Search for a command to run...
16 Dec 2000
‘‘సాక్షాత్తు బ్రహ్మాబాబా సమానంగా కర్మయోగి ఫరిశ్తాగా అవ్వండి, అప్పుడు సాక్షాత్కారాలు ప్రారంభమవుతాయి’’
16 December 2000 · తెలుగు
ఈరోజు బ్రాహ్మణ ప్రపంచము యొక్క రచయిత అయిన బాప్‌దాదా తమ బ్రాహ్మణ ప్రపంచాన్ని చూస్తూ-చూస్తూ హర్షిస్తున్నారు. ఇది ఎంత చిన్నని ప్రియమైన ప్రపంచము. ప్రతి బ్రాహ్మణుని మస్తకముపై భాగ్య సితార మెరుస్తూ ఉంది. నంబరువారుగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరి సితారలో భగవంతుడిని గుర్తించే మరియు భగవంతునికి చెందినవారిగా అయ్యే శ్రేష్ఠ భాగ్య మెరుపు ఉంది. ఏ తండ్రి గురించైతే ఋషులు, మునులు, తపస్వీలు మాకు తెలియదు, మాకు తెలియదు అంటూ వెళ్ళిపోయారో, అటువంటి తండ్రిని బ్రాహ్మణ ప్రపంచములోని ఎంతో అమాయకులైన ఆత్మలు తెలుసుకున్నారు మరియు పొందారు. ఈ భాగ్యము ఏ ఆత్మలకు ప్రాప్తిస్తుంది? సాధారణ ఆత్మలకు. బాబా కూడా సాధారణ తనువులో వస్తారు, అలాగే సాధారణ ఆత్మలైన పిల్లలే గుర్తిస్తారు. నేటి ఈ సభలో చూడండి, ఎవరు కూర్చుని ఉన్నారు? మిలియనీర్లు, బిలియనీర్లు కూర్చుని ఉన్నారా? సాధారణ ఆత్మల గాయనమే ఉంది. బాబాకు పేదల పెన్నిధి అన్న గాయనము ఉంది. మిలియనీర్ల పెన్నిధి అని గాయనము లేదు. బుద్ధివంతులకంటే బుద్ధివంతుడైన బాబా మిలియనీర్ల బుద్ధిని మార్చలేరా? అదేమంత పెద్ద విషయము! కానీ డ్రామాలో చాలా మంచి కళ్యాణకారీ నియమము తయారై ఉంది, అదేమిటంటే పరమాత్మ కార్యములో చుక్క-చుక్క కలిసి చెరువు తయారవ్వటము అనేది ఉంది. అనేకాత్మల భవిష్యత్తు తయారవ్వాలి. 10-20 మందిది కాదు, అనేక ఆత్మలది సఫలమవ్వాలి, అందుకే చుక్క-చుక్క కలిసి చెరువు తయారవ్వటము అన్న గాయనము ఉంది. మీరంతా ఎంతగా తనువు-మనసు-ధనమును సఫలం చేసుకుంటూ ఉంటారో, అంతగానే సఫలతా సితారలుగా తయారయ్యారు. అందరూ సఫలతా సితారలుగా అయ్యారా? అలా తయారయ్యారా లేక ఇప్పుడింకా తయారవ్వాలా, ఆలోచిస్తున్నారా? ఆలోచించకండి. చేస్తాము, చూస్తాము, చేయవలసిందే కదా... ఇలా ఆలోచించటము కూడా సమయాన్ని పోగొట్టుకోవటము, భవిష్యత్తు మరియు వర్తమానము యొక్క ప్రాప్తిని పోగొట్టుకోవటము.
బాప్‌దాదా వద్దకు కొంతమంది పిల్లల యొక్క ఒక సంకల్పము చేరుకుంటుంది. బయటివారైతే పాపం అభాగ్యులు కానీ బ్రాహ్మణ ఆత్మలు అభాగ్యులు కారు, ఆలోచనాపరులు, వివేకవంతులు. కానీ అప్పుడప్పుడు కొంతమంది పిల్లల్లో ఒక బలహీన సంకల్పము తలెత్తుతుంది, అదేమిటో చెప్పమంటారా. చెప్పమంటారా? అందరూ చేతులు ఎత్తుతున్నారు, చాలా మంచిది. వినాశనమవుతుందా అవ్వదా అని అప్పుడప్పుడు ఇలా ఆలోచిస్తారు! 1999 యొక్క చర్చ కూడా పూర్తయిపోయింది, 2000 కూడా పూర్తవ్వబోతుంది. ఇప్పుడిది ఇంకా ఎంతవరకు? బాప్‌దాదా అనుకుంటూ ఉంటారు - ఇది నవ్వొచ్చే విషయము ఎందుకంటే వినాశనం గురించి ఆలోచించటము అంటే బాబాకు వీడ్కోలు ఇవ్వటము ఎందుకంటే వినాశనమైపోతే బాబా పరంధామానికి వెళ్ళిపోతారు కదా! సంగమయుగముతో అలసిపోయారా? దీనిని వజ్రతుల్యమైనది అని అంటారు కానీ బంగారు ప్రపంచాన్ని ఎక్కువగా గుర్తు చేస్తారు, వినాశనము జరిగేదే ఉంది కానీ దాని కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? కొంతమంది పిల్లలు ఎలా ఆలోచిస్తారంటే - సఫలం చేద్దాము కానీ రేపో, ఎల్లుండో వినాశనమైపోతే మాది ఉపయోగపడనే పడదు, మాది సేవలో వినియోగించనే వినియోగించబడదు కాబట్టి - చేద్దాము, ఆలోచించి చేద్దాము, లెక్కపెట్టుకుని చేద్దాము, కొంచెం-కొంచెం చేద్దాము, ఈ సంకల్పాలు బాబా వద్దకు చేరుకుంటాయి. కానీ ఒకవేళ ఈ రోజు పిల్లలైన మీరు మీ తనువును సేవలో సమర్పణ చేసారనుకోండి, మనసును విశ్వ పరివర్తన అనే వైబ్రేషన్లు వ్యాపింపజేయటంలో నిరంతరం పెట్టారనుకోండి, ధనమేదైతే ఉందో అది వాస్తవానికి ప్రాప్తి ముందు అసలేమీ కాదు, కానీ ఈ రోజు మీరు అర్పించారు మరియు రేపే వినాశనం అయిపోతే మీది సఫలమైనట్లా లేక వ్యర్థమైనట్లా? ఆలోచించండి, సేవలో అయితే ఉపయోగించలేదు, మరి సఫలమైనట్లా? మీరు ఎవరికోసం సఫలం చేసారు? బాప్‌దాదా కోసం సఫలం చేసారు కదా? మరి బాప్‌దాదా అయితే అవినాశీ, వారు వినాశనమవ్వరు! అవినాశీ ఖాతాలో అవినాశీ బాప్‌దాదా వద్ద ఈ రోజు మీరు జమ చేసారంటే, ఒక గంట క్రితమే జమ చేసినా సరే అవినాశీ బాబా దగ్గర మీ ఖాతా ఒకటికి పదమాల రెట్లు జమ అవుతుంది. ఒకటికి పదమాల రెట్లు ఇవ్వటానికి బాబా బంధించబడి ఉన్నారు. బాబా అయితే వెళ్ళిపోరు కదా! పాత సృష్టి వినాశనమవుతుంది కదా! అందుకే మీరు మనస్ఫూర్తిగా చెయ్యాలి. తప్పదు కదా అని చేసినా లేక ఎవరినో చూసి చేసినా దానికి పూర్తి రిటర్న్ లభించదు. లభించటమైతే తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే దాతకు ఇచ్చారు కదా, కానీ పూర్తిగా లభించదు. అందుకే ఇలా ఆలోచించకండి - అచ్ఛా, ఇప్పుడు వినాశనమైతే 2001 వరకు కూడా కనిపించటం లేదు, ఇప్పుడైతే ఇంకా ప్రోగ్రాములు తయారవుతున్నాయి, ఇళ్ళు తయారవుతున్నాయి, పెద్ద-పెద్ద ప్లాన్లు తయారవుతున్నాయి, అందుకే 2001 వరకు కూడా వినాశనము అయ్యేలా కనిపించటం లేదు. ఎప్పుడూ కూడా ఈ విషయాలను ఆధారంగా చేసుకొని నిర్లక్ష్యులుగా అవ్వకండి. అకస్మాత్తుగా జరగనున్నది. ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు, గంట తర్వాత అయినా అవ్వవచ్చు, ఏమీ అవ్వదులేండి, ఒక గంట తర్వాత ఏమవుతుందో అని భయపడకండి, కానీ అది సంభవమే. ఇంత ఎవరెడీగా అయితే ఉండాల్సిందే. శివరాత్రి కల్లా చేయాలి అని ఇలా ఆలోచించకండి. సమయము కోసం ఎదురుచూడకండి. సమయము మీ రచన, మీరు మాస్టర్ రచయిత. రచయిత రచనకు ఆధీనమవ్వరు. రచన అయిన సమయము మీ ఆజ్ఞానుసారంగా నడుస్తుంది. మీరు సమయము కోసం ఎదురు చూడకండి, కానీ ఇప్పుడు సమయము మీ కోసం ఎదురుచూస్తూ ఉంది. కొంతమంది పిల్లలు ఎలా ఆలోచిస్తారంటే - బాప్‌దాదా 6 నెలల కోసం అన్నారు కదా, కావున 6 నెలలైతే తప్పకుండా ఉంటుంది, ఉంటుంది కదా! కానీ బాప్‌దాదా అంటారు - ఈ హద్దు విషయాలను ఆధారంగా చేసుకోకండి, ఎవరెడీగా ఉండండి. నిరాధారంగా ఉండాలి, ఒక్క క్షణములో జీవన్ముక్తి. ఒక్క క్షణములో జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకోండి అని ఛాలెంజ్ చేస్తారు. మరి మీరు ఒక్క క్షణములో స్వయమును జీవన్ముక్తులుగా చేసుకోలేరా? అందుకే ఎదురు చూడకండి, సంపన్నంగా అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకోండి.
బాప్‌దాదాకు పిల్లల ఆటను చూసి నవ్వు వస్తుంది కూడా. ఏ ఆటను చూసి నవ్వు వస్తుంది? చెప్పమంటారా? ఈ రోజు మురళిని వినిపించటం లేదు, సమాచారాన్ని వినిపిస్తున్నాము. ఇప్పటికీ చాలామంది పిల్లలకు ఆటబొమ్మలతో ఆడుకోవటము చాలా మంచిగా అనిపిస్తుంటుంది. చిన్న-చిన్న విషయాలు అనే ఆటబొమ్మలతో ఆడుకోవటము, చిన్న విషయాలను పట్టుకుని ఉండటము, వీటిలో సమయాన్ని పోగొట్టుకుంటారు. ఇవన్నీ సైడ్ సీన్స్. భిన్న-భిన్న సంస్కారాలకు చెందిన విషయాలు మరియు నడవడిక అనేవి సంపూర్ణ గమ్యానికి చేరుకునేటప్పుడు మార్గ మధ్యములో వచ్చే సైడ్ సీన్స్. వాటిని చూసి ఆగిపోవటము అంటే ఆలోచించటము, ప్రభావములోకి రావటము, సమయాన్ని పోగొట్టుకోవటము, అభిరుచితో వినటము, వినిపించటము, అటువంటి వాయుమండలాన్ని తయారుచెయ్యటము... ఆగిపోవటము అంటే ఇదే. దీని వలన సంపూర్ణత అనే గమ్యానికి దూరమైపోతారు. బాబా సమానంగా అవ్వాల్సిందే అని చాలా కష్టపడతారు, చాలా కోరుకుంటారు, శుభ సంకల్పము, శుభ కోరిక ఉంది కానీ శ్రమిస్తున్నా సరే ఆటంకం వచ్చేస్తుంది. రెండు చెవులు ఉన్నాయి, రెండు కళ్ళు ఉన్నాయి, నోరు ఉంది కనుక చూడటం, వినటం, మాట్లాడటం జరుగుతుంది అని అంటారు. కానీ బాబా యొక్క చాలా పాత స్లోగన్ సదా గుర్తు పెట్టుకోండి - చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి. వింటూ కూడా దాని గురించి ఆలోచించకండి, వింటూ దానిని లోపల ఇముడ్చుకోండి, వ్యాపింపజేయకండి. ఈ పాత స్లోగన్‌ను గుర్తు పెట్టుకోవడం తప్పనిసరి ఎందుకంటే రోజురోజుకూ ఎలా అయితే అందరి పాత శరీరాల లెక్కలు పూర్తవుతూ ఉన్నాయో, అదే విధంగా అందరి పాత సంస్కారాలు కూడా, పాత వ్యాధులు కూడా బయటికి వచ్చి సమాప్తం అవ్వనున్నాయి. అందుకే - ఏమిటో ఇప్పుడు ఇంకా విషయాలు పెరిగిపోతున్నాయి, ఇంతకుముందైతే ఇవి లేవు అని గాభరా పడకండి. ఒకప్పుడు లేనివి ఇప్పుడు బయటికి వస్తున్నాయి మరియు రావాల్సిందే. మీ ఇముడ్చుకునే శక్తికి, సహన శక్తికి, సర్దుబాటు శక్తికి, నిర్ణయ శక్తికి పరీక్షలు ఇవి. 10 సంవత్సరాల క్రింద వచ్చిన పరీక్షే ఇప్పుడు వస్తుందా ఏమిటి? బి.ఎ. క్లాసులో వచ్చే పేపర్ యమ్.ఏ. క్లాసులో వస్తుందా? అందుకే - ఏమి జరుగుతుంది, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది... అని గాభరా పడకండి. ఆటను చూడండి. పరీక్షనైతే పాస్ అవ్వండి, పాస్ విత్ ఆనర్‌గా అవ్వండి.
బాప్‌దాదా ఇంతకుముందు కూడా వినిపించి ఉన్నారు, పాస్ అయ్యేందుకు అన్నింటికన్నా సహజ సాధనము - బాప్‌దాదాకు పాస్ (దగ్గర)గా ఉండండి, మీకు అవసరం లేని దృశ్యాలేవైతే ఉన్నాయో వాటిని పాస్ చేయండి (దాటెయ్యండి). పాస్‌గా ఉండండి (దగ్గరగా ఉండండి), పాస్ చెయ్యండి (దాటెయ్యండి), పాస్ అవ్వండి (ఉత్తీర్ణులవ్వండి). ఇది కష్టమా? టీచర్లు వినిపించండి, మధుబన్ వారు వినిపించండి. మధుబన్ వారు చేతులెత్తండి. మధుబన్ వారు తెలివైనవారు. ముందుకు వచ్చి కూర్చుంటారు, మంచిదే రండి. బాప్‌దాదాకు సంతోషము అనిపిస్తుంది. మీ హక్కును తీసుకుంటారు కదా! మంచిది, ఈ విషయంలో బాప్‌దాదా అసంతుష్టంగా లేరు, ముందు కూర్చోండి, ఏం ఫరవాలేదు. మధుబన్‌లో ఉంటున్నారు కావున ప్రత్యేక పాలన ఉండాలి కదా! కానీ పాస్ అన్న మాటను గుర్తుంచుకోండి. మధుబన్‌లో కొత్త-కొత్త విషయాలు జరుగుతాయి కదా, దొంగలు కూడా వస్తారు. ఎన్నో కొత్త-కొత్త విషయాలు జరుగుతాయి. ఇప్పుడు అందరి సమక్షంలో బాప్‌దాదా వాటిని ఏం వినిపిస్తారు, కొంచెం గుప్తంగా ఉంచుతారు కానీ అవి ఏమిటో మధుబన్ వారికి తెలుసు. మనోరంజనం చేసుకోండి, తికమకపడకండి. తికమకపడటం ఒకటి, లేదంటే మనోరంజనంగా భావించి ఆనందములో పాస్ చెయ్యటం (దాటెయ్యటం) మరొకటి. మరి తికమకపడటము మంచిదా లేక వాటిని దాటి వేసి ఆనందములో ఉండటము మంచిదా? పాస్ చెయ్యాలి (దాటెయ్యాలి) కదా! పాస్ అవ్వాలి (ఉత్తీర్ణులవ్వాలి) కదా! కనుక పాస్ చెయ్యండి (దాటెయ్యండి). ఇదేమైనా పెద్ద విషయమా? పెద్ద విషయమేమీ కాదు. విషయాన్ని పెద్దదిగా చేయటము లేక చిన్నదిగా చేయటము అనేది మీ బుద్ధిపై ఆధారపడి ఉంటుంది. ఎవరైతే విషయాన్ని పెద్దదిగా చేస్తారో, అటువంటివారి గురించి అజ్ఞానకాలములో కూడా ఏమంటారంటే - వీరు తాడును కూడా పాముగా చేస్తారు అని. సింధీ భాషలో ‘‘నోరీ కో నాగ్’’ (తాడును పాముగా) గా చేస్తారు అని అంటారు. ఇటువంటి ఆటను ఆడకండి. ఇప్పుడు ఈ ఆట సమాప్తమైపోవాలి.
ఈరోజు విశేష సమాచారాన్ని అయితే వినిపించాము కదా, బాప్‌దాదా ఇప్పుడు ఒక సహజ పురుషార్థాన్ని వినిపిస్తారు. కష్టమైనదేమీ కాదు. బాబా సమానంగా అవ్వాల్సిందే అని అందరికీ ఈ సంకల్పమైతే ఉండనే ఉంది. అవ్వాల్సిందే, పక్కా కదా! విదేశీయులు, అవ్వాల్సిందే కదా? టీచర్లు, అవ్వాలి కదా? ఎంతమంది టీచర్లు వచ్చారు! వాహ్! టీచర్లది అద్భుతము. బాప్‌దాదా ఈ రోజు టీచర్ల గురించి ఒక సంతోషకరమైన వార్తను విన్నారు. ఆ సంతోషకరమైన వార్త ఏమిటో చెప్పండి. టీచర్లకు ఈ రోజు గోల్డెన్ మెడల్ (బ్యాడ్జి) లభించింది. ఎవరికైతే గోల్డెన్ మెడల్ (బంగారు బ్యాడ్జి) లభించిందో వారు చేతులెత్తండి. పాండవులకు కూడా లభించిందా? బాబా యొక్క తోటివారు మిగిలిపోకూడదు కదా. పాండవులు బ్రాహ్మాబాబా యొక్క తోటివారు. (వారికి వేరే రకమైన గోల్డెన్ది లభించింది) పాండవులది రాయల్ గోల్డ్ మెడల్. గోల్డెన్ మెడల్ లభించినవారికి బాప్‌దాదా యొక్క కోటానుకోట్ల రెట్ల అభినందనలు, అభినందనలు, అభినందనలు.
ఎవరైతే దేశ-విదేశాలలో వింటున్నారో మరియు ఎవరికైతే గోల్డెన్ మెడల్ లభించిందో, వారందరూ కూడా, మాకు కూడా బాప్‌దాదా అభినందనలు ఇచ్చారు అని భావించండి. వారు పాండవులైనా లేక శక్తులైనా, ఏ కార్యానికి నిమిత్తులుగా అయినవారైనా కానీ, పరివారములో ఉండేవారికి కూడా ఏదో ఒక విశేషత ఆధారంగా, ప్రత్యేకంగా దాదీలు గోల్డెన్ మెడల్‌ను ఇస్తారు. కనుక ఎవరికి ఏ విశేషత ఆధారంగా లభించినా సరే, అంటే సమర్పణ అయినందుకైనా లేక ఏదైనా సేవలో విశేషంగా ముందుకు వెళ్ళినవారికైనా దాదీల ద్వారా కూడా గోల్డెన్ బ్యాడ్జి లభించింది, అందుకే దూరంగా కూర్చుని వింటున్నవారికి కూడా చాలా, చాలా అభినందనలు. దూరంగా కూర్చుని మురళిని వినేవారి కోసమూ, గోల్డెన్ మెడల్ లభించినవారి కోసమూ, మీరందరూ ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి, వారు మీ చప్పట్లను చూస్తున్నారు. వారు కూడా నవ్వుతున్నారు, సంతోషిస్తున్నారు.
బాప్‌దాదా సహజ పురుషార్థం గురించి వినిపిస్తున్నారు - ఇప్పుడు సమయమైతే అకస్మాత్తుగా వచ్చేదే ఉంది, ఒక గంట ముందు కూడా బాప్‌దాదా ఎనౌన్స్ చెయ్యరు, చెయ్యరు, చెయ్యరు. నంబరు ఎలా తయారవుతుంది? ఒకవేళ అకస్మాత్తుగా జరగకపోతే అది పరీక్ష ఎలా అవుతుంది? పాస్ విత్ ఆనర్ సర్టిఫికేట్, ఫైనల్ సర్టిఫికేట్ అయితే అకస్మాత్తుగా జరిగినప్పుడే లభిస్తుంది. అందుకే దాదీల ఒక సంకల్పము బాప్‌దాదా వద్దకు చేరుకుంది. దాదీలు ఏం కోరుకుంటున్నారంటే - ఇప్పుడు బాప్‌దాదా సాక్షాత్కారాల తాళాన్ని తెరవాలి, ఇది వారి సంకల్పము. మీరందరూ కూడా కోరుకుంటున్నారా? బాప్‌దాదా తాళాన్ని తెరుస్తారా లేక మీరు నిమిత్తులుగా అవుతారా? అచ్ఛా, బాప్‌దాదా తాళం తెరవాలా, సరే. బాప్‌దాదా హాజీ అంటారు, (అందరూ చప్పట్లు కొట్టారు) ముందు పూర్తిగా వినండి. బాప్‌దాదాకు తాళం తెరవడానికి ఆలస్యమేముంది, కానీ ఎవరి ద్వారా తెరిపిస్తారు? ప్రత్యక్షత ఎవరు చెయ్యాలి? పిల్లలా లేక బాబానా? బాబా కూడా పిల్లల ద్వారానే చెయ్యాలి ఎందుకంటే ఒకవేళ జ్యోతిర్బిందు యొక్క సాక్షాత్కారము జరిగినా సరే... కొంతమంది అభాగ్యులు... పాపం, అభాగ్యులే కదా, వారు అదేమిటి అనేది కూడా తెలుసుకోలేరు. చివరిలో శక్తులు మరియు పాండవులైన పిల్లల ద్వారానే బాబా ప్రత్యక్షమవ్వాలి. అందుకే బాప్‌దాదా ఏం చెప్తున్నారంటే - బాబా సమానంగా తయారవ్వవలసిందే అని పిల్లలందరి సంకల్పము ఒక్కటే అయినప్పుడు, ఈ విషయంలో రెండు ఆలోచనలు లేవు కదా! అందరి ఆలోచన ఒక్కటే కదా! అయితే బ్రహ్మాబాబాను ఫాలో చెయ్యండి. అశరీరిగా, బిందువుగా ఆటోమేటిక్‌గా అయిపోతారు. బ్రహ్మాబాబా పట్లనైతే అందరికీ ప్రేమ ఉంది కదా! చాలా వరకు ఏమి గమనించడం జరిగిందంటే - మామూలుగా అయితే అందరికీ ప్రేమ ఉంది, కానీ విదేశీయులకు బ్రాహ్మాబాబాపై చాలా ప్రేమ ఉంది. వారు ఈ కళ్ళ ద్వారా చూడలేదు కానీ అనుభవమనే నేత్రం ద్వారా విదేశీయులు మెజారిటీ బ్రహ్మాబాబాను చూసారు మరియు ప్రేమ కూడా చాలా ఉంది. ఆ మాటకొస్తే భారత్‌లోని గోపికలు మరియు గోపులు కూడా ఉన్నారు, అయినా కానీ బాప్‌దాదా అప్పుడప్పుడు విదేశీయుల అనుభవాల కథలను వింటుంటారు, భారతవాసులు కొంచెం గుప్తంగా ఉంచుతారు. వారు బ్రహ్మాబాబా గురించి వినిపిస్తారు, వారు వినిపించే కథలను బాప్‌దాదా కూడా వింటారు మరియు ఇతరులకు కూడా వినిపిస్తారు, విదేశీయులకు అభినందనలు. లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా, రష్యా, జర్మనీ... అనగా నలువైపుల ఉన్న విదేశీయులకు, ఎవరైతే దూరంలో కూర్చుని కూడా వింటున్నారో, వారందరికీ కూడా బాప్‌దాదా అభినందనలను తెలుపుతున్నారు, ప్రత్యేకంగా బ్రహ్మాబాబా అభినందనలను తెలుపుతున్నారు. భారతీయులది కొంచెం గుప్తంగా ఉంటుంది, వారు అంతగా ప్రసిద్ధి చెయ్యలేరు, గుప్తంగా ఉంచుతారు. ఇప్పుడు ప్రత్యక్షం చెయ్యండి. ఇకపోతే, భారత్‌లో కూడా చాలా మంచి-మంచివారు ఉన్నారు. ఎటువంటి గోపికలు ఉన్నారంటే, ఒకవేళ వారి అనుభవాన్ని ఇప్పటి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ విన్నారంటే వారి కళ్ళ నుండి కూడా కన్నీరు వస్తుంది. అటువంటి అనుభవాలు ఉన్నాయి, కానీ గుప్తంగా ఉంచుతారు. అంతగా తెలియజేయరు, అవకాశము కూడా తక్కువగా లభిస్తుంది. బాప్‌దాదా ఏమంటున్నారంటే - బ్రహ్మాబాబాపై అందరికీ ప్రేమ అయితే ఉంది, కనుకనే మిమ్మల్ని మీరు ఏమని పిలుచుకుంటారు? బ్రహ్మాకుమారి అనా శివకుమారి అనా? బ్రహ్మాకుమారి అని పిలుచుకుంటారు కదా, అంటే బ్రహ్మాబాబాపై ప్రేమైతే ఉండనే ఉంది కదా. ఒకవేళ అశరీరులుగా అవ్వాలంటే కొంచెం శ్రమ అనిపించవచ్చు, కానీ బ్రహ్మాబాబా ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారు? ఏ రూపంలో ఉన్నారు? చెప్పండి. (ఫరిశ్తా రూపములో), మరి బ్రహ్మాపై ప్రేమ ఉండటము అనగా ఫరిశ్తా రూపముపై ప్రేమ ఉండటము. బిందువుగా అవ్వటం కొంచెం కష్టం అనిపిస్తుంది, ఫరిశ్తాగా అవ్వటమైతే దానికంటే సహజమే కదా! చెప్పండి, బిందు రూపము కంటే ఫరిశ్తా రూపము సహజము కదా! మీరు అకౌంట్స్ పని చేస్తూ బిందువుగా అవ్వగలరా? ఫరిశ్తాగా అయితే అవ్వగలరు కదా! బిందు రూపములో కర్మలు చేస్తూ అప్పుడప్పుడు వ్యక్త శరీరములోకి రావలసి వస్తుంది కానీ బాప్‌దాదా చూసారు - సైన్స్ వారు విద్యుత్తు ఆధారంగా రోబోట్‌ను (మరమనిషిని) తయారుచేసారు, విన్నారు కదా! చూడకపోయినా కానీ వినటమైతే విన్నారు కదా! మాతలు విన్నారా? మీకు ఆ చిత్రాన్ని చూపిస్తారు. వారు విద్యుత్తు ఆధారంతో రోబోట్‌ను తయారుచేసారు మరియు అది అన్ని పనులను చేస్తుంది. మరియు విద్యుత్తు ఆధారంతో చాలా వేగంగా చేస్తుంది. ఇది సైన్సుకు ప్రత్యక్ష ప్రమాణము. కావున బాప్‌దాదా అంటున్నారు - సైలెన్స్ శక్తితో, సైలెన్స్ విద్యుత్తుతో మీరు కర్మలను చెయ్యలేరా? చెయ్యలేరా? ఇంజనీర్లు మరియు వైజ్ఞానికులు కూర్చుని ఉన్నారు కదా! మీరు కూడా ఒక ఆత్మిక రోబోట్ వంటి స్థితిని తయారుచేసుకోండి. వారినే ఆత్మిక కర్మయోగులు, ఫరిశ్తా కర్మయోగులు అని అంటారు. ముందు మీరు తయారవ్వండి. ఇంజనీర్లు ఉన్నారు, వైజ్ఞానికులు ఉన్నారు, కనుక ముందుగా మీరు అనుభవము చెయ్యండి. చేస్తారా? చెయ్యగలరా? అచ్ఛా, అటువంటి ప్లాన్‌ను తయారుచెయ్యండి. బాప్‌దాదా ఇటువంటి నడుస్తూ-తిరుగుతూ ఉన్న ఆత్మిక కర్మయోగి ఫరిశ్తాలను చూడాలనుకుంటున్నారు. అమృతవేళ లేవండి, బాప్‌దాదాతో మిలనం చేసుకోండి, ఆత్మిక సంభాషణను చెయ్యండి, వరదానాన్ని తీసుకోండి. ఏది చెయ్యాలో అది చెయ్యండి. కానీ బాప్‌దాదా నుండి ప్రతిరోజూ అమృతవేళ కర్మయోగీ ఫరిశ్తా భవ అన్న వరదానాన్ని తీసుకుని, ఆ తర్వాత కార్య వ్యవహారాలలోకి రండి. ఇది వీలవుతుందా?
మీ డిపార్టుమెంట్లో (అకౌంట్స్) చాలా బుద్ధితో కూడుకున్న పని ఉంటుంది, మీకు వీలవుతుందా? మధుబన్ వారు చేతులెత్తండి. వీలవుతుంది అని భావించేవారు చేతిని పెద్దగా ఎత్తండి. మధుబన్ సోదరీలు చేతులెత్తారు. మధుబన్ వైబ్రేషన్లు నలువైపులకు వ్యాపిస్తాయి కదా. ఇందులో ఫరిశ్తా స్వరూపంలో కర్మయోగిగా, డబల్ లైట్‌గా, లైట్ శరీరంతో, లైట్‌గా అయ్యి (తేలికగా అయ్యి) కర్మ చేస్తున్నారు. మాట్లాడినా ఫరిశ్తా రూపంలో, కర్మ చేసినా ఫరిశ్తా రూపంలో. ఎవరికి పని ఉందో, వారొక్కరే వినాలి, మరొకరు వినే అవసరం లేదు. వాతావారణం ఎందుకు తయారవుతుంది?
ఏదైనా చిన్న విషయమైనా దాని వాతావరణం ఎందుకు తయారవుతుంది అని బాప్‌దాదా చూసారు. ఏదైనా విషయం ఉంటే అది ఎలా మాట్లాడుతారంటే, ఆ విషయంతో సంబంధం లేని వారి చెవులకు కూడా విషయం చేరుతుంది. వారికి కూడా వ్యర్థ సంకల్పాలు నడవడం ప్రారంభం అవుతాయి. కావున ఫరిశ్తా అనగా ఎవరి పని ఉందో వారే వినాలి. ఎంత అవసరమో అంతే మాట్లాడాలి, కథగా చెప్పకండి. కథ అంటే ఎప్పుడూ మిక్స్ చేసి కూడా చెప్తారు మరియు ఎక్కువ చెప్తారు. మరి బ్రహ్మా బాబాపై ఉన్న ప్రేమకు రిటర్న్ – బ్రహ్మా బాబా సమానంగా కర్మయోగి ఫరిశ్తా భవ.
బాప్‌దాదా ఇదే చెప్తున్నారు – ఇటువంటి స్థితి యొక్క ధరణిని తయారు చేయండి అప్పుడు బాప్‌దాదా, సాక్షాత్తూ బాబా పిల్లల ద్వారా సాక్షాత్కారాన్ని తప్పకుండా చేయిస్తారు. సాక్షాత్తూ బాబా మరియు సాక్షాత్కారము – ఈ రెండు పదాలను గుర్తు పెట్టుకోండి. కేవలం ఉన్నదే ఫరిశ్తా. సేవ కూడా చేస్తారు, ఉన్నతమైన స్థితి నుండి ఫరిశ్తా క్రిందకు వచ్చింది, సందేశము ఇచ్చింది, తర్వాత పైకి వెళ్ళిపోయింది అనగా ఉన్నతమైన స్మృతిలోకి తిరిగి వెళ్ళిపోయింది.
ఎలా అయితే ఇప్పుడు సమయం అనుసారంగా, అక్కడక్కడ నీటి దప్పికతో ఉన్నారో, అలా వర్తమాన సమయంలో శుద్ధమైన, శాంతిమయమైన, సుఖమయమైన వైబ్రేషన్ల దప్పికతో ఉన్నారు. ఫరిశ్తా రూపంతోటే వైబ్రేషన్లను వ్యాప్తి చేయగలరు. ఫరిశ్తా అనగా సదా ఉన్నతమైన స్థితిలో ఉండటము. ఫరిశ్తా అనగా పాత ప్రపంచము మరియు పాత సంస్కారాలతో సంబంధము లేకుండా ఉండటము. ప్రపంచ పరివర్తన ఇప్పుడు మీ యొక్క సంస్కార పరివర్తన కారణంగా ఆగి ఉంది.
ఈ కొత్త సంవత్సరములో లక్ష్యము పెట్టుకోండి - సంస్కార పరివర్తన. స్వయానిది కూడా, మరియు సహయోగము ద్వారా ఇతరులది కూడా. ఎవరైనా బలహీనులు ఉంటే వారికి సహయోగాన్ని ఇవ్వండి, వారి బలహీనతను వర్ణించకండి, అటువంటి వాతావరణాన్ని తయారుచెయ్యకండి. సహయోగాన్ని ఇవ్వండి. ఈ సంవత్సరము యొక్క టాపిక్ ‘‘సంస్కార పరివర్తన’’. ఫరిశ్తా సంస్కారాలు, బ్రహ్మాబాబా సమానమైన సంస్కారాలు. మరి ఇది సహజ పురుషార్థమా లేక కష్టమా? కొంచెం-కొంచెం కష్టమా? ఎప్పుడూ ఏ విషయమూ కష్టము కాదు, తమ బలహీనతే కష్టంగా చేస్తుంది. అందుకే బాప్‌దాదా అంటున్నారు - ‘‘ఓ మాస్టర్ సర్వశక్తిమంతులైన పిల్లలూ, ఇప్పుడు శక్తులతో కూడిన వాయుమండలాన్ని వ్యాపింపజేయండి.’’ ఇప్పుడు వాయుమండలానికి మీ అవసరము చాలా-చాలా ఉంది. ఎలా అయితే ఈ రోజుల్లో విశ్వములో కాలుష్య సమస్య ఉందో, అలా విశ్వములో ఒక్క క్షణకాలమైనా మనసులో శాంతి, సుఖముల వాయుమండలము యొక్క అవసరము ఉంది ఎందుకంటే మానసిక కాలుష్యము చాలా ఉంది, గాలి కాలుష్యము కంటే కూడా అది ఎక్కువగా ఉంది. అచ్ఛా.
నలువైపులా బాప్‌దాదా సమానంగా అవ్వాల్సిందే అన్న లక్ష్యం పెట్టుకున్న వారందరికీ, నిశ్చయబుద్ధి విజయీ ఆత్మలకు, సదా పాత ప్రపంచాన్ని మరియు పాత సంస్కారాలను దృఢ సంకల్పం ద్వారా పరివర్తన చేసే మాస్టర్ సర్వ శక్తిమాన్ ఆత్మలకు, సదా ఏ కారణంగానైనా, పరిస్థితుల కారణంగానైనా, స్వభావ-సంస్కారాల కారణంగానైనా బలహీనులుగా ఉన్న తమ తోటి సహచరులకు, ఆత్మలకు సహయోగాన్ని ఇచ్చేవారికి, కారణాన్ని చూడకుండా నివారణ చేసే ధైర్యవంతులైన ఆత్మలకు, సదా బ్రహ్మాబాబా స్నేహానికి రిటర్న్ ఇచ్చే కర్మయోగి ఫరిశ్తా ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
సేవ టర్న్ పంజాబ్ వారిది, పంజాబ్ వారికి బ్రహ్మా బాబాపై చాలా ప్రేమ ఉంది:- మంచిది, బ్రహ్మా బాబా పాలనను కూడా తీసుకున్నారు. ఈరోజుల్లో ప్రైజ్ తీసుకునే ప్రోగ్రామును పెడుతున్నారు కదా. ఎలా అయితే కల్చర్ ఆఫ్ పీస్ కార్యక్రమంలో నంబర్‌వన్ ప్రైజ్ ఏ జోన్ అయినా తీసుకుని ఉండవచ్చు, ఏ సెంటర్ అయినా తీసుకుని ఉండవచ్చు, అలాగే కర్మయోగి ఫరిశ్తా స్వరూపము యొక్క స్థితిలో పంజాబ్ వారు నంబర్‌వన్ ప్రైజ్ తీసుకోవాలి అని బాప్‌దాదా భావిస్తున్నారు. వీలవుతుందా? పంజాబ్ వారు చేతులెత్తండి. ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటారా? పంజాబ్ వారు ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటాము అని భావిస్తున్నారో వారు ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి. పంజాబ్ టీచర్లు ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి. చాలా సమయం నుండి కూర్చుని ఉన్నారు కదా, డ్రిల్ చేయండి, లేవండి. సెంటర్ నుండి వచ్చిన ముఖ్యమైన పాండవులు కూడా లేవండి. ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటారా? అచ్ఛా, మూడు ప్రైజులను ఎవరు తీసుకుంటారో చూస్తాము. ఫస్ట్, సెకండ్, థర్డ్, మూడు బహుమతులు బాప్‌దాదా ఇస్తారు. బహుమతిని ఎప్పటివరకు ఇస్తారు? (మే నెలకల్లా ఇస్తాము అని దాదీ చెప్పారు) (బాప్‌దాదా పంజాబ్ యొక్క అచల్ దీదీని అడుగుతున్నారు) 6 నెలలలో పూర్తి పురుషార్థం జరుగుతుందా? టీచర్లు చెప్పండి, 6 నెలలు కావాలా? ఎవరికైతే 6 నెలలు కావాలి అంటారో వారు చేతులెత్తండి. అచ్ఛా, మరి మిగతా వారికి ఎంత సమయం కావాలి, 12 నెలలు? అంతకన్నా తక్కువ సమయం కావాలా? సరే, బాప్‌దాదా చివరగా మార్చిలో పేపరు తీసుకోమంటారా? అప్పుడు శాతంలో వచ్చినా, ఫైనల్ వచ్చినా, దాని అనుసారంగా ప్రైజ్ ఇస్తాము. సరేనా! మార్చిలో చివరి టర్న్‌లో. (శివరాత్రి సమయంలో చివరి టర్న్ ఉంటుంది) ఫిబ్రవరి ఆఖరున లేక మార్చి, ఏదైనా ఒకటే. అంటే కేవలం పంజాబ్ వారే తయారు కావాలని అర్థం కాదు, అన్ని జోన్లు, అన్ని సెంటర్లు తయారు కావాలి. వీలవుతుందా? పంజాబ్ కన్నా ముందుకు ఎవరైనా వెళ్ళవచ్చు, ఏ వన్. కావున అన్ని జోన్లకు పేపరు తీసుకోమంటారా? మధుబన్ కూడా ఒక జోన్, మేము జోన్లో లేము అని భావించకండి. ముందు మధుబన్. అచ్ఛా.
జగదీశ్ అన్నయ్యతో:- మంచిగా ఉన్నారు కదా! (మీకే బాగా తెలుసు) బాగుంది. ఇప్పుడు నేచురల్ సాధనాలతోటే మంచిగా ఉన్నారు. సేవ అయితే మీరు ఆది నుండి చాలా చేసారు (బాధ్యతను పూర్తి చేసాను, నా భాగ్యాన్ని తయారు చేసుకున్నాను) ఇప్పుడు మీరు శరీరం ద్వారా చేయలేకపోవచ్చు, కానీ ఏ ఆత్మ అయితే ఏ సేవకు నిమిత్తమవుతుందో, సేవ యొక్క ఆవిష్కరణకు నిమిత్తమవుతుందో, ఆ ఆత్మకు సేవా సఫలత యొక్క వాటా జమ అవుతూ ఉంటుంది. ఎలా అయితే ప్రదర్శని యొక్క ఆవిష్కరణ జరిగింది, దాని ద్వారా క్వాంటిటీకి సందేశం లభిస్తుంది, మేళాలు జరిగాయి, ఇది కూడా క్వాంటిటీ సేవ, వి.ఐ.పీలు చాలా తక్కువ వస్తారు, కానీ కాన్ఫరెన్సు జరిగితే కాన్ఫరెన్సు సేవతో, స్పీచ్ యొక్క ఆకర్షణతో వి.ఐ.పీలు వస్తారు, వారి సేవ జరుగుతుంది, కానీ అందులో కూడా అతి కొద్దిమంది వస్తారు. ఇప్పుడు ఏదైతే వర్గాల సేవ జరుగుతుందో, ఇందులో భిన్న-భిన్న వర్గాల నుండి వి.ఐ.పీలు రావడం జరుగుతుంది, వర్గీకరణ సేవలతో సమీపంగా వచ్చి సహయోగం కూడా చేస్తున్నారు, ఎందుకని? ఒక విషయమేమిటంటే, వర్గాలు 15 ఉన్నాయి, విస్తారముగా ఉన్నాయి. 15 వర్గాలు వేరువేరుగా సేవలను చేస్తున్నాయి, వేరువేరు వి.ఐ.పీలను ఆవిష్కరిస్తున్నారు, అలాగే 2-3 రోజులు ఉండే అవకాశం కూడా లభిస్తుంది. కాన్ఫరెన్సులో వస్తారు కానీ వి.ఐ.పీలు చాలావరకు వారి భాషణ వినిపించేసి వెళ్ళిపోతారు అయినాగానీ వి.ఐ.పీలు స్పీచ్ ఇవ్వడానికి సాధనాలు ఉన్నాయి, ఆకర్షణ ఉంది. కావున ఎవరైతే సేవ యొక్క ఇన్వెషన్ చేసారో వారికి ఆ సేవల యొక్క వాటా లభిస్తూ ఉంటుంది, కనుక, నేను సేవలను చేయలేకపోతున్నాను అని మీరు చింతించకండి. సేవ జరుగుతుంది. భిన్న-భిన్న సేవలకు నిమిత్తమయ్యారు. వీరు (రమేష్ అన్నయ్య) ప్రదర్శనికి నిమిత్తమయ్యారు, వీరు (నిర్వైర్ అన్నయ్య) మెట్ల చిత్రానికి నిమిత్తమయ్యారు, ఏదో ఒక సేవకు నిమిత్తమయ్యారు, మరొకరు కాన్ఫరెన్సుకు నిమిత్తమయ్యారు, దాదీలైతే అన్నింటిలో ఉన్నారు. మీరు వింగ్స్‌కు నిమిత్తమయ్యారు. దాదీల ఛత్రఛాయ కూడా ఉంది. విదేశాలలో కూడా సేవ చేసారు. పునాదిని వెయ్యడానికి శ్రమ చేసారు. కనుక చింతించకండి, మీ వాటా జమ అవుతూ ఉంది. కొద్దిగా చింత ఉంది ( బాబాను ప్రత్యక్షం చేయలేదు, ఈ చింత ఉంది) ఇది వాయుమండలంతో జరుగుతుంది. పరదా తెరవడానికి సమయం ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఫరిశ్తా రూపంగా అవ్వాలి, అప్పుడు నలువైపుల సాక్షాత్కారాలు మొదలవుతాయి. వచ్చినది ఎవరా అని చూస్తారు. ఆరంభంలో బ్రహ్మా బాబాను చూసేవారు కదా, అలా బ్రహ్మా బాబాతోపాటు పాండవులు, శక్తులైన మిమ్మల్ని కూడా చూస్తారు. వీరెవరు, ఎక్కడున్నారు అని మీకోసం వెతుకుతారు. ఢిల్లీ సేవలో మొట్టమొదటగా తయారైన ఆత్మ మీరు. రాగానే సేవను ఆరంభించారు. మీరు వ్రాసిన మొట్టమొదటి పుస్తకం ఏమిటో గుర్తుందా? కుంభ మేళా కోసం వ్రాసారు. మరి రాగానే సేవను ఆరంభించారు కదా. అందుకని మీకు ఫలం లభిస్తుంది. అయితే డ్యాన్స్ చేయండి. గణపతి డ్యాన్స్ చేయండి. (జగదీశ్ అన్నయ్య గణపతి డ్యాన్స్‌ను చేసారు)
మంచిది, సేవ నిమిత్తమాత్రము, కానీ దీని ద్వారా మీ భాగ్య రేఖను పెద్దగా గీసుకుంటున్నారు. (తాంజానీయా నుండి జగదీశ్ అన్నయ్య కోసం నేచురోపతి డాక్టర్ వచ్చారు) నిమిత్తంగా అయ్యే గోల్డెన్ ఛాన్స్ లభించింది. ఇలా అనుభవం చేసుకుంటున్నారా? మంచిది, సహయోగము ఇవ్వడము, సహయోగిగా అవ్వడము అంటే స్వయం యొక్క ఖాతాను పెంచుకోవడము. అచ్ఛా, ఓం శాంతి.
మురళి దాదా, రజని సోదరి (జయంతి అక్కయ్యగారి లౌకిక తల్లిదండ్రులు):- బాప్‌దాదా యొక్క తోడు మరియు చేయి ఆది నుండి ఉన్నాయి మరియు అంతిమం వరకు ఉండనే ఉంటాయి. (అప్పుడప్పుడు మనసు చిన్నబుచ్చుకుంటారు అని దాదీ జానకి అంటారు) లేదు. బాప్‌దాదా యొక్క చేయి మరియు తోడు రెండూ ఇరువురిపై ఉన్నాయి. ఎందుకని? కారణము ఏమిటి? మీ వాటా యొక్క ఖాతా చాలా ఎక్కువగా ఉంది. ఎవరైతే కన్యను దానం చేస్తారో, వారి సేవల వాటా మీ ఖాతాలో జమ అవుతూ ఉంటుంది, అందుకని సంతోషంగా ఉండండి. నిశ్చింత చక్రవర్తి. నిశ్చింత చక్రవర్తులే కదా! సహయోగము లభిస్తూ ఉంటుంది. అచ్ఛా. ఎటువంటి చింత పెట్టుకోకండి, బాప్‌దాదా ఎవరో ఒకరిని నిమిత్తంగా చేస్తారు. చాలా మంచిగా చేసారు.
*** ఓంశాంతి ***