‘‘అవ్యక్త సంవత్సరాన్ని జరుపుకోవడము అనగా సుపుత్రులుగా అయి ఋజువు చూపించడము’’
ఈరోజు అవ్యక్త తండ్రి తమ అవ్యక్తమూర్తి పిల్లలతో మిలనం జరుపుకుంటున్నారు. అవ్యక్తము అనగా వ్యక్త భావము నుండి అతీతముగా మరియు అవ్యక్త తండ్రి సమానంగా ప్రియముగా ఉండడము. పిల్లలందరూ విశేషంగా ఈ సంవత్సరం ఈ విధంగా తండ్రి సమానంగా అయ్యే లక్ష్యం పెట్టుకొని యథా శక్తి చాలా మంచి పురుషార్థం చేస్తున్నారు. లక్ష్యంతో పాటు లక్షణాలను కూడా ధారణ చేసుకుంటూ నడుస్తున్నారు. బాప్‌దాదా పిల్లలందరి పురుషార్థం చూసి హర్షిస్తున్నారు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు, ఈ విధంగా సమానంగా అవ్వడమే స్నేహానికి ఋజువు, అందుకే ఋజువునిచ్చే ఇటువంటి పిల్లలనే సుపుత్రులైన పిల్లలు అని అంటాము. కనుక సుపుత్రులైన పిల్లలను చూసి బాప్‌దాదా సంతోషిస్తారు కూడా మరియు విశేషంగా అదనపు సహాయం కూడా ఇస్తారు.
ఎంతగా ధైర్యవంతులుగా అవుతారో, అంతగా పదమారెట్లు తండ్రి సహాయానికి స్వతహాగానే పాత్రులుగా అవుతారు. ఇటువంటి పాత్రులైన పిల్లల గుర్తులేమిటి? తండ్రి యొక్క భాండాగారాలు సదా నిండుగా ఉంటాయని ఎలాగైతే తండ్రి కోసం గాయనం ఉందో, అలాగే సుపుత్రులైన పిల్లల భాండాగారాలు సదా సర్వుల హృదయపూర్వక స్నేహంతో కూడిన ఆశీర్వాదాలతో, సర్వుల సహయోగం యొక్క అనుభూతులతో, సర్వ ఖజానాలతో నిండుగా ఉంటాయి. స్వయాన్ని ఏ ఖజానా విషయంలోనూ ఖాళీగా అనుభవం చేయరు. సదా వారి హృదయం నుండి ఈ పాటే స్వతహాగా మోగుతుంది - తండ్రి పిల్లలమైన మా భాండాగారంలో అప్రాప్తి అనే వస్తువంటూ ఏదీ లేదు. వారి దృష్టి ద్వారా, వృత్తి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా, ముఖము ద్వారా, సంపర్కము ద్వారా సదా నిండుగా ఉండే ఆత్మలని అనుభవమవుతుంది. ఇటువంటి పిల్లలు సదా తండ్రితో ఉంటారు మరియు సహచరులుగా కూడా ఉంటారు. ఈ డబల్ అనుభవం అవ్వాలి. స్వయం యొక్క తపనలో సదా తోడు యొక్క అనుభవం చేస్తారు మరియు సేవలో సదా సహచరుని స్థితిని అనుభవం చేస్తారు. ‘సహచరుడు(సాథీ) మరియు తోడు(సాథ్) - ఈ రెండింటి అనుభవం స్వతహాగానే తండ్రి సమానంగా సాక్షిగా అనగా అతీతంగా మరియు ప్రియంగా చేస్తుంది. ఎలాగైతే బ్రహ్మా బాబాను చూసారు - తండ్రి మరియు బ్రహ్మా బాబా కంబైండ్ రూపంలో ఉన్నట్లుగా సదా అనుభవం చేసారు మరియు చేయించారు. కంబైండ్ స్వరూపాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు. ఇటువంటి సుపుత్రులైన పిల్లలు సదా స్వయాన్ని కంబైండ్ రూపంలో అనుభవం చేస్తారు. వేరు చేయగలిగే శక్తి ఎవ్వరికీ ఉండదు.
ఎలాగైతే సత్యయుగంలో దేవతలకు ప్రకృతి దాసిగా ఉంటుందో అనగా సదా సమయానుసారంగా సహయోగిగా ఉంటుందో, అలా సుపుత్రులైన పిల్లల శ్రేష్ఠ స్థితి కారణంగా సర్వ శక్తులు మరియు సర్వ గుణాలు సమయానుసారంగా సదా సహయోగిగా ఉంటాయి అనగా సర్వ శక్తులకు, గుణాలకు రాజ్యాధికారిగా ఉంటారు. దానితో పాటు ఇటువంటి సుపుత్రుల సేవ యొక్క విశేష స్వరూపం ఏముంటుంది? ఎలాగైతే అందరూ వాణి ద్వారా లేక మనసా-సేవ ద్వారా సేవ చేస్తూ ఉంటారో, అటువంటి సేవను వారు కూడా చేస్తారు, కానీ వీరి విశేష సేవ ఇదే - సదా ప్రాప్తించిన తండ్రి యొక్క గుణాలను మరియు శక్తులను ఇతర ఆత్మలకు దానం చేయడమే కాదు సహయోగాన్ని లేక ప్రాప్తిని అనుభవం చేయించడము. అజ్ఞానులకు దానం చేస్తారు, బ్రాహ్మణాత్మలకు సహయోగాన్ని లేక ప్రాప్తిని చేయిస్తారు ఎందుకంటే అన్నింటికన్నా అతి గొప్ప దానము గుణ దానము లేక శక్తుల దానము.
నిర్బలులను శక్తివంతులుగా చేయడము, ఇదే శ్రేష్ఠ దానము లేక సహయోగము. కనుక ఇటువంటి సహయోగాన్ని ఇవ్వడం వస్తుందా? లేక ఇప్పుడింకా తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఇప్పటికీ తీసుకునేవారిగా ఉన్నారా లేక దాత పిల్లలుగా అయి ఇచ్చేవారిగా అయ్యారా? లేక అప్పుడప్పుడు తీసుకుంటున్నారు, అప్పుడప్పుడు ఇస్తున్నారు, అలా ఉన్నారా? ఇవ్వడములో నిమగ్నమవ్వండి, అప్పుడు తీసుకోవడము స్వతహాగానే సంపన్నమైపోతుంది ఎందుకంటే తండ్రి అందరికీ అన్నీ ఇచ్చేసారు. తమ వద్ద ఏమీ ఉంచుకోలేదు, అన్నీ ఇచ్చేసారు. కేవలం తీసుకునేవారికి సంభాళించడము మరియు కార్యంలో ఉపయోగించడము రావడం లేదు. కావున ఎంతగా ఇస్తూ ఉంటారో, అంతగానే సంపన్నతను అనుభవం చేస్తూ ఉంటారు. ఇటువంటి సుపుత్రులే కదా! ‘సుపుత్రుల’ లైన్లో ఉన్నారా లేక సుపుత్రులుగా అయ్యే లైన్లో ఉన్నారా? ఎలాగైతే లౌకికంలో కూడా తల్లిదండ్రులు పిల్లలను తమ చేతులలో నాట్యం చేయిస్తూ ఉంటారు అనగా సదా సంతోషంగా ఉంచుతారు, ఉల్లాస-ఉత్సాహాలతో ఉంచుతారు. అదే విధంగా సుపుత్రులైన పిల్లలు సదా సర్వులను ఉల్లాస-ఉత్సాహాలలో నాట్యం చేయిస్తూ ఉంటారు, ఎగిరే కళలో ఎగిరేలా చేస్తూ ఉంటారు. కావున ఈ సంవత్సరాన్ని అవ్యక్త సంవత్సరంగా జరుపుకుంటున్నారు. అవ్యక్త సంవత్సరం అనగా తండ్రికి సుపుత్రులుగా అయి ఋజువు చూపించేవారిగా అవ్వడము. ఇటువంటి ఋజువును చూపించడము అనగా జరుపుకోవడము. అవ్యక్తము అంటే అర్థమే, వ్యక్త భావము మరియు వ్యక్త భావనల నుండి అతీతముగా ఉండడము.
జీవితంలో ఎగిరే కళ లేక దిగే కళకు ఆధారము రెండు విషయాలే - 1. భావన మరియు 2. భావము. ఒకవేళ ఏదైనా కార్యంలో కార్యం పట్ల లేక కార్యం చేసే వ్యక్తి పట్ల భావన శ్రేష్ఠంగా ఉంటే, భావనకు ఫలం కూడా స్వతహాగానే శ్రేష్ఠమైనది ప్రాప్తిస్తుంది. ఒకటేమో - సర్వుల పట్ల కళ్యాణ భావన, రెండవది - ఎవరు ఎలా ఉన్నా సరే, సదా స్నేహము మరియు సహయోగము ఇచ్చే భావన, మూడవది - సదా ధైర్యాన్ని, ఉత్సాహాన్ని పెంచే భావన, నాల్గవది - ఎవరు ఎలా ఉన్నా సరే, సదా నా వారు అన్న భావన మరియు ఐదవది - వీటన్నింటికీ పునాది అయిన ఆత్మిక స్వరూపం యొక్క భావన. వీటినే సద్భావనలు లేక పాజిటివ్ భావనలు అని అంటారు. కనుక అవ్యక్తమవ్వడము అనగా ఈ సర్వ సద్భావనలు ఉంచుకోవడము. ఒకవేళ ఈ సద్భావనలకు విపరీతముగా ఉంటే, అప్పుడు వ్యక్త భావము తన వైపుకు ఆకర్షిస్తుంది. వ్యక్త భావము యొక్క అర్థమే, ఈ ఐదు విషయాలకు నెగిటివ్‌లో అనగా విపరీతమైన స్థితిలో ఉండడము. వీటికి విపరీతము అయితే స్వయానికే తెలుసు, వర్ణించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే భావన విపరీతంగా అవుతుందో, అప్పుడు అవ్యక్త స్థితిలో స్థితులవ్వలేరు.
మాయ వచ్చేందుకు విశేషమైన ద్వారాలు ఇవే. ఏ విఘ్నాన్ని అయినా చెక్ చేసుకోండి, దానికి మూలము - ప్రీతికి బదులుగా విపరీత భావనలే ఉంటాయి. భావన అనేది మొదట సంకల్ప రూపంలో ఉంటుంది, తర్వాత మాటలోకి వస్తుంది మరియు దాని తర్వాత మళ్ళీ కర్మలోకి వస్తుంది. ఎటువంటి భావన ఉంటుందో, అలాగే వ్యక్తుల యొక్క ప్రతి ఒక్క నడవడికను లేక మాటను అదే భావముతో చూస్తారు, వింటారు లేక సంబంధంలోకి వస్తారు. భావన వలన భావము కూడా మారిపోతుంది. ఒకవేళ ఏ ఆత్మ పట్ల అయినా ఏదైనా సమయంలో ఈర్ష్య భావన ఉంటే అనగా నా వారు అన్న భావన లేకపోతే ఆ వ్యక్తి యొక్క ప్రతి నడవడిక ద్వారా, ప్రతి మాట ద్వారా అపార్థ భావము అనుభవమవుతుంది. వారు మంచి చేస్తారు కానీ మీ భావన మంచిగా లేని కారణంగా ప్రతి నడవడిక మరియు మాట ద్వారా మీకు చెడు భావమే కనిపిస్తుంది. కనుక భావన, భావాన్ని మార్చేటువంటిది. మరి చెక్ చేసుకోండి, ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ భావము ఉంటుందా? భావాన్ని అర్థం చేసుకోవడములో తేడా రావడం వలన ‘అపార్థ భావము’ మాయకు ద్వారముగా అయిపోతుంది. అవ్యక్త స్థితిని తయారు చేసుకునేందుకు విశేషంగా మీ భావనను మరియు భావాన్ని చెక్ చేసుకోండి, అప్పుడు సహజంగా అవ్యక్త స్థితిలో విశేషమైన అనుభవాలను చేసుకుంటూ ఉంటారు.
చాలామంది పిల్లలు అశుద్ధ భావన లేక అశుభ భావాల నుండి దూరంగా కూడా ఉంటారు. కానీ ఒకటి - శుభ భావము మరియు భావన, రెండవది - వ్యర్థ భావము మరియు భావన, మూడవది సాధారణ భావన మరియు భావము, ఎందుకంటే బ్రాహ్మణులు అనగా సేవా భావము. కావున సాధారణ భావన లేక సాధారణ భావము నష్టం చేయవు, కానీ బ్రాహ్మణ జీవితం యొక్క కర్తవ్యము ఏదైతే ఉందో, శుభ భావనతో సేవా భావము, దానిని చేయలేరు, అందుకే బ్రాహ్మణ జీవితంలో సేవా ఫలం జమ అయ్యే విశేష వరదానం ఏదైతే ఉందో, దానిని అనుభవం చేయలేరు. కనుక సాధారణ భావన మరియు భావమును కూడా శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ భావములోకి పరివర్తన చేయండి. చెక్ చేసుకుంటే ఛేంజ్ చేసుకుంటారు మరియు తండ్రి సమానంగా అవ్యక్త ఫరిశ్తాగా సహజంగా అవుతారు. కనుక అర్థమయిందా, అవ్యక్త సంవత్సరాన్ని ఎలా జరుపుకోవాలో?
‘శుభ భావన’ మనసా-సేవకు చాలా శ్రేష్ఠ సాధనము మరియు ‘శ్రేష్ఠ భావము’ సంబంధ-సంపర్కంలో సర్వులకు ప్రియంగా అయ్యేందుకు సహజ సాధనము. ఎవరైతే సదా ప్రతి ఒక్కరి పట్ల శ్రేష్ఠ భావాన్ని ధారణ చేస్తారో, వారే మాలలో సమీప మణిగా అవుతారు ఎందుకంటే మాల అనేది సంబంధ-సంపర్కంలో సమీపతకు మరియు శ్రేష్ఠతకు గుర్తు. ఎవరు ఎలాంటి భావముతో మాట్లాడినా లేక నడుచుకున్నా కానీ, మీరు సదా ప్రతి ఒక్కరి పట్ల శుభ భావము, శ్రేష్ఠ భావమును ధారణ చేయండి. ఎవరైతే ఇందులో విజయులుగా అవుతారో, వారే మాలలో కూర్చబడేందుకు అధికారులుగా అవుతారు. సేవా క్షేత్రంలో భాషణ చేయకపోవచ్చు, ప్లాన్లు తయారుచేయకపోవచ్చు, కానీ ఎవరైతే ప్రతి ఒక్కరితో సంబంధ-సంపర్కంలో శుభ భావము పెట్టుకోగలరో, ఈ ‘శుభ భావము’ సూక్ష్మ సేవా-భావంలో జమ అయిపోతుంది. ఈ విధంగా శుభ భావము కలవారు సదా అందరికీ సుఖాన్ని ఇస్తారు, సుఖం తీసుకుంటారు. కనుక ఇది కూడా సేవనే మరియు ఈ సేవా-భావము ముందు నంబరు తీసుకునేందుకు అధికారిగా చేస్తుంది, అందుకే మాలలో మణిగా అయిపోతారు. అర్థమయిందా? ఇలా ఎప్పుడూ ఆలోచించకండి, మాకైతే భాషణ చేసే అవకాశమే లభించదు, పెద్ద-పెద్ద సేవల యొక్క అవకాశమే లభించదు అని. కానీ ఈ సేవా-భావము యొక్క గోల్డెన్ ఛాన్స్ తీసుకునేవారు ఛాన్సలర్ లైన్లోకి వచ్చేస్తారు అనగా విశేష ఆత్మలుగా అయిపోతారు, అందుకే ఈ సంవత్సరంలో విశేషంగా ఈ ‘శుభ భావన’ మరియు ‘శ్రేష్ఠ భావము’ను ధారణ చేయడంపై విశేషమైన అటెన్షన్ పెట్టండి.
అశుభ భావము మరియు అశుభ భావనను కూడా తమ శుభ భావము మరియు శుభ భావన ద్వారా పరివర్తన చేయగలరు. వినిపించాము కదా, గులాబి పుష్పము దుర్వాసన కలిగిన ఎరువు నుండి సుగంధాన్ని ధారణ చేసి సుగంధభరితమైన గులాబిగా అవుతుంది. మరి శ్రేష్ఠ ఆత్మలైన మీరు అశుభాన్ని, వ్యర్థాన్ని, సాధారణ భావనను మరియు భావాలను శ్రేష్ఠతలోకి మార్చలేరా! లేక ఇలా అంటారా, ఏం చేయాలి, వీరిది ఉన్నదే అశుభ భావన, వీరి భావమే నా పట్ల చాలా చెడుగా ఉంది, నేనేం చేయాలి? ఇలా అయితే అనరు కదా! మీ యొక్క టైటిల్యే విశ్వ పరివర్తకులు. ప్రకృతిని తమోగుణి నుండి సతోగుణిగా చేయగలరు అన్నప్పుడు, మరి ఆత్మల యొక్క భావాలు మరియు భావనల పరివర్తకులుగా అవ్వలేరా? కావున ఈ లక్ష్యమే తండ్రి సమానంగా అవ్యక్త ఫరిశ్తాగా అయ్యే లక్షణాలను సహజంగా మరియు స్వతహాగా తీసుకొస్తుంది. అర్థమయిందా, అవ్యక్త సంవత్సరాన్ని ఎలా జరుపుకోవాలో? జరుపుకోవడము అనగా తయారవ్వడము - ఇదే బ్రాహ్మణుల భాష యొక్క సిద్ధాంతము. తయారవ్వాలి కదా లేక కేవలం జరుపుకోవాలా? కనుక బ్రాహ్మణులలో వర్తమాన సమయంలో ఈ పురుషార్థం యొక్క విశేషమైన అవసరముంది మరియు ఈ సేవయే మాలలో మణులను సమీపంగా తీసుకొచ్చి మాలను ప్రసిద్ధి చేస్తుంది. మాలలో మణులు వేర్వేరుగా తయారవుతున్నారు. కానీ మాల అంటేనే పూస, పూస యొక్క సామీప్యత. కనుక ఈ రెండు విషయాలు పూస, పూస యొక్క సామీప్యతకు సాధనము. వీరినే సుపుత్రులు అనగా ఋజువు చూపించేవారు అని అంటాము. అచ్ఛా!
నలువైపులా ఉన్న స్నేహానికి ఋజువు చూపించే సర్వ సుపుత్రులందరికీ, సదా తండ్రి సమానంగా ఫరిశ్తాగా అయ్యే ఉల్లాస-ఉత్సాహాలలో ఉండే ఆత్మలకు, సదా సర్వుల పట్ల శ్రేష్ఠ భావన మరియు శ్రేష్ఠ భావము పెట్టుకునే విజయీ ఆత్మలకు, సదా పత్రి ఆత్మను శ్రేష్ఠ భావనతో పరివర్తన చేసే విశ్వ-పరివర్తక ఆత్మలకు, సదా విజయులుగా అయ్యి విజయ మాలలో సమీపంగా వచ్చే విజయీ రత్నాలకు బాప్‌దాదా యొక్క అవ్యక్త సంవత్సరపు శుభాకాంక్షలతో పాటు ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో మిలనము
జానకి దాదీతో:- తమ ధైర్యము మరియు సర్వుల సహయోగం యొక్క ఆశీర్వాదాలు శరీరాన్ని నడిపిస్తున్నాయి. సమయానికి శరీరం కూడా సహయోగమిస్తుంది. దీనినే అదనపు ఆశీర్వాదాల సహాయము అని అంటాము. కావున విశేష ఆత్మలకు ఈ అదనపు సహాయం తప్పకుండా లభిస్తుంది. కొద్దిగా శరీరానికి విశ్రాంతి కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ విశ్రాంతి ఇవ్వకపోతే అది గడబిడ చేస్తుంది. ఎలాగైతే ఇతరులకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తారు కదా! కొందరికి శాంతి కావాలి, కొందరికి సుఖం కావాలి, కొందరికి ధైర్యం కావాలి అంటే ఇస్తారు కదా! కావున శరీరానికి ఏం కావాలో, అది కూడా ఇస్తూ ఉండండి. దీనికి కూడా ఏదో ఒకటి కావాలి కదా! ఎందుకంటే ఈ శరీరం కూడా తాకట్టు కదా! దీనిని కూడా సంభాళించాల్సి ఉంటుంది కదా! మంచి ధైర్యంతో నడుస్తున్నారు మరియు నడవాల్సిందే. సమయానికి ఆవశ్యకత అనుసారంగా ఎలాగైతే శరీరం మీకు సహయోగమిస్తుందో, అలాగే మీరు కూడా కొద్ది-కొద్దిగా సహయోగమివ్వండి. నాలెడ్జ్‌ఫుల్‌గా అయితే ఉండనే ఉన్నారు. మంచిది, ఎందుకంటే ఈ శరీరం ద్వారానే అనేక ఆత్మల కళ్యాణం జరగాలి. కేవలం మీ తోడు యొక్క అనుభవంతోనే అందరూ చాలా గొప్ప సహాయాన్ని అనుభవం చేస్తారు. హాజరవ్వడము కూడా సేవ యొక్క హాజరుగా అయిపోతుంది. స్థూల సేవ చేయకపోయినా కూడా, హాజరు అవ్వడముతో హాజరు పడిపోతుంది. క్షణం కూడా సేవ లేకుండా ఉండలేరు, ఉండరు, అందుకే సేవ యొక్క జమ ఖాతా జమ అవుతూనే ఉంది. చాలా బాగా పాత్రను అభినయిస్తూ ఉన్నారు, అభినయిస్తూనే ఉంటారు. మంచి పాత్ర లభించింది కదా! డ్రామానుసారంగా ఇంత గొప్ప పాత్ర ఆశీర్వాదాల కారణంగా లభించింది! ఇది బ్రాహ్మణ జన్మ యొక్క ఆది సంస్కారాలైన ‘దయాహృదయము’ మరియు ‘సహయోగ భావన’లకు ఫలము. తనువు ద్వారా గానీ, మనసు ద్వారా గానీ దయాహృదయము మరియు సహయోగ భావనల యొక్క పాత్ర ఆది నుండి లభించి ఉంది, అందుకే దాని ఫలము సహజంగా ప్రాప్తిస్తూ ఉంది. శారీరక సహయోగం యొక్క సేవను కూడా హృదయపూర్వకంగా చేసారు, అందుకే శరీరం యొక్క ఆయువు ఈ ఆశీర్వాదాల ద్వారా పెరుగుతూ ఉంది. అచ్ఛా!
దాదీజీతో:- అచ్ఛా, సేవ చేసి వచ్చారా! ఈ డ్రామా కూడా సహయోగిగా అవుతుంది మరియు ఈ శుభ భావనల యొక్క ఫలము మరియు బలము లభిస్తుంది. సంగఠిత రూపంలో శుభ భావన ఈ ఫలాన్ని ఇస్తుంది. కావున బాగుంది మరియు ఇంకా బాగా జరగాల్సిందే. ఇప్పుడైతే ఇంకా అవ్యక్త స్థితి ద్వారా విశ్వ ఆత్మలకు ఇంకా సేవలో ముందుకు వెళ్ళేందుకు బలం లభిస్తుంది. కేవలం బ్రాహ్మణుల యొక్క దృఢ పరివర్తన కోసం విశ్వ పరివర్తన ఆగి ఉంది. బ్రాహ్మణుల పరివర్తన అప్పుడప్పుడు శక్తిశాలిగా ఉంటుంది, అప్పుడప్పుడు తేలికగా ఉంటుంది. కావున ఈ అలజడి కూడా అప్పుడప్పుడు తీవ్రమవుతుంది, అప్పుడప్పుడు ఢీలా అవుతుంది. సంపన్నంగా అవ్వాల్సినవారు అయితే ఈ బ్రాహ్మణులే. అచ్ఛా!
చంద్రమణి దాదీతో:- అనంతమైన చక్రవర్తిగా అయ్యారు, ఈరోజు ఇక్కడ, రేపు అక్కడ! కావున దీనినే విశ్వాత్మలతో స్వతహాగా మరియు సహజంగా సంబంధం పెరగడము అని అంటాము. విశ్వంపై రాజ్యం చేయాలి, విశ్వ కళ్యాణకారులు, కనుక మూల-మూలలో పాదాలనైతే మోపాలి కదా, అందుకే దేశ-విదేశాలలో అవకాశం లభిస్తుంది. ప్రోగ్రామ్ తయారుచేయకపోయినా కూడా, డ్రామానుసారంగా ఈ సంగమము యొక్క సేవ భవిష్యత్తును ప్రత్యక్షం చేస్తూ ఉంది, అందుకే అనంతమైన సేవ మరియు అనంతమైన సంబంధ-సంపర్కాలు పెరుగుతున్నాయి మరియు పెరుగుతూనే ఉంటాయి. రాష్ట్రానికి రాజుగా అయితే అవ్వరు, విశ్వానికి అవ్వాలి! పంజాబుకు రాజుగా అయితే అవ్వరు! అదైతే నిమిత్తముగా ఉన్న బాధ్యత, బాధ్యతగా భావించి నిర్వర్తిస్తారు. ఇకపోతే, మధుబన్ నివాసిగా అవ్వాలని ఆజ్ఞాపిస్తే, పంజాబు ఏమవుతుంది అని ఆలోచిస్తారా ఏమిటి? అలా ఉండకూడదు. ఎక్కడ ఏ బాధ్యత ఎప్పటివరకైతే ఉంటుందో, చాలా మంచి రీతిలో నిర్వర్తించాల్సిందే.
జానకి దాదీతో:- మీరు విదేశం నుండి వెంటనే ఇక్కడికి వచ్చేయండి అని ఇప్పుడు అంటే కూర్చుండిపోతారు కదా! తండ్రి పంపిస్తారు, స్వయము వెళ్ళరు. చివరికి అందరూ ఇక్కడికి రావాల్సే ఉంటుంది కదా! అందుకే పదే-పదే వస్తూ-వస్తూ ఇక ఉండిపోతారు. అక్కడకు వెళ్ళి తిరిగి వచ్చేస్తారు కదా! అందుకే అతీతంగా కూడా ఉన్నారు మరియు సేవకు ప్రియంగా కూడా ఉన్నారు. దేశానికి మరియు వ్యక్తులకు ప్రియమైనవారు కాదు, సేవకు ప్రియమైనవారు. అచ్ఛా! అందరికీ స్మృతిని ఇవ్వండి, అవ్యక్త సంవత్సరం యొక్క అభినందనలు ఇవ్వండి.
అవ్యక్త బాప్‌దాదా యొక్క పర్సనల్ మిలనము
గ్రూప్ నం. 1
వ్యర్థం నుండి రక్షణ పొందేందుకు బుద్ధిని శుద్ధ సంకల్పాలలో బిజీగా ఉంచండి
సదా సంతోషంగా ఉంటున్నారా! లేక ఎప్పుడైనా సంతోషంగా ఉండి, ఎప్పుడైనా సంతోషానికి బదులుగా ఏదైనా వ్యర్థ సంస్కారము లేదా సంకల్పంలోకి వచ్చేస్తున్నారా? ఒకవేళ ఏ వ్యర్థ సంకల్పమైనా వచ్చినా లేదా వ్యర్థ సాంగత్యము లభించినా సంతోషము సమాప్తమైపోతుంది. ఎందుకంటే వ్యర్థ సాంగత్యము లేదా వ్యర్థ సంకల్పము అనేది బరువు, మరియు సంతోషము తేలికైన విషయం! అందుకే చూడండి, సంతోషంగా ఉన్నప్పుడు నాట్యం చేస్తారు. ఎవరైతే తేలికగా ఉంటారో వారు సంతోషంలో నాట్యం చేస్తారు! శరీరం ఎంత బరువుగా ఉన్నప్పటికీ మనస్సు తేలికగా ఉంటే నాట్యం చేస్తుంది. మనస్సు బరువుగా ఉంటే తేలికగా ఉన్నవారు కూడా నాట్యం చేయరు. కాబట్టి సంతోషం అంటే తేలికతనము మరియు వ్యర్థ సంకల్పము లేదా వ్యర్థ సాంగత్యము అనేది బరువు. బరువు సదా కిందకు తీసుకువస్తుంది మరియు తేలికైన వస్తువు సదా పైకి వెళ్తుంది. కాబట్టి సంతోషంగా ఉండేందుకు సహజ సాధనము - సదా తేలికగా ఉండండి. శుద్ధ సంకల్పాలు తేలికైనవి మరియు వ్యర్థ సంకల్పాలు బరువైనవి. ఎప్పుడైనా ఎవరిలోనైనా వ్యర్థ సంకల్పాలు వచ్చినప్పుడు ఏమి అనుభవం చేస్తారు? తల బరువుగా అయిపోతుంది. బరువు ఉంది కాబట్టే తల బరువుగా అవుతుంది కదా! కాబట్టి సదా బాబా తోడులో ఉండడం మరియు సదా బాబా ఇచ్చిన శుద్ధ సంకల్పాలలో ఉండడం! ఈ రోజు వారి మురళి రోజువారీ కొరకు శుద్ధ సంకల్పాలు. మరి బాబా ద్వారా ఎన్ని శుద్ధ సంకల్పాలు లభించాయి! ఏదైనా మంచి వస్తువు లేదా శ్రేష్ఠమైన వస్తువు లభించినప్పుడు తేలికైన (తక్కువ రకపు) వస్తువును ఏమి చేస్తారు? సమాప్తం చేస్తారు కదా!
రోజంతా బుద్ధిని బిజీగా ఉంచడానికి రోజూ ఉదయాన్నే బాబా శుద్ధ సంకల్పాలను ఇస్తారు. ఎక్కడైతే శుద్ధమైనవి ఉంటాయో అక్కడ వ్యర్థమైనవి ఉండవు. బుద్ధిని ఖాళీగా ఉంచుతారు, అందుకే వ్యర్థమైనవి వస్తాయి. ఇదే సహజ ఉపాయము, సాధనము - సదా శుద్ధ సంకల్పాలతో బుద్ధిని బిజీగా ఉంచండి. కేవలం సంతోషంగా ఉండాలి అని మాత్రమే గుర్తుంచుకోకూడదు, కానీ ‘సదా సంతోషంగా’ ఉండాలి! ఇది ఆలోచించండి - బ్రాహ్మణులే సంతోషంగా ఉండకపోతే ఇంకెవరు ఉంటారు! బ్రాహ్మణులే శ్రేష్ఠమైనవారు కదా. దేవతల కంటే కూడా బ్రాహ్మణులే శ్రేష్ఠమైనవారు. బ్రాహ్మణుల ఆహారము సంతోషమే. అందుకే పాడుతారు - సంతోషం లాంటి ఆహారము ఇంకేదీ లేదని. ఎవరైనా సదా సంతోషంగా ఉంటే అడుగుతారు - మీకు ఏమి లభించింది! అని. మీరు లౌకిక జీవితం నుండి అలౌకిక జీవితం వారైపోయారు. కాబట్టి ఈ అలౌకికత యొక్క శోభ ముఖంలో కనిపిస్తూ ఉండాలి. అలా అని నేను లోపల నుండి అయితే సంతోషంగా ఉంటాను, బయటకు కనిపించడం లేదు అని కాదు. లోపల ఉన్నది బయటకు తప్పకుండా వస్తుంది. కాబట్టి సదా చెక్ చేసుకోండి - మన ముఖము మరియు ప్రవర్తన అలౌకికత యొక్క శోభను చూపిస్తున్నాయా? అచ్ఛా!
గ్రూప్ నం. 2
అచలంగా-నిశ్చలంగా అయ్యేందుకు రోజూ మూడు బిందువుల తిలకాన్ని ధరించండి
మిమ్మల్ని మీరు త్రికాలదర్శిగా అనుభవం చేసుకుంటున్నారా? సంగమయుగంలో బాబా అన్ని ఆత్మలను త్రికాలదర్శిగా తయారుచేస్తారు. ఎందుకంటే సంగమయుగము శ్రేష్ఠమైనది, ఉన్నతమైనది. కాబట్టి ఏ స్థానమైతే ఉన్నతంగా ఉంటుందో అక్కడ నిలబడడం వల్ల అంతా కనిపిస్తుంది. కాబట్టి సంగమయుగంలో నిలబడడం వల్ల మూడు కాలాలు కనిపిస్తాయి. ఒకవైపు దుఃఖధామం జ్ఞానం ఉంది, ఇంకోవైపు సుఖధామం జ్ఞానం ఉంది మరియు వర్తమాన కాలమైన సంగమయుగం జ్ఞానం కూడా ఉంది. కాబట్టి త్రికాలదర్శిగా అయిపోయారు కదా! మూడు కాలాల జ్ఞానం ఇమర్జ్ అయి ఉందా? మూడు కాలాలను స్మృతిలో ఉంచుకోండి - నిన్న దుఃఖధామంలో ఉంటిమి, ఈరోజు సంగమయుగంలో ఉన్నాము మరియు రేపు సుఖధామానికి వెళ్తాము. ఏ కర్మ చేసినా త్రికాలదర్శిగా అయి చేయండి, అప్పుడు ప్రతి కర్మ శ్రేష్ఠంగా ఉంటుంది. వ్యర్థంగా అవ్వదు, సమర్థంగా ఉంటుంది! సమర్థ కర్మ యొక్క ఫలం సమర్థంగా లభిస్తుంది. త్రికాలదర్శిగా అవ్వడం వల్ల ‘ఇది ఎందుకు జరిగింది, ఇది ఏమి జరిగింది, ఇలా కాదు అలా జరిగి ఉండాల్సింది’... ఈ క్వశ్చన్ మార్క్లన్నీ సమాప్తమైపోతాయి. లేకపోతే చాలా ప్రశ్నలు వస్తాయి . ‘ఎందుకు’ అనే క్వశ్చన్ రావడం వల్ల వ్యర్థ సంకల్పాల క్యూ (లైన్) వస్తుంది మరియు త్రికాలదర్శిగా అవ్వడం వల్ల ఫుల్స్టాప్ పడిపోతుంది. నథింగ్ న్యూ, కాబట్టి ఫుల్స్టాప్ పడిపోయింది కదా! ఫుల్స్టాప్ అంటే బిందువు పెట్టడం వల్ల బిందు రూపం సహజంగా గుర్తుకు వస్తుంది.
బాప్‌దాదా సదా చెబుతారు - అమృతవేళ సదా మూడు బిందువుల తిలకం ధరించండి. మీరు కూడా బిందువే, బాబా కూడా బిందువే మరియు ఏది జరిగిపోయిందో, ఏది జరుగుతోందో, నథింగ్ న్యూ, కాబట్టి ఫుల్స్టాప్ కూడా బిందువే. ఈ మూడు బిందువుల తిలకము అంటే స్మృతి యొక్క తిలకము. మస్తకము స్మృతి యొక్క స్థానము, అందుకే తిలకాన్ని మస్తకం పైన ధరిస్తారు. మూడు బిందువుల తిలకం ధరించడం అంటే స్మృతిలో ఉంచుకోవడం. అప్పుడు రోజంతా అచలంగా-నిశ్చలంగా ఉంటారు. ఈ ‘ఎందుకు’ మరియు ‘ఏమిటి’ అనేవే అలజడి. కాబట్టి అచలంగా ఉండేందుకు సాధనము - అమృతవేళ మూడు బిందువుల తిలకాన్ని ధరించండి. దీనిని మరచిపోకండి. ఏ సమయంలోనైనా ఏ విషయమైనా జరిగితే అప్పుడే ఫుల్స్టాప్ పెట్టండి. అలా అని గుర్తు ఉండింది కానీ ఆ సమయంలో మరచిపోయాను అని అనకూడదు. బండిలో సమయానికి బ్రేక్ పడకపోతే లాభం జరుగుతుందా లేక నష్టం జరుగుతుందా? కాబట్టి సమయానికే ఫుల్స్టాప్ పెట్టండి. నథింగ్ న్యూ జరగాల్సి ఉండింది, జరుగుతోంది. మరియు సాక్షిగా అయి చూస్తూ ముందుకు సాగిపోండి. కాబట్టి త్రికాలదర్శి అంటే ఆది, మధ్య, అంతము మూడింటినీ తెలుసుకొని సమయానికి తగినట్లుగా మిమ్మల్ని మీరు సదా సేఫ్‌గా ఉంచుకోగలగాలి. అలా అని ఈ సమస్య చాలా పెద్దదిగా ఉండింది కదా, చిన్నదై ఉంటే నేను పాస్ అయిపోయేదాన్ని కానీ సమస్య చాలా పెద్దదిగా ఉండింది! అని అనకండి. ఎంత పెద్ద సమస్య అయినా కానీ మీరైతే మాస్టర్ సర్వశక్తిమంతులు కదా! కాబట్టి మీరు పెద్దవారా కాదా! పెద్దవారి ఎదుట సమస్య అనేది ఉండదు కానీ ఆటగా ఉంటుంది! వీరిని త్రికాలదర్శి అని అంటాము. త్రికాలదర్శి ఆత్మ సదా నిశ్చింతగా ఉంటుంది, ఎందుకంటే ‘మన విజయం నిశ్చయంగా జరిగే ఉంది’ అనే నిశ్చయం వారికి ఉంటుంది.
మిమ్మల్ని మీరు బాధ్యులుగా అనుకున్నప్పుడు చింత కలుగుతుంది మరియు బాబాను బాధ్యునిగా అనుకుంటే నిశ్చింతగా అయిపోతారు. చాలాసార్లు అంటారు కదా - ఏమి చేయాలి, బాధ్యత ఉంది కదా, నిభాయించాల్సి వస్తుంది అని. కానీ ట్రస్టీగా అయి నిభాయించండి. గృహస్థునిగా అయి నిభాయించలేరు. ట్రస్టీగా అయి నిభాయించడం వల్ల సహజంగానూ అవుతుంది మరియు సఫలత కూడా లభిస్తుంది. కాబట్టి చింతలన్నీ వదిలేసి వెళ్ళండి. ఎవరి దగ్గరైనా కొద్దో గొప్పో ఉంటే వదిలేసి వెళ్ళండి, వెంట తీసుకెళ్ళకండి. ఎలాగైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఏదో ఒకటి వదిలి వస్తారు కదా. మరి ఇది కూడా మహాన్ తీర్థయాత్ర కదా! కాబట్టి సదా కొరకు నిశ్చింతగా, నిశ్చయబుద్ధిగా ఉండండి. అర్థమైందా? చెత్తను వెంట ఉంచుకోవడం జరగదు. మాతలకు అలవాటు ఉంటుంది - పాత వస్తువు ఉన్నా మూటగట్టి ఉంచుకుంటారు! కాబట్టి దీనిని కూడా మూటగట్టుకుని వెళ్ళకండి. మాతలు మూటగడతారు, పాండవులు జేబులో ఉంచుకుంటారు. కాబట్టి దీనిని వదిలేసి నిశ్చింతగా అంటే సదా అచలంగా-నిశ్చలంగా స్థితిలో ఉండండి. అచ్ఛా!
గ్రూప్ నం. 3
సఫలతామూర్తులుగా అయ్యేందుకు సాధనము - జీవన్ముక్త స్థితి
బ్రాహ్మణ జీవితము అంటే సదా జీవన్ముక్త స్థితి ఉన్నవారు, సర్వ బంధనాల నుండి ముక్తులు. మొదటి బంధనము తమ దేహాభిమానం యొక్క బంధనము. బ్రాహ్మణ జీవితంలో దేహం యొక్క బంధనము, సంబంధం యొక్క బంధనము, సాధనాల యొక్క బంధనము అంతా సమాప్తమైపోయింది కదా! లావు దారము సమాప్తమైపోయింది. సన్నని దారము ఏమైనా మిగిలి ఉందా? ఇప్పుడు సంబంధం ఉంది కానీ బంధనము లేదు. బంధనము తన వశం చేసుకుంటుంది మరియు సంబంధము స్నేహం యొక్క సహయోగాన్ని ఇస్తుంది. కానీ శుద్ధమైన సంబంధము. దేహం యొక్క సంబంధీకులతో దైహిక సంబంధం కాదు కానీ ఆత్మిక సంబంధము. మరి బంధనంలో ఉన్నారా లేక సంబంధంలో ఉన్నారా? ఒకవేళ వశమైపోతే, పరవశమైపోతే బంధనము, మరియు ముక్తులుగా ఉంటే సంబంధము! ఎలా ఉంటున్నారు? కొద్దిగా ఆకర్షితులవుతున్నారా? బ్రాహ్మణులు అంటే జీవన్ముక్తులు. కాబట్టి చెక్ చేసుకోండి - ఏ కర్మ అయినా ముక్తులుగా అయి చేస్తున్నారా? ఎందుకంటే కర్మ లేకుండా అయితే ఉండలేరు, కర్మేంద్రియాల ఆధారము ఉన్నప్పుడు కర్మ అయితే చేయాల్సిందే, కానీ కర్మబంధనము కాదు, కర్మసంబంధము. జీవన్ముక్త అవస్థ అంటే సఫలత కూడా ఎక్కువగా ఉంటుంది మరియు కర్మ యొక్క బరువు కూడా ఉండదు. ఎవరైతే ముక్తులుగా ఉన్నారో వారు సదా సఫలతామూర్తులు. జీవన్ముక్త ఆత్మ సదా గర్వంగా చెబుతుంది - ‘సఫలత నా జన్మసిద్ధ అధికారము’ అని. ఎవరైతే బంధనంలో ఉంటారో వారు సదా ఆలోచిస్తూ ఉంటారు - ‘సఫలత లభిస్తుందా లేదా, ఇది చేయాలా వద్దా, సరిగ్గా ఉంటుందా ఉండదా?’ అని. కానీ బ్రాహ్మణ ఆత్మల సఫలత నిశ్చితం, విజయం నిశ్చితం.
అంతేకానీ భవిష్యత్తులో జీవన్ముక్తులుగా అవుతాము అని అనుకోకండి! ఇప్పుడే జీవన్ముక్తులుగా అవ్వాలి. ఈ సమయంలోనే జీవనబంధనము మరియు జీవన్ముక్తి యొక్క జ్ఞానం ఉంది! సత్యయుగంలో ఈ జ్ఞానం ఉండదు! మజా ఉంది అంటే ఈ సమయానిదే! జీవన బంధనాన్ని కూడా అనుభవం చేశారు మరియు జీవన్ముక్తిని కూడా అనుభవం చేస్తున్నారు! సదా జీవన్ముక్తులుగా ఉండేందుకు సహజ సాధనము - ‘నేను’ మరియు ‘నా బాబా’! ఎందుకంటే నాది-నాది అనేదే బంధనము. నా బాబా అని అయిపోతే ఇక నాది అంతా సమాప్తం. ఎప్పుడైతే ‘ఒక్క నా బాబా’లో ‘అంతా నాది-నాది’ సమాప్తమైపోయిందో, అప్పుడు బంధనముక్తులుగా అయిపోయారు. మరి ఈ సహజ సాధనము వచ్చు కదా! కర్మ చేయడానికి కంటే ముందు చెక్ చేసుకోండి - బంధనంలో చిక్కుకుని కర్మ చేయడం లేదు కదా? ప్రపంచం వారైతే ముక్తిని పొందడానికి చాలా కఠినమైన తపస్సు చేస్తారు. మరి మీకు సహజంగా లభించింది కదా! ‘నా బాబా’ అని అన్నారు, బంధనము సమాప్తం. కాబట్టి ఏది సహజంగా ఉంటుందో దానిని సదా అవలంబిస్తారు. ఏది కష్టంగా ఉంటుందో దానిని సదా చేయలేరు. మరి సదా సహజంగా ఉందా లేక ఎప్పుడైనా కొద్దిగా కష్టంగా అనిపిస్తోందా? కాబట్టి ఇదే గుర్తుంచుకోండి - మేము బ్రాహ్మణులము జీవన్ముక్త ఆత్మలము. సహజయోగి అంటే సఫలతామూర్తి. అచ్ఛా!
గ్రూప్ నం. 4
స్వమానంలో ఉంటే సర్వ హద్దు కోరికలూ సమాప్తమైపోతాయి
మిమ్మల్ని మీరు శ్రేష్ఠమైన స్వమానధారీ ఆత్మగా అనుభవం చేసుకుంటున్నారా? ఎంతగా స్వమానంలో స్థితి అయి ఉంటారో, అంతగా స్వమానము దేహాభిమానాన్ని మరచిపోయేలా చేస్తుంది. అర్థకల్పం దేహాభిమానంలో ఉన్నారు మరియు దేహాభిమానం కారణంగా అల్పకాలిక గౌరవాన్ని పొందే బికారులుగా ఉన్నారు. ఇప్పుడు బాబా వచ్చి స్వమానధారీగా తయారుచేశారు. స్వమానంలో స్థితి కలిగి ఉంటున్నారా లేక ఎప్పుడైనా హద్దు యొక్క గౌరవం యొక్క కోరిక ఉంచుకుంటున్నారా? ఎవరైతే స్వమానంలో ఉంటారో వారికి హద్దు యొక్క గౌరవాన్ని పొందాలనే కోరిక ఎప్పుడూ ఉండదు, ‘ఇచ్ఛా మాత్రమ్ అవిద్య’గా అయిపోతారు. ఒక్క స్వమానంలో సర్వ హద్దుల కోరికలూ ఇమిడిపోతాయి, అడగాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ హద్దు యొక్క కోరికలు ఎప్పుడూ పూర్తవ్వవు. ఒక హద్దు యొక్క కోరిక అనేక కోరికలను ఉత్పన్నం చేస్తుంది, సంపూర్ణం చేయదు కానీ పుట్టిస్తుంది. స్వమానము సర్వ కోరికలనూ సహజంగానే సంపూర్ణం చేసేస్తుంది. మరి బాబా సదా కొరకు స్వమానాన్ని ఇచ్చినప్పుడు, ఎప్పుడో ఒకసారి ఎందుకు తీసుకోవాలి! స్వమానధారీ సదా నిశ్చింత చక్రవర్తిగా ఉంటారు, సర్వ ప్రాప్తి స్వరూపంగా ఉంటారు. వారికి అప్రాప్తి యొక్క అవిద్య ఉంటుంది. కాబట్టి సదా ‘నేను స్వమానధారీ ఆత్మను’ అని గుర్తుంచుకోండి. స్వమానధారీ సదా బాబా యొక్క హృదయ సింహాసనాధికారిగా ఉంటారు, ఎందుకంటే నిశ్చింత చక్రవర్తి! చక్రవర్తి యొక్క జీవితం ఎంత శ్రేష్ఠమైనది! ప్రపంచం వారి జీవితంలో ఎంత చింత ఉంటుంది - లేచినా చింతే, నిద్రపోయినా చింతే. కానీ మీరు సదా నిశ్చింతగా ఉన్నారు.
పాండవులకు చింత ఉంటుందా? రేపు వ్యాపారం సరిగ్గా ఉంటుందో ఉండదో, రేపు దేశంలో శాంతి ఉంటుందో అశాంతి ఉంటుందో... ఈ చింత ఉంటుందా? రేపు పిల్లలను సరిగ్గా చూసుకోగలమో లేదో అనే ఈ చింత మాతలకు ఉంటుందా? ప్రపంచంలో ఏమైనా కానీ, అశాంతి యొక్క వాయుమండలంలో మీరైతే శాంత స్వరూప ఆత్మలు, ఇతరులకు కూడా శాంతిని ఇచ్చేవారు. లేక అశాంతి ఉంటే మీరు కూడా భయపడిపోతారా? మీ ఇంటి బయట చాలా గందరగోళం జరుగుతుంటే, మీరు ఆ సమయంలో ఏమి చేస్తారు? స్మృతిలో కూర్చుంటారు కదా! బాబాను స్మృతి చేసి శాంతిని తీసుకుని ఇతరులకు ఇవ్వడం - ఈ సేవ చేయండి. ఎందుకంటే ఏ మంచి వస్తువు తన వద్ద ఉందో మరియు ఇతరులకు దాని అవసరం ఉందో, దానిని ఇవ్వాలి కదా! కాబట్టి అశాంతి సమయంలో మాస్టర్ శాంతిదాతగా అయి ఇతరులకు కూడా శాంతిని ఇవ్వండి, భయపడకండి. ఎందుకంటే, ఏది జరుగుతోందో అది మంచిదే మరియు ఏది జరగాలో అది ఇంకా మంచిది అని తెలుసు! వికారాలకు వశమైన మనుషులైతే పోట్లాడుకుంటూనే ఉంటారు. వారి పనే అది. కానీ మీ పని అలాంటి ఆత్మలకు శాంతిని ఇవ్వడం. ఎందుకంటే విశ్వకళ్యాణకారులు కదా! విశ్వకళ్యాణకారి ఆత్మలు సదా మాస్టర్ దాతగా అయి ఇస్తూ ఉంటారు. మరి అందరూ శక్తి స్వరూపులు కదా! మాతలు నాలుగు గోడల మధ్య ఉండే అబలలు కారు, శక్తులు. కాబట్టి శక్తి సదా వరదానిగా ఉంటుంది మరియు పాండవులు కూడా సదా మహావీరులు. మహావీరుడికి సదా విజయం ఉంటుంది. ఎప్పుడూ ఓటమి చెందలేరు. అచ్ఛా!
గ్రూప్ నం. 5
సంపన్నంగా అయ్యేందుకు సహజ సాధనము - సదా బాబాతో ఉండండి
(డబల్ విదేశీ పిల్లలతో) సదా మిమ్మల్ని మీరు ఈ సృష్టి డ్రామా యొక్క అనంతమైన స్టేజ్ పైన పాత్రను అభినయించే హీరో యాక్టర్లుగా భావిస్తున్నారా? అత్యున్నతమైన బాబాతో పార్ట్ అభినయించే అత్యున్నతమైన యాక్టర్లుగా అయిపోయారు కదా. బాబాతో పాత్రను అభినయిస్తున్నారు, అందుకే విశేష పాత్రధారులుగా అయిపోయారు. హీరో యాక్టర్పైన అందరి దృష్టి ఉంటుంది. మరి సమస్త విశ్వం యొక్క ఆత్మల దృష్టి ఇప్పుడు మీ అందరి వైపే ఉంది! కాబట్టి ఒక నషా ఏమిటంటే - ‘మేము బాబాతో కలిసి పాత్రను అభినయించేవారము’ అని, రెండవ నషా - ‘సమస్త విశ్వం యొక్క దృష్టి శ్రేష్ఠ ఆత్మలమైన మాపైన ఉంది’ అని! కాబట్టి డబల్ నషా ఉంది. డబల్ సంతోషం ఉంది - ఒకటేమో శ్రేష్ఠ ఆత్మగా అయ్యే సంతోషం, రెండవది బాబాను కలిసేది! డబల్ హీరో - ఒకటి రత్న సమానమైన జీవితాన్ని తయారుచేసుకున్నారు మరియు రెండవది విశేష పాత్రధారీ! ‘నేను ఇంత విశేష పాత్ర అభినయించే ఆత్మను’ అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించలేదు కానీ సెకనులో అయిపోయారు. సెకనులో చేసే బేరము కదా! సహజంగా లభించిందా లేక శ్రమ పట్టిందా? ఫారెన్ కల్చర్ నుండి బ్రాహ్మణ కల్చర్‌కు మారడంలో శ్రమ పట్టలేదా? ఎన్నిసార్లు బ్రాహ్మణ కల్చర్‌లో ఉన్నారు? అనేకసార్లు పొందిన సంస్కారాలు గుర్తుకు వస్తున్నాయా? లేక ఇమర్జ్ చేయడంలో శ్రమ పడుతోందా? ఈ సమ్‌టైమ్ (అప్పుడప్పుడు) అనేది ఎప్పటివరకు ఉంటుంది? ఒకవేళ ఇప్పుడే వినాశనం అయిపోతే ఎవరెడీగా అయ్యారా? అచ్ఛా!
భారత్వాసులు తయారయ్యారా? రేపే వినాశనం అయిపోతే అంత సంపన్నంగా అయ్యారా? ఎవరెడీగా అవ్వడమే సేఫ్టీకి సాధనము. ఒకవేళ సమయం లభిస్తే సంగమయుగం యొక్క మజాను జరుపుకోండి కానీ ఎవరెడీగా ఉండండి. ఎందుకంటే ఫైనల్ వినాశనం యొక్క డేట్ ఎప్పుడూ ముందుగా తెలియదు, హఠాత్తుగా జరుగుతుంది. ఎవరెడీగా ఉండకపోతే మోసపోతారు. అందుకే ఎవరెడీగా అవ్వండి. సదా ఇది గుర్తుంచుకోండి - ‘నేను మరియు బాబా సదా తోడుగా ఉన్నాము’. కాబట్టి బాబా ఎలాగైతే సంపన్నంగా ఉన్నారో, అలాగే తోడుగా ఉండేవారు కూడా సంపన్నంగా అయిపోతారు. తోడు యొక్క అనుభవం చేసుకున్నప్పుడు నిరంతర యోగిగా సహజంగా అయిపోతారు. సదా తోడుగా ఉన్నారు, తోడుగా ఉంటారు మరియు స్వీట్ హోమ్‌కు తోడుగా వెళ్తారు. ఎవరైతే సహచరుడిగా (కంపానియన్) ఉంటారో వారు తోడుగా వెళ్తారు, మరియు ఎవరైతే ఊరేగింపులో వెళ్ళే జనం ఉంటారో, చూసేవారిగా ఉంటారో వారు వెనుక వెనుక వెళ్తారు. సమానంగా అయ్యేవారే తోడుగా వెళ్తారు. కాబట్టి సమానంగా అవ్వాల్సిందే మరియు తోడుగా వెళ్లాల్సిందే అని ప్లాన్ తయారుచేయండి. అచ్ఛా! (డబల్ విదేశీ పిల్లలతో) అందరికీ బాప్‌దాదా వైపు నుండి కొత్త సంవత్సరం అభినందనలు మరియు ప్రియస్మృతులు ఇవ్వండి. బాప్‌దాదా చూస్తున్నారు - అందరూ తమను తాము బాబా సమానంగా తయారుచేసుకునే ఉల్లాస-ఉత్సాహాలలో ఎగురుతున్నారు. కాబట్టి ఎగురుతున్నారు మరియు సదా ఎగురుతూనే ఉంటారు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
