Search for a command to run...
11 Feb 2010
శివుని జన్మ దినం రోజున క్రోధం రూపి జిల్లేడు పూలను బాప్‌దాదాకు అర్పించి దర్పణంలా అవ్వండి. పవిత్ర ప్రవృత్తికి ప్రత్యక్ష ప్రమాణమై ప్రత్యక్షతను సమీపంగా తీసుకురండి
11 February 2010 · తెలుగు
ఈరోజు పిల్లలందరూ సమ్ముఖంలో కూర్చున్న వారు మరియు దేశ విదేశాలలో నలువైపుల ఉన్న పిల్లలు చాలా సంతోషంతో తండ్రి మరియు తమ జన్మ దినాన్ని జరుపుకుంటున్నందుకు అనేకానేక అభినందనలు, శుభాకాంక్షలను ఇస్తున్నాము. మీరు సమ్ముఖంలో కూర్చుని ఉన్నారు మరియు దూర దూరాలలో కూడా సైన్సు సాధనాల ద్వారా పిల్లలందరూ ఎంతో సంతోషంతో హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నారు. ఇక్కడకు వచ్చిన మీరందరూ తండ్రి జన్మ దినాన్ని జరుపుకోవడానికి వచ్చారా లేక మీ జన్మ దినాన్ని జరుపుకోవడానికి వచ్చారా? ఎందుకంటే ఈ జయంతి విచిత్రమైన జయంతి. ఎందుకని విచిత్రమైనది? తండ్రి మరియు పిల్లలది ఒకేసారి ఉంది కనుక. పూర్తి కల్పంలో ఇటువంటి జయంతి ఎక్కడా ఉండదు. కల్పమంతా ఒకసారి చుట్టి రండి. విచిత్రమైన జయంతి. బాప్‌దాదా మీ అందరినీ అడుగుతున్నారు, మీరందరూ తండ్రికి అభినందనలు తెలపడానికి వచ్చారా లేక తండ్రి నుండి అభినందనలను తీసుకోవడానికి వచ్చారా? బాప్‌దాదా ఒంటరిగా ఏమీ చెయ్యరు ఎందుకంటే జన్మ తీసుకోగానే యజ్ఞాన్ని రచించారు. మరి యజ్ఞంలో బ్రాహ్మణులు కావాలి కనుక మీ జన్మ కూడా తండ్రితోపాటు జరిగిపోయింది. ఇందుకు గుర్తుగా భక్తిలో కూడా శివరాత్రిని జరుపుకుంటారు, దానితోపాటు శాలిగ్రామాల పూజ కూడా జరుగుతుంది. అనేకానేక శాలిగ్రామాల పూజ జరుగుతుంది. కనుక ఈ జయంతి అద్భుతమైన జయంతి. అందుకే ఈ జయంతిని వజ్రసమానమైన జయంతి అని అనడం జరుగుతుంది. కావున బాప్‌దాదా తోడుగా ఉన్న పిల్లలందరికీ పదమా పదమరెట్లు తమ బాహువుల హారం మధ్యలో పదమా పదమరెట్ల అభినందనలు తెలుపుతున్నారు. ఇది కూడా తండ్రికి మరియు పిల్లలకు ఉన్న హృదయపూర్వక ప్రేమకు గుర్తు. తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము అన్నది బాప్‌దాదా పిల్లలకు చేసిన వాగ్దానము. మరి చెప్పండి, పిల్లలు కూడా బాబాకు వాగ్దానం చేసారు కదా - సంగమంలో తోడుగా ఉంటాము, తోడుగా ఉండాలి కూడా, విశ్వ సేవ కూడా తోడుగా ఉంది. తోడుగా ఉండాలి, తోడుగా ఎగరాలి కూడా. మరి చెప్పండి, తోడుగా ఉంటాము, తోడుగా వస్తాము మరియు బ్రహ్మా బాబాతో పాటు రాజ్యంలోకి వస్తాము, విశ్వంపై రాజ్యం చేస్తాము అని మీరు కూడా వాగ్దానం చేసారు కదా. ప్రతిజ్ఞ చేసారు కదా? పక్కా ప్రతిజ్ఞ చేసారు కదా? ఇదే శివ జయంతి యొక్క విశేషత.
బాప్‌దాదా అమృతవేళ నుండి ఏమి చూసారంటే భిన్న భిన్న స్థానాలలో ఉన్న పిల్లలు ఎంతో సంతోషంతో అభినందనలను, శుభాకాంక్షలను పంపుతున్నారు. మీరైతే సమ్ముఖంలో అభినందనలను తెలుపుతున్నారు మరియు తీసుకుంటున్నారు కూడా. ఇవ్వడము మరియు తీస్కోవడము రెండూ కలిసి ఉన్నాయి. భగవంతుని పిల్లలు ఎంతటి అదృష్టవంతులు, భగవంతుని సమ్ముఖంలో పుట్టిన రోజును జరుపుకుంటున్నారు! అందరి ముఖాలు సంతోషంతో ఎగురుతూ కనిపిస్తున్నాయి. ఒకవైపు బాప్‌దాదా పిల్లల భాగ్యాన్ని చూస్తున్నారు, మరో వైపు భక్తులను కూడా చూస్తున్నారు. ఇప్పటికీ వారింకా రండి అంటూ భగవంతుడిని పిలుస్తున్నారు, మీరు భగవంతుని సమ్ముఖంలో జరుపుకుంటున్నారు. భక్తుల అనుభూతి కూడా తక్కువగా ఏమీ లేదు అని బాప్‌దాదా చూసారు. మీరు ప్రాక్టికల్‌లో చేసేదానిని వారు స్మృతిచిహ్నంగా ఎంతో చక్కని విధితో స్మృతిచిహ్నాన్ని జరుపుకుంటున్నారు. మీరు వ్రతం తీసుకున్నారు కనుక వారు కూడా వ్రతానికి స్మృతిచిహ్నాన్ని తయారు చేసారు. వారు ఒక్క రోజుకు లేక కొద్ది సమయానికి వ్రతాన్ని ఉంచుతారు కానీ మీరు ఏ వ్రతాన్ని తీసుకున్నారు? అందరూ బాబా ఎదుట వ్రతాన్ని పాటించే ప్రతిజ్ఞను చేసారు కదా? మీరు బాబాతో సంతోషంగా వ్రతాన్ని తీసుకున్నారు - బాబా, మేము ఈ పూర్తి జన్మ, పూర్తి బ్రాహ్మణ జన్మలో వ్రతాన్ని ధారణ చేస్తాము అన్నారు. వ్రతాన్ని ధారణ చేసారు కదా! ఏ వ్రతము? పవిత్రతా వ్రతము. ఒక్క జన్మ కోసం వ్రతాన్ని తీసుకున్నారు. కానీ ఒక్క జన్మ యొక్క పవిత్రతా వ్రతము 21 జన్మల వరకు ఉంటుంది. వారు (భక్తులు) కొద్ది సమయం కోసం ఆహార పానీయాలలో మరియు జాగరణలో వ్రతాన్ని చేస్తారు. కానీ మీరు ఇప్పటి ఒక్క జన్మ యొక్క జాగరణతో అనగా అంధకారం నుండి వెలుగులోకి వచ్చారు. జాగరణ కూడా మీది 21 జన్మల వరకు ఉంటుంది. మీరు ఎటువంటి జాగరణ చేస్తున్నారంటే మీ జాగరణతో విశ్వమే వెలిగే జ్యోతిలా అయిపోతుంది. ఎటువంటి దుఃఖము, అశాంతుల అంధకారము ఉండదు. మరి చెప్పండి, మీరు పూర్తి విశ్వాన్ని అంధకారం నుండి వెలుగులోకి తీసుకువచ్చారు, ఇటువంటి అనంతమైన వ్రతం మంచిగా అనిపిస్తుందా? కష్టంగా లేదు కదా? సహజంగా ఉందా లేక కష్టమా? సహజంగా ఉందా! ఎవరికైతే సహజంగా అనిపిస్తుందో వారు చేతులెత్తండి. అప్పుడప్పుడూ కష్టమనిపిస్తుందా? అప్పుడప్పుడూ అనిపిస్తుందా? లేదా! ఎందుకంటే పవిత్రత మా జన్మ సిద్ధ అధికారము అని మీకు తెలుసు. అందుకే పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు, మనసా వాచా కర్మణ, సంబంధ సంపర్కాలలో కూడా పవిత్రత. పవిత్రతా సంస్కారాలను సహజంగా ధారణ చేసేవారు మీరు. మరి పవిత్రత యొక్క సంకల్పమైతే చేసారు కానీ ఇప్పుడు సమయానుసారంగా బాప్‌దాదా అయితే సమయం గురించి వార్నింగ్ అయితే ఇస్తున్నారు. ఎలా అయితే పవిత్రతా వ్రతాన్ని ధైర్యంతో తమ స్వధర్మంగా భావించి ధారణ చేసారో అలాగే రెండవ భూతము క్రోధము. బాప్‌దాదా ఈ రోజు అడుగుతున్నారు, ఒక మహా భూతం గురించైతే వ్రతాన్ని తీసుకుని వృత్తిని మార్చుకున్నారు కానీ రెండవ భూతమైన క్రోధంపై విజయం పొందాలి అని కూడా సంకల్పం చేసారా లేక రెండవ భూతం కనుక ఫర్వాలేదనుకుంటున్నారా! ఎందుకంటే క్రోధమనేది అందరి కనెక్షన్‌లోకి వస్తుంది. మరి ఈరోజు, ఎప్పుడు జన్మ దినం జరుపుకున్నా కానీ ఒకరికొకరు బహుమతులను కూడా ఇచ్చుకుంటారు. మరి బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు, ఎలా అయితే ధైర్యంతో మరియు తండ్రి సహాయంతో మొదటి నంబరు భూతంపై మెజారిటీ విజయాన్ని పొంది నడుచుకుంటున్నారో అలాగే క్రోధంపై కూడా విజయాన్ని పొందడం సాధ్యమేనా? ఎందుకంటే ఏ భూతమైనా పరేషాన్ చేస్తుంది, క్రోధమనే భూతము అందరి కనెక్షన్‌లోకి వస్తుంది. సంపర్కంలోకి వస్తుంది. మీ మనసులో కూడా క్రోధం వచ్చినప్పుడు స్వయం కూడా క్రోధంతో బలహీనమవుతారు. మరి తండ్రి పుట్టిన రోజును జరపడానికి వచ్చారు కనుక బాప్‌దాదా భారతదేశంవారు మరియు విదేశీయులు అందరి నుండి క్రోధాన్ని బహుమతిగా తీసుకోవాలనుకుంటున్నారు. వీలవుతుందా? వీలవుతుందా? ఈరోజు బాబాకు ఈ బహుమతిని ఇవ్వగలము, మనసులో కూడా ఉండకూడదు, స్వప్నంలో కూడా రాకూడదు, ఇలా స్వయానికి సంకల్పాన్ని ఇచ్చుకుని ధైర్యంతో ముందుకు వెళ్ళగలిగే శక్తి ఉందా? ఉందా? బాబాకు ధైర్యంతో సంకల్పం చేయగలరా? చేస్తాము అని బహుమతిని ఇవ్వగలగాలి. చేస్తారు మరియు బాప్దాదానుండి బహుమతిని పొందుతారా? బహుమతిని ఇవ్వండి మరియు బహుమతిని పొందండి. ఒకవేళ క్రోధంపై విజయం సాధించినట్లయితే ఇతరులపై (ఇతర వికారాలపై) కూడా విజయం సాధించే ధైర్యం వస్తుంది. ఈ బహుమతిని ఇచ్చి తండ్రి నుండి బహుమతిని తీసుకుంటాము అని ఎవరు భావిస్తున్నారు? వారు చేతులెత్తండి. అచ్ఛా, జెండాలు ఊపుతున్నారు. కుమారీలు కూడా! చూడండి. బాప్‌దాదాకు పిల్లల ధైర్యము చూసి చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు దృశ్యాన్ని చూస్తున్నారు కదా. ఫోటో తియ్యండి, మళ్ళీ చేతులెత్తండి. అందరి ఫోటోను తియ్యండి. మీ ధైర్యానికి బాబా ప్రతిరోజూ అమృతవేళ మీరు మిలనం చేసుకునేటప్పుడు విశేషమైన అనుభవి ఆత్మగా సహజంగా అయ్యేందుకు అభినందనలు తెలుపుతారు. ఎందుకంటే ఇంతమంది తమ తమ స్థానాలలో ఉండటాన్ని అందరూ చూస్తూ ఉంటారు. ఇంతమంది ఉంటారు, కలిసి ఉంటారు, ప్రవృత్తిని సంభాళిస్తారు, ఇల్లు వాకిలిని వదిలి వెళ్ళలేదు, కానీ పవిత్ర ప్రవృత్తిని తయారు చేసారు అని చూసినప్పుడు ఏమవుతుంది? ఆత్మల క్యూ ఏర్పడాలి అన్న మీ అందరి శుభ భావన, ఆ క్యూ మీకు కనిపిస్తుంది. ఎందుకంటే క్రోధం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. వీరు పవిత్రత గురించి కేవలం చెప్పడమే కాదు, పవిత్రంగా ఉండి చూపిస్తున్నారు అని ప్రాక్టికల్‌గా చూస్తారు. ప్రత్యక్షతను కోరుకుంటున్నట్లయితే అందుకు ఇదే ప్రత్యక్ష ప్రమాణము. దీనితో అందరూ ఆకర్షితులై స్వతహాగా వచ్చేస్తారు. కానీ, వినిపించమంటారా? వినిపించమంటారా? క్రోధం రావడానికి మెజారిటీ కారణము - ఎక్కడో అక్కడ ఈర్ష్య మరియు దీనితోపాటు ఏదైనా చూసినప్పుడు వ్యర్థ సంకల్పాల బీజము కూడా క్రోధానికి కారణమవుతుంది. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు బీజమైతే అందులో నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది. ఇందుకు ఒక్క మాట కారణమవుతుంది. ఆ ఒక్క మాట అను బీజాన్ని ఒకవేళ సమాప్తం చేసినట్లయితే సహజమైపోతుంది. ఆ ఒక్క మాట ‘ఎందుకు’, ఇది ఎందుకు? ఇది ఎందుకు జరిగింది? ఇలా ఎందుకు చేసారు? ఈ ‘ఎందుకు’ అన్న మాటకు చాలా పెద్ద క్యూ ఉంది. క్యూ అన్న అక్షరాన్ని ఇంగ్లీషులో వ్రాయడం ఎంత కష్టం! ‘ఎ’ అన్న అక్షరాన్ని వ్రాయడం చాలా తేలిక. ఈ ఎందుకు అన్న మాట వలన వచ్చే క్యూను సమాప్తం చెయ్యాలని బాప్‌దాదా ఈరోజు ఆశిస్తున్నారు. మీ అందరి ఆశ ఉంది కదా, ఇప్పుడు త్వరగా ప్రత్యక్షత జరగాలి అని. ప్రతి ఒక్కరి హృదయాలలో తండ్రి స్నేహమనే ఫ్లాగ్, జెండా ఎగరాలి మరియు మా బాబా వచ్చేసారు, మధురమైన బాబా వచ్చేసారు అని మనసు పాట పాడాలి, అందరి మనసులు పాట పాడాలి. త్వర త్వరగా ప్రత్యక్షతా జెండా అందరి హృదయాలలో ఎగరాలనే కదా అందరూ కోరుకునేది! అయితే ఎందుకు (క్యూం), ఏమిటి (క్యా), ఎలా అవుతుంది (కైసే), ఈ కై- కై అన్న భాషను సమాప్తం చేసి కై అని మాట్లాడాలంటే కమాల్ (అద్భుతం) అని మాట్లాడండి. కై-కై అని అనకండి. బాప్‌దాదా పిల్లల కోసం బోర్డింగ్ తెరిచినప్పుడు, పాకిస్థాన్‌లో, ఆది సమయంలో పిల్లలకు జగదాంబ ఇదే చెప్పేవారు. కనుక కై - కై భాష ఇప్పుడు వద్దు. కై- కై అని ఎది అంటుంది? అది మంచిగా అనిపిస్తుందా? కావున ఇప్పుడు క్యూం, క్యూం అన్న క్యూ పెట్టకండి. హాఁ జీ, అచ్ఛా జీ, చాలా మంచిది, మనం కలిసి చేద్దాం, ఎగురుదాం, ఇటువంటి మాటలను మాట్లాడండి. భాష పరివర్తన వీలవుతుందా? కై-కై కాదు, ఈ క్యూను వదిలిపెట్టండి అప్పుడు ఆ క్యూ మొదలవుతుంది.
చూడండి, శివునిపై జిల్లేడు పూలనే వేస్తారు. ఈ రోజు శివరాత్రిని జరుపుకుంటున్నారు. శివుని పుట్టిన రోజును జరుపుకుంటున్నారు కావున ఈ క్రోధమనే జిల్లేడు పూవును బాప్‌దాదాకు అర్పించండి అప్పుడు మీరు దర్పణంలా అవుతారు. ఇష్టమేనా! ఇష్టమేనా? అచ్ఛా. మళ్ళీ బాప్‌దాదా హోలీ సమయంలో వచ్చినప్పుడు రిజల్టును చూస్తారు. అలసిపోవద్దు. జరగలేదు అని అనుకోవద్దు. నిశ్చయబుద్ధిగా అయి చెయ్యండి. చేతిని ఎత్తారు, చేతిని ఎత్తడమంటే బాబాకు ఇచ్చేసినట్లే. ఇచ్చారు కదా! మళ్ళీ చేతులెత్తండి. దాదీలు చూస్తున్నారా? చప్పట్లు కొట్టండి. ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోకండి. ఒకవేళ కొంచెం తక్కువైనా కానీ ఇక ముందు ధైర్యం ఉంచండి, వదలకండి. ముందుకు వెళ్తూ ఉండండి. బాప్‌దాదా కంబైన్డుగా ఉన్నారు అని అంటారు కదా, తోడుగా ఉన్నారు అని అనరు, కంబైన్డుగా ఉన్నారు. ఇటువంటి సమయంలో ఏది జరిగినా కానీ కంబైన్డు బాబాను మీ ముందుకు తెచ్చుకుని తర్వాత అర్పించండి. పిల్లలందరూ నంబరన్ ఉండాలి అని బాప్‌దాదా ఆశిస్తున్నారు. ఇచ్చిన వస్తువు ఇప్పుడు అమానత్ (బాబా వస్తువు) అయిపోయింది. చేతిని ఎత్తడమంటే ఇచ్చినట్లు, ఇప్పుడది మీది కాదు. అమానత్. సంకల్పంలో వచ్చినాకానీ అమానత్లో కల్తీ జరిగినట్లు అర్థం. ఇది మంచిది కాదు. ఇచ్చిన వస్తువును ఎప్పుడూ తిరిగి తీసుకోరు ఎందుకంటే అది ఇక నాది కాదు కనుక.
ఈరోజు బాప్‌దాదా నలువైపుల ఉన్న పిల్లలకు, ఎవరైతే స్క్రీన్‌పై కూడా చూస్తున్నారో, అక్కడ కూర్చుని కూడా ఎంతో సంతోషంతో చూస్తున్నారు మరియు సంకల్పం కూడా చేస్తున్నారు. మరి మధువనం లేక అన్ని సెంటర్లు ఎలా తయారవుతాయి? ఎలా తయారవుతాయి? అన్ని సెంటర్లు నిర్విఘ్న భవకు వరదానిగా అవుతాయి. ఇష్టమే కదా! ఇష్టమేనా? ఎందుకంటే ఇప్పుడు అకస్మాత్తుగా పరిస్థితులు ఎలా రానున్నాయంటే దుఃఖము, అశాంతి కారణంగా మీ అందరికీ ఆత్మలపై దయ కలుగుతుంది, ఎందుకంటే మీరు పూర్వజులు. పూజ్యులు కూడా మరియు పూర్వజులు కూడా. పూర్వజులు ఏ ఆత్మ యొక్క దుఃఖాన్ని, డిస్టర్బెన్సును చూడలేరు. ఎవరిపై ప్రేమ ఉంటుందో, దయ ఉంటుందో వారి దుఃఖాన్ని చూడలేరు. సమయం మిమ్మల్ని పరివర్తన చేసేకన్నా ముందుగానే మీరు పురుషార్థం యొక్క ప్రాప్తుల ప్రాలబ్ధాన్ని ఇప్పటినుండే అనుభవం చేయాలని బాప్‌దాదా ఆశిస్తున్నారు. ఎందుకంటే మీకు నేర్పించేది సమయము కాదు, సమయం మీ టీచరు కాదు. మరి బాప్‌దాదా హోలీ సమయాన మీ రిజల్టును చూడాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ రిజల్టును, ఎక్కువ విస్తారంగా కాదు, అంత చదివే తీరిక ఉండదు. బాప్‌దాదా ముందు కూడా వినిపించి ఉన్నారు, ఎలా అయితే మీకు వరదానం కార్డు లభిస్తుంది కదా, ఎంత చిన్నగా ఉంటుంది, అందులో ఓ.కే అని వ్రాయండి. ఒకవేళ పురుషార్థం చేస్తూ ఉన్నప్పుడు ఏమైనా జరిగితే ఓ.కే కి మధ్యలో గీతను పెట్టండి(ఓ.కే). పెద్ద కాగితాన్ని వేస్ట్ చెయ్యకండి. ఒకవేళ ఎక్కువ సార్లు అయితే రెండు సార్లు, మూడు సార్లు లైన్ పెడ్తూ వెళ్ళండి. మరియు హోలీకన్నా ముందుగానే మధువనానికి పంపండి. అందరిదీ కలిపి పంపినా ఫర్వాలేదు, టీచర్ పంపవచ్చు. తర్వాత బాప్‌దాదా వద్దకు రిజల్టు చేరుకుంటుంది. ఇందులో ఎవరు నంబర్‌వన్? అప్పుడు బాప్‌దాదా మీకు పదమా పదమరెట్లు హృదయపూర్వక స్నేహాన్ని బహుమతిగా ఇస్తారు. అచ్ఛా.
డబల్ విదేశీయులు ఉన్నారు కదా! చేతులెత్తండి. నంబర్ తీసుకుంటారు కదా! ఫారెన్ వారు నంబరు తీసుకుంటారా లేక భారతదేశంవారు తీసుకుంటారా అని చూద్దాం! బాగుంది. బాప్‌దాదా అయితే అందర్నీ ఆశావాదులుగా చూడాలని అనుకోవడం లేదు, బాబా ఆశలను పూర్తి చేసే బాబా అశా దీపాలుగా చూడాలని ఆశిస్తున్నారు. అచ్ఛా – మధుబన్ ఏమి చేస్తుంది? మధుబన్వారు ఏమి చేస్తారు?మధుబన్వారు చేతులెత్తండి. పైన, క్రింద అందరూ. పైన ఉండేవారు కూడా చేతులు పూర్తిగా ఎత్తండి. ఊపండి. అచ్ఛా. మధువనమైతే నంబరు తీసుకోవాలి. తీసుకోవాలి కదా! తీసుకోవాలి ఎందుకంటే మధువనాన్ని అందరూ చాలా త్వరగా కాపీ చేస్తారు. మరి బాగుంది.
అచ్ఛా, ఈసారి మొదటిసారి వచ్చినవారు లేవండి. చాలామంది ఉన్నారు. బాప్‌దాదా మొదటి సారి వచ్చినవారికి ఛాన్సు (అవకాశం) ఇస్తున్నారు. ఫాస్ట్‌గా వెళ్ళండి మరియు ఫస్ట్ రండి. బాగున్నారు. ధైర్యం కలిగినవారు. బాబా కంబైన్డుగా ఉన్నారు. కంబైన్డు శక్తితో ఏది కావాలంటే అది చేయవచ్చు. ఏది వచ్చినాకానీ బాబాకు ఇచ్చేయండి. మీరు ఉపయోగించకండి. ఎలా అయితే పిల్లలు వారికి ఏదైనా నచ్చకపోతే ఏమిచేస్తారు, మమ్మీ - పప్పా ఇది తీసుకోండి, మాకు వద్దు అని అంటారు కదా. మరి బాప్‌దాదా సహయోగిగా ఉన్నారు మరియు సదా ఉంటారు. మొదటిసారి వచ్చినవారికి మొదటిసారి వచ్చినందుకు పదమా పదమరెట్ల అభినందనలు, అభినందనలు, అభినందనలు. మీ చప్పట్లను దేశ విదేశాలలో నలువైపుల చూస్తున్నారు. సైన్సు వారిది కూడా ఎంతో అద్భుతం కదా! నిమిత్తమైనవారికి కూడా బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు. మీకు ఇప్పుడు ఈ సాధనాలు అవసరమైనప్పుడు క్రొత్త క్రొత్త సాధనాలు వెలువడుతున్నాయి. భక్తులపై కూడా బాప్‌దాదాకు చాలా దయ కలుగుతుంది. చాలా కష్టపడతారు. మీరు ప్రేమ (ముహబ్బత్)లో ఉంటే వారు కష్టం (మెహనత్)లో ఉన్నారు. మీరు కష్టపడద్దు. ప్రేమలో ఉండండి. అచ్ఛా. కూర్చోండి.
ఓం శాంతి మంత్రాన్ని శస్త్రంలా చేసుకుని ఉపయోగించండి. ఎవరి వద్ద అయితే శస్త్రాలు ఉంటాయో వారు స్వయాన్ని ధైర్యవంతులుగా భావిస్తారు, మిలటరీవారు ధైర్యాన్ని ఉంచినట్లు. అచ్ఛా.
నలువైపుల కంబైన్డుగా ఉండే పిల్లలు చూస్తున్నారు, వింటున్నారు కూడా. కానీ ఎవరైతే వినడం లేదో వారు మురళి ద్వారా వింటారు. నలువైపుల తండ్రికి స్నేహి, సహయోగులు, మధురాతి మధురమైన, ప్రియాతి ప్రియమైన పిల్లలకు బాప్‌దాదా పదమా పదమరెట్ల అభినందనలను కూడా ఇస్తున్నారు, శుభాకాంక్షలను కూడా తెలుపుతున్నారు. దీనితోపాటు ప్రత్యక్షతా జెండా త్వరత్వరగా ఎగిరింపజేసే సంకల్పాన్ని కూడా ఇస్తున్నారు. సమయం కోసం ఉండకండి, సమయాన్ని మీ టీచర్ చేసుకోకండి. బాబా తండ్రి, టీచరు మరియు సద్గురువు అయినప్పుడు, మీ జగదాంబ ఎలా అయితే చేసారో, రెండు మాటలతో నంబరును తీసుకున్నారు. బాబా చెప్పడము మరియు జగదాంబ చెయ్యడము - ఇటువంటి తీవ్ర పురుషార్థాన్ని చేసారు మరియు నంబరును తీసుకున్నారు. మీరందరూ కూడా ఒప్పుకుంటారు కదా, మీరు కూడా ఫాలో మదర్ జగదాంబ. అచ్ఛా. అందరూ ప్రియస్మృతులను, చాలా చాలా హృదయపూర్వక దీవెనలను స్వీకరించండి. అంతేకాక బాబా తన పిల్లలను యజమాని రూపంలో చూసి నమస్తే చేస్తున్నారు.
సేవ టర్న్ భోపాల్ జోన్ వారిది:- అచ్ఛా, చాలా మంచిది. భోపాల్ జోన్ పేరే భూపాల్, భూ అని దేనిని అంటారు? ధరణిని. దానిని పాలించేవారు. మీరు ధరిత్రికి సితారలై ఆత్మలను ఎగిరింపజేసేవారు, నడిపించేవారు కాదు, ఎగిరేలా చేసేవారు. అన్నిటికన్నా సహజమైన సాధనము ఎగరడము మరియు ఎగిరించడము. మరి భోపాల్ నివాసులు స్వయం ఎగిరేవారు మరియు ఇతరులను కూడా ఎగిరింపజేసేవారు. సరేనా, అంతే కదా? లేక ప్రయత్నిస్తున్నారా? కాదు, అలా ఉన్నారు. మరియు ఉంటారు. బాప్‌దాదాకు ప్రతి జోన్‌పై గాఢమైన స్నేహం ఉంది. ఎందులో అయితే వారస క్వాలిటీవారు అధికంగా ఉంటారో అదే జోన్ నంబర్‌వన్ అవుతుంది అని బాప్‌దాదా ముందే చెప్పి ఉన్నారు. సాధారణమైన వారైతే వస్తూనే ఉంటారు, కానీ వారస క్వాలిటీని జోన్లో వెరిఫై చెయ్యడం జరుగుతుంది. మీరు లిస్టు పంపితే సరిపోదు. దానిని వెరిఫై చెయ్యాలి, ఏ జోన్లో అయితే వారస క్వాలిటీ వారు ఎక్కువగా ఉంటారో వారికి నంబరును ఇస్తాము. అందరూ ప్రోగ్రాములు కూడా చేస్తున్నారు మరియు ఇప్పుడు కూడా చేస్తున్నారు. బాప్‌దాదా వద్దకు సమాచారమంతా వస్తుంది. మరి ఇప్పుడు వారస క్వాలిటీని తయారు చేయండి. ఎందుకంటే వారస క్వాలిటీవారు తమ రాజ్యంలో రాజ్య అధికారులుగా అవుతారు. ఒకవేళ రాజ్య అధికారులు తయారైపోతే, అందర్నీ కలిపితే రాజ్యం రావడంలో ఎక్కువ ఆలస్యం అవ్వదు. మరి భోపాల్ నంబరు తీసుకుంటుంది కదా! ఎవరైతే స్వయం వారసులు ఉన్నారో, వారు ఫోర్సు యొక్క కోర్సును చేయించి ఇతరులను కూడా త్వర త్వరగా వారసులుగా తయారు చెయ్యవచ్చు. సాధారణ కోర్సు కాదు, ఫోర్సు యొక్క కోర్సు. ఆరంభం చేసినప్పుడు, బాప్‌దాదా సింధ్‌లో ఆరంభించినప్పుడు సింధిలో ఇలా అంటారు, ఇప్పుడు ఝటపట్ కుల్ఫీ ఏక్ పైసా. ఆదిలో చెప్పిన మాటలు ఇప్పుడు ప్రాక్టికల్‌లో అవుతున్నాయి. సమయానికైతే వరదానం ఉంది, మీరు కేవలం దృఢ సంకల్పం చేయండి, ఎగిరింపజేయాల్సిందే. నడిపించడం కాదు, ఎగిరించడము. మరి భోపాల్ వారు ఛాన్సును తీసుకున్నారు. చాలా మంచిది. ఇప్పుడు నంబరు తీసుకోండి. అచ్ఛా.
బాప్‌దాదా అన్ని జోన్లకు చెప్పి ఉన్నారు - వారస్ మరియు మైక్‌లను తయారు చేయండి. ప్రభావశాలి మైక్ - వారి అనుభవాన్ని విని మేము కూడా వీరిలా అవ్వాలి, ఎవ్వరినైనా తృప్తి పరచగలగాలి అని అనిపించాలి, ప్రేరణ రావాలి. అన్ని జోన్లు లిస్టును పంపండి. ఈరోజు ఢిల్లీవారు లిస్టును పంపడాన్ని బాప్‌దాదా చూసారు. ఇందుకు బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు. అన్ని జోన్లు పంపితే అప్పుడు ఎంతమంది వారసులు తయారయ్యారు అని మీకు కూడా రిజల్టును వినిపిస్తాము. చెకింగ్ చేయిస్తాము, అంతేకానీ లిస్టు రాగానే ఒప్పుకుంటామని కాదు. గుప్త చెకింగ్ చేయిస్తాము. అచ్ఛా, ఆదిలో కూడా అభినందనలు మరియు శుభాకాంక్షలు లభించాయి. ఇప్పుడు కూడా బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ హృదయంలో పేరు తీసుకుని పదమా పదమరెట్లు అభినందనలు తెలుపుతున్నారు. బాబా వద్ద అయితే పిల్లలందరి చిత్రం వతనంలో ఇమర్జ్ అయి ఉంది. మరి బాప్‌దాదా పిల్లల పుట్టినరోజు జరిపారు మరియు పిల్లలు తండ్రి పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇద్దరికీ అభినందనలు. అచ్ఛా.
లచ్ఛు దాదీతో:- మంచిగా చేస్తారు, మంచిగా అలంకరిస్తారు.
దాదీలతో:- స్నేహంలో ఉండనే ఉన్నారు. మీరు స్నేహంతో లేకపోతే వైబ్రేషన్లు ఎలా లభిస్తాయి!
మోహిని అక్కయ్యతో:- బాగున్నారు, బాగానే ఉంటారు. బాగా అయిపోతారు. సంకల్పంలో శక్తి ఉంది. సంకల్పాన్ని పూర్తి చేసుకుంటున్నారు. తండ్రి సహాయం కూడా ఉంది. (బాప్‌దాదా సహాయం చాలా ఉంది) తండ్రి సహాయం ఉంది కానీ ప్రేమ ఉంది కనుక ఇతరుల సహాయం కూడా ఉంది. అచ్ఛా.
పర్దాదీతో:- శాలిగ్రామమైన మీకు తండ్రితో పాటు జన్మ దిన శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. శాంతమణి దాదీతో:- ప్రేమ ఉంది కదా! బాబాపై ప్రేమ ఉంది. అందరూ అభినందనలు తెలుపుతున్నారు. చాలా మంచిది.
రమేష్ అన్నయ్యతో:- బాగుంది, ముందు ముందుకు సాగుతూ వెళ్తున్నారు. కేవలం లక్ష్యం పెట్టుకుంటే చాలు, ఒకరికొకరు సహయోగులుగా అయ్యి ముందుకు ఎగురుతూ వెళ్తారు. ఇప్పుడు ఎగరాలి మరియు ఎగిరించాలి. నడిచే సమయం పూర్తయింది. ఎంత తేలికగా ఉంటామో అంతగా ఎగురుతాము మరియు ఇతరులనూ ఎగిరించగలము. ఇప్పుడు ఎగిరించే సీజన్. చాలా మంచిది.
నిర్వైర్ అన్నయ్య అందరి స్మృతిని ఇచ్చారు:- అందరికీ స్మృతిని ఇవ్వండి. ఎవరైతే ఈ కార్డు మొదలైనవి పంపారో వారందరికీ ప్రియస్మృతులు. దీనిని చూసే ఉంటారు అయినాకానీ విశేషమైన ప్రియస్మృతులను పంపుతున్నాము. ఇది ఎగరుతూ ఎగిరించే సీజన్, కనుక డబల్ లైట్ అని వ్రాయండి.
భూపాల్ అన్నయ్యతో:- నలు వైపుల అంతా మంచిగా జరుగుతుంది కదా!
(అంకుల్, ఆంటీ మరియు మురళి దాదాల స్మృతిని అందించారు) బాప్‌దాదా వద్దకు వారిది చేరుకుంది. ఇద్దరూ నిమిత్తమయ్యారు, తమ తమ కార్యాలనుసారంగా ఇద్దరూ విశేషమైనవారే.
మోహిని అక్కయ్య డాక్టరుతో:- కేవలం సేవను మాత్రమే చెయ్యకండి, మీ తండ్రి యొక్క ప్రేమ నిండిన ధైర్యం మరియు ఉల్లాసాన్ని కూడా ఇవ్వండి. డబల్ డాక్టర్ కదా కావున డబల్ పని చెయ్యండి.
బాప్‌దాదా తమ హస్తాలతో జెండాను ఎగురవేసారు:- ఈరోజు శివ జయంతి రోజున పిల్లలు మరియు తండ్రి యొక్క జన్మ దినానికి స్మృతి చిహ్నంగా ఈ ఎగురవేయడం జరిగింది. మీ అందరి జెండా కూడా ఎగురవేయబడ్డది, ఎందుకంటే మీరందరూ కూడా శాలిగ్రామాలు కాబట్టి. శాలిగ్రామాలు ఒక్కొక్కరు బాబాతో ఉన్నారు. తండ్రి పూజ జరిగినట్లుగా శాలిగ్రామాల పూజ కూడా జరుగుతుంది. వాటికి గుర్తుగా బిందువును పెడ్తారు. శివరాత్రికి విశేషంగా బిందువును మహిమ చేస్తారు. ఈరోజైతే ఈ జెండాను ఎగురవేసాము కానీ తండ్రి స్నేహమనే జెండా అందరి మనసులలో ఎగిరే రోజు అతి త్వరలో రానుంది. ఈరోజు బాబా ఇచ్చిన సూచనను మీరు చేస్తారు కదా, అప్పుడు ప్రత్యక్షత త్వరగా అయిపోతుంది. మీ ముందు కూడా ఈ దృశ్యం వచ్చేసినట్లే. అందరి నోటి నుండి మా బాబా వచ్చేసారు అని రావాలి. ఇప్పుడు తీవ్ర పురుషార్థం చేసి ఈ సమయాన్ని చాలా త్వరగా సమీపంగా తీసుకురావాలి, రావలసిందే, జరగవలసిందే మరియు అందరికీ చెప్పవలసిందే.
మీ అందరికీ బాప్‌దాదా విశేషంగా స్నేహ హారాన్ని వేస్తున్నారు. ముందుకు సాగుతూ వెళ్ళండి, ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. అచ్ఛా.
ఇంటర్నేషనల్ కుమారీల రిట్రీట్:- కుమారిని పూజిస్తారు ఎందుకంటే కుమారి శుద్ధమైనది, పవిత్రమైనది కనుక. అంటే పవిత్రతకు పూజ జరుగుతుంది. మరి మీరు స్వయాన్ని ఇంతటి పూజ్య ఆత్మగా భావిస్తున్నారా, భావిస్తున్నారా? భాష అర్థం కావడంలేదా? కుమారి అంటే ఇతరులకు కూడా పవిత్రంగా ఉండే శిక్షణను ఇచ్చి వారిని కూడా పవిత్రంగా చేసేవారు కావున ముందుకు సాగుతూ ఉండండి, అలసిపోవద్దు, ఎవ్వరినీ చూడద్దు. బాబాను ఫాలో చెయ్యండి, ఫాలో చేసి బాబా ద్వారా అనేక శక్తుల వరదానాన్ని తీసుకుంటూ ఆత్మలను ఎగిరింపజేయండి ఎందుకంటే కుమారీలు తేలికైనవారు, భారం లేదు మరి ఇతరులను కూడా ఇలా ఎగిరేట్లు చేయండి. బాప్‌దాదాకు మీ అందర్నీ చూసి సంతోషంగా ఉంది. ఒక్కొక్క కుమారి 100 బ్రాహ్మణులకన్నా ఉత్తమమైనది. ఇంతగా తమ స్వమానాన్ని పెట్టుకోండి. మంచిగా చేసారు, ట్రైనింగ్ చేసారు, ఇప్పుడు మీరు తయారై ఇతరులకు ట్రైనింగ్‌ను ఇవ్వండి, ఈ రిజల్టును తయారు చెయ్యండి. సమాచారం వస్తుంది, సమాచారాన్ని ఇస్తూ ఉండండి, అది బాబా వద్దకు చేరుకుంటుంది. బాగుంది. ధైర్యముంది, ఇప్పుడు ఉల్లాస ఉత్సాహాలతో ఎగరండి. అచ్ఛా.
ఓంశాంతి