"సదా నషాలో ఉంటూ నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి, తీవ్ర పురుషార్థం ద్వారా సంపన్నంగా మరియు సమానంగా అయ్యి కలిసి వెళ్ళేందుకు తయారీలు చేసుకోండి"
ఓం శాంతి 15-11-2019 మధువనం
ప్రాణేశ్వరుడైన అవ్యక్త బాప్‌దాదాకు అతి స్నేహులు, సదా తీవ్ర పురుషార్థం ద్వారా సంపన్నంగా మరియు సమానంగా అయ్యి కలిసి నడిచేవారు, ఆత్మిక నషాలో ఉండి సదా నిశ్చింత చక్రవర్తి స్థితిని అనుభవం చేసుకునే సర్వ బ్రాహ్మణ కుల భూషణులైన సోదరసోదరీమణులు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.
తర్వాత సమాచారము - ప్రియమైన అవ్యక్త బాప్‌దాదా అవతరణ సీజన్లో ఈరోజు ఈ రెండవ మిలనంలో ఇండోర్ మరియు ఛత్తీస్‌ఘడ్(కమల అక్కయ్య) వారి టర్న్. షుమారు 15-16 వేల మంది సోదరసోదరీలు ప్రియమైన బాప్‌దాదా యొక్క మంగళకర మిలనాన్ని జరుపుకోవడానికి, తమ ఒడిని వరదానాలతో నింపుకోవడానికి మధుబనానికి చేరుకున్నారు. డబల్ విదేశీ బాబా పిల్లలకైతే ప్రతి గ్రూపులో విశేషమైన లాటరీ ఉండనే ఉంది. వారికోసం జ్ఞాన సరోవరంలో కొన్ని రోజులు రిట్రీట్ మరియు జ్ఞానయోగాల లోతైన క్లాసులు జరుగుతాయి. బాప్‌దాదా అవతరణ రోజున అందరూ డైమండ్ హాల్లో సంగఠిత రూపంలో సాయంకాలం విశేషంగా యోగ తపస్యతో పాటు ప్రియమైన బాప్‌దాదాను ఆహ్వానిస్తారు. ఆ తర్వాత వీడియో ద్వారా అవ్యక్త మహావాక్యాలను వింటున్నప్పుడు బాబా మన సమ్ముఖంలోనే ఉన్నట్లుగా అనుభవం అవుతుంది. సమయానుసారంగా వారు మన సంకల్పాలను క్యాచ్ చేసి విశేషంగా వరదానాలను ఇస్తూ శక్తిని నింపుతారు.
చిరునవ్వుతో ఉన్న బాబా ముఖం, వారి ఆత్మిక దృష్టి ప్రతి పిల్లవాడిని దృష్టితో పావనం చేస్తాయి. నేరుగా ఆకారీ రూపం ద్వారా ఈ ఆకారీ సో నిరాకారీ మిలనం జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. అందరూ తృప్తిగా, నిండుగా అయ్యి వెళ్తారు. సాకారంలో రాకపోయినా కానీ వతనం నుండే తమ పిల్లలకు పాలన ఇవ్వడము అన్నది ప్రియమైన బాబా చేసే ఇంద్రజాలం. దీనితోపాటు అనుభవజ్ఞులైన సోదరసోదరీల క్లాసులు లభిస్తాయి. ప్రతి ఒక్కరూ లోతైన యోగ తపస్య చేస్తారు. బాప్‌దాదా అవతకణ రోజున చాలా శక్తిశాలి వాతావరణం తయారవుతుంది. మన మధురమైన దాదీ జానకిగారు కూడా రోజూ సాయంకాలం అందరినీ కలిసి అందరిలో ఉల్లాస ఉత్సాహాలను నింపుతారు. సంగమంలో దాదీల పాలన కూడా చాలా శక్తిశాలి మరియు శ్రేష్ఠమైనది. భాగ్యశాలి ఆత్మలందరికీ ఈ పాలన లభిస్తుంది. అందరూ మన ప్రియమైన దాదీ గుల్జార్ గారికి కూడా మనస్ఫూర్తిగా దీవెనలు ఇచ్చారు. దాదీ ద్వారా బాబా మనందరికీ అమూల్యమైన రత్నాల శ్రేష్ఠమైన ఖజానా ఇచ్చారు. దాదీగారు ఇప్పటికీ ముంబయిలో ఉన్నాకానీ వారి సూక్ష్మ సకాశ్ మరియు శుభ భావనలు శాంతివన్ వాయుమండలంలో నలువైపుల వ్యాపించి ఉన్నాయి.
ఈరోజు మనందరం వీడియో ద్వారా మహావాక్యాలను విన్నాము, వాటిని మీ వద్దకు పంపుతున్నాము, పూర్తి క్లాసును రిఫ్రెష్ చేయగలరు. అచ్ఛా - అందరికీ స్మృతి... ఓం శాంతి.
15-11-19 ఓం శాంతి రివైజ్ వీడియో 15-12-11 మధువనం
సదా నషాలో ఉంటూ నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి, తీవ్ర పురుషార్థం ద్వారా సంపన్నంగా మరియు సమానంగా అయ్యి కలిసి వెళ్ళేందుకు తయారీలు చేసుకోండి
ఈరోజు బాప్‌దాదా నిశ్చింత చక్రవర్తుల సభను చూస్తున్నారు. ఇటువంటి సభ ఈ సమయంలోనే కనిపిస్తుంది ఎందుకంటే పిల్లలందరూ తమ ఫికర్ (చింత)ను బాబాకు ఇచ్చేసి ఫఖుర్ (నషా)ను తీసుకున్నారు. ఇప్పుడే ఈ సభ ఇలా అనిపిస్తుంది. మీరు కూడా ఉదయం లేచినప్పటినుండి కర్మలు చేస్తూ కూడా నిశ్చింతులుగా మరియు చక్రవర్తులుగా నడుచుకుంటున్నారు కదా! ఈ నిశ్చింత జీవితము ఎంత ప్రియంగా ఉంటుంది! నిశ్చింతకు గుర్తులు ఏమి కనిపిస్తాయి? నిశ్చింతులుగా ఉండే ప్రతి ఒక్కరి మస్తకంపై లైట్, ఆత్మ మెరుస్తూ కనిపిస్తుంది. ఇటువంటి నిశ్చింత జీవితము ఎలా తయారైంది? బాబా పిల్లలందరి జీవితాలనుండి ఫికర్ తీసేసుకుని ఫఖుర్ ఇచ్చేసారు. ఎవరి జీవితాలలో అయితే ఫఖుర్ కాక ఫికర్ కనిపిస్తుందో వారి మస్తకంపై లైట్ మెరుస్తూ కనిపించదు. వారి మస్తకంపై భారమైన రేఖలు కనిపిస్తాయి. మరి చెప్పండి, మీకు ఏది ఇష్టము? లైట్ ఇష్టమా, భారము ఇష్టమా? ఒకవేళ ఏదైనా భారము వచ్చినా కానీ భారము అంటే చింత, ఆ చింతను బాబాకు ఇచ్చేసి నిశ్చింతను తీసుకోవచ్చు. మీ అందరికీ నిశ్చింత జీవితము ఇష్టమే కదా! చూసేవారు కూడా నిశ్చింత జీవితాన్ని ఇష్టపడతారు.
బాప్‌దాదా ఈరోజు నలువైపుల ఉన్న పిల్లల, సమ్ముఖంలో ఉన్నా లేక మరింకెక్కడైనా కూర్చున్నా కానీ, పిల్లల మస్తకం మధ్యలో మెరుస్తున్న లైట్‌నే చూస్తున్నారు. మరి సదా నిశ్చింతగా ఉంటున్నారా లేక ఎప్పుడైనా ఏదైనా చింత కూడా వస్తుందా? ఏదైనా చింత ఉందా? బాబా ప్రకృతిజీతులుగా, వికారీజీతులుగా తయారు చేసినప్పుడు చింత ఎలా రాగలదు? నిశ్చింతులుగా అయ్యారా, అయితే చేతులెత్తండి. సదా అయ్యారా? సదా అయ్యారా లేక అప్పుడప్పుడా? అప్పుడప్పుడు వారు కూడా ఉన్నారా? అప్పుడప్పుడు వారు ఎవరైనా ఉన్నారా, అటువంటి వారెవరూ చేతులెత్తడం లేదు. బాప్‌దాదా కూడా చూడాలనుకోవడం లేదు. బాప్‌దాదా పిల్లలందరినీ నిశ్చింత చక్రవర్తులుగా చూడాలని ఆశిస్తున్నారు. ఒకవేళ అప్పుడప్పుడు వారు ఉన్నట్లయితే అందుకు సహజమైన విధి - ఏదైనా చింత వచ్చినట్లయితే ‘నాది’ అనేదాన్ని ‘నీది’ లోకి పరివర్తన చెయ్యండి. ఈ హద్దు యొక్క ‘నాది’ అన్నది సమాప్తమయ్యింది కదా! నా బాబా అని అన్నారు కదా. నా బాబా, ప్రియమైన బాబా, మధురమైన బాబా అని అందరూ మనస్ఫూర్తిగా అంటారు కదా! మరి ‘నాది’ అన్నదాన్ని ‘నీది’ లోకి ఇమడ్చడం కష్టమా? తేడా ఏమిటి? ‘నా’ మరియు ‘నీ’, ఇంత చిన్న తేడా మాత్రమే ఉంది. అన్నీ నీవే అని సంకల్పం చేసినప్పుడు నావంటూ ఏమి మిగిలాయి? నా బాబా.
బాప్‌దాదా ఏమి చూసారంటే మెజారిటీ పిల్లలు హద్దు యొక్క ‘నాది’ అన్నదాన్ని ‘నీది’ లోకి పరివర్తన చేసారు, అందుకే ఎలా అయ్యారు? నిశ్చింత చక్రవర్తులు. ఈరోజు బాప్‌దాదా పిల్లలను నిశ్చింత చక్రవర్తుల స్వరూపంలో చూడాలనుకుంటున్నారు. చూడండి, భక్తి మార్గంలో కూడా మీ చిత్రాలు తయారు చేసినప్పుడు డబల్ కిరీటాన్ని చూపిస్తారు. ప్రకాశ కిరీటమైతే ఉండనే ఉంటుంది ఎందుకంటే నిశ్చింత ఆత్మకు గుర్తు - మస్తకంపై లైట్ మెరుస్తూ ఉంటుంది మరియు రెండవ కిరీటము, వికారాలపై విజయులుగా అయ్యునందుకు గుర్తుగా కిరీటాన్ని చూపించారు. కావున ఈ అటెన్షన్‌ను ఉంచండి. బాప్‌దాదా ఫికర్ తీసుకుని ఫఖుర్ ఇచ్చినప్పుడు ఎలా అయిపోతారు? నిశ్చింత చక్రవర్తులు. చక్రవర్తులుగా అయితే సింహాసనం కూడా కావాలి కదా! అందుకే బాప్‌దాదా మిమ్మల్ని మూడు సింహాసనాలకు యజమానులుగా చేసారు. ఆ మూడు సింహాసనాలు ఏమేమిటో తెలుసా? ఒకటి, భృకుటి సింహాసనము. ఇదైతే అందరికీ ఉండనే ఉంది. రెండవ సింహాసనము, బాప్‌దాదా హృదయ సింహాసనము మరియు మూడవది, విశ్వ రాజ్య సింహాసనము. మరి మీ అందరికీ ఈ మూడు సింహాసనాలు ప్రాప్తించాయి కదా! అన్నిటికన్నా శ్రేష్ఠమైనది, బాప్‌దాదా హృదయ సింహాసనము. సింహాసనం పైనే ఉంటున్నారా అని పరిశీలించుకోండి. ఎందుకంటే బాప్‌దాదా హృదయ సింహాసనంపై ఎవరు కూర్చుంటారు? ఎవరైతే స్వయం కూడా బాప్‌దాదాను తమ హృదయ సింహాసనంపై కూర్చోపెట్టుకున్నారో, ఎవరైతే సదా శ్రేష్ఠ స్థితిలో మాస్టర్ సర్వశక్తిమంతులై ఉంటారో వారే బాప్‌దాదా హృదయ సింహాసనంపై కూర్చుంటారు. మరి సదా సింహాసనాధికారులుగా ఉంటున్నారా అన్నది పరిశీలించుకోండి. లేక అప్పుడప్పుడూ మట్టిలోకి కూడా వచ్చేస్తుంటారా? ఈ దేహభానము మట్టితో సమానము. ఎంతోకాలం మట్టిలోనే ఉన్నారు, మరి అప్పుడప్పుడూ మట్టిలోకి వెళ్ళిపోవడం లేదు కదా?
బాప్‌దాదా పిల్లలందరికీ సమయపు సూచనను ఇస్తున్నారు. ఆకస్మిక పాత్రను పక్కా చేస్తున్నారు. ఇందుకోసం ఈ సంగమ సమయానికి చాలా చాలా మహత్వాన్ని ఉంచవలసి ఉంటుంది ఎందుకంటే ఈ ఒక్క జన్మలో అనేక జన్మలకోసం ప్రాలబ్దాన్ని తయారు చేసుకోవాలి. అందుకే బాప్‌దాదా సూచన అయితే ఇచ్చారు. కావున సంగమ సమయంలో రెండు విషయాలపై అటెన్షన్‌ను ఇవ్వాలి. ఆ రెండు విషయాలైతే గుర్తు ఉండి ఉండవచ్చు - సమయము మరియు సంకల్పము. అందరూ ధైర్యంగా బాప్‌దాదాకు వ్యర్థ సంకల్పాలను సంకల్పం ద్వారా ఇచ్చే ధైర్యం చేసారు. మరి ఆ ధైర్యం సదా స్థిరంగా ఉంటుందా అని పరిశీలించుకోండి. ఎందుకంటే పిల్లల ధైర్యము ఒకసారి అయితే బాబా వేయి సార్లు సహయోగాన్ని అందిస్తారు. మరిప్పుడు ఏమి అనుకుంటున్నారు? ధైర్యం చేసి వ్యర్థ సంకల్పాల గురించి బాబా ఎదురుగా ఏ సంకల్పమైతే చేసారో అది స్థిరంగా ఉందా? ఎందుకంటే ఈ వ్యర్థ సంకల్పాలలో చాలా సమయం పోతుంది. ప్రస్తుత సమయ ప్రమాణంగా విశ్వాత్మలకు సందేశమును అందించడం మీ కార్యము. కావున వ్యర్థ సంకల్పాలను సమాప్తం చెయ్యాలి అప్పుడే దుఃఖ, అశాంత ఆత్మలకు సుఖశాంతుల అనుభవాన్ని చేయించగలరు. దుఃఖంతో ఉన్న ఆత్మలను చూసి బాప్‌దాదాకు దయ కలుగుతుంది. మీకు కూడా మీ సోదరసోదరీలను చూసి దయ కలుగుతుంది కదా!
బాప్‌దాదా ఏమి చూసారంటే వర్తమాన సమయంలో అందరికీ ఎంతో అభిరుచి ఉంది, ప్లాన్ కూడా తయారుచేసారు, ప్రాక్టికల్‌గా కూడా చేసారు. బాప్‌దాదా కూడా ఇదే కోరుకుంటారు, ప్రోగ్రాములైతే అందరూ చాలా బాగా చేసారు, ఇందుకు అభినందనలు కూడా తెలుపుతున్నారు. కానీ ఇప్పుడు సమయ ప్రమాణంగా త్వరత్వరగా వారిని వారసులుగా తయారు చెయ్యండి, ఎంతో కొంత వారసత్వానికి అధికారులుగా అవ్వాలి. బాగుంది, బాగుంది అని చాలా అంటారు, పిల్లల సేవకు ఈ రిజల్టును బాప్‌దాదా చాలా చూసారు, సంతోషిస్తున్నారు కూడా. మనస్ఫూర్తిగా చేస్తున్నారు. సమయ ప్రమాణంగా ఎంతో అభిరుచితో వింటున్నారు కూడా. ఈ తేడా అయితే వచ్చింది. మంచిగా ఉంది అని అంటున్నారు కానీ మంచిగా వారిని తయారుచేసి ఎంతో కొంత వారసత్వానికి అధికారులుగా చెయ్యండి. ఇందుకోసం బాప్‌దాదా ముందు కూడా సూచన ఇచ్చి ఉన్నారు - ఇప్పుడు సమయానుసారంగా తీవ్ర పురుషార్థీలుగా అయ్యే ఆవశ్యకత ఉంది. తీవ్ర పురుషార్థీలుగా అయ్యేందుకు ముఖ్య పురుషార్ధము - సెకండులో బిందువును పెట్టడము. సెకండు మరియు బిందువు, రెండూ సమానంగా ఉండాలి. బాప్‌దాదా అయితే పిల్లలను నిశ్చింత చక్రవర్తుల రూపంలోనే చూస్తున్నారు. ఇప్పుడు ఈ రూపాన్నే సదా అనుభవం చెయ్యండి. ఎప్పుడు ఏమి వచ్చినా కానీ ‘నాది’ అన్నదాన్ని ‘నీది’ లోకి మార్చేయండి.
బాప్‌దాదా పిల్లలందరినీ తమతో తీసుకువెళ్తానని మాట ఇచ్చారు. మరి కలిసి వెళ్ళేందుకు ఏ తయారీలు చేసుకోవాలి? బాబా అయితే సెకండులో అశరీరిగా అయిపోతారు కానీ, కలిసి వెళ్తాము అని మీరు మాట ఇచ్చారు, బాబా కూడా మాటిచ్చారు. మరి అందుకు కావలసిన తయారీలున్నాయా అని పరిశీలించుకోండి. సెకండులో బిందువు పెట్టేసి, సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయి వెళ్ళిపోవాలి. ఇటువంటి తయారీ ఉందా? కలిసి అయితే వెళ్ళాలి కదా? వెళ్ళాలా? తల ఊపండి. వెళ్ళాలా, మంచిది. పక్కా? చేతిలో చేయి వేయడము అంటే దాని అర్థము సమానంగా అవ్వడము అని. కావున పరిశీలించుకోండి. సమయమైతే అకస్మాత్తుగా రానుంది, మరి కలిసి వెళ్ళేంత తయారీ ఉందా?
బాబాకు పిల్లలపై ప్రేమ ఉంది కదా! ఒక్కరిని కూడా వెనుక విడిచి వెళ్ళడం బాబాకు ఇష్టం లేదు. కలిసి ఉన్నాము, కలిసి ఉంటాము, కలిసి వెళ్తాము మరియు రాజధానిలోకి, రాజ్య వంశంలోకి వస్తాము. సమ్మతమే కదా! సమ్మతమే కదా? తయారీ ఉందా? సమ్మతమేనా అన్న దానిలో అయితే చేతులెత్తుతారు. ఈ చేతులు ఎత్తకండి. తయారీ ఉన్నదా అన్నదాంట్లో చేతులెత్తండి. చేతులు పెద్దగా లేపండి. అచ్ఛా. రేపు వినాశనం జరిగినా కానీ తయారుగా ఉన్నారా? కానీ మీరు చెయ్యాల్సిన సేవను సమాప్తం చేసారా? సేవ ఇంకా మిగిలి ఉంది కదా లేక సేవ సమాప్తమైపోయిందా? అందరికీ సందేశం అందిందా? కేవలం మీ వీధిని చూసుకోండి. బాబా వచ్చేసారు, వారసత్వం తీసుకోవాలంటే తీసుకోండి అన్న సందేశాన్ని ఇచ్చారా? సందేశమైతే ఇవ్వవలసిందే. లేకపోతే ఫిర్యాదు వస్తుంది. ప్రతి ఇంట్లోనూ ఈ ఫిర్యాదు సమాప్తమవ్వడం ఇష్టమే కదా. మాకైతే తెలీలేదు, బాబా వచ్చారు మరియు వెళ్ళిపోయారు కూడా, వంచితమైపొయ్యాము అన్న ఫిర్యాదు ఉండిపోకూడదు. అందరికీ ఉత్సాహము ఉంది కదా! అందరికీ ఉత్సాహం ఉంది కదా? సేవ చేసి ఫిర్యాదును సమాప్తం చేసుకోండి. ఉత్సాహం ఉంటే బాప్‌దాదా సహయోగము కూడా ఉంటుంది. అచ్ఛా.
బాప్‌దాదా మనసులో ఉన్న ఆశ అయితే అందరికీ తెలుసు. సమానము మరియు సంపూర్ణము. ఈ రెండు మాటలను సదా పరిశీలించుకుంటూ ఉండండి. మరి బాబా ఆశను పూర్తి చేసారా? ఎందుకంటే బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ తమ ఆశా సితారలుగా చూస్తారు. పిల్లలందరికీ బాబాపై ప్రేమ ఉంది, ఇది బాప్‌దాదాకు కూడా తెలుసు. మీ అందరినీ మధుబన్కు తీసుకువచ్చేదేమిటి? ప్రేమ అనే రైలులో వస్తారు. ప్రేమ అనే విమానంలో వస్తారు. ప్రేమ సబ్జెక్టులో బాబా కూడా పిల్లల పట్ల సంతోషంగా ఉన్నారు. కానీ బాబా కోరుకుంటున్న రెండు పదాలు - సమానము మరియు సంపూర్ణము, దీనిని కూడా సంపన్నం చెయ్యాల్సిందే. ఈరోజు బాప్‌దాదా నలువైపుల ఉన్న పిల్లలకు, పిల్లల హృదయపూర్వక ప్రేమకు మనస్ఫూర్తిగా, స్నేహపూర్వకంగా ఒక్కొక్కరికీ అభినందనలు తెలుపుతున్నారు. అచ్ఛా.
సేవ టర్న్ ఇండోర్ జోన్ వారిది:- ఇటువంటి అవకాశం మంచిగా అనిపిస్తుంది కదా! సేవ ఖజానా సహజంగానే లభిస్తుంది. ఈ అవకాశాన్ని చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు, ఒకటి, సేవ ఫలితం లభిస్తుంది మరియు బలం కూడా లభిస్తుంది. అందరి దృష్టి దేనిపై ఉంటుంది? ఇప్పుడు ఏ జోన్ వారి టర్న్ అని అందరి దృష్టి ఉంటుంది. సేవ, మధుబన్ సేవ అంటేనే సేవ ఫలము మరియు బలము లభించడము. కావున చాలా మంచిగా చేసారు. నిర్విఘ్న సేవ చేసారు, అందరికీ సంతుష్టత అనే ఫలాన్ని తినిపించారు. బాప్‌దాదాకు సంతోషంగా ఉంటుంది ఎందుకంటే విశేషంగా అవకాశం లభిస్తుంది కదా. పిల్లలు మధుబన్కు చేరుకుంటారు. మధుబన్కు రావడము, ఇంత పెద్ద పరివారాన్ని కలవడము మరియు ఇంత పెద్ద పరివారము యొక్క సేవకు నిమిత్తంగా అవ్వడము, ఇది కూడా చాలా పెద్ద భాగ్యపు విషయము.
బాగుంది, ప్రతి ఒక్కరిపై బాబా దృష్టి కూడా ఉంటుంది, పరివారము యొక్క దృష్టి కూడా ఉంటుంది. ఆత్మలకు ప్రత్యక్షంగా సంతోషం కూడా లభిస్తుంది. సంతోష పరుస్తున్నారు మరియు సంతోషం లభిస్తుంది, రెండూ. కావున రెండింటికీ అభినందనలు.
డబల్ విదేశీ సోదరసోదరీలతో:- డబల్ విదేశీయులలోని సంస్కారం ఏమిటంటే ఏది చేసినా ఉల్లాస ఉత్సాహాలతో పూర్తి చేస్తారు మరియు పురుషార్థం వైపు కూడా అటెన్షన్ పెడ్తారు. మరి అందరూ తీవ్ర పురుషార్థీ లేనా అన్నదానిలో చేతులెత్తండి. తీవ్ర పురుషార్థీ లేనా? అచ్ఛా. అందరి తరఫు నుండి కూడా అభినందనలు, ఎందుకని? తీవ్ర పురుషార్థి అంటే బాప్‌దాదా ఆశలను పూర్తిగా ప్రాక్టికల్లోకి తీసుకువచ్చేవారు. కావున బాప్‌దాదా తీవ్ర పురుషార్థం కోసం అభినందనలు తెలుపుతున్నారు. తీవ్ర పురుషార్థీలుగా ఉన్నారు మరియు సదా తీవ్ర పురుషార్థిగా అయ్యి ఇతరులను కూడా తీవ్ర పురుషార్థీలుగా చేస్తారు. ఇలా పూర్తి విదేశము తీవ్ర పురుషార్థీ లిస్టులో వచ్చేయాలి. ఇటువంటి రికార్డ్ కొంత ఉంది, మరికొంత చూపించండి. బాప్‌దాదా పురుషార్థం కోసం అభినందనలు తెలుపుతున్నారు.
మొదటి సారి వచ్చినవారితో:- బాప్‌దాదా పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. వచ్చారు, రండి. ఇక ముందు తీవ్ర పురుషార్థం చేసి మున్ముందుకు వెళ్ళే దృఢ సంకల్పమును చెయ్యండి. దృఢత్వము సఫలతకు తాళం చెవి. ఈరోజు వచ్చిన పిల్లలందరికీ విశేషంగా దృఢత్వము అనే తాళం చెవిని బాప్‌దాదా బహుమతిగా ఇస్తున్నారు. దృఢత్వాన్ని ఎప్పుడూ తగ్గించుకోకండి. దృఢత్వము మిమ్మల్ని సదా సహజంగా ముందుకు తీసుకువెళ్తుంది. బాప్‌దాదా సంతోషిస్తున్నారు, రండి. మీ వారసత్వాన్ని పొందడానికి వచ్చారు. ఇందుకు చాలా చాలా అభినందనలు. అచ్ఛా.
నలువైపుల ఉన్న సర్వ బ్రాహ్మణులకు బాప్‌దాదా హృదయపూర్వక ప్రేమను మరియు ముందుకు వెళ్ళేందుకు శ్రేష్ఠ సంకల్పాన్ని ఇస్తున్నారు. పిల్లలు ఒక్కొక్కరిని బాబా చూస్తున్నారు కూడా మరియు చూస్తూ చూస్తూ హృదయంలో ఇముడ్చుకుంటున్నారు. దగ్గరగా ఉన్నవారైతే బాప్‌దాదాను ఎదురుగా చూస్తున్నారు మరియు ఇతరులు సాధనాల ద్వారా ఎదురుగానే చూస్తున్నారు. బాప్‌దాదా కూడా మీ అందరినీ ఎక్కడ కూర్చున్నాకానీ సమ్ముఖంలో కూర్చున్నట్లుగా చూస్తున్నారు మరియు ఒక్కొక్కరికీ హృదయపూర్వక ప్రేమను ఇస్తున్నారు. ముందుకు వెళ్తూ ఉండండి, తీవ్ర పురుషార్థం చేసి మున్ముందుకు వెళ్తూ ఉండండి. అచ్ఛా.
సమ్ముఖంగా కూర్చుని ఉన్నవారికి కూడా బాప్‌దాదా ప్రియస్మృతులు మరియు సదా ముందుకు వెళ్తూ ఉండేందుకు అభినందనలు, అభినందనలు, అభినందనలు. అచ్ఛా.
దాదీ జానకిగారు:- ఈరోజు అందరూ మంచి భావనను తీసుకున్నారు. వండర్ఫుల్ బాబా! ఈరోజు ఇప్పుడు బాబా నోటి నుండి మహావాక్యాలను వింటూ ఉంటే హృదయం నుండి నా బాబా అని వెలువడుతోంది. మధురమైన బాబా... బాబా నావారు, నేను బాబావారిని. నాలో నీది, నీలో నాది ఇముడ్చుకున్నాయి. వండర్ఫుల్ డ్రామా, వండర్ఫుల్ బాబా. అందరూ చాలా మంచి అనుభవం చేశారు. ఈరోజు బాప్‌దాదా యొక్క మహావాక్యాలను విన్నాము. నా భావన ఏమిటంటే, ఒక్క పదం కూడా మిస్ కాలేదు. మనం బాబాకు గారాల పిల్లలము కదా. బాబా మనలను లైట్‌గా చేసి మైట్‌ను ఇచ్చారు. బాబా అంటారు - పిల్లలూ, ఎల్లప్పుడూ లైట్‌గా ఉండండి, మైట్‌ను తీసుకోండి. అప్పుడు ఎవిరీథింగ్ రైట్ అవుతుంది. నేను సాక్షిగా ఉండి చూస్తున్నాను. మీరు కూడా అనుభవిస్తున్నారు. మొదట మనమందరం సాకారంలో పాలనను తీసుకున్నాము, చాలా బాగా. తరువాత అవ్యక్త పాలనను తీసుకున్నాము. ఈరోజు బాబా యొక్క మహావాక్యాలను వింటూ ఉన్నప్పుడు అవి హృదయానికి తాకాయి. బాబా హృదయాన్ని తీసుకున్నారు, ఇంకేమీ మిగలలేదు. బాబా అంటారు - పిల్లలూ, ఎల్లప్పుడూ హృదయంలో ఉండండి. దిలారామ్ను మీ తోడుగా చేసుకోండి మరియు సాక్షిగా ఉండి డ్రామాలోని ప్రతి సన్నివేశాన్ని చూస్తూ సంతోషపు పాదరసాన్ని పెంచుతూ ఉండండి. ఏ విషయం జరిగినా బిందువు పెట్టండి. బిందువు పెట్టడంలో ఎటువంటి శ్రమ లేదు. అది ప్రేమ యొక్క అనుభవం. సెకనులో బిందువు. క్వశ్చన్ మార్క్ పొడవుగా ఉంటుంది. ఎటువంటి ప్రశ్న లేదు. క్యూలో నిలబడవలసిన అవసరం లేదు. కలిసి నడిచే సహజ పురుషార్థాన్ని బాబా ఎంత సహజంగా చెప్పారో. అచ్ఛా!
*** ఓంశాంతి ***
