Search for a command to run...
9 Jun 1969
బద్ధకానికి తియ్యని రూపము - సోమరితనము
9 June 1969 · తెలుగు
అందరూ వ్యక్త రూపంలో ఉంటూ కూడా అవ్యక్త స్థితిలో ఉన్నారా? అవ్యక్త స్థితి అని దేనిని అంటారో ఆ అవగాహన అయితే ఉంది కదా? ముందుగా అవ్యక్త స్థితిని తెలుసుకోవాలి, తెలుసుకోవడము తర్వాత పరిశీలన. మరి ఈ రెండు విషయాల జ్ఞానము ఉందా? అవ్యక్త స్థితి అని దేనిని అంటారు? (వ్యక్త భానము లేకపోవడము) వ్యక్తంలో కార్యము చేస్తూ కూడా వ్యక్త భానము లేకుండా ఎలా ఉంటుంది? వ్యక్తంలో ఉంటూ కూడా అవ్యక్త స్థితి ఉండటము, ఇది ఎంత అనుభవం అవుతుంది, ఈ రోజు ఇది అందరినీ అడగాలి! అవ్యక్త స్థితిలో గరిష్టంగా ఎంత సమయం ఉంటున్నారు? అత్యధికంగా ఎంత సమయం ఉండాలి, తెలుసా? ( ఎనిమిది గంటలు) సంపూర్ణ స్థితి లెక్కలో అయితే ఎనిమిది గంటలు కూడా తక్కువే. మీ వర్తమాన పురుషార్థం ప్రకారం ఎక్కువగా ఎనిమిది గంటలు ఉంటున్నారా? (ఎవ్వరూ చేతులెత్తలేదు) అచ్ఛా. 6 గంటల వరకు చేరుకున్నవారు చేతులెత్తండి. (ఎవ్వరూ చేతులెత్తడం లేదు). అచ్ఛా, 4 గంటల వరకు చేరుకున్నవారు చేతులెత్తండి. (కొందరు 4 గంటలలో, కొందరు 2 గంటలలో చేతులెత్తారు). ఈ రిజల్టు ప్రకారం ఎంత సమయం పురుషార్థం ఉండాలి? కోర్సు కూడా పూర్తయింది. రివైజ్ కోర్సు కూడా జరుగుతుంది. అయినా కానీ మెజారిటీ రిజల్టు ఇలా ఉండటానికి కారణము ఏమిటి? అందరూ పురుషార్థం కూడా చేస్తున్నారు, ఉల్లాసము కూడా ఉంది, లక్ష్యము కూడా ఉంది, అయినా కానీ ఎందుకని జరగడం లేదు? (అటెన్షన్ తక్కువగా ఉంది) ఏ విషయంలో అటెన్షన్ తక్కువగా ఉంది? యోగ్యులుగా అవ్వాలి, సమీపంగా రావాలి అన్న అటెన్షన్ అయితే అందరూ ఉంచుతున్నారు కానీ ముఖ్యంగా ఏ విషయంలో అటెన్షన్ తక్కువగా ఉన్న కారణంగా అవ్యక్త స్థితి తక్కువగా ఉంటుంది? ఇక్కడ కూర్చున్న వారందరూ పురుషార్థులే. నేను పురుషార్థిని కాను అని ఎవరైనా చెప్తారా? పురుషార్థం చేస్తున్నప్పటికీ ఎందుకు లోటు కనిపిస్తుంది? కారణం ఏమిటి? అంతర్ముఖిగా ఉండాలనుకుంటున్నప్పటికీ ఎందుకు ఉండలేకపోతున్నారు? బాహ్యముఖతలోకి ఎందుకు వస్తున్నారు? అందరూ జ్ఞానీ తూ ఆత్మలుగా కూడా అయ్యారు, జ్ఞానీ తూ ఆత్మగా, తెలివైనవారిగా అవుతున్నా కానీ తెలివిహీనులుగా ఎందుకు అయిపోతున్నారు? వివేకము అయితే లభించింది. అవగాహన కోర్సు కూడా పూర్తయింది. కోర్సు పూర్తయింది అంటే వివేకవంతులుగా అయినట్లే. అయినా కానీ అవివేకులుగా ఎందుకు అవుతున్నారు?
ముఖ్య కారణము ఇదే చూసాము - కొందరిలో నిర్లక్ష్యము వచ్చేస్తుంది, దానిని బద్ధకము అంటాము. బద్ధకానికి తియ్యని రూపము సోమరితనము. సోమరితనము కూడా అనేక రకాలుగా ఉంటుంది. మెజారిటీలో సోమరితనము లేక నిర్లక్ష్యము ఏదో ఒక రకము వచ్చేసింది. కోరిక కూడా ఉంది, పురుషార్థం కూడా ఉంది కానీ సోమరితనము కారణంగా ఏ విధంగా అయితే పురుషార్థం చేయాలో దానిని చేయలేకపోతున్నారు. బుద్ధిలోకి ఎక్కువ జ్ఞానం వచ్చేస్తే దాని వలన ఎక్కువ సోమరితనము కూడా వచ్చేసింది. ఎవరైతే స్వయాన్ని ఎక్కువ తెలివైనవారిగా భావించరో వారు తీవ్ర పురుషార్థాన్ని చేస్తున్నారు. కానీ ఎవరైతే స్వయాన్ని ఎక్కువ తెలివైనవారిగా భావిస్తున్నారో వారు ఎక్కువగా సోమరిగా అయిపోయారు. మొదట్లో పురుషార్థం చేయాలని తపించేవారు. ఇలా అయ్యి చూపిస్తాము, ఇలా చేసి చూపిస్తాము అనేవారు. ఇప్పుడు ఆ తపన సమాప్తమైపోయింది. తృప్తి చెందేసారు. తమతో తాము తృప్తి చెందారు. జ్ఞానమైతే అర్థమయింది, సేవ చేస్తున్నాము, నడుస్తున్నాము కదా అనుకుని తృప్త ఆత్మలుగా అవ్వకూడదు. పురుషార్థం చేయాలన్న తపన ఉండాలి. బంధనంలో ఉన్నవారు తపిస్తూ ఉంటారు కనుక పురుషార్థం కూడా తీవ్రంగా చేస్తారు. బంధనంలో లేనివారు, వారు తృప్తి చెందేసారు కనుక సోమరిగా అయిపోయారు. మెజారిటీ పురుషార్థీలలో ఇదే రిజల్టును చూసాము. నేను నంబరువన్ పురుషార్థీగా అవ్వాలని ఎప్పుడూ భావించండి. అయిపోయాము కాదు. మూడు కాలాల జ్ఞానము బుద్ధిలోకి వచ్చిన కారణంగా స్వయాన్ని చాలా తెలివైనవారిగా భావిస్తున్నారు. ముందు కూడా వినిపించాము కదా – ఎక్కడ బాలకులుగా అవ్వాలో అక్కడ యజమానిగా అయిపోతున్నారు, ఎక్కడ యజమానిగా అవ్వాలో అక్కడ బాలకులుగా అవుతున్నారు. కనుక ఇప్పుడు పిల్లల రూపంలో తియ్యగా పురుషార్థాన్ని చేస్తున్నారు. రాజ్య అధికారులుగా అయితే అయిపోయారు, తిలకము కూడా వచ్చేసింది కానీ ఇప్పుడు ఇటువంటి ఢీలా మరియు తియ్యని పురుషార్థం ఇక కొనసాగడానికి వీలు లేదు. ఎంతగా శక్తి రూపంలో స్థితులవుతారో అంతగా పురుషార్థం కూడా శక్తిశాలిగా అవుతుంది. ఇప్పుడు పురుషార్థం శక్తిశాలిగా లేదు. ఢీలా-ఢీలాగా ఉంది. అందరూ పురుషార్థీలే, కానీ పురుషార్థం ఎంతైతే శక్తిశాలిగా ఉండాలో ఆ శక్తి పురుషార్థంలో నిండలేదు. ఉదయం లేవగానే శక్తిని నింపే ఏదో ఒక పాయింటును మీ ముందు పెట్టుకోండి. అమృతవేళ ఎలా అయితే ఆత్మిక సంభాషణ చేస్తారో అలాగే మీ పురుషార్థాన్ని శక్తిశాలిగా చేసుకోవడానికి కూడా ఏదో ఒక పాయింటును విశేష రూపంలో మీ బుద్ధిలో గుర్తుంచుకోండి. ఇప్పుడు విశేష పురుషార్థాన్ని చేయాల్సిన ఆవశ్యకత ఉంది. సాధారణ పురుషార్థము చేసే రోజులు ఇప్పుడు గడిచిపోతున్నాయి. ఎలా అయితే విశేషమైన ఫంక్షన్ మొదలైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు కదా, అలాగే ఇప్పుడు సమయం కొద్దిగానే ఉంది అని అర్థం చేసుకుని, విశేషంగా పురుషార్థం యొక్క ప్రోగ్రామును పెట్టండి. ఈ విశేష పురుషార్థం చేసే లక్ష్యాన్ని ఉంచుకుని ముందుకు సాగండి. ఒకవేళ ఇలాగే ఢీలా రిజల్టులోనే ఉంటే రాబోయే పరీక్షలలో రిజల్టు ఎలా ఉంటుంది? కఠినమైన పరీక్షలు రానున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి పురుషార్థం కూడా కఠినంగా ఉండాలి. ఒకవేళ పురుషార్థం సాధారణంగా, పరీక్షలు కఠినంగా ఉంటే రిజల్టు ఎలా ఉంటుంది?
ఈరోజు గోపకులను(అన్నయ్యలను) కలుస్తాము. మీ పురుషార్థంతో సంతుష్టంగా ఉన్నారా? నడుస్తున్నారు కానీ ఎంత శాతంతో? మేము 75 శాతం శ్రీమతంపై నడుచుకుంటున్నాము అని భావించేవారు చేతులెత్తండి. (కొందరు చేతులెత్తారు). అచ్ఛా, ముఖ్య శ్రీమతము ఏమిటి? ఎక్కువ సమయము స్మృతి యాత్రలో ఉండాలి అన్నదే ముఖ్యమైన శ్రీమతము. ఎందుకంటే ఈ స్మృతియాత్రతోటే పవిత్రత, దైవీ గుణాలు మరియు సేవలో సఫలత లభిస్తుంది. ఎవరైతే 75 శాతం శ్రీమతంపై నడుస్తున్నారో వారి యోగం చార్టు ఎంత ఉంది? స్మృతి చార్టు కూడా 75 శాతం ఉండాలి. దీనినే పూర్తిగా శ్రీమతంపై నడుచుకోవడము అని అంటాము. ఈరోజు ముఖ్యంగా గోపకులను ముందుంచాము. గోపికలను(అక్కయ్యలను) తర్వాత రమ్మన్నాము ఎందుకంటే మిలనం గురించిన విషయం వస్తే గోపికలు త్వరగా వచ్చేస్తారు. గోపకులు చూస్తూ చూస్తూ ఉండిపోతారు. గోపకులకు బాధ్యత కూడా ఇచ్చేది ఉంది. ఇచ్చే ఉన్నాము. ద్వాపరం తర్వాత కిరీటం తీసేస్తారు అని మీ చిత్రంలో చూపిస్తారు కదా. ఇప్పుడు బాధ్యత కిరీటాన్ని ఇచ్చాము కానీ కొన్నిసార్లు కావాలని కూడా ఈ కిరీటాన్ని తీసేస్తుంటారు, మరి కొన్ని సార్లు మాయ కూడా తీసేస్తూ ఉంటుంది. సత్యయుగంలో అయితే కిరీటం ఎంత తేలికగా ఉంటుందంటే, బరువు తల మీద ఉందని కూడా అనిపించదు. సత్యయుగ దృశ్యాలు మీ ముందుకు వస్తున్నాయా లేదా? సత్యయుగ దృశ్యాలు వాటంతటవే మీ ముందుకు వస్తున్నాయా లేక మీరు తెచ్చుకోవలసి వస్తుందా? ఎంతెంతగా ముందుకు వెళ్తుంటారో అంతగా వద్దనుకున్నా కానీ సత్యయుగ దృశ్యాలు వాటంతటవే మీ ముందుకు వస్తుంటాయి. తెచ్చుకోవలసిన అవసరం ఉండదు. ఎంతెంతగా సమీపంగా వెళ్తూ ఉంటారో, అంతంతగా దృశ్యాలు కూడా సమీపంగా కనిపిస్తూ ఉంటాయి. సత్యయుగానికి వెళ్ళాలి, అక్కడ ఆడుకోవాలి. ఇదైతే నిశ్చితమైన విషయమే. ఈరోజు, ఇక్కడ కూర్చున్న వారందరిలో, నేను శ్రీకృష్ణునితో పాటు మొదటి జన్మలో వస్తాను అని ఎవరు భావిస్తున్నారు? వారి కుటుంబంలో వస్తారా, లేక స్నేహితుడు స్నేహితురాలిగా అవుతారా లేక స్కూలు సహచరులుగా అవుతారా? మూడింటిలో ఏదో ఒకటి అవుతాము అని భావించేటువంటి నిశ్చయబుద్ధి ఎవరున్నారు? (అందరూ చేతులెత్తారు). సమీపంగా వచ్చేవారి లక్షణాలు సంగమయుగంలో ఎలా ఉంటాయి? ఇక్కడ ఎవరు స్వయాన్ని సమీపంగా భావిస్తున్నారు? యజ్ఞ సేవలో మరియు ఎవరైతే బాప్దాదా కార్యంలో సమీపంగా ఉంటారో వారే అక్కడ ఆటపాటలు మొదలైన వాటిలో సమీపంగా ఉంటారు. యజ్ఞ బాధ్యత మరియు బాప్దాదా కార్య బాధ్యతకు ఎంతెంతగా సమీపంగా ఉంటారో అంతగా అక్కడ కూడా సమీపంగా ఉంటారు. సమీపంగా ఉన్నవారి గుర్తులు ఏమిటి? ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి – ఎంతగా బుద్ధిని, ఎంతగా తనువు-మనసు-ధనమును మరియు ఎంత సమయమును లౌకిక బాధ్యతలకు ఇస్తారో అంతే సమయాన్ని ఇటు వైపు ఇస్తున్నారా? ఇటువైపు ఎక్కువ ఇవ్వాలి. ఒకవేళ ఎక్కువ లేకపోతే వాటి బరువు ఒకేలా ఉందా? రెండు వైపులా ఒకేలా ఉంటే కూడా సమీపంగా ఉన్నట్లుగా లెక్కించవచ్చు. ఈ లెక్క ప్రకారం స్వయాన్ని పరిశీలించుకోండి. ఇప్పటి వరకు రిజల్టులో లౌకిక బాధ్యతల బరువు ఎక్కువగా ఉన్నట్లుగా కనిపించింది. ముఖ్యమైన గోపకులు ఈ విషయాలపై శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది – గడిచిన ఈరోజు లౌకిక బాధ్యతల వైపు ఎంత సమయము ఉన్నది మరియు ఎంత సమయము అలౌకిక లేక పారలౌకిక బాధ్యతల వైపు ఉన్నది? ఎంత సహయోగిగా ఉన్నాను? ఈ చెకింగ్ చేసుకుంటూ ఉంటే ఎటు వైపు ఖాళీగా ఉందో తెలుస్తుంది. అన్ని రకాల పరిస్థితులలో ఉంటూ కూడా కనీసం రెండు వైపుల ఒకేలా ఉండేలా చూసుకోవడం అవసరము. తక్కువ వద్దు. అటు వైపు తక్కువ ఉన్నా ఫర్వాలేదు. ఇటు వైపు తక్కువ ఉండకూడదు. అప్పుడు లౌకిక బాధ్యతల లోటును కూడా సరి చేసుకోగలరు. పరమార్థంతో వ్యవహారం కూడా సిద్ధిస్తుంది. ముందు వ్యవహారాన్ని సరి చేసి తర్వాత పరమార్థంలోకి వస్తాము అని కొందరు అంటారు. ఇది సరి కాదు. దీనిపై ప్రత్యేకమైన శ్రద్ధను ఉంచండి.
ప్రత్యేకంగా గోపకుల మీద బాప్దాదాకు ఒక ఆశ ఉంది, అది కేవలం గోపకులే పూర్తి చేయగలరు. గోపికలు చేయలేరు. అది ఏ ఆశ? పాండవుల ముఖ్య కర్తవ్యము – అనేక రకాల వ్యక్తులు, అనేక రకాల పరీక్షలు రాబోతున్నవి మరియు ప్రస్తుతం వస్తున్నవి కూడా, ఈ వ్యక్తులను మరియు పరీక్షలను ఎప్పటికప్పుడు పరిశీలించడము, ఇది విశేషంగా గోపకుల పని. ఎందుకంటే శక్తులను చూసుకునే ముఖ్యమైన కార్యము పాండవులపై ఉంది. శక్తుల పని బాణం వేయడము కానీ అన్ని రకాల పరీక్షలు మరియు వ్యక్తులను పరిశీలించడము, శక్తులను జాగ్రత్తగా చూసుకోవడము పాండవుల పని. ఇంతటి బాధ్యతను తీసుకోగలరా? లేక శక్తులు మిమ్మల్ని చూసుకోవలసిన అవసరం ఉందా? పాండవులు, తమను ఇతరులు చూసుకోవాలి అని కోరుకోవడాన్ని కొన్నిచోట్ల చూసాము. కానీ పాండవులు తమను తాము చూసుకోవడమే కాకుండా నలువైపులను చూసుకోవాలి. అనంతమైన దృష్టి ఉండాలి, హద్దు వద్దు. ఒకవేళ స్వయాన్నే చూసుకోలేకపోతే ఇతరులను చూసుకోవడం కష్టమవుతుంది. అచ్ఛా!
ఓంశాంతి