఆలోచించడాన్ని సమాప్తము చెయ్యండి. ఇలా అయితే అవ్వదు కదా, అలా అయితే అవ్వదు కదా... అని ఇలా ఆలోచిస్తే అది స్థితిని కిందా-మీదా చేస్తుంది. అర్థమైందా!
కొత్తగా వచ్చినవారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ కల్పంలో మొదటిసారి మధుబన్కు వచ్చినవారు చేతులు ఎత్తండి. చాలా మంచిది. బాప్‌దాదా కొత్త పిల్లలను చూసి సంతోషిస్తారు. ఎంతో ఆనందంతో వెల్కమ్ పిల్లలూ, వెల్కమ్ పిల్లలూ అని స్వాగతం పలుకుతున్నారు. అంతిమ సమయానికి ముందే చేరుకున్నారు, ఇది చాలా మంచిది. అయినప్పటికీ, కలిసే సమయానికి చేరుకున్నారు. కాబట్టి తరువాత వచ్చినవారికీ ఇంకా ముందుకు వెళ్లడానికి ఛాన్స్ ఉంది. మీరు ఆ గోల్డెన్ ఛాన్స్‌ను తీసుకోండి. అచ్ఛా.
గుజరాత్ నుండి సమర్పణ కుమారీల గ్రూప్ వచ్చింది. (అహ్మదాబాద్ మేళాలో నవంబర్ 13న 38 మంది కుమారీల సమర్పణ సెరిమనీ జరిగింది. వారందరూ బాప్‌దాదా సమ్ముఖంలో కూర్చున్నారు.) సమర్పణ అయితే అయ్యారు, చాలా మంచిది. సేవ కూడా జరిగింది, ఉత్సవం కూడా జరుపుకున్నారు, సేవ యొక్క భాగ్యాన్ని కూడా నిర్మించుకున్నారు. ఇకపై ఇంకో సమర్పణ సెరిమనీ జరుపుకోవాలా, లేక ఇదే చివరిదా? బాప్‌దాదా చెప్పేది ఏమిటంటే, ఈ మొత్తం గ్రూప్ బంధనముక్తుల సమర్పణ సెరిమనీని జరుపుకోవాలి. అంతటి శక్తి ఉందా? ఉంటే చప్పట్లు కొట్టండి. ఇతరులను చూసి చప్పట్లు కొట్టవద్దు. అహ్మదాబాద్‌కు సేవ యొక్క ఫలితం కూడా ఉంది, సేవ యొక్క బలం కూడా ఉంది. అందుకే అలాంటి సమర్పణ సెరిమనీని జరుపుకోవాలి. అప్పుడు బాప్‌దాదా బహుమతి ఇస్తారు. సరేనా! మొదట నేను. ఇందులో ఇతరులను చూడకండి. ముందు పెద్దవారు చేస్తే, తరువాత మేము చేస్తాము అని కాదు. మొదట నేను. సరే. అచ్ఛా. ఈ విషయంపై పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకోండి. ఒకరికొకరు చేసిన వాగ్దానాన్ని గుర్తుచేయించుకుంటూ ముందుకు సాగండి. చాలా మంచిది.
ఎడ్యుకేషన్ వింగ్ ట్రైనింగ్‌కు సుమారు 100 మంది టీచర్లు వచ్చారు:- చాలా మంచి ట్రైనింగ్ జరిగింది. బాగా నచ్చిందా? ఇప్పుడు సేవలో ముందుకు వెళ్తారు, అది చాలా మంచిది. కానీ ఈరోజు బాప్‌దాదా చెప్పినట్లుగా, ముందుగా మిమ్మల్ని మీరు కూడా శిక్షణ పొందించుకోండి. ముందు స్వయం శిక్షణ, దానితో పాటు అందరికీ శిక్షణ. ఇలా డబల్ కార్యాన్ని చేస్తూ ముందుకు సాగండి. ఎగురుతూ ముందుకు వెళ్లండి. ఎగిరేవారే కదా! అచ్ఛా. ఈ మధుబన్ ట్రైనింగ్‌ను అవినాశిగా ఉంచండి. సేవలో ఛాన్స్ తీసుకోవాలనే సంకల్పం ఉన్నట్లే, స్వస్థితిలో ముందుకు వెళ్లడానికి కూడా ఎప్పటికప్పుడు ఛాన్స్ తీసుకుంటూ ఉండండి. బాగా ఉంది కదా! బ్యాలెన్స్‌లో విజయం పొందిన నంబర్‌వన్ ఎవరో బాప్‌దాదా చూస్తారు. చాలా మంచిది.
పంజాబ్ వారు మొదటి గ్రూప్‌లో సేవ చేశారు:- అచ్ఛా, పెద్ద గ్రూప్. మంచి ఛాన్స్ లభించింది. పంజాబ్‌కు బాప్‌దాదా ఒక ప్రత్యేక విషయానికి అభినందనలు తెలియజేస్తున్నారు. అది ఏమిటో తెలుసా? పంజాబ్ బంజరు నేలను ఫలవంతమైనదిగా మార్చడంలో మంచి పురోగతి సాధించింది. అభివృద్ధి బాగుంది. అందుకే అభినందనలు. ఇంకా పంజాబ్‌ను సింహమని కూడా అంటారు. మీ దాదీ (చంద్రమణి దాదీ)ని కూడా పంజాబ్ సింహమని అనేవారు. మరి మీరందరూ కూడా సింహాలే కదా! అయితే సింహం ఎవరిని వేటాడుతుంది? మేకనా? నంబర్‌వన్ సింహం అంటే మరో సింహాన్నే వేటాడేది. ఇప్పుడు పంజాబ్ నేల మంచి స్థితికి వచ్చింది. ఇక ఇలాంటి ప్రత్యేక వారసులను తయారుచేయండి. అదే సింహం చేసే వేట. ఎవరైనా మండలేశ్వరునికి ప్రత్యేక సేవ చేసి, వచ్చే సీజన్‌కు వారిని తీసుకురండి. వచ్చే సీజన్లో పంజాబ్ నుండి ఎంతమంది వారసులు వస్తారో చూద్దాం. అచ్ఛా. సేవ యొక్క సువాసన చాలా బాగుంది. మీరందరూ సంతృప్తిగా ఉంటున్నారు, ఇతరులను కూడా సంతృప్తిపరుస్తున్నారు. అభినందనలు.
(డబల్ విదేశీయులు కూడా చాలామంది వచ్చారు) విదేశీయుల గ్రూపు లేవండి. విదేశాలలో కూడా ఒక విశేషత బాప్‌దాదాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అదేమిటి? విదేశాలలోని మూల-మూలలలో బాబా స్థానాలను తయారుచెయ్యాలి అని అందరికీ చాలా ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి మరియు అలా తయారుచేసారు కూడా. ఈ సంవత్సరము ఎన్ని కొత్త స్థానాలను తయారుచేసారు? (12-15) సందేశము నలువైపులా లభించాలి అని మంచి ఉల్లాసము ఉంది. ఈ లక్ష్యము చాలా బాగుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరినో ఒకరిని నిమిత్తులుగా తయారుచెయ్యాలి అన్న సేవా లక్ష్యమును మంచిగా పెట్టుకుంటారు. ఇది విశేషత. ప్రతి ఒక్కరూ ఎంత వీలైతే అంత తమను తాము సేవకు నిమిత్తులుగా చేసుకునేందుకు ఆఫర్ కూడా చేసుకుంటారు మరియు ప్రాక్టికల్‌గా చేస్తారు కూడా. ఇంటింటిలోనూ బాబా ఇల్లు ఉండాలి అని ఇదే ఆలోచిస్తారు, ఈ ఉల్లాస-ఉత్సాహాలు చాలా బాగున్నాయి, అందుకే ఈ ఉల్లాస-ఉత్సాహాలతో మరింత ముందుకు వెళ్ళాలని బాప్‌దాదా ముందుగానే అభినందనలను ఇస్తున్నారు. బాప్‌దాదా విదేశీయులకు అనగా విశ్వ కళ్యాణానికి నిమిత్తులైన పిల్లలకు ఇదే చెప్తున్నారు - ఇప్పుడు సేవలో మరియు విదేహీ అవస్థలో నంబరువన్‌గా విదేశీ పిల్లలే తయారవ్వాలి. తయారవ్వాలా? ఎప్పుడు? 99లో తయారవ్వాలా లేక 2000లోనా? ఎప్పుడో కాదు, ఇప్పుడే. అవ్యక్త బాబా యొక్క పాలనకు ప్రత్యక్ష ఋజువును ఇవ్వాలి. బ్రహ్మా బాబా అవ్యక్తమై విదేహీ స్థితి ద్వారా కర్మాతీతులుగా అయ్యారు, మీరు అవ్యక్త బ్రహ్మా యొక్క విశేష పాలనకు పాత్రులు, అందుకే విదేహీలుగా అయ్యి, సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్సును ఉంచుతూ, అవ్యక్త పాలనకు బాబాకు రిటర్న్ ఇవ్వండి. సరేనా, అంగీకారమేనా? చెయ్యాల్సిందే. చూస్తారులే, చేస్తారులే అని బాప్‌దాదా ఆలోచించరు. అలా కాదు. చెయ్యాల్సిందే. మీ భాషలో చెప్పండి - చెయ్యాల్సిందే. టీ.వి.లో చూస్తున్నవారందరూ కూడా ఇలానే చెప్తున్నారు కదా? బాప్‌దాదా చూస్తున్నారు. భారత్‌లో చూస్తున్నా, విదేశాలలో చూస్తున్నా, మేము చేస్తాము, మేము చేస్తాము, మేము చెయ్యాల్సిందే అని అందరికీ ఉల్లాసము వస్తూ ఉంది. అందుకు ముందుగా అభినందనలు. అచ్ఛా.
(చాలామంది విదేశీ సోదర-సోదరీలు మొదటిసారి మధుబన్కు వచ్చారు, రిట్రీట్‌లో వచ్చిన అతిథులు కూడా కూర్చుని ఉన్నారు) చాలా మంచిది - అందరూ నంబరువన్ను తీసుకునేవారు. చాలా మంచిది, అతిథులుగా అయ్యి వచ్చారు కానీ బాబా యొక్క అధికారీ పిల్లలుగా అయిపోయారు. అధికారులుగా అయ్యారు కదా? అధికారులేనా? చాలా మంచిది, ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉండండి.
హాస్పిటల్ ట్రస్టీలతో:- అందరూ డబల్ ట్రస్టీలు. ఒకటేమో ప్రవృత్తిలో ఉంటూ ట్రస్టీలుగా ఉండటము మరియు ఇంకొకటి హాస్పిటల్లో ఉంటూ ట్రస్టీలుగా ఉండటము. హాస్పిటల్ ట్రస్టీలు కూడా మరియు జీవితంలో కూడా ట్రస్టీలు. మంచిది. హాస్పిటల్ అనేది ఆత్మలకు కూడా సేవ చేస్తుంది మరియు శరీరానికి కూడా సేవ చేస్తుంది. కావున డబల్ సేవ జరుగుతూ ఉంది, అందుకే నిమిత్తులుగా అయిన ఆత్మలు ఎవరైతే ఉన్నారో, వారికి కూడా డబల్ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. చాలా మంచి ప్లాన్‌ను తయారుచేసారు కదా. సేవా ఛాన్స్‌ను తీసుకోవటము అనగా ఛాన్సలర్లుగా అవ్వటము. ఆ ఛాన్సలర్ కాదు, ఆత్మిక యూనివర్సిటీకి ఛాన్సలర్. మంచిది.
(ఆస్ట్రేలియా వారు ఒలింపిక్ గేమ్స్ జరిగే సమయంలో చాలా పెద్ద ప్రోగ్రామ్ చేసే ప్లాన్‌ను తయారు చేస్తున్నారు, బాప్‌దాదాకు ప్లాన్ చూపించారు) ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి మరియు అందరి ఏకమతము ఉంది. ఎక్కడైతే ఏకమతము మరియు ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయో, అక్కడ సఫలత ఉండనే ఉంటుంది. మంచిది, చెయ్యండి. విదేశాలలో పేరును ప్రఖ్యాతము చెయ్యండి. చాలా మంచిది.
ఎవరెవరైతే భారత్ నుండి వచ్చారో, బాప్‌దాదా అవతరణ కూడా భారత్‌లోనే జరుగుతుందని, అలాగే ఒకవేళ కలుసుకోవడానికి వచ్చినా, అది కూడా భారత్‌లోకే వస్తారని భారతవాసులకు విశేషమైన నషా ఉంటుంది. కనుక డబల్ నషా ఉంది కదా! భారత్‌యే విదేశాలలో సందేశాన్ని ఇచ్చింది, భారత్ విదేశాలలో కూడా తమ పరివారాన్ని వెతుక్కుని ఒక పరివారాన్ని తయారుచేసింది, అందుకే భారతవాసీ పిల్లలకు సదా మహత్వము ఉంటుంది మరియు భారత్ యొక్క మహత్వాన్ని పెంచటానికి భారతవాసుల మహత్వము ఉండనే ఉంది. అందుకే పాత-కొత్త పిల్లలు ఎవరెవరైతే వచ్చారో వారు చాలా ప్రేమతో చేరుకున్నారు. బాప్‌దాదా పిల్లలందరి స్నేహాన్ని మరియు నలవైపులా కల సేవా సహయోగాన్ని చూసి సంతోషంగా ఉన్నారు మరియు పిల్లలు కూడా సదా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉంటారు కదా? ఎప్పుడూ సంతోషాన్ని తగ్గనివ్వకండి. ఇది బాబా యొక్క స్పెషల్ ఖజానా, అందుకే సంతోషాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకండి. సదా సంతోషంగా ఉండాలి. అచ్ఛా.
నలువైపులా ఉన్న సర్వ శ్రేష్ఠ భాగ్యవంతులకు, సర్వ శ్రేష్ఠ ఖజానాలకు యజమానులైనవారికి, సదా సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్సును ఉంచే జ్ఞాన స్వరూప ఆత్మలకు, సర్వ శక్తి సంపన్న ఆత్మలకు, సదా బంధనముక్త-జీవన్ముక్త ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
*** ఓంశాంతి ***
