Search for a command to run...
30 Jan 2010
నాలుగు సబ్జెక్టులలోనూ స్వమానాల అనుభవి స్వరూపులుగా అయ్యి అనుభవం యొక్క అథారిటీని కార్యంలోకి తీసుకురండి
30 January 2010 · తెలుగు
ఈరోజు బ్రాహ్మణ ప్రపంచానికి రచయిత అయిన బాప్‌దాదా తమ నలువైపుల ఉన్న బ్రాహ్మణ ప్రపంచాన్ని చూస్తున్నారు. బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ పూర్తి ప్రపంచంలోనే విశేషమైన ఆత్మలు. కోట్లలో కొద్దిమంది, ఎందుకంటే సాధారణ తనువులో వచ్చిన తండ్రిని గుర్తించారు. బాప్‌దాదా కూడా హృదయంలో ఇమిడిపోయే పిల్లలకు హృదయపూర్వకంగా హృదయ ప్రేమను ఇస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమను తాము తండ్రికి ప్రియులుగా, హృదయంలో తండ్రిని నింపుకున్నవారిగా అనుభవం చేసుకుంటున్నారు కదా! బాబాకైతే పిల్లలందరూ ఎంతో ప్రియమైనవారు, సర్వులకు ప్రియులు. మేము యోగి జీవితాన్ని గడుపుతున్నాము అని పిల్లలైన మీరందరూ సర్వాత్మల ముందు ఛాలెంజ్ చేసారు. కేవలం యోగం చేసేవారు కాదు, యోగి జీవితాన్ని గడుపుతున్నవారు. జీవితమంటే రెండు నాలుగు గంటలకు మాత్రమే ఉండేది కాదు. జీవితమంటే అది సదాకాలం ఉండేది. కనుక నడుస్తూ, తిరుగుతూ, కర్మ చేస్తూ యోగి జీవితాన్ని గడిపే నిరంతర యోగులు. యోగంలో కూర్చున్నా, కర్మను చేస్తున్నాకానీ కర్మయోగులు. జీవిత లక్ష్యమే సదా యోగి. మరి ఈ విధమైన యోగి జీవితాన్ని, నేచురల్ జీవితాన్ని అనుభవం చేస్తున్నారా? బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న భాగ్యాన్ని చూస్తున్నారు. ఏమి చూసారు? నా పిల్లలు ప్రతి ఒక్కరూ స్వమానధారులు, స్వరాజ్య అధికారులు. ఎందుకని? ఎక్కడ స్వమానము ఉంటుందో అక్కడ దేహ భానము రాలేదు. ఆది నుండి అంతిమం వరకు, ఇప్పటి వరకు బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ భిన్న భిన్న స్వమానాలను ఇచ్చారు. ఒకవేళ ఇప్పుడైనా స్వమానాలను గుర్తు తెచ్చుకుని ఒక్కొక్క స్వమాన మాలను త్రిప్పినట్లయితే అనేక స్వమానాల స్వరూపులుగా అయి స్వమానంలో లవ్లీనమైపోతారు. కానీ బాప్‌దాదాకు పిల్లల్లోని ఒక్క విషయం ఇప్పటికీ నచ్చడం లేదు. అది ఏమిటో తెలుసా? స్వమానంలో స్థితి కావడం అప్పుడప్పుడు మాకు కష్టమవుతుంది, స్థితి అవ్వాలని ఉంటుంది కానీ కష్టమవుతుంది అని పిల్లలు అంటారు. సర్వశక్తిమంతుడైన తండ్రి పిల్లల కష్టాన్ని చూడలేరు. ఎందుకంటే ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ కష్టం ఉండదు. ఎక్కడ కష్టముంటుందో అక్కడ ప్రేమలో లోపం ఉందని అర్థం.
ఈరోజు అమృతవేళ బాప్‌దాదా నలువైపుల ఉన్న బ్రాహ్మణుల వద్దకు, దేశములో మరియు విదేశములో చుట్టి వచ్చారు, అక్కడ ఏమి చూసారు? కొంతమంది పిల్లలు స్వమానంలో కూర్చుని ఉన్నారు. నేను బాప్‌దాదా హృదయ సింహాసనాధికారిని అని ఆలోచిస్తూ ఉన్నారు, స్వమానంలో స్థితులవ్వడానికి పురుషార్థం కూడా చేస్తున్నారు కానీ ఏ లోపము చూసాము? స్వమానం గుర్తుంది, దాని గురించి ఆలోచిస్తున్నారు, కానీ స్వమాన స్వరూపులుగా అయి, అనుభవిమూర్తులుగా అయి అనుభవం యొక్క అథారిటీ స్వరూపులుగా అవ్వడంలోనే లోపం కనిపించింది ఎందుకంటే అథారిటీలు అనేకమున్నాయి కానీ అన్నిటికన్నా పెద్ద అథారిటీ అనుభవం యొక్క అథారిటీ. ఈ స్వమానాల అనుభూతి ఆల్మైటీ అథారిటీ ఇచ్చారు. అయితే కష్టపడుతున్నారు కానీ అనుభవి స్వరూపులుగా అవ్వడంలేదు. మరి బాప్‌దాదా ఏమి చూసారంటే కూర్చుంటారు, ఆలోచిస్తున్నారు కూడా కానీ కొద్దిమంది మాత్రమే అనుభవి స్వరూపులుగా అవుతున్నారు. అనుభవంలో ఏ విధమైన దేహాభిమానము కొంచెం కూడా తనవైపుకు ఆకర్షితం చెయ్యలేదు. కనుక, అనుభవి స్వరూపులుగా అవ్వడం, కర్మ చేస్తూ కూడా కర్మయోగి యొక్క అనుభవీ స్వరూపంలో మునిగిపోవడం, ఇందులో ఇప్పుడు మరింత ఆవశ్యకత ఉంది. స్వరూపంలోకి వచ్చేయాలి. ప్రతి విషయంలో, ప్రతి సబ్జెక్టులో అనుభవి స్వరూపులుగా కావాలి. జ్ఞానం, యోగం, ధారణ, సేవ, నాలుగు సబ్జెక్టులలోనూ అనుభవి స్వరూపులుగా అవ్వాలి. అనుభవిని మాయ కూడా కదిలించలేదు అందుకే బాప్‌దాదా ఈరోజు పిల్లలందరినీ అనుభవి స్వరూపులుగా చూడాలని ఆశిస్తున్నారు. వినడం మరియు ఆలోచించడంలో తేడా ఉంది కానీ అనుభవి స్వరూపులుగా కావాలి, ఏదైతే అనుకుంటారో, ఏ స్వమానంలో స్థితి అవ్వాలనుకుంటారో ఆ అనుభవ స్వరూపంలో స్థితులవ్వగలగాలి. అనుభవాన్ని ఎవ్వరూ కదిలించలేరు ఎందుకంటే స్వమానము మరియు దేహభానము. ఎక్కడ స్వమాన స్వరూపము ఉంటుందో, స్వమాన అనుభవంలో స్థితులై ఉంటారో అక్కడ దేహ భానము రాలేదు. ఎలాగంటే చూడండి, అంధకారం ఉందనుకోండి, లైట్ యొక్క స్విచ్‌ను మీరు ఆన్ చెయ్యగానే అంధకారం ఆటోమేటిక్‌గా మాయమైపోతుంది. అంధకారాన్ని తొలగించడానికి, అంధకారాన్ని పారద్రోలడానికి శ్రమించనవసరం లేదు. అలాగే స్వమానమనే సీట్‌పై అనుభవం అనే స్విచ్ ఆన్ అయి ఉన్నట్లయితే ఏ విధమైన దేహ భానము రాదు. భిన్న భిన్న ప్రకారాల దేహ భానాలు ఉన్నాయి మరియు భిన్న భిన్న ప్రకారాల స్వమానాలను బాబా ఇచ్చి ఉన్నారు. స్వమానాలు తెలుసు, పురుషార్థం కూడా చేస్తున్నారు కానీ అనుభవంతో కూడిన పురుషార్థం చెయ్యడంలో మరియు అనుభవి స్వరూపులుగా అవ్వడంలోనూ తేడా ఉంది అందుకే కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు సమయానుసారంగా తండ్రి సమానంగా అయ్యే లక్ష్యాన్ని సంపన్నం చేసే సమయంలో పిల్లలు కష్టపడటం బాప్‌దాదాకు నచ్చడంలేదు. నేను కర్మయోగి జీవితం ఉన్నవాడినా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకోండి. జీవతమనేది నేచురల్‌గా, సదాకాలం కోసం ఉండేది, అప్పుడప్పుడూ ఉండేది కాదు. ఇటువంటి అనుభవి స్వరూపులుగా అవ్వండి. యోగి జీవితం, అనుభవిమూర్తులుగా అవ్వాలన్న లక్ష్యం సంపన్నమవుతుందా? మస్తకంపై మెరుస్తున్న ప్రకాశం సదా స్వయానికీ అనుభవం కావాలి. స్వయం ఆ స్వరూపంలో స్థితులవ్వాలి, స్మృతి స్వరూపులుగా ఉండాలి. స్మృతి చేసేవారిగా కాదు, స్మృతి స్వరూపులుగా ఉండాలి. స్మృతి స్వరూపులుగా ఉన్నారా లేదా అన్నదానికి ప్రమాణము - ఎక్కడ స్మృతి యొక్క అనుభవి స్వరూపము ఉంటుందో అక్కడ ప్రతి కార్యాన్ని చేస్తూ స్వయంలో సమర్థత అనుభవం అవుతుంది. భిన్న భిన్న కార్యాలు ఉండవచ్చు కానీ అనుభవి స్వరూపము యొక్క స్థితి భిన్న భిన్నంగా ఉండదు.
ఎందుకు కష్టవడాల్సి వస్తుంది అని ఈరోజు బాప్‌దాదా చూసారు. అనుభవి స్వరూపంగా అయ్యేందులో నంబరువారీ పురుషార్థనుసారంగా ఉండటాన్ని చూసాము. బాప్‌దాదాకు పిల్లలందరిపై గాఢమైన ప్రేమ ఉంది. ఎవరి మీద ప్రేమ ఉంటుందో వారు కష్టపడటాన్ని చూడలేము. ఏ సబ్జెక్టులోనైనా కష్టపడాల్సి వస్తుందంటే, అప్పుడప్పుడు అన్న పదాన్ని ఉపయోగించాల్సి వస్తుంది అంటే అందుకు కారణం - అనుభవి స్వరూపులుగా అవ్వడంలో లోటు. పురుషార్థీలే కానీ స్వరూపులుగా అవ్వలేదు. దేహాభిమానం దగ్గరకు రానంతగా ఒక్క క్షణంలో నాలుగు సబ్జెక్టులలోనూ తమ స్వమానాల అనుభవి స్వరూపులుగా అవ్వాలి. ప్రకాశం ముందు చీకటి నిలువనట్లుగా, అంధకారాన్ని తొలగించాల్సిన అవసరం ఉండదు. అంధకారం ఉన్నచోట ప్రకాశం తక్కువగా అయినా ఉండి ఉండాలి లేక అసలు లేకైనా ఉండాలి, ఇది నేచురల్. కావున అన్నిటికన్నా అతి పెద్ద అథారిటీ అనుభవము అని గాయనం ఉంది. అనుభవాన్ని వేలాది మంది మార్చాలనుకున్నా మార్చలేరు. ఉదాహరణకు, మీరందరూ చక్కెర తియ్యగా ఉంటుందని అనుభవం చేసి ఉన్నారు, ఈ విషయంలో మిమ్మల్ని వేలాది మంది మార్చాలని చూసినా మీరు మారుతారా? అలాగే జ్ఞానం, యోగం, ధారణ మరియు సేవ, ఈ నాలుగింటిలో ఏ ఒక్క దానిలోనైనా కష్టంగా అనిపిస్తుంది అంటే తప్పకుండా అనుభవంలో లోటు ఉందని అర్థం. సేవలో సఫలత, ధారణలో స్వభావ పరివర్తన, యోగంలో అచలంగా ఉండటము, యోగి జీవితాన్ని అనుభవం చెయ్యడము, ఎక్కడ కష్టం ఉంటుందో లేక ఎక్కడ అప్పుడప్పుడు అని అంటారో, అంటే ఆ ఫలానా సబ్జెక్టులో మీరు అనుభవిమూర్తులుగా అవ్వలేదు అని అర్థము. అనుభవం అప్పుడప్పుడు ఉండదు, అది నేచురల్ నేచర్‌గా ఉంటుంది. కష్టపడటానికి కారణమేమిటో ఇప్పుడు విన్నారా? అనుభూతి అను సీట్‌పై సెట్ అయ్యి ఏదో ఒక వరదాన స్వరూపంలో అనుభవిగా అయి అనుభవం చేసుకున్నప్పుడు కష్టపడాల్సిన అవసరం ఉండదు అని మీకు అనుభవం అయ్యే ఉంటుంది. కష్టమనిపిస్తుందా? నేచురల్‌గా అనుభవం అవుతుంది. అందుకే ఇప్పుడు సమయానుసారంగా అన్నీ అకస్మాత్తుగా జరుగనున్నాయి. ఏదీ చెప్పి జరగదు. ఎలా అయితే ప్రకృతిలో అన్నీ ఆకస్మిక ఆటలే జరుగుతున్నాయి కదా, ఇప్పుడది ఆరంభమయింది. కొత్త కొత్త విషయాలు అకస్మాత్తుగా జరుగుతున్నాయి,భూకంపం వచ్చింది, కొద్ది సమయంలోనే లక్షల ఆత్మలు వెళ్ళిపోయాయి. రేపు మేము ఉంటామా లేదా అని వారికి తెలుసా? ఇలాగే అనేక ప్రమాదాలు అకస్మాత్తుగా భిన్న-భిన్న స్థానాలలో జరగడం ఆరంభమయ్యాయి. గుంపులు గుంపులుగా ఒకే సమయంలో అనేకుల టికెట్టు కట్ అవుతుంది. ఇటువంటి సమయంలో మీరు ఎవరెడీగా ఉన్నారా? పురుషార్థం చేస్తున్నాను అని అప్పుడు చెప్పరు కదా? ఎవరెడీ అంటే ఏ వరదానమునైనా, స్వమానాన్నయినా సంకల్పం చెయ్యగానే ఆ స్వరూపంలోకి వచ్చేయాలి. అందుకే బాప్‌దాదా ఈరోజు ఈ విషయంపై అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఏ వరదానమునైనా ఫలప్రదం చేసి వరదానం లేక స్వమాన స్వరూపం యొక్క అనుభవిగా అవ్వగలరా? అవ్వాల్సిందే. ప్రయత్నిస్తున్నాను, ఒకవేళ ప్రయత్నించాలనుకున్నా అది ఇప్పటినుండే చెయ్యండి ఎందుకంటే బహుకాలపు అభ్యాసము సమయానికి సహాయం చేస్తుంది. పురుషార్థీలు కాదు, అనుభవిలు ఎందుకంటే మీ అందరికీ అనుభవం యొక్క అథారిటీని ఆల్మైటీ అథారిటీ ఇచ్చారు. దేహభానం యొక్క అథారిటీ ఉంది కదా, నేను ఫలానాను అని దేహ భానాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందా! ఉదాహరణకు, మీ పేరు దేహం ఆధారంగా వచ్చింది, మరి దేహ భానం కలిగినట్లే కదా, నేను ఫలానా, వేలాది మంది వచ్చి మీరు ఫలానా కాదు, మీరు ఇది అంటూ మీ పేరు మార్చి చెబితే మీరు ఒప్పుకుంటారా? మీ పేరును మర్చిపోతారా! జన్మ తీసుకోగానే వచ్చిన దేహ భానము ఎంత పక్కాగా, నేచురల్‌గా ఉంది. వేరొకరిని కూడా మీ పేరుతో పిలిచినట్లయితే, మిమ్మల్ని పిలవడం లేదు, కానీ మీ పేరున్న వారిని పిలిచినా కానీ పేరు వినగానే మిమ్మల్ని పిలుస్తున్నారేమో అని మీ చెవులు అటెన్షన్ పెడ్తాయి. మరి దేహ భానము ఇంతగా పక్కాగా అయిపోయింది. ఇలాగే దేహి అభిమాని, స్వమానధారి, స్వరాజ్య అధికారి - ఇవి కూడా ఇంత పక్కా అయిపోవాలి. మీరంటారు కదా, మా జీవితం పరివర్తన చెందింది అని, ఏ పరివర్తన తీసుకువచ్చారు? దేహ భానము నుండి స్వమానము, స్వరాజ్య అధికారులుగా అయ్యారు. మరి జ్ఞాన స్వరూపుడిగా అయ్యానా అని పరిశీలించుకోండి. లేక జ్ఞానం వింటూ వినిపించేవాడిగా అయ్యానా? జ్ఞానము అంటే నాలెడ్జ్, నాలెడ్జ్ యొక్క ప్రాక్టికల్ స్వరూపము. నాలెడ్జ్ ఈజ్ లైట్ (జ్ఞానము ప్రకాశమువంటిది), నాలెడ్జ్ ఈజ్ మైట్ (జ్ఞానము శక్తివంటిది) అని నాలెడ్జ్ గురించి అంటారు. కనుక జ్ఞాన స్వరూపులుగా అవ్వడమంటే ఏ కర్మ చేసినా అందులో లైట్ మరియు మైట్ ఉండటము. యథార్థంగా ఉంటాయి. జ్ఞాన స్వరూపులుగా అవ్వడమంటే అర్థం ఇదే. జ్ఞానాన్ని వినిపించేవారిగా కాదు, జ్ఞాన స్వరూపులుగా అవ్వాలి. యోగ స్వరూపము అనగా కర్మేంద్రియజీతులుగా అవ్వడము. ప్రతి కర్మేంద్రియంపై స్వరాజ్యాధికారి. దీనినే యోగము అనగా యుక్తియుక్త జీవితము అని అంటారు. అలాగే జ్ఞానయోగాల స్వరూపులుగా ఉన్నట్లయితే ప్రతి గుణ ధారణ ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. ఎక్కడ జ్ఞానము, యోగము, యోగయుక్తము ఉంటాయో అక్కడ గుణాల ధారణ ఆటోమేటిక్‌గా జరుగుతుంది. సేవ ప్రతి సమయము ఆటోమేటిక్‌గా జరుగుతుంది. సమయానుసారంగా మనసా సేవను చెయ్యండి, వాచ, కర్మణ, స్నేహ సంబంధాలలో చెయ్యండి, సేవ కూడా అఖండంగా జరుగుతూనే ఉంటుంది. సంబంధ సంపర్కాలలో కూడా సేవ జరుగుతుంది. ఉదాహరణకు, మీ బ్రాహ్మణ పరివారంలో మీ సోదరి లేక సోదరుడు నిరాశతో ఉన్నారనుకోండి, పురుషార్థంలో కాస్త డల్‌గా ఉన్నారనుకోండి, ఏదైనా సంస్కారానికి వశమై ఉన్నారనుకోండి, ఇటువంటి సంపర్కంలో ఉన్న ఆత్మకు మీరు ఉల్లాస ఉత్సాహాన్ని ఇచ్చారు, సహయోగాన్ని అందించారు, స్నేహమును ఇచ్చారనుకోండి, మీ సేవలో దీనికి కూడా పుణ్యం జమ అవుతుంది. పడిపోయిన వారిని లేపడాన్ని పుణ్యమని అంటారు. కనుక, సంబంధ సంపర్కాలలో కూడా సేవ చెయ్యడమే సత్యమైన సేవాధారుల కర్తవ్యము. సేవ లభించినప్పుడు లేక సేవ ఇవ్వడం జరిగినప్పుడు అదే సేవ అని అనుకోకండి. స్వయం మనసా, వాచ, కర్మణ, సంబంధ సంపర్కాలలో సేవ ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉండాలి. బాప్‌దాదా ఏమి చూసారంటే కొన్నిసార్లు సంపర్కంలో ఉన్నవారి స్వభావ సంస్కారము కొంచెం ఉండాల్సిన విధంగా లేనప్పుడు, వీరింతే, వీరు మారరు, వీరి సేవ చెయ్యడం టైమ్ వేస్టు అని సంకల్పం చెయ్యడం - ఇది యథార్థమా? మేము ప్రకృతిని కూడా సతోప్రధానంగా చేసేవారము అని మీరు స్వయం గురించి భావిస్తున్నప్పుడు, వీరైతే మనుష్యాత్మలు, బ్రాహ్మణుడు అని అనబడుతున్నారు, కానీ సంస్కారానికి వశమై ఉన్నారు. ప్రకృతి యొక్క సంస్కారాన్ని మారుస్తాము అని ఛాలెంజ్ చేసినప్పుడు వీరైతే ప్రకృతితో చూస్తే పురుషుడు, ఆత్మ. మీ సంబంధంలో ఉన్నవారు. సత్యమైన సేవాధారి తమ సేవా పుణ్యాన్ని జమ చేసుకోవడానికి శుభ భావనను తప్పకుండా ఉంచుకుంటారు. వీరింతే, వీరింక మారరు - దీనిని శుభ భావన అని అనరు, ఇది సూక్ష్మ ద్వేష భావము. ఎంతైనా మన సోదరీ సోదరులు. నా బాబా అనైతే అంటారు కదా! సత్యమైన సేవాధారులు శుభ భావనలు ఇచ్చే సేవలో కూడా పుణ్యాన్ని సంపాదించుకుంటారు. పడిపోయిన వారిని మరింత పడవేయకండి, లేపండి. సహయోగాన్ని ఇచ్చేవారినే సత్యమైన సేవాధారి, పుణ్యాత్మ అని అంటాము. ఇంతటి సేవా ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయా అని స్వయాన్ని పరిశీలించుకోండి. వీరినే అనుభవం యొక్క అథారిటీ ఉన్నవారు అనంటారు. ఇప్పుడు బాప్‌దాదా ఇదే ఆశిస్తున్నారు, అనుభవిమూర్తులుగా అవ్వండి, అనుభవం యొక్క అథారిటీని కార్యంలోకి తీసుకురండి.
ఎవరైతే నాలుగు సబ్జెక్టులలోనూ స్వయాన్ని అనుభవి స్వరూపులుగా చేసుకుని అనుభవం యొక్క అథారిటీని కార్యంలోకి తీసుకువస్తాము, ఉన్న లోపాలను సంపన్నం చేస్తాము, ఇంతగా స్వయంపై అటెన్షన్‌ను పెడ్తాము అన్నవారు చేతులెత్తండి. మనసు యొక్క చేతిని ఎత్తుతున్నారు కదా! శరీర చేయి కాదు, మనసు యొక్క చేయి. ఎత్తండి. మనసు యొక్క చేతిని ఎత్తండి ఎందుకంటే బాప్‌దాదా శివరాత్రికి రిజల్టును చూస్తారు. ఎవ్వరి సంస్కార లోపము మీ మనసులోని శుభ భావనను తగ్గించకూడదు. వారి సంస్కారం ఢీలాగా ఉంది కానీ మీలోని శుభ భావనను తగ్గించేంత పవర్‌ఫుల్‌గా అయితే వారి సంస్కారం ఉంది కదా. బ్రహ్మాబాబా ఏమేమి చూడలేదు, ఏమేమి చెయ్యలేదు, బాధ్యత ఉన్నప్పటికీ అంతిమంలో శుభ భావన, శుభ కామనలు మూడు మాటల శిక్షణను అందరికీ ఇచ్చి వెళ్ళారు. గుర్తుంది కదా! మూడు మాటలు గుర్తున్నాయి కదా! స్వయం కూడా నిరాకారి, నిరహంకారి, నిర్వికారి, ఈ స్థితిలోనే అవ్యక్తమయ్యారు, ఎవ్వరికీ కర్మభోగం యొక్క ఫీలింగ్‌ను తెప్పించలేదు, వారి కర్మభోగం సమాప్తమవుతుంది అని ఎవరికైనా అనిపించిందా! ఏమయింది! అవ్యక్తమైపోయారు. ఇటువంటి బ్రహ్మా బాబా సమానంగా ఫరిశ్తా భవ అను వరదానమేదైతే బాబా చేసి చూపించారో, ఫాలో బ్రహ్మా తండ్రి. బ్రహ్మా బాబాపై ప్రేమ ఉంది, ఇప్పుడు కూడా సాకారంలో వారిని చూడకపోయినా కానీ అవ్యక్త బాబా రూపంలో కూడా అందరికీ స్నేహం ఇచ్చారు. బాప్‌దాదా ఇద్దరిపై ప్రేమ ఉండటాన్ని చూసాము. స్నేహం సబ్జెక్టులో మెజారిటీ అందరూ పాస్ అయ్యారు. స్నేహమే నడిపిస్తుంది. ధారణ లేకపోయినాగానీ, ఏదైనా సబ్జెక్టులో లోటు ఉన్నాగానీ స్నేహము సబ్జెక్టులో మెజారిటీ అందరూ పాస్ అయ్యారు. స్నేహము నడిపిస్తుంది. మీరందరూ ఎందుకు వచ్చారు? ఏ విమానంలో వచ్చారు? స్నేహ విమానంలో చేరుకున్నారు. బాప్‌దాదాకు తన చివరి పిల్లవాడిపై కూడా ప్రేమ ఉంది. ఎలాంటివారైనా కానీ ప్రేమలో పాస్ అయ్యారు ఎందుకంటే బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరిపై హృదయపూర్వక ప్రేమ ఉంది. ఎలా ఉన్నాకానీ నా వారు. నా బాబా అని మీరంటారు కదా, మరి బాబా ఏమంటారు? నా పిల్లలు. ఇటువంటి శుభ భావన పరివారంలో పరస్పరంలో ఉండటం అవసరము. స్వభావాన్ని చూడకండి. భావ స్వభావాలు ఉన్నాయని బాబాకు తెలుసు, కానీ భావ స్వభావాలు ప్రేమను సమాప్తం చెయ్యకూడదు. సంబంధాలను సమాప్తం చెయ్యకూడదు. కార్యాన్ని తక్కువ సఫలం చెయ్యడం సరైనది కాదు. ఇది పరివారము. ఏ పరివారము? ప్రభు పరివారము, పరమాత్మ పరివారము. ఏ కారణం చేతనైనా ఇందులో ప్రేమ తగ్గకూడదు. ఇలా ఉందా? ప్రేమలో లోటు ఉందా? ప్రేమ అనగా శుభ భావన తప్పక ఉండాలి. ఎలాంటి వారైనా కానీ, ఇది పరమాత్ముని పరివారము. నేను ప్రభు పరివారానికి చెందినవాడను అని భావించినప్పుడు, పరివారము అనగా ప్రేమ. ఒకవేళ పరివారంలో ప్రేమ లేకపోతే పరివారమే లేనట్లు. కనుక, ఈరోజు ఏ పాఠాన్ని చదువుకున్నారు? పక్కా చేసుకున్నారా? ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ భావము. ఈ పరమాత్మ పరివారము ఒక్క సమయంలోనే ఉంటుంది, ఇంత పెద్ద పరివారము పరమాత్మునికి తప్ప మరెవ్వరికీ ఉండదు. కావున పరిశీలించుకోండి ఎందుకంటే ఇది పురుషార్థంలో విఘ్నంగా అవుతుంది. విఘ్నముక్తులుగా అయినప్పుడే అనుభవిగా అయ్యి అనుభవం యొక్క అథారిటీ ద్వారా అందర్నీ అనుభవిలుగా చేస్తారు. అచ్ఛా.
ఈరోజు మొదటిసారి వచ్చినవారు లేచి నిల్చోండి. చేయి ఊపండి. మొదటి సారి వచ్చిన వారికి బాప్‌దాదా విశేషమైన అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకంటే టూ లేట్‌లో కాక లేట్‌లో అయినా వచ్చారు. వచ్చిన వారందరికీ బాప్‌దాదా ఒక శుభవార్త ఏమని వినిపిస్తున్నారంటే ఒకవేళ ఆలస్యంగా వచ్చినా కానీ తీవ్ర పురుషార్థం అనగా ఎగిరే కళ యొక్క పురుషార్థాన్ని చేసి ముందుకు వెళ్ళాలనుకుంటే తీవ్ర పురుషార్థం ద్వారా ముందుకు వెళ్ళవచ్చు. కానీ తీవ్ర పురుషార్థము. సాధారణ పురుషార్థము కాదు. ప్రతిసారీ మొదటిసారి వచ్చినవారిని చూసి బాప్‌దాదా సంతోషిస్తారు. అంతేకాక పూర్తి పరివారం మిమ్మల్ని చూసి సంతోషిస్తుంది. వచ్చారు, ఏదో ఒక వారసత్వాన్ని తీసుకునే అధికారులుగా అవుతారు అందుకే బాప్‌దాదా అంటారు రండి, తండ్రి నుండి దూరమైన పిల్లలూ, రండి. అచ్ఛా.
సేవ టర్ను రాజస్థాన్ మరియు ఇండోర్ వారిది:- అచ్ఛా, ముందు ఇండోర్వారు చేతులెత్తండి. ఇప్పుడు రాజస్థాన్వారు చేతులెత్తండి. అచ్ఛా. ఇద్దరూ తమ సేవా పాత్రను చక్కగా నిర్వహించారు. అందరూ ఈ సేవా అవకాశాన్ని ఎంతో ఉల్లాస-ఉత్సాహాలతో తీసుకుంటారు, అందరూ ప్రేమతో చేయడం కూడా మరియు చేయించడాన్ని కూడా బాప్‌దాదా చూసారు. ఈ 10-15 రోజుల సేవా పాత్ర భిన్న భిన్న సంపాదనలకు సాధనము. ఒక లాభమేమిటంటే సేవ యొక్క మేవగా ప్రతి ఒక్కరికీ పుణ్యం జమ అవుతుంది. మరో లాభము, ఇక్కడ మధువన జ్ఞాన వాతావరణము, పెద్ద పరివార స్నేహ వాతావరణము ఉంటాయి, దీని ద్వారా పురుషార్థంలో కూడా బలం లభిస్తుంది. ఎందుకంటే వాతావరణం, వైబ్రేషన్లు మరియు జ్ఞాన స్నానము – వారైతే ఒక్కసారి తీర్థ స్నానాలు చెయ్యడానికి వెళ్తేనే ఎంతో పుణ్యం జమ అయిందనుకుంటారు, మరి ఇక్కడ ఎన్ని రోజులైతే ఉంటారో అన్ని రోజులు జ్ఞాన స్నానము, జ్ఞాన వాక్యాలు చెవులలో పడుతూ ఉంటాయి. యోగి ఆత్మలు, ప్రభు ప్రేమ కలిగిన ఆత్మలకు ఆ వైబ్రేషన్లు కూడా ఆటోమేటిక్‌గా అందుతూ ఉంటాయి. ఏకాంత వాతావరణం నుండి లాభం చేకూరుతుంది. ఎవరైతే తమ పనులలో, చదువులో, తమ లాభాలలో స్వయాన్ని బిజీగా పెట్టుకుంటారో వారు కొద్ది రోజుల్లోనే తమ భవిష్యత్తును ఉన్నతంగా చేసుకునే అవకాశం లభిస్తుంది. అందుకే యజ్ఞ కార్యం కూడా జరుగుతుంది మరియు వచ్చేవారికి పుణ్యం జమ అవుతూ ఉంటుంది. రెండు జోన్లు వచ్చాయి కానీ బాప్‌దాదా ఏమి చూసారంటే ఈనాటి వాతావరణంలో సేవా ఉత్సాహము మెజారిటీ అన్ని జోన్లలోనూ ఉంది. ఇండోర్ కూడా సెంటర్లను పెంచుతుంది, సందేశాన్ని ఇచ్చి బాబా పిల్లలుగా చేస్తున్నారు. రాజస్థాన్ కూడా ఇలాగే ముందుకు వెళ్తుంది. ఈరోజుల్లో సేవా అల అందరిలో ఉంది. బాప్‌దాదా కూడా ఏమని సూచిస్తున్నారంటే ఏ జోన్వారైనా, ఎక్కడ నుండి వచ్చినా, శివరాత్రి తండ్రి జన్మదినం, సేవా ఆరంభం కూడా మరియు విశేష ఆత్మల జన్మ దినం కూడా. ఎలాగైతే ప్రసిద్ధి చెందినవారి పుట్టినరోజును ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా జరుపుతుంది కదా, బాపూజీ గాంధీ పుట్టినరోజును ఎంత బాగా జరుపుకుంటారు కదా, ఆ రోజున ప్రతి ఒక్కరూ భారతదేశానికి గుర్తు అయిన జెండాను ఎగురవేయాలి అని అనుకుంటారు కదా. అలాగే ఈ విశేష జన్మ మహారథులది కూడా, తండ్రిది కూడా. మరి ఈరోజున ప్రతి ఒక్కరూ ఏమి జరుపుకోవాలి? బాప్‌దాదా సంకల్పమేమిటంటే ఈ శివరాత్రి నాడు లేక ఒక వారం ముందైనా, ఒక వారం తర్వాతైనా, ఈ రోజుల్లో మీ పరిచయస్థులకు, మీ వీధివారికి, మీ ఆఫీసులో పనిచేసే తోటివారికి, వీరికి సందేశాన్ని తప్పక ఇవ్వండి - ఒకవేళ బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటే తీసుకోండి అన్న సందేశాన్ని తప్పకుండా ఇవ్వండి. మీ వీధిలో ఎవ్వరూ కూడా మాకింత ఆలస్యంగా తెలిసిందే, కొంచెం ముందు తెలిసి ఉంటే కొద్దిగా అయినా తయారు చేసుకునేవారము, లేకపోతే చివరిలో కేవలం అహో ప్రభూ అని మాత్రమే అనగలము. మీరు వచ్చారు కానీ మేము గుర్తించలేదు అని ఫిర్యాదు చేస్తూ ఉంటారు. మరి ఈ శివరాత్రికి ఏ విధితో అయినా కానీ పరిచయస్థులకు సందేశాన్ని అందించే ఏదైనా విధిని పరస్పరం తయారు చెయ్యండి. అయినా మిగిలిఉంటే ఇక అది వారి అదృష్టం. కానీ మీరు మీ కార్యాన్ని పూర్తి చేసారు. ఇలా ఏదో విధంగా ప్రతి ఒక్కరికీ సందేశం అందాలి. నేచర్నుబట్టి, స్వభావాన్ని బట్టి మీ మీ పద్ధతులలో సందేశాన్ని తప్పకుండా ఇవ్వండి. పెద్ద రోజు, ఈరోజు మీకు శుభవార్తను వినిపిస్తాము. అప్పుడు ఈ ఫిర్యాదు ఉండదు. ఇప్పుడు కూడా మీరు ఏదైనా ప్రోగ్రాములు చేస్తే ఏమంటారు? మాకైతే ఇప్పుడే తెలిసింది, మీరు ముందే ఎందుకు చెప్పలేదు అని కొందరు అంటారు కదా. అందుకే ఇది పిల్లలది మరియు బాప్‌దాదా జన్మ దినము, పాతవారు తమ జన్మదినాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? శివరాత్రి జరుపుకుంటారు కదా? శివరాత్రి జరుపుకుంటారు కదా! మరి ఇంతమంది యొక్క జన్మదినాన ఈ సందేశాన్ని అందించే మిఠాయిని అందరికీ పంచండి. సరేనా! పంచుతారా! చేతులెత్తండి. ఎవ్వరూ వంచితమవ్వకూడదు. ఏ విధి అయినా ఫర్వాలేదు, ఫంక్షన్ చెయ్యండి, పోస్ట్ ద్వారా పంపండి, కానీ ఎవ్వరూ మిగలకూడదు. ఏ సాధనం ద్వారా అయినా కానీ అందరికీ సందేశాన్ని అందించాలి. మీరు పరస్పరం సలహాలు తీసుకుని మూడు నాలుగు పద్ధతులను తయారు చెయ్యండి. వర్గంవారు కూడా తమ కనెక్షన్లో ఉన్నవారందరికీ శివరాత్రి మహత్వాన్ని తెలిపే సందేశాన్ని ఇవ్వండి. ఇష్టమేనా? అచ్ఛా.
గ్రామగ్రామాలలో కూడా, గ్రామాలలో ఉండే వారిలో ఎవరో ఒకరు బ్రాహ్మణులుగా అయితే మారి ఉంటారు కదా, వార్కి వారి గ్రామంలో వారి ద్వారా ఏదో ఒక రీతిలో, కావాలంటే కరపత్రాలను పంచండి, కావాలంటే వారి సమ్ముఖంలోకి వెళ్ళండి, కానీ సందేశాన్ని తప్పకుండా ఇవ్వండి. ఈ శివరాత్రి అంటే ఏమిటి అని ఇంటింటికీ తెలియాలి. ఈ విషయంలో ఏ జోన్ ఏ నంబరు తీసుకుంటుందో చూస్తాము. లెక్క ఉంచండి. బాప్‌దాదా రిజల్టు చూస్తారు, ఎంతమందికి కరపత్రాలను పంచారు, ఎంతమందిని ప్రత్యక్షంగా కలిసారు, అంతా రిజల్టును తీసి పెట్టండి. ప్రతి ఒక్కరూ బిజీగా ఉండాలి, ఎవ్వరూ ఫ్రీగా ఉండకూడదు. అచ్ఛా.
ఇండోర్ మరియు రాజస్థాన్:- ఇరువురి విశేషత - బ్రహ్మా బాబాకు ప్రియమైనవారు. బ్రహ్మా బాబా ద్వారా ఇండోర్‌కు పునాది ఏర్పడింది మరియు రాజస్థాన్‌లో బ్రహ్మా బాబా మరియు బాప్‌దాదా ద్వారా మొదటి మ్యూజియం తయారు చెయ్యబడ్డది. కావున ఇరువురూ బ్రహ్మా బాబాకు, బాబాకు ఎలాగూ ప్రియమైనవారు, కానీ విశేషంగా బ్రహ్మా బాబాకు ప్రియమైనవారు. మరి బ్రహ్మా బాబా ఛత్రఛాయ ఇద్దరిపై సదా ఉంటుంది. అన్ని జోన్లపై సదా ఉంటుంది కానీ వీరిది విశేషత ఉంది. సందేశి వెళ్ళినప్పుడు అడ్వాన్స్ పార్టీ ఇమర్జ్ అయితే బ్రహ్మా బాబా వారితో జరిగే ఆత్మిక సంభాషణలో ఆరంభంలో జరిగిన విషయాల చర్చను చేస్తారు. మీ అందరి మహారథి, ఎవరైతే స్థాపన కార్యంలో నిమిత్తమై ఉన్నారో, ఇటువంటి అనేక తోటివారు, అడ్వాన్స్ పార్టీలో నిమిత్తమైనవారు వారితో బాప్‌దాదా సదా ఆది విషయాలను సంభాషిస్తూ ఉంటారు. బాప్‌దాదా మరియు అడ్వాన్స్ పార్టీలది ఒకటే సంకల్పం - ఇప్పుడిక ఎప్పుడు ద్వారాలు తెరవడానికి వస్తారు! ఎందుకంటే కేవలం అడ్వాన్స్ పార్టీ తెరవలేదు, బాప్‌దాదా కూడా తెరవలేరు. కలిసే తెరుస్తారు. మరి అడ్వాన్స్ పార్టీవారు మరియు బాప్‌దాదా ఏమని అడుగుతున్నారంటే అందరూ నిరాకారి ఫరిశ్తా స్వరూపంలో ఎప్పటివరకు ఎవరెడీగా అవుతారు! ఈమధ్యలో ప్రకృతి కూడా చాలా పిలుస్తుంది, భారం చాలా పెరుగుతూ ఉంది. మనసుది కూడా, శరీరానిది కూడా. అందుకే అందరూ ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు కొంచెం కొంచెం తమ ఎవరెడీ దృశ్యాలను చూపించండి. ఆ దృశ్యాలు ఎక్కువలో ఎక్కువ సమయము లేక ఫరిశ్తా రూపము లేక నిరాకారి రూపము, ప్రాక్టికల్‌లో తమది ప్రత్యక్షం చేసుకోండి. గుప్త పురుషార్థం చేస్తున్నారు కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపించాలి, మీ మస్తకం ద్వారా లైట్ యొక్క ప్రకాశం అనుభవం కావాలి. నయనాలతో ఆత్మిక శక్తి అనుభవం కావాలి. నోటితో, ముఖంతో మధురత, చిరునవ్వు చిందించే ముఖం అనుభవం కావాలి. తారీఖు అడిగితే అందరూ ఆలోచనలో పడ్తారు ఎందుకంటే సంగఠన రూపంలో మహావీరులెవరైతే ఉన్నారో, తీవ్ర పురుషార్థీలు సంగఠిత రూపంలో వెళ్ళాలి. ముందు వెనుక వెళ్ళకూడదు. ముందుగా ఇక్కడ ఎవరెడీ రూపము ప్రత్యక్షం కావాలి, దీనిద్వారా బాప్‌దాదా మరియు కార్యము ప్రత్యక్షం కావాలి. కావున ఇప్పుడు తీవ్ర పురుషార్థం చెయ్యండి, ఒకరికొకరు సహయోగాన్ని అందించుకోండి, ముందుకు తీసుకువెళ్ళండి. బలహీనులకు ఆధారాన్ని ఇవ్వండి. ఇటువంటి సంగఠనను తయారు చెయ్యండి. అచ్ఛా.
గ్రామ వికాస వింగ్, సైన్సు ఇంజినీర్ వింగ్ మరియు స్పార్క్ వింగ్ యొక్క మీటింగ్ జరుగుతుంది:- అందరూ తమ పరిచయాన్ని మంచిగా ఇస్తున్నారు. (ప్రతి వింగ్ వారు తమ బ్యానర్‌ను చూపిస్తున్నారు) అచ్ఛా, మూడు వర్గాల సమాచారాన్ని బాప్‌దాదా విన్నారు. ఇప్పుడు వచ్చిన మూడు వర్గాలు పరస్పరంలో మంచి ప్రగతిశీల మీటింగ్‌ను చేసుకున్నారు. మీటింగ్‌లో తమ భవిష్య ప్లాన్లను కూడా తయారు చేసుకున్నారు. ఈరోజుల్లో వర్గంవారు సేవలో ప్రతి ఒక్కరూ నంబర్‌వన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఇందుకు బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఈ తీవ్ర పురుషార్థం యొక్క ఉల్లాస ఉత్సాహాలను చూసి బాప్‌దాదా అన్ని వర్గాలవారికి, ముఖ్యంగా ఈ మూడింటికి పదమారెట్ల అభినందనలు తెలుపుతున్నారు. ప్లాన్ మంచిగా చేసారు. మంచిగా చేసారు, ఉల్లాసంతో చేసారు. అందుకే బాప్‌దాదా ముగ్గురికీ ఏమంటున్నారంటే ఏ ప్లాన్లనైతే చేసారో వాటిని చాలా త్వరగా ప్రాక్టికల్లోకి తీసుకురండి. బాప్‌దాదాకు నచ్చాయి. కేవలం మధ్య-మధ్యలో, ఈరోజుల్లో అయితే పరస్పరం కాన్ఫరెన్సు చేసుకోవడానికి ఫోన్ సిస్టమ్ కూడా ఉంది. ప్రతి వర్గానికి విశేషంగా నిమిత్తమైనవారు మధ్య మధ్యలో ఫోన్ కాన్ఫరెన్సు ద్వారా కూడా ఉత్సాహాన్ని పెంచవచ్చు. ఎందుకంటే తమ తమ పట్టణాలలో ఉల్లాస ఉత్సాహాలను ఇచ్చినట్లయితే మీటింగ్‌లో ఉన్నప్పుడు వచ్చిన ఉత్సాహంలా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో రిజల్టును అడుగుతూ వారిని కూడా ఉత్సాహంలోకి తీసుకురండి. బాగుంది.
ఈ బోర్డును (బ్యానర్) పబ్లిక్ వైపుకు తిప్పండి. నేచర్ గురించి కూడా అందరికీ ఈరోజుల్లో చింత ఉంది. కనుక, మీరు విశేషంగా సందేశాన్ని ఇవ్వండి, మనసు యొక్క నేచర్ ద్వారా ప్రకృతి నేచర్‌ను ఎలా మార్చవచ్చు? ప్లాన్ తయారు చేసారు కానీ ప్రతి స్థానము కలిసి ప్రోగ్రాము ద్వారా అనౌన్సు చెయ్యండి, చిన్న చిన్న ప్రోగ్రాములు కూడా చెయ్యండి కానీ సందేశాన్ని అందించండి. ఇప్పుడు ఏ ప్రోగ్రాములైతే జరుగుతున్నాయో అందులో సందేశాన్ని అందించిన పద్ధతి చాలా బాగుండటాన్ని బాప్‌దాదా చూసారు. ఇకమీదట కూడా ఏదైతే చేస్తారో అందులో కూడా నిమిత్తమైన సేవాధారుల సలహాను తీసుకుని ప్రోగ్రామును చక్కగా నడిపించండి. ఎక్కడకు వెళ్ళినా కానీ, విశేషమైన స్థానాలు కావచ్చు లేక చిన్న చిన్న స్థానాలు కావచ్చు, బ్రహ్మాకుమారీలు ఏదో ప్రోగ్రాము చేస్తున్నారు. శాంతిగా కూర్చుండిపోకండి, ఇప్పుడు ఉల్లాస ఉత్సాహాలతో సందేశాన్ని అందించండి. ఇప్పుడు దగ్గరకు వచ్చే సమయము. వాతావరణము ఇప్పుడు వైరాగ్య వృత్తిది కావున నవీనతను చూడాలని, వినాలని ఆశగా ఉంది. పరస్పరంలో సలహాలను తీసుకుని మరింత ఉల్లాస ఉత్సాహాలతో నలు వైపుల సందేశాన్ని అందించండి. దేశంలోని ముఖ్య స్థానాలలో ఒకేసారి సందేశం అందాలి, ప్రతి ముఖ్య స్థానంలో వార్తాపత్రికల్లో రావాలి, ఇది జరిగింది, ఇది జరిగింది... ఇది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు... రేడియో కావచ్చు, టి.వి కావచ్చు, అన్ని వైపుల నుండి సందేశాన్ని అందించండి. తమ తమ ఏరియాలలో కూడా టి.వి ద్వారా, రేడియో ద్వారా సందేశాన్ని వ్యాపింపజేయవచ్చు. అచ్ఛా. చాలా చాలా అభినందనలు. వర్గంవారు ఈరోజుల్లో ఉత్సాహంతో చేస్తున్నారు. ఇంకా చేస్తూ ఉండండి. అచ్ఛా.
సింధీ గ్రూపు:- సింధీ గ్రూపువారు చేతులెత్తండి. ఈ ఉత్సాహము, సేవా విధానము చాలా బాగున్నాయి. బాప్‌దాదా విశేషంగా ఇందుకు నిమిత్తమైనవారికి అభినందనలు తెలుపుతున్నారు ఎందుకంటే ఈ కారణంగా అందరికీ సందేశం అందింది కదా. రావడం ఎంతమంది వచ్చినాకానీ పరిచయం ఎంతమందికి లభించింది! ఇతరులందరికీ మీ ఈ సాధనము మంచిగా అనిపిస్తుంది. సేవ కూడా జరిగింది, జరుపుకోవడం కూడా జరిగింది. డబల్ పని అయిపోయింది. తోడుగా ఎవరైతే ఉన్నారో వారి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. బాగుంది. బాబాకు, శివబాబాకు తమ అవతరణ స్థానంగా ఏదంటే ఇష్టము? సింధ్ నచ్చింది కదా! మరి అదృష్టం కదా! అవతరణ స్థానానికి ఎంతటి మహత్వం ఉంటుంది! ధర్మపితల జన్మస్థానానికి ఎంత మహత్వముంటుంది. మరి సింధు జన్మ భూమికి కూడా తన మహత్వముంది. ఇప్పుడు వీరు ప్రోగ్రాము చేస్తున్నారు, జనక్ ప్రోగ్రాము తయారు చేస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా మీ పరిచయస్థులకు, అక్కడ కూర్చున్నవారికి సందేశాన్ని అందించండి. ఒకవేళ సందేశం అంది ఉంటే వారికి చెప్పండి, ఇప్పుడు ఈ స్థానము తన స్థానాన్ని సంపాదించుకుంది. చిన్నదాని నుండి పెద్దగా అయిపోతుంది. కానీ బాప్‌దాదా ఈ అటెన్షన్‌ను ఇప్పిస్తున్నారు - ఏ సమయము వెళ్తారో అప్పటి వాతావరణాన్ని తెలుసుకొని తర్వాత అడుగులు వెయ్యండి ఎందుకంటే వీరు మారడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇకపోతే అంతా మంచిగా ఉంది, జన్మస్థానం చోట ప్రత్యక్షం జరగాలి. ఏ ధర్మానికి చెందినవారైనా కానీ ఒకే తండ్రి సంతానము. తండ్రి సందేశాన్ని వినడానికి అందరికీ హక్కు ఉంది. మీ ఈ ప్లాన్ చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఇక్కడకు వచ్చినవారందరికీ బాప్‌దాదా విశేషంగా అభినందనలు తెలుపుతున్నారు. అభినందనలు, అభినందనలు, అభినందనలు.
డబల్ విదేశీయులు:- డబల్ విదేశీయులు ఛాన్సును తీసుకోవడంలో తెలివైనవారు అని బాప్‌దాదా చూసారు. ఎక్కడి నుండైనా వచ్చేస్తారు, తమ తమ సేవా ప్లాన్లను మంచిగా తయారు చేసుకుని తమ సంగఠనను కూడా పటిష్ఠ పరుచుకుంటారు. మంచి స్థానాన్ని వెతికి పట్టుకున్నారు. బాబాను కూడా కలవడము, పరివారాన్ని కూడా కలవడము మరియు స్వ ఉన్నతి కూడా చేసుకోవడము. ఇది బాప్‌దాదాకు నచ్చింది. విదేశీయులు ఎటువంటి సాంపుల్‌గా అయి చూపించాలంటే ఎవరు ఏ దేశంలో నిమిత్తులో ఆ దేశంలో ఏ సెంటరు ఉంటుందో, ఎన్ని సెంటర్లు ఉంటాయో అవి నిర్విఘ్నంగా అయ్యే ఉదాహరణగా తయారు చేసి చూపించండి. నంబరును తీసుకోండి. ఇండియా జోన్ కూడా పురుషార్థం చేస్తుంది, ఇప్పుడు అనౌన్సు కాలేదు కానీ మీరు నంబరు తీసుకోండి. ఎవరైనా తీసుకోవచ్చు. మంచి ధైర్యం ఉంది, సహయోగం కూడా మంచిగా లభించి ఉంది. ఎవరినైతే తయారు చేస్తారో వారి బాకింగ్ (ఫాలో అప్) చేస్తారు, అనగా ఇండియన్ భాషలో తదుపరి పర్యవేక్షణ అనంటారు. కనెక్షన్ పెట్టుకుని ఏదో ఒక సాధనముతో కనెక్షన్లో ముందుకు వెళ్తారు. బాగుంది. ఉల్లాస ఉత్సాహాల అలను వ్యాపింపజేస్తూ ఉంటారు మరియు ప్రతి సంవత్సరము ఏదో ఒక విశేషతను జత చేస్తూ కూడా ఉంటారు. అందుకే బాప్‌దాదా పదమారెట్ల అభినందనలను ఇస్తున్నారు.
ఇప్పుడు ఇండోర్ ఏమి చేస్తుంది? ఎవరైనా ఉదాహరణగా, నంబర్‌వన్‌గా అయి చూపిస్తారా? ఇండోర్ అయినా రాజస్థాన్ అయినా చెయ్యండి, నంబరును తీసుకోండి. ధైర్యముందా? ధైర్యము ఉంది కదా? బాప్‌దాదాను తోడుగా అయితే చేసుకున్నారు. కనుక బాప్‌దాదా తోడుగా ఉన్నారు, కేవలం నిమిత్తంగా కావాల్సి ఉంది. అచ్ఛా. బాప్‌దాదా పిల్లలందరిలోని విశేషతలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సబ్జెక్టులో విశేషత దాగి ఉంది అందుకే బాప్‌దాదా ఇన్డివిడ్యువల్గా ఒక్కొక్కరిని కాబోయే విజయి స్వరూపంలో చూస్తున్నారు ఎందుకంటే అందరినీ తోడుగా చేసుకుని నడవాల్సి ఉంటుంది. తోడుగా ఉన్నారు, తోడుగా నడుస్తారు. బ్రహ్మా బాబాతో పాటు రాజ్యం చేస్తారు. అచ్ఛా.
నలువైపుల ఉన్న పిల్లలను చూసి బాప్‌దాదా సంతోషంతో వాహ్ పిల్లలు వాహ్! అన్న పాటను పాడుతున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో బాబా ఉన్నారు మరియు బాబా హృదయంలో పిల్లలందరూ ఉన్నారు. ఇక్కడ ఇంతటి పరివారాన్ని, మధువన నివాసులను చూసి వాహ్ మధువనం వాహ్! అన్న సంతోషం కూడా కలుగుతుంది. అందరి ఆశ్రయ స్థానం మధువనమే అందుకే మధువనానికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు బాబా ఆశను త్వరత్వరగా పూర్తి చెయ్యాలి. నాలుగు సబ్జెక్టులలోనూ అనుభవి స్వరూపులుగా అవ్వాల్సిందే. దేశ విదేశాలలోని నలువైపుల ఉన్న పిల్లలు, ఎక్కడ కూర్చున్నాగానీ బాప్‌దాదా చూస్తున్నారు. అందరూ చూసి ఎంతో సంతోషిస్తున్నారు. ఈ సాధనాలు, ఈ సైన్సు ఈ సమయంలో ఉన్నతిలోకి వెళ్తున్నాయి, క్రొత్త క్రొత్త ఇన్వెన్షన్లు ప్రపంచంలో చేస్తున్నారు, మీ లాభం కోసం అనేక మంచి మంచి సాధనాలను తయారు చేస్తున్నారు. పిల్లలు దూరంగా ఉన్నప్పటికీ తోడుగా ఉన్నారు. కనుక ఈ సాధనాలను తయారు చేసినందుకు సైన్సువారికి కూడా అభినందనలు. అచ్ఛా. దేశ విదేశాలలోని పిల్లలందరూ చాలా-చాలా హృదయపూర్వక ప్రేమ మరియు స్మృతిని స్వీకరించండి మరియు విశేషంగా ఇటువంటి విశేషమైన పిల్లలకు నమస్తే.
దాదీలతో:- ఉల్లాస ఉత్సాహాలు మంచిగా ఉన్నాయి, ఏర్పాట్లు కూడా లభిస్తున్నాయి. ఈ సాధనాలు మీ సమయంలోనే వెలువడ్డాయి, మీకే సుఖం లభిస్తుంది. వారు వినాశనం గురించే మాట్లాడుతున్నారు, మీరు లాభాన్ని పొందుతున్నారు. బాగుంది.
మోహిని అక్కయ్య ముంబయి ఆసుపత్రిలో ఉన్నారు, వారు విశేష స్మృతిని పంపారు:- ఇప్పుడు సరి చేసుకోవడంలో పడ్డారు కదా, మంచిగా నయం చేసుకునే రండి. గుర్తుకైతే వస్తారు కానీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి కదా. బాప్‌దాదాను కూడా స్మృతి చేస్తున్నారు, బాప్‌దాదా వద్దకు స్మృతి చేరుకుంటుంది. వారికి విశేష ప్రియ స్మృతులను అందించండి.
దాదీ నిర్మల్శాంతతో:- మీ ధైర్యము శరీరాన్ని నడిపిస్తుంది. తండ్రి సహాయం చేసేవారు మరియు మీ ధైర్యము కూడా ఉంది.
రతన్ మోహిని దాదీతో:- ఎగిరింపజేస్తూ ఉన్నారు, ఎగురుతూ ఉన్నారు.
శాంతమణి దాదీతో:- బాగున్నారు, సంతోషంగా ఉన్నారు. చాలా మంచిగా దృష్టిని తీసుకుంటున్నారు.
ముగ్గురు అన్నయ్యలతో:- ముగ్గురూ కలిసి శివరాత్రి ప్లాన్‌ను తయారు చెయ్యండి. విశేష స్థానాలలో ఒకే సమయంలో ఒకే విధంగా తమ తమ దగ్గర చెయ్యండి, కానీ ముఖ్య స్థానాలలో అడ్వర్టైజ్ చెయ్యండి. అన్ని స్థానాలలో ఉండాలి. ఎందుకంటే ముఖ్య స్థానాలలో ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేసి పెట్టవచ్చు. ఎలా అయితే ఒకే సమయంలో పెద్ద ప్రోగ్రామును చేసారు కదా అలా శివరాత్రి ప్రోగ్రాము ప్రతి స్థానంలో జరగాలి మరియు అన్ని స్థానాల గురించి ముందు చూపించినట్లుగా (టి.వీలో) చూపించండి.
మద్రాసు ప్రోగ్రాము చాలా మంచిగా అయింది:- ఇందులో కూడా ఏదైనా ఎడిషన్ చెయ్యాలన్నా లేక నవీనతను తీసుకురావాలన్నా పరస్పరంలో మీటింగ్ చేసుకుని దానిని కూడా ముందుకు తీసుకు వెళ్ళవచ్చు. నిమిత్తంగా ఉన్నారు, నిమిత్తంగా అయి కార్యాన్ని మంచిగా చేస్తున్నారు కానీ ఇందులో ఎడిషన్ చెయ్యాలంటే చెయ్యవచ్చు.
నిజార్ అన్నయ్యతో:- మంచిది, అభినందనలు. ప్రోగ్రామైతే మంచిగా జరుగుతుంది. అయినప్పటికీ పరస్పరంలో సలహాను తీసుకుని ఏదైనా ఎడిషన్ చెయ్యాలంటే ఎడిషన్ చేయండి. చెయ్యండి, నడిపిస్తూ ఉండండి. ఏదైనా సలహా ఉంటే దానిని వినండి, ఒకవేళ నచ్చితే దానిని ముందుకు తీసుకువెళ్ళండి. ఇకపోతే అంతా బాగుంది. మీటింగ్‌లో ఏదైనా సలహాను ఇవ్వండి, తర్వాత అందరూ కలిసి దేనినైతే ఫైనల్ చేస్తారో దానిని చేసి చూడండి.
డైమండ్ హాల్లో క్రొత్త స్క్రీన్ పెట్టడం జరిగింది, దానిని బాప్‌దాదా చూస్తున్నారు:- అందరూ సంతోషంతో ఎగురుతున్నారు. అందరూ ఒక్కొక్కరుగా ఎగురుతూ ఉండటాన్ని బాప్‌దాదా చూస్తున్నారు. అచ్ఛా!
ఓంశాంతి