Search for a command to run...
5 Apr 2018
"కారణము అనే మాటను నివారణలోకి పరివర్తన చేసి మాస్టర్ ముక్తిదాతలుగా కండి, అందరికీ తండ్రి సాంగత్యము అనే రంగును వేసి సమానంగా అయ్యే హోలీని జరుపుకోండి"
5 April 2018 · తెలుగు
ప్రాణప్రదమైన అవ్యక్త బాప్‌దాదాకు అతి గారాల పిల్లలు, సదా తమ శ్రేష్ఠ మనసుతో శుభ భావనల సకాశ్ను ఇచ్చేవారు, నిమిత్తము మరియు నిర్మానము యొక్క విధి ద్వారా సర్వ ఖాతాలు జమ చేసుకునేవారు, సర్వ ఖజానాలతో సంపన్నులుగా అయ్యే నిమిత్త టీచరు అక్కయ్యలు మరియు దేశవిదేశాలలోని సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదరీసోదరులు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.
ప్రియమైన బాప్‌దాదా సీజన్లో ఇది చివరి టర్ను. మీ అందరి సూక్ష్మ సకాశ్తో మన మధురమైన దాదీ గుల్జార్గారి ఆరోగ్యం కొంచెం మెరుగుపడింది కానీ డాక్టర్లు మధువనానికి తీసుకురావడానికి ఒప్పుకోలేదు. అయినప్పటికీ బాప్‌దాదా మరియు మధుబన్ బేహద్ ఇంటి ఆకర్షణ పూర్తి బ్రాహ్మణ పరివారాన్ని తన వైపుకు స్వతహాగానే ఆకర్షించింది. ఈనాటి ఈ చివరి టర్నులో షుమారు 30 వేలమంది సోదరసోదరీలు అవ్యక్త మిలనం కోసం శాంతివనానికి చేరుకున్నారు. భగవంతుడు కణ కణంలో ఉన్నాడు అని భక్తులు భావనతో చెప్పినట్లుగా ఇక్కడ మధువనంలో కూడా ప్రతి కణంలో బాప్‌దాదా మరియు మహారథుల ఆత్మిక స్నేహము కణ కణములో నిండి వాటి శక్తిశాలి ప్రకంపనాలు నలువైపుల వ్యాపించినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడకు వచ్చే ప్రతి ఒక్కరూ స్వతహాగానే రిఫ్రెష్ అవుతున్నారు. ప్రతి గ్రూపులో 60-70 శాతం మంది సోదరసోదరీలు మొదటిసారి మధువనానికి వస్తున్నారు. వారికి మహారథుల క్లాసులు, యోగ కార్యక్రమాలు మరియు అవ్యక్త మురళి యొక్క పరివర్తన విధి ద్వారా కూడా చాలా మంచి రిఫ్రెష్మెంట్ లభిస్తుంది. అందరూ సంతుష్టంగా అయ్యి వరదానాలతో నిండుగా వెళ్తున్నారు. అద్భుతమంతా మధురమైన బాబాదే, అవ్యక్త వతనవాసిగా ఉన్నప్పటికీ సాకార వతనంలో గుప్త రీతిలో తమ పిల్లలకు సకాశ్ను మరియు సర్వ శక్తుల పాలనను ఇస్తున్నారు. ప్రతి ఒక్కరి మనసులలో సాకారం ద్వారా అవ్యక్త మిలనం చేసుకోవాలన్న ఆశ సదా ఉంటుంది కానీ డ్రామాలో విధి. ఇప్పటివరకు ఈ 2018 సంవత్సరంలో ప్రియమైన అవ్యక్త బాప్‌దాదా యొక్క సాకార మిలనము జరగలేదు. మనందరి మధురమైన దాదీ గుల్జార్‌గారు త్వరత్వరగా ఆరోగ్యాన్ని పుంజుకుని మధువనానికి రావాలి మరియు వారి ఆత్మిక దృష్టి ద్వారా మనమంతా బాప్‌దాదా దృశ్యాన్ని చూడాలి అన్నదే మనందరి శుభ ఆశ.
ఇకపోతే ఈ గ్రూపులో సేవ టర్ను ఢిల్లీ మరియు ఆగ్రా జోన్ వారిది. దేశవిదేశాలలోని ఇతర స్థానాల నుండి కూడా అనేకానేక సోదరసోదరీలు చేరుకున్నారు. అందరూ అమృతవేళ నుండే అవ్యక్త స్థితిలో ఉండి అవ్యక్త వతనపు షికారుకు వెళ్తున్నారు. ఇంతమంది సోదరసోదరీలు ఉన్నప్పటికీ నలువైపుల ఎంతో మంచి సైలెన్సు యొక్క వాతావరణం ఉంది. అందరూ బాబా ప్రేమలో లీనమై ఉన్నారు. అందరి హృదయాలలో బాబా స్మృతి ఇమిడి ఉంది. ప్రతిసారి వలె అవ్యక్త మిలనపు అలౌకిక విధుల క్లాసును విన్న తర్వాత ముఖ్యమైన పెద్దక్కయ్యలు సంగఠిత యోగ అభ్యాసమును చేయించారు. ఆ తర్వాత ప్రియమైన బాప్‌దాదాకు భోగ్‌ను స్వీకరింపజేసారు. భోగ్ తర్వాత 7 నుండి 8 వరకు, 18 మార్చి 2008 అవ్యక్త మహావాక్యాలను అందరూ వీడియో ద్వారా విన్నారు. ఆ తర్వాత దాదీలు మరియు పెద్ద అన్నయ్యలు మరియు అక్కయ్యలు తమ శుభ భావనలను తెలిపారు. ఈ రోజు ఇక్కడ వినిపించబడ్డ మహావాక్యాలను మీ వద్దకు పంపుతున్నాము. మీ మీ క్లాసులలో అందరినీ రిఫ్రెష్ చెయ్యగలరు. అచ్ఛా! అందరికీ స్మృతి... ఓం శాంతి...
5-4-2018 ఓం శాంతి “అవ్యక్త బాప్‌దాదా” వీడియో ద్వారా రివైజ్ మహావాక్యాలు 18-03-08 మధువనం
ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని అయిన బాప్‌దాదా తమ నలువైపుల ఖజానాలతో సంపన్నంగా ఉన్న పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి ఖజానాలో ఎన్ని ఖజానాలు జమ అయి ఉన్నాయి, ఇది చూసి హర్షిస్తున్నారు. ఖజానాలు అయితే అందరికీ ఒకే సమయంలో ఒకే విధంగా లభించాయి, అయినప్పటికీ జమ ఖాతా పిల్లలందరిదీ వేరువేరుగా ఉంది. సమయ ప్రమాణంగా ఇప్పుడు బాప్‌దాదా పిల్లలందరినీ సర్వ ఖజానాలతో సంపన్నంగా చూడాలని ఆశిస్తున్నారు. ఎందుకంటే ఈ ఖజానాలు కేవలం ఇప్పుడు ఒక్క జన్మ కోసం కాదు, ఈ అవినాశీ ఖజానాలు అనేక జన్మలు తోడుగా నిలువనున్నాయి. ఈ సమయంలోని ఖజానాల గురించి అయితే పిల్లలకు తెలుసు. బాప్‌దాదా ఏఏ ఖజానాలు ఇచ్చారో వాటి గురించి చెప్పగానే అవి అందరి ముందుకు వచ్చేసాయి. అందరి ఎదుట ఖజానాల లిస్టు ఇమర్జ్ అయిపోయింది కదా! ఎందుకంటే బాప్‌దాదా ముందుగానే వినిపించి ఉన్నారు, ఖజానాలు అయితే లభించాయి కానీ వాటిని జమ చేసుకునేందుకు విధి ఏమిటి? ఎవరు ఎంతగా నిమిత్తంగా మరియు నిర్మానంగా అవుతారో అంతగా ఖజానాలు జమ అవుతాయి. కావున పరిశీలించుకోండి - నిమిత్తంగా మరియు నిర్మానంగా అయ్యే విధితో మా ఖాతాలో ఎన్ని ఖజానాలు జమ అయి ఉన్నాయి? ఎంతగా ఖజానాలు జమ అయి ఉంటాయో, నిండుగా ఉంటాయో, వారి నడవడిక మరియు ముఖమునుండి నిండుతనముతో కూడిన ఆత్మ యొక్క ఆత్మిక నషా స్వతహాగా కనిపిస్తుంది. వారి ముఖముపై సదా ఆత్మిక నషా మరియు శుద్ధ గర్వము మెరుస్తూ ఉంటాయి. ఎంతగా శుద్ధ గర్వము ఉంటుందో అంతగా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. ఆత్మిక శుద్ధ గర్వము అనగా ఆత్మిక నషా కల నిశ్చింత చక్రవర్తికి గుర్తు. కావున, నా ముఖము మరియు నడవడికలో నిశ్చింత చక్రవర్తి యొక్క నిశ్చయము మరియు నషా ఉన్నాయా అని స్వయాన్ని పరిశీలించుకోండి. దర్పణమైతే అందరికీ లభించింది కదా! కావున హృదయము అనే దర్పణంలో తమ ముఖాన్ని పరిశీలించుకోండి. ఏ విధమైన చింత అయితే లేదు కదా? ఏమవుతుంది! ఎలా అవుతుంది! ఇలా అయితే జరుగదు కదా! ఏ సంకల్పమూ ఉండిపోలేదు కదా? ఏదైతే జరుగుతుందో అది చాలా మంచిది మరియు ఏదైతే జరుగనున్నదో అది చాలా చాలా మంచిది అన్న సంకల్పము నిశ్చింత చక్రవర్తులకు ఉంటుంది. దీనినే శుద్ధ గర్వము అని అంటారు, ఆత్మిక శుద్ధ గర్వము అనగా స్వమానధారి ఆత్మ. వినాశి ధనం కలవారు ఎంతగా సంపాదిస్తారో అంతగా సమయం అనుసారంగా చింతలో ఉంటారు. మీకు మీ ఈశ్వరీయ ఖజానాల గురించి చింత ఉందా? నిశ్చింతగా ఉన్నారు కదా! ఎందుకంటే ఎవరైతే ఖజానాలకు యజమానులుగా మరియు పరమాత్మకు సంతానముగా ఉంటారో వారు సదా స్వప్నంలో కూడా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు ఎందుకంటే ఈ ఈశ్వరీయ ఖజానాలు ఈ జన్మలోనే కాదు, అనేక జన్మలు మీకు తోడుగా నిలువనున్నాయి, తోడుగా ఉంటాయి అని వారికి నిశ్చయము ఉంటుంది. అందుకే వారు నిశ్చయబుద్ధి నిశ్చింతులుగా ఉంటారు.
మరి ఈరోజు బాప్‌దాదా నలువైపుల ఉన్న పిల్లల జమ ఖాతాను చూస్తున్నారు. విశేషంగా మూడు విధాల ఖజానాలను జమ చేసుకున్నారు మరియు చేసుకోగలరు అని ముందు కూడా వినిపించి ఉన్నాము. ఒకటి - తమ పురుషార్థం అనుసారంగా ఖజానాలు జమ చేసుకోవడము. ఇది ఒక ఖాతా. రెండవ ఖాతా - దీవెనల ఖాతా. దీవెనల ఖాతా జమ అయ్యేందుకు సాధనము - సదా సంబంధ సంపర్కం మరియు సేవలో ఉంటూ సంకల్పము, మాట మరియు కర్మ మూడింటిలో స్వయం కూడా స్వయంతో సంతుష్టంగా మరియు ఇతరులు కూడా, సర్వులు మరియు సదా సంతుష్టంగా ఉండాలి. సంతుష్టత దీవెనల ఖాతాను పెంచుతుంది. మరియు మూడవ ఖాతా - పుణ్య ఖాతా. పుణ్య ఖాతాకు సాధనము - ఏ సేవ చేసినా, మనసు ద్వారా కానీ, వాణి ద్వారా కానీ, కర్మ ద్వారా కానీ, సంబంధంలో కానీ, సంపర్కంలోకానీ సదా నిస్వార్థంగా మరియు అనంతమైన వృత్తి, స్వభావము, భావము మరియు భావనతో సేవ చేయడము. దీనితో పుణ్య ఖాతా స్వతహాగానే జమ అయిపోతుంది. కావున పరిశీలించుకోండి - పరిశీలించుకోవడమైతే వచ్చు కదా? వచ్చా? ఎవరికైతే రాదో వారు చేతులెత్తండి. ఎవరికైతే రాదో, ఎవ్వరూ లేరు - అంటే అందరికీ పరిశీలించుకోవడము వచ్చు. మరి స్వ పురుషార్థం యొక్క ఖాతా, దీవెనల ఖాతా, పుణ్య ఖాతా - ఈ మూడు ఎంత శాతంలో జమ అయి ఉన్నాయి అని పరిశీలించుకున్నారా? పరిశీలించుకున్నారా? ఎవరైతే పరిశీలించుకుంటారో వారు చేతులెత్తండి. పరిశీలించుకుంటూ ఉంటారా? మొదటి లైనువారు చెయ్యరా? పరిశీలించుకోరా? ఏమంటారు? చేస్తారు కదా! ఎందుకంటే ఇప్పుడు సమయము యొక్క సమీపత తీవ్రగతితో ముందుకు సాగుతుంది అని బాప్‌దాదా అయితే వినిపించి ఉన్నారు, సూచనను ఇచ్చి ఉన్నారు. కావున తమ చెకింగ్‌ను పదే పదే చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ రాజా పిల్లలుగా, రాజయోగి సో రాజా పిల్లలుగా చూడాలని ఆశిస్తున్నారు. పిల్లలు ఒక్కొక్కరు రాజా పిల్లలు అని పరమాత్మ తండ్రికి ఆత్మిక నషా ఉంది. పరమాత్మ సంతానము స్వరాజ్య అధికారి సో విశ్వ రాజ్యాధికారి.
మరి ఖజానాలైతే బాప్‌దాదా ద్వారా లభిస్తూనే ఉంటాయి. ఈ ఖజానాలను జమ చేసుకునేందుకు చాలా సహజమైన విధి - విధి అనండి లేక తాళం చెవి అనండి, అది తెలుసు కదా! జమ చేసుకునేందుకు తాళం చెవి ఏమిటి? తెలుసా? మూడు బిందువులు. ఈ తాళం చెవి అందరి వద్ద ఉంది కదా? మూడు బిందువులను పెట్టండి, ఖజానాలు జమ అవుతూ ఉంటాయి. మాతలకు తాళం చెవి పెట్టడం వచ్చు కదా, మాతలైతే తాళం చెవిని సంభాళించడంలో తెలివైనవారు! మరి మాతలందరూ ఈ మూడు బిందువుల తాళం చెవిని జాగ్రత్తగా పెట్టుకున్నారా? పెట్టుకున్నారా? చెప్పండి, మాతలూ, తాళం చెవి ఉన్నదా? ఎవరి వద్ద అయితే ఉన్నదో, వారు చేతులెత్తండి. తాళం చెవి దొంగిలించబడటం లేదు కదా? ఇంట్లోని ప్రతి వస్తువు యొక్క తాళం చెవిని సంభాళించడం మాతలకు బాగా వచ్చు. అలాగే ఈ తాళం చెవి కూడా ఎప్పుడూ మీతోటే ఉంటుంది కదా!
మరి వర్తమాన సమయం బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు – ఇప్పుడు సమయం సమీపిస్తున్న కారణంగా బాప్‌దాదా ఒక్క పదాన్ని పిల్లలందరి లోపల నుండి, సంకల్పం నుండి, మాట నుండి మరియు ప్రాక్టికల్ కర్మనుండి ఛేంజ్ చేయడాన్ని చూడాలనుకుంటున్నారు. ధైర్యముందా? బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరిలో ఈ ఒక్క పదంలోనే పరివర్తనను చూడాలనుకుంటున్నారు, ఈ ఒక్క పదమే పదే-పదే తీవ్ర పురుషార్థం నుండి నిర్లక్ష్యపు పురుషార్థీలుగా చేసేస్తుంది. మరి ఇప్పుడు సమయం అనుసారంగా ఎటువంటి పురుషార్థం కావాలి? తీవ్ర పురుషార్థము, అందరూ కూడా తాము తీవ్ర పురుషార్థీల లైన్లో రావాలని కోరుకుంటారు కానీ ఒక్క పదము నిర్లక్ష్యంగా చేసేస్తుంది. ఆ పదము ఏమిటో తెలుసా? పరివర్తన చేసుకోవడానికి తయారుగా ఉన్నారా? తయారుగా ఉన్నారా? చేతులెత్తండి, తయారుగా ఉన్నారా? చూడండి, మీ ఫోటో టి.విలో వస్తుంది. తయారుగా ఉన్నారు, మంచిది, అభినందనలు. అచ్ఛా – తీవ్ర పురుషార్థంతో పరివర్తనను తీసుకురావాలి, అంతేనా లేక చేద్దాములో, చూద్దాములే... ఇలా అయితే కాదు కదా? ఆ ఒక్క పదం గురించి అయితే తెలిసిపోయి ఉండవచ్చు, ఎందుకంటే అందరూ తెలివైనవారే. ఆ ఒక్క పదము, ‘కారణము’. కారణము అన్న పదాన్ని పరివర్తన చేసి నివారణ పదాన్ని ముందుకు తీసుకురండి. కారణము ముందుకు వస్తే లేక కారణాన్ని ఆలోచిస్తే నివారణ రాదు. కేవలం ఇది మాటల వరకే కాదు, ఈ కారణము అన్న పదము నివారణలోకి సంకల్పాల వరకు పరివర్తన అవ్వాలన్నది బాప్‌దాదా కోరుకుంటున్నారు. ఎందుకంటే కారణము భిన్న-భిన్న ప్రకారాలుగా ఉంటుంది. కారణాన్ని ఆలోచిస్తే, మాట్లాడితే, కర్మలోకి వస్తే తీవ్ర పురుషార్థం ఎదుట బంధనంగా అవుతుంది ఎందుకంటే మీ అందరూ బాప్‌దాదాతో ఒక ప్రతిజ్ఞ చేసారు, స్నేహంతో ప్రతిజ్ఞ చేసారు – మేమందరమూ కూడా విశ్వ పరివర్తన కార్యంలో బాబాతో ఉన్నాము. బాబా ఒంటరిగా లేరు, పిల్లలను తమతోపాటు తీసుకుంటారు. మరి విశ్వ పరివర్తన కార్యంలో మీ కార్యం ఏమిటి? సర్వ ఆత్మల కారణాన్ని కూడా నివారణ చేయాలి ఎందుకంటే ఈరోజుల్లో మెజారిటీ దుఃఖము మరియు అశాంతి ఉన్న కారణంగా ఇప్పుడు ముక్తిని కోరుకుంటున్నారు. దుఃఖమునుండి, అశాంతి నుండి, సర్వ బంధనాల నుండి ముక్తిని కోరుకుంటున్నారు, మరి ముక్తిదాతలు ఎవరు? బాబాతో పాటు మీరు కూడా ముక్తిదాతలు. మీ జడ చిత్రాల నుండి ఈరోజు వరకు ఏమి కోరుకుంటున్నారు? పెరుగుతున్న దుఃఖము, అశాంతిని చూసి మెజారిటీ ఆత్మలు ముక్తిదాతలైన మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. మనసులో ఉన్న దుఃఖంతో ఆక్రందనలు చేస్తున్నారు – ఓ ముక్తిదాతల్లారా, ముక్తిని ఇవ్వండి. మరి మీకు దుఃఖము, అశాంతితో ఆత్మలు చేస్తున్న ఆక్రందనలు వినిపించడం లేదా? ముక్తిదాతలుగా అయ్యి ముందు ‘కారణము’ అన్న పదాన్ని ముక్తి చేయండి. అప్పుడు స్వతహాగా ముక్తి యొక్క ధ్వని మీ చెవులకు వినిపిస్తుంది. ముందు మీరు ఈ ఒక్క పదం నుండి ముక్తులైతే ఇతరులను కూడా ముక్తి చేయగలరు. ఇప్పుడైతే రోజురోజుకూ, ఓ ముక్తిదాతల్లారా, ముక్తినివ్వండి అనే క్యూ రానుంది. కానీ ఇప్పటి వరకు తమ పురుషార్థంలో భిన్న భిన్న కారణాలు అనే పదం కారణంగా ముక్తి ద్వారము మూసి ఉంది. కావున ఈరోజు బాప్‌దాదా ఈ పదం నుండి, దీనితోపాటు అనేక బలహీన పదాలు వెంట వస్తాయి. ముఖ్యమైనది ‘కారణము’, అందులో అనేక బలహీనతలు కూడా ఉంటాయి, ఇలా, అలా, ఎలా – ఇవి కూడా దీని తోటి పదాలు. ద్వారము మూసి ఉండటానికి ఇవి కూడా కారణాలే.
మరి ఈరోజు బాప్‌దాదాకు ఈరోజు పిల్లల జమ ఖాతాను చూడాలన్న సంకల్పం వచ్చింది. చూసారు కూడా మరియు చూస్తూ ఉంటారు. ఎందుకంటే బాప్‌దాదా ముందుగానే పిల్లలకు సూచనను ఇచ్చి ఉన్నారు – జమ ఖాతాను జమ చేసుకునే సమయము ఈ సంగమ సమయము. ఈ సంగమయుగంలో ఎంత జమ చేసుకోవాలనుకుంటే అంతగా పూర్తి కల్పం కోసం ఖాతాను ఇప్పుడు జమ చేసుకోవచ్చు. తర్వాత జమ చేసుకునే బ్యాంకు మూసివేయబడుతుంది, అప్పుడు ఏమి చేస్తారు! బాప్‌దాదాకు పిల్లలపై ప్రేమ ఉంది కదా! పిల్లలు నిర్లక్ష్యము కారణంగా మర్చిపోతున్నారు, అయిపోతుందిలే, చూద్దాములే, చేస్తున్నాము కదా, నడుస్తున్నాము కదా! చాలా మజాతో అంటారు – మీకు కనిపించడం లేదా – మేము చేస్తున్నాము కదా, నడుస్తున్నాము కదా, ఇంకేమి చేయాలి... కానీ నడవడము మరియు ఎగరడములో ఎంతో తేడా ఉంది. నడుస్తున్నారు, అభినందనలు కానీ ఇప్పుడు నడిచే సమయం సమాప్తమైపోయింది, ఇప్పుడు ఎగిరే సమయము, అప్పుడే గమ్యాన్ని చేరుకోగలరు. సాధారణ ప్రజలలోకి రావడము, భగవంతుని పిల్లలు, సాధారణ ప్రజలా! బాగుంటుందా?
మొదటి సారి కలవడానికి వచ్చినవారు లేవండి. మొదటిసారిగా ఏ పిల్లలైతే ధైర్యమును ఉంచి వచ్చారో వారికి విశేషంగా బాప్‌దాదా ఈ సంగఠనలోని మజాను ఆనందిస్తున్నందుకు అభినందనలు ఇస్తున్నారు మరియు వరదానము కూడా ఇస్తున్నారు - ఆ వరదానము అమర భవ. ఈ వరదానము సదా అమృతవేళ మిలనమును జరుపుకున్న తర్వాత రోజంతటి కోసం పదే పదే గుర్తు చేసుకోండి. అమరుడను, అమరుడైన తండ్రి సంతానమును, అమర పదవిని ప్రాప్తి చేసుకునే ఆత్మను. జన్మ మరొకటి తీసుకున్నా కానీ సుఖశాంతులు అమరంగా ఉంటాయి. అచ్ఛా.
సేవ టర్ను ఢిల్లీ, ఆగ్రా వారిది:- ఏ జోన్‌కు సేవ టర్ను లభించినా కానీ వారు పెద్ద మనసుతో, మనస్ఫూర్తిగా అందరికీ అవకాశాన్ని ఇవ్వడాన్ని బాప్‌దాదా చూసారు. బాగుంది, డబల్ లాభం జరుగుతుంది. ఒకటి యజ్ఞ సేవ. యజ్ఞ సేవ యొక్క పుణ్యము చాలా గొప్పది. ఒకటికి లక్షింతలు ఫలితం లభిస్తుంది. యజ్ఞ మహిమ తక్కువేమీ కాదు. ఎవరు వచ్చినా కానీ వారికి చాలా లాభము ఉంటుంది. ఒకటి యజ్ఞ సేవ యొక్క పుణ్యము జమ అవుతుంది మరియు రెండవది ఇంతటి శ్రేష్ఠ ఆత్మల కలయిక మధువనంలోనే అవుతుంది. పాండవులు కావచ్చు, దాదీలు కావచ్చు, మహారథి సోదర సోదరీలు కావచ్చు, ఇంతటి అనంతమైన పరివారము ఒకే చోట ఎక్కడ లభిస్తుంది మీకు! సత్యయుగంలో కూడా చిన్న పరివారము ఉంటుంది. ఇంతటి వేలాది సంఖ్యలో ఉన్న పరివారము సత్యయుగంలో లభించదు, త్రేతాలో లభించదు, ద్వాపర కలియుగాలలో లభించదు. ఇటువంటి పరివారము, ఎప్పుడైనా విన్నారా! సంభాళించడమే కష్టమైపోతుంది. కానీ ఇక్కడ చూడండి అందరూ మజా మజాతో ఉంటున్నారు. మరి ఎంత లాభముంది. ఇంత పెద్ద పరివారముతో కలవడము ఎప్పుడూ జరగదు. అంతేకాక ఇది విశేషంగా భగవంతుని పరివారము.
అచ్చా, ఢిల్లీవారు భవిష్య రాజధాని ఢిల్లీని తయారు చెయ్యాలి కదా! పక్కా కదా! తయారుగా ఉన్నారు కదా! మరి ఇది చాలా పెద్ద పరివారము. అందరూ మీ ఢిల్లీలోకి వస్తారు. మీరు తోడుగా అవుతారా? మరి తయారీలు కూడా చెయ్యాలి కదా. మరి ఢిల్లీ తయారు చేసుకుందా? అందరినీ ఆహ్వానించారా? ఇప్పుడైతే ఢిల్లీ గందరగోళంగా ఉంది. రోజూ వార్తలు వింటే ఏమని వార్తలు వస్తున్నాయి? అలజడి, గందరగోళం. ఇప్పుడు ఏమి తయారవుతుంది? ఎటువంటి ఢిల్లీ తయారవుతుంది? స్వర్ణిమ ఢిల్లీ తయారవుతుంది. అందరికీ స్థానమును ఇస్తారు కదా. అందరినీ రాజధానిలోకి పిలుస్తారు కదా. మరి ఢిల్లీవారు ముందుగా ఢిల్లీని తయారు చెయ్యాల్సి ఉంటుంది. అప్పుడే అందరూ వస్తారు కదా. ఢిల్లీవారిలో విశేషతలు ఉన్నాయి. ఢిల్లీవారు ఎన్నో విశేషమైన సేవలను ఇమర్జ్ చేయడము బాప్‌దాదా చూసారు. అందుకు నిమిత్తమయ్యారు. ఢిల్లీని స్వర్ణిమ ఢిల్లీగా మార్చేందుకు ఎటువంటి ప్లాన్‌ను తయారుచెయ్యాలంటే అందరి హృదయాల నుండి వాహ్! నిమిత్తమైన ఢిల్లీవారు, మీరు మాకు స్వర్గపు రాజ్య భాగ్యాన్ని అందించారు అని రావాలి. ఎందుకంటే ఢిల్లీలోనే స్వర్గం తయారు కానుంది. స్థాపన అయితే అక్కడ జరుగనుంది. బాగుంది, సంగఠన కూడా బాగుంది మరియు సేవ ప్లాన్లను తయారుచెయ్యడంలో కూడా విశేష ఆత్మలు.
డబల్ విదేశీయులు కూడా వచ్చారు:- డబల్ విదేశీయులకు బాప్‌దాదా ఏమని టైటిల్ ఇచ్చారు? డబల్ తీవ్ర పురుషార్థి. డబల్ విదేశీయులైతే బాప్‌దాదా యొక్క విశ్వ పరివర్తకుడు అన్న టైటిల్‌ను సిద్ధి చేసారు అని ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. లేకపోతే అందరూ భారత కళ్యాణకారి అని అనేవారు, విదేశాల కారణంగా ప్రాక్టికల్‌గా విశ్వ కళ్యాణకారిగా అయ్యారు. ప్రతి సీజనులో డబల్ విదేశీయుల సంఖ్య పెరగడం బాప్‌దాదా చూసారు మరియు విశేషమైన పరివర్తన ఏమిటంటే మొదట్లో మా సంస్కృతి, భారతదేశ సంస్కృతి అని వినిపించేది ఇప్పుడు లేదు. పరివర్తన జరిగిపోయింది. ఇప్పుడు అందరిదీ ఒకే సంస్కృతి అయిపోయింది, బ్రాహ్మణ సంస్కృతి. ఇష్టమే కదా. బ్రాహ్మణ సంస్కృతి ఇష్టమే కదా. ఇష్టమే, అందుకే బాప్‌దాదాకు డబల్ విదేశీయులైన మీరంటే చాలా చాలా చాలా ఇష్టము. ఎందుకంటే విశేషత ఏమిటంటే ఏదైనా కార్యము చేస్తే పూర్తిగా చేస్తారు. ధైర్యమునుంచి అవును అంటే అవును, లేదు అంటే లేదు. ఇందులో తెలివైనవారు. అచ్ఛా.
నలువైపుల ఉన్న శ్రేష్ఠమైన విశేషమైన హోలీ మరియు హైయెస్ట్ పిల్లలకు, సదా స్వయమును తండ్రి సమానంగా సర్వ శక్తులతో సంపన్నంగా సర్వశక్తిమంతునిగా అనుభవం చేసేవారికి, సదా ప్రతి బలహీనత నుండి ముక్తులై ఇతర ఆత్మలకు కూడా ముక్తిని ఇచ్చే ముక్తిదాత పిల్లలకు, సదా స్వమానము అనే సీట్‌పై సెట్ అయ్యేవారికి, సదా అమరభవ అనే వరదానాన్ని అనుభవ స్వరూపంలోకి తీసుకువచ్చే వారికి, నలు వైపుల ఉన్న ఇటువంటి పిల్లలకు, ఎదురుగా కూర్చుని ఉన్నా కానీ, దూరంగా కూర్చుని స్నేహంలో ఇమిడిపోయిన పిల్లలకు ప్రియస్మృతులు మరియు తమ ఉల్లాస-ఉత్సాహము, పురుషార్థము యొక్క సమాచారము ఇచ్చేటువంటి వారికి బాప్‌దాదా నుండి చాలా చాలా హృదయపూర్వక ప్రియస్మృతులు మరియు హృదయపూర్వక పదమాపదమారెట్ల ప్రియస్మృతులను స్వీకరించండి మరియు రాజయోగి సో రాజ్య అధికారి పిల్లలందరికీ నమస్తే.