Search for a command to run...
12 Oct 2018
“సదా స్నేహిగా ఉండటంతోపాటు అఖండ మహాదానిగా అవ్వండి అప్పుడు విఘ్న వినాశకులుగా, సమాధాన స్వరూపులుగా అవుతారు”
12 October 2018 · తెలుగు
ప్రాణప్రదమైన అవ్యక్త బాప్‌దాదాకు అతి స్నేహులు, సదా పరమాత్మ ప్రేమకు పాత్రులు, స్నేహము అనే అలౌకిక విమానము ద్వారా మూడు లోకాల షికారు చేసేవారు, అఖండ ఖజానాలకు యజమానులు, సర్వ నిమిత్త సేవాధారి టీచర్ అక్కయ్యలు మరియు దేశవిదేశాలలోని సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదరీసోదరులు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని మధుబన్ ఇంటి నుండి స్వీకరించండి.
తర్వాత సమాచారము - ప్రియమైన బాప్‌దాదాతో అలౌకిక మిలనం జరుపుకునే సీజన్ ప్రారంభమయింది. ఈ మొదటి టర్నులో నలువైపుల నుండి డబల్ విదేశీ సోదరసోదరీలు చేరుకున్నారు. గత 4 రోజుల నుండి జ్ఞానయోగాల లోతైన క్లాసులు, భిన్న భిన్న అంశాలపై వర్క్‌షాపులు, యోగ తపస్సు యొక్క అనుభూతులు జరుగుతున్నాయి. సేవలకు మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ నుండి సోదరసోదరీలు చేరుకున్నారు. ఈరోజు 12వ తారీఖు విశేషంగా అవ్యక్త మిలనం చేసుకునే రోజు. ఉదయం నుండే అందరూ మనసు మరియు నోటి మౌనాన్ని పాటిస్తూ అవ్యక్త మిలనపు షికారును చేస్తున్నారు. నలువైపుల చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. నలువైపుల శ్వేత వస్త్రాలను ధరించిన ఫరిశ్తాలు శాంతివన్ విశాల ప్రాంగణంలో సంచరిస్తూ కనిపించారు.
అందరి మనసులలో ప్రియమైన బాప్‌దాదాతో పాటు మధురమైన దాదీ గుల్జార్‌గారు కూడా గుర్తుకు వస్తున్నారు. గత 49 సంవత్సరాల నుండి దాదీగారి ద్వారా ప్రియమైన అవ్యక్త బాప్‌దాదా పిల్లలైన మనలను అనేకానేక వరదానాలతో నింపారు. జ్ఞాన రత్నాల తరగని ఖజానాను ఇచ్చారు. ప్రస్తుతం దాదీగారు ముంబయి గామ్దేవి సేవాకేంద్రంలో ఉన్నారు. మనందరి సూక్ష్మ ప్రేమ నిండిన సకాశ్ దాదీగారిని అతి శీఘ్రంగా శాంతివనానికి తీసుకువస్తుంది, ఇటువంటి శుభ భావనలు బాప్‌దాదా వద్దకు చేరుకుంటున్నాయి. పిల్లల ఆశను బాబా తప్పకుండా పూర్తి చేస్తారు. ఈ రోజు క్లాసు తర్వాత విశేషంగా బాప్‌దాదాకు భోగ్‌ను స్వీకరింపజేయడం జరిగింది. తర్వాత ప్రాణప్రదమైన అవ్యక్త బాప్‌దాదా యొక్క 31-10-06 విశేష మహావాక్యాలను, డబల్ విదేశీ పిల్లల కోసం బాప్‌దాదా ఉచ్ఛరించిన మహావాక్యాలను వీడియో ద్వారా అందరూ విన్నారు. ఎంతో శక్తిశాలి యోగ వాతావరణం నెలకొంది. అందరూ పరమాత్మ స్నేహములో ఇమిడిపోయి ఉన్నారు. మురళి తర్వాత మధురవాణి గ్రూపువారు ప్రియమైన బాప్‌దాదా మధుబన పూదోటలోకి సాకార రూపంలో పిల్లలను కలుసుకోవడానికి విచ్చేయాలంటూ స్నేహభరిత పాటను పాడారు. ఆ తర్వాత దాదీలు మరియు అన్నయ్యలు తమ భావాలను వినిపించారు. ఈ గ్రూపులో విదేశాల నుండి చాలామంది క్రొత్త పిల్లలు వచ్చారు. వారిని కూడా బాప్‌దాదా వతనం నుండి విశేషంగా సర్వ శక్తులతో, వరదానాలతో నింపుతున్నారు. వీడియో ద్వారా మనందరం విన్న అవ్యక్త మహావాక్యాలను మీ వద్దకు పంపుతున్నాము. మీ మీ క్లాసులలో వినిపించండి.
12-10-18 ఓం శాంతి వీడియో ద్వారా రివైజ్ 31-10-06 మధువనం
“సదా స్నేహిగా ఉండటంతోపాటు అఖండ మహాదానిగా అవ్వండి అప్పుడు విఘ్న వినాశకులుగా, సమాధాన స్వరూపులుగా అవుతారు”
ఈరోజు పరమాత్మ ప్రేమకు పాత్రులైన తన పిల్లలను కలుసుకోవడానికి ప్రేమ సాగరుడు వచ్చారు. మీరందరూ కూడా స్నేహము అనే అలౌకిక విమానంలో ఇక్కడకు చేరుకున్నారు కదా! సాధారణ విమానంలో వచ్చారా లేక స్నేహమనే విమానంలో ఎగిరి వచ్చారా? అందరి హృదయాలలో స్నేహపు అలలు ఎగిసిపడుతున్నాయి. స్నేహమే ఈ బ్రాహ్మణ జీవితానికి పునాది. మరి మిమ్మల్ని స్నేహమే ఆకర్షించింది కదా! జ్ఞానమైతే తర్వాత విన్నారు, కానీ స్నేహము పరమాత్మ స్నేహిగా చేసింది. మేము పరమాత్మ స్నేహానికి పాత్రులమవుతామని స్వప్నంలో కూడా అనుకోలేదు కదా. మరి ఇప్పుడు ఏమంటారు? పాత్రులైపోయాము. స్నేహము కూడా సాధారణ స్నేహము కాదు, హృదయపూర్వక స్నేహము, ఆత్మిక స్నేహము, సత్యమైన స్నేహము, నిస్వార్థ స్నేహము. ఈ పరమాత్మ స్నేహము ఎంతో సహజంగా స్మృతిని అనుభవం చేయిస్తుంది. స్నేహితుడిని గుర్తు చెయ్యడం కష్టం కాదు, మర్చిపోవడం కష్టం. స్నేహము ఒక అలౌకిక అయస్కాంతం వంటిది. స్నేహము సహజ యోగిగా చేస్తుంది, శ్రమ నుండి విడిపిస్తుంది. స్నేహంతో గుర్తు చెయ్యడం కష్టమనిపించదు. ప్రేమ యొక్క ఫలితాన్ని తింటారు. స్నేహానికి గుర్తుగా నలువైపుల పిల్లలు ఉన్నారు కానీ డబల్ విదేశీయులు పరుగు పరుగున చేరుకున్నారు. చూడండి, 90 దేశాల నుండి ఎలా పరిగెత్తుకుంటూ చేరుకున్నారో! దేశం పిల్లలైతే ప్రభు ప్రేమకు పాత్రులుగా ఉన్నారు. ఈరోజు విశేషంగా డబల్ విదేశీయులుకు సువర్ణావకాశం. మీ అందరికీ కూడా విశేషమైన ప్రేమ ఉంది కదా! స్నేహము ఉంది కదా! ఎవరితోనైనా పోల్చగలరా? దీనికి పోలిక లేదు. మీ వద్ద ఒక పాట ఉంది - ఆకాశంలో ఇన్ని తారలు లేవు, సముద్రంలో అంత జలము లేదు... అనంతమైన ప్రేమ, అనంతమైన స్నేహము.
బాప్‌దాదా కూడా స్నేహి పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు. పిల్లలైన మీరంతా ఎంతో స్నేహంతో గుర్తు చేసారు, బాప్‌దాదా మీ ప్రేమకు బద్ధుడై వచ్చేసారు. ఇప్పుడు అందరి ముఖాలపై స్నేహపు రేఖలు మెరుస్తున్నాయి, మరి ఇప్పుడు దీనితో పాటు ఇంకేది ఎడిషన్ (జత) చేయాలి? స్నేహమైతే ఉంది, ఇదైతే పక్కా, పిల్లలకు స్నేహము ఉంది అని బాప్‌దాదా కూడా సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏమి చెయ్యాలి? అర్థమయింది కదా! ఇప్పుడు కేవలం అండర్లైన్ చెయ్యండి - సదా స్నేహిగా అవ్వాలి, సదా. సమ్‌టైమ్ (అప్పుడప్పుడు) కాదు. ఎడతెగని స్నేహము ఉంది కానీ శాతంలో తేడా వస్తుంది. మరి ఈ తేడాను తొలగించే మంత్రం ఏమిటి? ఇప్పుడు మహాదానిగా, అఖండ దానిగా అవ్వండి. సదా దాత పిల్లలు విశ్వ సేవాధారి సమానము. ఏ సమయంలోనూ మాస్టర్ దాతగా అవ్వకుండా ఉండవద్దు ఎందుకంటే విశ్వ కళ్యాణ కార్యములో బాబాతో పాటు మీరు కూడా సహయోగిగా అవుతాము అని సంకల్పం చేసారు. మనసు ద్వారా శక్తుల దానము లేక సహయోగాన్ని ఇవ్వండి, వాచ ద్వారా జ్ఞాన దానమును ఇవ్వండి, సహయోగమును ఇవ్వండి. కర్మ ద్వారా గుణాల దానమును ఇవ్వండి మరియు స్నేహ సంపర్కము ద్వారా సంతోషాన్ని దానం చెయ్యండి. ఎన్నో అఖండ ఖజానాలకు యజమాని మీరు, రిచెస్ట్ ఇన్ ది వరల్డ్. తరగని మరియు అఖండ ఖజానాలు ఉన్నాయి. ఎంత ఇస్తూ ఉంటారో అంతగా పెరుగుతూ ఉంటాయి. తరగవు, పెరుగుతాయి. వర్తమాన సమయంలో ఈ ఖజానాలలో మెజారిటీ మీ ఆత్మిక సోదరసోదరీలు దప్పికతో ఉన్నారు. మీ సోదరసోదరీలపై దయ కలగడం లేదా! దప్పికతో ఉన్న ఆత్మల దప్పికను తీర్చరా? ‘‘ఓ మా దేవీదేవతలారా, మాకు శక్తిని ఇవ్వండి, సత్యమైన ప్రేమను ఇవ్వండి” అన్న మాటలు మీ చెవులకు వినిపించడం లేదా? మీ భక్తులు మరియు దుఃఖి ఆత్మలు ఇద్దరూ - దయ చూపండి, కృప చూపండి, ఓ కృపా దేవి దేవతల్లారా అంటూ మొర పెట్టుకుంటున్నారు. సమయపు పిలుపు వినిపిస్తుంది కదా. ఇప్పుడు సమయము కూడా ఇచ్చే సమయము. ఇంకెప్పుడు ఇస్తారు? మీ వద్ద ఉన్న ఇంత తరగని, అఖండ ఖజానాలను ఇంకెప్పుడు ఇస్తారు? చివరి సమయంలో, అంతిమ సమయంలో ఇస్తారా? ఆ సమయంలో కేవలం అంచలి (కొంచెం) మాత్రమే ఇవ్వగలరు. మీ వద్ద జమ అయి ఉన్న ఖజానాలను ఎప్పుడు కార్యంలోకి తీసుకువస్తారు? ప్రతి సమయము ఏదో ఒక ఖజానాను సఫలం చేస్తున్నానా అని పరిశీలించుకుంటూ ఉండండి. ఇందులో డబల్ లాభము ఉంది. ఖజానాలను సఫలం చేయడం వలన ఆత్మల కళ్యాణము కూడా అవుతుంది దానితో పాటు మీరందరూ మహాదానిగా ఉన్న కారణంగా విఘ్న వినాశకులుగా, సమస్య స్వరూపులుగా కాక సమాధాన స్వరూపులుగా సహజంగా అవుతారు. డబల్ లాభము ఉంది. ఈరోజు ఇది వచ్చింది, రేపు ఇది వచ్చింది, ఈ రోజు ఇది జరిగింది, రేపు అది జరిగిపోయింది... విఘ్న ముక్తులు, సమస్య ముక్తులుగా సదా కోసం అవుతారు. సమస్య వెనుక మీరు వెచ్చించే సమయము, శ్రమ, ఒక్కోసారి ఉదాసీనులుగా ఉంటారు, ఒక్కోసారి ఉల్లాసంగా ఉంటారు, దీని నుండి రక్షింపబడతారు. బాప్‌దాదాకు కూడా పిల్లలు శ్రమపడితే ఇష్టముండదు. పిల్లలు శ్రమపడుతుండటాన్ని బాప్‌దాదా చూసినప్పుడు పిల్లల కష్టాన్ని బాప్‌దాదా చూడలేరు. కనుక శ్రమముక్తులు. పురుషార్థం చేయాలి కానీ ఏ పురుషార్థం? ఇంకా ఇప్పటి వరకు మీ చిన్న చిన్న విషయాలలోనే పురుషార్థం చేస్తూ ఉంటారా? ఇప్పుడు అఖండ మహాదాని, అఖండ సహయోగిగా అయ్యే పురుషార్థం చెయ్యండి. బ్రాహ్మణులకు సహయోగులుగా అవ్వండి మరియు దుఃఖి ఆత్మలకు, దప్పికతో ఉన్న ఆత్మలకు మహాదానిగా అవ్వండి. ఇప్పుడు ఈ పురుషార్థం యొక్క ఆవశ్యకత ఉంది. ఇష్టమే కదా! ఇష్టమేనా? వెనుక ఉన్నవారికి ఇష్టమేనా? ఇప్పుడు ఏదైనా మార్పు తీసుకురావాలి కదా. స్వ కోసం ఎంతో సమయాన్ని కేటాయించారు. పాండవులు ఏమంటారు? ఇష్టమేనా? మరి రేపటి నుండి ఏమి చేస్తారు? రేపటి నుండి ప్రారంభిస్తారా లేక ఇప్పటి నుండా? ఇప్పటినుండి సంకల్పం చెయ్యండి - నా సమయము, సంకల్పము విశ్వ సేవ కోసం. ఇందులో స్వయం కోసం ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది, ఉండిపోదు, పెరుగుతుంది. ఎందుకని? మీరు ఎవరి ఆశలైనా పూర్తి చేస్తే, దుఃఖానికి బదులు సుఖాన్ని ఇస్తే, నిర్బల ఆత్మలకు శక్తిని ఇస్తే, గుణాలను ఇస్తే, వారు ఎన్ని దీవెనలను ఇస్తారు! అందరి నుండి దీవెనలను తీసుకోవడము - ఇదే ముందుకు వెళ్ళేందుకు అన్నింటికన్నా సహజమైన సాధనము. ప్రసంగాలు చేయకపోయినా, ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయకపోయినా కానీ ఏమీ ఫర్వాలేదు. సేవా కార్యక్రమాలు చేయగలిగితే చేయండి. కానీ చేయలేకపోతే కూడా ఏమీ ఫర్వాలేదు, ఖజానాలను సఫలం చేయండి. వినిపించాము కదా - మనసు ద్వారా శక్తుల ఖజానాను ఇస్తూ ఉండండి. వాణి ద్వారా జ్ఞాన ఖజానాను, కర్మలతో గుణాల ఖజానాను మరియు బుద్ధితో సమయ ఖజానాను, సంబంధ సంపర్కం ద్వారా సంతోష ఖజానాను సఫలం చెయ్యండి. సఫలం చేయడం వలన సహజంగానే సఫలతామూర్తులుగా అవుతారు. సహజంగా ఎగురుతూ ఉంటారు ఎందుకంటే దీవెనలు ఒక లిఫ్టువలె పని చేస్తాయి. మెట్లు కాదు. సమస్య వచ్చింది, తొలగించారు, ఒక్కోసారి రెండు రోజులు పడుతుంది, మరోసారి రెండు గంటలు పడుతుంది, ఇది మెట్లు ఎక్కడము అంటే. సఫలం చేసుకోండి, సఫలతామూర్తులుగా అవ్వండి, అప్పుడు దీవెనలు అనే లిఫ్టుతో ఎక్కడకు కావాలంటే అక్కడకు సెకండులో చేరుకోగలరు. సూక్ష్మవతనంలోకి చేరుకోండి, పరంధామంలోకి చేరుకోండి, మీ రాజ్యములోకి చేరుకోండి, ఎక్కడకు కావాలంటే అక్కడకు సెకండులో చేరుకోండి. లండన్‌లో వన్ మినట్ అనే కార్యక్రమం చేసారు కదా. బాప్‌దాదా అంటారు వన్ సెకండ్. ఒక్క సెకండులో దీవెనలు అనే లిఫ్టులో ఎక్కండి. కేవలం స్మృతి అనే స్విచ్‌ను ఆన్ చెయ్యండి, అంతే, శ్రమముక్తులు.
ఈరోజు డబల్ విదేశీయుల రోజు కదా, బాప్‌దాదా ముందుగా డబల్ విదేశీయులను ఏ స్వరూపంలో చూడాలని ఆశిస్తున్నారు? శ్రమముక్తులు, సఫలతామూర్తులు, దీవెనలకు పాత్రులు. అవుతారు కదా? ఎందుకంటే డబల్ విదేశీయులకు బాబాపై చాలా ప్రేమ ఉంది, శక్తి కావాలి కానీ ప్రేమ బాగా ఉంది. అద్భుతమైతే చేసారు కదా? చూడండి, 90 దేశాల నుండి, వేరు వేరు దేశాల నుండి, వేరువేరు ఆచార వ్యవహారాల నుండి వచ్చారు కానీ 5 ఖండాలు కలిసి ఒక చందన వృక్షముగా అయ్యాయి. ఒకే వృక్షములోకి వచ్చేసారు. ఒకే బ్రాహ్మణ కల్చర్‌లోకి వచ్చేసారు, ఇప్పుడు ఇంగ్లీష్ కల్చర్ ఉందా? మాది ఇంగ్లీష్ కల్చర్... అని అనరు కదా! బ్రాహ్మణులు కదా! ఇప్పుడైతే మాది బ్రాహ్మణ కల్చర్ అని భావించేవారు చేతులెత్తండి. బ్రాహ్మణ కల్చర్, మరింకే ఎడిషన్ లేదు. ఒకటిగా అయిపోయారు కదా! ఎవ్వరినైనా అడగండి, అమెరికాని అడగండి, యూరప్‌ను అడగండి, మీరు ఎవరు అని? ఏమని అంటారు? బ్రాహ్మణులము అని అంటారు కదా. లేక యు.కె, ఆఫ్రికన్, అమెరికన్ అంటారా? అందరూ బ్రాహ్మణులుగా అయిపోయారు, ఒకే మతానికి చెందినవారిగా అయ్యారు. తల ఊపుతున్నారు, మంచిది.
బాప్‌దాదా సేవలో ఏ నవీనతను కోరుకుంటున్నారు? ఎవరెవరు అయితే సేవలను చేస్తున్నారో చాలా చాలా చాలా బాగా చేస్తున్నారు, ఇందుకు అభినందనలు. కానీ ఇక మీదట ఏమి ఎడిషన్ చేయాలి? మీ మనసులో కూడా నవీనత కావాలి అని అనుకుంటున్నారు కదా. బాప్‌దాదా ఏమి చూసారంటే, ఏ కార్యక్రమాలైతే చేసారో, సమయాన్ని వెచ్చించారు, ప్రేమతో చేసారు, కష్టాన్ని కూడా ప్రేమతో చేసారు, మీరు మీ స్థూల ధనాన్ని ఇచ్చి ఉంటే అది పదమా రెట్లు పెరిగి మీ పరమాత్మ బ్యాంకులో జమ అయిపోయింది. అది ఇచ్చినట్లు కాదు, జమ చేసుకున్నట్లు. రిజల్టు చూసింది ఏమిటంటే సందేశాన్ని అందించే కార్యాన్ని, పరిచయాన్ని ఇచ్చే కార్యాన్ని చాలా బాగా చేసారు. సేవ ఎక్కడైనా చేసి ఉండవచ్చు, ఇప్పుడు ఢిల్లీలో జరుగనుంది, లండన్‌లో జరిగింది. డబల్ విదేశీయులు చేసిన కాల్ ఆఫ్ టైమ్ లేక పీస్ ఆఫ్ మైండ్ కార్యక్రమాలు బాప్‌దాదాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా ఎంత చెయ్యగలరో అంత చేస్తూ ఉండండి. సందేశం లభిస్తుంది, స్నేహులుగా అవుతూ ఉంటారు, సహయోగిగా అవుతూ ఉంటారు, సంబంధంలోకి కొంతమంది వస్తూ ఉంటారు, కానీ ఏదైనా అనుభవం చేసుకుని వెళ్ళాలి. ఆ అనుభవం త్వరగా ముందుకు తీసుకువెళ్తుంది. కాల్ ఆఫ్ టైమ్ లేక పీస్ ఆఫ్ మైండ్ వంటి కార్యక్రమాలలో అనుభవం ఎక్కువగా జరుగుతుంది. పెద్ద కార్యక్రమాలలో సందేశమైతే బాగా అందిస్తున్నారు కానీ వచ్చిన వారిని తర్వాత పలకరిస్తూ అనుభవం చేసుకోమని లక్ష్యాన్ని ఇవ్వండి, ఏదో ఒకటి అనుభవం జరగాలి ఎందుకంటే అనుభవం ఎప్పటికీ మర్చిపోలేనిది. అనుభవం ఎటువంటిది అంటే అనాయాసంగా దాని వైపుకు ఆకర్షితులవుతారు. మరి బాప్‌దాదా అడుగుతున్నారు - ముందుగా, జ్ఞాన పాయింట్లను బ్రాహ్మణులు అనుభవం చేసుకున్నారా? ప్రతి శక్తిని అనుభవం చేసుకున్నారా? ప్రతి గుణాన్ని అనుభవం చేసుకున్నారా? ఆత్మిక స్థితిని అనుభవం చేసుకున్నారా? పరమాత్మ ప్రేమను అనుభవం చేసుకున్నారా? జ్ఞానాన్ని అర్థం చేసుకోవడంలో అయితే పాస్ అయ్యారు, నాలెజ్ఫుల్గా అయితే అయ్యారు, ఇందులో బాప్‌దాదా కూడా మంచి మార్కులను ఇస్తున్నారు. ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి, డ్రామా ఏమిటి, జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారు, కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత సమయం కావాలంటే అంత సమయం, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ, ఆ పరిస్థితిలో ఆత్మిక బలం అనుభవం అవ్వాలి, పరమాత్మ శక్తి అనుభవం అవ్వాలి, అది జరుగుతుందా? ఏ సమయంలో, ఎంత సమయం, ఏ అనుభవం కావాలనుకుంటే అది జరుగుతుందా? లేక ఒకసారి ఒకలాగా, మరోసారి మరోలాగా ఉంటుందా? ఆత్మ అనుకుంటున్నారు కానీ పదే పదే దేహభానములోకి వస్తున్నారు, అలాంటప్పుడు అనుభవం ఉపయోగపడినట్లా? అనుభవీ మూర్తులు అంటే ప్రతి సబ్జెక్టులో అనుభవిమూర్తులుగా ఉండాలి, అన్ని శక్తులలో అనుభవిమూర్తులుగా ఉండాలి. కనుక స్వయంలో కూడా అనుభవాన్ని పెంచండి. ఉంది, లేదు అని కాదు, కానీ అప్పుడప్పుడు ఉంది, సమ్‌టైమ్. బాప్‌దాదా సమ్‌టైమ్ కోరుకోవడం లేదు, సమ్‌థింగ్ అయిపోతుంది, సమ్‌టైమ్ కూడా అయిపోతుంది ఎందుకంటే మీ అందరి లక్ష్యము ఏమిటి, ఏమి అవ్వాలని లక్ష్యము? బాబా సమానము అంటారు. ఒకే జవాబు అందరూ ఇస్తారు. బాబా అయితే సమ్‌టైమ్, సమ్‌థింగ్ కాదు కదా. బ్రహ్మాబాబా సదా రహస్యయుక్తంగా, యోగయుక్తంగా, ప్రతి శక్తిలో సదాగా ఉన్నారు, అప్పుడప్పుడు కాదు. జరిగిన అనుభవం సదాకాలం ఉంటుంది, అది సమ్‌టైమ్ ఉండదు. కనుక స్వయం అనుభవిమూర్తులుగా అయ్యి ప్రతి విషయంలో, ప్రతి సబ్జెక్టులో అనుభవి, జ్ఞాన స్వరూపంలో అనుభవి, యోగయుక్తంగా ఉండటంలో అనుభవి, ధారణ స్వరూపంలో అనుభవి. ఆల్ రౌండ్ సేవలో అనగా మనసా, వాచ, కర్మణ, సంబంధ-సంపర్కం అన్నింటిలో అనుభవి, అప్పుడు అంటారు పాస్ విత్ ఆనర్ అని. మరి ఏమి అవ్వాలనుకుంటున్నారు? పాస్ అవ్వాలనుకుంటున్నారా లేక పాస్ విత్ ఆనర్ అవ్వాలనుకుంటున్నారా? పాస్ అయ్యే వారైతే చివరలో కూడా వస్తారు, మీరైతే టూలేట్ కన్నా ముందే వచ్చారు. ఇప్పుడు కొత్తవారు వచ్చినా కానీ తీవ్ర పురుషార్థం చేస్తే, కేవలం పురుషార్థం కాదు తీవ్ర పురుషార్థం చేస్తే ముందుకు వెళ్ళవచ్చు ఎందుకంటే నంబర్ అవుట్ కాలేదు. కేవలం బాబా మరియు మమ్మా ఇద్దరి నంబర్ మాత్రమే అవుట్ అయింది.
అచ్ఛా - ఇప్పుడు సెకండులో బాప్‌దాదా ఏ స్థితిలో స్థితి అవ్వమని డైరెక్షన్ ఇస్తే ఆ స్థితిలోకి సెకండులో చేరుకోగలరా? లేక పురుషార్థంలో సమయం పడుతుందా? ఇప్పుడు సెకండు యొక్క అభ్యాసం కావాలి ఎందుకంటే రాబోయే ఫైనల్ సమయంలో పాస్ విత్ ఆనర్ సర్టిఫికేట్ లభించాలి, అందుకోసం ఇప్పటినుండే అభ్యాసం చెయ్యాలి. సెకండులో ఎక్కడకు కావాలంటే అక్కడకు, ఏ స్థితిలో కావాలంటే ఆ స్థితిలో స్థితి కాగలగాలి. మరి ఎవరెడీ. రెడీ అయిపోయారా!
ఇప్పుడు ముందుగా ఒక్క సెకండులో పురుషోత్తమ సంగమయుగి శ్రేష్ఠ బ్రాహ్మణుడిని, ఈ స్థితిలో స్థితి అవ్వండి... ఇప్పుడు నేను ఫరిశ్తా రూపమును, డబల్ లైట్‌గా ఉన్నాను... ఇప్పుడు విశ్వ కళ్యాణకారిగా అయ్యి మనసు ద్వారా నలువైపులకు శక్తి కిరణాలను పంపిస్తున్న అనుభవాన్ని చేయండి. ఇలా రోజంతటిలో సెకండులో స్థితి అవ్వగలరా? ఈ అనుభవం చేస్తూ ఉండండి ఎందుకంటే అకస్మాత్తుగా ఏదైనా జరగవచ్చు. ఎక్కువ సమయం లభించదు. అలజడిలో కూడా సెకండులో అచలంగా అవ్వగలగాలి. ఈ అభ్యాసాన్ని స్వయమే సమయాన్ని కేటాయించి మధ్యమధ్యలో చేస్తూ ఉండండి. దీని ద్వారా మనసు సహజంగా కంట్రోల్ అవుతుంది. కంట్రోలింగ్ పావర్, రూలింగ్ పావర్ పెరుగుతాయి. అచ్చా!
నలువైపుల ఉన్న పిల్లలనుండి చాలా ఉత్తరాలు కూడా వచ్చాయి, అనుభవాలు కూడా చాలా వచ్చాయి. బాప్‌దాదా పిల్లలకు రిటర్న్‌లో చాలా చాలా హృదయపూర్వక దీవెనలను మరియు హృదయపూర్వక ప్రియస్మృతులను పదమా పదమారెట్లు ఇస్తున్నారు. బాప్‌దాదా చూస్తున్నారు - నలువైపుల ఉన్న పిల్లలు వింటున్నారు కూడా, చూస్తున్నారు కూడా. ఎవరైతే చూడటం లేదో వారు కూడా గుర్తు చేస్తున్నారు. అందరి బుద్ధి ఈ సమయం మధువనంలో ఉంది. నలువైపుల ఉన్న పిల్లలందరూ పేరుపేరున ప్రియస్మృతులను స్వీకరించండి.
అందరూ ఉల్లాస ఉత్సాహాలు అనే రెక్కల ద్వారా ఉన్నత స్థితిలోకి ఎగిరే శ్రేష్ఠ ఆత్మలకు, సదా స్నేహంలో లవ్లీనమై ఉండే పిల్లలకు, సదా శ్రమముక్తులు, సమస్య ముక్తులు, విఘ్న ముక్తులు, యోగయుక్తులు, రహస్యాయుక్తులైన పిల్లలకు, సదా ప్రతి పరిస్థితిలో సెకండులో పాస్ అయ్యేవారు, ప్రతి సమయము సర్వ శక్తి స్వరూపంగా ఉండే మాస్టర్ సర్వశక్తిమాన్ పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.