"శ్రేష్ఠ వృత్తితో శక్తిశాలి వైబ్రేషన్ మరియు వాయుమండలాన్ని తయారుచేసే తీవ్ర పురుషార్థీలుగా అవ్వండి, ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి"
17-10-2019 ఓం శాంతి “దినచర్య” మధువనం
ప్రాణప్రదమైన అవ్యక్త బాప్‌దాదాకు అతి స్నేహులు, సదా పరమాత్మ మిలనం యొక్క అనుభూతులలో నిమగ్నమయ్యేవారు, తమ శ్రేష్ఠ వృత్తి ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే తీవ్ర పురుషార్థీ నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు దేశవిదేశాలలోని సోదరసోదరీమణులు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.
తర్వాత సమాచారము - ప్రియమైన బాప్‌దాదా ఇంటిలో అవ్యక్త అనుభూతులు జరుపుకునే అలౌకిక సీజన్ ప్రారంభమయింది. అక్టోబర్ నెలలోని ఈ మొదటి టర్నులో ఉత్తర ప్రదేశ్ మరియు పశ్చిమ నేపాల్ వారిది సేవ టర్న్. భారతదేశంలోని విభిన్న స్థానాలతో పాటు అనేక దేశాల నుండి డబల్ విదేశీ సోదరసోదరీలు మధుబనానికి చేరుకున్నారు. డ్రామాలో ఈ అద్భుతమైన మిలన మేళా చాలా అతీతమైనది మరియు ప్రియమైనది, శోభాయమానమైనది. మన మధురమైన గుల్జార్ దాదీగారిని ప్రియమైన బాప్‌దాదా సాక్షిద్రష్ట స్థితిలో ఉంచి ముంబాయి గామ్దేవిలో కూర్చోబెట్టారు. అక్కడ నుండి వారి తపస్సు యొక్క వైబ్రేషన్లతో మధుబనంలో బాప్‌దాదా ఉపస్థితులైన అనుభవం కలిగిస్తున్నారు. ప్రతి ఒక్కరి మనసులలో ప్రియమైన బాప్‌దాదాతో పాటు దాదీగారి స్మృతి కూడా ఇమిడి ఉంది. దాదీ జానకిగారు అందరికీ చక్కని వైబ్రేషన్లు, స్నేహం, ప్రేమ నిండిన పాలనను ఇచ్చారు. ఇప్పటి వరకు అవ్యక్త రూపంతో సాకార పాలన లభించడమన్నది డ్రామాలోని అద్భుతమైన దృశ్యం, ఇప్పుడు నిరాకార రూపంతో పిల్లలందరినీ బాప్‌దాదా అన్ని రకాలుగా సంపన్నంగా చేస్తున్నారు. మధుబన ఇంటి పవిత్రమైన వైబ్రేషన్లు, సంగఠన శక్తి, అనుభవజ్ఞులైన సోదరసోదరీల అనుభవయుక్తమైన క్లాసులు మరియు అవ్యక్త బాప్‌దాదా యొక్క రివైజ్డ్ మురళిని వీడియో ద్వారా వినడము అందరినీ ఎంతో రిఫ్రెష్ చేస్తుంది. బాబా ఇంటికి ఎవరొచ్చినా కానీ అందరూ చాలా మంచి అనుభవాలు చేసుకుని వెళ్తారు.
జ్ఞాన సరోవరం, పాండవ భవనంలో డబల్ విదేశీ సోదరసోదరీలకు వేర్వేరుగా వర్క్‌షాపులు, క్లాసులు జరిగాయి. దీనికన్నా ముందు పీస్ ఆఫ్ మైండ్ మరియు కాల్ ఆఫ్ టైమ్ కార్యక్రమాలలో షుమారు 55 దేశాల నుండి సోదరసోదరీలు బాబా ఇంటికి చేరుకుని చాలా బాగా రిఫ్రెష్ అయ్యి వెళ్ళారు. 3 ఏప్రిల్ 2020 వరకు మీరంతా మీ మీ టర్నులలో మధుబన ఇంటికి వచ్చేందుకు ఆహ్వానం ఉంది. మేము బాబా ఇంట్లో సర్వ వరదానాలతో ఒడిని నింపుకోవాలన్న భావనతో అందరూ బాబా ఇంటికి వస్తారు.
బ్రాహ్మణులైన మీరంతా మీ శక్తిశాలి శుభ భావనల సకాశ్ను దాదీ గుల్జార్ గారికి పంపుతారని ఆశిస్తున్నాం, ఎంతగా అంటే డాక్టర్లు దాదీగారిని మధుబనానికి పంపటానికి అనుమతించాలి. అచ్ఛా - అందరికీ చాలా చాలా స్మృతి... ఓం శాంతి.
17-10-19 “అవ్యక్త బాప్‌దాదా” రివైజ్ వీడియో 17-03-07 మధువనం
శ్రేష్ఠ వృత్తితో శక్తిశాలి వైబ్రేషన్ మరియు వాయుమండలాన్ని తయారుచేసే తీవ్ర పురుషార్థీలుగా అవ్వండి, ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి
ఈరోజు ప్రేమ మరియు శక్తి సాగరుడైన బాప్‌దాదా తమ స్నేహి పిల్లలను, చాలాకాలం తర్వాత కలిసిన పిల్లలను మరియు గారాల పిల్లలను కలిసేందుకు వచ్చారు. పిల్లలందరూ కూడా దూరదూరాల నుండి స్నేహపు ఆకర్షణలో మిలనాన్ని జరుపుకోవడానికి చేరుకున్నారు. సమ్ముఖంలో కూర్చున్నా, దేశ విదేశాలలో కూర్చుని ఉన్నాకానీ స్నేహ మిలనాన్ని జరుపుకుంటున్నారు. నలువైపుల ఉన్న సర్వ స్నేహి, సర్వ సహయోగి, తోడుగా ఉండే పిల్లలను చూసి బాప్‌దాదా హర్షిస్తున్నారు. ఇప్పుడు త్వరత్వరగా బాబాను ప్రత్యక్షం చేయాలన్న సంకల్పం మెజారిటి పిల్లల మనసులలో ఉండటాన్ని బాప్‌దాదా చూస్తున్నారు. పిల్లల ఉత్సాహం చాలా బాగుంది, కానీ ముందుగా స్వయాన్ని బాబా సమానంగా సంపన్నంగా, సంపూర్ణంగా ప్రత్యక్షం చేసుకున్నప్పుడే బాబాను ప్రత్యక్షం చేయగలరని బాబా అంటున్నారు. ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది అని పిల్లలు బాబాను అడుగుతారు? మీరు ఎప్పుడు స్వయాన్ని బాబా సమానంగా ప్రత్యక్షం చేసుకుంటారు అని బాబా కూడా పిల్లలను అడుగుతున్నారు? మీరు సంపన్నంగా అయ్యేందుకు తారీఖును ఫిక్స్ చేసుకున్నారా? విదేశీయులు దేనికైనా ఒక సంవత్సరం ముందే డేట్‌ను ఫిక్స్ చేసుకుంటారు కదా, మరి స్వయాన్ని బాబా సమానంగా తయారు చేసుకోవడానికి పరస్పరంలో మీటింగ్ పెట్టుకుని తారీఖును ఫిక్స్ చేసుకున్నారా?
ఈరోజుల్లో ప్రతి వర్గంవారి మీటింగులు జరగడాన్ని బాప్‌దాదా చూస్తున్నారు. డబల్ విదేశీయుల మీటింగ్ గురించి బాప్‌దాదా విన్నారు. మంచిగా అనిపించింది. అన్ని మీటింగులు బాప్‌దాదా వద్దకు చేరుకుంటాయి. ఈ డేట్‌ను ఎప్పుడు ఫిక్స్ చేస్తారని బాప్‌దాదా అడుగుతున్నారు? ఈ డేట్‌ను డ్రామా ఫిక్స్ చేస్తుందా లేక మీరు ఫిక్స్ చేస్తారా? ఎవరు చేస్తారు? లక్ష్యమైతే మీరే పెట్టుకోవాలి కదా. లక్ష్యమైతే చాలా మంచిగా, గొప్పగా పెట్టుకున్నారు. ఎటువంటి లక్ష్యం పెట్టుకున్నారో దాని అనుసారంగా లక్షణాలను తీసుకురావడం ఇప్పుడు కావాలి, శ్రేష్ఠ లక్ష్యం సమానంగా తయారుకావాలి. ఇప్పుడు లక్ష్యం మరియు లక్షణాలలో తేడా ఉంది. లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా అయినప్పుడు లక్ష్యం ప్రాక్టికల్లోకి వస్తుంది. పిల్లలందరూ అమృతవేళ మిలనం జరుపుకున్నప్పుడు, సంకల్పం చేస్తున్నప్పుడు చాలా బాగా చేస్తారు. నలువైపుల ఉన్న పిల్లల ఆత్మిక సంభాషణను బాప్‌దాదా వింటారు. చాలా అందమైన మాటలు చెప్తారు. పురుషార్థం కూడా చాలా బాగా చేస్తారు కానీ పురుషార్థంలో ఒక్క విషయంలో తీవ్రత రావాలి. పురుషార్థం ఉంది కానీ తీవ్ర పురుషార్థం కావాలి. తీవ్రత అనే దృఢతను జత చేయండి.
బాప్‌దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరిపట్ల ఇదే ఆశ ఉంది - సమయానుసారంగా ప్రతి ఒక్కరూ తీవ్ర పురుషార్థీలుగా అవ్వాలి. నంబరువారీగా ఉన్నా కానీ ఫర్వాలేదు, బాప్‌దాదాకు తెలుసు కానీ నంబరువారీలో కూడా తీవ్ర పురుషార్థం సదా ఉండాలి, ఈ ఆవశ్యకత ఇప్పుడు ఉంది. సమయం సంపన్నం కావడంలో తీవ్రంగా వెళ్తుంది. ఇప్పుడు పిల్లలు బాబా సమానంగా అవ్వవలసిందే, ఇది కూడా నిశ్చితమే, ఇందులో తీవ్రత రావాలి. నేను సదా తీవ్ర పురుషార్థిగా ఉన్నానా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకోండి. ఎందుకంటే పురుషార్థంలో పేపర్లు అయితే చాలానే వస్తాయి. వస్తూనే ఉంటాయి కానీ తీవ్ర పురుషార్థి పేపరులో పాస్ అవ్వడం ఎంత నిశ్చితమంటే తీవ్ర పురుషార్థి పేపరులో పాస్ అయ్యే ఉన్నారు. అవ్వాలి కాదు, అయ్యే ఉన్నారు, ఇది నిశ్చితము. సేవ కూడా అందరూ ఎంతో అభిరుచితో చేస్తున్నారు కానీ వర్తమాన సమయ ప్రమాణంగా ఒకే సమయంలో మనసా-వాచ-కర్మణ అనగా నడవడిక మరియు ముఖం ద్వారా మూడు రకాల సేవలు జరగాలి అని బాప్‌దాదా ముందే చెప్పి ఉన్నారు. మనసు ద్వారా అనుభవం చేయించడం, వాణి ద్వారా జ్ఞాన ఖజానాల పరిచయాన్ని ఇవ్వడం మరియు నడవడిక మరియు ముఖం ద్వారా సంపూర్ణ యోగి జీవితాన్ని ప్రాక్టికల్‌గా అనుభవం చేయించడం, మూడు సేవలు ఒకేసారి జరగాలి. వేరువేరుగా కాదు, సమయం తక్కువగా ఉంది, చేయవలసిన సేవ ఇంకా చాలా ఉంది. వృత్తి ద్వారా వైబ్రేషన్లు తయారు చేయడము మరియు వైబ్రేషన్ల ద్వారా వాయుమండలాన్ని తయారు చేయడము అన్నిటికన్నా సహజమైన సేవా సాధనంగా బాప్‌దాదా చూసారు. ఎలా అయితే సైన్స్ రాకెట్ వేగంగా వెళ్తుందో అలాగే మీ ఆత్మిక శుభ భావన, శుభ కామనల వృత్తి, దృష్టి మరియు సృష్టిని మార్చేస్తుంది. ఒక్క స్థానంలో కూర్చునే వృత్తి ద్వారా సేవను చేయగలరు. విన్న విషయాన్ని మర్చిపోవచ్చు కానీ వాయుమండలం యొక్క అనుభవాన్ని మర్చిపోలేరు. మధుబనం అంటే బ్రహ్మా బాబా గారి కర్మభూమి, యోగ భూమి, చరిత్ర భూమి అని అనుభవం చేసుకుంటారు కదా. ఇప్పటివరకు కూడా ప్రతి ఒక్కరూ ఆ వాయుమండలం ఇచ్చిన అనుభూతులను మర్చిపోలేరు. వాయుమండలం ఇచ్చే అనుభవం మనసులో ముద్ర పడిపోతుంది. వాణి ద్వారా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు కానీ ప్రతి ఒక్కరికీ మీ శ్రేష్ఠ ఆత్మిక వృత్తి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా వాయుమండలాన్ని తయారు చేసి అనుభూతిని ఇవ్వండి. ఎప్పుడైతే మీ మనసులో, హృదయంలో ఎవ్వరిపట్ల కూడా చెడు వృత్తి నిండిన వైబ్రేషన్లు లేకుండా ఉంటుందో అప్పుడే వృత్తి ఆత్మికంగా మరియు శక్తిశాలిగా ఉంటుంది. మీ మనసు యొక్క వృత్తి సదా స్వచ్ఛంగా ఉండాలి ఎందుకంటే ఏ ఆత్మ పట్ల అయినా ఒకవేళ వ్యర్థ వృత్తి లేక జ్ఞానం ప్రకారంగా ప్రతికూల వృత్తి ఉంటే, నెగెటివ్ అంటే చెత్త అని అర్థం, ఒకవేళ మనసులో చెత్త ఉంటే శుభ వృత్తితో సేవను చేయలేరు. కావున, నా మనసులోని వృత్తి శుభమైనదిగా, ఆత్మికంగా ఉన్నదా అని ముందుగా స్వయాన్ని పరిశీలించుకోండి. నెగెటివ్ వృత్తిని కూడా మీలోని శుభ భావన మరియు శుభ కామనల ద్వారా నెగెటివ్ నుండి పాజిటివ్ లోకి మార్చగలరు ఎందుకంటే నెగెటివ్‌తో మీ మనసే కలతగా ఉంటుంది కదా! వ్యర్థ ఆలోచనలు అయితే వస్తాయి కదా! నా మనసులో ఏదైనా గందరగోళం లేదు కదా అని ముందుగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నంబరువారీగా అయితే ఉంటారు, మంచిగా కూడా ఉన్నారు అలాగే గందరగోళంతో కూడా ఉన్నారు. వీరు ఇలాంటివారు అని అర్థం చేసుకోవడం మంచిదే. రాంగ్‌ను (తప్పును) రాంగ్గా అర్థం చేసుకోవాలి. రైట్ను (ఒప్పును) రైట్‌గా అర్థం చేసుకోవాలి కానీ మనసులో పెట్టుకోకూడదు. అర్థం చేసుకోవడం వేరు, నాలెజ్ఫుల్ అవ్వడం మంచిది, రాంగ్‌ను రాంగ్ అనైతే చెప్పాలి కదా! బాబా, వీరేమిటో మీకు తెలీదు, మీరు చూస్తే మీకే తెలుస్తుంది అని కొందరంటారు. బాబా మీ మాటను ఒప్పుకుంటున్నారు. మీరు చెప్పకముందే బాబా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు, కానీ ఇలాంటి విషయాలను మీ మనసులో, వృత్తిలో పెట్టుకోవడం వలన స్వయం కూడా పరేషాన్ అవుతున్నారు కదా. పాడైన వస్తువు మనసులో ఉంటే, హృదయంలో ఉంటే, ఎక్కడ పాడైన వస్తువు ఉంటుందో, వేస్ట్ థాట్స్ (వ్యర్థ సంకల్పాలు) ఉంటాయో, వారు విశ్వ కళ్యాణకారిగా ఎలా అవ్వగలరు? మీ అందరి వృత్తి ఏమిటి? మేము లండన్ కళ్యాణకారులం, ఢిల్లీ కళ్యాణకారులం, యూ.పి కళ్యాణకారులం అంటారా? లేదా ఉండేది ఎక్కడైనా కానీ, దేశం కాకపోయినా కానీ సెంటర్ కళ్యాణకారులం అంటారా? అందరూ స్వయాన్ని విశ్వ కళ్యాణకారి అనే అంటారు కదా! మరి అందరూ ఎవరు? విశ్వ కళ్యాణకారులేనా? అయితే చేతులెత్తండి (అందరూ చేతులెత్తారు) విశ్వ కళ్యాణకారులు. విశ్వ కళ్యాణకారులు. అచ్ఛా. మరి మనసులో ఎటువంటి చెడు లేదు కదా? అర్థం చేసుకోవడం వేరు, ఇది రైటు, ఇది రాంగ్ అని అర్థం చేసుకోండి, కానీ మనసులో పెట్టుకోవద్దు. మనసులో అటువంటి వృత్తి పెట్టుకోవడం వలన దృష్టి మరియు సృష్టి మారిపోతాయి. బాప్‌దాదా హోమ్‌వర్కును ఇచ్చారు, ఏమి ఇచ్చారు? అన్నిటికన్నా సహజ పురుషార్థం, ఇది అందరూ చేయగలరు, మాతలు కూడా చేయగలరు, వృద్ధులు కూడా చేయగలరు, పిల్లలు కూడా చేయగలరు, ఇదే విధిని ఇచ్చారు, కేవలం ఒక్క పని చేయండి, ఎవరిని కలిసినా కానీ - “ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి.” వారు శాపమిచ్చినా సరే, మీరు ఏమని కోర్స్ చేయిస్తారు? నెగెటివ్‌ను పాజిటివ్ లోకి మార్చే కోర్స్ చేయిస్తారు కదా, ఆ సమయంలో మీరు స్వయానికి కోర్స్ చేయించుకోండి. ఛాలెంజ్ ఏమి చేసారు? ప్రకృతిని కూడా తమోగుణి నుండి సతోగుణిగా చెయ్యవలసిందే అని ఛాలెంజ్ చేసారు కదా. ఇదే కదా ఛాలెంజ్. అవునా? ప్రకృతిని కూడా సతోప్రధానంగా చెయ్యవలసిందే అన్న ఛాలెంజ్ అందరూ చేసారు కదా? అవునా? తల ఊపండి, చేయి ఊపండి. చూడండి, ఊరికే అలా ఊపకండి. మనస్ఫూర్తిగా ఊపండి ఎందుకంటే ఇప్పుడు సమయానుసారంగా వృత్తితో వాయుమండలాన్ని తయారు చేసే తీవ్ర పురుషార్థం యొక్క ఆవశ్యకత ఉంది. మరి వృత్తిలో ఒకవేళ కొంచెమైనా కూడా చెత్త ఉంటే, మరి వృత్తితో వాయుమండలాన్ని ఎలా తయారు చేస్తారు? ప్రకృతి వరకు మీ వైబ్రేషన్లు వెళ్తాయి కానీ వాణి కాదు. వైబ్రేషన్లు వెళ్తాయి, వైబ్రేషన్లు వృత్తితో తయారవుతాయి, వైబ్రేషన్లతో వాయుమండలం తయారవుతుంది. మధుబనంలో కూడా అందరూ ఒకలా ఉండరు. కానీ బ్రహ్మా బాబా మరియు అనన్య పిల్లల వృత్తి ద్వారా, తీవ్ర పురుషార్థం ద్వారా వాయుమండలం తయారైంది.
ఈరోజు మీ దాదీ గుర్తుకు వస్తున్నారు. (ఆ సమయంలో దాదీ గారు ఆరోగ్యం కారణంగా ముంబై లో ఉన్నారు) దాదీలో ఏ విశేషతను చూసాము? ఎవరు కంట్రోల్ చేసారు? ఎప్పుడూ, ఎటువంటి వృత్తితో ఉన్నవారి లోపాలను దాదీ తమ మనసులో పెట్టుకోలేదు. అందరికీ ఉత్సాహాన్ని ఇచ్చేవారు. మీ జగదాంబ తల్లి వాయుమండలాన్ని తయారు చేసారు. అన్నీ తెలిసి కూడా తమ వృత్తిని శుభంగా పెట్టుకున్నారు. ఆ వాయుమండలం యొక్క అనుభవాన్ని ఇప్పుడు మీరంతా చేసుకుంటున్నారు. ఫాలో ఫాదర్, అయినా కానీ, ప్రతి ఒక్కరి విశేషతలను తెలుసుకుని ఆ విశేషతలను మీ సొంతం చేసుకోండి అని బాప్‌దాదా ఎప్పుడూ అంటారు. బాప్‌దాదా పిల్లలుగా అయిన వారందరిలో, మూడవ నంబర్ వారైనా కానీ, డ్రామా విశేషత అనండి, బాప్‌దాదా వరదానం అనండి, పిల్లలందరిలో 99 తప్పులున్నా కానీ ఒక్క విశేషత అయితే తప్పకుండా ఉంటుంది. ఆ విశేషత ఆధారంగానే నా బాబా అనేందుకు హక్కుదారులు అయ్యారు. పరవశులే కానీ బాబాపై ప్రేమ ఎడతెగనిదిగా ఉంది. అందుకని బాప్‌దాదా ఇప్పుడు సమయం యొక్క సమీపత అనుసారంగా ప్రతి ఒక్కరూ, బాబా స్థానాలు ఏవైనా, గ్రామం కావచ్చు, పెద్ద జోన్లు కావచ్చు, సెంటర్లలో ఉండేవారు కావచ్చు, ప్రతి స్థానం మరియు తోడుగా ఉండేవారిలో శ్రేష్ఠ వృత్తి యొక్క వాయుమండలం ఆవశ్యకము. కేవలం ఒక్క మాట గుర్తుంచుకోండి, ఒకవేళ ఎవరైనా శాపమిచ్చినా కానీ, తీసుకునేదెవరు? ఇచ్చేవారు, తీసుకునేవారు ఒక్కరేనా, ఇద్దరా? ఎవరైనా మీకు పాడైన వస్తువు ఇస్తే, మీరేమి చేస్తారు? మీ వద్ద పెట్టుకుంటారా? తిరిగి ఇచ్చేస్తారా లేక పారేస్తారా లేక అల్మారీలో భద్రంగా పెట్టుకుంటారా? మనసులో భద్రంగా పెట్టుకోకండి ఎందుకంటే మీ హృదయం బాప్‌దాదా యొక్క హృదయ సింహాసనం. కనుక, ఇప్పుడు ఒక్క మాట మనసులో పక్కాగా పెట్టుకోండి, నోటిలో కాదు, మనసులో గుర్తుంచుకోండి - ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఎటువంటి నెగెటివ్ విషయాన్ని మనసులో పెట్టుకోవద్దు. సరే, ఒక చెవితో విన్నారు. రెండో చెవితో వదిలిపెట్టడము మీ పనా లేక వేరేవారి పనా? అప్పుడే విశ్వంలో, ఆత్మలలో ఫాస్ట్ గతి యొక్క సేవ, వృత్తి ద్వారా వాయుమండలం తయారయ్యే సేవ జరగగలదు. విశ్వ పరివర్తన చేయాలి కదా! మరి ఏమి గుర్తు పెట్టుకుంటారు? మనసులో గుర్తుపెట్టుకున్నారా? ఆశీర్వాదం అన్న మాట గుర్తుంచుకోండి, చాలు ఎందుకంటే మీ జడమైన చిత్రాలు ఏమిస్తాయి? ఆశీర్వాదాలు ఇస్తాయి కదా! మందిరంలోకి వెళ్ళి ఏమి కోరుకుంటారు? ఆశీర్వాదం కోరుకుంటారు కదా! ఆశీర్వాదం లభిస్తుంది కనుకనే ఆశీర్వాదాలు అడుగుతారు కదా. మీ జడమైన చిత్రాలు అంతిమ జన్మలో కూడా ఆశీర్వాదాలు ఇస్తాయి, వృత్తితో వారి కామనలను పూర్తి చేస్తాయి. మరి మీరు పదే పదే ఇటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేవారిగా అయ్యారు అందుకనే మీ చిత్రాలు కూడా ఈరోజు వరకు ఆశీర్వాదాలు ఇస్తున్నాయి. పరవశులై ఉన్న ఆత్మలను కొంచెం క్షమాసాగరుని పిల్లలై క్షమిస్తే మంచిదే కదా! మీరంతా మాస్టర్ క్షమా సాగరులు కదా? అవునా కాదా? అవును కదా? ఇందులో ముందు నేను అనండి. ఇందులో హే అర్జునులుగా అవ్వండి. ఎవరు మీ ముందుకు వచ్చినా కానీ వారు స్నేహం, సహయోగం తీసుకోవాలి, క్షమ, ధైర్యం, సహయోగం, ఉల్లాస ఉత్సాహాలు ఏదో ఒకటి అనుభవం చేసుకుని వెళ్ళాలి. ఇలా వీలవుతుందా? వీలవుతుందా? ముందు లైనులో ఉన్నవారు, వీలవుతుందా? చేతులెత్తండి. ముందు చేయాల్సి ఉంటుంది. మరి అందరూ చేస్తారా? టీచర్లు చేస్తారా? అచ్ఛా..
ఇప్పుడు విశ్వానికి చాలా ఆవశ్యకత ఉంది. మీరు నివారణమూర్తులుగా అవ్వండి. మీరు నివారణమూర్తులుగా అవ్వడం వలన ఆత్మలు నిర్వాణంలోకి వెళ్ళగలవు. ఒకవేళ మీరు నివారణమూర్తులుగా అవ్వకపోతే ఆత్మలు పాపం నిర్వాణంలోకి వెళ్ళలేవు. నిర్వాణ ద్వారాలు మీరే తెరవాలి. బాబాతోపాటు మీరు ద్వారాలు తెరుస్తారు కదా! గేట్ సెరిమనీ చేస్తారు కదా? ఇప్పుడు పరస్పరం ఆలోచించుకుని డేట్‌ను ఫిక్స్ చేయండి.
అనేక స్థానాలలోని పిల్లలనుండి ఈమెయిల్ మరియు ఉత్తరాలు వస్తూనే ఉంటాయి. ఎవరైతే ఉత్తరం రాయలేదు కానీ సంకల్పం చేసారో, సంకల్పం చేసినవారి ప్రియస్మృతులు కూడా బాప్‌దాదా వద్దకు చేరుకున్నాయి. ఉత్తరాలు చాలా మధురంగా వ్రాస్తారు. ఉత్తరాలు చూస్తే వీరు ఉల్లాస ఉత్సాహాలలో ఎప్పుడూ ఎగురుతూనే ఉంటారని అనిపిస్తుంది. ఇదీ మంచిదే. ఉత్తరం రాయడం వలన స్వయాన్ని బంధనంలో బంధిస్తారు, ప్రతిజ్ఞ చేస్తారు. నలువైపుల ఉన్న పిల్లలకు, ఎవరు ఎక్కడ నుండి వింటున్నా, చూస్తున్నా కానీ, అందరికీ బాప్‌దాదా సమ్ముఖంలో ఉన్నవారికన్నా ముందే ప్రియస్మృతులు ఇస్తున్నారు ఎందుకంటే ఒక చోట ఒక సమయం, మరో చోట మరో సమయం అని బాప్‌దాదాకు తెలుసు, అయినా కానీ అందరూ ఎంతో ఉత్సాహంగా కూర్చుని ఉన్నారు, గుర్తుగా వింటున్నారు కూడా. మంచిది.
సేవా టర్న్ యూ.పి, బనారస్ మరియు పశ్చిమ నేపాల్ వారిది:- (ఎదురుగా టీచర్లు నిల్చుని ఉన్నారు) వీరంతా టీచర్లు. రెండు వైపుల టీచర్లు ఉన్నారు. బాగుంది. బాప్‌దాదాకు టీచర్లపై ఎంతో గర్వంగా ఉంటుంది ఎందుకంటే ధైర్యంతో సమర్పణ అయ్యి పూర్తి జీవితాన్ని సేవ కోసం వినియోగించాలన్న సంకల్పం చేసారు. టీచర్లు పక్కాగా ఉన్నారు కదా? పక్కాగా ఉన్నారా లేక కొంచెం కచ్చాగా ఉన్నారా? టీచర్లు కచ్చాగా ఉండవద్దు. టీచర్లు అంటే మీ ఫీచర్లతో ఫ్యూచర్ (భవిష్యత్తు)ను చూపించేవారు. ఇప్పుడు సంగమయుగం యొక్క భవిష్యత్తు - ఫరిశ్తా భవ. భవిష్యత్తు యొక్క ఫీచర్లు - దేవతా భవ. మేము ఫరిశ్తా సో దేవతలుగా అవ్వవలసిందే అన్న డబల్ నషా, వచ్చిన సేవాధారి గ్రూపుకు ఉంది. అందరూ పక్కాగా ఉన్నారా? చూడండి, మీ ఫోటో తీస్తున్నారు, ఫోటోలో కనిపించకుండా ఉండేలా ఉండద్దు, పక్కాగా ఉండండి. ఎందుకంటే ఎక్కడైనా కొంచెం గడబిడ జరిగితే కొందరు చాలా తొందరగా గాబరా పడిపోతారు. లోతుల్లోకి వెళ్ళరు, గాబరా పడిపోతారు. లోతుల్లోకి వెళితే, ఎక్కడ ఎంత పెద్ద అలజడి నిండిన పేపర్ వచ్చినా కానీ, పరిస్థితి వచ్చినా కానీ లోతుల్లోకి వెళ్ళేవారు, సముద్ర లోతుల్లోకి వెళ్ళినవారికి చాలా అమూల్యమైనవి లభించినట్లు ఇది కూడా. పైపైన ఉండేవారు కాదు, పైపైన ఉండేవారికి చేపలు దొరుకుతాయి కానీ లోతుల్లోకి వెళ్ళేవారికి చాలా అమూల్యమైన వస్తువులు లభిస్తాయి. ఇక్కడ కూడా ఏదైనా పరిస్థితి వస్తే, పరిస్థితులు అయితే వస్తాయి, పరిస్థితులు రావు అని బాప్‌దాదా చెప్పలేదు. ఎంత ముందుకు వెళ్తుంటారో అంతగా సూక్ష్మ పరిస్థితులు వస్తాయి ఎందుకంటే పాస్ విత్ ఆనర్‌గా అవ్వాలి కదా. టీచర్లు ఏమి ఆలోచించారు? పాస్ విత్ ఆనర్‌గా అవ్వాలా లేక 33 మార్కులతో పాస్ అవ్వాలా? పాస్ విత్ ఆనర్‌గా కావాలంటే చేతులెత్తండి. వీరి ఫోటో బాగా తీయండి. అచ్ఛా. మరి అలజడిలో గాబరా పడకండి. ఆ సమయంలో బాప్‌దాదాను మర్చిపోతారు, ఒంటరిగా అయిపోతారు కదా అప్పుడు చిన్న విషయం కూడా పెద్దదిగా అనిపిస్తుంది. బాప్‌దాదా కంబైన్డ్‌గా ఉన్నారు, కంబైన్డ్‌గా ఉండండి, అనుభవం చేయండి అప్పుడు చూడండి పర్వతం కూడా ఆవగింజలా మారిపోతుంది. పెద్ద విషయం కానే కాదు. ఎన్ని సార్లు పాస్ అయ్యారు, ఎన్ని కల్పాలు పాస్ అయ్యారు, తెలుసా? నషా ఉందా? అనేక సార్లు నేనే పాస్ అయ్యాను, ఇప్పుడు కేవలం రిపీట్ చేయాలి. కొత్త విషయమేమీ లేదు, కేవలం రిపీట్ చేయాలి అని గుర్తుంచుకోండి.
అచ్ఛా - తీవ్ర పురుషార్థం చేసి నంబర్‌వన్‌గా అవ్వవలసిందే అని అందరూ సంకల్పం చేసారా? చేతులెత్తండి. అచ్ఛా, ఇప్పుడు టీచర్లందరూ చేతులెత్తుతున్నారు. ముందు లైన్ వారైతే ఉండనే ఉన్నారు కదా. మంచిది - రోజంతటిలో మధ్యమధ్యలో 5 నిమిషాలు లభించినా, అందులో మనసుతో వ్యాయామం చేయండి అని బాప్‌దాదా డైరెక్షన్ ఇచ్చి ఉన్నారు. ప్రస్తుత కాలం వ్యాయామం చేసే కాలం. 5 నిమిషాలలో మనసుతో వ్యాయామం చేయండి, మనసును పరంధామానికి తీసుకువెళ్ళండి, సూక్ష్మవతనంలో ఫరిశ్తా స్థితిని గుర్తు చేసుకోండి, తర్వాత పూజ్య రూపాన్ని గుర్తు చేసుకోండి, తర్వాత బ్రాహ్మణ రూపాన్ని గుర్తు చేసుకోండి, తర్వాత దేవతా రూపాన్ని గుర్తు చేసుకోండి. ఎన్ని అయ్యాయి? 5. 5 నిమిషాలలో 5 వ్యాయామాలు చేయండి. రోజంతా నడుస్తూ తిరుగుతూ కూడా ఇది చేయవచ్చు, ఇందుకోసం మైదానం అవసరం లేదు, పరిగెత్తనవసరం లేదు, కుర్చీ అవసరం లేదు, సీట్ అవసరం లేదు, మెషీన్లు అవసరం లేదు. శరీరానికి అవసరమైన ఇతర వ్యాయామాలు చేయండి, అందుకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈ మనసు యొక్క డ్రిల్, వ్యాయామం, మనసును ఎప్పుడూ సంతోషంగా ఉంచుతుంది. ఉల్లాస ఉత్సాహాలలో ఉంచుతుంది, ఎగిరే కళను అనుభవం చేయిస్తుంది. ఇప్పుడే అందరూ ఈ డ్రిల్‌ను చేయండి - పరంధామం నుండి దేవత వరకు (బాప్‌దాదా డ్రిల్ చేయించారు) అచ్ఛా -
నలువైపుల ఉన్న సదా తమ వృత్తితో ఆత్మిక శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే తీవ్ర పురుషార్థి పిల్లలకు, సదా తమ స్థానము మరియు స్థితిని శక్తిశాలిగా అనుభవం చేసుకునే దృఢసంకల్పధారి శ్రేష్ఠ ఆత్మలకు, సదా ఆశీర్వాదాలు ఇస్తూ ఆశీర్వాదాలు తీసుకునే దయాహృదయ ఆత్మలకు, సదా స్వయాన్ని ఎగిరే కళలో అనుభవం చేసుకునే డబల్ లైట్ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీ జానకి గారు:- నిన్న రాత్రి గుల్జార్ దాదీ గారికి ఫోన్ చేసాము. దాదీ ఇక్కడికి రండి కదా. రెండు సంవత్సరాలయింది కదా. డ్రామా మరియు బాబా. బాబా ఎలా నడిపిస్తే అలా! మమ్మల్ని బాబా మంచిగా అరచేతిలో కూర్చోబెట్టుకొని పాలన ఇచ్చారు. ఇప్పుడు బాబా ఏది చేయిస్తే అది. బాబా ఎదురుగా అందరూ చేతులు ఎత్తారు. ఇప్పుడు మేము శాంతిగా కూర్చున్నాము. అందరి సంతోషాన్ని చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషం కలుగుతుంది. ఓ.కే.
*** ఓంశాంతి ***
