‘‘సత్యమైన స్నేహీగా అయ్యి ఒక్క తండ్రి ద్వారా సర్వ సంబంధాలను సాకారములో అనుభవము చేయండి’’
ఈరోజు విశ్వ స్నేహీ అయిన బాప్‌దాదా తమ అతి స్నేహీ, సదా తండ్రికి సహచరులు మరియు సహయోగులైన ఆత్మలను చూస్తున్నారు. నలువైపులా ఉన్న బ్రాహ్మణ ఆత్మలందరూ తప్పకుండా స్నేహీలే. స్నేహము బ్రాహ్మణ జీవితములో పరివర్తనను తీసుకువచ్చింది. అయినా కూడా స్నేహీలలో మూడు రకాలవారు ఉన్నారు - ఒకరు స్నేహం చేసేవారు, రెండవవారు స్నేహాన్ని నిర్వర్తించేవారు మరియు మూడవవారు స్నేహములో ఇమిడిపోయేవారు. ఇమిడిపోవడము అనగా సమానముగా అవ్వడము. స్నేహం చేసేవారు ఒక్కోసారి స్నేహం చేస్తారు కానీ స్నేహం చేస్తూ-చేస్తూ ఒక్కోసారి ఆ స్నేహము తెగిపోతుంది, ఒక్కోసారి జోడించబడుతుంది, అందుకే ఎప్పటికప్పుడు స్నేహాన్ని జోడించడానికి పురుషార్థము చేయాల్సి వస్తుంది ఎందుకంటే తండ్రితోపాటుగా ఇంకా ఎక్కడైనా స్నేహము ఉన్నట్లయితే, అది వ్యక్తుల పట్ల అయినా లేక ప్రాకృతిక సాధనాల పట్ల అయినా, అలా ఎక్కడైనా సంకల్పమాత్రమైనా కూడా స్నేహము జోడింపబడి ఉన్నట్లయితే తండ్రితో స్నేహము చేసేవారి లిస్ట్‌లోకి వస్తారు. స్నేహానికి గుర్తు ఏమిటంటే - ఎటువంటి శ్రమ లేకుండా స్నేహితుని వైపుకు స్నేహము స్వతహాగానే వెళ్తుంది. స్నేహం చేసే ఆత్మ ప్రతి సమయము, ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితిలో ఆధారాన్ని అనుభవము చేస్తుంది. ఒకవేళ సాధనాల పట్ల స్నేహము ఉన్నట్లయితే ఆ సమయములో తండ్రి కన్నా కూడా ఎక్కువగా సాధనాల సహాయము అనగా ఆధారము అనుభవమవుతుంది. ఆ సమయములో ఆ ఆత్మకు సంకల్పములో తండ్రి స్నేహము గుర్తుకొస్తుంది కూడా, తండ్రి స్నేహము శ్రేష్ఠమైనదని ఆలోచిస్తారు కూడా కానీ ఈ సాధనము లేక వ్యక్తి యొక్క ఆధారము కూడా తప్పకుండా అవసరము అని అనుకుంటారు, అందుకే రెండు వైపులా స్నేహము అసంపూర్ణమవుతుంది మరియు పదే-పదే స్నేహము జోడించాల్సి వస్తుంది. ఒకే బలము, ఒకే నమ్మకము అన్నదానికి బదులుగా మరోదానిపై నమ్మకము పెట్టుకోవడము కూడా తప్పకుండా అవసరము అని అనిపిస్తుంది. అందుకే తండ్రి స్నేహము ద్వారా సర్వ ప్రాప్తుల అనుభవము ఏదైతే ఉంటుందో, దానికి బదులుగా ఇతర ఆధారాల ద్వారా కలిగే అల్పకాలికమైన ప్రాప్తి తనవైపుకు ఆకర్షితము చేస్తుంది. ఎంతగా ఆకర్షిస్తుందంటే ఇక దానినే అత్యంత అవసరము అని భావించడము మొదలుపెడతారు. దానిని ఆకర్షణ అని అనుకోరు కానీ ఆధారము అని భావిస్తారు. ఇటువంటివారిని స్నేహము చేసేవారు అని అంటాము.
రెండవవారు స్నేహాన్ని నిర్వర్తించేవారు. వారికి స్నేహము చేయడంతోపాటు దానిని నిర్వర్తించే శక్తి కూడా ఉంటుంది. నిర్వర్తించటము అనగా స్నేహానికి రెస్పాన్స్ ఇవ్వటము, రిటర్న్ ఇవ్వటము. స్నేహానికి రిటర్న్ ఏమిటంటే, స్నేహీ తండ్రి పిల్లల పట్ల ఏ శ్రేష్ఠ ఆశలనైతే పెట్టుకుంటారో, ఆ అన్ని ఆశలను ప్రాక్టికల్‌లో పూర్తి చెయ్యటము. స్నేహాన్ని నిర్వర్తించేవారు చాలావరకు ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తారు, కానీ సదా తండ్రి సమానంగా అనగా ఇమిడిపోయి ఉండే ఆ అనుభూతి అప్పుడప్పుడు జరుగుతుంది, అప్పుడప్పుడు జరగదు. అయినా కూడా నిర్వర్తించేవారు సమీపంగా ఉంటారు, కానీ సమానంగా ఉండరు. స్నేహాన్ని నిర్వర్తించేవారికి అది నిర్వర్తించినందుకు రిటర్న్‌లో పదమా రెట్ల ధైర్యము మరియు ఉల్లాస-ఉత్సాహాల సహాయము అనేది విశేషంగా తండ్రి ద్వారా లభిస్తూ ఉంటుంది. మూడవవారు, ఎవరైతే స్నేహములో ఇమిడిపోయి ఉంటారో ఆ ఆత్మల నయనాలలో, మాటలలో, సంకల్పాలలో, ప్రతి కర్మలో సహజంగా మరియు స్వతహాగా స్నేహీ తండ్రి యొక్క తోడు సదా అనుభవమవుతుంది. తండ్రి వారి నుండి వేరుగా ఉండరు మరియు వారు తండ్రి నుండి వేరుగా ఉండరు. ప్రతి సమయము తండ్రి పట్ల ఉన్న స్నేహానికి రిటర్న్‌లో ప్రాప్తించిన సర్వ ప్రాప్తులతో సంపన్నంగా మరియు సంతుష్టంగా ఉంటారు, అందుకే మరే ఇతర ఆధారము వారిని ఆకర్షితము చెయ్యలేదు ఎందుకంటే ఏదైనా అల్పకాలికమైన ప్రాప్తి యొక్క అవసరమనేది ఇతరులెవరినో ఆధారంగా చేస్తుంది అనగా సంపూర్ణ స్నేహములో తేడా తీసుకొస్తుంది. స్నేహములో ఇమిడి ఉన్న ఆత్మలు సదా సర్వ ప్రాప్తి సంపన్నులుగా ఉన్న కారణంగా సహజంగానే ‘ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు’ అన్న అనుభూతిలో ఉంటారు. కనుక అందరూ స్నేహీలే కానీ మూడు రకాల వారు ఉన్నారు. ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోండి - నేను ఎవరిని. మీ గురించి మీరు తెలుసుకోగలరు కదా. స్నేహీలు కావుననే స్నేహము కారణంగా బ్రాహ్మణ జీవితంలో నడుస్తున్నారు. కానీ స్నేహముతోపాటు దానిని నిర్వర్తించే శక్తి ఉండటము, ఇందులో నంబరువారుగా ఉంటారు. స్నేహముతో పాటు శక్తి కూడా అవసరము. ఎవరిలోనైతే స్నేహము మరియు శక్తి, రెండింటి బ్యాలెన్స్ ఉంటుందో, వారే తండ్రి సమానంగా అవుతారు. ఇలా స్నేహములో ఇమిడిపోయే ఆత్మలకు ఎలా అనుభవమవుతుందంటే - వారికి తండ్రి స్నేహము నుండి దూరమవ్వటమనేది కష్టము. స్నేహములో ఇమిడిపోవటము సహజము, దూరమవ్వటము కష్టము ఎందుకంటే ఇమిడిపోయే ఆత్మలకు ఒక్క తండ్రియే ప్రపంచము.
ప్రపంచములో ఆకర్షించే విషయాలు రెండే ఉంటాయి - ఒకటి వ్యక్తుల సంబంధాలు మరియు రెండవది రకరకాల వైభవాలు లేక సాధనాల ద్వారా ప్రాప్తి లభించడము. స్నేహములో ఇమిడిపోయి ఉండే ఆత్మలకు సర్వ సంబంధాల రసానుభూతి ఒక్క తండ్రి ద్వారా సదా కలుగుతుంటుంది. సర్వ ప్రాప్తులకు ఆధారము ఒక్క తండ్రియే, అంతేకానీ వైభవాలు లేక సాధనాలు కాదు. వైభవాలు మరియు సాధనాలు అనేవి రచన మరియు తండ్రి రచయిత. ఎవరికైతే స్వయంగా రచయితనే ఆధారముగా ఉన్నారో, వారికి రచన ద్వారా లభించే అల్పకాలికమైన ప్రాప్తి గురించి స్వప్నమాత్రము కూడా సంకల్పము కలగదు. బాప్‌దాదాకు అప్పుడప్పుడు పిల్లల స్థితిని చూసి నవ్వు వస్తుంటుంది ఎందుకంటే ఆశ్చర్యము అని చెప్పలేము, ఫుల్స్టాప్ ఉంటుంది. నడుస్తూ-నడుస్తూ బీజాన్ని వదిలేసి కొమ్మలు-రెమ్మలకు ఆకర్షితులవుతారు. ఏదో ఒక ఆత్మను ఆధారంగా చేసుకుంటారు, ఏవో సాధనాలను ఆధారంగా చేసుకుంటారు ఎందుకంటే బీజము యొక్క రూపము, రంగు శోభాయమానంగా ఉండవు మరియు కొమ్మలు-రెమ్మలు యొక్క రూపము, రంగు చాలా శోభాయమానంగా ఉంటాయి. దేహధారుల సంబంధము యొక్క ఆధారము దేహ-భానములో సహజంగా అనుభవమవుతుంది మరియు తండ్రి యొక్క ఆధారము దేహ-భానము నుండి దూరమవ్వటంతో అనుభవమవుతుంది. దేహ-భానములోకి వచ్చే అలవాటైతే ఉండనే ఉంది. వద్దనుకున్నా కానీ అలా ఉంటారు, అందుకే దేహధారుల సంబంధము యొక్క ఆధారము సహజంగా అనుభవమవుతుంది. ఇది రైట్ కాదు అని అనుకుంటారు కూడా, అయినా కూడా ఆధారంగా చేసుకుంటారు. బాప్‌దాదా దీనిని చూస్తూ నవ్వుకుంటుంటారు. ఆ సమయములోని స్థితి నవ్వు తెప్పించేదిగా ఉంటుంది. ఏ విధంగా మీరు క్లాసుల్లో లేక మీ భాషణల్లో ఒక చిలుక కథను వినిపిస్తారు కదా - నీటి కుళాయిపై కూర్చోవద్దని దానికి చెప్పారు, కానీ అది కుళాయిపై కూర్చునే కుళాయిపై కూర్చోవద్దు అని చెప్తుంటుంది. అలాగే పిల్లలు కూడా ఆ సమయములో మనసులో ఒక వైపేమో ఇలా ఆలోచిస్తుంటారు - ‘ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు’ అని, పదే-పదే తమలో తాము ఇది రిపీట్ కూడా చేస్తుంటారు కానీ దానితో పాటు ఇలా కూడా ఆలోచిస్తుంటారు - స్థూలంలో అయితే ఆధారము కావాలి కదా అని. మరి ఆ సమయములో నవ్వు వస్తుంది కదా మరియు ఆ సమయములో ఇక మాయ అవకాశము తీసుకుంటుంది. బుద్ధిని ఎలా మార్చేస్తుందంటే అసత్యమైన ఆధారమే సత్యమైన ఆధారముగా అనుభవమవుతుంది. ఏ విధంగా ఈ రోజుల్లో నకిలీది నిజమైనదానికంటే కూడా మంచిగా అనిపిస్తుంది, అలా ఆ సమయంలో తప్పు, ఒప్పుగా అనిపిస్తుంది. మరియు ఆ తప్పుడు విషయము, అసత్యమైన ఆధారము దానిని పక్కా చేసేందుకు లేక ఆ అసత్యాన్ని సత్యంగా నిరూపించేందుకు, ఎలా అయితే ఏదైనా స్థానము బలహీనంగా ఉంటే దాన్ని దృఢంగా చేయడానికి పిల్లర్ వేయడం జరుగుతుంది, అలాగే మాయ కూడా బలహీన సంకల్పాన్ని దృఢంగా చేసేందుకు చాలా రాయల్ పిల్లర్ వేస్తుంది. ఏ పిల్లర్ వేస్తుంది? మాయ ఎటువంటి సంకల్పాలను కలిగిస్తుందంటే - ఇలా అయితే జరుగుతూనే ఉంటుంది, చాలామంది పెద్ద-పెద్దవారు కూడా ఇలాగే చేస్తారు, ఇలాగే నడుస్తారు, లేదా ఇలా అంటారు - ఇప్పుడైతే పురుషార్థులమే, సంపూర్ణంగా అయితే అవ్వలేదు కావున తప్పకుండా ఇప్పుడు ఏదో ఒక లోపమైతే ఉండనే ఉంటుంది, మున్ముందు సంపూర్ణంగా అవుతాము అని అనుకుంటారు - ఇటువంటి వ్యర్థ సంకల్పాల రూపీ పిల్లర్ బలహీనతను గట్టిపరుస్తుంది. కనుక ఇటువంటి పిల్లర్‌ను ఆధారంగా చేసుకోకూడదు. సమయము వచ్చినప్పుడు ఈ నకిలీ పిల్లర్ మోసగిస్తుంది. సర్వ సంబంధాల ఆధారముగా సదా ఒక్క తండ్రే ఉండాలి అనే ఆ అనుభవాన్ని తక్కువగా చేస్తారు. ఈ సర్వ సంబంధాల అనుభవాన్ని పెంచండి. సర్వ సంబంధాల అనుభూతి తక్కువైన కారణంగా ఎక్కడో అక్కడ అల్పకాలికమైన సంబంధము జోడించబడుతుంది. స్థూల జీవితములో కూడా స్థూల రూపములో ఆధారాన్ని లేక ప్రతి పరిస్థితిలో స్థూల రూపములో సహయోగాన్ని ఇచ్చే ఆధారము తండ్రినే. ఈ అనుభవాన్ని ఇంకా పెంచండి. తండ్రి అయితే సూక్ష్మంగా మాత్రమే సహయోగాన్ని ఇచ్చేవారు అని అనుకోకండి. వారు నిరాకారుడు, ఆకారుడు, అంతేకానీ సాకారుడైతే కాదు, కానీ వారితో ప్రతి సంబంధాన్ని సాకార రూపములో అనుభవము చేయగలరు. సాకార స్వరూపములో తోడు యొక్క అనుభవము చేయగలరు. ఈ అనుభూతిని లోతుగా అర్థం చేసుకోండి మరియు స్వయాన్ని ఇందులో దృఢంగా చేసుకోండి. అప్పుడు వ్యక్తులు, వైభవాలు లేక సాధనాలు తమవైపుకు ఆకర్షితము చెయ్యవు. సాధనాలను నిమిత్తమాత్రంగా కార్యములో వినియోగించటము మరియు సాక్షీగా అయ్యి సేవ కోసం కార్యములో పెట్టడము - ఇటువంటి అనుభూతిని పెంచండి. ఆధారంగా చేసుకోవద్దు, నిమిత్తమాత్రముగా ఉండాలి. ఇటువంటివారినే స్నేహములో ఇమిడిపోయి ఉండే సమాన ఆత్మలు అని అంటాము. కనుక నేను ఎవరిని అని మీకు మీరు ఆలోచించుకోవాలి. అర్థమైందా? అచ్ఛా!
సదా స్నేహములో ఇమిడిపోయి ఉండే సమాన ఆత్మలకు, సదా ఒక్క తండ్రి నుండి సర్వ సంబంధాలను అనుభవము చేసే ఆత్మలకు, సదా ఒక్క తండ్రిని ఆధారమూర్తిగా, సత్యమైన ఆధారముగా అనుభవము చేసే ఆత్మలకు, సదా సర్వ ప్రాప్తులను రచయిత అయిన తండ్రి ద్వారా అనుభవము చేసే ఆత్మలకు, సదా సహజంగా, స్వతహాగా ‘ఒకే బలము, ఒకే నమ్మకము’ను అనుభవము చేసే సత్యమైన స్నేహీ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో మిలనము:- సదా ఇమిడిపోయి ఉంటారా లేక స్మృతి చేసేందుకు శ్రమ చెయ్యాల్సి ఉంటుందా? ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ కనిపించరు. కథలు వినేటప్పుడు నవ్వు వస్తుంది కదా. కథ నడుస్తూ ఉన్నంత సమయం తమకేమైందో తమకే అర్థం కాదు మరియు ఎప్పుడైతే కథ పూర్తయిపోతుందో, అప్పుడు ఆలోచిస్తారు - ఏమిటి ఇలా జరిగింది? అది నేనేనా లేక ఇంకెవరైనానా. ఇలా అనుకుంటారు ఎందుకంటే ఆ సమయములో పరవశమవుతారు కదా. పరవశమైనవారికి తమ స్పృహ ఉండదు. ఎప్పుడైతే స్పృహ వస్తుందో, అప్పుడు ఉన్నతి చెందేందుకు ఉత్సాహము కూడా వస్తుంది. అచ్ఛా, సంగఠన పెరుగుతూ ఉంది మరియు పెరుగుతూనే ఉంటుంది. మరియు నిమిత్త ఆత్మలైన మీరు ఈ ఆటనంతా చూసి హర్షితులవుతుంటారు. అందరూ నడుస్తున్నారు, కొందరు నడుస్తున్నారు, కొందరు ఎగురుతున్నారు, మరి మీరేం చేస్తారు? ఎగురుతూ-ఎగురుతూ మీతో పాటు ఇతరులను కూడా ఎగిరేలా చేస్తున్నారు ఎందుకంటే దయాహృదయుడైన తండ్రి యొక్క దయాహృదయము కల ఆత్మలుగా అయ్యారు, కావున దయ కలుగుతుంది కదా. అయిష్టము కలగదు, కానీ దయ కలుగుతుంది. ఈ దయనే హృదయపూర్వకమైన ప్రేమలా పని చేస్తుంది. అచ్ఛా, ఎవరైతే నడుస్తున్నారో వారు చాలా-చాలా మంచిగా నడుస్తున్నారు. అలసటలేనివారిగా అయ్యి సేవ చేస్తున్నారు కదా. నిమిత్త ఆత్మల అలసటలేనితనాన్ని చూసి అందరిలో ఉల్లాసము వస్తుంది కదా.
అవ్యక్త బాప్‌దాదాతో వ్యక్తిగత మిలనము
గ్రూప్ నం.1
సాధారణతను సమాప్తము చేసి విశేషత కల సంస్కారాలను నేచురల్ మరియు నేచర్‌గా తయారుచేసుకోండి
స్వయాన్ని సదా సంగమయుగ ఆత్మిక ఆనందములో ఉండేవారిగా అనుభవము చేస్తారా? ఆనందములో ఉంటారా లేక ఒక్కోసారి ఆనందములో ఉంటే, ఒక్కోసారి తికమకపడుతుంటారా లేక సదా ఆనందములో ఉంటారా? స్థితి-గతులు ఎలా ఉన్నాయి? ఎప్పుడైనా ఏదైనా అటువంటి పరిస్థితి వచ్చినా లేక అటువంటి పరీక్ష వచ్చినా తికమకపడతారా? (కొద్ది సమయము కోసం తికమకపడతాము). ఒకవేళ ఆ కొద్ది సమయములోనే మీకు మృత్యువు వచ్చినట్లయితే ఏమవుతుంది? అకాల మృత్యువుల సమయము కదా. కావున కొద్ది సమయమైనా కూడా ఒకవేళ ఆనందముగా ఉండేందుకు బదులుగా తికమకపడితే, మరియు ఆ సమయములోనే అంతిమ క్షణము వస్తే అంతిమతి సో గతి ఎలా ఉంటుంది? అందుకే సదా ఎవరెడీ అని వింటూ ఉంటారు కదా. ఎవరెడీ అంటే ఏమిటి? ప్రతి క్షణము అలా ఎవరెడీగా ఉన్నారా? ఏ సమస్యా కూడా సంపూర్ణంగా అవ్వటంలో విఘ్నరూపంగా అవ్వకూడదు. అంతిమము మంచిగా ఉంటే భవిష్య ఆది కూడా మంచిగా ఉంటుంది. కనుక ఎవరెడీ పాఠాన్ని అందుకే చదివించటం జరుగుతుంది. కొద్ది సమయమే అలా తికమకపడతాము కదా అని అనుకోకండి ఎందుకంటే కొద్ది సమయమైనా, ఒక్క క్షణమైనా మోసగించగలదు. ఎక్కువ సమయము ఇలా ఉండదు, కేవలం రెండు-నాలుగు నిమిషాలు అలా గడుస్తాయి అని అనుకుంటారు కానీ ఒక్క క్షణమైనా మోసగించేదిగా ఉండచ్చు అన్నప్పుడు ఇక ఒక నిమిషము గురించి ఆలోచించనే ఆలోచించవద్దు ఎందుకంటే మీరు అందరికంటే విలువైన ఆత్మలు, అమూల్యమైనవారు. అమూల్యమైన ఆత్మలను ప్రపంచములోని వారితో పోల్చలేము. ప్రపంచములోనివారు మిమ్మల్నందరినీ సాధారణమైనవారిగా భావిస్తారు. కానీ మీరు సాధారణమైనవారు కారు, విశేష ఆత్మలు.
విశేష ఆత్మల అర్థమేమిటంటే - వారు ఏ కర్మ చేసినా, ఏ సంకల్పము చేసినా, ఏ మాట మాట్లాడినా వారి ప్రతి మాట మరియు ప్రతి సంకల్పము విశేషమైనదిగా ఉండాలి, సాధారణముగా ఉండకూడదు. సమయము కూడా సాధారణ రీతిలో గడవదు. ప్రతి క్షణము మరియు ప్రతి సంకల్పము విశేషమైనదిగా ఉండాలి. ఇటువంటివారిని విశేష ఆత్మలు అని అంటాము. మరి విశేషంగా చేస్తూ-చేస్తూ సాధారణంగా అయిపోవటంలేదు కదా అన్నదానిని చెక్ చేసుకోండి. కొందరు ఎలా ఆలోచిస్తారంటే - మేమైతే ఎటువంటి పొరపాటు చెయ్యలేదు, ఎటువంటి పాప కర్మ చెయ్యలేదు, వాణి ద్వారా కూడా ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు అని, కానీ భవిష్యత్తును మరియు వర్తమానాన్ని శ్రేష్ఠంగా తయారు చేసుకున్నారా? చెడును చెయ్యలేదు కానీ మంచిని చేసారా? చెడు చెయ్యలేదు అని కేవలము దీనినే చెక్ చేసుకోకండి, కానీ చెడుకు బదులుగా చాలా మంచి పని చేసారా లేక సాధారణమైనది జరిగిందా? కనుక ఇటువంటి సాధారణత ఉండకూడదు, శ్రేష్ఠత ఉండాలి. నష్టము జరగలేదు కానీ జమ అయ్యిందా? ఎందుకంటే జమ చేసుకునే సమయము ఇప్పుడే ఉంది కదా. ఇప్పుడు జమ చేసుకున్నదానిని భవిష్యత్తులో అనేక జన్మలు తింటుంటారు. మరి ఎంతగా జమ అవుతుందో అంతగానే తింటారు కదా. ఒకవేళ తక్కువ జమ చేసుకుంటే తక్కువగా తినాల్సి ఉంటుంది అనగా ప్రారబ్ధము తక్కువైపోతుంది. మరి శ్రేష్ఠ ప్రారబ్ధాన్ని పొందాలనే లక్ష్యము ఉందా లేక సాధారణమైనదైనా ఫరవాలేదా? స్వర్గములోకైతే వెళ్ళనే వెళ్తాము, దుఃఖమైతే కలగదు, సాధారణమైన ప్రారబ్ధమైనా అభ్యంతరమేముంది... ? అభ్యంతరము ఉందా లేక ఫరవాలేదా? కనుక చెక్ చేసుకోండి - ప్రతి క్షణము, ప్రతి సంకల్పము విశేషమైనదిగా ఉండాలి. ఏ విధంగా అర్థకల్పము దేహ-భానములో ఉండే ఆ అభ్యాసము నేచురల్‌గానే, అనుకోకుండానే పని చేస్తుంటుంది కదా. దేహ-అభిమానములోకి రావటము నేచురల్ అయ్యింది కదా. అలా దేహి-అభిమానీ స్థితి నేచురల్ మరియు నేచర్‌గా అవ్వాలి. ఏదైతే నేచర్ (స్వభావము) గా అవుతుందో అది స్వతహాగానే తన పని చేస్తుంది, ఆలోచించాల్సిన అవసరము ఉండదు, కొత్తగా అలవాటు చేసుకోవాల్సిన అవసరము ఉండదు, ఏమీ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరము ఉండదు కానీ స్వతహాగానే జరిగిపోతుంది. కనుక విశేషతతో కూడుకున్న అటువంటి సంస్కారాలు నేచర్‌గా అవ్వాలి మరియు ఇది ప్రతి ఒక్కరి మనసు నుండి రావాలి. అంతేకానీ, నా నేచర్ ఇది, నా నేచర్ ఇది కాదు అని అనకూడదు. ప్రతి ఒక్కరి నోటి నుండి, మనసు నుండి ఇదే మాట వెలువడాలి - విశేష ఆత్మల విశేషతతో కూడినదే నా నేచర్. మరి ఇటువంటివారేనా లేక శ్రమ చేయాల్సి వస్తుందా? ఏదైతే నేచర్‌గా ఉంటుందో అందులో శ్రమ ఉండదు. ఎవరి నేచర్ అయినా రమణీకమైనదైతే స్వతహాగానే రమణీకత నడుస్తుంటుంది కదా. నేనేం చేసాను అన్నది వాళ్ళకు తెలియను కూడా తెలియదు. ఎవరైనా చెప్పినా కూడా నేనేం చెయ్యను, ఇది నా నేచర్ అని అంటారు. కనుక విశేషత కూడా అటువంటి నేచర్‌గా అవ్వాలి. మీ నేచర్ ఏమిటి అని ఎవరైనా అడిగితే అప్పుడు అందరి మనసుల నుండి - మా నేచర్ విశేషతతో కూడినది అని వెలువడాలి. సాధారణ కర్మలు చెయ్యటము సమాప్తమైపోయింది ఎందుకంటే మరజీవులుగా అయ్యారు కదా. కావున సాధారణత నుండి చనిపోయారు, విశేషతలో జీవిస్తున్నారు అనగా కొత్త జన్మ జరిగింది. సాధారణత గత జన్మ నేచర్, ఇప్పటిది కాదు ఎందుకంటే కొత్త జన్మ తీసుకున్నారు. మరి కొత్త జన్మ యొక్క నేచర్ విశేషతతో కూడినది, ఇటువంటి అనుభవము ఉండాలి. మరి ఇప్పుడేం చేస్తారు? సాధారణతను సమాప్తి చేయడము. సంకల్పములో కూడా సాధారణత ఉండకూడదు.
మాతలు ఆనందంలో ఉంటున్నారా? మిమ్మల్ని తికమకపెట్టేందుకు ఎవరు ఎంత ప్రయత్నము చేసినా కానీ మీరు ఆనందములో ఉండండి. తికమకపెట్టేవాళ్ళు తికమకపడతారు కానీ మీరు మాత్రం తికమకపడకండి ఎందుకంటే అజ్ఞానుల పని తికమకపెట్టటము మరియు జ్ఞానుల పని ఆనందములో ఉండటము. కనుక వాళ్ళు వాళ్ళ పని చేస్తారు, మీరు మీ పని చెయ్యండి. సదా ఆనందాన్ని అనుభవము చెయ్యండి, అప్పుడే నషాతో చెప్పగలరు. అలా ఉన్నప్పుడే చెప్పగలరు కదా? అలా లేనివారు చెప్పలేరు కూడా. మేము తికమకపడేవారము కాము అని ఛాలెంజ్ చేయవచ్చు ఎందుకంటే విశేష ఆత్మలు. ఏం గుర్తు పెట్టుకుంటారు? ఆనందములో ఉండే విశేష ఆత్మలు. ఇటువంటి ధైర్యము కలవారే కదా. ధైర్యము కలవారికి స్వతహాగానే సహాయము లభిస్తుంది.
ఎక్కడ ఉన్నా కానీ ఈ శబ్దము బిగ్గరగా రావాలి – ఈ బ్రాహ్మణ ఆత్మలు విశేషమైనవారు అని. గుప్తం నుండి ప్రత్యక్షం అవ్వాల్సిందే కదా! అందరి దృష్టి బ్రాహ్మణ ఆత్మల వైపు వెళ్లాల్సిందే. వెళ్తోందా లేక ఇంకా ప్రారంభం అవ్వలేదా? కాబట్టి కమాల్ (అద్భుతం) చేసి చూపించబోతున్నారు కదా! ఇప్పటివరకు ఎవ్వరూ చేయని అలాంటి అద్భుతాన్ని చేయండి. సెమినార్ చేశారు, కాన్ఫరెన్స్ చేశారు – ఇవి అందరూ చేస్తారు. ఏదైనా కొత్త విషయాన్ని చేసి చూపించండి.
మరి అందరూ బాగున్నారా? చాలా ఆరామ్‌గా ఉన్నారు కదా! నిర్భయ ఆత్మలు, ఇతరులను కూడా నిర్భయంగా తయారుచేసేవారు. ఇలా ఉన్నారా లేక ఏమవుతుంది, ఎలా అవుతుంది అని ఎప్పుడైనా భయపడుతున్నారా? లేదు. ఏది జరిగినా మంచిగా జరుగుతుంది. ప్రపంచానికి అయితే చెడుగా ఉంది, కానీ పరివర్తన జరగాల్సిందే అని మీరు ఆలోచించి-అర్థం చేసుకోగలరు, అందుకే ఏది జరుగుతున్నా మంచిదే జరుగుతోంది. ఎందుకంటే జరగాల్సిందేనని మీకు తెలుసు. అచ్ఛా!
గ్రూప్ నెం. 2
సదా ఉల్లాస-ఉత్సాహాలలో ఉంటూ తమ ముఖము మరియు నడవడిక ద్వారా ఇతరుల ఉల్లాస-ఉత్సాహాలను పెంచండి
అందరూ స్వయాన్ని సదా ఉల్లాస-ఉత్సాహాలతో ఎగిరే ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? సదా ఉల్లాస-ఉత్సాహాలు పెరుగుతూ ఉంటాయా లేదా ఎప్పుడైనా తగ్గి ఎప్పుడైనా పెరుగుతాయా? ఎందుకంటే ఎంత ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయో అంతగా ఇతరులను కూడా ఉల్లాస-ఉత్సాహాలలో ఎగిరిస్తారు. కేవలం స్వయం ఎగిరేవారు మాత్రమే కాదు, ఇతరులను కూడా ఎగిరించేవారు. కాబట్టి ఉల్లాస-ఉత్సాహాలు ఇవి ఎగరడానికి రెక్కలు. ఒకవేళ రెక్కలు బలంగా ఉంటే తీవ్ర గతితో ఎగరవచ్చు. ఒకవేళ రెక్కలు బలహీనంగా ఉండి తీవ్ర గతితో ఎగరడానికి ప్రయత్నించినా ఎగరలేరు, పదే పదే క్రిందకి వచ్చేస్తారు. కాబట్టి ఉల్లాస-ఉత్సాహాల రెక్కలు సదా బలంగా ఉండాలి. ఎప్పుడైనా బలహీనంగా, ఎప్పుడైనా బలంగా కాదు, సదా బలంగా ఉండాలి. ఎందుకంటే అనేక ఆత్మలను ఎగిరించే బాధ్యత ఉన్న ఆత్మలు మీరు. విశ్వ కళ్యాణం చేసే బాధ్యతను తీసుకున్నారు కదా! కాబట్టి సదా ఇంత పెద్ద బాధ్యత స్మృతిలో ఉండాలి. ఏదైనా బాధ్యత ఉన్నప్పుడు ఏ పని చేసినా తీవ్ర గతితో చేస్తారు, బాధ్యత లేకపోతే నిర్లక్ష్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరిపైనా ఎంత పెద్ద బాధ్యత ఉందో! అందరూ ఈ బాధ్యత యొక్క సంకల్పం తీసుకున్నారా? లేక ఇది పెద్దల పని, మేము చిన్నవాళ్లము అని భావిస్తున్నారా, అలా ఏమీ లేదు కదా! వీరు పాతవారు, మేము కొత్తవారము అని భావిస్తున్నారా, అలా ఏమీ లేదు కదా! పెద్దవారైనా, చిన్నవారైనా, పాతవారైనా, కొత్తవారైనా కానీ బ్రాహ్మణులుగా అవ్వడం అంటే బాధ్యత తీసుకోవడం. కొత్తవారైనా, పాతవారైనా కానీ బి.కె.లే కదా లేక ఇంకేమైనానా? బి.కె. అంటే బ్రాహ్మణులుగా అవ్వడం మరియు బ్రాహ్మణుల బాధ్యత ఇది ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఈ బాధ్యత యొక్క స్మృతి మిమ్మల్ని ఎప్పుడూ నిర్లక్ష్యంగా తయారుచేయదు. లౌకిక కార్యంలో కూడా ఏదైనా బాధ్యత పెరిగినప్పుడు బద్ధకం మరియు అలసత్వం వస్తాయా లేక వెళ్ళిపోతాయా? ఎవరైనా ‘పదండి, కాసేపు విశ్రాంతి తీసుకోండి, కూర్చోండి, ఏం చేస్తారు’ అని చెప్పినా కూర్చోగలరా? కాబట్టి బాధ్యత, బద్ధకాన్ని మరియు అలసత్వాన్ని సమాప్తం చేసేస్తుంది. కాబట్టి చెక్ చేసుకోండి - ఎప్పుడైనా బద్ధకం లేదా అలసత్వం వచ్చేయడం లేదు కదా? నడుస్తున్నాం కదా, అయిపోతుందిలే అనుకోవడం అలసత్వం. ఈరోజు కాకపోతే రేపు అయిపోతుందిలే అనుకోవడం బద్ధకం. రేపు కాదు, ఈరోజు కూడా కాదు, ఇప్పుడు. ఎందుకంటే ఏ నమ్మకమూ లేదు. ఒకవేళ అసంపూర్ణ పురుషార్థం ఉండిపోతే ఎక్కడికి చేరుకుంటారు? సూర్యవంశీయులలోకా లేక చంద్రవంశీయులలోకా? సగం పురుషార్థం ఉంటే ప్రారబ్ధం కూడా సగమే లభిస్తుంది కదా. మరి చంద్రవంశీయులలోకి వెళ్లాలా? వెళ్లకూడదా? ఒక్కరు కూడా వెళ్లరా? మాతలు కూడా అందరూ సూర్యవంశీయులుగా అవుతారా? అచ్ఛా! ఎందుకంటే పొందేటప్పుడు పూర్తిగా పొందాలి కదా. సగం పొందడం తెలివితక్కువతనం. తెలివైనవారు సదా స్వయాన్ని సంపూర్ణ అధికారిగా తయారుచేసుకుంటారు, ఎందుకంటే బిడ్డ అంటే అధికారి. కాబట్టి అలాంటి అధికారీ ఆత్మలా లేక ఎప్పుడైనా అలసిపోతుంటారా? అధికారం తీసుకుంటూ తీసుకుంటూ అలసిపోవడం లేదు కదా? ఎక్కడి వరకు చేస్తాం అని ఎప్పుడైనా మనస్సుతో అలసిపోతున్నారా? అలసిపోనివారు (అథక్), అలసిపోయేవారు కాదు. అలసిపోవడం చంద్రవంశీయుల పని మరియు అలసిపోకుండా (అథక్) ఉండడం సూర్యవంశీయుల గుర్తు. ఏమైనా కానీ సదా అలసిపోకుండా ఉండాలి. ఎవరికైతే ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయో వారు ఎప్పుడూ అలసిపోరు. ఉత్సాహం తగ్గితే అలసట ఖచ్చితంగా వస్తుంది. ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నవారు సదా తమ ముఖము ద్వారా ఇతరులకు కూడా ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు. ఒకటి ముఖము, రెండవది నడవడిక. కాబట్టి మీ ముఖము మరియు నడవడిక ద్వారా సదా ఇతరులను కూడా ఉల్లాస-ఉత్సాహాలలో పెంచుతూ ఉండండి. ఎవరైనా చూస్తే ‘వీరు సదా ఉల్లాస-ఉత్సాహాలలో ఎలా ఉంటారు?’ అని ఆలోచించేలా మీ నడవడిక ఉండాలి. ఎవరో చాలా సంతోషంగా ఉంటే వారిని చూసి ఇతరులు కూడా సంతోషిస్తారు కదా. ఎవరైనా ఏడ్చేవారు ఉంటే, ఏడ్చేవారిని చూసి ఇతరులు ఏం చేస్తారు? ఏడవకపోయినా చిరునవ్వు అయినా నవ్వరు కదా. కాబట్టి మీ నడవడిక మరియు ముఖము అలా ఉన్నాయా? గర్వంగా సమాధానం ఇవ్వండి - మేము కాకపోతే ఇంకెవరు ఉంటారు అని. కల్పకల్పంలో మీరే ఉన్నారు మరియు సదా మీరే ఉంటారు. ఇది పక్కా నిశ్చయమే కదా! కాబట్టి మనమే ఉన్నాము, మనమే ఉంటాము. పక్కానే కదా? సీజన్ (సమయం) ఎగిరేది అయినప్పుడు ఎగిరే సమయంలో పడిపోవడం మంచిది కాదు కదా. కాబట్టి మీరు ఎగిరేవారు మరియు ఎగిరించేవారు కూడా. ఎప్పుడైనా ఏ విషయమైనా వస్తే, మేము ఎవరు? మా బాధ్యత ఏమిటి అని గుర్తుచేసుకోండి.
ఇప్పుడు చూద్దాం - స్వ స్థితిలో లేదా సేవలో నంబర్ ముందుకు ఎవరు వెళ్తారో. స్వ స్థితిలోనూ నంబర్‌వన్ తీసుకోవాలి, సేవలోనూ నంబర్‌వన్ తీసుకోవాలి. అచ్ఛా!
గ్రూప్ నెం. 3
అందరి దీవెనలు (బ్లెస్సింగ్స్) తీసుకోవడానికి కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ఉంచండి
సదా స్వయాన్ని కర్మయోగి ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? కర్మయోగి అంటే ప్రతి కర్మ యోగయుక్తంగా ఉండడం. కర్మ వేరు, యోగం వేరు కాదు. కర్మలో యోగం, యోగంలో కర్మ. సదా రెండూ జతగా ఉన్నప్పుడే కర్మయోగి అంటాము. అలా అని యోగంలో కూర్చున్నప్పుడు యోగిగా, కర్మలోకి వెళ్ళినప్పుడు యోగం సాధారణంగా అయిపోయి కర్మ మహాన్‌గా అయిపోవడం కాదు. సదా రెండూ జతగా ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. కాబట్టి అలాంటి కర్మయోగులా లేక కర్మలో నిమగ్నమైనప్పుడు యోగం తగ్గిపోతుందా? మరియు యోగంలో కూర్చున్నప్పుడు కూర్చునే ఉంటే బాగుణ్ణు అనిపిస్తుందా? కర్మయోగి ఆత్మ సదా కర్మను మరియు యోగాన్ని జతగా ఉంచేది, అనగా బ్యాలెన్స్ ఉంచేది. కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ఉంటే ప్రతి కర్మలో తండ్రి ద్వారా దీవెనలు (బ్లెస్సింగ్స్) లభించడమే కాక, ఎవరి సంబంధ-సంపర్కాలలోకి వస్తారో వారి నుండి కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరైనా మంచి పని చేస్తే వారి కోసం హృదయపూర్వకంగా ‘చాలా బాగుంది’ అని ఆశీర్వాదాలు వస్తాయి కదా. కాబట్టి ‘చాలా బాగుంది’ అని అనుకోవడమే ఆశీర్వాదాలు. మరియు మంచి కార్యాలు చేసేవారి తోడుగా ఉండడం సదా అందరికీ నచ్చుతుంది. వారికి సహయోగులు చాలామంది అవుతారు. కాబట్టి ఆశీర్వాదాలూ లభిస్తాయి, సహకారమూ లభిస్తుంది. కాబట్టి ఎక్కడైతే ఆశీర్వాదాలు, సహకారం ఉంటాయో అక్కడ సఫలత ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఎన్ని ప్రాప్తులు ఉన్నాయో! చాలా ప్రాప్తులు లభించాయి కదా. అందుకే సదా కర్మయోగి. యోగం ఉన్నప్పుడు కర్మ స్వతహాగానే శ్రేష్ఠంగా అవుతుంది, ఎందుకంటే యోగం యొక్క అర్థమే శ్రేష్ఠ తండ్రి స్మృతిలో ఉండడం మరియు ‘నేను కూడా శ్రేష్ఠ ఆత్మను’ అనే స్మృతిలో ఉండడం. కాబట్టి స్మృతి శ్రేష్ఠంగా ఉన్నప్పుడు స్థితి కూడా శ్రేష్ఠంగా ఉంటుంది కదా, మరియు స్థితి శ్రేష్ఠంగా ఉండడం వల్ల కోరుకోకపోయినా వాతావరణం శ్రేష్ఠంగా తయారవుతుంది. కాబట్టి కర్మయోగి అంటే శ్రేష్ఠ స్మృతి, శ్రేష్ఠ స్థితి మరియు శ్రేష్ఠ వాతావరణం. ఎవరైనా జ్ఞానం విననివ్వండి, వినకపోనివ్వండి, యోగం నేర్చుకోనివ్వండి, నేర్చుకోకపోనివ్వండి, కానీ వాతావరణం యొక్క ప్రభావం స్వతహాగానే వారిని ఆకర్షిస్తుంది. మధుబన్‌లో ఏ విశేష అనుభవం చేసుకుంటారు? తపస్సు యొక్క వాతావరణం ఉంది కదా! కాబట్టి ఎవరు వచ్చినా వారి యోగం శ్రమ లేకుండానే కుదిరిపోతుంది. యోగం జోడించాల్సిన అవసరం ఉండదు, యోగం కుదిరిపోతుంది. అలాగే జరుగుతుంది కదా. మధుబన్‌లో యోగం జోడించే శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే వాతావరణం తపస్సుది, సాంగత్యం తపస్వి ఆత్మలది. అలాగే మీరు ఎక్కడ కర్మయోగిగా అయి కర్మలు చేస్తారో, అక్కడ వాతావరణం ఇతరులకు ఆ విధంగా సహకారం ఇస్తుంది. అనుభవీలే కదా, సహకారం లభిస్తుంది కదా? కాబట్టి మీ సహకారం కూడా ఇతరులకు లభిస్తుంది. మీరు ఉండే చోట సేవ జరుగుతోందా? సదా కర్మయోగి ఆత్మ తండ్రికి కూడా ప్రియమైనవారు, విశ్వానికి కూడా ప్రియమైనవారు. విశ్వానికి కూడా ప్రియంగా తయారయ్యారా లేక తయారవుతున్నారా? చూడండి, కల్పం క్రితం కూడా విశ్వానికి ప్రియంగా అయ్యారు, అందుకే కదా మీ జడ చిత్రాలను కూడా అందరూ ఎంతగానో ప్రేమిస్తున్నారు. మరి అవి మీ చిత్రాలే కదా. మీపై మీకు అంత ప్రేమ ఉండదేమో కానీ చిత్రాలపై అంత ప్రేమ ఉంటుంది. కాబట్టి చైతన్యంలో అయ్యారు కాబట్టే జడ చిత్రాల రూపాన్ని స్మృతిచిహ్నంగా చూస్తున్నారు. చైతన్య రూపంలో మీ జడ చిత్రాల స్మృతిచిహ్నాలను చూస్తున్నారు. కాబట్టి చూసి సంతోషం కలుగుతుంది కదా - ‘మేము ఇలా విశ్వానికి ప్రియంగా అయ్యాము’ అని. ఎందుకంటే తండ్రికి ప్రియంగా అయ్యారు కదా! కాబట్టి ఎంత సంతోషం ఉంది! సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారా? అందరికీ సంతోషంలో నాట్యం చేయడం వచ్చా? సంతోషంలో నాట్యం చేయడం రానివారు ఎవరైనా ఉన్నారా? అందరికీ వచ్చు. కాళ్ళతో నాట్యం చేయడం ఒకరికి వచ్చు, ఒకరికి రాకపోవచ్చు. కానీ సంతోషంలో నాట్యం చేయడం అందరికీ వచ్చు మరియు ఈ నాట్యం చేయడంలో అలసిపోరు కూడా. కాబట్టి సదా నాట్యం చేస్తూ ఉంటారా? బ్రాహ్మణ జీవితంలో సంతోషం తప్ప ఇంకేముంది? దుఃఖధామాన్ని వదిలేశారు కదా, ఇక దుఃఖం ఎందుకు వస్తుంది? మరియు ఎక్కడైతే దుఃఖం ఉండదో అక్కడ సంతోషం ఉంటుంది కదా. సంగమవాసులు సదా సంతోషంగా ఉంటారు, కలియుగవాసులు దుఃఖంగా ఉంటారు. మరి మీరు సంగమయుగులా లేక ఎప్పుడైనా పొరపాటున దుఃఖధామవాసులుగా అయిపోతుంటారా? లేదా ఎప్పుడైనా పొరపాటున వెళ్ళిపోతుంటారా? స్వప్నంలో కూడా దుఃఖం యొక్క అల రాకూడదు. ఇక సాకారంలో అయితే అసలు ప్రశ్నే లేదు. కాబట్టి అందరూ గుర్తుంచుకోండి - మేము కర్మయోగులము, కర్మను మరియు యోగాన్ని సదా జతగా ఉంచేవారము అని.
సదా సంతోషంగా ఉండే కర్మయోగులు, తండ్రికి ప్రియమైన ఆత్మలు - ఈ సంతోషమే సదా అవినాశిగా ఉండాలి. ఎప్పుడో ఒకసారి ఉండేది కాదు, సదా ఉండేది. ఎప్పుడో ఒకసారి సంతోషం, ఎప్పుడో ఒకసారి దుఃఖం యొక్క అలలు రావడం మంచిది కాదు. కాబట్టి సంతోషంగా ఉన్నారు మరియు సదా సంతోషంగా ఉంటారు. అచ్ఛా!
గ్రూప్ నెం. 4
సదా అదృష్టవంతుడిని, భాగ్యవాన్ ఆత్మను అన్న స్మృతిలో ఉంటూ అందరినీ భాగ్యవంతులుగా తయారుచేయండి
సదా మీ శ్రేష్ఠ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకుంటూ స్వయాన్ని సమర్థ ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే ఎంత స్మృతి ఉంటుందో అంత సమర్థత ఉంటుంది. స్మృతి తగ్గితే సమర్థత కూడా తగ్గుతుంది. కాబట్టి స్మృతి స్వరూపంగా అయ్యారా లేక స్మృతిని తెచ్చుకోవాల్సి వస్తోందా? ఎలాగైతే మీ సాకార స్వరూపం ఎప్పుడూ మర్చిపోదో... ‘నేను ఫలానా, నేను ఇలాంటివాడిని’ అని సదా స్మృతి ఉంటుందో, అలాగే మీ భాగ్యం యొక్క స్మృతి స్వరూపంగా అవ్వండి. గుర్తుచేసుకుంటే స్మృతి రావడం, నడుస్తూ నడుస్తూ స్మృతి విస్మృతిగా అయిపోవడం... దానిని స్వరూపం అనము, స్వరూపం ఎప్పుడూ మర్చిపోదు. ఒకరు స్మృతి చేసేవారు, ఇంకొకరు స్మృతి స్వరూపంగా ఉండేవారు. మరి మీరందరూ ఎవరు? స్వరూపంగా అయిపోయారా లేక విస్మృతి-స్మృతుల ఆట నడుస్తోందా?
(హాస్పిటల్ మరియు ఆబూ నివాసులు బాప్‌దాదా ఎదురుగా కూర్చున్నారు)
మీరందరూ చాలా చాలా భాగ్యవంతులు. ఎందుకంటే మెజారిటీ మధుబన్ నివాసులు లేదా మధుబన్ మరియు హాస్పిటల్ వేరు అని భావిస్తున్నారా? మధుబన్ నివాసులే కదా? ఏ వాతావరణంలో ఉంటున్నారు? మధుబన్ వాతావరణంలో ఉంటున్నారా లేక వేరే హాస్పిటల్ వాతావరణంలో ఉంటున్నారా? ఎందుకంటే అన్నిటికంటే పెద్ద పాలన జ్ఞానం యొక్క పాలన, మురళీ పాలన. మరి ఆ హాస్పిటల్లో లేదా మీ మీ ఇళ్ళల్లో వింటున్నారా లేక మధుబన్లోనే వింటున్నారా? కాబట్టి అన్నిటికన్నా శ్రేష్ఠమైన పాలన మురళీ. మరియు రెండవ పాలన బ్రహ్మా భోజనం. అది ఆత్మ యొక్క పాలన, ఇది శరీరం యొక్క పాలన. మరి రెండూ మధుబన్లోనే జరుగుతున్నాయి కదా. ఒకవేళ ఇంట్లో తింటున్నా ఏమి గుర్తు చేసుకుని తింటారు? ‘మధుబన్‌లో కూర్చుని తింటున్నాం’ అనే కదా, ఇక హాస్పిటల్ వారైతే తినడమే మధుబన్‌లో తింటారు కదా. కాబట్టి ఎంత లక్కీ! సదా బ్రహ్మా భోజనం లభించడం ఇది తక్కువ భాగ్యం కాదు! సదా ఆత్మ యొక్క పాలన విశేష ఆత్మల ద్వారా జరుగుతూ ఉండడం ఇది కూడా తక్కువ పాలన కాదు! సదా శ్రేష్ఠ వాతావరణం లభించడం, శ్రేష్ఠ సాంగత్యం లభించడం - ఎంత భాగ్యం ఉంది! అమృతవేళ నుండి రాత్రి వరకు మీ విభిన్న భాగ్యాలను స్మృతిలోకి తెచ్చుకోండి. దినచర్య ఆదిలోనే మొదటి భాగ్యం తండ్రితో మిలనం జరుపుకోవడం. ప్రపంచం తలక్రిందులై తపించిపోతోంది, మీరైతే అమృతవేళ నుండి రాత్రి వరకు మిలనం జరుపుకుంటూ ఉంటారు. ఒకవేళ రాత్రి పడుకున్నా ఎక్కడ పడుకుంటున్నారు? పరుపు పైనా? కాబట్టి చూడండి, ఆదిలోనూ భాగ్యం, మధ్యలోనూ భాగ్యం మరియు అంత్యంలో ఏమవుతుంది? భాగ్యమే భాగ్యం ఉంటుంది కదా. కాబట్టి సదా మీ భాగ్యం యొక్క జాబితాను ఎదురుగా ఉంచుకోండి. మరియు ‘వాహ్ నా భాగ్యము!’ అనే పాటను సదా పాడుతూ ఉండండి. ‘వాహ్ బాబా’ అని ఎలాగూ ఉంది, కానీ దానితో పాటు ‘వాహ్ నా శ్రేష్ఠ భాగ్యము!’. హద్దు యొక్క భాగ్యం కాదు, అనంతమైన శ్రేష్ఠ భాగ్యం. కాబట్టి స్వయం సదా తమ భాగ్యం యొక్క స్మృతిలో ఉండేవారు ఇతరులను కూడా భాగ్యవంతులుగా తయారుచేస్తారు కదా. ఎవరు ఎలా ఉంటే అలా తయారుచేస్తారు కదా. మరి హాస్పిటల్ వారు రోజంతా ఏమి చేస్తారు? పేషెంట్లను చూస్తూ ఉంటారా లేక తమ భాగ్యాన్ని కూడా చూసుకుంటూ ఉంటారా? ఏం చూస్తారు? భాగ్యాన్నే చూస్తారు కదా. పేషెంట్‌తో పాటు ముందు మీ భాగ్యాన్ని చూసుకోండి. అప్పుడు భగవంతుడు మరియు భాగ్యం రెండూ గుర్తుంటాయి.
చూడండి, ‘ఆబూ నివాసి’ అని టైటిల్ అయితే చాలా మంచిది లభించింది. మరి ఆబూ నివాసి అని వినగానే పరమధామ నివాసి అని సహజంగానే గుర్తుకు వస్తుంది కదా. ఎందుకంటే ఆబూ బ్రహ్మా బాబాది, బ్రహ్మా బాబా గుర్తుకు వస్తే శివ తండ్రి సహజంగానే గుర్తుకు వస్తారు, కంబైన్డ్ కదా. కాబట్టి ‘ఆబూ నివాసి’ అని వినగానే స్వీట్ హోమ్ కూడా గుర్తుకు వస్తుంది, అనగా బాప్‌దాదా ఇద్దరూ సహజంగా గుర్తుకు వస్తారు. హాస్పిటల్ కూడా ఎక్కడ ఉంది? ఆబూలోనే ఉంది కదా.
ఎక్కువ సహజ స్మృతిలో హాస్పిటల్ వారు ఉంటారా లేక తమ తమ స్థానాలలో ఆబూ నివాసులుగా పిలువబడేవారు ఉంటారా లేక సెంటర్లలో ఉండేవారు ఉంటారా? ఎవరు ఉంటారు? స్మృతిలో అయితే అందరూ ఉంటారు, కానీ సహజ స్మృతిలో ఉండేవారు ఎవరు? డబల్ విదేశీయులు అయితే సంతోషంగానే ఉంటారు. డబల్ విదేశీయులు అంటే డబల్ సంతోషం. హాస్పిటల్లో సంతోషం తక్కువగా ఉంటుందా లేక పెరుగుతుందా? లేక ఎప్పుడైనా తగ్గిపోతుందా? తగ్గకూడదు. ఏమైనా కానీ, ఎలా ఉన్నా కానీ, చనిపోయే వరకు విషయం వచ్చినా సంతోషం పోకూడదు. మృత్యువు వచ్చినా పర్వాలేదు కానీ సంతోషం పోకూడదు. శరీరం పోయినా ఫర్వాలేదు. ఎందుకంటే గ్యారెంటీ ఉంది కదా - ఒకవేళ సంతోషంతో వెళ్తే అనేకులను సంతోషపరచడానికే వెళ్తారు. కాబట్టి శరీరం పోయినా సంతోషం పోకూడదని అంత పక్కాగా ఉండాలి. బ్రాహ్మణ జీవితం అంటే సంతోషకరమైన జీవితం, బ్రాహ్మణులై ఉండి సంతోషం లేకపోతే అది బ్రాహ్మణ జీవితమే కాదు. కాబట్టి అందరూ పక్కా బ్రాహ్మణులే. ఇందులో అడగాల్సిన ప్రశ్నే లేదు. మీరందరూ సంతకం చేసేటప్పుడు ఆక్యుపేషన్ (వృత్తి) లో ‘బి.కె.’ అని రాస్తారు కదా. కాబట్టి బ్రాహ్మణులు అంటే అదృష్టవంతులుగా, సదా సంతోషంగా ఉండేవారు. బ్రాహ్మణ ఆత్మ యొక్క సంతోషాన్ని తగ్గించే ధైర్యం ఎవరికీ లేదు. మాయ అయినా లేదా మాయ యొక్క తండ్రి అయినా సరే సంతోషాన్ని మాయం చేయలేరు. (మాయ తండ్రి ఎవరు?) రావణుడిని మాయ యొక్క తండ్రి అనండి. కాబట్టి సంతోషం తగ్గడం అసాధ్యం.
ఏక్కడ ఉన్నా సంతోషం మాయం కావడం అసాధ్యం అని గర్వంగా చెప్తారా లేక ఎప్పుడో ఒకసారి సంభవిస్తుందేమో అని అంటారా? బ్రాహ్మణ జీవితంలో సంతోషం పోవడం అసాధ్యం అని బాగా తెలుసు కదా. కాబట్టి ప్రతి ఒక్కరి ముఖము సంతోషకరంగా, అదృష్టవంతంగా కనిపించాలి. ప్రతి ఒక్కరి మస్తకంలో సంతోషం యొక్క భాగ్యం మెరుస్తోంది. మెరుస్తోంది కదా? మేఘాలు రావడం లేదు కదా? మేఘాలు దేనినైనా దాచేస్తాయి. కాబట్టి మేఘాలు రాకూడదు. సదా మెరుస్తూ ఉండండి.
శక్తులు ఏమి ఆలోచిస్తున్నారు? శక్తులు సంతోషపు పాటలు పాడుతూ ఉంటారు, పాండవులు నాట్యం చేస్తూ ఉంటారు. బ్రాహ్మణ జీవితంలో ఉన్నదే నాట్యం చేయడం మరియు పాడడం. కర్మలు చేస్తున్నా కర్మ కూడా ఒక డాన్స్ కదా. డాన్స్‌లో చేతులు-కాళ్ళు తిప్పాల్సి ఉంటుంది కదా. కాబట్టి కర్మయోగిగా అయి చేసే కర్మ కూడా నాట్యం చేయడమే కదా. ఆట ఆడుతున్నారు కదా. అచ్ఛా!
గ్రూప్ నెం. 5
సంతుష్టత అత్యంత పెద్ద ఖజానా, ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ సర్వ ప్రాప్తులు ఉంటాయి
సదా ఈ బ్రాహ్మణ జీవితంలో ఆది నుండి ఇప్పటివరకు లభించిన సర్వ ప్రాప్తులు స్మృతిలో ఉంటున్నాయా? ఎన్ని ప్రాప్తులు ఉన్నాయి? ప్రాప్తుల జాబితా తీస్తే ఎంత పెద్దగా ఉంటుంది! సారాంశంగా చెప్పాలంటే ‘బ్రాహ్మణ జీవితంలో లభించని వస్తువంటూ ఏదీ లేదు’. మరి ఇలా అనుభవం చేసుకుంటున్నారా? సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అయిపోయారా? మరియు ప్రాప్తులు కూడా అవినాశివి. ఒక జన్మ, అర జన్మవి కావు, సదాకాలం కోసం ప్రాప్తులు లభించాయి. ఏ యుగంలోనూ మీ ఆత్మలకు ప్రాప్తి లేకుండానూ లేదు. ద్వాపరం నుండి దిగజారే కళ ప్రారంభమైనా, ద్వాపరం నుండి ఇప్పటివరకు పూజించబడుతూనే ఉన్నారు కదా. కాబట్టి అర్ధ కల్పం రాజ్యాధికారులుగా అవుతారు, అర్ధ కల్పం పూజ్యులుగా అవుతారు. స్వయం చైతన్యంలో పూజారిగా అయిపోయినా జడ చిత్రాల రూపంలో పూజించబడుతున్నారు. కాబట్టి పూజ్యులయ్యే ప్రాప్తి ఉంటూనే ఉంది కదా. స్వయాన్ని తెలుసుకోలేకపోయినా ప్రాప్తి మొత్తం కల్పం అంతటికీ ఉంది. రాజ్య పదవి మరియు పూజ్య పదవి. ఎంత నషా కలిగించే విషయం! కాబట్టి సదా సర్వ ప్రాప్తుల స్మృతిలో ఉండండి, స్మృతి స్వరూపంగా ఉండండి. మరి ప్రాప్తులు గుర్తుంటున్నాయా లేక ఎప్పుడైనా మర్చిపోయి, ఎప్పుడైనా గుర్తుంటున్నాయా? హద్దు యొక్క ప్రాప్తులు ఉన్నవారికే ఎంత నషా ఉంటుందో. మరి మీకు అవినాశి ప్రాప్తులు ఉంటే అవినాశి ఆత్మిక నషా ఉందా?
(కుమారీలతో) కుమారీలకు నషా ఉంటోందా? సదా ఉంటోందా లేక ఎప్పుడైనా? ఎప్పుడైనా మర్చిపోతుంటారా? ఎప్పుడైనా మూడ్ ఆఫ్ అవుతుందా? కుమారీల మూడ్ ఆఫ్ అవుతుందా? ఏడవరు కానీ మౌనంగా అయిపోతారా? ఎంతకాలం నుండి ఏడవలేదు? బ్రహ్మాకుమారీలుగా అయినప్పటి నుండి ఏడవలేదా లేక ఇప్పుడు ఏడవడలేదా? మనస్సులో కూడా ఏడవలేదా? కుమారీలు కోమలంగా ఉండడం వల్ల ఏడుపు త్వరగా వస్తుంది. ఏడవకపోతే పక్కాగా ఉన్నట్లే కదా. అందరూ సంతోషంగా ఉంటున్నారా? మరియు పురుషార్థంలో కూడా ఎగిరే కళలో ఉన్నారా లేక ఎక్కే కళలో ఉన్నారా? అందరూ ఎగిరే కళలో ఉన్నారా? మంచిది, ఒకసారి క్రిందకి, ఒకసారి పైకి అవ్వకూడదు, సదా ఎగురుతూ ఉండాలి. మాతలది కూడా ఎగిరే కళనా లేక మధ్యమధ్యలో పడిపోవడం కూడా నచ్చుతుందా? పడిపోయి ఎగరాలా లేక ఎగురుతూనే ఉండాలా? పాండవులు ఎగిరే కళ వారేనా? ఎగరాల్సిందే. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది, గమ్యం శ్రేష్ఠమైనది. కాబట్టి ఎగిరే కళ లేకుండా గమ్యానికి చేరుకోవడం కష్టం. అందుకే సదా ఎగురుతూ ఉండండి, మరియు ఎగరడానికి సాధనం సదా సర్వ ప్రాప్తులను స్మృతిలో ఉంచుకోవడం. ఇమర్జ్ రూపంలో, మర్జ్ రూపంలో కాదు. ‘తెలుసులే’ అని కాదు, గుప్తం నుండి ప్రత్యక్షం చేయండి. ఏమేమి లభించాయి! ఏమై ఉన్నారు, ఏమైపోయారు! నిన్న ఏమిటి, ఈరోజు ఏమిటి! కాబట్టి ప్రాప్తుల సంతోషం ఎప్పుడూ క్రిందకి, అలజడిలోకి తీసుకురాదు. క్రిందకి రావడం కాదు, అలజడి కూడా ఉండదు, అచలము. సంపన్నంగా ఉన్నది అలజడిలోకి రాదు. ఖాళీగా ఉన్నదే ఊగుతుంది. ఏ వస్తువైనా ఊగుతుంటే దానిని నలువైపుల నుండి నింపి, భర్తీ చేస్తే అది ఊగదు; ఏ మూలనైనా ఖాళీగా ఉంటే ఊగుతుంది, ఊగి ఊగి విరిగిపోతుంది. కాబట్టి సంపన్నత అచలంగా తయారుచేస్తుంది. అలజడి నుండి విడిపిస్తుంది. మరి సర్వ ప్రాప్తులలో సంపన్నంగా ఉన్నారు కదా? దాత లభించినప్పుడు దాత ఏం చేస్తారు? సంపన్నంగా తయారుచేస్తారు కదా. కాబట్టి ‘మేము దాత యొక్క పిల్లలము’ అనే నషా కూడా ఉంది. సాధారణ తండ్రి పిల్లలము కాదు, దాత యొక్క పిల్లలము. కాబట్టి స్వయం దాత అయినప్పుడు మాస్టర్ దాతగా తయారుచేస్తారు కదా. మరి ఏం గుర్తుంచుకుంటారు, మీరు ఎవరు? మాస్టర్ దాతలు. సర్వ ప్రాప్తులతో సంపన్నమైన ఆత్మలు. కొంచెం కూడా అప్రాప్తి లేదు. ఏమైనా అప్రాప్తి ఉందా? ఏమైనా ఉండిపోయిందా లేదా ఏదైనా వస్తువు కావాలా, పేరు కావాలా, సేవ కావాలా, కొద్దిగా అవకాశం లభిస్తే బాగుండు, నా పేరు రావాలి, నన్ను ముందు ఉంచాలి... ఈ అప్రాప్తి ఏమీ లేదు కదా. ఎవరికైనా ఉంటే చెప్పండి. మంచి ఇల్లు లభిస్తే బాగుండు, కారు లభిస్తే బాగుండు..., కారు ఉంటే సేవ బాగా చేయవచ్చు. ఎన్ని సాధనాలు ఉంటే అంత బుద్ధి కూడా వెళ్తుంది. ఎలా ఉన్నారో, ఎక్కడ ఉన్నారో సదా తృప్తిగా (రాజీగా) ఉండండి. కొంచెంలో సంతుష్టంగా ఉండే వారికి సదా సర్వ ప్రాప్తుల అనుభూతి కలుగుతుంది. సంతుష్టత అత్యంత పెద్ద ఖజానా. ఎవరి వద్ద సంతుష్టత ఉంటుందో వారి వద్ద అంతా ఉన్నట్లే. ఎవరి వద్ద సంతుష్టత ఉండదో వారి వద్ద అంతా ఉన్నా ఏమీ లేనట్లే. ఎందుకంటే అసంతృప్త ఆత్మ సదా కోరికలకు వశమై ఉంటుంది. ఒక కోరిక నెరవేరితే 10 కోరికలు ఉత్పన్నమవుతాయి. మరి మీరు ఎలాంటివారు? హద్దు యొక్క కోరికలలో అవిద్య. అలా ఉన్నారా లేక ఎప్పుడైనా చిన్నచిన్న కోరికలు కలుగుతున్నాయా? సంతుష్టంగా ఉన్నారా? సదా ‘పొందాల్సింది పొందేసాము’ అనే పాటను పాడుతూ ఉండండి. మంచిది. అందరూ సంతుష్ట మణులు కదా!
*** ఓంశాంతి ***
