Search for a command to run...
13 Mar 1969
ప్రేమ మరియు శక్తి గుణాలలో సమానత
13 March 1969 · తెలుగు
ఆత్మ అభిమానిగా అయ్యి స్మృతి యాత్రలో కూర్చున్నారా? స్మృతి యాత్రలో కూడా ముఖ్యంగా ఏ గుణంలో స్థితి అయ్యారు? స్మృతి యాత్రలో ఉన్నాకానీ ముఖ్యంగా ఏ గుణ స్వరూపులుగా ఉన్నారు? ప్రస్తుతం మీ యొక్క ముఖ్య గుణము ఏమిటి? (అందరూ తమ తమ ఆలోచనలను వినిపించారు) ఈ సమయంలో అయితే అందరూ విశేషంగా ప్రేమ స్వరూప స్థితిలో ఉన్నారు. కానీ ప్రేమతో పాటు వర్తమాన సమయంలో వచ్చే పరిస్థితుల అనుసారంగా ఎంతగా ప్రేమ స్వరూపమో అంతగా శక్తి స్వరూపముగా కూడా ఉండాలి. దేవతల చిత్రాలను చూసారు కదా – దేవతల చిత్రంలో ముఖ్యంగా ఏ విశేషత కనిపిస్తుంది? మీ చిత్రాలను ఎప్పుడూ శ్రద్ధతో చూడలేదా? దేవతల చిత్రాలను తయారు చేసినప్పుడు, ఒక్క కాళి దేవి తప్ప, మిగతా దేవతలందరి నయనాలను చెమ్మగా చూపిస్తారు. ప్రేమలో మునిగి ఉన్న నయనాలను చూపిస్తారు, అలాగే వారి ముఖాన్ని తయారుచేసినప్పుడు వారి ముఖం ద్వారానే శక్తి యొక్క సంస్కారం కనిపిస్తుంది. కానీ నయనాలలో ప్రేమ, దయ, శీతలత కనిపిస్తాయి. మాతృత్వంతో కూడిన ప్రేమ సమస్కారం ఈ నయనాలలో కనిపిస్తుంది. వారు కూర్చునే విధానము, వారి సవారీ, అస్త్ర శస్త్రాలు అన్నీ శక్తి రూపాన్ని చూపిస్తాయి. మరి అలాగే శక్తులైన మీలో కూడా ఈ రెండు గుణాలు సమానంగా ఉండాలి. ఎంతగా శక్తి స్వరూపమో అంతగా ప్రేమ స్వరూపము. ఇప్పటివరకు రెండూ లేవు. ఒకసారి ప్రేమ అలలో, మరోసారి శక్తి రూపంలో స్థితి అవుతున్నారు. రెండూ కలిసి, సమానంగా ఉండాలి. ఇది శక్తితత్వము యొక్క అంతిమ సంపూర్ణతకు గుర్తు.
ఇప్పుడు బాప్దాదాకు తమ పిల్లల మస్తకంలో ఏమి కనిపిస్తుంది? మీ మస్తకంలో చూసుకున్నారా? ప్రారబ్ధాన్ని చూసుకున్నారా లేక వర్తమాన సౌభాగ్య సితార మెరుస్తున్నట్లుగా చూసుకున్నారా లేక మరింకేదైనా చూసారా? (అందరూ తమ తమ ఆలోచనలను వినిపించారు). మూడు సంబంధాలతో మూడు విషయాలను చూడటం జరిగింది. కనుక మీకు త్రిశూలాన్ని బహుమతిగా పంపించాము. మూడు సితారలు కనిపిస్తున్నాయి. ఒకటి భవిష్యత్తుది, రెండు వర్తమాన సౌభాగ్యము మరియు మూడవది పరంధామంలో మీ ఆత్మ యొక్క సంపూర్ణ అవస్థ ఏదైతే ఉంటుందో, ఆ ఆత్మిక సంపూర్ణ స్థితి యొక్క సితార. మూడు సితారలు కనిపిస్తున్నాయి. ఈ మూడు సితారలను చూస్తూ ఉండండి. ఒక్కోసారి సితారల మధ్యకు మబ్బులు వచ్చేస్తుంటాయి. ఒక్కోసారి సితారలు తమ స్థానాన్ని కూడా మారుస్తాయి. ఒక్కోసారి సితారలు రాలిపోతుంటాయి. ఇక్కడ కూడా అలాగే స్థానాన్ని మారుస్తూ ఉంటారు. ఒక్కోసారి రాలిపోతుంటారు. ఒకసారి చూస్తే ఎంతో ఎత్తులో ఉంటారు, ఒకసారి చూస్తే మధ్యలో ఉంటారు, మరోసారి చూస్తే దానికన్నా క్రింద ఉంటారు. మీ స్థానాన్ని కూడా ఇక మార్చకండి. ఒకవేళ మారాలి అంటే ఉన్న స్థానం కన్నా ముందుకు వెళ్ళండి. క్రిందికి రాకండి. అవినాశి సంపూర్ణ స్థితిలో సదా ఎక్కుతూ ఉండండి. ఇటువంటి సితారగా అవ్వాలి. రాలిపోవడము అనేది ఇక్కడ లేనే లేదు. అందరూ మంచి పురుషార్థీలు కూర్చుని ఉన్నారు. అయితే స్థానాన్ని మార్చే అలవాటును తొలగించాలి.
కుమారీల రిజల్టు ఎలా ఉంది? మీరు మీ రిజల్టు ఎలా ఉందని భావిస్తున్నారు? విశేషంగా ఏ విషయంలో ఉన్నతిని భావిస్తున్నారు? (అందరూ తమ ఆలోచనలను వినిపించారు). స్మృతి యాత్రలో తక్కువగా ఉన్నారు. అందుకే అంతగా అనిపించడం లేదు. అమృతవేళ స్మృతి అంతగా అనుభవం కావడం లేదు. సాకారుడు ఎలా అయితే ఇక్కడ చల్లని గాలిలో షికారుకు తీసుకువెళ్ళేవారు, లక్ష్యాన్ని ఇచ్చేవారు, యోగ అనుభూతిని కూడా చేయించేవారు కదా, అలాగే కుమారీలకు నిమిత్తమైన టీచర్లు కూడా వారిని అర్థగంట ఏకాంతంలో షికారుకు తీసుకువెళ్ళండి. ఎలా అయితే ఆరంభంలో మీరు వేరువేరుగా కూర్చునేవారు కదా, సాగరం ఒడ్డున, ఒకరు ఒక చోట, మరొకరు మరో చోటకు వెళ్ళి కూర్చునేవారు. ఇటువంటి అభ్యాసాన్ని చేయించండి. ఇక్కడ డాబాలు (పైకప్పులు) చాలా ఉన్నాయి. సాయంకాలం కూడా 7 నుండి 7.30 వరకు సమయం చాలా విశేషంగా ఉంటుంది. అమృతవేళ సమయము ఎలా అయితే సతోగుణి సమయంగా ఉంటుందో అలాగే సాయంకాల సమయం కూడా విశేషంగా బాగుంటుంది. షికారుకు కూడా ఈ సమయంలో వెళ్ళేవారు. ఆ సమయంలోనే సంగఠనలో యోగం చేయించండి, మధ్య మధ్యలో అవ్యక్త రూపంలో మాట్లాడుతూ ఉండండి, ఎవరి బుద్ధియోగమైనా అటు ఇటు వెళ్ళి ఉంటే వారు అటెన్షన్లోకి వస్తారు. యోగం సబ్జెక్టులో చాలా తక్కువగా ఉన్నారు. భాషణ చేయడము, ప్రదర్శనిలో అర్థం చేయించడము, ఇదైతే ఈరోజుల్లో స్కూలులోని కుమారీలకు కూడా ఒక వారం రోజుల పాటు ట్రైనింగు ఇస్తే వారు కూడా చాలా బాగా చెప్తారు. కానీ ఇక్కడైతే జీవితంలో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకోవాలి. ఆ సమయంలో, బాప్దాదా ఆహ్వానంపై వెళ్తున్నాము అని భావించండి. బాప్దాదా షికారు చేస్తున్నట్లుగా మీరు కూడా మీ బుద్ధియోగ బలంతో షికారు చేయవచ్చు. స్మృతి యాత్రను అనుభవం చేసుకున్నట్లయితే అవ్యక్త స్థితి యొక్క ప్రభావము మీ నయనాల ద్వారా, నడవడిక ద్వారా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. తర్వాత వారితో మాలను తయారుచేయిస్తాము. ఆరంభంలో మీరు స్వయంగా మాలను తయారుచేసేవారు కదా.
ఈ గ్రూపుకు ఉల్లాస ఉత్సాహాలు చాలా బాగున్నాయి. కాకపోతే ఒక్క విషయంపై శ్రద్ధ పెట్టండి – ఇతరుల సంస్కారాలను తెలుసుకుని కూడా, పరస్పరం ఒకరితో ఒకరు కలిసిమెలసి ఉండండి. ఎవరితోనైనా విశేష స్నేహము ఉంటే వారితో ఎంతో కలిసిపోతారు కదా. అలాగే అందరూ అందరితో కలిసిపోవాలి. కుమారీలు ఇటువంటి షో చేసి చూపించినప్పుడు ఇతర కుమారీలు కూడా సేవ చేసేందుకు నిమిత్తులుగా అవుతారు. ఎవరైతే నిమిత్తంగా అవుతారో వారికి దాని ఫలితం కూడా లభిస్తుంది. అనేకమంది కుమారీలకు ఉల్లాసము, ఉత్సాహాము, ఉన్నతి ఇవ్వడానికి మీరు నిమిత్తులు. ఎంత ఉల్లాసంతో సాకారుడు మరియు నిరాకారుడు ఇద్దరూ కలిసి ఈ ప్రోగ్రామును తయారు చేసారో అంతగా దాని ఫలితాన్ని చూపించాలి. అనేక కుమారీల ఉన్నతికి నిమిత్తులుగా కాగలరు. మీ తోటివారిని క్రింద పడకుండా కాపాడగలరు. కుమారీలపై బాప్దాదాకు విశేష స్నేహము ఉంది. ఎందుకంటే బాప్దాదా పరమ పవిత్రమైనవారు, అలాగే కుమారీలు కూడా పవిత్రమైనవారు. మరి పవిత్రత, పవిత్రతను ఆకర్షిస్తుంది. వర్తమాన సమయములో ముఖ్య విశేషత ఇదే కావాలి, తమలోని గుణాలను ఇతరులలో నింపడమే ప్రతి మహారథి బాధ్యత. ఎలా అయితే జ్ఞానాన్ని దానం చేస్తారో అలాగే గుణాలను దానం చేయవలసి ఉంటుంది. ఎలా అయితే జ్ఞాన రత్నాలను దానం చేస్తారో, అందుకే మహారథి అని పిలవబడుతున్నారు కదా, అలాగే గుణాల దానం కూడా చాలా పెద్ద దానము. జ్ఞానము ఇవ్వడము అయితే సహజమే. గుణాల దానము చేయడము, ఇందులో కొంత శ్రమ ఉంది. గుణాల దానాన్ని చేయడంలో మహారథులందరిలోకి నంబరువన్ ఎవరు? జనక్. ఈ గుణం వీరిలో విశేషంగా ఉంది. మరి ఒకరినుండి మరొకరు గుణాలను తీసుకోండి.
ఆబూ మ్యూజియం తయారీ గురించి బాప్దాదా ఇలా అన్నారు –
దూరదర్శిగా మరియు విశాల బుద్ధిగా అయ్యి మ్యూజియంను తయారు చేయండి. ముందే భవిష్యత్తును ఆలోచించి సమయాన్ని సఫలం చేసుకునే గుణాన్ని ధారణ చేసుకోండి, సమయానికి తయారు కూడా చేయాలి. త్వరగా కూడా అవ్వాలి మరియు సంపూర్ణంగా కూడా అవ్వాలి, అదే అద్భుతము. ఒకవేళ ఏదైనా లోపము ఉంటే ఆ లోపము వైపే అందరి దృష్టి వెళ్తుంది. అటువంటి లోపము ఉండకూడదు. అందరి నోటి నుండి అద్భుతము అని రావాలి. పూర్తి దైవీ పరివారము మీ ముఖాన్ని మ్యూజియం అను దర్పణంలో చూస్తారు. అచ్ఛా!
ఓంశాంతి