Search for a command to run...
15 Nov 2018
“స్వరాజ్యము యొక్క రిజల్ట్‌ను చెక్ చేసుకుని స్వయాన్ని ఛేంజ్ చేసుకోండి మరియు అఖండ రాజ్యానికి అధికారులుగా అవ్వండి’’
15 November 2018 · తెలుగు
ప్రాణేశ్వరుడైన అవ్యక్తమూర్తి తల్లితండ్రి అయిన బాప్‌దాదాకు అతి స్నేహులు, సదా అవ్యక్త స్వరూపం ద్వారా అవ్యక్త మిలనపు అనుభూతులలో మగ్నమయ్యేవారు, స్వరాజ్య సింహాసనాధికారులు మరియు బాప్‌దాదా హృదయ సింహాసనాధికారులైన టీచర్ అక్కయ్యలు మరియు దేశవిదేశాలలోని సర్వ బాబా కనుపాపలు, సదా ఉల్లాస ఉత్సాహాలతో సంపన్నత మరియు సంపూర్ణత గమ్యాన్ని సమీపంగా అనుభవం చేసే సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదరసోదరీలు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.
తర్వాత సమాచారము - ఈరోజు ప్రియమైన అవ్యక్త బాప్‌దాదాతో మంగళ మిలనము చేసుకునేందుకు మూడవ టర్న్. సేవలో ఉత్తర ప్రదేశ్, బెనారస్ మరియు పశ్చిమ నేపాల్ నుండి సోదరసోదరీలు చాలా సంఖ్యలో చేరుకున్నారు. ఈ గ్రూపులో దేశవిదేశాల నుండి షుమారు 18వేల మంది సోదరసోదరీల సంగఠన ఉంది. అవ్యక్త బాప్‌దాదా మన మధురమైన దాదీ గుల్జార్గారి ద్వారా పిల్లలమైన మనందరికీ ఇంత కాలం పాలన ఇచ్చారు. అలాగే ఇప్పుడు కూడా అవ్యక్త వతనవాసి బాప్‌దాదా తన పిల్లలకు అవ్యక్త వతనం యొక్క సుందరమైన అలౌకిక అనుభూతులను చేయిస్తున్నారు. ఉదయం నుండే అందరూ అంతర్ముఖులుగా అయ్యి అవ్యక్త స్థితి ద్వారా అవ్యక్త మిలనాన్ని జరుపుకుంటున్నారు. సాయంకాల సమయం విశేషంగా అందరూ డైమండ్ హాలులో అదే తపనలో నిమగ్నమై ఉన్నారు. చాలా శక్తిశాలి వాతావరణం నెలకొన్నది. అందరి హృదయాలలో బాబా ప్రేమ నిండి ఉన్నట్లుగా అనుభవం అయింది. దాదీగారిని కూడా అందరూ గుర్తు చేసుకుంటూ, వీడియో ద్వారా వింటున్న అవ్యక్త మహావాక్యాల ద్వారా సాకారంలో బాప్‌దాదా పిల్లల మధ్యనే ఉన్నట్లుగా అనుభవం చేసుకున్నారు. పాత, క్రొత్త అందరూ సోదరసోదరీలు అదే అలలో, అనుభవాల సాగరంలో మునిగిపోయారు. డ్రామాలోని ఈ విచిత్రమైన దృశ్యాన్ని చూస్తున్న బాబా పిల్లలంతా తమ సంకల్పాలకు బ్రేకు వేసి వాహ్ మధురమైన బాబా వాహ్! వాహ్ మీ ప్రభు లీల వాహ్! అన్న పాటను పాడుతున్నారు. సాయంకాలం అవ్యక్త విధుల గురించి క్లాసు విన్న తర్వాత ప్రియమైన బాప్‌దాదాకు భోగ్‌ను స్వీకరింపజేసారు. అవ్యక్త మహావాక్యాలను విన్న తర్వాత బాబా స్నేహం నిండిన టోలీ అందరికీ లభించింది, దాదీలు మరియు పెద్ద అన్నయ్యలు తమ తమ శుభ కామనలను అందించారు.
మనమంతా విన్న ప్రియమైన బాప్‌దాదా మహావాక్యాలను మీ వద్దకు పంపిస్తున్నాము. అందరినీ రిఫ్రెష్ చెయ్యగలరు. అచ్ఛా - అందరికీ చాలా చాలా స్మృతి... ఓం శాంతి.
15-11-18 అవ్యక్త మహావాక్యాలు రివైజ్ వీడియో 15-11-09 మధువనం
“స్వరాజ్యము యొక్క రిజల్ట్‌ను చెక్ చేసుకుని స్వయాన్ని ఛేంజ్ చేసుకోండి మరియు అఖండ రాజ్యానికి అధికారులుగా అవ్వండి’’
ఈరోజు దిలారామ్ బాబా తమ రాజ్ దులారే (ప్రియమైన) పిల్లలను కలవడానికి వచ్చారు. ఎందుకు ప్రియమైనవారు? పిల్లలు ప్రతి ఒక్కరూ మూడు సింహాసనాలకు యజమానులు అని తెలుసా? ఒకటి, స్వరాజ్య సింహాసనము, రెండు బాప్‌దాదా హృదయ సింహాసనము, మూడు భవిష్య సింహాసనము. మూడు సింహాసనాలకు అధికారులు. తమ భవిష్య సింహాసనం కోసం కూడా ఇక్కడే అభ్యాసం చేస్తున్నారు. భవిష్యత్తు కోసం తయారీలు మరియు పురుషార్థాన్ని ఇక్కడే చేస్తున్నారు. ఇప్పటి పురుషార్థము అనేక జన్మలకు రాజ్య భాగ్యాన్ని ఇప్పించేది. ఈ సమయంలోనే తమ రాజ్య భాగ్య సంస్కారాన్ని ధారణ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి పురుషార్థము భవిష్య రాజ్యానికి అధికారిగా చేస్తుంది. మరి ఈ సమయంలో ఉన్న తమ పురుషార్థము యథార్థంగా ఉన్నదా అని పరిశీలించుకోండి. భవిష్యత్తులో ఒక్క రాజ్యమున్నట్లుగా ఇప్పుడు మా మనసులలో ఒకే రాజ్యం నడుస్తుందా అని పరిశీలించుకోండి. పురుషార్థంలో ఒక్క రాజ్యం ఉందా? లేక మీ రాజ్యంలో మాయ విఘ్నాలను వేస్తుందా? ఒక్క రాజ్యానికి బదులుగా మాయ ప్రభావం పడటం లేదు కదా? రెండు రాజ్యాలైతే లేవు కదా? ఒకే రాజ్యము అన్నది భవిష్యత్తుకు ఉన్న విశేషత. ఇప్పటి అభ్యాసమే భవిష్యత్తులో జరుగుతుంది. మరి పరిశీలించుకోండి - ఇప్పుడు స్వరాజ్యము ఉంది, స్వరాజ్యంలో మాయ తల దూర్చడం లేదు కదా? రెండు రాజ్యాలైతే లేవు కదా? ఒకవేళ రెండు రాజ్యాలు ఉన్నట్లయితే ఒక్క రాజ్యపు సంస్కారాన్ని ఎప్పుడు నింపుకుంటారు? ఒకే రాజ్యము, ఒకే ధర్మము అన్నది భవిష్యత్తుకు ఉన్న విశేషత. అక్కడ ఏ ధర్మము ఉంటుంది? మీ విశేష ధారణ ఏమిటి? సంపూర్ణ పవిత్రత. ఒకే ధర్మము ఉందా అని పరిశీలించుకోండి. మధ్యలో అపవిత్రత అను రెండవ ధర్మము దూరడం లేదు కదా? దీనితో పాటు లా అండ్ ఆర్డర్ ఒక్కరిదే ఉందా లేక మాయ అందులో కూడా ప్రవేశిస్తుందా అని పరిశీలించుకోండి. ఒక్కరి రాజ్యము నిర్విఘ్నంగా జరుగుతుందా? మరో విషయమేమిటంటే రాజ్యంలో సదా సుఖము మరియు శాంతి సహజంగా ఉంటాయి, మరి ఇప్పుడు చూసుకోండి మీ రాజ్యంలో సదా సుఖశాంతులు ఉన్నాయా? ఎవ్వరూ మధ్యలో ప్రవేశించడం లేదు కదా? స్వరాజ్యంలో మాయ కలుగజేసుకుని అశాంతిని వ్యాప్తి చెయ్యడం లేదు కదా? స్వరాజ్యంలో ఏదో ఒక సాల్వేషన్ లేక ప్రశంసల ప్రభావాన్ని మాయ తీసుకురావడం లేదు కదా? సదా సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, అతీంద్రియ సుఖము స్థిరంగా ఉంటున్నాయా? ఎందుకంటే భవిష్య రాజ్యంలో సర్వ ప్రాప్తులు, సంపన్నత ఉంటాయి అని మీకు తెలుసు. దీని కారణంగా సంతుష్టత కూడా ఉంటుంది. మరి ఇప్పుడు కూడా స్వరాజ్యము సంపన్నంగా ఉన్నదా లేక ఏదైనా లోటు ఉందా? ఎందుకంటే ఇప్పటి పురుషార్థంలో ఒకవేళ లోపం ఉండిపోయినట్లయితే భవిష్య అఖండ రాజ్యానికి అధికారులుగా ఎలా అవ్వగలరు! ఆధారమంతా ఇప్పటి పురుషార్థం పైననే ఉంది. ఇప్పుడు ఉన్న ఏ లోపము భవిష్యత్తులో సంపూర్ణ రాజ్యానికి అధికారిగా కానివ్వదు. బహుకాలపు ఈ స్వరాజ్య అభ్యాసము భవిష్య రాజ్యానికి అధికారిగా చేస్తుంది. కావున తమ ఈ చెకింగ్ సదా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ బహుకాలపు పురుషార్థము లేనట్లయితే ప్రాలబ్ధము కూడా తక్కువ లభిస్తుంది. అందుకే బాప్‌దాదా సమయానుసారంగా ఈ అటెన్షన్‌ను ఇప్పిస్తున్నారు - ఇందుకోసం ఇప్పుడు స్వయాన్ని సంపన్నంగా మరియు సంపూర్ణంగా తయారు చేసుకోండి. పురుషార్థం జరుగుతుంది అని అప్పుడప్పుడూ అంటూ ఉంటారు కానీ పురుషార్థం చేస్తూ మధ్యలో ‘అయితే’ అని అనడం లేదు కదా! ఇది అయితే అయిపోతుందిలే, ఇది అయితే చేస్తాములే, ఈ సంస్కారము 21 జన్మల అవినాశి, అఖండ రాజ్యానికి అధికారిగా అవ్వనివ్వదు.
కావున బాప్‌దాదా సదా కోసం అటెన్షన్‌ను ఇప్పిస్తున్నారు, పరిశీలించుకోండి. ఒకవేళ ఏదైనా విఘ్నము వచ్చినా కానీ, తుఫాను వచ్చినా తుఫాను తోఫా(బహుమతిగా)గా మారిపోతుందా? తుఫాను తుఫానుగా కాక తోఫాగా మారిపోవాలి. ఏ విధమైన మాయా దాడి జరిగినా, మాయ అలా అనుభవం చేయిస్తుంది, ఆ అనుభవం కూడా మనకు ఎలా అనుభవం అవ్వాలంటే ఆ అనుభవం అనే మెట్లు మనల్ని ముందుకు తీసుకు వెళ్తాయి. దీనికోసం బాప్‌దాదా అంటారు సదా తమ చార్టును తామే పరిశీలించుకోండి. ఎంతగా తమ చార్టును పరిశీలించుకుంటారో అంతగా చెక్ చేసుకుని ఛేంజ్ అవుతారు. మరి ప్రతి ఒక్కరూ తమ చార్టును పరిశీలించుకుంటున్నారా? చేసుకుంటున్నారా? రోజూ పరిశీలించుకునేవారు చేతులెత్తండి. రోజూ చేసేవారు, అప్పుడప్పుడూ చేసేవారు కాదు. రోజూ చార్టును చెక్ చేసుకోండి మరియు ఛేంజ్ అవ్వండి ఎందుకంటే సమయపు సూచనను బాప్‌దాదా చాలాకాలం నుండి ఇస్తున్నారు. సమయాన్ని కూడా చూస్తున్నారు. మనుష్యుల మనసులలో చింత కూడా పెరిగిపోతుంది కానీ మీ మనసులో చింత కాదు, ప్రభు చింతన ఉంది. ప్రభు చింతన ఉన్న కారణంగా మేము నిమిత్తులము, నిర్మాణులము ఎందుకంటే చేయించేవారు బాబా అని మీకు తెలుసు. దీని కారణంగా మీ మనసులో చింత లేదు, చేయించేవారు చేయిస్తున్నారు అన్న స్మృతి సదా ముందుకు తీసుకువెళ్తుంది.
ఈ సంగమయుగంలో ఒక్కొక్క సెకండు, సమయము మరియు సంకల్పము శుభంగా జరుగుతుందా అని ఇప్పుడు విశేషంగా పరిశీలించుకోవాలి. ఈ సమయానికి ఉన్న మహత్వాన్ని తెలుసుకోండి. ఒక్క సెకండుకు కూడా విలువ ఉంది, మహత్వము ఉంది. అప్పుడుప్పుడు పిల్లలు అంటారు, సంకల్పాలు అయితే వచ్చాయి కానీ రెండు నాలుగు సెకండ్లు మాత్రమే అని. కానీ సంగమ సమయానికి విలువ ఉంది, ఇప్పటి ఒక్క సెకండు ఒక్క గంటతో సమానము. ఈ సమయానికి ఇంతటి మహత్వము ఉంది. అకస్మాత్తుగా ఏ సమయంలో అయినా మీ ఫైనల్ పేపర్ రావచ్చు అని బాప్‌దాదా చెప్పి ఉన్నారు. బాప్‌దాదా కూడా చెప్పరు కనుక ఈ సమయపు అటెన్షన్ స్వయాన్ని సంపూర్ణంగా మరియు సంపన్నంగా చేయాలి. బాప్‌దాదా ఏవైతే సర్వ ఖజానాలను ఇచ్చారో ఆ ఒక్కొక్క ఖజానాను సమయానికి కార్యంలో వినియోగించండి. ఖజానాలకు యజమానులు మీరు, యజమాని విశేషత ఏమిటంటే ఏ సమయంలో ఏ ఖజానా అవసరముంటుందో ఆ సమయంలో ఆ ఖజానాను కార్యంలో పెడ్తాడు. మీరు ఇముడ్చుకునే శక్తిని ఆజ్ఞాపిస్తే ఇముడ్చుకునే శక్తి కార్యంలోకి వస్తుందా? ఎందుకంటే ఎవరైతే సమయానికి తమ ఖజానాలను కార్యంలో వినియోగిస్తారో వారినే యజమాని అని అంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్వయంపై ఇంతటి అటెన్షన్ ఇవ్వాలి. అందరిలో ఉన్న సంతోష ఖజానా సదా ముఖంలో మరియు నడవడికలో కనిపించాలి. అవినాశి తండ్రి ప్రసాదము ఈ సంతోషము. మరి అవినాశి తండ్రి ఇచ్చినదానిని అవినాశిగా నిలుపుకోండి. సంతోషం గురించి ఇలా అంటారు - సంతోషమువంటి ఔషధం లేదు, సంతోషమువంటి ఖజానా మరొకటి లేదు. ఎవరిలో అయితే సంతోషము ఉంటుందో వారి నయనాలలో, ముఖంలో, నడవడికలో ఆటోమేటిక్‌గా అది కనిపిస్తుంది. సదా సంతోషంగా ఉండండి మరియు సదా సంతోషాన్ని పంచండి అన్నది బాప్‌దాదా ఇచ్చిన వరదానము. ఎందుకంటే సంతోషాన్ని పంచడం వలన సంతోషం పెరుగుతుంది. మిగతా ఖజానాలైతే పంచడం వలన తరిగిపోతాయి. కానీ సంతోష ఖజానాను ఎంతగా పంచుతారో అంతగా అది పెరుగుతుంది. సంతోష ఖజానా స్థిరంగా ఉందా అని పరిశీలించుకోండి.
ఇప్పుడు పిల్లలందరికీ దేశంవారు కావచ్చు, విదేశం వారు కావచ్చు, పిల్లలందరికీ బాప్‌దాదా ఒక విషయంలో విశేష అభినందనలను తెలియజేస్తున్నారు. ఏ విషయము? దేశంలోకానీ, విదేశంలోకానీ తమ ఉల్లాస-ఉత్సాహాలతో ఆత్మలకు బాబా సందేశాన్ని ఇచ్చారు. అందరూ సంతోషంతో ఏదైతే కార్యాన్ని చేసారో ఆ కార్యంలో ప్రోగ్రాము ఒకటి చేసారు, ప్రతి చోట ఒకే కార్యక్రమాన్ని చేసారు కానీ అందుకు ఫలితం వేయి రెట్లను పొందారు. ఇప్పటి సమయ ప్రమాణంగా ఏవైతే పరిస్థితులున్నాయో అవి ముందు ముందు మరింత నాజూకుగా అవ్వనున్నాయి. అందుకే గ్రామంలోకానీ, ఏ మూలన ఉన్నా కానీ మా తండ్రి వచ్చారు కానీ మాకు సందేశం ఇవ్వలేదు అన్న ఫిర్యాదు రాకూడదు అన్నది బాప్‌దాదా సంకల్పము. అందుకే అందరూ ఉల్లాస ఉత్సాహాలతో ఈ సేవను చేసారు, బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఇలాగే పరస్పరంలో కలుసుకుని ఇటువంటి ప్రోగ్రాములను తయారు చెయ్యండి. తమ ఉల్లాస ఉత్సాహాలను, ధైర్యమును ప్రతి ఒక్కరూ తమ తమ విధి అనుసారంగా కార్యంలో వినియోగించారు కానీ ఇప్పుడైతే అందరూ చాలా బాగా చేసారు. సమయ ప్రమాణంగా ఎవ్వరూ, ఏ మూలన సందేశం మిగిలిపోకూడదు అని గుర్తుంచుకోండి. ఇందులో తమ స్వ పురుషార్థం కూడా మంచిగా అవుతుంది మరియు ఆత్మల కళ్యాణం కూడా జరుగుతుంది. అందరికీ ఈ ప్రోగ్రాములు మంచిగా అనిపించాయి కదా! మంచిగా అనిపించాయా! బాప్‌దాదా పిల్లలందరికీ పదే పదే ఇదే చెప్తున్నారు - ఆత్మల పట్ల దయాహృదయులుగా అవ్వండి. ఈ రోజుల్లో దుఃఖం, అశాంతి కారణంగా అందరూ దయ చూపండి, కృప చూపండి అని మనసుతో అంటున్నారు. మరి బాబాకు సహచరులు పిల్లలైన మీరే కదా. ఇప్పుడు పిల్లల దయా హృదయ పాత్రను చూడాలని బాబా ఆశిస్తున్నారు. ఈ దుఃఖమయ ప్రపంచం మారి సుఖమయ ప్రపంచం రావాలన్నది మీ అందరి ఉత్సాహము. మరి సుఖమయ ప్రపంచం రావడానికి ఈ దుఃఖ అశాంతులు వినాశనం కావడానికి పరిస్థితులు మారుతున్నాయి. కావున ఈ రోజు బాబా ఇచ్చే ఈ సందేశాన్ని సదా గుర్తుంచుకోండి - ఇప్పుడు మనసా కావచ్చు, వాచ కావచ్చు, ముఖం మరియు నడవడికతో సేవా గతిని పెంచుతూ వెళ్ళండి. మీ రాజ్యాన్ని సమీపంలోకి తెచ్చుకోండి. అచ్ఛా.
ఈసారి మొదటి సారి బాప్‌దాదాను కలవడానికి వచ్చినవారు చేతులెత్తండి. అచ్ఛా, చాలా మంది ఉన్నారు. అందరూ లేవండి. అభినందనలు. అయినా సమాప్తికి ముందే చేరుకున్నారు. క్రొత్త జన్మను తీసుకున్నారు. ఇందుకు అందరి తరఫున ఇప్పుడు రాబోయే పిల్లలకు బాప్‌దాదా మరియు నలువైపుల ఉన్న పిల్లల ద్వారా అభినందనలు, అభినందనలు. బ్రాహ్మణ పరివారాన్ని చూసి సంతోషంగా ఉంటుంది కదా! కానీ ఎవరైతే వచ్చారో వారికి బాబా ఇదే చెప్తారు - ఇప్పుడు చాలా సమయం గడిచిపోయింది, చాలా కొద్ది సమయమే మిగిలి ఉంది. అందుకే పురుషార్థాన్ని తీవ్రం చేయండి. తీవ్ర పురుషార్థీలు ముందుకు వెళ్తారు, నడవడం కాదు ఎగురుతారు. ఎగిరే కళ యొక్క పురుషార్థాన్ని చేస్తారు. కనుక ఆలస్యంగా వచ్చినా కానీ బాబా వారసత్వంపై తమ పూర్తి హక్కును తీసుకోవచ్చు. ప్రతి సెకండు సంతోషంగా ఉండాలి మరియు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. అచ్ఛా.
సేవ టర్న్ యు.పి, బెనారస్ మరియు పశ్చిమ నేపాల్ వారిది:- సేవ కోసమై వచ్చినవారు లేవండి. మంచి అవకాశాన్ని తీసుకున్నారు. యు.పి.లో మీ సేవకు స్మృతిచిహ్నాలు చాలా ఉన్నాయి. భక్తి మార్గపు మందిరాలు కూడా చాలా ఉన్నాయి, నదులు కూడా చాలా ఉన్నాయి. మరి యు.పి. వారు నలువైపుల సేవను పెంచుతూ కూడా ఉన్నారు, ఇకపై కూడా పెంచుతూ ఉంటారు. ఇప్పుడు బాప్‌దాదా అన్ని జోన్లకు ఈ విధంగా చెప్తున్నారు - ప్రతి ఒక్కరూ తమ జోన్లో ఎటువంటి గ్రూపును తయారు చెయ్యండంటే ఆ గ్రూపులో అన్ని వర్గాలవారు ఉండాలి. మీకు వర్గాలు ఉన్నాయి కదా, సేవ కోసం ప్రతి జోన్ వారు తమ ప్రదేశాలలో ప్రతి వర్గపు సేవను చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు కానీ ప్రతి జోన్లో ఎటువంటి సేవా గ్రూపు ఉండాలంటే అందులో ప్రతి వర్గానికి చెందినవారు ఒకరు ఉండాలి. మరియు ఎక్కడ ప్రోగ్రాము చేసినా కానీ అక్కడ ఆ గ్రూపు వారు తమ వర్గానికి విశేష నిమంత్రణను ఇవ్వండి. ఏ వర్గంవారు కూడా మాకు సందేశం అందలేదు అన్న ఫిర్యాదును చెయ్యకూడదు. అంతే కాక వెరైటీ గ్రూపులుగా ఏదైతే అయ్యారో దాని నుండి కూడా సేవను పెంచండి. తమ వర్గము మరియు దానితో పాటు ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానంతో మాకు ఏమి లభించింది మరియు ఏమి అనుభూతి జరిగింది అని తమ తమ అనుభవాన్ని వినిపించండి. ప్రతి జోన్లో ఇటువంటి సేవా గ్రూపును తయారు చెయ్యండి. భాషణ చెయ్యడానికి అంతగా సమయము లభించకపోయినా కానీ వారిని ఫంక్షన్ సమయంలో వెనుక కూర్చోపెట్టి వారి పరిచయాన్ని స్టేజి సెక్రటరీ ఇవ్వాలి. ఒకరిద్దరి అనుభవాన్ని కూడా పెట్టవచ్చు. పరివారంలో ఉంటూ తమ పనులను చేసుకుంటూ మీ జీవితం ఎలా గడిచింది, ఎలా మారింది అన్న అనుభవాన్ని అవకాశం తీసుకుని సమయం ఉంటే వినిపించండి. అచ్ఛా!
మరి ఈరోజు బాప్‌దాదా, స్వరాజ్య అధికారిగా అయి స్వరాజ్యపు రిజల్టును పరిశీలించుకోండి అని చెప్పారు. దానిని చెక్ చేసుకుంటూ, చాలా సమయంనుండి ఉన్న ఎటువంటి లోపమునైనా ఛేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంతోకాలము అఖండ రాజ్యము ఉండాలి. ఇందుకు బహుకాలపు పురుషార్థము అవసరము. బహుకాలపు ప్రాలబ్ధంతో స్వతహాగనే అధికారులుగా అవుతారు అందుకే బహుకాలపు పురుషార్థము అన్న పదము అండర్లైన్ చెయ్యండి. చెకింగ్ చేసుకోండి మరియు ఛేంజ్ అవ్వండి.
నలువైపుల ఉన్న బాప్‌దాదా హృదయ సింహానాధికారులైన ప్రతి ఒక్కరికీ బాప్‌దాదా రోజూ అమృతవేళ విశేషంగా శక్తిని పంచుతారు. అమృతవేళ విశేషంగా వరదానాలు, శక్తులను పంచుతారు. ఎవరైతే అమృతవేళలోని శక్తిని, విశేష వరదానాన్ని స్వీకరిస్తారో వారు విశేషంగా తీవ్ర పురుషార్థీలవుతారు. అమృతవేళకు మహత్వాన్ని ఇవ్వడము అంటే బాప్‌దాదా హృదయ సింహాసనాధికారులుగా సదా ఉండటము. కనుక, కొంతమంది పిల్లలకు అటెన్షన్ ఉంది, బాప్‌దాదా వారికి రోజూ సర్టిఫికేటు ఇస్తారు మరియు వాహ్ పిల్లలూ వాహ్ అని అంటారు.
నలువైపుల ఉన్న తీవ్ర పురుషార్థీ పిల్లలకు, ప్రతి సమయము బాప్‌దాదాను తమ సహచరునిగా చేసుకుని కంబైండ్‌గా ఉండే అలవాటున్న పిల్లలకు విశేషంగా వరదానాన్ని ఇస్తున్నాము - సదా ఎగురుతూ ఉండండి మరియు ఇతరులకు కూడా ఎగిరే సహకారాన్ని అందించి ఎగిరిస్తూ ఉండండి. అందరూ విజయులే మరియు విజయానికి ఫలితంగా బాప్‌దాదా దీవెనలు ప్రతి క్షణము మనకు లభిస్తాయి. అమరులుగా అయి అందరికీ అమృతాన్ని త్రాగించండి. నలువైపుల ఉన్న పిల్లలు బాప్‌దాదా ఎదుట కూర్చుని ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిపై బాప్‌దాదాకు హృదయపూర్వక ప్రేమ ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత ఉంది. ఇప్పుడు సర్వ విశేషతలతో స్వయాన్ని విశేష ఆత్మగా చేసుకుని ముందుకు సాగుతూ వెళ్ళండి. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ పర్సనల్‌గా ఇచ్చే పదమారెట్ల ప్రియస్మృతిని స్వీకరించండి. అచ్ఛా - ఇప్పుడైతే ఇక కలుస్తూనే ఉంటాము. నమస్తే.
దాదీ జానకిగారి వరదానీ వాక్యాలు:-
ఓం శాంతి. ఈరోజు ఎంతటి సుందరమైన దృశ్యమో చూడండి. బాప్‌దాదా మహావాక్యాలు వింటూ వింటూ ప్రతి ఒక్కరి హృదయాలను కూడా చూస్తున్నాము. బాబా మన ముఖాన్ని, నడవడికను ఎంతగా మార్చేసారో కదా, వండర్ బాబా. బాబా మనందరినీ మూడు సింహాసనాలపై కూర్చోబెట్టారు. బాబా అవ్యక్తమై మనందరికీ ఎంత మంచి పాలనను ఇస్తున్నారు! సదా మీ సమయాన్ని సఫలం చేసుకోమని బాబా అంటారు.
బాబా వతనం నుండి అందరినీ చేతులెత్తమన్నారు. అందరూ బాబా ఎదురుగా చేతులెత్తారు. బాబా నుండి మనందరికీ తరంగాలు లభించాయి. బాబా మనకు తమ తరంగాలు పంపించారని మాకు అనిపించింది. 17-18 వేలమంది ఇక్కడ కూర్చుని ఉన్నారని విన్నాము. బయట గార్డెన్లో, కాన్ఫెరెన్సు హాలులో కూడా కూర్చుని ఉన్నారు. మేము కేవలం భాగ్యశాలి కాదు పదమాపదమ్ భాగ్యశాలి ఉన్నాము అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఎక్కడ అడుగు పడుతుందో అక్కడ సంపాదనే సంపాదన. మాకు సాకార బాబా యొక్క ఒక దృశ్యం కనిపిస్తుంది. బాబా మెట్ల మీద నిల్చున్నారు. మేము కింద కూర్చున్నాము. మీ పాదాలు ఇలా చూపించండి అని బాబా అన్నారు. మేము అరిపాదాలను ఇలా చేసాము, ఫరిశ్తాల పాదాలు నేల మీద ఉండవు అని బాబా చెప్పారు. మనం ఫరిశ్తా సమానంగా అయ్యే ఆత్మలము. దేవతగా అయితే సత్యయుగంలో అవుతాము. ఇప్పుడు నేల మీద పాదాలు లేవు. బాబా ఎలా నడిపిస్తున్నారో, అంతా చాలా చక్కగా జరుగుతుంది. పూర్తి జీవితంలో లైట్, మైట్ మరియు ఎవిరిథింగ్ రైట్ (అంతా సక్రమమే). లైట్ అంటే రెండు అర్థాలు ఉన్నాయి - ఒకటి లైట్ (తేలికదనము), రెండవ లైట్ ప్రకాశము. నలువైపుల లైట్ లైట్ కనిపిస్తుంది. బాబా యొక్క మైట్ (శక్తి) పని చేస్తుంది. అచ్ఛా! ఓం శాంతి.