‘‘భవిష్య విశ్వ రాజ్యము యొక్క ఆధారము - సంగమయుగము యొక్క స్వరాజ్యము’’
ఈరోజు విశ్వ రచయిత అయిన బాప్‌దాదా తమ స్వరాజ్య అధికారి పిల్లలందరినీ చూస్తున్నారు. ఈ వర్తమాన సంగమయుగం యొక్క స్వరాజ్య అధికారులుగా మరియు భవిష్యత్తులో విశ్వ రాజ్య అధికారులుగా అవుతారు ఎందుకంటే స్వరాజ్యం ద్వారానే విశ్వ రాజ్య అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఈ సమయంలోని స్వరాజ్య ప్రాప్తి యొక్క అనుభవము, భవిష్య విశ్వ రాజ్యం యొక్క అనుభవం కంటే అతి శ్రేష్ఠమైనది! మొత్తం డ్రామాలో రాజ్యాధికారులు రాజ్యం చేస్తూ వస్తారు. అన్నింటికన్నా శ్రేష్ఠమైనది, మొట్టమొదటిది స్వరాజ్యము, దీని ఆధారంగా స్వరాజ్య అధికారి ఆత్మలైన మీరు అనేక జన్మలు సత్య-త్రేతాయుగాల వరకు విశ్వ రాజ్య అధికారులుగా అవుతారు. కావున మొదటిది స్వరాజ్యము, ఆ తర్వాత అర్థకల్పము విశ్వ రాజ్య అధికారము మరియు ద్వాపరయుగం నుండి రాజ్యమైతే ఉండనే ఉంటుంది కానీ అక్కడ విశ్వ రాజ్యం కాదు, రాష్ట్రాలకు రాజులుగా అవుతారు. మొత్తం విశ్వంపై ఒకే రాజ్యమనేది కేవలం సత్యయుగంలో మాత్రమే ఉంటుంది. కావున మూడు రకాల రాజ్యాల గురించి వినిపించాము. రాజ్యం అనగా సర్వ అధికారాల ప్రాప్తి. సత్య-త్రేతాయుగాల రాజనీతి, ద్వాపరం యొక్క రాజనీతి మరియు సంగమయుగం యొక్క స్వరాజ్య నీతి - మీకు మూడింటి గురించి బాగా తెలుసు.
సంగమయుగం యొక్క రాజనీతి అనగా ప్రతి బ్రాహ్మణాత్మ స్వయానికి రాజ్యాధికారులుగా అవుతారు. ప్రతి ఒక్కరూ రాజయోగి. మీరంతా రాజయోగులేనా లేక ప్రజాయోగులా? రాజయోగులు కదా. రాజయోగులు అనగా రాజులుగా అయ్యే యోగులు. స్వరాజ్య అధికారి ఆత్మల యొక్క విశేషమైన నీతి ఏమిటంటే - ఎలాగైతే రాజు తన సేవా సహచరులకు, ప్రజలకు ఏ ఆజ్ఞను ఎలా ఇస్తే, ఆ ఆజ్ఞ అనుసారంగా, అదే నీతి ప్రమాణంగా సహచరులు లేక ప్రజలు కార్యం చేస్తారు. అలాగే స్వరాజ్య అధికారి ఆత్మలైన మీరు మీ యోగశక్తి ద్వారా ప్రతి కర్మేంద్రియానికి ఏ విధంగా ఆజ్ఞను ఇస్తారో, అదే విధంగా ప్రతి కర్మేంద్రియము మీ ఆజ్ఞ అనుసారంగా నడుస్తుంది. కేవలం ఈ స్థూల శరీరంలోని సర్వ కర్మేంద్రియాలే కాకుండా మనసు, బుద్ధి, సంస్కారాలు కూడా రాజ్యాధికారీ ఆత్మలైన మీ డైరెక్షన్ల అనుసారంగా నడుస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా మనసును అనగా సంకల్ప శక్తిని అక్కడ స్థితి చేయగలరు అనగా మీరు మనసు, బుద్ధి, సంస్కారాలకు కూడా రాజ్యాధికారులు. మీరు సంస్కారాలకు వశమవ్వరు కానీ సంస్కారాలను తమ వశం చేసుకుని శ్రేష్ఠమైన నీతి ద్వారా కార్యంలో ఉపయోగిస్తారు, శ్రేష్ఠ సంస్కారాల అనుసారంగా సంబంధ-సంపర్కంలోకి వస్తారు. కావున స్వరాజ్య నీతి ఏమిటంటే - మనసు, బుద్ధి, సంస్కారాలు మరియు సర్వ కర్మేంద్రియాలపై స్వ అనగా ఆత్మ యొక్క అధికారము. ఒకవేళ ఏవైనా కర్మేంద్రియాలు - ఒక్కోసారి కళ్ళు మోసం చేస్తాయి, ఒక్కోసారి మాటలు మోసం చేస్తాయి, ఒక్కోసారి వాణి అనగా నోరు మోసం చేస్తుంది, సంస్కారాలు తమ కంట్రోల్లో ఉండవు, అటువంటివారిని స్వరాజ్య అధికారులని అనము, వారిని స్వరాజ్య అధికారులుగా అయ్యే పురుషార్థులని అంటాము. వారు అధికారులు కాదు కానీ పురుషార్థులు. వాస్తవానికి రాజ్యాధికారీ ఆత్మలను స్వప్నంలో కూడా ఏ కర్మేంద్రియము గానీ, మనసు, బుద్ధి, సంస్కారాలు గానీ మోసం చేయలేవు ఎందుకంటే వారు అధికారులుగా ఉంటారు. అధికారులు ఎప్పుడూ అధీనమవ్వలేరు. అధీనంగా ఉంటే అధికారులుగా అయ్యే పురుషార్థులని అర్థము. కావున నేను పురుషార్థినా లేక అధికారినా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. అధికారులుగా అయ్యారా లేక అవుతూ ఉన్నారా? స్వరాజ్యం యొక్క ఆత్మిక నషా ఏ అనుభవం చేయిస్తుంది? ఎలా తయారవుతారు? నిశ్చింత చక్రవర్తులుగా, నిశ్చింతపురానికి చక్రవర్తులుగా అవుతారు!
అందరికన్నా అత్యంత గొప్ప చక్రవర్తి - నిశ్చింత చక్రవర్తి మరియు అన్నింటికన్నా అత్యంత గొప్ప రాజ్యము - నిశ్చింతపురి యొక్క రాజ్యము. నిశ్చింతపురి యొక్క రాజ్యాధికారుల ముందు ఈ విశ్వ రాజ్యం కూడా అసలేమీ కాదు. ఈ నిశ్చింతపురి యొక్క రాజ్యాధికారము అతి శ్రేష్ఠమైనది మరియు సుఖమయమైనది. పేరే నిశ్చింతపురి. మరి నిశ్చింతపురి యొక్క అనుభవం ఉంది కదా. లేక అప్పుడప్పుడు కిందికి వచ్చేస్తారా? సదా ఆత్మిక నషాలో నిశ్చింతపురికి చక్రవర్తులము అనే అధికారంలో ఉండండి. కిందికి రాకండి. చూడండి, ఈరోజుల్లోని రాజ్యంలో కూడా ఒకవేళ ఎవరైనా కుర్చీపై ఉంటే వారి అధికారముంటుంది మరియు రేపు కుర్చీ నుండి దిగిపోతే వారి అధికారముంటుందా? సాధారణంగా అయిపోతారు. కావున మీరు కూడా స్వరాజ్య నషాలో ఉంటారు, అకాల సింహాసనాధికారులుగా ఉంటారు. అందరి వద్ద సింహాసనం ఉంది కదా. మరి సింహాసనాన్ని ఎందుకు వదిలేస్తారు? సదా సింహాసనాధికారులుగా ఉండండి, ఆత్మిక నషాలో ఉండండి. అకాల సింహాసనం అంటే – అమృత్‌సర్‌లో ఉండే ఆ అకాల సింహాసనం కాదు, ఇది ఈ అకాల సింహాసనము. ఈ అకాల సింహాసనం అందరి వద్ద ఉంది. కావున అకాల సింహాసనాధికారి స్వరాజ్య అధికారులుగా ఎవరు తయారుచేసారు? తండ్రి, బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరినీ సింహాసనాధికారి రాజుగా చేసారు.
మొత్తం సృష్టి చక్రంలో ఎవరికైనా అనేకమంది పిల్లలు ఉండి, అందరూ రాజా పిల్లలుగా ఉండే తండ్రి ఎవరైనా ఉంటారా! లక్ష్మీ-నారాయణులు కూడా అలా అవ్వలేరు. పరమాత్మ తండ్రి మాత్రమే - నా పిల్లలందరూ రాజా పిల్లలు అని అంటారు. ఆ మాటకొస్తే ప్రపంచంలో ఇతడు రాజా బిడ్డ అని ఊరకే అంటారు. ఆ బిడ్డ ఎలా తయారైనా, సేవకునిగా అయినా, లేదా ఇంకెలా తయారైనా, అనడానికి రాజా బిడ్డ అనే అంటారు. కానీ ఈ సమయంలో మీరు ప్రాక్టికల్‌గా రాజయోగులుగా అనగా రాజా పిల్లలుగా అవుతారు. కావున తండ్రికి కూడా నషా ఉంది మరియు పిల్లలకు కూడా నషా ఉంది. కావున స్వరాజ్యం యొక్క నీతి ఏమిటి? స్వయంపై రాజ్యం, ప్రతి కర్మేంద్రియముపై అధికారము ఉండాలి. అంతేకానీ చూడాలనుకోలేదు కానీ చూసేసాము అన్నట్లు ఉండకూడదు. కళ్ళు తెరిచి ఉన్నాయి కదా అందుకే కనిపించింది, చెవులకు తలుపులు లేవు కదా అందుకే విషయం చెవిలో పడింది అని కాదు. మీకు రెండు చెవులు ఉన్నాయి. ఒకవేళ అలాంటి విషయము ఏదైనా విన్నా దానిని బయటకు తీసే మార్గము కూడా ఉంది. అందుకే ఈ భారత్‌లో విశేషంగా గాంధీగారి స్మృతిలో ఈ చిత్రము తయారుచేయబడింది - చెడు చూడకండి, చెడు వినకండి, చెడు మాట్లాడకండి. వారు మూడు చూపిస్తారు, మీరు నాలుగు చూపిస్తారు. చెడు ఆలోచించకండి కూడా ఎందుకంటే మొదట ఆలోచిస్తారు, ఆ తర్వాత మాట్లాడుతారు, ఆ తర్వాత చూస్తారు. అందుకే కంట్రోలింగ్ పవర్ (నియంత్రణ శక్తి), రూలింగ్ పవర్ (శాసన శక్తి) ఉంచుకోండి. రాజు అనగా రూలింగ్ పవర్. రాజుగా ఉంటూ రూలింగ్ పవర్ లేనే లేకపోతే వారిని రాజుగా ఎవరు అంగీకరిస్తారు! కావున స్వరాజ్యము అనగా రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్.
బాప్‌దాదా ఇంతకుముందు కూడా వినిపించారు - చాలా మంది పిల్లలు పరిశీలించడంలో చాలా తెలివి కలవారిగా ఉంటారు. ఏదైనా పొరపాటు జరిగితే, అది నీతి అనుసారంగా లేకపోతే, అప్పుడు - ఇది చేయకూడదు, ఇది సత్యము కాదు, యథార్థము కాదు, ఇది అయథార్థము, వ్యర్థము అని అర్థం చేసుకుంటారు. కానీ అర్థం చేసుకున్నా, మళ్ళీ చేస్తూ ఉంటారు లేదా చేసేస్తారు. మరి దీనిని ఏమంటాము? ఏ శక్తి తక్కువగా ఉంది? కంట్రోలింగ్ పవర్ లేదు. ఉదాహరణకు ఈరోజుల్లో కారు నడుపుతారు, ఆక్సిడెంట్ జరిగే అవకాశముందని చూస్తూ ఉంటారు కూడా, బ్రేకు వేసే ప్రయత్నం చేస్తారు కానీ బ్రేకు పడకపోతే తప్పకుండా ఆక్సిడెంట్ జరుగుతుంది కదా. బ్రేకు ఉంది కానీ శక్తిశాలిగా లేకపోతే మరియు ఇక్కడ పడేందుకు బదులుగా అక్కడ పడితే ఏమవుతుంది? అంత సమయము పరవశమై ఉన్నట్లే కదా. కోరుకున్నా చేయలేకపోతారు. బ్రేకు వేయలేకపోతారు లేక బ్రేకు శక్తిశాలిగా లేని కారణంగా సరిగ్గా పడదు. కావున ఇది చెక్ చేసుకోండి. ఎత్తైన పర్వతాలను ఎక్కేటప్పుడు ఏమి రాసి ఉంటుంది? బ్రేకు చెక్ చేసుకోండి అని రాసి ఉంటుంది ఎందుకంటే బ్రేకు రక్షణకు సాధనము. కావున కంట్రోలింగ్ పవర్ లేదా బ్రేకు వేయడం అంటే ఇక్కడ వేస్తే అక్కడ పడడం అని కాదు. ఎవరైనా వ్యర్థాన్ని కంట్రోల్ చేయాలనుకుంటే, ఇది రాంగ్ అని అర్థం చేసుకుంటారు, అయితే అదే సమయంలో రాంగ్ అనేది రైట్లోకి పరివర్తన అవ్వాలి. దీనిని కంట్రోలింగ్ పవర్ అని అంటాము. అంతేకానీ కంట్రోల్ చేయాలని అనుకుంటూ కూడా ఉంటారు, కానీ అరగంట వ్యర్థంగా గడిచిన తర్వాత కంట్రోల్లోకి రావడం కాదు. చాలా పురుషార్థం చేసి అరగంట తర్వాత పరివర్తన అయితే దానిని కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ అని అనము. అది కొద్ది-కొద్దిగా అధీనము మరియు కొద్ది-కొద్దిగా అధికారి, రెండు మిక్స్ అయినట్లు. మరి అటువంటివారిని రాజ్యాధికారులని అంటారా లేక పురుషార్థులని అంటారా? కావున ఇప్పుడు పురుషార్థులుగా కాదు, రాజ్యాధికారులుగా అవ్వండి. ఇది స్వరాజ్యాధికారము యొక్క శ్రేష్ఠమైన ఆనందము.
స్వరాజ్య అధికారి అనగా సదా ఆనందమే ఆనందంలో ఉండడము. ఆనందంగా ఉండేవారు ఎప్పుడూ ఏ విషయంలోనూ తికమకపడరు. ఒకవేళ తికమకపడితే ఆనందం ఉండదు. సంగమయుగంలో ఆనందమే ఆనందముంది కదా. లేక అప్పుడప్పుడు మాత్రమే ఆనందముందా? శక్తులకు, పాండవులకు ఆనందముంది కదా. కావున అర్థమయిందా - స్వరాజ్యం యొక్క నీతి ఏమిటో మరియు విశ్వ రాజ్యం యొక్క నీతి ఏమిటో? ప్రజలైనా లేక రాయల్ కుటుంబము వారైనా, స్వర్గంలో ప్రజలంటే ప్రజలు కాదు, ప్రజలు కూడా ఒక పరివారము. పరివారము యొక్క నీతియే సత్య-త్రేతాయుగాల రాజనీతి. రాజుగా పిలవబడతారు కానీ రాజు అయినప్పటికీ వారు పరమప్రియ తండ్రి యొక్క స్వరూపము. పరివారము అనే విధితో రాజనీతి నడుస్తుంది. రాజ్య కార్య వ్యవహారాలు వేర్వేరు చేతులలో ఉంటాయి కానీ పరివారమనే స్నేహం యొక్క విధితో కార్య వ్యవహారాలు జరుగుతాయి. రాజు వద్ద చాలా ధన-సంపద ఉండి, ప్రజలకు తినేందుకు, తాగేందుకు ఏమీ లేకపోవడం అనేది ఉండదు. ద్వాపర-కలియుగాల రాజనీతిలో లా అండ్ ఆర్డర్ నడుస్తుంది. కానీ విశ్వరాజ్యం, దైవీ రాజ్య సమయంలో ఈ నీతియే నడుస్తుంది, లా ఉండదు, కానీ స్నేహం మరియు సంబంధము యొక్క నీతి నడుస్తుంది. ఏ ఆత్మకు దుఃఖమనే పదము కూడా తెలియదు. రాజు అయినా లేక ప్రజలైనా దుఃఖము-అశాంతి యొక్క నామరూపాలు ఉండవు. దుఃఖమంటే ఏమిటి అన్న విషయంలో అజ్ఞానముంటుంది, దానికి సంబంధించిన జ్ఞానమే ఉండదు. ఇప్పుడు స్వరాజ్యం ఉన్న ఈ సమయంలో కూడా బాప్‌దాదా మిమ్మల్ని ఏ నీతితో నడిపిస్తున్నారు? స్నేహము మరియు శ్రీమతము. శ్రీమతంపై నడుస్తూ ఉంటే ఎలాంటి కఠినమైన ఆజ్ఞను ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఈ నీతిని మర్చిపోయినట్లయితే మీరు స్వయాన్ని స్వయమే కలియుగ నీతి అనుసారంగా నడిపించుకుంటారు. కావున విశ్వ రాజ్యం యొక్క నీతి కూడా చాలా ప్రియమైనది ఎందుకంటే అనేకత ఉండదు, ఒకే రాజ్యం మరియు తరగని ఖజానా ఉంటుంది! ప్రజలు కూడా అంత సంపన్నంగా ఉంటారు - ఈరోజుల్లోని పెద్ద-పెద్ద పదమపతులు ఎవరైతే ఉన్నారో, వారి కన్నా సంపన్నంగా ఉంటారు! అప్రాప్తి యొక్క నామ-రూపాలు కూడా ఉండవు. కానీ దీనికి ఆధారమేమిటి? స్వరాజ్యము.
ఈ సమయంలో సంపన్నంగా అవుతారు, అందుకే పరమాత్మ సంపద యొక్క సంపన్నత, సత్య-త్రేతాయుగాలలో అనేక జన్మలు ప్రాప్తిస్తాయి. అందుకే ఇలా అన్నాము – నంబర్‌వన్ రాజ్యం స్వరాజ్యము, తర్వాత విశ్వరాజ్యము మరియు మూడవది ద్వాపర-కలియుగాలలోని వేరు-వేరు రాష్ట్రాల రాజ్యము. ఈ రాజ్యం గురించి అయితే బాగా తెలుసు, వర్ణించాల్సిన అవసరం లేదు. కావున సదా ఏ నషాలో ఉండాలి? స్వరాజ్యము మా జన్మ సిద్ధ అధికారము! ఏ జన్మది? బ్రాహ్మణ జన్మది. బ్రహ్మా బాబా జన్మతోనే ప్రతి బ్రాహ్మణాత్మకు స్వరాజ్య తిలకాన్ని దిద్దారు. మీరు తిలకధారులే కదా. ఇది స్మృతి తిలకము. తిలకము కూడా ఉంది, సింహాసనము కూడా ఉంది మరియు కిరీటము కూడా ఉంది. కిరీటధారులే కదా. ఏ కిరీటము ఉంది? విశ్వకళ్యాణమనే కిరీటముంది. మీరు విశ్వకళ్యాణకారులు కదా. పవిత్రతా కిరీటము మరియు విశ్వకళ్యాణ కిరీటము - డబల్ కిరీటముంది. పవిత్రతా కిరీటము అంటే ప్రకాశ కిరీటము మరియు విశ్వకళ్యాణ కిరీటము అంటే సేవా కిరీటము.
మీరు విశ్వ సేవాధారులు కదా. మేము గుజరాత్ వారము, మేము రాజస్థాన్ వారము, మేము ఢిల్లీ సేవాధారులము అని స్వయాన్ని రాష్ట్ర సేవాధారులుగా భావించకండి. అలా కాదు. మీరు విశ్వ సేవాధారులు. ఎక్కడ ఉన్నా మీ వృత్తి, దృష్టి అనంతంలో ఉండాలి. ఒకవేళ విశ్వ సేవాధారులుగా అవ్వకపోతే స్వరాజ్యము, విశ్వరాజ్యము లభించవు, ఇక తర్వాత ద్వాపర-కలియుగాలలో రాష్ట్రానికి రాజులుగా అవ్వాల్సి వస్తుంది. విశ్వ రాజ్యాధికారులుగా అవ్వాలంటే సదా మీ కిరీటము, తిలకము మరియు సింహాసనము - సదా వీటిపై స్థితులై ఉండండి. శరీరముతో సింహాసనంపై కూర్చోవడం కాదు కానీ బుద్ధి ద్వారా స్మృతి యొక్క స్థితిలో స్థితులై ఉండాలి. స్థితిలో స్థితులవ్వడమే సింహాసనంపై కూర్చోవడము, ఇలా అయితే సదా కూర్చోగలరు. శరీరంతో అయితే ఎన్ని గంటలు కూర్చుంటారు? అలసిపోతారు కదా. కానీ బుద్ధి ద్వారా స్థితిలో స్థితులవ్వడమే సింహాసనాధికారులుగా అవ్వడము. ఇది సులభమే కదా. కావున స్వరాజ్యం యొక్క నషాలో నిరంతరం స్థితులై ఉండండి. ఏం చేయాలో అర్థమయిందా? పురుషార్థులుగా కాదు కానీ అధికారులుగా అవ్వండి.
అందరూ మిలనము జరుపుకున్నారు కదా. పరమాత్మ మిలన మేళాను జరుపుకునేందుకు అందరూ పరుగుపరుగున వస్తారు. మీరంతా మిలన మేళాకు వచ్చారు కదా. ఇది మేళా అని అనిపిస్తుందా లేక గుంపులా అనిపిస్తుందా? ప్రశాంతత ఉంది కదా. ప్రశాంతంగా ఉండడం, తినడం, నడుచుకోవడం, అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి కదా. అయినా మీరు చాలా అదృష్టవంతులు. ఆ మేళాల వలె మట్టిలో అయితే ఉండడం లేదు కదా. ఎంతైనా మంచము, పరుపు అయితే లభించాయి కదా. అక్కడి మేళాలలోనైతే స్నానం చేస్తున్నా కూడా మట్టే, ఉంటున్నా కూడా మట్టే మరియు తింటున్నా మట్టే మీతో పాటు వస్తుంది. ఇక్కడ పిల్లలు తమ ఇంటికి వస్తారు. నషాతో వస్తారు. తండ్రికి కూడా సంతోషము మరియు పిల్లలకు కూడా సంతోషము. హాలులో వెనుక కూర్చున్నవారు అందరికన్నా ముందు ఉన్నారు ఎందుకంటే బాప్‌దాదా యొక్క మొదటి దృష్టి చివరి వరకు వెళ్తుంది. అచ్ఛా!
సర్వ స్వరాజ్య అధికారి నిశ్చింత చక్రవర్తి పిల్లలకు, విశ్వ రాజ్య అధికారులుగా అనేక జన్మలు సంపూర్ణ సంపన్నంగా ఉండే సర్వాత్మలకు, సదా తిలకము, కిరీటము మరియు సింహాసనానికి అధికారి పిల్లలకు, సదా అనంతమైన సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలలో ఉండే విశేషమైన పిల్లలకు, దేశ-విదేశాలలో సమ్ముఖంగా అనుభవం చేసే పిల్లలందరికీ బాప్‌దాదా యొక్క పదమా గుణాల ప్రియస్మృతులు. ఇంకా అందరి స్నేహభరిత పత్రాలకు బదులు కూడా ఇస్తున్నాము. విదేశం వారు మరియు దేశంవారు - ఇరువురు తమ తమ విధి ప్రమాణంగా స్వపురుషార్థంలో సిద్ధిని ప్రాప్తి చేసుకుంటున్నారు మరియు సేవలో కూడా సదా ముందుకు వెళ్ళే ఉత్సాహంలో నిమగ్నమై ఉన్నారు. అందుకే ఎవరు ఏ మూలలో ఉన్నా, ప్రతి ఒక్కరి స్మృతి, సేవా సమాచారము, ప్రేమపూర్వక పత్రాలు, స్థితి యొక్క ఉల్లాస-ఉత్సాహాల సమాచారము అన్నీ లభించాయి మరియు బాప్‌దాదా పిల్లలందరికీ వారి వారి పేరు సహితంగా, ప్రతి ఒక్కరి విశేషతల సహితంగా చాలా చాలా చాలా ప్రియస్మృతులను ఇస్తున్నారు మరియు సదా ఈ స్మృతి మరియు ప్రేమ యొక్క పాలనలో పాలింపబడుతున్నారు, ఎగురుతున్నారు మరియు ఎగురుతూ-ఎగురుతూ గమ్యానికి చేరుకోవాల్సిందే లేక చేరిపోయే ఉన్నారని చెప్పవచ్చా. కావున ప్రియస్మృతులు మరియు నమస్తే.
రాజస్థాన్ గవర్నర్ డాక్టర్ ఎం. చెన్నారెడ్డి గారితో మిలనము :- సంగమయుగం యొక్క స్వరాజ్య అధికారులు కదా. స్వరాజ్యం లభించింది కదా. మంచిది, తమ ఈశ్వరీయ కుటుంబం యొక్క స్నేహాన్ని ప్రాక్టికల్‌లో చూశారు. ఈ ఈశ్వరీయ కుటుంబ ప్రేమ యొక్క అధికారాన్ని ఏ విశేషత ద్వారా పొందారు? (బాబా ఆశీర్వాదం ద్వారా). కానీ మీలో కూడా ఒక విశేషత ఉంది, ఆ విశేషత కారణంగానే సమీపానికి రాగలిగారు. (భక్తి) భక్తి కూడా ఉంది, మరియు శక్తి కూడా ఉంది. ఆది నుండి ఇప్పటివరకు జీవితంలో ముందుకు సాగడానికి ఆధారమైనది ఏదైతే ఉందో, అది మీ ధైర్యము. “పిల్లల ధైర్యము, బాబా సహాయం” అని మహిమ చేయబడి ఉంది. కాబట్టి ప్రతి రంగంలోనూ ధైర్యము మీకు తోడ్పాటునందించింది, అందువలన ధైర్యము కారణంగా నిశ్చింతగా ముందుకు సాగారు. కాబట్టి ఈ విశేషతను సదా మీ వెంట ఉంచుకోండి. సదా అమృతవేళ కళ్ళు తెరవగానే తమకు మూడు బిందువుల తిలకం దిద్దుకోండి - (1) నేను ఆత్మను బిందువును, (2) తండ్రి కూడా బిందువే మరియు (3) డ్రామాలో ఏదైతే జరిగిపోయిందో, గడిచిపోయిందో దానికి ఫుల్స్టాప్ పెట్టడం. కాబట్టి ఈ మూడు బిందువుల తిలకం సదా రాజ్య తిలకానికి అధికారిగా చేస్తుంది. ఇప్పుడు స్వరాజ్యము, ఆ తర్వాత విశ్వరాజ్యము. భక్తి ఫలం అయితే లభిస్తుంది కదా. భక్తి యొక్క ఫలం సహజ మిలనము. (యుగల్తో) వీరు కూడా మంచి ఆనందంలో ఉంటారు. ఆనందమే ఆనందం కదా. (మీ ఆశీర్వాదం కావాలి) రోజంతా కేవలం ఒకే ఒక్క మాటను గుర్తుంచుకోండి, అది “నా బాబా”. ‘నా’ అనడం ద్వారా అధికారం లభిస్తుంది. అప్పుడు ఆశీర్వాదపు అధికారం స్వతహాగానే ప్రాప్తిస్తుంది. ఇది చాలా సహజం కదా. ఏ కార్యమైనా చేయండి కానీ ‘నా బాబా’ మరియు బాబా యొక్క ఈ కార్యాన్ని చేస్తున్నాను అని గుర్తుంచుకోండి. ట్రస్టీగా అయి కార్యం చేయండి. మరి ట్రస్టీకి ఎప్పుడూ ఏ భారమూ ఉండదు. భారమూ ఉండదు, మరచిపోనూ లేరు. అయినా కూడా భక్తిలో స్మృతి అయితే చేశారు కదా. స్మృతి యొక్క రిటర్న్ - ఆనందంలో ఉండటం. (కృష్ణుని భక్తురాలు) కాబట్టి కృష్ణుని రాజ్యంలోకి నడవాలి కదా. మరి ఇప్పుడు నడుస్తారా? వీరందరూ మిమ్మల్ని తీసుకునే వెళ్తారు, ఎవరూ వదిలేసి వెళ్ళరు. అయినా ఇద్దరి ఆలోచనలూ మంచిగా ఉన్నాయి. అచ్ఛా!
అవ్యక్త బాప్‌దాదాతో పర్సనల్ మిలనము
గ్రూప్ నం. 1 :- స్వ-స్థితిని ఎంత శక్తిశాలిగా తయారుచేసుకోవాలంటే పరిస్థితి ఎన్నడూ తారుమారు చేయకూడదు
సదా తమ భాగ్యం యొక్క మెరిసే సితారను చూస్తూ ఉంటున్నారా? భాగ్య సితార ఎంత శ్రేష్ఠంగా మెరుస్తోంది! సదా తమ భాగ్యం యొక్క పాటలు పాడుతూనే ఉంటారా? ఏమిటి పాట? వాహ్ నా శ్రేష్ఠ భాగ్యము! ఈ పాట సదా మోగుతూనే ఉంటుందా? ఆటోమేటిక్గానా లేక శ్రమ పడాల్సి వస్తోందా? ఆటోమేటిక్ కదా. ఎందుకంటే భాగ్యవిధాత అయిన తండ్రి మనవారైపోయారు. మరి భాగ్యవిధాత పిల్లలుగా అయినప్పుడు, ఇంతకంటే పెద్ద భాగ్యం ఇంకేముంటుంది! భాగ్యవిధాత పిల్లలము అనే ఇదే స్మృతి సదా ఉండాలి, అంతే. ప్రపంచంలోనివారైతే తమ భాగ్యం యొక్క వరదానాన్ని తీసుకోవడానికి ఇటూఅటూ తిరుగుతూ ఉంటారు మరియు మీ అందరికీ ఇంట్లో కూర్చునే భాగ్యం యొక్క ఖజానా లభించేసింది. శ్రమ పడటం నుండి తప్పించుకున్నారు కదా. శ్రమ కూడా లేదు మరియు ప్రాప్తి కూడా ఎక్కువ. శ్రమ లేకుండా ప్రాప్తించడాన్నే భాగ్యము అంటారు. ఒక్క జన్మలో 21 జన్మల ప్రాప్తిని పొందడం - ఇది ఎంత శ్రేష్ఠమైనది! ప్రాప్తి కూడా అవినాశి మరియు అఖండమైనది, ఎవరూ దీనిని ఖండించలేరు. మాయ కూడా లొంగిపోతుంది, అందువలన అఖండంగా ఉంటుంది. ఎవరైనా యుద్ధం చేసి విజయాన్ని పొందాలని అనుకుంటే పొందగలరా? ఎవరికీ అంత శక్తి లేదు. ఇలాంటి స్థిరమైన-అఖండమైన భాగ్యాన్ని పొందేశారు! స్థితిని కూడా ఇప్పుడు ఇలాగే స్థిరంగా తయారుచేసుకోండి. ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ తమ స్థితిని తారుమారు చేసుకోకండి. అవినాశి తండ్రి, అవినాశి ప్రాప్తులు. మరి స్థితి కూడా ఎలా ఉండాలి? అవినాశిగా ఉండాలి కదా. అందరూ నిర్విఘ్నంగా ఉన్నారా లేక కొద్దికొద్దిగా విఘ్నాలు వస్తున్నాయా? విఘ్న-వినాశకులుగా మహిమ చేయబడ్డారు కదా. ఎలాంటి విఘ్నం వచ్చినా, నేను విఘ్న వినాశక ఆత్మను అని గుర్తుంచుకోండి. తమ ఈ టైటిల్ సదా గుర్తుంటుందా? మాస్టర్ సర్వశక్తిమాన్గా ఉన్నప్పుడు, మాస్టర్ సర్వశక్తిమాన్ ఎదుట ఎంత పెద్ద విఘ్నమైనా ఏమీ కాదు. ఏమీ లేనప్పుడు ఇక దాని ప్రభావం ఏమి పడుతుంది?
గ్రూప్ నం. 2 :- సదా సంతోషంగా ఉండేందుకు ‘అనేక’ నాది అన్నదానిని ‘ఒకే’ నాది అనేదానిలో పరివర్తన చేయండి
అందరూ సదా సంతోషంగా ఉంటున్నారా? సదా సంతోషంగా ఉండేందుకు సహజ పురుషార్థం ఏది? (స్మృతి) స్మృతిలో కూడా ఏమి గుర్తుంచుకోవడం సహజం? నాది అనే భావం సహజం చేస్తుంది. నాది అనే భావం ఉన్నప్పుడు నాది అనేది సహజంగానే గుర్తొస్తుంది. కాబట్టి నాది అనే అధికారంతో గుర్తుచేసుకోవడమే సహజ విధి. ఒకవేళ సంతోషం తగ్గితే దానికి కారణమే నాది అనే అధికారంతో తండ్రిని గుర్తుచేసుకోకపోవడమే. ఎందుకంటే స్మృతిలో విఘ్నం కలిగించేదే నాది అనే భావం. నా శరీరం, నా సంబంధం - ఈ నాది అనే భావమే విఘ్నం కలిగిస్తుంది. అందువలన ఈ ‘అనేక నాది-నాది’ అన్నదానిని ‘ఒకే నా బాబా’ అనేదానిలోకి మార్చేయండి. ఇదే సహజ విధి. ఎందుకంటే జీవితంలో అన్నింటికంటే అతిపెద్ద ప్రాప్తి సంతోషమే. ఒకవేళ సంతోషం లేకపోతే బ్రాహ్మణ జీవితమే లేదు. బ్రాహ్మణ జీవితానికి శ్వాస సంతోషం. అందువలన సదా సంతోషంగా ఉండండి. తండ్రి లభించారు అనగా సర్వస్వం లభించింది. ఏదైనా అప్రాప్తి కలిగినప్పుడే సంతోషం మాయమవుతుంది. బ్రాహ్మణులు అనగా సర్వస్వం లభించినవారు. ప్రాప్తికి గుర్తు సంతోషం. సంతోషంగా ఉండేవారు కూడా మరియు సంతోషాన్ని పంచేవారు కూడా. ఎవరు పంచుతారు? ఎవరి వద్ద అయితే స్టాక్ ఉంటుందో వారు. తమ కొరకు స్టాక్ ఉంది, కానీ ఇతరుల కొరకు కూడా అంతే స్టాక్ జమ అయి ఉండాలి. కాబట్టి సదా తమ స్టాక్‌ను చెక్ చేసుకోండి - ఇంతగా నిండుగా ఉందా అని? లోలోపల నుండే మాయ స్టాక్‌ను ఖాళీ చేసేయడం మరియు ఇంకా స్టాక్ ఉందిలే అని మీరు అనుకుంటూ ఉండటం - ఇలా జరగట్లేదు కదా! ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు నా సంతోషం ఎక్కడికి పోయిందో ఏమో అంటారు? ఎందుకు పోయింది? లోలోపల స్టాక్ ఖాళీ అయిపోయింది. కాబట్టి సదా తమ స్టాక్ నిండుగా ఉందా అని చెక్ చేసుకోండి? ఎందుకంటే మాయకు కూడా బ్రాహ్మణ ఆత్మలు ప్రియంగా అనిపిస్తారు. అది కూడా తనవారిగా చేసుకునే పురుషార్థాన్ని వదలదు. అందువలన ప్రతి సమయం ఖబర్దార్, అలర్ట్‌గా ఉండండి!
గ్రూప్ నం. 3 :- బ్రహ్మా బాబా సంస్కారాలను తమ సంస్కారాలుగా చేసుకోవడమే ఫాలో ఫాదర్ చేయడం
సదా తమను తాము విశ్వ పరివర్తకులుగా అనుభవం చేసుకుంటున్నారా? విశ్వాన్ని పరివర్తన చేసే విధి ఏమిటి? స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన. బహు కాలం యొక్క స్వ పరివర్తన ఆధారంగానే బహు కాలం యొక్క రాజ్య అధికారం లభిస్తుంది. స్వ పరివర్తన బహు కాలముది కావాలి. ఒకవేళ అంతిమంలో స్వ పరివర్తన జరిగితే విశ్వ పరివర్తనకు నిమిత్తంగా కూడా అంతిమంలోనే అవుతారు, అప్పుడు రాజ్యం కూడా అంతిమంలోనే లభిస్తుంది. మరి అంతిమంలో రాజ్యం తీసుకోవాలా లేక మొదటి నుండే తీసుకోవాలా? సరే, తీసుకోవడం మొదటి నుండి కావాలి, చేయడం అంతిమంలోనా? బహు కాలముది తీసుకోవాలంటే స్వ పరివర్తన కూడా బహు కాలముది కావాలి. ఎందుకంటే సంస్కారంగా ఏర్పడుతుంది కదా. బహు కాలం యొక్క సంస్కారం ఇష్టం లేకపోయినా తన వైపుకు లాగుతుంది. ఇప్పుడు కూడా నాది ఈ పాత సంస్కారం కదా, అందుకే ఇష్టం లేకపోయినా జరిగిపోతుంది అని అంటారు. మరి అది లాగుతోంది కదా. అలాగే ఇది కూడా బహు కాలం యొక్క పక్కా పురుషార్థం కాకపోతే, కచ్చాగా (పచ్చిగా) ఉంటే, ఆ కచ్చా పురుషార్థం కూడా తన వైపుకు లాగుతుంది మరియు రిజల్ట్ ఏమవుతుంది? ఫుల్ పాస్ కాలేరు కదా. అందువలన ఇప్పటి నుండే స్వ పరివర్తన యొక్క సంస్కారాలను తయారు చేసుకోండి. నేచురల్ సంస్కారంగా అయిపోవాలి. నేచురల్ సంస్కారాలకు శ్రమ పడాల్సిన అవసరం ఉండదు.
స్వ పరివర్తన యొక్క విశేష సంస్కారం ఏమిటి? ఏవైతే బ్రహ్మా బాబా సంస్కారాలో అవే పిల్లల సంస్కారాలు. మరి బ్రహ్మా బాబా తమ సంస్కారంగా దేనిని చేసుకున్నారు, సాకార శరీరం యొక్క అంతిమంలో కూడా దేనిని గుర్తుచేశారు? నిరాకారి, నిర్వికారి, నిరహంకారి - ఇవి బ్రహ్మా బాబా అనగా బ్రాహ్మణుల సంస్కారాలు. కాబట్టి ఈ సంస్కారాలు నేచురల్‌గా ఉండాలి. నిరాకారులుగా అయితే ఎలాగూ ఉన్నారు కదా, ఇది స్వధర్మమే కదా. మరి ఎన్నిసార్లు నిర్వికారులుగా అయ్యారు! అనేకసార్లు అయ్యారు కదా. నిరహంకారిగా అవ్వడమే బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత. మరి బ్రహ్మా యొక్క ఈ సంస్కారాలు నిజంగా నా సంస్కారాలుగా తయారయ్యాయా అని మీలో చూసుకోండి? ఇవి బ్రహ్మా సంస్కారాలు అని కాదు, ఇవి నా సంస్కారాలు. ఫాలో ఫాదర్ కదా. పూర్తిగా ఫాలో చేయాలి కదా. కాబట్టి సదా ఈ శ్రేష్ఠ సంస్కారాలను ఎదురుగా ఉంచుకోండి. రోజంతా ఏ కర్మలు చేసినా, ప్రతి కర్మ సమయంలో ఈ మూడు సంస్కారాలూ ఇమర్జ్ రూపంలో ఉన్నాయా అని చెక్ చేసుకోండి? అప్పుడు బహు కాలం యొక్క సంస్కారాలు సహజంగా తయారైపోతాయి. ఇదే లక్ష్యం కదా! పూర్తిగా అవ్వాలి అంటే త్వరత్వరగా అవ్వండి కదా. సమయం వచ్చినప్పుడు అవ్వడం కాదు, సమయానికంటే ముందే తమను తాము సంపన్నంగా తయారుచేసుకోవాలి. సమయం రచన మరియు మీరు మాస్టర్ రచయిత. రచయిత శక్తిశాలినా లేక రచనా? కాబట్టి ఇప్పుడే పూర్తిగా స్వ పరివర్తన చేసుకోండి. బ్రాహ్మణుల డిక్షనరీలో ఎప్పుడో అనేది లేదు. ఇప్పుడే. మరి ఇలాంటి పక్కా బ్రాహ్మణులే కదా.
గ్రూప్ నం. 4 :- దివ్యతయే సఫలతకు ఆధారం
బాప్‌దాదా ద్వారా ప్రతి బిడ్డకూ దివ్య బుద్ధి వరదానంగా లభించింది. ఈ దివ్య బుద్ధి వరదానాన్ని అందరూ తమ జీవితంలో కార్యంలో ఉపయోగించారా? ఎందుకంటే వరదానాన్ని కార్యంలో ఉపయోగించినప్పుడే దాని లాభం లభిస్తుంది. దివ్య బుద్ధి వరదానం అందరికీ లభించింది కానీ ఎంత ఉపయోగిస్తున్నారు? ఏ వస్తువైనా ఉపయోగించడం ద్వారా, కార్యంలో పెట్టడం ద్వారా పెరుగుతుంది కూడా మరియు దానికి సుఖం, సంతోషం యొక్క అనుభూతి కూడా కలుగుతుంది. మరి దివ్య బుద్ధిని కార్యంలో ఎంతవరకు ఉపయోగిస్తున్నారు అనేదానికి గుర్తు ఏమిటి? సఫలత ఉంటుంది. ప్రతి కార్యం దివ్యంగా-అలౌకికంగా అనుభవమవుతుంది, సాధారణంగా కాదు. ఎందుకంటే కార్యంలో దివ్యత్వమే సఫలతకు ఆధారం. కాబట్టి ప్రతి కర్మలోనూ దివ్యత్వం ఉండడమే దివ్య బుద్ధికి గుర్తు. మరి ఇలా అనుభవం చేసుకుంటున్నారా? లేక అప్పుడప్పుడు సాధారణ కర్మలు కూడా జరిగిపోతున్నాయా?
దివ్య బుద్ధిని పొందిన ఆత్మలు సదా అదివ్యమైనదానిని కూడా దివ్యమైనదిగా మార్చేస్తారు. పారసము (స్పర్శమణి) ఇనుమును తాకితే అది కూడా పారసముగా మారిపోతుంది అని మహిమ చేస్తారు కదా. కాబట్టి దివ్య బుద్ధి అనగా పారస్ వంటి బుద్ధి. ఇలా తయారయ్యారా? ఎందుకంటే బుద్ధి ప్రతి విషయాన్నీ గ్రహిస్తుంది. దివ్య బుద్ధి దివ్యత్వాన్నే గ్రహిస్తుంది. ఇలా పరివర్తన చేయగలరు. అదివ్యమైనదానిని దివ్యమైనదిగా మార్చగలరు. లేక అదివ్యత యొక్క ప్రభావం పడిపోతుందా? ఏదైనా అదివ్యమైన విషయం జరిగితే, అదివ్యమైన కార్యం జరిగితే దాని ప్రభావం మీపై పడుతుందా? దివ్య బుద్ధి వరదానం ద్వారా పరివర్తన శక్తి అదివ్యమైనదానిని కూడా దివ్య రూపంలోకి మార్చేస్తుంది. అదివ్య వాతావరణం లేదా అదివ్య నడవడిక, మాటలు దివ్య బుద్ధిపై ప్రభావం చూపించలేవు. ఇలాంటి స్థితి ఉన్నవారినే దివ్య బుద్ధి వరదానీమూర్తి అని అంటాము. వాటర్-ప్రూఫ్, ఫైర్-ప్రూఫ్ ఉన్నట్లుగా. సైన్స్ సాధనాలు వాటర్-ప్రూఫ్ చేస్తాయి, ఫైర్-ప్రూఫ్ చేయగలవు. మరి సైలెన్స్ శక్తి పరివర్తన చేయలేదా, ప్రూఫ్‌గా తయారుచేయలేదా? నాలెడ్జ్ కలిగి ఉండటం వేరే విషయం - ఇది దివ్యమైనది, ఇది అదివ్యమైనది అని. కానీ ప్రభావంలోకి రావడం వేరే విషయం. దివ్యత్వపు శక్తి శ్రేష్ఠమైనదా లేక అదివ్యత్వపు శక్తి శ్రేష్ఠమైనదా? కాబట్టి దివ్యత్వ ప్రభావం అదివ్యత్వంపై పడాలి కదా. అందువలన ఇప్పుడు దివ్య బుద్ధి వరదానాన్ని కార్యంలో ఉపయోగించండి. ఉపయోగించడం వచ్చా లేక అప్పుడప్పుడు మరచిపోతున్నారా? అర్థ కల్పం మరచిపోయేవారిగా అయ్యారు, కానీ ఇప్పుడు అభూల్ (మరపురానివారు)గా అవ్వాలి.
దివ్య బుద్ధి ఎంతటి శ్రేష్ఠమైన యంత్రమంటే ఈ యంత్రం ద్వారా వ్యక్తులనే కాదు, ప్రకృతిని కూడా దివ్యమైనదిగా తయారుచేయగలరు. వ్యక్తులను దివ్యంగా తయారుచేయడం ద్వారా ప్రకృతిపై స్వతహాగానే ప్రభావం పడుతూ ఉంటుంది. మొదట తమలో సదా దివ్య బుద్ధి ఇమర్జ్ రూపంలో ఉందా అని చూసుకోండి? ప్రకృతిని కూడా పరివర్తన చేసేంత శక్తి ఉంది. ఇది పరమాత్మ వరదానం. ఏ మహాత్ముడిదో లేదా ధర్మాత్ముడిదో వరదానం కాదు. బాబా ఎలాగైతే సర్వశక్తిమానో, అలాగే వరదానం కూడా సర్వశక్తిమాన్ కదా. కాబట్టి ఏ కార్యం చేస్తున్నా మొదట చెక్ చేసుకోండి - దివ్య బుద్ధి వరదానం ద్వారా కార్యం చేస్తున్నామా లేక సాధారణ బుద్ధితో కార్యం చేస్తున్నామా అని? మీ దివ్యత్వ ప్రభావం విశ్వాన్ని దివ్యమైనదిగా చేస్తుంది. మీ ఆక్యుపేషన్ ఇదే కదా. ఇంజనీర్‌ను, డాక్టర్‌ను, క్లర్క్‌ను, ఫలానా... ఈ ఆక్యుపేషన్ శరీర నిర్వాహణ కొరకు మాత్రమే. కానీ నిజమైన ఆక్యుపేషన్ విశ్వాన్ని పరివర్తన చేయడం. ఇలా భావించి కార్యం చేస్తున్నారా?
ఒకవేళ వరదానాన్ని కార్యంలో ఉపయోగిస్తే వరదానం యొక్క ప్రాప్తి సదా సహజ అనుభవాన్ని కలిగిస్తుంది. వరదానంలో శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ దివ్య బుద్ధి ఒక వరదానం. 63 జన్మలు చాలా శ్రమ చేశారు. ఇప్పుడు శ్రమ కాదు, సహజం. బ్రాహ్మణ జీవితంలో కూడా శ్రమ పడాల్సి వస్తే, యుద్ధం చేయాల్సి వస్తే ఇక ఆనందాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సత్యయుగంలోనైతే ఆనందాన్ని జరుపుకుంటున్నామని కూడా తెలియదు. అక్కడ కాంట్రాస్ట్ ఉండదు. ఇప్పుడైతే శ్రమ ఏమిటి, ఆనందం ఏమిటి అనే కాంట్రాస్ట్ ఉంది. కాబట్టి ఆనందం ఇప్పుడే ఉంది, సత్యయుగంలో సాధారణ విషయమైపోతుంది. అచ్ఛా!
గ్రూప్ నం. 5 :- పరివర్తన శక్తి ద్వారా వ్యర్థాన్ని సమర్థంగా మార్చడమే హోలీ హంసగా అవ్వడం
సదా తమను తాము హోలీ హంసగా భావిస్తున్నారా? హోలీ హంస కర్తవ్యం ఏమిటి? వ్యర్థాన్ని మరియు సమర్థాన్ని గుర్తించి వేరుచేయడం. అదైతే రాళ్లను, రత్నాలను వేరుచేస్తుంది, కానీ మీరు హోలీ హంసలుగా సమర్థాన్ని ధారణ చేస్తున్నారు, వ్యర్థాన్ని సమాప్తం చేస్తున్నారు. కాబట్టి సమర్థాన్ని మరియు వ్యర్థాన్ని గుర్తించడం మరియు పరివర్తన చేయడం - ఇది హోలీ హంస కర్తవ్యం. రోజంతా వ్యర్థ సంకల్పం, వ్యర్థ మాట, వ్యర్థ కర్మ మరియు వ్యర్థ సంబంధ-సంపర్కం ఏది జరిగినా, ఆ వ్యర్థాన్ని సమాప్తం చేయడమే హోలీ హంస. ఎదుటివారు ఎంత వ్యర్థంగా మాట్లాడినా మీరు వ్యర్థాన్ని సమర్థంగా పరివర్తన చేసేయండి. వ్యర్థాన్ని మీ బుద్ధిలోకి స్వీకరించకండి. ఒక్క వ్యర్థ సంకల్పాన్ని, వ్యర్థ మాటను, వ్యర్థ కర్మను స్వీకరించినా ఆ ఒక్క వ్యర్థం అనేక వ్యర్థాలకు జన్మనిస్తుంది. ఒక్క వ్యర్థ మాట స్పర్శించినా అది అనేక వ్యర్థాల అనుభవాన్ని కలిగిస్తుంది, దీనినే మీరు ఫీలింగ్ వచ్చేసింది అంటారు. ఒక వ్యర్థ సంకల్పం యొక్క ఫీలింగ్ వస్తే అది ఫీలింగ్‌ను పెంచుతుంది. అందుకనే కర్మ అయినా, మరేదైనా వ్యర్థం యొక్క పుట్టుక చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఒక్క వ్యర్థ మాట మాట్లాడితే దానిని సమర్థించుకోవడానికి ఇంకెన్ని వ్యర్థ మాటలు మాట్లాడాల్సి వస్తుంది! ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఇంకెన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుందో అని లోకులు అంటారు కదా!
కాబట్టి వ్యర్థం యొక్క ఖాతా సమాప్తమైపోవాలి మరియు సదా సమర్థం యొక్క ఖాతా జమ అవుతూ ఉండాలి. వారు మీకు వ్యర్థాన్ని ఇచ్చినా మీరు పరివర్తన చేసి సమర్థాన్ని ధారణ చేయండి. ఇంత తీవ్ర పరివర్తన శక్తి కావాలి. నేటి సైన్స్ వ్యర్థాన్ని కార్యంలో ఉపయోగించి మంచిగా ఎలా మారుస్తోందో, ఎన్నో వేస్ట్ వస్తువులను బెస్ట్‌గా పరివర్తన చేస్తుంది. మీ రచనే ఇంత ఫాస్ట్‌గా పరివర్తన చేయగలదు. చూడండి, మలినము ఉంటుంది కదా, మలినము చెడు పదార్థమే కానీ అది దేనికి జన్మనిస్తుంది? మలినము మురికిదే కానీ పువ్వు వికసించినప్పుడు సువాసనతో కూడుకున్నదిగా ఉంటుంది. లేదా దుర్వాసనతో ఉంటుందా? కాబట్టి మలినములో పరివర్తన చేసే శక్తి ఉంది కదా. అది స్వయంగా ఎలా ఉన్నా కానీ దేనికి జన్మనిస్తోంది? పండ్లు, పూలు, కూరగాయలు... మరి మీ రచనలోనే ఇంత శక్తి ఉన్నప్పుడు మీలో అంతకంటే ఎక్కువ శక్తి ఉంది కదా! వారు నిందించినా మీరు దాన్ని పూవుగా మార్చి ధారణ చేయండి. వారు కోపం ప్రదర్శించినా మీరు వారికి శాంతి అనే శీతల జలాన్ని ఇవ్వండి. ఈ పరివర్తన శక్తి కావాలి. హోలీ హంస కర్తవ్యం ఇదే. ఇలాంటి జీవితం తయారైందా? లేక ఏం చేస్తాం, మాట్లాడటమే చెడుగా మాట్లాడారు కదా, చేయడమే చాలా చెడ్డ పని చేశారు, అసలు వాళ్లే చాలా చెడ్డవారు అని అంటారా? కానీ చెడ్డదానినే కదా మంచిగా చేయాలి. మంచిదానిని మంచిగా చేయాల్సిన అవసరం లేదు కదా. మీరు మంచివారిగా వచ్చారా లేక చెడ్డవారిగా వచ్చారా? మరి బాబా మంచివారిగా చేశారు కదా. వీరు చాలా చెడ్డవారు, వీరిని మంచివారిగా ఎలా చేయాలి అని అన్నారా? ఆలోచించారా? తయారుచేశారు కదా. మరి బాబా మీ అందరినీ చెడు నుండి మంచివారిగా చేసినప్పుడు, మీరు చెడ్డ విషయాన్ని మంచిగా మార్చలేరా? చెడు ప్రభావం మీపై పడిపోతోంది. వాతావరణమే చెడ్డది కదా అని అంటారు. ఇది హోలీ హంస లక్షణం కాదు.
ఎలాంటి వాతావరణమున్నా, ఎలాంటి వృత్తి ఉన్నా, ఎలాంటి వాణి ఉన్నా, ఎలాంటి దృష్టి ఉన్నా సరే హోలీ హంస అందరినీ హోలీ (పవిత్రులు)గా మార్చేస్తుంది. సదా ఈ పవర్ ఉండి, సదా ఇంత తీవ్రగతిలో పరివర్తన చేసే విధి వస్తే ఏమైపోతారు? ఫరిశ్తా. ఫరిశ్తా ఎవరి ప్రభావంలోకీ రారు. తమ కార్యం చేశారు, వెళ్ళిపోయారు. ఫరిశ్తా ఎన్నడూ ఏ విఘ్నానికీ వశం కారు - విఘ్నానికీ కారు, వ్యక్తికీ కారు. కాబట్టి హోలీ హంస అనగా ఫరిశ్తా. సేవ చేశారు, అతీతంగా అయిపోయారు. మరి ఇలాంటి స్థితి సదా ఉంటోందా? ఇలా హోలీ హంసలుగా అయ్యారా లేక అవుతున్నారా? ఎప్పటివరకు అవుతారు? ఏమైనా టైమ్ లిమిట్ ఉందా లేదా? వచ్చే సంవత్సరం కూడా అవుతున్నాము అనే అంటారా? నాలెడ్జ్‌ఫుల్‌గా అయ్యారు కదా. మరి హోలీ హంసనైన నా కర్తవ్యం ఏమిటి అనే నాలెడ్జ్ ఉన్నప్పుడు, నాలెడ్జ్ శక్తితో పరివర్తన చేయలేరా? వచ్చే సంవత్సరం కూడా అవుతున్నాము అని అనకూడదు.
తీవ్ర పురుషార్థి లక్ష్యమే ‘ఇప్పుడు’ మరియు ఢీలా పురుషార్థి లక్ష్యం ‘ఎప్పుడో’. మరి తీవ్ర పురుషార్థులే కదా. బాప్‌దాదా సదా ప్రతి ఆత్మ పట్ల చేసేవారే అనే శ్రేష్ఠ భావనను ఉంచుతారు. అందువలన ఈ శ్రేష్ఠ భావనను ప్రాక్టికల్లోకి తీసుకురావాలి - ఇప్పుడు చేయాల్సిందే, జరగాల్సిందే. సంకల్పంలో జరగాల్సిందే, చేయాల్సిందే అనే లక్ష్యం ఉంటే ఈ సంకల్పం తప్పక సఫలతను ప్రాప్తింపజేస్తుంది. ఎందుకంటే దృఢత్వమే సఫలతకు తాళంచెవి. కాబట్టి సదా సఫలతను వెంట ఉంచుకోండి.
గ్రూప్ నం. 6 :- సాధారణతలో మహానతను అనుభవం చేయించడమే సేవ యొక్క సహజ సాధనం
అందరికంటే షాహుకారులలో షాహుకారులు ఎవరు? మొత్తం చక్రం అంతటిలోనూ షాహుకారులలో షాహుకారులమైన ఆత్మలము మేమే అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. దేనిలో షాహుకారులు? ఎన్ని రకాల ధనాలు లభించాయి? ఆ జాబితా గుర్తుందా? చాలా ఖజానాలు లభించాయి! ఒక్క రోజులో ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? పదమాల సంపాదన చేస్తున్నారు. ఉండేది పల్లెటూరిలో మరియు సంపాదిస్తున్నది పదమాల సంపాదన! చూడండి, పరమాత్మ తండ్రి యొక్క అద్భుతము ఇదే - చూడటానికి సాధారణం కానీ అందరికంటే షాహుకారులలో షాహుకారులు! వార్తాపత్రికలలో వేస్తారు - ఇక్కడ షాహుకారులలో షాహుకారులు కూర్చున్నారు అని. అప్పుడు అందరూ మీ వెంటే పడతారు. ఈ రోజుల్లో ఉగ్రవాదులు షాహుకారుల వెంటే పడతారు కదా. మీ వెంట పడితే అప్పుడు ఏం చేస్తారు? వారిని కూడా షాహుకారులుగా చేసేస్తారు కదా. చూడటానికి ఎంత సాధారణ రూపంలో ఉన్నారు, ఎవరైనా మిమ్మల్ని చూసి వీరు సమస్త విశ్వంలోనే షాహుకారులని లేదా పదమాల సంపాదన చేసేవారని భావిస్తారా? కానీ సాధారణత్వంలో మహానత ఇమిడి ఉంది. ఎంత సాధారణంగా ఉంటారో అంత లోలోపల మహాన్! బాబా ఎలా ఉన్నవారిని ఎలా మార్చేశారు మరియు ఏమేమి ఇచ్చేశారు అనే నషా ఉంటోందా! రెండూ గుర్తుంటున్నాయి కదా. వార్తాపత్రికలలో వేస్తారు కదా ‘రిచెస్ట్ ఇన్ ది వరల్డ్’ (విశ్వంలో అందరికంటే ఎక్కువ ధనవంతులు) అని.
మరి చూడండి, ఖజానా కూడా ఎలాంటిదంటే దొంగ దోచుకోలేరు, నిప్పు కాల్చలేదు, నీరు ముంచలేదు. అలాంటి ఖజానాను బాబా ఇచ్చేశారు. అవినాశి ఖజానా కదా. అవినాశి ఖజానాను ఎవరూ వినాశనం చేయలేరు. ఎంత సహజంగా లభించేసింది! ఎంతటి ఖజానా ఉందో దానికి తగినట్లుగా శ్రమ ఏదైనా చేశారా? త్యాగం చేశారా లేక భాగ్యం లభించిందా? త్యాగం చేసినా చెడునే త్యాగం చేశారు కదా. చెడును వదలడం కూడా ఒక వదలడమేనా? ప్రపంచం త్యాగం చేశారు అంటుంది, మీరు భాగ్యం లభించింది అంటారు. షాహుకారుడిని షాహుకారుగా చేయడం పెద్ద విషయం కాదు కదా. పేదవారిని షాహుకారుగా చేయడమే అద్భుతము. ఇప్పటి వినాశి ధనం గల షాహుకారులను బాబా షాహుకారులుగా తయారుచేయరు. వారి భాగ్యమే లేదు. భాగ్యం పేదవారిదే. మీ పేరు ఎప్పుడైనా ‘హూ ఈజ్ హూ’ (పేరుప్రఖ్యాతులు గల వ్యక్తుల జాబితా)లో వచ్చిందా? ఇతరుల పేర్లు వస్తాయి కదా. బాబా డిక్షనరీలో, ‘హూ ఈజ్ హూ’లో మీ పేరు ఉంది. భగవంతుని పుస్తకమే అతీతమైనది. మరి ఇంత సంతోషం ఉందా? భూమిని మరియు ఆకాశాన్ని కొలిచినా, దానికంటే కూడా ఎక్కువ సంతోషం ఉంది కదా. అపారమైనది కదా. ఆకాశం మరియు భూమి అంటే హద్దు అయిపోతుంది కదా. మీది దానికంటే కూడా అనంతమైనది. అనంతమైనవారికి యజమాని అయిపోయారు కదా. బాబా కూడా అనంతమైన తండ్రి అయినప్పుడు, ప్రాప్తి కూడా అనంతమైనదే చేయిస్తారు కదా. మరి ఏమి గుర్తుంటుంది? అనంతమైన తండ్రి లభించారు, అనంతమైన రాజ్య-భాగ్యం లభించింది, అనంతమైన ఖజానా లభించింది. నషా ఉందా? ప్రతి కర్మలోనూ ఈ ఆత్మిక నషా అనుభవమవ్వాలి - తమకు కూడా మరియు ఇతరులకు కూడా. వారు అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా వీరు సంతోషం-ఆనందంలో ఉంటారు అని ఇంత మాత్రమైనా అంటారు కదా. ఈ అనుభవం అయితే చేయించగలరు కదా. మధుబన్కి వచ్చినప్పుడు తెలియనివారైనా సరే కానీ ఏమి అనుభవం చేసుకుంటారు? ఇక్కడి వాతావరణం మరియు ఇక్కడి ఆత్మలు సంతోషంగా ఉన్నారు, వాతావరణంలో సంతోషం ఉంది అని అనుభవం చేసుకుంటారు కదా. అలాగే మీ అందరి సంబంధ-సంపర్కంలో వీరు అలౌకిక ఆత్మలు, సంపూర్ణమైన ఆత్మలు అని అందరూ అనుభవం చేసుకోవాలి. అలా అనుభవం చేసుకుంటారు. దేహాభిమానం కారణంగా పైకి చెప్పకపోయినా లోపల మాత్రం తెలుసుకుంటారు కదా. ఎందుకంటే బయటకు మీతో చెప్తే తాము కూడా అలా మారాల్సి వస్తుంది కదా. అందుకే పైకి చెప్పరు కానీ లోపల అనుభూతి తప్పకుండా కలుగుతుంది. మరి ఇంత శ్రేష్ఠమైనవారే కదా. అందుకనే అతీంద్రియ సుఖం గురించి అడగాలంటే... అని గానం చేయబడింది. మిమ్మల్ని అడగమంటారా?
చూడండి, భగవంతుని ఎంపిక ఏమిటి? ఎవరినైతే ఎవరూ ఇష్టపడరో వారిని బాబా ఇష్టపడతారు! బాబా దృష్టి ఎవరిపై పడింది? మీపైనే. బాగా పేరుప్రఖ్యాతులు గల వ్యక్తులపై దృష్టి పడలేదు. మీ గతి-మతి మీకే తెలుసు, మరెవరికీ తెలియదు అంటారు కదా. పరమాత్మ మమ్మల్ని ఎన్నుకున్నారు అనే నషా ఉందా. డబల్ విదేశీయులు డబల్ నషాలో ఉంటారు. భారతీయులను అయితే భారతదేశంలోనే వచ్చి ఎన్నుకున్నారు. కానీ డబల్ విదేశీయులను ఎక్కడి నుండి ఎన్నుకున్నారు? ఇంత దూరం నుండి బాబా మమ్మల్ని ఎన్నుకున్నారు. కాబట్టి డబల్ నషా ఉంది కదా. ఆత్మ మరియు శరీరం ఎలాగైతే కలిసి ఉన్నాయో మరియు సదా తోడుగా ఉంటాయో, అలాగే ఈ నషా ఆత్మకు సదా తోడుగా ఉంటుంది. మరి ఇలాంటి నషాలో ఉండే శ్రేష్ఠాతి శ్రేష్ఠ ఆత్మలు! సదా సంతోషంలో నాట్యం చేసేవారు. ఏదైనా ప్రాప్తి కలిగితే సంతోషంలో నాట్యం చేస్తారు. మీకైతే అడుగడుగునా ప్రాప్తే ప్రాప్తి. పరమాత్మ ఖజానాలో అప్రాప్తమైన వస్తువు ఏదీ లేదు అని హృదయం చెప్పేంత ప్రాప్తి ఉంది. ఈ సమయపు గీతం ఇదే - బ్రాహ్మణుల ఖజానాలో సర్వ ప్రాప్తులు ఉన్నాయి. అచ్ఛా!
*** ఓంశాంతి ***
