Search for a command to run...
10 Mar 1969
తమ పాత సంస్కారాలపై విజయాన్ని సాధించినవారే నంబరువన్గా అవ్వగలరు
10 March 1969 · తెలుగు
(కుమారీల మొదటి గ్రూపు అయిన టీచర్ల ట్రైనింగులో అవ్యక్త బాప్దాదా ఉచ్ఛరించిన మధురమైన శిక్షణలు)
వచ్చిన కుమారీలందరూ, మీ అందరిలో ఏ లక్ష్యం ఉంది? ఏ లక్ష్యంతో ఇక్కడకు వచ్చారు? (భట్టీ అనుభూతిని పొందడానికి వచ్చామని కొందరు చెప్పారు) అనుభవం చేసుకోవాలన్న లక్ష్యం కూడా ఎందుకుంది? ఎందుకు ఈ అనుభూతిని కావాలనుకుంటున్నారు? టీచర్ల లక్ష్యం ఏమిటి? భట్టీలో అయితే గట్టిగా అవుతారు కానీ భట్టీలో గట్టిగా అయ్యి ఏమి చేయాలి? ఆ లక్ష్యం తప్పకుండా స్పష్టమవ్వాలి. ఏమి అవ్వాలి, ఎలా అవ్వాలి! సాకర రూపంలో మమ్మా బాబా కర్మలు చేసి చూపించడంలో ఉదాహరణగా నిలిచారు, ఒకే పదంలో సంపూర్ణ మరియు శ్రేష్ఠ టీచరు ఎలా ఉండాలి అని చూపించారు. మీరు కేవలం టీచరే కాదు, తండ్రి, టీచరు మరియు గురువు మూడు రూపాలు ఉండాలి. ఇదే విధంగా జగన్మాత మరియు జగత్తుకు నిమిత్త టీచరు, అలాగే సద్గురువు. సద్గురువు మీరు స్వయం అవ్వలేరు కానీ సద్గురువుతో పూర్తి సంబంధాన్ని పెట్టుకునే వారిగా అవ్వాలి. శ్రీమతంపై స్వయం నడుస్తూ, ఇతరులను నడిపించే వారిగా అవ్వాలి. ఈ ముఖ్యమైన విషయాలు ఎప్పుడైతే టీచరులో వస్తాయో అప్పుడు ఆ టీచరు యొక్క రిజల్టు సర్వోత్తమంగా ఉంటుంది. టీచరుగా అవ్వడము సహజం కానీ టీచరుతనం యొక్క క్వాలిఫికేషన్లో జ్ఞానయోగాలకు సంబంధించిన ముఖ్యమైన అన్ని సంస్కారాలను నింపుకోవడం, ఇది చాలా అవసరం. జగన్మాతగా, శక్తి రూపిణిగా, దివ్య గుణధారి దైవీతత్వంతో, యోధురాలిగా – ఇలాంటి అన్ని సంస్కారాలను మీలో సరిగ్గా నింపుకుంటే అప్పుడు ప్రపంచంలో పేరు ప్రఖ్యాతి అవుతుంది. ఇటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారా? కన్య అయినప్పటికీ మీరు జగన్మాతలు. స్వయాన్ని ఒకవేళ కన్యగా భావిస్తే కొన్ని కొన్ని విషయాలలో సేవ చేసేటప్పుడు అనాసక్తత ఉంటుంది. కన్యతనం అంటే పవిత్రత. కనుక కుమారీతనాన్ని కూడా పూర్తిగా పెట్టుకోవాలి, కుమారీతనంతో పాటు అనంతమైన జగన్మాతను అని కూడా భావించాలి. అలమటిస్తున్న ఆత్మలకు, దుఃఖంతో మొరపెట్టుకుంటున్న ఆత్మలకు జ్ఞానయోగాలతో పాలన చేయాలి. ఈ విధంగా మీ వృత్తి, స్మృతి మరియు దృష్టిని పెట్టుకుంటే అప్పుడు మీ దృష్టిలో ఆత్మికత వస్తుంది. భౌతికత తొలగిపోతుంది, ఆత్మిక దృష్టి వస్తూ ఉంటుంది. నంబరువారీగా ఉన్నప్పటికీ నేను నంబరువన్ అయి చూపిస్తాను అని ప్రతి ఒక్కరూ లక్ష్యం పెట్టుకోవాలి. కానీ నంబరు వన్ ఎలా అవుతారు? ఎప్పుడైతే మీ సర్వ పాత సంస్కారాలపై విన్ (విజయం) అవుతారో అప్పుడే వన్ అవుతారు. ఇంతటి ఉల్లాసము మరియు ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ తమలో పెట్టుకోవాలి. మరి ఇంతమంది కుమారీలు సంపూర్ణ టీచర్లుగా అయితే వినాశనం ఎంత త్వరగా వచ్చేస్తుంది? ఎందుకంటే మీరు సంపూర్ణమైతే సృష్టి కూడా సంపూర్ణం అవుతుంది. ఈ అసంపూర్ణ సృష్టి త్వరత్వరగా సమాప్తమై సంపూర్ణ సృష్టి వచ్చేస్తుంది. అప్పుడు శక్తుల పేరు మూలమూలన ప్రఖ్యాతి అవుతుంది. ఎప్పుడు కూడా స్వయంలో పాత సంస్కారాలను రానివ్వకూడదు అని ముఖ్యంగా అందరూ భావించాలి. సంకల్పాలలోనే వాటిని సమాప్తం చేయాలి. ఒకవేళ సంకల్పం వచ్చినాగానీ సంకల్పానికి స్థానమిచ్చి దానికి పాలన ఇవ్వకండి. సంకల్పాన్ని సంకల్పంలోనే సమాప్తం చేసెయ్యండి. అప్పుడు చివరకు సంకల్పాలలోనే పాత సంస్కారాలు ఇమర్జ్ అవ్వకుండా ఉంటాయి.
అందరి స్వభావాలు వేరువేరుగా ఉంటాయి కానీ స్వభావాల నుండి కాపాడబడాలంటే స్వయంలో ఏమి ధారణ చేయాలి? సరళత. ఎంతగా సరళ దృష్టి, సరళ బుద్ధి, సరళమైన వాణి ఉంటాయో అంతగా స్వభావాల ఘర్షణ జరగదు.
కుమారీలు భట్టీ పేరు విని గాభరా పడటం లేదు కదా? ఇదైతే మధురమైన భట్టీ, ఈ భట్టీలోనే మీరు బంగారంలా అవ్వాలి. మనసులో ఏదైనా కష్టంగా అనిపిస్తే మనసులోని మాటను మనసులోనే పెట్టుకోకండి. మనసులోని మాటను మాటలలోకి తీసుకురండి, కానీ ఎక్కడ? స్థానము చూసి బయటకు తీసుకురండి. ఇది చెత్త కదా. చెత్తను ఎక్కడ వేస్తారు? అందుకు నిర్ధారించబడ్డ స్థానంలో వేస్తారు. అక్కడ ఇక్కడ చెత్తను వేస్తే అది వాతావరణంలో వ్యాపిస్తుంది. కనుక మనసులో ఒకవేళ అటువంటి సంకల్పాలు ఏమైనా వస్తే, ఆ సంకల్పాలను వ్యర్థము లేక వికల్పము అని అనుకుంటే, వాటిని అందుకు నిమిత్తం చేయబడ్డ స్థానములో తప్ప మరెవ్వరికీ చెప్పకండి. లేకపోతే వాయుమండలాన్ని పాడు చేసిన దానికి మీరు నిమిత్తమైన కారణంగా అది మీ పురుషార్థంలో ఆటంకంగా నిలుస్తుంది. కనుక, మీరు పెట్టుకున్న లక్ష్యం అనుసారంగా, మీకు ఆటంకంగా నిలిచే ఏ విషయాలను పెట్టుకోకండి. తొలిగిస్తూ, నెట్టేస్తూ ముందుకు వెళ్ళండి. అప్పుడే లక్ష్యాన్ని పొందగలరు. ప్రతి మురళిలో లక్ష్యాన్ని అయితే ఇచ్చాము. ఏమి చేయాలి, ఏమి చూడాలి, ఏమి ఆలోచించాలి. ఇచ్చిన డైరెక్షన్ల అనుసారంగానే నడుచుకోండి.
ఇంట్లో గారాల పిల్లలు ఉంటే తండ్రి వారిని చక్కగా అలంకరిస్తారు కదా. మరి కుమారీలైన మీరు ఎటువంటి అలంకరణ చేసుకుంటారు? ఆభరణాలు ధరించారా? ఎప్పటికీ మీ ఆభరణాలతో అలంకరింపబడి ఉండండి. తీసెయ్యకండి. రాయల్ కుటుంబంలోని వారు ఎప్పుడూ వారి ఆభరణాలను తీసివేయరు. పేదవారు అప్పుడప్పుడూ ధరిస్తారు. మీరందరూ ఎవరి పిల్లలు? ఏ ఆభరణాలు ధరించి ఉన్నారు? ఏ తిలకము ఉంది? (రాజ తిలకము). రాజ తిలకము అయితే మీకు మీ సత్యయుగ తల్లిదండ్రులు ఇస్తారు. సంగమయుగంలోని క్రొత్త తిలకము ఏమిటి? విజయులుగా అయ్యే విక్టరీ. విజయి రత్నములుగా అయ్యేందుకు గుర్తును ఈరోజు తిలక రూపంలో కుమారీలకు ఇస్తున్నాము. అచ్ఛా,బిందీ (పెద్ద తిలకము) ధరించారా? ఏ బిందీ ధరించారు? బిందీ – స్వదర్శన చక్రము. ఇది ఎప్పుడూ మర్చిపోకండి. ఏ కుండలము(చెవిపోగు) ధరిస్తారు? (శంఖము) శంఖధ్వని జరుగుతూ ఉండాలి. అచ్ఛా, ఏ కంకణం ధరిస్తారు? నియమము అనే కంకణాన్ని ధరించండి. అయితే ఎవరు ఎన్ని నియమాలు పాటిస్తారో అన్ని కంకణాలు వారు ధరించినట్లు అర్థం. కొందరు పది-పది కంకణాలు కూడా ధరిస్తారు, కొందరు ఒకటే వేసుకుంటారు. ఎక్కువ కంకణాలు ధరించినప్పుడు ఎక్కువ అందంగా ఉంటుంది. ఎన్ని నియమాల పాలన చేస్తారో అన్ని కంకణాలను ధరించారని అర్థం. అచ్ఛా, ఏ మువ్వలు ధరిస్తారు? మువ్వలు (గజ్జలు) ధ్వనిస్తాయి. మరి జ్ఞాన మువ్వల సవ్వడి అందరూ వినాలి. కృష్ణుని మువ్వల సవ్వడితో గోపికలు వచ్చేవారని కృష్ణుని గురించి అంటారు. మీ జ్ఞాన మువ్వల సవ్వడితో ఎవరు వస్తారు? మీ భక్తులు మరియు ప్రజలు. ఎంతెంతగా మధురమైన ధ్వని ఉంటుందో అంతంతగా ఆకర్షణ ఉంటుంది. ఈ ఆభరణాలన్నీ ఎప్పుడూ ధరించి ఉండండి. మాయ తీసివేయకుండా ఉండాలి. తీసివేసే వారు కూడా చాలా తెలివైనవారు ఉన్నారు. చాలా ప్రేమగా చెబుతూ తీసేస్తారు. కనుక ఎప్పుడూ తీసేయకండి.
కుమారీలపై ఆశ ఉంది కానీ ఎంత శాతంలో ఆశలను పూర్తి చేస్తారో తెలిసిపోతుంది. నేను ఏదైనా అద్భుతాన్ని చేసి చూపించాలని ప్రతి ఒక్కరూ భావించాలి. బాప్దాదాకు ఉన్న ఆశ ఏదైతే ఉందో, ఆ ఆశా సితార మీ మస్తకంపై మెరిపించి చూపించాలి. కుమారీల గ్రూపు మంచిది. టీచర్లు కూడా మంచివారు లభించారు. ఎక్కడ ఎవరిలో మంచి గుణం చూసినా దానిని వెంటనే తీసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేష గుణం ఉంది. ఇలా ప్రతి ఒక్కరి నుండి గుణాలను తీసుకుంటూ తీసుకుంటూ సర్వ గుణ సంపన్నులుగా అవ్వండి. ఒకవేళ అవగుణం చూస్తే వెనుతిరగండి. బొమ్మ చూసారు కదా. సీత ఎదురుగా రావణుడిని పెడితే సీత వెనక్కు తిరుగుతుంది, అదే రాముడిని పెడితే సమ్ముఖానికి వస్తుంది. మీరు కూడా సీతలే కదా. గుణాలను చూస్తే ధారణ చేయండి. అవగుణాలను చూసీ చూడనట్లుగా ఉండండి. వినీవిననట్లుగా ఉండండి. ఆలోచించకండి. వినడము మరియు ఆలోచించడము అయితే రెండవ స్థితి. కుమారీలందరికీ విక్టరీ తిలకాన్ని ఇచ్చి, పైన బిందువు పెడుతూ నోరు తీపి చేసారా? ఈ తిలకాన్ని ఎప్పటికీ నిలుపుకునే ధైర్యం ఉంది కదా! ఈరోజు ఎలా అయితే మస్తకం మెరుస్తుందో అలా అవినాశిగా మెరవాలి. అచ్ఛా.
ఓంశాంతి