Search for a command to run...
26 May 1969
సంపూర్ణ స్నేహానికి గుర్తు
26 May 1969 · తెలుగు
అందరూ ఏ స్థితిలో కూర్చున్నారు? తత్పరులై (లగన్) కూర్చున్నారా లేక నిమగ్నమై (మగన్) కూర్చున్నారా? ఏ అవస్థలో కూర్చున్నారు? ఎక్కువ సమయము తత్పరులై కూర్చునే పురుషార్థం జరుగుతుందా లేక నిమగ్న రూపంలో ఉన్నారా? మీ చెకింగ్ని అయితే చేసుకుంటూ ఉండవచ్చు. అచ్ఛా. మా పేపరు యొక్క రిజల్టు తెలియాలి అని అందరూ కోరుకుంటున్నారు. విశేషంగా అందరి మనసులలో ఇదే సంకల్పం వస్తూ ఉంది. మరి ఈ రోజు రిజల్టును కూడా వినిపించేస్తాము. అందరూ తమ యథా యోగ్యంగా, యథా శక్తి అనుసారంగా ఏదైతే వ్రాసారో, దాని అనుసారంగా టోటల్ రిజల్టు ఏమిటంటే, బాబాపై నిశ్చయబుద్ధి అయితే ఉంది, కానీ ఎంతగా బాబాపై నిశ్చయం ఉందో అంతే నిశ్చయము బాబా చెప్పే మహా వాక్యాలు, ఆజ్ఞలపై నిశ్చయబుద్ధిగా అయి నడుచుకోవడము – అది ఇప్పుడు 50 శాతం మాత్రమే కనిపిస్తుంది. బాబాపై అయితే 100 శాతం ఉంది కానీ బాబా ఆజ్ఞలు మరియు ఆదేశాలలో నిశ్చయబుద్ధిగా అయి ఏ ఆదేశము లభిస్తుందో అది వెంటనే చేయడము – ఆదేశాలలో ఇటువంటి నిశ్చయుబుద్ధిలో మెజారిటీమందికి 50 శాతం రిజల్టు వచ్చింది. అలాగే టీచరుపై నిశ్చయము ఉంది కానీ వారు చెప్పే పూర్తి చదువుపై పూర్ణ రీతిగా నడుచుకోవడంలో కూడా తమ తమ శాతం రిజల్టులో ఉంది. అలాగే గురువు రూపంలో, వీరు సద్గురువు అన్న పూర్తి నిశ్చయం ఉంది కానీ వారి శ్రీమతంపై నడవడము – ఈ టోటల్ రిజల్టులో 50 శాతం వరకే ఉంది. కేవలం తండ్రి, టీచరు మరియు సద్గురువుపై నిశ్చయము మాత్రమే కాదు, ఈ నిశ్చయంతో పాటు వారి ఆదేశాలు, వారి చదువు, వారి శ్రీమతముపై కూడా సంపూర్ణ నిశ్చయ బుద్ధి అయి నడుచుకోవాలి. ఇందులో లోటు ఉంది, దీనిని ఇప్పుడు భర్తీ చేయాలి.
స్నేహానికి గుర్తు ఏమిటి? సంపూర్ణ స్నేహి యొక్క ఆనవాళ్ళు(గుర్తులు) ఏమిటి? వారి ముఖ్య లక్ష్యము ఏమి ఉంటుంది? మీరందరూ ఏమైతే వినిపించారో అవి ఉండనే ఉన్నాయి. కానీ వాటిని స్పష్టం చేయడానికి, ఎవరితో అయితే ఎవరికైతే స్నేహం ఉంటుందో వారి ముఖంలో ఆ స్నేహితుడి ముఖమే కనిపిస్తుంది. వారి నయనాలలో ఆ మెరుపే కనిపిస్తుంది. వారి నోటి నుండి కూడా స్నేహ పలుకులే వస్తాయి. వారి ప్రతి నడవడికలో స్నేహం యొక్క చిత్రం కనిపిస్తుంది. వారిలో ఆ స్నేహితుడే ఇమిడి ఉంటారు. ఇటువంటి అవస్థ ఉండాలి. ఇప్పుడు పిల్లలు మరియు తండ్రి సంస్కారాలలో చాలా తేడా ఉంది. సమానంగా అయితే మీ సంస్కారాలు కనిపించవు. వారే కనిపిస్తారు. ఒక్కొక్కరిలో బాబానే కనిపిస్తారు. మీ అందరి ద్వారా బాబా సాక్షాత్కారం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ లోటు ఉంది. అటువంటి స్నేహిగా అయ్యానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. స్నేహం పెట్టుకోవడం కూడా సహజమే. స్నేహి స్వరూపంగా అవ్వడము – ఇది ఫైనల్ స్టేజ్. . పరీక్ష యొక్క రిజల్టును వినిపించాము. ఒకటైతే ఈ కొరత ఉంది, రెండవ విషయము, అందరూ ఏదైతే వ్రాసారో అందులో సహనశక్తి యొక్క రిజల్టు చాలా తక్కువగా ఉంది. ఎంత సహనశక్తి ఉంటుందో అంతగా సేవలో సఫలత ఉంటుంది. సంగఠనలో ఉండటానికి కూడా సహనశక్తి కావాలి. వినాశనము అనే ఫైనల్ పేపరులో పాస్ అవ్వడానికి కూడా సహనశక్తి కావాలి. ఆ సహనశక్తి మెజారిటీ రిజల్టులో చాలా తక్కువగా ఉంది. కనుక ఇప్పుడు దానిని పెంచండి. సహన శక్తి ఎలా వస్తుంది? స్నేహిగా అయ్యే దానిని బట్టి వస్తుంది. ఎంతగా ఎవరి పట్ల అయితే స్నేహం ఉంటుందో ఆ స్నేహంతో శక్తి వస్తుంది. స్నేహంతో సహనశక్తి ఎలా వస్తుంది అన్నది ఎప్పుడైనా అనుభవం చేసారా? ఎలాగైతే, చూడండి, ‘పిల్లల తల్లి ఉంది. పిల్లలకు ఏదైనా ఆపద వస్తే, తల్లికి స్నేహము ఉన్న కారణంగా తనలో సహనశక్తి వచ్చేస్తుంది. పిల్లల కోసం దేనినైనా సహించడానికి తయారైపోతుంది. ఆ సమయంలో, స్నేహంలో, తన తనువును, పరిస్థితులను దేనినీ పట్టించుకోదు’. అలాగే ఒకవేళ నిరంతరం స్నేహం ఉన్నట్లయితే వారికి స్నేహితుని కోసం సహించడం పెద్ద కష్టంగా అనిపించదు. స్నేహం తక్కువగా ఉన్న కారణంగా సహనశక్తి కూడా తక్కువగా ఉంది. ఇది మీ అందరి . పరీక్ష యొక్క రిజల్టు. ఇప్పుడు ఒక నెల తర్వాత రిజల్టును చూస్తాము. అక్కడైతే మూడు నెలల తర్వాత పరీక్ష వస్తుంది. ఇక్కడ ఒక నెల తర్వాత, స్నేహి రూపంగా ఎంత అయ్యారు అన్న రిజల్టును చూస్తాము.
ముఖ్యమైనది నిర్భయత గుణము, ఇది . పరీక్ష లో ఇవ్వలేదు. ఎందుకంటే ఇది చాలా తక్కువగా ఉంది. ఒక నెలలోపు ఈ నిర్భయత గుణాన్ని కూడా మీలో పూర్తిగా నింపుకునే ప్రయత్నం చేయాలి. నిర్భయత ఎలా వస్తుంది? అందుకోసం చేయవలసిన ముఖ్య పురుషార్థం ఏమిటి? నిరాకారిగా అవ్వాలి. ఎంతగా నిరాకారి అవస్థలో ఉంటారో అంతగా నిర్భయంగా ఉంటారు. శరీర భానంలోకి వస్తేనే భయం కలుగుతుంది. ఒక నెల చార్టును ముందే చెప్పేస్తున్నాము. కుమారీల ట్రైనింగ్ క్లాసు పూర్తయిన తర్వాత, సహనశక్తి, నిర్భయత మరియు నిశ్చయానికి గురుతులు ఏవైతే చెప్పామో అవి ఎంత వరకు వచ్చాయి అని అడుగుతాము. ఈ మూడు విషయాల . పరీక్ష మళ్ళీ తీసుకుంటాము.
కుమారీలపై బాప్దాదాకు విశేషమైన ప్రేమ ఎందుకు ఉంటుంది? ఏ ప్రత్యేకమైన విషయము ఉన్న కారణంగా బాప్దాదా ప్రత్యేకమైన స్నేహాన్ని ఉంచుతున్నారు? ఎందుకంటే, వీరికి ఈశ్వరీయ స్నేహము లభించకపోతే మరొకరి స్నేహంలో ఇరుక్కుపోతారు అని బాప్దాదా భావిస్తారు. బాబా దయాహృదయుడు కదా. దయ కారణంగా స్నేహము ఉంది. భవిష్య రక్షణ కోసం విశేష స్నేహము ఉంది. మరి ఇప్పుడు బాప్దాదా స్నేహానికి మీరు ఎలా జవాబిస్తారో చూస్తాము. స్వయాన్ని రక్షించుకోవడమే బాప్దాదా స్నేహానికి ఇచ్చే రెస్పాండ్. ఏ ఏ విషయాల నుండి స్వయాన్ని రక్షించుకోవాలో తెలుసు కదా? ఒకటి, మనసుతో సహా పవిత్రత. మనసులో ఎటువంటి సంశయం రాకూడదు. రెండవ విషయము, మీ వాచను కూడా ఎలా ఉంచుకోవాలంటే నోటి నుండి అలాంటి ఇలాంటి మాటలు రాకూడదు. వాణిపై కూడా కంట్రోల్, మనసుపై కూడా కంట్రోల్. సాకారంలో బాప్దాదా వాణి ఎలా ఉండేదో అటువంటి వాణి ఉండాలి. సాకార తనువు ద్వారా ఏ కర్మలను చేసి చూపించారో ఆ విధమైన కర్మలను చేయండి. మీ కర్మలు ఎలా ఉండాలంటే ఇతరులు కూడా చూసి వారూ చేయాలి. ఇది ప్రత్యేకంగా కుమారీల కోసం, ఇంకా దేని నుండి రక్షించుకోవాలి స్వయాన్ని? సాంగత్య దోషంతో రక్షింపబడాల్సిందే, మరో విశేషమైన విషయము ఉంది. ఇప్పుడు బహు రూపాలలో, ఆత్మ రూపంలో, శరీరం రూపంలో, మీ అందరినీ మభ్య పెట్టడానికి బహు రూపాలు మీ ఎదురుగా వస్తాయి. కానీ అందులో మోసపోకండి. చాలా పరీక్షలు వస్తాయి కానీ ఏమీ ఉండదు. పరీక్షలలో ఎవరు పాస్ అవ్వగలరు? పూర్తి పరిశీలన ఉన్నవారు. పరిశీలన శక్తి ఎంతగా ఉంటుందో అంతగా పరీక్షలలో పాస్ అవుతారు. పరిశీలించే శక్తి తక్కువగా ఉంటుంది, ఇది ఎటువంటి విఘ్నము, మాయ ఏ రూపంలో వస్తుంది, నా ఎదురుగానే ఈ విఘ్నము ఎందుకు వచ్చింది, దీనివలన రిజల్టు ఏమి ఉంటుంది అని పరిశీలించలేకపోతున్నారు. ఈ పరిశీలన తక్కువగా ఉన్న కారణంగా పరీక్షలలో ఫెయిల్ అవుతున్నారు. పరిశీలన మంచిగా ఉంటే వారు పాస్ అవ్వగలరు. అచ్ఛా.
ఓంశాంతి