Search for a command to run...
3 Feb 2002
‘‘లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా తయారు చేసుకోండి, సర్వ ఖజానాలతో సంపన్నులుగా అవ్వండి’’
3 February 2002 · తెలుగు
ఈరోజు సర్వ ఖజానాల యజమాని, ఖజానాలతో సంపన్నంగా ఉన్న తమ పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్నారు. ఎవరైతే సంపన్నంగా ఉంటారో, వారి గుర్తు ఏమిటంటే - వారు సదా ప్రాప్తి స్వరూపులుగా, తృప్త ఆత్మలుగా కనిపిస్తారు. వారు సదా సంతోషంగా కనిపిస్తారు ఎందుకంటే నిండుగా ఉంటారు. కనుక ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోండి, మా వద్ద ఎన్ని ఖజానాలు జమ అయి ఉన్నాయి? ఈ అవినాశి ఖజానాలు ఇప్పుడు కూడా ప్రాప్తించాయి మరియు భవిష్యత్తులో అనేక జన్మలు తోడుగా ఉంటాయి. ఈ ఖజానాలు అంతమయ్యేవి కావు. అన్నింటికంటే మొదటి ఖజానా - జ్ఞాన ఖజానా, ఈ జ్ఞాన ఖజానా ఆధారంగా ఈ సమయములో కూడా మీరందరూ ముక్తిని మరియు జీవన్ముక్తిని అనుభవం చేస్తున్నారు. జీవితములో ఉంటూ, పాత ప్రపంచములో ఉంటూ, తమోగుణ వాయుమండలములో ఉంటూ జ్ఞాన ఖజానా ఆధారముతో ఈ వాయుమండలము, వైబ్రేషన్లు, ఈ అన్నింటి నుండి అతీతముగా ముక్తులై ఉన్నారు. కమలపుష్ప సమానముగా అతీతముగా, ముక్తులుగా ఉన్న ఆత్మలైన మీరు దుఃఖము నుండి, చింతల నుండి, అశాంతి నుండి ముక్తులై ఉన్నారు. జీవితములో ఉంటూ చెడు విషయాల బంధనాల నుండి ముక్తులుగా ఉన్నారు. వ్యర్థ సంకల్పాల తుఫాను నుండి ముక్తులుగా ఉన్నారు. ముక్తులుగా ఉన్నారా? అందరూ చేతులూపుతున్నారు.
కనుక ముక్తి మరియు జీవన్ముక్తి అనేవి ఈ జ్ఞాన ఖజానా యొక్క ఫలము, ప్రాప్తి. వ్యర్థ సంకల్పాలు రావటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి, నెగెటివ్ కూడా వస్తుంది, కానీ మీకు ఈ జ్ఞానము అనగా వివేకము ఉంది, అదేమిటంటే - వ్యర్థ సంకల్పాలు మరియు నెగెటివ్ యొక్క పని రావటము మరియు జ్ఞాన స్వరూప ఆత్మలైన మీ పని వాటి నుండి ముక్తులుగా, అతీతులుగా మరియు బాబాకు ప్రియమైనవారిగా ఉండటము. కనుక చెక్ చేసుకోండి, జ్ఞాన ఖజానా ప్రాప్తించిందా? నిండుగా ఉందా? ఖజానా సంపన్నంగా ఉందా లేక తక్కువ ఉందా? ఒకవేళ తక్కువగా ఉంటే దానిని జమ చేసుకోండి, ఖాళీగా ఉండకూడదు.
అలాగే యోగము యొక్క ఖజానా - దీని ద్వారా సర్వ శక్తుల ప్రాప్తి కలుగుతుంది. కనుక మిమ్మల్ని మీరు చూసుకోండి, యోగము యొక్క ఖజానా ద్వారా సర్వ శక్తులు జమ అయ్యాయా? సర్వ శక్తులూనా? ఒక్క శక్తి అయినా ఒకవేళ తక్కువైతే అవసరమైన సమయములో మోసగిస్తుంది. మీ అందరి టైటిల్ మాస్టర్ సర్వశక్తిమాన్, శక్తిమాన్ కాదు, సర్వశక్తిమాన్. మరి సర్వ శక్తుల ఖజానా యోగబలము ద్వారా జమ అయ్యిందా? నిండుగా ఉందా, ప్రాప్తి స్వరూపులుగా ఉన్నారా లేక లోటు ఉందా? ఎందుకని? ఇప్పుడు మీరు ఆ లోటును భర్తీ చేయగలరు. ఇప్పుడు అవకాశము ఉంది. తర్వాత సంపన్నంగా చేసుకునే సమయము సమాప్తమైపోతే లోటు అలాగే ఉండిపోతుంది. చెక్ చేసుకోండి - ఒక్కొక్క శక్తినీ ఎదురుగా తెచ్చుకోండి మరియు మొత్తము రోజంతటి దినచర్యలో చెక్ చేసుకోండి - ఒకవేళ పర్సెంటేజ్ తక్కువగా ఉన్నా సరే ఫుల్ పాస్ అని అనము ఎందుకంటే మీ అందరికీ లక్ష్యము ఉంది. ఫుల్ పాస్ అవ్వాలా లేక హాఫ్ పాస్ అవ్వాలా అని పిల్లల్లో ఎవరిని అడిగినా, అందరూ - మేమైతే సూర్యవంశీయులుగానే అవుతాము, చంద్రవంశీయులుగా అవ్వము అని అంటారు. చంద్రవంశీయులుగా అవుతారా? బాప్‌దాదా చాలా మంచి సింహాసనాన్ని ఇస్తారు, అలా అయితే చంద్రవంశీయులుగా అవుతారా? భారత్ వారు సూర్యవంశీయులుగా అవుతారు, విదేశీయులు చంద్రవంశీయులుగా అవుతారు అంటే, మరి అలా అవుతారా? అలా అవ్వరా? సూర్యవంశీయులుగానే అవ్వాలా? అవ్వాల్సిందే. బాప్‌దాదా చిట్‌చాట్ చేస్తున్నారు. మరి సూర్యవంశీయులుగా అవ్వాల్సిందే అని అన్నప్పుడు, దృఢ నిశ్చయము ఉంది అని అన్నప్పుడు, బాబాతో మరియు స్వయముతో ప్రతిజ్ఞను చేసారు అని అన్నప్పుడు, ఇక ఇప్పటి నుండి ఏ శక్తి యొక్క పర్సెంటేజ్ తక్కువ అవ్వకూడదు. పరిస్థితుల అనుసారంగా, సమస్యల అనుసారంగా పర్సెంటేజ్ తక్కువగా ఉండిపోయింది అని చెప్పారంటే, మరి 14 కళల వారిగా అవుతారు, అందుకే ఈరోజుల్లో బాప్‌దాదా నలువైపులా ఉన్న పిల్లలందరి లెక్కాపత్రాన్ని, రిజిస్టర్‌ను చెక్ చేస్తున్నారు. బాప్‌దాదా వద్ద కూడా ప్రతి ఒక్కరి రిజిస్టర్ ఉంది ఎందుకంటే సమయమనుసారంగా ముందుగానే బాప్‌దాదా పిల్లలకు వినిపిస్తున్నారు - సమయము యొక్క వేగము అనుసారంగా ఇప్పుడిక ‘ఎప్పుడో’ అని అనకండి, ‘ఇప్పుడు’ అని అనండి. ఎప్పుడో అవుతుందిలే, చేస్తాములే... అవ్వవలసిందే... అని ఇలా ఆలోచించకండి. అవ్వవలసిందే అని కాదు, ఇప్పుటికిప్పుడే చెయ్యవలసిందే. సమయము యొక్క వేగం తీవ్రమవుతూ ఉంది, అందుకే బాబా సమానంగా అయ్యే, ఫుల్ పాస్ అయ్యే, 16 కళల సంపన్నంగా అయ్యే లక్ష్యమునేదైతే పెట్టుకున్నారో, బాప్‌దాదా కూడా ఇదే కోరుకుంటున్నారు - లక్ష్యము మరియు ప్రాక్టికల్‌గా లక్షణాలు సమానంగా ఉండాలి. లక్ష్యము మరియు లక్షణాలు రెండూ సమానంగా అయినప్పుడే బాబా సమానంగా సహజంగా అవుతారు. కావున చెక్ చేసుకోండి - అయిపోతుందిలే, తప్పకుండా తయారైపోతాములే... ఇలా అనుకోవటము నిర్లక్ష్యము. ఏదైతే చెయ్యాలో, ఎలాగైతే తయారవ్వాలో, ఏ లక్ష్యమైతే ఉందో, అది ఇప్పటి నుండే చెయ్యాలి, తయారవ్వాలి. ‘ఎప్పుడో’ అన్న పదాన్ని ఉపయోగించకండి, ఇప్పటికిప్పుడే.
జ్ఞాన ఖజానా, యోగ ఖజానా, అంతేకాక ధారణల ఖజానా ఉంది. వీటి ద్వారా (ధారణల ద్వారా) గుణాల ఖజానా జమ అవుతుంది. ఏ విధంగా సర్వ శక్తులూ ఉన్నాయో, అలాగే గుణాలలో కూడా సర్వ గుణాలూ ఉన్నాయి. కేవలం గుణాలు కాదు, సర్వ గుణాలు. మరి సర్వ గుణాలు ఉన్నాయా లేక ఒకటి, రెండు గుణాలు తక్కువైతే ఏమైందిలే అని అనుకుంటున్నారా, అలా నడుస్తుందా? నడవదు. మరి సర్వ గుణాల ఖజానా జమ అయ్యిందా? ఏ గుణములో లోటు ఉందో, దానిని చెక్ చేసుకుని నిండుగా అవ్వండి.
నాల్గవ విషయము - సేవ. సేవ ద్వారా అందరికీ ఈ అనుభవము ఉంది, ఎప్పుడెప్పుడైతే మనసా సేవ లేక వాణి ద్వారా లేక కర్మ ద్వారా సేవ చేస్తారో, దానికి ప్రాప్తిగా ఆత్మిక సంతోషము లభిస్తుంది. కనుక చెక్ చేసుకోండి - సేవ ద్వారా సంతోషము యొక్క అనుభూతిని ఎంతవరకు చేసారు? ఒకవేళ సేవ చేసారు కానీ సంతోషము లభించలేదంటే, ఆ సేవ యథార్థ సేవ కాదు, ఆ సేవలో ఏదో ఒక లోపము ఉంది, అందుకే సంతోషము లభించదు. సేవ అంటే అర్థము, ఆత్మ తనను తాను సంతోషముగా, వికసించిన ఆత్మిక గులాబీలా, సంతోషపు ఊయలలో ఊగుతున్నట్లుగా అనుభవం చేస్తుంది. కనుక చెక్ చేసుకోండి - మొత్తము రోజంతా సేవ చేసారు, కానీ మొత్తము రోజంతా చేసిన సేవతో పోలిస్తే అంత కంతా సంతోషము కలిగిందా లేక ఇది కాదు అది, అది కాదు ఇది... అని ఇలా ఆలోచనలే నడుస్తూ ఉన్నాయా? అంతేకాక మీ సంతోషము యొక్క ప్రభావము, ఒకటేమో సేవా స్థానముపై, రెండవది సేవా సహచరులపై, మూడవది ఏ ఆత్మలకైతే సేవ చేసారో ఆ ఆత్మలపై పడాలి, వాయుమండలము కూడా సంతోషంగా అయిపోవాలి. సేవ యొక్క ఖజానా ఈ సంతోషము.
ఇంకొక విషయము - నాలుగు సబ్జెక్టులైతే వచ్చేసాయి. మరొకటి సంబంధ-సంపర్కాలు, ఇది కూడా చాలా అవసరము, ఎందుకు? చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే - బాప్‌దాదాతో అయితే సంబంధము ఉండనే ఉంది, పరివారముతో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి (ఏం ఫర్వాలేదు), బీజముతో అయితే సంబంధము ఉండనే ఉంది కదా. కానీ మీరు విశ్వ రాజ్యము చెయ్యాలి కదా! మరి రాజ్యములో ఉన్నప్పుడు సంబంధములోకి రావాల్సిందే. అందుకే సంబంధ-సంపర్కాలలోకి రావాల్సిందే. సంబంధ-సంపర్కాలలో యథార్థ ఖజానా లభిస్తుంది, అదేమిటంటే - ఆశీర్వాదాలు. సంబంధ-సంపర్కాలు లేకుండా మీ వద్ద ఆశీర్వాదాల ఖాతా జమ అవ్వదు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలైతే ఉన్నాయి కానీ సంబంధ-సంపర్కాలలో కూడా ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఒకవేళ ఆశీర్వాదాలు లభించకపోతే, ఆ ఫీలింగ్ రాకపోతే, సంబంధ-సంపర్కాలలో ఏదో లోపము ఉంది అని అర్థం చేసుకోండి. ఒకవేళ సంబంధ-సంపర్కాలు యథార్థ రీతిలో ఉంటే ఆశీర్వాదాల అనుభూతి కలగాలి. ఆశీర్వాదాల అనుభూతి ఎలా ఉంటుంది? అనుభవీలే కదా! ఒకవేళ సేవ ద్వారా ఆశీర్వాదాలు లభించినట్లయితే, ఆ ఆశీర్వాదాలు లభించినందుకు అనుభవం ఎలా ఉంటుందంటే, స్వయం కూడా సంబంధములోకి వస్తారు, కార్యము చేస్తూ డబల్ లైట్‌గా (తేలికగా) ఉంటారు, భారము అనిపించదు మరియు ఎవరి సేవనైతే చేసారో, ఎవరి సంబంధ-సంపర్కములోకైతే వచ్చారో, వారు కూడా డబల్ లైట్‌గా ఫీల్ అవుతారు. ఈ సంబంధములో సదా తేలికగా ఉంటుంది అనగా ఈజీగా ఉంటుంది, భారము అనిపించదు అని అనుభవం చేస్తారు. సంబంధములోకి వచ్చినా, రాకపోయినా కానీ, ఆశీర్వాదాలు లభించిన కారణంగా రెండు వైపుల నియమ ప్రమాణంగా ఉంటారు. అలాగని అంత ఈజీగా ఉండటం కూడా కాదు, బాగా తీపి ఉన్న చోట చీమలు చాలా చేరుతాయి అని సామెత ఉంది కదా, కనుక అంత ఈజీ కూడా కాదు, కానీ డబల్ లైట్‌గా ఉంటారు. కనుక బాప్‌దాదా చెప్తున్నారు - మీ ఖజానాలను చెక్ చేసుకోండి. సమయాన్ని ఇస్తున్నాము. ఇప్పుడు ఇంకా సమాప్తి బోర్డు పెట్టలేదు. అందుకే చెక్ చేసుకోండి మరియు ముందుకు వెళ్తూ ఉండండి.
బాప్‌దాదాకు పిల్లలపై ప్రేమ ఉంది కదా! అందుకే బాప్‌దాదా పిల్లలెవరూ వెనుక ఉండిపోకూడదు అని అనుకుంటారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఇంకా, ఇంకా ముందుకు వెళ్ళాలి. నడుస్తూ-నడుస్తూ ఉండగా దేహాభిమానము వచ్చేస్తుంది. స్వమానము మరియు దేహాభిమానము. దేహాభిమానానికి కారణము ఏమిటంటే, స్వమానములో లోటు ఏర్పడటము. కనుక దేహాభిమానాన్ని తొలగించుకునేందుకు చాలా సహజ సాధనము ఏమిటంటే - దేహాభిమానము వచ్చేందుకు కారణము ఒకటే మాట, ఒకటే పదము, అది మీకు తెలుసు కూడా. దేహాభిమానానికి సంబంధించిన ఆ ఒక్క మాట ఏమిటి? (నేను). అచ్ఛా, మరి ఎన్ని సార్లు నేను-నేను అని అంటారు? మొత్తము రోజంతటిలో ఎన్ని సార్లు ‘‘నేను’’ అని అంటారో ఎప్పుడైనా నోట్ చేసుకున్నారా? అచ్ఛా, ఒక రోజు నోట్ చేసుకోండి. పదే-పదే నేను అనే పదమైతే వస్తుంది. కానీ నేను ఎవరిని? మొదటి పాఠము - నేను ఎవరు? దేహాభిమానములో నేను అని అంటారు కానీ వాస్తవానికి నేను ఎవరిని? ఆత్మనా లేక దేహాన్నా? ఆత్మ దేహాన్ని ధారణ చేసిందా లేక దేహము ఆత్మను ధారణ చేసిందా? ఏం జరిగింది? ఆత్మ దేహాన్ని ధారణ చేసింది. ఇది కరెక్టు కదా? ఆత్మ దేహాన్ని ధారణ చేసిందంటే, మరి నేను ఎవరిని? ఆత్మను కదా! కనుక సహజ సాధనమేమిటంటే, ‘నేను’ అనే మాటను ఎప్పుడు మాట్లాడినా, నేను ఎటువంటి ఆత్మను అన్నది గుర్తు చేసుకోండి. ఆత్మ నిరాకారి, దేహము సాకారి. నిరాకార ఆత్మ సాకార దేహాన్ని ధారణ చేసింది. కనుక ఎన్ని సార్లు నేను, నేను అన్న పదాన్ని ఉపయోగించినా, అంత సమయమూ ఇది గుర్తుంచుకోండి - నిరాకార ఆత్మనైన నేను సాకార శరీరములో ప్రవేశించాను. నిరాకార స్థితి గుర్తున్నట్లయితే నిరహంకారులుగా స్వతహాగానే అయిపోతారు. దేహ భానము సమాప్తమైపోతుంది. అదే మొదటి పాఠము, నేను ఎవరిని? నేను ఎటువంటి ఆత్మను అన్నదానిని స్మృతిలో పెట్టుకుని ఆత్మను గుర్తు చేసుకుంటే నిరాకారి స్థితి పక్కా అయిపోతుంది. ఎక్కడైతే నిరాకారి స్థితి ఉంటుందో అక్కడ నిరహంకారులుగా, నిర్వికారులుగా స్వతహాగా అయిపోతారు. కనుక రేపటి నుండి నోట్ చేసుకోండి - నేను అన్న మాట పలికినప్పుడు ఏం గుర్తుకొస్తుంది? మరియు ఎన్ని సార్లు అయితే నేను అన్న మాటను ఉపయోగిస్తారో అన్ని సార్లు నిరాకారిగా, నిరహంకారిగా, నిర్వికారిగా స్వతహాగానే అయిపోవాలి. అచ్ఛా!
ఈరోజు యూథ్ (యువ) గ్రూప్ వచ్చింది. యూథ్ చాలామంది ఉన్నారు. బాప్‌దాదా యూథ్ గ్రూప్‌కు వరదానము ఇస్తున్నారు - సదా వర్థిల్లండి. ఒక్క ఖజానాను కూడా వ్యర్థం చేయకండి, సంపన్నంగా ఉండండి, సంపన్నంగా చేయండి. లౌకిక గురువులు - ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తారు. బాప్‌దాదా అంటారు - శరీర ఆయువు అయితే ఎంత ఉందో అంతే ఉంటుంది, అందుకే శరీర ఆయువు లెక్కలో ఆయుష్మాన్ భవ అన్న వరదానాన్ని ఇవ్వటం లేదు, కానీ ఈ బ్రాహ్మణ జీవితములో సదా ఆయుష్మాన్ భవ. ఎందుకని? బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు కనుక ఆయుష్మంతులుగా అయితే ఉంటారు కదా! యూథ్లో ఒక విశేషత ఉంది. యూథ్ అయిన మీకు మీ విశేషత గురించి తెలుసా? ఏ విశేషత ఉంటుందో తెలుసా? మీలో ఏ విశేషత ఉంది? (ఏది అనుకుంటే అది చెయ్యగలము) అచ్ఛా - చెయ్యగలరా? మంచిది. ప్రపంచములోని వారి లెక్కలో యూథ్ చాలా మొండిగా ఉంటారు, ఏది అనుకుంటే అదే చేస్తారు, చూపిస్తారు. వారు ఆ మాటను నెగెటివ్ అర్థంలో అంటారు కానీ ఇక్కడి బ్రాహ్మణ యూథ్ మొండిగా ఉండేవారు కారు, కానీ తాము చేసిన ప్రతిజ్ఞపై దృఢంగా ఉండేవారు. ప్రతిజ్ఞ నుండి పక్కకు తప్పుకునేవారు కారు. మరి యూథ్ ఇలానే ఉన్నారా? చెయ్యి ఎత్తటమైతే చాలా సహజము. బాప్‌దాదా సంతోషిస్తున్నారు - చేతులు ఎత్తటము కూడా ధైర్యమే కదా. కానీ రోజూ అమృతవేళ బాబాకు ఏదైతే ప్రతిజ్ఞను చేసారో - మేము ఈ బ్రాహ్మణ జీవితము యొక్క ప్రాప్తి నుండి, సేవ నుండి ఎప్పుడూ సంకల్పములో కూడా పక్కకు వెళ్ళము అని, ఈ ధైర్యాన్ని, ప్రతిజ్ఞను ప్రతి రోజూ రిపీట్ చేసుకోండి మరియు పదే, పదే చెక్ చేసుకోండి - ఏ ధైర్యాన్ని అయితే పెట్టారో, సంకల్పాన్ని అయితే చేసారో, అది ప్రాక్టికల్‌లో జరుగుతుందా?
గవర్నమెంట్ అంటుంది - రెండు, నాలుగు లక్షలమంది యూథ్ తయారైనా మంచిదే అని. బాప్‌దాదా అంటారు - ఇక్కడ బ్రాహ్మణ యూథ్ ఒక్కొక్కరూ ఒక లక్షమందితో సమానము. అంత దృఢమైనవారు. అంతేనా? చూడండి, ఇంటికి వెళ్ళిన తరువాత, బాబా, మాయ వచ్చేసింది, సంస్కారము వచ్చేసింది, సమస్య వచ్చేసింది అని వ్రాయకూడదు. సమస్యలకు సమాధాన స్వరూపులుగా అవ్వండి. సమస్యలైతే వస్తాయి, కానీ నేను ఎవరిని? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సమాధాన స్వరూపుడినా లేక సమస్యల కారణంగా ఓడిపోయేవాడినా? మీ అందరి టైటిల్ ఏమిటి - విజయి రత్నమా లేక ఓడిపోయే రత్నమా? విజయి రత్నము. బ్రాహ్మణ జన్మ లభించటముతోనే బాప్‌దాదా బ్రాహ్మణుల ప్రతి ఒక్కరి మస్తకముపై విజయ తిలకాన్ని అమరంగా పెట్టారు. కనుక మీరు అమర భవ అన్న వరదానము కలవారు. ఇప్పుడు మీతో మీరు ఈ ప్రతిజ్ఞను చేసుకోండి, ఒకవేళ ప్రతిజ్ఞను చేయిస్తే అందరూ చేస్తారు కానీ మీ మనసులో మీకు మీరు ప్రతిజ్ఞ చేసుకోండి - ఎప్పుడూ సంస్కారాలకు వశమవ్వము, బాబా సంస్కారాలేవైతే ఉన్నాయో, అవే బ్రాహ్మణ ఆత్మనైన నా సంస్కారాలు. ద్వాపర, కలియుగ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, అవి నా సంస్కారాలు కావు ఎందుకంటే అవి బాబా సంస్కారాలు కావు. ఈ తమోగుణ సంస్కారాలు బ్రాహ్మణుల సంస్కారాలా? కాదు కదా! మరి మీరు ఎవరు? బ్రాహ్మణులు కదా!
బాప్‌దాదాకు కూడా యూథ్ గ్రూపును చూస్తే గర్వంగా ఉంది. చూడండి, దాదీలకు కూడా యూథ్ను చూస్తే గర్వంగా ఉంది. యూథ్ అంటే దాదీకి ప్రేమ కదా. ఎక్స్ట్రా ప్రేమ ఉంది. కుమారులు మంచి కుమారులు. మీరు కుమారులు కారు, మంచి కుమారులు. ఒక్కొక్క కుమార్ విశ్వములోని కుమారులను పరివర్తన చేసి చూపించేవారు. అచ్ఛా, కుమారులకు పని ఇమ్మంటారా? ధైర్యము ఉందా? చెయ్యాల్సి వస్తుంది. కుమారీలు చేస్తారా?
మరైతే పని ఇస్తున్నాము, శ్రద్ధగా వినండి. రాబోయే సీజన్ ఉంటుంది కదా, రాబోయే సీజన్లో కూడా కుమారులకు ఇలాగే స్పెషల్ ప్రోగ్రామ్ పెడతాము, కానీ... కానీ అనేది కూడా ఉంది. ఎక్కువ పని ఇవ్వటం లేదు. ఒకొక్క కుమార్ 10-10 మంది కుమారులను తయారుచేసి తీసుకురావాలి అనగా చేతికి చిన్న కంకణాన్ని (కుమారుల గ్రూప్‌ను) తయారుచేసి తీసుకురావాలి. చేతికి కంకణం ధరిస్తారు కదా. బ్రహ్మా బాబాకు సదా చేతికి పూల కంకణాన్ని పెడతారు. మరి ఒక్కొక్క కుమార్, కచ్చా-కచ్చా వారిని తీసుకురాకండి, పక్కా-పక్కా వారిని తీసుకురండి. మధుబన్కైతే వస్తారు కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళి మారిపోతారు అన్నట్లు కాదు! అలాంటివారు కాదు. వారిని ఎలా పక్కాగా చేసి తీసుకురావాలంటే, బాప్‌దాదా వారిని చూస్తూ-చూస్తూ - వాహ్ కుమార్, వాహ్ అని అనాలి! ఇలా చేయటానికి సిద్ధంగా ఉన్నారా? ఇలా చేస్తారా? కొద్దిగా ఆలోచించుకోండి. ఊరికే చేతులెత్తకండి. చేయవలసి ఉంటుంది. తయారుచేయవలసి ఉంటుంది. డబల్ విదేశీయులు కూడా చేస్తారా? డబల్ విదేశీయులలో కుమారులు చేతులెత్తండి. మరి మీరు కూడా 10 మందిని తీసుకువస్తారు కదా? విదేశీయులు కూడా తీసుకువస్తారు, భారత్ వారు కూడా తీసుకువస్తారు. ఎవరైతే ఫస్ట్ క్లాస్ క్వాలిటీని తీసుకువస్తారో, వారికి బహుమతిని ఇస్తాము. గొప్ప బహుమతిని ఇస్తాము, చవకది ఇవ్వము. కుమారులంటే ప్రేమ కదా! ఒకవేళ గవర్నమెంట్‌కు ఎక్కువలో ఎక్కువమంది కుమారులు పాజిటివ్ కర్మలు చేసేవారు దొరికినట్లయితే గవర్నమెంట్ ఎంత సంతోషిస్తుంది. ఒకవేళ మీరు ఒక్కొక్కరూ 10-10 మంది కుమారులను తీసుకువస్తే మొత్తం హాల్ అంతా కుమారులతో నిండిపోతుంది, అప్పుడు గవర్నమెంటువారిని పిలుస్తాము - ఈ కుమారులను చూడండి అని. కానీ తీసుకురావాల్సి ఉంటుంది, తయారు చెయ్యాల్సి ఉంటుంది. ఒకవేళ మీ స్థితిని, లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా ఉంచుకున్నట్లయితే ఇక సేవలో సఫలత లభిస్తుందా, లభించదా అన్న సంకల్పము కూడా తలెత్తలేదు. సఫలత తప్పకుండా లభించి తీరుతుంది. కేవలం మీరు నిమిత్తులుగా అవ్వవలసి ఉంటుంది. ఈ ప్రతిజ్ఞను సదా రివైజ్ చేసుకుంటూ ఉండండి. అద్భుతమైతే చెయ్యాల్సిందే. అచ్ఛా!
డబల్ విదేశీయులు కూడా వచ్చారు. డబల్ విదేశీయులు బాప్‌దాదా యొక్క ఒక టైటిల్ ప్రాక్టికల్‌లో ప్రత్యక్షం చేసారు, అదేమిటి? (విశ్వ కళ్యాణకారి) మొదట్లో, స్థాపన జరిగినప్పుడు భారత్ కళ్యాణకారిగా మాత్రమే అయ్యాము కానీ ఎప్పటినుండైతే డబల్ విదేశీయులు బ్రాహ్మణాత్మలుగా అయ్యారో అప్పటినుండి బాబా యొక్క విశ్వ కళ్యాణకారి అన్న టైటిల్‌ను ప్రాక్టికల్‌గా ప్రత్యక్షం చేసారు. అందుకని బాప్‌దాదాకు డబల్ విదేశీయులపై విశేషమైన గర్వము ఉంటుంది. ఏ మూల కూడా సేవ జరగకుండా మిగలకూడదు అన్న సేవ యొక్క తపన డబల్ విదేశీయులకు ఉండటాన్ని బాప్‌దాదా చూసారు.
(మురళి జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా ఇద్దరు కుమారులు బాప్‌దాదా ఎదుటకు స్టేజ్‌పైకి వచ్చేసారు, వారిని అక్కడి నుండి పంపేసారు)
అచ్ఛా! ఇప్పుడు ఆటలో ఆట చూసారు. ఇప్పుడు బాప్‌దాదా అంటున్నారు - సాక్షిగా అయ్యి ఆటను చూసారు, ఎంజాయ్ చేసారు, ఇప్పుడు ఒక్క క్షణములో పూర్తిగా దేహము నుండి అతీతమై శక్తిశాలి ఆత్మిక రూపములో స్థితులవ్వగలరా? ఫుల్ స్టాప్.
(బాప్‌దాదా చాలా శక్తిశాలి డ్రిల్‌ను చేయించారు)
అచ్ఛా - ఈ అభ్యాసాన్నే అన్నివేళలా మధ్యమధ్యలో చేస్తూ ఉండాలి. ఇప్పుడిప్పుడే కార్యములోకి రావాలి, ఇప్పుడిప్పుడే కార్యము నుండి అతీతం అవ్వాలి, సాకారి నుండి నిరాకారి స్థితిలో స్థితులైపోవాలి. ఇది కూడా ఒక అనుభవములా చూసారు కదా. ఏదైనా సమస్య వచ్చినా కూడా ఇలాగే ఒక్క క్షణములో సాక్షి ద్రష్టగా అయ్యి, సమస్యను ఒక సైడ్ సీన్ (మార్గమధ్యంలో వచ్చే దృశ్యము)గా భావించి, తుఫానును ఒక కానుకగా భావించి దానిని దాటి వేయాలి. అభ్యాసము ఉంది కదా? మున్ముందు అయితే ఇటువంటి అభ్యాసము చాలా అవసరము ఉంటుంది. ఫుల్ స్టాప్. ఇది ఎందుకైంది, ఎలా అయ్యింది అని ప్రశ్నార్థకము ఉండకూడదు. అది అయిపోయింది. ఇక ఫుల్ స్టాప్ మరియు మీ ఫుల్ శక్తిశాలి స్థితిలో స్థితులైపోండి. సమస్య కింద ఉండిపోతుంది, మీరు ఉన్నతమైన స్థితిలో ఉంటూ సమస్య రూపి సైడ్ సీన్‌ను చూస్తూ ఉంటారు. అచ్ఛా!
ఎవరైతే దూరదూరాలలో కూర్చుని వింటున్నారో, భారత్‌లో కావచ్చు, విదేశములో కావచ్చు, వింటున్నారు కూడా మరియు చూస్తున్నారు కూడా, దూరంగా కూర్చుని కూడా మనసుకు దగ్గరగా ఉన్న ఆ పిల్లలందరికీ బాప్‌దాదా ముందుగా ప్రియస్మృతులను ఇస్తున్నారు ఎందుకంటే ఒకరిది ఒక సమయము, మరొకరిది మరొక సమయము అని బాప్‌దాదాకు తెలుసు, అయినాగానీ రాత్రిని పగలుగా మార్చి, పగలును రాత్రిగా మార్చి కూర్చున్నారు. ఇదే పిల్లలు మరియు బాబా మధ్య ఉన్న ప్రేమ, అలాగే బాప్‌దాదా వైజ్ఞానిక పిల్లలకు కూడా అభినందనలు తెలుపుతున్నారు ఎందుకంటే పిల్లలైన మీకోసమే ఈ సైన్సు సాధనాలు తయారయ్యాయి. అందుకే బాప్‌దాదా ఆ పిల్లలకు కూడా అభినందనలు తెలుపుతున్నారు. మీకోసమే ఈ సాధనాలు 100 సంవత్సరాలలోపు వెలువడ్డాయి. మరి సైన్సు వారు అద్భుతము చేసారు కదా, థ్యాంక్స్ కదా! అచ్ఛా!
నలువైపులా ఉన్న సర్వ ఖజానాలతో సంపన్నమైన ఆత్మలకు, సదా అన్నివేళలా ప్రాప్తులతో నిండుగా ఉంటూ, చిరునవ్వు నవ్వుతూ హర్షితంగా ఉండే ఆత్మలకు, సదా బాబాతో చేసిన ప్రతిజ్ఞను జీవితములో ప్రత్యక్షము చేసే జ్ఞాన స్వరూప ఆత్మలు, యోగ స్వరూప ఆత్మలైన పిల్లలకు, సదా లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానముగా చేసుకునే బాబా సమానమైన ఆత్మలకు, సదా అన్నివేళలా సర్వ ఖజానాల స్టాక్‌ను ఉంచుకునే మరియు స్టాప్‌ను పెట్టే తీవ్ర పురుషార్థి శ్రేష్ఠ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు మనోభిరాముని మనస్ఫూర్వకమైన ప్రియస్మృతులు మరియు నమస్తే.
ఈస్టర్న్, తమిళనాడు సేవాధారులు వచ్చారు:- అచ్ఛా, ఎవరైతే సేవాధారులు వచ్చారో వారు లేవండి. బెంగాల్, బీహార్, నేపాల్, అస్సాం, ఒరిస్సా, తమిళనాడు... తమిళనాడు రోజీ అక్కయ్య వచ్చారు (రోజీ అక్కయ్య ఆరోగ్యం చాలా కాలం నుండి సరిగా లేదు) చూడండి, క్రొత్త జీవితం లభించేసింది. క్రొత్త జీవితానికి అభినందనలు.
మరి అందరూ పాండవులు, శక్తులు ఎవరైతే వచ్చారో, సేవకు నిమిత్తమయ్యారో, వారు చేసిన సేవకు ప్రత్యక్ష ఫలితంగా సంతోషం లభించింది. ఇది పిల్లల తెలివి అని బాప్‌దాదా అంటారు, సహజ పురుషార్థంతో ఆశీర్వాదాలు తీసుకునేందుకు, పుణ్య ఖాతాను జమ చేసుకునేందుకు ఈ ఛాన్సును మంచిగా తీసుకుంటారు. ఎవరైతే అలసట లేకుండా చేస్తారో, ఆ అలసట లేకుండా సేవను చేసే సేవాధారుల మనసా, వాచ, కర్మణ మూడు ఖాతాలలో జమ అవుతుంది. అందుకని జమ చేసుకున్నందుకు సేవాధారులందరికీ అభినందనలు, అభినందనలు. అచ్ఛా. అందరూ చేరుకుంటారు.
దాదీజీ, దాదీ జానకితో:- (ఒక టర్న్ మిస్ అయ్యాము) సేవ చేస్తే అది మిస్ చేసినట్లు కాదు. బాప్‌దాదా మీ ఇరువురి బాధ్యతా కిరీటంలో సదా అమూల్యమైన రత్నాలను పెడుతూ ఉంటారు. ఎంతెంతగా సాకార రూపంలో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయో, అంతగా మీరు డబల్ లైట్‌గా అయ్యి పాత్రను చేస్తారు. శక్తులు విజయ పతాకాన్ని చాలా బాగా ప్రసిద్ధి చేసినందుకు బాప్‌దాదాకు విశేషంగా సంతోషం ఉంది. బాబా అయితే గుప్తంగా ఉన్నారు, కానీ పిల్లలు ప్రత్యక్ష రూపంలో జెండాను ఎగురవేసారు. (దాదీ జానకి ఇలా అంటున్నారు, బాబా ఒక ఆశ ఉంది, శాంతిధామానికి వెళ్ళేకన్నా ముందు అందరూ భారత్‌లో కలవాలి) అవుతుంది, వారు కూడా ఎక్కడకు వెళ్తారు, అవ్వవలసిందే. అచ్ఛా.
డా. అబ్దుల్ కలామ్, డా. పిళ్ళై, డా. సెల్వమూర్తి (భారతదేశ సైంటిస్టులు)తో:- బాప్‌దాదా మీ అందరి భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు. మీ ద్వారా కూడా విశేషమైన సేవ జరుగనుంది. ఏ సేవను చేస్తారు? (30% మంది పేదవారు ఉన్నారు, ఆ పేదరికాన్ని దూరం చేయాలన్న సంకల్పం కలుగుతుంది) జరుగుతుంది. మీకున్న సంకల్పం నెరవేరే సమయం రాబోతుంది, ఈ పేదరికం ఉండనే ఉండదు. ఎలా అయితే భారత దేశం ఒకప్పుడు అన్నిటికన్నా ధనవంతంగా ఉండిందో, అలాగే ఇప్పుడు మళ్ళీ అవ్వవలసిందే. మరి మీ ఈ సంకల్పం పూర్తి అవుతుంది. మంచి సంకల్పము. ఏ ఆత్మ అయినా మీ సంపర్కంలోకి వస్తే అప్పుడు మీరు కేవలం సందేశకుడిలా అయ్యి ఇదే మెసేజ్‌ను ఇవ్వండి – సైలెన్స్ మరియు సైన్స్ రెండింటి బ్యాలెన్సు ఎలా ఉండాలి, ఇది పరమాత్మ బ్లెసింగ్స్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు ఇదే మెసేజ్‌ను ఇవ్వండి. బాప్‌దాదాకు సంతోషంగా ఉంది, పిల్లల ఉన్నతి జరగాలి, పిల్లలు యోగ్యులుగా అవ్వాలి అని మీరు కోరుకుంటున్నారు, అందుకోసం కూడా ఇక్కడ ప్లాన్ తయారవుతుంది. ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ నెమ్మది-నెమ్మదిగా ముందుకు వెళ్తుంది, అందులో మీరు కూడా సహయోగులుగా అవుతారు, ఈ పిల్లలంతా సహయోగులుగా అవుతారు. వాహ్ భారత్ వాహ్! అని అనే ఒక రోజు తప్పకుండా వస్తుంది. భారత్ యొక్క నాలెజ్ అందరికీ సుఖశాంతుల వరదానాన్ని ఇస్తుంది. (సైన్స్ మరియు సైలెన్స్ యొక్క బ్యాలెన్స్ భారతదేశాన్ని స్వర్ణిమంగా చేస్తుంది) ఫాలో బ్రహ్మా బాబా. మీలో ఒక విశేషత ఉంది, ఆ విశేషతను ఉపయోగించవచ్చు, మీలో ఉన్న నేచురల్ విశేషత ఏమిటంటే, ఏ పని అయితే చేస్తారో, దానిని పూర్తిగా చేస్తారు, సగంలో విడిచిపెట్టరు. కనుక ఈ విశేషతతో మీ సంకల్పం పూర్తవుతుంది. ఈ ఇద్దరు సహచరులు కూడా మంచిగా ఉన్నారు. త్రిమూర్తి అయ్యారు కదా! ఎక్కడ త్రిమూర్తులు ఉంటారో అక్కడ శివబాబా ఉండనే ఉంటారు. (వీరు కూడా కుమార్) బ్రహ్మచారి కూడా, బ్రహ్మాచారి (కూడా. (సెల్వమూర్తి సోదరుడితో) మంచిది, వీరు హెల్త్ చేస్తారు. హెల్త్‌లో కూడా చూడండి, అందరి దుఃఖము దూరమవుతుంది కదా. అందరి దుఃఖము దూరం చెయ్యడము, ఇది కూడా ఎంత మంచి పని. అందుకే హెల్త్ వారిని నెక్స్ట్ గాడ్ అంటారు. బాగుంది. హెల్త్‌తో పాటు, జ్ఞానం యొక్క వెల్త్ (సంపద) కూడా ఆత్మలకు లభిస్తుంది. మంచి నిమిత్త ఆత్మలు.
(డా. పిళ్ళైకు పద్మశ్రీ అవార్డు మరియు డా. అబ్దుల్ కలామ్ గారికి భారత రత్న అవార్డు లభించాయి)
బాబా అయితే పదమాపదమాపదమ్ టైటిల్ ఇస్తున్నారు. వీరికి భారతరత్న టైటిల్ లభించింది అందుకే భారతదేశంపై ప్రేమ ఉంది. అచ్ఛా – ఇప్పుడు మైక్‌గా అవుతారు. ఆత్మిక మైక్‌గా అయ్యి సేవ చేస్తారు.
ఆశ అక్కయ్యతో:- మంచిగా జరుగుతుంది కదా. అందరి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆశీర్వాదాలు ఎటువంటివి అంటే అవి అన్ని కార్యాలను సహజం చేసేస్తాయి. బాగుంది.
రోజీ అక్కయ్యతో:- డ్రామాలో మీకు ఎంతో మంచి పాత్ర లభించింది. ఇది కూడా లెక్కలు తీరాయి. ఏ లెక్కాచారము మిగిలి ఉందో, అది పూర్తయింది. సంతోషంగా పూర్తి చేసారు. ఈ లెక్క సేవ కోసమే జరుగుతుంది. సేవాధారులు ఎవరైతే ఉంటారో వారు సేవ లేనిదే ఉండలేరు, చేసిన సేవకు ప్రతిఫలంగా ఆశీర్వాదాలు లభిస్తాయి. (మాతో డాక్టర్లు కూడా వచ్చారు) చాలా మంచిగా చేసారు. బ్రాహ్మణ ఆత్మల సేవ చేస్తే ఆశీర్వాదాలు లభిస్తాయి. సంతోషంగా సేవను చేసారు, అందుకే సేవకు జమ అయింది.
మద్రాసు టీచర్‌తో:- వీరు సేవను సంభాళిస్తున్నారు. మంచిది, సేవ యొక్క ఛాన్స్ లభించడం,. ఇది కూడా భాగ్యముకు గుర్తు, మరి అందరూ భాగ్యవంతులే.
విదేశాల పెద్దక్కయ్యలతో:- ప్రతి ఒక్కరూ తమ-తమ పాత్రను మంచిగా చేయడాన్ని చూసి బాప్‌దాదాకు విశేషమైన సంతోషం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ-తమ పాత్రను చేస్తూ స్వయాన్ని కూడా ముందుకు తీసుకు వెళ్తున్నారు మరియు సేవను కూడా ముందుకు తీసుకు వెళ్తున్నారు. డ్రామానుసారంగా నిమిత్తంగా అయ్యారు. ఇప్పుడు ఇకముందు కోసం కూడా ప్లాన్లు తయారు చేస్తారు కదా! ఏమి చేయాలి? ఏదైనా నవీనతను చేస్తారు కదా! అచ్ఛా! బాప్‌దాదా సంతోషిస్తున్నారు. అచ్ఛా!