‘‘దృఢ సంకల్పము ద్వారా ‘టెన్షన్ ఫ్రీ’ కు ఉదాహరణగా అయ్యి అందరికీ ఆధారమూర్తులుగా అవ్వండి, మనసా శక్తి ద్వారా దుఃఖంలో ఉన్న ఆత్మలకు సంతోషాన్ని వరదానంగా ఇవ్వండి’’
ఓం శాంతి 24-11-20 మధుబన్
ప్రాణప్రదమైన అవ్యక్త మూర్తి తల్లి తండ్రి అయిన బాప్‌దాదాకు అతి గారాల పిల్లలు, సదా తమ హృదయంలో హృదయాభిరాముడిని నిలుపుకునే లవ్లీన ఆత్మలైన నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు ప్రతి అడుగులోనూ పదమాల సంపాదనను జమ చేసుకునే దేశ విదేశాలలోని సర్వ పదమాపదమ భాగ్యశాలి బ్రాహ్మణ కులభూషణ సోదరసోదరీలు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.
తర్వాత సమాచారము - అలజడితో నిండిన వర్తమాన వాతావరణంలో ప్రియమైన అవ్యక్త బాప్‌దాదా పిల్లలను సర్వ ప్రాప్తులతో సంపన్నం చేస్తున్నారు. ఈరోజు వీడియో ద్వారా మనందరం విన్న అవ్యక్త మహావాక్యాలలో ప్రియమైన బాప్‌దాదా తమ పిల్లల భాగ్యాన్ని హృదయపూర్వకంగా మహిమ చేస్తూ, సదా “టెన్షన్ ఫ్రీ”గా ఉండే ఉదహరణగా అవ్వమని విశేష సూచనను ఇచ్చారు. సమయ ప్రమాణంగా ప్రతి ఒక్కరూ నా ఆధారమూర్త పిల్లలు తమ మనసా శక్తి ద్వారా సర్వ దుఃఖి, అశాంత ఆత్మలకు సంతోషాన్ని వరదానంగా ఇవ్వాలని బాప్‌దాదా కోరుకుంటున్నారు.
ఈసారి బాప్‌దాదా టర్న్‌లో రాజస్థాన్ నుండి సోదరసోదరీలు చేరుకున్నారు. అందరూ మధుబన అనంతమైన ఇంటిలోని ప్రశాంతత మరియు ఏకాంత వాతావరణంలో విశేష యోగ తపస్సును చేస్తున్నారు. బాబా పిల్లలు మధుబనానికి రావాలని అనుకున్నా కానీ రాలేకపోవడం కూడా డ్రామాలోని దృశ్యమే. అయితే మీరందరూ మీ మీ స్థానాలలో ఉంటూనే విశేష యోగ తపస్సును చేస్తూ, మనసా సకాశ్ ఇచ్చే అనంతమైన సేవను చేస్తూనే ఉన్నారు. దూరంగా కూర్చుని ఉన్నా కానీ ఈ అవ్యక్త పాలన అందరినీ శక్తిశాలిగా చేస్తుంది. అచ్ఛా - మీ అందరి ఆరోగ్యం మంచిగా ఉందని భావిస్తున్నాము. అందరికీ స్మృతి... ఓం శాంతి.
24-11-20 ఓం శాంతి “అవ్యక్త మహావాక్యాలు” రివైజ్ వీడియో 31-03-11 మధుబన్
దృఢ సంకల్పము ద్వారా ‘టెన్షన్ ఫ్రీ’ కు ఉదాహరణగా అయ్యి అందరికీ ఆధారమూర్తులుగా అవ్వండి, మనసా శక్తి ద్వారా దుఃఖంలో ఉన్న ఆత్మలకు సంతోషాన్ని వరదానంగా ఇవ్వండి
ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, కోట్లలో కొద్ది మంది, కొద్దిమందిలో కూడా అతి కొంతమంది అయిన తమ పిల్లల భాగ్య రేఖలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకం నుండి దివ్యంగా మెరుస్తున్న సితార యొక్క మెరుపు కనిపిస్తుంది. నయనాలలో స్నేహపు రేఖను చూస్తున్నారు. నోటిలో జ్ఞాన రేఖ చూస్తున్నారు. హృదయంలో హృదయాభిరాముడి లవలీన రేఖలు చూస్తున్నారు. చేతులలో జ్ఞాన ఖజానాల రేఖను చూస్తున్నారు. పాదాలలో ప్రతి అడుగులో పదమాల రేఖను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ రేఖలలో నంబరువారీగా సంపన్నంగా ఉన్నారు. ఇటువంటి భాగ్యము మీకు తప్ప మరెవ్వరికీ లేదు. మీ ఈ శ్రేష్ఠ భాగ్యము ప్రతి ఒక్కరి నుండి మెరుస్తూ, కనిపిస్తుంది మరియు ఈ భాగ్యము అవినాశిగా అయిపోతుంది, ఎందుకని? ఎందుకంటే ఇచ్చేవారు అవినాశీ తండ్రి కనుక. ఈ సంగమయుగంలోనే ఇంతటి శ్రేష్ఠ భాగ్యము ప్రాప్తిస్తుంది, అది భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఈ సంగమయుగము సర్వ ప్రాప్తుల యుగము. ఎవరు ఎంతగా తమ భాగ్యాన్ని జమ చేసుకుంటారో అంతగా అనేక జన్మలు భాగ్యము యొక్క ఫలితము కలుగుతుంది. ఈ సంగమయుగ మహిమ గురించి పిల్లలైన మీకే తెలుసు. సంగమయుగ ప్రాప్తులు పూర్తి కల్పంలోనూ శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవి.
బాప్‌దాదా ఏమి చూస్తున్నారంటే, పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ సంగమయుగ ప్రాప్తులతో ఎంత సంపన్నంగా ఉన్నారు? మీరందరూ కూడా సర్వ ప్రాప్తుల అనుభవంలో సదా ఉంటున్నారా లేక అప్పుడప్పుడా? అవినాశీ తండ్రి అయినప్పుడు ప్రాప్తులు కూడా అవినాశిగా ఉంటాయి. బాప్‌దాదా పిల్లలందరినీ ఏ రూపంలో చూడాలనుకుంటున్నారు, తెలుసు కదా! పిల్లలు ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారిగా అవ్వాలని బాప్‌దాదా ఆశిస్తున్నారు. స్వయం పైన అనగా కర్మేంద్రియాలపైన, మనసు-బుద్ధి-సంస్కారాల పైన రాజుగా అయ్యి రాజ్యం చెయ్యాలి. భవిష్యత్తులో అయితే రాజ్యాధికారిగా అవుతారు కానీ ఇప్పుడైతే స్వరాజ్య అధికారిగా అవ్వాలి కదా. ఏ కర్మేంద్రియమైనా మీ కంట్రోల్లో ఉండాలి ఎందుకంటే బాబా ద్వారా సర్వ శక్తుల ఖజానా ప్రాప్తించింది. కావున బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ స్వరాజ్య అధికారి రాజు రూపంలో చూడాలని ఆశిస్తున్నారు. మరి మీరందరూ స్వరాజ్య అధికారులుగా అయ్యారా? మనసు, బుద్ధిపై రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ వచ్చాయా? ఆధీనత లేదు కదా? అధికారులు మీరు. బాప్‌దాదాను తోడుగా పెట్టుకున్నప్పుడు, ఒంటరిగా అవ్వనప్పుడు, బాబాను సదా సహచరునిగా చేసుకుని ఉన్నందువలన ఈ మనసు బుద్ధి సంస్కారాలు వేటికీ కూడా కంట్రోల్లో లేకుండా ఉండేంత శక్తి ఉండదు. అందుకే సదా తండ్రి తోడును మర్చిపోకుండా ఉండేందుకు బాప్‌దాదా శక్తులకు ఏ స్వరూపాన్ని గుర్తుంచుకోమని చెప్తారు? మేము శివశక్తులము. శివుడు మరియు శక్తి రెండూ కలిసి ఉన్నారు. ఈ స్మృతి మాయాజీత్, ప్రకృతిజీత్గా స్వతహాగా చేస్తుంది ఎందుకంటే వర్తమాన సమయంలో ప్రకృతి తన పని చేసుకుంటూ ఉంటుంది అని బాప్‌దాదా వినిపించి ఉన్నారు. ప్రకృతిని కూడా మనుష్యాత్మలు విసిగిస్తున్నారు కావున ప్రకృతి కూడా విసిగిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్రకృతి ఎక్కడో ఒక చోట తన కార్యాన్ని చేస్తూ ఉండటాన్ని చూస్తూనే ఉన్నాము. కానీ మీరు ప్రకృతిజీతులుగా అయ్యి ప్రకృతిని కూడా సతో ప్రధానంగా చేస్తున్నారు. లోకులైతే ప్రకృతిలోని అలజడులు చూసి రేపు ఏమవుతుందా అని భయపడుతున్నారు. కానీ అంతా ఎంతో మంచిగా జరుగనుంది అని మీకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు సంగమయుగము అనగా సృష్టి చక్రము యొక్క అమృతవేళ జరుగుతుంది. మరి అమృతవేళ తర్వాత ఏమి వస్తుంది? ఉదయము. అంధకారము సమాప్తమై ప్రకాశము వస్తుంది. కావున ఇప్పుడిక మా రాజ్యము, సుఖమయ ప్రపంచము, సుఖమయ ప్రకృతి ఉండే రాజ్యము రానున్నదని మీకు సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది కదా! ఆ రాజ్యంలో దుఃఖము, అశాంతి నామమాత్రానికి కూడా ఉండవు ఎందుకంటే ఇప్పుడు సంగమంలో మీరు ప్రకృతిజీతులుగా అవుతున్నారు. మరి అందరికీ సంతోషంగా ఉంది కదా, ఏ విషయంలో? చెప్పండి, మా రాజ్యము రానుంది. ఈ సంతోషము ఉందా? ఎవరైతే ఈ సంతోషంలో ఉంటున్నారో వారు చేతులెత్తండి. చాలా మంచిది. మీరైతే సంతోషంగా ఉంటున్నారు, ఇందుకు అభినందనలు. కానీ ఇటువంటి సంతోషమును దుఃఖంతో అశాంతిగా ఉన్న మీ సోదరాత్మలకు తమ తండ్రి నుండి తీసుకున్న కిరణాల ద్వారా సంతోషపు కిరణాలను అందజేస్తున్నారా? ఇటువంటి మనసా సేవను చేసేందుకు సమయాన్ని ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో ఫిక్స్ చేసుకోవాలని బాప్‌దాదా చెప్పి ఉన్నారు. ఎలా అయితే ఇతర కార్యాలకు సమయము ఫిక్స్ అయి ఉన్నదో అలాగే తమ సంతోషపు ఔషధము ద్వారా బాధతో ఉన్న ఆత్మలకు మనసా శక్తి ద్వారా కొద్దిగా వరదానాలను ఇచ్చి వారిని కూడా సంతోషపరచండి. మరి ఎవరైతే మనసా సేవ కోసం సమయాన్ని ఫిక్స్ చేసుకున్నారో వారు చేతులెత్తండి. అచ్ఛా, ఫిక్స్ చేసుకోనివారు కూడా కొద్దిమంది ఉన్నారు. వారు కూడా ఫిక్స్ చేసుకోండి ఎందుకంటే మన సోదరసోదరీలే కదా. దయ కలుగుతుంది కదా! లేక దయ కలగడం లేదా? కలుగుతుంది కదా! సంగమంలో విశేషమైనవి, అమూల్యమైనవి రెండు విషయాలు బాప్‌దాదా అందరిలో చూడాలనుకుంటుంన్నారు, ఒకటి సంకల్ప శక్తి, మరొకటి సంగమ సమయము ఎందుకంటే సంగమ సమయంలో ఒక్క జన్మలో అనేక జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో బాప్‌దాదా ఏమి చూసారంటే చాలామందిలో అశుద్ధ సంకల్పాలు తక్కువగానే వస్తాయి కానీ వ్యర్థ సంకల్పాలు వస్తూ ఉంటాయి. ఈ ఒక్క జన్మ విలువ అనుసారంగా ఇప్పుడు ఈ వ్యర్థ సంకల్పాలు సమాప్తమైపోవాలి ఎందుకంటే సంగమ మహత్వము అనుసారంగా ఒక్క క్షణము ఎన్నో విలువైన క్షణాలకు అధికారిగా చేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ రెండు విషయాలను - సమయము మరియు సంకల్పము రెండింటి విలువను తెలుసుకుని సమయాన్ని మరియు సంకల్పాన్ని సఫలం చేయండి, స్థూల ఖజానాలను సఫలం చేసినట్లుగా సఫలం చేయండి. ఈ ఒక్క జన్మలో సఫలం చేయడం వలన అనేక జన్మలకు దాని ప్రాప్తి లభిస్తుందని మీకు తెలుసు. ఈ విధంగా ఈ రెండు విషయాలపై అటెన్షన్ ఉంచుతూ సఫలం చేసి సఫలతా మూర్తులుగా అవ్వండి.
బాప్‌దాదా ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరికీ ఒక వరదానమును ఇస్తున్నారు, పిల్లలు ప్రతి ఒక్కరూ ఈరోజు నుండి స్వయాన్ని టెన్షన్ ఫ్రీ చేసుకోగలరా? ఈరోజు నుండి అటెన్షన్, నో టెన్షన్ అని దృఢ సంకల్పం చేయండి. పిల్లలు టెన్షన్లో ఉండటాన్ని చూసినప్పుడు అదే సమయంలో ఆ పిల్లల ఫోటోను తీసి వారికి పంపించాలని బాప్‌దాదాకు అనిపిస్తూ ఉంటుంది. నేనెలా అయిపొయ్యాను అని అప్పుడు పిల్లలకే అర్థమవుతుంది! బాప్‌దాదా మన్జీత్, జగత్జీత్గా చేయాలని ఆశిస్తున్నారు. టెన్షన్ ఎందులో వస్తుంది, మనసులోనే కదా వస్తుంది! మరి మీరైతే రాజులు కదా, స్వరాజ్య అధికారులు కదా! మనసు మీదా లేక మనసు యజమానిగా ఉందా? మీరేమంటారు? రోజంతా నా మనసు అని అంటారు కదా! మనసు మీకు యజమాని కాదు కదా! ఎవరు ధైర్యమును ఉంచగలరు? బాబా వరదానమైతే సహజంగానే లభిస్తుంది కానీ కేవలం కొద్దిగా అటెన్షన్ అవసరము. బాబా ఇచ్చిన వరదానపు సహకారాన్ని అనుభవం చేసి చూడండి. ఎప్పుడు చూసినాకానీ అందరి ముఖాలు ఎలా కనిపించాలి? టెన్షన్ ఫ్రీ, కమల పుష్ప సమానంగా మరియు వికసించిన గులాబీ పుష్పంవలె కనిపించాలి.
పర్సంటేజ్ వ్రాసే పని ఏదైతే బాప్‌దాదా ఇచ్చి ఉన్నారో దానిని బాబా చూసారు. అన్ని స్థానాలనుండి కొంత కొంత సమాచారము వచ్చింది. ఇక్కడ కూడా రిజల్ట్ తయారు చేసారు. అటెన్షన్ ఇచ్చినందుకు బాప్‌దాదా అభినందనలు తెలియజేస్తున్నారు కానీ సమయానుసారంగా ఇప్పుడిక వాణి ద్వారా వినేందుకు కూడా సమయము తక్కువ లభిస్తుంది కావున మనసా ద్వారా, తమ ముఖము మరియు నడవడిక ద్వారా సేవ చేయాలని బాప్‌దాదా ఆశిస్తున్నారు. ఇప్పటి అభ్యాసము రాబోయే సమయంలో ఉపయోగపడుతుంది. మరి ఈరోజు నుండి టెన్షన్ ఫ్రీ సంకల్పాన్ని తీసుకోగలరా? తీసుకోగలరా? తీసుకోగలరా? చేతులెత్తండి. టెన్షన్ ఫ్రీ. అచ్ఛా, అందరి ఫోటో తియ్యండి. చాలా మంచిది. ఎవరైతే పరిస్థితుల కారణంగా చాలా టెన్షన్లో ఉంటారో, ఈరోజుల్లో టెన్షన్ చాలా పెరిగిపోయింది. మీ టెన్షన్ ఫ్రీ అనుభవము, టెన్షన్ ఫ్రీ నడవడిక మరియు ముఖము వారి ఎదుట ఆధారమూర్తిగా అవుతాయి. ఒకవేళ ఈనాటి ప్రపంచాన్ని చుట్టి వచ్చినా లేక సమాచారము విన్నా ఏముంటుంది? అల్పకాలికంగా స్వయాన్ని సంతోషపరుచుకోవడానికి సాధనాలు తయారు చేస్తూ ఉన్నారు. కావున టెన్షన్లో ఉన్నవారికి టెన్షన్ ఫ్రీ కి ఉదాహరణగా అయ్యి చూపించండి అప్పుడు వారికి కూడా ఆధారము లభిస్తుంది. మరి సంకల్పం చేసారా, టెన్షన్ ఫ్రీ అయి ఉంటాము అని మీ మనసులో సంకల్పం చేసారా? చేసారా? దృఢంగా చేసారా లేక సాధారణంగా చేసారా? ఎక్కడ దృఢత్వము ఉంటుందో అక్కడ సఫలత ఉండనే ఉన్నది. చేస్తాము కాదు, చేయాల్సిందే. ఇష్టమేనా? ఇందులో చేతులెత్తండి.
బాప్‌దాదా ఒక విషయము ఏమి చూసారంటే చేతులెత్తి చాలా సంతోషపరుస్తారు. చేతులెత్తి అయితే సంతోషపరిచారు. కానీ ఇప్పుడు ఏమి చేస్తారు? దృఢ సంకల్పానికి, సాధారణ సంకల్పానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. చేస్తాము మరియు చేయవలసిందే. టెన్షన్ నామరూపాలు కూడా ఉండకూడదు అని బ్రాహ్మణ పరివారంలో ఇంత ధైర్యము, ఉల్లాసము ఉన్నాయా? వీలవుతుందా? ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి, వీలవుతుందా? ఈ శుభవార్తను బాప్‌దాదా వినాలని ఆశిస్తున్నారు.
బాప్‌దాదా ఏమి చూసారంటే చేయాలి అన్న ఆశ అందరిలోనూ ఉంది, కానీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మిమ్మల్ని తనదిగా చేసేసుకుంటుంది. అప్పుడు చాలా మధురమైన మాటలను వినిపిస్తారు. ఇలా జరిగిపోతుంది కదా, ఇది అవుతుంది కదా! ఇదైతే ఫర్వాలేదు కదా! బాప్‌దాదాకు చాలా తియ్యని మాటలను వినిపిస్తారు. అన్నింటికీ నివారణ ఒక్కటే, రాజుగా అయిపోండి, చాలు. స్వరాజ్య అధికారులుగా అవ్వండి. ఈరోజు బాప్‌దాదా ఎదురుగా కూర్చున్నవారు కానీ, దూరంగా ఉన్నా హృదయంలో ఉన్నవారైనా కానీ, మీరైతే కళ్ళ ఎదురుగా ఉన్నారు, కానీ దూరంగా కూర్చుని ఉన్నవారిని బాప్‌దాదా హృదయంలో చూస్తున్నారు. అచ్ఛా.
సేవ టర్న్ రాజస్థాన్ జోన్ వారిది:- మంచిది. రాజస్థాన్ ధరణి బ్రహ్మా బాబాకు చాలా ఇష్టమైనది, అందుకనే రాజస్ధాన్ లోనే మధువనాన్ని తయారు చేసారు. రాజస్ధాన్ లోని ప్రతి స్థానంలో కూడా ఇప్పుడు సేవ మంచిగా వృద్ధి అవ్వడాన్ని బాప్‌దాదా చూసారు. కొత్త కొత్త ఆత్మలకు తండ్రి సందేశాన్ని ఇచ్చే ప్రొగ్రామ్‌లు కూడా మంచిగా జరుగుతున్నాయి. స్వ మరియు సేవ రెండింటిలోనూ బ్యాలెన్స్ పెట్టేవారు ఇప్పుడు ప్రతి సెంటర్లోనూ చాలా ముందుకు రావాలని ఇప్పుడు బాప్‌దాదా చూడాలనుకుంటుంన్నారు. కేవలం సేవ కాదు, స్వ మరియు సేవ ఎందుకంటే ఇప్పుడు స్వ పరివర్తనకు ఎక్కువ సమయం లేదు. కావున ముందు స్వ, దానితోపాటు సేవ. ప్రతి సేవాకేంద్రము నిర్విఘ్నంగా, తోటివారందరూ నిర్విఘ్నంగా, కేవలం టీచర్ కాదు పూర్తి క్లాస్ నిర్విఘ్నంగా మరియు స్వ పరివర్తనపై అటెన్షన్ ఉంచేవారిగా అవ్వాలి. మరి ఈ వృద్ధిని చేయండి. ఒక్కొక్కరి విషయాలను వినండి మరియు వారికి ఉల్లాస ఉత్సాహాలనే రెక్కలను పెట్టండి, ఇలా బాప్‌దాదాకు నిర్విఘ్న సెంటర్ గురించి సమాచారము రావాలి. రాజస్థాన్ కూడా ముందుకు వెళ్తుంది, ముందుకు వెళ్తూ ఉంటుంది అని బాప్‌దాదా కూడా చూసారు. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ ముందుకు వెళ్ళేందుకు అభినందనలు తెలుపుతున్నారు. అచ్ఛా.
డబల్ విదేశీ సోదరసోదరీలతో:- విదేశీయులకు డబల్ విదేశీయులు అన్న పేరు ఇవ్వడం జరిగింది. విదేశీయులు కాదు, డబల్ విదేశీయులు. డబల్ విదేశీయులు అన్న టైటిల్ అనుసారంగా మెజారిటీ పిల్లలకు డబల్ నషా ఉంటుంది. డబల్ నషా ఏమిటి? మేము డబల్ ఉల్లాస ఉత్సాహాలలో ఉంటాము. ఉల్లాస ఉత్సాహాలు మంచిగా ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. భారతవాసులకు కూడా ఉత్సాహం వస్తుంది. పురుషార్ధంలో కూడా చూసినట్లయితే ఇప్పుడు విదేశీయుల వద్దకు పరీక్షలైతే వస్తాయి కానీ వారిలోని విశేషత ఏమిటంటే సత్యమైన హృదయంతో చెప్పేస్తారు. లోపల పెట్టుకోరు, అంతే కాక దానికి సమాధానము కూడా సత్యమైన హృదయముతోనే చేస్తారు. సత్యమైన హృదయము ఉన్నప్పుడు హజూర్ హాజరు అవుతారు. మంచి రిజల్ట్‌ను చూసి బాప్‌దాదా అభినందనలు కూడా తెలుపుతున్నారు మరియు సదా ముందుకు వెళ్తూ ఉంటారు అని వరదానము కూడా ఇస్తున్నారు. టీచర్లు కూడా మంచి కృషి చేస్తున్నారు. మధువన్ లాభాన్ని ఎక్కువగా విదేశీయులే తీసుకోవడం బాప్‌దాదాకు సంతోషాన్ని కలిగిస్తుంది. విదేశములోని చిన్న చిన్న స్థానాలలో కూడా సందేశాన్ని వినిపించే సేవను ఆరంభించడాన్ని బాగా చూసారు. కావున సేవకు అభినందనలు, స్వ పరివర్తనకు అభినందనలు. ఎగురుతూ ఉండండి మరియు ఎగిరిస్తూ ఉండండి. అచ్ఛా.
నలువైపుల ఉన్న దేశ విదేశాల పిల్లలు పురుషార్థంలో సహజంగా ముందుకు వెళ్తున్నందుకు, ముందుకు తీసుకు వెళ్తున్నందుకు బాప్‌దాదా విశేషమైన అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు రానున్న సమయము కోసం తీవ్ర పురుషార్థిగా అయ్యి సెకండ్లో బిందువు పెట్టడము, ఫుల్ స్టాప్ పెట్టే అభ్యాసము అతి ఆవశ్యకము. దీనిని తేలికగా తీసుకోకండి. అకస్మాత్తుగా ఏదో ఒకటి జరుగవలసిందే కావున బాబాకు కల శుభ ఆశ ఏమిటంటే పిల్లలు ప్రతి ఒక్కరూ కలసి ఉన్నారు, కలిసి వెళ్తాము, బ్రహ్మా బాబాతో కలిసి రాజ్యము చేస్తాము, శివబాబా సాక్షిగా అయిపోతారు. కలిసి ఉండేవారిగా అయ్యేదుంటే బాప్‌దాదా సమానంగా అవ్వవలసిందే. అచ్ఛా.
*** ఓంశాంతి ***
