Search for a command to run...
4 Mar 1969
జరిగిపోయినదానిని హో లీ (జరిగిపోయింది) గా భావించడమే హోలీను జరుపుకోవడము
4 March 1969 · తెలుగు
(హోలీ శుభ సందర్భముగా అవ్యక్త మహావాక్యాలు)
ఈరోజు మీది ప్రత్యేకమైన హోలీనా? హోలీని ఎలా జరుపుకుంటారు? హోలీ జరుపుకోవడం వచ్చా? సంగమయుగ హోలీ ఏమిటి? వర్తమాన పాత్ర అనుసారంగా హోలీని ఎలా జరుపుకుంటారు? హోలీలో అనేక విషయాలు చేయవలసి ఉంటుంది. రంగులు వేసుకుంటారు, కాలుస్తారు, అలాగే అలంకరించడం కూడా జరుగుతుంది, మరి కొంత తొలగించడం కూడా చేస్తారు. హోలీలో ఏ ఏ విషయాలు చేస్తారో అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఏమి కాల్చాలి, ఏమి తొలగించాలి, ఏ రంగు వేసుకోవాలి మరియు వేటితో అలంకరింపబడాలి? ఇవన్నీ చేస్తేనే జరుపుకోవడము అని అంటారు. ఒకవేళ ఈ నాలుగు విషయాలలో ఏదైనా లోపము ఉంటే దానిని జరుపుకోవడము అని అనలేము. హోలీ రోజున ఎంతో సుందరంగా అలంకరించుకుంటారు. ఎలా అలంకరించుకుంటారు? దేవతల సమానంగా. మీరందరూ అలంకరింపబడి ఉన్నారా? అలంకరణలో ఏ లోపము లేదు కదా. అలంకరణలో ముఖ్యమైన హోలీ అలంకరణ ఏమిటి? చిత్రవిచిత్రమైన వేషధారణలు వేసినప్పుడు ముందుగా వారి మస్తకంలో ఒక బల్బును పెడ్తారు. ఇది కూడా ఈ సమయానిదే, వారు కాపీ చేసారు. మీకు కూడా సంగమంలో ముఖ్యమైన అలంకారము మస్తకంపై ఆత్మ దీపాన్ని వెలిగించడము. దీనికి గుర్తుగా వారు బల్బును వెలిగిస్తారు. ఇవన్నీ ఉన్నా కానీ హోలీ మాట యొక్క అర్థాన్ని గుర్తుంచుకోండి. ‘‘హో లీ’’(గడిచిపోయింది) – ఏదైతే జరిగిందో అది గడిచిపోయింది. ఏ దృశ్యం అయితే జరిగిపోయిందో అది హో లీ అనగా గడిచిపోయింది. వర్తమాన సమయం ధారణ చేసుకోవలసిన పాయింటు ఏమిటి, హోలీ అనగా డ్రామా ఢాలు. అలా ఎప్పుడైతే గట్టిగా అవుతారో అప్పుడు ఆ రంగు కూడా పక్కాగా అంటుకుంటుంది. ఒకవేళ హోలీ అర్థాన్ని జీవితంలోకి తీసుకురాకపోతే రంగు సరిగ్గా అంటుకోదు. పక్కాగా రంగు అంటుకోవాలంటే ప్రతి సమయము హోలీ అన్న మాటను గుర్తు పెట్టుకోండి. ఏదైతే గడిచిందో, అది గడిచిపోయింది. ఇటువంటి హోలీని జరుపుకుంటున్నారా? లేక అప్పుడప్పుడు డ్రామా దృశ్యాన్ని చూసి కొంచెం మథనం చేస్తున్నారా? జ్ఞాన మథనం వేరే విషయము. కానీ డ్రామా దృశ్యము గురించి మథనం చేయడము, ఎందుకు, ఏమిటి, ఎలా – ఇది దేని గురించి మథనం అయింది? పెరుగును చిలికినప్పుడు వెన్న వస్తుంది. అదే నీళ్ళను మథిస్తే ఏమి వస్తుంది? ఏమీ రాదు. రిజల్టులో అలసట, సమయం వృధా అవ్వడమే ఉంటుంది. కనుక ఇది నీటి మథనం అవుతుంది. ఇలా మథించే బదులు జ్ఞాన మథనం చేయండి.
సాకార రూపంలో చివరి రోజులలో సేవకు ముఖ్యమైన యుక్తిని ఏమని వినిపించారు? ‘చుట్టుముట్టడము’. డబల్ ముట్టడి వేయాలి, ఒకటి - వాణి ద్వారా సేవ, రెండు - అవ్యక్త ఆకర్షణ. ఈ ముట్టడి ఎలా ఉండాలంటే స్వయం దాని నుండి బయటకు రాలేకపోవాలి, ఇతరులు కూడా రాలేని విధంగా ఉండాలి. ముట్టడి చేసే విధానము ఇప్పటివరకు ప్రాక్టికల్లో కనిపించలేదు. మ్యూజియం తయారు చేయడం అయితే సహజమే. మ్యూజియం తయారు చేయడాన్ని ముట్టడి చేయడము అని అనరు. మీ అవ్యక్త ఆకర్షణతో వారికి గురి పెట్టడాన్ని ముట్టడి చేయడము అంటారు. అది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు సేవకు ఎక్కువ సమయం ఉండదు. సమస్యలు ఎలా ముందుకు వచ్చి నిల్చుంటాయంటే మీరు చేసే సేవలో అవి ఆటంకంగా అయ్యే అవకాశం ఉంది. కనుక లభించిన సమయంలో ఎవరు ఎంత సేవ చేస్తారో అంత ఎక్కువగా చేయండి. లేకపోతే సేవ చేసే సమయం కూడా హో లీ అయిపోతుంది అనగా గడిచిపోతుంది. కనుక ఇప్పుడు స్వయాన్ని ఎంత ఎక్కవ వీలైతే అంత ఎక్కువ సేవా బంధనంలో బంధించుకోవాలి. ఈ ఒక్క బంధనంతోటే అనేక బంధనాలు తొలగుతాయి. మీరే స్వయంగా ఈశ్వరీయ సేవలో ఉండాలి, ఇతరులు చెబితే కాదు. ఇతరులు చెబితే ఏమవుతుంది? సగం ఫలితం లభిస్తుంది. ఎందుకంటే ఎవరైతే చెప్పారో లేక ప్రేరణ ఇచ్చారో వారికి కూడా వాటా ఉంటుంది. దుకాణంలో ఒకవేళ ఇద్దరు భాగస్వాములు ఉంటే విభజన జరుగుతంది కదా! ఒక్కరే ఉంటే వారే యజమానిగా ఉంటారు. కనుక, ఒకరు చెబితే చేస్తే ఆ కార్యంలో వారికీ వాటా ఉంటుంది. స్వయమే యజమానిగా అయ్యి చేస్తే పూర్తి ఆస్తికి అధికారులుగా అవుతారు. అందుకని ప్రతి ఒక్కరూ యజమానిగా అయ్యి చేయాలి, కానీ యజమానితత్వముతో పాటు బాలకతత్వము కూడా పూర్తిగా ఉండాలి. ఒక్కోసారి యజమానిగా నిల్చుంటారు, మరోసారి బాలకలుగా అయ్యి అంతా విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టకండి, పట్టుకోకండి. పట్టుకోవడము అంటే మొండిగా పట్టుకోవడము వద్దు అని అర్థం. ఏదైనా వస్తువును గట్టిగా పట్టుకుంటే ఆ వస్తువు యొక్క రూపము మారిపోతుంది. పువ్వును గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది? పట్టుకోవాలి కానీ ఎంత వరకు, ఎలా పట్టుకోవాలి అని కూడా అర్థం చేసుకోవాలి. పట్టుకున్నప్పుడు ఆగిపోతున్నారు, విడిచిపెట్టినప్పుడు దూరమైపోతున్నారు. రెండూ సమానంగా ఉండే పురుషార్థాన్ని చేయండి. యజమానిగా మరియు బాలకునిగా రెండు విధాలుగా నడుచుకునేవారి ముఖ్య లక్షణము ఏమి ఉంటుంది – ఒకటి నిర్మానత ఉంటుంది, దానితో పాటు నిరహంకారి, నిర్మాణము మరియు ప్రేమ స్వరూపము. ఈ నాలుగు విషయాలు వారి ప్రతి నడవడికలో కనిపిస్తాయి. ఒకవేళ నాలుగింటిలో ఏది తక్కువ ఉన్నాకానీ స్థితి కొంత తక్కువగా ఉందని అర్థం. అచ్ఛా!
వతనంలో ఈరోజు హోలీ ఎలా ఆడామో తెలుసా? కేవలం పిల్లలతోటే ఉన్నాము. మీరు హోలీ జరుపుకుంటున్నారు కదా! అక్కడకు సందేశి వస్తే ఒక ఆట ఆడాము. ఏ ఆట ఆడి ఉండవచ్చు? (మీరు తీసుకువెళితే చూస్తాము). బుద్ధి విమానము అయితే ఉంది కదా. బుద్ధి విమానమైతే దివ్య దృష్టికన్నా చాలా బాగుంటుంది. ఇక్కడైతే అది వీలవ్వదు. అటువంటిది లేనేలేదు. ఈరోజు సరదా రోజు కదా, కనుక సందేశి వతనానికి వచ్చినప్పుడు సాకారుడిని దాచిపెట్టాము. ఒక సుందరమైన పూల పర్వతాన్ని తయారు చేయించాము, దాని లోపల సాకారుడిని దాచి పెట్టాము. దూరం నుండి చూస్తే పర్వతమే కనిపిస్తుంది. సందేశి వచ్చినప్పుడు సాకారుడు కనిపించలేదు. చాలా వెతికారు కానీ కనిపించలేదు. దాగుడుమూతల ఆటను ఆడుతారు కదా, ఆ ఆటను చూసాము. తర్వాత అకస్మాత్తుగా పూల మధ్య నుండి సాకారుడు కూర్చుని ఉన్న దృశ్యం కనిపించింది. ఆ దృశ్యం చాలా బాగుంది. అచ్ఛా! (తర్వాత అవ్యక్త బాప్దాదా అందరికీ అమృతాన్ని త్రాగించి భోగ్ ఇచ్చారు మరియు ఒక్కొక్కరితో కలిసారు. ముఖ్యంగా మ్యూజియం వారిని కలిసి డైరెక్షన్లను ఇచ్చారు - అవ్యక్త ఆకర్షణతో మ్యూజియంను తయారు చేయండి. ఇందులోకి ఎవరు వచ్చినా కానీ చక్కగా ఆకర్షింపబడాలి అన్నారు).
ఓంశాంతి